శివ పార్వతి కళ్యాణం!!
నవ యవ్వనంలో మెరిసి పోతోంది పార్వతి.నల్లటి శరీర ఛాయ అయినా,అపరిమిత సౌందర్యవతి!
తీర్చి దిద్దినట్లున్న శరీర సౌష్ఠవం!ఆ కళ్ళు!నిండు కొలనులో ఈదులాడుతున్న జంట మీనాలా!కాదు కాదు అదే కొలనులో వికసించిన జంట కలువలేమో!
సంపంగి పువ్వుని మరి కాస్త పొడుగ్గా సాగదీసి ప్రతిష్ఠించినట్టున్న నాసిక!ఆ నాసిక కాస్త కింద ఎర్రగా దానిమ్మ గింజల రంగులో నిండుగా మెరిసిపోతున్న అధరాలు!ముక్కున ఉన్న వజ్రాల ముంగెర తళతళలు ఆ అధరాలపై పడి తళ తళలాడుతోంది.పెదవులు విప్పి దీక్షగా "ఓం నమః శివాయ"అంటున్నప్పుడు ఆ వజ్రకాంతులు ఆమె దంతాలపై పడి,అవీ వజ్రాల వలె ప్రకాశిస్తున్నాయి.
తపస్సు చేత ప్రసాదించ బడిన అలౌకికమైన కాంతి చేత ముఖ మండలం సూర్యబింబం వలే ప్రకాశిస్తోంది.ఆకాశంలోని సూర్యుడు గిరిజ మొహంలో ఉదయించినట్టు ఆ మోము వెలుగులు చిమ్ముతోంది.
నిరాహారిగా ఉంటూ,కఠినమైన తపోదీక్షలో ఉండటం వలన,ఆమె మృదువైన,కోమలమైన తనూలత మరింతగా చిక్కి,నాజూకుగా మారింది.నడుము మరీ సన్నగా మారి కఠినత్వాన్ని సంతరించుకుంది.ముడి వేయ బడిన శిరోజాలు నల్లటి యమున వలె వీపంతా పరచుకున్నాయి.అంత సన్నటి నడుము ఆమె తనూ భారాన్ని ఎలా మోయ గలుగుతోందా అనే ఆశ్చర్యాన్ని కలుగ చేస్తోంది.
"ఓం నమః శివాయ"గంభీరమైన పురుష స్వరానికి కళ్ళు తెరిచింది పార్వతి.ద్వారం బయట కాషాయాంబరాలతో బ్రహ్మచారి.ముఖమండలం వర్ఛస్సుతో వెలిగి పోతోంది.చేతిలో భిక్షాపాత్ర!నిలువెత్తు విగ్రహం!చూడగానే వదనంలో నమస్కారం చేయాలనిపించేంత గాంభీర్యం!పార్వతి ఆసనం మీద నుంచి లేచి ఆ బ్రహ్మచారికి నమస్కరించింది.
"సౌభాగ్యమస్తు!అమ్మాయీ!ఈ రోజు నాకు ఎక్కడా భిక్ష లభ్యం కాలేదు.నాకు ఇంత భిక్ష ప్రసాదించి,పుణ్యం మూట గట్టుకో!నీ మనసులోని కోరిక తీరుతుంది"గంభీరమైన ఘంటా నాదంలా మోగింది అతని స్వరం.
పార్వతి వినయంగా నమస్కరించింది."బ్రాహ్మణోత్తమా!నేను ఎండి రాలిన ఆకులనైననూ భుజింపక నీటిని,చంద్ర కిరణాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపోదీక్షలో ఉన్న దానను.నేను మీకు పచనమైన ఎట్టి ఆహార పదార్ధాలూ భిక్షగా సమర్పించలేను. నా కుటీరంలోని చెట్లకు కాసిన మధుర ఫలాలను కోరినన్ని సమర్పించ గలను"అని వినయంగా సమాధానం ఇచ్చింది.
మంజుల వీణా నాదం వంటి ఆమె స్వరానికి ఆ సాధువు ఆనంద భరితుడయ్యాడు."అలాగే హైమవతీ!ఆకలి గొన్నవారికి ఏ ఖాద్య పదార్ధమైనా అమృతంతో సమానమే కదా!ఆ పళ్ళే నాకు భిక్షగా ఒసగుము"
సాధువు మాటలు విన్న పార్వతి సంతోషంగా తన ఆశ్రమంలోని మధుర ఫలాలను స్వయంగా కోసి,పళ్ళెంలో పెట్టి ఆ బ్రహ్మచారికి సమర్పించింది.చెంబు నిండా మంచి నీరు పెట్టింది.కడుపునిండా పళ్ళు తిన్న బ్రహ్మచారి సంతుష్టుడైనాడు.
"అయితే కుమారీ!నీవు ఎవరు?ఈ అరణ్యప్రాంతంలో తపస్సు చేయటానికి గల కారణం ఏది?లతాంగి వలే ఇంత మృదువుగా ఉన్న నీవు ఇంత కఠిన నియమాలతో కూడిన తపస్సు చేయుటకు గల కారణాలేమిటో తెలియ చేయి!"అన్నాడు.
ఆ బ్రహ్మచారి పక్కన వినయంగా నిలబడి ఉన్న పార్వతి మొహం సిగ్గుతో కంది పోయింది.నల్లని ఆమె శరీర ఛాయ సిగ్గు వలన కలిగిన అరుణిమ తో ముదురు కెంపు రంగులోకి మారింది.కలువల వంటి కళ్ళు సిగ్గుతో వాలి పోయాయి.తల నేలకు వాలింది.బరువుగా కిందకు వాలిన మీనాల వంటి కను రెప్పలను బలవంతంగా పైకి ఎత్తటానికి ప్రయత్నిస్తూ ఉండగా,ఆమె చెలికత్తెలు."స్వామీ!సతీ దేవిని కోల్పోయి తపస్సులో నిమగ్నమైన పరమశివుని పరిచర్యలకై హిమ వంతుడు తన కూతురైన ఈ హైమవతిని నియమించెను.మన్మధుడి బాణ ప్రయోగానికి ఆ సదా శివుడు చలించలేదు కానీ ఆ బాణము మా రాకుమారి ఎదలో నాటుకుంది.అప్పటి నుండీ లోకమంతటికీ నాధుడైన ఆ పరమ శివుని తన పతిగా పొందాలనే ధ్యేయంతో ఈ తపస్సు ఆచరిస్తున్నది.ఆయన ఎప్పటికైనా కరుణించక పోతాడా అనే ఆశతో ఎదురు తెన్నులు చూస్తున్నది"అని పలికిరి.
అంతట ఆ బ్రహ్మచారి పకపకా నవ్వి ఇట్లన్నాడు!"ఓ లతాంగీ!ఆ పరమ శివుడెక్కడ?నీ వెక్కడ!నిరంతరం స్మశాన సంచారి అయిన శివుని కొరకై చేసే నీ తపస్సు సహేతుకంగా లేదు.వజ్ర కంకణాలతో మృదు శబ్దాలను వెలువరించే తామరతూడుల వంటివి నీ హస్తాలు!శుభకరమైన కల్యాణ కంకణంతో అలంకరించబడిన అటువంటి హస్తాలతో, నిత్యం పడగలు విప్పిన నాగులనే కడియాలుగా అలంకరించుకున్న ఆ శివుడి చేతులను ఎలా పట్టుకోగలవు?
కలహంస అంచుల కొంగులు కలిగిన నీ పట్టుచీరె కొంగులని ఆ శివుడు ధరించిన పులిచర్మానికి మూడు ముళ్ళు వేయుట నీకు సమ్మతమా?
పారాణితో అలంకరించబడి,నీ తండ్రి ఇంట పువ్వులు పరువ బడిన రత్న కంబళ్ళమీద నడచిన నీ మృదు పాదాలు,వివాహమైన తరువాత స్మశానంలోని బూడిదలో మోపవలసి వస్తుంది కదా?
మదపుటేనుగులపై ఎక్కి రాజోచితంగా తిరిగిన కన్యవు,వివాహానంతరం ఆ ముసలి ఎద్దుపై విహరించ వలసి వస్తుంది.ఆయన పుట్టుక ఎవరికీ తెలియదు.తల్లి దండ్రులెవరో తెలియదు.అంద వికారంగా నుదుటిన మూడవ కన్ను ఒకటి!
దిగంబరుడు.నిత్య భిక్షువు!ఏ విధంగానూ ఆ శివుడు నీకు వరుడుగా సాటి రాజాలడు!కన్యా రత్నమా!నా మాట విని,నీ మనసు అతనిపై నుండి మరల్చుకో"అని పలికెను!
శివుని గురించి తిరస్కారంగా మాట్లాడిన బ్రహ్మచారి పై పార్వతికి పట్టరానంత ఆగ్రహం కలిగింది.తను కూర్చున్న ఆసనం పైనుంచి దిగ్గున లేచింది.మొగలిపూల పరిమళంతో మత్తెక్కి పడగ వాల్చి పవళించిన ఉరగాంగన,తనపై ఆకస్మికంగా దాడి చేసిన శత్రువుపై ఉవ్వెత్తున ఎగసి పడినట్లు.చివ్వున రోషంతో లేచింది.ఆ విసురుకు ఆమె తల వెంట్రుకల ముడి వీడిపోయి వేణీ భారం వీపంతా పరచుకొంది.ముఖాన వాలుతున్న నల్లని ముంగురుల మధ్య అస్పష్టంగా కన బడుతున్న ఆమె ముఖ మండలం మబ్బుల్లో తారాడే చంద్రుడి వలే గోచరిస్తోంది.
కోపంతో ఎర్ర బడిన ముఖాన్ని ఒక పక్కగా తిప్పి ఆ బ్రహ్మచారితో ఇట్లు పలికింది"ఓయీ!బ్రహ్మచారీ!తేజస్సుతో నిండిన నీ రూపు ,స్వచ్ఛమైన నీ వాక్కు నిన్ను ఒక సర్వజ్ఞుడిగా నన్ను భ్రమింప చేశాయి.సంపదలపై వ్యామోహం కలవారు వాటికై నిత్యం పాకులాడతారు.సుగంధ లేపనాలకై పరితపిస్తారు.ఆ పరమ శివుడు సర్వ మంగళాలకూ అధిపతయ్యా!ఆయనకు అలంకారాలతో పనేమున్నది!
సర్వ సంపదలూ మూర్తీభవించిన రూపం ఆయనది.ఏ కోరికలూ లేని విరాగి ఆయన!ఆయనే సర్వ సంపదలకూ మూల కారణమైన ఆ ప్రభువుకు సంపదలతో నిమిత్తం లేదు!
ఆయనకు ఆభరణాలు అయినా ఒకటే,నాగులూ ఒకటే!
పట్టు వస్త్రాలైనా ఒకటే,ఏనుగు చర్మమైనా ఒకటే!
ఒంటికి సుగుంధ లేపనమైనా ఒకటే చితా భస్మమైనా ఒకటే!తాండవ సమయంలో ఆయన శరీరం నుంచి రాలిన చితా భస్మాన్ని సకల దేవతలూ పవిత్రంగా భావించి తమ నొసటన ధరిస్తున్నారు.ఆయన వాహనం ఎద్దు కావటం కూడా నీకు చిన్న చూపు కలిగించిందా?ఐరావతాన్ని అధిరోహించి వస్తున్న దేవేంద్రుడు కూడా ఎద్దుపై వచ్చేశివుని చూసి ఏనుగుని దిగి శివుని పాదాలకు నమస్కారం చేస్తున్నాడు.
ఒకటి మాత్రం నిజం చెప్పావు.ఆ సదాశివుని మూలం,పుట్టుకను తెలుసుకోవటం ఎవరికీ సాధ్యం కాదు.ఆద్యంత రహితుడు ఆయన!ఇక నీతో వాదించటం వ్యర్ధం!
ఆ శివుడు నీవు చెప్పిన లక్షణాలే కలిగి ఉండును గాక!నా మనస్సాతడిపై లగ్నమై ఉండుట చేత,మనసా వాచా కర్మణా ఆ పరమ శివుడే నా నాధుడు.నా మనసు ఆయనని తప్ప అన్యులను పతిగా భావించనేరదు.
ఓ చెలులారా!ఈ కపటి ఇంకేమీ మాటలాడక మునుపే అతనిని బయటకు పంపుము"అని చెలికత్తెలకు ఆదేశమిచ్చింది.తను కూడా చివాలున ఆశ్రమం బయటకు దారి తీసింది.
కానీ పార్వతి చెంగు దేనికో తగుల్కొన్నది.ఆ అపర్ణ తన మృదువైన హస్తంతో తన కొంగును బలంగా లాగింది.అయినా ఆ కొంగు బంధ ముక్తిని పొందలేదు.తల ఒక పక్కకు ఓరగా తిప్పి చూసిన పార్వతికి ఒళ్ళు పులకరించింది.ఆ బ్రహ్మచారి రూపంలోని శివుడు తన నిజ స్వరూపంలో ప్రత్యక్షమై,పార్వతి చీరె కొంగును తన హస్తంలో బంధించి మనోహరంగా చూస్తున్నాడు.
మన్మధుడిని భస్మంగా మార్చినపుడు నిప్పులు కురిసిన ఆయన కన్నులు ఇప్పుడు అరవిరిసిన తామర దళాలైనాయేమి!
సోగలు తీరిన ఆయన కను చివరల నుండి ప్రేమతో కూడిన కొంటె చూపులు ప్రసరింప బడుచున్నవేమీ!
నిప్పులు కురిసిన ఫాల నేత్రం నేడు ప్రశాంతంగా అరమోడ్పు అయి జరిగేదానికి సాక్షీభూతంగా నిలువనున్నదేమి?
డమరుక నాదంతో లయ కలిపి సతీ దేహంతో మహోగ్ర తాండవం చేసిన ఆ మృదు పాదాలు నేడు ప్రేమతో కూడి స్వల్ప అలజడికి గురైనట్లు చలిస్తున్నవేమీ!
తామర పుష్పాల వంటి ఎర్రని ఆ అరచేతులలో, కుడి చేయి తన చేలాంచలాన్ని బంధించి ఉండగా, ఎడమ తామర పుష్పం కొంటెగా ఆ కొంగుని నులుమున్నదేమీ!
అంటే,అంటే తను ఆ సదాశివునితో అనుగ్రహించ బడినదన్నమాట!ఆ కరుణా తరంగితుడు తన తపస్సు మెచ్చి తనపై మరులు కొన్నాడన్న మాట!ఆహా ఏమి గిరి పుత్రికనైన నా మహా భాగ్యం అని తలచి పార్వతీదేవి రెండు చేతులూ జోడించి శివుని వైపు క్రీగంట చూపులు నెరపుతూ నిలువెల్లా సిగ్గుల మొగ్గ అయినది.
విసురుగా ముందుకు వేయటానికి లేపిన పార్వతి పాదం అలాగే భూమికి కొంత దూరంలో గాలిలో స్థంభించింది.వేగంగా పరుగులు పెడుతున్న సెలయేటి ప్రవాహానికి పెద్ద బండరాయి అడ్డు పడినట్లు ఆమె పాదం ముందుకు కదలలేక పోయింది.
ఆ ఫాల నేత్రుడు ఉమాదేవి కొంగు మెల్లగా జాలవిడిచాడు.స్తంభించిన పార్వతి ముందు మోకాలిపై కూర్చున్నాడు.ఆయన రెండు చేతులను ముందుకు చాపాడు."కుసుల కోమలమైన నీ పాదాలను నా అరచేత ప్రతిష్టించు గౌరీ!ఆది భిక్షువునైన నాకు, నేడు నీ మంజుల పాదస్పర్శా సుఖాన్ని భిక్షగా ప్రసాదించు.నీవు నీ తపస్సు చేత నన్ను కొన్నావు.నేటి నుంచీ నేను నీ పాద సేవకుడను"అని అనురాగ పూరితంగా మృదు పదాలు పలికాడు.
ఆ మాటలకు పార్వతి నిలువెల్లా సిగ్గుతో కంపించిపోయింది.తటాలున తన కుడిపాదం నేలపై ఉంచి,ఆ శివుని ముందు మోకరిల్లింది"ఓ సుందరేశా!నా అల్ప తపస్సుకే నీవు నన్ను కరుణించి నా యందు అనుగ్రహం కురిపించావు.నేను కన్యను.తండ్రి చాటు బిడ్డను.నీవు దయుంచి నా తండ్రితో పెళ్ళిమాటలు నెరపి,నన్ను శాస్త్రోక్తంగా నీ ఇల్లాలిని చేసుకో"అని ప్రార్ధించింది.
మందహాసంతో పార్వతి కోరికను అంగీకరించిన శివుడు సప్త మహర్షులను స్మరించాడు.సప్తరుషులందరూ తమ సతీమణులతో శివుని ముందు నిలిచారు."స్వామీ!మేము నిరంతరంగా చేసిన తపో పుణ్యంచేత నీవు మమ్మల్ని స్మరించావు!దయచేసి మావలన జరువలసినది ఏమో శలవిమ్మని"కోరారు.
అంత శివుడు"హిమవంతుడి కుమార్తె,సర్వ సులక్షణ సుశోభిత అయిన పార్వతి అనే ఈ కన్యామణిని వివాహమాడి,లోక కళ్యాణార్ధం(తారకాసురుని వధకై)పుత్ర సంతానం పొంద దల్చుకున్నాను.మీరు హిమవంతునితో వివాహ యోగ్యమైన మాటలాడి ఈ వివాహం నిర్ణయించ వలసింది"అని కోరెను.
సప్తరుషులు మహా సంతోషంతో ఆకాశమార్గాన హిమవంతుని సౌధానికి చేరుకున్నారు.సముచిత మర్యాదలు పొందిన తరువాత తాము వచ్చిన పనిని ఆయనకు తెలిపారు.తల్లి చెంత ఆసీనురాలైన పార్వతి రుషుల మాటలకు సిగ్గుల మొగ్గ అయింది.ఆమె మనోభీష్టాన్ని గ్రహించిన హిమవంతుడు పార్వతి చుబుకాన్ని చేత పూని "తల్లీ!నీ తపస్సు ఫలించింది.నీ పుట్టుకతో నా గృహస్థ ధర్మం నెరవేరింది.సదానందరూపుడైన పరమేశ్వరునికి శాశ్వత భిక్షగా,నిన్ను సమర్పించబోతున్నాను.మీరివురూ ఆది దంపతులై లోకాన్ని పాలించండి.నేటినుండీ నువ్వు నాకు కుమార్తెవు కాదమ్మా!సాక్షాత్తూ ఆ లోకమాతవు తల్లీ"అని పార్వతి నుదుటిని ప్రేమ పూర్వకంగా ముద్దాడాడు.
శుభ ముహూర్తం నిర్ణయించ బడింది.నగరమంతా పెళ్ళి సందడి మొదలైంది.ప్రతి ఇంటికీ శుభప్రదమైన తోరణాలు కట్టారు.పురంలోని ప్రతి ఇంటా పసుపు దంచుతున్నారు.పసుపు దంచేటప్పుడు పైకెగిరి,గాలిలో కలిసిన ఆ పసుపు ధూళి ప్రజలందరి శిరసుపై స్వర్ణ రజను వలే ఆవరించింది.అందరి మొహాలలోనూ కారణం లేని,కారణం తెలియని చిరునవ్వుల జల్లులే.రాజమార్గమంతా పుష్పాలు పరిచారు.రాజ సౌధాన్ని బంగారు తోరణాలతో అలంకరించారు.
సుముహూర్తాన పార్వతిని పెళ్ళి కూతురిని చేసే కార్యక్రమం చేపట్టారు.ఒళ్ళంతా సువాసన భరితమైన చందనం కలిపిన పసుపుతో నలుగు పెట్టారు.సువాసనలీనే పూలరేకులు వేసిన సుగంధాల పన్నీరుతో జలకమాడించారు.సుదీర్ఘమైన వేణీ భారాన్ని తడియార్చి సుగంధ ద్యవ్యాలతో పరిమళ భరితం చేశారు.సర్వ మంగళ ప్రదమైన రత్న కాంతులు విరజిమ్మే ఆభరణాలను ధరింప చేశారు.
స్వచ్ఛమైన బంగారంతో నేయబడిన అతి సున్నితమైన జలతారు వస్త్రాన్ని చీరగా ధరింప చేశారు.చంద్రుని నుంచి తెచ్చిన చల్లని చంద్రకిరణాల వెన్నెలతో నేయబడిన వలిపంపు వస్త్రాన్ని మేలిముసుగుగా ధరింప చేశారు.రెండు చేతులతోనూ శుభప్రదమైన నారికేళాన్ని, తాంబూల సహితంగా ధరించి నిలువెల్లా వెలుగులు చిమ్ముతున్న ఆ వెన్నెల బొమ్మకు బంధు మిత్రులు ఎన్నిసార్లు దిష్టి తీశారో లెక్కలేదు.ముత్తయిదువలు అడుగుకోసారి ఎర్రనీళ్ళు దిగదుడిచి పోస్తున్నారు.
ఇంతటి మనోహర లావణ్యమూర్తి చేపడుతున్న ఆ మోహనాకారుడిని చూడాలని జనులు తహతహలాడుతున్నారు.వరుని ఆగమనం సూచిస్తూ నగారాలు మోగాయి.వెను వెంటనే మంగళ వాయిద్యాలు దిక్కులన్నిటా మారుమోగాయి.అంతఃపుర స్త్రీలందరూ గవాక్షాల వద్ద గుమి కూడారు.
ఎదురుగా ఎంతటి అపురూప దృశ్యం!ఏమి ఆ పరమ శివుడి కళ్యాణ వైభోగం!మొదటగా బ్రహ్మ తన సతి అయిన సరస్వతీ దేవితో ఏతెంచాడు.సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు గరుత్మంతుడిపై మహాలక్ష్మీ సమేతంగా అధిరోహించాడు.ఆయన నోట "ఫాలాక్షునికి శుభమస్తు"అనే మాటలు వెలువడుతున్నాయి.ఇంద్రాది లోక పాలకులు,అష్ట దిక్పాలురుజయ జయ ధ్వానాలతో నడుస్తున్నారు.
సప్త మాతృకలు ముందు నడుస్తూ ఉండగా,ఆ మహా శివుడు తన నంది వాహనాన్ని అలంకరించాడు.విశ్వకర్మ బహూకరించిన గొడుగుని ధరించాడు.సప్తరుషులు పౌరోహిత్యాన్ని వహించారు.ఈ అపూర్వమైన మగ పెళ్ళివారి ఊరేగింపు పై ఓషధీ ప్రస్తపుర స్త్రీలందరూ మేడల పైనుంచీ పూల వర్షం కురిపిస్తూ స్వాగతించారు,
శివునికి వివాహయోగ్యమైన పట్టు వస్త్రాలను ధరింప చేశారు.నుదుట మణి మాణిక్యాలతో కూడిన కళ్యాణ తిలకం దిద్దారు.శుభ ముహూర్తాన వెన్నెల సంద్రంలాగా వెలిగిపోతున్న పార్వతీదేవితో ఆ దేవదేవుని పాణిగ్రహణం జరిగింది.ఎదురుగా ఒక అపూర్వమైన కాంతి పుంజం ఆవిష్కరించబడింది.
సప్తరుషుల ఆదేశానుసారం శివపార్వతులు ఇరువురూ అగ్ని చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేశారు.
అందరూ నవ దంపతులను ఆశీర్వదించారు."తల్లీ!ఈ అగ్ని సాక్షిగా నీవు దేవదేవుని ఇల్లాలైనావు.నీ భర్తతో కలిసి దాంపత్య ధర్మాన్ని అనుసరింపుము.మీ జంట సమస్త లోకాలకీ దాంపత్య ధర్మానికి ప్రతీకగా నిలుచుగాక"అనీ దీవించారు.
వివాహానంతరం నూతన దంపతులు మేనకా హిమవంతులకు,సకల దేవతలకూ సర్వ బంధు జనాలకూ నమస్కరించి శుభాశ్శీస్సులు పొందారు.
తదుపరి ఆ దంపతులు వేదికపై బంగారు ఆసనాలను అధిరోహించారు.అందరూ పార్వతిని"కళ్యాణీ!వీరమాతవు కమ్మని దీవించారు.లక్ష్మీదేవి వారికితెల్లని పద్మాన్ని గొడుగుగా పట్టింది.సరస్వతీ దేవి వారిని పలు భాషలలో స్తుతిస్తూ గానం చేసింది.బ్రహ్మ నాలుగు ముఖాలతో చతుర్వేదాలలోని ఆశీర్వచనం పలికాడు!
ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు పవిత్రమైన దాంపత్య ధర్మంలోకి శుభప్రదంగా అడుగు పెట్టారు.
సర్వే జనా సుఖినో భవంతు!
(ఈ కార్తీక మాసంలో పవిత్రమైన పార్వతీ కళ్యాణాన్ని నాకు తెలిసినంత వరకూ,తెలిసిన భాషలో రాయాలని అనిపించి,ఈ ప్రయత్నం చేశాను.ఈ, నా రాతలోని లోటు పాట్లను సరిచేసి,నా ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుతూ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి