11, డిసెంబర్ 2018, మంగళవారం



దక్ష మహాదేవ్ కోవెల.....హరిద్వార్... (10) 

మన పురాణాలు చెప్పినదాని ప్రకారం మన దేశంలో మోక్షాన్ని ఇచ్చే ఏడు అతిపవిత్ర నగరాలు ఉన్నాయి.అవి అయోధ్య,మధుర,మాయా,కంచి,కాశి,అవంతిక,ద్వారమతి. వీటిలో మాయా అనే నగరమే ఇప్పటి హరిద్వార్.హరిద్వార్ కి గంగా ద్వార్ అని మరో పేరుకూడాఉంది.హిమాలయాల్లో కైలాస పర్వత పాదం వద్ద పుట్టి గంగోత్రి వద్ద మనకి దర్శనం ఇచ్చే గంగ మాత మొట్టమొదట ఈ హరిద్వార్ లోనే భూమిమీద అడుగుపెడుతుంది. 

హరిద్వార్ ఒక పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం. ఇది ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది. హిందువుల పుణ్యక్షేత్రం. ద్వారం అంటే లోపలకు ప్రవేశించే దారి. హరి అంటే విష్ణువు హరిద్వార్ అంటే హరిని చేరే దారి. .ఇది ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం. హరిద్వార్ అమృతం చిందిన నాలుగు క్షేత్రాలలో ఒకటి. మిగిలిన మూడు అలహాబాద్ లోని ప్రయాగ, ఉజ్జయిని మరియు గోదావరి జన్మ స్థలమైన నాసిక్. సాగరమథనం తరువాత గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకొని వచ్చే సమయంలో అమృతం నాలుగు ప్రదేశాలలో చిందినట్లు పురాణ కథనం. ప్రస్తుతం ఇవి పుణ్యక్షేత్రాలుగా మారాయి. 12 సంవత్సరాల కాలానికి ఒక సారి ఈ క్షేత్రాలలో కుంభమేళా జరుగుతుంది. 3 సంవత్సరముల వ్యవధిలో ఒక్కొక్క క్షేత్రంలో కుంభమేళా జరపడం ఆనవాయితీ. ప్రయాగలో జరిగే మహాకుంభమేళాకు భక్తులు, యాత్రీకులు ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడ కూడి వేడుక జరపడం ఆనవాయితీ. ఈ సమయంలో భక్తులు గంగా తీరంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు. కుంభమేళా సందర్భంగా హరిద్వార్‌ సమీపంలోని జ్వాలాపూర్‌ లో జరిగే భారీ ఊరేగింపులో పాల్గొనేందుకు విచ్చేసిన హిందూ మత నాయకులూ, సాధు, సంత్‌లకు సంప్రదాయం ప్రకారం అంజుమన్‌ కామ్‌ గంధన్‌ పంచాయత్‌ కు చెందిన ముస్లిం పెద్దలు సాదర స్వాగతం పలుకుతారు. హిందూ స్వాములకు ముస్లిం పెద్దలు భక్తి పూర్వకంగా దక్షిణలు సమర్పించి వారి ఆశీస్సులు పొందుతారు. అందుకు ప్రతిగా హిందూ స్వాములు ముస్లిం పెద్దలను ఆలింగనం చేసుకుని వారిని ఆశీర్వదిస్తారు. ముస్లింలకు ప్రసాదాలు అందజేస్తారు. కుంభమేళాలో పెష్వాయ్‌ సందర్భంగా హిందూ మత నాయకులను ఇలా సత్కరించడం,అలాగే,ముస్లింల ఉత్సవాలకూ,పండుగలకూ ఇక్కడి హిందూ నాయకులు శుబాకాంక్షలు తెలపడం, సత్కరించడం సంప్రదాయంగా వస్తోంది.తరతరాలుగా ఈ ప్రాంతంలో మత సామరస్యం వెల్లివిరుస్తోంది. 
హరి ద్వార్ లో ఒక స్నాన ఘట్టం 
హరిద్వార్ ప్రకృతి ఆరాధకుల స్వర్గసీమ. హరిద్వార్ భారతీయ సంత్రదాయానికి, నాగరికతకు ప్రతి బింబం. పురాణాలలో ఇది కపిస్థాన్ గానూ, మాయాపురి మరియు గంగాపురిగా వర్ణించబడింది. ఉత్తరఖాండ్‌లో ఉన్న ఈ నగరం చార్ ధామ్ అని పిలవబడే గంగోత్రి, యమునోత్రి, కేదారినాథ్ మరియు బదరీనాథ్ లకు ప్రవేశ ద్వారం. శైవులు దీనిని హరద్వార్ గానూ వైష్ణవులు దీనిని హరిద్వార్ గానూ పిలుస్తుంటారు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు అని అర్ధం. క్రీ.పూ 1700 నుండి 1300 మధ్య జీవించిన ప్రజలు టెర్రాకోట్టా (బంకమన్ను తో తయారుచేసిన వస్తువులను భట్టీలలో కాల్చి ఉపయోగించే) సంస్కృతి (అనగా, సిరామిక్ వస్తువులను ఉపయోగించేవారు) కలిగివున్నారని పూరాతత్వ పరిశోధనలు ఋజువుచేస్తున్నాయి. క్రీ.శ 629లో భారత దేశంలో పర్యటించిన చైనా హ్యూయన్ త్సాంగ్ రచనల్లో దీని వర్ణన ఉండటం వ్రాత పూర్వకంగా మొదటి సాక్ష్యంగా గుర్తించ బడినది. 16వ శతాబ్దంలో అక్బర్ పరిపాలనలో అబుల్ ఫజల్ చే వ్రాయబడిన ఆయిన-ఎ-అక్బరీ గ్రంథంలో హరిద్వార్ మాయాపురిగా సూచింపబడింది. జహంగీర్ చక్రవర్తి (1596-1627)పరిపాలనా కాలంలో ఈ ప్రదేశాన్ని సందర్శించిన ఆంగ్లేయ యాత్రికుడు థోమస్ కోర్యాట్ హరిద్వార్‌ని 'హరద్వారా' శివుని రాజధానిగా సూచించాడు. కపిల ముని ఇక్కడ ఆశ్రమం నిర్మించుకుని నివసించడం వలన ఇది కపిస్థాన్ గా కూడా పిలువబడినట్లు పురాణ కథనం. సత్య యుగంలో శ్రీ రామచంద్రుని పూర్వీకుడూ సూర్య వంశరాజు అయిన సరుని కుమారులలో ఒకడైన భగీరథుడు కపిల ముని శాపగ్రస్తులైన తన పితృదేవతలకు 60,000 మందికి ముక్తిని ప్రసాదించగోరి స్వర్గంనుండి గంగా దేవిని ఇక్కడకు రప్పించినట్లు హిందూ పురాణాల వర్ణన. ఈ కారణంగా హిందువులు మరణించిన తమ పితరుల ముక్తి కోసం వారి చితాభస్మం ఇక్కడకు తీసుకు వచ్చి గంగానదిలో కలపడం ఆనవాయితీ. విష్ణుమూర్తి తన పాదముద్రలను ఇక్కడ హరి కి పురి లో వదిలి వెళుతున్నానని చెప్పినట్లు పురాణ కథనం. సదా ఈ పాదముద్రలు గంగానదిచే తడపబడటం విశేషం. 1399 జనవరి 13 న టర్కీ రాజు 'తిమూర్‌ లాంగ్'(1336-1405) దండయాత్రలో హరిద్వార్ తిమూర్ లాంగ్ వశమైంది. సిక్కు గురువు 'గురునానక్'(14469-1539)హరిద్వార్ లోని 'కుష్వన్ ఘాట్' లో స్నానం చేసిన సందర్భం వార మతగ్రంథాలైన 'జన్మసఖి'లో చోటుచేసుకుంది. హరిద్వార్ పురాతన సంస్కృతికి, సంప్రదాయాలతో సుసంపన్న మైన ఆధ్యాత్మిక నగరం. ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన హరిద్వార్‌లో ఇప్పటికీ చాలా హవేలీలు,మఠాలు పురాతన చిత్రాలు,శిల్ప సంపదతో విలసిల్లుతున్నాయి. హరిద్వార్ పురాణ కాలంనుండి ప్రస్తుత కాలం వరకు తన పుతారన్త్వాన్ని,ఆధ్యాత్మిక వైభవాన్ని నిలుపుకుంటూ అభివృద్ధి పధంలో పయనిస్తున్న భారతీయ నగరాలలో ఒకటి.హరిద్వార్ బౌద్దుల కాలందాటి,ఆగ్లేయుల పరిపాలన చవిచూసి ప్రస్తుత ఆధునిక కాలంలో కూడా భక్తులను ఆధ్యాత్మికంగా ఆకర్షిస్తూ కొనసాగుతున్న ప్రముఖ హిందూ పుణ్య క్షేత్రాలలో ఒకటి. 
ఇక్కడ చూడవలసిన ఇతర ప్రదేశాలు 
కేబుల్ కారు 
మహారాజు విక్రమాదిత్యుడు తన సోదరుడు భర్తృహరి మరణానంతరం అతని జ్ఞాపకార్ధంగా గంగా నది తీరంలో స్నానఘట్టం కట్టించాడని ప్రతీతి. భర్తృహరి ఈ ప్రదేశంలో పవిత్ర గంగానది తీరాన తపసు చేసి ఇక్కడే తనువు చాలించిన కారణంగా అతని పేరుతో ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. తరవాతి కాలంలో 'హరి కా పురి'గా నామాంతరం చెందిది.ఈ పవిత్ర స్నాన ఘట్టం బ్రహ్మ కుండ్‌గా కూడా పిలుస్తారు.సాయంకాల సమయంలో గంగాదేవి హారతి ఇచ్చే ఆచారం ఉంది.తరవాత భక్తులు పితృదేవతా ప్రీత్యర్ధం నదీ జలాలలో తేలిపోయే దీపాలను వదులుతుంటారు ఈ దృశ్యం మనోహరంగా ఉండి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. చండీ దేవి ఆలయం. చండీ దేవి ఆలయం కాశ్మీర్ రాజు సుచత్ సింగ్ చే1929లో గంగానది అవతలి తీరంలో నీల పర్వత శిఖరం పైన నిర్మించబడింది. ఇది చండీ ఘాట్‌కు 3 కిలో మీటర్ల దూరంలో నీల్ పర్వత శిఖరంపైన ఉంది. రాక్షసరాజులైన సుంభ-నిశుంభుల సైన్యాధిపతి చండ-ముండ ఈ ప్రదేశంలో చంఢీ దేవిచే సంహరించ బడినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆ కారణంగా ఆ ప్రదేశం చంఢీ ఘాట్ పిలువబడుతుంది. ఈ దేవిని ఆదిశంకరాచార్యులు కీ.పూ 8 వ శతాబ్ధంలో ప్రతిష్టించినట్లు పురాణ కథనం. ఈ దేవాలయాన్ని ఉదయం 8.30 నుండి సాయంత్రం 6 గంటలవరకు కాలిబాటన లేక రోప్ వే ద్వారా చేరవచ్చు. మశాదేవి ఆలయం. మంశాదేవి కోవెల బిల్వ ప్రర్వత శిఖరంపైన ఉంది. మంశాదేవి అంటే మనసులోని కోరికలను తీర్చేదేవి అని అర్ధం. ఇది భక్తుల ఆకర్షణీయ కోవెలలలో ఒకటి. ఈ కోవెలను చూడటానికి కేబులు కారులో ప్రయాణం చేయడం ద్వారా ఊరంతటినీ చూడటం భక్తులకు ఆనందమైన అనుభవం.ఈ కోవెలలో రెండు ప్రధాన ఆలయంలో 5 చేతులు మూడు ముఖాలు కలిగిన విగ్రహం ఒకటి, 8 చేతులు కలిగిన విగ్రహం ఒకటి మొత్తం రెండు విగ్రహాలు ఉన్నాయి 11వ శతాబ్దంలో నిర్మించినట్లు అంచనా. ఇది ఆదిశక్తి ఆలయం. ఇది సిద్ధ పీఠాలలో ఒకటి. ఈ ప్రదేశంలోసతీదేవి హృదయం నాభి పడినట్లు పురాణ కథనం. హరిద్వార్ లో భైరవ ఆలయం నారాయణీ శిలా ఆలయం తో ఇది కూడా పురాతన ఆలయాలలో ఒకటి. దక్షమహాదేవ్ కోవెల 
హరిద్వార్‌కి దక్షిణంలో ఉన్న కంకాళ్ అనే ఊరిలో సతీదేవి తండ్రి అయిన దక్షుడి ఆలయం ఉంది. పురాణాల ఆధారంగా సతీ దేవి తండ్రి దక్షుడు తలపెట్టిన యాగానికి త్రిమూర్తులలో ఒకడు తన అల్లుడూ అయిన మహాశివునికి ఆహ్వానం పంపలేదు. సటీదేవి పుట్టింటి మీద మమకారాన్ని వదులుకోలేక తన తండ్రిని భర్త అయిన శివుని ఎందుకు పిలవలేదని అడగటానికి పిలవక పోయినా యగ్జానికి వెళుతుంది. అఖ్ఖడ తన భర్త అయిన శివుని ను పిలవకుండా యాగం చేయడం అపరాధమని తన తండ్రిని హెచ్చరిస్తుంది. దురహంకార పూరితుడైన దక్షుడు తన కుమార్తెను అవమానించి అల్లుడైన శివుని దూషిస్తాడు. అది భరించలేని సతీదేవి అదే యజ్ఞకుండంలో దూకి ప్రాణ . సతీదేవి ప్రాణత్యాగం తెలుసుకున్న శివుడు తన ఆగ్రహంతో వీరభద్రుని సృష్టించి దక్షుణ్ణి సంహరించమని పంపిస్తాడు. వీరభద్రుని చేతిలో మరణించిన దక్షుణ్ణి దేవతలు, దక్షిని భార్య కోరిక పై తిరిగి దక్షుని శరీరానికి మేక తలను అతికించి బ్రతికిస్తాడు. ఈ పురాణ సన్నివేశానికి గుర్తుగా ఇక్కడ దక్ష మహాదేవ్ కోవెల నిర్మించారు.

--((**))--

రావివలస.........శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామి (9)

శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలం రావివలసలోని ఎండ మల్లికార్జునస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని ప్రదేశాలలో శివుడికి ఆలయాలు ఉన్నాయి. కానీ, ఎండ మల్లి కార్జునస్వామికి ప్రత్యేకించి ఆలయం లేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆ స్వామి నేటికీ కొండ మీద ఆరుబయటే కొలువై ఉన్నాడు. అంతేకాకుండా కొండమీద కొలువైన శివలింగం అతి పెద్దది. ఇంట పెద్ద శివలింగం దేశంలోని ఏ ఆలయంలోనూ లేదు. పురాతన కాలం నుంచే ఇది ప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరు పొందింది. కార్తీక మాసం లోనూ అశ్వర్ధ వృక్షం క్రింద గడిపేందుకు, శివరాత్రి పర్వదినాన వేలసంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తారు. మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని లింగోద్భావాన్ని నిర్వహిస్తారు. మహాశివరాత్రి, కార్తీక సోమవారం నాడు ఈక్షేత్రంలో అభిషేక, ఉపవాస, జాగరణలు ఎవరు చేస్తారో వారి మనోవాంఛలు సిద్ధిస్తాయని, ఈ దేవుని దర్శించిన వారికి దీర్ఘరోగాలు ముఖ్యంగా చర్మరోగాలు పోయి పూర్తిగా ఆరోగ్యవంతులవుతారని భక్తుల ప్రగాడనమ్మకం. 

క్షేత్ర ప్రశస్తి 
శ్రీరాముడు రావణ సంహార అనంతరం తిరిగి అయోధ్యకు వెళుతూ మార్గమధ్యంలో కల మహారణ్య ప్రాంతములో కల సుమంచ పర్వతగిరి శిఖరంపై తన అనుచరగణంతో విడిది చేసాడు. అనుచరగణంలో ఉన్న సుశేణుడు అనే దేవ వైద్యుడు ఆ పర్వత ప్రాంతములో కల ఔషద, మూలికా వృక్షజాతులను చూసి ఆనంద పరవశుడయ్యాడు. కాని చుట్టూ ఔషదాలున్నా అక్కడి జనులంతా రోగ గ్రస్తులై ఉండటం అతనిని ఆశ్చర్యపరచింది. ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య ఈతిబాధల నివారణార్ధం తను ఏదైనా చేయలని తలంచాడు. బొందితో కైలాసం చేరుకోవాలనే తన పూర్వవాంఛితము నెరవేర్చుకోవడానికి కూడా ఇదేమంచి ప్రదేశంగా అతనికి అనిపించింది. శ్రీరామునికి తన నిర్ణయాన్ని తెలియపరచి తను ఈ సుమంచ పర్వత ప్రాంతంలోనే తపమాచరించాలనుకొంటున్నట్లుగా చెప్పాడు. శ్రీరాముడు అతని వాంఛితం నెరవేరాలని ఆశీర్వదించి తన పరివార, అనుచరులతో తరలి వెళ్ళి పోయాడు. తరువాత సుశేణుడు సుమంచ పర్వతంపై శివుని గురించి ఘోర తపస్సు చేయనారంబించాడు. కొంతకాలం తరువాత సుశేణుడు ఎలా ఉన్నాడో క్షేమ సమాచారాలు చూసిరమ్మని హనుమంతుని పంపించాడు శ్రీరాముడు. హనుమంతుడు సుమంచ పర్వతప్రాంతానికి వచ్చి చూస్తే అక్కడ సుశేణుడు కనిపించ లేదు కాని అతని కళేబరం కనిపించింది. సుశేణుడు తపమాచరిస్తూ శివసాయుజ్యం పొందినట్టు భావించి అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పరచి సుశేణుని కళేబరాన్ని అందులో ఉంచి గొయ్యి పూడ్చి అక్కడ దొరకిన మల్లెపూలను ఆ ప్రదేశంలో ఉంచి దానిపై జింక చర్మాన్ని కప్పి శ్రీరామునికి విషయాన్ని చెప్పేందుకు వెళ్ళిపోతాడు.

హనుమంతుని ద్వారా విషయం తెలిసిన రాముడు సీత, లక్ష్మణ హనుమంతునితో కలసి సుమంచ పర్వతానికి వచ్చాడు. సుశేణుని కళేబరాన్ని రాముడికి చూపించ డానికి జింక చర్మాన్ని పైకి లేపాడట హనుమంతుడు. జింక చర్మం తీసేసరికి అక్కడ కళేబరం స్థానంలో శివలింగం కనిపించిందట. దానిపై పువ్వులు ఉన్నాయట. శ్రీరాముడు సీతా లక్ష్మణ సహితుడై ప్రక్కన ఉన్న కొలనులో స్నానంచేసి శివ లింగాన్ని పూజించుటం ప్రారంబించగానే ఆ శివలింగం క్రమంగా పెరుగుతూ ఆ ప్రాంతాలలో ఔషద, మూలికల సువాసనలతో కూడిన గాలి శివలింగాన్ని తాకి ప్రచండ పవనాలుగా మారి వీచినంత మేర అందరికీ అనారోగ్యాలు మొత్తంగా తుడిచి పెట్టినట్లుగా పోవడం, ఒకరకమైన శక్తి తేజస్సు రావడం గమనించారు. శ్రీరాముడు ఈ శివలింగానికి గుడి కట్టాలని అనుకున్నా అది పెరుగుతుండటంతో ఆలోచన విర మించాడట. అప్పటి నుండి ఈ శివలింగం పెరిగి పెరిగి మహాలింగంగా ఆవిర్భ వించిందిది. మల్లెపూలతో పూజింపబడి జినంతో{చర్మం} కప్పబడీ ఉన్నపుడు వెలసిన స్వామి కనుక మల్లికాజిన స్వామిగా పిలువబడుతుండేవాడు. క్రమంగా మల్లికార్జునినిగా మార్పు చెందినది. 

ద్వాపర యుగంలో అజ్ఞాతవాసం చేస్తూ పాండవులు ఇక్కడికి వచ్చి అప్పటికి సీతా కుండంగా పిలవబడుతున్న అక్కడి కొలనులో స్నానం స్వామిని పూజిస్తూ అక్కడ కల గుహలో నివాసం ఉండే సమయంలో ఈ పర్వతంపై అర్త్జునుడు శివుని గురించి తపస్సు చేశాడు. అర్జునుని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. దానికి అర్జునుడు ' ఓ మల్లికార్జునేశ్వర నీ పేరు మీద ఈ క్షేత్రం ఖ్యాతి పొందాలి' అని కోరుకున్నాడు. అప్పటినుంచి ఈ క్షేత్రానికి మల్లిఖార్జునస్వామి దేవస్థానంగా పేరువచ్చింది. 

దేవాలయ చరిత్ర: 
1870 ప్రాంతములో టెక్కలి జమిందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగద్దేవ్ మల్లిఖార్జునస్వామికి ఆలయం నిర్మించగా అది తొందరలోనే కొంతకాలానికి శిథిలమై పోయింది. మరికొంతకాలానికి ఆలయనిర్మాణానికి పూనుకొనగా స్వామి భక్తుల కలలో కనబడి తనకు ఆలయం వద్దనీ వాతావరణ మార్పులలో ఆరుబయట ఉండటమే తనకు ఇష్టమనీ అదే లోక కళ్యాణమనీ, ఎండకు ఎండి, వానలో తడవడం వల్లనే ఎండ మల్లిఖార్జునస్వామిగాప్రాచుర్యం పొందుతానని తెలియజేసాడు. అప్పటినుండి ఈ శివలింగం ఎండ మల్లిఖార్జునస్వామిగా పేరొందింది.

__((**))--


మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం: (8)

కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం.కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం. మోపిదేవి లోని వల్లీ, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానం దక్షిణభారత దేశం లోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం గా విరాజిల్లుతోంది. 

స్థల పురాణం:------ స్కాందపురాణం లోని సహ్యాద్రిఖండం లో కృష్ణానదీ మహాత్మ్యము, ఇతర క్షేత్రములను వివరించు సందర్భం లో మోపిదేవి క్షేత్ర ప్రశంస కన్పిస్తోంది. అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరి స్థితుల్లో కాశీని విడిచిపెట్ట వలసి వచ్చింది. వింధ్య పర్వతం అహంకారం తో విజృంభించి, ఆకాశం లోకి చొచ్చుకొని పోయి, సూర్య గమనాన్నిసైతం నిరోధించ సాగింది. ప్రకృతి స్థంభించింది.గ్రహ సంచారాలు నిలిచిపోయాయి. ఈ మహోపద్రవాన్నినివారించ గలిగేది అగస్త్యమహర్షి మాత్రమే నని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్యమహర్షి కి , విషయాన్ని వివరించారు. 

యోగదృష్టి తో సర్వము నెరింగిన మహర్షి తాను ఇప్పుడు కాశీ ని వీడితే కల్పాంత మైనా తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడ లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరించాడు . లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో నున్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరించింది. తాను మరలి వచ్చే వరకు అలాగే ఉండమని శాసించి ,కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసు లో నిలుపుకొని , దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు. పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరం లోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. కనకదుర్గామాతను ,శ్రీకాకుళ ఆంద్ర మహావిష్ణువు ని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు. 

“ వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్” అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది,. ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు. ఒకపుట్టనుండి దివ్యతేజస్సుని గమనించి. ఇదే “సుబ్రమణ్య క్షేత్రమని ఇది భుక్తి ము క్తి ఫలప్రదమని “శిష్యులకు వివరించాడు అగస్త్యుడు. కుమారమూర్తి కే సుబ్రమణ్య మనెడి పేరని మాండవ్యుడనే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశాడు. 

కుమారస్వామి ఉరగ (పాము) రూపం లో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధం గా శిష్యులకు వివరించారు అగస్య్త మహర్షి. 
“ సనక,సనకస,సనత్కుమార సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారుగానే ఉంటారు, పైగా దిగంబరులు.వారు ఎల్లప్పుడూ భగవదారాధన లోనే కాలం గడుపుతుంటారు.వారు ఒక పర్యాయం పరమేశ్వర దర్శనానికి కైలాసం చేరుకున్నారు. ఆ సమయం లో పరమేశ్వరుడు కైలాసం లో లేడు.లోకమాత పార్వతి,కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. అదేసమయం లో శచీ,స్వాహా మొదలైన దేవతాస్త్రీలు, లక్ష్మీ సరస్వతులు, పార్వతీ దేవి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాల తో సుందరీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు.

“ కుమారా! ఏల నవ్వుచున్నావు ?. వారు నేనులా కన్పించలేదా.? ఆ తాపసులు మీ తండ్రి వలే లేరా? భేదమేమైననూ కన్పించినదా ?” యని జగదంబ కుమారుని ప్రశ్నించినది. ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చాత్తాప పడినాడు. తల్లి పాదాలపై బడి క్షమాపణ కోరుకున్నాడు. తల్లి కాదన్న వినకుండా పాప పరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపం తో తపస్సు ప్రారంభించాడు. 

ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టి తో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. పడగ వలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు.” అత్రస్నానం తు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్, “అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్ర తో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి. 
కాలాంతరం లో ఆ ప్రదేశమంతా పుట్టల తో నిండిపోయింది. ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపం లోనే కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు. వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. ఈతను మహాభక్తుడు. అతనికి స్వామి కలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి, లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి , ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు. పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తనవారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు. తనవృత్తిని స్వామి కి అంకితం చేశాడు.మట్టి తో స్వామికి ఇష్టమైన వాటిని తయారు చేసి, వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయం లో భద్రపరచేవాడు. అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయం లో శిథిలమై పోగా మిగిలిన నంది ,గుర్రము ఈ నాటికీ స్వామి వారి కళ్యాణమండపం లో భద్రంగా ఉండి , భక్తులకు కనువిందు చేస్తున్నాయి. 

ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవి స్ధిరపడిందని చెపుతారు. 
ఆలయప్రత్యేకత.:----- స్వామివారి ఆలయం తూర్పుదిశ గా ఉంటుంది. గర్భగుడి లో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం. స్వామి కి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధం గా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన ,అభిషేక సమయాల్లో ఆ రంధ్రం లో పాలుపోయడం జరుగు తుంది. ఆలయ ప్రదక్షిణ మార్గం లో ఉన్న పుట్టనుండి గర్భగుడి లోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం. 

ఇక్కడ స్వామి వారి ఆలయం లో పుట్టలో పాలుపోయడం విశేష సేవ గా భక్తు లు భావిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలిగించడం, చూపు మందగించినవారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం,మనోవ్యాధి, చర్మ సంబంధ వ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు. 

స్వామి వారి ఆలయం లో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం , అన్న ప్రాసన, అక్షరాభ్యాసం, చీరమ్రొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చు కుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమౌతున్న యువతులు ప్రత్యేక పూజలు జరిపించు కుంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు. 

విశేష పూజలు :------. నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టి వంటి పర్వదినాల తోపాటు ఆదివారం, గురువారం స్వామిని భక్తులు విశేషంగా సందర్శించి, మొక్కులు తీర్చుకుంటారు. స్వామి వారికి పర్వదినాల్లో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం తో పాటు ప్రత్యేకఅర్చనలు జరుగుతాయి.ఆలయం లో ప్రతి రోజు స్వామి వారికి శాంతి కళ్యాణం జరుగుతుంది.ప్రతి నెలా వచ్చే కృత్తికానక్షత్రం రోజున రాహు, కేతువు ,సర్పదోష నివారణకు ప్రత్యేక పూజలు జరుగుతాయి.ఉగాది ప్రవదినం,దసరా శమీపూజ, కార్తీక దీపోత్సవం, ఆరుద్రో త్సవము విశేషంగా జరుగుతాయి. 
మాఘమాసం లో కళ్యాణోత్సవం, రథోత్సవం,వసంతోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. 
భక్తుల సౌకర్యార్ధం నిత్యాన్నదాన పథకం ఇటీవలె ప్రారంభించబడింది 
రవాణా సౌకర్యాలు . :------- కృష్ణాజిల్లా లో విజయవాడ కు 70 కి. మీ దూరం లోను,మచిలీపట్టణానికి 35 కి.మీ దూరం లోను, గుంటూరు జిల్లా రేపల్లె కు 8 కి. మీ దూరం లోను మోపి దేవి క్షేత్రం ఉంది.అతి సమీపం లోని రైల్వేష్టేషన్ రేపల్లె. 
ఇక్కడ ఉండటానికి ఎటువంటి హోటల్ సౌకర్యాలు ఉండవు. గ్రామీణ స్థాయి కాఫీహోటల్స్ మాత్రం ఉంటాయి. అవనిగడ్డ, రేపల్లె, చల్లపల్లి లో ప్రభుత్వ అతిథి గృహాలున్నాయి. 214 ఎ జాతీయ రహదారిపై చల్లపల్లి – పులిగడ్డ మధ్య మోపిదేవి క్షేత్రం ఉంది. 

నాగదోషాలకు, సంతాన రాహిత్యా నివారణకు ,జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనే తరుణోపాయం గా శాస్త్రాలు చెపుతున్నాయి.
--((**))--


కొడుముడి దేవాలయం.ఈరోడ్ (7)  
ఒకే ఆలయంలో దర్శనమిచ్చే త్రిమూర్తులు. 
బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వేరు వేరుగా ఆలయాలు మనం చూస్తూనే ఉంటాం కాని ఒకే ఆలయంలో త్రిమూర్తులు ముగ్గురూ కొలువు తీరి ఉండటం చాలా అరుదుగా చూస్తాం. అలాంటి ఒక ఆలయమే తమిళనాడులోని ఈరోడ్ దగ్గరలో ఉన్న కొడుముడి దేవాలయం. 

ఇక్కడి శివుడిని ముఘ్దేశ్వర్ అని, అమ్మవారిని సౌందర్యవల్లి అని అంటారు. ఒక పురాణగాథ ప్రకారం ఆదిశేషుడికి, వాయు దేముడికి మధ్య ఎవరి బలం గొప్పదో అనే దాని మీద వాదోపవాదాలు జరిగి ఇద్దరు మేరు పర్వతం దగ్గరకి వచ్చి యుద్ధానికి తలపడ్డారట. ఆదిశేషుడు మేరు పర్వతాన్ని గట్టిగా పట్టుకుని ఉండగా వాయు దేముడు తన శక్తి మేర గట్టిగా ఊదితే అతని ప్రతాపానికి మేరు పర్వత శిఖరం అయిదు ముక్కలుగా విరిగి వివిధ ప్రదేశాల్లో పడిందట. అలా వజ్రంతో సమానమైన మేరు పర్వత శిఖర భాగం వచ్చి ఈ కొడుమూడిలో పడి శివలింగ రూపం దాల్చిందట. అదే ముఘ్దేశ్వర శివలింగం. 
శివుడి పెళ్లి జరిగిన తరువాత పార్వతి దేవితో కలిసి అగస్త్య మహర్షికి ఈ ప్రదేశంలోనే ప్రధమ దర్శనమిచ్చాడట. అలాగే భరద్వాజ మహర్షికి శివుడి తాండవం చూసే అదృష్టం కూడా ఈ ప్రదేశంలోనే కలిగిందట. ఈ ఆలయ ప్రాంగణంలోనే భరద్వాజ తీర్థం, దేవ తీర్థం, బ్రహ్మ తీర్థం అనే మూడు తీర్థాలని మనం చూడవచ్చు. 
ఇక విష్ణుమూర్తి రూపాన్ని వీర నారాయణ పెరుమాళ్ అని అంటారు. అమ్మవారిని తిరుమంగ నాచియార్ అని పిలుస్తారు. పెళ్లి కాని వారు ఇక్కడ పరిహార పూజలు చేయించుకుంటే వెంటనే పెళ్లి కుదురుతుందనే ఒక నమ్మకం కూడా ఉంది. అంతేకాదు రాహు కేతువులకు కూడా పహిహార పూజలు చేసుకోవచ్చు. కుజదోషం ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. మొత్తానికి ఎలాంటి జాతక దోషాలకైనా ఇక్కడ పరిహార పూజలు చేయటం పరిపాటి. 

ఇకపోతే బ్రహ్మ దేముడు ఒక చెట్టు రూపంలో ఉండటం ఇక్కడి మరొక విశేషం. వణ్ణి చెట్టుగా పేరుపొందిన ఈ మహావృక్షం దాదాపు 3000 సంవత్సరాలనాటిదని చెప్తున్నారు ఆలయ నిర్వాహకులు. ఈ చెట్టుకున్న మరొక విశేషం దీనికి ఒక వైపు ముళ్ళు ఉంటే మరో వైపు ఉండవు, అంతేకాదు దీనికి పళ్ళు పువ్వులు కూడా కాయవు. ఈ చెట్టు ఆకు ఒక్కటైనా ఒక బిందెడు నీళ్ళల్లో వేసి ఉంచితే ఆ నీళ్ళు ఎన్నాళ్లయినా పాడవ్వవు అని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న వినాయకుడి విగ్రహం కూడా ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఏనుగు మొహంతో ఉండే వినాయకుడికి కాళ్ళు మాత్రం పులి పంజాలా ఉంటాయి. 

కావేరి నది పక్కన ఉన్న ఈ ఆలయంలో ప్రతి ఏట జరిగే బ్రహ్మొత్సవాలకి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఉత్సవమూర్తులని రథంపై తిరువీధి తిప్పుతారు. నవగ్రహ పూజలకి, నవగ్రహ శాంతి హోమాలకి పేరుపొందిన ఈ ఆలయం నిజంగా చూడతగ్గ దేవాలయం.
--((**))--

ఆరాధ్య పుణ్యక్షేత్రాలు 
సేకరణ:రచయత:  మల్లాప్రగడ రామకృష్ణ  


పంజలి ప్రభ (     -1 2 - 2018 )
విల్లిపుత్తూరు గోదామాత ఆలయం (6 )

కల్యాణ వరప్రదాత విల్లిపుత్తూరు గోదామాత 
భగవంతుడు ఎప్పుడూ భక్తుల పాలిట పక్షపాతే… వజ్ర వైడూర్యాలు, సిరిసంపదలు, హంగూ ఆర్భాటాలు ఇవేమీ భగవంతునికి అక్కర్లేదు… ఆ జగత్ పాలకుడికి కావల్సింది నిశ్చలమైన భక్తి… పరిపూర్ణమైన విశ్వాసం… అవుంటే శ్రీవైకుంఠంనుంచి కూడా తరలి వచ్చి అనుగ్రహిస్తాడు. అక్కున చేర్చుకుని సేద తీరుస్తాడు. అలా తన నిశ్చలమైన భక్తితో సాక్షాత్తు శ్రీరంగనాధుడ్నే మెప్పించిన మహాభక్తురాలు గోదాదేవి. ఆండాళ్‌గా పూజలందుకుంటున్న ఆ తల్లి ఆవిర్భవించిన పుణ్యధామమే ‘శ్రీవిల్లిపుత్తూరు’. తమిళనాడు రాష్ట్రం మధురై నగరానికి 80 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రం గోదాదేవి పాద స్పర్శతో, ఆమె శ్రీహరి భక్తితో పునీతమైంది. 
శ్రీవిల్లిపుత్తూరులో ప్రసిద్ధమైన ఆలయాలలో గోదాదేవి ఆలయం ఒకటి. మహిమాన్విత ఈ దివ్యాలయ ప్రాంగణం సదా గోదా, వటపత్ర సాయి నామస్మరణంతో మారుమ్రోగుతుంది. అణువణువూ ఆధ్యాత్మికానురక్తిని పెంచే గోదాదేవి ఆలయం సొంతం… అపురూప ఈ దివ్యాలయాన్ని 7వ శతాబ్దంలో వల్లభదేవ పాండ్యన్ అనే రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరంతర కాలంలో ఈ ఆలయాన్ని తిరుమల నాయకర్, చొక్కప్పనాయకర్ అనే రాజులు అభివృద్ధి చేశారు. కాలాంతరంలో ఈ ఆలయంలో అనేక మార్పులు చేర్పులూ జరిగినప్పటికీ, పురాతనత్వాన్ని చెక్కుచెదరకుండా మిగుల్చుకున్న ఆలయమిది. నిత్యం వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయ ప్రాంగణం గోదాదేవి భక్తికి ప్రభల నిదర్శనంగా దర్శనమిస్తుంది. 
పురాణగాథ: 
పూర్వం విష్ణుచిత్తుడనే పండితుడు శ్రీహరి భక్తుడు. అతడు రోజూ శ్రీహరినే సేవిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఓసారి విష్ణుచిత్తుడు తులసీవనంలో ఉండగా, ఓ ఆడ శిశువు దొరికింది. అది శ్రీమన్నారాయణుడి కటాక్షంగా ఆ శిశువును చేరదీసి గోదాదేవి అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచాడు. ఆ శిశువు పెరిగి పెద్దదవుతూ శ్రీరంగనాధుడ్ని అమితంగా సేవించేది. శ్రీరంగనాధుడే తన ప్రత్యక్ష దైవమని, ఎప్పటికైనా ఆ స్వామిని చేరాలని ఆకాంక్షించేది. రోజూ పుష్పహారాలను చేసి ముందుగా తన మెడలో ధరించి,ఆ తర్వాత స్వామివారి కైంకర్యానికి పంపించేది. స్వామిని ఎప్పటికైనా వివాహమాడాలని తలచేది. ఎప్పుడూ స్వామి సేవలో తరిస్తూ గడిపేది. ఆమె వయస్సు పెరుగుత్నుకొద్దీ స్వామిపై భక్తి విశ్వాసాలను పెరాగాయ. ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతాన్ని ఆచరించేది. భక్తిని మాలగా అల్లి సువాసన భరిత పుష్పాలతో ఆ భగవానుడ్ని సేవించి ముక్తి పొందవచ్చని తలచి తిరుప్పావై ప్రబంధాన్ని రచించి ఆండాళ్‌గా ప్రసిద్ధిచెందింది. ఇందులో 30 పాశురాలున్నాయి. ఆ పాశురాలను భక్తితో గానామృతం చేసి, తన భక్తిప్రపత్తులను చాటుకుని, స్వామిని వివాహమాడి చివరికి శ్రీరంగనాధునిలోనే ఐక్యమైంది. గోదాదేవి ఆవిర్భవించిన స్థలంగా చెప్పబడ్తున్న ఈ ప్రాంగణంలో నిర్మించిన దివ్యాలయమే శ్రీవిల్లిపుత్తూరు శ్రీ గోదాదేవి ఆలయం. మహిమాన్వితమైన ఈ దివ్యాలయ ప్రాంగణంలో గోదాదేవి దొరికిన తులసీవనం ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది. ఈ తులసీవనంలోనే అమ్మవారికి గుర్తుగా ఓ చిన్న మందిరాన్ని నిర్మించి పూజిస్తున్నారు. గోదాదేవి అమ్మవారి ప్రధానాలయ ప్రాంగణం విశాలమైనది. ఈ ప్రాంగణం లోపలి ప్రాకారంలో ఎడమవైపు లక్ష్మీనారాయణ పెరుమాళ్ మందిరం ఉంది. దీనికి సమీపంలో ఆండాళ్ పూజా మంటపం ఉంది. ప్రధానాలయ లోపల ప్రాకారం కేరళ సంప్రదాయ రీతిలో ఉంది. అమ్మవారి ఆలయానికి ముందు మణిగన్, సుముఖన్, సేనై ఇముదల్వర్‌ల చిన్ని చిన్ని మందిరాలున్నాయి. గర్భాలయం వెలుపల తులసివనంలో బావి ఉంది. అమ్మవారు రోజూ ఈ బావిలోనే తన ముఖారవిందాన్ని చూచుకొనేదంటారు. ఇదే ప్రాంగణంలో ఊంజల్ మంటపం ఉంది. అత్యంత నయన శోభితంగా ఉన్న ఈ ప్రాంగణం చూపరులను అమితంగా ఆకర్షిస్తుంది. గర్భాలయంలో రంగమన్నార్ దర్శనమిస్తారు. స్వామికి దక్షిణ భాగంలో ఆండాళ్ అమ్మవారు, ఉత్తర భాగంలో గరుత్మంతుడు కొలువుదీరి ఉన్నారు. 
ఆలయ బయట ప్రాకారంలో గజలక్ష్మి, ఆంజనేయ మందిరాలున్నాయి. ఈ ప్రాకారంలోని అద్భుత శిల్పాలు భక్తులకు దర్శనమిస్తాయి. అఘోర వీరభద్ర, సరస్వతి, శ్రీరాముడు, లక్ష్మణుడు, వేణుగోపాలస్వామి, విశ్వకర్మ, రంభ, ఊర్వశి, జలంధర్, మోహినీ అవతారం, మన్మధుడు, రతి, ఊర్థ్వవీరభద్ర తదితర అద్భుత శిల్పరాజాలు చూపరుల దృష్టిని మరలనీయవు. అలనాటి శిల్పుల పనితనానికి నిదర్శనంగా ఇవి దర్శనమిస్తాయి. అమ్మవారి గర్భాలయం బయట ప్రాకారంలో తిరుప్పావై పాశురాలకు చెందిన మనోహరమైన చిత్రాలున్నాయి. ఇవన్నీ భక్తులలో భక్త్భివాన్ని ప్రోదిచేస్తాయి. శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి అమ్మవారిని దర్శించుకునే కన్యలకు వివాహయోగం తప్పక కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే భక్తులకు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి సాక్షాత్కారం కలుగుతుంది. ఇక్కడ అమ్మవారిని, స్వామివార్లను తులసి దళాలతో, పుష్పహారాలతోనూ సేవిస్తే ఐశ్వర్యవృద్ధి కలిగి, కోర్కెలు సిద్ధిస్తాయంటారు. అలాగే వివాహం కాని కన్యలు ఇక్కడ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే, వెంటనే వివాహం జరిగి, సౌభాగ్యసిద్ధి కలుగుతుందంటారు. మహిమాన్విత ఈ దివ్యాలయంలో ధనుర్మాసం చివరిరోజున గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తారు. అత్యంత ఘనంగా నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న శ్రీవిల్లిపుత్తూరులో యాత్రికులకు బసచేయడానికి అనేక హోటళ్ళున్నాయి. భోజనానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మహిమాన్విత ఈ క్షేత్రంలో ఒక రోజు నిద్ర చేస్తే పుణ్య ఫలాలు సిద్ధిస్తాయంటారు
--((**))--


ఆరాధ్య పుణ్యక్షేత్రాలు 
సేకరణ:రచయత:  మల్లాప్రగడ రామకృష్ణ  


పంజలి ప్రభ (     -1 2 - 2018 )

కోనసిమ....."జగ్గన్నతోట" ప్రభల తీర్థం (5 )

కోనసిమ అంటేనే వేదసీమ అని పెద్దల ఉవాచ. 

శ్రీశైల పర్వతసానువుల తరువాత తొందరగా మనోలయమయ్యే ప్రదేశాలు కోనసీమ దైవ క్షేత్రాలు 

కోనసీమ నడుమ తరతరాలనుండీ జరుగుతున్న "జగ్గన్నతోట" ప్రభల తీర్థం వైభవాన్ని ఇంతింతా అని చెప్పరానిది. మకర సంక్రమణ ఉత్తరాయణ మహా పుణ్యకాలంలో సంక్రాంతి కనుమ నాడు కోనసీమలోని "మొసలిపల్లి శివారు జగ్గన్నతోట" లో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమము అత్యంత ప్రాచీనమైన, చారిత్రాత్మకమైన, అతిపురాతనమైన, పవిత్రమైన సమాగమము. ప్రాచీన కాలంలో మొట్టమొదటగా ఈ తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. ఈ తోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురం గానీ వుండవు. ఇది పూర్తిగా కొబ్బరి తోట. ఈ ఏకాదశ రుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడంతో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇది ఏకాదశ రుద్రుల కొలువు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారము ఏకాదశ రుద్రులు ఒక్కచోట కొలువు తీరేది ప్రపంచం మొత్తం మీదా,ఈ భూమండలం మొత్తానికీ ఒక్క చోటే అదీ వేదసీమ అయినటువంటి కోనసీమలోనే. 

లోక కళ్యాణార్ధం ఈ పదకొండు గ్రామాల శివుళ్ళు సమావేశం అయ్యి లోక విషయాలు చర్చిస్తారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం నుండీ ఈ సంప్రదాయం వుందనీ తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17 వ శతాబ్ధములో ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి లోక రక్షణ గావించారనీ ప్రతీతి. అప్పటి నుండీ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరమూ కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా, భూమి తల్లక్రిందులైనా ఈ రుద్రులను ఒక్కచొట చేర్చుతారు ఈ గ్రామస్తులు. సంస్థానధీశులైన శ్రీ రాజా వత్సవాయి జగన్నాధ మహారాజుకు చెందిన ఈ తోట జగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడింది. 

ఈ ఏకాదశ రుద్రులు కొలువైన గ్రామాలు ఆ రుద్రుల పేర్లు వరుస గా 
1. వ్యాఘ్రేశ్వరం : శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి(బాలాత్రిపురసుందరీ) 
2. పుల్లేటికుర్రు : అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి(బాలా త్రిపుర సుందరి) 
3. మొసలపల్లి : మధుమానంత భోగేశ్వర స్వామి 
4. గంగలకుర్రు : చెన్నమల్లేశ్వరుడు 
5. గంగలకుర్రు(అగ్రహారం) : వీరేశ్వరుడు 
6. పెదపూడి : మేనకేశ్వరుడు 
7. ఇరుసుమండ : ఆనంద రామేశ్వరుడు 
8. వక్కలంక : విశ్వేశ్వరుడు 
9. నేదునూరు : చెన్న మల్లేశ్వరుడు 
10. ముక్కామల : రాఘవేశ్వరుడు 
11. పాలగుమ్మి : చెన్న మల్లేశ్వరుడు. 

ఇవీ గ్రామాలు ... ఆ గ్రామాల రుద్రుల నామాలు. ఈ స్వామి వారలను "ప్రభలపై" అలంకరించి మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, భాజా భజంత్రీలతో "శరభా శరభా", "హర హర మహాదేవ" అంటూ ఆయా గ్రామాల నుంచి వీరిని మోస్తూ ఈ తోటకు తీసుకువస్తారు. 

ఈ తోట మొసలపల్లి గ్రామములో వుంది కనుక దీనికి ఆతిథ్యం మొసలపల్లికి చెందిన మధుమానంత భోగేశ్వరుడు, మిగతా గ్రామ రుద్రులకు ఆతిథ్యం ఇస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నా ముందే తోటకు చేరుకుని అందరు రుద్రులూ తిరిగి వెళ్లిన తరువాత వెళ్లడం ఆనవాయితీ. ఈ ఏకాదశ రుద్రులకు అద్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వారానికి చెందిన రుద్రుడు 

"శ్రీ వ్యాఘ్రేశ్వరుడు". ఈ వ్యాఘ్రేశ్వరుడు కి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాదా పుర:స్సరంగా ఒక్కసారి లేపి మళ్ళీ కిందకు దించుతారు. ఈ 11 శివుళ్ళకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానము. 
ఇక్కడ మరో విశిష్టత ఏమిటీ అంటే గంగలకుర్రు మరియూ గంగలకుర్రు(అగ్రహారం) రుద్ర ప్రభలు ఈ తోట కి రావాలంటే మధ్యలో కాలువ(కౌశిక) దాటాలి. ఆ ప్రభల్ని ఆ కాలువలోంచి ఏ మాత్రం తొట్రూ లేకుండా "హరా హరా" అంటూ తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండు కళ్ళూ చాలవు. ఎందుకంటే కాలువలో మామూలుగానే నడువలేము. అలాంటిది ఒక 30 మంది మోస్తే కానీ లేవని ప్రభని, ఆ కాలువలోంచి తోటలోకి తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇక ఆ కాలువలోకి వచ్చే ముందు ఒక వరి చేనుని ఆ ప్రభలు దాటవలిసి వస్తుంది. ఆ చేనుని దాటడానికి పంటను తొక్కుతూ వచ్చినా రైతులు భాధపడక, సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తమ చేల గుండా వెళ్ళడం వాళ్ళ పూర్వజన్మ సుకృతం గా భావిస్తారు. అలా ఏక కాలం లో ఏకాదశ రుద్రుల(11)దర్శనం చేస్తుంటే కళ్ళు ఆనందాశ్రువులు రాలుస్తాయి. 

నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయమహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్-మహాదేవాయ నమః’ అంటూ రుద్రం లో ఏకాదశ రుద్రుల గురించి ప్రస్తావన ఉంటుంది. 

ఆ ఏకాదశ రుద్రులు ఏకకాలంలో సమాగం అయ్యే సన్నివేశం చూస్తే మనసు పులకిస్తుందిఈ తీర్థము ను దర్శించడానికి ప్రపంచవ్యాప్తం గా స్థిరపడిన కోనసీమ ప్రజలే కాక,దేశ విదేశీయిలు వచ్చి దర్శించి తరిస్తారు.


--((**))--


ఆరాధ్య పుణ్యక్షేత్రాలు (4)
 ప్రాంజలి ప్రభ  "మల్లాప్రగడ రామకృష్ణ"

దివ్యక్షేత్రం వాడపల్లి (  -12 - 2 0 1 8 )   
శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయే‌உర్థినామ్ | 
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || 

ఉదయం లేచిన వెంటనే మనం ఎవరిని చూస్తే ఆ రోజు అలాగే సాగుతుందనే నమ్మకం చాలామందిలో ఉంటుంది. అందుకే ప్రతి రోజు శుభప్రదంగా ఉండాలంటే ఉదయాన్నే వేటిని చూస్తే శుభం కలుగుతుందో, వేటిని చూడకుండా ఉండటం మంచిదో తెలుసుకుందాం. సుమంగళినీ, గోవునూ, వేదవేత్తనూ, అగ్నిహోత్రాన్ని చూసిన శుభ ఫలము కలుగును. నది, సముద్రం, సరస్తులు చూస్తే దోషాలు పోతాయి. పెరుగూ, నెయ్యి, ఆవాలు, అద్దం చూస్తే అశుభంగా తలుస్తారు. ఇక ఉదయం లేవగానే పదిదోసిళ్ళ నీరు త్రాగితే మంచిది. అలా చేయటం వల్ల నిత్యం యవ్వనంతో ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళకీ, పిల్లలకి ఉదయాన్నే నీళ్ళు తాగటం అలవాటు చేస్తే వారు జీవితాంతం అజీర్తి, మూత్రపిండాల వ్యాధులతో బాధపడకుండా ఉండగలుగుతారు. రాగి చెంబుతో నీరు తాగితే మలబద్దకం ఉండదని ఆయుర్వేదం చెబుతోంది. - 

1.* శ్రీనివాసుడు వెంకటాద్రికి తరలివచ్చిన రోజు.....శనివారం 
2.* ఓంకారం ప్రభవించిన రోజు...............శనివారం 
3.* శ్రీ స్వామి వారు శ్రీనివాసుని అవతారం లో ఉద్భవించిన రోజు...శనివారం 
4.* సకల జనులకు శని పీడలు తొలగించే రోజు.....శనివారం 
5.* శ్రీ మహా లక్ష్మిని వక్షస్థలాన నిలిపిన రోజు....శనివారం 
6.* శ్రీనివాసుని భక్తీ శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారి జోలికి రానని శనీశ్వరుడు వాగ్దానం చేసిన రోజు...శనివారం 
7.* పద్మావతి శ్రీనివాసుల కల్యాణం జరిగిన రోజు ...... శనివారం 
8.* శ్రీ వారిని ఆభరణాలతో అలంకరించే రోజు....శనివారం 
9.* స్వామి వారిని ఏడుకొండలపై మొదటిగా భక్తులు గుర్తించిన రోజ....శనివారం . "ఏపని చేసినా సుస్తిరతలు చేకూర్చే రోజు కాబత్ట్ శనివా రాముననకు శనివారం నకు స్థిరవారమని పేరు" దివ్య చరిత వాడనిమల్లి".....చరిత్ర 

ఒకసారి సనకసనందనాది మహర్షులందరూ వైకుంఠం లోని శ్రీమన్నారాయణుని దర్శించుకుని ఆయనను అనేకవిధములుగా స్తుతించిన తరువాత తాము వచ్చిన పనిని తెలిపారు.కలియుగం లో ధర్మం ఒంటిపాదం లో నడుస్తోంది ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యత నిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వశులై అధర్మ జీవితం గడుపుచున్నారు ఉపేక్షిస్తే అధర్మం మిగిలిన యుగాలకు కూదా ప్రాప్తిస్తుంది. 

కనుక ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవిమ్మని ఋషులు మహావిష్ణువును ప్ర్రార్ధించగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈవిధంగా చెప్పెను. అధర్మం ప్రబలినప్పుడు స్వయముగా యుగ యుగమందున అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారాలు ధరించితిని కాని కలియుగం లో పాపభూయిష్టము యెక్కువ అయిఉంది కొద్ది మాత్రమే పుణ్యాన్వితమ్ కావున కలియుగం లో అర్చా స్వరూపుడనై భూలోకమున లక్ష్మీ క్రీడా స్తానమై మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరమున నౌక వలె దరిచేర్చునది అగు గౌతమీ తీరమున నౌకపురమును (వాడపల్లి) పురమందు వెలయుదును. లక్ష్మీ సహితంగా ఒక చందన పేటికలో గౌతమీ ప్రవాహ మార్గం లో నౌకపురి (వాడపల్లి) చేరుకుంటాను. తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్  

ఈ వృత్తాంతం అంతా తెలిసిన నారదుడుపురజనులకు తెలియ పరుస్తాడు. కొంత కాలానికి నౌకపురి ప్రజలకు గౌతమీ ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చందన వృక్షం కనిపించింది తీరా వడ్డుకు తీసుకువద్దామని వెళ్ళినంతలో అదృశ్యమై పోవడం ప్రారంభించింది.ఒక రోజు గ్రామం లోని వృద్ధ బ్రాహ్మణులకు కలలొ కనిపించి కలికల్మషం వల్ల జ్ఞానం లోపించి మీరు నన్ను కనుగొనలేక పోతున్నారు.కనుక పురజనులందరూ వేకువనే గౌతమీ స్నానంతో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భం లోకి వెళితే కృష్ణ గరుడ వాలిన చోట నేనున్న చందన పేటిక దొరుకు తుందని చెబుతాడు. 

పురజనులు స్వామి ఆదేశాన్ని పాటించి నౌకలో నది గర్భంలోనికి వెళ్ళగా చందన పేటిక లభిస్తుంది.దానిని ఒడ్డుకు తీసుకువచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందులో శంఖు,చక్ర,గదలతో ఒప్పుతున్న స్వామీ దివ్యమంగళ విగ్రహం కనిపించింది. అంతలో అక్కడికి దేవర్షి నారదుడు విచ్చేశాడు.గతంలో ఋషులు వైకుంఠమునకు వెళ్లి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూపవలసినదిగా విష్ణువును ప్రార్ధించడం ,విష్ణువు నౌకపురిలో అర్చావతారంగా వెలుస్తానని చెప్పడం మొదలైన విషయాలు నారదుడు పురజనులకు చెబుతాడు. 

తరువాత మూడు మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయం కట్టింప జేసినాడు."వేం"అంటే పాపాలను "కట" అంటే పోగొట్టే వాడు కనుక స్వామికి "వేంకటేశ్వరుడు"అని నారదుడే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్టింప చేసినాడు.వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి నిలువెత్తు రూపం చూడగానే కళ్ళకు ఆకట్టుకుని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది. భారతదేశం లో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో "వాడపల్లి" ఒకటి వాడపల్లి తీర్ధం అనగా వాడవాడలా ఉత్సవమే. 

ఆబాలగోపాలానికీ ఆనందమే.ప్రతీఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామీ వారి తీర్ధం ,కల్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. స్వామివారి బ్రహ్మోత్సవ ,కల్యాణోత్సవ కార్యక్రమములను కన్నుల పండుగగా భక్తీ ప్రపత్తులతో తిలకిస్తారు. ఏటా కళ్యాణంతో పాటు నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శిస్తుంటారు. 

ఏడు శనివారముల వెంకన్న దర్శనం -ఏడేడు జన్మల పుణ్యఫలం.... 
స్వయంభూ క్షేత్రమైన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామీ వారిని వరుసగా " 7 " సనివారములు దర్శించినచొ భక్తుల కోర్కెలు తప్పక నెరవేరును. ప్రారంభించే మొదటి సనివారం ధ్వజస్థంభం వద్ద నిలబడి మీ మనస్సులోని కోరికను స్వామీ వారికి నివేదించుకొని " 7 " సార్లు ప్రదక్షిణము చేసి స్వామీ వారిని దర్శించు కోవలెను .స్త్రీల విషయంలో ఏదైనా ఒక శనివారం అవాంతరం కలిగినచో మరొక శనివారం అదనంగా చేసినచో " 7 " సనివారముల ఫలితము కలుగును. " 7 " శనివారములు దర్శనాలు పూర్తి అయిన పిదప స్వామీ వారి ఆలయంలో అన్నదానమునకు బియ్యం,పప్పులు,నూనెలు,ఏదైనా గాని భక్తుని స్తోమతను బట్టి 7 కుంచాలు లేదా 7 కేజీలు లేదా 7 గుప్పెళ్ళు గాని సమర్పించు కొనవచ్చును.

--((**))--

1 కామెంట్‌:

  1. https://photos.app.goo.gl/R7Ug5tWqX6LBKnrB8
    వాడపల్లి వెంకన్న దేవాలయ నిర్మాత తాళ్ళరేవు వాస్తవ్యులు శ్రీ పెనుబోతు గజేంద్రుడు గారు.
    ఈ విషయం దేవాదాయ శాఖ వారు ఆలయ ప్రాంగణంలో నెలకొల్పిన శిలాఫలకంలో ఉంది.

    రిప్లయితొలగించండి