9, ఏప్రిల్ 2020, గురువారం

నారదుని తపస్సు - 2 🌻

నారదుని తపస్సు  - 2 🌻

శృణుతాదరతస్తత్ర కారణం శౌనకాదయః | ఈశ్వరానుగ్రహేణాత్ర న ప్రభావః స్మరస్య హి || 17

అత్రైవ శంభునాsకారి సుతపశ్చ స్మరారిణా | అత్రైవ దగ్దస్తేనాశు కామో మునితపోపహః 18

కామ జీవనహేతోర్హి రత్యా సంప్రార్ధితైస్సురైః | సంప్రార్థిత ఉవాచేదం శంకరో లోకశంకరః || 19

కంచిత్సమయమాసాద్య జీవిష్యతి సురాః స్మరః | పరం త్విహ స్మరో పాయశ్చరిష్యతి న కశ్చన || 20

ఇహ యావద్దృశ్యతే భూర్జనై స్థ్సి త్వాs మరాస్సదా | కామబాణ ప్రభావోsత్ర న భవిష్యత్య సంశయమ్‌ || 21

ఓ శౌనకాది ఋషులారా! అట్లు జరుగుటకు గల కారణమును శ్రద్ధగా వినుడు. ఈశ్వరుని అనుగ్రహముచే ఆ ప్రదేశములో మన్మథుని ప్రభావము నిరుపయోగము (17).

మన్మథ శత్రువగు శంభుడు గొప్ప తపస్సు చేసిన స్థలమదియే. మహర్షుల తపస్సును భంగము చేయు మన్మథుడచటనే శివునిచే దహింపబడినాడు (18).

మన్మథుని బ్రతికించుడని రతీదేవి దేవతలను ప్రార్థించగా, వారు శివుని ప్రార్థించిరి. లోకములకు మంగళములను కలుగజేయు శంకరుడు అపుడిట్లనెను (19).

ఓ దేవతలారా! కొంతకాలము తరువాత మన్మథుడు మరల జీవించగలడు. కాని ఈ స్థానములో మన్మథుని ఆటలేమియూ సాగవు (20).

ఓ దేవతలారా! ఇచట నుండి కనుచూపుమేర వరకు ఉండే ప్రదేశములో మన్మథ బాణముల ప్రభావము చెల్లదు. దీనిలో సందియము లేదు (21).

ఇతి శంభూక్తితః కామో మిథ్యాత్మ గతికస్తదా | నారదే స జగామాశు దివమింద్ర సమీపతః || 22

ఆచఖ్యౌ సర్వవృత్తాంతం ప్రభావం చ మునే స్స్మరః | తదాజ్ఞయా య¸° స్థానం స్వకీయం స మధుప్రియః || 23

విస్మితోsభూత్సురాధీశః ప్రశశంసాథ నారదమ్‌ | తద్వృత్తాంతానభిజ్ఞో హి మోహితశ్శివ మాయయా || 24

దుర్‌ జ్ఞేయా శాంభవీ మాయా సర్వేషాం ప్రాణినామిహ | భక్తం వినార్పితాత్మానం తయా సమ్మోహ్యతే జగత్‌ || 25

శివుని ఈ పలుకుల చే నారదుని యందు చూపదలచిన తన ప్రతాపము భగ్నము కాగా, మన్మథుడు వెనువెంటనే స్వర్గములో ఇంద్రుని వద్దకు వెళ్లెను (22).

మన్మథుడు నారదుని ప్రభావమును, జరిగిన వృత్తాంతమును పూర్తిగా ఇంద్రునకు విన్నవించెను. వసంత మిత్రుడగు మన్మథుడు ఇంద్రుని వద్ద సెలవు తీసుకుని తన స్థానము చేరెను (23).

అపుడు ఇంద్రుడు ఆశ్చర్య చకితుడై నారదుని ప్రశంసించెను. నారదుని వృత్తాంతము నెరుంగని ఇంద్రుడు శివమాయచే మోహితుడయ్యెను (24).

శివుని మాయ సర్వప్రాణులకు తెలియ శక్యము కానిది. సర్వ స్వార్పణము చేసిన భక్తుడు తక్క ఈ జగత్తంతయూ శివమాయచే మోహితమగును (25).

నారదోsపి చిరం తస్థౌ తత్రేశాను గ్రహేణ హ | పూర్ణం మత్వా తపస్తత్‌ స్వం విరరామ తతో మునిః || 26

కామాజ్ఞయం నిజం మత్వా గర్వితోsభూన్మునీశ్వరఃశ | వృథైవ విగతజ్ఞాన శ్శివవయా విమోహితః|| 27

ధన్యా ధన్యా మహామాయా శాంభవీ మునిసత్తమాః | తద్గతిం నహి పశ్యంతి విష్ణు బ్రహ్మాదయేsపి హి || 28

తయో సం మోహితోsతీవ నారదో మునసత్తమః కైలాసం ప్రయ¸° శీఘ్రం స్వవృత్
తం గదితుం మదీ || 29

ఈశ్వరుని అనుగ్రహముచే నారదుడచటనే చిరకాలముండెను. తరువాత ఆ మహర్షికి తన తపస్సు పూర్ణమైనదనే తలంపు కలిగి విరమించెను (26).

మన్మథునిపై విజయము తన ప్రభావమేనని ఆ మహర్షి తలపోసెను. ఆయన శివమాయచే మోహితుడయ్యెను. ఆయన జ్ఞానము వృథా అయెను (27).

ఓ మునిశ్రేష్ఠులారా! శంభుని మహా మాయ మిక్కిలి ధన్యమైనది. బ్రహ్మ, విష్ణువు మొదలగు వారికి కూడా దాని ప్రసారము తెలియకుండును (28).

మునిశ్రేష్ఠుడగు నారదుడు ఆ మాయచే మిక్కిలి సంమోహితుడై, తన మహిమను శివునకు చాటిచెప్పే ఉద్దేశ్యముతో వెంటనే కైలాసమునకు బయలు దేరెను (29).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 113 🌷
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
అధ్యాయము - 2
🌻. నారదుని తపస్సు  - 3 🌻

రుద్రం నత్వాబ్రవీత్సర్వం స్వవృత్తం గర్వవాన్మునిః | మత్వాత్మానం మాహాత్మానం స్వప్రభుం చ స్మరంజయమ్‌ || 30

తచ్ఛ్రుత్వా శంకరః ప్రాహ నారదం భక్తవత్సలః | స్వమాయా మోహితం హేత్వనభిజ్ఞం భ్రష్టచేతసమ్‌ || 31

గర్వితుడగు ఆ మహర్షి తాను మహాత్ముడననియు, మన్మథుని పై విజయము తన ప్రభావమేననియు తలంచినవాడై, రుద్రునకు నమస్కరించి తన వృత్తాంతమునంతయూ చెప్పెను (30).

భక్త వత్సలుడగు శంకరుడా పలుకులను విని, తన మాయచే మోహితుడై వివేకమును కోల్పోయిన ఆనారదునితో నిట్లనెను (31).

రుద్ర ఉవాచ |

హే తాత నారద ప్రాజ్ఞ ధన్యస్త్వం శృణు మద్వచః | వాచ్యమేవం న కుత్రాపి హరేరగ్రే విశేషతః || 32

పృచ్ఛమానోsపి న బ్రూయాః స్వవృత్తం మే యదుక్తవాన్‌ | గోప్యం గోప్యం సర్వథా హి నైవ వాచ్యం కదాచన || 33

శాస్మ్యహం త్వాం విశేషేణ మమ ప్రియతమో భవాన్‌ | విష్ణుభక్తో యతస్త్వం హి తద్భక్తోsతీవ మేsనుగః || 34

శాస్తి స్మేత్థం చ బహుశో రుద్రస్సూతికరః ప్రభుః | నారదో న హితం మేనే శివమాయావిమోహితః || 35

రుద్రుడు ఇట్లనెను -

వత్సా!నారదా! నీవు ప్రాజ్ఞుడవు. ధన్యుడవు. నీ నామాటను వినుము. ఈ మాటలను ఇతరుల వద్ద చెప్పకుము. విష్ణువు యెదుట సుతరాము చెప్పకుము. (32).

నీవు నాకు చెప్పిన ఈ వృత్తాంతమును రహస్యముగ నుంచుము. ఏనాడైననూ బయటపెట్టకుము(33).

నీవు విష్ణుభక్తుడవు. విష్ణుభక్తులు నాయందు కూడ భక్తిని కలిగియుందురు. కావున, నీవు నాకు మిక్కిలి ప్రియమైనవాడవు. నేను నిన్ను ప్రత్యేకించి శాసించు చున్నాను (34).

ఈ విధముగా, జగత్తును సృష్టించి పాలించు రుద్రుడు నారదునికి అనేక విధముల నచ్చచెప్పెను. అయిననూ, శివమాయచే విమోహితుడైన నారదుడు ఆ మాటలను లెక్కచేయలేదు (35).

ప్రబలా భావినీ కర్మ గతిర్‌ జ్ఞేయా విచక్షణౖః | న నివార్యా జనైః కైశ్చిదపీచ్ఛా సైవ శాంకరీ || 36

తతస్స మునివర్యో హి బ్రహ్మలోకం జగామ హ | విధిం నత్వాsబ్రవీత్కామజయం స్వస్య తపోబలాత్‌ || 37

తదాకర్ణ్య విధిస్సోsథ స్మ్వత్వా శంభుపదాంబుజమ్‌ | జ్ఞాత్వా సర్వం కారణం తన్నిషిషేధ సుతం తదా || 38

మేనే హితం న విధ్యుక్తం నారదో జ్ఞాని సత్తమః | శివమాయామోహితశ్చ రూఢచిత్తమదాంకురః || 39

శివేచ్ఛా చ యాదృశీ లోకే భవత్యేవ హి సా తదా | తదధీనం జగత్సర్వం వచస్తథ్యం స్థితం యతః || 40

రాబోవు కర్మఫలముల చాల బలీయమైనదని విద్వాంసులు తెలియవలెను. మానవులెవ్వరైననూ కర్మగతిని తప్పించుకొనలేరు. శంకరునని ఇచ్ఛానుసారముగా కర్మగతి ప్రవర్తిల్లును (36).

అపుడా మహర్షి బ్రహ్మలోకమునకు వెళ్లి, బ్రహ్మకు నమస్కరించి, తాను తన తపశ్శక్తి చేత కాముని జయించితినని చెప్పెను (37).

విధి ఆ మాటలను విని శంభుని పాదపద్మములను స్మరించి, కాముని జయించుటకు గల కారణము నెరింగి, కుమారుడగు నారదుని అట్లు ప్రచారము చేయవద్దని నివారించెను (38).

నారదుడు గొప్ప జ్ఞానియే అయిననూ, శివమాయచే మోహితుడగుటచే, అతని మనస్సునందు గర్వము అంకురించి, బ్రహ్మ గారి మాటను పెడచెవిని పెట్టెను (39).

లోకము నందు సర్వము శివుని ఇచ్ఛ ప్రకారమే జరుగును. జగత్తంతయూ శివుని అధీనము నందుండును. ఇది సత్యము (40).

నారదోsథ య¸° శీఘ్రం విష్ణులోకం వినష్టధీః | మదాంకురమనా వృత్తం గదితుం స్వ తదగ్రతః|| 41

ఆగచ్ఛంతం మునిం దృష్ట్వా నారదం విష్ణురాదరాత్‌ | ఉత్థిత్వాగ్రే గతోsరం తం శిశ్లేష జ్ఞాతహేతుకః || 42

స్వాసనే సముపావేశ్య స్మృత్వా శివపదాంబుజమ్‌ | హరిః ప్రాహ వచస్తథ్యం నారదం మదనాశనమ్‌ || 43

వివేకము నశించి గర్వము అంకురించిన మనస్సు గల నారదుడు తరువాత వెనువెంటనే తన గొప్పదనమును ప్రకటించుటకు విష్ణులోకమునకు వెళ్లెను(41).

నారద మహర్షి వచ్చుచుండుటను గాంచి, విష్ణువు లేచి, కొద్ది దూరము ఎదురేగి కౌగిలించుకొనెను. నారదుని రాకకు కారణము ఆయనకు విదితమే (42).

విష్ణువు
నారదుని తన ఆసనముపై కూర్చుండబెట్టి, శివుని పాదపద్మములను స్మరించి అతని గర్వమును పోగొట్టు సత్యవచనముల నిట్లు పలికెను (43).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి