21, ఫిబ్రవరి 2019, గురువారం

*వసంత పంచమి


*వసంత పంచమి నేడే... *  
ఆమె అక్షరం... ఆమె అక్షయం... ఆమె గీర్వాణి... ఆమె సకల శాస్త్రాలకూ రారాణి
ఆమె జ్ఞానం.. ఆమె సర్వవిద్యలకూ మూలం...
వాల్మీకి నోట ఆది కావ్యాన్ని పలికించిన తల్లి ఆమె.
వ్యాసభగవానుడి చేత ఆపార సాహిత్యాన్ని రాయించిందీ ఆ తల్లే.
యాజ్ఞవల్క్యుడు, ఆదిశంకరులు, ఆదిశేషువు, బృహస్పతి అందరూ ఆమె అనుగ్రహంతోనే అనంతమైన జ్ఞానాన్ని వరప్రసాదంగా అందుకున్నారు.

ఆ తల్లి సరస్వతి... మనలోని విజ్ఞానానికి మాతృమూర్తి. ఆమె ఆవిర్భవించిన రోజు వసంతపంచమి.

మాఘమాసం ప్రకృతి వికాసానికి, సరస్వతి మనోవికాసానికి సంకేతం. ఈ రెండింటి కలయిక పరిపూర్ణ వికాసానికి నిదర్శనం. దీనికి ప్రతీకగా వసంత పంచమి వ్యాప్తిలోకి వచ్చింది. మనిషిలో ఉండే అవిద్య లేదా అజ్ఞానం తొలగిపోయి ఎప్పుడు జ్ఞానం అనే వెలుగురేఖ ప్రసారమవుతుందో ఆ రోజు మనిషి వికాసానికి ప్రారంభసూచిక అవుతుంది. అజ్ఞానం అనే మంచుతో గడ్డకట్టిన మనిషి హృదయాన్ని చదువు అనే వేడితో కరిగించి జ్ఞానం అనే వెలుగును ప్రసరింపజేయటమే వసంత పంచమి అంత‌రార్థం. మాఘమాసంలో వచ్చే శుక్ల పక్ష పంచమిని వసంత పంచమిగా చేసుకుంటాం. ఈ రోజుకే శ్రీపంచమి, మదన పంచమి, సరస్వతీ జయంతి అనే పేర్లు కూడా వాడుకలో ఉన్నాయి.

* చైత్ర, వైశాఖమాసాల్లో వచ్చే వసంత రుతువుకు స్వాగతోపచారాలు మాఘమాసంలోనే మొదలవుతాయి. కాలగమనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మకర సంక్రమణం (సంక్రాంతి) తర్వాత వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మాఘమాసం ప్రారంభం కావడంతోనే చెట్లు చిగురించడం, పూలు పూయడం మొదలవుతుంది. చలి, ఎండల మిశ్రమ వాతావరణం ప్రజలకు ఎంతో హాయి కలిగిస్తుంది. పంటలు నిండుగా చేతికి వచ్చి ఉంటాయి. పాడి పశువులకు పుష్కలంగా గ్రాసం లభిస్తుంది. దీంతో అవి సమృద్ధిగా పాలనిస్తాయి. గ్రహగమనాలన్నీ శుభస్థానాల్లో జరుగుతాయి. వివాహాది శుభకార్యాల సందడి మొదలవుతుంది. మొత్తంగా మానవజీవితానికి అత్యంత ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చే కాలం ప్రారంభమవుతుంది. ఇదంతా రాబోయే వసంతమాసానికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉండి వసంత సందడి ముందుగానే వచ్చిన అనుభూతి కలిగిస్తుంది.

* పురాణ, ఇతిహాసపరంగా కూడా వసంత పంచమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. బ్రహ్మవైవర్త పురాణం, కృత్యసార సముచ్చయం, హేమాద్రి గ్రంథాల్లో ఇందుకు సంబంధించిన అనేక విషయాలు వివరణాత్మకంగా ఉన్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం ప్రాచీన రోమన్లు వసంతపంచమి ఉత్సవాన్ని జరిపేవారని తెలుస్తోంది. గ్రీకులు వారి జ్ఞానదేవతకు ఈ రోజున పూజలు చేసేవారు.

* ఈ రోజును రతికామ దమనోత్సవంగా జరుపుకునే ఆచారం కొన్నిచోట్ల ఉంది. పంచమినాడు రతీదేవి కామదేవ పూజచేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. రుతువుల రాజు అయిన వసంతుడికి, కామదేవుడికి మధ్య ఎంతో సఖ్యత ఉంది. వసంతుడు సస్యదేవత. కాముడు ప్రేమదేవత. రతీదేవి అనురాగ దేవత. ఈ ముగ్గురి కలయిక... అంటే, ప్రకృతి ద్వారా లభించే అమితమైన జీవనోపాధి మనుషుల మధ్య ప్రేమానురాగాల్ని కలిగిస్తుంది. ఏ ప్రాంతమైతే పాడిపంటలతో సుభిక్షంగా ఉంటుందో అక్కడి మనుషులు ప్రేమానురాగాలతో సుఖంగా ఉంటారనేది ఇందులో అంతరార్థం.

* ఈరోజును బెంగాల్‌లో శ్రీపంచమిగా మూడురోజుల పాటు ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్తరభారతంలో ఈ రోజున ఉదయం నుంచే సరస్వతీదేవిని పూజించి, సాయంకాలం ఆ ప్రతిమకు ఊరేగింపు జరిపి, నిమజ్జనం చేసే ఆచారం కొనసాగుతోంది. వసంతరుతువుకు స్వాగతం పలికే రోజు వసంత పంచమి అని, ఇది రుతువులకు సంబంధించిన పండుగ అని శాస్త్రాలు చెబుతున్నాయి. పంజాబ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో ఈ రోజున పతంగుల పండుగ చేసుకుంటారు. వేదవ్యాస మహర్షి గోదావరీ నదీతీరంలో ఇసుకతో సరస్వతీదేవిని ప్రతిష్ఠించి, అర్చన చేశాడు. వ్యాసుడి కారణంగా ఏర్పడిన ఆ క్షేత్రమే ‘వ్యాసర’ లేదా ‘వ్యాసపురి’ కాలక్రమంలో ‘బాసర’గా ప్రసిద్ధి పొందింది.

*శ్వేతరూపం.. జ్ఞానదీపం...*

* సరః అంటే కాంతి. కాంతి అంటే జ్ఞానం. మన జీవితాన్ని జ్ఞానంతో నింపే మాతృశక్తి సరస్వతి. శుద్ధ జ్ఞానానికి ఆమె ప్రతీక. వికాసం, విజ్ఞానాలకు ఆమె ఆకృతి. అక్షర అక్షయ సంపదలకు మూలమైన ప్రణవ స్వరూపిణి ఆమె. వేదజ్ఞానానికి మాతృకగా, గాయత్రిగా, సావిత్రిగా, లౌకిక, అలౌకిక విద్యల ప్రదాతగా ఆమె పూజలందుకుంటోంది.

* సరస్వతి అనే శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం అంటే నిరంతరం సాగిపోయే చైతన్యం. సాధారణంగా జలం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. జలం జీవశక్తికి సంకేతం. దాన్నుంచే అన్ని జీవులకూ శక్తి అందుతోంది. తద్వారా ప్రకృతిలో ఉత్పాదకత జరుగుతోంది. ఈ ఉత్పాదకతకు ప్రతిఫలమే సరస్వతి (జ్ఞానం). సృష్టి కార్యాన్ని నిర్వహించే బ్రహ్మదేవుడికి కూడా అందుకు తగిన జ్ఞానాన్ని సరస్వతి అందిస్తుంది.

* సరస్వతీ అవతారం అహింసకు కూడా తార్కాణంగా కనిపిస్తుంది. తెల్లటి వస్త్రాలు, తెల్లటి పువ్వులు, తెల్లటి ముత్యాల సరం, గంధపు పూత ఇవన్నీ గీర్వాణికి ఇష్టమైనవి. ఇవన్నీ శాంతికి, స్వచ్ఛతకు చిహ్నాలు. ఏవిధమైన ఆయుధాలూ ఆమె చేతిలో ఉండవు. మనలో ఉన్న అజ్ఞానమనే రాక్షసుడిని సంహరించే విజ్ఞానమనే ఆయుధాన్ని అందించే పుస్తకాన్ని చేతుల్లో పట్టుకుని ఉంటుంది. జ్ఞానం ఉన్న చోట హింసకు, అశాంతికి తావుండదు కదా. ఇంకో ఉపమానంలో తెలుపు శుభ్రతకు, నిర్మలత్వానికి, స్వచ్ఛతకు ప్రతీక. ఈ ప్రకారం సరస్వతి స్వచ్ఛతకు ఆలంబనగా నిలుస్తుంది. అన్నిరకాలైన విద్యలు సరస్వతీదేవి అనుగ్రహంతో లభిస్తాయి. అంటే, విద్య ద్వారా మనిషి స్వచ్ఛంగా తయారై, నిర్మలహృదయంతో ప్రకాశిస్తాడని అర్థం చేసుకోవచ్చు.

* నదుల పరంగా చూస్తే గంగ, యమునలతో కలిసి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఈ కోణంలో చూస్తే జ్ఞానం మనిషిలో అంతర్లీనంగా ప్రవహించాలే కానీ బాహ్యప్రదర్శనల కోసం విజ్ఞానాన్ని ప్రకటించకూడదనే సందేశాన్ని సరస్వతీ నది ద్వారా మనకు అందుతుంది.

* బౌద్ధమతం వ్యాప్తిలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో సరస్వతీదేవిని మంజుశ్రీ, మహాసరస్వతి, వజ్రసరస్వతి, ఆర్య వజ్రసరస్వతి, వజ్ర వీణా సరస్వతి, వజ్రశారద వంటి పేర్లతో ఆరాధిస్తారు. జైనులు కూడా శృతదేవత, షోడశవిద్యాదేవతగా పూజలు చేస్తారు.

* రుగ్వేదం, దేవీభాగవతం, బ్రహ్మవైవర్త, పద్మపురాణాల్లో సరస్వతీదేవి వర్ణన విస్తారంగా ఉంది. వీటిప్రకారం సరస్వతీదేవి తెల్లటి వస్త్రాలు ధరించి, హంసవాహనాన్ని అధిరోహించి ఉంటుంది. చేతుల్లో వీణ, రుద్రాక్షమాల, పుస్తకం ధరించి ఉంటుంది.

* సరస్వతీదేవి చేతిలో ఉన్న పుస్తకం జ్ఞానానికి సంకేతం. పుస్తకం ద్వారా జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం మనిషిలో తీర్చిదిద్దిన సంపూర్ణ వ్యక్తిత్వానికి, హృదయ నిర్మలత్వానికి ప్రతీక. సంహరించాల్సింది వ్యక్తిని కాదు... అతడిలోని రాక్షస గుణాన్ని మాత్రమే అనే సంకేతాన్ని సరస్వతి చేతిలోని పుస్తకం ద్వారా అందుతుంది.

* అమ్మ చేతిలో వీణ సంగీతానికి ప్రతిరూపం. ఈ వీణ పేరు ‘కచ్ఛపి’. చదువంటే కేవలం పుస్తకాల్లో ఉండేది మాత్రమే కాదు. కళలన్నీ చదువులో భాగమే. కళాకారుడు అత్యుత్తమ సంస్కారం, ఆత్మీయత కలిగి ఉంటాడు. మనుషులందరూ ఇలాంటివారు కావాలని సరస్వతి చేతిలోని వీణ చెబుతుంది. అందులో ఏడుతంత్రులు ఉంటాయి. వీటిద్వారా నాదం ఉత్పత్తి అవుతుంది. మనం చూసే ప్రపంచమంతా నాదమయం. పరమేశ్వరుడు నాదస్వరూపుడు. కాబట్టి, పరమేశ్వరుడిని చేరుకోవాలంటే నాదోపాసన చెయ్యాలన్న సందేశం కూడా సరస్వతీదేవి చేతిలోని వీణ చెబుతుంది.

* ఆమె వాహనం హంస. పాలలో కలిసిన నీటిని వేరు చేసి కేవలం పాలను మాత్రమే స్వీకరించే గుణం హంసకు ఉంది. సమాజంలో మంచి, చెడూ పాలూనీళ్లలా కలిసే ఉంటాయి. ఉత్తమ జ్ఞానం కలిగిన వ్యక్తి హంసలాగా చెడును వదిలేసి మంచిని మాత్రమే గ్రహించాలని చెప్పటం హంసవాహనం ఇచ్చే సందేశం.

* కమలం వికాసానికి, పవిత్రతకూ చిహ్నం. కమలం పుట్టుక బురదలోనే. కానీ, బురద వాసన, అపవిత్రత దానికి సోకవు. అందుకే అమ్మకు కమలం ఆసనమైంది. అలాగే మనిషి కూడా అనేక అపవిత్రాలు ఉండే సమాజంలో ఉంటూనే తన పవిత్రతను కాపాడుకోవాలి. మనోవికాసాన్ని సాధించాలనే సందేశాన్ని కమలం అందిస్తుంది. మన శరీరంలో ఉండే కుండలినీ శక్తి జాగృతమైనప్పుడు అందుకు ప్రతీకగా కూడా కమలాన్ని యోగసాధకులు చెబుతారు.

* సరస్వతీదేవి ధరించే ధవళవస్త్రాలు స్వచ్ఛతకు చిహ్నం. మనిషి కూడా స్వచ్ఛంగా ఉండాలని ఇవి సూచిస్తాయి. తెలుపు వస్త్రం ఏ చిన్న రంగు పడినా అది సహజత్వాన్ని కోల్పోతుంది. చూడటానికి ఇంపుగా ఉండదు. మనిషి కూడా అంతే. ఏ చిన్న అపవాదు వచ్చినా, తప్పు చేసినా ఆ ఫలితం అతడి జీవితాంతం వెన్నంటి ఉంటుంది. అందుకే, ఏ తప్పూ చెయ్యకుండా స్వచ్ఛంగా, తెల్లటి వస్త్రంలా ఉండాలని ధవళ వస్త్రాలు సూచిస్తాయి.

* ఆమె చేతిలోని రుద్రాక్షమాల ఆత్మచైతన్యాన్ని సూచిస్తుంది. కేవలం భౌతికం, లౌకికమైన విద్య మాత్రమే మనిషిని భగవంతుడి వద్దకు చేర్చలేదు. అతడు ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి. రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపం. ఆత్మసాక్షాత్కారం పొందటానికి రుద్రాక్ష మార్గం చూపుతుంది. రుద్రాక్షను రుషులు భూమికి, స్వర్గానికి మధ్య వారధిగా భావిస్తారు.
--((**))--


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి