4, ఏప్రిల్ 2020, శనివారం

శ్రీ యోగ వాసిష్ఠ సారము

శ్రీ యోగ వాసిష్ఠ సారము -  250 / Yoga Vasishta - 250 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 47 🌴
🌻.  129. క్రిమి కీటకముల అనుభవము 🌻

క్రిమి,కీటక, తిర్యక్‌,స్ధావర, జన్మలందు ప్రపంచమున ఎట్టి అనుభవముండును?

ఓ రామాచంద్రా| సమస్త స్ధావర జంగమ ప్రాణులును, వానివానికి యోగ్యములగు భోగములయొక్క సుఖ సంపత్తినందు స్థితిగల్గియుందురు. అల్పప్రాణులకు, మనకు భోగేచ్ఛ కలదు కాని, మనకు అట్టి భోగములందు అల్ప విశ్వాసములు కొద్ది విఘ్నమును మాత్రమే గలవు.

ఓ రామచంద్రా| బ్రహ్మాండ శరీరుడగు విరాట్‌, స్వభోగముకొరకై ఎట్లు ప్రయత్నించుచున్నాడో, అట్లే సూక్ష్మములైనట్టి క్రిమి కీటకాదులును తమ శరీరములందు ప్రయత్నించుచున్నవి.

పక్షులు, చీమలు,సూక్ష్మజీవులు, క్రిములు మున్నగువన్నియు, స్వభోగముకొరకై ప్రయత్నించుచున్నవి. వృక్షములు కొంత జాగరూకములై, శిలలు ఘోరనిద్ర యందు, క్రిములు కొంత జాగరూపులై, నిద్రాశీలురైయుందురు. సుఖదుఃఖములతో కూడియుండును.

సుకుమారులైన మనుష్యులవలె, సుఖనిద్రయందు, శీతోష్ణస్థితులందు ఇట్టి దుఃఖము వేదన కల్గును. రాగద్వేష, భయ,ఆహార, మైధున జనితములగు సుఖదుఃఖములందును, జనన మరణాది భేదమందును, ఇంద్రునకు కీటకమునకు ఎట్టి భేదములేదు.

ఆత్మ తత్వజ్ఞానము కలుగనంతవరకు ఈ జగత్తు ఉండును. పరమార్ధమున ఈ జగత్తు పూర్వమెట్లుండునో ఇపుడును అట్లే సమముగనుండెను. ఏకరూపముగనున్నది.
స్వప్నమున అజ్ఞాన భ్రమ కల్గగా జ్ఞానము కల్గిన పిమ్మట అది ఎచ్చటను లభించుటలేదు.

భూత భవిష్యత్‌ వర్తమానములు, జ్ఞానాజ్ఞానములును యధార్ధముగ లేనివైయున్నవి. తరంగములచేత తరంగము నశింపబడినను జలమునకు హాని లేనట్లు, దేహముచే దేహము నశింపబడినను అదిష్ఠానమగు ఆత్మకు ఏ హానియు లేదు.

ఓ రామచంద్రా| మనోరాజ్యమున చిదాకాశ మాత్రసారమగు ఆత్మయే శాఖ, పత్ర,పుష్ప,ఫల రూపమైన సంకల్ప వృక్షమెట్లు స్పురించుచున్నదో అట్లే తత్వజ్ఞాని దృష్టిచే బాహ్యాంతరమునందు, చిదాకాశమొక్కటియే నీవు నేనను సర్వ జగద్రూపమై స్ఫురించుచున్నది.

ఎంతవరకు జీవితముండునో అంత వరకు సుఖముగా జీవించవలయును. మృత్యువు ప్రత్యక్షమైనది. భస్మీభూతమై శమించునట్టి దేహమునకు మరల రాక ఎచట? ఆకాశమువలె చిదాకాశము సర్వ వ్యాపకమైయున్నది. శాంతమైయున్నది.

సృష్టికి పూర్వము మహాప్రళయమున బ్రహ్మముకంటే వేరైన వస్తువు లేదు. ఇక సమస్త దేహేంద్రియాదులయొక్క, ప్రవర్తకమగు, ప్రత్యగాత్మ చైతన్యముగాని, మనస్సుగాని సర్వ శాస్త్రానుసారము కేవలముమొక బ్రహ్మమే.

కావున ఓ రామా| ఆనందస్వరూపమగు ఆత్మకు విరుద్ధముగ నెవడు అంతఃకరణ వృత్తిచే''నేను దుఃఖి''నని దృఢముగ నిశ్చయించుచున్నాడో, అతడట్టి భావంతో తన్మయుడై అవశ్యము దుఃఖమునే అనుభవించుచున్నాడు. ఆకాశమున ధూళి అంటనట్లు, ఏకమైనట్టి చైతన్యము మాత్రమే గలదను నిశ్చయముగలవారికి సుఖదుఃఖములుండవు.

ఆత్మజ్ఞానముచే ఈ అవిద్య నశించునదై, మరల ఎన్నడును ఉదయించదు. ఒకవేళ క్షణకాలమున మరల ఆవిర్భవించిన అపుడు జీవుని దుఃఖమిక ఎపుడు దేనిచే నశించును.

ఎరుగబడిన ఆత్మ సంసారబంధమును ఛేదించివేయును. మనుజుడు నిద్రయందు జడత్వము పొందునట్లు, స్వప్రకాశమైన ఆత్మ జ్ఞానము వలన ఈ ప్రపంచమును పొందుచున్నవి.

సంవిత్తు(ఆత్మ) లేదను చిశ్చయము గలవాడు, శిలవలె చిరకాలము విశేష జ్ఞానరహితుడై, జడప్రాయుడైయుండును. చిద్రూపుడగు ఏ జీవునిచే నేది ఎవ్విధముగ ఎఱుంగబడుచున్నదో, అది అవ్విధముగనే నాతనిచే పొందబడుట జరుగును.

 చిదాకాశమందును, సంసారముయొక్క వివిధ వైచిత్య్రము సంభవించుచున్నది. బ్రహ్మమును పొందిన మహాత్ములు, నిర్మలమైన చైతన్యరూపముతో వర్తించుచు తత్‌భిన్నమైన దృశ్య రూపముతో వర్తింపకుందురు.
🌹 🌹 🌹 🌹 🌹
 



శ్రీ యోగ వాసిష్ఠ సారము -  252 / Yoga Vasishta - 252 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 49 🌴

🌻. 131. చైతన్యస్థితి 🌻

చైతన్యముయొక్క నిత్యత్వము, ఏకత్వము, స్వాతంత్య్రము, సత్‌శాస్త్రముయొక్క మహత్యము ఇచట వర్ణింపడినది.
జాగ్రత్‌, స్వప్న, సుషుప్తులగు త్రివిధ అవస్థలందు సాక్షియై, శాంతరూపియై ఖేద రహితమైనదగు శరీరము నశించినను,చిదాకాశము నశింపదు.

దృశ్యమని ఎరుగబడుచున్న ఇదియంతయు చైతన్యముయొక్క వివర్త మాత్రమే. రామచంద్రా| ఉపదేశవాక్యములచే, అవిద్య ఉపశమించినప్పటికిని, జీవన్ముక్తి అభ్యాసములేక సంభవించదు.

ఆత్మజ్ఞానము తెలిసియున్నపటికిని అహంభావాది దోషములతో యుండుటవలన; కథన, బోధన, చింతనాది అభ్యాసములు లేకున్న, మరపువలన తెలియనిదే అగును. ఎవడు ఏ వస్తువును గూర్చి ప్రార్ధించునో, దానికొరకై నిరంతరశ్రమ చేసిన తప్పక పొందగలడు.

ఆధ్యాత్మ శాస్త్రముకంటే మించినది మరొకటిలేదు. దీనివలన సంసారమార్గముయొక్క భ్రమ తొలగును. సంసారబంధమై, అతి భయంకరమై,దీర్ఘమైనట్టి అజ్ఞానము, ఆత్మజ్ఞానము లేకుండ నశింపదు.

ఆకలిగొన్న సర్పము, రసహీనమైన వాయువును భక్షించునట్లు, విచారములేని మనుజుడు శూన్యవిషయములను మధురముగా భావించును. వివేకులు ''స్వ'' తత్వజ్ఞానము మాత్రముచే చిదాకాశమున స్థితిపొందుదురు. అట్టి సర్వోత్కృష్టులు, సశ్చాస్త్రముల యుపేక్షద్వారా అజ్ఞానమును భరించలేరు.

ఎవడు మరణమను ఆపదతో ఇపుడే చికిత్స యొనర్పడో, అట్టి మూఢుడు మరణము సంభవించినపుడు ఏమి చేయగలడు. ఆత్మావబోధయందు ఈ వాసిష్టరామాయణము తప్ప, మరియొక యుత్తమ గ్రంధము లేదు. కావున మోక్షసాధకులు దీని నిక్కముగ గ్రహింపవలెను.

మరియు ఈ గ్రంధము దీపమువలె ఆత్మజ్ఞానమును ప్రకాశింపజేయును. తండ్రివలె శీఘ్రముగ బోధనయొర్చును. స్త్రీవలె బాగుగ నానందింపజేయును. ఇది సులభముగ బోధించునది, మనోహరమైనది.

వివిధ అభ్యాసములు కథలతో విచిత్రమైన ఈ వాసిష్టరామాయణమను ఈ శాస్త్రము మనోరంజనముకొరకై విచారించుచో, నిక్కముగ పరమాత్మబోధన పొందును సంశయములేదు.

అజ్ఞానముచే, మాత్సర్యముచే మోహముచే, శాస్త్రార్ధములను తిరస్కరించునట్టి విచారహీనులగు ఆత్మ హంతకులతో ఎన్నడు మైత్రి సల్పకూడదు.

కావున మరణదినములు రాకముందే నన్ను ఆప్తునిగ నెఱిగి, నాయుపదేశముయొక్క సర్వ పదార్ధములయెడల వైరాగ్యము అనుదానిని సంపాదించడు.

ఎవడీ లోకమున నరకమను వ్యాధికి చికిత్స గావింపకయుండునో, వాడు ఔషదములు లేని స్ధానమునకేగి, నరక రోగముచే బాధితుడై ఏమిచేయగలడు. సర్వపదార్ధములందు వైరాగ్యమెంతవరకు బొందకయుండునో అంతవరకును ఆ పదార్వములయొక్క వాన సన్నగిల్లనేరదు.

కాననో రామా| ఆత్మను పూర్ణముగనుద్ధరించుటకై, వాసనలను సన్నగిల్లచేయుట తప్ప మరియొక ఉపాయమేదియలేదు. దేనియందు సాకారమగు బీజమొకింతయైన లేదో, దానినుండి ఈ జగత్తు కలుగుచున్నదనుట, అర్ధశూన్యమగు వాక్యమే అగును.

పరమాణు సమూహములు కలిసి, తమ ఇష్టము చొప్పున జగత్తును నిర్మించుచున్నచో, తమ ఇష్టము చొప్పుననే అవి ఆకాశమున శిధిలములైపోవుచున్నవి. మరియు కిటికీగుండా ప్రసరించు సూర్యకిరణములందే త్రసరేణువులు కనిపించుచున్నవి.

కర్తలేనిచో జగత్తు ఉత్పన్నము కానిదే అగుట వలన మనమందరమెవరము? ఎట్లు జగమునందున్నామో అన్నచో మనము, ఈ సమస్త జనులు చిదాకాశరూపులమే అయి యున్నాము. మరియు స్వప్నమందు స్వప్నమానవులు ఎట్లు స్థితికల్గియుందురో అట్లే మనమందరము ఇచ్చట స్థితికల్గియున్నాము.

ఓ రామచంద్రా| ఒక ప్రదేశమునుండి దూరమునున్న మరియొక ప్రదేశమునకు, క్షణ కాలములో దృష్టి చనునప్పుడు, రెండు ప్రదేశముల మధ్యనున్న నిర్విషయమగు జ్ఞానముయొక్క స్వరూపమేదికలదో అదియే చిదాకాశముయొక్క స్వరూపము. చిదాకాశమే సమస్త పదార్ధములయొక్క పరమార్ధరూపమైయున్నది. ఆ చిత్‌స్వరూపమునందే జ్ఞానులెపుడును స్థితికల్గియుందురు.

సృష్ట్యాదియందు, సమస్త పదార్ధములు, అభావము సంభవింప, నిక నిపుడు ఈ దేహమెచ్చటనున్నది. కావున శరీరాది రూపములన్నియు, చిదాకాశముయొక్క స్వప్నమేయైయున్నవి. మనోచైతన్యముయొక్క ప్రధమ స్వప్నము, బ్రహ్మదేవుని స్వరూపము.

ఆ బ్రహ్మదేవుని శరీరమునుండి యావిర్భవించిన మనము ఆ స్వప్నము యొక్క, స్వప్నాంతర రూపులవలెనున్నాము. బ్రహ్మదేవుని మొదలుకొని, తృణమువరకు గల ఈ జగత్తంతయు, స్వప్నమువలె మిధ్యగనే యుత్పన్నమగుచున్నది.

మరల స్వప్నమువలెనె శీఘ్రముగ నశించుచున్నది. ఆ నశించుటకూడ మిధ్యయే. ఏ నగరాదులు స్వప్నాదియందు యుత్పన్నము గాకయు
న్నవో అవి ఇపుడు జగత్తునుండి ఎట్లు యుత్పన్నములగును.

స్వప్నమందు ఇటుక మున్నగునవి లేకయే నగరాదులెట్లు కన్పించుచున్నవో అట్లే ఈ జాగ్రదాకాశమందు గాన్పించుచున్నవి. జాగ్రదాకాశమందలి పురమెట్టిదో, స్వప్నాకాశమందలి పురమునట్టిదే.
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  253 / Yoga Vasishta  - 253 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 50 🌴

🌻. 132. పంచభూతములు, జీవుడు 🌻

ఓ రామచంద్రా| ఆకాశము శబ్ధ తన్మాతమ్రు, వాయువు, స్పర్శ తన్మాత్రముకాగ, ఆయాకాశవాయువుల సంఘర్షణచే రూప తన్మాత్రయగు తేజము, తేజముయొక్క ఉష్ణ శాంతిచే రసతన్మాత్రయగు జలము, వీటన్నిటియొక్క సంయోగము వలన గంధతన్మాత్రయగు పృధివి ఏర్పడుచున్నవి. నిరాకార ఆకాశమునుండియే ఇవన్నియు ఏర్పడినవి.

బ్రహ్మమే సర్వపదార్ధ స్వరూపమైయున్నది. ఈ పంచభూతములు అసత్యములైనను స్వప్న దశయందువలె సత్యములుగ అనుభూతములగును.

జాగ్రత్‌ స్వప్న రూపములతో చైతన్యమే ప్రకాశించుచున్నదనియు, చిత్‌ స్వభావముచే ఈ రెంటికి భేదములేదనియు నిచట వర్ణింపబడినది.
స్వప్నమందు వాస్తవముగ జగత్తులేదు.

చిత్‌ రూపమగు ఆత్మయే అట్లు
ప్రకాశమయ స్వరూపముతో భాసించుచున్నదనియు, అట్లే జాగ్రత్‌నందు, ప్రకాశించుచున్నదనియు, స్వప్నపదార్ధములవలె అసత్తయినను, ఈ త్రిలోకముల భాసించుచున్నది.

కావున స్వప్నమందు జగత్తు శూన్యమైనట్లు, జాగ్రత్తును శూన్యమేయైయున్నది. సూర్యుడు గత దినమున, నేడు ఒకడే అయినట్లు, మనుజుడు నిన్న నేడు కూడ ఒకడే అయినట్లు, జాగ్రత్‌ స్వప్నములు రెండు ఒక్కటే.

స్వప్నమున మరణించినయాతడు స్వప్నమునుండి యోగముపొంది, మరియు జాగ్రత్‌ నందు మేల్కొనుచున్నాడో, అతడు నిద్రనుండి విముక్తుడాయెనని చెప్పబడుచున్నది.

పూర్వజన్మమందలి బంధువులు ఈ జన్మలో కనబడకయున్న, బాధపడుటలేదు. అట్లే జాగ్రత్‌యందు జీవుడు అన్యదేహమును మాత్రమే గైకొనుటచే, పూర్వపు స్వప్న పదార్ధములు దానిచే బాధింపబడవు కదా'

స్వప్నమందు ద్రష్ట అనేక సుఖదుఃఖములను పెక్కు మోహములను, దినరాత్రుల భేదములు అనుభవించి మరణించినప్పటికి, మేల్కొన్న తదుపరి నిద్ర అంతముకాగ, ఇచ్చట జనించుచున్నాడు. అపుడు స్వప్న అనుభూతులు అసత్యమని తలచును.

జీవుడు జాగ్రత్‌ ప్రపంచమున మరణించి మరియొక జాగ్రత్‌ ప్రపంచమున జన్మించునపుడు, పూర్వజాగ్రత్‌ ప్రపంచరూపమును గ్రహించక ఇప్పటి జాగ్రత్‌నే గ్రహించును.

ఇట్లు జీవుడు జాగ్రత్‌ స్వప్నములను రెండవస్ధలందు వాస్తవముగ జన్మించుటలేదు, మరణించుటలేదు. అయినను ఆయా దేహమందలి యనుభవముచే జన్మించుచున్నాడు, మరణించుచున్నాడు.

వర్తమానమున స్వప్నము జాగ్రత్‌వలె ప్రత్యక్షముగ భాసించుచున్నది. భూతకాలిక జగత్తును, స్వప్నమువలె కన్పించుచున్నది. కాని వాస్తవముగ ఆ రెండును అసత్యములైయున్నవి. కేవలము చిదాకాశమే అట్లు స్ఫురించుచున్నది.

ఏది దేనిమయమైయున్నదో అది లేక ఎట్లు లభించగలదు. కావున స్వప్న జాగ్రత్తులందు వికల్పములైనట్టి ఏకమగు చిన్మాత్రయే శేషించుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹


బ్రహ్మ సత్ - జగన్మిథ్య

అద్వైత సిద్ధాంతం - వైజ్ఞానిక పరిశీలన

        ---2---

ఇక్కడ ఆది శంకరుల "అద్వైతాన్ని" గూర్చి కొంచెం చెప్పుకుందాం. ప్రాచీన కాలంలో అఖండ భారతంలోనూ, ఇతర దేశాలలోనూ...అనేక తాత్విక సిద్ధాంతాలు పుట్టుకొచ్చినాయి. ఏ సిద్ధాంతమయినా, తనకు పరిచయమైన విషయాన్ని విమర్శించి, ఆ దృష్టితో అప్పటికి ఉన్న అనేక సిద్ధాంతాలపై విమర్శ కురిపించింది. ఇక అద్వైత సిద్ధాంత విషయానికి వస్తే, మానవ మేథా శక్తి ఎంత మేరకు పనిచేస్తుందో, అంత వరకూ-అంతకు మించి ఈ అద్వైత సిద్ధాంత పరిధి విస్తరించిందనుకోవచ్చు.

     అందుకే ఇతర సిద్ధాంతాలలో కనిపించే వైరుధ్యాలు, ఈ అద్వైత సిద్ధాంతంలో కనబడవు. మనిషిలో ఎల్లప్పుడూ రెండు శక్తుల మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రపంచం, ద్వైతం అంటాడు అరిష్టాటిల్. అయితే ఈ ద్వంద్వానికి అతీతమైన స్థితి ఒకటి ఉంది. సగుణ తత్వానికీ, నిర్గుణ తత్వానికీ మూలం ఒక్కటే. ఇలాంటి వైరుధ్యాల ఏకత్వాన్ని మనం "అద్వైతం" లో చూడవచ్చు.

    బ్రహ్మాన్ని గూర్చి వివరిస్తూ...అది కదులు తుంది - కదలదు, అది దగ్గరగా ఉంది- దూరంగా ఉంది...ఇలా అద్వైతం చెబుతుంది. కదలిక - కదలిక లేకపోవడం, స్థిరత్వం-అస్థిరత్వం, దూరం-దగ్గర, లోపల-బయట....అనేవి పరస్పర విరుద్ధాలు. అయితే ఇలాంటి లక్షణాలన్నీ ఒకే వస్తువులో,ఒకే సమయంలో ఉన్నాయంటుంది, అద్వైతం. మనిషి బుద్ది ఎంత మేరకు పని చేస్తుందో, ఆ హద్దులను కూడా పరిగణన లోనికి తీసుకొని చేసిన సిద్ధాంతం "అద్వైత సిద్ధాంతం". అయితే అన్ని సిద్ధాంతాలూ .....ఎక్కడో ఒక దగ్గర అద్వైతంలో ఉన్నాయని చెప్పడం సాహసమే అయినా,అది సత్య దూరం కాదు.

    అలాగే అద్వైత సిద్ధాంతంలో కూడా ఈ ప్రపంచం,విశ్వం  యొక్క స్థితి ఇట్టిదని ఇదమిత్థంగా చెప్పడానికి వీలు లేదు. ప్రపంచం మన పంచేంద్రియాలకు అనుభూతం అవుతోంది కాబట్టి , సత్యమని అనాలి. మరి ఈ ప్రపంచం స్వప్నంలో కూడా అనుభూతం అవుతోంది. కావున సత్యం అందామా? ఏదీ నిర్ణయించలేకపోతున్నామే!

   మనకు "సప్తశతి" అనే పురాణం ఉంది. అందులో సృష్టి యావత్తు "ఆదిశక్తి"  ద్వారానే వచ్చిందని చెబుతూ ఒక కథ చెబుతారు.

     ఒకప్పుడు దేవతలు పరాజితులై, ఆదిశక్తిని ప్రార్థించగా....ఆ తల్లి తన లోంచి అనేక శక్తులను ఉద్భవింపజేసి రాక్షసులపై యుద్ధానికి వెళ్ళింది. నీ కింత సేనా వాహిని ఉంది కాబట్టే, యుద్ధంలో చెలరేగి పోతున్నావు....అని ఆ రాక్షస నాయకుడు అనగా, ఆ జగన్మాత , వారందరూ నా శక్తులే అని, వారందరినీ తనలో విలీనం చేసుకొని, ఒక్కత్తెగా యుద్ధానికి నిలబడింది. ఇది కథగా ఉంది కాబట్టి విజ్ఞాన శాస్త్ర పరంగా అర్థం కాదు. కానీ ఇక్కడ ఆ పురాణ కర్త, శక్తి యొక్క ఆది స్వరూపం ఒకటేనని, అది భిన్నాలుగా కనబడినా, ఇన్ని భేదాలేమిటి అని పరిశీలించి చూస్తే....అంతా ఒక్కటి గానే అయిపోతోంది...అని శక్తి తత్వాన్ని వివరిస్తున్నాడు. శక్తి అనగా నేమి అన్న చర్చకు వచ్చినపుడు.....అది అనిర్వచనీయము అని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ "అనిర్వచనీయము" అన్న పదాన్ని Hysen Berg  యొక్క "అనిశ్చితత్వ నియమం" నేపథ్యంలో అర్థం చేసుకుంటే సమంజసంగా ఉంటుంది.

      విజ్ఞాన శాస్త్రం... మొదట్లో, పదార్ధం వేరు, శక్తి వేరు అనుకున్నది. "ఐన్ ష్టీన్" రాకతో ఆ రెండూ వేరు కాదు అని నిరూపణ అయింది. Hysenberg  రాకతో ఆరెండూ వేరు కాదు, కానీ అవేమిటి ? అన్న ప్రశ్నకు సమాధానం అన్వేషణ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో పరాశక్తి నిత్య స్పందనా శీలమని, దాని రూపాలు అనంతమని,అనిర్వచనీయమని , పురాణ వర్ణన వైజ్ఞానిక వర్ణన కాదని ఎలా అనగలం?

భట్టాచార్య 


. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  255  / Yoga Vasishta -  255 🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 52 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌻 134. విపశ్చి దుపాఖ్యానము - 1 🌻

అవిద్య నశించనిచో, జగత్తునకు అంతములేదు. అని తెల్పు అవిద్యోపాఖ్యానము వర్ణించబడినది.

శ్రీరాముడు, ఈ అవిద్య ఎంతకాలముండును. ఎట్లు అది వర్తించును? అని అడుగగా వసిష్ఠుడిట్లు పలికెను.

ఈ అవిద్య ఎవరికి ఉండునో, అట్టి అజ్ఞానులకు బ్రహ్మమువలె అంతమేయుండదు. ఈ విషయములో ఈ కథను వినుము.

పూర్వకాలమున ఒకానొక వస్తువునందు, ఒకప్రదేశమున వివిధ అవస్థలలో ఒక త్రైలోక్యము కలదు.

అందు ఒక భూభాగమందు మనుజులు, గజములు, అశ్వములతో యోగ్యమైన సమప్రదేవమున తతమితయను పేరుగల ప్రసిద్ధ నగరము కలదు అందు విపశ్చిత్తు అను పేరుచే విఖ్యాతి పొందిన భూపాలుడొకడు కలడు. అతడు సర్వ శాస్త్ర ప్రవీణుడగుటచే అతని సభకూడ ప్రసిద్ధి చెందినది.

ఆ రాజుయొక్క అనంత గుణములు వర్ణించుటయందు, కవులు అసక్తులైరి. అయినను ఆ రాజు వారిని గౌరవించుచుండెను. అతడు బ్రాహ్మణులయందు, దేవతలయందు భక్తి కల్గియుండెను.

అతని వద్ద సర్వ సమర్దులైన నల్గురు మంత్రులు మహా బలవంతులు ఉండిరి. రాజు ఆ మంత్రుల సాయంతో శత్రువులను జయించుచుండెను. ఒకానొక దినమున తూర్పుదిక్కునుండి ఒక చతురుడైన దూతవచ్చి కఠోర వాక్యముల నిట్లు పలికెను.

ఓ రాజా| తూర్పుదిక్కున ఉన్న సామంతరాజు, జ్వరపీడితుడై మరణించుట జరుగగా తదుపరి, దక్షిణదిక్కునందలి సామంతుడు పూర్వ, దక్షిణ దిక్కులను జయించ నుద్యుక్తుడు కాగ అతని ఆసైన్యములు అతనిని హతునిగావించినవి. అపుడు పశ్చిమదిశయందలి సామంతులు పూర్వ దక్షిణ దిక్కులను జయించుట కుద్యుక్తులు కాగ, అతడు పూర్వ దక్షిణ దిక్కుల సైన్యముచే హతుడయ్యెను.

అతడిట్లు పల్కుచుండ మరియొక దూత ఆ రాజభవనమున ప్రవేశించి ఉత్తర దిక్కునందలి సేనాని శత్రువులచే బాధితుడై, సేనాసమేతుడై ఇచ్చటికేతెంచు చున్నాడు.

అది విని రాజు సమయమును వృధా చేయరాదనియు, అచటినుండి బయల్వెడలుచు ఇట్లనియే.
రాజులను, సామంతులను మంత్రులను అందరిని యుద్ధమునకు సన్నద్ధులుగ జేసుకొని రండి.

ఆయుద్ధశాలను తెరచి, సైనికులకు భయంకర ఆయుధములనొసగుడు, యోధులు కవచములు ధరించుడు. సర్వసైన్యమును సమాయత్తపరచుడు. నలువైపుల దూతలను పంపుడు. అంతలో ద్వార పాలకుడిట్లు పలికెను.

ఓ రాజా| యుత్తర దిక్కునందలి సేనాపతి ద్వారముకడ వేచియున్నాడు. తమ దర్శనము కోరుచున్నాడు అని పల్కగ వెంటనే అతనిని కొని రమ్మని రాజు పల్కెను. అపుడు ఆ సేనాపతి రాజు సమీపమునకేతెంచెను.

అతని శరీరమంతయు గాయములతో, బాణములతో బలరహితుడై ధైర్యముతో నిట్లు పల్కెను. పూర్వ,దోక్షిణ, పశ్చిమ దిశలందలి సేనాపతులు మృతులుకాగ మిగిలిన సైన్యము నన్ను వెంటాడుటకు అరుదెంచుచున్నారని పల్కి యూరకుండెను.

ఇంతలో మరియొక పురుషుడచ్చటికేతెంచి రాజుతో నిట్లనియే ఓ రాజా| నలువైపుల గొప్ప సైన్యము వ్యాపించి యున్నది. వారు సమస్త ఆయుధముతో సిద్ధముగా నున్నారు. తమ సేనాపతి యుద్ధము సల్ప నుద్యుక్తుడై తమతో నిట్లు చెప్పమనెను. అంతట రాజగృహము యుద్ధప్రయత్నములలో మునిగెను.

అపుడు అతని మంత్రులు రాజును సమీపించి; శత్రువులు సామధాన భేదములకు లొంగరనిన, దండోపాయమే శరణ్యమని పల్కగ అందులకు రాజు సమ్మతించి, తాను యుద్ధమునకు సిద్ధమయ్యెను.
అతడు స్నానమాచరించి, అగ్నిదేవుని పూజించి ఇట్లు తలచెను.

నేనిప్పటివరకు రాజ్యమును ప్రజలను సమర్దవంతముగ పాలించితిని. ఇపుడు నేను వృద్ధుడనైతిని. శత్రువులు రాజ్యమును చుట్టుముట్టిరి. విజయము నాకిపుడు సందిగ్ధముగ నున్నది.

కావున నేను అగ్ని దేవుడైన నీకు నా శిరంబు, నాదరముతో ఆహుతి నొసంగెదను. అని మరియు ఈ అగ్నిగుండమునుండి,అతి బలవంతులును, నారాయణుని భుజబలమువంటివియగు నాల్గు శరీరములు నాకు యుత్పన్నమగును గాక.

వాటిచే నాల్గు దిక్కులను వధించి వైచెను. నాకు తమ దర్శన మొసంగుడని పల్కెను. తదుపరి తన ఖడ్గముచే తన శిరస్సును ఛేదించివైచెను. అగ్నియందు ఆహుతి అయ్యెను.

అగ్నిదేవుడు ఆ శరీరమును దహించి, తిరిగి నాల్గింతలుగ ఆ అగ్ని గుండమునుండి, నాల్గు శరీరములతో నారాయణునివలె బయల్వెడలెను. ఆ నాల్గు దేహములు సర్వాలంకార శోభితులై, సర్వశక్తి వంతులై తేజిల్లెను. మరియు ఆ దేహములు అశ్వములపై అధిరోహించి ఆ అగ్నిగుండమునుండి బయల్వెడలెను.

అపుడు నాల్గు వైపుల ఘోరయుద్ధమారంభమైనది. ఆ యుద్ధరంగము అశ్వములు, గజములు కాల్బలములతో దిక్కులు పిక్కటిల్లునట్లు రణగణ ధ్వనులతో,అచట గుహలు ప్రతిధ్వనించుచుండెను.

ఆ యుద్ధమందు ఏనుగులు చిన్నాభిన్నముగ ఆకాశమున ప్రసరింపబడిన ఆయుధములయొక్క టాంకారశబ్ధముల చేతను, అశ్వ,గజ చక్రముల మహాశబ్ధములచేతను వ్యాపించబడినదై యుండెను. ఇవ్విధమున ప్రళయమువంటి మహాయుద్ధ సంభ్రమము ప్రవృత్తము కాగ, ఆ యుద్ధరంగము చిందరవందరగా నైనది.

సశేషం.. 


🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  257 / Yoga Vasishta - 257 🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 54 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌻. 135. జీవన్ముక్తులు - 1 🌻

దేహధర్మము అనగా వ్యవహారాధులు, జీవన్ముక్తునకు వర్తింపవు. ముక్త చిత్తము మరల ఎన్నటికి బంధింపబడదు.

తొడిమనుండి పడిన ఫలము,మరల ప్రయత్నము చేసినను, ఎవని చేతను ఆ తొడిమ బంధింపబడజాలదు. కాబట్టి అట్టి వారు ఇతరులచే జీవన్ముక్తుని తెలియబడజాలరు.

ధారణాదులచే గూడిన యోగులు, ఇతరులచే నెఱుగబడుదురు కాన మోక్షము ధారణాదులవలె ఇతరులచే నెఱుగబడినది కాదు. అది మధుర పదార్ధముల ఆస్వాద సౌఖ్యమువలె స్వాద్వైక వేద్యమే యైయున్నది.

అభ్యంతరమున శీతలత్వముతో గూడిన(శాంతి) చిత్తమే ముక్తియని, సంతప్త చిత్తమే బంధమని చెప్పబడుచున్నది. కావున బంధమోక్షములు చిత్తాదీనములే గాని, దేహాదీనములు కావు. దేహమునందు బంధమోక్షములు లేవు.

శరీరము ముక్కలు ముక్కలుగ కోయబడినను, ఏడ్చుచున్నను, నవ్వుచున్నను, జీవన్ముక్తునకు అంతఃకరణమున దేహసంబంధ దుఃఖము, సుఖము కొంచెమైననుండదు.

నిత్యమై అశరీరమైన ఆత్మస్వభావము పొందియుండుటచే జీవన్ముక్తులకు దేహాదిభావన నెపుడును నుండనేరదు. దేహము మరణించినను, జీవన్ముక్తుడు మరణింపకయే యుండును.

ఏడ్చుచున్నప్పటికి వాస్తవముగ ఏడ్వనివాడే అగును. నవ్వు, క్రోధము, రాగము ఉన్నను అవి లేనివారేయగును. మోహములచే చుట్టబడినను, మోహరహితుడేయగును.

త్యజించుటకు సమర్ధుడైనను, పవిత్రాంతఃకరణ యుక్తుడగు శివుడు రాగమును త్యజించుటలేదు. ఆ శివునికి ఈ ప్రపంచమున, నేదేని కార్యము చేయుటచే కాని, చేయకుండుటచే కాని ప్రయోజనమేదియు లేదు.

ఈ ప్రపంచమున నేది ఎట్లున్నదో అది అట్లే అగుగాకయని తలచి విష్ణుభగవానుడు ఆయా కార్యమును చేయుచున్నప్పటికి, వాసనారహితుడై ఏ కోర్కె లేక శుద్ధ చిన్మాత్ర రూపుడై పడియున్నాడు. సూర్యభగవానుడు, నిరంతరము తన్ను పరిభ్రమింపజేసికొనుచున్నాడు.

జీవన్ముక్తులైనను గురువులగు శుక్రాచార్య, బృహస్పతులిరువురు లోకమున పరస్పరము జయించుకొనుటగూర్చి అనేక అభిలాషలతో గూడియున్నారు.

జీవన్ముక్తుడైనను జనక మహారాజు, యుద్ధములందు పాల్గొనుచు రాజ్యపాలన చేయుచున్నాడు. వ్యవహారమందు జ్ఞాని అజ్ఞానియు సమముగనే వర్తించుదురు. కేవలము వాసనలు, వాసనారాహిత్యములే బంధమోక్షములకు కారణమైయున్నవి.

ఆకాశమున ఇంద్రధనస్సు, వివిధ వర్ణములు భాసించినను, వాస్తవముగ శూన్యరూపములే యైయున్నవి. అటులనే ఈ బ్రహ్మాండములును, పరమాణువులును శూన్యరూపములే యైయున్నవి.

సర్వకల్పనావర్జితమై, సర్వత్రా ఏకరసమై, కేవల చిదాకాశ రూపమై, నిద్రారహితమైనట్టి సమాధి కాలమందలి ఏ స్థితి కలదో, అద్దానిచే ఈ జగత్తు వెలయుచున్నదని ఎరుగవలెను.

ఓ రామచంద్రా| ఘనశిలవలె ప్రశాంతముగ, మౌనముగ నున్నట్టి బ్రహ్మరూపమే యగు ఈ దృశ్య సమూహమేదికలదో దానికి స్వాత్మయే జగత్తను పేరు విధించి, స్వ మాయచే మోహితమైన దానివలె నున్నది.

ఆహా| మాయ ఎంత ప్రభలమైనది.
శ్రీరాముడు- ఓ మునీంద్రా| ద్వీప,సముద్ర,వన, పర్వతాదులతో గూడిన ఈ దిగంతములందు ఆ విపశ్చిత్తు ఇపుడేమిచేయుచుండిరి.

ఆ విపశ్చిత్తులందొకరిని, క్రౌంఛద్వీపమందలి ప్రసిద్ధమగు వర్ష సీమపర్వతముయొక్క పశ్చిమభాగమునగల ఒకానొకశిలపై నొక గజము తన గండస్ధలముచే, కమలములవలె చూర్ణమొనర్చెను.

రెండవ విపశ్చిత్తును, ఒకరాక్షసుడు యుద్ధమున భగ్నశరీరుని గావించి, ఆకాశమునకు గొనిపోయి అటనుండి సముద్రమునందలి బడబాగ్ని మధ్యమున బడవేయ అచ్ఛట అతడు భస్మీభూతుడయ్యెను.

మూడవ విపశ్చితుని, ఒక విధ్యాధరుడు స్వర్గమున ఇంద్ర సభకు కొనిపోవ అచ్చట, నమస్కారము గావింపనందున, ఇంద్రుడు కుపితుడై శపించి యాతనిని భస్మయొనర్చెను.

నాల్గవ విపశ్చితుని, పుష్యద్వీపమందలి, ఒకానొక పర్వతము యొక్క సమీపమున గల నదీ తటమున ఒక ముసలి ఎనిమిది తునకలు గావించి చంపివేసెను. ఈ ప్రకారముగ వ్యాకులచిత్తులగు ఆ నల్గురు విపశ్చిద్రాదులు మృతినొందిరి.

మరణానంతరము వారి సంవిత్తు ఆకాశరూపము పొంది, అచట పూర్వసంస్కారములచే, భూమండలమును వీక్షించెను. ఆ నల్గురు విపశ్చిత్తుల సంవిత్తు తన దేహములను, పూర్వమువలె గాంచిరి. వారు తమ సూక్ష్మ స్ధూల శరీరములను తమ ఎదుట గాంచిరి.

ఆత్మ జ్ఞానము లేనియూ అవిద్య ఎంత పరిమాణము గల్గియుండునను విషయము నవలోకించుటకై వారు తమ పూర్వకాలిక సంస్కారములచే ప్రవృత్తులైరి.

సశేషం.... 


శ్రీ యోగ వాసిష్ఠ సారము -  258 🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 55 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌻. 135. జీవన్ముక్తులు - 2 🌻

వారు భూమండల మందు అవిద్యయొక్క అనుభవ పరిమాణమెంత యుండునని గాంచుటకై వారొక ద్వీపమునుండి మరొకద్వీపమునకు పరిభ్రమించుచుండిరి.

సప్త మహా సముద్రములతో గూడిన సప్తద్వీపములను దాటి, పశ్చిదిశయందలి విపశ్చిత్తు స్వర్ణమయమగు భూమిని పొంది అచట క్రీడించుచున్న విష్ణు భగవానుని గాంచిరి.

విష్ణుభగవానుడు నిరుపమానమగు బ్రహ్మజ్ఞానమును బడసి నచట ఐదు సంవత్సరములు సమాధి నిష్టుడై యుండెను. ఆ పిదప దేహమును త్యజించి, చిత్తమున నాతడు విదేహముక్తిని బడసెను. అతని ప్రాణము ఆకాశమును పొందెను.

పూర్వదిశ యందలి  విపశ్చిత్తు, బూర్ణచంద్ర  బింబ సమీపమందు తన శరీరమును, శుద్ధ, చంద్ర రూపముగ భావించు కొనుచుండ చిరకాలమునకు శరీరము నశింప ఆ చంద్రలోకముననే స్థితి కల్గియుండెను.

దక్షిణ దిశయందలి విపశ్చిత్తు శత్రువులందరిని నశింపజేసి, నేటికిని శాల్మలి ద్వీపమున రాజ్యము సల్పుచున్నారు. తత్వజ్ఞానము లేక అట్లు బాహ్యాపదార్ధముల స్థితియందున్నాడు.

ఉత్తర దిక్కునందలి విపశ్చిత్తు సప్తమ సముద్రమున నొక ముసలి మాంసమునే భుజించుచుడెను. క్రమముగ ఆ మకరము మరణింప దానినుండి, సముద్రము నుండి బయటకు వచ్చెను.

ఆ సముద్రమును దాటి, ఒక విశాలమైన సువర్ణ భూమియందు మరణించెను. అచ్చట అగ్ని ప్రజ్వరిల్లి అగ్ని రూపము పొంది, దేవరూపము నొందెను.

ఆ నల్గురు, ఒకే వ్యక్తినుండి యుదయించిన్నప్పటికి, యుత్తమ అనుభూతి, భిన్నభిన్న ఫలముల నేల పొందిరి. అని శ్రీరాముడు అడుగగా వసిష్ఠుడిట్లు పలికెను.

జీవుని వాసనలు అల్పదృఢమైనచో, అది దేశకాల క్రియలననుసరించి, అన్యరూపము పొందెను. అధిక దృఢమైనచో బొందడు.

ఈ విధముగ ఆ నల్గురు, విరుద్ధ దేశకాలాది, భోగ్యవిభాగముచే, వాసనా విభాగయుక్తులై, తత్‌ఫలములను బొందుచున్నారు.

విష్ణువు సాహచర్యమున ముక్తుడు,చంద్రుని సాహచర్యమున చంద్రుడు, జంతువు సాహచర్యమున జంతువులను, రాజ్యభోగములందు భోగిగను,ఆయా పరిస్థితుల కనుగుణముగ మారుచున్నారు.అందుకే సత్‌సాంగత్యము అవసరము.

బ్రహ్మము తెలియబడకున్న అది మిధ్య, అవిద్య, జగత్తుగను; తెలిసిన అది శాంతము,బ్రహ్మము అగుచున్నది.

ఓ రామచంద్రా| పూర్వము బ్రహ్మదేవుడు జన్మించినపుడు,అతడు తన రెండు భుజములచే బ్రహ్మాండములను రెండు భాగములుగ పైకి క్రిందికి చీల్చివైచెను. ఆ రెండు దూరమైనవి. అవి పంచభూతములతో ఒప్పినవి.


ఆ రెంటి మధ్య (రెండు కూటములు) భాగము ఆకాశమైనది. అనంతమైన బ్రహ్మము నెరిగిన అది ఉన్నది. ఎరగనిచో, జగత్తు మిధ్యయై వెలుగొందుచున్నది.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹 


🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  259 🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 56 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌻. 136. భాసుని ఉదంతము - 1 🌻

మృగరూపియగు విపశ్చిత్తు నివసించుచున్న,బ్రహ్మాండమును నేనిపుడు గాంచుచున్నాను. ఒకానొక పర్వత గుహయందు,పరిశ్చిత్తు మృగరూపమున జన్మించెను.

ఆ మృగమునే త్రిగర్త దేశపు రాజునకు యొసంగబడినది. అదియే విపశ్చిత్తు అని శ్రీరామునితో వసిష్ఠుడు పలికెను. అంతట ఆ మృగమును,అచ్చటకు కొనితెచ్చిరి. 

అది ఆకర్షణీయముగ చపలత్వముతో గెంతుచున్నది. దానిని గాంచిన సభాసదులు,ఆశ్చర్యముతో పరమేశ్వరుని మాయ ఎట్టి అనంతమైనది, ఆశ్చర్యజనకమైనది అని భావించిరి.

అంతట వసిష్ఠుడు, ధ్యానస్ధితుడై, అగ్నిని ప్రజ్వలింపజేయగ ఆ మృగము, అగ్నియందు ప్రవేశించి, దగ్ధమై,అందుండి విపశ్చిత్తు పూర్వరూపముతో సభయందు కాన్పించెను. అతడు సుందరరూపుడగు సూర్యుని వలె ప్రకాశించుచుండెను.

అతడు రుద్రాక్షలు ధరించి, శాంతుడునునై యుండుటచే,అతనికి భాసుడు అను నామకరణము చేసిరి. అతడచట కూర్చుండి,ధ్యానించి తన పూర్వ వృత్తాంతమును స్మరించెను.

తదుపరి సభను వీక్షించి, వసిష్ఠునకు నమస్కరించెను. అపుడు వసిష్ఠుడతనిని దీవించి, అతని అవిద్యను, క్షయమొనర్చెను. అంతట అతడు శ్రీరాముని పల్కరించగా దశరధుడు అతనిని ఆసనముపై కూర్చుండజేసెను.

అజ్ఞానమువలన, ఇప్పటివరకు ఈ విపశ్చిత్తు చిరకాలము దుఃఖముననుభవించెను. అంతట వారిట్లు తలచిరి. పదునాలుగు భువనములందు, మహత్తరమైన బ్రహ్మాండము,హిరణ్యగర్భుని సంకల్పమున, నాకాశమున స్థితిపొందినది.

ఇక, ఇపుడు భాసుడను పేరుగల ఆ విపశ్చిత్తు రాజు తన వృత్తాంతమునిట్లు తెలుపుచున్నాడు. నేను అనేక దృశ్యముల గాంచితిని.

ఖేదరహితుడనై, యెంతయో సంచరించితిని. బహురీతుల పెక్కువిషయముల ననుభవించితిని.

నేననేక శరీరములను పొంది, అసంఖ్యాకమగు, గొప్పగొప్ప సుఖములు, దుఃఖములు బొందితిని. అవిద్య యొక్క అంతమును పరీక్షించుటకు అనేక ప్రయత్నముల నొనర్చితిని.

చిత్తము యొక్క వృక్ష దర్శనమునకై, వేయి సంవత్సరములు, వృక్షరూపమున నుంటిని. అందు బాహ్య చేష్టలుడిగి, అంతర్ముఖుడనై, సుఖ దుఃఖముల అనుభవించుచు; పుష్ప, ఫలాదులను నుత్పన్నము చేయుచు, కాలాదుల కధీనుడునై యుంటిని.
లేడి రూపమును ధరించి, మేరు పర్వతముపై నూరు సంవత్సములుంటిని.

అట్లే శరభ మృగముగను, సిద్ధునిగను, తాపసునిగను ఇట్లు అనేక ప్రాణులుగను, అనేక ప్రదేశములందు సంచరించుచు,నేను అనుభవించని కార్యమే లేకుండెను. ఇంకను భాసుడిట్లు పలికెను. 

ఒకపుడు మంధర పర్వతముపై ఒక లతాకుంజ భవనంబున, మంధరయను అప్సరసను కౌవగలించుకొని, నిదిరించి యుండ, నొకనది తృణమువలె మమ్ములను గొట్టుకొని పోయెను.

అంత ఆ అప్సరస రాత్రి తాను నన్ను కౌగలించుకొని పరుండినపుడు,నదీ ప్రవాహము తనను నాతోపాటు తీసుకొని పోయెనని పల్కెను.

ఆ జలముచే తడసిన నేను మంధరాచల శిఖరముపై,ఆ అప్సరసతో ఏడు సంవత్సరములుంటినని పల్కెను.

తదుపరి విద్యాధర దేవతల విహార ప్రదేశమును,అనంతరము అమర సౌముడను పేరుగల విద్యాధరునిగ జన్మించి,తపస్వినై పదునాల్గు సంవత్సరములు గడిపితిని.

ఇట్లు ఆకాశగమనము, పతనములయొక్క అనుభవములచే చిరకాలము శ్రమనొంది నిద్రావస్థను పొందితిని.

ఇట్లు జాగ్రత్‌నందు, స్వప్నమునందు అనేక వత్సరములు గడచిపోయినవి. ఇంకను ఇది సత్యము,ఇది సత్యము కాదు అని విచారించుచు,ప్రతి విషయమందు నాకు ద్వంద్వ బుద్ధి తొలగుటలేదు. ఇంకను భాసుడిట్లు పల్కెను.

ఈ జగత్తు కంటే వేరైన,ఒకానొక అపూర్వ జగత్తు, అది భయంకరమైననను, అవిద్యచే అంధుడనైన నేను, అగ్నిదేవుని వరప్రసాద బలముచే, ఆ జగత్తునందు సంచరించుచు, ఒకచోట గొప్ప పర్వతాకారమైన ఒక ఛాయ,భూమిపై తిరుగట గాంచితిని.

అది ఒక పురుషాకృతియై యున్నది. అది గొప్ప శబ్ధముతో, వేగముతో క్రింద పడెను. అపుడు నేను ప్రక్కన్నున అగ్నియందు ప్రవేశించితిని. నాచే జన్మాంతరమున పూజింపబడిన అగ్ని,చంద్రునివలె శీతలము కాగ,భయపడవలదని పలికెను.

అంతట ఆ అగ్నిదేవుడు నన్ను తనతో తన లోకమునకు తీసుకొని వెళ్ళెను. అపుడు నేను ఆకాశమునుండి క్రింద పడిన ఆ శవమును గాంచితిని.

అది పడుటచే భూమియంతయు కంపించెను. అట్టి భయంకర శబ్ధములు వినిపించెను. గొప్ప పగులు ఏర్పడెను. ఆ పగులునందు పెద్ద పర్వతములు, పాతాళమునకు చేరెను. ఆ శవ పాతము సర్వ జీవులను బాధించుచు ప్రళయమును సృష్టించెను. ఇట్లు నేనాకాశమును గాంచి, అగ్నిభగవానునిట్లడిగితిని. 

ఓ దేవా| ఆ శవమేమిటి, అది పైనుండి ఏల పడినది,దాని విశేషములు తెలుపుమనగా, అగ్నిదేవుడిట్లు పలికెను.

అపుడు పెక్కు జీవులచటి కేతెంచిరి. అందు సిద్ధులు, సాధ్యులు, దేవతలు, మునులు,యక్షులు మొదలగు ఆకాశ చారులుండిరి. మరియు సమస్త జగత్తు,ప్రళయ సంభ్రమముచే భీతిల్లి,గొప్ప శబ్ధముచేయసాగెను. మహాకంపన శబ్ధము ఉద్భవించినది. 

అట్లు ఆ శవమును గాంచి, ప్రభూ| ఈ మాంసమయమగు దేహమెట్లు పడినదని మరల అడుగగా అగ్నిదేవుడు ఆ శవముయొక్క భుజములను గూర్చి,తొడలను గూర్చి,శిరోభాగమును గూర్చి ఇట్లు పలికెను.ఇంతలో ఆకాశ దేవతలు దేవిని ఆదరముతో స్తుతించిరి.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  260 🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 57 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌻. 136. భాసుని ఉదంతము - 2 🌻

ఆ దేవి ప్రేత సమూహములతో అనుసరించబడి, కుంభాండ, యక్ష, భేతాళ సమూహములచే, సర్వాయుధములు ధరించియుండెను. అపుడు దేవతలు ఆ దేవితో నిట్లనిరి.

ఓ దేవి| ఈ శవము నీకు కానుకగా నొసంగబడినది. కాన నీవు దీనిని నీ పరివారముతో భుజింపుము. అంత ఆ దేవి ఆ శవమును భుజించి తృప్తిచెందెను. ఆకాశమున ఆ భగవతి నృత్యము చేయుచుండగ దేవతలు వీక్షించిరి.

పిచాచాదులు, ఆ శవములో శేషించిన భాగముల ను తినివేసెను. తదుపరి భూతగణములు కూడ నృత్యమొనర్చిరి. అది గాంచి దేవతలు మిక్కిలి దుఃఖించిరి.

అచట గల పర్వతములు,వృక్షములతో గూడిన పృధివి కంపించసాగెను.
ఓ రామచంద్రా| మధించిన భూతగణము శవమును భుజించగ మిగిలిన అస్తులు మహాపర్వతము వలె పడియున్నవి.

ఇట్లు ఆశవము క్షయింప,సూర్యాధులు తమతమ దిన కార్యక్రమములు,యధావిధిగ సల్పుచుండ, మరల భూతలమున సృష్టి యధాప్రకారముగ వర్ధిల్లెను. అపుడు భాసుడడిగిన ప్రశ్నలకు, శవమును గూర్చిన విశేషములు అగ్నిదేవుడిట్లు చెప్ప దొడగెను.

అసంఖ్యాకమగు జగద్రూప పరమాణువులు గల, నిరాకార చిన్మయ పరమాకాశమొకటి కలదు. అందుండి విషయాకారమయమగు సంవిత్తు స్వయముగ జన్మించెను. ఆ సంవిత్తు తనలో తేజఃపరమాణు రూపమును గాంచెను.

ఆ పరమాణువునందు అణువును గాంచెను. తదుపరి పంచేంద్రియములను గాంచెను. క్రమముగ పంచభూతములు, పంచతన్మాత్రలు, అనంతరము అసురజాతికి చెందిన జీవుడుదయించెను. 

అతడు దేహాభిమానములతో గూడి వర్తించుచుండెను. అసురస్వభావము వలన నాతడు మిగుల దర్పముతో,ఒక మహా ముని ఆశ్రమమును తన విశాల దేహముతో త్రొక్కివేసెను.

అంతట ఆ మునీంద్రుడు దానిని, నీవు అతి స్థూలశరీరముచే ఈ ఆశ్రమమును నశింపజేసితివి కాన,క్షుద్రమగు (మశకము) దోమయై పొవుదువుగాక| అని శపించెను.

అతని చైతన్యము ఆకాశముయొక్క వలయమును బోలి వర్తింపుచున్నది. ఆ చైతన్యము, ఆకాశముతో ఏకత్వమొంది తదుపరి వాయువుతోను ఏకమైనది. 

అంతట ప్రాణవాయువు దేహమును పొంది''ప్రాణి''యను నామముగలదయ్యెను. మరియు అది ఆ పంచీకృతమగు, పృధివాది నాల్గు భూతములచే వ్యాప్తిచెందెను. పిమ్మట ఆకాశమున వాయువువలె చలనము పొందెను. అంతట వర్షము, వాయువుచేత భూమియందు అంకురమై, బీజమువలన జ్ఞానశక్తి యావిర్భవించెను.

తదనంతరము ఆ ముని శాపముచే దోమ సంస్కారముచే పొడువబడినదై, మశకము యొక్క అవయవములు కల్గి దోమరూపము పొందెను. ఆ దోమయొక్క జీవితము ఈ ప్రపంచమున రెండు దినములు మాత్రమే.

ఓ రామా| బ్రహ్మదేవుని మొదలుకొని తృణము వరకు గల సమస్త జీవులయొక్క యుత్పత్తి రెండు విధములుగ యున్నది. ఒకటి బ్రహ్మమయమైనది, మరొకటి భ్రాంతి జన్యమైనది.

పూర్వజన్మముల అనుభవముచే, తత్‌దేహ భ్రాంతిచే, దృశ్యముతో సంగమము చేతను, ఆయా తన్మాత్రలయొక్క రంజనముచే, తదాకారముగ సంభవించు ప్రాణులయుత్పత్తి భ్రాంతి జన్యమైనది.

నిత్య ముక్తమగు బ్రహ్మమున కనిపించని జగత్‌ భ్రాంతియందు, బ్రహ్మము స్వయముగ రూపము పొంది, సృష్ట్యాదియందు, చతుర్విద భూత సముదాయ రూపమును ధరింపకల్గు జీవోత్పత్తి, బ్రహ్మమని చెప్పబడినది. అది యోని జనితముకాదు. అట్టివారు కపిల,సనకాది సిద్ధ పురుషులు.

భూమిపైగల తృణ సమూహమందు చరించు మశకము , తన భార్యతోగూడి చరించుచు శ్రమతోకూడి ఒకచోట విశ్రమించుచుండ, ఇంతలో ఒక హరిణము పాదము దానిపై బడుటచే అది చూర్ణమైపోయెను.

హరిణము యొక్క ముఖమును జూసి ప్రాణమును త్యజించుటచే, నామశకము దాని ఇంద్రియములు గ్రహించినదై యటు పిమ్మట హరిణమై జన్మించెను.

అట్లు హరిణ రూపముతో అరణ్యమున చరించుచుండగ, అది ఒకానొక బోయవాని ధనస్సుచే చంపబడెను. వ్యాధుని ముఖముగాంచిన హరిణము అతని సంస్కారము పొంది వ్యాధుడై జన్మించెను.

అట్లు వ్యాధుడు సంచరించుచు, ఒకానొక ముని వనమందు విశ్రమించగా, అచట సత్‌సాంగత్య లాభము పొందగ, ఆ ముని ఇట్లు ప్రభోదించెను. నీవేల ఇట్లు మృగములను వధించుచు సంచరించుచున్నావు.

ఈ క్షణభంగురమగు జగత్తునందు అహింస, అభయదానము మున్నగు శాస్త్ర మర్యాదనేల పాలింపకున్నావు. ఆయువు క్షణభంగురమైనది.

భోగములు చంచలములైనవి. యవ్వన విలాసముతో శరీరము క్షణములో అపాయము పొందును. కావున అభయము,అహింసల నాచరించుచు,నిత్య నిరతిశయానందరూపమగు బ్రహ్మమును,గురువు శాస్త్రముల ద్వారా పొందుము.

అపుడు వ్యాధుడు మునీంద్రునిట్లు ప్రశ్నించెను. ఓ మునీంద్రా| హింసాది వ్యవహారము దుఃఖహేతువైన,దుఃఖ క్షయము అతి కఠినము,కోమలము గాని వ్యవహారమేదియని అడుగగా, ముని ఇట్లనియే. 

ముందు నీయొక్క ధనుస్సు, బాణములు త్యజించి; యమ, నియమములను అనుష్టాన మార్గములు ఆచరించి, దుఃఖమును శమింపజేసికొనును. ఇచట వసింపుము.

అట్లు బోధింపబడిన వ్యాధుడు మున్యాశ్రమమునందు లభించినదానితో తృప్తి పొందుచు జీవించు చుండెను. కొలది దినములలోనే సత్సంగము,శుద్ధ చిత్తము ద్వారా వివేక శీలత్వము పొందెను. ఒకపరి అతడిట్లు మునిని ప్రశ్నించెను.

మహాత్మ  ప్రాణుల యంతఃకరణమున నున్న స్వప్నము, జాగ్రత్తు వలె బ్రహ్మమున నెట్లు కన్పించుచున్నదని ప్రశ్నింపగ అతడిట్లు పలికెను.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

1 కామెంట్‌: