13, ఫిబ్రవరి 2022, ఆదివారం

శ్రీలలితా భాష్యము- 51 ---100*


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

51వ నామ మంత్రము 

ఓం సర్వాభరణ భూషితాయై నమః

ఆపాదమస్తకమూ, కాలి మట్టెలనుండి శిరోభూషణమైన చూడామణి వరకు వివిధ ఆభరములను ధరించియున్న పరమేశ్వరికి నమస్కారము.

ముత్యము (చంద్రునికి సంబంధించిన), పగడం (కుజునికి సంబంధించిన), వజ్రం (శుక్రునికి సంబంధించిన) ఇంకను మరెన్నో మణి, రత్న ఖచితమైన సర్వాభరణ భూషితయైన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావ'ళి యందలి  సర్వాభరణ భూషితా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం సర్వాభరణ భూషితాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఉపాసించు సాధకునకు ఆ తల్లి భౌతికముగా సమస్త సుఖసంతోషములను, సిరిసంపదలను ప్రాప్తింపజేసి,  భగవధ్యానమునందు నిమగ్నముచేసి తరింపజేయును.

అమ్మవారు సర్వాభరణ భూషిత. కాళికా పురాణమునందు శిరోభూషణము మొదలుకొని కాలివ్రేళ్ళ మట్టెలవరకునూ గల అన్ని రకముల ఆభరణములను ఆ పరమేశ్వరి ధరించియున్నది. కల్పసూత్రమునందు నలుబది రకముల ఆభరణములు చెప్పబడినవి.  కొన్ని ఆభరణములు  సౌభాగ్యదాయకములు. మరికొన్ని సౌందర్యదాయకములు. మంగళసూత్రము, నల్లపూసల తావళములు, చెవులకమ్మలు, ముక్కునకు ముక్కెర, కాలికి మట్టెలు - ఇలాంటివి అన్నియును సౌభాగ్యదాయకములు. వీటిని ధరించిన స్త్రీని చూస్తే, వివాహిత మరియు మత్తైదువ అనికూడా చెప్పగలరు. అలాగే చంద్రహారములు, పాపిడి బొట్టు మొదలైనవి సౌందర్యాభరణములు.

పూర్వము ఏడు వారాల నగలకు ఎంతో ప్రత్యేకత ఉండేది. ఏడువారాల నగల గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు.  మన పూర్వీకులు గ్రహాల అనుగ్రహము కోసము, ఆరోగ్యరీత్య స్త్రీ పురుషులు బంగారు నగలను ధరించెడివారు. వారము రోజులు అనగా ఆదివారము నుండి శనివారము వరకు రోజుకొక విధమైన బంగారు ఆభరణములను ధరించెడివారు. వీటినే ఏడు వారాల నగలు అంటారు. గ్రహాలకు అనుకూలముగా కంఠహారములు, గాజులు, చెవికమ్మలు, ముక్కుపుడకలు, పాపిడిబొట్టు,  దండవంకీలు మొదలైనవి ఆభరణముల జాబితాలో వస్తాయి.

ఏడువారాల నగలు:

ఆదివారము - సూర్యుని కోసము కెంపుల కమ్మలు, హారాలు మొదలగున్నవి.

సోమవారము - చంద్రుని కోసం ముత్యాల హారాలు, గాజులు మొదలగునవి.

మంగళవారం - కుజుని కోసం పగడాల దండలు, ఉంగరాలు మొదలగునవి.

బుధవారం - బుధుని కోసం పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి.

గురువారము - బృహస్పతి కోసం పుష్యరాగం కమ్మలు, ఉంగరాలు మొదలగునవి.

శుక్రవారం- శుక్రుని కోసము వజ్రాల హారాలు, ముక్కెర మొదలగునవి.

శనివారము - శని ప్రభావం పడకుండా ఉండడం కోసం నీలమణి హారాలు మొదలగునవి.

ఈ ఏడు వారాల నగలు, స్తోమతననుసరించి బంగారముతో మణిగణఖచితమై కూడా ఉంటాయి.

అమ్మవారి ముక్కెర ముక్కుకు కుడిప్రక్క పగడముతోను, ఎడమ ప్రక్క వజ్రముతోను, బులాకి మంచి ముత్యముతో చేయబడి ఉన్నవని తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా యను (20వ) నామ మంత్రములో చెప్పబడినది.  

ఎర్రని పగడపు కాంతులు సూర్యసంబంధమైన తేజస్సును, తెల్లని వజ్రపు కాంతులు  చంద్రసంబంధమైన తేజస్సును సూచించుచున్నవి. కుడి ఎడమల ముక్కును విడదీస్తూ మధ్యన ఉండే నాసాదండమునకు సౌభాగ్యచిహ్నమైన ముత్యాల (అడ్డబాస) బులాకీ అమ్మవారు ధరించియున్నది.

ఆ పరమేశ్వరి కుజ గ్రహకాంతులను ధిక్కరించే ఎర్రని పగడపు ముక్కెర ముక్కునకు కుడివైపున, శుక్రగ్రహకాంతులను సైతము తిరస్కరించే తెల్లని వజ్రపు ముక్కెర ముక్కునకు ఎడమ ప్రక్కన ధరించియున్నది.  కనకాంగదకేయూరములను నాలుగు భుజములకు ధరించియున్నది.

దేవీభాగవతమునందలి ద్వాదశస్కంధమునందు పండ్రెండవ అధ్యాయమునందు అమ్మవారి ఆభరణ విశేషముల వర్ణనగల కొన్ని శ్లోకములు ఇచ్చటనీయబడినవి.

నవరత్నగణాకీర్ణ కాఞ్చీదామ విరాజితా|

తప్తకాఞ్చనసన్నద్ధ వైదూర్యాఙ్గదభూషణా॥18॥

కనచ్ఛ్రీచక్రతాటఙ్క విటఙ్క వదనామ్బుజా|

లలాటకాన్తి విభవ విజితార్ధసుధాకరా॥19॥

బిమ్బకాన్తి తిరస్కారిరదచ్ఛద విరాజితా|

లసత్కుఙ్కుమకస్తూరీతిలకోద్భాసితాననా॥20॥

దివ్య చూడామణి స్ఫార చఞ్చచ్చన్ద్రకసూర్యకా|

ఉద్యత్కవిసమస్వచ్ఛ నాసాభరణ భాసురా॥21॥

చిన్తాకలమ్బితస్వచ్ఛ ముక్తాగుచ్ఛ విరాజితా|

పాటీర పఙ్క కర్పూర కుఙ్కుమాలఙ్కృత స్తనీ॥22॥

విచిత్ర వివిధా కల్పా కమ్బుసఙ్కాశ కన్ధరా|

దాడిమీఫలబీజాభ దన్తపఙ్క్తి విరాజితా॥23॥

అనర్ఘ్య రత్నఘటిత ముకుటాఞ్చిత మస్తకా ।

మత్తాలిమాలావిలసదలకాఢ్య ముఖామ్బుజా॥24॥

కళఙ్కకార్శ్యనిర్ముక్త శరచ్చన్ద్రనిభాననా ।

జాహ్నవీసలిలావర్త శోభినాభివిభూషితా ॥ 25॥

మాణిక్య శకలాబద్ధ ముద్రికాఙ్గుళిభూషితా ।

పుణ్డరీకదలాకార నయనత్రయసున్దరీ ॥ 26 ॥

కల్పితాచ్ఛ మహారాగ పద్మరాగోజ్జ్వలప్రభా ।

రత్నకిఙ్కిణికాయుక్త రత్నకఙ్కణశోభితా ॥ 27 ॥

మణిముక్తాసరాపార లసత్పదకసన్తతిః ।

రత్నాఙ్గుళిప్రవితత ప్రభాజాలలసత్కరా ॥ 28 ॥

కఞ్చుకీగుమ్ఫితాపార నానా రత్నతతిద్యుతిః ।

మల్లికామోది ధమ్మిల్ల మల్లికాలిసరావృతా ॥ 29 ॥

సువృత్తనిబిడోత్తుఙ్గ కుచభారాలసా శివా ।

వరపాశాఙ్కుశాభీతి లసద్బాహు చతుష్టయా ॥ 30 ॥

సర్వశృఙ్గారవేషాఢ్యా సుకుమారాఙ్గవల్లరీ ।

సౌన్దర్యధారాసర్వస్వా నిర్వ్యాజకరుణామయీ ॥ 31 ॥

నిజసంలాపమాధుర్య వినిర్భర్త్సితకచ్ఛపీ ।

కోటికోటిరవీన్దూనాం కాన్తిం యా బిభ్రతీ పరా ॥ 32 ॥

నానా సఖీభిర్దాసీభిస్తథా దేవాఙ్గనాదిభిః ।

సర్వాభిర్దేవతాభిస్తు సమన్తాత్పరివేష్టితా ॥ 33 ॥

పైశ్లోకములలో నున్న ఆభరణవిశేషములు మాత్రమే ఇచ్చట చెప్పబడినవి.

నవరత్నములు పొదిగిన ఒడ్డాణము, తప్తకాంచనము, వైడూర్యమణులతో సిద్ధముచేసిన భుజకీర్తులు, గొడుగువంటి తాటంకములు, సూర్యచంద్రులవంటి ఆకారముతో రత్ననిర్మితమైన దివ్యమగు చూడామణి, శుక్రనక్షత్రముతో సమానమైన స్వచ్ఛమైన నాసాభరణము, అమూల్య రత్నములతో పొదిగిన మకుటము, మణులతో పొదిగిన ఉంగరము, రత్ననిర్మితమైన కింకిణులతో, కంకణములతోను పరమేశ్వరి విరాజిల్లుచున్నది.

ఇంకను సప్తశతియందు, రెండవ అధ్యాయంలో ఇలా చెప్పబడినది.

పాలసముద్రుడు మంచిముత్యాలహారమును,  మాసిపొనివి, చిరిగిపోని చీరలు, దివ్యమైన శిరోరత్నము, చెవికమ్మలు, కడియములు, పాపిడి బొట్టు, బాహువులకు భుజకీర్తులు, కాలియందెలు, కంఠాభరణములు, అన్ని వ్రేళ్ళకు శ్రేష్ఠమైన ఉంగరములు ఇచ్చెను. విశ్వకర్మ కాంచననిర్మితమైన గండ్రగొడ్డలి,, పలురకములైన అస్త్రములను, అభేద్యమైన కవచమును ఇచ్చెను. సముద్రుడు ఎన్నటికీ వాడని ఉత్తమజాతి తామరపూల హారములు పరమేశ్వరి మెడలో వేసికొనుటకును మరియు తలలో ముడుచుకొనుటకును ఇచ్చెను. హిమవంతుడు సింహవాహనము, అనేకరకములైన రత్నభూషణములు ఇచ్చెను. కుబేరుడు మధువు కొఱకు అక్షయపాత్రను, భూమిని ధరించు శేషుడు గొప్పదైన మణులతో చెక్కిన నాగహారమును ఇచ్చెను. ఇంకను ఇతర దేవీదేవతలు మరియెన్నో ఆభరణములను, నగలను ఆ పరమేశ్వరికి ఇచ్చియున్నారు.

ఆ తల్లి ఆవిర్భావ సమయములో సకల దేవతల అంశలతో ఆ పరమేశ్వరికి అంగములు ప్రకటితముకాగా, ఆయుధములు వారి నుండి లభించినవి. ముక్కోటి దేవతలు తాము ధరించిన అనేకములైన ఆభరణములను కూడా ఇచ్చియున్నారు.

ఆ పరమేశ్వరి ఆయుధములను మాత్రమేకాకుండా, సర్వాభరణములను ధరించి యుద్ధమునకు కాదు, తానొక శుభకార్యమునకు పోవు ముత్తైదువవలె సకలాభరణభూషితయై, శక్తిసైన్యములతో చక్రరాజము గేయచక్రము, కిరిచక్రము మొదలైన రథములతో బయలుదేరినది. సర్వాభరణభూషితయైన పరమేశ్వరిని గాంచి సకల దేవీదేవతలు ఓం సర్వాభరణభూషితాయై నమః కీర్తించారు. 

అటువంటి సర్వాభణ భూషితయైన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వాభరణ భూషితాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

52వ నామ మంత్రము 

ఓం శివ కామేశ్వరాంకస్థాయై నమః

శివస్వరూపుడు, కామస్వరూపుడు అయిన కామేశ్వరుని (శివుని) అంకమును (తొడను) స్దానముగా జేసికొని విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి శివ కామేశ్వరాంకస్థా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం శివ కామేశ్వరాంకస్థాయై నమః యని ఉచ్చరించుచూ ఆ శ్రీమాతను ఉపాసించు సాధకునికి ఆత్మానందము, భౌతికసంబంధమైన సుఖసంతోషములు సంప్రాప్తమగును.

ఇంతవరకూ ఆ పరమేశ్వరి స్థూలరూప సందర్శనము నామ మంత్రములద్వారా జరిగినది. ఇప్పుడు ఆ పరమేశ్వరి నివాస స్థానముల వైనము తెలియజేయబడుచున్నది. అమ్మవారు శివకామేశ్వరాంకస్థా  యని అనబడినది.

శివ అన్నప్పుడు మనం ఒక యోగి గురించి, మొట్టమొదటి యోగి లేక ఆదియోగి గురించి, అలాగే మొట్టమొదటి గురువు లేక ఆది గురువు అని అనుకోవాలి.  ఆయనే ఆది భిక్షువు అని కూడా అంటారు. అటువంటి శివస్వరూపుడు పరమేశ్వరుడు. కోరికలు గలవాడు కాముడు. పరమేశ్వరుడు సృష్టిచేయాలనే కోరిక గలవాడు అని బృహదారణ్యకమున చెప్పబడినది.    శివుడు, కాముడు అనునవి ఈశ్వరునికి (పరమేశ్వరునికి) విశేషణములు. గనుక ఆయన శివకామేశ్వరుడు. ఆయన అంకము తన స్థానముగా గలిగిన పరమేశ్వరి శివకామేశ్వరాంకస్థా యని అనబడినది. ఆ పరమేశ్వరి శివునికి ఇచ్ఛాస్వరూపురాలు. అనగా ఇచ్ఛాశక్తి. సృష్టిచేయాలనే శివుని ఇచ్ఛకు ఆ పరమేశ్వరి స్వరూపురాలు గనుక ఆ తల్లి శివుని ఇచ్ఛాస్వరూపురాలు అని చెప్పబడినది. భక్తుల హృదయస్థానము పరమాత్మకు నివాసస్థానము. పరమేశ్వరి ఇచ్ఛాస్థానము శివకామేశ్వరుని అంకస్థానము. ఇచ్ఛ అనునది ఒక శక్తి యని కూడా అన్నారు. శక్తులు ఆధారములేకుండా ఉండవు. ఆధారము కావలెను. ఈ శక్తి శివుని ఇచ్ఛాశక్తి గనుక శివుడాధారమైయున్నది. ఆ ఆధారమే కైలాసమునందు ఉండు పరమేశ్వరుని వామాంకము.  గనుకనే అమ్మవారు శివకామేశ్వరాంకస్థా యని అనబడినది. 

సత్యస్వరూపుడు, స్థావరజంగమాత్మకమగు జగత్తుయొక్క సృష్టికి కర్తయైనవాడు, చిద్రూపుడు (స్వప్రకాశస్వరూపుడు), సదా ప్రేమాస్పదుడు, ఆనందస్వరూపుడు, సృష్టిలోని పదార్థములన్నింటిలో పరిపూర్ణుడైనవాడు - ఇతనికే శివుడని పేరు. జీవేశ్వరులకు భేదములేనివాడు. లేదా జీవాత్మపరమాత్మలకు ఒకటే రూపమైనవాడు - అతడే శివుడు.

శివము అనగా మంగళము. అట్టి మంగళమును కలిగించువాడు గనుక శివుడు. శివుని భార్య శివాని. ఈమెకూడా మంగళరూపిణియే. ఒకరు కుడి అయితే మరొకరు ఎడమ. కుడిఎడమల స్వరూపమైన అర్ధనారీశ్వరతత్త్వమే శివపార్వతులు.  గనుకనే ఆ పరమేశ్వరి కామేశ్వరుని అంకమున ఉన్నది. అందుచే ఆ జగన్మాత శివకామేశ్వరాంకస్థా యని అనబడినది.
 
 సౌందర్యలహరియందు, ఎనిమిదవ శ్లోకంలో శంకరభగవత్పాదులవారు ఇలా అన్నారు.

సుధాసింధోర్మధ్యే - సురవిటపివాటీపరివృతే

మణిద్వీపే నీపో-పవనవతి చింతామణి గృహే |

శివకారే మంచే - పరమశివపర్యంక నిలయామ్

భజంతి త్వాం ధన్యాః - కతిచన చిదానందలహరీమ్ || 8 ||

ఓ పరమేశ్వరీ! అమృతసముద్రము మధ్యలో కల్పవృక్షాలతో నిండియున్న మణిద్వీపంలో, కదంబపుష్ప వృక్ష  తోటలో, చింతామణులతో నిర్మించిన గృహమునందు, త్రికోణాకారపు మంచము మీద, పరమశివుని పర్యంకస్థితవై ప్రకాశించుచు, జ్ఞాన స్వరూపమై నిరతిశయ సుఖప్రవాహరూపముగా ఉన్న నిన్ను స్వల్ప సంఖ్యాకులైన ధన్యులు మాత్రమే సేవించుకోగలుగుతున్నారు.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం శివకామేశ్వరాంకస్థాయై నమః అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

53వ నామ మంత్రము 

ఓం శివాయై నమః

శివుని శరీరంలో అర్ధభాగము తనదై, ఆ మహాదేవుని అర్ధనారీశ్వరునిజేసి, తానే శివుడై, శివుడే తానై శివస్వరూపిణిగా, శుభగుణ స్వరూపిణిగా, ముక్తిస్వరూపిణిగా అలరారే పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి శివా అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం శివాయై నమః  అని ఉచ్చరించుచూ ఆ శివశక్త్యైక్య రూపిణిని భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకునకు జగన్మాత జననిగా, శివస్వరూపిణిగాను గోచరించి, రాగద్వేషరహితునిగను మరియు పరమ శాంతియు, తద్ద్వారా బ్రహ్మభావమును పొందును.

శివా అనగా పరమేశ్వరుని ఇచ్ఛాస్వరూపురాలు. ఆ పరమేశ్వరునికి జగత్తును సృష్టించాలనే కోరిక కలిగినది. ఆ సృష్టించాలనే కోరికయే ఇచ్ఛ. ఇచ్ఛ అనునది ఒక శక్తి. ఆ శక్తియే పరమేశ్వరి. గనుక అమ్మవారు సదాశివుని ఇచ్ఛాస్వరూపురాలు.

పరమేశ్వరి శివునితో అభేదము పొందినది. గనుక శివ యని అనబడినది. మనోవృత్తికిని, మనోవృత్తులులేని స్థితికినీ సాక్షీభూతుడు శివుడు.  జగత్తు అనేది అసత్యము. అటువంటి అసత్యజగత్తునకు ఆధారమైన శివుడు సత్యస్వరూపుడు. చరాచరాత్మకమగు సకల జడ పదార్థములను సృజించినవాడు శివుడు. అతడు స్వప్రకాశస్వరూపుడు అనగా చిద్రూపుడు. ఎల్లప్పుడూ అందరిచే ప్రేమింపదగినవాడు. ఆనందస్వరూపుడు. తాను సృజించిన పదార్థము లన్నింటియందు పరిపూర్ణుడైనవాడు. అతడే శివుడు.  జీవునికి, ఈశ్వరునికి భేదములేక ఒక్కడే అయినవాడు. అందుచే అతడు శివుడని అనబడినాడు. అతని భార్య అయిన పరమేశ్వరి శివా యని అనబడినది.

శివము అనగా మంగళము. మంగళప్రదమైనవాడు శివుడు అని యనబడినాడు. శివునికి, పరమేశ్వరికి అభేదమున్నది గనుక పరమేశ్వరి శివా యని అనబడినది. అట్టి పరమేశ్వరియందు మంగళగుణములు గలవు గనుకనే సర్వమంగళ యని కూడా అనబడినది.

మనుష్యులందరికీ శుభముకోరుచూ, వారి సకలకార్యములను శుభప్రదమొనరించుచున్నాడు గనుక శివుడు అనబడినాడు. అట్టి శివుని భార్య శివా యని అనబడినది.

శివునికి దేవతలు, రాక్షసులు అనుభేదములేదు. అందరూ సమానులే. ప్రాణులందరికినీ మంగళప్రదమొనరించువాడు గనుక  శివుడు అని యనబడినాడు. అట్టి శివుని భార్య అయిన పరమేశ్వరి శివా యని అనబడినది.

అన్ని ప్రాణులయందును భగవంతుడు ఉన్నాడని వేదమునందు చెప్పబడినది. జగత్తు అంతయును అతనియందే ఉన్నది. అట్టివాడే త్రిలోచనుడు, నీలకంఠుడు, ప్రశాంతుడు, శివుడు అని చెప్పబడినది. శివ అను శబ్దమునకు శాంతించువాడు అని అర్థముగలదు. ఎవరైతే స్వాభావికముగా నిర్మలుడో, ఎవరికైతే స్వచ్ఛత, శమము, జగదాధారమగుట, భక్తులకు మోక్షదాయిత్వము, బలము, ఇచ్ఛాశక్తి యను గుణములు ఉన్నవో, అతడు శివుడని యనబడినాడు అని వేదములందు గలదు. అతని భార్య అయిన పరమేశ్వరి శివా యని అనబడినది.

పరమేశ్వరి శివునితో అభేదము గలది యగుటచే శివ యని  అనబడినది. భగవంతునికి రెండు రూపములు గలవు. ఒకటి శివుడు, ఇంకొకటి శివాని (పరమేశ్వరి). అనగా శివుడే పార్వతి, పార్వతియే శివుడు. గనుక అమ్మవారు శివా యని అనబడినది.

యజ్ఞవైభవ ఖండమునందు అధిష్టాన చైతన్యమును ఆశ్రయించుకొని మాయ గలదు. ఆ మాయయందు శక్తిస్వరూప భాగమునందు ప్రవేశించిన చైతన్యమునకు నిర్వికల్ప, స్వయంప్రభ, సదాకార, పరానంద, సంసార వినాశకారిణి, శివ, పరమ, దేవి, శివాభిన్న, శాంకరి అను పేర్లుగలవు. దీనిని అనుసరించి పరమేశ్వరియే శివస్వరూపిణియై శివా యని అనబడినది.

లింగపురాణములో వాయుదేవుని భార్య పేరు శివ అని చెప్పబడినది. సమస్తలోకములందు వ్యాపించు  అన్ని శరీరములను ధరించువాడు వాయుదేవుడు. ఈ వాయుదేవుడినే ఈశానుడు అని చెప్పుచున్నారు. పరమాత్మస్వరూపుడు, జగత్కర్తయగు ఈశానుని భార్యపేరు శివ. అటువంటి శివ స్వరూపిణి పరమేశ్వరి గనుక, ఆ తల్లి శివా యని అనబడినది. 

ఈశ్వరుని అష్టమూర్తులు వీరు:  1. సూర్యుడు, 2. జలము, 3. పృథివి, 4. వాయువు, 5. వహ్ని, 6. ఆకాశము, 7. దీక్షిత బ్రాహ్మణుడు, 8. చంద్రుడు. వీరిలో నాల్గవవాడైన వాయువు భార్య శివ గనుక పరమేశ్వరి శివా యని అనబడినది.

శివమనగా మోక్షసుఖము. పరమేశ్వరి అట్టి మోక్షసుఖమును ఇచ్చును గనుక, ఆ అమ్మ శివా యని అనబడినది. పార్వతి శివునికొరకే పుట్టినది. ఆయనతో వివాహమునందుటకై అవతరించినది గనుక శివా యని అనబడినది.

అగ్నికి వేడివలె, సూర్యునకు కాంతివలె, చంద్రునకు వెన్నెలవలె శివునికి, పార్వతి అవినాభావసంబంధము గలది యగుటచే, ఆ తల్లి శివా యని అనబడినది.

అట్టి శివా యని అనబడు జగన్మాతకు నమస్కరించునపుడు ఓం శివాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

54వ నామ మంత్రము 

ఓం స్వాధీన వల్లభాయై నమః

భర్త అయిన మహాదేవుడిని తన అధీనంలో ఉంచుకోగలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి స్వాధీన వల్లభా అను ఆరక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం స్వాధీన వల్లభాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని పూజించు భక్తులు సుఖశాంతులతో సర్వశుభాలను పొంది మందహాసయుతంగా జీవనయాత్ర సాగిస్తారు.

 శివుడు శక్తితో కూడి ఉన్నప్పుడే సృష్టి-స్థితి-లయ కార్యములను చేయగలడు. కాబట్టి శక్తికి ఆధీనుడు. అనగా పరమేశ్వరికి స్వాధీనవల్లభుడు ఆ పరమేశ్వరుడు. అమ్మవారు స్వాధీనవల్లభా యని అనబడినది. 

సర్వము శివశక్త్యైక్యము. శ్రీచక్రమునందు శివుడు బిందురూపుడు. ఆ బిందువు చుట్టూ గల త్రికోణమే పరమేశ్వరి. అనగా బిందువును చుట్టి, ఆ బిందువును తన స్వాధీనములో నుంచుకొనినది అను భావముగలదు. గనుకనే పరమేశ్వరి  స్వాధీనవల్లభా యని అనబడినది. 

శివుని ఇచ్ఛాశక్తి పరమేశ్వరి. శివుని ఆత్మ శివానికి అధీనముగాన పరమేశ్వరి స్వాధీనవల్లభా యని అనబడినది. ఇచ్ఛాశక్తి మొదలైన ధర్మములు ఒక ధర్మిని ఆశ్రయించుకొని ఉంటాయి. ధర్మి, ధర్మములు వేరుగా ఉండవు. ధర్మి యనగా శివుడు. ధర్మములు వ్యక్తికి ఆధీనములైయుండును. అనగా ధర్మి ధర్మాధీనుడై యున్నాడు. పరమేశ్వరి చింతామణి గృహమనందు శివుడు నివసించుచున్నాడని కాళికాపురాణమునందు చెప్పబడినది. అనగా పరమేశ్వరి అధీనములో పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుడు శక్తి (పరమేశ్వరి) యుండుటవలననే సకల జగత్తునకు కారణమైనాడు. శక్తిలేనిచో ఆయన ఏమియు చేయలేని అశక్తుడు గాన పరమేశ్వరి స్వాధీనవల్లభా యని అనబడినది. శక్తిలేనిచో ఆయన అడుగుకూడా వేయలేని అసమర్థుడు గాన పరమేశ్వరి స్వాధీనవల్లభా యని అనబడినది.

ఆ పరమేశ్వరి లేనిదే పరమశివుడు లేడను వివరము శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు ప్రథమ శ్లోకంలో ఇలా వివరించారు:-

శివః శక్త్యా యుక్తో- యది భవతి శక్తః ప్రభవితుం

న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి|

అతస్త్వామ్ ఆరాధ్యాం హరి-హర-విరిన్చాదిభి రపి

ప్రణంతుం స్తోతుం వా కథ-మక్ర్త పుణ్యః ప్రభవతి॥1॥

ఓ పరమేశ్వరీ! ఆయన పరమశివుడే అయినా నీతో కలసి ఉన్నప్పుడు మాత్రమే సర్వశక్తిమంతుడై లోకవ్యవహారములు చేయ గలుగు తున్నాడు.
అదే నీతోడు లేనినాడు శంకరుడే అయినా ఇసుమంత కూడా కదలలేడు కదా. (శక్తితో ఉంటే శివం-కదలగలిగేది,శక్తి లేకుంటే శవం - కదలలేనిది)
శివరూపమైన లింగం శక్తిరూపమైన పానమట్టం లేనిదే నిలబడలేదుగా.
అంత శంకరుడే పరాధీనతతో నీ ఆధారముతో నిలువగా ఇక సామాన్యులు నినువిడచి జీవించుట ఎట్లుసాధ్యం.
నిన్ను నిత్యము శివుడు,విష్ణువు, బ్రహ్మ మొదలైన దేవాదిదేవతలే కొలుస్తూ ఉంటారు.
అటువంటి నిన్ను కొలవాలన్నా నీ పాదపద్మాలు సేవించాలన్నా ఎన్నో జన్మ జన్మల పుణ్యం చేసినవారికి తప్ప అన్యులకు ఆ భాగ్యము దక్కదు కదా.
          
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం స్వాధీన వల్లభాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

55వ నామ మంత్రము 

ఓం సుమేరు శృంగమధ్యస్థాయై నమః

మేరుపర్వత శృంగ మధ్యస్థానంలో ఉండు శ్రీమాతకు నమస్కారము

శ్రీచక్రబిందుస్థానము తన నిలయమైన జగన్మాతకు నమస్కారము

సహస్రారకమల మధ్యస్థానంలో ఉండు పరాశక్తికి నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సుమేరు శృంగమధ్యస్థా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం సుమేరు శృంగమధ్యస్థాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఉపాసించు సాధకునికి  ఆ శ్రీమాత కరుణ వలన  సర్వాభీష్టములు సిద్ధించి, ఆత్మానందానుభూతిని లభించును.

మేరు పర్వతము యొక్కశిఖరము మధ్యప్రదేశము నందు జగన్మాత ఉన్నది.

శ్రీచక్రంలోని బిందువే మేరుశృంగం. ఇక్కడ ఉండే త్రిభుజంలో తూర్పుకోణం వద్ద ఇచ్ఛాశక్తి, నైఋతికోణం వద్ద క్రియాశక్తి, వాయువ్య కోణం వద్ద జ్ఞానశక్తి ఉంటాయి. ఈ మూడింటి బిందుస్థానమే మేరుశృంగం. ఇక్కడే శ్రీమాత పరమశివుని అంకస్థానంలో అనగా ఎడమ తొడపై ఉంటుంది.

కొందరు ఈ నామ మంత్రమును సుమేరుమధ్యశృంగస్థా అని కూడా చదువుతారు. అలాగయితే:

దేవతలు, నక్షత్రములు గలిగియున్నది మేరుపర్వతము. ఇది సురులకు (దేవతలకు) స్థానము. అందుచే మానవదృష్టికి అగోచరము (కనిపించనిది) అని అంటారు. సకల భువనములతోను, ఉద్యానవనములతోను, అనేక మైన  దేవతావృక్షసంపదతోను ఉండు ఈ ప్రదేశమే పరమేశ్వరికి నివాసస్థానము. మేరు పర్వతమునకు మధ్యశిఖరమునందు జగన్మాత యుండుటచే సుమేరుమధ్యశృంగస్థా యని అనబడినది ఆ పరమేశ్వరి. సుందరమైన మేరు శిఖరములు మూడుగలవు. మధ్యగల నాల్గవ శిఖరము కలదు. అచ్చటనే లలితాపరమేశ్వరి ఉంటుంది. ఈ విషయము లలితాస్తవగ్రంథమునందు దుర్వాసుడు వివరించెన. సకలలోక సముదాయముతో కూడినది. కాంచనవికారమయిన పొదరిండ్లు గలవు. ఆ పొదరిండ్లలో దేవతాస్త్రీలు సంగీతసాధనలో ఉందురు. అటువంటి మేరు పర్వతమునకు తూర్పున ఒఖ శిఖరము, నైరుతియందు ఒక శిఖరము, వాయువ్యమున ఒక శిఖరమును గలవు. ఈ శిఖరములే క్రమముగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లోకములకు ఆధారములని చెప్పబడినది. ఈ మూడు శిఖరముల మధ్య మనోజ్ఞమైనట్టిదియు, రత్నకాంతులతో ప్రకాశించు నాలుగువందల యోజనముల ఎత్తుగల శ్రేష్ఠమైన ఒక శిఖరము గలదు. అందు మహాపద్మాటవీ మధ్యమున, చింతామణి గృహమునందు పరమేశ్వరి గలదు.

మనలో ఉండే వెన్నెముకకు మేరుదండమని అంటారు. ఆ వెన్నెముక యొక్క మధ్య నుండి సుషుమ్నా మార్గము సహస్రార చక్రము వరకు ఉంటుంది. మనలో ఉన్న సుమేరు శృంగము యొక్క మధ్య స్థానమే మేరు అనబడుచున్నది. మేరు అను పదమును విడదీసిన మ్ + ఆ + ఇ + ర్ + ఉ. ఈ అయిదు అక్షరములు అయిదు శృంగములు. దీనిలో మధ్యలో ఉన్న అక్షరం ఇ కావున జగన్మాత సుమేరు శృంగ మధ్యస్థా అనబడుచున్నది. శ్రీచక్రంలోని మధ్యలో ఉన్న బిందువు మేరు శృంగమనవచ్చును. సుమేరు శృంగ మధ్యస్థా మొదలుకొని సుధా సాగర మధ్యస్థా అను నామము వరకు మనలో ఉన్న మాత నివాసమని గ్రహించదగును.

శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం సుమేరు శృంగ మధ్యస్థాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

56వ నామ మంత్రము 

ఓం శ్రీమన్నగర నాయికాయై నమః

శ్రీచక్రమే శ్రీవిద్యానగరమై, శుభప్రదమై, ఐశ్వర్యములతో కూడినదై, శ్రీమన్నగరమై అలరారగా, అట్టి శ్రీమన్నగరమునకు అధిష్ఠాత్రి అయిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి శ్రీమన్నగరనాయికా అను ఎనిమిది అక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం శ్రీమన్నగర నాయికాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకులను  ఆ జగన్మాత కరుణించి అన్ని దుఃఖములనుండి వారిని కాపాడి సర్వాభీష్టములను నెరవేర్చి, పరమపదమునకు మార్గమును జూపి తరింపజేయును.

ఇంతకు ముందు నామములో అమ్మవారిని సుమేరుశృంగమధ్యస్థా యని అన్నాము. అనగా అమ్మవారు ఉండు మేరుపర్వతము కాంచనమయము. అనగా బంగారు పర్వతము. మేరుపర్వతముపైన త్రికోణాకారంలో మూడు  శిఖరములు గలవు. అందులో ఒకటి తూర్పుశిఖరము. రెండవది నైరుతిశిఖరము. మూడవది వాయువ్య శిఖరము. ఈ మూడు శిఖరములు త్రిమూర్తులకు నిలయములు. తూర్పుశిఖరము బ్రహ్మకు, నైరుతి శిఖరము విష్ణువుకు, వాయువ్యశిఖరము మహేశ్వరునకు నిలయములు. ఈ మూడుశిఖరములనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులుగా కూడా చెప్పడం జరిగింది. ఈ మూడు శిఖరముల మధ్య నాలుగువందల యోజనముల ఎత్తుగలిగిన నాలుగవ శిఖరమే పరమేశ్వరి నివాసస్థానము. పరమేశ్వరి నివాసస్థానమే శ్రీమన్నగరము. ఈ శిఖరమే సకలదేవతలచే ఆరాధింపబడుచున్నది. ఇచ్చట దేవతలు ఉండడంచేత సామాన్య మానవులకు కనబడదు. 

ఇంతకు ముందు శ్రీమన్నగరము మేరుపర్వతము మధ్యశిఖరము నందుగలదు అని చెప్పకొనుట జరిగినది. ఇక పరమేశ్వరి రెండవ నగరము (శ్రీమన్నగరము) సకల బ్రహ్మాండములకును బహిర్భాగమున పైన సుధాసాగరము గలదు. అంద రత్నద్వీపము మధ్య గలదు. దీనినే మణిద్వీపము అని కూడా అన్నారు.  ఆ రత్నద్వీపమే పరమేశ్వరి రెండవ శ్రీమన్నగరము.  ఈ సంగతి రుద్రయామళము నందు చెప్ఫబడినది. అనేక కోట్ల బ్రహ్మాండములను దాటి ఊర్ధ్వభాగమునందు సహస్రకోటియోజన విస్తారము గల రత్నద్వీపము మధ్యనున్న, దీనినే జగద్ద్వీపము అనియు ఆ ద్వీపములో ప్రతీగోడ మూడులక్షల యోజనముల ఎత్తుగలిగి యుండుననియు ఆ గోడలు ఇరువదిఐదు తత్త్వస్వరూపములతో అలరారుచున్నదనియు కూడా చెప్పబడినది.

 శ్రీ అనగా లక్ష్మి,  సంపద, ఐశ్వర్యము, త్రివర్గము,  వృద్ధి, శోభ, అలంకరణము, కీర్తి, బుద్ధి, సరస్వతి. ఇన్ని అర్థములు ఉన్నవి. ఇన్ని అర్థములు కూడా పరమేశ్వరి నివాసస్దానమునకు  సమన్వయించవచ్చును. ఆ నివాసస్థానమే శ్రీమన్నగరము, అచట నివసించు ఆ పరమేశ్వరి శ్రీమన్నగరనాయకీ యని అనబడినది.

శ్రీ అనగా లక్ష్మి, సంపద, ఐశ్వర్యము అను అర్థములు తీసుకుంటే, ఎక్కడైతే సకల సంపదలు, అష్టైశ్వర్యములు ఉంటాయో దానినే శ్రీమన్నగరము అంటారు. అదే లక్ష్మీనివాసస్థానము. ఆ నగరమునకు నాయిక అయిన పరమేశ్వరి శ్రీమన్నగరనాయికా యని అనబడినది. శ్రీమన్నగరమునకు పరమేశ్వరి నాయిక అవడంచేత శ్రీమహారాజ్ఞీ యని శ్రీలలితా సహస్ర నామావళి యందు అన్నాము.

శ్రీ అనగా త్రివర్గము. త్రివర్గము అంటే ధర్మార్థకామములు - ధర్మార్థకామముల నిర్వహణ క్రమము తప్పని స్థితిలో ఉండే నగరమే శ్రీమన్నగరము అని కూడా అనవచ్చు. ధర్మార్థకామములు ఎచ్చటనైతే పరిరక్షింపబడతాయో అటువంటి నగరమునందు పరమేశ్వరి ఉన్నది గనుక ఆ తల్లి శ్రీమన్నగరనాయికా యని అనబడినది. ధర్మార్థకామములు పరిరక్షింపబడిన చోట ఆ పరమేశ్వరి ఉంటూ నాలుగవ పురుషార్థమైన మోక్షమును ప్రసాదించి పురుషార్థప్రదాయనీ యని కూడా ఆ పరమేశ్వరి అనబడుచున్నది.

సత్త్వరజస్తమో గుణములు అను త్రివర్గము పరమాత్మ నుండియే ఉద్భవించినను, సత్వరజస్తమోగుణ నిలయమైన ప్రకృతిచే పరమాత్మ ఎన్నడును     ప్రభావితుడు కాడు. కనుకనే పరమాత్మ నిర్గుణుడు. అనగా గుణములు అతడి నుండియే కలుగుచున్నను అతనిపై ప్రభావమును చూపలేవు. అదియే పరమాత్మయొక్క ప్రత్యేక లక్షణములలో ఒకటి. సత్త్వరజస్తమోగుణములకు అతీతమైన నగరమే శ్రీమన్నగరము. అటువంటి శ్రీమన్నగరమునకు అధినేత్రియైన పరమేశ్వరి శ్రీమన్నగరనాయికా యని అనబడినది.

క్షయస్థానవృద్ధులు. వీటినే సృష్టిస్థితిలయములు అందురు. సృష్టిస్థితిలయకార్యములకు ఆ పరమేశ్వరియే కారణము. ఆదిపరాశక్తి సృష్టికి ముందు, సృష్టికి తరువాత, లయకాలము మరియు లయకాలముల తరువాతకూడా తానేయుండును. మిగిలినవి ఏమియు ఉండవు. సృష్టిస్థితిలయకారిణియైన పరమేశ్వరి నివాసస్థానము శ్రీమన్నగరమౌతుంది, ఆ పరమేశ్వరి శ్రీమన్నగరనాయికా యని అనబడుతుంది.

శ్రీమన్నగరమే మణిద్వీపము. అటువంటి మణిద్వీప వర్ణన పఠించినను, పఠింపజేసినను, విన్నను, వినిపించినను పాపములన్నియు పోయి ఆ పరమేశ్వరి పరంధామమే జన్మాంత్యముస సంప్రాప్తించును అందుచే మణిద్వీపమనబడే శ్రీమన్నగర వర్ణన ఇచట సమర్పించడమైనది.

మణిద్వీప వర్ణనము

మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉన్నది. మణిద్వీపాన్ని సర్వలోకమని కూడా అంటారు. 

మణిద్వీపానికి నాలుగు వైపులా అనేక యోజనముల పొడవు, విస్తీర్ణముగల అమృతమయమైన సముద్రముగలదు. ఇందు రత్నములతో కూడిన ఇసుక, బంగారు చేపలు, ముత్యములతోను నిండియున్నది. ఈ సముద్రమునకు అన్ని దిశలయందును రత్నాల వృక్షములు గలవు. ఈ సముద్రమునకు ఆవల ఇరువది ఐదు ప్రాకారములు గలవు.  అవి:

1. లోహమయ ప్రాకారము: ఈ ప్రాకారములో సుశిక్షుతులైన భటులు ఉందురు. ఈ ప్రాకారమునకు నాలుగు ద్వారములు గలవు. ఈ ప్రహారీయందు పరమేశ్వరి భక్తులు దర్శనార్థము వేచియుందురు. అమ్మవారి దర్శనార్థము వచ్చిన దేవతలకొరకు నివాసస్థానములు గలవు. ఆ దేవతల వాహనములు, విమానములు ఇచటనే ఉండును. ఇచట ఉన్న సరోవరములలో మధుర జలములు ఉండును. ఈ ప్రాకారములో అనేకమైన ఉద్యానవనములు గలవు. లోహప్రాకారమునకు ముందు కాంస్యప్రాకారము గలదు. 

2. కాంస్య ప్రాకారము ఈ ప్రాకార శిఖరము ఆకాశమును తాకుచూ ఉండును. గోపురములు, ద్వారములతోను అందముగా ఉండును ఈ ప్రాకారము. ఇక్కడ అనేక జాతుల దేవతా వృక్షములు గలవు. పుష్పములు, ఫలములతో ఆ వృక్షములు నిండియుండును. పుష్పములు పరిమళభరితములై యుండును. అనేకమైన ఉద్యానవనములు, పద్మములతో నిండి ఉండిన కొలనులు ఉన్నవి. కోకిలలు, రామచిలుకల కలరవములతోను, భ్రమరముల ఝంకారనాదములుతోను వీనులువిందుగా ఉండును. కాంస్యప్రాకారమునకు ఆవల తామ్రప్రాకారము గలదు.

3. తామ్ర ప్రాకారము ఈ ప్రాకారమునకు నాలుగుకోణములు, వందయోజనముల యెత్తును గలదు. కాంస్యప్రాకారమునకును, తామ్రప్రాకారమునకు మధ్య ఆవణలో సుందరమైన వాటిక గలదు. పుష్పములు బంగారమును బోలియుండును. ఆకులుగూడ బంగారమువలె మెరయుచుండును. ఫలములలోని బీజములు రత్నములవలె ఉండును. ఇచటి సుమపరిమళములు పదియోజనముల వరకూ వ్యాపించియుండును. ఇచట పుష్పములయొక్క గొడుగునీడలో వసంతుడు గలడు. అతనికి మధుశ్రీ, మాధవశ్రీ అను ఇరువురు భార్యలు గలరు. ఈ దేవీమణులు ఇరువురు పూలబంతులతో ఆడుకొనుచుందురు. ఇచ్చటగల వాటిక మకరందముతో నిండియుండును. గంధర్వుల గానములు, గంధర్వకాంతల నాట్యములు కన్నుల విందుగొలుపుచుండును. ఈ తామ్రప్రాకారమునకు ముందు సీసప్రాకారము గలదు.

4. సీస ప్రాకారము సీసప్రాకారము ఉన్నతముగాను, ఏడు యోజనములు పొడవుగాను ఉండును. ఇచ్చట సంతానమను పేరుగల వృక్షవాటిక గలదు. అచటి పుష్పముల సుగంధము పదియోజనముల వరకును వ్యాపించియుండును. పుష్పములు పసిడికాంతులతో  శోభిల్లుచుండును. అమృత సమానమైన రసభరితములగు ఫలములతో వృక్షములు నిండియుండును. ఈ వాటికకు స్వామి గ్రీష్మ ఋతువు. ఇతనికి శుకశ్రీ, శుచిశ్రీ యను ఇరువురు భార్యలు గలరు. ఈ వృక్షముల మూలములు సిద్ధులు, దేవతలతో నిండియుండును. ఈ ప్రాకారమునకు ముందు అత్యంత సుందరమైన ఇత్తడి ప్రాకారము గలదు. 

5. ఇత్తడి ప్రాకారము ఈ ప్రాకారము పొడవు ఏడు యోజనములు. ఇత్తడి ప్రాకారమునకును, సీస ప్రాకారమునకును మధ్య మలయగిరి వృక్షవాటిక గలదు.  ఇచ్చట మేఘములమీద స్వారీచేయు వర్ష ఋతువు ఈ ప్రాకారమును వ్యవస్థీకరించుచుండును. దీని నేత్రములు పింగళవర్ణములు. ఇది మేఘరూప కవచమును ధరించియుండును. విద్యుల్లతలు తళతళ మెరయుచుండును. వర్షరాజు మేఘరూపమున గర్జించుచుండును. ఇతని చేతిలో ఇంద్రధనుస్సు ఉండును. నభఃశ్రీ, నభస్యశ్రీ, స్వరస్యా, రస్యమాలినీ, అంబాదులా, నిరత్ని, అభ్రమంతి, మేఘయంతిక, వర్షయంతి, చివునిక, వారిధార, సమ్మత అను నామములతో ప్రసిద్ధులైన ఈ పండ్రెండు శక్తులు వర్షఋతువు యొక్క పత్నులుగ చెప్పబడుదురు. వీరు సదా మదవిహ్వలులై యుందురు. ఇచటి వృక్షములు క్రొత్త చివురుటాకులతోను, లతలు రంగురంగుల పుష్పములతోను మనోహరముగా అలరారు చుండును. ఈ ఆవరణలో నదీనదములు అత్యంత సొంపుతో ప్రవహించుచుండును. దేవతలు, సిద్ధులు ఇచట దేవీ యజ్ఞములతో సందడిగా ఉందురు. పరమేశ్వరి కొరకు వాపీ, కూప తటాకములు నిర్మించిన పుణ్యాత్ములు ఇచట ఉందురు. ఈ ఇత్తడి ప్రాకారమునకు ఆవల ఏడు యోజనముల పొడవు గల పంచలోహనిర్మితమైన ప్రాకారము గలదు.

6. పంచలోహ ప్రాకారము ఈ పంచలోహ ప్రాకారమునకును, ఇత్తడి ప్రాకారమునకును మధ్య మందారమను దివ్యమైన వృక్షవాటిక గలదు. రకరకములైన పుష్పములతోను, లతలతోను ఈ ఉపవనము వ్యాపించి అత్యంత రమణీయమై యొప్పును. దీనికి శరద్ ఋతువు పవిత్రాత్మయై అలరారుచుండెను. ఇతనికి ఇషులక్ష్మి, ఊర్జలక్ష్మి అను పేర్లుగల ఇరువురు దేవేరులుగలరు.  సిద్ధపురుషులు పత్నీసమేతంగా ఇచ్చట ఉందురు. ఈ ప్రాకారమునకు ఆవల రజతప్రాకారము గలదు. 

 7. రజిత ప్రాకారము ఈ ప్రాకారము కూడ ఏడు యోజనములు పొడవుకలిగి యుండును. విశాలమైన ఈ ప్రాకారము శిఖరము అత్యంత శోభాయమానమై యొప్పుచుండును. పారిజాత పుష్పసుగంధములు యోజనముల మేర వ్యాపించియుండును. ఈ పుష్పములు దేవీ యజ్ఞములయందు నిరంతరము ఉపయోగింపబడుచుండును. మహోజ్జ్వలమైన హేమంత ఋతువు ఈ ప్రాకారమునందు యజమాని. ఇతడు ఆయుధములు ధరించి యుండును. ఈ హేమంతునికి  సహశ్రీ, సహస్యశ్రీ అను పేర్లుగల రెండు శక్తులు గలవు. ఈ రజిత ప్రాకారమునకు ఆవల సువర్ణనిర్మితమైన ప్రాకారము గలదు.

8. సువర్ణమయ ప్రాకారము ఈ ప్రాకారము పొడవు ఏడు యోజనములు. దీనిని సౌవర్ణశాల అని పిలచుదురు. ఈ ప్రాకారము మధ్య కదంబవాటిక గలదు. శిశిర ఋతువు ఈ ప్రాకారమునకు క్షేత్రపాలకుడు. తపఃశ్రీ, తపస్యశ్రీ అను పేర్లతో శిశిర ఋతువునకు భార్యలు. వీరు కూడా శిశిర ఋతువువలెనే ప్రసన్నవదనులై యుందురు. ఇచట అమ్మవారిని ప్రసన్నమొనర్చుటకు గోదాన, భూదానములు చేయు మహాసిద్ధపురుషులు ఉందురు. ఈ బంగారు ప్రాకారమునకు ముందు కుంకుమతో సమానమైన అరుణకాంతులతో విలసిల్లు పుష్పరాగమణి ప్రాకారము గలదు.

9. పుష్పరాగమణి ప్రాకారము ఈ ప్రాకారము కూడ ఏడుయోజనముల పొడవు ఉండును. ఈ ప్రాకారము అరుణకాంతులతో భాసిల్లియుండును. ఈ ప్రాకారమునందలి భూమి, వనములు,  ఉపవనములన్నియును పుష్పరాగమయములే అయి ఉండును. అచటి వృక్షములు, ఇసుక తిన్నెలు పుష్పరాగ రత్నములవలె భాసిల్లుచుండును. రత్నములతో ఈ ప్రాకారము నిర్మితమై యుండును. అదే రత్నములతో అచటి వృక్షములు, నేల, పక్షులు, నీరు, మండపములు, స్తంభములు, సరోవరములు, కమలములు తయారు చేయబడియుండును. ఇంకను ఆ ప్రాకారములోని వస్తువులన్నియును పుష్పరాగమణులతో నిర్మించబడినవి.

పుష్పరాగనిర్మిత ప్రాకారము ముందు కుంకుమతో సమానమైన అరుణకాంతులను వెదజల్లు పద్మరాగమణులతో ఒక ప్రహారీ నిర్మింపబడినది.

 10. పద్మరాగమణి ప్రాకారము ఈ పద్మరాగ ప్రాకారము పదియోజనముల పొడవు గలది. అనేక గోపురములు, ద్వారములతో సుశోభితమై యున్నది. ఇచటగల వందల కొలదీ మండపములు పద్మరాగములతో నిర్మింపబడిన స్తంభములతోను అరుగులతోను  కూడియున్నది. ఈ ప్రాకారము మధ్యలో ఆయుధములను ధరించి రత్నభూషణములతో అలంకరింపబడిన వీరవేషధారులైన  అరువది నాలుగు కళలు ఇచట నివసించును. ఈ అరువది నాలుగు కళలకు ఒక్కొక్క కళకు ఒక లోకము కలదు. ఆ అరువది నాలుగు కళలు:

పింగళాక్షి, విశాలాక్షి సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహా, స్వధా, అభిఖ్య, మాయా, సంజ్ఞ, వసుంధర, త్రిలోకధాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదశేశ్వరి, సురూప, బహురూప, స్కందమాత, అచ్యుతప్రియ, విమల, అమల, అరుణి, హారుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, మాత, సంధ్య, పరమసాధ్వీ, హంసీ, మర్దిక, వజ్రిక, దేవమాత, భగవతి, దేవకి, కమలాసన,  త్రిముఖ, సప్తముఖ, సురాసుర విమర్దిని, లంబోష్ఠి, ఊర్ధ్వకేశి, బహుశీర్ష, వృకోదరి, రథరేఖ, శశిరేఖ, గగనవేగ, పవనవేగ, భువనపాల, మదనాతుర, అనంగ, అనంగమథన, అనంగమేఖల, అనంగకుసుమ, విశ్వరూప, సురాదిక, క్షయంకరి, శక్తి, అక్షోభ్య, సత్యవాదిని, బహురూప, శుచివ్రత, ఉదార, వాగీశి - ఇవి అరువది నాలుగు కళలుగ చెప్పబడినవి. ఈ కళలయొక్క ముఖములన్నియును మండుచున్న జిహ్వలతో కూడియుండును. వీరు తమ నోళ్ళనుండి అగ్నిని క్రక్కుచుండును. "మేమందరము జలమును త్రాగివేయుదుము. మా ఎదుట నిలుచు శక్తి అగ్నికి లేదు. మేము వాయువును ఆపివేయుటయందు తత్పరులమై యున్నాము. ఇప్పుడిప్పుడే సకలజగత్తు మాకు ఆహారమగును" ఈ విధముగ శబ్దముల నుచ్చరించు ఆ కళలు క్రోధావేశపూరితములై సదా కనులు ఎర్రబారియుండును. ఆ కళలన్నిటి చేతులలో ధనుర్బాణములు శోభిల్లుచుండును. ఈ అరువది నాలుగు కళలలో ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్క అక్షౌహిణీ సైన్యముండును. వారు దంతములు కొరికితే దిక్కులు పిక్కటిల్లునట్లుండును. ఆ కళలవద్ధ ఉన్న సైనికులు పింగళవర్ణమును కలిగి పైకి లేచిన కేశములతో విరాజిల్లుచుందురు. ఒక్కొక్క శక్తికి బ్రహ్మాండములను సంహరించు సామర్ద్యముగలదు.  ఈ కళలన్నియు పరమేశ్వరి శక్తిసైన్యములుగా భావించనగును. ఈ పద్మరాగమయ ప్రాకారమునకు ముందు గోమేధికమణి ప్రాకారము గలదు.

 11. గోమేధికమణి ప్రాకారము ఈ గోమేధికరత్నప్రాకారము పదియోజనముల పొదవు గలదు. దీని కాంతి జపాకుసమములవలె ఎర్రగా భాసిల్లుచుండును. దీని మధ్యభాగముకూడా జపాకుసుమవర్ణములోనే ఉండును. గోమేధికప్రాకారము వర్ణములోనే ఆ ప్రాకారములోని భవనములు మొదలగునవి ఉండును. ఈ ప్రాకారమునకు మధ్యభాగమునందు ముప్పదిరెండు ప్రసిద్ధమైన మహాశక్తులు గలరు. వీరు ఆయుధములను ధరించి ఉందురు. ఈ శక్తులలో ఒక్కొక్క శక్తి వెంట పది అక్షౌహిణుల చొప్పున సైన్యము ఉందురు. అన్ని శక్తులలో ప్రతీ శక్తికి ఒక బ్రహ్మాండమును సంహరించగల సామర్థ్యము గలదు. వీరు పరమేశ్వరి అంతరంగ సైన్యము. వారి నామములు: విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినీవారి, కుహు, రుద్ర, వీర్య, ప్రభ, ఆనంద, పోషిణి, రుద్రిద, కాలరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతి, దండిని, ముండిని, సేందుఖండ, శిఖండిని, నిశుంభ - శుంభమథిని, మహిషాసురమర్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్ధ్రశరీరిణి, నారి, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, హ్లాదిని - ఈ ముప్పదిరెండుమంది శక్తులకు కోపమువచ్చినచో బ్రహ్మాండమంతయు వెంటనే నశించును. ఇదియంతయు అమ్మవారి శ్రీమన్నగరము యొక్క భద్రతా సిబ్బంది యని తెలియదగును. ఈ గోమేధిక ప్రాకారము ముందు వజ్రనిర్మితమైన ప్రాకారము గలదు.

 12. వజ్రాల ప్రాకారము ఈ వజ్రాలప్రాకారము పదియోజనముల పొడవుగల ఉన్నతమైన ప్రాకారము. ఈ ప్రాకారము మధ్యభాగమంతయు వజ్రనిర్మితము. పెద్దపెద్ద భవనములు, వీథులు, నాలుగుత్రోవలు కలియు కూడలులు, రాజమార్గములు, వృక్షములు, లతలు, శారఙ్గము మొదలగు పక్షులు - ఇవి అన్నియును వజ్రములవలె ప్రకాశించును. అమ్మవారి పరిచారికలు ఇచ్చట ఉందురు. ఒక్కొక్క పరిచారికను సేవించుచు మదోన్మత్తులై నానావిధ సామాగ్రితో లక్షలకొలది దాసీజనమిచట నివసించెదరు. ఈ పరిచారికలు అందరును అందమైన వస్త్రములను ధరించియుందురు. వీరందరు అమ్మవారి దూతలు అని అందురు వీరి పేర్లు: అనంగరూప, అనంగమదన, సుందరి, మదనాతుర, భువనవేద, భువనపాలిక, సర్వశిశిర, అనంగవేదన, అనంగమేఖల - వీరి  అంగములు మెరపుతీగలవలె ప్రకాశించుచుండును. విద్యుల్లతలవలె ప్రకాశించు ఈ దూతికలందరు శోభాయమానముగా తిరుగుతూ కనులవిందుచేయుచుందురు. వీరు ఎనిమిది దిక్కులందు రకరకములైన వాహనములలో తిరుగుచుందురు. వీరికి సుందరమైన భవనములు నిర్మించబడినవి. ఈ వజ్రమయ ప్రాకారమునకు ముందు వైడూర్యమయ ప్రాకారము గలదు.

13. వైడూర్య ప్రాకారము  ఈ ప్రాకారము అత్యంత ఉన్నతంగా, పదియోజనముల పొడవు ఉండును. ఇందుగల భవనములు, వీధులు, కూడళ్ళు సమస్తము వైడూర్యమణుల నిర్మితము. ఈ ప్రాకారములో ఎనిమిది దిశలందు బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, ఇంద్రాణి, చాముండ అను సప్తమాతృకలు ఉండగా ఎనిమిదవ మాతృక మహాలక్ష్మికూడా ఉండును. వీరి ఆకారములు బ్రహ్మరుద్రాది దేవతలను పోలియుండును. వైడూర్యమణి ప్రాకారమునకు ముందు ఇంద్రనీల మణులతో నిర్మింపబడిన ప్రాకారము గలదు.

14. ఇంద్రనీల మణి ప్రాకారము ఈ ప్రాకారమునకు మధ్యనున్న భూమి, వీధులు, రాజమార్గములు, భవనములు, వాపీకూప తటాకములు, లోయలు కూడా ఇంద్రనీలమణులతోనే నిర్మింపబడినవి. ఈ ప్రాకారమునందు అనేక యోజనముల విస్తీర్ణముగల కమలము ఒకటిగలదు. పదహారు అంచులుగల సుదర్శనచక్రం వలె ఉంటుంది ఆ కమలం. ఆ పదహారు అంచుల కమలంపై పదహారు శక్తులు ఉన్నవి. ఆ శక్తుల నామములు: కరాళి, వికరాళి, ఉమ, సరస్వతి, శ్రీదుర్గ, ఉష, లక్ష్మి, శ్రుతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేథ, మతి, కాంతి, ఆర్య - ఈ పదహారుగురు నీలమేఘవర్ణముతో సుశోభితులై యుండిరి. వీరి చేతిలో కత్తి, డాలు కలిగి, యుద్ధలాలసతో ఉందురు. వీరికి ఆ పరమేశ్వరియే అధినేత్రి. ఈ ఇంద్రనీలమణి ప్రాకారమునకు ముందుభాగమున ఒక విశాలమైన ముక్తాప్రకారము ఉన్నది.

 15. ముత్యాల ప్రాకారము దీని ఎత్తు పదియోజనములు. ఈ ప్రాకారము మధ్య అంతయును ముత్యాలనిర్మితము. ఈ ప్రాకారము మధ్య ఒక అష్టదళ కమలము గలదు.  ఈ విశాలకమలము ముత్యములు, మణులతో కూడిన కేసరములతో కూడియుండును. ఈ ఎనిమిది దళములందు పరమేశ్వరిని బోలిన ఆకారముగల దేవీమణులు ఆయుధములను చేబూని సదా విరాజమానలై యుందురు. ఈ ఎనిమిది మంది దేవీమణులు అమ్మవారికి మంత్రులని చెప్పబడుదురు. వీరు అత్యంత సౌందర్యవతులు. వీరి నామములు: అనంగకుసుమ, అనంగకుసుమాతుర, అనంగమదన, అనంగమదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ. వీరు ఎర్రనిరంగుతో ఉందురు. చేతులందు పాశ, అంకుశ, వరద, అభయముద్రలను ధరించియుందురు. విశ్వమునకు సంబంధించిన వార్తలను బోధించుట వీరి ప్రముఖకార్యమైయుండును. ఈ ముక్తాప్రాకారమునకు ముందు మహామరకతమణినిర్మితమైన ఒక రెండవ ప్రాకారము గలదు 

16. మరకతమణి ప్రాకారము ఈ ప్రాకారము పదియోజనముల పొడవుగలిగి అన్ని ప్రాకారములకంటె శ్రేష్ఠతను కలిగియుండును. ఈ ప్రాకారమునందు పరమేశ్వరియొక్క ఆరుకోణములుగల విశాలమైన యంత్రమొకటిగలదు. ఆరుకొణములయందలి తూర్పుకోణము నందు చతుర్ముఖబ్రహ్మ, భగవతి గాయత్రితో విరాజిల్లుచుండును. ఈయన చేతియందు కమండలము, అక్షసూత్రము, అభయముద్రా దండము, శ్రేష్ఠమైన ఆయుధమును ధరించియుండును. భగవతి గాయత్రికూడా ఈ ఆయుధమలనే ధరించియుండును.  వేదములు, వివిధశాస్త్రములు మూర్తిమంతములై ఇచట శోభిల్లుచుండును. స్మృతులు, పురాణములు కూడ ఆకారములను ధరించియుండును. బ్రహ్మస్వరూపులు, గాయత్రీస్వరూపులు, వ్యాహృతుల విగ్రహములు ఇచట నిత్యము నివసించును. 

నైరృతీదిశయందు శంఖ, చక్ర, గదా, పద్మములను ధరించి భగవతి సావిత్రి విరాజమానయై యుండును. విష్ణుభగవానుడు కూడ ఇట్టి వేషమునే ధరించియుండును. విష్ణుమూర్తి అవతారములు, గాయత్రీ విగ్రహము ఇచటగలవు.  గండ్రగొడ్డలి, అక్షమాల, అభయ, వరముద్రలను ధరించి మహారుద్రుడు దీనికి వాయవ్య దిశయందు నివసించును. సరస్వతీ దేవి కూడా ఈ వేషమునందే ఇచటనున్నది. దక్షిణామూర్తి, గౌరీ, అరువదినాలుగు ఆగమములు ఇచట ఉన్నవి. కుబేరుడు కూడా రత్నమయ కలశమును, మణికరండమును రెండుచేతులతో ధరించియుండును. కుబేరుడు అమ్మవారి కోశాగారమును రక్షించుచుండును. మన్మథుడు, రతీదేవి ఇచట ఉన్నారు. ఈశాన్యదిశయందు గణేశ్వరుడు ఇచట ఉన్నాడు. ఈ మరకత ప్రాకారమునకు ముందు వందయోజనముల పొడవైన పగడాలప్రాకారము గలదు.

 17. పగడాల ప్రాకారము ఈ ప్రాకారము పగడవర్ణశోభితమై యుండును. దీనిమధ్య భూమి, భవనములు కూడ అరుణవర్ణరంజితమై యుండును. ఈ ప్రాకారమునందు పంచభూతముల అధిపతులు ఉందురు. వారి నామములు: హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్ఛుష్మ - వీరు ఐదు శక్తులు కలిగియుందురు. వీరు అమ్మవారి వలెనే యుందురు. ఈ పగడప్రాకారమునకు ముందు మాణిక్యప్రాకారము గలదు.

18. మాణిక్యరత్న ప్రాకారము ఈ ప్రాకారము నవరత్నములతో నిర్మింపబడి అనేక యోజనముల పొడవు గలదు. ఆగమప్రసిద్ధమై ఆమ్నాయ మను పేరుగల దేవతల అనేక భవ్యభవనములు ఇచట అలరారుచున్నవి. ఇవి అన్నియును నవరత్నములు.  పరమేశ్వరి అవతారములన్నిటికిని నివాసమిదియే. మహావిద్యయొక్క అవతారములన్నియును ఇచట విరాజిల్లుచుండును.  కోట్లకొలది సూర్యులతో సమానమై వెలుగొందు సకలదేవీమణులు తమ అంగరక్షక శక్తులతోను, ఆభరణములతోను, వాహనములతోను ఇచట అనుపమాన శోభాయమానలై యుందురు. ఏడుకోట్ల మహామంత్రములకు అధిదేవతలైన వారికి కూడ ఇచట స్థానముండును.

ఈ నవరత్నమయ ప్రాకారమునకు ముందు చింతామణి గృహముగలదు. ఇచట ఉన్న సమస్తమూ చింతామణి నిర్మితములే. సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలవలె ప్రకాశించెడి రాళ్ళతో నిర్మితమైన వేలకొలది స్తంభములు ఈ భవనమందు అమర్చబడినవి.

మణిద్వీపమునకు తూర్పుదిశయందు ఉన్నత శిఖరముగల అమరావతీ నగరము గలదు. ఇది ఇంద్రుని పట్టణము కంటెను సుందరముగా ఉండును. ఇచట వేలఇంద్రుల తేజస్సుతో మహేంద్రుడు, దేవసేనలతో భాసిల్లుచుండును. ఇచటి ఇంద్రుడు నూరు యజ్ఞములు చేసిన ప్రతాపవంతుడు. శచీదేవకూడా తన చెలికత్తెలతో విహరించుచుండున.

మణిద్వీపమునకు ఆగ్నేయదిశయందు అగ్నితో సమానమైన వహ్నిపురముగలదు. ఇచట స్వాహా, స్వధా యను భార్యలతో అగ్నిదేవుడు తేజరిల్లు చుండును.

మణి ద్వీపమునకు దక్షిణమున యమరాజపురముగలదు. అచట యముడు, చిత్రగుప్తుడు, యముని మంత్రులు, అనుచరులతో కొలువుదీరి యుండును.

నైరుతిదిశయందు రాక్షసనగరము గలదు. ఈ పురము మణిద్వీపమునకు నైరుతి కోణమునందుగలదు. ఇచ్చట నిరృతి తన ఖడ్గముతోను, రాక్షస శక్తితోను పరివేష్టితుడై యుండును. 

మణిద్వీపమునకు పశ్చిమ దిశలో వరుణుడు తన పాశముతో విరాజిల్లు చుండును. మహామత్స్యము ఇతని వాహనమ.  మధువునే మధుపానముగా వరుణుడు స్వీకరించును. ఇతడు మధుపానముతో విహ్వలుడై శక్తులతో, గణములతోను విరాజిల్లుచుండును. 

మణిద్వీపమునకు వాయువ్యదిశయందు వాయులోకము గలదు. ఇచట వాయుదేవుడు ప్రకాశమానుడై యుండును. ఇచట ప్రాణాయామము చేయగల మిక్కిలి నేర్పరులైన సిద్ధయోగులతో వాయుదేవుడు కొలువుదీరియుండును. వాయుదేవుడు మృగవాహనుడు. వాయుదేవుడు మరుద్గణపరివృతుడై యుండును.

మణిద్వీపమునకు ఉత్తరదిశయందు యక్షుల మహాలోకము గలదు. ఇచట యక్షులకు రాజైన కుబేరుడు ఉండును. ఇతడు తన బుద్ధి-వృద్ధి మొదలగు శక్తులతో నవనిధులతో కూడి యుండును. మణిభద్రుడు, పూర్ణభద్రుడు, మణిమానుడు, మణికంధరుడు, మణిభూషణుడు, మణిమాలి, మణిధనుర్ధరుడు మొదలైన నామములతో ప్రసిద్ధులైన  యక్షసేనలను వెంటనిడుకొని మహానుభావుడై కుబేరుడు విరాజిల్లుచుండును. 

మణిద్వీపమునకు ఈశానకోణమునందు మహారుద్రలోకము కలదని చెప్పబడినది. అమూల్య రత్నములతో చిత్రితమైన ఈ లోకమునందు రుద్రుడు నివసించును. క్రోధప్రపూర్ణమైన ఇతని విగ్రహము మండుచున్న  నేత్రములతో సంపన్నమైయుండును. ఈ స్వామి వీపు నందు గొప్ప అమ్ముల పొదిని కట్టుకొని యుండును. పటుత్వమున్న ధనుస్సు వామహస్తము నందుండును. తనవంటి అసంఖ్యాకులైన రుద్రులు త్రిశూలములను చేబూని శ్రేష్ఠధనువులతో ఈ స్వామికి సహాయపడుచుందురు. ఈ సహాయరుద్రులు వికృతములైన ముఖములతో భయంకరాకారులై యుందురు. వారి నోటినుండి అగ్నిజ్వాలలు వెలువడుచుండును. చాలామంది పదితలలవారు, ఎంతోమంది వందచేతులు గలవారు, ఇంకెంతమందో వేయి చేతులతో సంపన్నులై యుందురు. ఎంతోమంది భయంకరులై పదికాళ్ళు, మూడునేత్రములతో శోభిల్లుచుందురు. పరమేశ్వరుడు ఈ లోకమునందు సకల రుద్రులతో కొలువుతీరినవాడై యుండును. కోట్లాదిమంది రుద్రాణులు, భద్రకాళీలు మొదలైన మాతృకాగణములు ఈ స్వామివెంట నుండును. ఈ స్వామి వివిధశక్తులతో కూడి ఢామరీ మొదలగు గణములతో చుట్టుకొనబడియుండును. ఇతని గళమునందు కపాలమాల, చేతియందు సర్పవిలయము, భుజమునందు సర్పమయమైన యజ్ఞోపవీతము, శరీరమునందు పులిచర్మము, గజచర్మమును ఉత్తరీయముగ ధరించి ఆ స్వామి శోభిల్లుచుండును. తన సర్వాంగములందును చితాభస్మము అలదుకొనియుండును. ప్రమదాది గణములు ఆ స్వామి వెంటనే యుందురు. ఆయన ఢమరుకధ్వని దిక్కులుపిక్కటిల్లునట్లుండును. ఆ స్వామి అట్టహాసము ప్రళయగర్జనవలె ఉండును. ఆయన ఈశాన్య దిశకు ప్రభువు గనుక ఆయన ఈశానుడు అని యనబడుచున్నాడు. 

నవరత్నప్రాకారమునకు మధ్యభాగమునందు శోభాయమానమైన చింతామణిగృహమే జగన్మాత నివాసస్థలము. అందు నాలుగు మండపములు గలవు. ప్రతి మండపము వేయి స్తంభములతో కూడియున్నది.

 19. సహస్రస్తంభ మంటపములు నాలుగు మండపములలో మొదటిది శృంగారమండపము, రెండవది ముక్తిమండపము, మూడవది జ్ఞానమండపము, నాలుగవది ఏకాంతమండపము. 

ఈ మండపములందు అనేకమైన మణుల అరుగులు గలవు. అవి రకరకములైన ధూపపరిమళమలతో అలరారుచుండును.  ఈ సుందరమండపములు అన్నియును  కోటిసూర్యప్రభలతో తేజరిల్లుచుండెను. ఈ నాలుగుమండపములకు నలువైపున కేసరములు, మల్లికలు, కుందపుష్పముల ఉపవనములు గలవు. నాలుగు మండపములకు అన్నివైపుల మహాపద్మముల వనములు గలవు. వాటిమెట్లు రత్ననిర్మితములు. అసంఖ్యాకములైన ఉపవనములతో రమ్యమై సుగంధములతో మణిద్వీపము పరిమళమయమై యుండును.

 శృంగారమండపము మధ్యభాగమునంధు ఒక దివ్యసింహాసనమున పరమేశ్వరి విరాజమానురాలై యుండును. సభాసదుల రూపములో ప్రముఖ దేవతలు, దేవాంగనలు, సకల అప్సరసలు - రకరకములైన స్వరములతో భగవతి జగదంబ ఎదుట గానము చేయుచుందురు.

ముక్తి మండపము మధ్యభాగమునందు విలసిల్లు భగవతి శివాదేవి ప్రతి బ్రహ్మాండమునందు నివసించు భక్తులకు సదా ముక్తిని ప్రసాదించుచుండును. 

జ్ఞానమండపము భగవతి ఇచట వెలుగులను వెదజల్లుచు జ్ఞానముపదేశ మొనరించుచుండును.

ఏకాంత మండపము ఇచట జగన్మాత అనంగకుసుమ మొదలగు సచివ శక్తులతో ఆసీనురాలై జగద్రక్షణ విషయమున సమాలోచన జరుపుచుండును. 

చింతామణి గృహము పరమేశ్వరికి ప్రధానస్థానము. మూలప్రకృతియైన భగవతి భువనేశ్వరియొక్క పది శక్తితత్త్వములు సోపానరూపములో  ఇచట ఉపస్థితములై యుండును. వాటితో కూడిన భగవతి యొక్క ఉన్నతమైన వేదిక మహనీయ శోభలొలుకుచుండును. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, సదాశివుడు - ఈ నలుగురు దేవతలు ఆ వేదికకు (మంచమునకు) నాలుగు పాదములు. సదాశివుడు ఆ మంచమునకు ఫలకముగ చెప్పబడెను. దానిమీద మహామహిమాన్వితుడగు పరమేశ్వరుడు విరాజిల్లుచుండును. పరమేశ్వరి నడుము భాగమున నవరత్నములు పొదిగిన ఒడ్డాణముతో ఇనుమడించిన సౌందర్యముతో ఒప్పుచుండెను. తప్తకాంచనము, వైడూర్యములతో సిద్ధము చేసిన భుజకీర్తీలు ఆ పరమేశ్వరికి శోభనుకలుగ జేయుచున్నవి. ఆ భుజకీర్తులు శ్రీచక్రములవలె ఉన్నవి. గొడుగులవంటి తాటంకములు భగవతి ముఖమండలమును మనోహరముగ తీర్చిదిద్దును. పరమేశ్వరి లలాటకాంతి అష్టమిచంద్రుని శోభలనుకూడ తుచ్ఛముచేయుచున్నవి. ఆ తల్లి పైపెదవి పగడకాంతులను, క్రింది పెదవి దొండపండ్లను తిరస్కరించుచున్నవి. మనోహరమైన దంతపంక్తులు శుద్ధవిద్యాంకురములవలె ప్రకాశిస్తున్నవి. కుంకుమ, కస్తూరి కలిపిన తిలకము ముఖమండలమునకు అపారసౌందర్యమును కలుగజేయుచున్నది. ఆ పరమేశ్వరి సూర్యచంద్రులవంటి ఆకారములతో రత్ననిర్మితమైన దివ్యమగు చూడామణిని మస్తకమున ధరించియున్నది. శుక్రనక్షత్ర కాంతులను తిరస్కరించు నాసికాభరణము ఆ తల్లి ప్రకాశమును ఇనుమడింపజేయు పరమసాధనముగ రూపొందినది. ఆ పరమేశ్వరి కంఠాభరణమునందు  గల ముత్యముల గుత్తితో అతిశయ శోభాన్వితయై ఒప్పుచున్నది. చందనపంకము, కర్పూరము, కుంకుమలతో ఆ పరమేశ్వరి స్తనములు అలంకృతములై యున్నవి. విచిత్రములు, అద్భుతములైన ఆమె భుజస్కందములు శంఖములవలె సౌందర్యముతో అలరారుచున్నవి. అమూల్యరత్నములతో పొదిగబడిన మకుటమును తలపైధరించి రాజసముతో ఒప్పుచున్నది. పరమేశ్వరి ముఖకమలమందు ముంగురులు తుమ్మెదలవలె కదలుచున్నవి. మణులతో పొదిగిన ఉంగరము పరమేశ్వరి వ్రేలుకు క్రొత్త శోభలను అమర్చుచున్నది. కమలదళాకృతిని ధరించిన మూడునేత్రములతో ఆ శ్రీమాత అతిశయమనోహరముగ దర్శనమిచ్చుచున్నది. మెరుగుపెట్టి స్వచ్ఛమొనరించిన మహారాగములు, పద్మరాగములతో సమానమైన ఆ పరమేశ్వరి శరీరకాంతులు మహోజ్జ్వలమై తనరారుచున్నది. రత్ననిర్మిత కింకిణులతో, కంకణములతో ఆ పరమేశ్వరి అపురూప సౌందర్యవతివలె తేజరిల్లుచున్నది. మణుల, ముత్యాలసరుల యందున్న సహజలావణ్య శోభ ఆ పరమేశ్వరి చరణములనుండి ఉత్పన్నమైనది. ఆ పరమేశ్వరి నాలుగు భుజములు పాశ, అంకుశ, వర, అభయ ముద్రలతో సుశోతములై యున్నవి. ఆ పరమేశ్వరి తన పలుకుల మధురిమలతో సరస్వతీ దేవి కచ్ఛపీ వీణాస్వరమును తుచ్ఛమొనరించుచున్నది. సఖియలు, దాసీజనములు, దేవతాస్త్రీలు, సమస్త దేవసముహములు పరమేశ్వరిని నాలుగు వైపుల పరివేష్టించి ఆసీనులై యున్నారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులతో ఆ పరమేశ్వరి కూడియున్నది. లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ - ఇవి మూర్థిమంతములై భగవతిచెంత విరాజిల్లుచుండెను. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, దోగ్ధ్రీ, అఘోర, అమంగళ -  ఈ తొమ్మిదిమంది పీఠశక్తులు పరమేశ్వరి పరాంబిక సేవయందు సదా నిమగ్నులై యుందురు.

శంఖనిధి, పద్మనిధి, అను ఈ నిధులు పరమేశ్వరికి పార్శ్వభాగములందు గలవు.  నవరత్నవహ, కాంచనశ్రవ, సప్తధాతువహ అను పేర్లుగల నదులు శంఖ, పద్మ నిధులనుండి వెలువడినవి. ఈ నదులు సుధాసింధువునందు కలియును. ఈ విధముగ విశేషశక్తిశాలినియైన ఆ పరమేశ్వరి మహానుభావుడైన పరమేశ్వరుని వామాంకమున విరాజిల్లుచుండును. ఆ పరమేశ్వరి ప్రాభవమువలననే పరమేశ్వరునికి సర్వేశ్వరుడగు యోగ్యత ప్రాప్తించినది.

పరమేశ్వరియొక్క మణిద్వీపము అంతరిక్షలోకమునందు శోభిల్లుచున్నది. ప్రళయకాలమున నశింపదు. సృష్టికాలమునందు ఆవిర్భవించదు. ఆదిపరాశక్తి పరమేశ్వరివలెనే సదా ఉంటుంది. కోట్లకొలది సూర్యులు, చంద్రులు, అగ్నులు, విద్యుత్తులు ఈ మణిద్వీప దివ్యప్రభల యందలి ఒక్క అంశకు కూడ సరిపోలుటకు అర్హతను కలిగియుండవు. ఈ శ్రీమన్నగరమునందు ఒకచోట ముత్యముల వంటి ప్రకాశము వ్యాపించియుండును. కొంతభాగము మరకతములయొక్క సౌందర్యమును ధరించియుండును.  ఇంకొకచోట విద్యుత్తువలె, సూర్యునివలె మెరయుచుండును. ఈ శ్రీమన్నగరము యొక్క శిఖరము రత్నమయము. ప్రాకారములు, గోపురములు రత్ననిర్మితములు. ప్రకాశవంతమైన ఈ నగరమునందు దివ్య మయూరములు ఎల్లవేళల నృత్యము చేయుచుండును. కోకిలలు కుహుకుహు నాదములతో నినదించుచుండును. చిలుకలు మధురవచనములతో ఈ నగరమును ప్రతిధ్వనింప చేయుచుండును. శ్రీమన్నగరమునకు చుట్టు రమ్యమైన, స్వచ్ఛమైన జలములుగల లక్షలకొలది సరోవరములు పరివృతమై యుండును. మణిద్వీప మధ్యభాగమునందు వికసించిన రత్నమయ కమలములవలన ఈనగరము అనుపమ శోభలొలుకు చుండును. శ్రీమన్నగరమునకు నలువైపుల నున్న వంద యోజనముల భూమి దివ్యగంధములతో సదా పరిమళించుచుండును. పదివేల యోజనముల వరకు మెరయుచుండెడి మణిద్వీప ధూపముచేత శ్రేష్థమైన పరిమళములను వెదజల్లుచుండును. దర్పణములతో కూడి ఈ మణిద్వీపదిశలు చింతామణుల జ్యోతిఃపుంజములతో శోభలొలుకుచు అందరి మనస్సులను ముగ్ధము చేయుచుండును. సకలైశ్వర్యములూ, శృంగారములు, సర్వజ్ఞతలు, తేజస్సులు, పరాక్రమములు, ఉత్తమ గుణములు, దయలు ఈ శ్రీమన్నగరము అనెడి మణిద్వీపమునందు సమాప్తములగుచున్నవి. రాజుయొక్క ఆనందము నుండి బ్రహ్మలోకము వరకు ఉన్న ఆనందము లన్నియును ఈ శ్రీమన్నగరమునందు నెలకొనియున్నవి. ఇది శ్రీమన్నగరము. మణిద్వీపము అని కూడా యనబడే ఈ నగరము పరమేశ్వరియొక్క పరమధామమ. అన్ని లోకములకంటె శ్రేష్ఠమైనది. ఈ శ్రీమన్నగరము అనబడే మణిద్వీపమును స్మరించినంతనే సకలపాపములు నశించును. మరణసమయమున మణిద్వీపమును స్మరించిన ప్రాణి ఆ ధామమునకే వెళ్ళును. ఈ మణిద్వీపము అనబడే పరమేశ్వరియొక్క శ్రీమన్నగరమును గూర్చి విన్నను, వినిపించినను, పఠించినను, పఠింపజేసినను భూత, ప్రేత, పిశాచాది బాధలనుండి ముక్తులగుదురు. నూతన గృహము నందు వాస్తుదేవతను పూజించు సమయమున యత్నపూర్వకముగ శ్రీమన్నగరమనబడే మణిద్వీప వైభవమును పఠించిన సకల శ్రేయస్సులు లభించును.

ఆ పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం శ్రీమన్నగర నాయికాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

57వ నామ మంత్రము 

ఓం చింతామణి గృహాంతస్థాయై నమః

చింతామణులచే నిర్మింపబడిన గృహంలో నివసించు పరమేశ్వరికి నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి చింతామణి గృహాంతస్థా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం చింతామణి గృహాంతస్థాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసన చేయు భక్తులకు ఆ జగన్మాత కరుణచే అన్నిటికన్నా ముఖ్యమైన సుఖసంతోషములు అందుకు కావలసిన ఆయురారోగ్యములు ప్రసాదించి ఆత్మానందానుభూతితో జగన్మాత పాదసేవా పరాయణత పెంపొందించి తరింపజేయును.

చింతామణి అనేది ఒక రత్నము. ఆ మణి ఒకటి ఉంటే ఎన్నోకోరికలను తీరుస్తుంది. అటువంటి చింతామణులతో నిర్మించిన గృహంలో జగన్మాత నివసిస్తోంది. మానవుని శరీరంలో చింతామణి గృహం సహస్రారంలో ఉంటుంది. సాధకుడు తన సాధనలో మూలాధారం నుండి సహస్రారం చేరుకుంటే సిద్ధిపొందినట్లే. ఇంక ఏకోరికలూ ఉండవు. నిష్కాముడై బ్రహ్మత్త్వానికి చేరుకుంటాడు.

చింతామణి గృహము - వర్ణనము

నవరత్నప్రాకారమునకు మధ్యభాగమునందు శోభాయమానమైన చింతామణిగృహమే జగన్మాత నివాసస్థలము. అందు నాలుగు మండపములు గలవు. ప్రతి మండపము వేయి స్తంభములతో కూడియున్నది.

 నాలుగు మండపములలో మొదటిది శృంగారమండపము, రెండవది ముక్తిమండపము, మూడవది జ్ఞానమండపము, నాలుగవది ఏకాంతమండపము.

ఈ మండపములందు అనేకమైన మణుల అరుగులు గలవు. అవి రకరకములైన ధూపపరిమళమలతో అలరారుచుండును.  ఈ సుందరమండపములు అన్నియును  కోటిసూర్యప్రభలతో తేజరిల్లుచుండెను. ఈ నాలుగుమండపములకు నలువైపున కేసరములు, మల్లికలు, కుందపుష్పముల ఉపవనములు గలవు. నాలుగు మండపములకు అన్నివైపుల మహాపద్మముల వనములు గలవు. వాటిమెట్లు రత్ననిర్మితములు. అసంఖ్యాకములైన ఉపవనములతో రమ్యమై సుగంధములతో మణిద్వీపము పరిమళమయమై యుండును.

శృంగారమండపము మధ్యభాగమునంధు ఒక దివ్యసింహాసనమున పరమేశ్వరి విరాజమానురాలై యుండును. సభాసదుల రూపములో ప్రముఖ దేవతలు, దేవాంగనలు, సకల అప్సరసలు - రకరకములైన స్వరములతో భగవతి జగదంబ ఎదుట గానము చేయుచుందురు.

ముక్తి మండపము మధ్యభాగమునందు విలసిల్లు భగవతి శివాదేవి ప్రతి బ్రహ్మాండమునందు నివసించు భక్తులకు సదా ముక్తిని ప్రసాదించుచుండును. 

జ్ఞానమండపము భగవతి ఇచట వెలుగులను వెదజల్లుచు జ్ఞానముపదేశ మొనరించుచుండును.

ఏకాంత మండపము ఇచట జగన్మాత అనంగకుసుమ మొదలగు సచివ శక్తులతో ఆసీనురాలై జగద్రక్షణ విషయమున సమాలోచన జరుపుచుండును. 

చింతామణి గృహము పరమేశ్వరికి ప్రధానస్థానము. మూలప్రకృతియైన భగవతి భువనేశ్వరియొక్క పది శక్తితత్త్వములు సోపానరూపములో  ఇచట ఉపస్థితములై యుండును. వాటితో కూడిన భగవతి యొక్క ఉన్నతమైన వేదిక మహనీయ శోభలొలుకుచుండును.

చింతామణి గృహమునే మహాజ్ఞానులు, సిద్ధులు ఏం చెప్తారంటే శ్రీచక్రంలో బిందు మండలమున శ్రీదేవి వసిస్తుంది. మూలాధారగత కుండలినీ శక్తి జాగృతమై బిందుమండలము చేరినచో ఉపాసకుడు జగన్మాత సన్నిధికి చేరినట్లే. అంటే సంకల్పసిద్ధుడైనట్లే. అదే చింతామణి తత్త్వము   ముఖ్యంగా జీవునికి ఉండే అన్ని చింతలను దూరంచేసి బ్రహ్మానందభరితుడిని చేస్తుంది. అంతటితో ఆ జీవుడు నిష్కాముడౌతాడు. సుమేరుశృంగ మధ్యమందు, మహాపద్మాటవిలో చింతామణిగృహంలో ఉండి సాధకుని సిద్ధింపజేస్తుంది. కల్పవృక్షం అంటే చింతామణితో కూడిన సంకల్పం. కామధేనువు అంటే చింతామణితో కూడిన వాక్కు అని విజ్ఞులు చెపుతున్నారు. అటువంటి సంకల్పం, అటువంటి వాక్కును సాధకునికి కలుగజేస్తుంది జగన్మాత. అందుకే ఆ తల్లి చింతామణి గృహాంతస్థా అను నామముతో స్తుతింపబడుచున్నది.

కోరినవి ఇచ్చే చింతామణి గృహంలో శ్రీమాత వసించుతూ, ఆ ఇంటి ఇల్లాలైన జగన్మాత ఎంతటి అనుగ్రహప్రదాయనియో మనం ఊహించితే వర్ణనాతీతమేగదా. అంతటి చింతామణి గృహాంతస్థకు నమస్కరించునపుడు ఓం చింతామణి గృహాంతస్థాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

58వ నామ మంత్రము 
ఓం పంచబ్రహ్మాసన స్థితాయై నమః

పంచ బ్రహ్మలను (బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశాన, సదాశివులు) తన ఆసనంగా స్వీకరించియున్న పరాశక్తికి నమస్కారము.

 (వీరిలో మొదటి నలుగురు మంచంకోళ్ళు, సదాశివుడు ఆ మంచానికి పానుపు)

శ్రీలలితా సహస్ర నామావళి యందలి పంచబ్రహ్మాసన స్థితా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం పంచబ్రహ్మాసనస్థితాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను  ఉపాసించు సాధకుడు ఆ తల్లి కరుణచే సుఖశాంతులతోను, సర్వశుభాలతోను మందహాసయుతంగా జీవనయాత్ర కొనసాగించును.

జగన్మాత మహాపద్మాటవిలో చింతామణి నిర్మితమైన గృహమున పంచబ్రహ్మలచే ఏర్పడిన ఆసనము నందు విరాజిల్లుచున్నదని ఈ నామమంత్రమునందలి భావము.

పంచబ్రహ్మాసనస్థితా అనగా అయిదుగురైన బ్రాహ్మలచే నిర్మింపబడిన మంచము వంటి ఆసనమునందు ఉన్న తల్లి.

పరమేశ్వరి చింతామణులచే నిర్మింపబడిన గృహమునందు కూర్చునే ఆసనానికి మామూలు కోళ్ళు ఉండవు. ఒక కోడుగా ఆగ్నేయం వైపున చతుర్ముఖబ్రహ్మ, నైరుతి దిక్కుగా ఉండే కోడుగా శ్రీ మహావిష్ణువు, వాయువ్యంలో ఉండే కోడుగా రుద్రుడు, ఈశాన్యంలో ఉండే కోడుగా ఈశ్వరుడు. ఈ నాలుగు కోళ్ళనూ కలుపుతూ పైన ఒక పర్యంకం. పైన ఆచ్చాదనగా సదాశివుడు ఉంటాడు. అది ఒక శివాత్మకమగు మహా మంచము. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు అను ఈ ఐదుగురిని పంచబ్రహ్మలు అని యందురు. అటువంటి శివాత్మకమైన మంచమునందు అమ్మవారు కూర్చుని ఉంటుంది. అందుచే అమ్మవారు పంచబ్రహ్మాసనస్థితా యని అనబడినది. అమ్మవారు ఆ పర్యంకంపైన కూర్చుని ఉన్నప్పుడు ఆ తల్లి ప్రక్కన మహాకామేశ్వరుడు కూర్చుని ఉంటాడు. ఆ మహాకామేశ్వరుడు పదహారు సంవత్సరాల నవమన్మథుడి వలె ప్రకాశిస్తూ ఉండగా ఆయన ఎడమ తొడపైన అమ్మవారు కూర్చుని ఉంటుంది.

అమ్మవారి మంచము కోళ్లకు అర్ధాన్ని పరిశీలించినట్లయితే బ్రహ్మగారు సృష్టి చేస్తారు. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు. మరి రుద్రుడు లయం చేస్తాడు. ఇవి మాత్రమే కాక తిరోధానము, అనుగ్రహము అని రెండు ఉన్నాయి. తిరోధానము అనగా కనబడకుండా చెయ్యడం. దీనినే తిరస్కరిణీ అని కూడా అంటారు. అనగా ఉన్నదానిని కనబడకుండా చెయ్యడం మాయ. ఈ మాయే ఈశ్వరుడు. ఈ మాయ పనిచేస్తున్నంత సేపు మనకు భగవంతుడు కనిపించడు. ఆయన మాయలో లోకాన్ని ఆడిస్తూ ఉంటాడు. ఇందుకు ప్రమాణము శంకరభగవత్పాదులవారి సౌందర్యలహరిలోని తొంబది రెండవ శ్లోకము.

గతా స్తే మఞ్చత్వం - ద్రుహిణహరిరుద్రేశ్వరభృతః

శివస్స్వచ్ఛచ్ఛాయా - కపటఘటిత ప్రచ్ఛదపటః|

త్వదీయానాం భాసాం - ప్రతిఫలనరాగారుణతయా

‌శరీరీ శృంగారో - రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్‌॥92॥

ఓ పరమేశ్వరీ!  బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, రుద్రులు నీకు సమీప సేవను పొందుటకై నీ మంచమునకు కోళ్ళుగా ఉన్నారు. శివుడు తెల్లని కాంతి అను మిషతో నీకు పైని కప్పుకొనుటకు దుప్పటియైనాడు. అట్టి సదాశివుడు నీ యెఱ్ఱని దేహకాంతులు ప్రతిఫలించిన కారణమున తానును ఎఱ్ఱబారి మూర్తీభవించిన శృంగార రసము వలెనుండి నీ కనులకు వినోదము గొలుపుచున్నాడు. 

ముక్తి అనేది సాధకుని ఉపాసనా విధానాన్నిబట్టి ఉంటుంది.  అది ఎలాగ అంటే:

సాధకుడు మణిపూరంలో పరమేశ్వరిని ఉపాసిస్తే, ఆ తల్లికి దగ్గరలో ఇంకొక పురమును నిర్మించుకొని ఉంటారు. ఈ రకమైన ముక్తిని సార్షిరూపముక్తి అంటారు.

అనాహతంలో ఆ పరమేశ్వరిని అర్చించితే శ్రీమాత ఉన్న శ్రీమన్నగరమునందే ఉండి సాలోక్యముక్తిని పొందుతారు.

విశుద్ధిచక్రంలో శ్రీలలితాపరమేశ్వరిని  అర్చించితే, ఆ అమ్మవారికి సేవకులై సామీప్యముక్తిని సాధించుకుంటారు.

ఆజ్ఞాచక్రంలో ఆ జగదాంబను ఉపాసనచేస్తే వేరొకదేహంతో అమ్మవారి వద్ద సారూప్యముక్తి సాధకులుగా ఉంటారు.

సహస్రారంలో ఆ జగన్మాతను ఉపాసిస్తే జన్మరహితమైన శాశ్వత సాయుజ్యముక్తి సాధకులౌతారు.

ఇక్కడ పంచబ్రహ్మలు పరమేశ్వరికి దగ్గరలో ఉండి అమ్మవారికి సేవకులు కావాలని విశుద్ధిచక్రంలో ఉపాసనచేసి, ఆ తల్లికి దగ్గరలో మంచంకోళ్ళుగా ఉండగలిగారు. శంకరభగవత్పాదులవారి పైశ్లోకంలోని భావము ఇదియే.

శంకరభగవత్పాదులవారు, సౌందర్యలహరిలో ఎనిమిదవ శ్లోకంలో  ఇలా కూడా చెప్పారు.

సుధాసింధోర్మధ్యే - సురవిటపివాటీపరివృతే

మణిద్వీపే నీపో-పవనవతి చింతామణి గృహే |

శివకారే మంచే - పరమశివపర్యంక నిలయామ్

భజంతి త్వాం ధన్యాః - కతిచన చిదానందలహరీమ్॥8॥

 అమృతసముద్రము మధ్యలో కల్పవృక్షాలతో నిండియున్న మణిద్వీపంలో, కదంబపుష్ప వృక్ష  తోటలో, చింతామణులతో నిర్మించిన గృహమునందు, త్రికోణాకారపు మంచము మీద, పరమశివుని పర్యంకస్థితవై ప్రకాశించుచు, జ్ఞాన స్వరూపమై నిరతిశయ సుఖప్రవాహరూపముగా ఉన్న నిన్ను స్వల్ప సంఖ్యాకులైన ధన్యులు మాత్రమే సేవించుకోగలుగుతున్నారు.

అలాగే తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం మరియు   ఊర్ధ్వదిశలు కూడా పంచబ్రహ్మలను తెలియజేయుచున్నవి. మరియు పంచభూతాలు పృథ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశమును అనికూడా తెలియవచ్చును. హల్లులలో  క-చ-ట-త-ప లను కూడా సూచించుచున్నవి.

సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అనే ఐదుగురు శివాకార మంచము అనియు కొందరు (శివాకారే మంచే) నిర్వచిస్తారు.

మంచమునకు నాలుగు కోళ్ళు ఉండుట సహజము. అలాగే ఉంటుందని అనుకుంటాము. కానీ ఇక్కడ అలాకాదు. కుండలినీ శక్తి వెన్నెముక మధ్యలోని సుషుమ్న మార్గము ద్వారా ఊర్ధ్వముగా వెళ్ళుచున్నప్పుడు మూలాధార. స్వాధిష్ఠానములకు సంబంధించిన బ్రహ్మగ్రంథి,  మణిపూర, అనాహత కమలములకు సంబంధించిన విష్ణుగ్రంథి, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలకు సంబంధించిన రుద్రగ్రంథిని, లలాటానికి, శిరోమధ్య భాగానికి సంధించిన ఈశ్వర స్థానమును - అధిగమిస్తుంది.  ఈ నాల్గు  మంచము కోళ్ళని భావించాలి. మరియు మన సహస్రారంలో ఉండే సదాశివుని మంచంగా భావించాలి. జగన్మాతను ఈవిధంగా భావిస్తూ ఆరాధింపవలయును.

శ్రీచక్రము నందు ఐదు శక్తిచక్రములు, నాలుగు శివచక్రములు గలవు. శక్తిచక్రములు ఐదును పంచబ్రహ్మలు అందురు. అందు నడుమనున్న బిందువే పరమేశ్వరి అని భావించదగును. ఆవిధంగా పరమేశ్వరి పంచబ్రహ్మాసనస్థితా యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం పంచబ్రహ్మాసనస్థితాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

59వ నామ మంత్రము 

ఓం మహాపద్మాటవీ సంస్థాయై నమః

మహామహిమాన్వితమైన షట్చక్రములు అను పద్మములనే వనమునందుండు జగన్మాతకు  నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాపద్మాటవీసంస్థా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మహాపద్మాటవీ సంస్థాయై నమః అని ఉచ్చరిస్తూ, ఆ కరుణామయిని పూజించితే ఆ భక్తులు ఐహికమైన ధర్మార్థకామపరమైన అభీష్టముల సిద్ధి మాత్రమే గాక పరమార్థమును సైతం పొంది తరిస్తారు.

పరమేశ్వరి మహాపద్మాటవీసంస్థా  యని అనబడినది అంటే మహా అనగా గొప్పదైన, పద్మాటవీ అనగా పద్మముల వనమున, సంస్థితా అనగా విలసిల్లునది.  గొప్పదైన పద్మముల వనములో పరమేశ్వరి విలసిల్లుచున్నది. 

బ్రహ్మాండమునకు పైభాగంలో మూడులక్షల యోజనముల విస్తీర్ణంగల పద్మము ఉన్నది. ఇది ఒక మహాపద్మము.

మణిసదనసాలయోః ఆదిమధ్యం దశతాలభూమిరుహదీర్ఘైః|

పర్ణైః పయోదవర్ణైర్యుక్తాం కాండైశ్చయోజనోత్తుంగైః|

మిళితైః తాళీపంచకమానైః మిళితాం చ కేసరకదంబైః|

సంతతగళిత మరంద స్రోతోనిర్యన్మిళింద సందోహమ్|

పాటీరపవన బాలకధాటీ నిర్యత్పరాగ పింజరితామ్|

పద్మాటవీం భజామః పరిమళకల్లోలపక్ష్మలోపాంతామ్॥ (సౌభాగ్యభాస్కరం, 236వ పుట)

పై శ్లోకము మహాపద్మము యొక్క వర్ణన లలితాస్తవరత్నములో ఈయబడినది. ఆ మహాపద్మము ఎలా ఉందంటే: 

మణిద్వీపము మధ్య  మహాపద్మముల వనము ఉన్నది. ఆ మహాపద్మమునకు పది తాడిచెట్లంత పొడవు ఉన్న ఆకులు, ఒక యోజనము ఎత్తుగల కాడలు, ఐదు తాడిచెట్లంత పొడవుగల దట్టమైన కేసరములతో ఉన్నది.  ఆ మహాపద్మములందు మకరందప్రవాహము సదా ప్రవహించు చుండును. ఆ మహాపద్మముల పరిమళమును ఆస్వాదించుటకు తుమ్మెదలు గుంపులు గుంపులుగా వస్తూంటాయి. ఆ మహాపద్మముల నుండి మంచిగంధపు పరిమళ వాయువులు వీచుతున్నాయి. ఆ వాయువుల తాకిడికి పసుపు పచ్చని పుప్పొడి పైకిలేచి వ్యాపించుటచేత ఆ మహాపద్మ వనము పసుపుపచ్చని కాంతులతో నిండినది. ఆ పసుపు వర్ణము ఎలా ఉన్నది అంటే ఎఱుపును మించిన పసుపువర్ణమైనది. అలాంటి పసుపు వర్ణము పింజరవర్ణమని చెప్పబడినది. పింజరవర్ణమనగా బంగారు వర్ణమని కూడా చెప్పవచ్చును. ఆ మహాపద్మ పరిమళములు అన్ని దిశలకూ వ్యాపించి ఆ పరమేశ్వరి వైభవమును తెలియజేయు చున్నది. పరమేశ్వరి నివసిస్తున్న అటువంటి మహాపద్మవనమునకు నమస్కరింతును.  ఇది యంతయు బ్రహ్మాండమునందున్న మహాపద్మవనము (మహాపద్మాటవి). అటువంటి మహాపద్మాటవిలో విలసిల్లుచున్న పరమేశ్వరి మహాపద్మాటవీసంస్థా యని అనబడినది.🙏🙏🙏🕉️ ఓం మహాపద్మాటవీసంస్థాయై నమః 🕉️🙏🙏🙏

ఇక పిండాండము అనగా మానవశరీరం విషయానికి వస్తే - ఈ శరీరమే ఒక శ్రీచక్రము.  సప్తచక్రములు (సహస్రారముతో) - సప్త పద్మములు  (సహస్రార పద్మముతో).

1. విశుద్ధిపద్మము పదహారు దళములు, పదహారు మంది యోగినీ దేవతలు.

2. అనాహత పద్మము -  పండ్రెండు దళములు - పండ్రెండు మంది యోగినీ దేవతలు.

3. మణిపూర పద్మము - పది దళములు - పదిమంది యోగినీ దేవతలు.

4. స్వాధిష్ఠాన పద్మము - ఆరు దళములు - ఆరుగురు యోగినీ దేవతలు.

5. మూలాధార పద్మము - నాలుగు దళములు - నలుగురు యోగినీ దేవతలు.

6. ఆజ్ఞా చక్ర పద్మము - రెండు దళములు - ఇరువురు యోగినీ దేవతలు.

7. సహస్రార కమలము సహస్ర దళములు - పరమేశ్వరి

ఈ శరీరమే ఒక పద్మాటవి అనబడును. షట్చక్రములు, డెబ్బది రెండు నాడులు మొదలైనవన్నియును మహాపద్మములు అగును. ఇందు బ్రహ్మరంధ్రము నందలి సహస్రార కమలమునందు శ్రీదేవి విరాజిల్లుచుండును. మూలాధారమునందలి కుండలినీ శక్తిని జాగృతము చేసి సుషుమ్నా మార్గమున బ్రహ్మరంధ్రమును చేర్చినవారికి భవానీమాత సాక్షాత్కారమగును. సూర్యకిరణ తేజస్సు ద్వారా పద్మాలు వికసిస్తాయి. శుక్రము యొక్క సూక్ష్మముగా ఉండే ధాతువును ఓజస్సు, తేజస్సు, సహస్సు, భ్రాజస్సు లంటారు. వెన్నెముక మధ్యలో ఉండు సుషుమ్నా మార్గము ద్వారా ఊర్ధ్వ గతిలో పోయే కుండలినీ శక్తి తేజస్సు పైకి ప్రసరిస్తుంది. షట్చక్రములను ఛేదిస్తూ సహస్రారం చేరుతుంది. అచ్చటనుండి శ్రీమాత తమ చరణముల ద్వారా అమృత ధారలు కురిపిస్తుంది. అచ్చట షట్చక్రములు వికసిస్తాయి. వీటిపైన సహస్రార పద్మంలో శివ దేవునితో ఐక్యమై ఆనందమనుభవిస్తారు. కావున మహాపద్మటవీ సంస్థా అనబడుచున్నది. ఇది పిండాండ విషయము.

బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము సహస్రార పద్మము అందురు. సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈస్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.  యశస్వనీ దేవత ఈ చక్ర అధిష్టానదేవత. ఈ ఏడవ మాసములోనే గర్భస్ధ శిశువులో జీవుడు ప్రవేశించేది. ఇందు విశ్వంలోని సకల వర్ణములు, రంగులు, అక్షరములు, విద్యలు, ధ్వనులు, బీజాక్షరములు ఉంటాయి. యశస్వినీ దేవతకు లెక్కలేనన్ని చేతులు, అన్ని చేతులలో సకల ఆయుధములు ధరించునది. ఈమె సృష్టికి ఆధారభూతమైన శుక్ర ధాతువుని ఆశ్రయించునది. ఈమె సర్వతోముఖ అభివృద్ధి చేయునది. ఈమె అన్ని రకముల అన్నమునూ ఇష్టపడుతుంది.

ఈ సహస్రార పద్మము  బ్రహ్మరంధ్రమునందు గలదు. ఇది వేయి దళములుగల పద్మము. దీనినే మహాపద్మాటవి అందురు. అందుచే సహస్రార పద్మము అను మహాపద్మమునందున్న పరమేశ్వరి మహాపద్మాటవీసంస్థా యని అనబడినది. సహస్రార పద్మమునకు ఎనిమిది దళములు ఉండును. ఈ ఎనిమిది దళములందు, ఒక్కొక్క దళమునకు  నూటఇరువది ఐదు (125) చొప్పున  దళములు ఉండగా, మొత్తము పద్మమునకు వేయిదళములు (సహస్రదళములు) ఉండుటచే సహస్రదళ పద్మమనియు అందురు.   అమ్మవారు ఈ సహస్రదళ పద్మము అను మహాపద్మాటవి యందు ఉంటుంది గనుక ఆ పరమేశ్వరి మహాపద్మాటవీసంస్థా యని అనబడినది.

బ్రహ్మాండమునందలి పద్మాటవితో పిండాండము (శరీరము) నందలి సహస్రారకమలము సమానమని అరుణోపనిషద్ భాష్యము నందు అండీభవజా అను వాక్యమునకు చేసిన వ్యాఖ్యానము నందు చెప్పబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహాపద్మాటవీసంస్థాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

60వ నామ మంత్రము 

ఓం కదంబ వనవాసిన్యై నమః

కదంబ వనమునందు వసించు శ్రీమాతకు నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కదంబ వనవాసినీ యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును  ఓం కదంబ వనవాసిన్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులకు ఆ జగన్మాత సర్వము తానుగా, తానే అమ్మ స్వరూపంగాను మరియు వారు అమ్మను సర్వాతీత శక్తిగాను గుర్తిస్తారు మరియు ఆ తల్లి కరుణచే తరిస్తారు.

కడిమి (కదంబ) చెట్ల వనమునందు  పరాశక్తి నివసించునది.

ఇక్కడ కదంబ వృక్షములు, కదంబ కుసమముల గూర్చి వివరణ
 
రావి, తులసి, కదంబము, మారేడు, పారిజాతము - వీటిని దేవతా వృక్షములంటారు. లక్ష్మీప్రదమైనవి. అందునా కదంబ కుసుమములు జగన్మాతకు ప్రియమైనవి, కదంబవృక్షము క్రింద ఉండుట జగన్మాతకు అత్యంత ప్రియకరము. అందుకే జగన్మాతను కదంబవనవాసినీ యనియు కదంబ కుసుమప్రియా అనియు స్తుతించుతాము. ఇక్కడ కదంబ వృక్షము అంటే  - కాశీలో మాత్రమే ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోను, పశ్చిమగోదావరిజిల్లా ముక్కామలలోను బాలత్రిపురసుందరి, ఆలయములలో కదంబ వృక్షములు గలవు. ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం (వినుకొండ సమీపం) లో అయితే అమ్మవారి ఆలయం ఉన్న చెరువు కరకట్టయందు కదంబ కుసుమ వృక్షములు ఉన్నవి. అక్కడ ఒకనాడు కదంబ వనమే ఉండేదని అంటారు. ఈ కదంబం పూలు అరుణారుణవర్ణంతో పొడవైన సుమారు ఎనిమిది అంగుళముల తొడిమపై గెలల మాదిరిగా ఉండి అటువంటి తొడిమలు వృక్షము నిండా ఉంటాయి. అలాగే వీటి కేశరములు పసుపు రంగులో ఉంటాయి. ఈ కదంబ కుసుమమల గూర్చి మహా భాగవతంలో ఒక శ్లోకం ఉటంకించ బడుచున్నది.
 
శ్రీమద్భాగవతము - ద్వితీయ స్కంధము - రెండవ అధ్యాయము

(తొమ్మిదవ శ్లోకము)

ప్రసన్నవక్త్రం  నలినాయతేక్షణం కదంబకింజల్కపిశంగవాసనమ్|

లసన్మహారత్నహిరణ్మయాంగదమ్ స్బురన్మహారత్నకిరీటకుండలమ్॥855॥

భగవంతుని ముఖకమలము సర్వదా ప్రసన్నమై, దరహాస శోభితమై ఒప్పుచుండును. ఆ స్వామి నేత్రములు పద్మముల వలె విశాలములైనవి. ఆ ప్రభువు ధరించిన వస్త్రము కడిమిపూలు కేసరములవలె  పసుపుపచ్చని వన్నెతో విలసిల్లుచుండును. ఆ పరమాత్మ భుజముల యందు శ్రేష్ఠములైన రత్నములు పొదిగిన బంగారు భుజకీర్తులు శోభిల్లు చుండును. శిరస్సుపైగల రత్నకిరీటము, చెవులయందలి మణికుండలములు ధగధగ మెరయుచుండును.

మరియు ఆ కదంబకుసుములు అరుణారుణ వర్ణములో ఉండును.
 
సాధారణంగా బంతిపువ్వు సైజులో కదంబం పువ్వు చూస్తూ ఉంటాము. వీటిని రాక్షసకదంబములు అని యందురు. అది కదంబ కుసుమమే కావచ్చు. కాని అమ్మవారికి ప్రియమైన కదంబ వనంలోని కదంబ కుసుమం మాత్రం  కాదు. అమ్మవారు నివసించు కదంబ వనమునందు ఈ కదంబవృక్షములు  ఉండవు.

దీనికి కారణము అమ్మవారి కదంబ కుసుమములు, కదంబ వృక్షములు వ్యాప్తిలో లేవు. కనీసం గూగుల్ లో వాటి వివరములు కూడా లభించుట లేదు.

ఇంకను వేదవ్యాసులవారి శ్రీమద్భాగవతంలో దృష్టాంతములు కలవు.
 
కడిమి (కదంబ) వృక్ష వనము నందలి మహాపద్మవాటిక యందుండే చింతామణి గృహమునందు -  పంచబ్రహ్మాసనాసీనయై జగన్మాత విరాజిల్లుచున్నది. చెంగల్వ, కడిమి, నెమలి అతి ముఖ్యమైనవి. కడిమి చెట్లనూ, భూమ్యాకాశములను వర్షధారలు కలుపుతాయి.   ఈ పవిత్ర సంబంధాన్ని సదా కోరుకునేది కడిమి చెట్లు. అందుకొరకే విశ్వస్వరూపిణి అయిన జగన్మాతకు ఈ చెట్లు గల ఉద్యానవనము చాలా ఇష్టము. కావున కడిమి వృక్షాల మధ్యలో చింతమణి గృహమందు శ్రీదేవి నివాసము. అందుచేత కదంబ వనవాసిని అనబడుచున్నది. 

కదంబవనవాసిని అయిన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కదంబ వనవాసిన్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

61వ నామ మంత్రము 

ఓం సుధాసాగరమధ్యస్థాయై నమః

శ్రీచక్రమునందు కేంద్రబిందువే సహస్రార కమలము. అదే సుధాసాగరము లేదా అమృతసాగరము. అట్టి అమృత సాగరము మధ్యన వసించు పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సుధాసాగరమధ్యస్థా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం సుధాసాగరమధ్యస్థాయై నమః అని ఉచ్చరించుచూ శ్రీమాతను ఉపాసించు సాధకులకు ఐహిక ఐశ్వర్యాలు, స్వర్గాది ఐశ్వర్యాలు, చివరకు మహైశ్వర్యమైన పరమపదము లభిస్తుంది.

సుధాసాగరమధ్యస్థా అనగా శ్రీలలితా పరమేశ్వరి సుధాసాగరము అనగా అమృతపు సముద్రము మధ్య ఉన్నది. 

1. బ్రహ్మాండమునందు అన్నిటికంటె పైన అమృతవర్ణమున గల సముద్రము మధ్యన చింతామణి గృహమునందు అమ్మవారు ఉన్నది. ఇది బ్రహ్మాండమునకు సంబంధించిన విషయము.

2. పిండాండము అనగా మానవ శరీరమునందు సహస్రారకమల మధ్య కర్ణికయందు చంద్రమండలము మధ్య ఇంకొక సుధాసాగరముగలదు. అక్కడ అమ్మవారు ఉంటున్నది.

3. సగుణబ్రహ్మోపాసనాపరులు అపరాజిత అనగా శ్రీమన్నగరమును పొందుదురు. అక్కడ అర మరియు ణ్య అను పేరుతో సముద్రము వంటి రెండు మడుగుల మధ్య అమ్మవారు ఉంటున్నది. 

పైన చెప్పిన మూడు సుధాసాగరముల మధ్య అమ్మవారు ఉంటుందని చెప్పి యుండుటచేత అమ్మవారు సుధాసాగరమధ్యస్థా యని అనబడినది. 

సుధాసాగరమధ్యస్థా యని చెప్పిన ఈ నామ మంత్రము, శ్రీమన్నగరనాయికా యను (56వ) నామ మంత్రమునందు మరియు చింతామణిగృహాంతస్థా యను (57వ) నామ మంత్రము నందు చెప్పిన చింతామణిమణి గృహము మణిద్వీపము నందు గలదు. అదియే అమ్మవారి నివాసస్థానము.   చింతామణి గృహము యొక్క వర్ణనము ఇచ్చట మరల ఈయబడినది.

.సుధాసాగరము

మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉన్నది. మణిద్వీపాన్ని సర్వలోకమని కూడా అంటారు. 

మణిద్వీపానికి నాలుగు వైపులా అనేక యోజనముల పొడవు, విస్తీర్ణముగల అమృతమయమైన సముద్రముగలదు. దీనినే సుధాసాగరము అంటారు. ఈ సుధాసాగరము రత్నములతో కూడిన ఇసుక, బంగారు చేపలు, ముత్యములతోను నిండియున్నది. ఈ సముద్రమునకు అన్ని దిశలయందును రత్నాల వృక్షములు గలవు. ఈ సముద్రమునకు ఆవల ఇరువది ఐదు ప్రాకారములు గలవు.  అవి:  1. లోహమయ ప్రాకారము, 2. కాంస్య ప్రాకారము, 3. తామ్ర ప్రాకారము, 4. సీస ప్రాకారము, 5. ఇత్తడి ప్రాకారము, 6. పంచలోహ ప్రాకారము, 7. రజిత ప్రాకారము, 8. సువర్ణమయ ప్రాకారము, 9. పుష్పరాగమణి ప్రాకారము, 10. పద్మరాగమణి ప్రాకారము, 11. గోమేధికమణి ప్రాకారము  12. వజ్రాల ప్రాకారము, 13. వైడూర్య ప్రాకారము, 14. ఇంద్రనీల మణి ప్రాకారము, 15. ముత్యాల ప్రాకారము, 16. మరకతమణి ప్రాకారము, 17. పగడాల ప్రాకారము, 18. మాణిక్యరత్న ప్రాకారము, 19. సహస్రస్తంభ మంటపము, 20. మనస్సాలము, 21. బుద్ధిసాలము, 22. అహంకార సాలము, 23. సూర్యబింబ సాలము, 24. చంద్రబింబ సాలము, 25. శృంగారసాలము.

ఇక్కడ సాలము అనగా ప్రాకారము అని భావించవలెను.

ఇరువది ఐదు ప్రాకారములు పంచవింశతి తత్త్వములకు ప్రతీకలు.

పంచవింశతి తత్త్వములు అనగా
ఇరవది ఐదు తత్త్వములు అవి:

పంచభూతములు (5):- భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము

పంచఙ్ఞానేంద్రియములు (5) చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు,

పంచకర్మేంద్రియములు (5 ) నోరు, చేతులు, కాళ్ళు, గుదము, జననేంద్రియము.

విషయపంచకము (5) శబ్దము(చప్పుడు),  స్పర్శము,  రూపము(ఆకృతి), రసము (రుచి), గంధము(వాసన).

అహంకార త్రయము (3) అహంకారము, బుద్ధి, మహత్తు (అవ్యక్తము).

మనస్సు , కాలము లేదా పురుషుడు

మొత్తము = 25

ఇరువది ఐదు ప్రాకారముల మధ్య ఇరువది నాలుగు ఆవరణలు ఉండును.

నాలుగు మండపములలో మొదటిది శృంగారమండపము, రెండవది ముక్తిమండపము, మూడవది జ్ఞానమండపము, నాలుగవది ఏకాంతమండపము. 

 శృంగారమండపము మధ్యభాగమునంధు ఒక దివ్యసింహాసనమున పరమేశ్వరి విరాజమానురాలై యుండును. సభాసదుల రూపములో ప్రముఖ దేవతలు, దేవాంగనలు, సకల అప్సరసలు - రకరకములైన స్వరములతో భగవతి జగదంబ ఎదుట గానము చేయుచుందురు.

ముక్తి మండపము మధ్యభాగమునందు విలసిల్లు భగవతి శివాదేవి ప్రతి బ్రహ్మాండమునందు నివసించు భక్తులకు సదా ముక్తిని ప్రసాదించుచుండును. 

జ్ఞానమండపము భగవతి ఇచట వెలుగులను వెదజల్లుచు జ్ఞానముపదేశ మొనరించుచుండును.

ఏకాంత మండపము ఇచట జగన్మాత అనంగకుసుమ మొదలగు సచివ శక్తులతో ఆసీనురాలై జగద్రక్షణ విషయమున సమాలోచన జరుపుచుండును. 

సుధాసాగరమునందున్న మణిద్వీపమునందు ఉన్న ఈ చింతామణి గృహము పరమేశ్వరికి ప్రధానస్థానము. మూలప్రకృతియైన భగవతి భువనేశ్వరియొక్క పది శక్తితత్త్వములు సోపానరూపములో  ఇచట ఉపస్థితములై యుండును. వాటితో కూడిన భగవతి యొక్క ఉన్నతమైన వేదిక మహనీయ శోభలొలుకుచుండును. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, సదాశివుడు - ఈ నలుగురు దేవతలు ఆ వేదికకు (మంచమునకు) నాలుగు పాదములు. సదాశివుడు ఆ మంచమునకు ఫలకముగ చెప్పబడెను. దానిమీద మహామహిమాన్వితుడగు పరమేశ్వరుడు విరాజిల్లుచుండును. పరమేశ్వరి నడుము భాగమున నవరత్నములు పొదిగిన ఒడ్డాణముతో ఇనుమడించిన సౌందర్యముతో ఒప్పుచుండెను. తప్తకాంచనము, వైడూర్యములతో సిద్ధము చేసిన భుజకీర్తీలు ఆ పరమేశ్వరికి శోభనుకలుగ జేయుచున్నవి. ఆ భుజకీర్తులు శ్రీచక్రములవలె ఉన్నవి. గొడుగులవంటి తాటంకములు భగవతి ముఖమండలమును మనోహరముగ తీర్చిదిద్దును. పరమేశ్వరి లలాటకాంతి అష్టమిచంద్రుని శోభలనుకూడ తుచ్ఛముచేయుచున్నవి. ఆ తల్లి పైపెదవి పగడకాంతులను, క్రింది పెదవి దొండపండ్లను తిరస్కరించుచున్నవి. మనోహరమైన దంతపంక్తులు శుద్ధవిద్యాంకురములవలె ప్రకాశిస్తున్నవి. కుంకుమ, కస్తూరి కలిపిన తిలకము ముఖమండలమునకు అపారసౌందర్యమును కలుగజేయుచున్నది. ఆ పరమేశ్వరి సూర్యచంద్రులవంటి ఆకారములతో రత్ననిర్మితమైన దివ్యమగు చూడామణిని మస్తకమున ధరించియున్నది. శుక్రనక్షత్ర కాంతులను తిరస్కరించు నాసికాభరణము ఆ తల్లి ప్రకాశమును ఇనుమడింపజేయు పరమసాధనముగ రూపొందినది. ఆ పరమేశ్వరి కంఠాభరణమునందు  గల ముత్యముల గుత్తితో అతిశయ శోభాన్వితయై ఒప్పుచున్నది. చందనపంకము, కర్పూరము, కుంకుమలతో ఆ పరమేశ్వరి స్తనములు అలంకృతములై యున్నవి. విచిత్రములు, అద్భుతములైన ఆమె భుజస్కందములు శంఖములవలె సౌందర్యముతో అలరారుచున్నవి. అమూల్యరత్నములతో పొదిగబడిన మకుటమును తలపైధరించి రాజసముతో ఒప్పుచున్నది. పరమేశ్వరి ముఖకమలమందు ముంగురులు తుమ్మెదలవలె కదలుచున్నవి. మణులతో పొదిగిన ఉంగరము పరమేశ్వరి వ్రేలుకు క్రొత్త శోభలను అమర్చుచున్నది. కమలదళాకృతిని ధరించిన మూడునేత్రములతో ఆ శ్రీమాత అతిశయమనోహరముగ దర్శనమిచ్చుచున్నది. మెరుగుపెట్టి స్వచ్ఛమొనరించిన మహారాగములు, పద్మరాగములతో సమానమైన ఆ పరమేశ్వరి శరీరకాంతులు మహోజ్జ్వలమై తనరారుచున్నది. రత్ననిర్మిత కింకిణులతో, కంకణములతో ఆ పరమేశ్వరి అపురూప సౌందర్యవతివలె తేజరిల్లుచున్నది. మణుల, ముత్యాలసరుల యందున్న సహజలావణ్య శోభ ఆ పరమేశ్వరి చరణములనుండి ఉత్పన్నమైనది. ఆ పరమేశ్వరి నాలుగు భుజములు పాశ, అంకుశ, వర, అభయ ముద్రలతో సుశోతములై యున్నవి. ఆ పరమేశ్వరి తన పలుకుల మధురిమలతో సరస్వతీ దేవి కచ్ఛపీ వీణాస్వరమును తుచ్ఛమొనరించుచున్నది. సఖియలు, దాసీజనములు, దేవతాస్త్రీలు, సమస్త దేవసముహములు పరమేశ్వరిని నాలుగు వైపుల పరివేష్టించి ఆసీనులై యున్నారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులతో ఆ పరమేశ్వరి కూడియున్నది. లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ - ఇవి మూర్థిమంతములై భగవతిచెంత విరాజిల్లుచుండెను. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, దోగ్ధ్రీ, అఘోర, అమంగళ -  ఈ తొమ్మిదిమంది పీఠశక్తులు పరమేశ్వరి పరాంబిక సేవయందు సదా నిమగ్నులై యుందురు.

శంఖనిధి, పద్మనిధి, అను ఈ నిధులు పరమేశ్వరికి పార్శ్వభాగములందు గలవు.  నవరత్నవహ, కాంచనశ్రవ, సప్తధాతువహ అను పేర్లుగల నదులు శంఖ, పద్మ నిధులనుండి వెలువడినవి. ఈ నదులు సుధాసింధువునందు కలియును. ఈ విధముగ విశేషశక్తిశాలినియైన ఆ పరమేశ్వరి మహానుభావుడైన పరమేశ్వరుని వామాంకమున విరాజిల్లుచుండును. ఆ పరమేశ్వరి ప్రాభవమువలననే పరమేశ్వరునికి సర్వేశ్వరుడగు యోగ్యత ప్రాప్తించినది.

అమ్మవారు అమృతమయమైన సముద్ర మధ్యమున ఉంటుంది గనుక, ఆ పరమేశ్వరి అనుగ్రహం పొంది, సాయుజ్య ముక్తిని సాధించిన సాధకులకు, ఆ తల్లి కరుణచే చావు ఉండదు అనగా మరల జన్మలు ఉండవు. శాశ్వతమైన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.

అమ్మవారికి నమస్కరించేటప్పుడు  ఓం సుధాసాగర మధ్యస్థాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

62వ నామ మంత్రము 

ఓం కామాక్ష్యై నమః

దయావర్షమును కురుపించే నేత్రములు గల పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కామాక్షీ యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం కామాక్ష్యై నమః అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని పూజించు భక్తులకు ఆ తల్లి సర్వకామ్యములను సిద్ధింపజేసి, శాశ్వతమైన బ్రహ్మానందమును సైతము ప్రాప్తింపజేసి తరింపజేయును.

దయార్ధ్ర దృష్టి గల అక్షముల (కళ్ళ) తోనే సకల కామనలనూ తీర్చునది కావున పరమేశ్వరి కామాక్షీ అని అనబడుచున్నది. 

కామాక్షీ యనగా మిక్కిలి అందమైన కన్నులు గలిగినది ఆ పరమేశ్వరి అని  భావము.

 నయనత్రితయం తస్యా జజ్ఞే పావకతేజసా|

కృష్ణం రక్తం తథా శ్వేతం వర్ణత్రయవిభూషితమ్‌॥64॥(దేవీభాగవతం, పంచమస్కంధం, అష్టమాధ్యాయం)

 శ్రీమాతయొక్క ఆవిర్భావ కాలమున అగ్నిదేవుని తేజస్సుచే నేత్రములు కలిగినవి. కుడి నేత్రము అ ఇకారము - అధిష్ఠాన దేవత ఇంద్రుడు, ఎడమ నేత్రము ఈ కారము - విరాట్పురుషుడు అధిష్ఠాన దేవత.

సాధారణంగా స్త్రీయొక్క కన్నులు మీనములతో పోల్చడం సహజం అంటే ఆ కన్నులు అంతశోభాయమానంగా ఉంటాయి. అంతేకాదు ఆ కన్నులు మిలమిలలు కనురెప్పలు కొట్టుకుంటూ ఆ చూపులు ఇటు అటు త్వరితంగా ఒక ప్రక్కనే కాక చలిస్తూ చంచలమని పించుకుంటాయి. అప్పుడు ఆ స్త్రీ చంచలాక్షి.   మీనాక్షి, చంచలాక్షి యని కూడా అనిపించుకుంటుంది.  నీటిలో మీనము అర్ధచంద్రాకారమై ఒకింత రెప్పపాటు సమయం నిలకడవుతుంది. అంటే అది ఓరచూపు అని కూడా అంటాము. ఈ వర్ణన అంతా స్త్రీ నయన సౌందర్యం గురుంచేకదా. నయనములు మీనములు (చిన్నవి) వలె ఉంటాయి. మీనములు నీటిలో ఒక చోట ఉండక ఒక చోటు నుండి మరొక చోటుకు త్వరితగతిని అందముగా కదులుతాయి. ఇంకొకసారి కొంచం వంగి రెప్పపాటు సేపు నిలకడగా ఉంటాయ. అంతలోనె తుర్రుమని మరొకచోటికి కదులుతాయి. ఇదంతా చాలా మనో హరంగా ఉంటుంది.  ఆ పరమేశ్వరియొక్క నయన మనోహరము. అలాగే ఉంటుంది. 

అమ్మ వదనంలో ఉన్న ఆ నయన మీనములకు జలములేవీ? లేవంటారా? జలములు ఉన్నాయి. అమ్మవారి వదనమే ఒక శోభాయమానమైన సరోవరమయితే ఆ త్రిపుర సుందరి సౌందర్యమే ఒక పరీవాహము. ఆ పరీవాహంలో అమ్మ కనులనే మీనములు విహరిస్తున్నాయి అందుకే శ్రీమాతను వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచనా యను (15వ) నామ మంత్రంలో ఆ జగన్మాతను (మన అమ్మను) వశిన్యాది వాగ్దేవతలు అంత అద్భుతంగా స్తుతించారు. అయినా వారు అంతటితో తృప్తి చెందలేదు. ఇంకా ముందు ముందు నామ మంత్రములలో మరింత అద్భుతంగా వర్ణించారు.  

అమ్మవారి కన్నులు చేపపిల్లలతో పోల్చడంలో ఒక చమత్కారము ఉన్నది. చేపలకు సంయోగ, సంపర్కము లేకుండా కేవలం చూపులతోనే గ్రుడ్లుపెట్టడం జరుగుతుంది. గ్రుడ్లు నీటి అడుగున ఉండగా, నీటికి పైన ఉన్న ఆ చేపల చూపులతో ఆ గ్రుడ్లనుండి పిల్లలు వస్తాయి. అలాగే మీనాక్షియైన ఆ పరమేశ్వరి వీక్షణముల నుండియే భక్తులు  అనుగ్రహమును పొందుతారు. తమ మనో వాంఛితార్థములు ఆ పరమేశ్వరి వీక్షణములనుండియే పొందుతారు. శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు నలుబది ఎనిమిదవ శ్లోకంలో అమ్మవారి నయనములను ఇలా వర్ణించారు.

అహః సూతే సవ్య - తవ నయనమర్కాత్మకతయా

త్రియామాం వామంతే - సృజతి రజనీ నాయకతయా |

తృతీయా - తే దృష్టిర్దరదలిత హేమాంబుజ రుచిః

సమాధత్తే సంధ్యాం - దివసనిశయోరంతరచరీమ్॥48॥

పరమేశ్వరి కుడికన్ను సూర్యునివలె పగటిని, ఎడమకన్ను చంద్రునివలె రాత్రిని కలిగించుచున్నవి. మూడవ నేత్రము సంధ్యాకాలమును కలిగించుచున్నది.

అమ్మవారి కన్నులు అమాయకంగా, మీనద్వయము వలె ఆ పరమేశ్వరి ముఖకాంతిప్రవాహంలో చలించుచున్నను, ఆ కన్నుల నుండి వెడలు ప్రేమ, క్రోధ (భక్తులయెడ వాత్సల్యత, దుష్టులయెడ తీక్షణములైన అంకుశముల వంటి) వీక్షణములు ప్రసరించుచుండును. అవే మీనద్వయము వంటి కన్నులు కామేశ్వరుని యెడల అనురాగపూరితమైన దృక్కులై విలసిల్లును. ఆ పరమేశ్వరి కృపాపూరిత వీక్షణములు భక్తుల ఇష్టకామ్యములను సిద్ధింపజేయునవై యుండును.

 అమ్మ వారి కన్నులు రాత్రి, పగలు, ఉదయసంధ్యలను ఏర్పరచుచూ, పగలు, రాత్రి, దినము, వారము, పక్షము, మాసము, ఋతువులు, సంవత్సరములు, యుగములు అను కాలగమనము కలిగించు చుండగా, అమ్మవారు మాత్రం దేశకాలాపరిచ్ఛిన్న అయి నిలుస్తున్నది. అనగా అమ్మవారు కాలమునకు అతీతురాలు. ఆ పరమేశ్వరి నేత్రములు అనేక విధములైన దృష్టులను కలిగి ఉన్నవి. ఈ వైనము శంకర భగవత్పాదుల వారు తమ సౌందర్యలహరియందలి నలుబది తొమ్మిదవ శ్లోకంలో ఇలా తెలియజేశారు:-

విశాలా కల్యాణీ - స్ఫుతరుచి రయోధ్యా కువలయైః

కృపాధారాధారా - కిమపి మధురా‌உ‌உభోగవతికా |

అవంతీ దృష్టిస్తే - బహునగరవిస్తారవిజయా

ధ్రువం తత్తన్నామ-వ్యవహరణయోగ్యా విజయతే॥49॥
 
దేవి చూపు విపులమై, మంగళకరమై, దుర్జయమై, దయారసపూరితమై, అవ్యక్త మధురమై, పరిపూర్ణ భోగవతియై, భక్తులను రక్షించునదై అనేక నగరముల బహుముఖ విజయము కలదై యున్నది.

అమ్మా! జగన్మాతా! విశాలమైన నీ నేత్రములదృష్టి ప్రసరించుటచేత ఒక నగరానికి విశాలనగరము అని పేరు వచ్చినది. మంగళకరమైన, కళ్యాణప్రదమైన నీ వీక్షణం వల్లనే ఓ నగరానికి కళ్యాణి నగరము అను నామము వచ్చినది. చక్కని కాంతి కలిగి నల్లకలువల సోయగాన్ని త్రోసిరాజనునట్టి సొగసైన నీ చూపులు పడటం వల్లనే మరియొక నగరం అయోధ్యానగరము అని పిలువబడుతున్నది. నీ కంటి కృపాధారలే ఆధారమై ఉండుటచేత ఇంకొక నగరం ధారానగరంగా వ్యవహరించబడుతున్నది. నీ మధుర దృక్కుల ప్రసరణం వల్లనే వేరొక నగరం మధురానగరంగా శ్లాఘించబడుచున్నది. నీ భోగదత్త క్రీగంటి చూపులవల్లనే భోగవతీ నగరం ఏర్పడినది. నీ దుష్టశిక్షణ, శిష్టరక్షణా తత్పరత్వమైన చూపుల వలన అవంతీనగరం ఆవిర్బవించినది. నిత్య జయప్రదమైన సర్వోత్కృష్ట నీ జయ వీచికల వలన ఓ నగరం విజయనగరంగా పిలువబడుతున్నది.
ఈ రీతిన నీ నేత్రములనుండి  వెలువడు ఈ పవిత్ర దృష్టుల వలననే ఈ అష్ట దివ్య నగరములు ఆవిర్బవించినవని నేను భావిస్తున్నాను.

అమ్మవారిని కామాక్షీ యని వశిన్యాదులు ఈ నామ మంత్రంలో స్తుతించారు. అంటే పరమేశ్వరుడు కామేశ్వరుడు. ఆయన మానవునిలోని కోరికలకు ఈశ్వరుడు. కోరికలనే గుర్రములను ఆ కామేశ్వరుడు ధర్మార్థము,అర్థము, కామము, మోక్షము అనే చతుర్విధ పురుషార్థములలో కామము (కోరిక)  అనే పురుషార్థముము ధర్మము అనే కళ్ళెముతో ధర్మబద్ధంగా ప్రవర్తిల్లజేయును. అటువంటి కామేశ్వరునే తన నయనములుగా చేసికొని కామేశ్వరిగా నామప్రసిద్ధమై, కామాక్షీ యని స్తుతింపబడుచున్నది. పరమేశ్వరి తన భర్త అయిన ఆ కామేశ్వరునివైపు వీక్షించునపుడు ఆ కన్నులు కామపూరితములై (మోహపూరితములై) ఉంటాయి గనుకు అమ్మవారు కామాక్షీ యని అనబడినది.

పరమేశ్వరి కాముడినే (మన్మథుడినే) తన కన్నులుగా గలిగినది. గనుకనే ఆ తల్లి కామాక్షీ యని అనబడినది.

అనంతకోటి జీవరాశుల కోరికలను (కామములను) తన కన్నులుగా చేసికొని, సర్వదా జీవుల మనోకామనలను తీర్చును గనుక శ్రీమాత కామాక్షీ యని అనబడినది.

జీవుల జన్మాంతర సంస్కారములను అన్నింటినీ   సంస్కరించి పవిత్రులనుగా చేసే సుందరమైన నేత్రములు కలిగినది ఆ జగన్మాత. గనుకు ఆ పరమేశ్వరి కామాక్షీ యని అనబడినది.

శక్తిపీఠాల పురాణగాథ

ఒకప్పుడు దక్షుడు యజ్ఞం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని తన కుమార్తెయైన సతీదేవిని, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమథగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ దక్షునివలన అవమానపడినది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరంతో శివతాండవం ప్రారంభించాడు. లోకాలు అన్ని భయంతో గజగజలాడాయి. అది ప్రళయసంకేతంగా మారిపోయింది.  దేవతల ప్రార్థనల నాలకించిన విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం:

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే|

ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే|

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా|

కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా|

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా|

ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే|

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ|

జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా|

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ|

అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్|

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్|

సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్॥

కంచి కామాక్షి
ఈ శ్లోకంలో ఉన్న వివిధ స్థలాలను గుర్తించడంలో కొన్ని భేదాభిప్రాయాలున్నాయి. ఒక వివరణ ప్రకారం ఈ స్థలాలు ఇలా ఉన్నాయి

1. శాంకరీదేవి, శ్రీలంక, 2. కామాక్షి, కాంచీపురం, తమిళనాడు, 3. సింహళాదేవి, ప్రద్యుమ్న, బెంగాల్, 4. చాముండి, మైసూర్, కర్ణాటక, 5. జోగులాంబ, అలంపురి, తెలంగాణ, 6. భ్రమరాంబాదేవి, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్, 7. మహాలక్ష్మీ దేవి, కొల్హాపూర్, మహారాష్ట్ర, 8. ఏకవీరాదేవి, మహురీ, గుజరాత్, 9. మహాకాళీ, ఉజ్జయిని, మధ్యప్రదేశ్, 10. పురుహూతికాదేవి, పిఠాపురం, ఆంధ్రప్రదేశ్, 11. గిరిజాదేవి, ఓడ్యా, ఒడిశ్శా, 12. మాణిక్యాంబా దేవి, ద్రాక్షారామము, ఆంధ్రప్రదేశ్, 13. కామరూపీ, హరిక్షేత్రము, ఉత్తరప్రదేశ్, 14. మాధవేశ్వరీ దేవి, ప్రయాగ, ఉత్తరప్రదేశ్, 15. వైష్ణవీ దేవి, జ్వాలా, జమ్మూ, 16. మంగళగౌరీదేవి, గయ, ఉత్తరప్రదేశ్, 17. విశాలాక్షీ దేవి, వారణాసి, ఉత్తరప్రదేశ్, 18. సరస్వతీ దేవి, కాశ్మీర్.

అష్టాదశ పీఠములందు కాంచీపురము (కంచి) కూడా ఒక శక్తి పీఠము. కాంచీపురము అను ఈ శక్తిపీఠమునకు అధిష్ఠానదేవత కామాక్షి  అష్టాదశ శక్తిపీఠాధిష్ఠాన దేవతయగుటచే, ఆ పరమేశ్వరి, సతీదేవి అవతారమగుటచే కామాక్షీ యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కామాక్ష్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

63వ నామ మంత్రము 

ఓం కామదాయిన్యై నమః

భక్తుల అభీష్టములను సిద్ధింపజేయు కామాక్షీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కామదాయినీ యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం కామదాయిన్యై నమః అని ఉచ్చరిస్తూ ఆ జగన్మాత నిరంతరపాదసేవా తత్పరులైన భక్తులను ఆ తల్లి కరుణించి వారికి భౌతికపరమైన సుఖసంతోషములతో బాటు  ఆధ్యాత్మికానందమును ప్రసాదించి తరింపజేయును.

పరమేశ్వరిని  శ్రీలలితా సహస్ర నామావళి యందలి  కామాక్షీ యను (62వ) నామ మంత్రములో భక్తుల సకలకామములను సిద్ధించు తల్లిగా స్తుతించుకున్నాము. 

కామములకు ఈశ్వరుడు పరమేశ్వరుడు. గనుక ఆయన కామేశ్వరుడు అనబడినాడు. దాయని అనగా ఇచ్చునది. అమ్మవారు తన భక్తులకు కామేశ్వరుని అనుగ్రహమును ఇచ్చునది. భక్తులకు వారి వారి అర్హతలను బట్టి, కర్మఫలములననుసరించి కోరికలను సిద్ధింపజేయునది. పరమేశ్వరి మహాలక్ష్మీ అవతారము. లక్ష్మి యనగా సిరిసంపదలకు, సౌభాగ్యములకు, అష్టైశ్వర్యములకు అధిదేవత. అందుచే పరమేశ్వరి మహాలక్ష్మిగా (మువురమ్మల మూలపుటమ్మగా) తన భక్తుల యోగ్యతలననుసరించి అష్టైశ్వర్యములు, ధనధాన్య సంపదలను, మోక్షమును అనుగ్రహించును.

దాయని అనగా వంశపారంపర్యమునకు సంబంధమైనది. కామేశ్వరునితో జన్మజన్మల బంధముకలిగినది అని భావము. పరమేశ్వరి నవదుర్గలుగా, శక్తిపీఠాధిష్ఠానదేవతగా, గ్రామదేవతగా, కొండదేవతగా ఎన్నో రూపములలో ఆరాధింప బడుచున్నది. ఆ తల్లి ఎన్ని  అవతారములలో ఆవిర్భవించిననూ, పరమేశ్వరుని మాత్రమే తన పతిగా స్వీకరించినది. అలాగే పరమేశ్వరుడు కూడా ఎన్ని అవతారములు దాల్చిననూ ఆ పరమేశ్వరినే తన సతిగా స్వీకరించినాడు. గంగ తన తలమీదఉన్నది. ఆమె ఎవరో పిలిస్తే వచ్చింది. ఎవరికోసమో వెళితోంది. ఏమైనా శివుడు సాంబశివుడే. సదా పరమేశ్వరినే తన సతిగా భావించిన శివుడు సదా(సాంబ)శివుడే.  శివుడికన్నా పరమేశ్వరి వేరైనది కాదు.  ఐదు శక్తి చక్రములు, నాలుగు శివచక్రముల మొత్తముతో శ్రీచక్రమే తమదని శివశక్త్యైక్యతను జగత్తుకు తెలియజేసిన ఆది దంపతులు ఆ కామేశ్వరీకామేశ్వరులు. గనుక శివునితో ఏకమై ఉండు పరమేశ్వరి కామదాయనీ యని అనబడినది. 

శ్రీలలితా పరమేశ్వరి కామదాయినీ యని అనబడినది. అనగా ధర్మబద్ధంగా కోరిన కోర్కెలు సిద్ధింపజేయునది. ఈ నామ మంత్రమును ఓం కామదాయిన్యై నమః అని సంపుటీకరణ చేస్తూ శ్రీలలితా సహస్రనామ స్తోత్రమును పారాయణ చేసినచో, ఆ పరమేశ్వరి తన భక్తులకు ఏమి కావలయునో విన్నవించకనే సకలాభీష్టములను సిద్ధింపజేయును. 

శ్రీలలితా సహస్రనామ స్తోత్ర మహాత్మ్యము (ఫలశ్రుతి), తృతీయోఽధ్యాయము యొక్క తాత్పర్యము    
(ఇచ్చటనీయబడినది) చదివినచో, అమ్మవారు కామదాయినీ యను  నామమునకు ఎట్లు సార్థకనామధేయురాలైనదో మరింత మనము తెలిసికోగలము.

ఫలశ్రుతి అనగా  ఆచరించిన వైదిక కర్మలకు ఫలమును బోధించు వాక్యము, కర్మఫలశ్రవణము. శ్రీలలితా సహస్ర నామస్తోత్ర పారాయణము అనునది సాక్షాత్తు వేదస్వరూపిణియైన అమ్మవారు ఆదేశించిన ఒక వైదిక కర్మగా భావించవచ్చును. అటువంటి వైదికకర్మమును ఆచరించి నందువలన కలుగు ఫలమును వినుటయే (వినుపించుటయే) కర్మఫలశ్రవణము. దీనినే ఫలశ్రుతి యని అందురు.

పూర్వపీఠికలో అమ్మవారి ప్రీతికొరకు నిత్యము పారాయణ చేయవలయునని చెప్పబడినది. శ్రీలలితా సహస్ర నామస్తోత్ర పారాయణానంతరము కలుగు ఫలితములను ఉత్తరపీఠికయందు తెలియజేయబడినది. శ్రీలలితా సహస్ర నామ పారాయణ, ఆ తల్లి ఆదేశానుసారము చేయుట జరిగినది గనుక, ఏ ఫలము మనకు ప్రత్యక్షముగా కలుగకున్నను, లలితాంబిక ప్రీతిచెందుటయే అన్నిటికన్న ఉత్తమమైన ఫలమని చెప్పవచ్చును.

 శ్రీలలితా సహస్రనామ పారాయణ వలన ప్రమాదవశమున కలుగు మరణములు సంభవింపవు.   పుట్టుట గిట్టుట కొరకే. మంచముఫై ఎవరిచేతను చేయించుకోకుండా, కఫము, వాతము, పిత్తములచేత మరణ బాధలేకుండా, ఆయుష్షు తీరిన పిదప, అనాయాస మరణమును అమ్మవారు అనుగ్రహిస్తుంది.

ఆ పరమేశ్వరి పుత్రులు లేనివారికి పుత్రులను, చతుర్విధ పురుషార్థ ఫలములను అనుగ్రహించును.

 శ్రీలలితా పరమేశ్వరిని అర్చించుట సంధ్యావందనాదులు చేయునటులే ఒక దినచర్యగా భావించి శ్రీవిద్యోపాసన, శ్రీవిద్యను జపంచేయుట క్రమంతప్పక చేయవలెనని వివరించబడినది. శ్రీవిద్యోపాసకులు కానివారు, అశక్తులు శ్రీలలితా సహస్రనామ స్తోత్రమును దినచర్యలో ఒకభాగంగా భావించి క్రమంతప్పక చేయవచ్చును. సహస్రనామస్తోత్ర పారాయణయే శ్రీవిద్యోపాసన చేయునంతటి ఫలమును సంప్రాప్తింపజేయును. శ్రీలలితా సహస్ర నామస్తోత్రము పారాయణ చేయువారు భక్తిప్రపత్తులతో ఏకాగ్రచిత్తులై, దోషరహితముగా ఒక్కసారి చేసినా చాలును. కాని ఫూర్వపీఠిక, సహస్రనామస్తోత్రము, ఫలశ్రుతి (మూడు అధ్యాయములు) క్రమంతప్పక చేయవలెను. దినచర్యలో అనేకమైన కార్యక్రమములు చేస్తూ ఉంటాము. శ్రీలలితా సహస్రనామ స్తోత్రపారాయణ చేయునటువంటి నలబైనిమిషముల కార్యక్రమము కూడా దినచర్యలో ఒకభాగంగా భావించి చేస్తే, ఆ తల్లి అనుగ్రహము లభించుట తథ్యము. ఇష్టకామ్యార్థసిద్ధి గలుగుట అంతకన్నా తథ్యము.

 జీవితంలో ఒకసారి అయినా శ్రీలలితా సహస్రనామ పారాయణ చేస్తే కోటిజన్మలందు గంగానదివంటి నదులలో స్నానమాచరించిన ఫలము దక్కును అని హయగ్రీవులవారు అగస్త్యునితో చెప్పారు. భారతదేశము ఒక పుణ్యభూమి. ఎంతోపుణ్యం చేసుకుని ఈ భారతభూమిపై పుట్టాము గనుక గంగానదివంటి నదులలో స్నానం చేసి పునీతులము కావలెను. కాని అందరికీ ఆ భాగ్యం దక్కడం కష్టం గనుక, శ్రీలలితా సహస్ర నామపారాయణ ఒకసారైనా జీవితంలో చేయమని హయగ్రీవులవారు అగస్త్యమహర్షికి చెప్పారు.

కాశీయందు కాశి, వారణాసి, అవిముక్తము, అంతర్గృహము అని నాలుగుస్థానములు గలవు. ఈ నాలుగింటిలో అంతర్గృహము అను స్థానము అన్నిటికన్నా ఉత్తరమునందు గలదు. గనుక అంతర్గృహము అత్యుత్తమమైన స్థానము. ఇటువంటి స్థానమునందు కోటిశివలింగములు పతిష్టించినంత ఫలము శ్రీలలితా సహస్రనామ స్తోత్రపారాయణయందు గలదు. శ్రోత్రియులైన బ్రాహ్మణులకు కోటి సువర్ణాభరణములు దానం చేసినంత ఫలము ఒక్కసారి శ్రీలలితా సహస్రనామ పారాయణయందు గలదు. అలాగే గంగాతీరంలో కోటి అశ్వమేధములు చేసినంత ఫలము ఒక్క శ్రీలలితా సహస్రనామ స్తోత్రపారాయణ చేయుటయందు గలదు. ఒక్కసారి శ్రీలలితా సహస్ర నామపారాయణ చేయుట వలన నీరులేని ఎడారిలో కోటి బావులను త్రవ్వించినంత ఫలము దక్కును. తిండికి కరువు ఏర్పడిన సమయంలో కోటిమంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత ఫలము శ్రీలలితా సహస్ర నామపారాయణచే సంప్రాప్తించును.
 
శ్రీలలితా సహస్ర నామపారాయణ విశిష్టతను హయగ్రీవులవారు చాలా చక్కగా వివరించారు. శ్రీలలితాసహస్ర నామపారాయణ విడచిపెట్టి ఇతర వైదిక ప్రాయశ్చిత్తములవైపు దృష్టిపెట్టడమంటే తేలుకుడుతుందనే భయంతో పాములున్న ప్రదేశంలోనికి పరుగులు తీయుటవంటిది. నిరంతరము అనగా భక్తిప్రపత్తులతో,  ఏకాగ్రతను పాటిస్తూ, యావజ్జీవితమూ క్రమం తప్పకుండా, దోషరహితముగా నిత్యముచేయు స్నానసంధ్యా వందనాదుల పిదప పరమేశ్వరికి ప్రీతికలగించుటకు శ్రీలలితా సహస్ర నామ పారాయణ చేయుట నిత్యమూ ఆచరించు వైదిక కర్మలలో ఒకటిగా భావించి చేయవలెను. నిత్యవైదిక కర్మలయందు శ్రీలలితా సహస్ర నామముల పారాయణ చేయుట కూడా ఒక భాగముగా తలంచవలయును. నిత్యము చేయుటకు అవకాశము లేనిచో కనీసం పుణ్యదినాలలో, తన లేక తన కుటుంబ సభ్యుల జన్మదిన సందర్భములలోనైనను లేక సంక్రమణకాలము నందైనను ఈ స్తోత్రమును పారాయణము చేయవలెను. సంక్రమణకాలము అనగా సూర్యుని గమనము. ఒక సంవత్సరకాలములో  ఒక రాశి నుండి మరియొక రాశిలో ప్రవేశించుటను సంక్రమణ కాలము అని అందురు. అట్టి సంక్రమణములు సంవత్సరములో  పండ్రెండు. అవి 1. మేష సంక్రమణము, 2. వృషభ సంక్రమణము, 3. మిథున సంక్రమణము, 4. కర్కాటక సంక్రమణము, 5. సింహ సంక్రమణము, 6. కన్యా సంక్రమణము, 7. తులా సంక్రమణము, 8. వృశ్చిక సంక్రమణము, 9. ధనుస్సంక్రమణము, 10. మకర సంక్రమణము, 11. కుంభ సంక్రమణము, 12. మీన సంక్రమణము. దీనిని బట్టి నెలకు ఒకసారైనా ఆయా సంక్రమణ దినములలో శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారియణము చేయవలెను. లేదా, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన దినమునందైనను అనగా మకర సంక్రమణము నాడును, మరియు సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశంచిన దినమునందైనను అనగా కర్కాటక సంక్రమణము నాడు - ఈ రెండుపుణ్య దినములందైనా శ్రీలలితా సహస్రనామ స్తోత్ర పారాయణము చేసినచో ఆ పరమేశ్వరి సంతసించి మనము ఏమియు కోరుకొనకపోయినను, ఆ తల్లి మనకు శుభములొనగూరు నటులు అనుగ్రహించును. భక్తులు తమ జన్మ నక్షత్రమునాడు, జన్మ నక్షత్రమునకు ముందురోజు మరియు జన్మ నక్షత్రమునకు తరువాతరోజున చిత్తశుద్ధితో శ్రీలలితా సహస్రనామస్తోత్ర పారాయణము చేసినచో ఆ పరమేశ్వరి సంతసించి ఇష్టకామ్యార్థసిద్ధిని కలుగజేయును. ద్విజులు అనగా యజ్ఞోపవీత ధారులకు మూడుజన్మములు గలవు. అవి:- ఒకటి తల్లిగర్భమునుండి జన్మించినదినము, ఉపనయన సంస్కారము జరిగిన దినము, పూర్ణదీక్షను పొందిన దినము. ఈ మూడు తిథులందు శ్రీలలితా సహస్ర నామపారాయణచేయుటవలన ఆ పరమేశ్వరి అనుగ్రహము లభించును. అలా శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణ చేయని యెడల పరమేశ్వరి భక్తజనులలో తానుకూడా ఒకడు కాలేడు. భక్తులు నాలుగు విధములు. వారు ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని. వీరిలో ఆర్తుడు పాపములు పోగొట్టుకొనుటకు, జిజ్ఞాసువు చిత్తశుద్ధికొఱకు, లేదా భగవంతుని తెలుసుకొనుటకు, అర్థార్థి పురుషార్థ సిద్ధికొఱకు, జ్ఞాని లోకోపకారము కొఱకు శ్రీలలితా సహస్రనామ పారాయణము చేయవలెను.

ప్రతీ మాసమునందును శుక్లపక్షము నందు వచ్చు నవమి, అష్టమి, చతుర్దశి, పౌర్ణమి - ఈ తిథులందైనా   శ్రీలలితా పరమేశ్వరి సహస్ర నామ స్తోత్ర పారాయణము చేయవలెను. ఈ నాలుగు రోజులలో కనీసం పౌర్ణమినాడైనా శ్రీలలితా సహస్రనామ పారాయణ చేయవలయును. శుక్లపక్షము నందలి నవమి, అష్టమి, చతుర్దశి, పౌర్ణమి తిథులందు జన్మనక్షత్రము, సంక్రాంతి, శుక్రవారము కలసినచో ఆ దినము విశేషముగా భావించి శ్రీలలితా సహస్రనామ స్తోత్ర పారాయణము చేసినచో ఆ తల్లి అనుగ్రహము విశేషముగా లభించును. పౌర్ణమినాడు చంద్రబింబమునందు శ్రీలలితా పరమేశ్వరి స్వరూపమును భావనచేస్తూ, ఆ స్వరూపమునకు గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యముల (లమిత్యాది పంచపూజలు) పూజలొనరించి, శ్రీలలితా సహస్ర నామ పారాయణ చేసినచో ఆ పరమేశ్వరి అనుగ్రహమువలన విశేషమైన ఫలము లభించును.

రహస్యాతి రహస్యమైనవి శ్రీలలితా సహస్ర నామములు అనుటకు చాలా భావము గలదు. రోగశాంతి, మనశ్శాంతి, గ్రహశాంతి, ఇష్టకామ్యార్థసిద్ధి, పాపములుపశమించుట వంటి ఫలములు ఎన్నియో ఈ లలితా సహస్ర నామ స్తోత్రపారాయణలోని ప్రతీ నామమునందు గలవు. ఇంతకు ముందు చెప్పినట్లు శ్రీలలితా పరమేశ్వరిని ధ్యానము చేయుచు, పూజించి శ్రీలలితా సహస్రనామ పారాయణము చేస్తే సకలరోగములు నశించును, దీర్ఘాయువు, సకలసంపదలు గలుగును. ఈ విషయము పరశురామ కల్పమునందు వివరించబడినది. 

శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము అనిన ఈవిధముగా ఉండును. పరమేశ్వరిని తమ దహరాకాశములో వీక్షించుచూ, పూర్వపీఠికలోని ఏబది శ్లోకములు పఠించవలెను. తరువాత ఋషికీలకాది న్యాసములు చేసి, ధ్యానశ్లోకమును పఠించి, పురుషులైనచో వైదిక ప్రణవము (ఓం కారము), స్త్రీలయినచో దేవీప్రణవము (సర్వాభీష్ట ప్రదమైన ‘హ్రీం’ కారం) మును ఉచ్చరించి, శ్రీమాతా అని ప్రారంభించినది మొదలు శ్రీలలితాంబికా యని అనునంతవరకూ పఠించవలయును. పఠనములో తొందరలేకుండా, స్పష్టముగా అక్షరములన్నియు ఉచ్చరించుచూ, ప్రతీ నామమునకు గల అర్థమును అనుసంధానము చేసికొను చుండవలయును. చివరలో మరల ప్రణవమును ఉచ్చరించి, ఋషికీలకాది న్యాసములు చేసి, ఫలశ్రుతిలోని ఎనుబది ఆరున్నర శ్లోకములు పఠించవలెను. ఆ పిదప మంత్రపారాయణజపము చేసి, అమ్మవారి ఎడమ చేతియందు ఉదకమును విడువవలెను. 

ఆ తరువాత తన స్వరూపమును, అమ్మవారి స్వరూపమును మనోనేత్రములందు భావించి చంద్రమండలమునుండి దృష్టిని మరలించుకొని, ఆచమనము చేసి, ఆ సమయమున అచ్చట గల ఉపాసకులకు భోజనము పెట్టి వారి ఆశీర్వచనములను పొందవలయును. తరువాత తానుకూడా భుజించవలయును. ఈ విధముగా చేసినచో శ్రీలలితా త్రిపురసుందరి అనుగ్రహము లభించును అని భాస్కరరాయలు వారు చెప్పియున్నారు.

ఓం సర్వవ్యాధి ప్రశమన్యై నమః అని శ్రీలలితా సహస్ర నామములందు (551వ) నామముగలదు. ఈ నామముతో లలితాసహస్రనామస్తోత్ర శ్లోకములను సంపుటీకరణము చేసి  పారాయణచేస్తే రోగబాధలు ఉపశమించుతాయి. ఈ విధానము ఎలాగ అనగా - జ్వరము వచ్చిన రోగిని ఉత్తరముఖముగా కూర్చుండనియోగించి పారాయణ చేయు ఉపాసకుడు తూర్ఫుముఖముగా కూర్చుని భస్మమును చేతనుంచి, సహస్రనామములతో మంత్రించి భస్మమును జ్వరపీడితునకు పెట్టవలెను. మంత్రజలముతో జ్వరితునకు అభిషేకము చేసినను జ్వరము తగ్గును. ఈ విధానములో ఉపాసకుడు తన నిత్యకృత్యమైన సంధ్యావందనాదులు పూర్తిచేసికొని  మొదట పూర్వపీఠికను పఠించి, జ్వరముతో బాధపడువాని శిరస్సుపై చేయి ఉంచి, పిదప శ్రీలలితా సహస్రనామ స్తోత్రపారాయణము చేసి, ఆ తరువాత ఉత్తరభాగము అనగా ఫలశ్రుతి పఠించి బ్రాహ్మణునికి స్వయంపాకము సమర్పించుట గాని, భోజనముగాని పెట్టవలయును. అదే ఉపాసకునికే జ్వరము సోకితే, అతడు తన చేయిని తన శిరసుపై పెట్టుకొని పారాయణము పూర్వపీఠిక పఠనము, సమస్రనామస్తోత్ర పారాయణము అనంతరము ఉత్తరపీఠిక (ఫలశ్రుతి) పఠించవలయును. జ్వరము ఇంకను తగ్గనిచో పూర్వపీఠిక పఠనముచేసి, సహస్రనామస్తోత్ర పారాయణము ఎన్ని ఆవృత్తులయినను చేసి, అనంతరము ఉత్తరపీఠిక పఠనము చేయ వలయును. అనగా పూర్వపీఠిక, అనంతరము సహస్రనామ స్తోత్ర పారాయణము (ఎన్నిసార్లయినను) చేసి అనంతరము ఉత్తర పీఠిక పఠనము  చేయవలయును. ఉత్తర పీఠిక యనిన ఫలశ్రుతి.

ఉపాసకుడు సహస్రనామములతో విభూతిని మంత్రించి, ఆ విభూతిని రోగి శరీరంపై పడునట్లు ఊదవలెను . లేదా రోగి శరీరమునకు ఆ విభూతిని పూయవలెను. అట్లు చేసినచో సర్వరోగనివారణము కాగలదు. మంత్రించుట అనగా విభూతిని ఉపాసకుడు చేతిలో ఉంచుకొని, తన చేతి వ్రేళ్ళతో కదుపుచూ, సహస్రనామస్తోత్ర పారాయణము చేయవలెను. అనంతరము రోగి శరీరముపై విభూతిని చేతిలోనుండి ఊదవలెను లేదా శరీరముపై పూయవలెను.

బిందెలో నీటిని పోసి, సహస్ర నామ స్తోత్ర పారాయణము చేయుచూ అభిమంత్రించి, ఆ నీటిని గ్రహబాధా పీడితునికి స్నానము చేయించవలెను. తత్ఫలితముగా బాలగ్రహములు మరియు పిశాచబాధలు ఉపశమించును. నవగ్రహదోషములు తొలగును.

శ్రీలలితా పరమేశ్వరిని సుధాసాగరమధ్యమున ఉన్నట్లు భావించి, శ్రీలలితా సహస్రనామస్తోత్ర పారాయణము చేస్తే ఉపాసకుని బాధలు తొలగిపోవును. బాధాపీడితులు తమగోత్ర నామముల సంకల్పంతో ఉపాసకునిచే పారాయణ చేయించినట్లయిన, బాధాపీడుతులకు  సర్వరోగములు, సర్వభూతప్రేతపిశాచా పీడనము, నవగ్రహదోషములు తొలగిపోవును. శ్రీపురమెచ్చట ఉన్నదో, అచ్చట సుధతో కూడిన కొలనులు (చెఱువులు) అనేకము ఉన్నవి. ఆ శ్రీపురమునందు అర, ణ్య ములను రెండు హ్రదములు (కొలనులోని లోతైన మడుగులు) ఉన్నవి. అలాగే బ్రహ్మరంధ్రమునందు సహస్రారంలోని చంద్రమండలములోని సుధాసాగరము నందు ఒక హ్రదము గలదు. ఈ మూడింటిలో పరమేశ్వరి ఉంటుంది. తమతమ శక్తికొలది ఆ పరమేశ్వరిని ధ్యానము చేసి, మానసిక పంచోపచారములు (గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాలు) చేయవలయును. అలాచేస్తే ఉపాసకుల సకల బాధలు తొలగిపోవును.

సంతానభాగ్యము లేని వంధ్యులకు ఈ సహస్రనామపారాయతో మంత్రించిన వెన్నను భక్షింపజేసిన సత్సంతాన భాగ్యము కలుగును.

 శ్రీలలితా సహస్రనామస్తోత్ర పారాయణ చేయునతని ముఖము దివ్యకాంతులతో ప్రకాశించుచుండును. ఆ కాంతులలో సమ్మోహనశక్తి ప్రస్ఫుటమై యుండును. లోకులందరు వశ్యులై ఉంటారు. శత్రువులుకూడా వశమైపోతారు. శివవాతారుడైన శరభేశ్వరుడు శత్రువులను లేకుండా చేయును. శ్రీలలితా సహస్రనామస్తోత్ర పారాయణము వలన అంతటి మహిమాన్విత శక్తి ఉపాసకునిలో ఆవహించి ఉండును. శత్రుపీడ ఉన్నవారు శ్రీలలితా సహస్రనామస్తోత్ర పారాయణము చేసినచో శత్రుపీడ తొలగును మరియు సకలజనులు మిత్రభావమతో మెలగుచుందురు.

శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణ చేయునతనిని ఎవరైనా భయంకదృష్టితో చూచినచో, మార్తాండభైరవుడు భయంకరదృష్టితో చూచినవానిని అంధుని చేయును. ఈ మార్తాండ భైరవుడు కర్ణాటకలోని ప్రేమపురంలో శివుని అవతారంగా ప్రసిద్ధిచెందియున్నాడు.

శ్రీలలితా సహస్రనామ స్తోత్ర పారాయణము చేయునతని సమీపములోనికి ఎటువంటి మంత్రప్రయోగముల ప్రభావం చేరదు. తిరిగి ఆ మంత్రప్రభావము ప్రయోక్తపైకే తిరిగిపోవును. శ్రీలలితా సహస్ర నామ పారాయణ చేయునతనిని ఎవరైనా క్రూరదృష్టితో చూచినను, చెడుతలపెట్టినను శివుడు మార్తాండభైరవుడై ఆ చెడుదృష్టిని తిప్పికొట్టును, ఉపాసకుని (పారాయణచేయునతని) వైపు చూడడానికికూడా కన్నులు పనిచేయవు. శ్రీలలితా సహస్రనామ స్తోత్రపారాయణ చేయునతడు దుష్టులకు భయపడనవసరము ఉండదు.

శ్రీలలితా సహస్ర నామ పారాయణ చేయునతని సొత్తును అపహరించప్రయత్నం చేస్తే క్షేత్రపాలుడు ఆ చోరుని మట్టుబెట్టును.

విద్యార్థులు, ఉద్యోగార్థులు, కార్యసాధనలో నుండువారు, సభలయందు గోష్ఠిలో పాల్గొనువారు శ్రీలలితా సహస్ర నామ పారాయణ చేయుటవలన తమ ప్రయత్నముల యందు జయమును పొందగలరు.

ఎన్నికల యందు అభ్యర్థులుగా నున్నవారు, ఆటలపోటీలలో పాల్గొనువారు మరియు వివిధరకములైన పోటీలలో పాల్గొనువారు శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము భక్తిప్రపత్తులతో ఆచరిస్తే తప్పక విజయంసాధించగలరు. 

శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర )పారాయణ చేయువారిని ఆ |పరమేశ్వరి ధనధాన్యాది అష్టైశ్వర్యముల (దాసి, ధనము, ధాన్యము, బంధువు, భృత్యుఁడు, వస్త్రము, వాహనము, సుతుఁడు అను అష్టైశ్వర్యముల) సమృద్ధి కలగునట్లు అనుగ్రహించును. 

శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము చేయువారికి సరస్వతీ కటాక్షము సంప్రాప్తించును. సరస్వతీ కటాక్షమనిన విద్యార్థులు, పోటీ పరీక్షలకు వెళ్ళువారు, అధ్యయనము చేయు వారు అత్యున్నత శ్రేణిలో తమ స్థాయిని నిలబట్టుకొనట, ధారణాశక్తి, జ్ఞాపకశక్తి, విశ్లేషణాశక్తి, చదివిన అంశములను సమయస్ఫూర్తిగా వినియోగించుకొనుట వంటి విశేషమైన ప్రతిభలు సంప్రాప్తించును. 

 'విద్యలేనివాడు వింత పశువు' అని ఏనాడో వేమనకవి చెప్పిన మాటలు ఇక్కడ గుర్తుకు వచ్చినట్లు అనిపించినది. శ్రీవిద్య లేనివాడు అని అన్వయించుకోవచ్చును. శ్రీవిద్య మాత్రమే కాదు శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణచేయువారు కూడా అమ్మవారికి ప్రీతిపాత్రులే. గనుక, అట్టివారుకుడా శ్రీవిద్యోపాసకులంతటివారే. 

కోట్లాది సహస్ర నామములలో పది సహస్ర నామములు శ్రేష్ఠమైనవి గలవనియు, అందులో సాక్షాత్తు పరమేశ్వరి అంశలైన వశిన్యాది వాగ్దేవతలు చేసిన శ్రీలలితా సహస్ర నామములు అత్యంత శ్రేష్ఠమనియు  పూర్వపీఠికలో హయగ్రీవులవారు అగస్త్యుమహర్షికి చెప్పియున్నది ఇచ్చట మరియొకసారి ఆ భావముతో ఇచ్చట చెప్పబడినది. గనుక శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము చేయు భక్తజనులకు  సాటి వేరొకరు ఉండరని భావన.
 
 శ్రీవిద్యోపాసన లేనివారికి సహస్రనామస్తోత్ర పారాయణకు అర్హతలేదని శ్రీలలితా సహస్రనామ స్తోత్ర ఫలశ్రుతి ఒక చోట చెప్పబడినప్పటికిని పుస్తకమునందు వ్రాసుకొని ఆరాధించుటకు అర్హత ఉన్నది. అలాగే శ్రీవిద్యోపాసన లేనివారు కూడా శ్రీలలితా సహస్రనామ పారాయణ చేయవచ్చునని చెప్పబడినదనుట కూడా గమనార్హము. గనుక పుస్తకములో వ్రాసుకుని ఆ పుస్తకమును పూజించుట శ్రీలలితా సహస్ర నామస్తోత్ర పారాయణ చేయునంతటి ఫలము లభించును.  అనగా శ్రీలలితా పరమేశ్వరి తన సహస్ర నామ స్తోత్రపారాయణ చేయువారిని సకలాభీష్టసిద్ధితో అనుగ్రహించును.

శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణ ఫలశ్రుతిలో ఎంతగానో వివరించబడినది.  వశిన్యాది వాగ్దేవతలు సాక్షాత్తు పరమేశ్వరీ అంశసంభూతులు. వైైఖరీ రూపములో వెలువడు అక్షరములను జ్ఞానవంతమైన వాక్కులుగా బయల్వెడలజేయు జ్ఞానమూర్తులు ఆ వశిన్యాది వాగ్దేవతలు. కోట్లాది సహస్ర నామములలో అత్యంత శ్రేష్ఠమైనదియును, రహస్యాతి రహస్యమైనది అయిన శ్రీలలితా సహస్ర నామములను ఆ పరమేశ్వరి ఆజ్ఞమేరకు జ్ఞానస్వరూపులు అయిన వాగ్దేవతలు అయిన వశిన్యాదులు రచించినారు. గురువు ఒకసారి చెప్పిన పిదప,  ఏవిధముగా శిష్యుడు పదేపదే వల్లెవేయుచుండునో అదే విధమగా శ్రీలలితా సహస్రనామ స్తోత్రము పఠించుచున్నకొలదియు, అందులో ఇమిడి ఉన్న రహస్యాతి రహస్యమైన పరమేశ్వరియొక్క తత్త్వము పారాయణము చేయువారిలో ఇమిడిపోయి, బ్రహ్మజ్ఞానసంపన్నత లభించుట తథ్యము. దేవీ పురాణమునందు ఇలా చెప్పబడినది 'ఏ ఒక్క నామమైనను, ఆ నామముయొక్క ధాతువు (సారము), అర్థము, అందులో నిక్షిప్తమైన భావము వంటి విషయములు తెలిసికొనిన యతడే శ్రీలలితా లోకమునందు కోటి కల్పముల కాలము విలసిల్లియుండును' అని చెప్పబడినది. శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణ చేయునపుడు, ఆయా శ్లోకములలో ఇమిడి ఉన్న నామములు, నామములలోని భావములు, నామతత్త్వవిచారణ కూడా అనుసంధానము చేసికొనినచో, అట్టి ప్రక్రియ పరమేశ్వరికి బ్రహ్మానందదాయకము, పాఠకునికి కైవల్యదాయకము. 

శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము ఒకసారి చేయునతనికి గలుగు పుణ్యము యొక్క వివరము సాక్షాత్తు ముక్కంటికి కూడా చెప్పనలవికాదు.  ఒక్కసారి స్తోత్ర పారయణము చేసినంత మాత్రమున పద్మములు, తులసీ పుష్పములు, కల్హారములు (ఎరుపు, తెలుపుల మిశ్రిత వర్ణశోభితమైన పరమళ భరితములైన కలువలు), సంపెంగలు, మాలతీ కుసుమములు, మల్లెలు, కరవీర పుష్పములు, నల్లకలువలు, బిల్వపత్రములు, మొల్లలు, పొగడపూలు, పాటలీ కుసుమములు, మొగలి పువ్వులు, విరజాజులు వంటి పరిమళ భరితమైన కుసుమములతో పూజించిన ఫలము లభించును. ఇక్కడ చెప్పిన పుష్పములన్నియు శ్రీచక్రార్చనకు శ్రేష్ఠమైనవి. 

శ్రీచక్రార్చనముగాని, శ్రీలలితా త్రిపురసుందరి విగ్రహమునకు గాని, పటమునకు గాని శ్రీలలితా సహస్ర నామములతో పూజచేయు నపుడు, ఒక్కొక్క నామమునకు చివర 'నమః' చేర్చుచూ, ఒక్కొక్క పుష్పమును సమర్పిస్తూ పూజ చేయవలెను. ఉదా.  శ్రీమాత్రే నమః, శ్రీమహారాజ్ఞ్యై నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః అని యనుచూ సహస్రనామములతో, ఒక్కొక్క నామమునకు ఒక్కొక్క పుష్పము వేస్తూ పూజించవలెను. అనగా వేయి నామములకు వేయి పుష్పములు ఉపయోగించవలెను. అమ్మవారిని తులసిదళములతో పూజచేయరాదు. తులసి పుష్పములు (తులసికంకుల) తోనే పూజ చేయవలెను. కామ్యపూజ అనగా ఏ కోరికతో పూజచేయాలనుకుంటే, ఆ కోరికకు నిర్దేశింపబడిన పుష్పములతో పూజ  చేయవలెను. 

శ్రీలలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మహత్త్వముచే ఉపాసకులలో లలితా స్వరూపము కనిపించును. అనగా ఉపాసకుల ముఖపద్మములయందు దివ్యత్వము ప్రస్ఫుటముగా కానవచ్చును. ఉపాసకుని ఉపాసకుడే వీక్షిస్తే ఒకరి ముఖములో ఇంకొకరు శ్రీలలితా స్వరూపమును వీక్షించుచుందురు.  

శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారయణమే శ్రీలలితా పరమేశ్వరిని శ్రీచక్రమధ్యమున పూజించినంత ఫలము. చతుర్విధ మోక్షదాయకము. 

మనం దేని గురించి ధ్యానిస్తూ ఉంటామో, అది మనమై పోయే లక్షణము. మారీచుడు రాముడిని (భయముతో) ఉపాసన చేసి రాముడి లక్షణము (స్వరమును) పొందుటలాంటిది. దీనినే సారూప్య మోక్షం అంటారు.

మహానవమి అనగా ఆశ్యయుజ మాసములో వచ్చు దేవీ నవరాత్రులలో తొమ్మిదవ రోజు. దేవీ నవరాత్రులనే శారదా నవరాత్రులు అంటారు.

శుక్రవారము లక్ష్మీదేవికి ప్రీతియైన దినము. శ్రీలలితా పరమేశ్వరి మహలక్ష్మీ స్వరూపిణి గనుక శుక్రవారమ శ్రీలలితా పరమేశ్వరికి కూడా ప్రియమైన దినము.
 
ప్రతీ శుక్రవారం శ్రీచక్రమునందు సహస్ర నామములతో పూజించినవారికి భౌతికపరమైన మరియు ధర్మబద్ధమైన కోర్కెలు నెరవేరును. సకల సౌభాగ్యములు గలవారై, పుత్రులతోను, పౌత్రులతోను సంతోషంగా జీవించుచూ సకల భోగభాగ్యములను అనుభవించుదురు. మరణించిన పిదప ఎవరికీ సాధ్యముకానిది, శివుడు మున్నగు వారిచే ప్రార్థింపదగినది అయిన శ్రీలలితాసాయుజ్య మోక్షము (కైవల్యము) సంప్రాప్తింపజేసి కొందురనుటకు సందేహములేదు.

శ్రీచక్రమందు లలితాంబను పూజించిన గలుగు ఫలము శ్రీలలితా సహస్రనామ స్తోత్ర పారాయణము చేతకూడా లభించును. అమ్మవారికి సహస్రనామములచే చేయు పూజవలన ఎంత సంతృప్తి కలుగునో, శ్రీలలితా సహస్ర నామ పారాయణవలన కూడా అమ్మవారు  అంతే సంతృప్తి చెందును. శ్రీలలితా సహస్ర నామస్తోత్ర పారాయణము, ఇంతకు ముందు శ్లోకములలో చెప్పినవిధముగా మొదట పూర్వపీఠిక పఠించిన పిదప ధ్యాన శ్లోకము, అనంతరము సహస్ర నామ పఠనము తదుపరి ఉత్తర పీఠిక  (ఫలశ్రుతి) పఠించవలయును.

ఈ జన్నలో చేసిన పుణ్యపాప ఫలములు రాబోవు జన్మలలో లభించును. ఈ జన్మలో చేసిన పుణ్యపాపములు అత్యధికమయినచో ఫలములు కూడా ఈ జన్మలోనే లభించును. అదే విధముగా శ్రీలలితా సహస్ర నామ పారాయణము అత్యంతమగు భక్తినిరతితో, క్రమము తప్పకుండా చేసినచో అమ్మవారు మిక్కిలి ప్రీతిని పొందినదై, కోరిన కోర్కెలు నెరవేర్చుటయేగాక, ధనధాన్యసమృద్ధి, శాంతిసౌఖ్యములు సంప్రాప్తింపజేయును.

శ్రీలలితా సహస్ర నామ పారాయణము చేసి, అనంతరము సపాత్రులైన (గత శ్లోకములలో చెప్పినట్టు శ్రీలలితోపాసన చేయు భక్తులైన బ్రాహ్మణులు ఉత్తమమైన)  వేయిమంది బ్రాహ్మణులను పూజించి షడ్రసోపేతమైన భోజనం పెట్టి తగువిధంగా దక్షిణతాంబూలములతో సత్కరించు భక్తులంటే శ్రీలలితా పరమేశ్వరికి ఎంతో ఇష్టము. అట్టి భక్తులకు ఆ పరమేశ్వరి భౌతికముగా సకలభోగ భాగ్యములను,  మరణానంతరము లభించు అత్యంత దుర్లభమైన సాయుజ్యమోక్షమును అనుగ్రహించును. ఇచ్చట శ్రీలలితా పరమేశ్వరి తన సహస్రనామ స్తోత్రము పారాయణ చేయు భక్తులకు తన సామ్రాజ్యమును ఇచ్చును అను భావము స్ఫురించును. సామ్రాజ్యము అనగా తన భక్తులు రాజభోగములు అనుభవించువారిగా అనుగ్రహించును. 
 
వశిన్యాది వాగ్దేవతలచే విరచించబడిన శ్రీలలితా సహస్ర నామ స్తోత్రమును ఏకోరిక లేకుండా పారాయణము చేయు భక్తుడు సంసారబంధములను నిర్మూలించు బ్రహ్మజ్ఞాన సంపన్నుడగును.

బ్రహ్మజ్ఞాన సంపన్నులైన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితాంబిక అంశనుండి బయల్వెడలినవారు. శ్రీలలితా పరమేశ్వరియొక్క అనంతకోటి కాంతికిరణములనుండి ఉద్భవించినవారు ఆ వశిన్యాది వాగ్దేవతలు. బ్రహ్మజ్ఞాన సంపన్నులైన వశిన్యాదులు విరచించిన శ్రీలలితా సహస్ర నామములు రహస్యాతి రహస్యమైనవి. ప్రతీ ఒక్క నామము  యొక్క తత్త్వము అనంతము. బ్రహ్మజ్ఞాన నిబిడీకృతము. ప్రతీ నామము చదువగా వినిపించునది ఒక్కటేయైనను అంతర్లీనమైన భావము అనంతము. నామపారాయణము వలన లభించే ఫలము అద్భుతము. నిష్కామముతో పారాయణము చేసినను, సకలార్థసాధకము మరియు మోక్షప్రదాయకము. 

వశిన్యాది వాగ్దేవతలచే చేయబడిన శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము నాచరించు భక్తుడు సంపదలు కోరువాడైతే సంపదలు, కీర్తికాముకుడు అయినచో కీర్తి, సరస్వతీ కటాక్షము (విద్య) కోరువాడు అనంతమైన విద్యాసంపదను పొందుచున్నాడు.

శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణచే  నిష్కాముకుడైనా సరే ఆ పరమేశ్వరి    తన భక్తునకు ధనము, కీర్తి, విద్య వీటిలో ఏది అవసరమైతే అది ఆ పరమేశ్వరి అనుగ్రహిస్తుంది. విద్యార్థి అంటే శ్రీవిద్యార్థి అనగా శ్రీవిద్య, సంపదలు అంటే జ్ఞానసంపదలు, కీర్తి యంటే శ్రీవిద్యోపాసనచే కలుగు బ్రహ్మజ్ఞానతేజోయశస్సు అనికూడా అన్వయించుకోవచ్చును. నిష్కాముడైనా (ఏవిధమైన కోరిక లేనివాడు అయినాకూడా) అమ్మ వారి పాదసేవకూడా ఒక కోరికయే. గనుక సామీప్యమోక్షమును ప్రసాదించి అటువంటి పాదసంసేవనా భాగ్యము అనుగ్రహించును. 

భౌతికపరమైన భోగములు, చతుర్విధములైన మోక్షములు ప్రసాదించు శ్రీలలితా సహస్ర నామ స్తోత్రమునకు సాటియైనది వేరొక స్తోత్రంలేదు. ఐహిక సుఖములు, మోక్షసామ్రాజ్య సుఖములు కోరువారు శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము చేయవలెను.

శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము అత్యంత శ్రేష్ఠమైనది. భౌతికపరమైన కోరికలు లేని వారికి మోక్షము అనుగ్రహించును. అష్టైశ్వర్యములు, శాంతిసౌఖ్యములు, సంతోషము, విద్య, యశస్సు వంటి భౌతికసంబంధమైన కోరికలు కోరువారికి ఆ ఐహికపరమైన కోరికలు కూడా సిద్ధింపజేయును.

బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్న్యాసి యను చతురాశ్రమములవారు, ఆయా ఆశ్రమముల ధర్మముల నాచరించునపుడు, వైగుణ్యము (గుణదోషము), వైకల్యము కలిగినచో, తత్ప్రభావమున ఏర్పడిన దోషములు శ్రీలలితా సహస్రనామ స్తోత్ర పారాయణచే పటాపంచలగును.

చతురాశ్రమ ధర్మ నిర్వహణలో కలుగు దోషములు శ్రీలలితాసహస్రనామ స్తోత్ర పారాయణ వలన తొలగును అంటే శ్రీలలితా సహస్ర నామ స్తోత్రపారాయణము  చతురాశ్రమములవారికి కూడా ఆచరణీయము. సకాములు, నిష్కాములు కూడా ఈ స్తోత్ర పారాయణము చేయవచ్చును. ఏవరికి ఏఫలము అవసరమో ఆ ఫలము లభించును. దేశకాలమాన పరిస్థితులననుసరించి వైదికకర్మాచరణములో దోషములు సంభవించును. అటువంటి దోషములు శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణమాచరించుటచే తొలగును.

ఇది కలియుగము. స్వధర్మానుష్ఠానాచరణమునందు దోషములు కలిప్రభావమున సంభవించవచ్చును. అటువంటి దోషనివారణకు శ్రీలలితా సహస్ర నామస్తోత్ర పారాయణమే శరణ్యము తప్ప అన్యమేమీ ఉండదు. శ్రీలలితా సహస్ర నామ పారాయణము చేసినచో దోషపూరితమైన వైదికకర్మాచరణమునకు సాద్గుణ్యము సంతరించును.

శ్రీలలితా స్తోత్ర పారాయణము చేయునపుడు తెలియక సంభవించే పదపరిచ్ఛేద దోషములను ఆ పరమేశ్వరి క్షమించును. ఎందుకంటే శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము కూడా ఒక వైదికకర్మవంటిదే. సంధ్యావందనాదులు, యజ్ఞయాగాది క్రతువులు వంటి వైదిక కర్మాచరణముల సమయములో కలియుగ ప్రభావముచేత తెలిసియో, తెలియకనో ఏర్పడు దోషములు శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము చేత తొలగును. అనగా సకల వైదిక కర్మలనాచరించునపుడు శ్రీలలితా సహస్రనామ స్తోత్ర పారాయణమాచరించుట యొక్క ఆవశ్యకత ప్రస్ఫుటమగుచున్నది. గృహములో జరుగు చిన్న పూజాకార్యక్రమము మొదలు  వివాహాది శుభకార్యముల వరకును కూడా విఘ్ననివారణకు తొలిపూజ విఘ్నేశ్వరునికే చేయడం జరుగుతుంది. అదే విధముగా సకల వైదిక కర్మాచరణములయందు కలుగు దోషముల నివారించుటకు శ్రీలలితా సహస్రనామ స్తోత్ర పారాయణామాచరించుట కూడా అవసరము.

లౌకిక వాక్యములలో విష్ణునామ కీర్తనము ఉత్తమము. అటువంటి విష్ణు సహస్ర నామములకన్నా శివసహస్రనామము ఉత్తమము. శివ సహస్ర నామములకన్నా శ్రీలలితా సహస్ర నామములు ఉత్తమము. కోట్లాది దేవీ సహస్ర నామములలో గంగా, భవానీ, గాయత్రీ, కాళీ, లక్ష్మీ, సరస్వతీ, రాజరాజేశ్వరీ, బాలా, శ్యామలా, లలితా అను పదిసహస్ర నామములు అత్యంత ఉత్తమమైనవి.  అటువంటి పది దేవీసహస్ర నామములలో రహస్యాతి రహస్యమైనది శ్రీలలితా సహస్ర నామము. వైదికకర్మాచరణములో కలియుగ ప్రభావమున సంభవించే లోపముల వలన కలిగే దోషముల నివారణకు రహస్యాతి రహస్యమైన శ్రీలలితా సహస్ర నామ స్తోత్రము ఉత్తమమైనది.

దేవీ సహస్ర నామములు కోట్ల కొలదీ ఉన్నవి. అందులో పది సహస్ర నామములు మిక్కిలి ముఖ్యమైనవి. అటువంటి మఖ్యమైన దేవీ సహస్ర నామములలో అతిముఖ్యమైనది రహస్యాతిరహస్యమైన శ్రీలలితా సహస్ర నామము. అనగా వైదికకర్మాచరణమునందును, వర్ణాశ్రమాచారములు పాటించుటయందును కలియుగ ప్రభావమున కలుగు దోషనివారణమునకు శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము నిత్యము ఆచరించవలెను. 

ఈ నిజాన్ని తెలిసిన జనులు వాడవాడలా సమూహములుగా ఏర్పడి శ్రీలలితా సహస్ర నామ పారాయణమొనరించుచున్నారు. 

కొందరు విష్ణు సహస్రనామాలను, మరికొందరు శివసహస్ర నామాలను పరమని తలుస్తారు.  శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణమునకు గల ప్రభావము ఇంత అంత అని చెప్పుటకు ఎవరికినీ అలవికాదు.

గత జన్మలో శ్రౌతస్మార్తకర్మలను క్రమముదప్పక చేయుటచే పుణ్యము సంప్రాప్తమగును. అట్టి పుణ్యఫలముగా విష్ణునామములందు ఆసక్తి కలుగును. ఎన్నో జన్మములందు విష్ణునామములను కీర్తించిన ఫలముగా శివనామములం దాసక్తికలుగును. అట్టి అనేక జన్మల శివనామముల ఆసక్తి వలన శ్రీలలితా నామములందు ఆసక్తికలుగును. ఎవరైతే స్వయముగా శంకరుడై యున్నాడో, లేదా ఎవనికి అయితే పునర్జన్మలేక దేవీసాయుజ్యమునందగలడో అట్టి వానికి మాత్రమే శ్రీవిద్యోపాసన మబ్బును. అటువంటి శ్రీవిద్యోపాసనా తుల్యమైనది రహస్యాతి రహస్యమైన శ్రీలలితా సహస్ర నామ స్తోత్రపారాయణము. గనుక శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము చేసి తరించినవాడు  పునర్జన్మరాహిత్యమైన కైవల్యమునకు అర్హుడు. 

శ్రీవిద్యోపాసకులు ఏవిధంగా తక్కువగా ఉన్నారో, శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము పట్ల ఆసక్తి ఉన్నవారు కూడా అట్లే తక్కువ. 

ఇంతకు ముందు చెప్పినట్లు శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము చేయుట లేదా శ్రీవిద్యోపాసనయందు అభిలాష కలిగియుండుట అనేది పూర్వజన్మ పుణ్యఫలమే. శ్రౌతస్మార్తకర్మాచరణముయొక్క అనేక జన్మల పుణ్యఫలమే విష్ణునామములయందాసక్తి, విష్ణునామ జపములయొక్క అనేక జన్మల పుణ్యఫలమే శివనామములయందాసక్తి. శివనామ జపముల ఫలమే శివసాయుజ్యము, శివస్వరూపము.      ఎవనికి పునర్జన్మమైతో ఉండదో, ఎవడైతే శివస్వరూపమై ఉంటాడో అతడే శ్రీవిద్యోపాసకుడౌతాడు, అట్టివాడే శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము చేయగల అదృష్టవంతుడు. అంతటి అదృష్టవంతుడే పునర్జన్మములేని కైవల్య సాధకుడు. అంతటి మహిమాన్వితమైన స్తోత్రము పారాయణము నేడు వాడవాడలా...ఎల్లెడలా ఆచరించబడుతోంది. ఆ శ్రీలలితా పరమేశ్వరి అజ్ఞానాధ్వాంతదీపిక, ఆబాలగోపవిదిత, సర్వానుల్లంఘ్యశాసన, శ్రీచక్రరాజనిలయ, శివశక్త్యైక్యరూపిణి.

శ్రీవిద్యామంత్రము, శ్రీచక్రార్చనము, శ్రీలలితా సహస్ర నామ స్తోత్రపారాయణము ఈ మూడును ఒకే జన్నలో లభించుట అతి దుర్లభము. అలా లభించుట పూర్వజన్మపుణ్యఫలమే అగును. అంధుడు పదార్థముల స్వరూపమును ఎలాగైతే గ్రహించలేడో, శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము నాచరించనివాడు శ్రీలలితా పరమేశ్వరి అనుగ్రహమును పొందలేడు. 

జన్మజన్మల నుండి విష్ణుసహస్ర నామములు, శివసహస్ర నామముల జపమాచరించిన పుణ్యఫలముచే సంప్రాప్తమైనదే శ్రీలలితా మంత్రజపము, శ్రీచక్రార్చనము, శ్రీలలితా సహస్ర నామ పారాయణ - ఈ మూడింటిని యాచరించు మహద్భాగ్యము. నేత్రములు లేనివాడు వస్తువులను ఎలాచూడలేడో అట్లే లలితా సహస్రనామ స్తోత్రపారయణము చేయని వానికి ఆ పరమేశ్వరి అనుగ్రహము లభించదు. శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణ మహత్వమింతటి ప్రభావము గలదని తెలియుచున్నది. 

శ్రీలలితా సహస్ర నామ పారాయణము చేయకనే ఆ పరమేశ్వరి అనుగ్రహమును కోరుట, ఆహారము తినకుండానే ఆకలితీరదు అనునది నిశ్చయము. 

శ్రీలలితా పరమేశ్వరి భక్తుడయినవాడు శ్రీలలితా సహస్ర నామ పారాయణము చేయవలెను. శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము నిత్యమూ ఆచరించినవాడే దేవీ భక్తుడు. స్తోత్ర పారాయణచేయని వాడు భక్తుడు కానేరడు.

నేను పరమేశ్వరి భక్తుడను అనగానే సరిపోదు. ఆ పరమేశ్వరి నామ పారాయణము త్రికాలసంధ్యాచరణము వలె భావించి ఆ పరమేశ్వరి స్తోత్రపారాయణమాచరించినపుడే భక్తునిగా అర్హత ఉండునని పలుమార్లు హయగ్రీవులవారు వచించుచున్నారంటే పదేపదే శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము యొక్క ఆవశ్యకత వివరించుచున్నారని భావము.

ఇదియంతయును హయగ్రీవులవారు అగస్త్యునితో చెప్పినది సూతులవారు వచించియున్నారు. ఇంకను హయగ్రీవులవారు చెప్పినది   సూతులవారు ఇలా వచించున్నారు: "ఓ అగస్త్య మహర్షీ! శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణముచే శ్రీపరమేశ్వరికి ప్రీతి గలుగును గనుక నీకు నేను చెప్పియుంటిని. ఓ మహర్షీ! శ్రీవిద్య నెరుగని వానికి, దైవమందు విశ్వాసము లేని వానికి శ్రీలలితా సహస్ర నామ స్తోత్రమును చెప్పవలదు. శ్రీవిద్య ఎంతటి రహస్యమైనదో, శ్రీలలితా సహస్ర నామ స్తోత్రము కూడా అంతే రహస్యము".

హయగ్రీవులవారు ఇంకను మరల అగస్త్యులవారికి ఇలా చెప్పడం జరిగినదని సూతులవారు చెప్పారు: "శఠులు, మూఢులు, విశ్వాసము లేనివారు పశుతుల్యులు. అటువంటి పశువులకు రహస్యాతి రహస్యమైన శ్రీలలితా సహస్ర నామములు చెప్పవలదు. శ్రీవిద్యయు, భక్తియు లేనివారుకూడా పశుతుల్యులే.  గనుక శ్రీలలితా సహస్ర నామముల యొక్క రహస్యమును కాపాడవలెను.

శ్రీలలితా సహస్ర నామముల రహస్యము కాపాడనిచో, పరమేశ్వరిని సేవించు మహాచతుష్షష్టికోటి యోగినీ గణములకు ఆగ్రహము కలుగును అని హయగ్రీవులవారు వచించారు. 

హయగ్రీవులవారు ఇలా వచించినారట ఓ అగస్త్యమహర్షీ! నీవు శ్రీవిద్యా, శ్రద్ధాభక్తులు గలవాడవైనను నా అంతట నేనుచెప్ప లేదు. సాక్షాత్తు శ్రీలలితా పరమేశ్వరియే చెప్పమని నాకు ప్రేరణనిచ్చినది. అందుకే నీకు శ్రీలలితా సహస్ర నామములు కూడా చెప్పి ఉన్నాను.

శ్రీవిద్య తెలిసిన వానికి కూడా భేదింపక శ్రీలలితా సహస్ర నామములను రహస్యముగా ఉంచవలయునని చెప్పియుంటివి గదా! నాకెందుకు చెప్పితివి? అని శంకించు అగస్త్యునకు 'నీవు శ్రీవిద్యోపాసకుడవు. పూర్ణాధికారివి. గనుక చెప్పియుంటిని' అని హయగ్రీవులవారు సమాధానము చెప్పారు.

సూతులవారు వచించు చున్నారు  శ్రీ హయగ్రీవులవారు ఇలా పలికి, శ్రీలలితా పరమేశ్వరిని ధ్యానించినవాడై, వెంటనే ఆనందముతో హృదయము పులకించినవాడయ్యెను.

🙏🙏శ్రీమాత్రే నమః🙏🙏

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కామదాయిన్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

64వ నామ మంత్రము 

ఓం దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మ వైభవాయై నమః

దేవతల, ఋషుల మరియు గణదేవతల యొక్క సమూహములచే ప్రస్తుతింపబడు వైభవంతో విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మ వైభవా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మ వైభవాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని ఉపాసించు ఉపాసకులకు జ్ఞానసిద్ధి లభిస్తుంది. పవిత్రమైన కోరికలు జనిస్తాయి. జీవిత పరమార్థాన్ని సాధిస్తారు.

బ్రహ్మాది దేవతల యొక్కయు, కశ్యపాది ఋషుల యొక్కయు, ఆదిత్యాది గణముల యొక్కయు సమూహములచే స్తుతింపబడెడి వైభవముతో విరాజిల్లుచున్నది శ్రీమాత.

అగ్నిపురాణంలో ఇలా చెప్పబడినది 

ఆదిత్య విశ్వవసవస్తుషితాఽఽభాస్వరాఽనిలాః|

మహారాజికసాధ్యాశ్చ రుద్రాశ్చ గణదేవతాః॥

ఆదిత్యులు  - 12, విశ్వదేవతలు - 10, వసువులు - 8, తుషితులు - 36, అభాస్వరులు - 64, అనిలులు - 49, మహారాజికులు - 220, సాధ్యులు - 12, రుద్రులు - 11.

అనువారు నవగణదేవతలు. వీరిచే స్తుతింప బడినది.

అమ్మ మహామంత్రస్వరూపిణి. అనగా సప్తకోటి మహామంత్రాల స్వరూపవైభవం గలిగినది.

చతుష్షష్టికోటి యోగినీ గణములచే సేవింపబడు వైభవము గలిగియున్నది.

అచ్చులు పదహారు మరియు హల్లులు ముప్పది నాలుగు. ఇందు అచ్చులు దేవతలు, హల్లులు ఋషిగణములు, క్ష కారము సంఘాతము.

సప్తకోటి మహా మంత్రములు శ్రీమాతకు వైభవము. అచ్చులు - పదహారు, హల్లులు - ముప్పదినాలుగు మరియు క్ష కారము - మొత్తము ఏబది ఒక్క వర్ణములు (అక్షరములు). ఈ వర్ణముల తోడనే సమస్త వేద శాస్త్రాదికములు ఏర్పడినవి. వేదశాస్త్రాదులు అన్నియును శ్రీపరాశక్తిని స్తుతిస్తూ ఉన్నాయి. కనుక ఇవి అన్నియు శ్రీమాత వైభవమే అగును. బ్రహ్మాది దేవతలు - కశ్యపాది ఋషులు - మరీచ్చాది గణములు స్తోత్రము చేయగా చిదగ్నికుండమున శ్రీచక్రమున బిందు మండలమున శ్రీదేవి అవిర్భవించిసది అని తెలియదగిన విషయము. గనుక, ఆ పరమేశ్వరి దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మవైభవా యని అనబడినది.

రుద్రయామళములో అనేక కోట్లమంది దిక్పాలకులు, కోట్లాది సూర్యచంద్రులచేతను, వసువుల చేతను అమ్మవారు స్తుతింపబడినది అని చెప్పబడినది.

భండాసురునితో జరిగిన యుద్ధములో దేవతలు ఓడింపబడ్డారు. ఇంద్రుడు సింహాసనాన్ని కోల్పోయాడు. దేవకాంతలు చెరపట్టబడ్డారు. మునులు, ఋషులు నిర్వర్తించే యజ్ఞకుండములు అగ్ని చీము, రక్తములతో మలినమై పోవుచున్నది. సూర్యచంద్రులు గతులు తప్పి కళావిహీనమైపోయారు. 

అప్పుడు దేవగణములు, ఋషిగణములు తమను భండాసురుడనే సంఘాతము (నరకము) నుండి తప్పించమని పరమేశ్వరిని అనేక రకములుగా స్తుతించారు. ఇక్కడ సంఘాతము అంటే సమూహము అనియు, అమ్మవారు దేవర్షుల (నారదాది ఋషులు) చే స్తుతింపబడిన వైభవమనే ఆత్మానందముగలిగి యున్నదనియు కూడా భావించవచ్ఛును.

పరమేశ్వరి దేవర్షిగణములు, ఋషిగణములు సంఘీభవించి స్తుతించునట్టి వైభవము గలిగినది అని ఈ నామ మంత్రములోని భావము.

దేవర్షిగణములచే తమకు రాబోయే భండాసురుడనే సంఘాతనరకమును పోగొట్టమని స్తుతించుచూ వేడుకున్నారు అని కూడా ఈ నామ మంత్రములోని భావము.

భండాసురుని సంఘాతము (వధ) కొరకై దేవర్షిగణములచే స్తుతింపబడిన వైభవము గలిగినది పరమేశ్వరి.

ఆ పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మ వైభవాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

65వ నామ మంత్రము 

ఓం భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితాయై నమః

భండాసురుని వధించుటకు ఉద్యుక్తులైన శక్తిసేనలను కలిగియున్న పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితాయై నమః యని ఉచ్చరించుచూ ఆ శ్రీమాతను నిరుపమానమైన భక్తిశ్రద్ధలతో ఆ తల్లిని ఉపాసించు సాధకులకు ఐహిక, ఆముష్మికములైన సర్వశివములు అమ్మ కరుణచే లభిస్తాయి.

శ్రీమాత భండాసురుని సంహరింపబూనియున్నది. అందులకై బ్రహ్మాది శక్తులతోడను, ఇతరములైన సేనలతోడను సన్నద్ధురాలై యున్నది.

ఈ భండాసురుడు ఎవరు?

పరమేశ్వరుడు హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉండగా, పర్వత రాజైన హిమవంతుడు తన పుత్రిక అయిన పార్వతిని అతని సేవకై నియోగించాడు. అలా పార్వతి పరమేశ్వరుని సేవిస్తూ ఉండగా దేవతల కోరికపై మన్మథుడు అక్కడికి వచ్చాడు. చెట్టు చాటు నుండి శివునిపై పుష్పబాణం ప్రయోగించాడు. తపస్సమాధిలో ఉన్న శివుడు తన మనస్సులో కలిగిన కలవరపాటునకు చింతించి, అందుకు గల కారణం కోసం నలుదిక్కులా పరిశీలించాడు. మన్మథుడు కన్పించాడు. కోపంతో శివుడు మూడవకన్ను తెరచి, ఆ కంటి మంటలలో మన్మథుణ్ణి భస్మంచేశాడు.

కొంతకాలం తర్వాత గణపతి ఆ బూడిదను రెండు చేతులతో ప్రోగుచేస్తూ ఉండగా, ఆ బూడిద నుండి భయంకరాకారంతో రాక్షసుడొకడు ఉద్భవించాడు. అతడే భండాసురుడు. ఇతడు పెరిగి పెద్దవాడై, ఘోరమైన తపస్సు చేసి పురుషుల వల్ల తనకు మరణం లేకుండా వరం సంపాదించుకున్నాడు. వరగర్వితుడై, భండాసురుడు దేవతలను, మునులను, సాధువులను పీడించడం ప్రారంభించాడు. వైదిక కర్మలకు తీవ్రమైన ఆటంకం కలిగించడం, యజ్ఞకుండములలో రక్తమాంసములను వేయడం, మునిపత్నులను చెరపట్టడం వంటి రాక్షసకృత్యములను తీవ్రతరంగా చేయసాగాడు.

దేవగణములు, ఋషిగణములు భండుని దురాగతాలకు తట్టకోలేకపోయారు. తమ బాధలన్నీ బ్రహ్మదేవునికి నివేదించుకున్నారు. దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించగా, ఆ భండుడు కేవలం మహాశక్తి వల్ల మాత్రమే సంహరింప గలడు తప్ప పురుషులెవ్వరును అతనిని సంహరించలేరని విష్ణుమూర్తి వివరిస్తాడు. అపుడు దేవతలందరూ బ్రహ్మ సహాయంతో విష్ణుమూర్తి అధ్వర్యంలో ఒక మహాయాగం ప్రారంభించారు. ఆ యజ్ఞకుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని, బ్రహ్మ తన కమండలంలోని శక్తిని, శివుడు త్రిశూలంలోని శక్తిని, ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు. దేవతల కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ మరీ ప్రార్థించారు.

బ్రహ్మ , విష్ణువుల ఆధ్వర్యంలో జరిగిన యాగము, ఆ యాగములో దేవతలు చేసిన త్యాగము జగన్మాతను సంతృప్తి పరచగా, ఆ యజ్ఞవేదిక (చిదగ్నికుండం) నుండి  ఆవిర్భవించిది. ఆ పరమేశ్వరి సర్వాంగములు సకల దేవతల అంశలనుండి ప్రకటమయాయి. ఆయుధములన్నియు వివిధదేవతల నుండి పొందినది. దేవకాంతలనుండి సర్వాభరణములు సంప్రాప్తింపజేసుకున్నది. సూర్యచంద్రాగ్నులు త్రినేత్రములయారు. ఆమెనాలుగు చేతులలోపాశం, అంకుశము, చెఱకు విల్లు, పుష్పబాణములు ధరించింది. ఆ జగన్మాతను చూచి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్త్రోత్రాలు చేశారు (దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మ వైభవా- ఆ పరమేశ్వరి దేవర్షిగణసమూహముల స్తోత్రములకు ఆత్మానందవైభవమందినది).  భండాసురుణ్ణి సంహరించ గలనని దేవతలకు అమె అభయ మిచ్చింది. 

నాడు మహాభారతయుద్ధంలో శ్రీకృష్ణభగవానుడు అర్జునునికి ఒక మాట చెప్పాడు.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్| 

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే॥ (భగవద్గీత, 4.8)

సజ్జనుల సంరక్షణార్థమూ, దుష్టజన శిక్షణకూ, ధర్మసంస్థాపన కోసం … ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే వుంటాను. ”

ప్రతీయుగంలోనూ మంచివారిని రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు పరమాత్మ అవతరించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు భండాసురుని వధించుటకు పరమాత్మ స్త్రీరూపంలో అవతరించడం జరిగినది. 

భండాసురుడు, మహిషాసురుడు - ఈ రాక్షసులు ఇరువురును అజ్ఞానులు. పరమాత్మ ఆ పరమేశ్వరి. బ్రహ్మజ్ఞాన స్వరూపిణి. బ్రహ్మజ్ఞానము అజ్ఞానతిమిరాన్ని అంతరింపజేయడమే భండాసుర వధ యనునది.

ఆ పరమేశ్వరికి గల శక్తులు సంపత్కరీదేవి యనే గజదళాధినేత్రి, అశ్వారూఢాదేవి యనే యశ్వదళాధీశురాలు, శ్యామలాదేవి అనే మంత్రిణి, వారాహి యనే సైన్యాధ్యక్షురాలు, జ్వాలామాలిని యను అగ్నిపుత్రిక, నిత్యాదేవతలు, బాలాత్రిపురసుందరి, మహాగణేశ్వరుడు, రాక్షసుల శస్త్రములకు ప్రత్యస్త్రములు, మహాపాశుపతాస్త్రము, కామేశ్వరాస్త్రము వంటి తన రణతంత్రవ్యూహ సాధనములతో  ఆ జగన్మాత భండాసురుని సంహరించుటకు సన్నద్ధముగానున్నది. గనుకనే ఆ పరమేశ్వరి  భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా యని అనబడినది.

ఆ పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

66వ నామ మంత్రము 

ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః

తన అంకుశం నుండి ఉద్భవించి, గజవిద్యలో ప్రవీణురాలైన, గజసేనకు నాయకురాలైన, గజారోహణురాలైనటువంటి సంపత్కరీదేవిచే సేవింపబడు పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రముసు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఉపాసించు సాధకుడు ఆ పరమేశ్వరి కరుణచే అంతయును  తానే అయిపోవును మరియు ఇట్టి స్థితి అనేది కనబడే సద్గురు శిక్షణలో, వారి ఆశీస్సులద్వారా కలుగునట్లు ఆ కనబడని పరమేశ్వరి లభింపజేయును.

సంపత్కరీదేవి చేత చక్కగా అధిరోహింపబడిన ఏనుగుల సముదాయముచే సేవింపబడి విరాజిల్లుచున్న శ్రీమాతకు నమస్కారము.

భండాసురుని సంహారంలో అమ్మవారికి సామర్థ్యముగల సేనకావలసియుండును. అటువంటి శక్తిసేనలో రథ, గజ, తురగాది బలములు అవసరమై ఉండును. అటువంటి శక్తిసేనలో ప్రథమంగా గజబలం సాగుచుండును. ఆ గజసేనకు నాయకురాలు సంపత్కరీదేవి.  శ్రీదేవి ఆయుధమైన అంకుశం నుండి ఉద్భవించిన దేవత సంపత్కరీ. ఈ అమ్మవారి వైభవం ఊహింపశక్యం కాదు. ఆమె రణకోలాహలం అనే ఏనుగుపై అధిష్టించి వస్తుంది. అన్ని రకాల ఏనుగులనూ చాలా తేలికగా మచ్చిక చేసుకొనే అపార శక్తి సామర్థ్యాలు ఆమె సొంతం. త్రిపుర సుందరీదేవి సంపత్కరీ అనే మంత్రదేవతను సర్వగజసేనకు అధికారిణిగా నియమించింది. సుఖ సంపద్వికారమైన చిత్తవృత్తికీ సంపత్కరి అని పేరు. ఈ చిత్తవృత్తిలో శబ్దాదుల సముదాయాన్ని సింధుర వ్రజమని అంటారు. ఇందులోని సుఖప్రవృత్తి, చిత్తవృత్తికి కారణాలైన సుఖవికారాలే గజములు (ఏనుగులు). లౌకికమైన సుఖానుభవాలపై ఇంద్రియ నిగ్రహాల సాధనద్వారా ఉద్ధరింపజేసేదే ఈ జగన్మాత.

జగన్మాతకు నమస్కరించునపుడు 
ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

67వ నామ మంత్రము 

ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతాయై నమః

అశ్వారూఢా దేవి అను దేవతచే అధిష్ఠింపబడిన అనేక గుర్రములచే ఆవరింపబడియున్న జగదీశ్వరికి నమస్కారము.

ఇంద్రియములు అనే  అశ్వములను అదుపులో ఉంచి జ్ఞాన సముపార్జనకు మార్గమును జూపు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతా యను పదహారక్షరముల (షోదశాక్షరీ) నామ మంత్రమును ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతాయై నమః అని ఉచ్చరించుచూ జగన్మాతయైన ఆ లలితాంబను భక్తిప్రపత్తులతో ఉపాసనచేయు భక్తులకు వారి కోరికలు అనే గుర్రములు వారి అదుపులో ఉండి, ఇంద్రియలౌల్యమునకు గురికాకుండా, శాశ్వతజ్ఞాన సముపార్జన, తద్వారా ఆత్మానందమును పొందుదురు.

అశ్వారూఢ అను పదమూడు అక్షరముల ప్రసిద్ధ మంత్రము గలదు. అటువంటి అశ్వారూఢాదేవిని అమ్మవారు తన అశ్వములకు దళాధినేత్రిగా నియమించుకున్నదని బ్రహ్మాండపురాణమునందు చెప్ఫబడినది. అశ్వారూఢ అను ఈ దేవత అమ్మవారి పాశమునుండి ఉద్భవించినది. ఈ అశ్వారూఢ యను దేవత అమ్మవారి అశ్వదళములోని అపరాజిత అను గుర్రమును అధిష్టించియుండును. ఈ అశ్వారూఢ అన్ని జాతుల గుర్రములను అదుపులో ఉంచి రణరంగ మందు తన ఆజ్ఞలకు లోబడి గుర్రములు నడుచునట్లు చేయును. అందుచే జగన్మాత ఈ అశ్వారూఢ ను అశ్వసేనా నాయకురాలిగా చేసెను. అశ్వారూఢ అను ఈ దేవత అపరాజితాశ్వము ను అధిరోహించి, వివిధ జాతుల గుర్రముల సమూహములను తనతో ఉంచుకొని జగన్మాతను (చుట్టూ ఉండి - ఆవరించుతూ) సేవించుచుండును. అనగా అశ్వారూఢ తన సేనతో అమ్మవారికి ముందు ఉండును. శ్రీసూక్తంలో 

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినా''ద-ప్రబోధి'నీమ్

 అను మూడవ శ్లోకము లోని మొదటి పాదము ద్వారా ఈ మాటే తెలియుచున్నది.

కోరికలే గుర్రములయితే అనే నానుడి ప్రకారం మనకోరికలు గుర్రములవంటివి. అమ్మవారి పాశము అశ్వారూఢ అను దేవత వంటిది. ఆ దేవత మన కోరికలను గుర్రములను అదుపులో పెట్టి శాశ్వతమైన బ్రహ్మానందము వైపు మరియు తద్వారా మోక్షసాధనవైపు నడిపించును. గాన ఈ నామ మంత్రము జరిపించుటవలన మనకోరికలు అను గుర్రములు అదుపులో ఉండి, మోక్షసాధన దిశగా నడచుచూ జగన్మాత పాదసేవాభిలాష కల్పించును. కనుక జగన్మాతకు నమస్కరించునపుడు ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

68వ నామ మంత్రము 

ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః

సమస్త ఆయుధములచే అలంకరింపబడిన చక్రరాజమను రథమునధిరోహించిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఆరాధించు ఉపాసకులకు ఆ శ్రీమాత అజ్ఞాన రహితులను జేసి, భౌతిక సంపదలతోబాటు ఆధ్యాత్మిక సంపదలుకూడా ప్రసాదించి ఆత్మానందానుభూతి కలుగజేసి తరింపజేయును.

 శ్రీచక్రానికి మించిన చక్రము ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే అది చక్రరాజము అయినది. సమస్త దోషములను నివారించి సమస్త కోరికలను తీర్చి, సకల సౌభాగ్యాలు ఇచ్చే దివ్యమైన యంత్రము శ్రీచక్రం. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన అందరికీ సులభసాధ్యమైన పని కాదు. 

అటువంటి చక్రరాజమను రథము సమస్తమైన ఆయుధములచే అధిష్ఠింపబడిన లేక  ఉంచబడగా శ్రీమాత ఆ రథమును అధిరోహించి ప్రభాసిల్లుచున్నదని ఈ నామ మంత్రములోని భావము.

ఇంతవరకూ అమ్మవారి గజసైన్యము (సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా), తురగ సైన్యము (అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతా) ల గూర్చి తెలిసియుండగా, ఇప్పుడు చక్రరాజము, గేయచక్రరాజము, కిరిచక్రరాజము అను రథముల గూర్చి తెలియజేయబడుతున్నది. ఈ నామ మంత్రమున చక్రరాజము గూర్చి తెలియుచున్నది. ఈ చక్రరాజము తొమ్మిది పర్వములతోను, పదియోజనముల ఎత్తు, నాలుగు యోజనముల వైశాల్యం గలిగి యుంటుంది. ఈ చక్రరాజ రథమునుఅధిరోహించి భండాసురాది రాక్షసులను సంహరించడానికి యుద్ధ సన్నద్ధురాలవుతుంది గనుక, అందుకు అవసరమైన అన్ని రకముల ఆయుధములు అనగా విల్లంబులు, ఖడ్గము, చక్రము, గద ఇత్యాదులు ఉంచబడగా, శ్రీమాత ఆ శ్రీచక్రరాజమును అధిరోహించి యున్నది. ఇది స్థూలరథ ప్రస్తావన.

శ్రీచక్రం కూడా చక్రరాజమే. అందులో అజ్ఞానమను రాక్షసుని వధించి, జ్ఞానసంపదను ఏర్పరుచుటకు జ్ఞానసాధనకు కావలసిన అన్మి రకాల ఆత్మగుణ సూచితమైన సూక్ష్మాయుధాలు ఉంటాయి. వేదవిధులకు భంగంకలిగించే చర్యలనే అసురులను తెగటార్చడానికి పరివార దేవతలు, అంగదేవతలు సంకేతపూర్వకంగా ఉంటాయి. వీటినే చక్రరాజములోని పర్వములుగా భావించదగును. 

చతుర్భిః శ్రీకంఠైః -  శివయువతిభిః పంచభిరపి|

ప్రభిన్నాభిః శంభో ర్నవభిరపి మూలప్రకృతిభిః |

చతుశ్చత్వారింశ - ద్వసుదల-కలాశ్చ్త్రివలయ

 త్రిరేఖభిః సార్ధం - తవ శరణకోణాః పరిణతాః || 11 ||

శ్రీచక్రం వర్ణన - నవ చక్రాకృతమై, నలుబది నాలుగు అంచులు కలిగి శివశక్త్యుభయరూపముగా వెలయుచున్నది.

శంకరభగవత్పాదులవారు ఇలా అన్నారు:-

అమ్మా...శ్రీచక్రంలో శివకోణములు నాలుగు, ( వీటి కోణములు క్రిందకు ఉండును.) శక్తికోణములు ఐదు, ( వీటి కోణములు పైకి ఉండును.) మూలప్రకృతులు తొమ్మిది ,అష్టదళములు ఎనిమిది , షోడశదళములు పదహారు , త్రివలయములు మూడు, భూపురత్రయములు మూడు. ఈ తీరున శ్రీచక్రంలో మొత్తం నలుబది నాలుగు కోణములు ఉండును. అమ్మా! అటువంటి శ్రీచక్రము నీకు నిలయముగా నీ స్థానమై ఉన్నది. శ్రీచక్రము నందు సృష్టికి  మూల కారణమైన మూల ప్రకృతులను పేరుగల తొమ్మిది త్రికోణములు గలవు. శ్రీచక్రమునందు నలుబదినాలుగు కోణములు, ఇరువది ఎనిమిది మర్మ స్థానములు,  ఇరువది నాలుగు సంధులు గలవు.   తొమ్మిది త్రికోణములు గలవు గనుక నవయోన్యాత్మక మందురు. ఈ నవ యోనులు నవ ధాతువులై సృష్టి మూలకము లగుచున్నవి. త్వక్కు, రుధిరము, మాంసము, మేధస్సు, ఆస్థి అనునవి ఐదు శక్తి మూలకములు,  ధాతువులు.  మజ్ , శుక్రము,ప్రాణము, జీవుడు అను నాలుగు ధాతువులు శివ మూలకములు. మన దేహము నవ ధాతుమయము, నవ యోని సముద్భవము. దశమ యోని బైన్ధవ స్థానము. ఇట్లు పిండాండము, బ్రహ్మాండము వీని వలన జనించినది. పంచ మహా భూతములు, పంచ తన్మాత్రలు,
పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్తత్వము, మాయ, శుద్దవిద్య, మహేశ్వరుడు, సదాశివుడు, అను పంచ వింశతి తత్త్వములు శ్రీచక్రమునందంతర్భూతములై యున్నవి. శివశక్త్యాత్మకమైన శ్రీచక్రము చరాచర జగత్తునకు సృష్టికి మూలమై యున్నది. షట్చక్ర భేదనముచే శ్రీచక్రోపాసన చేసే శ్రీదేవీ భక్తులకు అణిమాది అష్ట సిద్దులు అతి సునాయాసముగా సిద్ధించును. సిద్ధించే ముందు పరీక్షలు చాలా తీవ్రముగా వుండును. మానసిక, శారీరిక పరీక్షలు వుండును. ఎన్నో రకముల భ్రమలు గల్పించబడును. కంటి ముందు మెరుపు తీగలు మెరియును. చెవులు హోరెత్తును. తల పగలి పోవునట్లుగా వుండును. భరించలేని మాడు పోటు, తల గిర్రున తిరుగును. ఒకే సమయములో శీతోష్ణస్థితులు గలుగును. వున్నది లేనట్టుగా లేనిది వున్నట్టుగా అగుపించును. రకరకాల మాయలు గనిపించును. మనస్సు తీవ్ర భయాందోళనలకు లోనగును. శరీరము తీవ్ర కంపనములకు లోను అగును. శరీరము చెమట పట్టును. వెన్నులోని నాడులు తీవ్రముగా స్పందించును. తరువాత శరీరము నెమ్మదిగా తేలిక అగును. నాగ బంధములో కదలిక గల్గును. మూలాధారములో శక్తి చలనము, ఉత్కీలనము, ఆ తరువాత షట్చక్ర భేదనము.

ఆజ్ఞాచక్రములో త్రికోణ దర్శనము, త్రికోణాంతర దీపికా దర్శనము కలుగును.

 ఆ తరువాత ఆనందమే బ్రహ్మానందం. ఇక మిగతా విషయములు చెప్పకూడదు.

 అతి రహస్యములు. స్వయముగా ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవాలి. మొదట సారి మాత్రమే ఈ సాదృశ్యములు అగుపించును. ఆ తరువాత నీ మానసిక, శారీరిక స్థితిగతులను బట్టి, నీకు తెలియకుండానే కుండలినీశక్తి సహస్రారము వరకు గమనము చేయుచూ వుండును. రహస్యమైన విషయమేమంటే సాధకుడు అఖండ బ్రహ్మచర్య నిష్ఠలో, పంచదశీ మంత్ర పునఃశ్చరణ దీక్షలో  వుండవలెను. అప్పుడే ఇది సాధించగలడు. లేనిచో ఇది కుదరదు. గురు ముఖతః దీక్ష తీసుకొన్నవారిలో మాత్రమే ఈ సిద్ధి కలుగును. ఇతరులు ఈ సాధన చేయకూడదు. చాలా తీవ్ర పరిమాణాలు వుంటాయి.

ఎవరికి వారు తమ్ము తాము ఉద్దరించుకోవడానికి మాత్రమే ఈ సాధన చేయవలెను. అన్యధా తగు మూల్యము చెల్లించుకోక తప్పదు. శ్రీవిద్య మోక్ష సాధనకు మాత్రమే అని గుర్తెరున్గవవలెను.

సాధకుడు అమ్మ పెట్టే పరీక్షలకు నిలబడాలి. సాధన తీవ్రముగా వుండాలి. మధ్యలో చలించగూడదు. ఏకోన్ముఖులై వుండాలి. ఎవరికి ఏయే బలహీనతలు గలవో, అవే పరీక్షలకు తావుగా నిలబడును. మెట్టు మెట్టుకూ చిత్ర విచిత్రమైన పరీక్షలు కల్గును.

మూలాధారాది చక్రాలలో సహస్రార చక్రం బ్రహ్మరంధ్ర స్థానంలో మానవ ప్రజ్ఞకు అతీతంగా  ఉంటుంది. అందులో ఉన్న బిందు స్థానంలో పరమేశ్వరి ఉంటుంది. పిండాండములోని సహస్రార చక్రాన్నే  చక్రరాజము అని అంటారు.

సూర్యునిచుట్టూ తిరిగే గ్రహములు, ఉపగ్రహములు వాటి కదలికల వివరాలు కూడా చక్రరాజరథంగా సంకేతిస్తారు. ఈ విధమైన చక్రరాజమునకు ఒకే చక్రము ఉండగా, ఆ చక్రమే సూర్యుడనియు, చక్రరాజమునకు కేంద్రమునకు ఇరుసుగా ఉండునని ఊహించుకోవాలి.

ఈ నామ మంత్రమునకు అర్ధము ఇలా ఊహించవచ్చు.

చక్రరాజ రథమునందు ఉంచబడిన ఆయుధాలచే జగన్మాత అలంకృతఅయినది.

శ్రీచక్రములో ఆత్మజ్ఞాన సంపద అను  ఆయుధములతో జగన్మాత అలంకృత అయినది.

సూర్యుడినే ఇరుసుగా గలిగి, ఖగోళములో అలంకరింపబడిన సూర్యకుటుంబమనే ఏకచక్రమును జగన్మాత అధిరోహింపబడి యున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు 
ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

69వ నామ మంత్రము 

ఓం గేయచక్ర రథారూఢా మంత్రిణీ పరిసేవితాయై నమః

గేయచక్రమను రథమును అధిరోహించి, తనకు గల పదహారు మంత్రిణులలో అతిసన్నిహితురాలైన శ్యామలాదేవిచే సేవింపబడు తల్లికీ నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి గేయచక్ర రథారూఢా మంత్రిణీ పరిసేవితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం గేయచక్ర రథారూఢా మంత్రిణీ పరిసేవితాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని భక్తిశ్రద్ధలతో ఉపాసించు ఉపాసకుడు భౌతికపరమైన జీవితంలో మంచి గౌరవప్రతిష్టలతో రాజభోగములనుభవించుచూ అంత్యమున జగన్మాత కరుణచే మోక్షసామ్రాజ్యమును చేరును.

జగన్మాతకు గల రథములలో గేయచక్రమను రథమునకు అత్యంత ప్రాధాన్యతగలదు. ఎందుకంటే ఆ తల్లికిగల పదహారు మంత్రిణిలులో శ్యామలాదేవి అత్యంత సన్నిహితురాలు. ఈ శ్యామలాదేవిని రాజశ్యామలాదేవి అని కూడా అంటారు. ఈ రథానికి ఏడు పర్వములు గలవు. పర్వము అంటే ఆవరణ.. ఈ ఏడు ఆవరణలలో  వివిధరకాలదేవతలు ఉంటారు.

శ్రీచక్రంలోని త్రికోణమే గేయచక్రరథము. ఈ త్రికోణానికి అధిష్టానదేవత అయిన త్రిపురాంబయే అమ్మవారికి మంత్రిణి అయిన శ్యామలాదేవి.  ఇంకోవిధంగా చెప్పాలంటే గేయచక్రము అంటే సూర్యమండలము. సూర్యలోకంపొందిన యోగినులు దేవిని ధ్యానించి పరలోకం చేరుతారు. ఆవిధంగా జగన్మాత సూర్యలోకం చేరిన యోగినులచే సేవింపబడుతున్నది.

పరమేశ్వరికిగల మంత్రిణులు వీరే

1) సంగీత యోగిని, 2) శ్యామా, 3) శ్యామలా, 4) మంత్రనాయకా, 5) మంత్రిణీ, 6) సచివేశానీ, 7) ప్రధానేశా, 8) కుశప్రియా, 9) వీణావతీ, 10) వైణికీ, 11) మంద్రిణీ, 12) ప్రియకప్రియా, 13) నీపప్రియా, 14) కదంబవేశ్యా, 15) కదంబవనవాసినీ, 16) సదామలా.

జగన్నాతకు నమస్కరించునపుడు ఓం గేయచక్ర రథారూఢా మంత్రిణీ పరిసేవితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

70వ నామ మంత్రము 

ఓం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః

కిరిచక్రము అను రథము నధిరోహించిన దండనాథ (వారాహి) అను దేవిచే సేవింపబడు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకులకు అఖండమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపద నిచ్చి, జీవనయానంలో సుఖసంతోషములు, ఆధ్యాత్మిక జ్ఞానమార్గంలో బ్రహ్మానందమును ఆ తల్లి ప్రసాదించి తరింపజేయును.

కిరి అనగా వరాహము. కిరిచక్రరథమును అధిష్టించిన దేవత వారాహి.  కిరిచక్రరథము వరాహరూపంలో ఉండి వరాహములచే లాగబడుతుంది. ఈ రథమునధిష్టించిన వారాహి చేతిలో దండమును ధరించి ఉంటుంది. అందుకే వారాహిని దండనాథా అని కూడా అంటారు "కిరిచక్రరథారూఢా దండనాథా " అనగా కిరిచక్రరథమునధిరోహించిన దండనాథా (అను దేవత) పురస్కృతా అనగా సేవింపబడు లేదా పూజింపబడు. కిరిచక్రరథమునధిరోహించిన దండనాథ (వారాహి) యను దేవతచే సేవింపబడునది (పూజింపబడు జగన్మాత) యని ఈ నామ మంత్రములోని భావము.

కిరిచక్రరథమునకు ఐదు పర్వములు (ఆవరణలు) గలవు. ఈ ఆవరణలను అంతస్తులు అందురు. కిరిచక్రరథేంద్రస్య పంచపర్వసమాశ్రయాః| దేవతాశ్చ శృణుప్రాజ్ఞ నామాని శృణుత్వాంజయః॥॥

కిరిచక్రరథేంద్రస్య పంచపర్వసమాశ్రితాః|

****

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

71వ నామ మంత్రము 

ఓం జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగాయై నమః

అగ్నిదేవుని పుత్రిక అయిన జ్వాలామాలిని అను శుక్లపక్ష చతుర్దశీ తిథి దేవత చేత వెలిగింపబడిన వహ్ని ప్రాకారము మధ్యలో ప్రకాశించు జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగదీశ్వరిని ఆరాధించు సాధకులకు    ఆ తల్లికరుణచే ముందుగా వారిలోని అరిషడ్వర్గములు (కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యములు) నశించి మృదుమధురమైన భాషణము, పరమాత్మయందు భక్తి పెంపొందును. తద్వారా పలువురిలో మంచితనము, పరమాత్మయొక్క కరుణ సంప్రాప్తమగును.

జ్వాలామాలిని అగ్నిదేవుని కుమార్తె. అందుచే ఈమె అగ్నిస్వరూపురాలు.      ఈమె తిథులకు సంబంధించిన నిత్యా దేవతలలో శుద్ధ చతుర్దశి తిథికి మరియు కృష్ణ విదియ తిథికి చెందిన నిత్యాదేవత. 

నిత్యాదేవతలు అంటే ఎవరు?

నిత్యాదేవతలు పదహారు మంది. చంద్రుని కళలు కూడా పదహారు. పదిహేను తిథులకు పదిహేను నిత్యలు కాగా చంద్రుని పదహారవ కళయే మహానిత్య. ఆ మహానిత్యయే సచ్చిదానంద స్వరూపిణియైన పరమేశ్వరి. శుక్లపక్ష పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ రోజుకొక నిత్య చొప్పున పదిహేను తిథులకు పదిహేను నిత్యలు ఉందురు.  

 శుక్ల పక్షము

  1. పాడ్యమి - కామేశ్వరి
  2. విదియ    - భగమాలిని
  3. తదియ    - నిత్యక్లిన్నా
  4. చవితి      - భేరుండా
  5. పంచమి  - వహ్నివాసినీ
  6. షష్టి        - మహావజ్రేశ్వరీ
  7. సప్తమి   -  శివదూతీ
  8. అష్టమి  -   త్వరతా
  9. నవమి  -   కులసుందరీ
10. దశమి   -   నిత్యా
11. ఏకాదశి -   నీలపతాకా
12. ద్వాదశి -   విజయ
13. త్రయోదశి-సర్వమంగళా
14. చతుర్దశి  - జ్వాలామాలిని
15. పూర్ణిమ  -  చిత్రా

శుక్ల పక్షము నందు పాడ్యమి నాటి చంద్రుని కళ కామేశ్వరి ప్రసాదించు కళ. శుక్ల పక్షము పాడ్యమి నాడు  చంద్రుని కళకు కాంతి ఉండదు.  శుక్ల పక్ష పౌర్ణమి నాటి చంద్రుని కళ చిత్రా అనే నిత్యాదేవత కళ. సంపూర్ణముగా చంద్రబింబము కనిపిస్తుంది. ఆ కళ చంద్రునిది కాదు. ఆనాటి నిత్యాదేవతదే అని గమనించవలెను. అమ్మవారు నిత్యాదేవతా స్వరూపిణి. మరల
కృష్ణ పక్షములోని పాడ్యమి నాటి చంద్రుని కళ పౌర్ణమి నాటి చిత్రా యను నిత్యాదేవత కళయే అవుతుంది (ఎందుకంటే పౌర్ణమినాటి చంద్రుడు, కృష్ణపక్షము లోని పాడ్యమి నాటి చంద్రుడు ఒకే విధంగా ఉంటారు) క్రమంగా కృష్ణ పక్షము నాటి అమావాస్యకు శుక్ల పక్షము లోని పాడ్యమి నాటి నిత్య అయిన కామేశ్వరి ప్రసాదిస్తుంది (శుక్ల పక్ష పాడ్యమి నాడు చంద్రుడు కనబడడు అనగా నెలపొడుపు ఉండదు. అలాగే అమావాస్యనాడు కూడా చంద్రుడు కనబడడు). ఇప్పుడు శుక్లపక్షము లో ఆయాతిథులలో నిత్యాదేవతలు, కృష్ణ పక్షములోని నిత్యాదేవతలు పరిశీలిస్తే ఆ తిథులలోని చంద్రకళలు ఎలా ఏర్పడ్డాయో తెలుస్తుంది. అనగా చంద్రునికి కళ ఆనాటి నిత్యాదేవతకళయే యని గ్రహించగలము.

కృష్ణ పక్షము

  1. పాడ్యమి - చిత్రా
  2. విదియ    - జ్వాలామాలిని
  3. తదియ    - సర్వమంగళా
  4. చవితి      - విజయా 
  5. పంచమి  - నీలపతాకా
  6. షష్టి        - నిత్యా
  7. సప్తమి   -  కులసుందరీ
  8. అష్టమి  -   త్వరితా
  9. నవమి  -   శివదూతీ
10. దశమి   -   మహావజ్రేశ్వరి
11. ఏకాదశి -   వహ్నివాసిని
12. ద్వాదశి -   భేరుండా
13. త్రయోదశి-నిత్యక్లిన్నా
14. చతుర్దశి  - భగమాలిని
15. అమావాస్య  -  కామేశ్వరీ

జ్వాలామాలినీదేవి అగ్నిస్వరూపురాలగుటచే ఈమెను తాకడంగాని, దాటడంగాని సాధ్యంకానిపని. ఒకవేళ తాకినా, లేక దాటినా మాడిపోవలసిందే. ఆ కారణముచే భండాసురునిపై యుద్ధమునకు పోవునపుడు జగన్మాత తన సైన్యానికి చుట్టూ వహ్ని ప్రాకారంగా విస్తరిల్లమని జ్వాలామాలినిని ఆదేశించింది. జ్వాలామాలిని ఆ ప్రకారం వహ్నిప్రాకారం ఏర్పాటు చేసినది. ఈ ప్రాకారం మధ్య జగన్మాత, తన సైన్యంతో వహ్నిప్రకారంలోను, భండుని సైన్యము వహ్ని ప్రాకారమునకు ఆవల ఉండడం జరిగినది. పరమేశ్వరి జ్వాలామాలినిచే వెలిగింపబడిన వహ్నిప్రాకారంలో ఉన్నది కనుక జగన్మాత జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా అను నామంతో జగన్మాతను  వశిన్యాదులు స్తుతించారు.

ఇక శ్రీచక్రం గురుంచి చెప్పుకుంటే, శ్రీచక్రంలో శక్తిసంజ్ఞ గలవి ఐదు చక్రాలు, అగ్ని సంజ్ఞగల చక్రాలు నాలుగు ఉంటాయి. ఈ త్రికోణముల కలయికతో ఏర్పడినదే  వహ్నిప్రాకారమనియు,  మధ్యలో ఉన్న బిందువే పరమేశ్వరి. ఈ విధంగా కూడా జగన్మాత వహ్నిప్రాకారమధ్యగా అని అంటారు. వహ్నిప్రకారమునకు మధ్యనున్నది అంతరావరణము అయితే, మిగిలినది బహిరావరణము అనియు, ఆ బహిరావరణములో అష్టకోణము (సర్వరోగహర చక్రము), దశారయుగ్మము, (యోగినులు:
1) విద్యాయోగినీ, 2) రేచికాయోగినీ, 3) మోచికాయోగినీ,  4) అమృతాయోగినీ, 5) దీపికాయోగినీ, 6) జ్ఞానయోగినీ, 7) ఆప్యాయనీయోగినీ, 8) వ్యాపినీయోగినీ, 9) మేథాయోగినీ, 10) వ్యోమరూపాయోగినీ, 11) సిద్ధరూపాయోగినీ,  12)లక్ష్మీ యోగినీ, మరియు వశిన్యాది శక్తులు ఎనిమిది మొత్తము కలిపి 20 శక్తులు అగును. ఇవి శ్రీచక్రము నందలి దశారయుగ్మమునందు ఉండు 20 (10 x 2 )  కోణములు ఇవే),
మన్వస్రము (సర్వసౌభాగ్యప్రద చక్రము) అష్టదళము (సర్వసంక్షోభిణీ చక్రము), షోడశదళము (సర్వాశాపరిపూర చక్రము) భూపురము (త్రైలోక్యమోహన చక్రము) ఉంటాయి. అంతరావరణములోని సేన భండాసురుని సంహరించుటకు అయితే, బహిరావరణములోని సేన భండుని సేనను సంహరించుటకు జగన్మాత ఏర్పరచుకున్నది.

జ్ఞాని అయిన వాడు అజ్ఞానానికి దూరంగా ఉంటాడు. జ్ఞానమనే వహ్నిప్రాకారం మధ్య ఉంటాడు. ఆ
 జ్వాలలు వెలుగు తున్నంత వరకూ ప్రకాశిస్తూ ఏవిధమైన జ్ఞానేతరములు అంటక తామరాకుపైనున్న స్వచ్ఛమైన నీటిలాగ ఉంటాడు.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

72వ నామ మంత్రము 
ఓం భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితాయై నమః

భండుని, భండుని సైన్యాన్ని .వధించుటకు ఉద్యుక్తులయిన శక్తి సైన్యముల పరాక్రమాన్ని చూసి ఆనందించిన తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ అఖిలాండేశ్వరిని   ఉపాసించు సాధకునకు అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదలు, ఆత్మానందానుభూతిని ప్రసాదించి భౌతికపరంగా కూడా సుఖసంతోషములతో జీవనం కొనసాగించి అంత్యమున పరమపదమును కటాక్షించును.

భండాసురుడు జీవాత్మ, పరమాత్మ రెండుగా భావించే అజ్ఞాని. అంతకన్నా కౄరుడు. అసుర ప్రవృత్తి గలవాడు. అహంభావి. అంటే పాంచభౌతిక శరీరమే నేను అనే మూర్ఖుడు. అరిషడ్వర్గములకు లొంగిపోయిన వాడు. ఈ జగత్తు, ఈ  
శరీరమే నిత్యమని భావించేవాడు. యథా రాజా తథా ప్రజా కదా అంటే తమ ప్రభువైన భండుడే అలాంటివాడయితే అతని సైన్యం మాత్రం అందుకు తీసిపోతారా? వారు అదే ప్రవృత్తి గలవారు. నిజానికి ద్వైదీభావన (జీవుడు, దేవుడు రెండు అను భావన), అరిషడ్వర్గములను, అహంకారము (నేను అంటే ఈ శరీరమే అను తత్త్వము) ఇలాంటి బాహ్యవృత్తులను నశింపజేసి వాటితో పూర్తిగా కలుషతమైన మనస్సును ప్రక్షాళనము చేయాలి. అప్పుడు స్వస్వరూప జ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము పొందిన జ్ఞాని ముక్తుడవుతాడు. అందుకు భండుడనే బాహ్యప్రవృత్తిని నాశనం చేయడానికి పరమేశ్వరి సైన్యమనే అద్వైతశక్తులు ఉద్యుక్తులయాయి. అటువంటి సేనలను చూసి పరాశక్తి మనసు హర్షాతిరేకముతో నిండిపోయింది. అటువంటి తల్లికి వశిన్యాదులు జగన్మాతకు ఇచ్చిన అనంతకోటి నామాలలో  భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితా యను ఒక నామ మంత్రమును చేర్చి, ఒక మహామంత్రముతో సమానముచేసి జగన్మాతను ప్రస్తుతించారు. అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

73వ నామ మంత్రము 

ఓం నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకాయై నమః

కామేశ్వరి మొదలుగా గల పదిహేను మంది నిత్యాదేవతలే తిథి దేవతలు, భండాసుర సంహారమునకు పరాక్రమించిన శక్తి సేనలు. అట్టి నిత్యాదేవతల పరాక్రమాటోపాన్ని వీక్షించుచూ సంతస మందిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా అను పదహారు అక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకునకు ఆ తల్లి మూలాధారము నందున్న కుండలినీ శక్తిని జాగృతము చేసి, షట్చక్రములకావల సహస్రారమును చేర్చి అచ్చట అమృతధారలందు ఓలలాడించి అసలు సిసలైన నిత్యమైన, సత్యమైన ఆనందాన్ని ప్రసాదించును.

నిత్యాదేవతలు పదిహేనుమంది, పదహారవ నిత్య మహానిత్య, పూర్ణామృత సాక్షాత్తు పరమేశ్వరియే శ్రీచక్రమందలి బిందుస్థానంలో వసించుచున్నది. 
భండాసురుడు, అతని సైన్యము అజ్ఞానమనే చీకటి (ధ్వాంతము) వంటివారు. వారు రాత్రిపూటనే చీకటివలె విజృంభిస్తారు.  శ్రీమాత సైన్యంలో అగ్నిస్వరూపులయిన జ్వాలామాలిని, వహ్నివాసిని అనే నిత్యలు ప్రకాశిస్తుండగా భండుని  సైన్యాధిపతులు గుర్తింపబడి సూర్యోదయమయేసరికి చీకటి కరిగినట్లు సంహరింపబడతారు. అందుకే జగన్మాతను అజ్ఞానాధ్వాంత దీపికా  (993వ నామ మంత్రము) అని వశిన్యాదులు స్తుతించారు. ఈ షోడస నిత్యలు శ్రీచక్రములో సర్వానందమయమను బిందుచక్రము చుట్టూ ఆవరించి ఉంటారు.

చంద్రకళలను సూచించే తిథులకు - అమ్మవారి కళలకు సమన్వయం ఉన్నది. శుక్లపక్షమి చంద్రుడు, పాడ్యమి నుండి క్రమంగా ఒక్కొక్క కళ పెరుగుతూ పూర్ణిమ వరకు నిండు చంద్రుడౌతాడు. చంద్రునియొక్క పదహారు కళలు శ్రీవిద్యలో నిత్య లని అంటారు. రెండు పక్షాలలోని తిథులకు నిత్యలను సమన్వయం చేయడమైనది

శుక్ల పక్షము

  1. పాడ్యమి - కామేశ్వరి
  2. విదియ    - భగమాలిని
  3. తదియ    - నిత్యక్లిన్నా
  4. చవితి      - భేరుండా
  5. పంచమి  - వహ్నివాసినీ
  6. షష్టి        - మహావజ్రేశ్వరీ
  7. సప్తమి   -  శివదూతీ
  8. అష్టమి  -   త్వరతా
  9. నవమి  -   కులసుందరీ
10. దశమి   -   నిత్యా
11. ఏకాదశి -   నీలపతాకా
12. ద్వాదశి -   విజయ
13. త్రయోదశి-సర్వమంగళా
14. చతుర్దశి  - జ్వాలామాలిని
15. పూర్ణిమ  -  చిత్రా

కృష్ణ పక్షము

  1. పాడ్యమి - చిత్రా
  2. విదియ    - జ్వాలామాలిని
  3. తదియ    - సర్వమంగళా
  4. చవితి      - విజయా 
  5. పంచమి  - నీలపతాకా
  6. షష్టి        - నిత్యా
  7. సప్తమి   -  కులసుందరీ
  8. అష్టమి  -   త్వరితా
  9. నవమి  -   శివదూతీ
10. దశమి   -   మహావజ్రేశ్వరి
11. ఏకాదశి -   వహ్నివాసిని
12. ద్వాదశి -   భేరుండా
13. త్రయోదశి-నిత్యక్లిన్నా
14. చతుర్దశి  - భగమాలిని
15. అమావాస్య  -  కామేశ్వరీ

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే శుక్లపక్షము నందలి  నిత్యాదేవతలు పాడ్యమి నుండి పౌర్ణమి వరకు అనులోమక్రమం అనగా పాడ్యమి నాడు కామేశ్వరి నుండి పౌర్ణమి నాడు చిత్రాగా గమనిస్తే, కృష్ణపక్షంలో విలోమము అనగా పౌర్ణమి నాటి నిత్యాదేవత చిత్ర కాగా కృష్ణపక్ష పాడ్యమికి కూడా నిత్యాదేవత చిత్రాతో ప్రారంభమై విలోమక్రమంలో అమావాస్యనాటికి  నిత్యాదేవత కామేశ్వరి అవుతుంది. ఇది చంద్రకళల క్రమంలో ఏర్పడింది. కాని శుక్లపక్షమునందు, కృష్ణ పక్షము  నందు అష్టమి నాటి నిత్యాదేవత  త్వరితా అగును. అంటే అష్టమీచంద్రవిభ్రాజదళకస్థల శోభితా అను నామ మంత్రములో వశిన్యాది దేవతలు చెప్పిన అష్టమి చంద్రుడు శుక్లపక్షమైనా, కృష్ణపక్షమైనా ఒకే విధముగా ఉంటాడు అంటే అంతటి అష్టమి చంద్ర శోభతో జగన్మాత ఫాలభాగము శోభాయమానమై ఉన్నదని వశిన్యాది దేవతలు చెప్పారంటే అమ్మను వారు తిలకించియున్నారు గదా!

ఈ పదిహేను నిత్యలలో - శుక్లపక్షములో ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుంది. కృష్ణపక్షములో ఒక్కొక్క కళ తగ్గుతూ ఉన్న మూలభూతమైన కళను మహానిత్యయని అందురు. దీనినే లలితకళ, ఆద్యకళ, చిత్కళ, సంవిత్కళ అని అంటారు. ఈ మహానిత్య లలితాంగిగా ఉన్నందున మిగతా కళలు నిత్యల యందు అంగభాగములుగా ఉండును.
 
భండాసురుని సేనాపతులు

1) దమనక, 2) దీర్ఘజిహ్వ, 3) హబక, 4) హలుమల్ల, 5) కక్లస, 6) కల్లివాహన, 7) ధుక్లస,  పుత్రకేతు, 9) చంద్రబాహు, 10) కుక్కుర, 11) జంబుకాక్ష, 12) కుంభగ, 13) తీక్షశృంగ, 14) త్రికంటక, 15) చంద్రగుప్త
 
భండాసురునికి పదిహేనుమంది సేనాధిపతులను శ్రీమాతకు గల పదిహేనుమంది నిత్యాదేవతలు సంహరించునపుడు చూపించిన పరాక్రమాటోపానికి మహదానందమైనది పదహారవనిత్య, మహాత్రిపురసుందరియైన జగన్మాత.
 
భండుని, భండుని సైన్యమును సంహరించుటలో నిత్యాదేవతల పరాక్రమాటోపాన్ని వీక్షించిన జగన్మాత పరమానంద భరితయైనది గాన ఆ తల్లికి నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా యను వశిన్యాదులు నామముతో ఆ పరాశక్తిని స్తుతించారు.

జగన్మాతకు నమస్కరించునపుడు
ఓం నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకాయై నమః
అని  అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

74వ నామ మంత్రము  

ఓం భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందితాయై నమః

భండాసురుని ముప్పైమంది కుమారులను సంహరించడానికి ఉద్యుక్తురాలైన తన కుమార్థె అయిన బాలాత్రిపురసుందరి విక్రమమును చూసి ఆనందించిన జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందితా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందితాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ జగన్మాతను, ఆమె అంశలో జనియించిన బాలాత్రిపురసుందరిని మనోనేత్రములందు దర్శించుచూ ఉపాసించిన సాధకులకు వారిలో భ్రమలను కలిగించి, వంచనకు గురిచేసే అసురీశక్తులు నిర్మూలింపబడి కాపాడబడడమేకాక ఆ బాలాత్రిపుర సుందరి కరుణతో సరస్వతీ కటాక్షముతో విద్వత్తు, లక్ష్మీ కటాక్షంతో సిరిసంపదలు, శక్తీ కటాక్షంతో లోకాలను ఆకట్టుకునే వాక్పటిమ సంప్రాప్తించి సుఖసంతోషాలతో జీవనం సాగించి అంత్యమున పరమపదమును పొందుదురు.

భండాసురునిపై యుద్ధమునకుద్యుక్తురాలైన జగదాంబ భండాసురుని తన శక్తిసేనలతో మట్టుపెడుతూ మంత్రిణి రాజశ్యామల, దండనాయకి అయిన వారాహి తనవెంట కదలివెళుతుండగా, అశ్వసేనకధినాయకురాలు అశ్వారూఢ, గజసేనకు నాయకురాలైన సంపత్కరీ వెనుకముందులుండగా, జ్వాలామాలిని, వహ్నివాసినులైన అగ్నిస్వరూపిణిలు వహ్నిప్రాకారములునేర్పరుచగా శక్తిస్వరూపిణి అయిన జగన్మాతపై భండాసురుని పుత్రులు ముప్పది మంది వీరావేశంతో విరుచుకుపడుతుంటే తనఅంశనుండి ఉద్భవించిన తొమ్మిది సంవత్సరముల బాలాత్రిపురసుందరిని భండునిపుత్రులతో పోరుసల్పమని ఆజ్ఞాపించింది. ఆ బాలా (కుమారి) త్రిపురసుందరి, మహాత్రిపురసుందరి  ఇచ్చిన రథమునధిరోహించి, సర్వాయుధపరిష్కృతయై, మహాత్రిపుర సుందరితో సమానమైన శక్తియుక్తులు కలిగినదగుటచేత చండప్రచండముగా భండుని సైన్యమును త్రొక్కుకుంటూ దాటి భండుని ముప్పైమంది పుత్రులను తునుముతుంటే మహాత్రిపురసుందరి ఆనందానికి ఆకాశంకూడా హద్దులు లేకుండాపోయిందని ఈ నామమంత్రములోని భావము.

భండుని పుత్రులు

1) చతుర్భాహువు, 2) చకోరాక్షుడు, 3) చతుశిరస్కుడు, 4)  వజ్రఘోషుడు, 5) ఊర్థ్వకేసుడు, 6) మహాకాయుడు, 7) మహాహనువు, 8) ముఖశత్రువు, 9) మఖస్కందుడు, 10) సింహఘోషుడు, 11) విరాలకుడు, 12) లశునుడు, 13) కుట్టిశేనుడు, 14) పురజిత్తు, 15) పూర్యరనూకుడు, 16) సర్గశత్రువు, 17) ఇంద్రశత్రువు, 18) అమీత్రకుడు, 19) విద్యున్మాలి, 20)  ఉగ్రకర్మ, 21) ఉగ్రధన్వా, 22) స్వర్గపీడుడు, 23) దుర్గుడు, 24) స్వర్గకంటకుడు, 25) అతిమాయుడు, 26) బృహన్నాయుడు, 27) విభీషణుడు, 28) శ్రుతిపారగుడు, 29) విదురుడు, 30) ఉపమాయువు.

బాలాత్రిపుర సుందరిని బాల అనియు, అలాగే బాలాత్రిపుర సుందరీ మంత్రము బాలామంత్రమనియు మిగుల ప్రసిద్ధి. ఈ బాలామంత్రం ఈ విధంగా ఉంటుంది ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం" అంటూ *శ్రీబాలాయై నమః లేదా శ్రీబాలాత్రిపురసుందర్యై నమః అని జపంచేయాలి. కాని ఈ మంత్రం గురువునుండి ఉపదేశింపబడాలి. ఈ మంత్రంలో ఐం అనేది వాగ్భవబీజం అనగా సరస్వతీ కటాక్షం కలిగిస్తుంది. క్లీం అనేది కామకళాబీజం, ఆకర్షణకు, చతుష్షష్టి కళలకు, లక్ష్యసిద్ధికి చెందుతుంది. సౌః అనేది మంగళ ప్రదమైన మోక్షానికి సంబంధించినది. అందుకే ఈ మంత్రం సర్వాభీష్ట ప్రదానమైన మంత్రంగా పండితులు చెబుతారు. ఒక ఉదాహరణ ప్రముఖ శ్రీవిద్యోపాసకులు కీర్తిశేషులు, (చందోలు - గుంటూరుజిల్లా)  తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు బాలాత్రిపురసుందరీ ఉపాసకులు తొలిరోజుల్లో కడుపేదరికం అనుభవించారు. అమ్మవారికి ఉద్ధరిణి ఉదకం మాత్రం బాలాత్రిపురసుందరీ అమ్మవారి మంత్రజపం తరువాత నివేదించేవారు. ఆ తల్లికి అవన్నీ తెలుసు. లక్ష్మీకటాక్షం కలిగించింది. పదిమందికి పిలిచి అన్నం పెట్టేలాగ, ఎందరికో వేదవిద్యనభ్యసింప జేశేవిధంగా వారిని కరుణించింది. ఆతల్లికి వారింట్లోనే ఒక మందిరం ఏర్పాటు చేస్తే వారితోటే ఆ బాల ఉండేది. అమ్మా! అని పిలిస్తే పిలిచావా బాబూ అని ఆయనకు కనిపించేది. నిన్నుకాదమ్మా అనేవారు. అయితే నన్ను పిలువవా అనేది ఆ తల్లి. వారింట్లో పసిపిల్లగా తిరిగిన అనుభవం వారికుంది. వారి ఇంట్లో అందరిలో కలసిపోయి ఒకరోజున చేతికి గాజులు వేయించుకొని తాను వారితోటే ఉన్నానని దృష్టాంతం ఇచ్చిందంటే  రాఘవనారాయణ శాస్త్రి గారిని ఒక మహర్షిగా మలచిందంటే బాలాత్రిపురసుందరీ మంత్రోపాసన ప్రభావం ఎలాంటిదో మనం గ్రహించాలి. ఎలా చివరకు వారి చితిమంటల్లో ఎగిసిపడిన జ్వాలల్లో జ్వాలగా ఆ బాల  చూపరులకు సైతం కనబడింది. ఎన్నో కెమెరాలలో ఛాయాచిత్రంగా చోటుచేసుకున్నది. అంత ప్రభావం ఉంది బాలాత్రిపురసుందరీ మంత్రోపాసన ప్రభావం. 

అంతటి మహాతల్లికి నమస్కరించునపుడు ఓం భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

75వ నామ మంత్రము 

ఓం మంత్రిణ్యంబా  విరచిత విషంగ వధ తోషితాయై నమః

విషంగుడు, విశుక్రుడు అను భండాసురుని సోదరులలో విషంగుని తన మంత్రిణి అయిన శ్యామలాదేవి (రాజశ్యామలా) సంహరించుటతో సంతోషించిన దేవి లలితాంబకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితాయై నమః అని ఉచ్చరిస్తూ ఆ లలితాంబను ఉపాసించిన సాధకుడు ఆ తల్లికరుణచే విషయలోలత్వానికి, ఐహికసుఖములకు, ప్రాపంచిక విషయములయందు ఆసక్తికి, అజ్ఞానమునకు దూరముగలవాడై, బ్రహ్మజ్ఞానసంపన్నుడై తరించును.

మహిషాసురుడు, నరకాసురుడు, భండాసురుడు, రావణుడు, హిరణ్యకశిపుడు మొదలైన వారు విషయాసక్తులు ఐహికభోగ లాలసులు, అజ్ఞానులు అరిషడ్వర్గములకు ప్రతిరూపులు. ఇలాంటి ప్రవృత్తులచేత అసురలయారు. లేకుంటే తపోబల సంపన్నులు, మహాబలవంతులు. బలానికీ, తపోబలానికీ కూడా దేవతలతో సమానులు. భండాసురుడు అతని పుత్రులు విషంగుడు, విశుక్రుడు కూడా అంతటివారే. రాక్షస ప్రవృత్తి గలవారు నేడుకూడా ఉన్నారు.  మహామాయావులుకూడా. భండాసురుడైన  విషంగుని రూపంలో ఉన్న అజ్ఞానాన్ని, విషయాసక్తిని, అరిషడ్వర్గం పైకి తన  మంత్రిణీ అయిన శ్యామలను జగన్మాత పంపినది. ఆ శ్యామలాదేవీ విషంగుని వధించినది. ఆ వార్త వినిన తోడనే శ్రీమాత సంతోషించింది. 

విషంగుడు అంటే మనలో విషయలంపటాన్ని రెచ్చగొట్టేవాడు. ఈ విషయ లంపటం అనేది అరిషడ్వర్గము(కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యము) లకు సంబంధించినదే. అటువంటి విషయలంపటాన్ని నాశనంచేయగల సమర్థత శ్యామలాదేవికి గలదు గనుకనే శ్రీమాత విషంగ సంహారానికీ శ్యామలాదేవిని పంపింది. శ్యామలాదేవిని రాజశ్యామలా అంటారు. ఈ శ్యామలామంత్రోపాసన వలన అరిషడ్వర్గములు నశిస్తాయి. అజ్ఞానం పటాపంచలవుతుంది. విషంగుని వధించినది మంత్రిణి శ్యామలాదేవి. విషంగ సంహారంతో జగన్మాతలో సంతోషం కలిగింది.
అందుకే జగన్మాతను మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా యను నామ మంత్రంతో వశిన్యాదులు జగన్మాతను ప్రస్తుతించారు. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మంత్రిణ్యంబా విరచిత  విషంగ వధ తోషితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

76వ నామ మంత్రము 

ఓం విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితాయై నమః

భండాసురుని సోదరులు, అతని బాహువుల నుండి ఉద్భవించినవారు, అతనికిరువైపులా రక్షకులైనవారు, అతని సేనానాయకులుగానున్న వారు అయిన విషంగుడు, విశుక్రుడు అను వారిలో విశుక్రుని పరిమార్చిన జగన్మాత సేనాని వారాహీదేవి పరాక్రమమును గాంచి ఆనందమందిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితాయై నమః అని ఉచ్చరించుచూ ఆ వారాహీ స్వరూపిణి అయిన శ్రీమాతను ఉపాసించు సాధకునిలోని అసురీ లక్షణాలను (ఉంటే) నిర్మూలించి, పవిత్రభావాలను కలుగజేసి, ఆధ్యాత్మిక చింతనతో, ఆత్మానందముతో భగవదారాధనలో నిమగ్నముచేసి తరింపజేయును.

భండాసురుని సంహారానికి శక్తిసేన సమన్వితయై, సంపత్కరీ దేవి గజసేనలతో, అశ్వారూఢ అశ్వసేనలతో, సర్వాయుధ పరిష్కృతమైన చక్రరాజము అను రథమునధిరోహించి, గేయచక్రమునధిరోహించిన శ్యామలాదేవి (రాజశ్యామల), కిరిచక్రరథారూఢ అయిన దండనాథ  అయిన వారాహి  తనను సేవించుచుండగా, అగ్నిపుత్రికలు, అగ్నిస్వరూపులు అయిన జ్వాలామాలిని, వహ్నివాసినులు ఏర్పరచిన జ్వాలాప్రాకారం మధ్యలో నుండగా, తన శక్తిసేనలు భండుని సైన్యాన్ని తునుమాడుతుంటే వారి శక్తివిక్రమమునకు హర్షాతిరేకితయై, భండుని పుత్రులను సంహరించు తన అంశయందు పుట్టిన బాలాత్రిపురసుందరి పరాక్రమమునకానందించినదై, తన మంత్రిణి శ్యామలాదేవి భండసోదరులు విషంగుడు, విశుక్రుడు అను వారిలో విషంగుని సంహరించుటతో  అంతులోని ఆనందమందిన ఆ పరాశక్తి ఈ నామ మంత్రములో భండాసురులలో రెండవవాడైన విశుక్రుని వారాహీదేవి సంహరించుటతో ఆ పరాశక్తి ఆనందానికి ఆకాశంకూడా హద్దు కాలేకపోయింది.

అమ్మవారు భండాసుర యుద్ధానికి సన్నద్ధమయింది. పదిహేను మంది భండుని సేనానాయకులు, ముప్పది మంది పుత్రులు, విషంగుడు, విశుక్రుడు అను సోదరులతో తలపడగా, శక్తిసేనలు, నిత్యాదేవతలు, సంపత్కరి, అశ్వారూఢ, బాలాత్రిపురసుందరి, శ్యామల, వారాహి మొదలైనవారు భండుని మొత్తం పరివారాన్ని మట్టుబెట్టాయి. 

భండాసురుని సోదరులు విషంగుడు, విశుక్రుడు అనువారు భండుని బాహువులనుండి ఉద్భవించారు. వారిరువురు అతనికి బాహువులవంటివారు. భండుని రక్షణకు రెండు బాహువులయారు. ఇంతకు ముందు బాహువులలో ఒక బాహువు వంటి వాడు విషంగుని శ్యామలా దేవి సంహరించగా, విశుక్రుని వారాహీదేవి అంతమొందించినది.
మనలోని శుక్రధాతువు కామోద్రేకాన్ని ప్రేరేపిస్తుంది. విశుక్రుడు శుక్రధాతువు వంటివాడు.    ఆ విశుక్రుని వారాహీదేవి అంతమొంచిందంటే వారాహి మనలోని శుక్రధాతువును అదుపులోఉంచి తన్మూలంగా అరిషడ్వర్గాలలో ఒకటైన కామాన్ని నశింపజేస్తుంది. కామమనేది నశిస్తే జీవుడు నడక దైవం వైపు సాగుతుంది కదా! సాధకుడు కామమయమైన శరీరం ఉన్నవాడైతే   కామాన్ని దాటి సాధన చేయలేడు. అందుకే యోగి కావాలంటే భోగలాలస వదలాలి. ముఖ్యంగా బ్రహ్మచారులు కామాన్ని విడిచి సాధనాపరంగా ముందుకు పోవాలంటే వారాహీ ఉపాసన చేయాలి. 

సప్తమాత్రుకలైన బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రిలలో వారాహి ఒక దేవత. 

శ్రీదేవీ ఖడ్గమాలాస్తోత్రంలో ప్రథమావరణంలో ప్రస్తుతింపబడ్డారు.

విశుక్రుడు అహంకారపూరితుడు. ఐహికబంధాలలో చిక్కిపోయినవాడు. సంసారలంపటుడు. అందుకే వారాహీ దేవి అతనిని నిర్మూలించింది. 

సంసారబంధములలోని చిక్కులు వీడాలన్నా, దుర్వ్యసనాలకు లోనుకాకుండా ఉండాలన్నా వారాహీ ఉపాసన చేయవలెను. వారాహీ అనే అమ్మవారి అంశ దేవతే కారణభూతురాలౌతుందని చెప్పడంలో ఔచిత్యం గలదు. ఎక్కడైనా, ఎప్పుడైనా అహాన్ని  శ్రేష్ఠవంతం చేయగలిగేది వరాహమే అని సౌందర్యలహరిలోని మూడవ శ్లోకంలో ఆది శంకరులు  ఇలా చెప్పారు.

అవిద్యానా-మంత-స్తిమిర-మిహిర ద్వీపనగ జడానాం చైతన్య-స్తబక మకరంద శ్రుతిఝరీ

దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి॥3॥


జననీ! నీ పాద కమల రేణువు,లోపల ఉన్న అజ్ఞానం అనే చీకటికి సూర్య కిరణం లాంటిది .జ్ఞానం కలిగిస్తుంది .మంద బుద్ధులకు చైతన్యం అనే కల్ప వృక్ష పుష్పం యొక్క మకరందం. దీనులకు అన్ని కోర్కె లను తీర్చే చింతామణి .జనన ,మరణ ,సంసార సముద్రం లో మునిగి ఉన్న వారికి యజ్న వరాహ మైన విష్ణువు యొక్క దంష్ట్రం (కోర ).లలితా పరా భట్టారికను స్తుతిస్తే అవిద్య, జడత్వం , దరిద్రం, జనన , భయాలు ఉండవు అని స్పష్ట పరుస్తున్నారు శంకర భగవత్పాదులవారు.

ఆ జగన్మాతకు నమస్కరించునపుడు  ఓం విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

77వ నామ మంత్రము  
ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరాయై నమః

భండాసుర సంగ్రామంలో విశుక్రునిచే ప్రతిష్టింపబడిన జయవిఘ్నము అను యంత్రమును భేదించుటకు కింకర్తవ్యమనునట్లు కామేశుని ముఖమునాలోకించగా, అంత మాత్రముననే మహాగణేశుని ఆవిర్భవింపజేసిన శైలసుత అయిన అఖిలాండేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ తల్లి కరుణచే ఆ గణేశ్వరుని చల్లనిచూపు ఆ భక్తులపై ప్రసరించి భండాసురుని జయవిఘ్నము అను శిలాయంత్రం తునాతునకలైనట్లు, ఆ భక్తులు సంకల్పించిన సత్కార్యములందు విఘ్నములు నాశనమయి అంతా మంగళ ప్రదమగుము.

శక్తి సైన్యములకు, భండాసుర సైన్యానికీ భీకరసంగ్రామం జరుగుతోంది. ఆ సమయంలో భండుని సోదరుడు విశుక్రుడు జయవిఘ్నము అను శిలాయంత్రాన్ని శక్తి సైన్యముల మధ్య ప్రతిష్ఠించాడు. ఈ సంగతి వారాహి, శ్యామలా శ్రీమాతకు తెలియజేశారు. ఆ యంత్రానికి అష్టదిక్కులూ, ప్రతీ దిక్కుకూ కోణములు, ప్రతీకోణంలోను విశుక్రుడు పాతిన శూలములు ఉన్నాయి. ఆ ఎనిమిది దిక్కులయందు ప్రతీశూలానికి ఒక్కొక్క శక్తిని ఆవాహనచేశాడు.

ఆ శక్తులు 1) ఆలసా, 2) కృపణా, 3) దీనా, 4) నిద్రా, 5) తంద్రా, 6) ప్రమీలికా, 7) క్లీబా, 8) నిరహంకారా.

ఆ యంత్రమువలన, అష్టదిక్కులలో  ప్రతిష్ఠింపబడిన శూలములు, వాటికి ఆహ్వానింపబడిన శక్తులతో జగన్మాత శక్తిసైనాన్యానికి కళ్ళు బైర్లుకమ్మాయి, నిద్రలాంటి మగత ఆవహించింది, పిరికితనం ఆవహించింది, శక్తిసేన అంతా చైతన్యరహితమయింది. వారికి యుద్ధము చేయుటయందు అనాసక్తి ఉత్పన్నమయింది. ఆ జయవిఘ్నయంత్రాన్ని నిర్వీర్యం చేయాలంటే విఘ్ననాశకుడు కావాలి. అంతే జగన్మాత కింకర్తవ్యమన్నట్లుగా చిన్న చిరునవ్వుతో పరమేశ్వరుని ముఖంలోకి చూసింది. తక్షణం పొట్టివాడు, పొట్టవాడు, గట్టివాడు, గజాననుడు, పెద్ద పెద్దచెవులు గలవాడు చిన్నచిన్న కన్నులు గలవాడు, వక్రతుండము గలవాడు, రక్తవర్ణము గలవాడు, పదిచేతులు గలవాడు అయిన గణేశుడు ఆవిర్భవించాడు. ఆ గణేశుని తల్లి అయిన జగన్మాత చేతిలో చిన్ని బిడ్డగా గోచరించినా బ్రహ్మాండమంతటివాడు, బ్రహ్మాండాలనే అబ్బురపరచేవాడు ఆగణేశుడు. ఆ గణపతి ఎవరు. షట్చక్రములలో మూలాధారమందుండే మూలకారకుడు, కుండలినీ శక్తిని ఊర్ధ్వముఖంగా పయనింపజేసేవాడు. అతడు. పృథివీతత్వాత్మకుడు. సర్వమంత్రాలలోను గురువందనం తర్వాత ఆహ్వానితుడు, సర్వపూజలకు, సర్వ కార్యములకు తొలిపూజలు అందుకునేవాడు, దైవ పంచాయతనములలో ఒకడైనవాడు. ఈ మహాగణపతి మంత్రోపాసన కూడా ఉన్నది. 

అంత ప్రాభావితమైన మహాగణేశ్వరుని జగన్మాత ఆవిర్భవింపజేసి, విశుక్రునిచే ప్రతిష్ఠింపబడిన జయవిఘ్నయంత్రము, అష్టదిక్కులందుగల శూలములు, ఆ శూలములపై ఆహ్వానింపబడిన క్షుద్రదేవతలను గణేశుడు తుదముట్టించాడు.

జగన్మాతకు నమస్కరించునపుడు 
ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

78వ నామ మంత్రము 

ఓం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః

విశుక్రునిచే ప్రతిష్ఠింపబడిన జయవిఘ్న యంత్రమును, ఆ యంత్రమునకు గల ఎనిమిది కోణములలోని శూలములు, ఆ శూలములపై విశుక్రుడు ఆవాహన చేసిన క్షుత్రదేవతలను మహాగణేశుడు తను సృష్టించిన తనవంటి ఆరుగురు గణపతుల సహాయముతో ఛిన్నాభిన్నముచేసిన గణేశుని గాంచి మహదానంద మందిన తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి 
మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా యను పదహారక్షరముల నామమంత్రమును ఓం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః అని
ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకునకు ఆ తల్లి కరుణచే సర్వవిఘ్ననివారణ, దుష్టగ్రహపీడ తొలగుట జరిగి సాధకుడు తలచిన కార్యములయందు జయము కలుగును.

విశుక్రుడు శక్తిసేనల నడుమ జయవిఘ్నయంత్రము ప్రతిష్ఠించి, ఆ యంత్రమునకు గల ఎనిమిది కోణములలో ఎనిమిది శూలములు, ఆ శూలముల వద్ద ఎనిమిది క్షుద్రశక్తులను ప్రతిష్ఠించి, శక్తిసేనలలోని చైతన్యమును నిర్వీర్యముచేసి మూర్ఛిల్లజేయగా, జగన్మాత కామేశముఖాలోకనంబుతో మహాగణేశుని కల్పితముజేయగా, ఆ గణేశుడు మహాగణేశుడై తనవంటి మరియొక ఆరుగురు గణేశులను సృష్టింపజేసి విశుక్రుని జయవిఘ్నయంత్రమును ఛిన్నాభిన్నము చేశాడు. ఆ క్షుద్రశక్తులను నాశనంజేశాడు.

మహాగణేశుడు ఆవిర్భవింపజేసిన ఆ ఆరుగురు గణపతులు వీరే: 1) ఆమోద, 2) ప్రమోద, 3) సుముఖ, 4) దుర్ముఖి, 5) అవిఘ్న, 6) విఘ్నకర్త

మానవులు శుభకార్యములు ప్రారంభించినపుడు, వ్రతములు, పుజలు చేయునపుడు తప్పనిసరిగా అసురభావములు గల మానవులు గాని, అసురశక్తులు అదృశ్యరూపంలో రావడం విఘ్నములు ఏర్పరచడంగాని, మనకు తెలియకుండా ఆ కార్యక్రమ ఫలితం మనకు రాకుండా ఆటంకపరచడంగాని చేయడం సాధారణం. ఆ పూజల వలన  తమకు బలంతగ్గుతుందని ఆటంకపరుచుతాయి ఆ అసురగణాలు.  అందుకని గణపతిని ఆహ్వానించి ఆ విఘ్ననాయకునికి పూజసలపడం తప్పనిసరి. పూజసలపడానికి ప్రారంభంలో గణపతి స్తుతిచేస్తూ ఘంటానాదం కూడా చేస్తాము ఆ అసురగణాలు ఫలాయనంచిత్తగించడానికి. 

వినాయకచవితినాడు విఘ్నేశ్వరుని పూజకు ముందు పసుపు వినాయకుని చేసి, తొలిపూజ చేసి, అవసర నివేదన బెల్లముక్క పెట్టి తరువాత వినాయక వ్రతం చేస్తాము.

పసుపు గణపతిని హరిద్రా గణపతి అంటాము

వ్రతాలు, పూజల్లో పసుపు ముద్దతో వినాయకుడిని రూపొందించి పూజించడం ఆనవాయితీ. పసుపుముద్దతో కాకుండా పసుపు కొమ్ముపైనే వినాయకుని ఆకారాన్ని పూజమందిరంలో ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవచ్చు. పసుపుకొమ్ముపై రూపొందించిన గణపతినే హరిద్రా గణపతి అంటారు

అటువంటి గణేశుని సృష్టించి విశుక్రుని ఆటలు కట్టింపజేసిన జగన్మాత మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా యను నామప్రసిద్ధ అయినది. 

పరమేశ్వరికి నమస్కరించునపుడు 
ఓం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

79వ నామ మంత్రము 

ఓం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః

భండాసురుడు ప్రయత్నపూర్వకంగా సాధించుకున్న అవిద్యా ఫూర్వకమైన అస్త్రములు ప్రయోగించగా, మంత్రపూర్వకమైన ప్రత్యస్త్రవర్షము కురిపించి భండాసురుని ఉక్కిరిబిక్కిరిచేసి ఓటమిదిశగా కొనిపోయిన పరాత్పరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ పరాశక్తి  సర్వాభీష్టసిద్ధి కలిగించును. సుఖసంతోషములు, ఆత్మానందానుభూతిని ప్రాప్తింపజేయును.

విశుక్రుడు ప్రయోగించిన జయవిఘ్నయంత్రమును గణేశుడు నాశనముచేయగా, శక్తిసైన్యములు భండుని సైన్యంలో విధ్వంసాన్ని సృష్టించి పలాయనం చిత్తగింపజేశాయి. చేయునది లేక భండాసురుడే శ్రీమాతపైకి యుద్ధసన్నద్ధుడై రకరకాల శస్త్రములను ఆ తల్లిపై ప్రయోగించి ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నించాడు. శ్రీమాత ప్రతికూలమైన అస్త్రాలు ఒక్కుమ్మడిగా వర్షింపజేసి భండాసురుని శస్త్రములను నిరోధింపజేసింది. ఆ అసురుని శస్త్రములను నాశనం చేసింది పరాశక్తి.

భండాసురుని శస్త్రాలకు జగన్మాత ప్రతిగా అస్త్రములను ప్రయోగించింది. ఇక్కడ అస్త్రమునకు శన్త్రమునకు భేదము కలదు. ధృత్వా ప్రహరణం శస్త్రం, ముక్త్వాత్వస్త్ర మితీరితమ్ అనే శ్లోకంలో భేదమును తెలుసుకోవచ్చు. చేతితో పట్టుకుని ప్రయోగించేది శస్త్రం ఇది భండాసురుని ప్రయోగం.  మంత్రయుక్తంగా జగన్మాత ప్రయోగించిన సూక్ష్మమైనది అస్త్రం అని అంటారు. ఈ విషయం ధనుర్వేదమునందు కూడా చెప్పబడినది. 

ఆత్మవస్తు దర్శనమునకు కలుగు విఘ్నములు అజ్ఞానమువలన సంభవించిన అహంకారమమకారాది మనోవృత్తులు. అనేక కోటి సంవత్సరముల నుండి సంభవించుచున్నవి. అజ్ఞానముచే దైవదూషణము జరుగుచున్నది. దైవంపై తిరుగుబాటు కూడా అజ్ఞానము వలననే జరుగుచున్నది. దైవదూషణము, దైవంపై తిరుగుబాటు అనేది భండాసురుని అవిద్యాసూచకమైన అస్త్రములవంటివి. పరమేశ్వరి భండాసురుని అస్త్రములకు ఆత్మజ్ఞానము, చిదానందము అను మంత్రయుక్తమైన ప్రత్యస్త్రములను ప్రయోగించి సమూలముగా అవిద్యాసంబంధమైన కార్యములను నాశనము చేసినది.

భండాసురునితో శ్రీమాత చేసిన యుద్ధంలో భండాసురుని అస్త్రాలకు ప్రతిగా శ్రీమాత ప్రత్యస్త్రం వేసి నాశనంచేసేది. భండాసురుడు అజ్ఞాని. వాని అస్త్రములు అజ్ఞాన సూచకమైనవి. క్షుద్రవిద్యా సంబంధమైనవి అని కూడా అనుకోవచ్చు. పరమేశ్వరి ప్రయోగించేవి జ్ఞానపూర్వకమైనవి. అమ్మవారు ప్రయోగించు ప్రత్యస్త్రములు మంత్రపూర్వకమైనవి. అమ్మవారు బాణమును ధనుస్సునందు  మంత్రోక్తముగా సంధిస్తుంది.  అమ్మవారు సప్తకోటి మంత్రస్వరూపిణి అన్న విషయం మనం తెలుసుకోవాలి. 

జగన్మాత నారాయణాస్త్రముతో అసురసేనను, పాశుపతముతో అతని సేనానులను, మహాకామేశ్వరాస్త్రంతో భండాసురుని సంహరించినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

80వ నామ మంత్రము 
ఓం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః

దైత్యులను ఉద్భవింపజేసే భండాసురుని సర్వాసురాస్త్రం నుండి వెడలి వచ్చిన హిరణ్యకశిప, రావణాది దైత్యులను తుదముట్టించడానికి తన చేతి పది వ్రేళ్ళ నఖములనుండి నారాయణుని దశావతారములుద్భవింపజేసిన అఖిలాండేశ్వరికి నమస్కారము.

కర+అఙ్గుళి+నఖ+ఉత్పన్న అనగా చేతివ్రేళ్ళగోళ్ళ నుండి పుట్టిన, నారాయణ అనగా జీవేశ్వరులిద్దరి యొక్క, దశ అనగా అవస్థలనెడి కృతిః అనగా కార్యములు కలిగిన పరమేశ్వరి.

అవి ఎలాగ అంటే:

జాగ్రత్, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణము యనునవి జీవుని ఐదు అవస్థలు.

సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు అను దేవుని (నారాయణుని) ఐదు కృత్యములు.

ఈ జీవుని మరియు దేవుని (నారాయణుని)  మొత్తము కృత్యములు పది.  ఈ పది కృత్యములు పరమేశ్వరి రెండు చేతుల వ్రేళ్ళ పది గోళ్ళనుండి ప్రకటింపబడినవని భావనచేయ దగును.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ తల్లి కరుణచే అన్నవస్త్రములకు లోటులేక, ఆధ్యాత్మికచింతన యందు నిమగ్నుడై చతుర్విధ పురుషార్థములను సాధించి తరించును.

భండాసురుని దైత్యులను ఉద్భవింపజేసే సర్వాసురాస్త్రం ప్రయోగించగా హిరణ్యకశిప, రావణాది దైత్యులు ఆవిర్భవించి యుద్ధం చేయ నారంభించారు. అందుకు ప్రతిగా జగజ్జనని నారాయణుని దశావతారములు జనియింపజేసి ఆ రాక్షసుల సంహారం కావింపజేసింది..

దశ అంటే అవస్థ అని  కృతి అంటే కృత్యం అనీ అర్థాలు చెప్పుకుంటే ఈ నామ మంత్రమునకు మరియొక అర్థము గలదు. దేవుడైన నారాయణుని అంశలే జీవులు. కాబట్టి అటు దేవుని పరంగా నారాయణునికి పంచకృత్యాలుంటాయి. వాటిని సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు అని అంటారు.  ఇక జీవుని పరంగా పంచ అవస్థలుంటాయి. వాటిని జాగ్రత్, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణాలు అంటారు. కాబట్టి నారాయణుని దైవలక్షణంగా ఐదుకృత్యాలు, జీవి లక్షణంగా ఐదు అవస్థలు ఉంటాయి. ఈ పదీ అమ్మవారి చేతి వ్రేళ్ళ పదిగోళ్ళనుండి ప్రకటితమయినట్లుగా భావించవచ్చును.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

81వ నామ మంత్రము 

ఓం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికాయై నమః

జీవుని అస్థిత్వమునకే ముప్ఫు కలిగించే అజ్ఞానము, అసురీభావములకు ప్రతీకలైన భండాసురుడు మరియు భండాసురుని సైన్యమును పాశుపతాస్త్రము నుండి వెలువడిన  అగ్నిచే భస్మీపటలము కావించిన జ్ఞానస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఉపాసించు సాధకునకు అజ్ఞానము, అసురీభావములు దరిజేరకుండా బ్రహ్మజ్ఞాన సంపన్నుడై జగన్మాతను సేవించి తరించును.

భండాసురుని సైన్యము శక్తిసేనల పరాక్రమానికి లొంగి నశిస్తున్నారు. ఇంకను భండుడు, మరికొంతమంది పరాక్రమశాలులైన రాక్షసులు జగదాంబను ప్రతిఘటిస్తున్నారు. వారు విభిన్న అస్త్రములను ప్రయోగిస్తుంటే, జగన్మాత మంత్రపూర్వకమైన ప్రత్యస్త్రములతో వారిని నిలువరిస్తున్నది. ఇక ఏమాత్రము జాగుచేయకుండా యుద్ధము ముగించాలని అమ్మవారు మహాపాశుపతాస్త్రాన్ని భండుని సైన్యముపై మంత్రపూర్వకంగా ప్రయోగించింది. మరుక్షణమే భండాసురుడు, అతని సైన్యము, భండుని నగరము పూర్తిగా భస్మీపటలమైనది.

పాశుపతాస్త్రములు రెండు రకములు. ఒకటి పాశుపతాస్త్రము అయితే రెండవది మహాపాశుపతాస్త్రము. ఇవి మంత్రపూర్వకమైన అస్త్రములు పాశుపతాస్త్రమునకు గల మంత్రము షడక్షరి అనగా ఆరక్షరములు గల మంత్రము. దీనికి అధిదేవత శివుడు. మహాపాశుపతాస్త్రమునకు గలమంత్రము పదునాలుగక్షరములు గలిగినది. దీనికి సదాశివుడు అధిదేవత. మహాపాశుపతాస్త్రము మహా ప్రభావవంతమైనది అగుటచే పరమేశ్వరి భండాసురుడు, అతని సైన్యము, అతని నగరమును భస్మీపటలము కావించుటకు మహాపాశుపతాన్ని ప్రయోగించి, శత్రుసేనలను నిర్మూలించినది.  

అజ్ఞానము, రాక్షసత్వము పెరిగిపోయి, పుణ్యకార్యము లొనరించే వారికి, అమాయకులకు అపకారం జరిగేసమయంలో, భండుడనే మహా అజ్ఞానమును తుదముట్టించడానికి జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారు మహాపాశుపతమనే అస్త్రాన్ని ప్రయోగించి జీవులను కాపాడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

82వ నామ మంత్రము 

ఓం కామేశ్వరాస్త్ర నిర్దగ్ద సభండాసుర శూన్యకాయై నమః

అత్యంత శక్తివంతమైనది, ముల్లోకములందు సాటి లేనిది, చిదగ్నికి మారుపేరైనది, ప్రళయకాలాగ్నికి ప్రతిరూపమైనది అయిన కామేశ్వరాస్త్రముతో భండాసురుని, అతని శూన్యకనగరమును నిశ్శేషముగా దహింపజేసిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కామేశ్వరాస్త్ర నిర్దగ్ద సభండాసుర శూన్యకా  అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం కామేశ్వరాస్త్ర నిర్దగ్ద సభండాసుర శూన్యకాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో జగన్మాతను ఉపాసించు సాధకుడు బ్రహ్మానందము, ఆత్మానందానుభూతి కలిగి తరించును.

భండాసురుని సైన్యము, అతని పుత్రులు, సేనానాయకులు అందరూ సంహరింపబడినారు.  అత్యంతభయంకరుడైన భండుడు అతని నగరము శూన్యకానగరము మిగిలి ఉన్నాయి. భండుని చంపడానికి సామాన్యమైన అస్త్రములు చాలవు. అస్త్రరాజములలో మహాభయంకరమైనది, ప్రళయకాలాగ్ని సమానమైనది, ముల్లోకములందు సాటిలేనిది, చిదగ్ని స్వరూపమైన కామేశ్వరాస్త్రమును ప్రయోగించి శత్రుశేషమైన భండాసురుడు, అతని   శూన్యకనగరము నిశ్శేషముగా దహింపజేసి లోకమునకు శాంతిచేకూర్చినది శ్రీమాత.

కామేశ్వరాస్త్రం అంటే చిదగ్ని. మహాపాశుపతాస్త్రంకంటే గొప్పది.  మానవునిలో చిదగ్ని ఫ్రకాశించినట్లైతే  ద్వైతభావమైన జీవస్వభావం నశిస్తుంది. అప్పుడు ఆత్మశక్తి ప్రకాశిస్తుంది. అరిషడ్వర్గాలతో జీవినాశనమవుతాడు. 

బ్రహ్మాండ పురాణములో ఇలా చెప్పబడినది: "లలితాదేవి భండాసురుని యుద్ధము చేయునపుడు భండుని బంధువులందరినీ సంహరించెను. బంధుసంహారముతో భండుని కోపం తారస్థాయికి చేరినది. భండుడు అంటే లోకాలకే విప్లవకారుడు. అంతకంటే బలపరాక్రమములు ఉన్నవాడు.  అటువంటి భండుని అమ్మవారు వేలకొలదీ సూర్యుల వలె ప్రకాశించుచున్న మహాకామేశ్వర అస్త్రము అను మంత్రప్రయోగముతో సంహరించెను. భండుని రాజ్యములోని స్త్రీలు, బాలురు, గోవులు, స్థానములు, ధనములు, ధాన్యములు మొదలగువాటితో సహా  సమూలంగా ఆ అస్త్రము యొక్క మంటలు భస్మము చేసినవి. ఆ పట్టణము మొత్తం నేలమట్టమయినది. మొత్తము శూన్యమైన భండుని పట్టణమునకు శూన్యకమను పేరు సార్థకమయ్యెను". ఆ విధముగా పరమేశ్వరి కామేశ్వరాస్త్రమును ప్రయోగించి భండుని, అతని పరివారమును, పట్టణమును సమూలంగా భస్మమొనర్చి, శూన్యతను నిలిపెను. గనుకనే అమ్మవారు కామేశ్వరాస్త్ర నిర్దగ్ద సభండాసుర శూన్యకా  యని అనబడినది.

భండుని వంటి అసురీభావం నాశనమవడానికి కామేశ్వరుడు అనే కామేశ్వరాస్త్రం జగన్మాత ప్రయోగించి అసురీ భావం నాశనంచేసిన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కామేశ్వరాస్త్ర నిర్దగ్ద సభండాసుర శూన్యకాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

83వ నామ మంత్రము 

ఓం బ్రహ్మోపేంద్రమహేంద్రాది దేవ సంస్తుత వైభవాయై నమః

తమ మొరనాలకించి అసురులైన భండాసురుని, అతని పుత్రులసు, సైన్యమును, శూన్యకనగరమును తన అంశనుండి ఉద్భవించిన బాలాత్రిపురసుందరి, సంపత్కరీదేవి, శ్యామలదేవి,  అశ్వారూఢాదేవి, వారాహీదేవి జ్వాలామాలిని, వహ్నివాసిని, నిత్యా తిథిదేవతలతో సహా సకల  శక్తిసేనలను నియోగించి, నిశ్శేషముగా నాశనమొనర్చి నందుకు సంతసించిన బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలచే స్తుతింపబడిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి బ్రహ్మోపేంద్రమహేంద్రాది దేవ సంస్తుత వైభవా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం బ్రహ్మోపేంద్రమహేంద్రాది దేవ సంస్తుత వైభవాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసన చేయు సాధకుడు నిశ్చయంగా ఆ తల్లి కరుణకు పాత్రుడై ఆత్మానందానుభూతితో బాటు, ఐహిక సుఖసంతోషాలతో జీవనము కొనసాగించి, అంత్యమున పరమపదము చేరును.

బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలు,  వరప్రభావమున గర్వితుడైన భండాసురునిచే పీడింపబడుతుండిరి. వారందరూ జగన్మాతతో తమ బాధను విన్నవించుకొన్నారు. చక్రరాజరథమందు సర్వాయుధాలంకృతయై, సంపత్కరీ, అశ్వారూఢ, శ్యామల, వారాహి, తిథిదేవతలైన నిత్యాదేవతలు మొదలైన శక్తిసేనలు, తన అంశనుండి ఉద్భవించిన బాలత్రిపురసుందరి వెంటరాగా జ్వాలామాలినీ, వహ్నివాసినులైన అగ్నిస్వరూపిణులు ఏర్పాటు చేసిన వహ్ని ప్రాకారంలో హోరాహోరీగా భండాసురునితో యుద్ధమునకు తలపడింది పరాశక్తి.  భండాసురుని శస్త్రములకు ప్రత్యస్త్రములు ప్రయోగిస్తూ, మహాపాశుపతాస్త్రము, కామేశ్వరాస్త్రము మొదలైన వివిధ మంత్రపూర్వమైన అస్త్రములతో భండుని, అతని పుత్రులను, సర్వసైన్యాన్ని, చివరకు భాండాసురుని శూన్యకనగరమును నిశ్శేషముగా తుదముట్టించి దేవగణములను కాపాడగా, బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలు అత్యంతానందముతో, అంతకు మించిన భక్తిప్రపత్తులతో ఆ పరాశక్తి పరాక్రమాన్ని కొనియాడుతు అనేకవిధములుగా స్తుతించారు.

భండాసురుడు మొదలైన అసురసేనలు మనలోని అజ్ఞానమునకు, మూర్ఖత్వానికి, క్రూరభావాలకు ప్రతీకలు కాగా,  జగన్మాత జ్ఞానదీపియై అజ్ఞానధ్వాంతమును అంతముచేసి బ్రహ్మజ్ఞానకాంతులు విస్తరింపజేసినది. అందుకే బ్రహ్మ, విష్ణు మహేంద్రాది దేవగణము జగన్మాత పరాక్రమాన్ని ప్రస్తుతించారు. 

అట్టి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం బ్రహ్మోపేంద్రమహేంద్రాది దేవ సంస్తుత వైభవాయై నమః అని ఉచ్చరించినచో మనలోని దుష్టశక్తులు నశించును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

84వ నామ మంత్రము 
ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః

తనపై (పార్వతీ దేవిపై) మోహం కలిగేలా పరమశివునిపై సుమశరములు ప్రయోగించిన మన్మథుని పరమశివుడు తన ఫాలనేత్రాగ్నితో భస్మంచేయగా, అందువలన రతీదేవికి సంభవించిన వైధవ్యమును బాపుటకై తిరిగి మన్మథుని సజీవుని చేసి, మన్మథుని పాలిట సంజీవనౌషధిగా ఒప్పారిన జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఉపాసించు ఉపాసకునకు ఆ తల్లి ఆయురారోగ్యములు, సుఖసంతోషములు పుష్కలంగా అనుగ్రహించును. మరియు ఆ సాధకుని ఆధ్యాత్మిక చింతనతో తరింపజేయును.

ఈ నామ మంత్రములో  పరమశివుని ఆగ్రహము గలదు అలాగే పరమేశ్వరి అనుగ్రహము కూడా గలదు.

పార్వతీ దేవి మహాశివుని వివాహమాడడానికి తపస్సు చేస్తుంది.  పరమశివునికి పార్వతిపై మోహముకలిగింపజేసి వారిరువురి పార్వతీ పరమేశ్వరులను వివాహబంధంతో కలపడానికి, పరమశివునికి పార్వతీ దేవిపై మోహము కలుగజేసి, పార్వతీపరమేశ్వరుల కళ్యాణమునకు కారకుడను కావాలనుకున్న మన్మథుడు, పరమశివునిపై మన్మథుడు పూలబాణములను ప్రయోగిస్తాడు. చెఱకు విలుకాడు ఆ ప్రయత్నంలో ఆ ప్రయత్నంలో శివుని ఫాలనేత్రాగ్నికి మన్మథుడు భస్మమవుతాడు.  మన్మథుని భార్య రతీదేవి తన భర్తకోసం విలపిస్తూ పార్వతిని పతిభిక్ష కోరుతుంది. అయ్యవారి కోపాగ్ని సంగతి అమ్మవారికి తెలిసు. అయ్యవారి కోపం తాటాకు మంట అని కూడా తెలుసు.   అలాగే అమ్మవారు క్షిప్రప్రసాదిని (ఓం క్షిప్రప్రసాదిన్యై నమః -  శ్రీలలితా సహస్రం నామావళిలో 869వ నామ మంత్రము)  అనగా అమ్మా అని ఆర్తితో పిలిస్తే చటుక్కున వచ్చే తల్లిలాగ, భక్తిప్రపత్తులతో ఆరాధిస్తే వరాలు కురుపించే దేవతలాగ, కొండల్లో నన్నువిడువకు అని ఎలుగెత్తి అరిస్తే తిరిగి నన్ను విడువకు అనే ప్రతిధ్వనిలాగ భక్తులను అనుగ్రహించు మహాజనని వెంటనే మన్మథుని సజీవుని చేస్తుంది. కాని అతడు అనంగుడు. అనగా శరీరంలేనివాడు. మన్మథుడు సజీవుడైనా అనంగుడు కావడానికి కారణం ఉంది. పరమశివుని కోపాగ్నికి మన్మథుడు కాలి బూడిద అయిపోతే ఆ బూడిదతో గణేషుడు భండాసురుని సృష్టించాడు. ఆ భండాసురుని అమ్మవారు సంహరించింది. అందుచేత సజీవుడైన మన్మథుడు అనంగుడు (శరీరము లేనివాడు) అయాడు. సజీవుడయిన మన్మథుడు అనంగుడవడంతో రతీదేవికి వైధవ్యం తొలగినా అనంగుడైన మన్మథుని గూర్చి మరింత విలపింపగా, పార్వతీదేవి ఆ రతీదేవికి మన్మథుడు సశరీరంగా కనబడేటట్లు వరమిస్తుంది. ఆనాటి నుండి మన్మథుడు అనంగుడు. కాని రతీదేవికి మాత్రం సశరీరుడు. ఈవిధంగా తండ్రి శిక్షిస్తే తల్లి పిల్లవాడిని సముదాయించింది అనునట్లు ఈ కథలో  అమ్మవారు తల్లిపాత్ర పోషించినది.

ఈ నామ మంత్రంలో హరుడు అనగా శివుడు. ఆయన త్రినేత్రుడు. కుడికన్ను సూర్యాత్మకము, ఎడమకన్ను చంద్రాత్మకము. ఫాలనేత్రం అగ్ని తత్త్వం గలది. అందుకే శివునికి కోపంవస్తే ఆయన ఫాలనేత్రం నుండి కాలాగ్నిజ్వాలలు వెడలి వస్తాయి. తన తపస్సుకు భంగం కలిగించిన కాముని (మన్మథుని) పై కోపంప్రదర్శిస్తూ ఫాలనేత్రం తెరిచాడు.  మన్మథుడు భస్మమయాడు. ఇక పరమశివుని ఎడమ కన్ను చంద్రాత్మకం అన్నాం గదా. ఆ భాగం అమ్మవారిది. అమ్మవారు చల్లనితల్లి. అందుకే అమ్మవారు హరనేత్రాగ్నిసందగ్ధ కామ సంజీవనౌషధిః అయి మన్మథుని సజీవుని చేసింది. శివుని ఫాలనేత్రం వద్ద ఆజ్ఞాచక్రం గలదు. కామంతో కళ్ళుమూసుకుపోతే శివుని మూడోకన్ను (ఆజ్ఞాచక్రం ఫాలభాగంలో ఉంది గనుక) ఆ ఫాలనేత్రం జ్ఞానసంకేతమైనది. ఆ విధంగా కామం నశించింది.   జ్ఞానం ఉదయించింది. 

హరుని నేత్రాగ్నిలో కాముడు దగ్ధముకాగా, ఆ కాముని (మన్మథుని) సజీవుని జేసి జగన్మాత ఆ మన్మథుని పాలిట సంజీవనౌషధి అయినది. అందుకే  అమ్మవారు హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవనౌషధిః అని యనబడినది.

అమ్మవారికి నమస్కరించునపుడు ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

85వ నామ మంత్రము 

ఓం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజాయై నమః

పంచదదశీ విద్యలో తొలి ఐదక్షరము (క ఏ ఈ ల హ్రీం)  లను వాగ్భవకూటమని అందురు. అట్టి వాగ్భవకూటమే తన ముఖపద్మముగా తేజరిల్లు జగదీశ్వరికి నమస్కారము. 

అమ్మవారి ముఖపద్మము స్థూల స్వరూపము కాగా, వాగ్భవకూటము సూక్ష్మస్వరూపము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ జగన్మాత కరుణచే ఆతల్లి స్థూల, సూక్ష్మ స్వరూపములను తన మనోనేత్రములందు భావించుచూ ఆత్మానందముననుభవించును. మరియు భౌతిక జీవనమందు ఆనందమయమైన మార్గముననుభవించును.

కరచరణాదులు కలది స్థూలరూపము

మంత్రమయము సూక్ష్మరూపము

 జ్ఞానమయము పర రూపము

సూక్ష్మ రూపమును సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమము
లని మూడు విధములు.

సూక్ష్మరూపము పంచదశీ మంత్రము. సూక్ష్మతరము కామకళ. సూక్ష్మతమము కుండలినీ శక్తి స్వరూపము.

శ్రీవిద్య పేరును పదిహేను అక్షరాలను కలిగిన మంత్రం పంచదశాక్షరీ మంత్రంగా పూజిస్తారు. అయితే మరికొంతమంది వీనికి శ్రీ ని కలిపి శోడషాక్షరీ మంత్రంగా కూడా భావిస్తారు.

జగన్మాతకు స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అను నాలుగు స్వరూపములు గలవు అని అనుకున్నాగదా! వివరణ మరియొకసారి విగ్రహములు, చిత్రములు, అమ్మవారి కాళ్ళుచేతులు, ఇంతకు ముందు నామ మంత్రాలలో జగన్మాత కేశములు, కిరీటము, ముఖకమలము, లలాటము, కనుబొమలు, నాసాదండము, చెక్కిలి, పెదవులు, చుబుకము, కపోలము, దంత పంక్తులు ఇలాంటి వర్ణనలు చేసినదంతా స్థూలస్వరూపము. పంచదశీ మంత్రాక్షరములు (క, ఏ, ఈ, ల, హ్రీం, హ, స, క, హ,ల, హ్రీం, స, క, ల హ్రీం) జగన్మాత సూక్ష్మస్వరూపము. దీనినే మంత్రాత్మకమందురు. కామకళాక్షరము సూక్ష్మతర శరీరము కుండలినీ రూపము సూక్ష్మతమ శరీరము.

పంచదశీ విద్యలో మొదటి ఐదక్షరముల (క, ఏ, ఈ, ల, హ్రీం)  సముదాయమునకు వాగ్భవకూటము అని అందురు. ఈ కూటము వలన సకలవిద్యలు సంభవించును. జ్ఞానము మొదలగు  మహిమలు గలది. అట్టి వాగ్భవకూటమే జగన్మాత ముఖపద్మము. సూక్ష్మశరీరములోని మంత్రాక్షరములే స్థూలములోని ముఖపద్మమును వర్ణించుటచే స్థూల, సూక్ష్మములకు అభేదము గ్రహించదగును. జగన్మాత శరీరమంతయు మంత్రమయము. అందుకే ఆ తల్లిని మూలమంత్రాత్మికా అనికూడా స్తుతిస్తున్నాము

ఇక ఈ పంచదశీవిద్యలోని పదిహేను మంత్రాక్షరములలో మొదటి ఐదక్షరములు (క, ఏ, ఈ, ల, హ్రీం) వాగ్భవకూటము కాగా తరువాత పది అక్షరములు జగన్మాత స్థూల శరీరములోని ఏయే  అవయవములో తరువాత రాబోయే నామ మంత్రములలో తెలుసుకోగలము.

జగన్మాత వాగ్భవకూటమను సూక్ష్మశరీరమే ఆ తల్లి ముఖపద్మమను స్థూలశరీరము. అటువంటి తల్లికి నమస్కరించు నపుడు ఓం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీలలితా సహస్రనామ భాష్యము

86వ నామ మంత్రము 

ఓం కణ్ఠాధః కటి పర్యన్తమధ్య కూట స్వరూపిణ్యై నమః

పంచదశీ విద్యలో మధ్యలోని హ, స, క, హ, ల, హ్రీం అను ఆరు బీజాక్షరాలను మధ్యకూటము  లేదా కామరాజకూటము అందురు. దీనినే హాదికూటమని కూడా అంటారు. కంఠము దిగువభాగం నుండి కటి పర్యంతము కామరాజకూటముతో సూక్ష్మ స్వరూపిణిగా విరాజిల్లు జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి  కణ్ఠాధః కటిపర్యన్త మధ్యకూట స్వరూపిణీ యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం కణ్ఠాధః కటి పర్యన్త మధ్యకూట స్వరూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ ఆ అఖిలాండేశ్వరిని  ఉపాసించు సాధకునకు జగన్మాత కరుణచే ఆత్మానందమును పొంది తరించును.

కామరాజు అనగా కామేశ్వరుడు. పరమశివుడు. సృష్టి ప్రక్రియను సూచించే కామాన్ని మహాకామం అంటారు. ఈ మహాకామానికి అధిపతి మహాకామేశ్వరుడు. దహరాకాశం అనేది మనహృదయంలోనే ఉంటుంది. ఆ హృదయం కంఠమునకు, మొలవరకు గల  మధ్యభాగమునందే హృదయం ఉంటుంది.  అందుకే శ్రీమాత సూక్ష్మరూపం కణ్ఠాధఃకటిపర్యన్త ప్రదేశంలో ఉంటుందని చెప్పబడినది. శ్రీవిద్యలో (పంచదశీ మంత్రము) మధ్యనున్న  హ, స, క, హ, ల, హ్రీం ఆరు బీజాక్షరములు మధ్యకూటము అనియు, ఆ మధ్యకూటమునే కణ్ఠాధఃకటిపర్యన్త మని చెప్పబడినది. వివరించడం జరిగింది. కోరికలు, అనురాగాలు, ప్రేమలు, వీటన్నిటికి కేంద్రమే హృదయము. అందుకే ప్రేమకు చిహ్నం ❤️ - ఇదియే. నాటినుంచి నేటి యువతరం వరకూ ప్రేమకు సంకేతంగా ఈ చిహ్నము (హృదయం) ను చూపించుతారు.

జగన్మాత కంఠం నుండి కటి (మొల) వరకు గల స్థూల శరీరమే పంచదశీ మంత్రమునందు మధ్యనున్న  హ, స, క, హ, ల హ్రీం అను ఆరు బీజాక్షరముల సూక్ష్మశరీరము. దీనినే కామరాజకూటము అని అంటారు.  కామేశ్వరుడే కామరాజు.  ఆయనకు  కామేశ్వరి (పరమేశ్వరి) పైగల ఆపేక్ష, అనురాగాలకు కేంద్రమైన దహరాకాశస్దానము హృదయము. ఆ హృదయము  కణ్ఠాధఃకటిపర్యన్తమైన మధ్య భాగమునందు గలదు గనుక ఆ జగన్మాత  మధ్యకూటస్వరూపిణిగా లేదా కామరాజకూట స్వరూపిణిగా విరాజిల్లుచూ కణ్ఠాధః కటిపర్యన్త మధ్యకూట స్వరూపిణీ యని అనబడినది.

భాస్కరరాయలువారు తమ సౌభాగ్యభాస్కరంలో  ' కంఠస్య అధః కటి పర్యంతోయస్య స మధ్యభాగః స ఏవ మధ్యస్య కామరాజాఖ్యస్య కూటస్య షడక్షరసమూహస్య స్వం నిజం రూపం అస్యాః అనగా కంఠము క్రింద మొదలు కటివరకు (మొలవరకు) గల ప్రదేశమునకు మధ్యకూటము అని పేరు. పంచదశీ మంత్రములో (క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం) మధ్యగల ఆరు అక్షరములకు కామరాజకూటము అని యందురు' అని యన్నారు.

అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కణ్ఠాధః కటి పర్యన్త మధ్యకూట స్వరూపిణ్యై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

87వ నామ మంత్రము 

ఓం శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణ్యై నమః

 పంచదశీ మంత్రములో శక్తికూటమనబడే చివరి నాలుగు బీజాక్షరములను (స, క, ల, హ్రీం) కటి నుండి పాదముల వరకూ ధరించిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణీ అను పదహారక్షరములు (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణ్యై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఉపాసించు సాధకుడు సృజనాత్మకమైన శక్తితో తాను చేపట్టిన వృత్తిలో లేదా ఉద్యోగములో రాణించును. ఆ జగన్మాత కరుణతో సుఖసంతోషములతో జీవించుచూ ఆధ్యాత్మికసంపన్నుడై భగవదారాధనలో తరించును.

కామస్తే హృదివసతీతి కామరాజం

స్రష్టృత్వాత్తదను తవాంబ శక్తికూటమి తి -  నీ హృదయమునందు ఉన్న కాముడు కామరాజును సృష్టించుటచే అది నీ శక్తికూటము అయినది అని భాస్కరరాయలువారు చెప్పారు.

పంచదశీ మంత్రము యొక్క చివరి నాలుగు బీజాక్షరములు (స, క, ల, హ్రీం) శక్తికూటము అని అందురు. సాధకులకు వారిలో దాగిన సృజనాత్మకతను వెలికితీయు శక్తి ఈ బీజాక్షరములలో గలదు గనుక ఈ కూటమును శక్తికూటము అని అన్నారు. సకలహ్రీం అనగా సకల విషయకాజ్ఞానము. ఇందులో హ్రీం అనేది మాయా బీజము. దీనినే శక్తి బీజము అనికూడా అంటారు. సకలమూ శక్తి మయమే అనగా సర్వమూ ఆ పరమేశ్వరియే అని భావించవచ్చును.

ఇందు మొదటి రెండు బీజాక్షరములను మణిపూరము మరియు స్వాధిష్టాన చక్రముల మధ్యన, మూడవ బీజాక్షరమును మూలాధార చక్రమునందు, నాలుగవ బీజాక్షరము స్వాధిష్టాన చక్రమునందు భావించుచూ సాధకుడు ఉపాసించవలెను. అలా చేయడం వలన తనలో గల భావములకు దైవత్వసిద్ధి ఏర్పడుతుంది. 

పంచదశీ మంత్రంలోగల మూడుకూటములను (వాగ్భవకూటము, కామరాజ కూటము, శక్తికూటములను)  వరుసగా సువర్లోకము, భువర్లోకము, భూలోకములతోను, దేవలోకము, మర్త్యలోకము, పాతాళలోకాలతోను కూడా సమన్వయించవచ్చును.

జగన్మాత కటినుండి పాదముల వరకు గల శరీరము స్థూలశరీరము అని చెపితే శక్రికూటము (స, క, ల, హ్రీం) శ్రీమాత సూక్ష్మరూపము.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణ్యై నమః
అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

88వ నామ మంత్రము 

ఓం మూలమంత్రాత్మికాయై నమః

సర్వసిద్ధిప్రదమైనది, సర్వమంత్రాలకూ మూలమైనది అయిన పంచదశాక్షరీ మంత్రమే ఆత్మస్వరూపముగా విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మూలమంత్రాత్మికా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రముసు ఓం మూలమంత్రాత్మికాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని   అత్యంత  భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకుడు పంచదశాక్షరీ మంత్రములోని బీజాక్షరాలను శరీరంలోని ఆయా బీజాక్షరాలకు నిర్దేశించినశరీరంలోని ఆయా స్థానాలతో న్యాసం చేస్తూ మంత్రదేవతా ఐక్యరూపాన్ని భావించితే తానుగూడా మంత్రదేవతాస్వరూపుడౌతాడు, చతుర్విధ పురుషార్థములలోని పరమార్థాన్ని గ్రహించి తరిస్తాడు.

పంచదశీ మంత్రము ధర్మ, అర్థ, కామ, మోక్షములనెడి చతుర్విధపురుషార్థములకు మూలమైనది గనుకనే పంచదశీ మంత్రము మూల మంత్రమై ఒప్పుచున్నది. ఎందుకంటే అమ్మవారు సర్వమంత్రాత్మిక అనగా సప్తకోటి మంత్రములు పరమాత్మయైన ఆ పరమేశ్వరి ఆత్మస్వరూపము. సప్తకోటి మంత్రాలలో పంచదశీ మంత్రము అన్ని మంత్రములకు మూలము. అమ్మవారి సూక్ష్మ (ఆత్మ)స్వరూపము కూడా పంచదశీ మంత్రంలోని వాగ్భవ, కామరాజ, శక్తి కూటములు అనునవి వరుసగా ఆ తల్లి ముఖపద్మము, కంఠమునుండి కటివరకు, కటినుండి పాదములవరకు గల ఈ భాగములు ఒప్పారినవి. పంచదశీ మంత్రము అను మూలమంత్రము అమ్మవారి సూక్ష్మ (ఆత్మ) స్వరూపము అయినది గనుక అ అమ్మవారు మూలమంత్రాత్మికా యని అనబడినది.

వివరణాత్మకంగా పరిశీలించుదాము:-
పంచదశీ మంత్రంలోని క,ఏ,ఈ,ల,హ్రీం,హ,స,క,హ,ల,హ్రీం,స, క, ల, హ్రీం అను ఈ  పదిహేను బీజాక్షరములు శ్రీమాతకు ఆత్మస్వరూపం కనుకనే ఆ తల్లి మూలమంత్రాత్మికా యని నామప్రసిద్ధమైనది. మూల మంత్రమైన పంచదశీ మంత్రము ఆ తల్లి సూక్ష్మ (ఆత్మ) స్వరూపము గనుక శ్రీమాత మూలమంత్రాత్మికా అని నామ ప్రసిద్ధమైనది. 

చతుర్విధపురుషార్థమూలకారణత్వాత్ మూలం పంచదశాక్షరీ చతుర్విధపురుషార్థములకు సంప్రాప్తింపజేసే మూలమంత్రం.
మననాత్ త్రాయత ఇతి మంత్రః మననము చేయుట వలన సాధకుని రక్షించును. ఆత్మా స్వరూపం యస్యాః తదుక్తం ఆత్మసాక్షాత్కారం చేయగలిగేది ఈ పంచదశీ మంత్రం.  పూర్ణాహంతానుసంధ్యాత్మాస్ఫూర్జన్మననధర్మత సంసారక్షయకృత్త్రాణధర్మతో మంత్ర  ఉచ్యత  పూర్ణాహంత యొక్క సంధిస్వరూప జీవసమిష్టి శ్రీమాత స్వరూపమును మాటిమాటికి మననముజేసినచో సంసారనాశము అను రక్షణము జరుగును. ఈ మంత్రోపాసనవలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. శ్రీవిద్యాసాంప్రదాయానికీ ఈ పంచదశీమంత్రం గాయత్రీ మంత్రం వంటిది.

మూలమంత్రమైన పంచదశాక్షరీ మంత్రమే స్వరూపంగా గలిగిన జగన్మాతకు నమస్కరించునపుడు 
ఓం మూలమంత్రాత్మికాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

89వ నామ మంత్రము 

ఓం మూలకూటత్రయ కళేబరాయై నమః

పంచదశీ (మూల) మంత్రములోగల వాగ్భవ, కామరాజ, శక్తికూటములే శరీరముగా ఒప్పారు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మూలకూటత్రయ కళేబరా అను పది అక్షరముల (దశాక్షరీ) నామ మంత్రమును ఓం మూలకూటత్రయ కళేబరాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా ఉపాసించు సాధకుడు ఈ మూలకూటత్రయ కళేబరా అను ఈ నామమే మనస్సును నడిపే చైతన్యం వలె పనిచేసి, పరిశుద్ధమనస్కుడై జీవించును.  

ఏ మంత్రాన్నైనా మూడుగా విభజించ గలిగితే ఆ మూడు భాగాలను మూడుకూటాలుగా తెలుసుకోవాలి. అలాగే ఇంతకు ముందు పంచదశాక్షరీ మంత్రంలో వాగ్భవ, కామరాజ, శక్తి కూటములు ఉన్నాయనుకున్నాము. ఆ మూడుకూటములే శ్రీమాతకు శరీరముగా ఒప్పారుచున్నది. ఇంతకు ముందు నామ మంత్రంలో మూలమంత్రాత్మికా అన్నాము.అంటే మూడుకూటములై ఉన్న పంచదశీ (మూల) మంత్రమే ఆత్మగా విరాజిల్లుచున్నది. అక్కడ సూక్ష్మరూపంగా అనుకుంటే ఇక్కడ (మూలకూటత్రయ కళేబరా) శ్రీమాత స్థూలరూపంగా అన్నాము. అంటే మూలమంత్రమే ఇంతకుముందు మంత్రంలో ఆత్మ అయితే ఇక్కడ శరీరం గా కూడా సమన్వయంచేసుకోవచ్చు.

పంచదశీ మంత్రంలోని వాగ్భవ, కామరాజ, శక్తి కూటములే ఆ మంత్రానికి బీజము, శక్తి, కీలకము. 

గణపతి మంత్రానికి ఇలా చెబుతాము 

అస్యశ్రీ మహాగణపతి మహామంత్రస్య గణక ఋషిః| నిఛృద్గాయత్రీ ఛందః | శ్రీ మహాగణపతిర్దేవతా| గం బీజం| స్వాహా శక్తిః | ఓం కీలకం ...అని చెబుతాము.

పంచదశీ మంత్రానికి దక్షిణామూర్తి ఋషిః| పంక్తిఛందః | శ్రీసౌభాగ్యవిద్యేశ్వరీత్రిపురసుందరీ దేవతా|  ఐం బీజం| సౌః శక్తిః | క్లీం కీలకం ...

పంచదశీ మహామంత్రాన్నే సౌభాగ్యవిద్య అని కూడా అంటారు.

ఈ విధంగా పంచదశీ మంత్రంలోని మూలకూటత్రయమే  శ్రీమాత శరీరమని చెప్పడానికి మూలకూటత్రయ కళేబరా అని అన్నాము. 

85వ నామ మంత్రంలో శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా అని అమ్మ ముఖపద్మాన్ని(స్థూల రూపమును) వాగ్భవకూటము (సూక్ష్మతర రూపము) అని చెప్పాము.

86వ నామ మంత్రంలో  కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణీ అన్నాము. అంటే కంఠము నుండి కటి ప్రదేశం వరకూ (స్థూల రూపమును) మధ్యకూటము అనగా కామరాజకూటము (సూక్ష్మతర రూపము) అని చెప్పాము.

87వ నామ మంత్రములో శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణీ కటినుండి పాదములవరకూ (స్థూలరూపము) శక్తి కూటము (సూక్ష్మతర రూపము) అని చెప్పాము.

88వ నామ మంత్రములో మూలమంత్రాత్మికా అని పంచదశీమంత్రమే ఆత్మయని 85, 86, 87 నామమంత్రములలోని వాగ్భవ, కామరాజ, శక్తికూటములను మరియొకసారి అమ్మవారి సూక్ష్మతర శరీరమును చెప్పుకున్నాము.

ఇక ఈ (89వ) నామ మంత్రము లో మూలకూటత్రయ కళేబరా అని 85, 86, 87 నామాలలో చెప్పిన శ్రీమాత ముఖకమలము, కంఠము క్రిందినుండి కటి ప్రదేశం వరకూ, కటినుండి పాదముల వరకూ గల జగన్మాత స్థూల రూపమును చెప్పుకున్నాము.

85, 86, 87 నామ మంత్రములలో వాగ్భవ, కామరాజ, శక్తి కూటములనే సూక్ష్మతర రూపములు ఆయా స్థూలరూపములతో విడివిడిగా చెబితే, 88వ నామమంత్రములో పరాశక్తి సూక్ష్మతర రూపమును, 89వ నామ మంత్రములో ఆ పరమేశ్వరి స్థూల శరీరమును చెప్పుకున్నాము.

మొత్తానికి 85వ నామమంత్రము నుండి 89వ నామ మంత్రము వరకూ అమ్మవారి స్థూల,సూక్ష్మరూపములను మనోనేత్రములందు అవలోకించాము. అనగా పంచదశీ మహామంత్రానికి వివరణ క్లుప్తముగా తెలుసకొనగలిగాము.

పంచదశీ మంత్రజపానుష్ఠానము వలన ఆయుష్షు, పుష్టి, వశీకరణము, విద్యాప్రదము, కీర్తికరము, కవిత్వప్రదము, సంపత్ప్రదము, భోగప్రదము, సౌఖ్యప్రదము మరియు సర్వాభీష్టప్రదము.

ఇదంతా మనం అర్థంచేసుకున్నామంటే సామాన్యవిషయంకాదు.  మన పూర్వజన్మసుకృతము అయి ఉన్నది కనుకనే అమ్మవారిని ఈ ఐదు నామ మంత్రములతో స్తుతించాము. ఇందులో నాకు కూడా (వివరణకర్త పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం) భాగం ఉన్నందకు మహదానందంగా ఉన్నది.

ఈ మాటను ఆదిశంకరాచార్యులవారు సౌందర్యలహరిలో ప్రథమ శ్లోకంలో ఏమి అన్నారో పరిశీలిద్దాము.

ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యఃప్రభవతి?

పంచదశీ మంత్రము శ్రీమాత సూక్ష్మరూపము కదా! అలాంటి పంచదశీ మంత్రోపాసన చేయడానికి  ఎంత పుణ్యం మనకు ఉండాలి?

అలాగే లలితా త్రిశతి ఫలశృతిలో 83వ శ్లోకంలో

యస్యనో పశ్చిమం జన్మ యది వా శంకరస్స్వయమ్|

తేనైన లభ్యతే విద్యా శ్రీమత్పంచదశాక్షరీ|

పంచదశీ మంత్రోపాసన చేయడమంటే మళ్ళీ జన్మ లేకుండా ఉండాలి లేదా సాక్షాత్తు పరమేశ్వరుడైనా అయి ఉండాలి. 

లలితా త్రిశతి అంటే మూడు వందల నామాలు. లలితా త్రిశతి పంచదశిలోని పదిహేను అక్షరములకు ఒక్కొక్క అక్షరమునకు ఇరువది నామాలు చొప్పున మొత్తం మూడువందల నామాలు గలవు.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మూలకూటత్రయ కళేబరాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ  భాష్యము - 

90వ నామ మంత్రము

ఓం కులామృతైక రసికాయై నమః

మూలాధార చక్రం నుండి జాగృతమైన కుండలినీ శక్తి సుషుమ్న మార్గం గుండా పయనించి షట్చాక్రాలను, బ్రహ్మవిష్ణురుద్ర గ్రంథులను భేదించి బ్రహ్మరంధ్రానికి చేరి అక్కడ సహస్రారంలో స్రవింపజేసిన కులామృతము అను అమృత ధారలందు ప్రీతిని కలిగియున్న పరమేశ్వరికి నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి  కులామృతైక రసికా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం కులామృతైక రసికాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు ఈ నామ మంత్రములోని అంతరార్థమును తెలిసికొని ఆత్మానందమునంది బ్రహ్మానందభరితుడగును.

ఈ 90వ నామ మంత్రం నుండి కుండలినీ శక్తివివరణ జరుగుచున్నది. గత నామ మంత్రములలో అనగా 85వ నామ మంత్రం నుండి 89వ మంత్రము వరకూ పంచదశీమంత్రమును అర్థంచేసుకుంటే ఈ నామ మంత్రమునుండి కుండలినీశక్తి గురించి తెలుసుకుంటున్నాము.

క్లుప్తంగా చెప్ఫాలంటే మూలాధారంలో తామరతూడులోని అతిసూక్ష్మతరమైన దారము వలె కుండలిని గుండ్రముగా మూడున్నరచుట్టలు చుట్టుకొని పరుండియుండును. యోగులు తమ యోగాభ్యాసముతో నిద్రలేపి మూలాధారాది షట్చక్రములను, బ్రహ్మ-విష్ణు-రుద్ర అను మూడు గ్రంథులను భేదించి సహస్రార చక్రమువరకూ తీసుకుని వెళ్ళుదురు. అక్కడ సహస్రారపద్మమందలి కర్ణికారూపమగు చంద్రమండలమునందలి అమృతధారలను ఆ కుండలినికి పొందింపజేయుదురు. అనగా కుండలినీశక్తిరూపంలో అమ్మవారు సహస్రారంలోని చంద్రమండలంలో వర్షించుచున్న అమృతధారలలో హాయిగా తృప్తిగా ఓలలాడును. కులము అనగా ఇక్కడ సహస్రారము అని అర్థము. అచ్చటి అమృత ధారలతో సంతృప్తి చెందుతుంది గనుక జగన్మాతను కులామృతైక రసికా అని స్తుతించాము.

జగన్మాతను కులామాతైక రసికా అను నామ మంత్రంతో  స్తుతిస్తున్నాము. కుల అనగా కులమునుండి (సహస్రారము నుండి) వచ్చిన, అమృత అనగా అమృతము యొక్క, ఏకరసికా అనగా మిక్కిలి ప్రీతిగలిగినది. 

కులము అంటే సాధారణంగా ఒకే జాతిలో ఉండు సముదాయముని సాధారణంగా చెబుతాము. మరి ఈ కులము ఏమిటి? అమృత (అమృతము) యొక్క అన్నాము, అది ఏమిటి? ఈ కులము నకు అమృత మునకు గల సంబంధము  ఏమిటి? ఈ నామము చివరిలో రసికా అనికూడా అంటూ, ఈ శబ్దమునకు మిక్కిలి ప్రీతికలిగినది అని భావము గలదని కూడా చెప్పాము. ఏమిటి ఇదంతా? 

ఈ విషయం భాస్కరరాయలు వారు ఇలా విశ్లేషించి చెప్పారు. అదే విశ్లేషణ ఆధారంగా వారి మాటల్లో, వారి అనుభవాన్ని మరింత రంగరించి మరింత బాగా అర్థమయేలా  ఇంకా చాలా మంది ఆధ్యాత్మిక తత్త్వవేత్తలు కూడా చెప్పారు. ఎవరు చెప్పినా భాస్కరరాయల వారిదే మూలం. ఇక్కడ మనం కూడా అదే విషయాన్ని మన మాటల్లో చెప్పుకుంటున్నాము.  అమ్మవారిని కొలిచే కులాలు ముఖ్యంగా బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులని నాలుగు కులాలు అనాది నుండి వస్తున్నాయి.  

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః|

తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్॥

గీతాచార్యుడు శ్రీకృష్ణభగవానుడు ఇలా అన్నారు. 

 బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య,  శూద్రులు… అనే నాలుగు వర్ణాల సముదాయం గుణకర్మల విభాగాన్ని అనుసరించి నా చేత సృష్టించబడింది.  ఈ రకమైన సృష్టి రచనకు కర్తను నేనే అయినప్పటికీ నాశరహితమైన  నన్ను  అకర్త గానే నువ్వు తెలుసుకో.

గుణకర్మల విభాగాన్ని అనుసరించి వర్ణాల సముదాయం

మానవుడు తాను చేసే వృత్తుల ప్రకారం నాలుగు వర్ణాలుగా భగవంతుడు సృష్టించి నట్లు గీతా చార్యుడు చెపితే, యజుర్వేద పురుష సూక్తంలో కూడా ఈ చాతుర్వర్ణాల గురుంచి ప్రస్తావన ఇలా వచ్చింది: బ్రాహ్మణోఽస్య ముఖ మాసీత్ బాహూ రాజన్య కృతః| ఊరూ తదస్య య ద్వైశ్యః పద్భ్యాగ్ం శూద్రో అజాయత॥॥

భగవానుని విరాట్స్వరూపముయొక్క ముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు,ఊరువుల నుంచి  వైశ్యులు, పాదముల నుండి శూద్రులు ఉద్భవించారు.

అలాంటి ఆ నాలుగు కులాలవారు హోమద్రవ్యాలుగా:

బ్రాహ్మణులు    అయితే  ఆవుపాలు,
క్షత్రియులు అయితే   ఘృతము (నెయ్యి), వైశ్యకులమువారు అయితే మధువు (తేనె), శూద్రులు అయితే  కల్లు/చెఱకు రసము హోమద్రవ్యములుగా ఉపయోగించవలెను. ఇలా వర్ణములను బట్టే కాక, తమ తమ కోర్కెలననుసరించి కూడా హోమ ద్రవ్యములను ఉపయోగించవలెను.

బిల్వ జలం వలన భోగ భాగ్యాలు,
ఆవు పాలతో సర్వ సౌఖ్యాలు,
ఆవు పెరుగుతో ఆరోగ్యం, బలం,
ఆవు నెయ్యితో ఐశ్వర్యాభివృద్ధి,
చెరకు రసం (పంచదార) వలన దుఃఖ నాశనం, ఆకర్షణ,
తేనె  వలన తేజో వృద్ధి,
నువ్వుల నూనె ఉపయోగించితే అపమృత్యు హరణం, రుద్రాక్షోదకం వలన మహా ఐశ్వర్యం, సువర్ణ జలంతో దరిద్ర నాశనం,
అన్నాభిషేకం చేస్తే సుఖ జీవనం,
గంగోదకం వలన సర్వ సమృద్ధి,  సంపదల ప్రాప్తి కస్తూరీ జలంతో చక్రవర్తిత్వం, నేరేడు పండ్ల రసంతో వైరాగ్య ప్రాప్తి, నవరత్న జలోదకంతో ధాన్య గృహ ప్రాప్తి, ద్రాక్ష రసంతో సకల కార్యాభివృద్ధి, నారికేళ జలంతో సర్వ సంపద వృద్ధి
ఖర్జూర రసంతో శత్రు నాశనం
దూర్వోదకం (గరిక జలం) వల ద్రవ్య ప్రాప్తి
ధవళోదకమ్ వలన శివ సాన్నిధ్యం,
మామిడి పండు రసంతో దీర్ఘ వ్యాధి నాశనం, పసుపు, కుంకుమల వలన మంగళ ప్రదం, విభూదితో కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.

ఈ హోమద్రవ్యాలే జగన్మాతకు అమృతము. ఆయా కులము ల వారు సమర్పించే హోమద్రవ్యాలే    (ఆవుపాలు, ఘృతము, మధువు (తేనె), చెఱకు రసము/కల్లు) అమృతతుల్యము. ఆ అమృత తుల్యమైనవంటే  శ్రీమాతకు ప్రియము కనుక  -  ఆ తల్లిని కులామృతైక రసికా అని స్తుతించుచున్నాము.

త్రిపుటి యందలి అమృతరసము ఆస్వాదించుటయందాసక్తురాలు అని భాస్కర రాయలువారు అన్నారు. కులము అంటే సమూహము. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము - ఈ మూడింటినీ త్రిపుటి అంటారు. జ్ఞాత అంటే తెలియువాడు. జ్ఞానము అంటే మోక్ష సంబంధమైన బుద్ధి. జ్ఞేయము అంటే తెలియదగినది. ఈ మూడు ఐక్యమైతేనే అమృతతుల్యమైన ఆనందమనియు, అట్టి ఆనందమే అమ్మకు అత్యంత ప్రీతికరమనియు,   ఆవిధంగా  జగన్మాత త్రిపుటి యందలి అమృతరసము ఆస్వాదించుటయందాసక్తురాలు కనుక కులామృతైక రసికా అను నామాంకిత అయినది. 

కులం అనే పదానికి ఎన్నో అర్థములు ఉన్నవి. ఈ నామ మంత్రాన్ననుసరించి మూడు అర్థాలు తెలియదగును. అందు మొదటిది - : కు అంటే కువలయం అనగా పృథ్వి , లం అంటే లయం. అనగా పృథివీ తత్త్వం లయం అయే చోటు మూలాధార చక్రము. రెండవది: మూలాధార చక్రం నుండి కుండలినీ శక్తి జాగృతమై ఊర్ధ్వముఖంగా బయలుదేరి వెళ్ళు మార్గమును సుషుమ్నా మార్గమును కులం  అంటారు. ఇక మూడవది: సహస్రారంలో ఉండే సహస్రదళ పద్మాన్ని కులపద్మ మని అంటారు. దీనిని బట్టి 1) మూలాధారము,  2) సుషుమ్నామార్గము, 3) సహస్రారపద్మము ఈ మూడింటిని కులమనియు సహస్రారచక్రంలోగల చంద్రమండలం నుండి అమృతధారలు స్రవించుతాయి. అలా స్రవించు అమృతధారలు శరీరంలోని 72000 నాడీ మండలాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఈ విధంగా సహస్రార పద్మంలో ఉండే చంద్రమండలంలో స్రవింపబడే అమృతానికి సుషుమ్నామార్గం అంతా చైతన్యవంతమౌతుంది గనుక, కుండలినీ శక్తి అను అమ్మవారికి ఆ కులామృతం అంటే చాలా ఇష్టం గనుక జగన్మాతను కులామృతైకరసికా అని స్తుతిస్తున్నాము.

ఇదే విషయం ఆదిశంకరులు సౌందర్యలహరిలో 10వ శ్లోకంలో ఇలా అన్నారు.

సుధాధారాసారై-శ్చరణయుగలాంతర్విగలితైః

ప్రపంచం సించన్తీ - పునరపి రసామ్నాయమహసః|

అవాప్య స్వాం భూమిం -  భుజగనిభ మధ్యుష్ట వలయం

స్వమాత్మానం కృత్వా - స్వపిషి కులకుండే కుహరిణి॥

అమ్మా...భగవతీ ( బ్రహ్మరంధ్ర స్థానములో ఉన్న సహస్రార చక్రమందు అయ్యవారితో విహరించు అమ్మ.) నీ పాదద్వయం మధ్యబాగము నుండి స్రవించిన అమృతధారా వర్షములచేత (మనలోని అంతః ప్రపంచమైన) వేల నాడుల ప్రపంచమును తడుపుతున్నదానివై,అమృతాతిశయ కాంతిగల చంద్రుని స్థానమును (బ్రహ్మరంధ్రమును) వీడి, మరలా స్వస్థానమైన మూలాధారమును చేరి,నీ రూపాన్ని నీవే చుట్టుకుని,పామువలె చుట్టలు చుట్టుకుని,పృధివీతత్వమగు మూలాధారమందు,తామరదుద్దు మధ్యలోని సన్నని రంధ్రములో సూక్ష్మముగానున్నదానియందు కుండలినీశక్తిగా నిద్రిస్తూ ఉంటావు.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కులామృతైక రసికాయై నమః అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము 

91వ నామ మంత్రము

ఓం కులసంకేత పాలిన్యై నమః

కులశాస్త్ర, కులాచార రహస్యములను, అర్హులైన ఉపాసకులకు మాత్రమే బోధించు కులసంకేతములను, సాంప్రదీయీకులకు మాత్రమే బోధించు సమయ లేక నియమపాలనను నిర్వహించు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కులసంకేత పాలినీ అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం కులసంకేత పాలిన్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు ఆ తల్లి కృపాకటాక్ష వీక్షణములకు పాత్రుడై బ్రహ్మజ్ఞాన సంపన్నుడై తరించును.

కులశాస్త్ర కులాచార రహస్యములను ఉపాసకులు కానివారికి కాకుండా సాంప్రదాయము ఉండి అర్హత ఉన్నవారికి మాత్రమే బోధించుచున్నట్టి సమయము, నియమము పరిపాలించునది శ్రీమాత.

కులము అంటే కేవలం శ్రీకృష్ణభగవానుడు చెప్పిన వృత్తులననుసరించి ఏర్పడిన నాలుగు వర్ణములవారు కాదు.  ఉపాసింపబడు దేవత, ఉపాసన చేయుసాధకుడు, ఉపాసనకు ఉపయోగించు హోమద్రవ్యములను   బోధించు శాస్త్రమునే కులము అందురు. భవిష్యోత్తర పురాణాలలో  కులము అంటే వంశం కాదు. ఆచారవ్యవహారముల కట్టుబాట్లు కలదే కులము అని చెప్పబడినది. కులపుస్తకాని చ గోపయేదితి  (సౌభాగ్యభాస్కరం, 295వ పుట) అని కల్పసూత్రాలలో చెప్పబడినది. అనగా కులాచారసాంప్రదాయములకు సంబంధించి కుల పుస్తకములను రక్షింపవలెను రక్షించుట అంటే అజ్ఞానులకు,  సాంప్రదాయాలకు నీళ్ళువదిలి, పుక్కిటి పురాణాలతో సంపాదనకోసమే శాస్త్రాలు చదువుతామని చెప్పు బుద్ధిహీనులకు ఈ శాస్త్రములను బోధించకూడదు. సద్గురువుఎప్పుడును మంత్రోపదేశము చేయునపుడు ఆ జిజ్ఞాసి ఇచ్చిన మంత్రమును కాపాడగలడా, సద్వినియోగం చేయగలడా అని ఆలోచిస్తాడు. ఇదే కులసంకేతపాలనము జగన్మాత కులసంకేతపాలనము చేయువారినే గురువులుగా కటాక్షించింది. అటువంటి వారే శిష్యసంతతిని ప్రవర్తింపజేయుదురు. అట్టివారిలోని  వారే ఆదిశంకరులు వంటివారు. వారిద్వారా కులసంకేతరక్షణము చేయుచున్నది గనుక ఆ తల్లి కులసంకేత పాలినీ అను  నామముతో స్తుతిస్తున్నాము. 

ఆచారములు జ్ఞానులకు చెప్పవలసిన పనిలేదు. వారు వారి జ్ఞానమార్గములో పోవుచునే యుందురు. నేను సాంప్రదాయాన్ని అనుసరిస్తాను, కాపాడతాను అంటూ ఐహికమైన కోర్కెలు ఉన్నవారికి ఈ శాస్త్రరహస్యములు చెప్పబడ్డాయి. ఆగమములలో 

1) చక్రసంకేతము, 2) మంత్రసంకేతము, 3) పూజాసంకేతము అని త్రిపురాదేవి సంకేతములు మూడువిధములుగా ఉన్నవి అనిగలదు. చింతామణి స్తవములో 

శ్లో. కులాంగనైషా ప్యథరాజవీథీః ప్రవిశ్య సంకేతగృహాంతరేషు|

విశ్రమ్య విశ్రమ్య పరేణ పుంసా సంగమ్య సంగమ్య రసం ప్రసూత॥ (సౌభాగ్యభాస్కరం, 296వ పుట)

దీని అర్థం పరిశీలించుదాము- కులాంగన (కుండలినీ శక్తి) రాజవీధులందు (సుషుమ్నా మార్గములో) ప్రవేశించి, రహస్య గృహములందు  (షట్చక్రములందు) విశ్రమించి, శ్రేష్ఠపురుషునితో (సహస్రారంలో పరమేశ్వరునితో) సంగమించి, సంగమించి, రసోత్పత్తి చేయుచున్నట్టిది (అమృథధారలను స్రవింపజేయుచున్నది)

కౌళాచారములో అంతయు రహస్యముగా ఉంచాలని శాస్త్రములు ఘోషిస్తున్నవి. అన్నియు రహస్యముగా తెరచాటునే జరపవలయునని చెప్పబడినది. ఉపాస్య,ఉపాసక, ఉపాసనలు చైతన్యస్వరూపములని భావించాలి. సాధకుడు యోగసాధనలో (అంతర్యాగమున) కుండలినీ శక్తిని సుషుమ్నా మార్గమున గొనపోవుచు, షట్చక్రములందు (మూలాధారము -   గుదస్థానమున, స్వాధిష్ఠానము - లింగస్థానమునందు, మణిపూరము - నాభి స్థానమునందు, అనాహతము - హృదయము నందు, విశుద్ధిచక్రము - కంఠస్థానమునందు, ఆజ్ఞాచక్రము - భృకుటి స్థానమునందు) విశ్రాన్తి గొలుపుచూ సహస్రారము చేరి అమృతమును వర్షింపజేయవలెనని  పై శ్లోకంలోని భావము. ఇలా ఉండగా కులస్త్రీ, రహస్యస్థానము, సంకేతము, పరపురుషుడు, సంగమము అనుమాటలను వికృతార్థములుగా తీసికొని వామాచారపరముగా వ్యాఖ్యానించుచున్నారు.

పరశురాముడు కల్పసూత్రము 1 నుండి 30 లో ఇతరవిద్యలు అన్నియు వేశ్యలవలె ధారాళంగా ప్రకటితములు, బహిర్గతములు. శ్రీలలితాంబిక పాతివ్రత్యాది గుణశీల. సర్వాంతర్యామియగు శ్రీవిద్య కులస్త్రీవలె మిక్కిలి గోప్యమైనది. కాన గురువునుండి మాత్రమే గ్రహింపదగు శ్రీవిద్య కోరువారు అత్యంతరహస్యముగా ఉపదేశము తీసికొనవలెను. అందరికీ బహిర్గతము చేయరాదు. ఈ విధమైన కులసంకేతములను పాలనచేయునది శ్రీమాత కనుక ఆ మహాతల్లిని కులసంకేత పాలినీ అని భక్తితో స్తుతిస్తున్నాము. ఈ నామమందలి భావమిది.

శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు పదియవ శ్లోకంలో ఇలా అన్నారు:-

సుధాధారాసారై-శ్చరణయుగలాంతర్విగలితైః

ప్రపంచం సించన్తీ - పునరపి రసామ్నాయమహసః|

అవాప్య స్వాం భూమిం -  భుజగనిభ మధ్యుష్ట వలయం

స్వమాత్మానం కృత్వా - స్వపిషి కులకుండే కుహరిణి || 10 ||

అమ్మా, ఓ పరమేశ్వరీ! ( బ్రహ్మరంధ్ర స్థానములో ఉన్న సహస్రార చక్రమందు అయ్యవారితో విహరించు తల్లి) నీ పాదద్వయం మధ్యబాగము నుండి స్రవించిన అమృతధారా వర్షములచేత (మనలోని అంతః ప్రపంచమైన) వేల నాడుల ప్రపంచమును తడుపుతున్నదానివై, అమృతాతిశయ కాంతిగల చంద్రుని స్థానమును (బ్రహ్మరంధ్రమును) వీడి, మరలా స్వస్థానమైన మూలాధారమును చేరి, నీ రూపాన్ని నీవే చుట్టుకుని, పామువలె చుట్టలు చుట్టుకుని, పృధివీతత్వమగు మూలాధారమందు, తామరదుద్దు మధ్యలోని సన్నని రంధ్రములో సూక్ష్మముగానున్నదానియందు కుండలినీశక్తిగా నిద్రిస్తూ ఉంటావు.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కులసంకేతపాలిన్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

92వ నామ మంత్రము 

ఓం కులాంగనాయై నమః

తల్లిదండ్రులు ఇరువురు  సత్-సాంప్రదాయ వంశ చరితులై, తాను పాతివ్రత్యాది సద్గుణ శీలవతియై, గృహమునందే అత్యంత గోప్యతతో విలసిల్లు కులాంగన వలెనూ, కులశాస్త్ర, కులాచార రహస్యములు ఉపాసకులు కానివారు, అజ్ఞానులు బోధనచేయ బడకయుండు సమయము లేదా నియమ పాలనా కులసంకేతములు గలిగిన శ్రీవిద్య అను కులాంగనా  స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా  సహస్ర నామావళి యందలి కులాంగనా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం కులాంగనాయై నమః అని ఉచ్చరించుచూ శ్రీమాతను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించు భక్తులకు ఆత్మానందానుభూతి కలిగి జగత్తంతా శ్రీవిద్యానిలయమను భావనకలిగి తరించుదురు.

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగ శః అని గీతాచార్యుడు శ్రీకృష్ణభగవానుడు అన్నారు. శ్రీకృష్ణభగవానుడు చెప్పిన బ్రహ్మక్షత్రియవైశ్యశూద్ర అను నాలుగు వర్ణములలో ఒక్కొక్క కులమునకు కొన్ని సాంప్రదాయములు, ఆచారములు ఉంటాయి. ఆ రాజకుమారునకు కులవతియైన కన్యతో వివాహం జరిపించారు అని కథలలోను పురాణాలలోను చదువుతూ ఉంటాము. కులవతి అంటే ఆ కులమునందు పుట్టినదే అయినదే అవుతుంది. తల్లివైపు, తండ్రివైపు సదాచార సంపన్నత, కట్టుబాట్లు, రూపము, విద్య, గుణశీలత వివాహమయిన తరువాత తన భర్త తక్క అన్యమెరుగని పాతివ్రత్యాది గుణశీలత, ఇంటికి వచ్చిన అతిథులకు భర్త ఆదేశాల కనుగుణంగా ఇచ్చు అతిథి సత్కారముల సాంప్రదాయత గల స్త్రీని కులాంగన అని అంటాము.  కులాంగనకు గల ముఖ్యమైన లక్షణములు 

1) స్థూలదేహమనే లక్షణంతో:

కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ|

భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ|

ఇక్కడ కులధర్మపత్ని అను మాటకు కులాంగన సమన్వయింపబడుతుంది.

పై శ్లోకానికి భావం

ఇంటి పనులు చెయ్యడంలో దాసీ మనిషి లాగా, మంచి ఆలోచన ఇచ్చేటప్పుడు మంత్రి లాగా, అలంకరణ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి లాగా, భోజనం పెట్టు నప్పుడు తల్లి లాగా, పడకటింటిలో రంభ లాగా ఈ షట్కర్మ (ఆరు పనులు) లతో ఉండేది ధర్మపత్ని.  ఇక్కడ షట్కర్మ బదులు షద్ధర్మ అని పాఠభేదం కూడా ఉంది.

రాముని ధర్మపత్ని సీతాదేవి హిందూ సమాజంలో స్త్రీ ప్రవర్తనకు, ఆలోచనకు సీత చరిత్ర మార్గదర్శకంగా నిలిచిపోయింది. సీతా దేవి ఎంతో గొప్పగా జీవించింది. సమాజానికి ఒక మర్గదర్శిగా నిలిచింది.

భర్తతో అడవులకు వెళ్ళింది. లంకలో రావణుని గరికతో సమానంగా చూస్తూ, రావణుడు పెట్టిన కష్టాలను భరిస్తూ, తన భర్త తీసుకు వెళతాడనే నమ్మకంతో రావణ సంహారం వరకూ ఎదురు చూసింది. లంక నుండి అయోధ్యకు వెళ్ళునపుడు రామునికి కాక, లోకులకోసం అగ్నిపునీతయై నిలిచింది.

తరువాత ఒక రజకుని మాటకు తల ఒగ్గి రామడు మరల అడవులలోనికి పంపాడు. వాల్మీకి ఆశ్రమంలో లవకుశులను కన్నది. వారికి రాముని గుణగణములన్నియు ప్రబోధించినది. రామునికి తిరిగి తన తనయులను సమర్పించుకుని ఒక కులాంగన గా తన అవతారమును చాలించినది.

ఇది అంతా ఒక కులాంగనయొక్క స్థూలదేహ లక్షణము

2) సూక్ష్మదేహ లక్షణంతో : మూడుముళ్ళతో ఇరువురు ఒకటై, స్త్రీ తన భర్త దేహంలో సగభాగం తీసుకుని అర్థనారీశ్వర తత్త్వానికి ప్రతీక అవుతుంది. తానే తన భర్తయొక్క అంశయనే భావంతో అతని కష్టసుఖాలు తనవిగా భావించుతుంది. బిడ్డను ప్రసవించునపుడు గోచరమయ్యే పేగుబంధం (బిడ్డయొక్క బొడ్డు)  ద్వారా తాను తన భర్తయొక్క అంశ అనే భావన రూఢి అవుతుంది గదా! 

3) పారమార్థిక లక్షణము: తనకు దేవుడు ఇచ్చిన భర్త అనియు, తనను భరించువాడనియు, జీవితాంతం అతనికి నీడ తానని, తనకు  తనభర్తే నీడనే భావంతో అర్థనారీశ్వరతత్త్వానికి మారుపేరుగా నిలుస్తుంది. కడవరకూ అతని కష్టసుఖాలలో నీడగా ఉంటుంది. 

తన భర్తకన్నా ఇంకేమియు లేదని, త్రికరణ శుద్ధిగా భర్తనే అను సరిస్తూ ధర్మపత్నీ సమేతస్య అనెడి తన భర్త చేయు సంకల్పంలో మమేకమవుతూ ఉండే స్త్రీ కులాంగన అనబడుతుంది. అటువంటి రూపంలోనే జగన్మాత విరాజిల్లుతున్నది గనుక కులాంగనా యని స్తుతించుచున్నాము. 

స్వాయంభువ మనువు, శతరూపల కుమార్తె అయిన ప్రసూతి, బ్రహ్మమానస పుత్రుడైన దక్షుని భార్య. దక్షుడు, ప్రసూతిల కుమార్తె జగన్మాత అవతారమైన సతీ దేవి. అంతటి ప్రాశస్త్యమైన కులము (వంశము) జగన్మాతది. ఈమె సాక్షాత్తు పరమేశ్వరుని భార్య. భర్త అయిన పరమేశ్వరుడు అవమానింపబడుట సహించలేక  దక్షుని యజ్ఞకుండంలో దేహాన్ని ఆహుతిచేసుకున్న కులాంగన

హిమవంతుడు పర్వతరాజు. ఇతఁడు మేరువు కూఁతురైన మనోరమ లేక మేనకను పెండ్లాడి ఆమెయందు గంగ అనియు, పార్వతి అనియు ఇరువురు కుమార్తెలను పడసెను. పార్వతికి ఉమ, దుర్గ, కాళి, శక్తి అని అనేక నామములు కలవు. పార్వతి పరమశివుని గూర్చి తపస్సు చేసి అతనిని వివాహమాడి భర్తశరీరంలో సగభాగం తనస్వంతం చేసుకుని అర్ధనారీశ్వర తత్త్వానికి సాక్షిగా నిలిచిన కులాంగన

కులాంగన అంటే పతివ్రత. ఒక పతివ్రత ఇలా కులాచార సాంప్రదాయములతోను, గణనీయమైన వంశచరిత్రలతోను, పాతివ్రత్యాది లక్షణములతోను గృహమే తనస్వర్గసీమగా, అతిగోప్యముగా రక్షింపబడునట్లే,  శ్రీవిద్య కూడా దాచబడుచూ కేవలము సాంప్రదాయము, సంస్కారము, ఉపాసనా లక్షణములు కలిగిన వారికే, ఎవరైతే  శ్రీవిద్యను ఒక కులాంగన వలె రక్షించుదురో వారికే లభించుతుంది. అలాగే  మూలమంత్రాత్మికా స్వరూపిణి, మూలకూటత్రయకళేబరా అని స్తుతింపబడు జగన్మాత కులాంగన అను నామ మంత్రముతో స్తుతింప బడుచున్నది. కులార్ణవతంత్రంలో ఇలా చెప్పారు:

శ్లో. అన్యాస్తు సకలా విద్యాః ప్రకటా గణికా ఇవ

ఇయం తు శాంభవీ విద్యాగుప్తా కులవధూరివ (సౌభాగ్యభాస్కరం, 297వ పుట)

వేశ్యలెట్లు బాహ్యముగా ఉందురో ఇతర విద్యలన్నియు ప్రకటముగా నుండును.  శాంభవీ విద్య (శ్రీవిద్య) మాత్రము కులాంగన వలె రహస్యముగా ఉండవలెను. అందుకే శ్రీమాత శ్రీవిద్యా స్వరూపిణి గనుక శ్రీమాతను కులాంగనా యని నామ మంత్రముతో స్తుతించుచున్నారు.  అంతర్ముఖులకు మాత్రమే శ్రీవిద్య ఉపదేశింపబడును గనుక, శ్రీవిద్యా స్వరూపిణి అయిన శ్రీమాతను అంతర్ముఖసమారాధ్యా అని 870వ నామ మంత్రముతో కూడా స్తుతిస్తాము. అలాగే బహిర్ముఖలైన వారికి జగన్మాత అనుగ్రహము దుర్లభము కనుక బహిర్ముఖసుదుర్లభా అని 871వ నామ మంత్రములో స్తుతిస్తాము.

 గృహస్థు ధర్మమును పాటించునప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో భార్యను, అన్ని సమయాల్లో పరస్త్రీలను (ఇతరుల భార్యలను) మాతృస్వరూపిణిగా భావించువారికి మాత్రమే శ్రీవిద్య పవిత్రముగా లభిస్తుంది, ఉపాసనచేయువారికి శ్రీమాత సాక్షాత్కార భావాన్ని కలుగజేస్తుంది. శ్రీరామకృష్ణ పరమహంస భార్య శారదాదేవిని సాక్షాత్తు కాళికాదేవిగా భావించి ఉపాసించడంజరిగింది.

శ్రీవిద్యాస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కులాంగనాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

93వ నామ మంత్రము 

ఓం కులాంతస్థాయై నమః

విజ్ఞాత, విజ్ఞాన, విజ్ఞేయముల (త్రిపుటి) యందు ప్రమాణ స్వరూపిణిగా, కులశాస్త్రములందు విపులముగా తెలియజేయబడి మరియు ఆ కుల శాస్త్రములెరిగిన వారికి బాగుగా తెలిసియుండు తల్లికి నమస్కారము.

నింగి, నీరు, నేల, నిప్పు, గాలి, పల్లె, నగరము, కారడవి, నడిసముద్రము   ఇందు అందు అని లేక ఉపాసనాసక్తి గల జనులున్న ఏ స్థానము నందైననూ తాను ఉంటూ పూజలందుకొను జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కులాంతస్థా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం కులాంతస్థాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరాశక్తిని అత్యంత భక్తి ప్రపత్తులతో ఉపాసించు సాధకుడు ఆ పరమేశ్వరి కరుణతో ఆత్మానందానుభూతినందును. భౌతికముగా సుఖసంతోషములతో జీవించును.

 కుల అంతః స్థా అనగా కులము నడుమ ఉన్నదని భావము. మూలాధారాది షట్చక్రముల సమూహము నందు శ్రీమాత విరాజిల్లుచున్నది. మూలాధారాది షట్చక్రములయందు  ఆయా అధిష్ఠాన దేవతల రూపంలో జగన్మాత ప్రకాశిస్తున్నది.  మూలాధారమందు  గణపతిగాను, స్వాధిష్టానము నందు బ్రహ్మగాను, మణిపూరక మందు విష్ణువుగాను, అనాహత చక్రముందు రుద్రునిగాను, విశుద్ధ చక్రమునందు జీవునిగాను, ఆజ్ఞాచక్రమునందు ఈశ్వరునిగాను, సహస్రారమునందు  పరమేశ్వరునితోను విరాజిల్లుచున్నది. షట్చక్రములందు ఆయా అధిష్టాన దేవతలరూపం విరాజిల్లుచు షట్కమలముల కులము నడుమ కుండలినీ శక్తిగా కదలుచున్నది గనుక కులాంతస్థా అని స్తుతిస్తున్నాము.

సౌందర్యలహరిలో ఆదిశంకరులు ఇలా చెప్ఫారు.

 సౌందర్యలహరిలో 9వ శ్లోకము

మహీం మూలాధారే - కమపి మణిపూరే హుతవహం

స్థితం స్వధిష్టానే - హృది మరుత మాకాశ ముపరి |

మనో‌உపి భ్రూమధ్యే -  సకలమపి భిత్వా కులపథం

సహస్రారే పద్మే - స హరహసి పత్యా విహరసే ||
 
తల్లీ! మూలాధార చక్రమందలి భూతత్వాన్ని దాటి ,మణిపూరక చక్రం లోని జలతత్వాన్ని దాటి, స్వాదిష్ఠాన చక్రంలోని అగ్నితత్వాన్ని అధిగమించి,అనాహత చక్రంలోని వాయుతత్వాన్ని దాటి,విశుద్ద చక్రంలోని ఆకాశతత్వాన్ని దాటి, ఆజ్ఞాచక్రంలోని మనస్తత్వాన్ని దాటి, సుషుమ్నా మార్గమును ఛేదించి అలా పైకి ప్రయాణించి, సహస్రార పద్మచక్రంలో నీ భర్త అయిన పరమశివునితో కలసి సదా విహరించుచున్నావు.

పంచభూతముల వరుస పృధివ్యాపస్తేజోవాయురాకాశాత్ అన్న ఆధారంతో ఆ తత్వముల వరుసతో ఇచట చక్రములను చూపుట జరిగినది. అసలు మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రముల వరుసక్రమంలో  అమ్మ మన శరీరంలో గుద లింగ,మధ్యస్థానాల్లో మూడు చక్రాలు, హృదయ, కంఠ, భ్రూమధ్య స్థానాల్లో మూడు చక్రాలు మొత్తం ఆరు చక్రముల పైన, బ్రహ్మరంధ్ర ప్రదేశములో ఉన్న సహస్రారచక్రంలో అమ్మ శివునితో కలసి విహరించుచుండును.

ఇక్కడ కులము అనగా ఆచార, వ్యవహార, సాంప్రదాయాల ప్రకారము కులమనియు, కులమనగా షట్చక్రములు మరియు సుషుమ్నా మార్గమనియు, గురువంశ పరంపరను కూడా కులమనియు అందురు.

మూలాధారమును కులస్థానమందురు. కుః పృథ్వీ తత్త్వం యత్రలీయతే తత్కులమ్, మూలాధారాంతరస్థితా కులాంగనా, సజాతీయానామ్  మూలాధారాది ఆజ్ఞాంతానాం కమలానాం సమూహోవా కులమ్॥

మూలాధార నుండి ఆజ్ఞ వరకూ గల కమలములు. అనగా షట్చక్రములకు షట్కమలములు అని అందురు. వాటికి దళములుండును. ఎందుకంటే మొదట ఆ కమలములు మొగ్గలవలె ఉండగా కుండిలినీ జాగృతముతో ఆ షట్కమలములు వికసించును.  ఆ షట్కమలములు వికసించుచున్నకొలదీ సాధకునికి దివ్యజ్ఞాన బోధ అర్థమవుతుంది. 

మూలాధారాది షట్కమలమ్ముల నెమ్మదిగా నేదాటి వచ్చితిని ధన్యోస్మి అని ఒక సాధకుడు అమ్మవారి దర్శనం సహస్రారంలో లభించినప్పుడు తన్మయంగా ఆలపించిన గీతం ఇది. మూలాధారాది షట్చక్రములు, బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులు, సుషుమ్నా మార్గము - ఈ సమూహమును కులమందురు. అటువంటి కులము నడుమన ఉండుటచే జగన్మాతను కులాంతస్థా అని స్తుతిస్తున్నాము. సరిగ్గా శ్రీసూక్తంలో శ్రియం' వాసయ' మే కులే మాతరం' పద్మమాలి'నీమ్  అని చెప్పిన ప్రకారం 'శ్రీమాత పద్మముల మాలవలె ఉన్న షట్చక్ర కమల కులము నడుమ ఉన్నది' అని భావము. 

శ్రీసూక్తంలో వేరొక చోట అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినా''ద-ప్రబోధి'నీమ్ అనుశ్లోకంలో  అశ్వపూర్వాం అనగా అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభి రావృతా (67వ నామ మంత్రము), అశ్వారూఢ దేవతయు, రథమధ్యాం అనగా
చక్రరాజ రథము, గేయచక్ర రథము, కిరిచక్ర రథములు ఈ క్రింది నామ మంత్రములలో  ప్రస్తావనకు వచ్చినవి.

68వ నామ మంత్రము చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా 
69వ నామ మంత్రము: గేయచక్రా రథారూఢ మంత్రిణీ పరిసేవితా

70 వ నామ మంత్రము కిరిచక్ర రథారూఢ దండనాథ పరిష్కృతా

హస్తినాద ప్రబోధినీమ్ అనగా 66వ నామ మంత్రము సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితా అనగా గజసేనా నాయకురాలు సంపత్కరీ దేవి ప్రస్తావనకు వచ్చినది.

దీనిని బట్టి శ్రీసూక్తం, శ్రీవిద్య, శ్రీచక్రం,     శ్రీలలితా సహస్రం ఇవి అన్నియు ఒక   సజాతీయ సమూహమై, అది ఒక కులముగా, అట్టి కులము నడుమన శ్రీమాత ఉండుటచే ఆ తల్లి కులాంతస్థా అను నామముచే స్తుతింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కులాంతస్థాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము 

94వ నామ మంత్రము

ఓం కౌళిన్యై నమః

కుల, అకులముల సామరస్య స్వరూపిణిగాను, శాక్తేయులకు కులదేవతా స్వరూపిణిగాను ఆరాధింపబడు శక్తి స్వరూపిణికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కౌళినీ అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం కౌళిన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు జగన్మాత సర్వాభీష్టములను నెరవేర్చి సుఖసంతోషములతో జీవనమును ప్రసాదించును.

మానవ దేహంలో బ్రహ్మరంధ్రమునకు దిగువలో ఉన్న సహస్రారంలో తెల్లని రంగు ఉన్న వేయిదళముల కమలము ఉన్నది. అదే విధంగా మూలాధారము (గుదస్థానంలో) లో ఎర్రగా రక్తవర్ణంలో సహస్రదళ కమలము ఉన్నది. ఈ రెండిటిలో  ఎర్రని కమలము కులము అనీ, తెల్లని కమలమును అకులము అనియు అందురు. 

శ్లో. కులం శక్తిరితి ప్రోక్తం కులం హి శివముచ్యతే|

కులాకులత్వ సంబంధః కౌలమిత్యభిధీయతే॥ (సౌభాగ్యభాస్కరం, 298వ పుట)

కులము అంటే శక్తి, అకులము అంటే శివుడు.  ఈ శివశక్తుల సంకేతములతో ఏర్పడిన సామరస్య స్వరూపమునే కౌళిని అందురు.

కులము నకు విశ్వనిఘంటువులో పరిశీలించగా 1) దేశము, 2) గృహము, 3) సజాతీయ సముదాయము, 4) గోత్రము, 5) దేహము అను అర్థములు గలవు.

భవిష్యపురాణములోని ఈ శ్లోకమును పరిశీలించుదాము. 

పూజనీయ జనై ర్దేవీ స్థానే స్థానే పురే పురే|

గృహే శక్తి పరై ర్గ్రామే గ్రామే వనే వనే॥

అనగా జగన్మాత ప్రతీ పట్టణమందు, గృహము నందు, ప్రతీ గ్రామమునందు, ప్రతీ వనమునందు, ప్రతీ దేహము నందు  ఎల్లచోట్లా పూజింపబడుతున్నది.

అమ్మవారిని పూజించే విధానంలో నాలుగు రకములు గలవు.

1) సమయాచారము , 2) కౌళాచారము, 3) దక్షిణాచారము, వామాచారము. ఇందులో సమయాచారము, దక్షిణాచారము ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. అలాగే  కౌళాచారము, వామాచారము ఒక మాదిరిగా ఉంటాయి. సమయాచారము సాంప్రదాయ సిద్ధముగా, వైదికముగా ఉంటే, కౌళాచారము మూలాధార శక్తికి ప్రాధాన్యతనిస్తారు. వామాచారులు కేవలం బాహ్యపూజలకే ప్రాధాన్యథ నిస్తారు. ఇందులో మంత్రములకన్నా  తంత్రయుక్తమైన ప్రాధాన్యతే ఉంటుంది. కౌళాచారములో జంతుబలులు, మద్యము సమర్ఫించడం, పూనకము వచ్చినట్లు అనుభూతినందడం, గరగలు, ఘటాలు, అమ్మవారి సంబరాలు వంటివి అన్నియు కౌళాచార సంబంధమైసవే.  అమ్మవారు గ్రామ దేవతల స్వరూపంలోను, ఆరాధనలో వేపచెట్లు, పానకములు, ఎర్రనీరు వంటివి ఎన్నోరకాలు ఉంటాయి. గ్రామాలలోని అమ్మవారి పండుగలు ఈ కోవకు చెందినవే. అమ్మవారు కూడా ఎన్నో గ్రామదేవతల పేర్లతో ఆరాధింపబడుతుంది. 

ఏదిఏమైనా జగన్మాత కులదేవత రూపంలో కౌళాచారులచే ఆరాధింపబడుతుంది గనుక శ్రీమాత కౌళిని అని నామప్రసిద్ధమైనది. 

సహస్రారంలోని తెల్లకమలము (అకులము - శివుడు), మూలాధారంలోని ఎర్రకమలము (కులము - శక్తి) గా శివశక్తుల సామరస్యభావాన్ని తెలుపుతూ కులవిద్యా స్వరూపిణియై కౌళిని అని కొనియాడబడుచున్నది.

కౌళినీ స్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కౌళిన్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

95వ నామ మంత్రము  

ఓం కులయోగిన్యై నమః

వామాచారులచే మూలాధారశక్తి ప్రాధాన్యతా క్రమంలో కుండలినీ యోగదేవతా స్వరూపిణి లేదా కులయోగినీ స్వరూపిణిగా ఆరాధింపబడు పరాశక్తికి నమస్కారము.

శ్రీచక్రమునందు, బహిర్దశారములో (పంచమావరణములో) గల కులోత్తీర్ణయోగినుల (కులయోగినుల) స్వరూపముతో విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కులయోగినీ అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం కులయోగిన్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరాశక్తిని ఆరాధనచేయు భక్తులకు సర్వాభీష్ట సిద్ధి కలుగును.

ఇంతకు ముందు నామములలో కులము అను పదానికి అనేక అర్థములు తెలిసికొని యున్నాము. 

మనం ఖడ్గమాలా స్తోత్రం పఠించునప్ఫుడు తొమ్మిది ఆవరణలలో యోగినులను స్మరిస్తూ ఉంటాము. ఆ యోగినులు ఆయా ఆవరణలకు ఆవరణాధిదేవతలు కూడా గలరు. 1)ప్రథమావరణలో (భూపురంలో) ప్రకటయోగినులు, 2) ద్వితీయావరణంలో (షోడశదళంలో ) గుప్తయోగినులు, 3) తృతీయావరణలలో (అష్టదళంలో) గుప్తతరయోగినులు, 4) చతుర్ధావరణలో (మన్వస్రములో) సంప్రదాయయోగినులు, 5) పంచమావరణములో (బహిర్దశారములో) కులోత్తీర్ణయోగినులు - వీరే కులయోగినులు, 6) షష్టావరణంలో (అంతర్దశారములో)   నిగర్భయోగినులు, 7) సప్తమావరణంలో (అష్టకోణములో) రహస్యయోగినులు, 8) అష్టమావరణంలో (త్రికోణములో) అతిరహస్యయోగినులు, 9) తొమ్మిదవ ఆవరణంలో (బిందువులో/సర్వానందమయ చక్రంలో) పరాపర రహస్యయోగినులు ఉందురు.

పైన పంచమావరణములో (బహిర్దశావరములో)  కులోత్తీర్ణయోగినులు గలరని తెలుసుకున్నాంగదా. ఆ కులోత్తీర్ణయోగినుల పేర్లు ఖడ్గమాలలో ఇలా చదువుతాము సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమనీ, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ - ఈ యోగినులందరూ కులోత్తీర్ణయోగినులు లేదా కులయోగినులు అందరు. జగన్మాత ఈ కులయోగినుల స్వరూపంలో విరాజిల్లుతుంది గనుక  ఆ తల్లిని కులయోగినీ అను నామంతో స్తుతించుచున్నాము.

వామాచారులు లేదా కౌళాచారులు అనగా మూలాధారశక్తికి వీరు చేయు పూజలో ప్రాధాన్యతను ఇస్తారు. మూలాధారంలో ఉన్నకుండలినీ శక్తిని కులదేవతగా భౌతికారాధన చేస్తారు. సమయాచారులు దహరాకాశములో శ్రీచక్రమును ప్రతిష్టిస్తే వామాచారులు బాహ్యాకాశమందు శ్రీచక్రమును లిఖింతురు. అలా బాహ్యాకాశంలోని శ్రీచక్రమునకు పూజలు చేయుదురు.  కులామృతైకరసికా అను (90వ) నామ మంత్రము నుండి కులయోగినీ అను (95వ) నామ మంత్రము వరకూ కౌళాచార సాంప్రదాయము అను బహిర్యాగ పద్ధతి ప్రస్తావన వస్తే, అకులా (96వ) నామ మంత్రము నుండి బిసతంతు తనీయసీ అను (111వ) నామ మంత్రము వరకూ - మొత్తం 16 నామములు సమయాచార పద్ధతి (అంతర్యాగ పద్ధతి) వరకూ ప్రస్తావింపబడుతుంది.

కులశబ్దార్ధములతో సంబంధము గలదియు, బహిర్యాగ పద్ధతిలో మూలాధారశక్తికి పద్ధతికి ప్రాధాన్యతనిచ్చే కుండలినీ శక్తి అనబడే కులయోగినిని కౌలాచారులు ఆరాధించుదురు గనుకను, బహిర్దశారములో (ఐదవ ఆవరణంలో) గల కులోత్తీర్ణయోగినులు (కులయోగినుల) స్వరూపంతో జగన్మాత విరాజిల్లుచున్నది గనుక అమ్మవారు కులయోగినీ అని నామ ప్రసిద్ధమైనది. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కులయోగిన్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

96

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

97వ నామ మంత్రము 

ఓం సమయాంతస్థాయై నమః

ప్రాచీన వైదిక గ్రంథములందు నిర్ణయింపబడిన ఆంతరిక ఆరాధనకు ప్రాధాన్యమిచ్చే వైదికులచే (సమయాచారులచే లేదా దక్షిణాచారులచే) ఆరాధింపబడు తల్లికి నమస్కారము.

హృదయ మధ్యమునందు గల దహరాకాశంలో భావింపబడిన శ్రీచక్రమునందలి పూజాదిక (సమయా) స్వరూపిణిగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సమయాన్తస్థా అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం సమయాంతస్థాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకుడు ఆత్మానందానుభూతిని పొందితినని, తరించితినని ఆనందించును

శ్రీమాతను ఉపాసించుటలో 1) సమయాచారులు, 2) దక్షిణాచారుయు, 3) కౌళాచారులు, 4) వామాచారులు అని నాలుగు విధములైన ఉపాసనలుగలవు. అయినను ఇందులో సమయాచారులు, దక్షిణాచారులు అను ఈ రెండు ఉపాసనాక్రమములు స్థూలంగా ఒకే విధానము. అలాగే కౌలాచారులు, వామాచారులు అనినను కూడా ఇంచుమించుగా ఒకటే. సమయాచారమునందు ప్రాచీన వైదిక సాంప్రదాయ గ్రంథములందు ఆంతరిక ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే వైదికులచే  శ్రీమాత ఉపాసింపబడుచున్నది. వీరినే సమయాచారులు లేదా దక్షిణాచారులు అని అందురు.

హృదయమధ్యమునందు గల దహరాకాశంలో శ్రీచక్రమున్నదని భావించి ఉపాసన చేయుదురు. దీనినే సమయమని యు,  అలాపూజలందుకొను దేవత పేరే సమయ అనియు, ఈ ఉపాసకులనే సమయాచారులనియు అందురు. ఇంకను వసిష్ఠతన్త్రము, శుకతన్త్రము, సనకతన్త్రము, సనన్దనతన్త్రము, సనత్కుమారతన్త్రము అనే ఈ అయిదు తంత్రములు కూడా దహరశ్రీచక్ర భావనా పూజాదులను బోధించుచున్నవి. వీనికి కూడా సమయము అని అంటారు. దహరశ్రీచక్రపూజాదులందు ఉండుటచేతను, ఈ వసిష్ఠ, శుక, సనక, సనన్దన, సనత్కుమార అను ఈ తంత్రపంచకములో బోధింపబడుచున్నది గనుక శ్రీమాత సమయాన్తస్థా అను నామ మంత్రముతో స్తుతింపబడుచున్నది.  సమయాచార ఉపాసనయందు దహరాకాశము నందు (హృదయాకాశము - అంతస్సూత్రంగా) మనలోనే ఉండి తనకు కావలసిన సమయములందు ఉపాసకులచే తనకు కావలసిన పనులు చేయించుకుంటుంది గనక శ్రీమాతను సమయాంతస్థా అని స్తుతించుచున్నాము. ఈ సమయ మను శబ్దముసందు శివశక్తులు ఇరువురును సామ్యమును అనగా కలియుటను పొందియున్నారని గ్రహింపదగును. ఈ శివశక్తుల సామ్యము ఐదు విధములు 

1) అధిష్ఠాన సామ్యము - శ్రీచక్రమునందు శివశక్తులు ఇద్దరూ ఉండి ఉపాసింపబడతారు.

2) అనుష్ఠాన సామ్యము సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు అనే పంచకృత్యములయందు సామ్యము.

3) అవస్థాన సామ్యము అనగా నాట్యాది క్రియలయందు సామ్యము.

4) నామ సామ్యము అనగా శివ-శివా, భైరవ-భైరవీ మొదలైన పేర్లలో ఇద్దరినీ తెలియజేయుట.

5) రూప సామ్యము అనగా ఇద్దరూ రూపవంతులే. అరుణవర్ణంగాని, తలపై నెలవంకగానీ, మూడుకన్నులు - ఇది రూపసామ్యము.

ఇన్ని కారణములచే జగన్మాత సమయాన్తస్థా లేదా సమయాంతస్థా అని స్తుతింపబడుచున్నది. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సమయాంతస్థాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

98వ నామ మంత్రము 

ఓం సమయాచార తత్పరాయై నమః

గురువుల వద్ద మహావేధ అను సంస్కారమును పొంది, షట్చక్రబేధనము, చతుర్విధైక్యసంధానము తెలిసికొని, ఆ క్రమములో శ్రీమాతను ఉపాసించు అంతర్యాగ క్రమము అనినచో (సమయాచారములందు) ఆసక్తిగలిగియున్న జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సమయాచార తత్పరా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీమాతను ఉపాసించు సాధకుడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడై, భౌతిక సుఖసంతోషములతోపాటు, ఆధ్యాత్మికానందమును సంప్రాప్తము  చేసికొని, ఆ పరాశక్తి సేవలో కొనసాగుచు ధన్యజీవియై తరించును.

సమయాచారము అనునది ప్రాచీన వైదిక సాంప్రదాయ గ్రంథములందు విపులీకరించిన విధానము. పూర్ణదీక్షను పొందిన సాధకునికి గురుకటాక్షము వలన షడ్విధైక్యము గాని, చతుర్విధైక్యముగాని అనుసంధానము చేయుశక్తి కలుగును. ఈ అనుసంధానము క్రమముగా దృఢపడి, మహానవమినాడు మహావేధయను ఒక సంస్కారము సంప్రాప్తించును.

షడ్విధైక్యము అనిన ఏమిటి?

ఇది ఆరువిధములు గనుక షడ్విధైక్యము అని చెప్పబడినది. ఇందులో 1) శ్రీచక్రము, 2) అకారాది క్షకారాంత వర్ణమాతృక, 3) పంచదశీవిద్య, 4) లలితాదేవత, 5)  బ్రహ్మాండము, 6) పిండాండము. ఈ ఆరింటికి ఏకత్వమును పొందుటయే షడ్విధైక్యమగును. ఈ  ఆరింటిలో ఎక్కడ ఈ ఐక్యమును ప్రారంభించవలెననునది కేవలం గురువులద్వారా తెలియవలసియున్నది. 

చతుర్విధైక్యము అనగా....

1) పరదేవతా శ్రీచక్రములకు ఏకత్వము, 2) శ్రీచక్ర బ్రహ్మాండములకు ఏకత్వము, 3) బ్రహ్మాండ పిండాండములకు ఏకత్వము, 4)  వర్ణమాతృకా దేవతల ఏకత్వము. ఇదికూడా గురుముఖతా తెలియవలసియుండును.

గురుకటాక్షము వలన చతుర్విధైక్యముగాని, షడ్విధైక్యముగాని  అనుసంధానము చేయుశక్తి కలిగిన తరువాత, ఆ అనుసంధానము దృఢపడి మహావేధయను ఒక సంస్కారము మహానవమినాడు కలుగుతుంది. ఈ సమయాచారంలో మూలాధారమునుండి బయలుదేరిన కుండలినీ శక్తి మణిపూరచక్రమునకు చేరుతుంది. అక్కడ ఆ కుండలినీ శక్తికి పాద్యాది  అలంకార సమర్పణమువరకు గల ఉపచారములచే పూజించి, అక్కడ నుండి అనాహత చక్రమందు భోజన తాంబూలాంతము వఱకు గల ఉపచారములతో పూజింపబడి, అక్కడ నుండి దేవిని (కుండలినీ శక్తి) విశుద్ధచక్రమునకు తీసికొనివెళ్ళి అచ్చట ఉన్న చంద్రకళా స్వరూపములైన మణులతో పూజించి అక్కడనుండి ఆజ్ఞాచక్రమున ప్రవేశింపజేసి, అచ్చట నీరాజనము సమర్పించి అక్కడనుండి తేనెటీగలతోను, మకరందము (మద్యము) తోను నిండియున్న సహస్రార కమలమున ప్రవేశింపజేసి, సహస్రారంలో ఉన్న సదాశివునితో ఐక్యముచేసి, ఆ శివ,శక్తులు కనుపించకుండునట్లు ఒక వస్త్రమును తెరగా ఉంచి, ఈ సాధకుడు మఱియొక గదిలో ఉండి,  శ్రీమాత శంకరుని విడిచిపెట్టి, బయలుదేరి మూలాధారములో ప్రవేశించువరకూ అక్కడనే సాధకుడు సమయము కొఱకు వేచియుండట జరుగును. దీనినే సమయాచారము అందురు. ఇదియంతయు రుద్రయామళమందు పది పటలములతో ఉపదేశింపబడిన సమయాచారము అని యందురు.

దీనినే భాస్కరరాయలు వారు ఇలా అన్నారు.

దీక్షగలవాడు (సాధకుడు) మూలాధారమునుండి సహస్రారమువరకూ దేవిని తీసుకొనివెళ్ళి శివునితో కలిపి, తెరవేసి, వేరొకచోటినుండి దేవి ఎప్పుడు వచ్చునో యని వచ్చుసమయము వరకు కనిపెట్టుకొని చేయు ఆచారమునందు ఆసక్తి గలిగినది శ్రీమాత

సమయాచారమునందు కేవలం అంతర్ముఖధ్యానము, దీక్ష, శ్రద్ధ, ఏకాగ్రత ముఖ్యమైనవి.  సమయాచారంలో అంతర్ముఖ సాధన తప్ప, భయంకరమనిపించే జంతువుల మెడలు నరకడం, అవి నేలపై విలవిలలాడుతుంటే కేరింతలు కొట్టడం, ఆ జంతువుల మాంసముతోబాటు కల్లు, గంజాయి వంటి మాదక ద్రవ్య సమర్పణ, పూనకములు, ఘటములు, గరగలు వంటి ఆవేశపూరిత చర్యలు ఉండవు. ఉపాసకుడు సమయాచార విధానములో చెప్పిన  పూజా ద్రవ్యాలు  ఉఫాసకుడిని సూక్ష్మలోకాలలో విహరింప జేయును. అందుకే అంతర్ముఖసమారాధ్యా (870వ నామ మంత్రము) బహిర్ముఖ సుదుర్లభా (871వ నామ మంత్రము) అను నామ మంత్రములలో అంతర్ముఖధ్యానంలో దేవి అనుగ్రహం ఎంత సులువుగా లభిస్తుందో బహిర్ముఖధ్యానంలో అంతకష్టము అని తెలియును.

ఇంతకు ముందు నామ మంత్రములో శివశక్తులకు పంచసామ్యమున్నదని చెప్ఫినది కూడా సమయాచారమే.

ఈ శివశక్తుల పంచసామ్యములు.

1) అధిష్ఠాన సామ్యము - శ్రీచక్రమునందు శివశక్తులు ఇద్దరూ ఉండి ఉపాసింపబడతారు.

2) అనుష్ఠాన సామ్యము సృష్టి,, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు అనే పంచకృత్యములయందు సామ్యము.

3) అవస్థాన సామ్యము అనగా నాట్యాది క్రియలయందు సామ్యము.

4) నామ సామ్యము అనగా శివ-శివా, భైరవ-భైరవీ మొదలైన పేర్లలో ఇద్దరినీ తెలియజేయుట.

5) రూప సామ్యము అనగా ఇద్దరూ రూపవంతులే. అరుణవర్ణంగాని, తలపై నెలవంకగానీ, మూడుకన్నులు - ఇది రూపసామ్యము.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సమయాచార తత్పరాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

99వ నామ మంత్రము 

ఓం మూలాధారైక నిలయాయై నమః

సుషుమ్నానాడి బయలుదేరు మూల స్థానమునందు చతుర్దళపద్మములో (మూలాధార చక్రమునందు) కుండలినీ శక్తి స్వరూపిణియై విలసిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మూలాధారైక నిలయా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మూలాధారైక నిలయాయై నమః

అని ఉచ్చరించుచూ ఆ జగన్నాతను అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో ఉపాసించు సాధకుడు నిశ్చయముగా ఆ శ్రీమాత కృపాకటాక్షములకు పాత్రుడై అద్వైత తత్త్వమును గ్రహించి బ్రహ్మానంద భరితుడగును.

 షట్చక్రములలో మొదటిది మూలాధారచక్రము.  గుద స్థానమునకు పైన, లింగ స్థానమునకు క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. దీని బీజ మంత్రం లం మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆ లింగము చుట్టును తామరతూడులోని దారము (బిసతంతు తనీయసీ - 111వ నామ మంత్రము) వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొని యున్నదనియు, వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.

నాలుగు దళముల మూలాధార పద్మమందు కులకుండమను బిందువులో  ముఖమును కప్పుకొని నిద్రావస్థలో నున్న  కుండలినీ దేవి యుండును. సుషుమ్నానాడి బయలుదేరు మూలస్థానమునందు, కుండలినీదేవి యుండుటకు మూలాధారము కనుకను,  ఉపాసకుడు తన యోగసాధనలో  నిద్రాణమైయున్న కుండలినీ శక్తిని జాగృతముచేసి షట్చక్రముల నధిగమించి సహస్రారము చేర్చు సుషుమ్నామార్గముయొక్క మూలస్థానములో గల ఈ చతుర్దళ  పద్మమునకు మూలాధార చక్రమనియు, షట్చక్రములలో మొదటిదైన కుండలినీశక్తి  సాధకుడు జాగృతము చేయగా సహస్రారమువరకూ పయనించి మరియు మూలాధారమునకు తిరిగి చేరుటచే మూలాధారమే కుండలినీశక్తి స్వస్థానమగుటచేత కుండలినీ శక్తి రూపములో నున్న శ్రీమాత మూలాధారైక నిలయా అని నామ ప్రసిద్ధమైనది.

సాధారణముగా కుండలినీ శక్తి మూలాధారంలో నిద్రాణమై యుండును. అందుకే జీవుడు అరిషడ్వర్గములకు లోబడి, నేను, నాది అను భావనతో ప్రాపంచిక సుఖములవైపు ఊగులాడు చుండును. యోగసాధనలో కుండలినీ శక్తి జాగృతమై షట్చక్రములధిగమించి సహస్రారముచేరుటతో అక్కడగల అమృతధారలలో తడిసిముద్దయి పరమార్థం తెలిసి నేను, నాది అనే భ్రాంతి నశించి పరబ్రహ్మము వైపు తిరుగుతాడు.

సుషమ్నా మార్గమునకు మూలస్థానమగుటచేత, షట్చక్రములకు మొదటి చక్రమగుతట చేత, ఇక్కడ తొలి పూజలందుకొను  విఘ్నేశ్వరుడు అగుటచేత ఈ చతుర్దళ పద్మము మూలాధారచక్రముగాను, అట్టి మూలాధారమునందు కుండలినీ శక్తి రూపంలో ఉండు దేవి మూలాధారైకనిలయా అని స్తుతింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు  ఓం మూలాధారైకనిలయాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

100వ నామ మంత్రము 

ఓం బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమః

మూలాధారము నందు జాగృతమై బయలుదేరి స్వాధిష్ఠాన సంబంధమైన బ్రహ్మగ్రంథిని భేదిస్తూ, సాధకుని బుద్ధిని ఆవహించి యున్న మాయ తొలగి, స్వస్వరూపజ్ఞాన ప్రకాశమునకు సంకేతముగా విరాజిల్లు కుండడలినీ శక్తి స్వరూపిణియైన పరాశక్తికి నమస్కారము.

 శ్రీలలితా సహస్ర నామావళి యందలి బ్రహ్మగ్రంథి విభేదినీ అను  (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమః అని ఉచ్చరిస్తూ ఆ పరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు ఉపాసకునికి ఆ తల్లి ఆత్మజ్ఞానానుభూతిని కలుగజేసి తరింపజేయును.

గ్రంథి అంటే ముడి.మూలాధారాది షట్చక్రములలో మూడు చక్రములందు ఆద్యంతములలో రెండేసి చొప్పున గ్రంథులు ఉండును. ఈ బ్రహ్మగ్రంథులు స్వాధిష్ఠాన చక్రమందుండును. అనగా మూలాధార స్వాధిష్థాన చక్రములు రెండింటికి పైన ఒక గ్రంథియు, స్వాధిష్ఠానచక్రమునకు క్రింద ఒక గ్రంథియు ఉండును. ఈ రెండు గ్రంథులకును కలిపి బ్రహ్మగ్రంథి యని పేరు. రెండేసి చక్రములకు ఒక్కొక్క గ్రంథియుండును. మానవుని బుద్ధిని ఆవహించి  మాయ ఉండును. నేను, నాది, నావాళ్ళు అను మాయలో కొట్టుమిట్టాడుతూ భౌతిక సుఖములవైపు దృష్టి సారించి యుండును. ధనము సంపాదించాలి. వస్తు వాహనాలు కొనుక్కోవాలి. నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు అను దృష్టితప్ప వేరేమి ఎరుగని స్థితిలో ఉండును. సత్యమైనది, నిత్యమైనది పరమాత్మ ఒకటి గలదు. అక్కడ ఉండే ఆనందం ఈ భౌతికవ్యామోహములకన్నా అతీతమైనది అన్న ఆలోచన ఉండదు. సాధకుడు తన యోగశక్తితో మూలాధారమందు నిద్రాణమై, మూడున్నర చుట్టలు చుట్టుకొనియున్న కుండలినీ శక్తిని జాగృతము చేసి ఊర్ధ్వముఖముగా  నడిపిస్తే ముందుగా భేదింపబడునది బ్రహ్మగ్రంథి. ఈ బ్రహ్మగ్రంథి భేదింప బడడంతో బుద్ధిని ఆవహించి ఉన్న మాయ తొలగుతుంది. స్వస్వరూప జ్ఞానము  కలుగుతుంది.  సృష్ట్యాది సంబంధములు భేదింపబడతాయి. అన్ని ఆనందాలను మించిన బ్రహ్మానందము ఒకటి ఉందనియు, పునర్జన్మరహితమైన ముక్తి అక్కడ లభించుననియు గ్రహించుతాడు. కుండలినీ శక్తి రూపిణియైన జగన్మాత బ్రహ్మగ్రంథి భేదనము చేసి  జీవునికి బుద్ధిని ఆవహించిన మాయను తొలగించి, స్వస్వరూప జ్ఞానమును కలిగించుతుంది గనుక ఆ పరమేశ్వరి బ్రహ్మగ్రంథి విభేదినీ యని స్తుతింపబడుతున్నది. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹






నామపారాయణప్రీతా

శ్రీలలితా సహస్ర నామములలో నామపారాయణప్రీతా యను నామములో శ్రీభాస్కరరాయలు వారు ఇచ్చిన సూచనల మేరకు సంస్కృత వర్ణమాల ఆధారంగా నాచే కూర్చబడిన కేవలం బీజాక్షరములు మాత్రమేగల 20,736 నామములు ఉన్న పుస్తకం ముద్రణకు సిద్ధమైనది.  ఈ పుస్తకములను నేను అమ్మ వారి పాదములవద్ద ఉంచి తొమ్మిది రోజులు  పూజింపబడిన పుస్తకముగా భక్తులకు సమర్పింపబడుతుంది. మొత్తం పుస్తకాలకు పూజ, హోమం మరియు పండితులచే చెప్పబడిన ఇతర వైదిక సంస్కరణలు పండితులచే చేయబడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని తమ ఇంటిలో అమ్మవారి పాదముల వద్ద ఉంచి పూజించుకొనవచ్చును మరియు 20736 నామములు పారాయణము ఈ క్రిందివిధముగా (భాస్కరరాయలువారు సెలవిచ్చిన రీతిలో) చేయవచ్చును. ఎందుకంటే అన్ని నామములు బీజాక్షరములతో భాస్కరరాయలువారు చెప్పినవిధంగా కూర్చబడినది. మొత్తం నామములు 20736. ఈ నామములు పదకొండురోజులు, పదిహేనురోజులు, ఇరువది ఒక్కరోజు, పౌర్ణమినుండి ప్రారంభించి మరల పౌర్ణమి వరకూ, లేదా మండల దీక్షతో పారాయణ చేయవచ్చును. ఈ విషయం పండితులు విన్నవించినదే. సౌభాగ్యభాస్కరంలో కూడా భాస్కరరాయలువారు ఈ క్రింది విధముగా చెప్పియున్నారు. 

ఈ విషయమంతయును భాస్కరరాయలువారు వ్రాసిన సౌభాగ్యభాస్కరంలో 841, 842 పేజీలలో వివరించబడినది.

సౌభాగ్యభాస్కరం వ్రాసినవారు భాస్కరరాయలువారు. అమ్మవారు వీరిచే వ్రాయించుకొన్నది అని విజ్ఞులు చెప్పియున్నారు.

1.అన్ని నామములు (20736) ఒకే రోజు పారాయణము చేయుట.

2. అన్ని నామములు (20736) వారం రోజులలో పారాయణము చేయుట.

3. అన్ని నామములు (20736) పదీహేను రోజులలో పారాయణము చేయుట.

4. అన్ని నామములు (20736)  30 రోజులలో పారాయణము చేయుట.

 5. అన్ని నామములు (20736)  36 రోజులలో పారాయణము చేయుట.

నామపారాయణ కర్మమనగా ఇదే.

యోగరూఢిచే  నామ పారాయణము అనగా ఈ నామములకే చెల్లును.

యౌగికార్థముచే ఇవికూడ నామములే యగును.

గనుక నామపారాయణ శబ్దముచే వీనిని గూడ యౌగికముగా గ్రహించవచ్చును.

ఈ పుస్తకం కావలసిన వారు ఈ క్రింది ఫోన్ నంబరుకు సంప్రదించగలరు.




దేవతాశ్చ శృణు ప్రాజ్ఞ నామ యచ్ఛృణ్వతాం జయః॥ 3,20.1॥ (లలితోపాఖ్యానం)

ఈ కిరిచక్రరథమునందు గల పర్వములందు (అంతస్తు లందు) వివిధ దేవతలు ఆయుధాలు ధరించి ఉందురు.

ఐదవ ఆవరణమునందు నల్లగా, వరాహమునకు ఉండే కోరలు వంటివి గలిగి దండినీ అని చెప్పబడే వారాహీ దేవత ఉంటుంది. కిరిచక్రరథ సేనకు పండ్రెండుమంది సేనానులు గలరు. వారు 1) పంచమి, 2) దండనాథా, 3) సంకేతా, 4) సమయేశ్వరీ, 5) సమయసంకేతా, 6) వారాహీ, 7) పోత్రిణీ, 8) శివా, 9) వార్తాళీ, 10) మహాసేనాని, 11) ఆజ్ఞా చక్రేశ్వరీ, 12) అలిందినీ. ఈ వారాహీ దేవతయే అమ్మవారికి ప్రధాన సేనాని. ఈ వారాహి దేవతకు ఉపాసనకూడా కలదు. కాశీ క్షేత్రంలో వారాహీ మందిరం గలదు. ఈ వారాహీ దేవతకు బీజాక్షరం హూం మనలో పోట్లాడే స్వభావంగలది ఈ వారాహి. అందుకే మనం ఎవరిపైనైనా కోపం వస్తే హుం కరించుతాము. అనుకోకుండానే మన గొంతుకనుండి   హూం అను బీజాక్షరం వచ్చిందికదా! అంటే మనలో కోప స్వభావంగల దేవత అయిన వారాహి ఉందికదా!

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి