4, అక్టోబర్ 2019, శుక్రవారం





9
ఒక సి. ఐ. డి ఆఫీసర్ ఒక ఫోన్ నెంబరును రహస్యంగా తన పై  అధికారికి చెప్పవలసి ఉంది. అందువలన ఒక కథ రాసి పంపించాడు. ఆ కథలో ఫోన్ నెంబర్ ఉందని చెప్పాడు.

కథ -
       మా ఊరిలో శ్రీరామ నవమి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. పెద్దలు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంటే పిల్లలు మరోపక్క అష్టాచెమ్మా ఆడుకుంటూ ప్రసాదాలు ఎప్పుడిస్తారోనని చూస్తున్నారు. మా ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయికి రాముడంటే చాలా భక్తి . ఉత్సవాలకు ప్రతీ సంవత్సరం పదివేలు చందా ఇస్తాడు. అయితే మా ఊరికి దూర ప్రాంతమైన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఉద్యగం చేస్తుండడం వల్ల తరచుగా రావడానికి అవ్వదు.  ఈసారి వారం రోజులు ఉంటానని వచ్చాడు. కానీ ఆఫీస్ నుండి ఫోన్ రావడంతో రెండురోజులకే వెళ్ళిపోయాడు. అతడు ఉండి ఉంటే లలిత కళల గురించి షార్ట్ ఫిల్మ్ తీద్దామని అనుకున్నాం..ఏం చేస్తాం. కుదరలేదు.




పైన రాసిన దాంట్లో దాగి ఉన్న ఫోన్ నెంబర్ కనిపెట్టండి చూద్దాం..
--(())--
*చక్కని సందేశం.*👍👌 -8

 సోక్రటీసుకు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు.

🍥ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు. శిష్య బృందమయితే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లూ చెబుతూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్యపెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు. మరణ శిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయముంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి.

🍥 సోక్రటీస్‌ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన దిగులు, ఆయన ముఖంలో ఆనందం వెలుగు. ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూచుని లైర్‌ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్‌ మనసుని తాకింది.

 🍥పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటిస్‌ హృదయాన్ని తాకింది. ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు.

🍥సోక్రటీస్‌ మెల్లగా కళ్ళు తెరచి జైలర్‌ని పిలిచాడు. జైలర్‌ ఎంతో గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమికావాలన్నాడు. సోక్రటీస్‌ కిటికీలోంచి చూపించి ”మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాణ్ణి తీసుకొస్తారా?” అని అడిగాడు.

 🍥జైలర్‌ ”అయ్యో!దాందేముంది?” అని వెళ్ళి ఆ బిచ్చగాణ్ణి తీసుకొచ్చాడు.

🍥సోక్రటీస్‌ ఆ బిచ్చగాణ్ణి తనకాపాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి లైర్‌ వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాటపాడాడు.

 🍥సోక్రటీస్‌ ఆ పాట పాడుతూ లైర్‌ వాద్యం వాయించాడు. ఇట్లా అరగంట సాధన తరువాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు.

🍥సోక్రటీస్‌ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాణ్ణి పంపేశాడు. ఆయన శిష్యులు, జైలర్‌ ఆశ్చర్యపోయారు. మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది కానీ సోక్రటీస్‌ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది.

శిష్యులు

 🍥”గురువుగారూ! ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. అది తాగి మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు.

🍥కానీ ఇప్పుడు మీరు లైర్‌ వాద్యంమీద ప్రాక్టీసు చేసి పాట నేర్చుకున్నారు? ఏమిటిది?” అని కన్నీళ్ళ పర్యంతమయ్యారు. సోక్రటీస్‌ నవ్వి ”జీవితమంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు.

🍥 నేను నువ్వు ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినన్నినాళ్ళు ప్రతిక్షణం విలువైందే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందముంది.

 🍥గంటక్రితం నాకా పాట తెలీదు. ఇప్పుడు నేర్చుకున్నాను.

🍥ఇంకా నాజీవితంలో గంట సమయముంది.
.
🍥అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశముంది” అన్నాడు.
శిష్యుల నోట మాట రాలేదు.


*🍥" జీవితం అంటే  యేడుస్తూ కూర్చోడం కాదు.,  జీవితం  అంటే  - నాకు  ఇంతే రాసి పెట్టి వుంది - అనుకుని  - నా ఖర్మ  ఇంతే - అంటూ నిందించడం కాదు .,  జీవితం  అంటే  -  నేర్చుకోవడం."*

--(())--

ఆకలికి  రుచి తెలియదు ఎందుకు ? కధ -7

రాజు వెంటనే వంటవాణ్ని పిలిపించాడు. 'ఇంతకాలం నాకు రుచికరమైన వంటకాలు చేసి పెట్టావు. కానీ ఈ మధ్య నీలో వంటలు చేసే ప్రావీణ్యం తగ్గింది. ఏవీ రుచిగా ఉండట్లేదు. నీకిప్పుడు ఒక పరీక్ష పెడతా. నాకు ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంటకం చేసి పెట్టాలి. లేకపోతే నీ తల కోట గుమ్మానికి వేలాడుతుంది' అని హెచ్చరించాడు రాజు.ఆ మాటలకి ముందుగా అలకనందుడు బయపడిపోయాడు. తర్వాత తేరుకుని 'మహారాజా! మీ ఆనతి ప్రకారం ప్రపంచంలోకెల్లా ఎంతో రుచికరమైన వంటకం వండిపెడతాను. దానికి మీరు ఒక నియమం పాటించాలి. ఆ వంటకం రుచి చూడ్డానికి రెండ్రోజుల వరకు మీరేమీ తినకుండా ఉపవాసం ఉండాలి. లేకపోతే ఈ వంటకం రుచి మీ మీద పని చేయదు' అన్నాడు అలకనందుడు.

ఆ షరతుకు ఒప్పుకున్నాడు రాజు. చెప్పినట్లుగానే రెండో రోజు అలకనందుడు ఘుమఘుమలాడుతున్న వంటకాన్ని తయారు చేసి రాజు ముందు పెట్టాడు. రెండ్రోజులు తిండి తిప్పలు లేకుండా ఉపవాసం ఉండి, ఆకలితో కడుపు నకనకలాడుతున్న రాజీవుడు ఆ వంటకాన్ని ఆవురావురంటూ తినేశాడు. 'అబ్బో! అద్భుతం! అమోఘం! చాలా రుచిగా ఉంది అలకనందా! నేనింత వరకు ఇంత గొప్ప వంటకాన్ని తినలేదు' అంటూ మెచ్చుకున్నాడు రాజీవుడు. 'కృతజ్ఞతలు మహారాజా!' అని వంగి వంగి దణ్నాలు పెట్టాడు అలకనందుడు.

ఇదంతా గమనిస్తున్న మహామంత్రి వంటవాణ్ని పక్కకి తీసుకెళ్లి అడిగాడు. 'అలకనందా! ఈ వంటకాన్ని ఎక్కడ నేర్చుకొని వచ్చావు? రాజుగారికి అంత బాగా నచ్చింది!' అని అడిగాడు.

'మహామంత్రీ! నన్ను మన్నించండి. ఏ వంటకం రుచి అయినా దాన్ని తినే వారి ఆకలి మీద ఆధారపడి ఉంటుంది. రాజుగారు ఈ మధ్య ఎక్కువసార్లు భోంచేస్తున్నారు. ఒకటి అరగక ముందే మరోటి తినేసరికి ఆయనకు ఏదీ రుచిగా ఉండట్లేదు. అదే ఇప్పుడు రెండు రోజుల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నారు కాబట్టి నేను ఎప్పడూ చేసిన వంటనే అమృతంలా ఉందనుకుంటున్నారు' అని అన్నాడు. అలకనందుడి తెలివికి ఎంతో మెచ్చుకున్నాడు మంత్రి.

--((***))--

ఓం శ్రీ రాం - నేటి ఓ హాస్య చిన్న కధ -6
Saz üslûbu yapraklar

నేటి ఓ హాస్య చిన్న కధ
ఏమండి ఈరోజు నేను చెప్పినవన్నీ మర్చి పోకుండా తీసుకు రండి అని భార్య చెప్పింది భార్తతో 
ఓ అలాగే ఓ అలాగే 
ఆఫీసు కు వెళ్లి నప్పటి నుండి ఒకటే ఆలోచన 
ఈ రోజు ఎవ్వరి పుట్టిన రోజు కాదు, మా పెళ్లి రోజుకాదు, పెద్దలకు ఆబ్దికం పెట్టె రోజు కాదు, గ్యాస్ బుక్ చేసాను, ఆదార్ కార్డు ఉంది, ఎక్కడికి పొయ్యే అవసరము అసలు లేదు, మరెందుకబ్బా ఇన్ని  తెమ్మన్నది. 

బుర్రగోక్కున్నా ఆలోచన తట్ట లేదు. 
ఎందుకైనా మంచిదని మరలా ఇంటికిఫోన్ చేసాడు భర్త 
ఈరోజు తారీకెంతో ఆ మాత్రం  తెలియదా అంటూ ఫోన్ కట్ చేసింది. 
అప్పుడే చేయి గిల్లుకొని నేను స్పృహలో ఉన్నాను అనుకోని ప్రక్కన ఉన్న స్నేహితుని అడిగాడు            
ఈరోజు విశేష మేమన్న ఉందా. 
ఉంది సార్ ఆడకుండా నాకు సెలవు మంజూరు చేస్తున్నారు అంటూ సెలవు చీటి ముందు పెట్టాడు, అంతె అనాలోచనతో సంతకం పెట్టాడు. 
అంతలో పి.ఏ వచ్చి ఏమిటి సార్ మీకు పెట్టిన టీ కూడా త్రాగలేదు అని అడిగింది. 
ఏమి లేదు ఈరోజు ఎన్నో తారీఖు
మీరు మర్చి పోయారనుకున్నా ఇంకా గుర్తు ఉన్నదండి మీకు 
నాకు ఉద్యోగము ఇచ్చి ఆదరించిన రోజు కదండి  
అవునవును సరే నీవు వేళ్ళు అన్నాడు. 
ఆఫీసునుండి భార్య చెప్పినవి తెస్తూ, కొడుకుని తీసుకు వెల్దామని స్కూలుకు వచ్చాడు. 
ఏమిటి నాన్న ఈరోజు ఆలస్యముగా వచ్చారు 
పని బాగా వున్నదా 
ఆ ఆ బాగా ఉన్నది అన్నాడు. 
ఏమిటి నాన్న అలా ఉన్నారు
ఈరోజు ఏదన్న పండగా అని ఆలోచిస్తున్నాను 
అమ్మ క్యాల0డర్ చూసి ఇవి అన్ని తెమ్మంది ఎందుకో అని ఆలోచిస్తున్నాను 
" ఏమి లేదు నాన్న ఈ నెల క్యాలెండర్ పేజీ చింపి అట్ట వేసుకున్న పాత డేట్ చూసి చెప్పి ఉంటుంది"        
ఆ ఆ ............................................................................ఆ ఆ        

ఆలోచనకు పదును పెట్టిన అర్ధం కావు "కాలమే చెపుతుంది ఓర్పు వహించాలి".   

--((***))-
 చాలా పాత కధ -5

పావురాలన్నీ ఆకాశములో ఎగురుతూ పోతున్నాయి, కొన్ని పావురలో అడవిలో నూకలు ఉండటం చూశాయి వెంటనే క్రిందకు దిగి తిందామని చిత్రగ్రివుడ్ని అడిగాయి. అడవిలో నూకలు వుండవు ఇక్కడ వెదికాడు వలవేసి ఉంటాడు ముందుకు పోయాయి ఏదైనా ఆహా రం తిందాం అని చెప్పగా, నోటిదగ్గర కూడు పాడుచేస్తున్నావు అన్నాయి. ఎవరికైనానుభవిస్తాగాని దాని విలువ తెలవదు మీరందరు దిగుతామంటే నేనెందుకు వద్దంటాను అన్నాడు. అన్ని కలసి క్రిందకు దిగినాయి. తింటూ వలలో ఇరుక్కుపోయినాయి, దూరంనుండి వేటగాడు రావాటం చూశాయి, అన్ని పావురాలు
చిత్రగ్రీవుని వేడుకున్నాయి, నేను చెప్పినట్లు చేయండి అన్నది, అట్లాగే అన్నాయి అన్నీ       

చిత్రగ్రీవుడు చెప్పిన మేరకు పావురాలన్నీ ఒక్కసారిగా పైకి లేచాయి.వలతో పాటుగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. జరిగిందంతా మొదటి నుంచీ గమనిస్తున్న లఘపతనకుడు అనే కాకి, ఈ పావురాలు ఎక్కడికివెళ్తున్నాయి?

వల నుంచి ఎలా తప్పించుకుంటాయి? ఇదేదో చూడదగ్గదే అనుకుని అది కూడా ఆకాశంలోకెగిరి, పావురాలను అనుసరించింది.‘‘ఇలా ఎంత దూరం ఎగరాలి? ఎక్కడికని ఎగరాలి’’ చిత్రగ్రీవుణ్ణిప్రశ్నించాయి పావురాలు.

‘‘గండకీనది వరకూ ఎగరాలి. దాని ఒడ్డున విచిత్రవనమనే అడవి ఉంది. అక్కడికి మనం చేరు కోవాలి.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.‘‘అక్కడికి ఎందుకు’’ అడిగింది ఓ పావురం.‘

‘ఎందుకంటే...అక్కడ నా మిత్రుడు ఉన్నాడు. హిరణ్యకుడు అని ఎలుకల రాజతను. అతను మనల్ని కాపాడతాడు. లోకంలో తల్లీ, తండ్రీ, స్నేహితుడూ ఈ ముగ్గురే కాపాడతారు. మిగిలిన వారు కాపాడ గలిగే అవకాశం ఉందికాని, వారికి మనతో అవసరం ఉండాలి. ఉంటేనే కాపాడతారు.

లేకపోతే కాపాడరు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.‘‘నిజమే’’ అన్నాయి పావురాలు.‘‘హిరణ్యకుణ్ణి కలిస్తే, అతను ఈ వలను కొరికి ముక ్కలు చేస్తాడు. మనం అప్పుడు తప్పించుకోవచ్చు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.‘‘అయితే ఇంకేం! పదండి, పదండి.’’ అన్నాయి పావురాలు. ఎగరడంలో వేగాన్ని పెంచాయి. వారిని వెన్నంటి వస్తున్న లఘుపతనకుడు కూడా వేగాన్ని పెంచాడు.

గండకీనది కనిపించింది. విచిత్రవనం కూడా కనిపించింది. ఒక్కసారిగా పావురాలన్నీ కిందికి దిగాయి. హిరణ్యకుడి కలుగు దగ్గర వాలాయి. రెక్కల టపటపలూ, పావురాల గోలకి కలుగులోని హిరణ్యకుడు ప్రమాదమేదో ముంచుకొచ్చిందని భయపడ్డాడు. కలుగులోనికి మరింతగా వెనక్కి జరిగాడు. కూడదీసుకుని కూడదీసుకుని కలుగు ముందుకు వచ్చాడు చిత్రగ్రీవుడు.‘‘మిత్రమా’’ అని పిలిచాడు.

పరిచయమయిన గొంతులా అనిపించి కొంచెం ముందుకు వచ్చాడు హిరణ్యకుడు.‘‘నేను మిత్రమా! నీ మిత్రుణ్ణి. చిత్రగ్రీవుణ్ణి. నీ సహాయం కోరి వచ్చాను. దయచేసి బయటికి రా’’ అన్నాడు చిత్రగ్రీవుడు. అతని మాట పూర్తికానే లేదు.

ఆనందంగా కలుగులోంచి బయటకు వచ్చాడు హిరణ్యకుడు. చిత్రగీవుణ్ణి చూసి ఆనందించాడు.

‘‘ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మిత్రమా! నిన్ను చూడ్డం నాకు చాలా ఆనందంగా ఉంది.’’ అన్నాడు. అంతలోనే మిత్రుడు వలలో చిక్కుకుని ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.‘‘ఇదేమిటిది? వలలో చిక్కుకున్నావు’’ అనడిగాడు.

సమాధానం చెప్పే లోపే చిత్రగ్రీవుణ్ణి వల నుండి తప్పించేందుకు ప్రయత్నించాడు. వలను కొరకసాగాడు.‘‘ఆగాగు! నన్ను విడిపించడం కాదు, ముందు నావాళ్ళను విడిపించు. తర్వాత నన్ను విడిపించవచ్చు’’ అన్నాడు చిత్రగ్రీవుడు.

రాజుగా తోటి వారిని కాపాడడం ప్రథమ కర్తవ్యం అనుకున్నాడతను. ‘‘పూర్వజన్మలో ఏ పాపం చేశామో! అందరం ఇలా వలలో చిక్కున్నాం. పాపం, పుణ్యం కాదుగాని, బుద్ధిగా ప్రవర్తించలేకపోయాం. ఫలితంగా శిక్ష అనుభవిస్తున్నాం’’ అన్నాడు చిత్రగ్రీవుడు. వల కొరక్కుండా ఆలోచిస్తోన్న హిరణ్యకుణ్ణి చూశాడు.

ఏమిటాలోచిస్తున్నావు మిత్రమా’’ అడిగాడు.

‘‘ఏం లేదు మిత్రమా! నా పళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. నొప్పెడుతున్నాయి. మొత్తం వలంతా కొరకడం అంటే కష్టమనిపిస్తోంది. ముందు నిన్ను విడిపించనీ! తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం.’’ అన్నాడు హిరణ్యకుడు.

చిత్రగ్రీవుడుకి హిరణ్యకుడి మాటలు నచ్చినట్టు లేదు. అదోలా చూశాడతన్ని.‘‘మిగిలిన పావురాలను కూడా విడిపిస్తాను. అనుమానం లేదు. కాకపోతే చెప్పానుగా! పళ్ళు ఇబ్బంది పెడుతున్నాయని. నొప్పి అని. ముందు నిన్ను విడిపించనీ’’ అని చిత్రగ్రీవుడి దగ్గరి వల తాళ్ళను కొరికే ప్రయత్నంలో పడబోయాడు హిరణ్యకుడు.

చిత్రగ్రీవుడు అతనికి అందక వెనక్కి జరిగాడు. ఆశ్చర్యంగా చూశాడు హిరణ్యకుడు.‘‘నీకు నొప్పి కలగనంత వరకూ నన్ను తప్పించి ఎంత మందిని నువ్వు విడిపించగలిగితే అంత మందినీ ముందు విడిపించు. అందరూ విడుద లయిన తర్వాతే నా గురించి నువ్వు ఆలోచించు. అంతేకాని, నన్ను ముందు విడుదల చేసి, మిగిలిన పావురాల సంగతి తర్వాతంటే భావ్యం కాదు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.

నవ్వాడు హిరణ్యకుడు.‘‘నువ్వు చెప్పేది చిత్రంగా ఉంది మిత్రమా! తనకు మాలిన ధర్మం అంటారే అలా ఉంది నువ్వు మాట్లాడేది. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో! తర్వాత మిగిలిన వారి సంగతి ఆలోచించవచ్చు.

అలా కాదు, వారి సంగతే ముందు ఆలోచించాలి, తర్వాతే నా సంగతి అంటావా, అప్పుడు నీ అంతటి మూర్ఖుడు ఇంకొకడు లేడనుకుంటాను. రాజుగా నువ్వు క్షేమంగా ఉంటేనే కదయ్యా, ఇతరుల క్షేమాన్ని పట్టించుకునేది. నువ్వే క్షేమంగా లేనప్పుడు వాళ్ళెవరు? నువ్వెవరు?’’ ప్రశ్నించాడు హిరణ్యకుడు.

‘‘నిజమే! కాని, నా వాళ్ళంతా కష్టంలో ఉండడాన్ని నేను భరించలేను. సాటి వారు కష్టంలో ఉంటే వారిని ఆదుకోవాలి. అందుకు ప్రాణత్యాగం చేసినా తప్పు లేదు. నేనూ వాళ్ళూ ఒకటే! వాళ్ళు లేకుండా నేను లేను. నేను లేకుండా వాళ్ళు లేరు.

ఆపదలో ఉన్న నా వాళ్ళను నేను రక్షించుకోలేనప్పుడు నాకీ రాచరికం ఎందుకు? ఎవర్ని ఉద్ధరించడానికి?’’ అన్నాడు చిత్రగ్రీవుడు. పావురాలన్నీ గొప్పగా చూశాయి, తమ రాజుని. రాజంటే చిత్రగ్రీవుడనుకున్నాయి.‘‘ఏదో రోజు అందరం పోయే వాళ్ళమే! ఈ శరీరం అశాశ్వితం. అది తెలుసుకోవాలి ముందు. తెలుసుకునిఉన్న నాలుగు రోజులూ నాలుగు కాలాల పాటు నిలిచే పనులు చెయ్యాలి. తోటివారికి సాయం చెయ్యాలి. అందుకని చెబుతున్నాను. మరోలా అనుకోకు. ముందు నా వాళ్ళను కాపాడు. తర్వాత నీకు వీలయితేనే నన్ను కాపాడు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.అతని మంచితనానికి ముచ్చటపడ్డాడు హిరణ్యకుడు. మనసులో జేజేలర్పించాడు.

--(())--
ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ:

నేటి కధ . (కలసిన హృదయాలు) (4)

నాన్న నాకప్పుడే పెళ్ళికి తొందరెందుకు, నాకు మంచి ఉద్యోగము రాలేదు, ఈ ట్యూషన్సు వల్ల పెళ్లి చేసుకుంటే కష్టం కదా.

అట్లా నేను అనుకుంటే నాకు అసలు పెళ్లి అయ్యేదే కాదు, ఎందుకంటే నా పెళ్లప్పుడు మునిసి పాలిటీ అత్తర్, చెత్త వ్యాన్ డ్రైవర్  పనిచేసే వాడ్ని, అందరూ  పెళైన కొత్తలో చెత్త బాబాయి అనేవాళ్ళు, వాళ్ళు అలా అన్నారని మీ అమ్మను ఎప్పుడూ భాద పెట్ట లేదు.

నీవేమి భయపడకు ఆ దేవుడు వ్రాసి నట్లే జరుగుతుంది అంతా మనకోసం జరిగిందను కోవాలి ఎంత చెట్టుకు  అంతే గాలి అయిన మానవ ప్రయత్నం చేయాలి కదా, నీవేమి ఆశలకు పోవటం లేదు కదా, కంతకు తగ్గ బొంత కోసం వెతు కుంటున్నావు, ఏమో నాన్న నీవు చెప్పావు కాబట్టి అమ్మాయిని చూసి వస్తా, నాకు నచ్చక పోతే నచ్చ లేదని చెపుతా అంతకు ఇష్ట మైతేనే పిల్లని చూస్తా, సరే నీతోపాటు పక్క ఇంటి గోపాలం గారిని తీసుకొనివెళ్ళు అన్నాడు.
ఆలా పిల్లను చూడటం నచ్చలేదని  నాన్నకు చెప్పఁటం జరిగింది.
  
ఎందుకు నచ్చలేదో చెప్పాలి, అమ్మాయి వాళ్లు నీచేత కంప్యూటర్
జిరాక్స్ మిషన్ కొని ఇంటర్ నెట్ సెంటర్ పెడుతారుట, స్వతంత్రంగా బ్రతక వచ్చు ఇలా ట్యూషన్సు చెప్పే బదులు ఒక్కసారి ఆలోచించు, అది అంత  తెలికకదా, నిన్ను వదలి వెళ్ళి బతకాలనిలేదు.

అది కాదు నాన్న" పిల్ల ", నాకునచ్చలా పిల్ల కళ్ళు గాజుకళ్ళు, పగలు చూడాలంటే నాకు భయ మేసింది, ఇక రాత్రి విషయం తలుచు కుంటే ఇంకా భయమేస్తుంది.

     సరేరా  మన గోపాలం గారి చుట్టా లెవరో ఉన్నారట చూసి వస్తావా.
నాన్న నేను మాత్రం ముందు చూడను, నీవు చూసి నచ్చింది, చూడరా అంటే చూస్తాను అంతే
చివరికి మానాన్న గారు చూసిన సంభంధము కుదిరింది.    
పెళ్లి రంగ రంగ వైభవముగా జరిగింది, పార్వతి పరమేశ్వరులు అని దీవించారు, నాకు గవర్నమెంటు ఉద్యోగమూ వచ్చింది, నాన్న గారిని వదలి వేరొక ఊరులో ఉద్యోగ నిమిత్తము కాపురం పెట్ట వలసి వచ్చినది. (నాన్న గారు గుడిలో పూజారిగా ఉంటాను, ఈ వయసులో మీ మధ్య నేనెందుకు అని మమ్ము భాగ్య నగరానికి  పంపించారు.

ఇంతకీ నాపేరు చెప్పలేదు కదా, నాపేరు మాధవ్  భార్యపేరు రాధ 
ఇక సంసారంలో సరిగమలు వినండి
నన్ను పొద్దున్నే రాధ నిద్ర లేపుతుంది వాకింగ్ పొమ్మంటుంది, తనేమో పాలు ఆలస్యముగా వస్తే వాడితో    గొడవ పెట్టు కుంటుంది, పని అమ్మాయి ముందు వస్తే నా నిద్ర చెడ గొట్టావ్ అని ఎగిరి పడు తుంది, నేను   తిరిగి వచ్చాక కూడా రుస రుస లాడుతూ ఉంటుంది,   పే పరు బాయ్ ఇంటిలోకి విసిరేశాడని వానితో గొడవ పెట్టు కుంటుంది, నేను ఎన్ని సార్లు చెప్పిన వాళ్ళతో తగాదా పడ కూడ దన్నా విని పించుకోదు, నన్నే ఉరిమి  ఉరిమి  చూస్తుంది, అప్పుడను కూనే వాణ్ని ఇలాంటి వాళ్ళను కాలమే బాగు చేయాలి,   నోటితో న్యాయం చెప్పఁటం కన్నా మౌనం గా ఉండుట మేలు అని తలచి కాపురము చేస్తున్నాను. టివి అదే పనిగా చూస్తుంది, సీరియల్సస్ లో లీనమై పోతుంది, వంటకాలు చూసి రోజు కొక  వంటకం తయారు చేస్తుంది . 

ఏదన్నా అంటే ఈ వయసులో కాక ఏ వయసులో సుఖపడతాం అంటుంది, పిల్లలు మాత్రం ఇపుడే వద్దంటుంది, మీ సంపాదన పిల్లలు ఉంటే సరి పోదంటుంది. ఎవరు ఏమి చెప్పిన ఇట్టే నమ్మేస్తుంది, ఆఫీసులో ఆలస్య మైనదనుకో ఆరోజు నాకు పస్తే నోరు చేసుకొని కాపురం చేస్తుంది. 
        
ఒక రోజు నాన్నగారు మా ఇంటికి వచ్చారు, ఎరా ఆలా ఉన్నావు, కోడల పిల్ల లేవ లేదా, వంట్లో      నలతగా ఉన్నది. అందుకని నేనే గ్రైండర్ లో పప్పు రుబ్బి దోశలు వేయుటకు నేను రడీగా ఉన్నా నాన్న, నీవు కాళ్ళు చేతులు కడుక్కొని రా, నీకు దోశలు పెడతాను, నాకు తొందర లేదురా, ఇప్పుడే రైల్లో దిగి ప్రక్కనే ఉన్న హోటల్లో టిఫిన్  తిని వచ్చానురా, నీవు ఆఫీసుకు పోతావేమోనని తొందరగా వచ్చాను, నీవు అమ్మాయి తినండి,  నీ పరిస్థితి చూస్తుంటే నాకు దిగులుగా ఉందిరా, నాన్న నేను ఆఫీసుకు పోయి  వచ్చాక అన్నీ మాట్లాడు కుందాం, నేను  కూడా నా స్నేహితుని కొడుకు మ్యారేజ్ చూసి వస్తాను . అమ్మాయికి ఒకేమారు చెప్పి పోతాను పిలుస్తావా. 
రాధా అని పిలిచాడు. 
         మావయ్యగారు ఎప్పుడు వచ్చారు, ఏమిటి  చెప్పకుండా వచ్చారు, సరేలేండి భోజనం చేసి మరి వెళ్ళండి.

ఏమిటే ఆ  మాటలు నాన్నతో
నేనేం తప్పు మాట్లాడ లేదు ఉన్న నిజం చెప్పా అంతేకదా
బాబు మీ సంసారం చూసాక మీకు కొన్ని విషయాలు చెప్పి వెళతాను అన్నాడు అట్లాగే నాన్న.    
ఏమిటండి, మీనాన్న నాకు చెప్పేది అన్నది
 మా నాన్నగారు వెళ్ళేదాకా అన్న నీ నోరు కంట్రోల్లో  పెట్టుకో, లేదా నేను చేయి చేసు కోవాల్సి ఉంటుంది,
ఏమిటి మీ చేయి లేస్తుంది, మీ నాన్న కోసం మీరు చెప్పినట్లుగా బుద్ధిమంతురాలుగా ఉంటాను నోరు ఎత్తను అన్నది. 

చూడు బాబు మారాలి మారాలి భార్య అని ఆమె చెప్పిన వన్నీ కోపంతోగాని ప్రేమతో గాని చేయటం తప్పు కాదు,    కాని నేను ఉద్యోగం చేస్తున్నాను అని అహంకారము భార్య ముందు ప్రదర్శించ కూడదు, భార్య భర్తలలో ఎవరికి   ఎవరు ఎక్కువకాదు .. తక్కువ కాదు ... సమానమే

మనస్పర్థలు రాకుండా ఎప్పుడూ నవ్వుతూ ప్రతి విషయము  సాల్వు చేసు కోవాలి, పెద్దలు కుదిర్చిన పెళ్లి ఆయన ఒకరి కొకరు ప్రేమను పంచుకొని సంసారాన్ని స్వర్గమయం చేసుకోండి, ఇంతకు ముందు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం నాముందు కీచులాటలు మాత్రం ప్రవర్తించ కండి.

మీ సంతోషానికి నేను అడ్డురాను, మీరు ఏ తిండి పెడితే అదే తింటాను, నాకు   పెన్షన్ వస్తుంది అది కూడా మీకే నేను ఇక్కడ ఉన్నంత కాలము మీకే ఇస్తాను.

మీరు చేయాల్సిందల్లా ఒక్కటే నాకు మనవుడో  మనవరాలో ఇవ్వండి వాళ్ళతో ఆడు కుంటూ ఇక్కడే ఉంటా .

అప్పుడే మావయ్యగారు నన్ను  క్షమించండి  తప్పుగా మాట్లాడితే మన్నించండి, మీరు ఇష్టమున్న రోజులు ఇక్కడ ఉండవచ్చు

నాన్న మీరు ఎక్కడికీ పోనక్కరల్లేదు ఇక్కడే ఉండండి.
మీరు కీచులాట లాడితే మాత్రము ఇక్కడ ఉండలేను ముందే చెపుతున్నాను.        

చీకటి పడింది, మావయ్యగారు పడుకొనే  గది చూపించి, మంచి నీళ్లు పెట్టి ఏ అవసరము వచ్చిన మీ అబ్బాయి నా సెల్లు నెంబర్లు ఇవి ఫోన్ చేయండి అనిచెప్పి పడక గది చేరి భర్తతో ఇంటి పనులు అన్నీ నే చూసు కుంటా, ఆఫీసు పనులు మీరు చూసుకోండి

అబ్బా ఈ రోజు పండు వెన్నలుగా ఉన్నది మంచం పై ఒకరికొకరు తన్మయత్వంలో మునిగి తేలారు, ఏవండీ నేను కూడా ఉద్యోగం చేయనా, మీ నాన్నగారు కూడా ఉన్నారుగా, ఇప్పుడు మనకు డబ్బుని గూర్చి ఆలోచించ వద్దు పిల్లలగురించి ఆలోచిద్దాం, అవునండి మనకు పిల్లలు కావాలి, మీ నాన్నగారు కూడా ఉండాలి,   (శంకరం మనసులో   అను కున్నాడు  ఇంట్లో పెద్దలు ఉంటె ఆ యిల్లు సుఖశాంతితో ఉంటుంది)   అంటూ    వారిరువురి హృదయాలు ఆనందంతో నిండినాయి.    


రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
  •   --((*))--
--((***))--

ఉప్పులో .. బద్ద* (3)


“ఏం..కూరొండేవేటి ..వదినే..…! ”
మిట్ట మజ్జానం రెండున్నరకి పిల్లలు అన్నాలు తిని బళ్ళోకి ఎల్లిపోయాకా.. తలుపుకి తాళవేసి ఆటిని జాగర్తగా జాకిట్లోకి దూరుపుతా అప్పుడే అరుగు మీద కొచ్చి కూచ్చుని తొక్క బద్దలు ఏరటానికని అక్కడే గోడకి జేరేసి ఉన్న సేటల్లోంచి ఏ సేట సేతుల్లోకి తీసుకుని పక్కనే ఉన్న కందిపప్పు బత్తాలోంచి దోసిలితో రెండో దోసిలి..కందిపప్పోసుకుంటున్న సరోజ్ని వంక సూడకుండానే సావిత్రంది ఏదోటి పలకరిచ్చాలి గాబట్టి అన్నట్టు.

రోజూ మజ్జానం కందిపప్పులో తొక్క బద్దలేరతానో..ఎండు మిరపకాయలకి ముచ్చికలు తీస్తానో..బియ్యంలో రాళ్ళేరతానో..
సింతపండు రోజుల్లో ఉట్టులూ, గింజలూ తీత్తానో..అప్పడాలు వత్తుతానో..ఏదో ఒక పని అంతా కలిసి సేసుకుంటానే ఉంటారు..సావిత్రి వాళ్ల మండువా అరుగుల మీద ఆ సుట్టుపక్కలోళ్లంతా . అదెవరి పనైనా అందరూ తలో సెయ్యీ ఏత్తం రివాజు.
నాలుగు సేతులడితే సంద్రాన్నయినా వడకట్టచ్చంటారు ఆల్లంతా.
సావిత్రి ఆళ్ల మండువాకి రెండిళ్ళవతల ఉంటది సరోజ్ని ఇల్లు.
సావిత్రి మొగుడు సుబ్బారావ్ సేల గట్ల మీద ఏదోటి ఏసి పండిత్తా ఉంటాడు..ఒకోసారి కంది మొక్కలేత్తే ఒకోసారి జనపనార సెట్లేత్తాడు. ఒకోసారి..బెండమొక్కలెడితే మరోసారి బంతి మొక్కలేత్తాడు.
మిగతా ఆటి మాటెలా ఉన్నా బంతి పూల మొక్కలేసిన ఏడు…అందరి గుమ్మాలూ రోజిడిసి రోజూ గుమ్మాలకి బంతి పూల దండల్తో..అమ్మోరికి ఆవ్వానం పలుకుతున్నట్టుంటాది ఈధి ఈదంతాను.
అలాగ ఈ ఏడు కంది సెట్లేసేడేమో..ఇంట్లోకి సరిపడా అయిన కందుల్ని పురుగు పట్టకుండా ఎండలో పోసి బాగా ఎండబెట్టి..వారం రోజులపాటు కందుల్ని తిరగలిలో ఏసి ఇసిరింది ఇసిరినట్టుందేమో ..సావిత్రి, అంతా య్యాకా దాన్ని జల్లెడతో జల్లిత్తా నలగని కందిగింజల్ని తీసేసి.., సేటతో పొట్టు సెరిగేసి..నూకల్ని తీసేసిందేమో దానంతా సేటతో బత్తాలోకెత్తి మూఠదెచ్చి అరుగు మీదెట్టి అయిదారు సేటల్ని పక్కనే పడేసింది ఇరుగుపొరుగోల్లొత్తారు తొక్కబద్దల్ని ఏరతాకని.

“సెరుకు తోటకి జడేత్తన్నారు కూలోల్లు పొలంలో. సేలో లోపలెక్కడో సిన్న పాదుందంట. కాసినియ్యని రెండు దోసకాయలుంటే తెచ్చేరు మియ్యన్నయ్య. పప్పులో పడేసి సారెట్తేను. నువ్వేంజేసా..?”
అంది సరోజ్ని ఉండుండి సేట్లోని కందిపప్పుని నాలుగేళ్లతో ముందుకి విసిరినట్టుగా లాగి అలా విసరగా పల్చగా అయిన పప్పులోంచి తొక్క బద్దల్ని ఏరి పక్కనున్న సోలలో ఏత్తా.. యధాలాపంగా..
“ఆ..! బెండకాయ పులుసెట్టేను. సావిడి కాడ నాలుగు సెట్లు నాటేరెంట. తెచ్చి నాల్రోజులయ్యింది. తెచ్చిన్నాడైతే నవనవలాడతా ఉంటాయని సగం కాయలు బెల్లం ఇగురేసేను. ఇంకో నాలుక్కాయలుంటే ముదిరిపోతన్నాయని ..”తలెత్తకుండానే బదులిచ్చింది సావిత్రి.
“దోసకాయ పప్పు మా పిల్లోడు నెయ్యేత్తే బాగానే తింటాడుగానీ ..మా గిలకే..నోటబెట్టదు.
తిన్నంటే తినదంతే. పిల్లోడికైనా బెతిమాలి ఓ ముద్ద తినిపిచ్చొచ్చు. ఇదొట్టి పెంకిది.
రెండు కొట్టి తినిపిద్దావని సూత్తానా..? తింటేనా..తిందు.నాకే తినిపిత్తది..తిరిగి.”
“మావోడూ..అంతే. డబ్బులిత్తాను, కొట్టుకాడ బిళ్లలు కొనుక్కుందుగానంటే తినేత్తాడు..”
“అలాగైతే బాగానే ఉండును. ఏదిత్తానన్నా..నచ్చాపోతే నోట పెట్టిచ్చలేను. ఒట్ఠి పెంకిముండ. యేగలేక సత్తన్నాననుకో దీంతో.. ..”
“రెండు మూడేల్లు పోతే ఇవరం అదే వత్తదిలే. ఇవరం వచ్చిందంటే మనకే సెప్పుద్దది..”అంది సావిత్రి..సేట్లోంచి తలెత్తకుండానే.
మాటల్లోనే ఇరుగూపొరుగోళ్ళొచ్చి తలో సేటా తీసుకుంటుంటే సావిత్రంది..
“టీలు ఐపోయినియ్యా ఏటి..?”
“ఇంకాలేదు. ఏదో పని మీద ఈయన మజ్జానం పొలాన్నించి ఇంటికొచ్చి వణ్ణం తిని గంటలో వత్తానని ఎల్లేరు. వత్తే టీ పెట్టి రావొచ్చని ఆగేను. ఇంకా వత్తాలేదని సూసీ సూసీ ఇటోచ్చేను. య్యే..మియ్యయిపోయినియ్యా..?”
“అప్పుడేనా..?”
మరో ఇద్దరొచ్చి చేరేసరికి సోల్లో తొక్క బద్దల్తో పాటు కవుర్లూ ఎక్కువైపోయినియ్ అక్కడ.
ఇంతలో .. రయ్యిమంటా దూసుకుని ఈరో సైకిలొచ్చి ఆగిందక్కడ. సైకిల్తో పాటు సుట్ట కంపూ అగిందక్కడ.
ఆ డొక్కు సైకిలు శబ్ధం, సుట్టకంపూ ఆల్ల ముక్కుసెవులకి అలవాటేనేమో..వంచిన తలెత్తలేదెవ్వరూ. ఎవరి పన్లో ఆళ్ళున్నారు.
ఒక్కాలు కిందెట్టి ఇంకొక్కాలు పెడలు మీద అలాగే ఉంచి సరోజ్ని వంకే సూత్తా..
“గిలకొచ్చేత్తందక్కా..బల్లోంచి..” అన్నాడు సావిత్రి మొగుడు సుబ్బారావ్ .
సివ్వున సేట్లోంచి తలెత్తి “మా గిలకే..?” అంది తెల్లబోతా..సరోజ్ని.
“అయ్యా..! గిలక తెలవదేటక్కా..నాకు? గిలకే. లంగా జాకిట్తేసుకుంది గదా..”
“అవును ..ఏస్కుంది. ఇప్పుడే గదా ఎల్లింది బళ్ళోకి? ఇంతలోనే ఇంటికాడ ఏం పనొచ్చింది ఎదవకి?”ఇసుగ్గా అంది సరోజ్ని మళ్ళీ సేట్లో పప్పులో తలదూరుత్తా..
సుబ్బారావు పకపకా నవ్వేడు ఏదో గుర్తొచ్చినట్టు. కాసేపలా నవ్వీ, నవ్వీ…
“లంగాని ఇస్రుగా తన్నుకుంటా వచ్చేత్తంది సరోజ్నక్కా.! ఆ ఇసురుకి లంగా ఇంతెత్తున ఎగిరెగిరి పడతంది. మూతేమో మూరడు పొడుగొచ్చింది ఇవతలికి. ఏదో సిరాగ్గా ఆపడతంది మడిసిగూడాను మరి..”
నవ్వుతానే అన్నాడు..సైకిల్ దిగేసి మందువా గోడపక్కమ్మటా స్టేండేసి లుంగీని పైకి మడుత్తా..
“ఉప్పుడే ఎల్లింది సుబ్బయ్యా ..అన్నందిని. దాన్నలాగంపి తాళవేసుకుని నేనిటొచ్చేను మీయావిడ కందిపప్పేరతంటే సూసి. ఇంతలో దానికి ఇంటికి ఏవన్నా పనుందంటావా? పేనం ఏగిచ్చిపోతందనుకో. ఇంటికాడుంటే ఏపిచ్చుకు తింటందని బళ్ళో పడెయ్యమన్నాను మీ బావయ్యని. ఇంటికాడుంటే ఒగ్గొడవ. బళ్లో ఏత్తే ఇంకొగ్గొడవా.సత్తన్నాననుకో దీంతో..”
“ఏ దొడ్లోకన్నా వత్తందేమో లేపోతే..” అదోలా నవ్వుతా అంది సావిత్రి మొగుడొచ్చేడని సేట పక్కనెట్టి లేసి నిలబడతా..
“అబ్బే. ఎప్పుడైనా ఇరోసనాలొత్తే తప్ప మజ్జలో ఎల్దు. పొద్దున్నే ఓసారి ఎల్లద్దంతే…! “సరోజ్నంది .
“ఒకవేళ ఎవరన్నా ఏవన్నా అన్నారేవో..మూతి ముందుకెట్టింది అంటన్నారుగదా ఈయన. అయినా కాసేపాగితే అదే తెలుత్తుది. “
“ ఎదప్పిల్లలు . అంతే బాబ. కొట్టుకుంటా ఉంటారు. కొంపలంటూ పోయినట్టు తిట్టుకుంటా ఉంటారు. మల్లీ ఆల్లే కలుత్తా ఉంటారు. మా రోజుల్లో అయితే రత్తాలొచ్చేతట్టు గీరేసుకునేవోల్లం. ఇంకా ఈ రోజుల్లో పిల్లలు నయవే..! సేతుల్తో కొట్టుకుంటన్నారు. ఎన్నిమార్లు కొట్టుకుంటే తగిలేను దెబ్బలు. కూతంతుంటాయ్ ముండా సేతులని..ముండా సేతులు..” రవణ అంది పిల్లల సేతులు గుర్తొచ్చి మురిపెంగా..
“అమ్మో..అలాగనకు రవణక్కా..! నీకుదెలవదు. మా గిలక సరిసిందంటేనా..? సుర్రున మండుద్ది..పిడపల్లాగుంటయ్యేవో సేతులు..ఎప్పుడైనా ఓ దెబ్బేత్తే పిల్లోడు గింగిరాలు దిరిగిపోతాడనుకో..దాని దెబ్బకి తట్టుకోలేక..”
ఏరేసిన పప్పుని పక్కనే ఉన్న బత్తాలో పోసేసి ఈధెనక్కి సూత్తా మరో నాలుగు దోసిళ్ల కందిపప్పు సేట్లో పోసుకుంటా అంది..సరోజ్ని.
అంతలోనే రయ్యున దూసుకుంటా వచ్చేసింది గిలక.
తలుపు గడియేసి ఉంటం సూసి నిలబడ్ద సోటే నిలబడి రెండు సేతుల్తో లంగా కొంచెం పైకెత్తి కాళ్ళు రెండూ నేల కేసి తపా తపా కొడతా రాగం లంకిచ్చుకుంది గిలక “అమ్మెక్కడికెల్లిపోయిందో “నన్నట్టు నిరాశగా.
సేతులు సేటలో ఆడిత్తా..అదంతా సూత్తానే ఉన్నారు మండువా అరుగుల మీద ఆడాళ్ళు.
అప్పటికే సూరీడు తిష్టేసేసినట్టు ఎర్రగా కందిపోయి భగభగలాడతందేవో..దానికి ఏడుపు తోడై వానలో మెరుత్తున్న సూరీళ్ళా ఉంది గిలక..
“మియ్యమ్మిక్కడుందే గిలకా..! ఏ..ఏటి? ఇయ్యాలప్పుడొచ్చా..” లోలోపల నవ్వుకుంటానే ఎటకారంగా అంది..గిలకొంక సూత్తా.. రవణ.
దాంతో ఏడుపాపి.. ఏమ్మాట్తాడకుండా తిన్నగా ఆల్లమ్మ..దగ్గరకంటా వచ్చి నిలబడి సెయ్యి సాపింది ఇంటి తాలాలిమ్మన్నట్టుగా..
“ఎంతుకొచ్చా…మజ్జలో..ఇంటికి? కడుపులో కాలిందా ఏటి?”
“హ్హె..కాదు..తాలాలియ్యి..”కోపంగా అంది గిలక.
“అదే ఎంతుకని అడిగితే సెప్పవే? మేస్టారు కొట్తేరా?’
“కాదని సెప్పేనా? ముందు తాలాలియ్యి..”ఇసుక్కుంది గిలక.
“మేస్టార్ని అడిగే వొచ్చేవా..?”
“ఆ..అడిగే వచ్చేను. ఒకటికి వత్తందన్నాను..పరిగెత్తన్నారు..”
..”ఎంతుకో సెప్పి సావొచ్చుకదా..! సెప్తుంటే నీక్కాదా? యేసాలేత్తన్నాయ్ యేసాలని..”
కళ్ళెర్రసేసింది సరోజ్ని..
ఇంక సెప్పక తప్పదని..సరోజ్ని దగ్గరకంటా వచ్చి ఈపుకి జారబడి కూకుని..సేట్లో కందిపప్పు కూతంత సేతుల్లోకి తీసుకుని పకి ఎగరబోత్తా..
“మరీ..మరీ .. ఆ కిట్టవేణుంది కదా…అదే ఆ గుడికాడిల్లు.. కిట్టవేణి. ఎలుగుబంటెహ్హె..”
“గుడికాడ కిట్టవేణంటే నాకెలా తెలుత్తుది. ఆల్ల ఇంటి పేరు సెప్తే తెలుత్తుదిగానీ..”
“సరోజ్నంది ..ఏంజప్పుద్దా అని సెవులు ఒదిలేసి ఇంటా.. .
“ అదేనెహ్హే…ఆ ఈడుబుగంటోరు కిట్టవేణి. ఎలుగుబంటీ ..ఎలుగుబంటీ అంటానుగదా నేను. “
“ నువ్వందరికీ పేర్లేలేగానీ సెప్పి ఏడువ్ ..! అలా పిలవద్దని నెత్తీ, నోరూ బాగుకున్నా ఇనవా?” ఇసుక్కుంది..సరోజ్ని..గిలక సాగతీతకి.
“ అబ్బా..సర్లేగానీ..ఆ..ఎలుగుబంటి..ఎప్పుడో నాకు సిన్నది, ఇదిగో ఇలా సూడు..ఇంత. ఇంతంటే ఇంతే. ఈ గోరంత కూడా ఉండదది. కూతంత ఉప్పులో ముక్కెట్టిందమ్మా..! ఉప్పుడు తెచ్చివ్వమంటంది.”
లాకుల వెనక దాక్కున్న నీళ్లల్లా..వాళ్లందరి ముఖాలూ ఉబికుబికి వచ్చే నవ్వుతో గుంభనంగా ఎప్పుడెప్పుడు వరదై పారదామా అన్నట్టున్నాయ్ గిలక మాటలకి.
“ఎప్పుడెట్టింది నీకు..?”నవ్వాగటం లేదు రవణకి.
“ఎప్పుడో అప్పుడ్లే. నువ్వు మరీను. సెప్పింది ఇనక..”ముసి ముసి నవ్వులు నవ్వుతా సావిత్రంది రవణని సెప్పనియ్యి అన్నట్టు
“ఎప్పుడో..! ..నాకే గుత్తులేదు..”…పప్పులో గీతలు గీత్తా.. అందేమో.. గిలక బుంగ మూతిని ముద్దెట్టి కొరికెయ్యాలనిపించింది..రవణకి.
“తింగరిముండ కాపోతే ..అప్పుడెప్పుడో పెట్టి ఇప్పుడెంతుకివ్వమంటందది….”సావిత్రంది…గిలకని రెచ్చగొడతాకన్నట్టు..మనసులో నవ్వుకుంటానే..
సావిత్రి కృష్ణవేణిని తింగరి ముండని తిట్టటంతో కొత్త ఉత్సాహం వచ్చేసింది గిలక్కి. దాంతో..గబుక్కున లేసి నిలబడి …నడుం మీద సెయ్యేస్కుని మరీ సావిత్రెనక్కే సూత్తా..
“అదే..సావిత్రత్తా..! మరీ..మరీ ..ఆ ఎలుగుబంటేవో.. ఓంవర్కు సెయ్యలేదు. నేనేమో..మేస్టారింకా రాలేదని వరండాలో..తంబాలాట ఆడుకుంటన్నాను. నేనలా ఆడుకుంటన్నానా..ఆడుకుంటుంటే నా సంచీలో స్సెయ్యెట్టి నా పుస్తకం ఇవతలకి తీసేసి.. సూసి రాసేత్తంటే గిరీసొచ్చి సెప్పేడు. నేనేమో మా మేస్టారుతో సెప్పేను. మా మేస్టారు సూసెంతుకు రాసేవు? ఇంటికాడేంజేత్తన్నా..గౌడిగేదెల్ని కాత్తన్నావా? అని దాన్ని తిట్టి బెంచెక్కి నిలబడమన్నారు. దానిక్కోపం వచ్చి పైనుంచి నాయనక్కి సూత్తా..”నన్ను బెంచీ ఎక్కిత్తావు గదా..! సూడు నిన్నేం సేత్తానో..? అని ఏలెట్టి బెదిరిచ్చి.. అప్పుడెప్పుడోను..డ్రాయింగు క్లాసులో నీకు ఉప్పులో ముక్కిచ్చేను గదా ..నా ముక్క నాకిచ్చెయ్ అంది. అత్తా..”
సెప్పేటప్పుడు అదేపనిగా తిప్పుతున్న ఆ బుజ్జి బుజ్జి సేతుల వంకే సూత్తన్నారేమో..ఒకటే నవ్వులు అక్కడంతా.
“అప్పుడు నువ్వేవన్నా..”పొట్టని సేత్తో పట్టుకుని నవ్వుని ఆపుకుంటా రవణంది..
పప్పేరతానే పైకి ఇనపడకుండా లోలోన సరోజ్ని నవ్వే నవ్వుకి అంతేలేదు..
“నేనూరుకుంటానేటి రవణత్తా..! నేనూ అన్నాను..గాడిద గుడ్డు. నీ ఉప్పులో ముక్క నీకు పడేత్తా.. కావాలంటే రెండిత్తా. సూసి రాసేవంటే మాత్తరం ఊరుకోనన్నాను. సూసి రాత్తే తప్పే కదా సావిత్రత్తా..”ప్రశ్నొకటి..
“తప్పా..తప్పున్నరా..?” సావిత్రత్త ఇచ్చే సపోర్టుకి లోకాల్ని జయించినట్టు పెట్టింది మొకాన్ని గిలక..వెయ్యేనుగుల బలవొచ్చేసి..
ఇంతలో రవణంది..
“మరి..మరి ..ఆ ఉప్పులో ముక్కని దాని ఎదాన కొట్తాలిగదా..! ఉప్పుడెక్కడ్నించి తెత్తా ఉప్పులో ముక్కని.. కిట్టవేణితోనేమో..ఒకటిగాదు. రెండిత్తాననని సెప్పొచ్చేవ్..”
“అమ్మిత్తాది..”సరోజ్ని ఈపుకి జేరబడతా గిలకన్న మాటల్లో ధీమా.
“ఎక్కడ్నించి తెచ్చివ్వను? ఈ యేడు నేను ఉప్పులో ముక్కలు పొయ్యలేదు..”లాకులెత్తితే దూసుకొచ్చిన నీళ్ళల్లా ఇస్సురుగా వచ్చేసింది జవాబు సరోజ్ని నించి.
“నువ్వుగాని కోసేవా సావిత్రొదినే..”అంతలో అంది సేట్లోంచి తలెత్తకుండానే..
“కోసేను గానీ ఆ మజ్జన ముసుర్లు పట్టినప్పుడు..పప్పులో ఏసేసేను. రవణ దగ్గరేవైనా ఉన్నాయేమో..? ఎంత? అడుగూబొడుగూ రెండు మూడు ముక్కలున్నా దానికి సాలు. పిల్లముండ బాకీ తీరుత్తాకే గదా .”
“బాగాసెప్పేవ్..! కానీ…నేనూ కొయ్యలేదు. అసలు ఈ యేడు సరైన మావిడికాయ దొరక్క..అసలు పచ్చడే పెట్టగలనో లేదోనని భయపడ్డాను. ఏదో మా పెదనాన్న ఓ పాతిక్కాయలు కొత్తపల్లి కొబ్బరి మావిడి కాయలు పంపేసరికి పచ్చడెట్టేను..లేపోతే అదీ ఉండాపోను..”రవణంది..
గిలక మొకంలో దిగులు మేగాలు సేరతం గమనించి..
“రేపిత్తానని సెప్పాపోయేవా..? ఇప్పటికిప్పుడే ఇచ్చేత్తానన్నావా?”అన్న సావిత్రి మాటలకి..
“అబ్బే..! తలుసుకున్నప్పుడే తాతపెళ్ళి. ఇప్పుడా ఉప్పులో ముక్కట్టుకెల్లి దాని మొకానగొట్తాల్సిందే. లేపోతే నా తల మీద జుట్టు పీకి మొలేత్తది..” సేట పక్కనెట్టి పైకి లేసి నిలబడి సీర దులుపుకుంటా సరోజ్నంది..
“మరిప్పుడా ఉప్పులో ముక్కని ఎక్కడ్నించి తెచ్చి ఇత్తా.! “
“సూడాలి. ఏదోటి సెయ్యక తప్పుద్దా?”అంది సరోజ్ని ఏళ్లిరిసుకుంటా..
ఇంతలో..
“సర్లే ..తాలాలియ్యి..”అంటా సరోజ్ని సేతిలోంచి తాళాలు లాక్కుని , లంగా పైకెత్తుకుని మరీ పొట్టేలు పిల్లలా పరిగెత్తుతున్న గిలకొంక సూత్తా..
“ఏవీ అనుకోకు వదినే. ఎప్పుడూ ఉంటాయ్ ఉప్పులో ముక్కలు మా ఇంట్లో..! ఈసారే మరీ తక్కువ కోసేను. నాకూ ఇష్టవే ఉప్పులో ముక్కలంటే..వానాకాలంలో ఉప్పుప్పగా ఏదైనా తినాలనిపిత్తే ఉప్పులో ముక్కే నోట్లో ఏసుకుంటాను. ఉప్పుప్పగా, పుల్లపుల్లగా నోటికి బాగుంటాయని. ఎంతుకలా తింటావ్. నాలుక్కొట్టూపోద్ది అంటారీయన. అయినా ..ఏంటో అదంటే ఇట్తం.. ‘
తొక్కబద్దల్ని కుంచంలో పోత్తా..సావిత్రంది…
౭౭ ౭౭ ౭౭
కాసేపయ్యాకా..ఏరిన కందిపప్పు బత్తాని లోపలెట్టేసి..అరుగంతా సీపురెట్టి ఊడ్సేసి సుబ్బరంగా ఉంది అనుకున్నాకా… “ఏంజేసా…ఉప్పులో బద్దల సంగతి వదినే..? లేపోతే ..మా పిన్నత్తగారింట్లో ఉంటాయేమో..! ఓమాటడగమంటావా? ఏటా కుండడు ముక్కలు కోత్తది. అదే.. ఊళ్ళో పిన్నత్తగారు. నీకూ దెల్సుగదా. అక్కడ్నించి తెప్పిచ్చమంటావా?” అంటా సరోజ్ని ఇంటికో అడుగేసిన సావిత్రి..అక్కడ ఎండలో నేలమీద సిన్న పేపరు ముక్కేసి..దాని మీదెట్టిన సన్నగా మూడు అంగుళాల పొడవున్న ఆ మెత్తనిదాన్ని సూసి నోరొదిలేసి “ఏటే ..అది..”అనడిగింది గిలకని సావిత్రి. “మాడికాయ్ ముక్క…”
“అదెక్కడ దొరికిందిప్పుడు నీకు?” తెల్లబోయింది.. సావిత్రి.
“మాగాయ పచ్చట్లోది ..”అక్కడే ఎండలో కిందకూచ్చుని పేపర్ మీద దాన్ని అటూ ఇటూతిరగేత్తా అంది గిలక తలెత్తకుండానే..
“…కడిగేసేవా?”ఆరా గా అంది సావిత్రి.
“ఊ..! మరి కడగొద్దేటి? కడిగేసి మళ్ళీ ఉప్పు గూడా రాసేసేను..”
“ఏటేటి? మాగాయ పచ్చట్లో ముక్క కడిగేసి ఉప్పు కూడా రాసేసేవా? రాసి ఎండబెడతన్నావా? ఆసి ముండకనా..! ”
సావిత్రి మాటలకి గిలక ఏమ్మాట్టడలేదు గానీ.. సరోజ్నంది…వంటింట్లోంచి పచ్చడి గరిటట్టుకుని బయటికొత్తా..
“దీని పెంకితనం సూసేవా వదినే? నేను కాళ్ళు కడుక్కుని వచ్చేలోపే ఇదంతా సేసేసింది. పచ్చడి జాడీలో ఏ గరిట పెట్టిందో ఏటోనని..గుండెలు దడెత్తి పోయేయనుకో. తడుంటే బూజొచ్చేత్తది..గదా. దీన్తో ఓ సమస్య కాదు నాకు. ఎలాగ ఏగాలో ఏటో..దీన్తో..”తలట్టుకుంది సరోజ్ని.
“నాకు తెల్దా..ఏటి? ! పెద్ద సెప్పొచ్చిందిగానీ మాయమ్మ, గరిటిని నా లంగాతో తుడిసేన్లే..అత్తా..”
తెల్లబోతా సూసేరిద్దరూ గిలక్కేసి.
“సర్లే..మేం ఎండబెడతాంగానీ నువ్వెల్లు బళ్ళోకి. మేస్టారు కొడతారు మల్లీని..”
దాంతో..కింద కూచ్చున్నదల్లా లేసి నిలబడి గుమ్మానికేసి అడుగేత్తా..
“అమ్మా..! కాసేపాగి తిరగెయ్..! బేగిని ఎండుద్ది. “అంటా రెండు సేతుల్తో లంగా పైకెత్తుకుని ఎగిరెగిరి పరిగెత్తుతున్న గిలక్కేసే సూత్తా..
“ఉప్పులో ముక్కల్లేవని మాగాయ ముక్క ఎండలో పెట్టుద్దా? దీని తెలివి సల్లగుండా..” అని మనసులో అనుకుని ..నవ్వుతా సరోజ్ని వంక సూత్తా .. “నీ కూతురు మామూల్ది గాదమ్మో…సరోజ్నే..! ఊళ్ళేలేత్తది.. “బుగ్గల్నొక్కుకుంది సావిత్రి.
ఉత్సాహంగా పరుగెత్తుతున్న కూతుర్ని దూరం నించే మురిపెంగా సూసుకుంది సరోజ్ని.

మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
రచన: కన్నెగంటి అనసూయ
ధన్యవాదాలు,
శుభదినం.



బిల్ గేట్స్ ని ఎవరో  (2)

“మీ కంటే ధనవంతుడు ఉన్నాడా?” బిల్ గేట్స్ ని ఎవరో అడిగారు.
“ఒకవ్యక్తి ఉన్నాడు” అని సమాధానమిచ్చి - ఇలా చెప్పాడు.
నేను డబ్బు, పేరు సంపాదించక ముందు ఒకరోజులలో ఒక నాడు న్యూ యార్క్ ఎయిర్ పోర్ట్ లో దిగాను. దినపత్రిక కొందామని చేతిలోకి తీసుకుని సరైన చిల్లర నావద్ద లేకపోవడం వలన తిరిగి పేపర్ ను అమ్మే కుర్రాడికి ఇచ్చేశాను.
“పర్లేదు...మీవద్ద చిల్లర లేకపోయినా, ఈ పేపర్ తీసుకోండి” బలవంతంగా నాచేతిలో పెట్టాడు. నేను తీసుకోక తప్పలేదు. 
మరో రెండు సంవత్సరాల తర్వాత చాలా విచిత్రంగా మళ్ళీ అదే ఎయిర్ పోర్ట్ లో అదే పేపర్ కుర్రాడి వద్ద మళ్ళీ దిన పత్రిక కొనాలని ప్రయత్నిస్తే నా వద్ద చాలినంత చిల్లర లేకపోయింది. 
ఆ కుర్రాడు నా చేతిలో బలవంతంగా పేపర్ పెడుతూ “ఈ పేపర్ మీకు ఉచితంగా ఇచ్చినందు వలన నేనేమీ నష్టం పోను, ఆ ఖరీదును నా లాభం లోంచి మినహాయించుకుంటాను” అన్నాడు.
ఆ తర్వాత పందొమ్మిది సంవత్సరాలకు నేను బాగా డబ్బు, పేరు సంపాదించిన తర్వాత ఆ పేపర్ కుర్రాడి కోసం వెదికాను. నెలన్నర తర్వాత అతడు దొరికాడు. 
“నేనెవరో తెలుసా, నాకు ఉచితంగా దినపత్రిక ఇచ్చావు ఒకసారి” అడిగాను.
“మీరు తెలుసు...బిల్ గేట్స్.... ఒకసారి కాదు రెండు సార్లు ఇచ్చాను” 
“ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి కృతఙ్ఞతలు, నీకు ఏమి కావాలో అడుగు, నీ జీవితంలో పొందాలను కున్నది ఏదైనా సరే నేను ఏర్పాటు చేస్తాను “
“సర్... మీరు ఏ సహాయం చేసినా నేను చేసిన దానికి ఎలా సరితూగుతుంది? అతడు ప్రశ్నించాడు.
“ఎందుకు సరితూగదు?” నేను ఆశ్చర్య పోయాను.
“నేను పేదరికంతో బాధ పడుతూ, దినపత్రికలు అమ్ముకుంటూ కూడా మీకు సహాయం చేసాను. ఈ రోజు మీరు ప్రపంచం లోనే పెద్ద ధనవంతులై వచ్చి నాకు సహాయం చేస్తానంటున్నారు... ఎలా సరితూగుతుంది?”
అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. అతడు ఇతరులకు సహాయం చెయ్యాలంటే తాను ధనవంతుడు కావడం కోసం ఎదురు చూడలేదు. అవును... నాకంటే ఆ పేపర్ కుర్రాడే ధనవంతుడు. 
అప్పుడు నాకు అనిపించింది- కుప్పలు కుప్పలు డబ్బు ఉండే కంటే...ఇతరులకు సహాయ పడాలనే హృదయం కలిగి ఉండటమే నిజమైన ఐశ్వర్యం.
ఇతరులకు సహాయ పడటానికి కావలసింది అదే...

--(())--


#మీ బిడ్డనే కద నాన్నా ! (1)

పద్మకి మబ్బుల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. నెల్లాళ్ల తన కష్టార్జితాన్ని పదే పదే చూసుకొని మురిసిపోయింది. మొదటిసారిగా అందుకున్న ఆ జీతం ఎంతో అపురూపంగా తోచడమే కాదు, అంతులేని ఆనందాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కలిగించింది ఆమెలో. మొదటి జీతం అందుకున్న శుభవేళ ఆఫీసులో స్టాఫ్‌ అంతా పార్టీ ఇమ్మని గొడవ చేయడంతో స్వీటు, హాటు, కూల్‌డ్రింక్స్‌తో చిన్న పార్టీ ఇచ్చింది అందరికీ.

స్వీటు కొనుక్కొని హుషారుగా ఇంటికి వచ్చింది పద్మ. అప్పటికే ఆమె తండ్రి నారాయణరావు ఆఫీసు నుండి వచ్చి కాఫీ తాగుతూ ఉదయం పేపరులో చదవగా మిగిలిన విశేషాలను చదువుతున్నాడు రిలాక్సవుతూ.

తండ్రిని చూడడంతోనే ఆనందంగా నవ్వుతూ పరుగులాంటి నడకతో దగ్గరకు వెళ్లి ‘నాన్నగారూ, ఈవేళ నాకెంత ఆనందంగా ఉందో తెలుసాండీ?’ అంటూ తనకు వచ్చిన జీతం కవరుని తండ్రి చేతిలో పెట్టి కాళ్లకు నమస్కరించింది.

నారాయణరావు కూతురి వంక మురిపెంగా చూస్తూ ‘గాడ్‌ బ్లెస్‌ యూ రా తల్లీ!’ అంటూ ఆదరంగా కూతురి తల మీద చెయ్యి వేసి లేవనెత్తాడు. పద్మ గొంతు విని లోపల పని చేసుకుంటున్న రమణమ్మ ఉత్సాహంగా వచ్చింది అక్కడకు.

‘అమ్మా, నాకు శాలరీ ఇచ్చారమ్మా ఈరోజు!’ అంటూ తల్లి భుజాల చుట్టూ చేతులు వేసి గిరగిరా తిప్పేసింది, చిన్నపిల్లలా సంబరపడిపోతూ.

‘ఆగవే తల్లీ. ఏంటిది?’ అంటూ కూతురి బుగ్గ మీద మురిపెంగా ముద్దు పెట్టుకుంది రమణమ్మ.

ఆ తరువాత తాను తెచ్చిన స్వీట్‌ బాక్స్‌ ఓపెన్‌ చేసి తల్లిదండ్రుల నోటికి స్వీట్‌ అందించింది. రమణమ్మ తాను సగం తిని మిగతాది కూతురి నోట్లో పెట్టింది.

స్వీట్‌ తిన్నాక ‘సంతోషం రా తల్లీ, ఇంద జీతం తీసి జాగ్రత్త చేసుకో!’ అంటూ ఆ జీతం కవరు తిరిగి పద్మకు ఇవ్వబోయాడు నారాయణరావు.

అది చూసి ‘అదేంటి నాన్నగారూ నాకిస్తున్నారు. నేనేం చేసుకోను?’ అంది పద్మ తెల్లబోయి చూస్తూ.

‘నీ దగ్గరే ఉండనివ్వమ్మా. ఇది నీ సంపాదన. నీ ఫ్యూచర్‌కి పనికి వస్తుంది’ అన్నాడు నారాయణరావు నిదానంగా కూతురి వంక చూస్తూ.

‘ఇదేంటి నాన్నా, ఈ రోజు మీదీ, నాదీ అంటూ వేరు చేసి కొత్తగా మాట్లాడుతున్నారు? ఈ డబ్బు మనందరిదీ కాదా. ఏంటమ్మా, నాన్నగారు ఇలా అంటున్నారు?’ అంది పద్మ నీరసపడిపోతూ.

అంతవరకూ ఆనందంతో పరవళ్లు తొక్కిన పద్మ మనసు తండ్రి మాటలతో నీరు కారిపోయింది.

‘అదెలా వీలవుతుందమ్మా, ఆడపిల్ల సంపాదన ఆడపిల్లకే. దాని మీద తల్లిదండ్రులుగా మాకెలాంటి హక్కూ ఉండదు!’ అన్నాడు నారాయణరావు ఖండితంగా.

‘ఇది చాలా అన్యాయం నాన్నగారు. ఎప్పుడూ లేనిది ఆడపిల్లనని నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు. ఇంతకాలం నన్నూ, తమ్ముడినీ ఒక్కలాగే పెంచారు. ఇప్పుడేంటి కొత్తగా ఈ మార్పు?’ అంది పద్మ కళ్లల్లో నీళ్లు చిప్పిల్లుతుండగా.

‘మీ ఇద్దర్నీ సమానంగా పెంచడం తల్లి దండ్రులుగా మా బాధ్యత. అంతే తప్ప, నీ సంపాదన మీద మాకు ఏ హక్కూ ఉండదమ్మా!’ అన్నాడు.

‘అయితే తమ్ముడు జీతం తెచ్చి ఇచ్చినా, ఇలాగే మాట్లాడుతారా నాన్నా, మీరు?’ అంది పద్మ తీక్షణంగా చూస్తూ.

‘అదెలా అవుతుంది, వాడు మగపిల్లాడు. ఈ ఇంటి వారసుడు!’ అన్నాడు నారాయణరావు.

‘బాగుంది నాన్నా, మీరు కని పెంచి పెద్ద చేసిన బిడ్డల పట్ల ఇంత వివక్ష చూపిస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకొని ఆటపాటలలో ప్రైజులు గెల్చుకుని తెచ్చి సంతోషంగా మీకు చూపించిన నాడు ఎంతో మురిసిపోతూ నన్నెంతో ఎప్రిషియేట్‌ చేశారు. ఈరోజు కూడా అలా చేస్తారని కొండంత ఆశతో వచ్చిన నన్ను ఇలా నిరాశపరుస్తున్నారు. సరే, మీకు అక్కరలేని ఈ డబ్బు నాకూ వద్దు! రేపే జాబ్‌కి రిజైన్‌ చేస్తాను!’ అంటూ బాధగా లోపలికి వెళ్లిపోయింది పద్మ.

అంతవరకూ జరిగిందంతా నిశ్చేష్టురాలై చూస్తున్న రమణమ్మ కూతురు అలా బాధగా వెళ్లడం చూసి ‘ఏమిటండీ, మీరు చేసిన పని ఈ రోజు. ఎందుకు దాని మనసు ఇలా నొప్పించారు. పాపం అది ఎంత బాధపడుతుందో గమనించారా?’ అంది మంద లిస్తున్నట్లుగా.

‘నిజం నిష్ఠూరంగానే ఉంటుంది రమణా. ఈరోజు కాకపోతే రేపైనా అది ఆడపిల్లే కానీ, ఈడపిల్ల కాదు కదా. దాని డబ్బు నాకెందుకు? కూతురికి ఆమాత్రం తిండి పెట్టలేని హీనస్థితిలో ఉన్నానా నేను?’ అన్నాడు నారాయణరావు విసురుగా.

భర్త మాటలను ఎలా అర్ధం చేసుకోవాలో బోధపడలేదు రమణమ్మకి. అందరూ సంతోషంగా ఉండవలసిన సమయంలో చాదస్తంగా ఎందుకు ఇలాంటి ప్రస్తావన తెచ్చినట్లు? అనుకుంది మనసులో.

లోపలున్న పద్మకు తండ్రి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. తానేం చెప్పినా, ఏం చేసినా తండ్రి వినిపించుకోడని, ఆ డబ్బు తీసుకోడని అర్ధమైపోయింది ఆమెకు. అన్ని విషయాల్లో తండ్రి స్వభావాన్నే పుణికి పుచ్చుకున్న పద్మ కూడా నా డబ్బు ఎలా తీసుకోరో చూస్తాను అనుకుంది పట్టుదలగా. వెంటనే చరచరా గదిలో నుండి హాళ్లోకి వచ్చి జీతం కవరు తీసుకుని లోపలికి వెళ్లిపోయింది.

ఆ మర్నాడు ఆఫీసు నుండి వస్తూ, ఇంట్లో అందరికీ బట్టలూ, వాటితో పాటు తల్లి చాన్నాళ్లుగా ముచ్చట పడుతున్న ఎల్‌.ఈ.డి. టి.వి కొనేసి ఇంటికి తీసుకువచ్చింది.

పద్మ చేసిన పని చూసి నారాయణరావుకి నోట మాట రాలేదు. కూతుర్ని మెచ్చుకోవాలో, తిట్టాలో అర్ధం కాలేదు అతడికి. రమణమ్మ మాత్రం ‘మీ నాన్నగారు చాదస్తం కొద్దీ ఏదో అన్నారని, డబ్బంతా ఇలా వృధా చేసావా?’ అంది మందలిస్తున్నట్లుగా.

‘ఏం కాదు, సద్వినియోగమే చేశాను. నిన్న నాన్నగారు నన్ను పరాయిదానిగా వేరు చేసి మాట్లాడారు. అలాగే నేనివాళ బట్టలు తెస్తే తీసుకుంటారో లేదో అనుకున్నాను. తీసుకున్నారు కదా, అదే చాలు!’ అంది పద్మ జీరబోయిన గొంతుతో.

కూతురి మాటలు విన్న నారాయణరావు మనసు కరిగిపోయింది. అనవసరంగా పద్మ మనసు కష్టపెట్టాను అని లోలోపలే బాధపడుతున్నాడు నిన్నటి నుండీ అతడు. ఈరోజు పద్మ ఆ మాట అనడంతో అతడిలో అపరాధ భావం రెట్టింపు అయింది.

‘సారీ తల్లీ. అనవసరంగా నిన్ను బాధపెట్టాను. కాని, నిన్ను నొప్పించాలని కాదమ్మా, నా ఉద్దేశం. ఈ కాలంలో మగపిల్లలతో పాటు ఆడపిల్లల్ని కూడా సమానంగా కష్టపడి చదివిస్తున్నాము. వాళ్ల సంపాదన విషయానికి వచ్చేసరికి ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆమె సంపాదనపై ఏ హక్కూ లేకుండా పోతున్నదమ్మా! ఎంతో ప్రేమతో పెంచి, పెద్దచేసిన మాకు మీ పెళ్లిళ్లయ్యాక నిన్నా మొన్నటి సంపాదన గూర్చి లెక్కలు అడుగుతున్నారు వియ్యాలవారు. మా ఆఫీసులో అలాంటి కేసులు రెండు, మూడు చూశాను నేను. పిల్ల పెళ్లి చేసిన ఆనందం లేకుండా ఎంతో అవమానాన్ని ఎదుర్కుంటున్నారు వాళ్లు. నేను అలా కాకూడదని ముందు జాగ్రత్తగా అలా అన్నానే కాని, నిన్ను బాధపెట్టాలనే ఉద్దేశం నాకు లేదమ్మా!’ అన్నాడు వివరణ ఇస్తున్నట్లుగా.

‘కాని నాన్నగారూ, నిన్నటి నుండీ నా మనస్సు ఎంతగా కలతపడిందో తెలుసా మీకు ? ఇంకెప్పుడూ నన్నలా వేరు చేసి మాట్లాడ కండి!’ అంటూ తండ్రి భుజం మీద తలవాల్చి ఏడ్చేసింది పద్మ.

‘పిచ్చిపిల్లా!’ అంటూ ఓదార్పుగా కూతురి తల నిమురుతూ ఉండి పోయాడు నారాయణరావు.

అప్పటి నుండీ నేరుగా తన జీతం తండ్రికి ఇస్తే తీసుకోడని, ఇంట్లోకి అవసరమైన అధునాతన పరికరా లన్నింటినీ ఒక్కొక్కటిగా కొని అమర్చ సాగింది. మొదట్లో నారాయణరావు వ్యతిరేకించినా, క్రమేపీ అలవాటు పడిపోయాడు.

చూస్తూండగానే కాలచక్రం గిర్రున తిరిగి పోయింది. పద్మ తమ్ముడు సునీల్‌కు కూడా చదువయిపోయి, ఉద్యోగం వచ్చేసింది. నారాయణ రావు సర్వీసులో ఉండగానే పిల్లలిద్దరికీ పెళ్ళిళ్లు జరిపించేశాడు.

పిల్లలిద్దరూ జీవితంలో స్థిరపడి ఎవరి బతుకులు వాళ్లు బతుకుతూండడంతో నిశ్చింతగా కాలం గడుపుతున్న వారి జీవితాల్లో అనుకోని విషాదం చోటు చేసుకుంది. హఠాత్తుగా రమణమ్మ గుండెపోటుతో మరణించింది. భార్య వియోగం నారాయణరావుని బాగా కుంగదీసింది.

మామగారు సర్వీసులో ఉండగా, అత్తగారు బతికి ఉండగా సునీల్‌ భార్య కోమలి అత్త చాటు కోడలుగా ఇంట్లో అందరికీ తలలో నాలుకలా మసలుకునేది. మామగారి పట్ల ఎంతో వినయ, విధేయతలు కనబరచేది.

అత్తగారు పోయాక, ఇంటి పెత్తనమంతా చేతికి చిక్కాక ఆమె తీరులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. స్వార్థం తప్ప మరేమీ లేకుండా పోయింది ఆమెకు.

ఒక రోజు ఉదయం పేపరు చదువుకుంటున్న నారాయణరావు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు సునీల్‌.

ఏదో చెప్పాలని తటపటాయింపుగా ఆగిపోయిన కొడుకుని గమనించాడు అతడు. ‘ఏంట్రా, ఏమైనా చెప్పాలా నాతో?’ అని అడిగాడు ఆదరంగా.

‘మరేం లేదు నాన్నా. నా ఫ్రెండ్సంతా ఏమంటున్నారంటే.. ఈ ఎదుగూ, బొదుగూ లేని ఉద్యోగం ఎంత కాలం చేస్తాము. ఈ జాబ్‌కి రిజైన్‌ చేసి మనందరం కలిసి ఏదైనా బిజినెస్‌ స్టార్ట్‌ చేద్దామంటున్నారు. వాళ్లకి పెట్టుబడికి లోటు ఏమీ లేదు. మన వాటాకి పెట్టుబడి కావాలి కదా. ఎలాగా అని ఆలోచిస్తున్నాను’ అన్నాడు సునీల్‌.

‘అదేంట్రా, బంగారం లాంటి గవర్నమెంటు ఉద్యోగం వదిలేస్తానంటున్నావు? అదీగాక, మనకు ఏమాత్రం అనుభవం లేని ఈ బిజినెస్‌లవీ ఎందుకు?’ అన్నాడు ఆదుర్దాగా.

అతడికి సునీల్‌ అంటే విపరీతమైన మమకారం. ఈ బిజినెస్‌ పేరుతో కొడుకు ఎక్కడ చిక్కుల్లో ఇరుక్కుంటాడోనని అతడి భయం.

‘ఏం ఫర్వాలేదు నాన్నా. ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా ఉంటాము? పెట్టుబడి కోసమే నా ఆలోచనంతా. మీరేమీ అనుకోనంటే, మీ పేరున ఉన్న ఈ ఇల్లు నా పేరున పెడితే బ్యాంకులో దీన్ని సెక్యూరిటీగా పెట్టి ఓ పాతిక లక్షలు లోను తీసుకుందామని ఉంది’ అన్నాడు సునీల్‌.

‘పాతిక లక్షలా? అయినా ఇల్లు నా పేరున ఉంటే ఏమవుతుందిరా? మా ఫ్రెండ్స్‌ పిల్లలంతా విదేశాలు వెళ్లేటప్పుడు ఎడ్యుకేషన్‌ లోన్స్‌ తండ్రి ప్రోపర్టీ మీదే కదా తీసుకున్నారు?’ అన్నాడు నారాయణరావు ఆలోచనగా.

‘అలా కాదు నాన్నగారు, ఇల్లు నా పేరున ఉంటే పక్కాగా ఉంటుంది అంటున్నారు మా వాళ్లంతా!’ అన్నాడు.

‘సరే అయితే, అలాగే చేద్దాంలే!’ అని కొడుక్కి హామీ ఇచ్చాడే గాని, ఆ విషయాన్ని లోతుగా ఆలోచించలేకపోయాడు నారాయణరావు.

ఇల్లు ఎప్పుడైతే సునీల్‌ పేరు మీదకు మారి పోయిందో అప్పుడే ఆ ఇంట్లో నారాయణరావు పరిస్థితి తారుమారయిపోయింది. నారాయణరావుకి పెట్టే తిండి దండగగా భావించసాగింది కోమలి. ఒకటో తేది నాడు మామగారి పెన్షన్‌ను ఎంతో లాఘవంగా తీసుకునే కోమలి అతడి అవసరాలు తీర్చే విషయంలో పూర్తి అలసత్వం వహించసాగింది.

సునీల్‌కి భార్య చేసేది తెలుస్తూనే ఉన్నా, ఏమీ మాట్లాడలేకపోయేవాడు. మాటకు ముందే ఈ ఇంట్లో తాను చేసే సర్వీస్‌కి ఎవరూ ఖరీదు కట్టలేరు అంటూ విరుచుకు పడేది అందరిమీదా.

తండ్రి విషయంలో మరదలు అనుసరిస్తున్న తీరు. అది చూస్తూ కూడా ఏమాత్రం ఖండించని తమ్ముడి వైఖరి గురించి తెలుసుకున్న పద్మ ఒకరోజు ఇంటికి వచ్చి గట్టిగా మందలించబోయింది.

‘నువ్వు మాకేమీ నీతులు చెప్పనక్కరలేదు. మా సంగతి మాకు తెలుసు. మాకు చెప్పేముందు మీ అత్తమామల్ని ఎలా చూస్తున్నావో గుర్తు చేసుకో!’ అంది కోమలి పెడసరంగా.

‘మా అత్తమామలకి మేము ఏం లోటు చేశాము. వాళ్లా పల్లెటూరు వదిలి రామంటే, అక్కడ వారికి ఏ లోటూ లేకుండా అన్నీ అమర్చి వచ్చాము. నెలకో సారి అక్కడికి వెళ్లి వాళ్ల మంచి, చెడ్డలు, మందూ, మాకు సంగతి చూసి వస్తున్నాము. నీలాగా కాదు మేము. మా నాన్నగారు కష్టపడి కట్టుకున్న ఇంటిలో ఆయన్నే ఒక పనికిరాని పాత వస్తువులా జమకట్టి చూస్తున్నారు మీరు. ఆయన పెన్షన్‌ అంతా తీసుకునే నువ్వు నాన్నగారికి కనీస అవసరాలైన మందులు కొనివ్వడానికి కూడా ఇష్టపడవు. ఇదేమైనా బాగుందా నీకు?’ అంది పద్మ ఆగ్రహావేశాలతో ఊగిపోతూ.

‘అంత బాధ్యత గల దానివైతే ఆయన్ను తీసుకువెళ్లి నువ్వే చూసుకో. కాదన్నదెవరు?’ అంది కోమలి దురుసుగా.

‘ఈ ఇంట్లోంచి కదలవలసి వస్తే, కదల వలసింది ఆయన కాదు, మీరు. ఈ ఇల్లు మా నాన్నగారి స్వార్జితం. తనెక్కడికి వెళ్తారు?’ అంది పద్మ నిలదీస్తున్నట్లుగా.

ఆ మాట విని వేళాకోళంగా నవ్వుతూ ‘ఇంకా ఆయనదెక్కడుంది. ఈ ఇల్లు మీ తమ్ముడి పేరున ఎప్పుడో రాసేశారు!’ అంది కోమలి నిర్లక్ష్యంగా.

ఆ మాట విని ఆశ్చర్యంగా తండ్రి వైపు చూస్తూ ‘నిజమా, నాన్నగారు ఇల్లు తమ్ముడు పేర రాసేశారా? రాసేముందు నాకొక్క మాటైనా చెప్పలేదు ఎందుకని?’ అంది పద్మ బాధగా.

‘ఏం.. చెప్తే నువ్వు వాటాకొచ్చేద్దామనా?’ అంది కోమలి ఎగతాళిగా.

‘ఏమిటి నాన్నా ఇదంతా?’ అంది పద్మ తండ్రి వైపు నిస్సహాయంగా చూస్తూ. నారాయణరావు దోషిలా తల వంచుకున్నాడు ఏమీ మాట్లాడలేక.

చివరికి పద్మ ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా ‘పదండి నాన్నా వెళదాం!’ అంది లేచి నిలబడి.

‘వద్దమ్మా, ఇప్పటికి జరిగింది చాలు. ఆడపిల్లవని నీ పట్ల చిన్న చూపుతో, వాడు మగపిల్లాడు, వంశోద్ధారకుడు అనే మూర్ఖత్వంతో చాలా వివక్షగా వ్యవహరించాను. మీ తమ్ముడు ఉద్యోగం మానేసి వ్యాపారం పెట్టుకుంటాను అని చెప్పి ఇల్లు తన పేర రాయించుకున్నాడు. నేను వాడి మీద గల గుడ్డి ప్రేమకో, నమ్మకానికో వాడేం చేయబోతున్నాడో ఏమాత్రం విచారించకుండా ఇల్లు వాడి పేరు మీద రాసేశాను.

నీకు తెలిస్తే పడనివ్వవని నీకు చెప్పలేదు. అలా రాశాక వాడు వ్యాపారం ఏమీ పెట్టకుండా, ఉద్యోగంలో కొనసాగడం చూశాక గానీ, వాడు, వాడి భార్య కలిసి నన్నెంత మోసం చేశారో గ్రహించలేక పోయాను. దాని ఫలితంగా ఇప్పుడు ఇదిగో ఇలా నిరాధారంగా, నిరాదరణకు గురై జీవచ్ఛవంలా బతుకుతున్నాను. ఇప్పుడు ఇంత జరిగాక మీ ఇంటికి ఏ ముఖం పెట్టుకొని రాగలనమ్మా! అలా వస్తే మీ అత్తమామల దగ్గర నాకెంత నగుబాటు?’ అన్నాడు నారాయణరావు.

‘ఈ ఫాల్స్‌ ప్రిస్టేజ్‌లే మనలాంటి వారి జీవితాలను చిందరవందర చేసి శాసిస్తున్నాయి నాన్నా. నా ఉన్నతికి కారకులైన మీకు ఆ మాత్రం చేయకూడదా? ఒకవేళ చేయవద్దని ఎవరైనా అన్నా, నేను లెక్క చేయను. ఎందుకంటే, మా అత్తమామలను ఎంత బాధ్యతగా చూసుకుంటున్నానో, మీ పట్ల కూడా నాకు అంత బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను. బయలుదేరండి నాన్నా!’ అంది పద్మ గంభీరంగా చూస్తూ.

‘సారీ అమ్మా. ఎంతయినా నేను ఆడపిల్ల ఇంట్లో ఉండలేనమ్మా. చావైనా, రేవైనా నా బతుకు ఇక్కడే తెల్లారిపోవాలి’ అన్నాడు నారాయణరావు కన్నీళ్లను అదిమి పెట్టి.

‘ఏమిటి నాన్నా ఈ మొండితనం. ఆడపిల్లనయినా, నేను మీ బిడ్డనే కద నాన్నా! నా కన్నతండ్రిని ఈ స్థితిలో ఇక్కడ వదిలి అక్కడ నేను స్థిమితంగా ముద్ద నోట పెట్టగలననే అనుకుంటున్నారా? ఎందుకు నాన్నా, మాట్లాడితే ఆడపిల్లనంటూ నన్ను వేరు చేసి మాట్లాడుతారు?’ అంటూ దోసిట్లో ముఖం ఇముడ్చుకుని కదిలి కదిలి ఏడ్చింది పద్మ.

అది చూసి నారాయణరావు మనసు కదిలి పోయింది. తన ఆలోచనా విధానం తప్పు అని తెలుసుకున్నాడు. వెంటనే, ఆగలేనట్లుగా నిలుచున్న చోట నుండి లేచి పద్మ దగ్గరకు వెళ్లి ‘వద్దమ్మా, వద్దు. ఇక నిన్ను ఎన్నటికీ అలాంటి భావనతో చూడను. పద వెళ్దాం!’ అంటూ కూతురి భుజం మీద చేయి వేశాడు అనునయంగా.

#రచన – పెబ్బిలి హైమావతి గారు
--((**))--


*రైతు త్యాగబుద్ది*


ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. అతని పేరు రామనాథం. ఆయన గొప్ప దయాగుణం కలవాడు. ఒకసారి కొండపైన తన పొలంలో వరి కోసి కుప్ప వేస్తున్నాడు. నాలుగు రోజులుగా పని సాగుతుంది. ఆ కొండ కింద కూడా పంట భూములున్నాయి. తన పొలం నుండి చూస్తే సముద్రం చక్కగా కనిపిస్తుంది.

ఆనాటితో కుప్ప వేయడం పూర్తయింది. ఇంటికి బయలుదేరదాం అనుకున్నాడు. ఎందుకో సముద్రం వైపు ఒకసారి చూశాడు. సముద్రం నీరు ఒక్కసారిగా లోపలి తగ్గిపోవడం గమనించాడు. అంటే వెంటనే పెద్ద ఉప్పెన లాగా సముద్రం పొంగి కొండ కిందున్నా భూముల్ని ముంచేస్తుందని తెలుసుకున్నాడు. కింద పొలాల్లో వందలమంది కూలీలు పనిచేస్తున్నారు. వాళ్లకు రాబోయే ప్రమాదం తెలియదు.

       వాళ్ళను కేకలు వేసి పిలిస్తే అందరూ రారు. వాళ్ళ ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని ముందూ వెనుక ఆలోచించకుండా వెంటనే తన వరికుప్పలకు నిప్పంటించి సహాయం కోసం కేకలు వేసి అందర్నీ పిలిచాడు. కూలీలు మంటల్ని చూసి రామనాథాన్ని కాపాడదామని కింద పొలాల్లో పని చేస్తున్న రైతులందరూ పని మానేసి గబగబా కొండెక్కారు. వాళ్ళను నవ్వుతూ సంతోషంతో ఆహ్వానించాడు. పైకి వచ్చిన వారికి ఆశ్చర్యం వేసింది. అపుడు కిందకు చూడమన్నాడు. ఆ రైతులందరూ చూస్తుండగా సముద్రం పొంగి తమ భూముల్ని మొత్తం ముంచేసింది. రైతులంతా కృతజ్ఞతా భావంతో రామనాథంను అభినందించారు.
: *📖 మన ఇతిహాసాలు 📓*


*ధ్రువనక్షత్రం*


 ఉత్తానపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు. వారి పేర్లు సునీత, సురుచి. రాజుగారికి సురుచి అంటే ఎంతో ప్రేమ. ఆమె కొడుకు ఉత్తముడు. పెద్ద భార్య అయిన సునీత పేరుకే రాణి. దాసికన్నా హీనంగా చూసేవాడు. సునీత కొడుకు ధ్రువుడు, ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకొనేవాడు. కాని తండ్రి, పిన తల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. అందువల్ల ద్రువునికి తండ్రి ప్రేమ కరువైంది.

ఒక రోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చొని ఉన్నాడు. ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ద్రువుడ్ని చీదరించుకున్నాడు. తండ్రి నిరాదరణకు ద్రువునికి దుఃఖం ఆగలేదు. అది చూసి పినతల్లి అయిన సురుచి కఠినంగా "ధ్రువా! నీవు నా కడుపున పుడితే మీ తండ్రిగారి తొడపై కూర్చొనే అదృష్టం కల్గేది. ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని శ్రీహరిని ప్రార్ధించు. అప్పుడు నీకు ఉత్తమ స్థానం లభిస్తుంది" అన్నది పినతల్లి సురుచి.

జరిగిన విషయమంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు. అప్పుడు తల్లి "నాయనా ధ్రువా! నీ పినతల్లి నిజమే చెప్పింది. తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని శ్రీహరిని గూర్చి తపస్సు చెయ్యి ఫలితం ఉంటుంది" అన్నది తల్లి.

     తల్లి మాటలకు ధ్రువుడు సంతోషపడి, తపస్సు చేయుటకు బయలుదేరాడు. దారిలో ద్రువునకు నారద మహర్షి ఎదురయ్యాడు. విషయం తెలిసుకొని నవ్వుతూ "నాయనా ధ్రువా! పసివాడివి పినతల్లి మాటలకు ఇంత పట్టింపా? తపస్సు అంటే మాటలు కాదు! చాలా కష్టము. నీ నిర్ణయం మార్చుకో" అన్నాడు. నారదుని మాటలకు ధ్రువుడు "మహర్షీ! పినతల్లి మాటలకు నాలో రేపిన బాధ అంత,ఇంత కాదు. ఉత్తముని కన్న నేను గొప్ప స్థానం సంపాదించాలి. అది పొందడానికి నేను కఠోర తపస్సు చేస్తాను" అని చెప్పాడు. "పట్టుదల గట్టిదే. నిశ్చలమైన మనస్సుతో తపస్సు చెయ్యి" అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి, దీక్షతో కొన్ని సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు.

     అతని తపస్సుకు మెచ్చి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి ఎన్నో స్తోత్రాలను స్తుతించాడు. అంతట విష్ణుమూర్తి "ధ్రువా! నీ మనస్సునందున్న కోరిక నెరవేరుస్తున్నాను. ఇంత వరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందుతావు. మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ, సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై, ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. లోకమంతా ఆ నక్షత్రాన్ని 'ధ్రువ నక్షత్రం' అని పిలుస్తారు" అని వరమిచ్చి అంతర్దానమైనాడు. నేటికీ కనబడే ఉత్తర ద్రువంపై ఉన్న నక్షత్రమే ధ్రువనక్షత్రం. ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి, అనుకున్నది సాధించాడు. పట్టుదల ధృడ సంకల్పం ఉంటే ఏ పనైనా సాధించ వచ్చు అని మనందరం తెలుసుకోవాలి.



--(())--

1 కామెంట్‌: