15, ఫిబ్రవరి 2022, మంగళవారం

994 --


[13:52, 29/01/2022] మల్లాప్రగడ రామకృష్ణ: [09/09/2021, 05:36] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

994వ నామ మంత్రము 9.9.2021

ఓం ఆబాలగోపవిదితాయై నమః

పసివాడి నుండి పరమాత్మ (గోపాలుని) వరకూ అందరిచేతా తెలియబడిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి ఆబాలగోపవిదితా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం ఆబాలగోపవిదితాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తజనులపాలిట ఆ శ్రీమాత తానొక కృష్ణభగవానుని రూపమున సర్వకాల సర్వావస్థలయందునూ తోడై నిలచును.

ఆబాలగోపవిదితా - బాలుని నుండి గోపాలునివరకూ. పిండాండము నుండి బ్రహ్మాండము వరకూ, పిపీలకాది బ్రహ్మ పర్యంతమూ ఆ పరమేశ్వరి తెలియబడియున్నది. భగవానుడు నారాయణుడైతే, పరమేశ్వరి నారాయణి. నారాయణుని ఆకృతులను తన చేతి పదివ్రేళ్ళ గోళ్ళ సందులనుండి ఉద్భవింపజేసినది పరమేశ్వరి. నారాయణ, నారాయణిల అభేదము దీనితో స్పష్టమగుచున్నది గనుక ఆ తల్లి సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మయే గదా!  నిండుసభలో దుర్యోధనాదులు వస్త్రాపహరణము చేయునపుడు ద్రౌపదిని శ్రీకృష్ణపరమాత్మ రక్షించినవాడైతే, అజ్ఞాతవాసప్రారంభంలో ఆర్తితో "అమ్మా! పరమేశ్వరీ! మా అజ్ఞాతవాస కాలము జయప్రదముగా ముగింపజేయుమమ్మా! కాత్యాయనీ' అని వేడుకున్న ద్రౌపదికి రక్షణనిచ్చినది ఆ కాత్యాయని. భాగవతము, దేవీభాగవతము ఈ రెండిటియందు  నారాయణ, నారాయణుల లీలలేగదా. ఆ నారాయణునిగురుంచి తెలియని బాలుడు, ఈ నారాయణి గురుంచి తెలియని గోపాలుడు ఉంటారా? ఉండరు. ఆ బాలునికి, ఈ గోపాలునికి కూడా తెలిసియుండునది ఆ పరమేశ్వరి గనుకనే ఆ తల్లి ఆబాలగోపవిదితా యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ఆబాలగోపవిదితాయై నమః అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

[20/09/2021, 04:42] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

995వ నామ మంత్రము 20.9.2021

ఓం సర్వానుల్లంఘ్యశాసనాయై నమః

బ్రహ్మోపేంద్రమహేంద్రాదులు సహితం మీరుటకు వీలులేని శాసనము గల పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వానుల్లంఘ్య శాసనా యను ఎనిమిదక్షరముల నామ మంత్రమును ఓం సర్వానుల్లంఘ్యశాసనాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులను ఆ తల్లి వేదవిహిత కర్మాచరణముల నాచరించువారిగా జేసి, నిషిద్ధకర్మలజోలికి పోనీయక, తద్వారా కర్మపరిపక్వముగావించి జన్మరాహిత్యమైన కైవల్యసిద్ధిని కలుగజేయును.

జగన్మాత శ్రీమహారాజ్ఞి. శ్రీమత్సింహాసనేశ్వరి. రాజరాజేశ్వరి. రాజ్యదాయిని. సకల జగత్తులందలి అనంతకోటి జీవరాశులు, బ్రహ్మోపేంద్రమహేంద్రాదులు సహితం ఉల్లంఘించవశముగాని శాసనములు చేసియున్నది. గనుకనే పరమేశ్వరి సర్వానుల్లంఘ్యశాసనా యని అనబడినది. ఆ పరమేశ్వరి అఖిల జగములను తన శాసన బద్ధులనుగావించి ధర్మ సంస్థాపనము గావించునది గనుకనే సర్వానుల్లంఘ్యశాసనా యని అనబడినది. తన శాసనముల నుల్లంఘించి, లోకకంటకులుగా వర్తించిన భండాసుర, మహిషాసురాది రాక్షసులను సంహరించుటలో సదా విజయం సాధించు శక్తిసేనల సమూహంగలిగి  జయత్సేనా (788వ నామ మంత్రము) యని అనబడినది. 

ఆ దేవి పంచకృత్యపరాయణయై (సృష్టిస్థితిలయతిరోధాననుగ్రహములను కృత్యములకు కారణమై), బ్రహ్మచే సృష్టి, విష్ణువుచే రక్షణ, రుద్రునిచే లయ కార్యములను నిర్వహించుతూ, మీరశక్యముగాని శాసనములను కలిగి లోకపాలన గావించు లోకేశ్వరి ఆ పరమేశ్వరి గనుకనే ఆ అమ్మ సర్వానుల్లంఘ్యశాసనా యని అనబడినది. ఆ తల్లి ఉల్లంఘింపరాని శాసనములు కలిగి యున్నది గనుకనే వాయువు సక్రమంగా వీచుచున్నది (లేకపోతే జగత్తులను ఎగురవేసి నేలపై పడవేయగలిగినది గాలి), సూర్యుడు తన కాంతికిరణములతో  లోకాలకు వెలుగు నిస్తున్నాడు (కాకుంటే చండప్రచండభాను కిరణములతో లోకములను మాడ్చగలడు ఆ భాస్కరుడు), చంద్రుడు చల్లని సుధామయ కిరణములను ప్రసరింపజేయుచున్నాడు (కాకుంటే అమావాస్య చంద్రుడై కళలుడిగి పోయి ఉంటాడు), అష్టదిక్పాలకులు గతులు తప్పక, వికృత చేష్టలు చేయక లోకాహ్లాద కరమైన కార్యములొనరించుచున్నారు.  దీనికంతటికీ ఆ తల్లి నిర్మించిన సర్వానుల్లంఘ్య శాసనములు మాత్రమే కారణము. ఆ తల్లి ఉగ్రరూపంతో అతిభయంకర మూర్తియై గర్జించక కేవలం మందస్మితవదనారవిందముతోనే లోకపాలురను, బ్రహ్మోపేంద్ర మహేంద్రాదులను తన శాసనాబద్ధులను గావించుచున్న కారణముచేతనే ఆ మహాతల్లి సర్వానుల్లంఘ్యశాసనా యని అనబడినది. (ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః) కన్నులు తెరచినంతనే బ్రహ్మాండాలను సృష్టిస్తూ, కన్నులు మూసినంతనే బ్రహ్మాండాలను నశింపజేస్తూ ఆ సృష్టిని ఉల్లంఘింపరాని శాసనములతో నియంత్రించుచున్నది గనుకనే సర్వానుల్లంఘ్యశాసనా యని అనబడినది.

ఇదే విషయాన్ని శంకర భగవత్పాదులవారు, వారి సౌందర్యలహరిలో ఇరువది నాలుగవ శ్లోకమునందు అమ్మవారిని ఈ విధంగా కీర్తించారు:

 జగత్సూతే ధాతా -  హరిరవతి రుద్రః క్షపయతే

తిరస్కుర్వన్నేతత్ - స్వమపి వపురీశస్తిరయతి |

సదా పూర్వస్సరం - తదిద మనుగృహ్ణాతి చ శివ

స్తవాఙ్ఞా మాలంబ్య -  క్షణచలితయో ర్భ్రూలతికయోః || 24 ||

బ్రహ్మాండము యొక్క సృష్టిస్థితిలయములు దేవి కనుసన్నల ఆజ్ఞల ప్రకారమే జరుగుచున్నవని స్థూలభావము.

వివరణ

అమ్మా! జగన్మాతా! .బ్రహ్మ చరాచర జగత్తును సృష్టించుచున్నాడు, విష్ణువు ఆ జగత్తును పోషిస్తూ రక్షణ భారాన్ని వహించుచున్నాడు, ఇక రుద్రుడు ఆ జగత్తును లయము చేయుచున్నాడు. ఇలా త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయములు జరుపుతూ ఉంటే ఆ అనంతరము ఈ మువ్వురిని మహేశ్వరుడు తనలో లీనము చేసుకొనుచున్నాడు. అలా లీనం చేసుకున్న మహేశ్వరుడు నీ విభుడైన సదాశివునిలో ఐక్యమగుచున్నాడు. ఆ విధముగా బ్రహ్మాండ ప్రళయం జరిగిన పిమ్మట సర్వం తనలో ఇముడ్చుకున్న నీ నాథుడైన సదాశివునికి మళ్ళీ ఈ బ్రహ్మాండములు సృష్టించాలని కోరిక కలిగినది కాని అది నీ ఆజ్ఞ లేనిదే సాధ్యం కాదుగా..అందుకే నీ అనుమతి కొరకై సదాశివుడు సదా నీ వైపే దృష్టి పెట్టెను. అప్పుడు నీవు నీ భర్త కోరిక తీర్చదలచి నీ కనుబొమలను క్షణకాలం చలింపచేసి కళ్లతోనే నీ సమ్మతిని అందించినావు. నీ ఆనతిని గైకొని మరల సదాశివుడు మహేశ్వరుని, అతనిద్వారా బ్రహ్మ, విష్ణు, రుద్రులను సృష్టించి మరల ఈ సృష్టి స్థితి లయాలను నీ అనుగ్రహంతోనే సదాశివుడు జరుపుతున్నాడు.

అమ్మా,  సృష్టికర్త ఐన బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నాడు. మహావిష్ణువు రక్షిస్తున్నాడు. రుద్రుడు విశ్వాన్ని లయింప చేస్తున్నాడు. కల్పాంతంలో మహేశ్వరుడు ఈ బ్రహ్మవిష్ణురుద్రులను తనలో లీనం చేసుకుని సదాశివతత్త్వంలో అంతర్భూతం చేస్తున్నాడు. ఇలా ఈ బ్రహాండం లయమయిపోతోంది. తిరిగి సదాశివుడు కల్పాదిలో నీ కనుబొమ్మల కదలికలను  ఆజ్ఞగా గ్రహించి యీ నాలుగు తత్త్వాలతో మళ్ళీ యథావిధిగా బ్రహ్మాండ సృష్ట్యాది కార్యాలు జరిపిస్తున్నాడు.

పంచకృత్యపరాయణ....యని లలితా సహస్ర నామంలో అమ్మ కు పేరు గలదు. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ అను పంచ విధములైన కృత్యములను అమ్మ నిర్వహిస్తూ వుంటుంది. అంటే బంధ మోక్షములు పరదేవతాధీనములు. 

సృష్టి అనగా జగన్నిర్మాణము, అది రజోగుణ ప్రధానుడైన ఈశ్వరుని (బ్రహ్మ) ఆధీనము. అట్టి సృష్టిని మూల ప్రకృతి రూపమున చేయు చున్నది గాన ఆమెకు సృష్టికర్త్రీ యని అనబడినది.

గోప్త్ర్యై నమః .... గోపమనగా జగత్ సంరక్షణము . ఇది సత్వ గుణ ప్రధానము.  ఈ ఈశ్వర కృత్యమును విష్ణు రూపములో నిర్వహిస్తున్నది గాన గోప్త్రీ యని అనబడినది. రక్షణ చేయుట, పాలన చేయుట. 

సంహారిణ్యై నమః..... జగత్తును లయము చేయుట. ఇది తమో గుణ ప్రదానుడైన రుద్రుని రూపములో అమ్మ ఈ ఈశ్వర కృత్యమును జేయుచున్నది గాన సంహారిణి యని అనబడినది.

తిరోధానకర్యై నమః.....సకల సృష్టిని పరమాణువుతో సహా నాశనము చేసి బీజ రూపములో తన దగ్గర ఉంచుకొనునది గాన తిరోధానకరీ యని అనబడినది. జీవులకు తమ స్వ స్వరూపము కూడా తెలియకుండా చేయడము తిరోధానము.  శుద్ధ సత్వ ప్రధానుడైన ఈశ్వరుని రూపములో అమ్మ ఈ కృత్యమును నిర్వహిస్తున్నది.

అనుగ్రహదాయై నమః....... బీజ రూపములో, సూక్ష్మ రూపములో వున్న సృష్టిని విస్తరించడానికి, వికసనము గావించడానికి  సదాశివ రూపములో అనుగ్రహించే కృత్యమును నిర్వహించునది గాన అనుగ్రహదా అని యనబడినది.

ఈ ఐదు కృత్యములను నిర్వహిస్తున్నది గాన ఆ తల్లి పంచ కృత్య పరాయణ  అని యనబడినది. జగత్తు కదలడం పంచ కృత్యపరాయణత్వము. పంచ కృత్యపరాయణత్వము వలెనే కదలిక జరుగుచున్నది.   నిత్యమూ మన శరీరములో, ఈ సృష్టిలో జరిగేది పంచ కృత్యపరాయణత్వము. ఈ ఐదు కర్మలు ప్రతి జీవిలో, ప్రతి చోట ఈ బ్రహ్మాండము లో జరిగే పరిణామ క్రమము.  ఐదు మంది బ్రహ్మలు, మూల అధికారులు. వారిలో మూల ప్రకృతియై మూల శక్తియై నడిపిస్తున్నది పరమేశ్వరి.

బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు...పంచ బ్రహ్మలు, పంచ కృత్యములను నిర్వహిస్తున్నారు.  ఈ ఐదు శక్తులకు మూలము ఆ తల్లి.. ఆ జగన్మాత అంటేనే కదలిక. యా దేవి సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా ...నమస్తస్యై... నమస్తస్యై...   నమస్తస్యై నమో నమః.

పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం సర్వానుల్లంఘ్యశాసనాయై నమః అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీలలితా సహస్రనామ భాష్యము

996వ నామ మంత్రము 21.9.2021

ఓం శ్రీచక్రరాజ నిలయాయై నమః

శ్రీచక్రరాజమే తన నిలయమై విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి శ్రీచక్రరాజ నిలయా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం శ్రీచక్రరాజ నిలయాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబికను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ  పరమేశ్వరి కొంగుబంగారమై ఉంటూ, సర్వకాల సర్వావస్థలయందును రక్షణ కల్పించుచూ, భౌతిక మరియు ఆముష్మిక పరమైన కోర్కెలను సిద్ధింపజేయును.

బిందువు, త్రికోణము, షట్కోణము, ఈ విధముగా శ్రీచక్రలేఖనము చెప్పబడినది అని భాస్కరరాయలువారు చెప్పారు. అటువంటి శ్రీచక్రమే నివాసముగా గలిగిన పరమేశ్వరి శ్రీచక్రరాజనిలయా యని అనబడినది. శ్రీచక్రము శివపార్వతుల శరీరమని భాస్కరరాయలువారు చెప్పారు. మన శరీరములో జీవుడు ఉన్నాడు. అలాగే శ్రీచక్రమునందు పార్వతీ పరమేశ్వరులున్నారు.

 బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మమన్వస్రనాగదళ షోడశపత్రయుక్తమ్||

వృత్తత్రయం చ ధరణీ నత్రయంచ శ్రీ చక్రరాజ ఉదితః పరదేవతాయా||

 చక్రరాజము అను పేరుగల రథములో ఉంచబడిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడిన తల్లికి నమస్కారము ( శ్రీ చక్రమునకు కూడా  చక్రరాజము అను పేరు ఉన్నది.)

                చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతా

అన్నిరకాలయిన ఆయుధములతోనూ అలంకరించబడిన 'చక్రరాజము” అనేరథాన్ని

పరమేశ్వరి అధిరోహించింది. రథాలలో కూడా రకాలున్నాయి అని రథశాస్త్రము చెబుతోంది.

అందులో ముఖ్యంగా మూడురకాలున్నాయి. 

1. చక్రరాజము, 2. గేయచక్రము, 3. కిరిచక్రము. 

లలితోపాఖ్యానంలో ఈ విషయాన్ని వివరిస్తూ....

ఆనందధ్వజముతో కూడినది. తొమ్మిది పర్వముల (ఆవరణలు)తో కూడినది. పదియోజనాలఎత్తు నాలుగుయోజనాల వెడల్పు గలిగినటువంటిది దేదీప్యమానముగా ప్రకాశించునది అయిన చక్రరాజము అను రథమును పరమేశ్వరి అధిరోహించెను. ఈ చక్రరాజరథమే శ్రీచక్రము.

శ్రీచక్రము అంటే చరాచరజగత్తే కాని వేరు కాదు. అందుకే భైరవయామళంలో

శ్రీచక్రాన్ని గురించి పరమేశ్వరుడు పరమేశ్వరికి వివరిస్తూ

ఓ పరమేశ్వరీ ! శ్రీచక్రము అంటే సామాన్యమైనటువంటి ఒక చిన్న యంత్రం కాదు. అది ఈ బ్రహ్మాండం మొత్తానికి ప్రతీక. ఏరకంగా అంటే...

సృష్టికి కారణం పంచభూతాలు, తన్మాత్రలు, సృష్టి ఆరంభంలో మొట్టమొదటగా తన్మాత్రలు ఏర్పడ్డాయి. అవే శబ్ద స్పర్శ రూప రస గంధాలు. ఆ తరువాత తన్మాత్రల స్థూలరూపాలయిన పంచభూతాలు ఏర్పడ్డాయి. అవి పృథివి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము.

ఇవన్నీ పంచీకరణం చెందినాయి. అప్పుడు పంచభూతాలు, తన్మాత్రలు విడివిడిగా 15

భాగాలయినవి. ఆ తరువాత ఇవి గుణత్రయంతో కలిసాయి. అప్పుడు ఈ సృష్టి జరిగింది. కాబట్టి సృష్టికి మూలమైనటువంటివి పంచభూతాలు, తన్మాత్రలు. అవి రెండూ శ్రీచక్రంలోనే ఉన్నాయి. అంటే పంచభూతాల, తన్మాత్రల తత్త్వాలు శ్రీచక్రంలో ఉన్నాయన్న

మాట. కాబట్టి శ్రీచక్ర  చరాచరజగత్తుకు ప్రతీక. అందుచేతనే శ్రీచక్రాన్ని అర్చించినటైతే చరాచరజగత్తును అర్చించినట్లే. జగత్తు అంటే కేవలము అడవులు, కొండలు, చెట్లు, పుట్టలతో కూడిన భూమి మాత్రమే కాదు. దానిమీద ఉండే జీవజాలము కూడా. శ్రీచక్రంలో

ఇంద్రియాలున్నాయి అన్నారు. అని రెండు రకాలు. 1. జ్ఞానేంద్రియాలు. 2. కర్మేంద్రియాలు. ఈ ఇంద్రియాలు ప్రతిపాణికీ ఉంటాయి. అందుచేతనే ఆహారనిద్రా మైధునాలు అన్ని

జీవులకు సామాన్యము అని చెప్పబడుతోంది. ఈ రకంగా దశేంద్రియాల తత్త్వాలు శ్రీచక్రంలో ఉన్నాయి కాబట్టి శ్రీచక్రం చరాచరజగత్తులోని జీవరాశి కంతటికీ ప్రతీక. అయితే ఈ జీవరాశిలో మానవుడున్నాడా ? అన్నదే ప్రశ్న మిగిలిన జీవరాశికి లేనిది, మానవుడికి ఉన్నది ఒక్కటే. అదే మనస్సు. సంకల్పవికల్పాలకు కారణమైంది మనస్సు. దీని కారణంగానే మానవుడికి యుక్తాయుక్తవిచక్షణాజ్ఞానం కలుగుతోంది. ధర్మాధర్మాలను

విచారించగలుగుతున్నాడు. మరి ఆ మనస్సు యొక్క తత్త్వము కూడా శ్రీచక్రంలోనే ఉన్నది. కాబట్టి శ్రీచక్రము జగత్తులోని మానవాళి కంతటికీ ప్రతీక. అందుచేతనే శ్రీచక్రానికి అంత గొప్పతనం ఉన్నది. శ్రీచక్రాన్ని గనక పూజించినట్లైతే చరాచరజగత్తునూ అర్చించినట్లే.

విశ్వమానవాళినంతటినీ సేవించినట్లే. శ్రీచక్రపూజచెయ్యడమంటే తనను తాను గౌరవించుకోవటం తప్ప వేరుకాదు.


ఈ జగత్తుకు అధిపతి పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు ? అని అడిగితే - జగత్తులోని ప్రతి వస్తువునందు ఉంటాడు. చరాచరజగత్తంతా పరమేశ్వరమయం ఈ జగత్తే శ్రీచక్రం అయినప్పుడు మరి ఆ పరమేశ్వరి శ్రీచక్రంలోనే కదా నివసించేది.

అందుచేతనే శ్రీచక్రరాజనిలయా యని అనబడినది.

ఇక మంత్రశాస్త్రంలోకి వెడితే ప్రపంచసార సంగ్రహంలో

బిందువు, త్రికోణము, అష్టకోణము, పదికోణములుగల చక్రములు రెండు, పద్నాలుగుకోణములుగల చక్రములు.  అష్టదళము వృత్తము, షోడశదళము వృత్తము, భూగృహము అనే ఆవరణలున్నాయి.

ఈ రకంగా శ్రీచక్రంలో ఉండే ఆవరణలు అనేకచోట్ల చెప్పబడ్డాయి.

అయితే శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలున్నాయి. వాటన్నింటికీ కూడా విడివిడిగా

పేర్లున్నాయి. రత్నాయరుషి వ్రాసిన ఆవరణ దేవతాస్తుతిలో వాటిని వివరించటం జరిగింది.

త్రైలోక్యమోహనం వందే సర్వాశాపరిపూరకమ్‌

సర్వసంక్షోభణం చక్రం సర్వసౌభాగ్యదాయకమ్॥

సర్వార్థసాధకం చక్రం సర్వరక్షాకరం పరమ్‌॥

సర్వరోగహరం చక్రం సర్వసిద్ధిప్రదాయకమ్‌|

సర్వానందమయం చక్రం ఇతి చక్రక్రమంభజే॥

1. ప్రధమావరణ భూపురము త్రైలోక్యమోహనచక్రము

2. ద్వితీయావరణ షోడశదళము - సర్వాశాపరిపూరకచక్రము.

3. తృతీయావరణ అష్టదళము - సర్వసంక్షోభణచక్రము

4. చతుర్థావరణ చతుర్దశారము - సర్వసౌభాగ్యదాయక చక్రము

5. పంచమావరణ బహిర్దశారము - సర్వార్ధసాధకచక్రము

6. షష్టావరణ అంతర్దశారము - సర్వరక్షాకరచక్రము

7. సప్తమావరణ అష్టకోణము - సర్వరోగహరచక్రము

8. అష్టమావరణ త్రికోణము - సర్వసిద్ధిప్రదచక్రము

9. నవమావరణ బిందువు - సర్వానందమయచక్రము

ఈ రకంగా నవావరణలున్నాయి. వీటిలో వృత్తత్రయం మాత్రం లేదు అని గుర్తించాలి. ఏ సంప్రదాయంలోనూ కూడా వృత్తత్రయానికి పూజలేదు.

భండాసురుని యొక్క వేదవిద్యలకు విరుద్ధమైన చర్యలకు పరమేశ్వరి ఆచరించే దండనలే ప్రతి క్రియలు. అవి ప్రకృతులు, పరివారదేవతలు ఆవరణదేవతలు,ాఆయుధదేవతలుగా చెప్పబడుతున్నారు.

శ్రీచక్రంలో ఉన్న తొమ్మిదిఆవరణలే, దేవికూర్చునే రథానికి పర్యములుగా ఉన్నాయి. ఈ ఆవరణలలో ఒక్కొక్క ఆవరణకు కొంతమంది దేవతలున్నారు. వారే ఆవరణ దేవతలు.

1. మొదటి ఆవరణ : ఇది భూపురము. త్రైలోక్యమోహనచక్రము. ఇందులో మూడు రేఖలున్నాయి. ఈ మూడు రేఖలు భూలోక భువర్లోక సువర్లోకాలకు ప్రతీక. ఈ ఆవరణలో

ఉండే దేవతలవివరాలు.

ప్రధమరేఖలో అష్టసిద్ధులు ఉంటాయి.

1. అణిమాసిద్ధి, 2. లఘిమాసిద్ధి,  3. గరిమాసిద్ధి,  4. మహిమాసిద్ధి,  5. ఈశిత్వసిద్ధి, 6. వశిిత్వసిద్ధి, 7. ప్రాకామ్యసిద్ధి,  8. ప్రాప్తిసిద్ధి,  9. సర్వకామసిద్ధి. 

రెండవరేఖలో అష్టమాత్రుకలు ఉంటాయి.

1. బ్రాహ్మి, 2. మాహేశ్వరి, 3. కౌమారి,  4. వైష్ణవీ, 5. వారాహి,     6. మాహేంద్రి, 7. చాముండి,  8. శ్రీమహాలక్ష్మి.

మూడవరేఖలో ముద్రాశక్తులు ఉంటాయి.

1.సర్వసంక్షోభిణీ,  2.సర్వవిద్రావిణీ,3.సర్వాకర్షిణీ, 4. సర్వవశంకరీ, 5. సర్వోన్మాదినీ, 6.సర్వమహాంకుశ, 7. సర్వఖేచరీ, 8.సర్వబీజా,9.సర్వయోనిః

ఈ ఆవరణకు అధిదేవత త్రిపురా. ఇక్కడ ఉండే యోగిని పేరుప్రకటయోగిని.

2. రెండవ ఆవరణ : ఇది షోడశదళపద్మము. అనగా పదహారు దళాలు ఉన్నటువంటి పద్మము. చంద్రకళాస్వరూపము. ఈ పదహారుదళాలలోను చంద్రుని యొక్క పదహారు కళలు ఉంటాయి. ఆ కళలన్నీ ఆకర్షణ దేవతల రూపంలో ఉంటాయి. అవి

1.కామాకర్షిణి, 2.బుద్ధ్యాకర్షిణి,  3.అహంకారాకర్షిణి, 4.శబ్దాకర్షిణి,    5 .స్పర్శాకర్షిణి, 6.రూపాకర్షిణి, 7. రసాకర్షిణి, 8. గంధాకర్షిణి   9. చిత్తాకర్షిణి, 10. ధైర్యాకర్షిణి,11. స్మృత్యాకర్షిణి, 12. నామాకర్షిణి,

13. బీజాకర్షిణి,14. ఆత్మాకర్షిణి,   15.అమృతాకర్షిణి, 16.శరీరాకర్షిణి, 

ఈ ఆవరణకు అధిదేవత త్రిపురేశి.

ఇక్కడ ఉండే యోగిని పేరు గుప్తయోగిని.

౩. మూడవ ఆవరణ : ఇది సర్వసంక్షోభణ చక్రము. 

ఎనిమిది దళాలు గల పద్మము.

అష్టమూర్వాత్మకము. దీని ఎనిమిది దళాలలోను విడివిడిగా ఉండే దేవతలు. అప్టమూర్త్యాత్మ!

1. అనంగకుసుమా, 2. అనంగమేఖలా, 3. అనంగమదనా,4.అనంగమదనాతురా, 5. అనంగరేఖా, 6. అనంగవేగినీ, 7.అనంగాంకు, 8. అనంగమాలినీ

ఈ ఆవరణకు అధిదేవత త్రిపురసుందరి. ఇక్కడ ఉండే యోగిని పేరు గుప్తతరయోగిని.

4, నాల్గవ ఆవరణ: ఇది సర్వసౌభాగ్యదాయకచక్రము. చతుర్దశారము. అంటే పదునాలుగు కోణాలుగల పద్మము ఇందులోని పదునాలుగు కోణాలు పదునాలుగు లోకాలకు ప్రతీక. ఇక ఇక్కడ ఉండే

దేవతల వివరాలు. 1.సర్వ సంక్షోభిణీ, 2.సర్వవిద్రావిణీ, ౩. సర్వాకర్షిణీ, 4. సర్వాహ్లాదినీ, 5. సర్వసమ్మోహినీ, 6.సర్వస్తంభినీ, 7.సర్వజృంభిణీ, 8. సర్వవశంకరీ,  9. సర్వరంజనీ, 10. సర్వోన్మాదినీ, 

11. సర్వార్థసాధినీ, 12. సర్వసంపత్తిపూరిణీ, 13. సర్వమంత్రమయి, 14. సర్వద్వంద్వక్షయంకరీ.

ఈ ఆవరణకు అధిదేవత త్రిపురవాసిని. ఇక్కడ ఉండే యోగిని పేరు సంప్రదాయయోగిని.

5. ఐదవ ఆవరణ : ఇది సర్వార్ధసాధక చక్రము. పది కోణాలు గల పద్మము. దీన్ని బహిర్దశారము అంటారు. దీనిలోని పదికోణాలు విష్ణుమూర్తి యొక్క పది అవతారాలకు

ప్రతీక. ఇందులో ఉండే దేవతలు.

1.సర్వసిద్ధిప్రద, 2.సర్వసంపత్ప్రద, 3..సర్వపియంకరి, 4.సర్వమంగళకారిణి, 5. సర్వకామప్రద, 6. సర్వదుఃఖవిమోచని, 7. సర్వమృత్యుప్రశమని, 8. సర్వవిఘ్ననివారిణి, 9. సర్వాంగసుందరి,  10. సర్వసౌభాగ్యదాయిని.

ఈ ఆవరణకు అధిదేవత త్రిపురాశ్రీ. ఇక్కడ ఉండే యోగిని పేరు కుళోతీర్ధయోగిని.

6. ఆరవ ఆవరణ : ఇది సర్వరక్షాకరచక్రము. పదికోణములుగల పద్మము. దీన్ని

అంతర్జశారము అంటారు. ఇందులోని కోణాలు అగ్నికళలకు ప్రతీక. ఇక్కడ ఉండే దేవతలు:

1. సర్వజ్ఞా, 2. సర్వశక్తిః, 3. సర్వైశ్వర్యప్రదాయిని, 4. సర్వజ్ఞానమయి, 5. సర్వవ్యాధివినాశిని, 6. సర్వాధారస్వరూప, 7. సర్వపాపహరా, 8. సర్వానందమయీ, 

9. సర్వరక్షాస్వరూపిణీ, 10. సర్వేప్సితఫలప్రద.

ఈ ఆవరణకు అధిదేవత త్రిపురమాలిని. ఇక్కడ ఉండే యోగిని పేరు నిగర్భయోగిని,

7. ఏడవ ఆవరణ : ఇది సర్వరోగహరచక్రము. అష్టకోణము. దీని కోణాలలో

అష్టవసువులు వాగ్దేవతలరూపంలో ఉంటారు.

1. వశిని, 2. కామేశ్వరి,3. మోదిని,  4. విమల, 5. అరుణ, 6. జయిని, 7. సర్వేశ్వరి, 8. కౌళిని

ఈ ఆవరణకు అధిదేవత త్రిపురా సిద్ధాంబ ఇక్కడ ఉండే యోగిని పేరు

రహస్యయోగిని.

8. ఎనిమిదవ ఆవరణ : ఇది సర్వసిద్ధిప్రద చక్రము. త్రికోణము. త్రిగుణాత్మకము.

ఇందులో కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అనే ముగ్గురు దేవతలు ఆయుధబీజసంయుతులై

ఉంటారు. ఇక్కడ త్రికోణము యొక్క మూడు కోణాలయందు.

1.త్రిమూర్తులు బ్రహ్మ విష్ణువు రుద్రుడు

2.త్రిశక్తులు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి

3.సృష్టి స్థితి లయాలు

4.వామజ్యేష్టరౌద్రి

5.ఇచ్చాజ్ఞానక్రియాశక్తులు

6.జ్ఞాత జ్ఞానము జ్ఞేయము

7.అ నుంచి స వరకు 48 అక్షరాలు

ఉంటాయి. అసలు సృష్టి అంతా ఇక్కడి నుంచే జరిగింది. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురాంబ. ఇక్కడ ఉండే యోగిని పేరు అతి రహస్యయోగిని.

9. తొమ్మిదవ ఆవరణ : ఇది సర్వానందమయ చక్రము. బిందురూపము. అదే పరబ్రహ్మస్వరూపము. ఈ ఆవరణకు అధిదేవత మహాత్రిపురసుందరి. ఇక్కడ ఉండే యోగిని పేరు పరాపర రహస్యయోగిని.

ఈ రకంగా తొమ్మిది ఆవరణలు గల శ్రీచక్రంలోని సర్వానందమయచక్రంలో పరమేశ్వరి ఉన్నది.

శ్రీచక్రము అంటే కేవలము పూజామందిరంలో ఉంచి పూజించే ఒక యంత్రం మాత్రమే కాదు. చరాచరజగత్తే శ్రీచక్రము.  అది ఎలా అంటే...

శ్రీచక్రంలోని వివిధ ఆవరణలను భావనోపనిషత్తు వివరిస్తోంది.

1. మొదటి ఆవరణలోని మొదటిరేఖలో సాధకుని శరీరంలోని నవరసాలే ఇక్కడ

సిద్ధిదేవతలు. నవరసాలు అంటే -

శృంగారరసము, హాస్యము, కరుణ, రౌద్రము, వీరము, భయము, భీభత్సము,

అద్భుతము, శాంతము.

రెండవరేఖలో సాధకుని శరీరంలోని మనోవికారాలే ఇక్కడ అష్టమాత్రుకలు.

మనోవికారాలంటే -

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, పుణ్య పాపములు.

మూడవరేఖలో సాధకుని శరీరంలోని మూలాధారం నుండి ద్వాదశాంతం వరకు ఉండే స్థానాలే. ముద్రాశక్తులు. ఆ స్థానాలవివరాలు.

మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధచక్రము, లంబికాగ్రము, ఆజ్ఞాచక్రము, సహస్రారము, ద్వాదశాంతము.

2. రెండవ ఆవరణలో చంద్రకళలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు,

మనస్సు, పంచభూతాలు.

3. మూడవ ఆవరణలో ఇక్కడ అష్టమూర్తులు అంటే సాధకుని శరీరంలోని ఇంద్రియధర్మాలు. అవి వచన, దాన, గమన, విసర్ద, సంభోగ, ప్రవృతి, నివృత్తి, ఉపేక్ష

4. నాల్గవవ ఆవరణలో చతుర్దశభువనాలు అంటే సాధకుని శరీరంలోని ముఖ్యమైన

నాడులే అవి.

అలంబుసా, కుహూ, విశ్వోదరి, వరుణా, హస్తిజిహ్వ, యశస్వని, అశ్వని, గాంధారి, పూషా, శంఖినీ, సరస్వతీ, ఇడా, పింగళా, సుషుమ్నా.

5. ఐదవ ఆవరణలో సాధకుని శరీరంలోని ప్రధాన వాయువులు, ఉపవాయువులే దశావతారాలు. ఆ వాయువుల వివరాలు.

ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయములు.

6. ఆరవ ఆవరణలోని అగ్నికళలు దశవాయువులగుణాలు. చతుర్విదాన్నములను

పచనముచేయు శక్తులు. అవి

దశవిధవాయువులగుణాలు : రేచకము, పూరకము, శోషకము, దాహకము, ప్లావకము.

వివిధాన్నములు : భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోప్యము, పేయము.

7. ఏడవ ఆవరణలోని అష్టవసువులు సాధకుని శరీరంలోగల లక్షణాలు అవి

శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము, ఇచ్ఛ, సత్వగుణము, రజోగుణము, తమోగుణము.

8. ఎనిమిదవ ఆవరణలోని త్రిశక్తులు పాడ్యమి నుంచి పూర్ణిమలేక అమావాస్య వరకుగల తిథులు.

9. తొమ్మిదవ ఆవరణలో కామేశ్వరీ కామేశ్వరులుంటారు. సాధకుని ఆత్మయే కామేశ్వరి. బుద్ధికామేశ్వరుడు. ఈ రెండూ ఒకటైతే సాదకుడు బ్రహ్మెక్యానుసంధానం పొందుతాడు. అదే జీవన్ముక్తి.

కాబట్టి శ్రీచక్రరాజములోని తొమ్మిదవ పర్వములో ఆ పరమేశ్వరి ఉన్నది అని చెప్పాలి. గనుకనే అమ్మవారు శ్రీచక్రరాజనిలయా యని అనబడినది.

అసలు మానవశరీరమే శ్రీచక్రము. శ్రీచక్రంలోని వివిధ ఆవరణలు మానవదేహంలోని వివిధ భాగాలు.


*బైందవమ్‌ బ్రహ్మరంధ్రం చ । మస్తకం చ త్రికోణకమ్‌ ।

లలాటే ష్టారకంపత్రం భృవోర్మధ్యే దశారకమ్‌

బహి ర్దశారం కంఠే తు! మన్వశ్రంహృదయం భవేత్‌

నాభౌ చ వసుపత్రం చ ॥ కట్యాం షోడశపత్రకమ్‌

వృత్తత్రయం చ ఊరుభ్యాం ! పద్భ్యాం భూపురత్రయమ్‌ ॥॥

బిందువు నా బ్రహ్మరంధ్రము

త్రికోణము నా తలముందు భాగము

అష్టకోణము గా లలాటము

అంతర్దశారము గా భ్రూమధ్యము

బహిర్దశారము గా కంఠము

చతుర్దశారము గా హృదయము

అష్టదళము గా నాభి

షోడశదళము గా కటి ప్రదేశము

వృత్తత్రయము గా ఊరువులు

భూపురము గా పాదాలు.


 మానవదేహమనే శ్రీచక్రంలో మొదటి ఆవరణ అయిన పాదాల దగ్గరనుండి బయలుదేరి పైకి వెళ్ళగా బ్రహ్మరంధ్రమే బిందుస్థానము. అదే తొమ్మిదవ ఆవరణ.

ఆధారచక్రంలో నిద్రిస్తున్న కుండలినీ శక్తిని జాగృతంచేసి సహస్రారానికి చేర్చినట్లేతే, అజ్ఞాని అయిన సాధకుడికి భగవసాక్షాత్కారం కలుగుతుంది. కాగా జ్ఞానికి

ఆత్మసాక్షాత్కారము కలుగుతుంది. అంటే పరబ్రహ్మస్వరూపమైన పరమేశ్వరి సాధకుని

దేహమనే శ్రీచక్రంలోని తొమ్మిదవ ఆవరణ అయిన సర్వానందమయ చక్రమనే బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్నది.

ఇప్పుడు అజ్ఞాని అయిన భండాసురునికి జ్ఞానాన్ని ప్రసాదించటానికి ఆ దేవి అతడితో యుద్ధానికి సమాయత్త మవుతున్నది. శ్రీచక్రరథమును సిద్ధిపొందినవాడు అనగా శ్రీవిద్యలో సిద్ధిపొందినవాడు ఆత్మసాక్షాత్కారం పొందుతాడు. అతడికి సాయుజ్యం లభిస్తుంది.

శంకరభగవత్పాదులవారు శ్రీచక్రమును ఈ విధంగా వర్ణించారు:

చతుర్భిః శ్రీకంఠైః -  శివయువతిభిః పంచభిరపి|

ప్రభిన్నాభిః శంభో ర్నవభిరపి మూలప్రకృతిభిః |

చతుశ్చత్వారింశ - ద్వసుదల-కలాశ్చ్త్రివలయ

 త్రిరేఖభిః సార్ధం - తవ శరణకోణాః పరిణతాః || 11 ||

శ్రీచక్రం వర్ణన - నవ చక్రాకృతమై, నలుబదినాలుగు అంచులు కలిగి శివశక్త్యుభయరూపముగా వెలయుచున్నది.

భావము:

అమ్మా...శ్రీచక్రంలో శివకోణములు నాలుగు,( వీటి కోణములు క్రిందకు ఉండును.) శక్తికోణములు ఐదు, ( వీటి కోణములు పైకి ఉండును.) మూలప్రకృతులు తొమ్మిది ,అష్టదళములు ఎనిమిది, షోడశదళములు పదహారు , త్రివలయములు మూడు , భూపురత్రయములు మూడు . ఈ తీరున శ్రీచక్రంలో మొత్తం నలుబది నాలుగు కోణములు ఉండును. అటువంటి శ్రీచక్రము నీకు నిలయముగా నీ స్థానమై ఉన్నది తల్లీ. శ్రీచక్రము నందు సృష్టికి  మూల కారణమైన మూల ప్రకృతులను పేరుగల తొమ్మిది త్రికోణములు గలవు. శ్రీచక్రమునందు నలుబదినాలుగు కోణములు, ఇరువది ఎనిమిది మర్మ స్థానములు, ఇరువది నాలుగు సంధులు గలవు.   తొమ్మిది త్రికోణములు గలవు గనుక నవయోన్యాత్మక మందురు. ఈ నవ యోనులు నవ ధాతువులై సృష్టి మూలకము లగుచున్నవి. త్వక్కు, రుధిరము, మాంసము, మేధస్సు, అస్తి అనునవి ఐదు శక్తి మూలకములు,  ధాతువులు.  మజ్జ,శుక్రము,ప్రాణము, జీవుడు అను నాలుగు ధాతువులు శివ మూలకములు. మన దేహము నవ ధాతుమయము, నవ యోని సముద్భవము. దశమ యోని బైన్ధవ స్థానము. ఇట్లు పిండాండము, బ్రహ్మాండము వీని వలన జనించినది. పంచ మహా భూతములు, పంచ తన్మాత్రలు,

పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు,మనస్తత్వము, మాయ, శుద్దవిద్య, మహేశ్వరుడు,సదాశివుడు, అను పంచ వింశతి తత్వములు శ్రీచక్రమునందంత ర్భూతములై యున్నవి. శివశక్త్యాత్మకమైన శ్రీచక్రము చరాచర జగత్తునకు సృష్టికి మూలమై యున్నది. షట్చక్ర భేదనముచే శ్రీచక్రోపాసన చేసే శ్రీదేవీ భక్తులకు అణిమాది అష్ట సిద్దులు అతి సునాయాసముగా సిద్ధించును. సిద్ధించే ముందు పరీక్షలు చాలా తీవ్రముగా వుండును. మానసిక, శారీరిక పరీక్షలు వుండును. ఎన్నో రకముల భ్రమలు గల్పించబడును. కంటి ముందు మెరుపు తీగలు మెరియును. చెవులు హోరెత్తును. తల పగలి పోవునట్లుగా వుండును. భరించలేని మాడు పోటు, తల గిర్రున తిరుగును. ఒకే సమయములో శీతోష్ణస్థితులు గలుగును. వున్నది లేనట్టుగా లేనిది వున్నట్టుగా అగుపించును. రకరకాల మాయలు గనిపించును. మనస్సు తీవ్ర భయాందోళనలకు లోనగును. శరీరము తీవ్ర కంపనములకు లోనగును. శరీరము చెమట పట్టును. వెన్నులోని నాడులు తీవ్రముగా స్పందించును. తరువాత శరీరము నెమ్మదిగా తేలిక అగును. నాగ బంధములో కదలిక గల్గును. మూలాధారములో శక్తి చలనము, ఉత్కీలనము, ఆ తరువాత షట్చక్ర భేదనము.

ఆజ్ఞాచక్రములో త్రికోణ దర్శనము, త్రికోణాంతర దీపికా దర్శనము కలుగును.

 ఆ తరువాత ఆనందమే బ్రహ్మానందం. ఇక మిగతా విషయములు చెప్పకూడదు.

అతి రహస్యములు. స్వయముగా ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవాలి. మొదట సారి మాత్రమే ఈ సాదృశ్యములు అగుపించును. ఆ తరువాత నీ మానసిక, శారీరిక స్థితిగతులను బట్టి, నీకు తెలియకుండానే కుండలినీశక్తి సహస్రారము వరకు గమనము చేయుచూ వుండును. రహస్యమైన విషయమేమంటే సాధకుడు అఖండ బ్రహ్మచర్య నిష్ఠలో, పంచదశీ మంత్ర పునఃశ్చరణ దీక్షలో  వుండవలెను. అప్పుడే ఇది సాధించగలడు. లేనిచో ఇది కుదరదు. గురు ముఖతః దీక్ష తీసుకొన్నవారిలో మాత్రమే ఈ సిద్ధి కలుగును. ఇతరులు ఈ సాధన చేయకూడదు. చాలా తీవ్ర పరిమాణాలు వుంటాయి.

ఎవరికి వారు తమ్ము తాము ఉద్దరించుకోవడానికి మాత్రమే ఈ సాధన చేయవలెను. అన్యధా తగు మూల్యము చెల్లించుకోక తప్పదు. శ్రీవిద్య మోక్ష సాధనకు మాత్రమే అని గుర్తెరుగవలెను.

సాధకుడు అమ్మ పెట్టే పరీక్షలకు నిలబడాలి. సాధన తీవ్రముగా వుండాలి. మధ్యలో చలించగూడదు. ఏకోన్ముఖులై వుండాలి. ఎవరికి ఏయే బలహీనతలు గలవో, అవే పరీక్షలకు తావుగా నిలబడును. మెట్టు మెట్టుకూ చిత్ర విచిత్రమైన పరీక్షలు కల్గును. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం శ్రీచక్రరాజ నిలయాయై నమః అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి