ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక 6-06-2022
సేకరణ, రచయిత :మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ చిన్న కధలు (1)
*దాంపత్య జీవితము మనసులో ఉదయించే* *మధురమైన ఊహ ప్రేమ. దాన్ని వికసింపజేసి, ఆ ఆనంద పరిమళాన్ని పరివ్యాప్తం చేసేదే పరిణయం. ప్రేమించి పెళ్లాడినా, పెళ్లాడి ప్రేమించినా రెండు మనసులూ కలిశాక,* *ఏడడుగులూ నడిచాక,చిరకాల అనుబంధానికి నాంది పలికేదే భారతీయ దాంపత్య వ్యవస్థ.*
*పెళ్లంటే, మనసులు కలిసిన ఇద్దరు జీవించడం మాత్రమే కాదు. రెండు కుటుంబాలు, రెండు విభిన్న వాతావరణాలు, రెండు భిన్నాభిప్రాయాలు, రెండు వేర్వేరు అభిరుచులు సమన్వయంతో సుదీర్ఘ సుఖమయ జీవనయానం కొనసాగించడమే పెళ్లి. భార్యాభర్తల బంధం ఎంత శాశ్వతమైందో, అంత సున్నితమైంది.*
*ఆ అనుబంధానికి ఎన్ని అవరోధాలు కలిగినా ఎంతో ఓర్పుగా, నేర్పుగా అధిగమించడమే దాంపత్య ధర్మంలోని ప్రధాన సూత్రం. పరస్పర విశ్వాసం, అవగాహన, భావాల వ్యక్తీకరణతో పాటు ఒకరి అభిప్రాయాల్ని మరొకరు మన్నించడం వల్ల దాంపత్య బంధం బలపడుతుంది. అనుకూలవతి అయిన భార్య లభించడం భర్తకు మహా వరం. విశ్వసనీయుడైన భర్త దొరకడం భార్య సుకృతం. శ్రీలక్ష్మి కోసం శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠం వదిలి, ఆమె పుట్టినిల్లయిన సముద్రంలోనే పడక ఏర్పాటు చేసుకున్నాడు. సీతాదేవి కోసం సముద్రాన్నే బంధించిన శ్రీరాముడు అక్కడ వారధి కట్టి, దానిమీదుగా లంకకు వెళ్లి, రావణుణ్ని సంహరించాడు.*
*ఇటువంటి అనేక వర్ణనలు పరాశర భట్టరు రాసిన _శ్రీగుణరత్న కోశం_ లో చోటుచేసుకున్నాయి.*
*"సూర్యుడి నుంచి కాంతిని వేరు చేయలేనట్లే, నా నుంచి సీతను ఎవరూ వేరు చేయలేరు" అని ఒక సందర్భంలో రాముడు అంటాడు.*
*దంపతులు ఏకోన్ముఖంగా ఉంటే, తోడూనీడగా మనుగడ సాగిస్తే, ఆ దాంపత్యం ఆదర్శవంతమవుతుంది. ఆ కుటుంబం సంతోష సుమ కదంబంగా విలసిల్లుతుంది. వేదవిహితమైన సమస్త కర్మల్ని దంపతులు కలిసి చేయాలి. పూజలు, వ్రతాలు కలిసే ఆచరించాలి. అదే దాంపత్య ధర్మం.*
*గృహంలో ఒకరి వల్ల మరొకరు శాంతిగా, ప్రసన్నంగా ఉండాలి. ఒకరికొకరు సలహాలు ఇచ్చిపుచ్చుకోవాలి.*
*అటువంటి గృహంలోనే సంతోష సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని మనుస్మృతి చెబుతుంది. ఇంటికి వచ్చే అతిథుల్ని సాదరంగా ఆహ్వానించాలంటుంది అధర్వ వేదం.
*దంపతుల్లో దైవభక్తి, ధర్మకార్యాలపై శ్రద్ధ సంపూర్ణంగా నెలకొనాలి.* *ఆటుపోట్లను తట్టుకొనే ఆత్మస్థైర్యం ఉభయులకూ కావాలి. ఏది మాట్లాడినా, ఏ పని చేసినా అది తమ పిల్లలమీద ప్రభావం చూపుతుందని వారు సదా గుర్తుంచుకోవాలి*
*అన్ని విద్యలకూ నిలయం గృహనీతి. అది మంచి ప్రవర్తన నేర్పే గురువు, వంశాభివృద్ధికి మూలం, సద్గతికి వూతం, కీర్తిప్రతిష్ఠలకు కారణమని మహాభారతం బోధిస్తుంది. ఆశ్రమ ధర్మాలు ఎన్ని ఉన్నా, గృహస్థాశ్రమమే అన్నింటి కంటే ఉత్తమం.*
*దానికి ఏ ఇతర ఆశ్రమాలూ సాటి రావని _శాంతిపర్వం_ చాటుతుంది. వసిష్ఠుడు, అత్రి మహర్షి ఉత్తమ గృహస్థులుగా రాణించారు.*
*రామకృష్ణ పరమహంస భక్తిసాధనను భార్య శారదాదేవి ప్రోత్సహించింది.*
*జనకుడు గృహస్థ ధర్మం నిర్వర్తిస్తూనే, మోక్షగామి కాగలిగాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆదర్శవంతుడైన గృహస్థుడు.*
*దేవతలు అమృతాన్ని రక్షించుకున్నట్లు కుటుంబ మర్యాద అనే నిధిని గృహ యజమాని, యజమానురాలు పదిలపరచుకోవాలి.*
*మంకుతనానికి, మొండి పట్టుదలకు తావివ్వకూడదు.*
*సంకల్పాలను పరస్పరం గౌరవించుకోవడమే గొప్ప సంస్కారం*.
*గృహిణి ఆనందంగా ఉన్నంతకాలమే ఆ కుటుంబ జీవనం ప్రశాంతంగా గడుస్తుంది. దంపతుల ప్రేమానురాగాల పందిరి కుటుంబసభ్యులందరికీ చల్లని నీడనిస్తుంది అని బృహదారణ్యకోపనిషత్తు హితవు పలుకుతుంది.*
దాంపత్య ధర్మంపైనే జాతి ప్రగతి ఆధారపడి ఉంది.
శా::దాంపత్యం వినయమ్ము కీర్తి సమయం ధాతృత్వ ఉత్కృష్టమై
దాంపత్యం ధరణీ తలమ్ము న సుఖా దాశ్యమ్ము ప్రేమమ్ముగా
దాంపత్యం హృదయమ్ము పంచ కలిగే దానమ్ము నిస్వార్థమే
దాంపత్యం వచయి0చ నొప్పితిని లే దారోగ్య ధర్మ0బుయే
--((**))--
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక (7-06-2022)
సేకరణ, రచయిత :మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ కధలు (2)
*ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి?
అని ప్రశ్నిస్తే ధర్మోరక్షతి రక్షితః అని సమాధానం.
ధర్మం వల్ల ఏం లభిస్తుందో? అనే ఫలాపేక్షతో ఉండడం కన్నా ధర్మాచరణయే ఫలంగా భావించడం ఉత్తముల మార్గం.
ధర్మం ఆచరిస్తున్నప్పుడు లభించే తృప్తిని అత్యుత్తమ ఫలంగా భావించే వాడు అసలైన ధార్మికుడు.
"" త న ధ ర్మ ము న కు భం గం
బొ న రఁ గ నె వ్వం డు ధ ర్మ మెం డొ క దా నిన్
గొ నఁ ద గు భా ర తీ య
ప్ర ణ యం బే మనకు బ ర మ పా వ న ము సు డీ ""
మనిషి సాధించవలసిన ప్రయోజనాలు నాలుగు అని విభజించారు భారతీయ మహర్షులు. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఇందులో ‘అర్థకామాల’ గురించి వివరించనవసరం లేదు. ఈ రెండు ప్రయోజనాల చుట్టూ మాత్రమే తిరుగుతుంటాం మనం. కానీ వాటికన్నా ముందు ధర్మాన్ని సంపాదించుకోవాలి. ధర్మం అనే ప్రాతిపదిక మీదనే అర్థకామ సంపాదన సాగాలి. అర్థ కామ సంపాదన మాత్రమే ధ్యేయంగా సాగితే వ్యక్తికీ, సమాజానికీ కూడా హాని. అందుకే ధర్మం అనే హద్దులో అర్థ కామ సంపాదన జరగాలి అని శాసించారు. ఇది శాశ్వత ప్రయోజనాన్ని ఉద్దేశించి నిర్దేశించింది. ధర్మరహితంగా అర్థ కామ సంపాదన చేస్తే పతనమై తీరతారని చెప్పడానికే రామాయణ భారతాలు ఆవిర్భవించాయి. ధర్మపరుడై బ్రతికే వానికి ఎన్నో సవాళ్లు ఎదురౌతాయి. ఏ కాలంలోనైనా ఇది తప్పదు. ప్రస్తుత కాలంలో మరీనూ. ఆ సమయంలో ఎటువంటి నిబ్బరాన్ని పాటించాలో మన ప్రాచీన ధార్మిక గ్రంథాలను పరిశీలించి తెలుసుకోవచ్చు.
శ్రీరామచంద్రుడు అరణ్యాలకు వెళ్ళే ముందు కైకతో అన్నమాటలు:
“నాహమర్థపరే లోకే విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితమ్ – నేను అర్థపరుణ్ణి కాను, కేవలం ధర్మమూ నందే నిష్ఠ కలిగిన వాడను” ధర్మంతో అర్థ కామాలను సంపాదిస్తాను అనే ధోరణి మంచిదే. అంతకన్నా ఉత్కృష్టం అర్థ కామాలకన్నా ధర్మ సంపాదనమే గొప్పదని భావించడం. ఆ ధర్మపరత్వంలో అర్థ కామాలకు హాని కలిగినా చలించరు. అటువంటి వారినే మహాత్ములని అంటాం.
మహాభారతంలో ధర్మరాజును గమనిస్తే ఆశ్చర్య చకితులవుతాం.
అరణ్య వాస సమయంలో భార్యతో, తమ్ములతో సహా దుర్గమారణ్యాలలో సంచరిస్తున్న ఆ చక్రవర్తిని ఒకరోజు భార్య ద్రౌపది ఇలా అడుగుతుంది.
“మీరెప్పుడూ ‘ధర్మం, ధర్మం’ అంటూ ఉంటారు. ఆ ధర్మం మీకేమిచ్చింది? అధర్మపడురైన వాడు రారాజై భోగాలనుభవిస్తున్నాడు. ధర్మపరులైన మీరు సపరివారంగా కానల పాలయ్యారు. ధర్మాన్ని ఆచరించి ప్రయోజనం ఏమిటి?” ఆమె అడిగిన ప్రశ్నకు సంయమనంతో సమాధానమిచ్చాడు యుధిష్ఠిరుడు.
నాహం ధర్మఫలాకాంక్షీ రాజపుత్రి! చరామ్యుత! ధర్మ ఏవ మనః కృష్ణే!
స్వభావాచ్చైవమే ధృతమ్! ధర్మ వాణిజ్యకో హీనో జఘన్యో ధర్మవాదినామ్!!
ధర్మరాజు వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని పట్టి చూపించే మాటలివి. ధర్మాచరణ నా స్వభావం. ధర్మం వల్ల ఏదో వస్తుందని, ఏదో రావాలని నేను ధర్మాచరణను అనుసరించలేదు. ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడు” అంటే ధర్మం వల్ల ఏదో వస్తుందనే లాభాపేక్ష ఉన్నవాణ్ణి పురుషాధముడని పేర్కొన్నాడు ధర్మరాజు.
‘ధర్మాన్ని ఆచరించడం నా స్వభావం’ అనగలిగాడంటే ఆయనలో ఎంతటి ధర్మనిష్ఠ ఉందో అర్థం చేసుకోవాలి. అయితే తాము ఫలాన్ని ఆశించకుండా ధర్మాన్ని అనుష్ఠించినా, ధర్మం ఊరుకోదు. తప్పకుండా రక్షిస్తుంది. ఆత్మ ఔన్నత్యాన్ని కాపాడటమే అసలైన సిద్ధి. ఆ సిద్ధికోసమే ధర్మపరుడు స్థిరంగా ఉంటాడు. ఆ సిద్ధిలోనే తృప్తిని సాధిస్తాడు. ధర్మాన్ని స్వభావంగా చేసుకున్న వారే ఆదర్శప్రాయులు. ఫలాపేక్ష లేని ధర్మంలోనే పరిపూర్ణత ఉంటుంది. ఇదే లక్షణం అచ్చమైన భక్తియోగంలోనూ సాక్షాత్కరిస్తుంది. అలా ధర్మనిష్టుడైన వాని పక్షాన దైవం శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
అందుకే భగవానుడు పాండవ పక్షపాతి అయ్యాడు. అంటే ధర్మపక్షపాతి. భౌతికంగా ధర్మానికి పెద్ద బలగం ఉండకపోవచ్చు గానీ బలం ఉంటుంది. ఆ బలం ఆత్మబలం, దైవబలం, అది ఎటువంటి దౌర్బల్యాన్నైనా జయించగలదు. రావణుడైనా, దుర్యోధనుడైనా భౌతికబలంలో సమృద్ధి కలవారే. కేవలం వానరులతో వచ్చిన రామలక్ష్మణులు లంకా సామ్రాజ్యాధినేత, సర్వబల సంపన్నుడైన రావణుని జయించారు. అయిదుగురు పాండవులు ఏడు అక్షౌహిణులతో, పదకొండు అక్షౌహిణుల బలం ఉన్న వందమంది కౌరవులను జయించారు.
ధర్మానికి లభించే జయం, ప్రాప్తించే ఫలం శాశ్వతం, సుస్థిరం.
“యతో ధర్మస్తతోజయః’ ఇది శాశ్వత సత్యం. దీనిని నమ్మే సమాజం, దీనికే బద్ధమైన పాలన తప్పకుండా నిజమైన క్షేమాన్ని ప్రసాదిస్తుంది.
--((**))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి