*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*
*651వ నామ మంత్రము*
*ఓం విజ్ఞాత్ర్యై నమః*
విశేషముగా తెలిసికొనిన పరమేశ్వరికి నమస్కారము.
విజ్ఞానమును ప్రసాదించు జ్ఞానశక్తి స్వరూపిణికి నమస్కారము.
ఇంద్రియములలో చైతన్యము ప్రసాదించి శక్తిని అనుగ్రహించు తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *విజ్ఞాత్రీ* అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం విజ్ఞాత్ర్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ విజ్ఞాన స్వరూపిణిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించు సాధకునికి ఎనలేని జ్ఞానసంపదల నొసగి తద్వారా ఆధ్యాత్మికతా భావము ఇంకొక ప్రక్క లౌకిక పరమైన సుఖసంతోషములు ప్రసాదించును.
పరాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి. అంటే మనలోని ఇంద్రియములకు తొలుత ఉన్న జడత్వముతో, వాటికి పనిచేసేశక్తి లేని స్థితి నుండి చైతన్యము కలిగించి ఆయా ఇంద్రియములకు వాటికి గల సహజసిద్ధమైన శక్తిని ప్రసాదించి, ఆయా జీవులకు పూర్వజన్మ వాసన ప్రకారం ఆయా ఇంద్రియములకు ఆయా స్థాయిలో శక్తిని ప్రసాదించును. కొందరు మూగవారు, కొందరు అంధులు, కొందరు బధిరులు, కుంటివారు కూడా ఉంటారు. ఎందుకని అవి వారి ప్రారబ్ధాలు. మరికొందరు అఖండ ప్రజ్ఞావంతులు, విజ్ఞానవంతులు, మహర్షులు, అత్యున్నత స్థానంలో ఉన్న మహారాజులు, కూటికి కూడాలేని పేదవారు ఇదంతా పూర్వజన్నకర్మలవాసన మాత్రమే. జీవుని శరీరంలోని ఇంద్రియములకు చైతన్యము, శక్తిని ప్రసాదించు సృష్టికి కారణభూతురాలైన పరాశక్తియే దీనంతటికీ కారణభూతురాలు. *కార్యకారణ నిర్ముక్త* గా స్తుతింప బడే విజ్ఞాన స్వరూపిణి అయిన జగన్మాత జీవునికి విజ్ఞాన ప్రదాత అందుచేతనే ఆ తల్లిని *విజ్ఞాత్రీ* అను నామ మంత్రముతో వశిన్యాది వాగ్దేవతలు స్తుతించారు.
విజ్ఞానమును ప్రసాదించు జగదీశ్వరికి నమస్కరించునపుడు *ఓం విజ్ఞాత్ర్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ
652వ నామ మంత్రము
ఓం వేద్య వర్జితాయై నమః
తెలుసుకోవలసిన, తెలుసుకోబడని విషయములు ఏవియు లేని సర్వజ్ఞ, విజ్ఞాత్రి అయిన పరాశక్తికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి వేద్య వర్జితా అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం వేద్య వర్జితాయై నమః అని ఉచ్చరిస్తూ ఆ విజ్ఞానస్వరూపిణి అయిన జగన్మాతను భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులు ఆ తల్లి కరుణచే అఖండ విద్యాసంపన్నులై చక్కని జీవితంలో మంచి అధికారహోదాలో రాణిస్తారు.
జగన్మాత సర్వజ్ఞా (అన్నియు తెలిసి ఉన్నది), జ్ఞానదాయని (జ్ఞానమును ప్రసాదించునది), జ్ఞానవిగ్రహా (జ్ఞానమే తనరూపము), జ్ఞానముద్రా (చూపుడు,బొటన వ్రేళ్ళను కలుపగా ఏర్ఫడు జ్ఞానమద్రా స్వరూపిణి), జ్ఞానగమ్యా (జ్ఞానమునకు మార్గమయినది) జ్ఞానజ్ఞేయ (జ్ఞానము, ఆ జ్ఞానముచే తెలియదగునది) అయినది పరాశక్తి. ఇంక ఆ తల్లికి తెలియవలసినది ఇంక ఏదియు లేదు అని భావము. అందుకే శ్రీమాత వేద్యవర్జితా అని వశిన్యాది వాగ్దేవతలు నామ మంత్రమును అమ్మ నామావళిలో ఉంచారు. అమ్మకు ఇంక తెలియ వలసింది లేదు. సర్వవేదాంత సంవేద్య అనగా వేదాలలోను వేదాంగాలలోనూ తెలియబడుచున్నది. అంటే ఆ తల్లి అన్నిటికీ అతీతమైనది, ఆ తల్లికి తెలియవలసినది ఇంక ఏమియు లేదు గనుకనే జగన్మాత వేద్య వర్జితా యని స్తుతింపబడుచున్నది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం వేద్య వర్జితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*
*653వ నామ మంత్రము*
*ఓం యోగిన్యై నమః*
ఏకత్వభావం కలిగి సాక్షాత్తు మహాయోగేశ్వరేశ్వరి, మహాచతుష్షష్టికోటి యోగినీగణసేవిత, యోగినీ స్వరూపిణి అయిన పరాత్పరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *యోగినీ* అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం యోగిన్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఉపాసించు సాధకునికి చక్కని యోగ్యత, సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలిగి, పరమేశ్వరియందు అత్యంత భక్తితత్పరుడై జన్మకు సార్థకత కలిగించుకుంటాడు.
మనసును అదుపుచేసుకుని ఇంద్రియములను అంతర్ముఖము చేయడాన్నే యోగము అంటాము. మనసును నిశ్చలంచేసినప్పుడు ఏకాగ్రత లభిస్తుంది. అలా ఏకాగ్రతతో చేసిన జపంవలన సిద్ధి పొందవచ్చు. సాధారణంగా ఏదైనా మంత్రజపం చేయునప్పుడుగాని, కనులు మూసుకొని భగవంతుని ధ్యానం చేయునపుడుగాని ఏవేవో దృశ్యాలు కళ్ళలో కదులుతుంటాయి. మనసు అనేకవిధాల ఆలోచించితే ధ్యానం భగ్నమవుతుంది. మనస్సును నిరోధించి లక్ష్యాన్ని ఏకాగ్రం చేస్తే ఇంద్రియాలను అంతర్ముఖం చేయవచ్చు. మనోవాక్కాయకర్మలతో పరిశుద్ధమైన మనసుతో చేసే అర్చన వలన ఫలితం కలుగుతుంది. అందుకే యోగం చేయాలి. *యోగః చిత్త వృత్తి నిరోధక్తః* మనసును అదుపుచేయుటయే యోగము అని అందురు.
శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు కలవు. తొమ్మిది ఆవరణలకు, తొమ్మిది చక్రములు, వాటికి అధిష్ఠానదేవతలుగా యోగినీదేవతలు కలరు.
1) భూపురం ఆవరణకు త్రైలోక్యమోహన చక్రము, యోగినీ దేవత పేరు ప్రకటయోగిని.
2) షోడశదళం ఆవరణకు సర్వాశా పరి పూరక చక్రము, యోగినీ దేవత పేరు గుప్తయోగిని.
3) అష్టదళం ఆవరణకు సర్వసంక్షోభిణీ చక్రము, యోగినీ దేవత పేరు గుప్తతర యోగిని.
4) మన్వస్రం ఆవరణకు సర్వ సౌభాగ్యదాయక చక్రము, యోగినీ దేవత పేరు సంప్రదాయ యోగిని.
5) బహిర్దశారం ఆవరణకు సర్వార్ధసాధక చక్రము, యోగినీ దేవత పేరు కులోత్తీర్ణ యోగిని.
6) అంతర్దశారం ఆవరణకు సర్వ రక్షాకర చక్రము, యోగినీ దేవత పేరు నిగర్భ యోగిని.
7) అష్టకోణం ఆవరణకు సర్వ రోగహర చక్రము, యోగినీ దేవత పేరు రహస్య యోగిని.
8) త్రికోణం ఆవరణకు సర్వ సిద్ధిప్రద చక్రము, యోగినీ దేవత పేరు అతిరహస్య యోగిని.
9) బిందువు ఆవరణకు సర్వానందమయ చక్రము, యోగినీ దేవత పేరు పరాపర రహస్య యోగిని.
*శ్రీదేవిఖడ్గమాలా స్తోత్రం* మనం స్తోత్రం చేయునప్పుడు ఈ ఆవరణలలోని చక్రములు, యోగీనీ దేవతల పేర్లు చెప్పడం జరుగుతుంది.
*ఇంకను దశారయుగ్మము నందు గల యోగినులు*
1) విద్యాయోగినీ, 2) రేచికాయోగినీ, 3) మోచికాయోగినీ, 4) అమృతాయోగినీ, 5) దీపికాయోగినీ, 6) జ్ఞానయోగినీ, 7) ఆప్యాయనీయోగినీ, 8) వ్యాపినీయోగినీ, 9) మేథాయోగినీ, 10) వ్యోమరూపాయోగినీ, 11) సిద్ధరూపాయోగినీ, 12) లక్ష్మీ యోగినీ, మరియు వశిన్యాది శక్తులు ఎనిమిది మొత్తము కలిపి 20 శక్తులు అగును. ఇవి శ్రీచక్రము నందలి దశారయుగ్మమునందు ఉండు 20 (10 x 2 ) కోణములు ఇవే.
*మహాచతుష్షష్టికోటియోగిగణసేవితా* అని 237వ నామ మంత్రంలో స్తుతించాము. అరవైనాలుగు కోట్లమంది యోగినీగణ దేవతలచే జగన్మాత సేవింపబడుతోంది. తొమ్మిదవ ఆవరణము బిందువు. అక్కడగలదు సర్వానందమయచక్రం. అక్కడ పరాపరరహస్యయోగినీ రూపంలో అమ్మవారు కలదు. అందుకే ఆ తల్లిని *యోగినీ* అని స్తుతిస్తున్నాము.
యోగినీ స్వరూపిణి అయిన పరాత్పరికి నమస్కరించునపుడు *ఓం యోగిన్యై నమః* అని అనవలెను.
***
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*
*654వ నామ మంత్రము*
*ఓం యోగదాయై నమః*
ఇంద్రియాలకు కావలసిన శక్తిని ఇచ్చి, ఇంద్రియములను ఆయా శక్తులతో సమన్వయించి, ఆయా ఇంద్రియములకు జీవునికర్మలను అనుసరించి ఆయా జీవులకు యోగ్యతలను ప్రసాదించు జగజ్జననికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *యోగదా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం యోగదాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని భక్తి ప్రపత్తులతో ఉపాసించు సాధకునికి తన సాధనామార్గంలో నిర్ధిష్టమైన ఏకాగ్రత ఏర్పడి మంత్రసిద్ధి పొందు యోగ్యత ఏర్పడును. భౌతికంగా సుఖసంతోషాలు, ప్రశాంతజీవనము సంప్రాప్తించును.
యోగదా అంటే యోగమును సంప్రాప్తింపజేయునది. ఆ పరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఆరాధనచేసి ఫలశృతిగా మనకు కావలసినది కోరుకోవడం సహజం. మనదగ్గరలేనిదిగాని, మనముకోరుకునే స్థితి గాని కోరడం అనేది యోగము అంటాము. మనకు గృహం కట్టాలి అనుకుంటాము. అంటే గృహయోగం కోరుకున్నామని అర్థము. విద్యాయోగము, వివాహయోగము, ఉద్యోగయోగము, ఆనందయోగము ఇలాంటి యోగాలు జగన్మాత ఇస్తుంది కనుక యోగదా అన్నాము. ఇలా మనలో భక్తియోగము, అమ్మవారిని దర్శించే అదృష్టయోగము ఇలా యోగాలు చెప్ఫుకుంటూపోతే మనకు లేనిది కోరుకోవడం. ఇక ఇంద్రియాలకు సంబంధించినదైతే ఇంద్రియములనేవి జడపదార్థములు. వాటిలో చైతన్యం కలుగజేసేది జగన్మాత. శక్తినిచ్చేది జగన్మాత. ఇంద్రియ శక్తులు ఇచ్చి, ఆ ఇంద్రియ శక్తులను ఆయా ఇంద్రియములకు అనుసంధానించునది జగన్మాత. అంటే కంటికి వినికిడి శక్తి, చెవులకు చూసే శక్తి ఉండదుకదా. అలాగే వివిధ అవయవాలకు వాటికి ఏయే శక్తులు ఇవ్వాలో ఇచ్చి వాటిచే పనిచేసే చైతన్యాన్ని కలిగించేది శ్రీమాత. ఈ యోగాలుకూడా జీవుని పూర్వజన్మవాసనలననుసరించి, ప్రారబ్ధాన్ననుసరించి ఉంటుంది. కుంటి, గ్రుడ్డి వంటి అంగవైకల్యాలు కూడా ప్రారబ్ధానుసారమే ఉంటాయి. ఇలా ఇంద్రియాలకు పనితనాన్ని ప్రసాదించేది జగన్మాతకనుక ఆతల్లిని *యోగదా* అని అన్నాము.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం యోగ్యదాయై నమః* అని అనవలెను.
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*
*655వ నామ మంత్రము*
*ఓం యోగ్యాయై నమః*
మహదానందమైన దివ్యానుభూతిని పొందు ఆత్మానందయోగాన్ని, బ్రహ్మానందయోగాన్ని తను తప్ప వేరొక్కరు అనుగ్రహించలేని యోగ్యత గలిగిన దివ్యమైన యోగస్వరూపిణి అయిన పరాశక్తికీ నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *యోగ్యా* అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం యోగ్యాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకునకు మహదానందయోగమును గలుగజేసి పరమేశ్వరీ పాదసేవయందు తరింపజేయును.
మానవుడు కూడు లేకపోతే కూడుదొరికే యోగం కలుగుతుంది. ఇంక ఇల్లుకావాలనుకుంటాడు. గృహయోగం కలుగు తుంది. తరువాత అష్టైశ్వర్యాలు కోరుకుంటాడు. ఐశ్వర్యయోగంకూడా కలుగుతుంది. అందమైన భార్య, గుణవంతులైన సంతానయోగంకోరుతుంటాడు. ఆ యోగంకూడా లభించింది. ఆపైన అధికారంకోరుతాడు. రాజయోగం కలిగింది. ఇలా ఒకటి వెంట ఒకటి కోరుతూ, తృప్తిలేక, ఆనందం పొందలేక అలమటించిపోతాడు. ఇలా ఒకటి విడిచి ఒకటి పొందుతున్నా ఏదీ శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వడంలేదని తెలిసేసరికి చాలా కాలం గడచిపోతుంది. అదృష్టవశాత్తు ఒకరోజు యోగం అనే పదానికి అర్థంతెలిసి సాధనచేస్తాడు. మూలాధారంలో నున్న కుండలిని జాగృతంచేసి, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి ఛేదించుకుంటూ, షట్చక్రాలు అధిగమించునటులు కుండలిని అక్కడకు చేర్చి, సహస్రారంచేరి అక్కడ అమృతధారలలో తడిసిముద్దయిన సాధకుడు ఇంతకన్నా ఆనందం ఇంకేముంది అన్న యోగానుభూతి,. ఆత్మానుభూతిని, బ్రహ్మానందాన్ని పొందుతాడు. ఇదే కదా శాశ్వతమైన ఆనందం అనుకుంటాడు. అట్టియోగాను భూతికి దారితీసే యోగవిధానమే యోగ్యమైనదిగా తెలుసుకోవాలి సాధకుడు. అటువంటి యోగస్వరూపాన్ని సూచించేది శ్రీమాత మాత్రమే. అమ్మయోగస్వరూపిణి. అలాసూచించే యోగ్యత శ్రీమాతకే కలదు. అందుకే ఆ శ్రీమాత *యోగ్యా* అను నామానికి సార్థకతగలదని ఎప్పుడో వశిన్యాదులు గుర్తించారు.
జగన్మాత యోగ్యమైనది. దివ్యమైన యోగ స్వరూపిణి. అట్టి తల్లికి నమస్కరించునపుడు *ఓం యోగ్యాయై నమః* అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*
*656వ నామ మంత్రము*
*ఓం యోగానందాయై నమః*
ఏ యోగం వలన దివ్యానుభూతి లభిస్తుందో, ఏ యోగం వలన మహదానందం లభిస్తుందో, అలా లభించిన ఆనందస్థితిలో శాశ్వతంగా ఉండాలని పిస్తుంది. అటువంటి దివ్యమైన అనుభూతిపరమైన ఆనందాన్ని ప్రసాదించే యోగానంద స్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *యోగానందా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం యోగానందాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ శ్రీమాతను అర్చించు భక్తులకు ఆ పరమేశ్వరి సుఖసంతోషాలతో, సిరిసంపదలతో ఆనందమయమైన జీవనమును ప్రసాదించును.
శ్రీమాత యోగస్వరూపిణి. ఆనందమయ యోగ స్వరూపిణి. తనను కొలిచే భక్తులకు నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. జీవాత్మ పరమాత్మల సమైక్యమే యోగమని అంటారు. శివశక్తుల సామరస్యము. జీవాత్మ పరమాత్మను చేరితే అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. మూలాధారంలో జాగృతమై, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథిలను భేదించి, షట్చక్రములకావల సహస్రారం చేరి, అచ్చట అమృతధారలలో ఓలలాడి శరీరంలోని డెబ్బదిరెండు వేల నాడీమండలము తడవగా, సాధకుడు అనిర్వచనీయమైన ఆనందం పొందుతాడు. యోగంవల్ల లభ్యమైన ఈ ఆనందం కేవలం అనుభవైకవేద్యము మాత్రమే. అందుకే పరమేశ్వరి యోగానందా అని సార్థకనామాంకిత అయినది.
అటువంటి యోగానంద నామాంకిత అయిన జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం యోగానందాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*
*657వ నామ మంత్రము*
*ఓం యుగంధరాయై నమః*
కృతయుగాది యుగములను ధరించు కాలస్వరూపిణియైన పరాశక్తికి నమస్కారము.
విశ్వమందు జంటలు జంటలుగా సయోధ్యతోను, పరస్పర వైరుధ్యంతోనూ ఉండే ఎన్నిటికో సమన్వయ స్వరూపిణియై విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *యుగంధరా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం యుగంధరాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని అత్యంతభక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకునికి అంతులేని ఆత్మానందానుభూతి ప్రాప్తించును. నిత్యమైన, సత్యమైన ఆనందమును అనుభవించును. జగన్మాత సకలలోకాలను తనలో ఇముడ్చుకొని, జీవులను తన బిడ్డలవలె భావించి వారిని సర్వాభీష్టసిద్ధులను జేయును. జగన్మాత కాలస్వరూపిణి. నాలుగు యుగములను కలిపితే ఏర్పడే మహాయుగములను ధరించును.
యుగం అనే పదమునకు జంట అనే అర్థము గలదు. స్థూలం-సూక్ష్మం, దేహము-ఆత్మ, సుఖము-దుఃఖము, ఆనందం-విషాదం, వెలుగు-చీకటి, పగలు-రాత్రి, జడము-చైతన్యము ఇటువంటి జంటలతో ఏర్పడినదే సృష్టి. అమ్మవారు సృష్టి స్వరూపిణి గనుక ఈ జంటలను తనయందు ధరించి *యుగంధరా* అని నామము పొందినది.
జగన్మాత సమన్వయ స్వరూపిణి. యుగాలను తనయందు ఇముడ్చుకున్న కాలస్వరూపిణి. శివా-శివ సమన్వయ స్వరూపిణి.
జగన్మాతకు నమస్కరించునపుడు
*ఓం యుగంధరాయై నమః* అని అనవలెను.
.........
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ
658వ నామ మంత్రము
ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమః
ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సమన్వయ స్వరూపిణి అయిన పరాశక్తికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి కృపాకటాక్షములచే ఆత్మానందానుభూతి ప్రాప్తించి సత్యమైన, నిత్యమైన ఆనందములో జీవనము గడుపుదురు.
పరమేశ్వరి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అన్నాము. అమ్మవారి స్వరూపమునందు శిరస్సు ఇచ్ఛాశక్తి కాగా, కంఠమునుండి కటివరకూ జ్ఞానశక్తి, కటి నుండి పాదముల వరకు క్రియాశక్తి.
85వ నామ మంత్రములో శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజా అని స్తుతించుతాము. అనగా పరమేశ్వరి ముఖపంకజము (శిరస్సు) వాగ్భవకూటము (పంచదశిలో మొదటి ఐదు బీజాక్షరములు) అని భావము.
86వ నామ మంత్రములో కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణీ అని స్తుతిస్తాము. అనగా కంఠమునుండి దిగువన కటి పర్యంతము మధ్యకూటము అనగా కామరాజ కూటము (పంచదశిలో మధ్యనున్న ఆరు బీజాక్షరములు) అని భావము.
87వ నామ మంత్రములో శక్తికూటైకతాపన్న కట్యనోభాగ ధారిణీ అని స్తుతిస్తాము. అనగా కటి నుండి పాదముల వరకు శక్తి కూటము (పంచదశిలోని చివరి నాలుగ బీజాక్షరములు)
88వ నామ మంత్రములో మూల మంత్రాత్మికా అని శ్రీమాతను స్తుతిస్తాము. అనగా పదునైదక్షరముల పంచదశాక్షరీ మంత్రమే ఆత్మస్వరూపము అని భావము.
89వ నామ మంత్రములో మూలకూటత్రయ కళేబరా అని స్తుతిస్తాము. అనగా పంచదశాక్షరీ మంత్రములోగల వాగ్భవ, కామరాజ, శక్తి కూటములుతో ఏర్పడిన శరీరము గలదని భావము.
ఈ విధంగా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ అను నామ మంత్రముతో సమన్వయించు కోవచ్చును.
శ్రీచక్రంలోని బిందువు దగ్గర త్రిభుజ త్రికోణాలవద్ద ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అను ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని.
ఏదైనా పనిచేయాలనుకొనే సంకల్పమే ఇచ్ఛాశక్తి అంటారు. ఆ సంకల్పించిన పనిని ఏవిధంగా చేయాలి అనేది జ్ఞానశక్తి. సంకల్పించిన పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయడం క్రియాశక్తి. విశ్వములు సృష్టించునపుడుగాని, మానవుడు ఏదైనా కార్యము నిర్వహించునప్పుడు గాని ఈ మూడు శక్తులూ వాటంతట అవే జరిగిపోతాయి. అటువంటి శక్తినిచ్చేదే ఆ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారు.
అటువంటి పరమేశ్వరికి నమస్కరించునపుడు
ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమః అని అనవలెను
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ
659వ నామ మంత్రము
ఓం సర్వాధారాయై నమః
అనంత విశ్వంలో గ్రహముల, తారల వివిధ గోళముల తత్త్వములు మారకుండా, గమనములలో విధ్వంసకర మైన మార్పులు రానీయకుండా సునిశితమైన పరిశీలనతో, నిపుణతగలిగిన పర్యవేక్షణతో నడుపుతూ, విశ్వనిర్వహణా కార్యక్రమములకు మూలనియంత్రణ శక్తిగా, సర్వధారయై విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.
స్వాధిష్ఠానాది షట్చక్ర శక్తికేంద్రములకు మూలాధారమే ఆధారం. కుండలినీ శక్తి జాగృతమగుటకు కారణమైన పృథివీతత్త్వముగల మూలాధారమునకధిష్ఠాన దేవతయై సహస్రార సుధాధారలలో సాధకుడు ఓలలాడుటకు సర్వాధారమైన జగదీశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వాధారా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం సర్వాధారాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని అర్చించు భక్తుడు సుఖసంతోషములతో జీవించి పరమేశ్వరి అనుగ్రహముతో తరించును.
గ్రహగోళములు, తారలు వాటి తత్త్వములు మారకుండా, నడకలో విధ్వంసకరమైన మార్పులు జరగకుండా అత్యంత నిశితమైన, నిపుణమైన పర్యవేక్షణతో సరైన మార్గంలో నడుపుతూ, విశ్వనిర్వహణా కార్యక్రమములకు మూలనియంత్రణ శక్తిగా జగన్మాత విరాజిల్లుతున్నందున ఆ తల్లి సర్వాధారా అయినది.
స్వాధిష్ఠానాది షట్చక్ర శక్తి కేంద్రములకు మూలాధారమే ఆధారం. పృథివీతత్త్వం గలిగిన మూలాధారమందు అన్నిశక్తులు ఇమిడి ఉంటాయి. కుండలినీ శక్తి జాగృతమై ఇచ్చటనుండి బయలుదేరి, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథులు ఛేదించుకుంటూ, షట్చక్రములకావల సహస్రారమందు అమృతధారలలోసాధకుని ఓలలాడించు మూలాధార అధిష్ఠానదేవతయే జగన్మాత. అట్టి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మూలాధారాయై నమః అని అనవలెను.
........
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ
660వ నామ మంత్రము
ఓం సుప్రతిష్ఠాయై నమః
కాలాలు మారినా, కల్పాలు మారినా, సంకల్పాలు మారినా తిరుగు లేని, సమర్థవంతమైన జగత్పరిపాలనా పటిమతో అనంత విశ్వంలో సుస్థిరమైన సుప్రతిష్ఠురాలిగా విరాజిల్లిన జగన్మాతకు నమస్కారము.
సృష్టి యంతయూ తానై, లేదా తనలోనే సృష్టియంతయునై, జీవులలో సుస్థిరమైన సుప్రతిష్ఠురాలిగా విలసిల్లు జగదీశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి సుప్రతిష్ఠా యను నాలుగక్షరముల(చతురక్షరీ) నామ మంత్రమును ఓం సుప్రతిష్ఠాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరాత్పరిని ఆరాధించు భక్తులకు సృష్టిలో ప్రతీ అణువు జగన్మాతగా గోచరించి, ఆ భక్తులు అనంతమైన భక్తిప్రపత్తులతో జగన్మాత పాదసేవాతత్పరులై తరించుదురు.
అఖిలాండకోటి బ్రహ్మాండాలకు ఆధారమైన దేవతలందరిలోనూ శ్రేష్ఠమైనదై, ఆర్తజన రక్షకియై, మంగళకరమైన సుప్రతిష్ఠురాలిగా జగన్మాత విలసిల్లుచున్నది.
యుగములు మారినా, కల్పములు మారినా, సంకల్పములలో మార్పులు వచ్చినా జగన్మాత మాత్రము సుస్థిరమైన సుప్రతిష్ఠురాలు.
సుప్రతిష్ఠా అను ఈ నామ మంత్రములో ష్ఠా అను అక్షరమే ఒక మంత్ర బీజాక్షరము. ఈ మంత్రాన్ని జమదగ్నిదత్తా అని అంటారని విజ్ఞులు చెప్పారు. ఈ మంత్రాన్ని జమదగ్ని కూతురైన సరస్వతీ అని అంటారు. నిజానికి సరస్వతి బృహస్పతి కూతురు. ఈ బృహస్పతి కూతురైన సరస్వతి అంగీరసుల ఆడపడుచు. భృగువుల కోడలు. తెల్లగా ఉంటుంది. ఇక జమదగ్ని కూతురైన సరస్వతి భృగువుల ఆడపడుచు. అంగీరసుల కోడలు. ఈ అంగీరసుల కోడలు నీలంగా ఉంటుంది. భృగువులు వెలుగులకు కేంద్రములవంటి వారైతే, అంగీరసులు శబ్దాలకు కేంద్రాల్లాంటివాళ్ళు. వెలుగు కనబడుతుంది కనుక భృగువుల సరస్వతి తెలుపు. శబ్దం కనబడదు కనుక అంగీరసుల సరస్వతి నీలం లేదా నలుపు. దీనిని బట్టి భృగువులు రూపవైభవాలకు, అంగీరసులు శబ్దవైభవాలకు సంబంధించినవారు అని భావము.
ఈ నీల సరస్వతీ బీజాక్షరాన్ని ష్ఠా అంటారు. తెల్లని సరస్వతీ బీజాక్షరం ఐం. జమదగ్మి దత్తమైన ఈ నీలసరస్వతీ బీజాక్షరాన్మి జమదగ్ని భార్య అయిన రేణుకా మంత్రంగా కూడా చెబుతారు.
అందుకే సుప్రతిష్టా అను నామమంత్రంలో ష్ఠా అను అక్షరాన్ని స్పష్ఠంగా ఉచ్చరించాలని కొందరు మంత్ర శాస్త్రజ్ఞులు చెబుతారని అన్నారు. ఎవరైనా మన వాక్పటిమను దిగ్బంధం చేస్తే ఈ జమదగ్ని దత్తా (ష్ఠా) అను మంత్రం విరుగుడుగా పనిచేసి ఆ దిగ్బంధాన్ని తొలగిస్తుందని అంటారు.
ఇక సు ప్రతి ష్ఠా అని ఈ నామాన్ని విడదీస్తే ఈనామ మంత్రం జమదగ్ని దత్తా అను ష్ఠా అనే మంత్రంగా నిగూఢార్థము ఈ నామ మంత్రములో గలదు.
జగన్మాతకు నమస్కరించు నపుడు ఓం సుప్రతిష్టాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
661వ నామ మంత్రము
ఓం సదసద్రూప ధారిణ్యై నమః
సత్-అసత్ అనగా బ్రహ్మము-జగత్తు, లేదా వ్యక్తము-అవ్యక్తము, భావము-అభావము, అస్తిత్వం-నాస్తిత్వం, మంచి-చెడు మొదలైన ఒకదానికి ఇంకొకటి వ్యతిరేకము అనిపించే ద్వంద్వములన్నియు కూడా పరమాత్మ తత్త్వమును ప్రతిపాదించగా - ఇలాంటి అనుకూల ప్రతికూలములు సమానముగా ఉండుటయే పరమాత్మ తత్త్వము. అట్టి పరమాత్మ తత్త్వంగా విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి సదసద్రూప ధారిణీ యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం సదసద్రూప ధారిణ్యై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు ఉపాసకుడు ఆ తల్లికరుణచే బ్రహ్మజ్ఞాన సంపదలు, ఆత్మానందానుభూతిని పొంది, భౌతికంగా సుఖసంతోషములు, ప్రశాంతజీవనమును కొనసాగించును.
సత్తు అంటే సత్యము. అనగా బ్రహ్మము. అసత్తు అనగా అసత్యము అనగా అనంతకోటి జీవరాసులు ఉన్న ఈ జగత్తు. ఈ జగత్తు ఒక నాటకరంగం. పాత్రలు వస్తాయి నిష్క్రమిస్తాయి. మళ్ళీ వేరే పాత్రలు వస్తాయి అవికూడా నిష్క్రమిస్తాయి. జననమరణ చక్రభ్రమణము. ఏదీ సత్యంకాదు, నిత్యంకాదు. ఇటు బ్రహ్మము అనగా సత్యమూ ఆమెయే, అటు అనిత్యము, అసత్యము అయిన జగత్తు ఆమెయే. సత్తు అనేది పారమార్ధిక సత్యము అయితే అసత్తు అనేది తుచ్ఛము. ఒకదానికి ఇంకోటి ప్రతికూలమైన ఈ రెండిటినీ ప్రకాశింప జేసేది జగన్మాతయే. అసత్తు అనేది నామరూపాలు కలిగి, కంటికి కనిపించే ఈ మాయాజగత్తు. ఇక సత్తు అంటే నిత్యము, సత్యము, ఈ అసత్తు అనే మాయా జగత్తును సృష్టించిన బ్రహ్మము. కంటికి కనిపించే అసత్తు అయిన జగత్తు అవ్యక్తమయితే ఆ జగత్తును సృష్టించే బ్రహ్మము కనిపించదు అంటే అవ్యక్తము. ఇలా వ్యక్తావ్యక్తరూపాలు ధరించి యున్నది పరమేశ్వరి. అందుకనే జగన్మాత సదసద్రూపధారిణీ అని స్తుతిస్తున్నాము.
భావ-అభావాలు, సత్యం-అసత్యం, అస్తిత్వం-నాస్తిత్వం, మంచి-చెడు ఇలాంటి అనుకూల ప్రతికూలములు కలిగిన ద్వంద్వములన్నీ కూడా వ్యక్తావ్యక్త స్వరూపిణి అయిన పరమేశ్వరి. అందుకే సత్తు-అసత్తుల ద్వంద్వభావమే సదసద్రూపధారిణి అయిన అమ్మవారు.
వ్యక్తావ్యక్తస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సదసద్రూపధారిణ్యై నమః అని అనవలెను.
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*662వ నామ మంత్రము*
*ఓం అష్టమూర్త్యై నమః*
అష్టలక్ష్మీ స్వరూపిణిగా, జీవాత్మ మున్నగు అష్టాత్మల స్వరూపిణిగా, పంచభూతములు, సూర్యచంద్రులు మరియు సోమయాజి స్వరూపిణిగా, పంచభూతములు, సూర్యచంద్రులు మరియు స్వర్గముల స్వరూపిణిగా, అష్టప్రకృతుల స్వరూపిణిగా, సమయాచారమందలి కులాష్టక స్వరూపిణిగా, బ్రాహ్మి మున్నగు మాత్రుకాష్టక స్వరూపిణిగా, వసిన్యాది వాగ్దేవతాాస్వరూపిణిగా, తన భక్తులకు వారివారి జన్మసంస్కారములు, కుల సంస్కారముల కనుగుణంగా కనిపించు సర్వేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అష్టమూర్తిః* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం అష్టమూర్త్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకునకు ఆ జగన్మాత ఆయా అష్టమూర్తి స్వరూపాలతో అష్టైశ్వర్యములు అనుగ్రహించు, సర్వాభీష్టములు సిద్ధింపజేయును.
1) *లక్ష్మీ మొదలగు అష్టమూర్తి స్వరూపిణి*
*లక్ష్మీ ర్మేధా ధరా పుష్టి ర్గౌరీ తుష్టిః ప్రభా ధృతిః|*
*ఏతాభిః పాహి తనుభి రష్టాభి ర్మాం సరస్వతి!*
మత్స్య పురాణములో ఇలా ఉన్నది:
*1) లక్ష్మి, 2) మేధ, 3) ధర, 4) పుష్టి, 5) గౌరి, 6| తుష్టి, 7) ప్రభ, 8) ధృతి అనెడు ఎనిమిది స్వరూపములలో నున్న సరస్వతీ!* నీవు నన్ను రక్షింపుము. అటువంటి ఎనిమిదిమూర్తుల స్వరూపముగా గలది జగన్మాత.
*2) జీవాత్మ మున్నగు అష్టాత్మల స్వరూపిణి పరమేశ్వరి*
*జీవాత్మా చాంతరాత్మా చ పరమాత్మా చ నిర్మలః*
*శుద్ధాత్మా జ్ఞానరూపాత్మా మహాత్మా సప్తమఃస్మృతః|*
*అష్టమ స్తే షు భూతాత్మే త్యష్టాత్మానః ప్రకీర్తితాః॥*
యోగశాస్త్రమందు గుణములను బట్టి ఆత్మ ఎనిమిది విధములయినట్లు చెప్పారు.
1) జీవాత్మ, 2) అంతరాత్ళ, 3) పరమాత్మ, 4) నిర్మలాత్మ, 5) శుద్ధాత్మ, 6) జ్ఞానాత్మ, 7) మహాత్మ, 8) భూతాత్మ - ఈ ఆత్మాష్టక మూర్తి స్వరూపిణి.
3) పంచభూతములు, సూర్యచంద్రులు, సోమయాజి స్వరూపిణి జగన్మాత:
*పంచభూతాని చంద్రార్కా వాత్మేతి మునిపుంగవ|*
*మూర్తి రష్టౌ శివ స్యాహు ర్దేవదేవస్య ధీమతః|*
*ఆత్మా తస్యాఽష్టమీ మూర్తి ర్యజమానాహ్వయా పరా॥*
*పంచ మహాభూతములు (భూమి, జలము, అగ్ని, ఆగ్ని, వాయువు, ఆకాశము), సూర్యచంద్రులు మరియు జీవాత్మ*
శక్తి రహస్యము ప్రకారము దేవ్యష్టమూర్తులు వీరు *పంచ మహాభూతములు (భూమి, జలము, అగ్ని, ఆగ్ని, వాయువు, ఆకాశము), సూర్యచంద్రులు మరియు స్వర్గము*
4) పంచభూతములు, సూర్యచంద్రులు, సోమయాజి స్వరూపిణి జగన్మాత:
విష్ణు పురాణము ప్రకారము *పంచ మహాభూతములు ( భూమి, జలము, అగ్ని, ఆగ్ని, వాయువు, ఆకాశము), సూర్యచంద్రులు మరియు సోమయాజి*
ఈ అష్టమూర్తుల స్వరూపము ఆ పరాత్పరిది.
అలాగే అష్టమూర్తుల పత్నులు 1) సువర్చల, 2) ఉమ, 3) సుకేశి, 4) అపరశివ, 5) స్వాహా, 6| దితి, 7) దీక్షా, 8) రోహిణి అని అష్టపత్నులు. అట్టి అష్టపత్నుల స్వరూపిణి ఆ పరాశక్తి.
ఇక వీరి కుమారులు 1) శనైశ్చరుడు, 2) శుక్రుడు, 3) లోహితాంగుడు, 4) మనోజవుడు, 5) స్కందుడు, 6) స్వర్గుడు, 7) సంతానుడు, 8) బుధుడు - వీరు ఎనమండుగురు అష్టమూర్తుల కుమారులు అనిగలదు - ఈ అష్టమూర్తుల స్వరూపిణి ఆ పరమేశ్వరి.
5) అష్టప్రకృతుల స్వరూపిణి ఆ అమ్మ వారు.
అష్టప్రకృతులు 1) మాయ, 2) మహత్తు, 3) అహంకారము, 4) శబ్ద, 5) స్పర్శ, 6) రూప, 7) రస, 8) గంధాలు సృష్టిలోగల ఈ అష్టప్రకృతుల స్వరూపిణి ఆ శ్రీమాత.
ఇక మిగిలిన వికృతులన్నియు ఆ జగదీశ్వరి విభూతులే
6) సమయాచారమందలి కులాష్టక స్వరూపిణి.
కులాష్టక స్వరూపములు 1) గణిక, వేశ్య, 2) శౌండిక (కల్లు అమ్మునది), 3) కైవర్తి (పడవ నడుపునది), 4) రజకి (చాకిత) 5) తస్త్రకారి (గొల్లది), 6) చర్మకారి (చెప్పులు కుట్టునది), 7) మాతంగి (చండాలస్త్రీ), 8) పుంశ్చలి (రంకులాడి) వీరికి కులాష్టకమని పేరు లేదా రుద్రయామళమందు *అవయవములు స్వల్పములైయుండి పొడుగైన జుత్తుగలది గణికయగును* అని ఈ విధముగా ఎనిమిదుగురికి లక్షణములను చెప్పెను. ఈ లక్షణములు తృతీయావరణమునందు ప్రసిద్ధముగా ఉన్నవి.అట్టి కులాష్టక స్వరూపురాలు లేదా బ్రాహ్మి మొదలగు అష్టమాతృకా స్వరూపురాలు. (భాస్కరరాయలు వారు సౌభాగ్య భాస్కరమందు చెప్పారు)
7) మాతృకాష్ట స్వరూపిణి
మనకి సంప్రదాయంలో *అష్టమాతృకలు* అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. 1) బ్రాహ్మి, 2) మహేశ్వరి, 3) వైష్ణవి, 4) మహేంద్రి, 5) చాముండ, 6) కౌమారి, 7) వారాహి, 8) మహాలక్ష్మి
ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని *అష్టమాతృకలు* అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.
8) వసిన్యాది వాగ్దేవతా స్వరూపిణి
1) వశిని, 2) కామేశ్వరి, 3) మోదిని, 4) విమల, 5) అరుణ, 6) జయిని, 7) సర్వేశ్వరి, 8) కాళిని - వీరు ఎనిమిది మంది వాగ్దేవతలు.
9) భక్తులకనేక విధములుగా కనిపించు కరుణామయి. ఇంట్లో పిల్లలకు పొంగుజల్లితే, మశూచి వస్తే చద్ది తినే దేవతగా, కల్లుత్రాగే దేవతగా, బిడ్డపుట్టిన పదకొండవరోజున కొలవబడే కొత్తెమ్మ, కొర్రెమ్మగా, ఎన్నెమ్మగా, ఊరారా గ్రామదేవతగా అనేక రూపాలలో కొలువబడే సర్వేశ్వరి లలితాంబిక.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అష్టమూర్త్యై నమః* అని అనవలెను.
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*663వ నామ మంత్రము*
*ఓం అజాజైత్ర్యై నమః*
సత్త్వరజస్తమో గుణాత్మురాలగు అవిద్య (మాయ) కు అజ అని పేరు వేదములో గలదు. అట్టి అవిద్య అనగా అజ్ఞానమును జయించు జ్ఞానస్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అజాజైత్రీ* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామమంత్రమును *ఓం అజాజైత్ర్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ తల్లిని ఉపాసించు సాధకుడు తనలోని అరిషడ్వర్గములను, అజ్ఞానమును జయించి, సత్యమైన, నిత్యమైన బ్రహ్మానందమును పొందుదిశగా తన బుద్ధిని నడిపించుకుంటూ పరమేశ్వరీ పాదసేవలో నిమగ్నుడై తరించును.
*అజా* అంటే మాయ. *జైత్రీ* అనగా జయించునది. జగన్మాత మాయ లేదా అవిద్య లేదా అజ్ఞానమును జయించి, తన భక్తులలోని అభద్రత, అవిద్యాభావమైన ఆలోచనలు నశింప జేయునదని భావము.
మాయ అంటే ఒక చిన్నమాట చెప్పుకుందాం: మేకపిల్ల తన తల్లిపాలను ఎక్కడ త్రాగుతుంది. మెడక్రింద వ్రేలాడే స్తనం వంటి అవయవము వద్దనా లేక వెనుక కాళ్ళ సందున ఉన్న పొదుగులోనా? అంటే వెనుక ఉన్న పొదుగులో అనే చెప్పాలి. ఆ మెడక్రిందనున్నది పొదుగు కాదని ఆ మూగ జీవికి నిశ్చయంగా తెలుసు. కాని మాయను జయించలేని మానవుడు , అవిద్యాసంబంధమైన ఆలోచనలు ఉన్న మానవుని సహజలక్షణం కంటికి కనబడే ఈ జగత్తు సత్యమని, నిత్యమని అంతకన్నా మించినవి ఇంకేలేవని భావిస్తాడు. జగన్మాత పాదసేవలో నిమగ్నుడైన సాధకుడు ఆ తల్లి కరుణచే అట్టి అవిద్యా సంబంధిత భావాలను జయించుతాడు.
కొందరు *అజా* మరియు *జైత్రి* అనునవి రెండునామ మంత్రాలుగా భావిస్తారు. అది సాంప్రదాయం కాదు. ఎందుకంటే లలితా సహస్ర నామావళిలో సహస్రనామాలు ఉంటాయి.కాని, అజా, జైత్రి అని రెండుగా చెబితే ఒకవెయ్యి ఒక నామాలు అవుతాయి. అందుచేత *అజాజైత్రి* అని చెప్పుకోవడమే సంప్రదాయము.
అయినను, అజాజైత్రీ అన్నది రెండు నామాలుగా చెబితే ఎలా ఉంటుందో పరిశీలిద్దాము.
*అజా* అంటే పుట్టుక లేనిది. *ఓం అజాయై నమః* అని ఉచ్చరించవలెను. పుట్టడం అనేది మరణం ఉన్నవాడికి మాత్రమే. నిత్యము, సత్యము అయిన జగన్మాతకు - పుట్టకకు ముందు, పుట్టినపుఢు, మరియు పోయినపుడు అను స్థితులు లేవు. జగన్మాత ఆద్యంతములేని ఆత్మస్వరూపిణి. పుట్టడం, పెరగడం, ఉండడం, కృశించడం, నశించడం వంటి షడ్వికారాలు ఆమెకు లేవు. అందుకే ఆ జగదీశ్వరి *అజ* అని సార్థకనామధేయురాలు అయినది.
ఇక *జైత్రీ* అను రెండవ నామాన్ని *ఓం జైత్ర్యై నమః* అని ఉచ్చరించవలెను. *జైత్రీ* అంటే జయించు శీలము గలది. దుష్టశిక్షణ, అజ్ఞాన నిర్మూలన, పంచకృత్య పరాయణత్వము - వీటిని సాధించి జైత్రయాత్ర నడుపునది అమ్మవారు కనుక *జైత్రీ* అని నామము గలిగినది. అమ్మవారిని స్తుతించునపుడు *ఓం జైత్ర్యై నమః* అని అంటాము.
ఏమైనా సంప్రదాయానుసారం జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అజాజైత్ర్యై నమః* అని అనవలెను.
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*664వ నామ మంత్రము*
*ఓం లోకయాత్రా విధాయిన్యై నమః*
చతుర్దశ భువనములలోని వైవిధ్యభరితమైన సృష్టిస్థితిలయలు, జీవుల జీవన సరళి, మానవాళి వర్ణాశ్రమ ధర్మములు మొదలైన వాటికి తగినట్లుగా విధానములను, పద్ధతులను విధించి, సంరక్షించు స్వభావము గలిగిన శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *లోకయాత్రా విధాయనీ* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) *ఓం లోకయాత్రా విధాయిన్యై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునికి ఆ తల్లి కరుణతో వర్ణాశ్రమ, పురుషార్థ (ధర్మార్థకామమోక్షములు) ధర్మముల జ్ఞానమును ప్రసాదించి, భౌతికపరమైన సుఖసంతోషములతోబాటు, ఆధ్యాత్మికానందమును ప్రసాదించును.
పదునాలుగు లోకాలలో తానే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకియై , పదునాలుగు లోకాలలో సృష్టిస్థితిలయకార్యములయందు అత్యంత సామర్థ్యతాపరమైన నిర్వహణకు, ఆయా లోకాలలో ఉన్న జీవులకు చేయవలసిన పనుల విధానాన్ని ముందుగానే నిర్ణయిస్తూ, మానవాళికి వర్ణాశ్రమధర్మములను, విధులను విధించుతూ, సంచితకర్మల ఫలములను మున్ముందు రాబోవు జన్మలలో అనుభవించునట్లు నింబంధనలేర్పరచి, కర్మల ఫలితముల కనుగుణంగా జీవులకు శరీరాలను నిర్ణయిస్తూ లోకాలన్నిటినీ పర్యవేక్షణా కార్యముపై యాత్రయనునట్లుగా పర్యటించు *లోకయాత్రా విధాయని* ఆ పరమేశ్వరి.
పదునాలుగు లోకముల యాత్ర (ప్రళయ సంరక్షణములు) చేయు స్వభావము గలిగినది జగన్మాత అని భాస్కరరాయలువారు అన్నారు. యాత్ర అనగా ప్రళయముగాని, సంరక్షణముగాని యని భాస్కరరాయలువారు (సౌభాగ్య భాస్కరంలో) చెప్పారు.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం లోకయాత్రా విధాయిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
665వ నామ మంత్రము
ఓం ఏకాకిన్యై నమః
అనంతవిశ్వంలో పదార్థమయమైన ప్రకృతియే తానుగా, సృష్టించునది, లయింపజేయునది, జీవుల ఆనందాహ్లాదములకు, సుఖదుఃఖములకు, సంకల్పవికల్పములకూ.అన్నిటికీ తానుగా, తనకన్న అన్యమేదీలేని ఏకాకినియై నిలచిన జగన్మాతకు నమస్కారము
శ్రీలలితా సహస్ర నామావళి యందలి ఏకాకినీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం ఏకాకిన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తునికి ఆ తల్లి సర్వాభీష్టసిద్ధిని కలుగజేయును. సుఖసంతోషములను, ఆత్మానందాన్ని ప్రసాదించును.
సృష్టికంతటికీ మూలకారణమైనది శ్రీమాత. ఈ భౌతిక విశ్వంలోని పదార్థమయమై, ఆ పదార్థమయమైన ప్రకృతే జగన్మాతస్వరూపమై, జీవుల జీవనసరళిలోని సంకల్పవికల్పాలకు, అనందము,ఆహ్లాదము, వాటికి సంబంధించిన లక్షణాలు, వాటిగుణాలు అన్నిటికీ జగన్మాతయే కారణమై, అంతకన్నా ఇంకెవరూ ఉండని ఏకైక జనయిత్రి. అందుకనే అలాంటి జనయిత్రిలు వేరెవ్వరూ లేని ఏకాకిని. ఆ తల్లియే లోకములను సృష్టిస్తున్నది మరియు లయింపజేస్తున్నది. లయకాలంలో అన్నీ తనలో లీనమైనప్పుడు ఎవరూలేక తొనొక్కతే ఏకాకిని అగును. ఏకమేవాద్వితీయం బ్రహ్మ పరబ్రహ్మ అద్వితీయమైనది. ఇక రెండవది అన్నదే లేదు. అందుకే జగన్మాత ఏకాకినీ అని స్తుతింపబడుచున్నది.
అట్టి అద్వితీయమైన శక్తిస్వరూపురాలయిన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ఏకాకిన్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
666వ నామ మంత్రము
ఓం భూమరూపాయై నమః
వేరొకటి కనబడని, మరింకేదీ వినబడని తురీయావస్థలో ఉంటూ, అదే పరమసుఖావస్థగా, పరబ్రహ్మరూపముగా, సర్వాధార స్వరూపంగా చెప్పబడుచూ, ఇంద్రియములు మనసునందు, ఆ మనసునందు బుద్ధి, ఆ బుద్ధి పరిపూర్ణమైన ఏకాగ్రతతో ఆత్మయందు లయమైన భూమరూపిణిగా విలసిల్లు జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి భూమరూపా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం భూమరూపాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగదీశ్వరిని పూజించు భక్తులకు సర్వాభీష్టసిద్ధిగలుగును.
ఏ పరమాత్మకంటె రెండవ పెద్ద వస్తువును చూడలేమో, ఇతరములేవీ వినలేమో లేక మరే ఇతరమును తెలియలేమో అదే భూమపదార్థమని చెప్పబడును. ఏది భూమమో అదే సుఖస్వరూపము అని ఛాందోగ్యోపనిత్తులో చెప్పబడినది. భూమమనగా పరబ్రహ్మస్వరూపము అని సూత్రభాష్యములో భూమాధి కరణమునందు నిర్ణయింపబడినది. ఏకాకినీ అను (665వ) నామ మంత్రములో శ్రీమాత అద్వితీయురాలు అనగా తానే ప్రథమం అని చెప్పబడినది. ఆమె అద్వితీయురాలైనను ఉపాధులనుబట్టి, లోకస్థులకోసం బహురూపములను పొందినది. అందులో ముఖ్యంగా నవదుర్గలు ఉన్నారుకదా! ఉదాహరణకు స్ఫటికమాణిక్యము ఒక్కటే అయినను దగ్గరగా ఉన్న చిత్రముల వర్ణములచే అనేక వర్ణములు గలిగినట్లుగా సత్త్వాదిగుణముల వలన శ్రీమాత బహురూపిణి. అందుకే భూమరూపా అనగా బహురూపములు కలిగినదని ఆ నామముతో ప్రసిద్ధిచెందినది. గుణవిశేషముచేత మేఘము ఒక్కటే. కాని చిన్నమేఘము, పెద్ద మేఘము, ఎఱుపు, తెలుపు, నలుపు, దూది పింజలవలెను అనేక రూపములలో కనబడుచున్నది. అలాగే శ్రీమాత గుణములను బట్టి, అవతారములను బట్టి అనేకరూపములు గలిగినది. వాయువు అంటే అర్థం ఒకటే. ఒకటి ప్రాణవాయువు, మరొకటి మనం విడిచిన బొగ్గుపులుసు వాయువు. అలాగే ప్రాణ, వ్యాన, అపాన, ఉదాన, సమాన వాయువులు మరియు మల్లెసుగంధములు, అపాన దుర్గంధములు అనేక విధములుగా తోచునట్లే దేవికూడా ఒకపరి ఉగ్రురాలిగా, మరియొకపరి భయంకరమైన కాళిగా,దుర్గగా, ఇంకొక సారి బాలగా, ధూమావతిగా, లక్ష్మీస్వరూపురాలిగా ఆ అమ్మ బహురూపులను దాల్చినది. అలాగే గార్హస్పత్యాగ్ని ఒక్కటే అయినను దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని అని అనేక నామములను పొందుచున్నట్లే శ్రీమాత బ్రహ్మ, క్షత్రియ, వైశ్యాది నామములు గలిగినది. ఈ విధముగా ఆలోచించితే భూమరూపా అను నామసార్థకతకు ప్రమాణములెన్నియోగలవు. జగన్మాతయందు భక్తి గలిగిన వారికి అన్నికోరికలు నేరవేరును. కూర్మపురాణమందు గూడ కామేశ్వరీ శక్తి మాత్రమే పరమాత్ముని సన్నిధియందు అనేక ఉపాధులను పొంది అనేకరూపములతో మెలగినది అని కలదు. అందుకే భూమరూప అనగా బ్రహ్మరూపిణి.
అట్టి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం భూమరూపాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
667వ నామ మంత్రము
ఓం నిర్ద్వైతాయై నమః
సమస్త బ్రహ్మాండములు, అందుజీవులు, ఆ జీవుల జీవన ప్రవృత్తులకు అన్నిటికీ తానే కారణమై, అన్నియు తననుండే ఉద్భవించినదై, సర్వస్వరూపములలో తాను తక్క అన్యమేదియు లేక, సమస్తమూ ఆ పరబ్రహ్మ స్వరూపములుగా ద్వైతమన నేదియు కాని నిర్ద్వైతా స్వరూపిణియైన జగజ్జననికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిర్ద్వైతా అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం నిర్ద్వైతాయై నమః అని ఉచ్చరించుచూ భక్తిశ్రద్ధలతో ఆ లోకేశ్వరిని అత్యంత భక్తి ప్రపత్తులతో ఉపాసించు సాధకునకు జగమంతయు ఆ జగదీశ్వరి తక్క అన్యమేమియు కాదనియు, ఆ జనని నామ మంత్ర జపమే సమస్త పాపకర్మల ఫలితములనుపశమింప జేసి, సత్కర్మలయాందాసక్తినేర్పరచి, నిత్యము ఆ కామేశ్వరి పాదసేవయందే నిమగ్నమొనర్చి తరింపజేయును.
జీవుడు వేరు దేవుడు వేరు అనునది ద్వైతము. ఇంతకు ముందు నామ మంత్రములో (భూమరూపా) తానుదక్క అన్యమయినది మరొక్కటి లేనిది అఖండముగా, శాశ్వతముగా విరాజిల్లు పరబ్రహ్మమే భూమమనియు, ఆ భూమమయినది సుఖస్వరూపమనియు చెప్పబడినది. ద్వైతము నిత్యమైతే అద్వైతము శాశ్వతము. ద్వైతము అనిత్యము, అసత్యము, మరణశీలమైనది, అటువంటి ద్వైతము లేనిది శ్రీమాత కనుక నిర్ద్వైతా అను నామాంకిత అయినది.
జీవులు ఎన్నో ఉన్నాయి. పులి, సింహము, పిల్లి, కుక్క మరియు మనుష్యుడు కూడా. జీవించి ఉన్నంతవరకే ఆ శరీరములోని ఆత్మకు ఆ శరీరముపేరు ఉన్నది. కాని మరణించిన తరువాత ఆత్మ తప్ప ఇంక ఆ జీవికి వేరే గుర్తింపు ఉండదు. ఆ శరీరము నుండి వేరు అయిన ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. ఇప్పుడు జీవుడు దేవునిలో చేరితే జీవుడు, దేవుడు ఒకటే అని చెప్పడమవుతుందికదా. ఇదే అద్వైతము. అజ్ఞానంలో ఉన్న జీవాత్మ తాను వేరు అనుకుంటాడు. బంధాలు తెగిన తరువాత పరమాత్మలో చేరిన జీవాత్మ కూడా పరమాత్మ అవుతుంది. అజ్ఞానపు పొరలు తొలగిన జీవాత్మ తానే పరబ్రహ్మ అని తెలియవస్తుంది. బ్రహ్మము నెరుగుట కూడా బ్రహ్మమే. ఈ ప్రపంచం వివిధరకాల జీవులతో వివిధ రకాల ప్రవృత్తులతో బ్రహ్మ వేరు జగత్తు వేరు అనిపించవచ్చు. ఆత్మజ్ఞానం ద్వారా, శాస్త్రజ్ఞానంద్వారా జీవుడు, దేవుడు అనేది తెలుసుకోవచ్చు. అమ్మవారు ఏకాకినీ అన్నాము. తనకన్నా అధికమైనదేదీ లేక తానే ఏకాకిని అనిపించించుకుంది. అంటే అద్వితీయమేకదా. రెండుభావాలకు చోటులేదుకదా. భూమరూపా బ్రహ్మస్వరూపురాలు. అంటే బ్రహ్మమంటేనే పరమాత్మ. అంతకన్నా మించినదేదీ లేని అద్వితీయమైన పరమాత్మ. ఈ నామ మంత్రములో ద్వైతభావమూనకు అవకాశములేని నిర్ద్వైతా
అటువంటి పరమాత్మయైన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిర్ద్వైతాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
668వ నామ మంత్రము
ఓం ద్వైతవర్జితాయై నమః
జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, అన్ని తానే, తానే అన్నీ అంటూ జీవుడికి దేవుడికి భేదముందనే ద్వైతాన్నిలేనిదిగా విరాజిల్లు భువనేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి ద్వైతవర్జితా అను అదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం ద్వైతవర్జితాయై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తిప్రపత్తులతో శ్రీమాతను పూజించు భక్తులకు ఆ తల్లి సకలాభీష్టసిద్ధినొసగి, అధ్యాత్మికానందముతో తరింపజేయును.
జగన్మాతకు జీవుడు వేరు, పరమేశ్వరుడు వేరు అను భావములు లేనిది. ఇంతకు ముందు నామ మంత్రములలో (ఏకాకినీ, భూమరూపా, నిర్ద్వైతా) లో జగన్మాతకు ద్వైతభావము పోయినది అని చెప్పబడినది. కాని ఆ తల్లికి ఆ భావము వచ్చుట, మరియు పోవుట అనేదే లేదు. ఆ జగన్మాతకు ఉన్నదే అద్వైతభావన. ద్వైతభావన అనగా జీవుడు వేరు, దేవుడు వేరు అన్నటువంటి భావన శ్రీమాతకు మొదటి నుండియు లేదు. అందుకే ఆ జగదీశ్వరిని ద్వైతవర్జితా అని స్తుతిస్తున్నాము. ద్వైతంలో స్వతంత్రత పరతంత్రతా అను రెండుభావములు కలవు. జీవి పరతంత్రుడు అన్నందుకు ఒక మాట. మరణానంతరము జీవి అంగుష్టమాత్ర శరీరుడై శ్రీమన్నారాయణుని సన్నిధిలో ఉంటాడు. దీనినే సామీప్యముక్తి అని చెప్పారు. కాని అద్వైతంలో సాయుజ్యం సంప్రాప్తిస్తుంది. జీవాత్మ పరమాత్మలో లీనం అవడం జరుగుతుంది. అందుకే జగన్మాతను ద్వైతవర్జితా అని అన్నాము.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ద్వైతవర్జితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
669వ నామ మంత్రము
ఓం అన్నదాయై నమః
జీవులకు ఆయా పూర్వజన్మవాసనల ప్రకారము, కర్మల ననుసరించి, మానవాళికి వర్ణాశ్రమధర్మములకు అనుగుణంగా ఆహారమును ప్రాప్తింపజేయు మాతృస్వరూపిణి అయిన జగజ్జననికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి అన్నదా అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం అన్నదాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగజ్జననిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు బిడ్డలవంటి తన భక్తులకు అన్నవస్త్రములకు లోటులేక, సుఖసంతోషములతో జీవనము కొనసాగించుచూ సర్వదా ఆ తల్లి కరుణామయ ధృక్కులను అమృతధారలలో ఓలలాడింపజేయును.
అన్నమును ఇచ్చునది జగన్మాత. అందుకే జగన్మాత అన్నదా అని స్తుతిస్తున్నాము.
అన్నం జనేభ్యో దదాతి - ప్రజలకు అన్నమునిచ్చునది (సౌభాగ్య భాస్కరం)
అన్నం మనం తినేది. మితంగా, హితంగా తిన్నంతవరకూ అది మనం తినేది అన్నము. మితిమీరి తింటే - అది వయస్సు మళ్ళినవారైనా, వేళతప్పినా, నిలవ ఉన్నదైనా అయితే దానివలన మనం తిన్నది కాదు అది. అది మనను తినినట్లు అవుతుంది. రోగగ్రస్తులమౌతాము. ప్రాణాలమీదకు కూడా వస్తుంది. అన్నమయినా జలమైనా కావచ్చు. గ్లాసుతో త్రాగితే దాహం తీరుతుంది. నూతిలోపడి నీరుత్రాగితే ఊపిరి సలపక ప్రాణంతీస్తుంది. దేనికైనా మితం అనేదే హితం. మితిని దాటి గతిని మార్చుకోకూడదు.
సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-36
అర్జునస్య ప్రతిజ్ఞే ద్వే న దైన్యం న పలాయనమ్ ।
ఆయూ రక్షతి మర్మాణి ఆయురన్నం ప్రయచ్ఛతి ॥36॥
దైన్యము లేకపోవడం, పారిపోకపోవడం ఈ రెండే అర్జునుని పతిజ్ఞలు. ఆయుర్దాయం ఉంటే అదే మర్మాలను రక్షిస్తుంది. అన్నం పెడుతుంది.
ఆయువు అన్నాన్నిస్తుంది. శ్రీమాత ఆయువు, అందుకు అన్నము ఇస్తుంది. ఇదే కదా - నారుపోసినవాడు నీరుపోయడా సాధారణంగా అంటూ ఉంటాము ఈ మాట.
డబ్బుఇవ్వండి. ఇంకా కావాలి. నగలు ఇవ్వండి. మరో నగకావాలి. మళ్ళీ కావాలి. అన్నంపెట్టండి. పట్టెడు పెట్టాం. మంచి కూర వేశాం. తింటాడు. కూర బాగుంది. మళ్ళీ పెడతాం తింటాడు. ఎంతసేపు కడుపు నిండేవరకూ. ఆపైన కోటి రూకలిచ్చినా ఒక్క మెతుకు కూడా ముట్టుకోడు. తిను, లేక పోతే చస్తావ్ అన్నా సరే. తినడు. అదీ అన్నంలో ఉన్నమహిమ. అటువంటి అన్నం పెట్టేది అమ్మ. కడుపు నిండితే ఇంక కావాలని అడగడు. అందుకే జగన్మాత తృప్తి అలవాటు చేసుకోవడం కోసం అన్నం పెడుతుంది. కోటి విద్యలూ కూటి కొరకే అన్నాం కదా. అందుకే శ్రీమాత అన్నంపెట్టి తృప్తి పరుస్తుంది జీవుడిని. అందుకే ఆ తల్లిని అన్నదా అని స్తుతించుతున్నాము. జీవుడికి ప్రాణం నిలబడాలంటే ముందు గాలి, తరువాత అన్నం, ఆ తరువాత నీరు. అనగా గాలి-అన్నం-నీరు ఈ మూడూ కూడా అన్నం అనే మాటక్రిందే వస్తాయి. అన్నమంటే ఇక్కడ ఆహారము. అది రొట్టైనా, అన్నమైనా లేక ఇంక ఏదైనా ఆహార రూపంలో తీసుకునే దాన్ని అన్నం అంటాము. అన్నం తిన్న తరువాత ఆశాజీవి మానవుడు ఏవేవో కోరుతూనే ఉంటాడు. కాని జగన్మాత మనిషికి అత్యవసరమైన అన్నం పెడుతుంది ముందు. ఆ తరువాత జీవునియొక్క అర్హతను బట్టి, పూర్వజన్మ వాసనను అనుసరించి ఏంకావాలో అది ఇస్తుంది. అంటే ఎవరికి ఏంకావాలో అది జగన్మాతకు తెలుసు.
శ్రీమాత అన్నం (భుజించే ఆహారం ఏదైనా) ఎలా ఇస్తుంది?
వేదాలలోఅన్నిటికన్నా ఆఖరులో భూమి ఉద్భవించింది. భూమి నుండి ఓషధులు, ఓషధుల నుంచి అన్నము వచ్చింది. ఇదంతా లోకేశ్వరి అయిన జగన్మాత సంకల్పం మాత్రమే. అందుకే ఆ పరమేశ్వరి సంకల్పం మాత్రాన ఆహారం వచ్చింది కనుక ఆ తల్లిని అన్నదా అని స్తుతించుచున్నాము. వర్షాలకోసం యజ్ఞాలు చేస్తాము. హోమగుండంలో అగ్నిలో ఆదిత్యునికిచ్చిన ఆహూతుల వలన వేడి, ఆ వేడి ఆదిత్యుని ప్రకాశము పెరిగి, నదులు, సముద్రమల లోని నీరు ఆవిరై, మేఘాలై, వానగా కురిసి, మరల వాగులు, వంకలు, నదులు, జలాశయములు జలకళను సంతరించుకుని కాయధాన్యాలు, గింజధాన్యాలు, కూరగాయలు, పళ్ళు వివిధరకములైన ఆహారోత్పత్తులు జరిగి జీవులకు ఆహారం (అన్నము) లభిస్తుంది. ఇదంతా ఆ అఖిలాండేశ్వరి సంకల్పము మాత్రమే. అందుకే ఆ జగన్మాతను అన్నదా అని భజించుతాము.
మిరపకాయ అన్నం ఒకడు తింటే, పంచభక్ష్య పరమాన్నములు మరొకడు తింటాడు. మత్స్యమాంసాదులు ఒకడు తింటే ఆకులలమలు వేరొక జీవితింటుంది. ఏది తిన్నా, ఎంత తిన్నా ఆ జీవి యొక్క పూర్వ జన్మ కర్మలఫలంగా జన్మ ఎత్తడం, ఆ జన్మలో, ఆ జీవికి ఉండే ఆహార నియమాల ననుసరించి ఆహారం తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా ఆకలి తీరడం కోసమే. ఇదంతా ఆ పరమేశ్వరి సంకల్పము వలననే. అందుకే ఆ పరమేశ్వరిని అన్నదా అని ప్రార్థించుచున్నాము.
మనం తక్కువ పూజ చేస్తే ఎక్కువ ఫలం లభించదు. అలాగే జీవియొక్క అవసరాలననుసరించి ఆ జగన్మాత ఆహారం ఇస్తుంది కనుక ఆ తల్లిని అన్నదా అని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నాము. అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం అన్నదాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
670వ నామ మంత్రము
ఓం వసుదాయై నమః
ధనము, ధాన్యము, రత్నమాణిక్యములు మొదలైన ప్రాపంచిక సంపదలే కాక, సత్యము, నిత్యమైన ఆధ్యాత్మిక సంపదలూ, మోక్ష సంపదలూ కూడా తనను ఆరాధించు భక్తులకు ప్రసాదించు జగజ్జననికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి వసుదా అను మూడక్షరముల నామ మంత్రమును ఓం వసుదాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఎనలేని భక్తిప్రపత్తులతో ఆరాధిస్తే ఆ సాధకునకు తన పూర్వ సుకృతానుసారము, ఈ జన్మలో చేసిన దానధర్మముల ఫలముగా జగన్మాత కరుణించి సర్వ సంపదలనూ (ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యములు) ప్రసాదించును. మరియు బ్రహ్మజ్ఞాన సంపదను కూడా ఆ సాధకుని కులాచారములకు తగినట్లు సంప్రాప్తింపజేయును.
ఇంతకు ముందు నామ మంత్రముల ప్రకారం ఆహారము సంప్రాప్తింపజేసినది. ఈ నామ మంత్రప్రకారం జీవులకు స్థితి స్థాపకతకు తగినట్లుగా గూడు, వర్ణాశ్రమ ధర్మముల ప్రకారం ఆధ్యాత్మిక చింతనకు, మనశ్శాంతి కొరకు అనువైన గూడు, భగవధ్యానమునకు సరైన ఏర్ఫాటుతోను, రాబోవు జన్మలనిమిత్తం ధర్మకార్యములొనరించుటకు, తాను తన కుటుంబముతో ఆనందముగా జీవనము కొన సాగించుటకు కావలసిన ఐశ్వర్యలక్షణములు ఏర్పరచును. పురుషార్థములైన ధర్మ, అర్ధ,కామములను పాటించుచూ, తద్ద్వారా నాలుగవ పురుషార్థమును పొందుటకు కావలసిన జ్ఞాన సంపదను కూడా ప్రసాదించును. సంపదలన్నియు సిరితా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ అన్నట్లు కొబ్భరికాయలో నీరు చేరినంతసులువుగా కలుగ జేయును. తానిచ్చిన సంపదలు సద్వినియోగమైనట్లైతే మరింత ప్రసాదించి వక్రమార్గమునకు పోకుండా కాపాడును. దైవమును సైతము ధిక్కరించి జగన్మాత ప్రసాదించిన సంపదలు జీవహింసకు, త్రాగుడు, పరస్త్రీలోలత్వము వంటి దుర్వ్యసనములకు పోయినచో క్రమక్రమముగా తానిచ్చిన సంపదలు (ఆయురారోగ్యములు, కీర్తప్రతిష్ఠలతో సహా) వివిధ రీతులలో సిరి తా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమ్మీ అన్నట్లు హారతికర్పూరంలా ఆవిరి చేయును.
కాన జ్ఞానిగా, అరిషడ్వర్గములను అదుపులో ఉంచుకుంటూ, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా అనునది మనసులో ఉంచుకుంటూ మరుజన్మకు పుణ్యఫలం opening balance ఉండు మాదిరిగా చివరి ఊపిరి వరకూ జాగ్రత్తగా ఉండి, పరమేశ్వరి కృపకొరకై నిత్యసాధనలో జీవితమును గడపవలెను.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం వసుదాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
671వ నామ మంత్రము
ఓం వృద్ధాయై నమః
సృష్టికి పూర్వమే, త్రిమూర్తులకు కూడా తానే తొలుతగా, అందరి కన్ననూ జ్యేష్డురాలిగా, స్థూల జగత్తులనే వృద్ధిపొందించిన పరబ్రహ్మ స్వరూపిణియైన ఆదిపరాశక్తికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి వృద్ధా అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం వృద్ధాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ ఆదిపరాశక్తిని ఉపాసించు సాధకునకు జగన్మాత బ్రహ్మస్వరూపిణిగా, బ్రహ్మజ్ఞాన ప్రదాయినిగా గోచరించగా, ఆ సాధకునికి తన జన్మతరించినది అను ఆత్మానందానుభూతి కలుగును
జగన్మాతను వృద్ధా అని అన్నారు. ఎందుకు? ఉదాహరణకు జ్ఞాని, అజ్ఞాని అను ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అజ్ఞాని వయసు అరవై సంవత్సరములు. జ్ఞాని వయసు ముప్పది సంవత్సరములు. అజ్ఞాని జ్ఞానికి నమస్కరించాడు. ఒక సాంప్రదాయవాది అయ్యో అపచారం జరిగింది అన్నాడు. ఆ అజ్ఞాని అన్నాడు నేను వృద్ధుడను. ఆయన జ్ఞానవృద్ధుడు. ఆయనవలననే లోకోపకారం జరుగుతుంది. నేను నాకుటుంబానికే ఏమీ చేయలేను అన్నాడు. అది నిజమే వయసుచేత వృద్ధుడు కాలేడు. మంచి బుద్ధిచే వృద్ధుడౌతాడు అంటారు. జగన్మాత సృష్టికి పూర్వమే, త్రిమూర్తులకు కూడా తానే తొలుతగా, అందరికన్నా జ్యేష్ఠురాలైనది. అన్నిటికీ మించి ఆ తల్లి పరబ్రహ్మస్వరూపిణి. అందుకే వృద్ధా అని స్తుతించాము. అందుకే జగన్మాత ఆదిపరాశక్తి ( ఆది పరాశక్తి).
త్వం జీర్ణా దండేన వంచసీతి, గచ్చ సీత్యర్థః నీవు ముదుసలివై దండముతో నడచుచున్నావు అని వేదములలో చెప్పబడినది అని భాస్కరరాయలు వారి సౌభాగ్య భాస్కరం చెపుతున్నది.
ఇక ఆ శ్రీమాతయే కదా సృష్టికి కారణభూతురాలైనది. అంటే సృష్టికి ముందే ఉన్నదనేగదా. అందుకే ఆమే జ్యేష్ఠురాలు. అందుకే అమ్మను వృద్ధా అను నామ మంత్రముతో స్తుతిస్తున్నాము. ఆతరువాతనే త్రిమూర్తులు బయల్వెడలినారు. గనుక మరొకసారి అమ్మను వృద్ధా అందాము. అని స్తుతించుదాము. తన సృష్టిని తానే వృద్ధి చేస్తోంది. బ్రహ్మజ్ఞాన సంపదనిచ్చి యోగులను, జ్ఞానులను, పుణ్యనదులను, పుణ్యక్షేత్రములను, పవిత్రమైన నైమిశారణ్యమువంటి వనములను, అడుగడుగునా దైవ మందిరములు, శక్తిపీఠములు, ఆదిశంకరాచార్యులు వంటి జగద్గురువులను, ధర్మపీఠములను, గోమాతలు పుష్కలమైన ధాన్యసంపదలనిచ్చే క్షేత్రములు ఎన్నో ఇచ్చి సృష్టిని వృద్ధిపొందించుతోంది. అందుకే జగన్మాతను వృద్ధా అని స్తుతిస్తున్నాము. దుష్టులను శిక్షించి, పుణ్యాత్ములనుద్ధరించుచున్న పరబ్రహ్మస్వరూపిణి గనుకనే జగన్మాతను వృద్ధా అని స్తుతిస్తున్నాము.
అటువంటి పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం వృద్ధాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
672వ నామ మంత్రము
ఓం బ్రహ్మాత్మ్యైక్య స్వరూపిణ్యై నమః
చైతన్యముతో జీవులందరూ ఐక్యమును పొందుటయే తన నిజస్వరూపంగా గల ఆదిపరాశక్తికి నమస్కారము.
ప్రాణమున్నవి, ప్రాణము లేనివి, చెట్లు, పుట్టలు, కొండలు, బండలు, పశుపక్ష్యాదులు ఒకటేమిటి బ్రహ్మాది పిపీలిక పర్యంతము సర్వమూ తానే అయి ఉన్న పరమేశ్వరికి నమస్కారము.
శ్రీ లలితా సహస్ర నామావళి యందలి బ్రహ్మాత్మ్యైక్య స్వరూపిణీ అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం బ్రహ్మాత్మ్యైక్య స్వరూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరబ్రహ్మ స్వరూపిణియైన జగన్మాతను ఉపాసించు సాధకుడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడై, భౌతికముగా సుఖసంతోషములతోను, జగన్మాత స్వరూప తత్త్వమును తెలిసికొని ఆత్మానందానుభూతిని పొంది జన్మతరించినది అని భావించును.
ఆత్మపరమాత్మల ఐక్యస్వరూపముగా జగన్మాత విరాజిల్లుచున్నది. జీవునికి దేవునికి ఏకత్వమును బోధించు సోఽహం అను హంసమంత్రమే పరమేశ్వరి స్వరూపము. ఈ నామ మంత్రములోని బ్రహ్మ అనునది బ్రహ్మవిద్య అయితే ఆత్మ అనునది ఆత్మవిద్య. అలాగే బ్రహ్మ అనగా బ్రహ్మాండజ్ఞానము. ఆత్మ అనగా పిండాండ జ్ఞానము. ఈ బ్రహ్మాండజ్ఞానమును, పిండాండజ్ఞానమును సమన్వయంచేసే మూలమంత్రస్వరూపిణి అయిన జగన్మాత బ్రహ్మాత్మైక్య స్వరూపిణీ అని జగన్మాత స్తుతింపబడుతున్నది.
నాలుగు వేదములు నాలుగు మహావాక్యములు చెప్పినవి.
1) పరబ్రహ్మము, 2) అహం బ్రహ్మాస్మి, 3) తత్త్వమసి, 4) అయమాత్మా బ్రహ్మా
1) ఋగ్వేద మహావాక్యము పరబ్రహ్మము
ఈ బ్రహ్మాండము పరబ్రహ్మము నుండి జనించినదని, ఈ చరాచర సృష్టికి శుద్ధ చైతన్యము బ్రహ్మమేనని తీర్మానించినది. బ్రహ్మమే సర్వజ్ఞతను కలిగియున్నది. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులను నడిపించే చైతన్యమే ఈ పరబ్రహ్మము
2) యజుర్వేద మహావాక్యము అహంబ్రహ్మాస్మి అనగా నేనే పరబ్రహ్మమని జీవుడు భావించడం. అనేక జన్మలలో జీవుడు పరిభ్రమిస్తున్నాడు. కాని అన్ని జన్మలలోను స్వరూపము ఆత్మగా వెలుగొందుతున్నది. తనకు లభించిన దేహమనే ఉపాధిలో జ్ఞానమును ప్రోది చేసుకొని ‘నేనే ఆత్మస్వరూపుడను’ అనే సత్యాన్ని దర్శించి ముక్తిని పొందుతాడని ఈ యజుర్వేద మహావాక్యము
3) సామవేద మహావాక్యము తత్త్వమసి చరాచరమంతా వ్యాపించియున్న శుద్ధచైతన్యము ఎక్కడో లేదు, నీలోనే వుండి, నీవైయున్నదని నిర్వచించడం చాలా ఆశ్చార్యాన్ని, తృప్తిని కలిగిస్తుంది. శంకర భగవత్పాదులు చాటి చెప్పిన అద్వైతము ఈ మహావాక్యమునుండే ఆవిర్భవించినది అని భావించడం మనం వినియున్నాము. ‘ఏక మేవ అద్వితీయం’, ఉన్నది ఒక్కటే! అదే పరబ్రహ్మము. అది నీలోన, అంతటా వ్యాపించి ఉన్నదనే ఒక గొప్ప సత్యాన్ని అద్వైతము ఆవిష్కరించినది. ఆత్మ పరమాణు ప్రమాణమైనది. అటువంటి పరమాణువునుండే ఈ బ్రహ్మాండము ఆవిర్భవించినది. కావున ఈ బ్రహ్మాండములో భాగమైన నీవే ఆత్మవు అని వర్ణించింది.
4) అథర్వణ వేద మహావాక్యము అయమాత్మా బ్రహ్మ ఈ వాక్యము కూడా ఆత్మయే బ్రహ్మమని తెలియజేస్తోంది. జీవాత్మ పరమాత్మలు ఒక్కటేనని విచారించింది. ఈ వేదములోనే ప్రణవ సంకేతమైన ఓంకార శబ్దమును మానవాళికి అందించినది. లౌకిక వస్తు సమదాయములన్నీ వివిధ నామములతో సూచించబడినట్లే అనంత విశ్వమును ఓంకారమనే శబ్ద సంకేతముతో సూచించినది. గ్రహముల భ్రమణ శబ్దము ఓంకారమేనని ఇటీవల విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు భావిస్తున్నాయి.
ఈ నాలుగు మహావాక్యాలలోని అర్థమునకు స్వరూపమైన శ్రీమాత బ్రహ్మాత్మైక్య స్వరూపిణి అను ఈ నామమంత్రముద్వారా గ్రహించవలసి ఉంటుంది.
జగత్తులో స్థావరములు, జంగమములు, ప్రాణమున్నవి, ప్రాణము లేనివి, చెట్లు, పుట్టలు, కొండలు, బండలు, పశుపక్ష్యాదులు ఒకటేమిటి బ్రహ్మాది పిపీలిక పర్యంతము సర్వమూ తానే అయి ఉన్నది ఆ శ్రీమాత గనుకనే ఆ తల్లిని బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ అను నామ మంత్రముతో స్తుతిస్తున్నాము.
ఆ పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం బ్రహ్మాత్మైక్య స్వరూపిణ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
673వ నామ మంత్రము
ఓం బృహత్యై నమః
బృహత్సామ స్వరూపిణిగాను, ముప్పది ఆరు అక్షరముల బృహతీ ఛందోరూపిణిగాను, జ్యేష్ఠసామస్వరూపిణిగాను విరాజిల్లు పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి బృహతీ అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం బృహత్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ అఖిలాండేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ తల్లి కరుణతో ఎంతటి బృహత్తరమైన సమస్య అయినను పరిష్కరింపబడి మానసిక ప్రశాంతననొందగలరు.
జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. పిండాండము నుండి బ్రహ్మాండము వరకూ తన యునికినే విస్తరింపజేసి ఎంతో గొప్పది అనుకుని, అంతకన్నా మరేదీ గొప్పది ఉండు అనాలంటే అంతటి బృహత్తమమైనది పరమేశ్వరి మాత్రమే. సర్వజగత్తుల సృష్టికి మూలకారణమైనది జగన్మాతయే. సృష్టికి మూలకారణమైనది జగన్మాత అంటే ఆ తల్లి కంటె గొప్పవి ఇంకేమి ఉండును? అందుకే శ్రీమాత బృహతీ అని స్తుతిస్తున్నాము.
వేద ఛందస్సులలో బృహతీ అను ఛందస్సు ఒకటి. ఈ ఛందస్సులో ఒకపాదమునకు తొమ్మిదక్షరముల చొప్పున నాలుగు పాదములకు ముప్పది ఆరక్షరములు ఉండును. అందుచే జగన్మాత వేదస్వరూపిణిగాన, 36 అక్షరముల బృహతీ ఛందోరూపురాలిగా కూడా భావించడమైనది.
వేదాలలో ముఖ్యంగా అనుష్టుప్ (8 అక్షరములు), బృహతి (9), పంక్తి (10), త్రిష్టుప్ (11), జగతి (12) అనబడు ఛందములను ఉపయోగించారు. మిక్కిలి ప్రఖ్యాతి గడించిన ఛందస్సు త్రిపద గాయత్రీ ఛందస్సు. అది తత్సవితుర్వరేణియం భర్గోదేవస్య ధీమహీ ధియో యోనః ప్రచోదయాత్. కొందరు మొదటి పాదములో వరేణ్యం అంటారు. అప్పుడు గాయత్రి ఛందస్సుకు 23 అక్షరాలే. ఇది గాయత్రిలో ఒక ప్రత్యేకత.
కూర్మ పురాణము నందు దేవియొక్క విశ్వరూప వర్ణనమందు సామలలో జ్యేష్ఠసామ నా స్వరూపము అని చెప్ప బడినది గనుక శ్రీమాత జ్యేష్ఠ సామ స్వరూపురాలు అని గ్రహించగలము.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం బృహత్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీలలితా సహస్రనామ భాష్యము
675వ నామ మంత్రము
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీలలితా సహస్ర నామావళియందలి 675వ నామ మంత్రము బ్రాహ్మీ సందర్భముగా తెలియజేయవలెనని అనుబంధంగా, చివరలో ఇస్తున్నాను. శ్లోకములు చదవకపోయినా, తాత్పర్యములు పఠించగలందులకు విజ్ఞప్తి.
శ్రీవేదవ్యాస మహాభాగవతం, తృతీయ స్కంధము, పండ్రెండవ అధ్యాయము 20వ శ్లోకము నుండి అధ్యాయము చివరి వరకు
బ్రహ్మదేవుని పుత్రులు, సరస్వతి బ్రహ్మదేవుని పుత్రికగా జన్మించుట, సాక్షాత్తు బ్రహ్మదేవుడే తన పుత్రిక అయిన సరస్వతిని మోహించుట, బ్రహ్మదేవుని పుత్రులు పదిమంది అందుకు వ్యతిరేకించుట, ఇంకా ఎన్నో ఉపయుక్తమైన విషయములు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
675వ నామ మంత్రము
ఓం బ్రాహ్మ్యై నమః
బ్రహ్మయొక్క సృజనాత్మక స్వరూపురాలు, బ్రహ్మచైతన్య స్వరూపురాలు, వాక్స్వరూపురాలు, జ్ఞానస్వరూపురాలు తానై మువురమ్మల మూలపుటమ్మగా విరాజిల్లు అఖిలాండేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి బ్రాహ్మీ అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం బ్రాహ్మ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరాశక్తిని మిగుల భక్తిశ్రద్ధలతో సేవించు భక్తులకు సరస్వతీ స్వరూపిణియైన శ్రీమాత సాధకునకు తాను చేయు వృత్తి వ్యాపారాదులయందు వాక్పటిమనేర్పరచి, వాక్చాతుర్యముతో తన వృత్తిప్రవృత్తులయందు రాణించునటులు చేయును. అదేవిధముగా తన వాక్కులో పవిత్రత ఏర్పరచి శ్రీమాతా నామస్మరణలో నిరతము నిమగ్నమొనర్చి తరింపజేయును.
సృష్టియంతయు పరమేశ్వరి ప్రేరణ మాత్రమే. కారణము తానయితే బ్రహ్మ ఆ పనిని నెరవేర్చుచున్నాడు. ఈ సమస్త సృష్టిని చేయు బ్రహ్మ వేరు బ్రహ్మమువేరు. బ్రహ్మ అంటే చతుర్వేదములు, చతుర్ముఖుడు, బ్రాహ్మణుడు మరియు పురోహితుడు. కాని బ్రహ్మము అనేది వేదాంతమునకు, యోగము, తత్త్వము, తపస్సు, శాస్త్రములు మొదలగునవి. బ్రహ్మ యొక్కశక్తి బ్రాహ్మి. సప్తమాతృకలలో బ్రాహ్మి మొదటిది. ఈ సప్తమాతృకల గూర్చి కొంచం తెలుసుకుందాము.
బ్రాహ్మి ... మహేశ్వరీ ...కౌమారి'. వైష్ణవి ... వారాహి ... ఇంద్రాణి... చాముండి దేవతలను సప్త మాతృకలు అంటారు. దేవీ పురాణం ... బ్రహ్మవైవర్త పురాణం ... స్కంద పురాణం ... సప్తమాతృకల ఆవిర్భావం గురించి వాటి విశిష్టతను గురించి పేర్కొన్నాయి. పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడి ఆగడాలు మితిమీరడంతో, వాడిని సంహరించడానికి శివుడు సిద్ధమయ్యాడు. అంధకాసురుడితో రుద్రుడు పోరాడుతూ వుండగా ఆ రాక్షసుడి నుంచి చిందిన రక్త బిందువులు రాక్షసులుగా మారేవి. విషయాన్ని గ్రహించిన శివుడు ... మహేశ్వరిని రంగంలోకి దింపాడు. 'వృషభ' వాహనంపై ఆమె యుద్ధభూమిలోకి ప్రవేశించింది.
దాంతో బ్రహ్మ పంపిన బ్రహ్మణి 'హంస' వాహనంపై ... విష్ణుమూర్తి పంపిన వైష్ణవి 'గరుడ' వాహనం పై ... కుమార స్వామి పంపిన కౌమారీ 'నెమలి' వాహనం పై ... వరాహమూర్తి పంపిన వారాహి 'మహిష' వాహనం పై ... ఇంద్రుడు పంపిన ఇంద్రాణి 'ఐరావతం' పై ... యముడు పంపిన చాముండి 'శవ' వాహనం పై యుద్ధభూమికి చేరుకున్నాయి. ఈ శక్తి స్వరూపాల సాయంతో అంధకాసురుడిని శివుడు సంహరించాడు.
ఇంతే కాకుండా ఈ సప్తమాతృకల పేర్లు మనం నిత్యం పఠించు ఖడ్గమాలాస్తోత్రం లో ప్రథమావరణ దేవతలలో చెప్తాము. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండీ కాని అక్కడ మహాలక్ష్మీ అని ఇంకొక మాతృక కూడా ఉన్నది కూడా ఊన్నది. ఈ విధంగా శ్రీచక్రములోని ప్రథమావరణ దేవతలలో గల బ్రాహ్మీ స్వరూపిణిగా శ్రీమాత విరాజిల్లుచున్నది. శ్రీమాత బ్రహ్మచైతన్యస్వరూపురాలైన బ్రాహ్మీ స్వరూపిణి. జగన్మాత వాక్స్వరూపురాలుగా బ్రాహ్మీ అని స్తుతింపబడుచున్నది. బ్రాహ్మీ స్వరూపిణి అయిన శ్రీమాత జ్ఞానస్వరూపిణి, చతుష్షష్టికళా స్వరూపిణి. అవిద్య అనగా అజ్ఞానమును మించిన జ్ఞానము గలిగినది. దేనివల్లనయితే ఈ భూతజాలమంతా ఉద్భవించుచున్నదో, వృద్ధి చెందుచున్నదో, దేనివలన లయం చెందుతున్నదో అది బ్రహ్మము. అట్టి బ్రహ్మమే ఈ బ్రాహ్మి. శుంభు నిశుంభులతో యుద్ధము చేయునపుడు పరమేశ్వరికి సహాయపడినది. మువురమ్మలకు మూలపుటమ్మ అనగా, లక్ష్మీ, సరస్వతి (బ్రాహ్మి), మహాకాళి (శ్రీమాత) అను త్రిశక్తులకు పరమేశ్వరియే మూలము అనుటచే జగన్మాత బ్రాహ్మి అని నామ ప్రసిద్ధమైనది.
జగన్మాతకు నమస్కరించు నపుడు ఓం బ్రాహ్మ్యై నమః అని అనవలెను.
శ్రీవేదవ్యాస మహాభాగవతం, తృతీయ స్కంధము, పండ్రెండవ అధ్యాయము 20వ శ్లోకము నుండి అధ్యాయము చివరి వరకు
బ్రహ్మదేవుని పుత్రులు, సరస్వతి బ్రహ్మదేవుని పుత్రికగా జన్మించుట, సాక్షాత్తు బ్రహ్మదేవుడే తన పుత్రిక అయిన సరస్వతిని మోహించుట, బ్రహ్మదేవుని పుత్రులు పదిమంది అందుకు వ్యతిరేకించుట, ఇంకా ఎన్నో ఉపయుక్తమైన విషయములు శ్రీలలితా సహస్ర నామావళియందలి 675వ నామ మంత్రము బ్రాహ్మీ సందర్భముగా తెలియజేయవలెనని అనుబంధంగా సమర్పించడమైనది. శ్లోకములు చదవకపోయినా, తాత్పర్యములు పఠించవచ్చును.
మైత్రేయ ఉవాచ
12.20 (ఇరువదియవ శ్లోకము)
ఏవమాత్మభువాఽఽదిష్టః పరిక్రమ్య గిరాంపతిమ్|
బాధమిత్యముమామంత్ర్య వివేశ తపసే వనమ్॥1641॥
మైత్రేయుడు నుడివెను- విదురా! బ్రహ్మదేవుడు ఇట్లు ఆజ్ఞాపింపగా పరమశివుడు ఆ ఆజ్ఞను శిరసావహించెను. పిదప అతడు బ్రహ్మదేవునకు ప్రదక్షిణమొనర్చి, ఆయన అనుమతితో తపస్సు చేయుటకై వనమందు ప్రవేశించెను.
12.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
అథాభిద్ధ్యాయతస్సర్గం దశపుత్రాః ప్రజజ్ఞిరే|
భగవచ్ఛక్తియుక్తస్య లోకసంతానహేతవః॥1642॥
శ్రీమన్నారాయణుని వలన సృష్టి రచనా సామర్థ్యమును పొందిన బ్రహ్మదేవుడు శివుని ఇట్లు ఆజ్ఞాపించిన పిదప సృష్టికార్యమునకు సంకల్పించెను. ఆయనకు పదిమంది పుత్రులు జన్మించిరి. వారు లోకమునందు ప్రజల అభివృద్ధికి కారకులైరి (వారి వలన ప్రజల సంఖ్య అభివృద్ధి చెందెను.
12.22 (ఇరువది రెండవ శ్లోకము)
మరీచిరత్ర్యంగిరసౌ పులస్త్య పులహః క్రతుః|
భృగుర్వశిష్ఠో దక్షశ్చ దశమస్తత్ర నారదః॥1643॥
12.23 (ఇరువది మూడవ శ్లోకము)
ఉత్సంగాన్నారదో జజ్ఞే దక్షోఽంగుష్ఠాత్స్వయంభువః|
ప్రాణాద్వశిష్ఠః సంజాతో భృగుస్త్వచి కరాత్క్రతుః॥1644॥
12.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
పులహో నాభితో జజ్ఞే పులస్త్యః కర్ణయోరృషిః|
అంగిరా ముఖతోఽక్ష్ణోఽత్రిర్మరీచిర్మనసోఽభవత్॥1645॥
అట్లు జన్మించిన పదిమంది పేర్లు - మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వసిష్ఠుడు, దక్షుడు, నారదుడు - ఆ బ్రహ్మదేవుని యొడి నుండి నారదుడు, బొటనవ్రేలినుండి దక్షుడు, ప్రాణములనుండి వసిష్ఠుడు, చర్మమునుండి భృగువు, చేతినుండి క్రతువు, నాభినుండి పులహుడు, కర్ణములనుండి పులస్త్యఋషి, ముఖమునుండి అంగిరసుడు, కనులనుండి అత్రి, మనస్సునుండి మరీచి ఉద్భవించిరి.
12.25 (ఇరువది ఐదవ శ్లోకము)
ధర్మః స్తనాద్దక్షిణతో యత్ర నారాయణః స్వయమ్|
అధర్మః పృష్ఠతో యస్మాన్మృత్యుర్లోకభయంకరః॥1646॥
అనంతరము బ్రహ్మదేవుడు మరల సృష్టికి పూనుకొనగా అతని దక్షిణ స్తనమునుండి ధర్మము ఉద్భవించెను. ఆ ధర్మముయొక్క పత్నియగు మూర్తిద్వారా నరనారాయణులు అవతరించిరి. పృష్ఠమునుండి అధర్మము జన్మించెను. అధర్మమునందు లోకభయంకరమైన మృత్యుదేవత ఉత్పన్నమయ్యెను.
12.26 (ఇరువది ఆరవ శ్లోకము)
హృది కామో భృవః క్రోధో లోభశ్చాధరదచ్ఛదాత్|
ఆస్యాద్వాక్సింధవో మేధ్రాన్నిరృతిః పాయోరఘాశ్రయః॥1647॥
అదేవిధముగా బ్రహ్మదేవుని హృదయమునుండి కామము, కనుబొమలనుండి క్రోధము, క్రింది పెదవినుండి లోభము, ముఖమునుండి వాక్కునకు అధిష్ఠాతయైన సరస్వతీదేవి, లింగమునుండి సముద్రములు, గుదమునుండి పాపమునకు నివాస స్థానము (రాక్షసులకు అధిపతి) ఐన నిరృతియు జన్మించిరి.
12.27 (ఇరువది ఏడవ శ్లోకము)
ఛాయాయాః కర్దమో జజ్ఞే దేవహూత్యాః పతిః ప్రభుః|
మనసో దేహతశ్చేదం జజ్ఞే విశ్వకృతో జగత్॥1648॥
ఛాయనుండి కర్దముడు జన్మించెను. అతడు దేవహూతికి పతి. సర్వసమర్థుడు. ఈ విధముగా సృష్టికర్తయైన బ్రహ్మదేవునియొక్క మనస్సు నుండి మరియు దేహాంగములనుండి సమస్త జగత్తు ఉద్భవించెను.
12.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
వాచం దుహితరం తన్వీం స్వయంభూర్హరతీం మనః|
అకామాం చకమే క్షత్తః సకామ ఇతి నః శ్రుతమ్॥1649॥
12.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
తమధర్మే కృతమతిం విలోక్య పితరం సతాః|
మరీచిముఖ్యా మునయో విస్రంభాత్ప్రత్యబోధయన్॥1650॥
విదురా! బ్రహ్మదేవుడు సృష్టించిన కన్య సరస్వతీదేవి మిగుల సుకుమారి, సర్వాంగసందరి. ఒకసారి బ్రహ్మదేవుడు ఆమెను జూచి కామమోహితుడయ్యెను. ఆమె స్వయముగా కామవాసనలు లేనిదని మేము వినియున్నాము. బ్రహ్మదేవునియొక్క అధర్మయుక్తమైన సంకల్పమును జూచి, అతని పుత్రులగు మరీచి మొదలగు మునులు తండ్రిపైగల చనువుకొలది ఇట్లు అతనితో హితోక్తులు పలికిరి.
12.30 (ముప్పదియవ శ్లోకము)
నైతత్పూర్వైః కృతం త్వద్య న కరిష్యంతి చాపరే|
యత్త్వం దుహితరం గచ్ఛేరనిగృహ్యాంగజం ప్రభుః ॥1651॥
తండ్రీ నీవు ధర్మమును పాటింపగలవాడవే (ధర్మాధర్మములు ఎఱిగినవాడవే). ఐనను నీ మనస్సులో కామావేశమును ఆపుకొనలేక నీ పుత్రికపై ఇట్టి పాపకృత్యమునకు సిద్ధపడితివి. నీ కంటే పూర్వులెవ్వరును ఇట్లు ప్రవర్తింపలేదు. ఇక ముందు తరాలవారును ఇట్లు చేయబోరు.
12.31 (ముప్పది ఒకటవ శ్లోకము|
తేజీయసామపి హ్యేతన్న సుశ్లోక్యం జగద్గురో|
యద్వృత్తమనుతిష్ఠన్యై లోకః క్షేమాయ కల్పతే॥1652॥
పితామహా! (జగద్యాపారపాలకా!) మీవంటి ధర్మాత్ములకు (పెద్దలకు) ఇది కీర్తికరముగాదు (తగినపనిగాదు). మీ వంటి శ్రేష్థుల ప్రవర్తనను అనుసరించుటవలననే లోకమునకు క్షేమమ గలుగును. (మీవంటి వారి ప్రవర్తన లోకమునకు ఆదర్శముగా ఉండవలెను).
12.32 (ముప్పది రెండవ శ్లోకము)
తస్మై నమో భగవతే య ఇదం స్వేన రోచిషా|
ఆత్మస్థం వ్యంజయామాస స ధర్మం పాతు మర్హతి॥1653॥
భగవంతుడు (శ్రీమహావిష్ణువు) తన స్వరూపమున స్థితుడై ఈ సమస్తజగత్తును తన కాంతిపుంజముతో ప్రకటించెను. ఇట్టి స్థితియందు ఆ దేవుడే ధర్మమును కాపాడగలడు. ఆ ప్రభువునకు నమస్కారము.
12.33 (ముప్పది మూడవ శ్లోకము)
స ఇత్థం గృణతః పుత్రాన్ పురో దృష్ట్వా ప్రజాపతీన్|
ప్రజాపతిపతిస్తన్వం తత్యాజ వ్రీడితస్తదా॥1654॥
అప్పుడు తన పుత్రులైన మరీచి మొదలగు ప్రజాపతులు తన యెదుటనే ఈ విధముగా పలుకగా బ్రహ్మదేవుడు ఎంతయు సిగ్గుపడెను ( కామమోహితమైన ఈ శరీరముతో ఇంక నాకేమి పని? అని భావించి) వెంటనే ఆయన తన శరీరమును పరిత్యజించెను. అంతట ఘోరమైన ఆ శరీరమును దిక్కులు (దిక్కుల అధిదేవతలు) తీసికొనిపోయెను. అచట చీకట్లతో నిండిన మంచు వ్యాపించెను.
12.34 (ముప్పది నాలుగవ శ్లోకము)
కదాచిద్ధ్యాయతస్స్రష్టుర్వేదా ఆసంశ్చతుర్ముఖాత్|
కథం స్రక్ష్యామ్యహం లోకాన్ సమవేతాన్ యథా పురా॥1655॥
ఒకసారి బ్రహ్మదేవుడు నేను మునుపటివలె సువ్యవస్థితమైన చిత్తముతో లోకములను ఎట్లు సృష్టి చేయగలను? అని ఆలోచింపసాగెను. ఆ సమయమున ఆయన నాలుగు ముఖములనుండి వేదములు ప్రకటములయ్యెను.
12.35 (ముప్పది ఐదవ శ్లోకము)
చాతుర్హోత్రం కర్మతంత్రముపవేదనయైస్సహ|
ధర్మస్య పాదాశ్చత్వారస్తథైవాశ్రమవృత్తయః॥1656॥
ఇంతేగాక, ఉపవేదములు, న్యాయశాస్త్రము, హోత, ఉద్గాత, అధ్వర్యువు, బ్రహ్మ అను నలుగురు ఋత్విజులయొక్క కర్మలు, యజ్ఞములయొక్క విస్తృతి, ధర్మముయొక్క నాలుగుపాదములు, చతురాశ్రమములు, వాటి వృత్తులు ఇవి అన్నియును ఆ బ్రహ్మదేవుని ముఖమునుండి ఉత్పన్నములాయెను.
విదుర ఉవాచ
12.36 (ముప్పది ఆరవ శ్లోకము)
స వై విశ్వసృజామీశో వేదాదీన్ ముఖతోఽసృజత్|
యద్యద్యేనాసృజద్దేవస్తన్మే బ్రూహి తపోధనః॥1657॥
విదురుడు వచించెను-మైత్రేయమహామునీ! విశ్వస్రష్టయైన బ్రహ్మదేవుడు తన ముఖమునుండి వేదములు మొదలగువాటిని రచించినప్పుడు అతడు ఏ ముఖమునుండి వేటిని ఉత్పన్నము చేసెను? దయతో తెలుపుము.
మైత్రేయ ఉవాచ
12.37 (ముప్పది ఏడవ శ్లోకము)
ఋగ్యజుస్సామాథర్వాఖ్యాన్ వేదాన్ పూర్వాదిభిర్ముఖైః|
శస్త్రమిజ్యాం స్తుతిస్తోమం ప్రాయశ్చిత్తం వ్యథాత్క్రమాత్॥1658॥
మైత్రేయుడు పలికెను-విదురా! బ్రహ్మదేవుడు తూర్పుదిశగల ముఖమునుండి ఋగ్వేదమును, దక్షిణమువైపునగల ముఖమునుండి యజుర్వేదమును, పడమరదిక్కునగల ముఖమునుండి సామవేదమును, ఉత్తరదిశయందుగల ముఖమునుండి అథర్వవేదమును రచించెను. ఇదే క్రమములో అతడు శస్త్రము అనగా అప్రగీత మంత్రస్తోత్రము (ఇది హోతయొక్క కర్మ), ఇజ్యము (ఇది అధ్వర్యువు యొక్క కార్యము), స్తుతిస్తోమము అనగా సంగీతరూపస్తోత్రము, దాని అర్థసముదాయము (ఇది ఉద్గాతయొక్క కృత్యము). ప్రాయశ్చిత్తము (ఇది బ్రహ్మ యొక్క కార్యము) అనునాల్గింటిని రచించెను.
12.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)
ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వం వేదమాత్మనః|
స్థాపత్యం చాసృజద్వేదం క్రమాత్పూర్వాదిదిభిర్ముఖైః॥1659॥
అట్లే బ్రహ్మదేవుడు తన పూర్వ-దక్షిణ-పశ్చిమ-ఉత్తర ముఖములనుండి క్రమముగా ఆయుర్వేదమును (చికిత్సా శాస్త్రమును), ధనుర్వేదమును (శస్త్రవిద్యలను), గాంధర్వవేదమును (సంగీత శాస్త్రమును) స్థాపత్యమును (శిల్పవిద్యను) ఉత్పన్నమొనర్చెను.
12.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)
ఇతిహాసపురాణాని పంచమం వేదమీశ్వరః|
సర్వేభ్య ఏవ వక్త్రేభ్యః ససృజే సర్వదర్శనః॥1660॥
12.40 (నలుబదియవ శ్లోకము)
షోడశ్యుక్థౌ పూర్వవక్త్రాత్పురీష్యగ్నిష్టుతావథ|
ఆప్తోర్యామాతిరాత్రౌ చ వాజపేయం సగోసవమ్॥1661॥
సర్వజ్ఞుడైన బ్రహ్మదేవుడు తన నాలుగు ముఖములనుండి పంచమవేదములైన ఇతిహాస పురాణములను రచించెను. ఇదే క్రమంలో షోడశి, ఉక్థములు, చయన, అగ్నిష్టోమములు, ఆప్తోర్యామ - అతిరాత్రములు, వాజపేయ-గోసవములు అను రెండ్రెండుయాగములను పూర్వాదిముఖములద్వారా ఉత్పన్నమొనర్చెను.
12.41 (నలుబది ఒకటవ శ్లోకము)
విద్యాదానం తపస్సత్యం ధర్మస్యేతి పదాని చ|
ఆశ్రమాంశ్చ యథాసంఖ్యమసృజత్సహ వృత్తిభిః॥1662॥
ధర్మము యొక్క నాలుగు పాదములైన విద్య, దానము, తపస్సు, సత్యములను వృత్తులతో సహా చతురాశ్రమములను సృజించెను.
12.42 (నలుబది రెండవ శ్లోకము)
సావిత్రం ప్రాజాపత్యం చ బ్రాహ్మం చాథ బృహత్తథా|
వార్తా సంచయశాలీనశిలోంఛ ఇతి వై గృహే॥1663॥
12.43 (నలుబది మూడవ శ్లోకము)
వైఖానసా వాలఖిల్యౌదుంబరాః ఫేనసా వనే|
న్యాసే కుటీచకః పూర్వం బహ్వోదో హంసనిష్క్రియౌ॥1664॥
1. సావిత్రము, 2. ప్రాజాపత్యము, 3. బ్రాహ్మము, 4. బృహత్తు అనునవి బ్రహ్మచారి వృత్తులు. 5. వార్త, 6. సంచయము, 7. శాలీనము, 8. శిలోంఛము అను నాలుగును గృహస్థాశ్రమవృత్తులు. అదే విధముగా 9. వైఖానసము, 10. వాలఖిల్యము, 11. ఔదుంబరము, 12. ఫేనసము - అను నాలుగును వానప్రస్థ వృత్తులు, 13. కుటీచము, 14. బహ్వోదకము, 15. హంసము, 16. నిష్క్రియము (పరమహంసము) అను నాలుగును సన్న్యాసాశ్రమ వృత్తులు - ప్రకటములయ్యెను.
1. సావిత్రము - ఉపనయన సంస్కారమును పొందిన పిమ్మట గాయత్రిని ఉపాసన చేయుటకు ఆచరించు మూడుదినముల బ్రహ్మచర్యవ్రతము.
2. ప్రాజాపత్యము - ఒక సంవత్సరమువరకు జరుపు బ్రహ్మచర్య వ్రతము
3. బ్రాహ్మము - వేదాధ్యయనము పూర్తియగునంతవరకు ఆచరింపబడు బ్రహ్మచర్య వ్రతము
4. బృహత్తు - జీవితాంతము ఆచరింపబడు బ్రహ్మచర్య వ్రతము.
5. వార్త - వ్యవసాయము మొదలగు శాస్త్రవిహిత వృత్తులు
6. సంచయము - యజ్ఞయాగాదులు ఆచరణము.
7. శాలీనము - అయాచితవృత్తి
8. శిలోంచము - పంటకు వచ్చిన పైర్లను కోసిన పిమ్మట కంకులనుండి రాలిన గింజలను, ధాన్యపు దుకాణములలో క్రిందపడిన ధాన్యమును ఏరుకొని వాటిద్వారా జీవించుట
9. వైఖానసము - దున్నకుండా, నాటకుండా భూమినుండి ఉత్పన్నములైన పదార్ధములతో జీవించుట
10. వాలఖిల్యము - క్రొత్తగా ఆహార పదార్థములు లభించినప్పుడు అంతకుముందన్న, సేకరింపబడియున్న ఆహారపదార్థములను దానము చేయుట
11. ఔదుంబరము - ప్రాతఃకాలమున నిద్రనుండి లేవగనే ముఖము ఏ దిశగానుండునో, ఆ దిశనుండి ఫలాదులను సేకరించి వాటితో జీవించుట.
12. ఫేనపము - తమంత తాముగా రాలిన ఫలములను భుజించి జీవించుట
13. కుటీచకము - ఒక ప్రదేశమున కుటీరమున నివసించుచు ఆశ్రమధర్మములను పాటించుట.
14. బహ్వోదకము - కర్మల విషయములయందు గౌణదృష్టితో ఉండి, జ్ఞాన దృష్టికి ప్రాధాన్యము నిచ్చుట
15. హంసము - జ్ఞానసాధనము
16. నిష్క్రియము (పరమహంసము) - జ్ఞానియై జీవన్ముక్తుడుగా జీవించుట
12.44 (నలుబది నాలుగవ శ్లోకము)
ఆన్వీక్షికీ త్రయీ వార్తా దండనీతిస్తథైవ చ|
ఏవం వ్యాహృతయశ్చాసన్ ప్రణవో హ్యస్య దహ్రతః॥1665॥
ఇదే క్రమములో 1.అన్వీక్షికి, 2. త్రయి, 3. వార్త, 4. దండనీతి అను నాలుగు విద్యలును, అట్లే 5. నాలుగు వ్యాహృతులును బ్రహ్మయొక్క నాలుగు ముఖముల నుండి ఉత్పన్నములయ్యెను. హదయాకాశము నుండి ఓంకారము ప్రకటమయ్యెను.
అన్వీక్షికి = మోక్షప్రాప్తిని కలుగ జేయు ఆత్మవిద్య, 2. త్రయి = స్వర్గాదిఫలములనొసంగు కర్మవిద్య, 3. వార్త = వ్యవసాయము, వ్యాపారము మొదలగు వాటికి సంబంధించిన విద్య, 4. దండనీతి = రాజనీతి, 5. వ్యాహృతులు = భూః, భువః, సువః, అను మూడింటికి నాలుగవదగు మహః అను దానితో కలిపి నాలుగు వ్యాహృతులను గూర్చి అశ్వలాయన గృహ్యసూత్రములయందు పేర్కొనబడినవి.
12.45 (నలుబది ఐదవ శ్లోకము)
తస్యోష్ణిగాసీల్లోషుభ్యో గాయత్రీ చ త్వచో విభోః|
త్రిష్టుమ్మాంసాత్స్నుతోఽనుష్టుబ్జగత్యస్థ్నః ప్రజాపతేః॥1666॥
12.46 (నలుబది ఆరవ శ్లోకము)
మజ్జాయాః పంక్తిరుత్పన్నా బృహతీ ప్రాణతోఽభవత్|
స్పర్శస్తస్యాభవజ్జీవః స్వరో దేహ ఉదాహృతః॥1667॥
బ్రహ్మయొక్క రోమములనుండి ఉష్ణిక్కు, చర్మమునుండి గాయత్రి, మాంసమునుండి త్రిష్టుప్, స్నాయువులనుండి అనుష్టుప్, ఎముకలనుండి జగతి, మజ్జ (క్రొవ్వు) నుండి పంక్తి, ప్రాణములనుండి బృహతి - అను ఛందస్సులు ఉత్పన్నములయ్యెను. బ్రహ్మయొక్క జీవమును స్పర్శవర్ణములు (కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గములు-కాదయో మావసానాః స్పర్శాః) దేహము స్వరవర్ణములు (అచ్చులు) అని పిలువబడినవి.
12.47 (నలుబది ఏడవ శ్లోకము)
ఊష్మాణమింద్రియాణ్యాహురంతఃస్థా బలమాత్మనః|
స్వరాస్సప్త విహారేణ భవంతి స్మ ప్రజాపతేః॥1668॥
బ్రహ్మదేవుని యొక్క ఇంద్రియములు (శ, ష, స, హ-శషసహ ఊష్మాణః) అనియు, బలమును అంతస్థములు (య, ర, ల, వ - యరలవ అంతస్థాః) అని వ్యవహరింతురు. ఆ ప్రజాపతియొక్క విహారమువలన షడ్జమము, ఋషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము అను (స, రి, గ, మ, ప, ద, ని) సప్తస్వరములు ఏర్పడినవి.
12.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)
శబ్దబ్రహ్మాత్మనస్తస్య వ్యక్తావ్యక్తాత్మనః పరః|
బ్రహ్మావభాతి వితతో నానాశక్త్యుపబృంహితః॥1669॥
నాయనా! విదురా! బ్రహ్మదేవుడు శబ్దబ్రహ్మ స్వరూపుడు. వైఖరీరూపముతో వ్యక్తమగును. ఓంకార రూపమున అవ్యక్తముగను విలసిల్లుచున్నాడు. అతని కంటెను శ్రేష్ఠుడై, సర్వత్ర పరిపూర్ణుడైన పరబ్రహ్మ అనేకవిధములగు శక్తులతో ఒప్పుచు ఇంద్రాదిరూపములలో భాసిల్లుచున్నాడు.
12.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)
తతోఽపరాముపాదాయ స సర్గాయ మనో దధే|
ఋషీణాం భూరివీర్యాణామపిసర్గమవిస్తృతమ్॥1670॥
12.50 (ఏబదియవ శ్లోకము)
జ్ఞాత్వా తద్ధృదయే భూయాశ్చింతయామాన కౌరవ|
అహో అద్భుతమేతన్మే వ్యాపృతస్యాపి నిత్యదా॥1671॥
12.51 (ఏబది ఒకటవ శ్లోకము)
న హ్యేధన్తే ప్రజా నూనం దైవమత్ర విఘాతకమ్|
ఏవం యుక్తకృతస్తస్య దైవం చావేక్షతస్తదా॥1672॥
12.52 (ఏబది రెండవ శ్లోకము)
కన్య రూపమభూద్ద్వేధా యత్కాయమభిచక్షతే|
తాభ్యాం రూపవిభాగాభ్యాం మిథునం సమపద్యత॥1673॥
పిమ్మట బ్రహ్మదేవుడు తన మొదటి (కామాసక్తమైన శరీరమువలన పొగమంచు ఏర్పడియుండెను) శరీరమును త్యజించెను, వేరొక శరీరముసు ధరించి, విశ్వమును విస్తరింపజేయుటకు సంకల్పించెను. మరీచి మొదలగు గొప్ప శక్తిశాలులైన మహర్షులద్వారాగూడ సృష్టివిస్తారము జరుగలేదని అతడు గ్రహించెను. అంతట అతడు తన మనస్సులో ఇట్లు ఆలోచింపసాగెను. ఇది మిగుల ఆశ్చర్యకరము. నేను అనుక్షణము ఎంతగా ప్రయత్నించినను ప్రజలసంఖ్య వృద్ధియగుటలేదు. దీని విఘాతమునకు (వృద్ధికాకుండుటకు) దైవమే కారణమని తోచుచున్నది. ఇప్పుడు నేను ఏమి చేయుట ఉచితము? అని ఆలోచించి అతడు (బ్రహ్మదేవుడు) దైవమును స్మరించెను. అంతట అకస్మాత్తుగా ఆయన యొక్క శరీరము రెండు భాగములయ్యెను. క అనగా బ్రహ్మదేవుడని అర్థము. అతడే రెండు విభాగములుగా అగుటవలన ఆ శరీరమునకు కాయము అని పేరు. ఆ రెండు భాగములనుండి ఒక స్త్రీ,ఒక పురుషుడు ఉద్భవించిరి.
12.53 (ఏబది మూడవ శ్లోకము)
యస్తు తత్ర పుమాన్ సోఽభూన్మనుః స్వాయంభువస్స్వరాట్|
స్త్రీ యాఽఽసీచ్ఛతరూపాభ్యా మహిష్యస్య మహాత్మనః॥1674॥
వారిలో పురుషుడు సార్వభౌముడైన స్వాయంభువ మనువుగా అయ్యెను. స్త్రీ - అతని భార్యయైన శతరూపగా నైనది. ఆమె ఆ సార్వభౌమునియొక్క పట్టమహిషి (మహారాణి) యైనది.
12.54 (ఏబది నాలుగవ శ్లోకము)
తదా మిథునధర్మేణ ప్రజా హ్యేధాంబభూవిరే|
స చాపి శతరూపాయాం పంచాపత్యాన్యజీజనత్॥1675॥
ఆ ఉభయులయొక్క దాంపత్యధర్మము (స్త్రీ పురుష సంయోగము) వలన ప్రజాభివృద్ధి జరిగెను. ఆ స్వాయంభువమనువువలన శతరూపయందు ఐదుగురు శిశువులు కలిగిరి.
12.55 (ఏబది ఐదవ శ్లోకము)
ప్రియవ్రతోత్తానపాదౌ తిస్రః కన్యాశ్చ భారత|
ఆకూతిర్దేవహూతిశ్చ ప్రసూతిరితి సత్తమ॥1676॥
సాధుశిరోమణీ! విదురా! వారిలో ఇద్దరు మగశిశువులు 1. ప్రియవ్రతుడు, 2. ఉత్తానపాదుడు. ముగ్గురు ఆడశిశువులు - 1. ఆకూతి, 2. దేవహూతి, 3. ప్రసూతి.
12.56 (ఏబది ఆరవ శ్లోకము)
ఆకూతిం ఋచయే ప్రాదాత్కర్దమాయ తు మధ్యమామ్|
దక్షయాదాత్ప్రసూతిం చ యత ఆపూరితం జగత్॥1677॥
మనువు ఆకూతి అను కన్యను రుచి అను ప్రజాపతికి ఇచ్చిపెండ్లి చేసెను. రెండవ కూతురైన దేవహూతిని కర్దమప్రజాపతికి ఇచ్చి వివాహం జరిపించెను. మూడవ కూతురైన ప్రసూతి వివాహము దక్షప్రజాపతితో జరిగెను. ఈ మూడు జంటలవలన కలిగిన సంతానముతో ఈ జగత్తు నిండెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
676వ నామ మంత్రము 12.5.2022
ఓం బ్రహ్మానందాయై నమః
మానవానందం నుండి బ్రహ్మానందం వరకూ గల ఎన్నో ఆనందములలో అన్నిటికీ పరాకాష్ఠయైనది బ్రహ్మానందము. అట్టి బ్రహ్మానంద స్వరూపిణియైన పరాశక్తికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి బ్రహ్మానందా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం బ్రహ్మానందాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకునకు అన్ని ఆనందములకూ పరాకాష్ఠయైన బ్రహ్మానందమునందుటకు అవసరమయిన యోగసాధనాశక్తి, పరాశక్తిని ప్రసన్నము చేయగలుగు అత్యంత భక్తితత్పరత సంప్రాప్తమై తరించును.
జగన్మాత బ్రహ్మానంద స్వరూపిణి. అంతర్ముఖ సమారాధనాాపరుడైన సాధకుడు మూలాధారంలో నిద్రాణస్థితిలోనున్న కుండలినీ శక్తిరూపంలో గల జగన్మాతను జాగృతంచేసి షట్చక్రములు దాటించి సహస్రారములో పరమేశ్వరుని వద్దకు చేర్చి అమృతధారలలో తన్మయింపజేస్తే జగన్మాత పొందే ఆనందం చెప్పనలవికాదు. ఆనందములలోకెల్లా పరాకాష్ఠగా నిలిచిన బ్రహ్మానందమును పొందుతుంది. అంతటి బ్రహ్మానందభరితురాలైన తల్లి సాధకునికి వరాలజల్లు కురిపిస్తుంది. ఆత్మానందానుభూతిని కలుగజేస్తుంది. అంతటి బ్రహ్మానందాని పొందుతుంది కనుకనే ఆ తల్లికి బ్రహ్మానందా అను నామ మంత్రముతో స్తుతింపబడుచున్నది.
జగన్మాతను 365వ నామ మంత్రములో స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః అని జగన్మాతను స్తుతించాము. అనగా బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము.. మొదలుగా గల ఆనందముల సమూహము గలిగిన తల్లి శ్రీమాత అని తెలియుచున్నది.
ఈ ఆనందాల సమూహం తైత్తరీయోపనిషత్తులో ఆనందవల్లి లో ఈ ఆనందములగూర్చి ఉన్నది.
ఒక ఆనందమునకు మరొక ఆనందమునకు మధ్యగల సంబంధం తెలియాలంటే ఒక ప్రమాణం కావాలి.
ఉదా. 1000 గ్రాములు ఒక కిలోగ్రాము. అలాగే 1000 కిలోగ్రాములు ఒక మెట్రిక్ టన్ను అన్నాము.
అలాగే ఇక్కడ ఆనందముల మధ్యగల సంబంధం తెలియాలంటే అది మానుషానందంతో ప్రారంభించాలి. ఆనందములన్నిటికీ పరాకాష్ఠగా చివరగా బ్రహ్మానందము వరకూ చెప్ఫాలి. అది ఎలాగంటే
1. వంద మనుష్యానందములు అయితే ఒక మనుష్య గంధర్వానందము.
2. వంద మానుష్య గంధర్వానందములు అయితే ఒక దేవ గంధర్వానందము.
3. వంద దేవ గంధర్వా నందములు అయితే ఒక చిరలోక పితరుల ఆనందము.
4. వంద చిరలోక పితరుల ఆనందములు అయితే ఒక అజానజ దేవానందము.
5. వంద అజానజదేవానందములు అయితే ఒక కర్మదేవానందము.
6. వంద కర్మదేవానందములు అయితే ఒక దేవానందము.
7. వంద దేవానందములు అయితే ఒక ఇంద్రానందము.
8. వంద ఇంద్రానందములు అయితే ఒక బృహస్పతి ఆనందము.
9. వంద బృహస్పతి ఆనందములము అయితే ఒక ప్రజాపతి ఆనందము.
10. వంద ప్రజాపతి ఆనందములు అయితే ఒక బ్రహ్మానందము.
జగన్మాత ఆనందం బ్రహ్మానందం. మరి అంతటి బ్రహ్మానందభరిత జగన్మాత కావాలంటే లలితా సహస్రనామస్తోత్రం తప్పులు లేకుండా పఠించుతూ అమ్మను అంతర్ముఖంగా దర్శించండి. లేదా పదినిమిషాలలో పఠించగలిగే ఖడ్గమాలా స్తోత్రాన్ని అమ్మను అంతర్ముఖంగా దర్శించుకుంటూ పఠించండి. ఇంకేది కుదరలేదు. అమ్మకు నమస్కరించుతూ ఓం బ్రహ్మానందాయై నమః అని అనండి. ఏదైనా అమ్మ అంతర్ముఖ సమారాధ్య
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
677వ నామ మంత్రము 13.5.2022
ఓం బలిప్రియాయై నమః
జ్ఞానులు, అరిషడ్వర్గములను జయించిన జితేంద్రియులనిన ప్రీతిగలిగిన జగన్మాతకు నమస్కారము.
ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుడు. విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి యనిన ప్రీతి గలిగిన పరమేశ్వరికి నమస్కారము.
పూజా సమయములో సమర్పింపబడు వివిధ పూజాద్రవ్యములనిన ఇష్టపడు తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి బలిప్రియా అను నాలుగు అక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం బలిప్రియాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకునకు సర్వాభీష్ట సిద్ధిగలుగును.
జగన్మాతకు మనస్పూర్తిగా పత్రం పుష్పం ఫలం తోయం అని భగవద్గీతలో చెప్పినట్లు సమర్పించితే ఆ పూజాద్రవ్యమును అత్యంత ప్రీతిగా స్వీకరించి అమ్మ బ్రహ్మానందభరితురాలై అనుగ్రహిస్తుంది.
దేవీ భాగవతంలో కోడి, పంది, ఎనుబోతు, మేక వంటి జంతు బలులు ఈయవచ్చునని గలదు. ఆ ప్రకారం అటువంటి బలులు అనిన జగన్మాతకు అత్యంత ప్రీతిని కలిగించును.
వివిధ వర్ణముల వారు అమ్మవారికి సమర్పించు నివేదనలు: బ్రాహ్మణుడు గుమ్మడి పండును, క్షత్రియుడు చెఱకుగడలును, వైశ్యుడు మారేడు ఫలమును, శూద్రుడు నారికేళము సమర్పింతురు. వాటిని స్వీకరించి దేవి బ్రహ్మానందమునందును.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం బలిప్రియాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
678వ నామ మంత్రము 14.5.2022
ఓం భాషారూపాయై నమః
సంస్కృత ప్రాకృతాది భాషలు స్వరూపముగా గలదిగాను, భక్తుల మనోభావములనే భాషలకు కూడా తానే స్వరూపిణియై, భాషలచే తానున్నానని నిరూపితమైన సాక్షాత్ వాగ్దేవీ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి భాషారూపా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం భాషారూపాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు పరిపూర్ణమైన సరస్వతీ కటాక్షము లభించి చతుష్షష్టి విద్యలలో తన వృత్తికిని ప్రవృత్తికిని సంబంధించిన విద్యలో ప్రావీణ్యతనందుకొనును. సుఖసంతోషములతో జీవనమును కొనసాగించుచూ, ఆ పరమేశ్వరీ నామ స్మరణలోకూడా నిమగ్నుడై జన్మ ధన్యతనందును.
శ్రీమాత మువురమ్మల మూలపుటమ్మ. అనగా లక్ష్మీ, వాణీ, పార్వతిల త్రిశక్తి స్వరూపిణి. అందుచే తనలో చదువుల తల్లి అయిన సరస్వతీ రూపము గూడా తనలో గలదు గనుక, సంస్కృత, ప్రాకృతాది భాషల స్వరూపిణిగా, భాషారూపా అని స్తుతింపబడుచున్నది.
ఒక తమిళుడు, ఒక ఉత్తర హిందుస్థానము వ్యక్తి, ఆంధ్రుడు కలిసి అమ్మవారి ఆలయానికి వెళ్ళారు. ముగ్గురూ వారి వారి భాషల్లో అమ్మవారికి నమస్కరిస్తారు. కోరికలు కోరుకుంటారు. మూడు భాషలవారినీ అమ్మవారు వారి ప్రార్థనలు స్వీకరించింది. ముగ్గురినీ అనుగ్రహిస్తుంది. ఇంకో మూగవాడు వచ్చి అమ్మవారికి సైగలతోనే ప్రార్థిస్తాడు. అమ్మ వారు ఆసైగలలో భావంకూడా తెలుసుకొని అనుగ్రహిస్తుంది. అంటే అమ్మవారికి ఆ ముగ్గురి భాషలే కాదు,సంస్కృత ప్రాకృతాది భాషలే కాక ఎన్నో భాషలు, తన దర్శనానికి వచ్చి ప్రార్థనచేసి మనసులోనే మౌనంగా వేడుకుంటారు. ఈ మౌనంలోని భావంకూడా గ్రహించి అనుగ్రహిస్తుంది. అలాగే ఏమీ కోరుకొనకపోయినా, తన భక్తులకేమికావాలో అనుగ్రహిస్తుంది. అమ్మకు అన్ని భాషలూ వచ్చు. సైగలు కూడా అర్థం చేసుకుంటుంది గనుక భాషభాషకూ తనస్వరూపాన్ని భక్తుల మనోభావాలలో ప్రకటింపజేస్తుంది. అందుకే జగన్మాత భాషారూపా అని స్తుతిస్తున్నాము.
జగదీశ్వరి మాతృకార్ణరూపిణి. అకారాది క్షకారాంత అక్షరములన్నీ పరమేశ్వరి రూపమే. భాషవేరైనా అక్షరాలు ఒకటే. భాషలోని భావంకూడా ఒకటే. అందుచేత జగన్మాతకు భాషల భేదంలేదు. ఆ తల్లి సర్వ భాషారూప అటువంటి తల్లికి నమస్కరించునపుడు ఓం భాషారూపాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
679వ నామ మంత్రము
ఓం బృహత్సేనాయై నమః
భండాసురాది రాక్షస సంహారమునకు సంపత్కరీ, అశ్వారూఢా, శ్యామల, జ్వాలామాలిని, నిత్యాదేవతలు మొదలైన సేనానులు, తన అంశయైన బాలాత్రిపుర సుందరి, చక్రరాజ-గేయచక్ర-కిరిచక్ర రథములతోను అసంఖ్యాకమైన భౌతిక సేనావాహినియు, అరిషడ్వర్గములు, అజ్ఞాన తిమిరములు మొదలైన దుష్టశక్తులనంతము చేయుటకు అనంతములైన వేదాలలోని ఋక్కులు, సామలు, యజుస్సులు మరియు తదితర మంత్రములు వంటి జ్ఞాన సేనావాహిని కలిగియున్న అఖిలాండేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర సామావళి యందలి బృహత్సేనా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం బృహత్సేనాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ తల్లి అంతులేని జ్ఞానసంపద, భౌతిక సంపదలు ప్రసాదించును.
భండాసురుడు మొదలైన రాక్షసులను, వారి సైన్యాలను సంహరించడానికి అనంతమైన భౌతిక సేనావాహిని, అస్త్రశస్త్రములు, రథములు, ఆవరణములు గలవు.
ఆ భౌతిక సేనావాహిని ఏమిటో ఈ క్రింది నామ మంత్రాలలో ఒక సారి పరిశీలించుదాము.
శక్తిసేనలు
65 వ నామ మంత్రము. భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా
గజ దళము- సంపత్కరీ దేవి
66వ నామ మంత్రము సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా
అశ్వదళము - అశ్వారూఢాదేవి
67వ నామ మంత్రము అశ్వారూఢాధిష్డితాశ్వ కోటి కోటిభి రావృతా
జ్వాలాప్రాకారం - జ్వాలామాలిని
71వ నామ మంత్రము జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా
నిత్యా దేవతలు
73వ నామ మంత్రము నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సకా
బాలా త్రిపుర సుందరి
74వ నామ మంత్రము భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా
(రాజ) శ్యామలా దేవి
75వ నామ మంత్రము మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా
వారాహి
76వ నామ మంత్రము విశుక్ర ప్రాణహరణా వారాహీ వీర్య నందితా
గణేశ్వరుడు
78వ నామ మంత్రము మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా
అమ్మవారు శస్త్రాలకు ప్రతిగా అస్త్రాలను వర్షింపజేసినది
79వ నామ మంత్రము భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ
నారాయణుని దశావతారములు
80వ నామ మంత్రము కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః
మహా పాశుపతాస్త్రం
81వ నామ మంత్రము మహా పాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా
కామేశ్వరాస్త్రము
82వ నామ మంత్రము కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా
ఆయుధములతో రథములు
68వ నామ మంత్రము చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా
69వ నామ మంత్రము గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా
70వ నామ మంత్రము కిరిచక్ర రథారూఢ దంఢనాథ పురస్కృతా
ఇంకా భండుని పదిహేను సేనానాయకులకు ప్రతిగా తన సేనానులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఒకటేమిటి అనంతకోటి భౌతిక సేనాసంపదతో దుష్టులను పరిమార్చినది శ్రీమాత.
అమ్మవారి జ్ఞాన సేనావాహినికి సంబంధించిన కొన్ని నామ మంత్రములు మాత్రము ఇక్కడ చూపడమైనది.
89వ నామ మంత్రం మూలమంత్రాత్మికా సర్వమునకు మూలమైన పంచదశాక్షరీ స్వరూపిణి జగన్మాత.
204వ నామ మంత్రం సర్వమంత్ర స్వరూపిణీ సమస్త మంత్రముల స్వరూపిణి జగన్మాత.
205వ నామ మంత్రం సర్వ యంత్రాత్మికా సర్వ యంత్రముల స్వరూపిణి జగన్మాత.
206వ నామ మంత్రం సర్వ తంత్రరూపా సర్వ తంత్రముల స్వరూపిణి జగన్మాత.
236వ నామ మంత్రం చతుష్షష్టి కళామయీ అరవై నాలుగు కళలు లేదా తంత్రముల స్వరూపిణి జగన్మాత.
239వ నామ మంత్రం చంద్రవిద్యా పన్నెండు మంది దేవీ ఉపాసకులలో చంద్రుడు ఉపాసించు విద్యాస్వరూపిణి జగన్మాత.
301వ నామ మంత్రం హ్రీంకారీ సృష్ఠి,స్థితి,లయములను చేయు భువనేశ్వరీ మాత మంత్ర స్వరూపిణి జగన్మాత.
338వ నామ మంత్రం వేదజననీ వేదాలకు జనని అయిన జగన్మాత.
366వ నామ మంత్రం పరా పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరులను నాలుగు వాక్కులకన్నా పరావాక్కు స్వరూపిణి జగన్మాత.
368వ నామ మంత్రం పశ్యంతీ అన్నిటినీ తనలోనే చూసే పశ్యంతీ వాక్కు స్వరూపిణి జగన్మాత.
402వ నామ మంత్రం విద్యావిద్యా స్వరూపిణీ జ్ఞానం, అజ్ఞానం, నానాత్వభావం అన్నీ తానే అయిన జగన్మాత.
420వ నామ మంత్రం గాయత్రీ వేదమంత్రి అయిన గాయత్రీ స్వరూపిణి జగన్మాత.
587వ నామ మంత్రం షోడశాక్షరీవిద్యా శ్రీ తో కూడిన పదహారు అక్షరాలుగల షోడశాక్షరీ విద్యాస్వరూపిణి జగన్మాత.
చతురంగ బలాలతో కూడిన సైన్యము మరియు బ్రహ్మ-విష్ణు-మహేశ్వరములు-ఇంద్రాది దేవతల సమూహమే జగన్మాత యొక్క సైన్యమని బాహ్యార్థమయితే అనంతమైన వేదరాశి, వేదాంత జ్ఞానము లలితాంబిక యొక్క జ్ఞాన సంకేత సేనావాహిని అని అంతరార్థము.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం బృహత్సేనాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
680వ నామ మంత్రము
ఓం భావాభావ వివర్జితాయై నమః
ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ అను భావములకు - (సత్), ప్రాక్+అభావ, ప్రధ్వంస+అభావ, అంత్యత+భావ, అన్యోన్యా+అభావ (ప్రాగాభావ,ప్రధ్వంసాభావ,అంత్యతాభావ, అన్యోన్యాభావ) అను అభావములకు (అసత్) - వీటికి అన్నిటికీ వేరుగా, అతీతముగా, వీటిచే వదలిపెట్టబడినదై ఉన్న జగదీశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి భావాభావ వివర్జితా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం భావాభావ వివర్జితాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునికి భావాభావములకు గల వ్యత్యాసము, వాటి నిర్వచనము - జగన్మాత వీటన్నిటికీ అతీతము అను దానికి వివరములు తెలిసి ఆత్మానందభరితుడై తరించును.
భావములు: ద్రవ్యగుణాదులు. అవి ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయువులు. ఇవి సత్ అనగా సత్యము.
అభావములు
ప్రాక్+అభావ ప్రాగాభావ - వస్తువు తయారుకాక పూర్వం ఆవస్తువు లేని స్థితి.
ప్రధ్వంస + అభావ - ప్రధ్వంసాభావ - వస్తువు పూర్తిగా నాశనమైపోయిన తరువాత ఆ వస్తువు ఉండని స్థితి.
అన్యోన్య+అభావ - అన్యోన్యాభావ వస్తువు ఇంకొక వస్తువులాగ ఉండలేని స్థితి.
అంత్యంత+అభావ అంత్యంతాభావ నపుంసకుని సంతానము లేదా గొడ్రాలి బిద్డ అన్నది అసలు అవకాశమేలేనిది.
ఇలాంటి భావాభావములు ఉండడము గాని ఉండక పోవడము గాని మనకు. కాని పరాశక్తికి వీటితో సంబంధంలేదు. అన్నిటికీ అతీతమైనది. ఇలాంటి భావాభావముల తర్కము జగన్మాతకు వర్జింపబడినది. అందుచేత జగన్మాత భావాభావ వివర్జితా అని నామ ప్రసిద్ధమైనది.
పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం భావాభావ వివర్జితాయై నమః అని అనవలెను.
---
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
681వ నామ మంత్రము 17.5.2022
ఓం సుఖారాధ్యాయై నమః
సామాన్యముగా నిత్యపూజా క్రమంలో ఏ విధమైన కాయకష్టముగాని, ఉపవాసములుగాని, నియమ నిష్ఠలుగాని లేకుండ కేవలము మానసికముగా తలచుచూ, పత్రం-పుష్పం-ఫలం-తోయం వంటివి భావనామాత్రముగా సమర్పించుచూ సులభతరముగా ఆరాధించువారిని కూడా అనుగ్రహించు శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి సుఖారాధ్యా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం సుఖారాధ్యాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ కరుణామయిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించితే ఆ తల్లి కరుణించి అన్నవస్త్రములకు లోటులేక, సుఖసంతోషములకు కొదువ లేక, నానాటికి ఇనుమడించిన భక్తిశ్రద్ధలతో జగన్మాతసేవలో జీవించి తరించును.
కాయకష్టము గాని, ఉపవాసములు గాని, ఆర్భాటమయిన పూజాద్రవ్యములు గాని అవసరము లేకుండా కేవలము అంతర్యాగ విధానంలో, అంతర్ముఖంగా ఆ పరమేశ్వరీ ఆరాధనలో త్రికరణశుద్ధిగా, ఆత్మసమర్పణా తత్త్వంతో నిమగ్నమయితే ఆ తల్లి ఆనందిస్తుంది. బ్రహ్మానందాన్ని పొందుతుంది. సర్వాభీష్టాలను నెరవేరుస్తుంది. ఆ తల్లి అంతర్ముఖ సమారాధ్య ఆ తల్లి సుఖారాధ్య.
భక్తుడు తనతాహతుకు తగినట్లుగా భక్తితో ఏం సమర్పించినా తీసుకుంటాను. నా భక్తుడ్ని అనుగ్రహిస్తాను అన్న భావంతో శ్రీకృష్ణ పరమాత్మ
భగవద్గీత - తొమ్మిదవ అధ్యాయం, 26వ శ్లోకం అన్నారు.
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి|
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః॥
భక్తితో ఒక ఆకును, ఒక పువ్వును.. అవి లేకపోతే ఓ పండును.. అదీ లేకపోతే నీటిని సమర్పిస్తే చాలు సంతోషిస్తా అంటాడు కృష్ణభగవానుడు. దేవుణ్ని పూజించడానికి ఖరీదైన సామగ్రి అక్కర్లేదని, భక్తితో ఏది సమర్పించినా చాలని అర్థం.
భక్తికి కావలసింది నోటితో మాటకాదు, శాస్త్రాలు చదవడంకాదు, నోరులేని జీవాలకు కూడా ఆత్మసమర్పణ బుద్ధి ఉంటేచాలు అనడానికి ఈ పద్యం పరిశీలించుదాము.
ఏ వేదంబు పఠించె లూత , భుజగం బే శాస్త్రముల్సూచె దా
నే విద్యాభ్యసనం బొనర్చె గరి , చెంచే మంత్ర మూహించె , బో
ధావిర్భావ నిధానముల్ చదువులయ్యా ? కావు , మీ పాద సం
సేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా !
ఓ ఈశ్వరా ! జ్ఞాన సముపార్జనకు ప్రాణులకు విద్య అవసరం లేదు. నీ పాదసేవయే సమస్తజ్ఞానమును కల్గించును . ఎట్లనగా నిన్ను సేవించిన సాలెపురుగు ఏ వేదాధ్యయనము చేసి,జ్ఞానమును సముపార్జించినది . నిన్ను సేవించిన సర్పము ఏ శాస్త్రమును చదివినది . నిను పూజించిన ఏనుగు ఏ విద్య నభ్యసించినది . బోయవాడైన తిన్నడు ఏ మంత్రమును చదివి నిన్ను సేవించి ముక్తి పొందినాడు . కావున నీ పాదములను సేవించాలనే కుతూహలమే సమస్త జ్ఞానమును కల్గించును ప్రభూ
అందరికీ మంత్రాలురాకపోవచ్చు. పూజావిధానం తెలియకపోవచ్చు. కనీసం ఆ పరమాత్మకు ఏం నివేదన చేయాలో కూడా తెలియక పోవచ్చు. కేవలం వారికి దైవము - ఆ దైవం మీద భక్తి - మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలనే తపన తప్ప వేరేమీ ఉండదు. ఆ పరమాత్మకు కూడా అదేకావాలి. అంతర్ముఖంగా (మనసులోనే)ఆరాధనే కావాలి.
కీర్తి శేషులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారు బాలాత్రిపుర సుందరీ ఉపాసకులు. సాక్షాత్తు బాలాత్రిపుర సుందరి ఆయన కుమార్తెగా వారింట్లో తిరిగింది. ఆయన మామూలుగా అమ్మా అంటే, ఏం నాయనా నన్ను పిలిచావా... ఇక్కడే ఉన్నానుగా అనేదట.
ఆయన తొలిరోజుల్లో నిరుపేద. భోజనానికి కూడా ఇబ్బంది పడిన రోజులు. దేవతార్చనలో అమ్మవారికి ఉద్దరిణతో ఉదకం మాత్రమే నివేదించేవారు. అదే పాయసంలాగ అమ్మ స్వీకరించిందట. ఒక రోజున పిడికెడు బంగారు అక్షతలు ఇచ్చిందట. అలా ఇచ్చిందో లేదో తెలియదు గాని, శాస్త్రిగారి ఇల్లు పెద్దదేవాలయం అయిపోయింది. ఒక పెద్ద వేదాధ్యయన పాఠశాల కూడా అయింది. అంతకన్నా మించి నిత్యము వచ్చేపోయే అతిథులకు సంతృప్తిగా భోజనం పెట్టడానికి అన్నపూర్ణాలయం అయింది. జగన్మాత సుఖారాధ్యా అని చెప్పడానికి ఇంకేం దృష్టాంతం కావాలి?
జగన్మాతను అతి సులభరీతిలో ఉపాసించవచ్చు అని కూర్మపురాణంలో చెప్పబడింది.
అటు వంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సుఖారాధ్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
682వ నామ మంత్రము 18.5.2022
ఓం శుభకర్యై నమః
పాత్రాపాత్రములౌచిత్యములకు తగినట్లుగా, శుభములొన గూర్చునవి ఏవైనను భక్తుల కోరికలను నెరవేరునట్లు జేయు శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి శుభకరీ అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం శుభకర్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరికి పూజలు చేయు భక్తులకు ఆ తల్లి కరుణించి సర్వాభీష్టసిద్ధి కలిగించును.
జగన్మాత భక్తులకు శుభములనుకలుగజేయును. తన భక్తుల కోరికలలోని ఔచిత్యముననుసరించి, పాత్రతకు తగినట్లుగా సిద్ధింపజేయును. భక్తుల కోరికలలో ధర్మబద్ధత, వారి అర్హతను అనుసరించి నెరవేర్చును. ఒక దొంగ వచ్చి అమ్మా నేను ఫలానా కోటీశ్వరుడు ఇంటికి దోపిడీకి వెళుతున్నాను. తనపని దిగ్విజయంగా పూర్తిచేయునట్లు అనుగ్రహించమంటే జగన్మాత ఆ కోరికను సిద్ధింప జేస్తుందా? చేయదు. అలాగే తల్లి తన బిడ్డను అనారోగ్యమునుండి కాపాడమంటే కాపాడుతుంది. ఒక తండ్రి తన కుమార్తెకు వివాహం ఆటంకం లేకుండా జరిగేలా అనుగ్రహించమంటే అనుగ్రహిస్తుంది.
వెర్రిగొల్ల కాళిదాసుకు విద్యకావాలి అని కాళికాదేవిని అడగడంకూడా రాక, కాళీబిద్దె అని అడిగాడు. ఆ తల్లి అనుగ్రహించి కాళిదాసును ఒక మహాకవిగా మార్చింది. అలా అతనికి శుభకరము కలుగజేసింది.
పాండవులు అజ్ఞాతవాసానికి విరాట్ రాజు కొలువుకు వెళ్ళేముందు ద్రౌపది జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి అని శుభములొనగూర్చమని కోరింది. మరి వారికి అజ్ఞాతవాసము శుభప్రదమయిందికదా. విరాటరాజు కూతురు ద్రౌపదికి కోడలయిందికదా. కీచక సంహారం జరిగిందికదా.
ఆ తల్లిని తలచుకుంటూ అమ్మా! శ్రీమాతా! శుభకరీ! కరుణించు తల్లీ అని వేడుకుంటే మనకు ఏ శుభం జరగాలో మనం అడగకుండానే కలుగజేస్తుంది. ఆ జగన్మాత సుఖారాధ్య. అంతర్ముఖంగా తలుచుకుంటే చాలు, మనకు శుభములే జరుగుతాయి. అందుకనే ఆ తల్లికి నమస్కరించునపుడు ఓం శుభకర్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
683వ నామ మంత్రము 20.5.2022
ఓం శోభనాసులభాగత్యై నమః
శోభనములైన పురుషార్థముల స్వరూపిణిగను, పురుషార్ఠములు సుఖోపాస్యమగు గమ్యస్థానముగను, పురుషార్థమలు
సులభతరముచేయు జ్ఞానస్వరూపిణిగను, పురుషార్థములు సులభగతిని లభింపజేయునదిగను, పునర్జన్మరాహిత్యము నొనగూర్చునదిగను తేజరిల్లు శ్రీమాతకు నమస్కారము
శ్రీలలితా సహస్ర నామావళి యందలి శోభనాసులభాగతిః అను ఎనిమిదక్షరముల నామ మంత్రమును ఓం శోభనాసులభాగత్యై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసన చేయు సాధకుడు నిశ్చయంగా చతుర్విధ పురుషార్థములను పొందు సులభగతిని సాధించి ముక్తసంగుడై తరించును.
ధర్మార్ధ కామమోక్షములు అను చతుర్విధ పురుషార్థములనే శోభనములు అంటారు. వీటిని అతి సులువుగా తన భక్తులకు సంప్రాప్తింపజేస్తుంది. ఇంతకు నామ మంత్రములో సుఖారాధ్యా అని (681వ నామ మంత్రములో) స్తుతించాము. అంటే జగన్మాతను ఆరాధించడానికి కఠోరమైన ఉపవాసములు, వనాంతరసీమలకు పోయి ఘోర తపస్సులు చేయనక్కరలేదు. శ్రీమాత్రే నమః అని స్మరిస్తూ, అంతర్ముఖంగా ధ్యానించితే సరిపోతుంది. సర్వశుభములు కలుగజేసి తరింపజేస్తుందనడానికి ఆ తల్లిని శుభకరీ అని (682వ నామ మంత్రములో) స్తుతిస్తున్నాము. ఇప్పుడు ఈ 683వ) నామ మంత్రములో శోభనాసులభాగతిః అని స్తుతిస్తున్నాము. చతుర్విధపురుషార్థములలో ధర్మార్థకామములు సక్రమమైన పద్ధతిలో నిర్వర్తిస్తే నాలుగవ పురుషార్థము అసంకల్పితముగానే సంప్రాప్తిస్తుంది. ధర్మము ఉత్తమగతులు పొందడాని దైవధ్యానము, సాటిమనిషికి సహాయపడడము, ధానధర్మములాచరించుట వంటి సత్కార్యములు చేయుచు తన కుటుంబమును నిర్వహించుటలో తన ధర్మమును తాను నిర్వర్తించుట అనననది పురుషార్థములలో మొదటిది.
అర్థము అష్టైశ్వర్యములు (ఎనిమిది విధములైన ఐశ్వర్యములు: 1. దాసీ జనము. 2. భృత్యులు. 3. పుత్రులు. 4. మిత్రులు. 5. బంధువులు. 6. వాహనములు. 7. ధనము. 8. ధాన్యము) ఇవి మానవునికి కావలసినవి. ధర్మబద్ధమైన పద్ధతిలో సంప్రాప్తింపజేసుకోవాలి.
కామము కామిగాక మోక్షకామిగాడు అన్నట్లు పున్నామ నరకమునుండి కాపాడబడుటకు, దైవము తనకొసగిన ఒక విధిప్రకారము సృష్టివికాసానికి కారకుడగుటకు సంతానమును పొందడము - ఇవన్నీ సక్రమంగా నిర్వహిస్తే పరబ్రహ్మము గూర్చి తెలుసుకోవాలని, పునర్జన్మరహితమైన దైవ సాన్నిధ్యమును పొందాలనే కామనలు తీర్చుకొనుదిశగా జీవనపదంలో ముందుకు సాగుట.
మోక్షము ఈ ధర్మార్థకామములు ఎప్పుడైతే పైన చెప్పిన విధంగా మానవుడు నిర్ణయించాడో అప్ఫుడే పరమాత్మ ఆ మానవునికి ఏవిధమైన మోక్షమునివ్వాలో నిర్ణయించుకోవడం జరుతుంది. ఈ దర్మార్థకామమోక్షములను చతుర్విధ పురుషార్థములే శోభనములు. ఇవి పొందాలంటే జగన్మాత సులభమైన మార్గాన్ని ఇస్తుంది గనుక ఆతల్లిని శోభనాసులభాగతిః అని స్తుతిస్తున్నాము.
'ధర్మార్థకామములను ఈ మూడు పురుషార్థములను నీ పూర్వవాసనలకనుగుణంగా, క్రమం తప్పక ఆచరించు. నేను నాలుగవ పురుషార్థమైన మోక్షాన్ని నేను ఇస్తాను. అది నువ్వు ఆచరించవలసినదికాదు. నేను సుఖారాధ్యను ఎందుకంటే భోళా శంకరుని భార్యను. ఆయనలో సగం గుణాలు నాకు వచ్చాయి. అందుకని సులువుగా ఆరాధింపబడతాను. గోరంత ఆరాధిస్తే కొండంత ఇచ్చేటంత భోళాశాంకరి ని. నీకు అన్నీ శుభకరమే అవుతాయి ఎందు కంటే నేను శుభకరిని. నాభర్త శంకరుడు శుభంకరుడు. నేను ఆయన భార్యను గనుక శుభంకరి ని' అని జగన్మాత అంటుంది. అనడమేకాదు శోభనాసులగతిః అనిపించు కుంటూ ధర్మార్థకామమోక్షములు అను శోభనములను సులభతరంగా పొందే మార్గాన్ని చూపిస్తుంది.
అమ్మవారిని (96వ శ్లోకంలో) 462వ నామ మంత్రంలో శోభనా అని విశేషించాము.
అలాగే 178వ శ్లోకంలో 'సువాసిన్యర్చనప్రీతాఽ శోభనా ' అన్నాము.
ఇన్ని సార్లు అమ్మను ఒకే పదాన్ని విశేషంగా చెపుతూ స్తుతిస్తున్నామంటే జగన్మాత సర్వశుభకారిణి.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం శోభనాసులభాగత్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
684వ నామ మంత్రము 21.5.2022
ఓం రాజరాజేశ్వర్యై నమః
దేవేంద్రుడు, బ్రహ్మోపేంద్రమహేంద్రాదుల వంటి రాజులు, కుబేరుడు, చంద్రుడు మొదలైనవారికే ఈశ్వరిగా, శ్రీవిద్యాషోడశాక్షరీమంత్రవిద్యాధి దేవతాస్వరూపిణిగా తేజరిల్లు జగదీశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి రాజరాజేశ్వరీ అను ఆరక్షరముల (షడాక్షరీ) నామ మంత్రమును ఓం రాజరాజేశ్వర్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమదయాస్వరూపిణి అయిస లలితాంబనుఅత్యంత భక్తిశ్రద్ధలతో పూజించు భక్తునకు రాజరాజేశ్వరీ స్వరూపిణి అయిన జగన్మాత కరుణతో సాధకునికి సర్వాభీష్టసిద్ధియును, పరాతత్త్వ జ్ఞానామృతమును సంప్రాప్తింపజేసి తరింపజేయును.
జగన్మాత తన ప్రేమలోక సామ్రాజ్యాధినేత అయిన శివునికి ప్రాణేశ్వరి, అర్ధాంగి.
దేవేంద్రుడు (సురలోకాధిపతి - రాజు) అయిన ఇంద్రునకు, బ్రహ్మోపేంద్రమహేంద్రాదులకు (త్రిమూర్తులకు), కుబేరుడు (యక్షులకు రాజు), చంద్రునకును (రాజు అనగా చంద్రుడు - రేరాజు) ఈ రాజులందరికీ జగన్మాత ఈశ్వరి (రాజరాజేశ్వరి). చతుర్దశ భువనాల కధిపతులై పరిపాలించు రాజులందరికీ, అష్టదిక్పాలకు, కూడా ఆ పరాశక్తి ఈశ్వరి గనుక రాజరాజేశ్వరి
మంత్రరాజమైన శ్రీవిద్యా షోడశాక్షరీమంత్ర విద్యాధిదేవతా స్వరూపిణిగా జగన్మాత విరాజిల్లుచున్నది. సర్వమంత్రాలకు, సర్వతంత్రాలకు, సర్వమంత్రాలకు శక్తిగా, అధినేత్రిగా, ఈశ్వరిగా విరాజిల్లుచున్నది గనుక, జగన్మాత రాజరాజేశ్వరి.
శ్రీలలితా సహస్రనామస్తోత్ర ఫలశ్రుతిలో
లౌకికా ద్వచనాన్ముఖ్యం విష్ణునామాను కీర్తనమ్|
విష్ణునామ సహస్రాచ్చ శివనామైక ముత్తమమ్|
శివనామ సహస్రాచ్చ దేవ్యా నామైక ముత్తమమ్॥
అనగా లోక వాక్యాల కంటే విష్ణునామ సంకీర్తనం,అలాటి విష్ణు సహస్రసామముల కంటె శివనామము, శివసహస్రనామాల కన్నా శ్రీలలితా నామం ఒక్కటి ఎంతో మహిమగలది అంటే వీటన్నిటికీ శ్రీమాతా నామ మంత్రం ఈశ్వరి వంటిది. అందుకే జగన్మాత రాజరాజేశ్వరీ అని స్తుతింపబడుచున్నది.
అటువంటి ఈశ్వరి అయిన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం రాజరాజేశ్వర్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*685వ నామ మంత్రము* 22.5.2022
*ఓం రాజ్యదాయిన్యై నమః*
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, దిక్పాలకులు మొదలైన దేవతలకు, తన భక్తులకు, ఉపాసకులకు దీక్షాబలము, సామర్థ్యముల ననుసరించి రాజ్యములను, నగరములను ఇచ్చి, వారిని అధిపతులను జేసిన అఖిలాండేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *రాజ్యదాయినీ* అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం రాజ్యదాయిన్యై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని పూజించు భక్తులకు సకలాభీష్టసిద్ధిని ప్రసాదించి అనుగ్రహించును.
జగన్మాత సృష్టిస్థితిలయకారిణి. దుష్టరాక్షసులను సంహరించి వారి నుండి రాజ్యములను కైవశముచేసికొని, రాక్షసులచేతిలో అపజయము పొంది వాటిని పోగొట్టుకొనిన ఇంద్రాది దేవతలకు తిరిగి ఇచ్చినది. బ్రహ్మకు సత్యలోకము, విష్ణుమూర్తికి వైకుంఠము, మహేశ్వరునకు కైలాసమును ఇచ్చినది. ఇంకను ఉపాసకులకు, శ్రేష్ఠులకు, భక్తులకు వారి వారి దీక్షాబలము, తపోబలము, ఉపాసనాబలము, పరిపాలనాదక్షత ననుసరించి రాజ్యములు, నగరములు ఇచ్చినది. అధిపతులను చేసినది జగన్మాత. ఉపాసనా సిద్ధి ఉన్న సాధకునకు, సాధనచేయు విద్యయను సామ్రాజ్యాధినేతను చేసి, జనహిత కార్యక్రమములు చేయనిర్దేశించినది. ఇంద్రునకు స్వర్గాధిపత్యము నిచ్చినది. కుబేరునకు ధనాధిపత్యము, అగ్నికి తేజోవతి నగరము, యముడికి సంయమని నగరము, నైరుతికి కృష్ణాంగన నగరము, వరుణునికి శ్రద్ధావతి నగరము, వాయువుకు గంధావతి నగరము, ఈశానుడికి యశోవతి నగరము ఇలా అందరికీ చతుర్దశ భువనములను ఇచ్చి, కార్యక్రమములు నిర్వహింపజేసినది. తాను సృష్టించిన జగత్తును రాజ్యములుగా చేసి, ఆయా విభాగములకు సామర్థ్యత గలిగిన వారిని అధిపతులను జేసి *రాజ్యదాయినీ* అని నామ మంత్రముతో స్తుతింప బడుతున్నది. అటు వంటి జగదీశ్వరికి నమస్కరించునపుడు *ఓం రాజ్యదాయిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*686వ నామ మంత్రము* 23.5.2022
*ఓం రాజ్యవల్లభాయై నమః*
త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, ఇంద్రాదులందరూ తానొసగిన చిన్న చిన్న రాజ్యములకు అధిపతులై, వివిధశాఖాధీశులుగా తన కనుసన్నలలోనే పరిపాలన కొనసాగించుచుండగా, ఆ రాజ్యములకన్నిటికీ తానే సర్వాధినేతయై, శ్రీమహారాజ్ఞిగా, శ్రీమత్సింహాసనేశ్వరిగా విరాజిల్లు అఖిలాండేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *రాజ్యవల్లభా* అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం రాజ్యవల్లభాయై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకుడు భక్తిసామ్రాజ్యాధినేతయై, శ్రీచక్రాధీశ్వరి కరుణతో విశేషమైన బ్రహ్మజ్ఞానసంపదతోబాటు, భౌతిక సుఖసంతోషములు కూడా సంప్రాప్తించి ఆనందమందును.
జగన్మాత ఈ సమస్త విశ్వసామ్రాజ్యమునకు ప్రభ్వి. సృష్టిస్థితిలయకారిణి. సమస్తభువనమండలములకు అధినేత్రియై స్వర్గసామ్రాజ్యమునకు దేవేంద్రుని, సత్యలోకమునకు చతుర్ముఖ బ్రహ్మను, వైకుంఠమునకు శ్రీమహావిష్ణువును, కైలాసమునకు త్రినేత్రుడిని పరిపాలనకు నియమించి, అష్టదిక్పాలకులను, నవగ్రహదేవతలను వివిధ నగరములకు అధిపతులను జేసి పరిపాలనను వికేంద్రీకరణము జేసి, సర్వాధిపత్యము తానే వహిస్తూ శిష్టజన రక్షణ, దుష్టజన శిక్షణ, సృష్టిస్థితిలయకార్యములకు విఘాతము కలుగకుండా అత్యంతసమర్థవంతంగా పరిపాలించు విశ్వజన సామ్రాజ్యాధికారిణిగా *రాజ్యవల్లభా* అసు నామమునకు సార్థకత చేకూర్చు తల్లి ఆ పరాశక్తి. జగన్మాత శ్రీచక్రసామ్రాజ్యానికి అధినేత్రియై నవావరణలు అను సామంతరాజ్యములకు ప్రకటయోగిని, గుప్తయోగిని, గుప్తతరయోగిని, సంప్రదాయయోగిని, కులోత్తీర్ణయోగిని, నిగర్భయోగిని, రహస్యయోగిని, అతిరహస్యయోగిని, పరాపర రహస్యయోగిని అను సామంత రాజ్యాధినేతలను నియమించి నవచక్రేశ్వరియై, బిందుమండలమందు కామేశ్వరునితో కూడి సార్వభౌమత్వమును నిర్వహించు చున్నది. ఆ తల్లి ఆ రాజ్యాధినేతలనిన అత్యంత ప్రీతికలిగియున్నది. గనుకనే జగన్మాతను *రాజ్యవల్లభా* అని నామ మంత్రముతో స్తుతించుచున్నాము.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం రాజ్యవల్లభాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
687వ నామ మంత్రము 24.5.2022
ఓం రాజత్కృపాయై నమః
సృష్టియందలి జీవజాలానికి కాలానుగుణముగా ఋతుధర్మముల ననుసరించి కూడు, గూడు, గుడ్డ వంటి అవసరములయందు, దుష్టశిక్షణ, శిష్టరక్షణాది కార్యకలాపముల నిర్వహణయందు బాధ్యతపడి సమస్త విశ్వమును మాతృమూర్తివలె అనురాగపు జల్లులలో ఆనందింపజేస్తూ విరాజిల్లు శ్రీమహారాజ్ఞికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి రాజత్కృపా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం రాజత్కృపాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తునకు ఆ జగన్మాతయొక్క సంపూర్ణ కరుణా కటాక్షములు లభించి సర్వాభీష్ట సిద్ధి కలుగును.
రాజ్యవల్లభా అను 686వ నామ మంత్రములో జగన్మాత అఖిలాండేశ్వరి. సర్వాధినేత్రి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, అష్టదిక్పాలకులకు సత్యలోకము, వైకుంఠము, కైలాసము మరియు అష్టదిక్పాలకులకు వారి వారి నిర్దేశిత విధులను బట్టి వివిధరాజ్యములను ఇచ్చి, ఆ రాజ్యములకు అధిపతులను జేసి, సార్వభౌమత్వమును తాను వహిస్తూ లోకేశ్వరి, అఖిలాండేశ్వరిగా విరాజిల్లుచున్నది జగన్మాత. సర్వాధినేత్రిగా జగన్మాతకు బాధ్యత ఇంకను చాలా ఉన్నది. అదేమిటంటే కాలధర్మములు, ఋతుధర్మములు, జీవుల జీవనవిధానములు వాటికనుగుణంగా నెలకు మూడు వానలు, గాదులనిండా ధాన్యములు, కడవలనిండా పాడి, చెరువుల నిండా నీళ్ళు, నదులు అదుపుతప్పకుండా ప్రవహించుట, పనిచేసే బసవన్నలు ఆరోగ్యంగా ఉండుట, స్త్రీమూర్తులు మాంగల్య శోభతో, ప్రాణంపెట్టే పతిదేవుళ్ళతో, రత్నమాణిక్యములవంటి సంతానముతో, ఆ సంతానము చతుష్షష్టి కళానైపుణ్యముతో, వజ్రవైఢూర్యాది నవరత్నములు కుంచములతో కొలిచి ఇచ్చే సిరిసంపదలతో....శోభనముల (పురుషార్థముల) నాచరించుటలో సమన్యాయముతో, స్త్రీమూర్తులు అష్టలక్ష్మీ సమానులై ఆరాధింపబడుతూ ఉంచవలసిన బాధ్యత ఆ జగన్మాతకు గలదు. ఈ బాధ్యతలను సమర్థవంతముగా నిర్వహిస్తూ, దుష్టశిక్షణ, శిష్టరక్షణాది కార్యక్రమములను నిర్వహిస్తూ, సమస్త సృష్టిలోని జీవజాలమునకు తానొక మాతృమూర్తియై, కృపాకటాక్షములనెడి సుధాధారలను వర్షింపజేస్తూ విరాజిల్లుతూ రాజిల్లుచున్నది గనుక జగన్మాత రాజత్కృపా అను నామప్రసిద్ధమైనది. అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం రాజత్కృపాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
688వ నామ మంత్రము 25.5.2022
ఓం రాజపీఠ నివేశిత నిజాశ్రితాయై నమః
తనను ఆశ్రయించిన బ్రహ్మోపేంద్రమహేంద్రాదులు, దిక్పాలకులు, ఉపాసకులు, యోగులు మొదలైన వారికి వారి వారి యోగ్యతానుసారము రాజపీఠ(యోగ)మును సంప్రాప్తింప జేసిన శ్రీమహారాజ్ఞికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి రాజపీఠ నివేశిత నిజాశ్రితా అను పండ్రెండక్షరముల (ద్వాదశాక్షరీ) నామ మంత్రమును ఓం రాజపీఠ నివేశిత నిజాశ్రితాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ రాజశ్యామలా స్వరూపిణిని ఉపాసించు సాధకులకు తప్పక రాజయోగము, పలువురిలో ముఖ్యస్థానము లభించును. కీర్తిప్రతిష్టలు ఇనుమడించును.
అలనాడు బ్రహ్మోపేంద్రమహేంద్రాదులకు తన మహాసామ్రాజ్యమునుండి శాఖాపరమైన రాజ్యాధిపత్యమును ఇచ్చి వారికి యోగ్యమైన సింహాసనములను కూడ ఇచ్చినది జగన్మాత. అలాగే తనను ఉపాసించిన మహాయోగులు, సిద్ధులు, భక్తులకు వారి యోగాభ్యాసములననుసరించి యోగసామ్రాజ్యములకు, ఆధ్యాత్మిక సామ్రాజ్యములకు అధినేతలను చేసి యోగ్యమైన పీఠములందు అధిష్టింప జేసిన శ్రీమహారాజ్ఞీ స్వరూపిణి జగన్మాత.
ఛత్రపతి శివాజీకి భవానీమాత ఖడ్గమునిచ్చి రాజ్యాధిపత్యమునందు మహాచక్రవర్తిని చేసినదని చరిత్రలు చెపుతున్నాయి.
మహాకాళీ భక్తుడు కాళిదాసు ఒకప్పుడు నిరక్షరకుక్షి. మేకల కాపరి. కాళిదాసును మహాకవియనే అబద్ధంతో రాజకుమార్తెకు ఇచ్చి పెళ్ళిచేస్తారు. విషయం తెలిసిన రాజకుమార్తె అవమానం భరించలేక, తన భర్తను నిజముగానే ఒకమహాకవిగా అనుగ్రహించమని మహాకాళిని శరణువేడుకొంటుంది. కాని అతనికి ఏడుజన్మలవరకూ అంతటి మహాయోగం అసంభవమని మహాకాళి రాజకుమార్తెకు చెప్పినది. రాజకుమార్తె ఆ తల్లిపాదాలను తన కన్నీటితో అభిషేకించి అలాగే ఉండిపోయింది. కాళీస్వరూపిణి అయిన జగన్మాత అతనికి అప్పటికప్పుడే ఏడు జన్మలు జననమరణములతో సంభవింపజేసి, ఎనిమిదవ జన్మలో అతని నాలుకపై వాగ్భవబీజములు వ్రాసి సంస్కృతవాఙ్మయ సామ్రాజ్యాధినేతగా, ఒకమహాకవిగా మార్చినది.
దేవేంద్రుడు తారకాసురుడు, మహిషాసురులు అను రాక్షసులవలన రాజ్యభ్రష్టుడవగా, జగన్మాత వారిని సంహరించి తిరిగి అమరావతీ పీఠంపై దేవేంద్రుడిని అధిష్టింపజేసినది.
ధ్రువుడు ఐదు సంవత్సరముల వయసులోనే తండ్రి ప్రేమసామ్రాజ్యంలో చోటులేకుండా సవతితల్లిచే నెట్టివేయబడతాడు. అకుంఠిత దీక్షతో అడవులకు వెళ్ళి తపస్సుచేసి శాశ్వత ధ్రువతారగా నేటికీ వెలుగుతున్నాడంటే సృష్టిస్థితిలయకారిణి, మహాసామ్రాజ్ఞి అయిన జగన్మాత సంకల్పం, శ్రీమహావిష్ణువు అనుగ్రహమేకదా.
ఇలా చెప్పుకుంటూపోతే ఆ శ్రీచక్రసామ్రాజ్ఞి గురుంచి దేవీభాగవతమే చదవాలి మనము.
రాజపీఠమంటే ఏదో రాజసింహాసనము, రాజ్యాధికారము మాత్రమేకాదు. పదిమందిలో ఒక ప్రత్యేకత, అధినాయకత్వము కలిగియుండుట.
అటువంటి శ్రీచక్రసామ్రాజ్ఞికి నమస్కరించునపుడు ఓం రాజపీఠ నివేశిత నిజాశ్రితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
689వ నామ మంత్రము 26.5.2022
ఓం రాజ్యలక్ష్మ్యై నమః
పాడిపంటలతో, సిరిసంపదలతో, ఆయురారోగ్యములతో , నిత్యకళ్యాణము పచ్చతోరణమై, వైభవంగా, ఆధ్యాత్మిక పరిపుష్టి కూడా తోడై, సర్వ సుసంపన్నమై తన రాజ్యములోనెల్లడలా మహదానంద భరితమగు ప్రజారంజకమైన పాలననందించు శ్రీమహారాజ్ఞిగా, ఒక మహాసామ్రాజ్యలక్ష్మిగా విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి రాజ్యలక్ష్మీ అను నాలగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం రాజ్యలక్ష్మ్యై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకునకు ఆ తల్లి కరుణచే సర్వాభీష్టసిద్ధియు, ఆధ్యాత్మిక జ్ఞానప్రాప్తియు లభించును.
జగన్మాత ఒక మహాసామ్రాజ్ఞి. తనచే సృష్టింపబడిన విశ్వములకన్నిటికీ మహా సామ్రాజ్ఞియే కాక శ్రీచక్రనగరసామ్రాజ్ఞాధినేత్రిగా కూడా విరాజిల్లుచున్నది. బ్రహ్మవిష్ణుమహేశ్వరులు, అష్టదిక్పాలకులు, స్వర్గాధినేత ఇంద్రుడు పరిపాలించు రాజ్యముల యందేగాక, యోగులకు, సాధకులకు, భక్తులకు సంప్రాప్తమైన ఆధ్యాత్మిక జ్ఞాన సామ్రాజ్యములు, భక్తిసామ్రాజ్యములు, యోగసామ్రాజ్యముల యందుగూడ తనదంటూ ఒక గణనీయమైన పరిపాలనా సరళిని ఏర్పరచినది. ఆయా సామ్రాజ్యములలో నుండువారికి మంగళకరము, శోభస్కరము, సౌభాగ్యకరమగు ఉనికిని కలుగజేయుచున్నది. లౌకిక రాజ్యములో శాంతిసౌభాగ్యములు, పాడిపంటలు, సిరిసంపదలకు కొఱతలేకుండుట, ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ఆధ్యాత్మికత, దైవచింతన, భగవదుపాసనలు - ఇవన్మీ లక్ష్మీకరము. తన సామ్రాజ్యములో నెలకొల్పిన శుభకరము లయిన వన్నియూ కూడా మనసుకు శాంతిసౌభాగ్యముల పరిపుష్టిని కలుగజేయును. ఎక్కడైతే తృప్తి, నిండుతనము నెలకొనియుంటుందో అదే లక్ష్మీకరము. ఆ విధముగా తాను పాలన చేయు సామ్రాజ్యములందు మహదానందకరమును కలుగజేసిన జగన్మాత మహాసామ్రాజ్ఞి లక్ష్మీస్వరూపురాలు, రాజ్యలక్ష్మీస్వరూపురాలు. రాజుకు ప్రజలకు గల సంబంధాన్మి సూచిస్తూ ఆధ్యాత్మికంగా ఆత్మకు మనస్సుకు గల సంబంధాన్ని కూడా జగన్మాత సూచిస్తున్నది. ఆ విధంగా రాజుకు-ప్రజలకు గల సంబంధమునందు గాని, ఆధ్యాత్మికంగా ఆత్మకు-మనస్సుకు గల సంబంధమునందుగాని పరిపూర్ణత నెలకొనినట్లైతే అదే శుభకరము, లక్ష్మీకరము. అట్టి లక్ష్మీకరమైన సంబంధవైభవాన్ని నెలకొల్పినది రాజ్యలక్ష్మీ స్వరూపురాలైన జగన్మాత.
అట్టి రాజ్యలక్ష్మీస్వరూపిణికి నమస్కరించునపుడు ఓం రాజ్యలక్ష్మ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీలలితా సహస్రనామ భాష్యము
690వ నామ మంత్రము 27.5.2022
ఓం కోశనాథాయై నమః
అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అను పంచకోశములకు అధికారిణిగా విరాజిల్లుచున్న జగదీశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి కోశనాథా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం కోశనాథాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తుడు సకల సంపదలతోనూ, ఆధ్యాత్మికా సౌరభములు వెలయు జీవన విధానముతో విలసిల్లి తరించును.
జగన్మాత మహాసామ్రాజ్ఞి. రాజ్యలక్ష్మీస్వరూపురాలు. అటువంటి తల్లి తన సామ్రాజ్యంలో అందరూ భౌతికానందము మరియు ఆధ్యాత్మికానందముతో ఉండాలంటే తగిన వనరులు కావాలి. అటువంటి వనరులు ఉంచగలుగు ప్రదేశములకే కోశములు. అందురు. ఉదాహరణ: కోశాధికారి అంటే మన భాషలో ఆర్థికవ్యవహారములు (ధనసంబంధమైన లావాదేవీలు) నిర్వహించు అధికారి అంటాము. కాని జగన్మాత సిరిసంపదల నిర్వహణ మాత్రమే చేయదు. ఆ తల్లి నిర్వహించునవి ఎన్నియో గలవు. పాడిపంటలు, పుష్కలమైన జలసంపద, ఆయురారోగ్యములు, చతుష్షష్టికళలు..ఇలా ఎన్నోఉన్నాయి. సిరిసంపదలకు లక్ష్మీస్వరూపురాలు, ఆ సిరులు నిక్షిప్తము చేయు ధనాగారములకు, కోశాధికారిగా కుబేర స్వరూపురాలు, ఆయురారోగ్యములకు ధన్వంతరీ స్వరూపురాలు, పచ్చనిపంటలకు జలకళనిచ్చు వరుణ స్వరూపురాలు, హోమములందు సమర్పించిన హవ్యము లారగించు సాక్షాత్ ఆ భగవత్స్వరూపురాలు, పితృయజ్ఞములందు సమర్పించు కవ్యములనారగించు పితృదేవతాస్వరూపురాలు. శివుడు, విష్ణువు మరియు సర్వ దేవతా స్వరూపిణి.
జగన్మాత ఉండేదే మణిద్వీపంలో చింతామణిగృహం. సర్వం మణిమయం. అంతటి తల్లి నవరత్నకోశములకు, కాంచన కోశములకు అధిపతి.
అన్నింటికి మించినకోశములు మనలోనే ఉన్నవి. అవి:-
ప్రశ్నోపనిషత్తులో పిప్పిలాద మహర్షి చెప్పినట్లుగా, ఆత్మ మానవుడి యందు అయిదు కోశాలచేత ఆవరించబడి వుంటుంది. అవి 1.శరీరం (అన్నమయ కోశం) 2. జీవశక్తులచేత ఏర్పడిన ప్రాణమయ కోశం, 3. మనస్సు (మనోమయ కోశం), 4. బుద్ధి విజ్ఞాన మయ కోశం 5. అజ్ఞానంచేత ఏర్పడిన ఆనందమయ కోశం.
1. అన్నమయ కోశము:- ఇది పైకి కనిపించే స్థూల శరీరమే. గింజను పైపొట్టు కప్పి వుంచినట్లు, గర్భస్త పిండమును మాయ కప్పి ఉంచినట్లు, స్థూల శరీరమైయున్నది.
అన్నాద్‌భవన్తి భూతాని వర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః (3-14) అని భగవద్గీతలో చెప్పినట్లు, అన్నము (ఆహారము)వల్ల ఏర్పడిన మన శరీరము ప్రకాశవంతమైన ఆత్మను కవచం వలె కప్పి వుంచుతుంది. అందువల్ల స్థూల భౌతిక శరీరమే అన్నమయకోశం అనబడుతోంది.
2. ప్రాణమయ కోశము:- ప్రాణ అనగా స్థిరముగా నిరంతరము మన శరీరంలో ప్రవహించే జీవశక్తి. దీనిని ఓజస్సు అని కూడ అనుకోవచ్చు. మన శరీరంలోని 72000 నాడుల (వీటిలో 14 ముఖ్యమైనవి అందులో పింగళ, ఇడ, సుషుమ్న అతి ముఖ్యమైనవి) ద్వారా ఈ ప్రాణశక్తి శరీరమంతా వ్యాపించి ఉంటుంది. పంచవాయువులు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు) గా పంచ ప్రాణములుగా సంచరిస్తూంటుంది. ఇది ప్రాణంతో తయారైంది కాబట్టి దీన్ని ప్రాణమయ కోశమన్నారు.
3. మనోమయ కోశం:- పంచ జ్ఞానేంద్రియములు, మనసు. ఇది ప్రాణమయ కోశమునకు లోపల ఉండి, దుఃఖమోదాది అరిషడ్వర్గములు లేని ఆత్మను, అవి ఉన్నట్టు కప్పి ఉంచును. ఈ కోశము సూక్ష్మమైనది. ఇది భౌతిక శరీరానికి జ్ఞానవంతమైన ఆత్మకు మధ్య ఉంటుంది.
4. విజ్ఞానమయ కోశము:- ఇది పంచ జ్ఞానేంద్రియములు మరియు బుద్ధికలిసి ఏర్పడుతుంది. నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను అనే (అహంభావం) నేను అనే భావన కలిగించి, తెలియరానట్టి, ఆత్మను, తెలియబరిచే దానిగా ఆవరించి ఉంటుంది. అట్టి విజ్ఞానంవల్ల ఏర్పడింది కాబట్టి, విజ్ఞానమయకోశమన్నారు.
5. ఆనందమయ కోశము:- ఆత్మ, సుఖ దుఃఖములు, ప్రియాప్రియములు మొదలగు ద్వంద్వాలకతీతముగా ఉంటుంది. అట్టి ఆత్మను అవన్నీకలల దానినిగా భ్రమింపచేస్తుంది. అందువల్ల దీన్ని ఆనందమయ కోశమన్నారు.
ఇన్ని కోశాలకు అధిపతిగనుకనే జగన్మాత కోశనాథా అని స్తుతించుచున్నాము.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కోశనాథాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
694వ నామ మంత్రము 31.5.2022
ఓం సాగరమేఖలాయై నమః
సమస్త సృష్టియును తన విశ్వరూపమై, సాగరములన్నీ తన కటిసూత్రము (ఒడ్డాణముగా) ఒప్పు విరాడ్రూపిణి అయిన పరాశక్తికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి సాగరమేఖలా అను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును ఓం సాగరమేఖలాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరాశక్తిని పూజించు సాధకుడు ఆ తల్లి కరుణచే సర్వాభీష్టసిద్ధిని పొంది ఆత్మానందానుభూతిని పొందగలడు.
జగన్మాత భూస్వరూపురాలు, విరాడ్రూపిణి. జగన్మాత విరాడ్రూపిణి అయితే ఆ తల్లికటిప్రదేశమే సమస్త సాగరసంపద ఉన్న భూలోకము. దుచే జగన్మాత కటిభాగము సముద్రములచే చుట్టబడియుండుటచే ఆ విరాడ్రూపిణికి సాగరమేఖలా అనగా సాగరములే జగన్మాతకు ఒడ్డాణమై ఒప్ఫుచున్నవి. దేవీభాగవతంలో జగన్మాత విరాడ్రూపము ఇలా వర్ణింపబడినది. అమ్మవారి శిరస్సు, సత్యలోకం. నయనములు - సూర్యచంద్రులు. కర్ణములు - దిక్కులు. కడగంటి చూపు - సృష్టి. పైపెదవి - లజ్జ. క్రింధి పెదవి - లోభము. ఉదరము - సముద్రము.
అటు వంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సాగర మేఖలాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
695వ నామ మంత్రము 1.6.2022
ఓం దీక్షితాయై నమః
సర్వమంత్రాత్మికగా, ఒక గురువుగా తన భక్తులకు బ్రహ్మజ్ఞానమును సంప్రాప్తింపజేయు పూర్ణదీక్షా స్వరూపిణిగా విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి దీక్షితా అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం దీక్షితాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు ఉపాసకునకు ఆ తల్లి కరుణతో అనంతమైన బ్రహ్మజ్ఞానసంపదలిచ్చి, నిత్యమును, సత్యమును అయిన ఆత్మానందమును సంప్రాప్తింపజేయును.
మూలమంత్రాత్మిక అయిన జగన్మాత పూర్ణదీక్షాస్వరూపిణి. పూర్ణదీక్షాపరులకు అన్ని మంత్రాలమీద అధికారం ఉంటుంది. సర్వమంత్రస్వరూపిణీ అని 204వ నామ మంత్రంలో అన్నాము. సప్తకోటి మహామంత్రస్వరూపిణి జగన్మాత అని భాస్కరరాయలువారు అని ఈ నామ మంత్రానికి భాష్యం చెప్పారు. ఆ జగన్మాత సర్వమంత్రస్వరూపిణి గనుకనే పూర్ణదీక్షా స్వరూపిణి అనియు, పూర్ణదీక్షాస్వరూపిణి గనుకనే దీక్షతా అని నామము కలిగియున్నది. పూర్ణదీక్షాస్వరూపిణి అయిన జగన్మాత గురువు రూపంలో శిష్యుడికి మంత్రదీక్ష ఇస్తుంది, ఆ శిష్యుని పాపములను పొగొడుతుంది గనుకనే జగన్మాత దీక్షితా అని అన్నాము. మంత్రోపదేశం అనేది సద్గురువు వద్ద తీసుకుంటే ఆ మంత్రం సిద్ధిస్తుంది. అందుకు సద్గురువును ఎన్నుకోవడమే ఒక ప్రధాన ప్రక్రియ. శ్రీవిద్యోపాసనకు దీక్ష అవసరం మరియు ఆ దీక్షవలన శిష్యుని శక్తి పెరుగుతుంది. సద్గురువు శిష్యుని తలపై చేయి ఉంచి దీక్షనివ్వడంతో గురువుయొక్క శక్తి ఆమేరకు తగ్గుతుంది. శిష్యుడు అంతటితో కృతార్థుడౌతాడు.
జగన్మాత తన భక్తులకు వారి అర్హతలననుసరించి అనుగ్రహించే దీక్షకలిగి యున్నది. అందుకే దేవతలు కోరినంతనే అసురుల సంహారానికి తన శక్తిసైన్యములతో కదలి అత్యంత మహిమాన్వితమైన కామేశ్వరాస్త్రము, మహాపాశుపతాస్త్రముల వంటి దివ్యాస్త్రములనుకూడా చేతబట్టి దేవకార్యసముద్యతా అని స్తుతింపబడినది. శ్రీమహారాజ్ఞి గా దేవతలకు రాజ్యములను ప్రసాదించి రాజ్యదాయినీ అయినది. వారికి అధికారములిచ్చి రాజపీఠనివేశితనిజాశ్రితా అయినది. ఒక తల్లి తన పసిబిడ్డకు ఏ సమయంలో శరీరానికి నూనిపెట్టాలో, ఎప్పుడు స్నానంచేయించాలో, ఎప్పుడు ఉగ్గు పట్టాలో, ఎప్పుడు స్తన్యమివ్వాలో ఎవరు చెపితే చేస్తుంది. ఆబిడ్డను సాకడంలో ఆ మాతృస్వరూపిణి ఒక దీక్షాస్వరూపిణి. అలాగే ఆ పరాత్పరి విశ్వంలోని సమస్తజీవజాలమునకు ఏమికావాలో, ఏ సమయంలో ఏమి అవసరమో, దుష్టశిక్షణ, శిష్టరక్షణకూ జగన్మాత యొక్క పరబ్రహ్మాత్మకమైన ఒక దీక్షయే కారణం. అందుకే ఆ పరమేశ్వరి దీక్షితా అనబడుచున్నది. తన భక్తులను కావడంలో దీక్షవహించిన తల్లి కనుకనే దీక్షితా యని స్తుతింప బడుచున్నది. జనహిత కార్యక్రమములు, ఆర్తజన పరాయణత్వ నిర్వహణ చేయువారికి దృఢదీక్షారూపిణిగా విరాజిల్లు తున్నది గనుకనే జగన్మాత దీక్షితా అని అనబడుచున్నది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం దీక్షితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
696వ నామ మంత్రము 2.6.2022
ఓం దైత్యశమన్యై నమః
అధర్ములు, అవైదికులు, అజ్ఞానులు అయిన దైత్యులను, దైత్యభావనలు గల దుష్టులను తుదముట్టించి ధర్మసంస్థాపనమొనర్చిన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి దైత్యశమనీ అను ఐదు అక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం దైత్యశమన్యై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగదీశ్వరిని ఆరాధించు భక్తులు ఆ తల్లి కరుణచే వారిలో గల అరిషడ్వర్గములను దైత్యభావనలు తొలగి ఎడతెగని భక్తిభావనతో, నిష్కాములై, నిష్కపట హృదయంతో కేవలం జన్మరాహిత్యమైన మోక్షమే వారి భక్తికి గమ్యమని తెలిసి ఆత్మానందానుభూతితో తరింతురు.
లోక కంటకులైన రాక్షసులను ఎందరినో తుదముట్టించి ధర్మసంస్థాపనము చేసినది జగన్మాత.
కశ్యపమహామునికి దితియందు దైత్యులు, అదితికియందు దేవతలు, దనువునందు దానవులు కుమారులుగా కలిగిరి. వీరందరూ ఒక మహాముని సంతానమే. శక్తి, యుక్తి, పరాక్రమములలో అందరూ సమానమైసవారే. కాని దేవతలు కేవలం ధర్మమార్గము నందు నడచువారు. కాని మిగిలిన వారు అధర్మవర్తనులు. అవైదికులు. అరిషడ్వర్గములచే జ్ఞానము కమ్ముకొనిపోయి, అజ్ఞానులుగా మెలగుతూ దైవభక్తులను, స్త్రీలను, పసివారిని హింసించుటయే పనిగా ఉన్నవారు. వారిలో కూడా భక్తితత్పరులే కాని వారి భక్తి క్షుద్ర మాంత్రికుని తంత్రజ్ఞానము వంటిది. కఠోరమైన తపస్సు చేసి కోరరాని వరములు కోరుకొని, దేవతలమీద దండెత్తారు. మహామునుల తపస్సులు భగ్నం కావించారు. స్త్రీలను చెరబట్టారు. లోకకంటకులైపోయారు. చివరకు ధర్మపరులైన దేవతలు జగన్మాతను ఆశ్రయించగా జగన్మాత దేవకార్యసముద్యత గా దీక్షతో వారిపై తన శక్తిసైన్యాన్ని పంపింది (భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్వితా) తన అంశనుండి బాలాత్రిపురసుందరిని సమరంలోనికి (భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమనందితా) పంపినది. సంపత్కరీదేవి (సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా), ఆశ్వారూఢాదేవి (అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభి రావృతా), జ్వాలామాలినీ (జ్వాలామలినికాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా), నిత్యాదేవతలు (నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా), శ్యామలాదేవి (మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా), వారాహి (విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితా), మహాగణేశుడు (మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా)- వీరందరూ దైత్యసంహారంలో జగన్మాతకు సహాయపడ్డారు. జగన్మాత శ్రీమన్నారాయణుని పది అవతారములను తన చేతి వ్రేళ్ళ గోళ్ళనుండి సృజించి దైత్యసంహారములో నారాయణుని సహాయము కూడా స్వీకరించినది (కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః). జగన్మాత తానే రణరంగమున దిగి రాక్షసుల అస్త్రములకు మంత్రయుక్తమైన ప్రత్యస్త్రములు వేసి తన పరాక్రమమును చూపించి దైత్యులను గడగడలాడించినది (భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ). మహాపాశుపతాస్త్రముతో రాక్షస సైన్యమును భస్మీపటలము కావించినది (మహా పాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా). రాక్షసులను, వారి స్థావరములను సమూలంగా కామేశ్వరాస్త్రముతో దగ్ధముచేసినది (కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా).
ఆ విధముగా దైత్యులను తుదముట్టించి దేవకార్యసముద్యతా యని బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవతలచే స్తుతింపబడినది (బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా)
జగన్మాత దుష్టశిష్టణ నిమిత్తమై నవదుర్గలుగా అవతరించినది.
1. శైలపుత్రి
సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి.
2. బ్రహ్మచారిణి
బ్రహ్మచారిణి యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది. కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రథము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.
3. చంద్రఘంట
ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు చంద్రఘంట యను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతి మయము. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు వడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును.
ఈ దేవి ఆరాధన సద్యఃఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏవిధమైన భయములును వారిని బాధింపజాలవు.
4. కూష్మాండ
దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి కూష్మాండ అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము లోని సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.
అష్టభుజాదేవి అని కూడా అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లు చుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే.
భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును.
5. స్కందమాత
కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి యైన దుర్గాదేవిని 'స్కందమాత'పేరున నవరాత్రులలో ఐదవ రోజున ఆరాధింతురు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఈమెయొడిలో ఒక కుడిచేత పట్టుకొనియుండును. మరియొక కుడిచేత పద్మము ధరించియుండును. ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలము ధరించి, పద్మాసన యనబడు ఈమెయు సింహవాహనయే.
స్కందమాతను ఉపాసించుటవలన భక్తుల కోరికలన్నియు నెఱవేఱును. ఈ మర్త్యలోకమునందే వారు పరమ శాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునకు చెందును.ఈ దేవి సూర్య మండల-అధిష్టాత్రి యగుటవలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు.
6. కాత్యాయని
కాత్యాయనీ మాత బాధ్రపదబహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించింది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.
కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులములోని గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండును. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదానియందు ఖడ్గము, వేఱొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన.
ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును.
7. కాళరాత్రి
కాళరాత్రి శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.
కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను శుభంకరి అనియు అంటారు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు.
కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.
8. మహాగౌరి
అష్టవర్షా భవేద్గౌరీ - మహాగౌరి అష్టవర్ష ప్రాయము గలది. ఈమె గౌర వర్ణ శోభలు మల్లెపూవులను, శంఖమును, చంద్రుని తలపింపజేయును.ఈమె ధరించు వస్త్రములును, ఆభరణములును ధవళ కాంతులను వెదజల్లుచుండును. ఈమె చతుర్భుజ, వృషభవాహన. తన కుడిచేతులలో ఒకదానియందు అభయముద్రను, మఱియొకదానియందు త్రిశూలమును వహించియుండును. అట్లే ఎడమచేతులలో ఒకదానియందు డమరుకమును, వేఱొకదానియందు వరముద్రను కలిగియుండును. ఈమె దర్శనము ప్రశాంతము.
పార్వతి యవతారమున పరమశివుని పతిగా పొందుటకు కఠోరమైన తపస్సు చేయగా ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను. ప్రసన్నుడైన శివుడు గంగాజలముతో అభిషేకించగా ఈమె శ్వేత వర్ణశోభితయై విద్యుత్కాంతులను విరజిమ్ముచు మహాగౌరి యని వాసిగాంచెను. ఈమె శక్తి అమోఘము. సద్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నియును ప్రక్షాళితమగును. వారి పూర్వ సంచిత పాపములును పూర్తిగా నశించును. భవిష్యత్తులో గూడ పాపతాపములుగాని, దైన్య దుఃఖములుగాని వారిని దరిజేరవు. వారు సర్వవిధముల పునీతులై, ఆక్షయముగా పుణ్యఫలములను పొందుదురు. ఈ దేవి పాదారవిందములను సేవించుటవలన కష్టములు మటుమాయమగును. ఈమె యుపాసన ప్రభావమున అసంభవములైన కార్యముల సైతము సంభవములే యగును.
9. సిద్ధిధాత్రి
సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగనుక సిద్ధి దాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడింది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలచెను. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై యుండును. ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మఱొకచేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును, మఱియొక హస్తమున కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకలసిద్ధులును కరతలామలకము.
ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథములన్నియును సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలియుండవు. అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజాదికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధ పడును. తన్మహత్వమున నిజమైన, పరమానందదాయకమైన అమృతపదము ప్రాప్తించును.
ఇంకను జగన్మాత దుష్టశిక్షణకు శిష్టరక్షణకు ఎన్నో రూపాలలో అవతరించి దైత్యులను, దైత్యభావాలను నాశనమొనర్చి దైత్యశమని యని నామ ప్రసిద్ధమైనది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం దైత్యశమన్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
697వ నామ మంత్రము 3.6.2022
ఓం సర్వలోక వశంకర్యై నమః
సమస్త లోకాలను తన వశమందుంచుకొని, చతుర్దశభువనములలోని సర్వప్రాణులను తన భక్తుల శములో ఉంచు పరాశక్తికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వలోకవశంకరీ యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం సర్వలోక వశంకర్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ అఖిలాండేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆరాధనా సిద్ధి లభించి ఆ భక్తులను పీడించు భూతప్రేతపిశాచాదులు భయకంపితమై వారికి వశమగును (బంధింపబడతాయి). అలాగే తమ ధర్మబద్ధమైన కోర్కెలకు గ్రహశక్తులు అనుకూలించి సర్వాభీష్టసిద్ధికి మార్గమును సుగమంచేస్తాయి.
సృష్టియంతయూ జగన్మాత వశమైయుండును. జగన్మాత అదుపు, ఆజ్ఞలకు లోనైయుండును. తన భక్తులకు వారి ధర్మబద్ధమైన కోర్కెలకనుగుణంగా సృష్టిలోని ఆయాశక్తులను జగన్మాత వారి వశంలో ఉంచి సర్వాభీష్టసిద్ధిని కలుగజేయును.
చతుర్దశ భువనములలోని జీవులను (శక్తులను) తన ఉపాసకులకు (భక్తులకు) వారి వారి దీక్షాసామర్థ్యముననుసరించి వశముచేయును.
జగన్మాతను ఆరాధించు సాధకుడు ముల్లోకాలను సమ్మోహనంలో ముంచి తనకు కావలసినది (ధర్మబద్ధమైనది) రాబట్టుకుంటాడు.
జ్ఞానార్థి జ్ఞానశక్తిని, ధనార్థి ధనపతి అయిన కుబేరుని, పాడిపంటలకు వరుణుని, వాయుప్రకంపనలు లేకుండా ప్రశాంతమైన వాయుప్రసారమునకు వాయుదేవుని, నిర్విఘ్నతకు విఘ్నేశ్వరుని, అకాలమృత్యు నివారణమునకు మృత్యుంజయుని జగన్మాత మనకు అనుగ్రహిస్తుంది.
అత్యంత భక్తి ప్రపత్తులతో ఖడ్గమాలా స్తోత్ర పఠనం కారణంగా బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మిలు (అష్టమాతృకలు), అణిమ,లఘిమ, గరిమా, మహిమా, ఈశిత్వ, వశిత్వ, ప్రాకామ్య, భుక్తి, ఇచ్ఛా, ప్రాకామ్య మొదలైన సిద్ధులు వశమౌతాయి. ఇంకను శ్రీచక్ర నవావరణాధి దేవతలు మనభక్తికి వశమై శుభములు చేకూర్చుతారు.
సందర్భం వచ్చినది గనుక సిద్ధులగురుంచి పరిశీలిద్ధాము.
అష్ట సిద్ధులు
అణిమ– అతి చిన్న వాడిగా మారిపోవడం
మహిమ – పెద్ద రూపం పొందడం
గరిమ – బరువుగా మారడం
లఘిమ– తేలికగా మారిపోవడం
ప్రాప్తి - ఇంద్రియాల అధిష్ఠాన దేవతల్ని దర్శించడం, ఏదౖైెనా ఎక్కడైనా పొందగలగడం
ప్రాకామ్య – కోరుకున్న పదార్థాల్ని దర్శించి అనుభవించే సామర్థ్యం పొందడం
ఈశిత్వ – జ్ఞాన వీర్యాదుల ప్రకోప శక్తి, సృష్టిపై ఆధిపత్య శక్తి
వశిత్వ – విషయ భోగాల నుంచి రక్తిని పొందడం, అన్నిటిపై ముఖ్యంగా పంచ భూతాలపై నియంత్రణ
కామావసాయత- సమస్త కోరికల ఉపశమనం
ఈ అష్ట సిద్ధులను పురాణ పురుషులు ప్రదర్శించారు.
అణిమా సిద్ధిని హనుమంతుడు సీతాన్వేషణకు లంకలో ప్రవేశించేటపుడు చిన్న వాడిగామారి ప్రదర్శించాడు.
మహిమా సిద్ధిని హను మంతుడు సముద్రోల్లంఘన సమయంలో ప్రదర్శించాడు. ఇక సురస నోరు తెరిచినపుడు పెద్దవాడుగా మారి ఒక్క సారిగా చిన్నవాడిగా మారి అణిమా మహిమా సిద్ధుల్ని ఒక దాని వెంట ఒకటి ప్రదర్శిం చాడు. ఇంకా ఎన్నో చోట్ల ఆయన కాయాన్ని పెంచ డం కనిపిస్తుంది.
ఇక వామనావతారంలో విష్ణువు మూడడు గులతో భూమ్యా కాశాలను ఆవరించిన పుడు కూడా ఇదే విధంగా పెరిగాడు.
గరిమా సిద్ధిని కృష్ణుడు చిన్నతనంలో తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో ఎత్తుకు పోవడానికి వచ్చినపుడు అతనితో బాటు పైకెగిరి వాడి భుజాల మీద కూర్చుని బరువుగా మారడంతో వాడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వాడిని కృష్ణుడు చంపివేశాడు.
భీముడు సౌగంధిక పుష్పాలను తెచ్చేందుకు వెళ్లినపుడు హనుమంతుడుడు తన తోకను అడ్డుగా పెట్టి దానిని భీముడు ఎత్తలేనంత బరువుగా మార్చాడు.
లఘిమా అంటే తేలికగా అయిపో వడం. ఆకాశగమనం వంటివి కూడా దీనితో అనుబంధంగా వచ్చే శక్తులని చెబుతారు.
ఈ సిద్ధుల ప్రదర్శన మనకు రామాయణ, భాగవతాదుల్లో ప్రముఖంగా కనిపిస్తుంది.
ఒక్క సిద్ధి సరైన గురువు వద్ద పొండానికే 40 సంవత్సరాలు పడుతుందని చెబుతారు.
దీనికి సంబందించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ఆది శంకరులకు ఒక పర్యాయం ఒక సిద్ధుడు తారసపడ్డాడు. తనకు ఉన్న ఆకాశ గమన విద్యను ఆయన ముందు ప్రదర్శించాడు. అది సాధించేందుకు ఎంత కాలం పట్టిందని ఆయన అడిగారు. 40 ఏళ్లు పట్టిందని చెప్పాడు.
ఆ విద్య పొందేందుకు నీ జీవితంలో 40 ఏళ్లు ఖర్చు పెట్టావు. ఏ సత్పు రుషుడిని దూషించినా కాకివై పుట్టి పుట్టుకతోనే ఆకాశగమనం సాధించేవాడివి కదా అని ఆయన ఎద్దేవా చేసినట్టు చెబుతారు😁😁😁
సిద్ధులు సాధించడం అనవసరమని, అందుకు జీవితం లో అంత కాలం వృధా చేయకుండా జగన్మాత అనుగ్రహం వల్ల ఉత్తమ గతులు పొందితే బాగుండుననేది ఆయన ఉద్దేశం.
కాని జగన్మాతను ఆరాధిస్తే మనకు ఏవి అవసరమో, ఏ శక్తులు వశంచేస్తే మనకు ఉపయోగము ఉంటుందో, మన దీక్షా సామర్థ్యం ఎంత ఉందో ఆ మేరకు ఆతల్లి అనుగ్రహిస్తుంది. ఏ కోర్కె అయినా ధర్మబద్ధంగా ఉండాలి.
అటు వంటి సర్వలోకవశంకరి అయిన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వలోకవశంకర్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*700వ నామ మంత్రము* 6.6.2022
*ఓం సచ్చిదానంద రూపిణ్యై నమః*
సత్యము, జ్ఞానము, ఆనందము అను మూడు లక్షణముల కలయికతో *సచ్చిదానందస్వరూపిణి* గా విరాజిల్లు పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సచ్చిదానంద రూపిణీ* యను ఎనిమిది అక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం సచ్చిదానంద రూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాతను ఉపాసించు సాధకుడు సత్యము, నిత్యమైన ఆ పరబ్రహ్మముయొక్క వైనము తెలిసి ఆత్మానందానుభూతితో అన్యమేమీ అవసరములేని స్థితికి చేరగలుగును.
జగన్మాత యొక్క స్వరూపం ఆపాదమస్తకం ఎన్నో నామ మంత్రములలో వర్ణింపబడినది.
*ఇక్కడ కొన్ని నామ మంత్రములు మనం ఒకసారి జ్ఞాపకంచేసుకుందాము.
6వ నామ మంత్రములో *ఉద్యద్భానుసహస్రాభా* ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతిని బోలునది జగన్మాత.
7వ నామ మంత్రము *చతుర్బాహుసమన్వితా* నాలుగు బాహువులు కలిగియున్న జగన్మాత.
14వ నామమంత్రము *కురువిందమణి శ్రేణీ కనత్కోటీరమండితా* జగన్మాత కిరీటము పద్మరాగమణులతో ప్రకాశించుచున్నది.
ఇలా అమ్మవారి లలాటము, ముఖబింబము, ముఖ కాంతిప్రవాహంలో చలించే మీనములతో బోలిన నయనములు, సంపంగివంటి నాసాదండము, శుక్రనక్షత్రకాంతిని బోలిన ముక్కెర, సూర్యచంద్రులనదగిన అమ్మవారి చెవికమ్మలు, పద్మరాగశిలలను, అద్దాన్ని తిరస్కరించే కపోలము, కచ్ఛపీవీణా మాధుర్యాన్ని మరిపించే మధురాతి మధురమైన పలుకులు....ఇలా మణులతో కూడి, మంజులమైన సవ్వడులు వినిపించే కాలియందెలు గల పాద పద్మములవరకూ నామ మంత్రములు గలవని మనకు తెలుసు
అన్నిటికీ మించి జగన్మాత *మూలమంత్రాత్మిక* అనగా పంచదశీ మంత్రము *(క, ఏ, ఈ, ల, హ్రీం, హ, స, క, హ, ల, హ్రీం, స, క, ల, హ్రీం)* లోని మొదటి ఐదు అక్షరములు - *క, ఏ, ఈ, ల, హ్రీం* (వాగ్భవకూటము) ముఖపద్మముగను, మధ్యనున్న ఆరు అక్షరములు - *హ, స, క, హ, ల, హ్రీం* (కామరాజకూటము) కంఠము క్రిందనుండి కటివరకూ గల ప్రదేశముగను, చివరి నాలుగక్షరములు *స, క, ల, హ్రీం* (శక్తికూటము) కటి దిగువ నుండి పాదముల వరకు గల ప్రదేశమును చెప్పడం జరిగినది. *మూలకూటత్రయకళేబరా* అనగా వాగ్భవ, కామరాజ, శక్తికూటములే జగన్మాత శరీరము.
కాని *(సచ్చిదానంద రూపిణీ)* అనే ఈ నామ మంత్రానికి ఇతర మంత్రములవలె కాదు. ఆ తల్లి సచ్చిదానందములు (సత్, చిత్, ఆనందము) స్వరూపములు గలది. ఆ స్వరూపము సాధకుడు సాధనలోనే తెలియగలడు (అనుభవైకవేద్యము) గాని, ఇతర మంత్రములతో చెప్పబడలేదు. ఈ స్వరూపమును ఊహించుతూ జగన్మాతను ఉపాసిస్తే లభించేది పరమసుఖమే అంటే సచ్చిదానందమే. బ్రహ్మము సత్యము. జగన్మాత *పరబ్రహ్మస్వరూపిణి*. ఆ పరబ్రహ్మము సత్యము కనుక జగన్మాత *సత్యస్వరూపిణి*. ఆ తల్లి *చిదగ్నికుండసంభూత* అనగా శుద్ధచైతన్యం నుండి ఉద్భవించింది గనుక *జ్ఞానస్వరూపిణి*. ఈ లక్షణముల కలయిక అయిన *సత్, చిత్, ఆనంద* ములే *సచ్చిదానందరూపిణి* గా జగన్మాత నామ ప్రసిద్ధి చెందినది.
అటువంటి తల్లికి నమస్కరించునపుడు *ఓం సచ్చిదానందరూపిణ్యై నమః* యని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*701వ నామ మంత్రము* 7.6.2022
*ఓం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః*
దేశ+కాల+అపరిచ్ఛిన్నా అనగా *దేశకాలాపరిచ్ఛిన్నా* అని చదువవలెను. అంతేగాని *దేశకాలపరిచ్ఛిన్నా* అనగా ల అనే అక్షరం *లా* గా కాకుండా *ల* గా చదువకూడదు. అర్థం మారుతుంది.
సకల ప్రపంచములకు తానే ముందుగా, సకల కాలములకు పూర్వముగాను, వస్తుభేదములు లేక, సకలభావములకు అభావముగా, సమస్త చరాచర జగత్తులు, కాలములు తన వల్లనే ఏర్పడి, అన్నిటికీ తానే ఆదిగా, ఆదిపరాశక్తిగా విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *దేశకాలాపరిచ్ఛిన్నా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులు ఆ తల్లి కరుణచే సర్వాభీష్టసిద్ధికలిగి బ్రహ్మానందభరితులై తరించుదురు.
జగన్మాత ఎక్కడనుంచి వచ్చినది, ఎప్పుడు వచ్చినది, ఎప్పటివరకూ ఉంటుంది అని గానీ, ఎన్నాళ్ళు ఉంటుంది అని గానీ వివరించే కాల వ్యవధులు, ఎల్లలులేవు. ఆ తల్లి *అనాదినిధనా* పుట్టుక, పోవుట ఏమియు లేనిది. సకల ప్రపంచములకూ తానే ముందు. కాలములన్నిటికీ తానే పూర్వము. వస్తుభేదములేదు. *భావాభావ వివర్జితా* భావములుచేత, అభావములచేత విడచిపెట్టబడి సకల భావములకు అభావమైనది. బ్రహ్మాదులకందరికీ కాలపరిమాణము గలదు. మానవుని ఆయువు నూరు వరకూ, బ్రహ్మఆయువు ఒక కల్పము. పరబ్రహ్మ అయిన జగన్మాతకు ఆయువు, ఆ ఆయువు ఇంత అనిఏమీ లేదు. ఎందుకంటే ఆది, అంతము లేనిది. జగన్మాతకు ఆయుఃపరిమాణము అనగా *కాలాపరిచ్ఛేదము* (కాలపరిమాణము) లేదు, ఇక్కడలేదు అక్కడ ఉంది అనే దేశాపరిచ్ఛేదము లేదు. ఆవిధంగా జగన్మాత *దేశకాలాపరిచ్ఛిన్నా* అను నామప్రసిద్ధమైనది. ఆ జగన్మాత అనిత్యమైన శరీరాలమధ్య శరీరం లేనిదిగా, అశాశ్వతమైన వాటి మధ్య శాశ్వతమైనదిగా ఉంటుంది. ఆత్మ అనేది నిత్యము. సత్యము. సర్వవ్యాపకము.
జగన్మాత పంచభూతాలలో భూమిలో ఉందని గాని, ఆకాశములో ఉందనిగాని, లేక వాయువు ఉందని గాని,ఇంకా నిప్పు, నీరు ఎక్కడ ఉన్నది? అంటే సర్వత్రా ఉన్నది. అటువంటి *దేశాపరిచ్ఛిన్నము లేనిది*. ఇంతకు ముందు లేదు. ఇప్పుడు ఉంటుంది. తరువాత ఏమో! అనేది కూడా లేదు. నిత్యమైనది.
సృష్టికి పూర్వమే తానున్నది.బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను తానే నియమించింది. మహాప్రళయం తరువాత కూడా ఉంటుంది. అప్ఫుడు సృష్టి అన్నది లేక పోతే త్రిమూర్తులతో పనిఏముంది. వారు కూడా ఉండరు. సమస్త సృష్టిని ప్రళయకాలంలో తనలో లయంచేసుకున్న జగన్మాత ఉంటుంది. అందుకే జగన్మాత ఎప్పటి నుండి ఎప్పటి వరకూ అనే కాలాపరచ్ఛేదం లేనిది. అనగా సృష్టికిముందు, తరువాత కూడా ఉంటుంది గనుక *కాలాపరిచ్ఛేదం లేదు*. కాబట్టి జగన్మాత *దేశకాలాపరిచ్ఛిన్నా* అని నామ ప్రసిద్ధమైనది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*702వ నామ మంత్రము* 8.6.2022
*ఓం సర్వగాయై నమః*
సర్వజీవులలోను, సమస్త వస్తుజాలమునందును, సకల ప్రదేశములలోను, ఇందు, అందు అనక ఎందైననూ సర్వాంతర్యామియై యుండు అఖిలాండేశ్వరియైన ఆ జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సర్వగా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రముసు *ఓం సర్వగాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిప్రపత్తులతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకునకు ఆ జగన్మాత కరుణతో అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదతోబాటు, భౌతికపరమైన సుఖసంతోషములు కూడా ప్రసాదించును. సాధకుడు ఆధ్యాత్మికపరమైన జీవనము గడిపి తరించును.
ఇంతకు ముందు (701వ నామమంత్రములో) *దేశకాలాపరిచ్ఛిన్నా* అని చెప్పాము. జగన్మాత అందు, అందు అనక ఎందైనా ఉంటుందనియు (దేశాపరిచ్ఛిన్నము లేనిదనియు) , అలాగే ఇప్ఫుడు, తరువాత రాబోయే కాలంలో, ఇంతకుముందు, ఎప్పుడో? అని కాకుండా, సృష్టికి ముందు, సృష్టి తరువాత, లయం తరువాత కూడా ఉంటుంది అంటూ కాలాపరిచ్ఛేదం లేనిదిగా సర్వదా ఉండునని అన్నాము. అనగా *దేశకాలాపరిచ్ఛిన్నా* - ప్రదేశపరంగాను, కాలపరంగాను విభజించుట గాని కొలుచుటగాని వీలు లేనిది. అందుచే జగన్మాత *సర్వగా* *(సర్వ* అనగా సర్వదేశ కాలములందు, *గా*) అంతర్యామిగా ఉంటుంది.
దేవి తానే సృష్టిరూపిణియై శ్వేతపర్వతముపై బ్రహ్మగూర్చి తపస్సు చేసెను. బ్రహ్మపత్యక్షమై కావలసిన వరము కోరుకొనుము అని చెప్పెను. అప్పుడు సృష్టిస్వరూపిణి అయిన దేవి బ్రహ్మతో 'నేను ఒకచోటు అని కాకుండా అన్నిచోట్లా, సర్వాంతర్యామిగా ఉందును.అట్లు వరమీయము' అని అనగా బ్రహ్మ అట్లే వరమిచ్చెను.
శ్రీమద్భాగవతంలో ప్రహ్లాదుడు ఆ సర్వాంతర్యామి అయిన పరమాత్మ ఎందైనా గలడని ఈ క్రింది పద్యముద్వారా చెప్పబడెను.
*బమ్మెర పోతనామాత్యులవారి పద్యుము*
*కంద పద్యము*
ఇందు గలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే."
భావం
ఓ హిరణ్యకశిప మహారాజా! శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు; ఇక్కడ ఉండడు; అని చెప్పడానికి లేదు. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల అన్నటి యందు ఉండే వాడు. ఈవిషయంలో ఏమాత్రం సందేహం అన్నది లేదు; అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడాలే కాని అక్కడే ఉంటాడయ్యా. రాక్షసరాజా!
ఈ సంఘటన కేవలం భగవానునికేకాదు, సర్వాంతర్యామియైన జగన్మాతకు కూడా అన్వయింపబడుతుంది. ఎందుకంటే సృష్టిని నిర్వహించడాని శ్రీమాత త్రిమూర్తులను నియమించింది. వారు సర్వాంతర్యాములయి ఉన్నారు. మరి *శ్రీమహారాజ్ఞి* అయిన అఖిలాండేశ్వరి కూడా సర్వాంతర్యామియే గదా! అందుచే జగన్మాత *సర్వగా* అని నామప్రసిద్ధమైసది. బ్రహ్మదేవుడు శ్రీమాతకు వరమిచ్చునపుడు ఆమెను *సర్వరూప* అని సంబోధించెను. అంటే సృష్టిలో సర్వజీవులయందు, సర్వవస్తు జాలములయందు, ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో, ఎప్పుడు, ఎలా చూడాలంటే అలా దర్శనమిస్తుంది. జగన్మాత *మహాచతుష్షష్టికోటి యోగినీ గణసేవితా* (లలితా సహస్రనామస్తొత్రమందు 58వ శ్లోకము, 2వ పాదము మరియు శ్రీలలితా సహస్రనామావళి యందు 237వ నామ మంత్రము) అరవైనాలుగు కోట్ల యోగినులచే లేదా శక్తి గణములచే సేవింపబడుచున్నది. అనగా జగన్మాత అన్నికోట్లరూపాలలో మనచే ఆరాధింపబడుచున్నది. శక్తిపీఠాలు, గ్రామదేవతలు ఇలా ఎన్నో రూపాలలో, సృష్టిలోని సర్వజీవులచే సేవింపబడుతోంది. కాబట్టీ జగన్మాత *సర్వగా* అని నామ ప్రసిద్ధమైనది. జగన్మాత అన్నిటితో అభేదమును పొందియుండుట, అన్ని శరీరములందు సగుణ స్వరూపముతో ఉండుట, అంతర్యామిరూపముగా ఉండుట యగుటచే *సర్వగా* యను నామముతో ప్రసిద్ధి నందినది. దేవీ పురాణములో ఇలా చెప్పబడినది - "వేదములు, యజ్ఞములు, స్వర్గము శ్రీమాతయే అయి ఉన్న అభేదరూపము. స్థావరజంగమాత్మకమయిన జగత్తు అంతటను దేవియే వ్యాపించియున్నది. ఇది అంతర్యామిత్వము అన్నపాన స్వరూపురాలుగా స్తుతింపబడి, పూజింపబడుచున్నదని చెప్పుట. వృక్షము, భూమి, వాయువు, ఆకాశము, నీరు, అగ్ని వీటిలో నామరూపములతో వ్యాపించియున్నది శ్రీమాత. వీటిలో స్థులరూపమున శాస్త్రప్రకారము పూజింపదగినది" అందుచే శ్రీమాత *సర్వగా* యని స్తుతింప బడుచున్నది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సర్వగాయై నమః* యని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
704వ నామ మంత్రము 10.6.2022
ఓం సరస్వత్యై నమః
జ్ఞానాధిష్ఠాన దేవతా స్వరూపిణిగా, జ్ఞానముద్రాస్వరూపిణిగా, ప్రాణుల జిహ్వలయందు వాగ్రూపిణిగా, సరస్వతి యను నదీస్వరూపిణిగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి సరస్వతీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం సరస్వత్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణచే చక్కని వాక్పటిమ, పలువురిలో మన్ననలందగల సంభాషణా చాతుర్యత, (విద్యార్థులయినచో) విద్యాబుద్ధులు, వేదాధ్యయనులకు వాక్శుద్ధి సంప్రాప్తించును ఆ జగన్మాత ఆరాధనలో.
సరస్వతి యనగా జ్ఞానిభిమానినీ దేవత. జ్ఞానముద్రస్వరూపురాలు గూడా. అనగా బ్రహ్మజ్ఞాన స్వరూపురాలు. అజ్ఞానముచే జ్ఞానమావరింపబడినది అనగా ప్రాణులు మోహమును పొందుచున్నారు. ఈ విషయం సర్వమోహినీ (703వ నామములో చెప్పబడినది. జ్ఞానమంటే అద్వైతము (జీవుడు, దేవుడు ఒకటే), అజ్ఞానము అద్వైతము అనగా జీవుడు వేరు, దేవుడు వేరు. అలా అన్నప్ఫుడు అజ్ఞాని మోహావేశభరితుడై భౌతికసుఖలోలత్వమునకు ఆశపడును.
వ్యాఘ్రపాదుడు అను మహాత్ముని కుమారులు ఉపమన్యు మరియు దౌమ్యుడు. ఈ దౌమ్యుడు కన్యకలకు నామకరణము చేయునపుడు రెండు సంవత్సరముల కన్యకకు సరస్వతి అని పేరు పెట్టెను. అందుచే రెండుసంవత్సరముల కన్యక భరద్వాజస్మృతిలో ప్రాణులందరి జిహ్వలందు వాక్కులకు స్థానమై ఎల్లప్పుడు ఉంటుంది గనుక, సరస్వతి వాగ్రూపురాలు అయి ఉండుటచేతను,రెండు సంవత్సరముల కన్యకకు సరస్వతి అని పేరు పెట్టిరి. అందుచేతనే రెండు సంవత్సరముల కన్యకను సరస్వతిగా నవరాత్రులలో ఆరాధించు సాంప్రదాయము గలదు.
అందరి జ్ఞానదృష్టులు ఈ రెండు వత్సరముల కన్యకపై యుండును గనుక ఆ రెండువత్సరముల బాలికకు సరస్వతి అని నామమును నిర్ణయించిరి. జగన్మాత సరస్వతీ యని ఈ కారణముచే చెప్పదగును. ఈ సరస్వతి సర్వులకు జ్ఞానదృష్టులను స్రవింపజేయుటచే గూడ, జగన్మాత సరస్వతీ యను నామముచే ప్రసిద్ధురాలు. జగన్మాత జ్ఞానప్రవాహ.
పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది.
సృష్టిచేయాలని బ్రహ్మ తపస్సు చేసినప్పుడు అతని శరీరం నుంచి పదిమంది కుమారులు, పదిమంది కుమార్తెలు ఉద్భవించారు. కుమార్తెలలో చివరిది శతరూప. ఆమెయే సరస్వతి.
సరస్వతీ నది హిందూ పురాణములలో చెప్పబడిన ఓ పురాతనమైన నది.
ఆ తరువాత మహాభారతములో ఈ నది ఎండిపోయినట్లు చెప్పబడింది. కాని సరస్వతీ నది అంతర్వాహినియై ఉంటుందని, ప్రయాగవద్ద గంగా, యమునలలో అంతర్వాహినిగా కలిసి, త్రివేణీ సంగమము ఏర్పడినదని పురాణగాథ.
మూలాధారం నుండి సహస్రారం దిశగా కుండలినీ శక్తి సుషుమ్నా మార్గంలో పయనిస్తుంది. సుషుమ్నాకు ఇరువైఫుల ఉండే ఇడ, పింగళ నాడులు రెండూ గంగ, యమునలు అయితే, సుషుమ్నా నాడి సరస్వతీ రూపము. ఆవిధంగా జగన్మాత సరస్వతీ స్వరూపురాలు.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సరస్వత్యై నమః యని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
705వ నామ మంత్రము 11.6.2022
ఓం శాస్త్రమయ్యై నమః
శాస్త్రములే తన శరీరావయవములుగా, ఉచ్ఛ్వాస నిశ్శ్వాసములే వేదాలుగా ఒప్పారు జగన్మాతకు నమస్కారము..
శ్రీలలితా సహస్ర నామావళి యందలి శాస్త్రమయీ అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం శాస్త్రమయ్యై నమః అని ఉచ్చరించుచూ, పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు భక్తులకు జగన్మాత అనంతమైన జ్ఞానసంపదను ప్రసాదించి, సుఖసంతోషములతోను మరియు పరమేశ్వరీ నామ స్మరణలో జీవించి తరించును.
జగన్మాత మాతృకా వర్ణరూపిణి. శృతులు, స్మృతులు, శాస్త్రాలు అన్ని వర్ణమయమే. అందుచే చతుర్వేదాలు, 1) శిక్ష, 2) వ్యాకరణము, 3) ఛందస్సు, 4) నిరుక్తము, 5) జ్యోతిషము, 6) కల్పము, 7) మీమాంస, 8) న్యాయము, 9) పురాణము, 10) ధర్మశాస్త్రము - ఇవన్నీ సరస్వతీ రూపమయితే, ఆ సరస్వతియే జగన్మాత.ఈ శాస్త్రాలన్నిటిలో పరబ్రహ్మతత్త్వమునే వివరించటం జరుగుతుంది. అందుచేత సరస్వతీ స్వరూపిణి అయిన జగన్మాత శాస్త్రమయి అనడం జరుగుతోంది.
బ్రహ్మపురాణంలో పరమేశ్వరి శరీర అవయవాలే శాస్త్రాలు. ఆ తల్లి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలే వేదాలు.
పరమేశ్వరినుంచి ఆవిర్భవించిన శాస్త్రాలు ఇవియే.
1)అభిమానంతో - మహామంత్రాలు, 2) మధురాలాపనతో - కావ్యాలు, నాటకాలు, అలంకారాలు. 3) జిహ్వ నుంచి సరస్వతి, 4) చుబుకముసుండి - వేదాంగములు, 5) కంఠం ఊర్థ్వరేఖ నుంచి - మీమాంస, న్యాయశాస్త్రము, 6) కంఠం మధ్యరేఖ నుండి - ఆయుర్వేదము, 7) కంఠం మొదటి రేఖనుంచి - చతుష్షష్టి తంత్రాలు, 8) బాహువుల నుంచి -కామశాస్త్రము. ఇవన్నీ జగన్మాతనుంఢి ఉద్భవించిన శాస్త్రాలు. అందు చేతనే జగన్మాత శాస్త్రమయీ అను నామముతో స్తుతింపబడుచున్నది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం శాస్త్రమయ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి