12, జనవరి 2020, ఆదివారం

తండ్రి నేర్పిన పాఠం- కధ 11/2020



19-11-2020 ప్రాంజలి ప్రభ .. ఓంమశ్రీ రామ్ . శ్రీ మాత్రేనమ: 
తండ్రి నేర్పిన పాఠం- నేటి  కధ

సీతాపతి నూనె వ్యాపారంలో లక్షలు గడించి ఆస్తులు కూడబెట్టాడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు కేశవుడు. వాడికి చదువు ఒంటబట్టలేదు. కొడుకుని ప్రయోజకుడిని చేయాలని సీతాపతి ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యపడలేదు.

కేశవుడు ఇంటి పట్టున ఉండేవాడు కాదు. నలుగురు స్నేహితులను వెంటేసుకుని వూరంతా బలాదూరుగా తిరిగి వచ్చేవాడు. చదువు ఎలాగూ అబ్బలేదు. కనీసం వాడిని ఏదైనా పనిలో పెట్టాలనుకున్నాడు సీతాపతి. పని నేర్చుకోవటానికి ఎవరి దగ్గరికి పంపినా కేశవుడు రెండో రోజు అక్కడికి వెళ్లేవాడు కాదు. తనకు ఆ పని నచ్చలేదని తెగేసి చెప్పేవాడు. కొడుకుని ఎలా దారిలో పెట్టాలో సీతాపతికి పాలుపోలేదు.

ఒకనాడు కేశవుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. తాను వ్యాపారం చేస్తానని, కొంత డబ్బు ఇవ్వమని సీతాపతిని అడిగాడు.

సీతాపతి చాలా సంతోషించాడు ‘ఇంతకాలానికి తన కొడుకులో మంచి మార్పు వచ్చింది. వ్యాపారం చేసి బాగుపడాలని అనుకుంటున్నాడు’ అని పొంగిపోయాడు.
‘కేశవా! ఏమి వ్యాపారం చేయాలనుకుంటున్నావు?’ అని కొడుకుని అడిగాడు సీతాపతి.
‘మన పెట్టుబడికి రెట్టింపు లాభం వచ్చే వ్యాపారం. రోజూ చేతిలో డబ్బు ఆడే వ్యాపారం. నష్టమే రాని వ్యాపారం. చెప్పుల వ్యాపారం’ అన్నాడు కేశవుడు.
‘మంచి ఆలోచన. ఎంత డబ్బు కావాలి?’ అడిగాడు సీతాపతి.
‘అయిదు లక్షలు’ అన్నాడు కేశవుడు.

‘నీవు వ్యాపారం చేసి బాగుపడతానంటే నాకూ ఆనందంగా ఉంది. తప్పకుండా నీవు అడిగిన డబ్బు ఇస్తాను’ అన్నాడు సీతాపతి.
కేశవుడి కళ్లు ఆనందంతో మెరిశాయి. తండ్రి ఇంత తేలిగ్గా ఒప్పుకొంటాడని అతను అనుకోలేదు.

‘కేశవా! లోపలి గదిలో నా తోలు సంచీ ఉంది. వెళ్లి తీసుకురా. దానిలో డబ్బు ఉంది ఇస్తాను’ అన్నాడు సీతాపతి.
చెప్పిందే తడవుగా లోపలి గదిలోకి పరుగు తీశాడు కేశవుడు. చిటికెలో తోలు సంచీ తెచ్చి తండ్రికి ఇచ్చాడు.

సీతాపతి తోలు సంచీ తెరిచి చూశాడు. ‘అయ్యో! డబ్బు దీనిలో పెట్టలేదనుకుంటాను. దీని పక్కనే నీలం పెట్టె ఉంటుంది. అది పట్టుకురా. దానిలో డబ్బు ఉంది’ అన్నాడు సీతాపతి. కేశవుడు గబగబా వెళ్లి నీలం పెట్టె తెచ్చి తండ్రికి ఇచ్చాడు.
సీతాపతి నీలం పెట్టె తెరిచాడు. దానిలోనూ డబ్బులేదు.

‘డబ్బు ఎక్కడ పెట్టాను?’ అని ఒకసారి బుర్ర గోక్కున్నాడు సీతాపతి. గుర్తుకు వచ్చినట్లు అతడి కళ్లు మెరిశాయి.
‘కేశవా! నా దిండు కింద తాళాలు ఉంటాయి. అవి తీసుకెళ్లి బీరువా తెరిచి, అందులో పసుపు రంగు సంచీ ఉంటుంది తీసుకురా’ అన్నాడు సీతాపతి.
‘డబ్బు అక్కడే ఉందా? సరిగ్గా గుర్తుకు తెచ్చుకో’ అన్నాడు కేశవుడు విసుగ్గా.
‘బాగా గుర్తు... బీరువాలోనే పెట్టాను. తీసుకురా!’ అన్నాడు సీతాపతి నమ్మకంగా.
చిరాగ్గా నడిచి వెళ్లి, దిండు కింద తాళాలు తీసుకుని, బీరువా తెరిచి దానిలోని పసుపు రంగు సంచీ తెచ్చి తండ్రి ఒళ్లొకి విసిరేశాడు కేశవుడు.

సంచీ తెరిచి చూసి సీతాపతి పెదవి విరిచాడు. ‘అరే!! దీనిలోనూ డబ్బులేదే’ అన్నాడు సీతాపతి. కేశవుడికి ఒళ్లుమండింది. తండ్రి వైపు కొరకొరా చూశాడు.
‘అందుకే బాగా గుర్తుకు తెచ్చుకోమన్నాను’ అన్నాడు ముఖం చిట్లిస్తూ కేశవుడు.
‘ఆ... గుర్తుకు వచ్చింది. ఒరే! అసలే దొంగల భయం. అందుకే అటక మీద జాడీలో పెట్టాను. వెళ్లి పట్టుకురా!’ అన్నాడు సీతాపతి.

తండ్రి మతిమరుపుని మనసులోనే తిట్టుకుంటూ అటకకి నిచ్చెన వేసి, పైకెక్కి జాడీని కిందికి దించాడు. దానిని తండ్రి దగ్గరికి మోసుకొచ్చాడు. మూత తీశాడు. జాడీ ఖాళీగా ఉంది. కేశవుడికి పట్టరాని కోపం వచ్చింది. జాడీని బలంగా నేలకేసి కొట్టాడు. జాడీ ముక్కలయ్యింది.

‘చెప్పేది సరిగ్గా చెప్పాలి. పదిసార్లు తిప్పటం కాదు. నాకు డబ్బు ఇవ్వాలనే ఉద్దేశం నీకు నిజంగా ఉందా?’ ఉక్రోషంతో అరిచి, తండ్రి మీదికి విరుచుకు పడ్డాడు కేశవుడు.
సీతాపతి చిరునవ్వు నవ్వాడు. ‘కేశవా! డబ్బు కోసం రెండు మూడు చోట్ల వెతకమంటేనే విసుగెత్తి జాడీని పగలగొట్టావు. నా మీద విరుచుకు పడ్డావు. ఇక నువ్వు చెప్పుల వ్యాపారం ఏం చేయగలవు? చెప్పులు కొనడానికి వచ్చిన వారికి ఎన్నో రకాల చెప్పులు చూపించాలి. వారు అడిగినవి ఓపికగా పైన అరల నుంచి తీసి, వెంటవెంటనే తెచ్చి ఇవ్వాలి. అవి నచ్చలేదంటే మరి కొన్ని చూపించాలి. ఇలా విసుక్కుని వాటిని విసిరి కొడితే ఒక్క రోజు కూడా వ్యాపారం చేయలేవు. అందువల్ల చెప్పుల వ్యాపారానికి నువ్వు పనికిరావు. ఏ పని చేయాలన్నా ఓర్పు అవసరం. విసుగు, అసహనం ఉండకూడదు. అప్పుడే వ్యాపారంలో రాణిస్తావు’ అని సీతాపతి కొడుకుని మందలించాడు.

తండ్రి మాటలతో కేశవుడికి కనువిప్పు కలిగింది. సీతాపతి కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు. నీవు చెప్పినట్లు నడుచుకుంటా’నని తండ్రిని బతిమాలుకున్నాడు. కొడుకులో వచ్చిన నిజమైన మార్పుకి సీతాపతి సంతోషించాడు.

--((***))--

1 కామెంట్‌: