7, ఏప్రిల్ 2020, మంగళవారం



🕉🌞🌙🌎🌟🚩
 *శ్రీమన్నారాయణీయం
9దశక-3-శ్లోకం.*
🕉🌞🌙🌎🌟🚩

ఆముష్య హి సరోరుహః కిమపి కారణం సంభవేత్
ఇతి స్మ కృతనిశ్చయః స ఖలు నాళరంధ్రాధ్వనా।
స్వయోగబలవిద్యయా సమవరూఢవాన్ ప్రౌఢధీః
త్వదీయమతిమోహనం న తు కళేబరం దృష్టవాన్||

భావం:-

ఆ పద్మమునకు మరియు తన ఆవిర్బవమునకు కారణమైన రూపము తప్పక ఉండవలెనని నిశ్చయుంచుకొనిన బ్రహ్మ, ఆ పద్మనాళరంధ్ర మార్గమున తన యోగజ్ఞాన శక్తి నైపుణ్యముతో ప్రవేశించెను. అట్లు ప్రవేశించిన బ్రహ్మదేవుడు అత్యంత మనోహహరమైన నీ రూపమును మాత్రము దర్శించలేకపోయెను.

వ్యాఖ్య:-

ఈరోజు శ్లోకంలో విష్ణుమూర్తి యొక్క సర్వ నియామకత్వం మనకు అవగతం అవుతోంది. ఇదే విషయాన్ని సాక్షాత్తు శ్రీక్రృష్ణులవారే మనకు భగవద్గీత అ.10 శ్లో.8 లో ఇలా చెప్పారు.


అహం సర్వస్య ప్రభవో
మత్తః సర్వం ప్రవర్తతే ।
ఇతి మత్వా భజంతే మాం
బుధా భావసమన్వితాః ।।

నేనే సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానమును. నా వల్లనే  అన్నీ కొనసాగుతున్నవి. దీనిని సంపూర్ణముగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు.


శ్రీ కృష్ణుడు ఈ శ్లోకాన్ని "అహం సర్వస్య ప్రభవో" అనటంతో ప్రారంభిస్తున్నాడు, అంటే "నేనే సర్వోత్కృష్ట పరమ సత్యాన్ని మరియు సర్వ కారణ కారణాన్ని" అని. ఈ విషయాన్ని భగవద్గీత లో చాలా సార్లు చెప్పారు. ఇతర పురాణ/ఇతిహాసాలలో కూడా ఇది గట్టిగా పేర్కొనబడినది.


ఋగ్వేదము ప్రకారం:
యం కామయే తం తం ఉగ్రం కృష్ణోమి తం బ్రహ్మాణం తమ్ ఋషిం తం సుమేద్సం (10.125.5)


"నేను ప్రేమించే వారిని అత్యంత మహానీయులుగా చేస్తాను; వారిని పురుషులుగా లేదా స్త్రీలగా చేస్తాను; వారిని జ్ఞానవంతులైన మహాత్ములుగా చేస్తాను; ఏదేని జీవాత్మను బ్రహ్మ పదవికి అర్హునిగా చేస్తాను."


ఈ నిజాన్ని అర్థం చేసుకున్న వివేకులు ధృడ విశ్వాసం పెంచుకుని మరియు ప్రేమయుక్త భక్తితో ఆయనను ఆరాధిస్తారు.


ఈ విధంగా శ్రీ కృష్ణుడు ఈ భౌతిక జగత్తుకి మరియు ఆధ్యాత్మిక జగత్తుకి, రెండింటికీ కూడా సర్వేశ్వరుడు. .


అనంతమైన భౌతిక విశ్వంతో కూడిన ఈ భౌతిక సృష్టిపై ఆధిపత్య భగవంతుని స్వరూపమే మహావిష్ణువు. మహా విష్ణువునే ప్రథమ పురుషుడు అని కూడా అంటారు (భౌతిక జగత్తులో భగవంతుని యొక్క ప్రథమ స్వరూపము).


ఆయన కారణ సముద్రంలో దివ్యమైన నీటిలో ఉంటూ అనంతమైన బ్రహ్మాండాలను తన శరీర రోమకూపాల్లోంచి సృజిస్తూ ఉంటాడు. తదుపరి ఆయనే ప్రతి ఒక్క బ్రహ్మాండం క్రింద గర్భోదక్షాయి విష్ణు స్వరూపంలో వ్యాప్తించి ఉంటాడు, ఆయననే ద్వితీయ పురుషుడు అంటారు. (భౌతిక ప్రపంచంలో రెండవ స్వరూపము).


గర్భోదక్షాయి విష్ణు నుండి బ్రహ్మ జన్మించాడు. ఆయనే సృష్టి క్రమాన్ని నిర్దేశిస్తాడు – విశ్వము యొక్క విభిన్నములైన స్థూల, సూక్ష్మ పదార్ధాలని, ప్రకృతి నియమాలని, గ్రహాలూ, పాలపుంతలూ, వాటిపై నివసించే జీవరాశులు మొదలైన వన్నీటినీ సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి బ్రహ్మని విశ్వ సృష్టి కర్త అని అంటూ ఉంటారు, నిజానికి ఆయన ద్వితీయ స్థాన సృష్టికర్త.


గర్భోదకశాయి విష్ణు ఇంకొంత వ్యాప్తి నొంది, తానే, క్షీరోదక్షాయి విష్ణు గా రూపాంతరం చెంది, ప్రతి బ్రహ్మాండం యొక్క పై భాగంలో, క్షీర సాగరంలో నివసిస్తాడు. క్షీరోదక్షాయి విష్ణువు నే తృతీయ పురుషుడు అంటారు. (భౌతిక జగత్తు లో భగవంతుని యొక్క మూడవ రూపాంతరము).


విశ్వం పైన ఉంటాడు కానీ తానే పరమాత్మ రూపంలో సర్వ ప్రాణుల హృదయములో, వాటి కర్మలను గమనిస్తూ, వాటి లెక్క గణిస్తూ, సరైన సమయంలో కర్మ ఫలాలని అందచేస్తూ ఉంటాడు. అందుకే ఆయనను విశ్వ స్థితికారకుడు అంటారు.


ఇక్కడ చెప్పబడిన విష్ణు మూర్తి స్వరూపాలన్నీ శ్రీ కృష్ణుడి కన్నా అబేధములే. అందుకే, ఈ శ్లోకంలో సమస్త ఆధ్యాత్మిక మరియు భౌతిక సృష్టి ఆయన నుండే వచ్చాయి అని అంటున్నాడు.


శ్రీ కృష్ణుడే అన్ని అవతారాల మూలం. శ్రీమద్భాగవతము ప్రకారం : ఏతే చాంశ కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం (1.3.28) - భగవంతుని సమస్త స్వరూపాలు శ్రీ కృష్ణుడి రూపాంతరాలే లేదా ఆయన రూపాంతరాల రూపాంతరాలే; ఆయన మాత్రం స్వయం భగవానుడు. అందుకే, ద్వితీయ స్థాన సృష్టికర్త అయిన బ్రహ్మ, శ్రీ కృష్ణుడిని ఈ విధంగా స్తుతించాడు:


యస్యైకనిశ్వసిత కాలమథావలంబ్య
జీవంతి లోమవిలజా జగదండనాథాః
విష్ణుర్మహాన్ సఇహయస్య కలావిషేశో
గోవిందమాది పురుషం తమహం భజామి (బ్రహ్మ సంహిత 5.48)


“అనంతమైన బ్రహ్మాండాలు – ప్రతి ఒక్క దాంట్లో ఒక శంకరుడు, బ్రహ్మ, మరియు విష్ణు ఉన్నటువంటివి – శ్రీ మహా విష్ణువు శరీర రోమ కూపాల్లోంచి ఆయన శ్వాస తీసుకున్నప్పుడు సృజించ బడుతాయి; మరియు ఆయన శ్వాస విడిచినప్పుడు ఆయనలోకే లయమై పోతాయి. అటువంటి శ్రీ మహా విష్ణువు మూల స్వరూపమైన శ్రీ కృష్ణుడిని నేను పూజిస్తాను.”


శ్రీమన్నారాయణీయం
9దశకం-5-శ్లోకం*
🕉🌞🌎🌙🌟🚩

శతేన పరివత్సరైర్ధృఢసమాధిబంధోల్లసత్-
ప్రబోధ విశదీకృతః స ఖలు పద్మినీ సంభవః।
అదృష్టచరమద్భుతం తవ హి రూపమంతర్దృశా
వ్యచష్ట పరితుష్టధీర్భుజగభోగ భాగాశ్రయమ్||

భావము:-

నూరు దివ్యసంవత్సరముల కాలము ధృఢ సమాధి యోగ స్థితి యందు ఉన్న బ్రహ్మదేవుడు, జ్ఞానము వికసించినవాడై - ఇంతకు ముందు తనకు కానరానిది, అద్భుతమైనది మరియు శేషతల్పము పై పవళించి యున్న నీ దివ్యమంగళ రూపమును తన అంతఃర్ దృష్టితో దర్శించి సంతోష భరితుడయ్యెను.


వ్యాఖ్య:-

ఈశ్లోకంలో భట్టతిరి వారు బ్రహ్మ దర్శించిన విష్ణువును స్తుతించారు. ఆ రూపం ఎలావుంది అన్నది పోతనభాగవతంలోని ఒక పద్యంలో వస్తుంది.


2-236-మ
సతతజ్ఞానరమా యశో బల మహైశ్వర్యాది యుక్తున్ జగ
త్పతి యజ్ఞేశు ననంతు నచ్యుతు దళత్పంకేరుహాక్షున్ శ్రియః
పతి నాద్యంతవికారదూరుఁ గరుణాపాథోనిధిన్ సాత్వతాం
పతి వర్థిష్ణు సహిష్ణు విష్ణు గుణవిభ్రాజిష్ణు రోచిష్ణునిన్.


ఎల్ల వేళల జ్ఞానము, సంపద, కీర్తి బలము, ఐశ్వర్యము మొదలైన గుణాలతో కూడినవాడు, భువనాలకు ప్రభువు, యజ్ఞానికి అధీశ్వరుడు, తుది లేనివాడు, చ్యుతి లేనివాడు, వికసించుచున్న పద్మాలవంటి నేత్రాలు కలవాడు, లక్ష్మీవల్లభుడు, మొదలు తుద వికారము లేనివాడు, దయాసముద్రుడు, సాత్వతులకు అధినాథుడు, వృద్ధిశీలుడు, సహనశీలుడు, అంతటా వ్యాపించిన వాడు, కల్యాణగుణాలతో విరాజిల్లేవాడు, కాంతిమంతుడు అయిన శ్రీహరిని బ్రహ్మదేవుడు దర్శించాడు.


2-240-చ.
ప్రియుఁడగు బొడ్డుఁదమ్మి తొలిబిడ్డఁడు వేలుపుఁబెద్ద భూతసం
చయములఁజేయుకర్త నిజశాసనపాత్రుఁడు ధాత మ్రొక్కినన్
దయ దళుకొత్తఁ బల్కెఁ బ్రమదస్మితచారుముఖారవిందుఁడై
నయమునఁ బాణిపంకజమునన్ హరి యాతనిదేహమంటుచున్ ఇట్లనియె..


తనకు ఇష్ఠుడు, నాభి యందు జనించినవాడు, ప్రథమ సంతానము, దేవతలందరకు అధిదేవుడు, సమస్తమైన భూతజాలమును సృష్టించెడి వాడు, తన ఆజ్ఞానువర్తి, సృష్టి నంతటిని ధరించువాడు అగు బ్రహ్మదేవుడు అలా ప్రణామములు చేయగా శ్రీమహావిష్ణువు పరమ సంతోషంతో కూడిన చిరునవ్వులు చిందించే మోము కలవాడయ్యాడు. అతని దేహమును చనువుగా హస్తపద్మములతో తాకుతు, దయ ఉట్టిపడుచుండగా ఆయనతో ఇలా అన్నాడు.


2-242-తే.
భద్రమగుఁగాక! నీకు నో! పద్మగర్భ!
వరము నిపు డిత్తు నెఱిఁగింపు వాంఛితంబు;
దేవదేవుఁడ నగు నస్మదీయ పాద
దర్శనం బవధి విపత్తిదశల కనఘ!


ఓ పరమ పుణ్యుడ దేవాధిదేవుడనైన నా యొక్క పాదదర్శనం పొందావు. నీ విపత్తి ఆపత్తులు సర్వం తొలగిపోతాయి. జ్ఞనానికి హృదయానికి ప్రతీక యైన పద్మమునందు ఉద్భవించిన ఓ బ్రహ్మదేవుడ! నీకు శుభమగు గాక. నీవు కోరిన వరం ఇస్తాను కోరుకో అన్నాడు విష్ణుమూర్తి.

🕉🌞🌎🌙🌟🚩


శ్రీమన్నారాయణీయం
9దశకం-6-శ్లోకం*
🕉🌞🌎🌙🌟🚩

కిరీటమకుటోల్లసత్కటకహారకేయూరయుఙ్
మణిస్ఫురితమేఖలం సుపరివీతపీతాంబరం।
కళాయకుసుమప్రభం గళతలోల్లసత్కౌస్తుభం
వపుస్తదయి! భావయే కమలజన్మనే దర్శితమ్||

భావం:-

దేదీప్యమానమైన కిరీటము, భుజకీర్తులు, కడియములు, హారములు, మణిఖచిత మొలనూలు, కంఠమున ప్రకాశించు కౌస్తుభమణి, పసిడివర్ణశోభితమైన పీతాంబరమును ధరించి, నీలికలువ పూల కాంతితో ప్రకాశించు నీ రూపమును బ్రహ్మదేవుడు దర్శించెను. అట్టి నీ అద్వితీయ రూపమును నేనును భావనచేసి ధ్యానింతును.

వ్యాఖ్య:-

ఈరోజు శ్లోకంలో భట్టతిరివారు వంద సంవత్సరాల తపః ఫలంగా విష్ణువు ను దర్శిస్తున్న వైనం చూశాము. మరి మనకీ దర్శించుకోవాలని ఉంది కదా. ఈరోజుల్లో మరి తపస్సు కుదరదాయే. సలభమార్గం ఏముందో చూద్దాం.


భాగవతంలోని  పురంధరుడి కధ నించి గ్రహించింది ఎంటంటే వైకుంఠనాథుడైన ఆ శ్రీమన్నారాయణుని నామాన్ని పిల్లలకో లేక ఇంకెవరికో పెట్టి పిల్చినా..పలికినా, లేక ఎవరినైనా వెక్కిరించడానికి పలికినా, ఏదో ఊత పదంగా పలికినా, అది వారి సమస్త పాపాల్ని నశింప చేస్తుంది. ఇంతటి మహత్తరమైన ఆ నారాయణ నామాన్ని స్మరింపక, కీర్తింపక ఎంత నష్టపోతున్నాము. పరమాత్మకి గానమంటే ప్రాణమట. ఆ శ్రీహరి నామం ఎలా తలచినా ఇంత   ఫలితం ఇస్తుందంటే స
ఆయనకు ప్రాణమైన గానాన్నే మనం చేస్తే ఇంకెంత ఫలితమో తెలుసుకోవాలి. అది కోరికలు తీర్చటం కాదు.... స్వయంగా పరమాత్మనే మన దగ్గరకు రప్పిస్తుందట. ఆ మాట ఆ పరమాత్మే స్వయంగా నారదునితో చెప్పాడు.


నాహం నాసామి వైకుంఠే యోగినాం హృదయేనచ l
మద్భక్తా యత్రగాయన్నిత తత్ర తిష్టామి నారదా ll

నారదా ! నేను ఎక్కడ ఉంటానో తెలుసునా ? అంతా నేను వైకుంఠములో ఉంటాను అకుంటున్నారు... కానీ నేను వైకుంఠములో లేను, ఉండను.... కొంతమంది నేను తపశ్శక్తి సంపన్నులైన యోగుల హృదయాలలో కనబడుతూ ఉంటానని అనుకుంటుంటారు. అక్కడా నేను కనబడను. ఎక్కడైతే నా నామస్మరణ చేస్తూ, నా భక్తులు గానం చేస్తుంటారో, నేను అక్కడే ఉంటాను...అని.


అందుకే నారదుల వారు ఆ నారాయణ నామస్మరణ గానాన్ని వీడకుండా గానం చేస్తుంటాడు. దానికి మహతి తోడు. ఈ హరినామ గానం చేస్తే ఆయన ప్రసన్నుడై, ముక్తిని ప్రసాదిస్తాడు.


హరేర్నామ హరేర్నామ హరేర్నామ కేవలం l
కలే నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యధా ll

ఈ కలియుగంలో సులభంగా మోక్షాన్ని పొందాలి అంటే ఈ హరినామ సంకీర్తన కంటే సులభమైన మరోమార్గం లేనేలేదు.


ఈరోజునుంచే భగవన్నామ సంకీర్తనం ప్రారంభిద్దాం. ప్రస్తుతం ఉన్న విపత్కర రోజుల్లో మనం రేపే ప్రయాణం అవ్వవలసి వస్తుందేమో. అప్పుడు మోక్షాన్ని పొందలేక మళ్ళీ జన్మమెత్తవలసి వస్తుంది. అందుకని ఈ క్షణమే స్మరిద్దాం.

🕉🌞🌎🌙🌟🚩
08-22-గీతా మకరందము
అక్షరపరబ్రహ్మయోగము
🕉🌞🌏🌙🌟🚩

అ|| ఇక నట్టి పరమాత్మను బొందుట కుపాయమును తెలియజేయుచున్నారు-

పురుషః స పరః పార్థ
భక్త్యా లభ్యస్త్వనన్యయా |
యస్యాన్తఃస్థాని భూతాని
యేన సర్వమిదం తతమ్ ||

తా:- ఓ అర్జునా ! ఎవనియం దీ ప్రాణికోట్లన్నియు నివసించుచున్నవో, ఎవనిచే ఈ సమస్త జగత్తున్ను వ్యాపింపబడియున్నదో, అట్టి పరమపురుషుడు (పరమాత్మ) అనన్యమగు (అచంచలమగు) భక్తిచేతనే పొందగలడు.

వ్యాఖ్య:- పరమాత్మ యొక్క స్వరూపము, వారిని పొందుమార్గము అనగా సాధ్యవస్తువు, సాధనము - రెండును ఈశ్లోకమున తెలుపబడినవి. అనేక ప్రాణికోట్లతో నిండి నిబిడీకృతమై ఈ జగత్తంతయు ఎచటనున్నది? దాని కాధారమేమి? పరమాత్మయను ఆధారముపై, అధిష్ఠానముపై ఈ చరాచరప్రపంచమంతయు రజ్జువునందు సర్పమువలె కల్పింపబడియున్నది. ఆరోపితవస్తువుయొక్క స్థానము, నివాసము అధిష్ఠానవస్తువే యనుట సుప్రసిద్ధము. కావున జగత్తంతయు సద్వస్తువగు పరమాత్మలోపల అధ్యస్తమై వెలయుచున్నది.


 స్వప్నలోకమంతయు మేలుకొనినవానియందే వర్తించునట్లు ఈ సమస్త   స్థావరజంగమప్రాణికోటియుక్తమగు ప్రపంచమంతయు ఆత్మయందే కలదు. కావున ఆత్మచేతనే అది పరివ్యాప్తమైయున్నది. వెన్న ఏ ప్రకారము పాలయందంతట వ్యాపించియున్నదో, ఆ ప్రకారమే పరమాత్మ జగత్తునందంతటను వ్యాపించియున్నారు. (యేన సర్వమిదం తతమ్).


   అట్టి సర్వవ్యాపకపరమాత్మ జీవులకు ఏ ఉపాయముచే లభ్యము కాగలరు? అను ప్రశ్నకిచట సూటియైన సమాధానమొసంగబడినది. ‘భక్త్యా లభ్యస్త్వనన్యయా’ - అనన్యభక్తిచేతనే యాతడు పొందబడగలడని వచింపబడినది. ‘అనన్యభక్తి’ అని పేర్కొనుటవలన మోక్షప్రాప్తికి స్వల్పభక్తి చాలదనియు, తీవ్రతరభక్తి అవసరమనియు స్పష్టమగుచున్నది. అన్యముకానిది ‘అనన్యము’ - అనగా భగవంతునిమీద తప్ప ఇతరమగు ఏ పదార్థమందును ఆసక్తిలేకుండుటయని భావము. నశ్వరములగు ప్రాపంచిక విషయములపైని కొంత ప్రీతి, భగవంతునిపై కొంత ప్రీతి అనన్యప్రేమ, అనన్య భక్తి కానేరదు.  భక్తిమార్గము సులభతరమైనది. కావున దాదాపు ప్రతి అధ్యాయము యొక్క చివరను దానిని పేర్కొనుచున్నారు. ఏ యోగమును బోధించినను దాని చివర భక్తిని ఉటంకించుచున్నారు. ఏలయనిన అది సులభమైనది యగుటయేకాక, అన్ని యోగములందును అద్దాని సమ్మేళనము ఆవశ్యకమైయున్నది.


    ఈ ప్రకారముగ అనన్యభక్తిచే ఆ పరమపురుషుడు (పరమాత్మ) తప్పక పొందబడగలడని భగవాను డిచట స్పష్టముగ తెలియజేసినందువలన, ఇవ్విషయమున జనులే మాత్రము సందేహింపక, అట్టిసాధనను వెనువెంటనే ఆచరించి, మోక్షసామ్రాజ్యాభిషిక్తులు కావలయును. దేవుని పొందుటకు మార్గమేమి? అని అనేకులు ప్రశ్నించుచుందురు.


    అట్టివారీశ్లోకమును బాగుగగ్రహించి, అనన్యభక్తియే అందులకు మార్గమని విశ్వసించి అట్టి పరాభక్తిని ప్రయత్నపూర్వకముగ సాధించివేయవలెను.


     ఇచట భగవానుని ‘పరమపురుషుడ’ని వర్ణించిరి. తక్కినవారందఱు సామాన్యపురుషులు. ఆతడొక్కడే పరమపురుషుడు. పురుషుడు (జీవుడు) భక్త్యాది సాధన లాశ్రయించి పరమాత్మయం దైక్యమై పరమపురుషుడుగ మారవలెను. అదియే జీవితలక్ష్యమని ప్రతివారును గుర్తుంచుకొనవలెను.


ప్ర:- ఈ సమస్త జగత్తు ఎవనియందు స్థితిగలిగియున్నది?ఎవనిచే వ్యాప్తమైయున్నది?
ఉ:-  పరమాత్మయందు స్థితిగల్గియున్నది. ఆతనిచేతనే వ్యాప్తమైయున్నది.


ప్ర:- ఆ పరమాత్మ యెట్లు పొందబడగలడు?
ఉ:-  అనన్యభక్తిచే.

🕉🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి