శ్రీ రుద్ర నమకమ్ - ప్రధమ అనువాకము - 9. వ మంత్రము
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక
నమో అస్తు నీలగ్రావాయ సహస్రోక్షాయ మీఢుషే
అథో యే అస్య సత్వానో హం తేభ్యో కరం నమః
ఇంద్రమూర్తి ధారణచే వేయికన్నులవాడైన శివునకు నమస్కార మగుగాక ! పర్జన్య రూపధారియై సృష్టికర్తయై సుఖమొసగు శివునకు నమస్కారము. అంతేకాదు ఏవిఈ రుద్రుని యొక్క భృత్యరూపము లైన ప్రాణులు కలవో వానికి నేను నమస్కారము చేయుచున్నాను.
సృష్టి కర్త అయిన పార్వతీ వల్లభా
వేయి కన్ను లున్న రూప దారి
నీల కంఠ ధర్మ ప ర్జన్య రూపిగా
మేము తెల్పు చుంటి వందనమ్ము
--(())--
10. వ మంత్రము
ప్రముజ్ఞ్య ధన్వస స్త్వముభయోరార్న్తి యోర్జ్యామ్
యాశ్చ తే హస్త ఇషవః పరాతా భగవో వప
ఓ భగవంతుడా ! నీవు పూజావంతుడు
మహదైశ్వర్య సంపన్నుడవు.. ఓ రుద్రా ! నీవు నీ
ధనస్సుకు రెండుచివరలకుకట్టినత్రాటిని విడువుము
విప్పివేయువుము. నీ చేతనున్న బాణములను
విడిచి పెట్టుము. మా పై విడువకు తండ్రీ !
--(())--
ఆసురీసంపదకు చెందిన లక్షణాలు కధ
ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవునిలోను కొద్దో గొప్పో - ఈ ఆసురీసంపదకు చెందిన లక్షణాలు ఉంటాయి. ఇవి దైవానికి దూరం చేసే లక్షణాలు. వీటిని తొలగించుకుంటేనే దైవానికి దగ్గరవుతారు. అసలు దైవీసంపదను పొందటం కన్నా ఆసురీ సంపదను దూరం చేసుకోవటమే ముఖ్యం. అందుకే *ఆసురీ సంపదలో ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారు? ఎలాంటి ఆలోచనలు చేస్తారు? అట్టివారు భగవంతునికి దూరమై ఎటువంటి జన్మలను పొందుతారు? వారిగతి ఏమిటి? అనే విషయాలను* గురించే ఈ అధ్యాయంలో చివరివరకూ తెలియజేయటం జరిగింది. కనుక *ఆసురీ సంపద విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి*.
*దంభం, దర్పం, అభిమానం, క్రోధం, పారుష్యం, అజ్ఞానం - అని ఇక్కడ ఆరింటిని ఆసురీ సంపదగా చెప్పినా ఈ ఆసురీసేన చాలా పెద్దదే. దైవీసంపదలో చెప్పిన లక్షణాలకు వ్యతిరేకమైనవన్నీ ఆసురీసంపదయే. ఈ ఆరూ రోగాల వంటివి. ఒక్కరోగం ఉన్నా చాలు పీక్కోలేక చావటానికి . ఇక ఆరూ ఉంటే చెప్పేపనేలేదు*. ఇక వాటిని వివరంగా తెలుసుకుందాం.
ఆసురీసంపద యొక్క లక్షణాలు.
*(1) దంభం*:- దీనినే *డంబాచారం* అంటారు. ఇతరులకు తన గొప్పతనాన్ని చాటటానికి చేసే ప్రయత్నమే దంభం. గొప్పతనం లేకున్నా ఉన్నట్లుగా చాటుకోవాలి.
మ్రింగ మెతుకులేదు - మీసాలకు సంపెంగ నూనె.
పొట్టకు రొట్టె లేకపోయినా జుట్టుకు మల్లెపూలు కావాలి.
పైన పటారం - లోన లొఠారం.
పండితుడు కాకపోయినా పండితుడిలాగా కనిపించాలి.
భక్తుడు కాకపోయినా భక్తుడిలాగా కనిపించాలి.
లోపల అగ్నిపర్వతం బ్రద్దలవుతున్నా పరమ ప్రశాంతంగా ఉన్నట్లు గొప్ప జ్ఞానిలాగా ఫోజ్ ఇవ్వాలి.
అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నా గొప్ప జ్ఞానిలాగా ఫోజ్ ఇవ్వాలి.
వార్డు మెంబరుగా ఓడిపోయినా MLA గా ఫోజ్ ఇవ్వాలి.
చెల్లని రూపాయికి గీతలెక్కువ.
*రాజకీయనాయకులు, సమాజసేవకులు, ధార్మిక ప్రచారకులు, దొంగబాబాలు, పండితులు, పామరులు, సాధువులు, సన్యాసులు - అందరూ కూడా వారివారి అంతస్థులలో ఈ దంభదేవత పూజారులే. కొద్దో గొప్పో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివాడూ ఈ దంభానికి లొంగాల్సిందే*.
*మహాత్ములు, స్వామీజీలు, గురువులు, పీఠాధిపతులు ఫోటోలు దిగేటప్పుడు చూడాలి. ఆ ఊర్ధ్వదృష్టి, ఆ చిన్ముద్రలు, ఆ సమాధి నిష్టాగరిష్టత్వం, జపమాలలు, కమండలాలూ, కృష్ణాజినాలు, యోగదండాలు, పాదుకలు - అన్నింటిని ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ ఉంటారు. సాదాసీదాగా ఉంటే ఏమిటి నష్టం? ఆ! ఎవరు చెప్పుకుంటారు గొప్పగా వారిని? నిజంగా నీలో సరుకుంటే ఎవ్వరూ చెప్పుకోనవసరం లేదు*.
*రామకృష్ణ పరమహంస వేషం ఎలా ఉంటుందో చూడండి. రమణమహర్షి వేషం చూడండి. గాంధీమహాత్ముని వేషం చూడండి. ఆచార్య వినోబాభావే వేషం చూడండి. వారికేం తక్కువైంది?*
నీ దోషాన్ని దాచుకొని పైకి నటించటమే దంభం. ఇలాంటి డాంబికాల వల్ల ధార్మిక విశ్వాసాలు దెబ్బతింటాయి. *కాషాయవస్త్రాలు ధరించి అన్ని లౌకిక విషయాలకోసం, భోగాలకోసం అర్రులు చాస్తూ ఉంటే వీడేం సన్యాసండీ. ఏం వదులుకున్నాడు? ఆశ్రమంలో అన్ని కుటీరాలు సామాన్యంగా ఉంటే వీడిది మాత్రం Special. A/C రూము, Special Meals, Costly Dressలు, ఎక్కడికన్నా రావాలంటే A/C కార్లు, ప్రవచనాలకు పిలిస్తే ముందే ఇంతని మాట్లాడుకోవటం, ముందుగానే సమర్పించుకోవటం - అని సామాన్యులు విమర్శించే అవకాశం ఇస్తారు. ఈ విమర్శలు వారిని మాత్రమే తాకి ఊరుకోవు. వారు చెప్పే శాస్త్రాలపై కూడా దాడి జరుగుతుంది. ఆ! ఏముంది గొప్ప ఆ శాస్త్రాల్లో? మనకు తెలియని శాస్త్రాలా? అంటుంటారు. కనుక డాంబికప్రవర్తన ధార్మికరంగాన్ని కూడా దెబ్బతీస్తుంది*.
ఈ డంబాచారులు కొంతకాలం, లేదా చాలాకాలం తప్పించుకోవచ్చు గాని ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు. నిజం నిలకడమీద తెలుస్తుంది. అప్పుడు నేరానికి తగిన శిక్ష కూడా పడుతుంది.
అనేకమంది దేశాధినేతలను తన చెప్పుచేతుల్లో పెట్టుకొని, ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తాంత్రికవేత్త చంద్రస్వామి ఈ దేశంలోని అనేకమంది రాజకీయనాయకులను, అధికారులను, ఉద్యోగులను, న్యాయమూర్తులను తన మాయాజాలంలో ముంచాడు. చివరకు ఏమైంది? తీహారు జైలులో ఊచలు లెక్కబెట్టాడు. ఏమి డంబాచారం వెలగబెట్టాడు? సొంతవిమానం, సొంత విమానాశ్రయం, తన ప్రయాణ ఖర్చులు 200 కోట్లరూపాయలని ఈ దొంగసన్యాసి CBI వారికి వాంగ్మూలం ఇచ్చాడు. ఇలాంటి వారెందరో పుట్టుకవస్తున్నారు. కల్కిభగవానులు, నిత్యానందులు, రాంపాల్ బాబాలు. పాపం పండితేగాని ఫలితం అందదు. ఇలాంటి వారివల్ల కాషాయ వస్త్రాలకు, దైవకార్యాలకు, వేదాంత శాస్త్రాలకు ఎంతటి హాని కలుగుతున్నదో చెప్పలేం.
పులితోలు కప్పుకొని గాడిద ఒకటి దండగ మేత మేసిందంట. దాని గుట్టు బయటపడే సరికి దాని ప్రాణానికే ముప్పుకలిగింది. డాంబికుల కథ ఇంతే. ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉందిగాని దంభానికి లేదు.
*(2) దర్పం*:- దంభానికి దగ్గర చుట్టం దర్పం. అక్కడ ఏమీలేకపోయినా గొప్పగా నటించటం. ఇక్కడ కించిత్తు ఉంటేచాలు పట్టపగ్గాలు లేకపోవటం. నాలుగు ఇంగ్లీషు ముక్కలు వస్తే చాలు. వాళ్లు మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్య మధ్యన so, but, No, Alright, Yes లాంటి పదాలను ఉపయోగించి ఇంగ్లీషులో పెద్ద పండితుణ్ణని ఫోజ్ ఇస్తారు. ఇక కొందరికి నాలుగు రూపాయలు చేతిలో ఉంటేచాలు చూపులు చుక్కల్లో ఉంటాయి.
ఒక కప్పకు రూపాయి దొరికిందట. ఇక దాని దర్పం చెప్పటానికి వీలులేదు. ఒక ఆబోతు ఆ దారిన వస్తున్నది. దాన్ని చూచి కప్ప అంటున్నది, 'ఇదిగో నా దగ్గర రూపాయి ఉంది. జాగ్రత్తగా వెళ్ళు. నేను తలచుకుంటే నిన్ను ఏమైనా చేస్తాను. నీవే పెద్దగొప్ప అనుకుంటున్నావేమో అన్నదట. తానూ ఆబోతంత కావాలని నీరు త్రాగి ఉబ్బి ఉబ్బి పొట్ట పగిలి చచ్చిందట. ఇదే దర్పం యొక్క మహిమ. కలెక్టరు కానక్కరలేదు. కండక్టరైతే చాలు. ఇకవాడి దర్పం పట్టశక్యం కాదు. తానేదో జాలితలచి ఈ ప్రయాణికులందరిని వారివారి గమ్యస్థానం చేరుస్తున్నానని, తనంతటి త్యాగపురుషుడు మరొకడు లేడని, తను ఆగమంటే బస్సు ఆగాలి, పొమ్మంటే పోవాలి అనీ, తనకు తానే కిరీటం తగిలించుకుంటాడు. అందరినీ తిరస్కరిస్తాడు. తనను తాను ప్రశంశించుకుంటాడు.
*ఆధ్యాత్మికరంగంలో దర్పం సాధకుడికి శతృవు. ఏవో రెండు ఉపన్యాసాలు విని, రెండు గ్రంధాలు చదివి, నాలుగు ముక్కలు నోటబెట్టుకొని ఎక్కడకు వెళ్ళినా ఆ నాలుగు ముక్కలూ వాడేస్తూ గొప్ప ఉపన్యాసకుడుగా ఫోజు ఇస్తాడు. అంతా తనకే తెలుసునని ఏవోవో అసందర్భ ప్రలాపాలు సాగిస్తాడు. అయితే ఎక్కడో ఒకచోట ఎదురుదెబ్బ తగిలితే గాని తత్త్వం బోధపడదు. కనుక దర్పం పనికిరాదు. దైవానికి దూరం చేసిది దర్పం*.
OM
రిప్లయితొలగించండి