10, ఏప్రిల్ 2020, శుక్రవారం


🌹. వామాచారం-కాళీకర్పూర తంత్రం
రెండు తంత్రశాస్త్ర గ్రంథాలు 🌹 

🌻. యక్షిణీతంత్ర రహస్యము, ఉడ్డీశ తంత్రము సమీక్ష నుండి తీసుకోబడింది 🌻

తంత్రశాస్త్రం ఒక నిగూఢసాధనల ప్రపంచం. తంత్రాల్ని హిందూ సంప్రదాయంగా అంగీకరించేవారూ ఉన్నారు, అంగీకరించనివారూ ఉన్నారు. దీనిక్కారణం – తంత్రాల్లోని సాధనలూ, దేవతలూ, మంత్రాలూ హెచ్చుశాతం అవైదికం కావడమే. వైదిక సాహిత్యంలో ఎక్కడా పేర్కోకపోవడమే. తంత్రసాధకులు మాత్రం ఇది పూర్తిగా హిందూ సంప్రదాయమేనని నొక్కివక్కాణిస్తారు. ఇందుకు వారిచ్చే వివరణ – తంత్రాలన్నీ శివప్రోక్తాలే. శివుడికి పంచామ్నాయాలూ పంచముఖాలు. పంచామ్నాయాలంటే –

1. శివుడి యొక్క సద్యోజాతమనే ముఖం నుంచి పూర్వామ్నాయం ఉద్భవించింది.

2. వామదేవమనే ముఖం నుంచి దక్షిణామ్నాయం ప్రకాశితమైంది.

3. అఘోరమనే ముఖం నుంచి పశ్చిమామ్నాయం జనించింది.

4. తత్పురుషమనే ముఖం నుంచి ఉత్తరామ్నాయం ప్రకటమైంది.

5. ఈశానమనే ముఖం నుంచి ఊర్ధ్వామ్నాయం వెలువడింది. దీన్నే వైదికమార్గం అంటున్నారు.

తంత్రసాధన పశ్చిమామ్నాయ సంప్రదాయానికి చెందినది. రథక్రాంత, విష్ణుక్రాంత, అశ్వక్రాంత అనే భేదాల వల్ల తంత్రం మూడువిధాలని చెప్పబడింది. వేద, ఇతిహాసాల కాలంలో లేని తంత్రసాధన ఆ తరువాతి యుగాల్లో భారతదేశంలో విస్తారంగా ప్రాచుర్యంలోకి రావడానికి కారణాల్ని రకరకాలుగా చెబుతారు.

వాటి సంగతెలా ఉన్నా తంత్రసాధనకు కుల-మత -లింగ-వర్గ విచక్షణ లేకపోవడం ఒక ప్రధాన కారణంగా భావించవచ్చు. తంత్రోపాసకులంతా ఒకే కులం కింద జమ. అలాగే వారు చేయాల్సిన సంధ్యోపాసన బ్రాహ్మణుల సంధ్యోపాసన కంటే చాలా తేడాగా ఉంటుంది.

అలాగే వారి హోమపద్ధతీ, మంత్రాలూ, నైవేద్యాలూ అన్నీ తేడాగానే ఉంటాయి. తంత్రాలు దేని గుఱించి ? అనడిగితే “ఇహానికీ, పరానికీ కూడా” అని తంత్రోపాసకులు సెలవిస్తారు. తంత్రం ద్వారా కోరికలూ సిద్ధిస్తాయి, మోక్షమూ లభిస్తుందని వారు చెబుతారు.

తంత్రంలో వామాచారం, కౌళాచారం అని రెండు భేదాలున్నాయి. వామాచారంలో వావి-వరుసల్ని ఉపేక్షించి చేయాల్సిన కార్యకలాపాలూ, మాంసభక్షణ, మద్యపానం ఇత్యాది అంశాలుండడం చేతా, ఇంకా అలాంటి అనేకమైన ప్రమాదకరమైన సాధనలు (పొఱపాట్లు చేయడానికి మిక్కిలి అవకాశం గలిగినవి) ఉండడం చేతా అగ్రకులస్థులకు మాత్రం అది పూర్తిగా నిషిద్ధం.

వారు శ్రీవిద్య (లలితోపాసన) వంటి కౌళసాధనను మాత్రమే ఎంచుకోవాలి. అదీ గాక వామాచారంలో కొన్ని విఫల తంత్రాలు కూడా ఉన్నాయని, అవి పైకి అసలైన తంత్రాల్లాగే కనిపిస్తూ, ఆచరించినప్పుడు మాత్రం ఏ విధమైన ఫలితాన్నీ ఇవ్వవనీ తంత్రమార్గీయులు చెబుతారు. ఈ తేడాల గుఱించి కూలంకషంగా తెలియాలంటే మంచి తాంత్రికగురువు అవసరం.

యక్షిణీతంత్ర రహస్యము, ఉడ్డీశతంత్రము. కొన్ని రకాల చెట్లని ఆశ్రయించుకొని కొన్ని యక్షిణీశక్తులు ఉంటాయనీ, వారిని తగుసాధనల ద్వారా సంతృప్తిపఱిస్తే వారు సాధకుడికి ప్రత్యక్షమై కోరిన కోరికలు తీఱుస్తారనీ యక్షిణీతంత్రరహస్యం చెబుతోంది.

అందఱు యక్షిణులూ అన్ని చెట్లలోనూ ఉండరు. ఒక యక్షిణి ఒక రకం చెట్టునే ఆశ్రయించుకుని ఉంటుంది. అలాగే అందఱు యక్షిణులూ అన్నిరకాల కోర్కెలనీ తీర్చరు. ఒక యక్షిణి ఒక తరహా కోరికనే తీఱుస్తుంది. విద్య, సంతానం, కార్యసిద్ధి, వాక్సిద్ధి, రాజ్యాధికారం, రాజోద్యోగం, ప్రతిరోజూ వేయి బంగారునాణేల ప్రాప్తి మొదలైన కోరికలకు వేఱువేఱు యక్షిణులున్నారు.

ఈ క్రమంలో – తులసీయక్షిణి, ఉదుంబర  (అత్తిచెట్టు) యక్షిణి, ఆమ్ర (మామిడి) యక్షిణి, అపామార్గ (ఉత్తరేణి) యక్షిణి, అంకోల (ఊడుగు) యక్షిణి మొదలైన యక్షిణుల్ని ఎలా ఉపాసన చేయాలో వివరంగా వ్రాశారు.

అదే విధంగా స్వర్గలోక అప్సరసల్ని ఎలా ప్రత్యక్షం చేసుకోవాలో కూడా విపులంగా వివరించబడింది. ఆ అప్సరసల్లో  రంభ, ఊర్వశి, తిలోత్తమ, శశిదేవి, కాంచనమాల, రత్నమాల, శ్రీభూష, మంజుఘోష మొదలైన వారున్నారు.

ఈ అప్సరసలు కేవలం స్వర్గలోక నాట్యగత్తెలు మాత్రమే కాక స్వతహాగా దేవతలు కూడా కావడం చేత, ప్రసన్నులైతే కొన్ని కోర్కెల్ని తీర్చగలరు. అలా వారిద్వారా తీఱగల కోర్కెల్లో నిధినిక్షేపాల్ని చూడగలగడం, కామగమనం, ఆకాశగమనం, అదృశ్యకరణి, వందలాది సంవత్సరాల ఆయుర్దాయం ఇత్యాదులున్నాయి.

ఈ అప్సరసల్ని ఎలాగైనా భావన చేయవచ్చు. తల్లిగా, చెల్లిగా, కూతురుగా, భార్యగా ! కానీ భార్యగా భావిస్తేనే ఎక్కువ సంతుష్టులవుతారట. ఎలా భావించినప్పటికీ సాధనాకాలంలో సంపూర్ణ బ్రహ్మచర్యం తప్పనిసరి. లేకపోతే భయంకరమైన శాపాలిస్తారు. అలాగని తంత్రసాధకులు తాంత్రిక దేవతలకు భయపడరు. ఒకవేళ ప్రత్యక్షం కాకపోతే, ఫలితమివ్వకపోతే ఆమెను దూషిస్తూ మళ్లీ మఱో రకమైన ఉపాసన చేస్తారు. ఆ దెబ్బకి ఆమె తప్పనిసరిగా దిగిరావాల్సిందే. వరమివ్వాల్సిందే.

ఇహపోతే, ఉడ్డీశతంత్రంలో 7 పటలాలు (అధ్యాయాలు) ఉన్నాయి. ఇందులో మంత్రాలతో పాటు సిద్ధౌషధి ప్రక్రియలూ, ప్రయోగాలూ కూడా విస్తారంగా చెప్పబడ్డాయి.

“ఈ …ప్రయోగంలో తిథివార నక్షత్ర నియమములు లేవు.” అని తెలియజేశారు. అలాగే గురువు లేకుండా ఉడ్డీశతంత్రం సిద్ధించదని కూడా తెలిపారు.

ఉడ్డీశతంత్రం ప్రధానంగా శాంతి, వశీకరణం, స్తంభనం, విద్వేషణం, ఉచ్చాటనం, మారణం అనే షట్ క్రియల గుఱించి చర్చిస్తుంది. రోగాల్ని, గ్రహబాధల్నీ, ఇతరులు తనమీద చేసిన ప్రయోగాల్నీ తొలగించుకోవడం శాంతికర్మ.

ఇతరుల్ని తనకు వశవర్తులుగా చేసుకోవడం వశీకరణ.  ఇతరుల ప్రవృత్తిని అడ్డుకునేది స్తంభనం. అన్యోన్యంగా ఉన్నవారిని విడదీయడం ద్వేషణం.  వెళ్ళగొట్టడం ఉచ్చాటనం. ప్రాణం తీయడం మారణం. కానీ లోకకల్యాణకాముడైన వ్యాఖ్యాత మారణప్రయోగాలనే ఈ చివఱి భాగాన్ని ప్రచురించకుండా విడి
చిపుచ్చారు.

(యక్షిణీతంత్ర రహస్యము మఱియు ఉడ్డీశతంత్రం) నుండి
🌹 🌹 🌹 🌹 🌹

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి