పిల్లలు లేని తల్లులు ఉండవచ్చు। కాని తల్లి లేకుండా పిల్లలు ఉండరు। పిల్లలలో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు। పిల్లల పట్ల మంచి తల్లి, చెడ్డ తల్లి అని ఉండదు। పరమేశ్వరికి భక్తులు ఉన్నారు। వారు కీర్తించి ఆ తల్లి సాయుజ్యంపొందుతున్నారు। అలాగే చెడ్డవారైన రాక్షసులు ఉన్నారు। పరమేశ్వరిని దూషిస్తూ, ఆమెచే సంహరింపబడి ఆమెలో లీనమైపోతున్నారు। జయవిజయులు మునిశాపానికి గురి అయారు। ఏడు జన్మలు కీర్తిస్తూ తనవద్దకు తిరిగి రావాలనుకుంటున్నారా? లేక శత్రుత్వంతో మూడుజన్మలలో తనవద్దకు తిరిగి రావాలనుకుంటున్నారా? అని పరమాత్మ జయవిజయులను అడిగితే ఏదైనా పరమేశ్వర సామీప్యమేగనుక మూడుజన్మలలో శత్రుత్వంతో తొందరగా పరమాత్ముని చేరాలనుకున్నారు। అలాగే తల్లి కూడా సుపుత్రులను, కుపుత్రులను కూడా తన బిడ్డలగానే సాకుతుంది। ఇద్దరికీ సమానంగా ప్రేమ పంచుతుంది। అలాగే పరమేశ్వరికూడా! అనంతకోటి జీవరాశులలో విషసర్ఫాలు ఉన్నాయి। క్రూరజంతువులు ఉన్నాయి। గోవువంటి సాధుజంతువులు ఉన్నాయి। జగన్మాతకు అన్ని జీవులు సమానమే। అందరికీ ప్రాణవాయువు, ఆహారము, సూర్యకాంతి, చంద్రుని వెన్నెల, నదులలోని నీరు, పర్వతాలలోని ఓషధులు మొదలైనవి అన్నియు అవసరం మేరకు సంప్రాప్తింప జేస్తుంది। అందుకే ఆ పరమేశ్వరి మాత। అన్ని జీవులకు శుభప్రదము, మంగళప్రదమును అనుగ్రహించు శ్రీమాత। అందుకే ఆ పరమేశ్వరి శ్రీమాతా యని అనబడినది।
అ కార, ఉ కార, మ కార సంయుక్తము ఓం కారము। అది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరం। అలాగే శ కార, ర కార, ఈ కారముల సంయుక్తము శ్రీ కారము। శ అంటే శారద (మహా సరస్వతి), ర అంటే రమ (మహాలక్ష్మి), ఈ ఈశ్వరి (పరమేశ్వరుని భార్య పార్వతి) అనగా శక్తిత్రయము। ఈ శక్తి త్రయమునకు పరమేశ్వరి తల్లి వంటిది। వీరు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిలు। ఈ మువ్వురు ప్రకృతులైతే, సత్త్వరజస్తమోగుణ మూర్తులు త్రిమూర్తులు (బ్రహ్మవిష్ణురుద్రులు) పురుషులు। వారికి వీరికీ మూలం పరమేశ్వరి। గనుకనే మాత అయిన పరమేశ్వరికి శ్రీ ని చేర్చి, ఆ తల్లిని శ్రీమాతా యని అన్నారు।
అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను।
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
2వ నామ మంత్రము
ఓం శ్రీ మహారాజ్ఞ్యై నమః
అఖిలాండేశ్వరి అయిన శ్రీమాత సమస్త లోకాలను పరిపాలించు తల్లికి నమస్కారము।
శ్రీ లలితా సహస్రనామావళియందలి శ్రీ మహారాజ్ఞీ అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రముసు ఓం శ్రీ మహారాజ్ఞ్యై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ శ్రీమాతను ఉపాసించు సాధకులకు శ్రీ మహారాజ్ఞి కరుణతో సమస్త ఈతిబాధలు, గ్రహసంబంధమైన ఇక్కట్లు, అష్టదారిద్ర్యములు తొలగి ఐహికానంద సంబంధమైన సుఖసంతోషములు, ఆధ్యాత్మికానందమును, కార్యదక్షతను ప్రసాదించును।
తొలుత శ్రీమాత అయితే ఈనామంతో తల్లి ఆబ్రహ్మ పిపీలకాది పర్యంతమూ గల అఖిలలోకముల కన్నిటికినీ అధినేతగా సామ్రాజ్ఞిగా పాలనా భారమును వహించిన మహారాజ్ఞి శుభప్రదమైన సామ్రాజ్ఞి। శ్రీమాతగా తనబిడ్డలకు కావలసిన ఆహారమును పంచభూతములద్వారా సమకూర్చి పెంచుతుంది। బ్రహ్మోపేంద్ర మహేంద్రాదులచే సంస్తుతింపజేసుకుంటూ సృష్టి, స్థితి, లయ కార్యములందు తనదైన పరిపాలనా దక్షతనందించు శ్రీమహారాజ్ఞి ఆ శ్రీమాత। గ్రహగతులు తప్పకుండా నవగ్రహములను, ఋతుధర్మములు మారకుండా అష్ట దిక్పాలకులను, ఆజ్ఞాబద్ధతతో నియంత్రించు మహాసామ్రాజ్ఞి ఆ శ్రీమహారాజ్ఞి। ఆ తల్లి చిన్న రాజ్యానికి రాణికాదు। సమస్త అఖిలాండములకే అఖిలాండాశ్వరి ఆ శ్రీమహారాజ్ఞి। తల్లి తన బిడ్డల సౌఖ్యాన్ని కోరితే ఈ జగన్మాత సమస్త విశ్వముల శ్రేయస్సును కాంక్షించే శ్రీమహారాజ్ఞి। ఉపనిషత్తులు పరమాత్మను ప్రతిపాదిస్తూ యస్మాద్భూత నిజాయన్తే, యేన జాతాని జీవన్తి అని చెపుతున్నాయి, సముద్రములు, నదులు, గిరులు తమ ధర్మములు తప్పకుండా ఉండునటులు అమ్మ పరిపాలనాదక్షతతో పాలించుచున్నది। జీవుల శరీరనిర్మాణం, అవయవముల అమరిక ఒక్కసారి ఆలోచించితే శరీరంలో జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనసు తమతమ పనులు నిర్వహించడం ఆ పరమేశ్వరి పరిపాలనా దక్షతదే యగుటచే ఆ తల్లి శ్రీమహారాజ్ఞి అయినది। ఆ పరమేశ్వరి పరిపాలనా దక్షత గురుంచి ఉపనిషత్తులు (తైత్తరీయోపనిషత్తులో) భీషాస్మాద్వాతః పవతే, భీషోదేతి సూర్యః, భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ, మృత్యుర్థావతి పంచమ ఇతి అని కీర్తించాయి। పరబ్రహ్మస్వరూపిణి, శ్రీమహారాజ్ఞి అయిన ఆ పరమేశ్వరి ఆజ్ఞకు లోబడి సూర్యుడు, వాయువు, అగ్ని, వరుణుడు, యముడు, ఇంద్రుడు వారికి నియమించిన కార్యములను హద్దులు దాటకుండా సక్రమంగా నిర్వహిస్తున్నారు।
ఆమె పరిపాలనలో క్రూరమృగములు, విషసర్పములు వనములు దాటి జనావాసంలో ప్రవేశించవీలులేదు। సముద్రము చెలియలికట్ట దాటి బయటకురాదు। మర్రిచెట్టుకు చిన్నకాయలు, గుమ్మడి పాదుకు పెద్దకాయలు ఉండవలసిందే। చీమకు విషము ఉండకూడదు। సాగర జలములు ఉప్పగా ఉన్నా ప్రక్కనే ఉన్న చలమలలోని నీరు అందుకు విరుద్దంగా తీయగా ఉంటుంది। ప్రకృతిమాత సిగలో అందంగా శ్రీమాత తురిమిన పువ్వులు ఎంత సుందరము! ఎన్నిరంగులు! ఎంత సువాసన! ఆ పూలలోని మకరందము ఎంత మధురము! ఆ పూల పొందిక (ఆకారములు) ఎంత అద్భుతం! ఇదంతా తన పాలనలోనున్న ప్రతీ జీవిని ఆహ్లాదపరిచే పరిపాలనా రహస్యం। కోకిల గానంలోని మధురం ఆ తల్లి అనుగ్రహమే। చిలుకపలుకులలోని కులుకు ఆ పరమేశ్వరి సమర్పణయే। ఇదంతా ఆ శ్రీమహారాజ్ఞియొక్క పరిపాలనా రహస్యం। అందుకే ఆ పరమేశ్వరి శ్రీమహారాజ్ఞీ యని అనబడినది।
చిన్న చిన్న రాజ్యాలను పాలించేవారు రాజులు। అలాంటి పలు రాజ్యాలను పాలించునతడు మహారాజు। మహారాజులకు మహారాజు చక్రవర్తి। అలాగే లోకాలను పాలించే ఇంద్రుడు, యముడు, వరుణుడు మొదలైనవారు లోకపాలురు। శ్రీమహావిష్ణువు వైకుంఠాధిపతి। బ్రహ్మ సత్యలోకాధీశుడు, పరమేశ్వరుడు కౌలాసపతి। ఈ రాజులను, మహారాజులను, చక్రవర్తులను, లోకపాలురను, త్రిమూర్తులను పాలించే పరమేశ్వరి మహారాజ్ఞి ఆ పరమేశ్వరి శ్రేష్ఠమైన పాలననందిస్తుంది గనుక, ఈ మహారాజ్ఞికి శ్రీ (శ్రేష్ఠమైన) అనే విశేషణం చెప్పబడింది గనుక ఆ తల్లి శ్రీమహారాజ్ఞి అంటే సకల జగత్తులకు ఉత్తమోత్తమమైన పాలననందిస్తుంది గనుక అమ్మవారు శ్రీమహారాజ్ఞీ యని అనబడినది।
ఆ పరమేశ్వరి మణిద్వీపంలో, శృంగారమంటపము, జ్ఞానమంటపము, ముక్తిమంటపము, ఏకాంతమంటపము అను నాలుగు వేయిస్తంభాల మంటపములున్న చింతామణిగృహంలో శృంగారమంటపంలో చతుష్షష్టికోటి యోగినీ గణములచే సేవింపబడుచుండగా, కోట్లాది మంది దేవతాగణముల మధ్య పంచబ్రహ్మాసనంపై అధిష్టించి దర్పము ఒలకబోస్తూ కొలువుతీరిఉంటుంది ఆ శ్రీమహారాజ్ఞి ముక్తిమంటపంలో కొలువుతీరి భక్తులకు ముక్తిని, జ్ఞానమంటపంలో కొలువుతీరి భక్తులకు బ్రహ్మజ్ఞానమును, ఏకాంత మంటపంలో పరమేశ్వరునితో ఏకాంతవాసమందు సృష్టి, స్థితి, లయకార్యముల గురుంచి, లోకపాలనా పరమైన విషయములగురుంచి సంభాషిస్తూ ఉంటుంది। సృష్టిస్థితిలయతిరోధానాను గ్రహములు, దుష్టశిక్షణ, శిష్టరక్షణ, భక్తపరిపాలన మొదలైనవన్నియు తన పాలనాదక్షతతో నిర్వహిస్తుంది గనుకనే శ్రీలలితాత్రిపురసుందరి శ్రీమహారాజ్ఞీ యని అనబడినది।
శ్రీ మహారాజ్ఞి పరిపాలన నిబంధనలను అతిక్రమించదు। భర్త అయిన పరమేశ్వరుని సన్నిధిలో ఆయన మనోరాజ్ఞి, జగత్పరిపాలనా పరంగా శ్రీమహారాజ్ఞి తానే మహారాజ్ఞిని, అందరూ తన చెప్పు చేతలలో ఉండాలి, ఏంచేసినా చెల్లుతుందనే తత్త్వం కాదు శ్రీమహారాజ్ఞి ది। పరమేశ్వరునికి పత్నిగా, కుమారగణనాథులకు మాతగా, ముల్లోకాలకు శ్రీమహారాజ్ఞి గా ఆ తల్లియొక్క కార్యనిర్వహణా దక్షతచేతనే ఆ తల్ల శ్రీమహారాజ్ఞీ యని అనబడినది।
పరిపాలన చేతకాక, ఎదిటివారిని ఇక్కట్లలో పెడుతూ, ధర్మవిరుద్ధంగా పరిపాలించుతూ, దోపిడీలు, హింసలు, అమాయక ప్రజలను బాధపెట్టుట చేస్తూ అరాచకాలను ప్రోత్సహించే నేటి నేతలు ఒక్కసారి అన్నీ మరచి ఓం శ్రీ మహాసామ్రాజ్ఞ్యై నమః అంటే వారే సర్వసమర్థులైన నేతలౌతారు।
శ్రీ మహారాజ్ఞీ అను మంత్రమునకు అర్థం 1) జగత్తును పోషంచి, పరిపాలించు మహా సామ్రాజ్ఞి, 2) సర్వసామర్థ్యమైన పరిపాలనా దక్షతగల మహా సామ్రాజ్ఞి, 3) తన పరిపాలనలో అంతటా శుభములను చేకూర్చు మహా సామ్రాజ్ఞి, 4) తన సంరక్షణలో సమస్త లోకములకు శుభప్రదమైన మహారాణి అని అనిపించుకోగల శ్రీమాత శ్రీమహారాజ్ఞి అయినది।
అఖిలాండేశ్వరికి నమస్కరించునపుడు ఓం శ్రీ మహారాజ్ఞ్యై నమః అని యనవలెను।
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
3వ నామ మంత్రము
ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః
సింహాసనములలో పరమైన శ్రీమత్సింహాసనమును అధివహించి శ్రీమత్సింహాసనేశ్వరీ అని స్తుతింపబడిన పరమేశ్వరికి నమస్కారము।
శోభాయమానమైన (శ్రీమత్), సింహముఖ మేర్పఱచిన స్వర్ణపీఠమును (సింహాసన), అధిష్ఠించినది (ఈశ్వరీ) అయిన తల్లికి నమస్కారము।
శ్రీలలితా సహస్రనామావళియందలి శ్రీమత్సింహాసనేశ్వరీ అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః అని ఉచ్చరిస్తూ శ్రీమాతను ఉపాసించు ఉపాసకులను
ఆ తల్లి కరుణించి వారిలోగల ప్రతిభా పాటవములను ఇనుమడింపజేసి, ధర్మాత్ములుగాను, కార్య సాధకులుగా వర్తింపజేసి ఆధ్యాత్మికముగాను, లౌకికముగాను పవిత్రమనస్కులగునట్లుగా కరుణించి ఉన్నత స్థానములనలంకరించునటులుగా వరములు ప్రసాదించును।
శ్రీలలితా పరమేశ్వరి తన బాల్యమునందు సింహమును అధిష్ఠించి మహిషాసురుని పైకి యుద్ధమునకు పోయి చంపినప్పటినుండి సింహాసనేశ్వరీ యని అనబడినది। సింహవాహనయై, మహిషుని చంపినందుకు మహిషఘ్నీ అని యనబడినది। మనలోని పాశవికత, హింసాత్మక లక్షణానికి సంకేతం ।సింహం అయితే ఆ లక్షణాన్ని శమింపజేసి, అదే సంహాసనంపై అధిష్ఠించినది గనుక సింహాసనేశ్వరి అయినది శ్రీమాత।
సింహ మారుహ్య కన్యాత్వే నిహతో మహిషోనయా మహిషఘ్నీ తతో దేవీ తథా సింహాసనేశ్వరీ (దేవీ పురాణం )। త్రిశక్తి స్వరూప బోధకములగు మొదటి మూడు నామములలో ఇది మూడవది। లయనీకరణ శక్తి। రుద్రశక్తి। సింహము ఆసనముగను వాహనముగానూ గలది। మహారాజులను, మహా రాణులను, కొలువు కూటములను ఉపవశించు ఆసనము సింహాసనము అనబడును। దీని కోళ్ళపై సింహాకృతులు నిర్మింప బడుటచే సింహాసనము అనబడును। సింహము మృగేంద్ర మనుట ఆసన శ్రేష్ఠతను, క్షాత్రముగలది యగుట ఆధిపత్యదర్పమును సూచించును। దేవతాసనమునకు నాలుగే కాక మధ్య యందును ఒక కోడు ఉండుట విశేషము। జ్ఞానార్ణవమున చెప్పబడినటుల చైతన్య భైరవులందు మూడు జతలుగను, మిగిలిన రెంటితో కలిసి అయిదును కోళ్ళు కలది సింహాసనమగును। సింహాసనములలో పరమైనది గావున శ్రీమత్సింహాసనము అనబడు చున్నది। దానిని అధివహించినది అగుటవలన పరమేశ్వరి శ్రీమత్సింహాసనేశ్వరీ అని స్తుతియింప బడుచున్నది। పరమేశ్వరి యొక్క ఇతర పంచాసనములు కొన్ని ఇచట ఉదాహరింపబడుచున్నవి।
పంచప్రణవాసనము – శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌ: అనునవి పంచప్రణవములు। వీనిపై మంత్రారూపములో వెలయునది।
పంచకళామయాసనము – నివృత్తి, ప్రతిష్ట, విద్యా, శాంతి, శాంత్యతీతలు పంచకళలు। వీని స్థానములకు పైన చిత్కళగా వెలయునది।
పంచదిగాసనము – పూర్వ దక్షిణ, పశ్చిమ, ఉత్తర, మధ్యలు దిక్కులు। ఈ దిక్కులు ఎల్లలుగా గల బ్రహ్మాండమును అధివసించినది।
పంచభూతాసనము – పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనునవి పంచ భూతములు। వీనిని అధివసించి ప్రపంచాకృతిగా వెలయునది।
పంచముఖాసనము – సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములు పరమేశ్వర ముఖములు। ఈదిశలు ముఖములు గల ఆసనమధిరోహించునది।
పంచప్రేతాసనము – బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు పంచప్రేతలు। వీరి కోళ్ళను పర్యంకముగా గల ఆసనమున వసించునది।
సింహము అనగా పంచాననము। ఆసనము వృత్త రూపమగుట పంచాననమున అయిదు వృత్తములచే రూపొందించిన శ్రీ కళా లేక కామకళా లేకా పరాతత్వమను నామాంతరములు గల కళ్యాణ శ్రీకళాయంత్ర మధిష్ఠానముగా గలది।
సింహాసనేశ్వరీ మంత్రోపాసన నిగ్రహానుగ్రహ ఫలదాయకము అని తెలియుచున్నది
ఈ అనంత సృష్టి యందు ప్రాణధారణ చేయునవి అన్నీ జీవ సంజ్ఞతో నొప్పుచున్నవి। ఈ జీవిసృష్టి యంతయు జీవముతో కూడి యున్నంతదనుక మానసికముగానో శారీరకముగానో ఏదియో యొక కర్మ చేయుచుండుట సహజము। జీవము చైతన్య లక్షణము। ఈ అచరిత సహజ కర్మ రెండు తెరగుల నుండును। తెలిసి చేయునది – తెలియక చేయునది। సుఖమను భావము వలన తాత్కాలికానంద దాయకముల నియతి తప్పి ఆచరించి వానివల్ల నగు ఆహార పదార్థముల సంపాదన యందును, వాటిని దంచుట, చెరచుట, విసరుట, తరుగుట, వండుట యందును, నీరు త్రాగుటయందును, త్రోవ నడచుటయందును మనకు తెలియకనే ఎంతో జీవహింస జరుగుచున్నది। మనకు తెలియకున్ననూ హింసయే అవుతుంది। ఈ కర్మల యొక్క కర్తలు వానివలన కలుగు ఫలమునకు వారసులగుట న్యాయ విరుద్ధము కాదు। ఒకడు మితిమీరి భుజించిన మరియొకడు కడుపు నొప్పి అనుభవింపడు। ఈ హింస కారకుల దుష్కృతి నివృత్తికిని, బాధిత జీవుల సద్గతికిని తగు విధానములు భారతీయ విజ్ఞాన ఖనియగు శ్రుతులద్వారా పరమేశ్వరి బోధించియున్నది। ఇవియే పాక యాగములని, హవిర్యాగములని, సోమయాగములని తెలియబడుచున్నవి। వీని విధాన మంతయు వేదవిధుల హృదయగతమై యుండును। ఏ జీవియు ఏ కృత్యమును తన హృదయమునకు తెలియకుండ చేయగల్గుట అసంభవము। హృదయము ఆత్మకు స్థానము। సర్వ జీవుల యందును ఆత్మ యుండును। హృదయమే ధర్మాసనము అనబడు సింహాసనము। ఆత్మయే తదధిష్ఠాత్రియగు పరమేశ్వరి। శాస్త్రానుగుణ్యముగా ఒనరించబడు దుష్కర్మలకు వాని కనువగు ఫలములను ఎవరివి వారికి న్యాయముగా సంప్రాప్తింప చేయు పరమేశ్వరియే శ్రీమత్సింహాసనేశ్వరీ యని స్తుతింప బడుచున్నది।
ఈ మూడు నామముల చేతను పరమేశ్వరి యొక్క త్రిగుణ స్వరూపమును అనగా సృష్టి స్థితి లయయుతము లగు బ్రహ్మ, విషు, రుద్ర (త్రిమూర్తి) రూపముల విశదీకరించి ముందు నామము నుండి శ్రీవ్యాస కృత పురాణాంతర్గత లలితా పరాశక్తి ప్రాదుర్భావము, తిరోధానానుగ్రహాదులు విశదీకరింపబడుచున్నవి।
బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు అను వారిని పంచబ్రహ్మలు అందురు। వీరు అమ్మవారిని అతి సమీపంగా ఉండి సేవించుకోవాలని తలంపుతో, ఆ తల్లికి ఒక సింహాసనము ఏర్పరిచారు। ఆ సింహాసనానికి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు - వీరు నలుగురు నాలుగు కోళ్ళుగాను, ఐదవవాడైన సదాశివుడు పరుపు మాదిరిగాను అయినారు। అటువంటి పంచబ్రహ్మలచే ఏర్పడిన సింహాసనముపై అధిష్ఠించిన పరమేశ్వరి పంచబ్రహ్మాసనస్థితా యని అనబడుటయే గాక, శ్రీమత్సింహాసనేశ్వరీ యని కూడా అనబడినది। ఇదే విషయాన్ని శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరిలో తొంబదిరెండవ శ్లోకంలో ఇలా అన్నారు:-
గతా స్తే మఞ్చత్వం - ద్రుహిణహరిరుద్రేశ్వరభృతః
శివస్స్వచ్ఛచ్ఛాయా - కపటఘటిత ప్రచ్ఛదపటః।
త్వదీయానాం భాసాం - ప్రతిఫలనరాగారుణతయా
శరీరీ శృంగారో - రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్।।92।।
ఓ పరమేశ్వరీ! బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, రుద్రులు నీకు అతిచేరువలోనే ఉండి, నిన్ను సేవించాలనుకొను అభిలాషతో నీ మంచమునకు (సింహాసనమునకు) కోళ్ళుగా అయినారు। శివుడు తెల్లని కాంతి అను మిషతో నీకు పైని కప్పుకొనుటకు దుప్పటియైనాడు। అట్టి సదాశివుడు నీ శరీరముయొక్క ఎర్రని కాంతులు ప్రతిఫలించిన కారణమున తానును ఎఱ్ఱగా మూర్తీభవించిన శృంగార రసము వలె నుండి నీ కనులకు ఆనందమునిచ్చుచున్నాడు। తెల్లని దేహకాంతిగల ఈశ్వరుడు అమ్మ వర్ణం లో కలిసిపోయి వారు ఇద్దరుగా కాక ఒక్కటిగానే అయిపోయి తానుకూడా అమ్మగానే కనబడుచున్నాడు। శివశక్తులు ఒక్కటయారు। అందుకే వశిన్యాదులు లలితా సహస్ర నామావళియందు స్వాధీన వల్లభా అను ఒక నామ మంత్రముతో అమ్మను కీర్తించారు।
శ్రీమత్సింహాసనేశ్వరి అయిన శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః అని అనవలెను।
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐
శ్రీమాత్రేనమః శ్రీలలితా సహస్రనామ భాష్యము
4వ నామ మంత్రము 29।12।2021
ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః
చైతన్యమనెడి ( చిత్ అనెడి) అగ్నికుండము ( అగ్నికుండ ము) నుండి ఉద్భవించిన ( సంభూతా) తల్లికి నమస్కారము।
శ్రీలలితా సహస్రనామావళి యందలి చిదగ్నికుండ సంభూతా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరాశక్తిని ఆరాధించు భక్తులు, తెలివి తక్కువ వారు అయితే చైతన్యవంతులగుదురు। వివిధ రంగములలో నున్న వారు అయితే తమ తమ రంగములలో మరింత నైపుణ్యమును పొందుదురు।
చిత్ అనగా చైతన్యము। చిత్ అనగా జ్ఞానము, జ్ఞానాగ్ని। అటువంటి జ్ఞానాగ్ని యున్న కుండము నండి ఉద్భవించిన పరమేశ్వరి చిదగ్నికుండసంభూతా యని అనబడినది। చిత్తు అనగా కేవలబ్రహ్మము (శుద్ధబ్రహ్మము)। ఇచ్చట అగ్నికున్న విశేషణమే జ్ఞానాగ్ని అదే చిదగ్ని। అగ్నికి తనకు విరుద్ధమైన చీకటిని ఎలాగైతే పోగొట్టునో ఈ చిత్తు (చైతన్యము) అజ్ఞానమును పోగొట్టును।
భగవద్గీతలో కృష్ణభగవానుడు అర్జునునికి చెప్పినది కూడా ఇదియే।
యథైధాంసి సమిద్ధోఽగ్నిః భస్మసాత్కురుతేఽర్జున।
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా (భగవద్గీత 4।37)
ఓ అర్జునా! ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మము చేయునో, అదేవిధంగా జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియ లన్నిటిని భస్మము చేయును।
చిచ్చక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు అను మూడుకోణములు గల చిదగ్నికుండమునుండి పరమేశ్వరి ఉద్భవించినది। అందుచేతనే ఆ తల్లి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిస్వరూపిణి। నిరాకారుడు, నిర్గుణస్వరూపుడు అయిన పరబ్రహ్మస్వరూపిణి ఆ పరమేశ్వరి। అయినప్పటికినీ, భక్తసంరక్షణకోసమే ఆ తల్లిచిదగ్నికుండమునుండి ఉద్భవించిన సగుణ పరబ్రహ్మ స్వరూపిణి।
ఏదైనా పని చేయాలనే సంకల్పము ఇచ్ఛాశక్తి। ఆ పనిని చేయు సాంకేతికత జ్ఞానశక్తి। ఆ పనిని చేయగలుగుటయే క్రియాశక్తి। ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సమిష్టి స్వరూపమే చిదగ్నికుండసంభూత అయిన జగన్మాత।
అగ్నులు మూడు రకాలు దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అని వాటికి పేర్లు। గార్హ్యపత్యాగ్ని అంటే గృహస్థుడు నిత్యం ఇంటిలో ఉంచి సమారాధించే అగ్నిస్వరూపం। దక్షిణాగ్ని అంటే యజ్ఞవేదికకు దక్షిణంగా ప్రతిష్ఠించబడే అగ్ని। ఆహవనీయాగ్ని అంటే హోమాగ్ని। ఈ మూడింటినీ కలిపి త్రేతాగ్నులు అని పిలుస్తారు। ఇక్కడ చిదగ్ని అంటే ఆహవనీయాగ్నిగా తెలుసుకోవాలి। ఇందే హవిస్సులను సమర్పిస్తారు। భండాసురవధా కథానుసారంగా దేవతలు తమతమ శరీరభాగాలనే అమ్మకు ఆహుతులుగా సమర్పించిన హోమాగ్ని గుండమే ఇక్కడ చిదగ్నికుండము అని చెప్పబడింది। ఆ చిదగ్నికుండము నుండి అమ్మవారు ఉద్భవించినది। కోటి సూర్యులకాంతులతో, కోట్లాది చంద్రుల చల్లదనంతో, ఉద్యద్భాను సహస్రాభగా (ఉదయించుచున్న వేయి సూర్యుల ప్రకాశంతో ప్రకాశిస్తున్నట్లుగా) ఆ పరమేశ్వరి తేజరిల్లుచున్నది। గనుకనే ఆ పరమేశ్వరి చిదగ్నికుండ సంభూతా యని అనబడినది।
తెలివిహీనులుగా ఉన్నవారు ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః అని జపిస్తే వారికి చైతన్యం లభించి తీరుతుంది।
శ్రీమాత చిత్ అనే జ్ఞానాగ్నినుండి ప్రభవించినది।
సృష్టికి పూర్వమునందే ప్రకాశరూపముగా ప్రకటమైనది ఆ శ్రీమహారాజ్ఞి
అణువునుండి అనంతమై సర్వత్రా వ్యాపించియున్నది ఆ శ్రీమత్సింహాసనేశ్వరి।
ఆది, అంతము లేనిది ఆ తల్లి చిదగ్ని సంభూత। ఆ తల్లియే త్రివిధశక్తులకు (ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులకు) మూలమై యున్నదని భావించవలెను
చిదగ్నికుండసంభూత యైన శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః అని అనవలెను।
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః శ్రీలలితా సహస్రనామ భాష్యము
5వ నామ మంత్రము
ఓం దేవకార్య సముద్యతాయై నమః
దేవతలయొక్క (దేవ) కార్యములకై (కార్య) ఆవిర్భవించిన (సముద్యతా) పరమేశ్వరికి నమస్కారము।
శ్రీ లలితా సహహ్రనామావళి యందలి దేవకార్య సముద్యతా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం దేవకార్య సముద్యతాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు భండాసుర, మహిషాసుర వంటి భయంకరమైన విఘ్నములు, ఆటంకములు నిరోధింపబడి, తాము తలపెట్టిన సర్వకార్యములు నిర్విఘ్నముగా నెరవేరును, ఆ జగజ్జనని సన్నిధిలో ప్రశాంతముగా సాధన కొనసాగి, బ్రహ్మజ్ఞాన సంపదను లబ్ధిపొంది తరింతురు।
చిదగ్నికుండ సంభూత అయిన శ్రీమాత అమృతమథనమునకు, భండాసురుడు, మహిషాసురుడు మొదలైన రాక్షససంహారమునకు, సృష్టి, స్థితి, లయకార్యముల వంటి దేవకార్యముల నిర్వహణలో ఇంద్రాది దేవతలకు సహాయముచేయ నావిర్భవించినది। అఖిలాండేశ్వరి శ్రీమహారాజ్ఞి గా దుష్టులను శిక్షించి, శిష్టులను కాపాడి సర్వజీవనరక్షణ మొనరించుటలో నారాయణుని సహితం అవతారపురుషునిగా అవతరింపజేసి కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతిః అని నామప్రసిద్ధ అయినది।
యదా యదా హి ధర్మస్య గ్లినిర్భవతి భారత।
అభ్యూత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్
ధర్మము కుంటుపడి, అధర్మము రాజ్యమేలుచున్నప్పుడు ధర్మాన్ని ఉద్ధరించడానికి పరమాత్మ అవతరిస్తాడు అనే గీతోక్తి ప్రకారం చిదగ్నికుండమున అవతరించిన పరాశక్తి ధర్మోద్ధరణ చేసి దేవతలకు సాయపడినది గనుకనే శ్రీమాత దేవకార్య సముద్యతా అని నామ ప్రసిద్ధమయినది।
పరమేశ్వరి రూపం గానీ, భౌతికమైన మరే లక్షణాలు గానీ లేని దైవం। అనగా ఆతల్లి నిర్గుణ। మానవుడి జ్ఞానానికీ, అవగాహనకు అందని దైవం। అటువంటి పరబ్రహ్మ స్వరూపిణియైన శ్రీమాత భండాసుర, మహిషాసుర వధ మొదలగు దేవకార్యములను సముద్ధరించుటకై సగుణ రూపమున ఆవిర్భవించెను। ఒకప్పుడు పరమేశ్వరుని కోపాగ్నికి మన్మథుడు దహింపబడి భస్మమైపోతాడు। గణేశ్వరుడనే ఒక శిల్పి ఈ భస్మమును తీసుకొని విచిత్రమైన ఆకృతి గల ఒక మానవుణ్ణి తయారుచేస్తాడు। ఈ విచిత్రాకార రూపముతో ఉన్న పురుషుడే భండుడను రాక్షసుడు। ఆ భండుడు తన రాక్షస కృత్యములను కొనసాగించుచూ ఇంద్రాది దేవతలతోను, త్రిమూర్తులతోను యుద్ధానికి తలపడుతూఉంటాడు। వానిని జయించుట ఎవరికినీ సాధ్యపడని విషయము। ఈ భండుని బారినుండి తమను కాపాడమని దేవతలంతా ఆ పరమేశ్వరిని వేడుకుంటారు। అందుకొరకై లక్షయోజన విస్తీర్ణమగు యజ్ఞకుండమును నిర్మించి హోమం చేస్తారు। అప్పటికీ వారు అనుకున్నది నెరవేరనందున దేవతలు తమ శరీరములోని మాంసములను ఆహుతులివ్వడానికి సిద్ధమయారు। అప్పుడు ఆ యజ్ఞకుండమునుండి అఖండమైన దివ్యకాంతి పుంజములతోను, అనంతకోటి సూర్యమండల కాంతులతోను అనంతమైన చంద్రమండల శీతలములతోను ఒక శ్రీచక్రముద్భవించి అందులో దివ్యమైన, సుందరమైన ఆ పరమేశ్వరి వేయిమంది ఉదయించు సూర్యుల కాంతితో ఆవిర్భవించినది। ఆ విధముగా ఆవిర్భవించిన పరమేశ్వరి రాక్షస సంహారము చేసి దేవతలను ఉద్ధరించినది గనుకనే ఆ పరమేశ్వరి దేవకార్యాసముద్యతా యని అనబడినది।
మానవుడు అజ్ఞానంతోనూ, దేహాభిమానముతోను భౌతికవాదము పెంచుకొని ఆత్మజ్ఞానమును కోల్పోతున్నాడు। అవిద్యా, అజ్ఞానము ద్వారా ఉద్భవించినవే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనబడే అరిషడ్వర్గములు। వీటినే అసురులని అంటారు। ఆత్మజ్ఞానానికి దోహదపడే జ్ఞానసంపద దేవతలైతే అవిద్యా ప్రవృత్తులు అనునవి అసురులని అన్నారు।
జ్ఞానార్జన యను దేవతలకొరకై, అవిద్యా (అజ్ఞాన సంబంధమైన) ప్రవృత్తులను నిర్మూలించడంకోసమై శ్రీలలితా పరమేశ్వరి అవతరించినది గనుక ఆ తల్లి దేవకార్య సముద్యతా యని అనబడినది।
ఓం దేవకార్య సముద్యతాయై నమః అని జపించిన సమాజమునకు ఉపకారం కలుగుతుంది। అసుర సంపదకు సంబంధించిన అనాత్మ భావములనూ, అజ్ఞానమను-, చీకటిని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించుటకై దేవకార్య సముద్యతా యని అనబడుచూ చిదగ్నికుండ సంభూతగా లలితా పరమేశ్వరి ఆవిర్భవించినది అని భావము।
దేవకార్యసముద్యత గా నామ ప్రసిద్ధమైన శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం దేవకార్య సముద్యతాయై నమః అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమఃశ్రీలలితా సహస్రనామ భాష్యము
6వ నామ మంత్రము
ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః
ఉదయించుచున్న భానునియొక్క సహస్రకిరణములతో సమాన కాంతులతో తేజరిల్లు జగన్మాతకు నమస్కారము।
శ్రీలలితా సహస్రనామావళి యందలి ఉద్యద్భాను సహస్రాభా అను ఎనిమిదక్షరముల(అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం ఉద్యాద్భాను సహస్రాభాయై నమః అని ఉచ్చరించుచూ జగన్మాతను ఆరాధించు సాధకులకు అత్యంత తేజోవంతమైన శరీరకాంతితోను, బ్రహ్మజ్ఞాన సంపదతోనూ తేజరిల్లి కీర్తిప్రతిష్టలంది తరింతురు।
దేవకార్యసముద్యతా అనే నామ మంత్రంలో జగన్మాత దేవతలయొక్క కార్యక్రమములకు సంసిద్ధమైనప్ఫుడు ఆ తల్లి స్థూలరూపం ఎలా ఉంటుందో వర్ణన ఈ ఉద్యద్భానుసహస్రాభా అను (6వ)నామ మంత్రం నుండి స్వాధీన వల్లభా అను 21వ శ్లోకం లోని (54వ) నామ మంత్రం వరకూ కొనసాగుతుంది।
బిందురూపుడై ఉన్న పరబ్రహ్మ, కర్మపరిపక్వం కాకుండా తనలో లీనమైన జీవరాశులకు మోక్షం కల్పించాలనే సంకల్పంతో సృష్టికార్యమును నిర్వహించాలనుకున్నాడు। అలా అనుకున్న పరబ్రహ్మ నుండి ఒక శక్తి బయటకు వెడలివచ్చింది। ఆ శక్తియే శివశక్తుల సమన్వితమైన పరబ్రహ్మ। శివశక్తులు ఇరువురూ ఒకటే। శక్తి త్రికోణంలో ఉండగా, ఆ త్రికోణంలోని బిందువే శివుడు। బిందురూపంలో ఉన్న శివుడు వ్యక్తము కాడు గనుక అవ్యక్తుడు। శక్తి త్రికోణరూపిణిగనుక, రూపము ఉన్నది గనుకనే శక్తి వ్యక్తరూపిణి యని అనబడుచున్నది। ఈ వ్యక్తరూపిణియే (త్రికోణరూపిణియే) పరమేశ్వరి। అంటే అమ్మవారు త్రికోణరూపిణి। అయ్యవారు బిందుస్వరూపుడు।
దేవీభాగవతంలో ఇలా చెప్పబడినది। తారకాసురుడనే రాక్షసుని బాధలు పడలేక దేవతలు శక్తిస్వరూపిణియైన పరమేశ్వరిని ప్రార్థిస్తారు। చైత్రశుద్ధ నవమి నాడు ఆ తల్లి వారికి సాక్షాత్కరిస్తుంది। ఆ సమయంలో దేవతలకు ప్రత్యక్షమైన ఆ పరమేశ్వరి ఒక కాంతిపుంజము వలె, కోట్లాది సూర్యులకాంతులతో ప్రకాశిస్తూ ఒక మెఱుపుతీగలా తళుక్కున మెఱుస్తుంది। ఆ కాంతికి ప్రస్ఫుటమైన రూపంలేదు। స్త్రీయా లేక పురుషుడా అనే సందేహం కలిగేటట్లు ఉంది। దేవతలందరూ ఒక్కసారి కళ్ళుమూసుకున్నారు। అంతే! ఒక నవయవ్వన తేజోరాశి, రమణీయమైన శరీర సౌష్ఠవముతో, అపురూపమైన లావణ్యంతో ఉన్న ఒక స్త్రీమూర్తి ప్రత్యక్షమయింది। ఆమెయే పరమేశ్వరి। ఆమెను చూచిన ఆ దేవతలు ఉద్యద్భాను సహస్రాభా యని ఒక్కసారి అన్నారు। చేతులు జోడించారు। 'జయహో మాతా!' అంటూ జయజయధ్వానములు వినిపించారు। ఆ దేవతలు అనిన ఆ నామమే వశిన్యాదులు తాము రచించి శ్రీలలితా సహస్ర నామములలో ఆరవ నామమయినది।
అమ్మవారికి మూడు రూపాలు ఉన్నవి।
1। స్థూల రూపము - పుష్పములు, అక్షతలు వగరాలతో సామాన్య భక్తులు పూజించుతారు। కంటికే కనిపించే రూపమే స్థూలరూపము। విగ్రహము, చిత్రపటము మొదలైనవి స్థూలరూపమునకు ఉదాహరణములు।
2। సూక్ష్మరూపము - మంత్రోపదేశం పొందినవారు, పూర్ణదీక్షాపరులు మంత్రపూర్వకంగా కనులు మూసుకొని ఆరాధిస్తారు। ఇది విమర్శరూపము అనికూడా అంటారు।
3। కారణరూపము బీజాక్షర సమన్వితమైన యంత్రము। పరారూపమని కూడా అంటారు। శ్రీచక్రము ఒక ముఖ్య ఉదాహరణ।
కరచరణాదులతో కూడిన శరీరమే శ్రీమాత స్థూలశరీరము। ఈ కారణ, సూక్ష్మ, స్థూల రూపములు వరుసగా మనోవాక్కాయమలతో ఆరాధించవలెను। అమ్మవారి స్థూల రూపాన్ని - మనముందు ఉన్న విగ్రహం లేదా చిత్రమును చేతులతో షోడశోపచార పూజలు చేసి ఆరాధించవలెను। సూక్ష్మరూపాన్ని వాక్కుతో బీజాక్షరమంత్ర, సహస్రనామ, అష్టోత్తర, ఖడ్గమాలాదులతో చదువుతూ పూజించవలెను। ఆపైన సూక్ష్మాతిసూక్ష్మమైన జగజ్జనని రూపాన్ని మనసునందు ధ్యానించి ఆరాధించవలెను। దీనినే త్రికరణ శుద్ధి అనియు, ఇట్లు త్రికరణ శుద్ధితో చేయు ఆరాధన మనసంకల్పమునకు బలమునిచ్చి ఫలప్రదమవుతుంది। ఆ విధమైన ఆరాధనలో అమ్మ స్థూలరూప వర్ణనకు సంబంధించిన నామ మంత్రములందు జగన్మాత మన మనో నేత్రములకు తప్పక గోచరమువుతుంది। ఉదాహరణకు ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః అని ఉచ్చరిస్తే అమ్మ ఉదయంచే భానుని సహస్రకిరణకాంతుల తేజస్సుతో, మందస్మితయై మననే కరుణించుతోంది అన్నట్లు మన మనోనేత్రములముందు గోచరిస్తుంది। అలాగే ఓం చతుర్బాహు సమన్వితాయై నమః అని ఉచ్చరించి భక్తితో ఒక పుష్పముగాని, చిటికెడు కుంకుమ గాని అమ్మ పాదాల ముందు ఉంచండి। అప్పుడు మన మనో నేత్రములకు చతుర్భాహ సమన్వితయై, సర్వారుణా అన్నట్లు సిందూరకాంతులీను రూపముతో, అరుణ కాంతులీను వస్త్రములు, కురులలో కుసుమ మాలలు,నాసాభరణములు, తాటంకములు, మెడలో రత్నాల హారములతో శ్రీమత్సింహాసనేశ్వరి యై మనోనేత్రములందు గోచరిస్తుంది। పూలవనంలోకి ప్రవేశించక ముందే పూలవాసన, జ్యోతిని చూచుటకు ముందు జ్యోతి కాంతి మనకు గోచరించుతాయి। అలాగే చిదగ్నికుండమున శ్రీచక్రమందు ఆవిర్భవించిన అమ్మయొక్క అరుణకాంతులు మనకు దర్శనమిస్తాయి।
అమ్మవారు ఉద్యద్భాను సహస్రాభా అని యనబడినది। అనగా వేయిమంది ఉదయభాను కిరణకాంతులతో అమ్మవారు ప్రకాశిస్తున్నది। ఇక్కడ వేయి అనగా అనంతము అని భావించవలెను। అనంతమైన ఆ కిరణ సమూహములు సాక్షాత్తు పరమేశ్వరివే గాని సూర్యుని కాంతులు, చంద్రుని కాంతులు, లేక నక్షత్రకాంతులు అని యనుకొనతగదు। ,అమ్మవారి నుండియే సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలైనవారు గ్రహించారు। శంకర భగవత్పాదులవారు తమ సౌందర్యలహరిలో పదునాలుగవ శ్లోకంలో ఇలా వివరించారు।
క్షితౌ షట్పంచాశ - ద్ద్విసమధిక పంచాశ దుదకే
హుతాశే ద్వాషష్టి - శ్చతురధిక పంచాశ దనిలే ।
దివి ద్విఃషట్త్రింశ - న్మనసి చ చతుఃషష్టిరితి యే
మయూఖాస్తేషామప్యుపరి తవ - పాదాంబుజయుగమ్ ।। 14 ।।
షట్చక్రాలలోని సహస్రారములో ఉండు దేవి పాదప్రకాశ వైభవం।
ఓ జగన్మాతా! యోగసాధనలో సాధకుడు షట్చక్రాలనూ అధిగమించి,సహస్రారములో ఉన్న నీపాదపద్మాలు చేరాలంటే తన దేహంలో ఉన్న పృధివీతత్వంతో కూడిన మూలాధార చక్రంలో 56 కిరణాలను దాటి, జలతత్వాత్మికమైన మణిపూరక చక్రంలో ఏబది రెండు (52) మయూఖములను (కిరణములను) దాటి, అగ్నితత్వాత్మికమైన అనాహత చక్రంలో ఏబది నాలుగు (54 ) కాంతిరేఖలను (కిరణములను) దాటి, ఆకాశతత్వాత్మికమైన విశుద్దచక్రమునందు డెబ్బది రెండు (72) కాంతికిరణాలు దాటి, మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రము నందు అరువది నాలుగు (64) కిరణపుంజాలు దాటి, ఈ ప్రకారముగా ప్రసిద్ధములైన ఈ మయూఖములు దాటి పైకి చేరుకోగా అచట సహస్ర దళ మధ్యగత చంద్రబింబాత్మకమైన బైందవ స్థానమున, సుధాసింధువునందు నీయొక్క పాదపద్మముల జంట గోచరమగుచున్నది।
పై శ్లోకములో ఆది శంకరులు చెప్పిన ప్రకారం
శ్రీ చక్రమునందు మూలాధార, స్వాదిష్టాన, మణిపూర। అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములును, సహస్రారము కలవు। ఈ ఆరు చక్రములును సోమ, సూర్య, అనలా(అగ్ని)త్మకములుగా మూడు ఖండములు। మూలాధార, స్వాదిష్టాన యుగళమైన ప్రథమ ఖండమునకు పై భాగమున అగ్నిస్థానము అదియే (రుద్రగ్రంథి)। మణిపూర, అనాహత చక్రములు రెండోవ ఖండము। సూర్యస్థానము అదియే (విష్ణుగ్రంథి)। విశుద్ధ, అజ్ఞాచక్రములు మూడోవ ఖండము చంద్రస్థానము అదియే (బ్రహ్మగ్రంథి)
ప్రథమఖండము పైనున్న అగ్ని తన జ్వాలలచేత ప్రథమఖండమును వ్యాపింపజేయును। రెండవ ఖండము పైనున్న సూర్యుడు తన కిరణముల చేత రెండవ ఖండమును వ్యాపింపజేయును।
మూడవఖండము పైనున్న చంద్రుడు తన కళలచేత మూడవఖండమును వ్యాపింపజేయును। పృథ్వీ తత్త్వాత్మిక మూలాధార చక్రమున (పృథ్వీ అగ్ని జ్వాలలు 56), మణిపూర చక్రమున (ఉదక తత్త్వాత్మిక జ్వాలలు 52) కలిపి 108 అగ్ని జ్వాలలు।
అట్లే స్వాధిష్టాన (అగ్ని తత్త్వాత్మిక కిరణములు 62), అనాహత చక్రమున (వాయు తత్త్వాత్మిక కిరణములు 54) కలిపి 116 సూర్య కిరణములు। ఆకాశ తత్త్వాత్మకమగు (విశుద్ధ చక్రమున 72), మనస్తత్త్వాత్మకమగు (ఆజ్ఞా చక్రమున 64) కలిసి 136 చంద్రుని కళలు అగుచున్నవి। ఇవి 108+116+136 మొత్తం 360 కిరణములు అగును। ఈ కిరణాలన్నియును ఉద్యద్భానుసహస్రాభ అయిన అమ్మవారి పాదములనుండి వెడలినవే।
అటువంటి ఉదయించే సూర్య సహస్ర కిరణ కాంతుల కన్నా తేజోవంతమైన తల్లికి నమస్కరించినపుడు ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః అని అనవలెను।
****
శ్రీమాత్రేనమః శ్రీలలితా సహస్రనామ భాష్యము
7వ నామ మంత్రము
ఓం చతుర్భాహు సమన్వితాయై నమః
చతుర్బాహువులతో (నాలుగు బాహువులతో) విరాజిల్లు జగన్మాతకు నమస్కారము
శ్రీ లలితా సహహ్రనామావళి యందలి చతుర్బాహు సమన్వితా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం చతుర్బాహు సమన్వితాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఉపాసించు సాధకులు అఖండ ప్రజ్ఞావంతులై, దివ్యజ్ఞాన సమన్వితులై ఎనలేని కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లుదురు.
ఈ నామ మంత్రములో ఆ పరమేశ్వరి స్థూలరూపమును వర్ణించడం జరిగినది. పరమేశ్వరి స్థూలరూపాన్ని వర్ణిస్తూ ఆ తల్లి తేజస్సును ఉదయించుచున్న వేయి సూర్యుల కిరణ కాంతితో పోల్చియున్నాము, అలాగే ఈ నామ మంత్రములో ఆ తల్లి చతుర్బాహు (నాలుగు బాహువు) సమన్వితగా (కూడినదిగా) చెప్పడం జరిగినది. ఈ నాలుగు చేతులు ధర్మ - అర్థ - కామ - మోక్షములని భావిస్తే అయితే ఊర్ధ్వబాహువులు రెండు ధర్మ, మోక్షములైతే, క్రింది బాహువులు రెండును అర్థ, కామములు అగును.
చతుర్వేదములు (ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదములు),
చతుర్వర్ణములు బ్రహ్మ, క్షత్రియ, వైశ్య శూద్రులు.
పరమాత్మ ముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు ఉద్భవించారు.
మహావాక్యచతుష్టయము
ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేద మహావాక్యముగా ప్రజ్ఞానం బ్రహ్మ ప్రసిద్ధికెక్కినది. అతి ప్రాచీనమైన ఋగ్వేదములో సృష్టిమూలమును తెలియజేస్తూ ఈ బ్రహ్మాండము పరబ్రహ్మము నుండి జనించినదని, ఈ చరాచర సృష్టికి శుద్ధ చైతన్యము బ్రహ్మమేనని తీర్మానించినది. బ్రహ్మమే సర్వజ్ఞతను కలిగియున్నది. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులను నడిపించే చైతన్యము బ్రహ్మము. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు తన పరిధిలోని గ్రహములను తన చుట్టూ భ్రమింపచేసుకొనే శక్తియే ఈ శుద్ధ చైతన్యము. ఆద్యంతములు కానరాని ఈ అనంత సూర్య మండలములను వ్యక్తావ్యక్తమైన ఈ ఆకాశములో పయనింపచేసే శక్తి కూడా ఈ బ్రహ్మయొక్కశుద్ధ చైతన్యమేనని వివరించినది. సృష్టికి ముందు తరువాత ఉండేది ఆత్మ ఒక్కటేనని తెలియజేసింది.
అహంబ్రహ్మాస్మి యజుర్వేద మహావాక్యము అహంబ్రహ్మస్మి
అనగా నేనే పరబ్రహ్మమని జీవుడు భావించడం. అనేక జన్మలలో జీవుడు పరిభ్రమిస్తున్నాడు. కాని అన్ని జన్మలలోను స్వరూపము ఆత్మగా వెలుగొందుతున్నది. తనకు లభించిన దేహమనే ఉపాధిలో జ్ఞానమును ప్రోది చేసుకొని నేనే ఆత్మస్వరూపుడను అనే సత్యాన్ని దర్శించి ముక్తిని పొందుతాడని ఈ యజుర్వేద మహావాక్యము విశదపరచింది. ఉత్కృష్టమైన మానవ జన్మలో ఆత్మశోధన ధర్మాచరణతోనే సాధించగలమని తెలియజేసింది. ధర్మబద్ధమైన కోరికలతో జీవించి తాను తరించి సమస్త ప్రకృతిని తరింపజేయాలని నొక్కి చెప్పింది.
తత్త్వమసి సామవేద మహావాక్యము తత్త్వమసి
చరాచరమంతా వ్యాపించియున్న శుద్ధచైతన్యము ఎక్కడో లేదు, నీలోనే వుండి, నీవైయున్నదని నిర్వచించడం చాలా ఆశ్చార్యాన్ని, తృప్తిని కలిగిస్తుంది. శంకర భగవత్పాదులు చాటి చెప్పిన అద్వైతము ఈ మహావాక్యము నుండే ఆవిర్భవించినది అని భావించడం మనం వినియున్నాము. ఏక మేవ అద్వితీయం, ఉన్నది ఒక్కటే! అదే పరబ్రహ్మము. అది నీలోన, అంతటా వ్యాపించి ఉన్నదనే ఒక గొప్ప సత్యాన్ని అద్వైతము ఆవిష్కరించినది. ఆత్మ పరమాణు ప్రమాణమైనది. అటువంటి పరమాణువునుండే ఈ బ్రహ్మాండము ఆవిర్భవించినది. కావున ఈ బ్రహ్మాండములో భాగమైన నీవే ఆత్మవు అని వర్ణించింది.
వాక్ రూపములు (పరా - పశ్యంతి - మధ్యమా - వైఖరీరూపా).
మూడురకముల వివరణలు ఈయబడినవి.
ఒకటి
పరబ్రహ్మతత్త్వ విచారణ సందర్భంలో వాక్కు నాలుగు విధాలుగా చెప్పారు. 1. పరా, 2. పశ్యంతి, 3, మధ్యమ, 4. వైఖరి. మనిషి అక్షర సముదాయాన్ని ఏర్పరచుకొని, వాటి సహాయంతో అంతులేని సాహిత్యాన్ని సృష్టించుకొన్నాడు. కాని, దృగ్గోచరమైన సృష్టికి మూలాన్ని అన్వేషించడానికి సతమతం అవుతున్నాడు. ఈ పరిస్థితిని చిత్రించే ఒక శ్లోకం ఉంది.
పరా వృక్షేషు సంజాతా, పశ్యంతీ భుజగీషుచ, మధ్యమావై పశుశ్చైవ, వైఖరీ వర్ణ రూపిణీ
పరా అనగా చెట్టు నుంచి చివుళ్లు, ఆకులు, కొమ్మలు, పూలు, ఫలాలు వస్తాయి. కాని తన వల్లనే వస్తున్నాయని చెట్టు గుర్తించదు.
పశ్యంతి పాముకు చూడటానికి కళ్లేగాని, వినడానికి ప్రత్యేకం ఒక శ్రవణేంద్రియం అనేది లేదు.
మధ్యమా పశువు అంబా అంటుంది. కాని, అంబను తెలుసుకొనలేదు.
వైఖరీ మనిషి కూడా అలాగే సృష్టిమూలాన్ని తెలుసుకొనలేక పోతున్నాడు.
రెండవ వివరణ
మరొక విధంగా కూడా ఈ పదాలకు అర్థం చెప్పారు.
ఏదైనా ఒక పనిని తలపెట్టినప్పుడు తలపునకు పూర్వస్థితి పరా వాక్కు
తలపు పశ్యంతీ వాక్కు
ఆలోచన కార్యరూపం ధరించే ముందున్న ఊహస్థితి మధ్యమ వాక్కు
తలపు కార్య రూపం ధరించడం వైఖరీ వాక్కు
మూడవ వివరణ
పరా విత్తు మొలకెత్తడానికి ముందు స్థితి. అంటే, విత్తు భూమిలో పడి, ఉబ్బి, మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నస్థితి.
మొలక విత్తులోనుంచి పైకి రావడం, అంటే ఆలోచన మొలకెత్తడం పశ్యంతి
మొక్క ఎదిగి, వృక్షంగా మారడం మధ్యమ స్థితి.
పూత పూయడం, పూలు ఫలాలు కావడం, పరిపూర్ణం చెందడం వైఖరి
చతురాశ్రమములు (ఈ ఆశ్రమములను చతుర్వర్ణాలలో మానసిక సంస్కారమును బట్టి అందరూ ఆచరించవచ్చును)
(బ్రహ్మచర్యం, గృహస్థము, వానప్రస్థము మరియు సన్యాసము) - వీటితో శ్రీమాత నాలుగు బాహువుల సమన్వయింపబడును. ఎందుకంటే చతుర్బాహు సమన్వితా యను నామ మంత్రములోని సమన్వితా అనే పదంలో గలదు.
బ్రహ్మచర్యం బ్రహ్మచారికి వేదాధ్యయనము, గురు శుశ్రూష, ఇంద్రియ నిగ్రహము, పెద్దలయందు గౌరవము ప్రధాన ధర్మములు.
గృహస్థము గృహస్థునకు ఏకపత్నీవ్రతము, తల్లిదండ్రుల సేవ, అతిథి సత్కారము, ధర్మ సంతానము, ఆచార నిర్వహణము, ఆనాథులయందు ఆదరణ, బీదలకు సహకారము ప్రధానములు.
వానప్రస్థము వానప్రస్థుడు ధర్మ వ్యవహారబద్ధుడై వయోభారాన్ని దృష్టిలో ఉంచుకొని, కర్మలయందు స్వార్ధమును వీడి సంతానమునకు వ్యవహార మప్పగించి ధర్మపత్నితో కందమూలాదుల నాహారించి తపమాచరించడం ధర్మము.
వైర్యాగ్యము కలిగి ధర్మపత్నిని సంతానమున కప్పగించి కామక్రోధాదులను జయించి నిర్లిప్తుడై శేష జీవితమును లోకోద్ధరణకై ధర్మ లక్ష్యముతో సాక్షాత్కారంతో
సన్న్యాసము సన్యసించుట సన్యాసాశ్రమము.
అంతఃకరణ చతుష్టయము
వివరణ:- శరీరం లోపల అంతర్గతముగా నుండు సూక్ష్మతత్త్వములతో కూడి యుండిన అంతఃకరణమునే అంతరింద్రియమని అందురు. పంచభూతముల యొక్క సూక్ష్మంశములే మనో, బుద్ధి, చిత్త, అహంకారంలతో కూడిన అంతఃకరణం ఈ నాలుగింటితో కూడిన అంతఃకరణమునే అంతఃకరణ చతుష్టయం అంటారు. గాలి, అగ్ని, జలము, పృథ్వి, ఆకాశాంశలతో కూడినదే అంతఃకరణం. అంతఃకరణము యొక్క తత్త్వం ఆకాశతత్త్వం కాగా, మనస్సు యొక్క తత్త్వం వాయుతత్త్వం, బుద్ధి యొక్క తత్త్వం అగ్ని తత్త్వం, చిత్తము యొక్క తత్త్వం జలతత్త్వం, అహము యొక్క తత్త్వం పృథ్వీతత్త్వం.
ఆ పరమేశ్వరి సహస్ర నామములందు అనంతమైన ఆధ్యాత్మికభావన, బ్రహ్మజ్ఞాన తత్త్వమూ ఇమిడి ఉన్నట్లే, ఆ తల్లి స్థూలరూపమునందు కూడా అత్యంత నిగూఢమైన తత్త్వము నిక్షిప్తమై ఉన్నది. బ్రహ్మజ్ఞానులు, కవులు, పండితులు, వ్యాఖ్యాతలు శ్రీలలితా పరమేశ్వరి నామ తత్త్వవిచారణచేస్తున్నారు. చేయు కొలది జ్ఞానసముపార్జనా భావములు వెలికి వస్తున్నాయి. రహస్యాతి రహస్యమైన శ్రీలలితా సహస్ర నామములయందు నిక్షిప్తమైన భావనిధి ఒక వజ్రాలఖని వంటిది.
చతుర్బాహు సమన్వితా యని కీర్తింపబడు తల్లికి నమస్కరించునపుడు ఓం చతుర్బాహు సమన్వితాయై నమః అని యనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః శ్రీలలితా సహస్రనామ భాష్యము
8వ నామ మంత్రము 2.1.2022
ఓం రాగస్వరూప పాశాఢ్యాయై నమః
అనురాగ స్వరూపమైన పాశము (నాలుగు చేతులలో ఎడమ వైపు గల క్రింది చేతిలో) ధరించియున్న తల్లికి నమస్కారము.
శ్రీ లలితా సహహ్రనామావళి యందలి రాగస్వరూపపాశాఢ్యా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం రాగస్వరూప పాశాఢ్యాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులను తన అనురాగ పాశముతో బిడ్డలుగా వారి అభీష్టములను ఆదరించి ఐహిక,ఆముష్మిక సుఖసంతోషాలను ప్రాప్తింపజేయును.
రాగము అను శబ్దమునకు అనురక్తి, అనురాగము, ప్రేమ, మాత్సర్యము మొదలైన అర్థములు ఉన్నవి. రాగమునకు వ్యతిరేకము ద్వేషము. తను అనుకున్నది అనుకూలమైతే రాగము, ప్రతికూలమైతే ద్వేషము. కామక్రోధాలు కూడా ఇంతే. రావణుడు సీతపై మోహం పడ్డాడు. అనగా అతనిలోని అరిషడ్వర్గాలలోని కామం (కోరిక) వెలికి వచ్చింది. సీతాదేవి పతివ్రత. అతనిని ద్వేషించింది. ఫలితంగా రావణునికి క్రోధం వచ్చింది. అరిషడ్వర్గాలను జయించినవారికి కామం ఉండదు. కామం లేని వానికి క్రోధం ఉండదు. రాగద్వేషములు, కామక్రోధములు అనునవి మనసుకు సంబంధించినవి. మనసుకు సంబంధించినది ఏదైనా పాశము వంటిదే. అంటే బంధము. ఒక వస్తువు లేదా వ్యక్తిపైనా ఇష్టత లేదా అనురక్తి పెంచుకుంటే విడచి ఉండలేని పరిస్థితి వస్తుంది. కొన్ని విషయాలలో విడిచి జీవించలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వేరే విషయాలపై ధ్యాసకూడా ఉండదు. అందుచేత అరిషడ్వర్గాలు జయిస్తే మానవుడు మహానుభావు డవుతాడు. అరిషడ్వర్గాలకు లోనైతే మానవుడు దానవు డవుతాడు, మహారాక్షసుడుకూడా అవుతాడు. అమ్మవారి చేతిలోనున్న పాశము తనను ఆరాధించు భక్తునికి అనురాగపూరితమై అతనిలోని అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుతుంది. విషయాలవైపు పోనీయదు. మోహాన్ని దరిజేరనీయదు. కర్మఫలాల కారణంగా ఏదో ఒక దేహాన్ని ధరించిజన్మ పొందుతాము. ఆ జన్మలో కొన్ని వాసనలు, కర్మఫలాలను ఖర్చు చేసుకుంటాము. మళ్లీ కొన్ని కర్మలు చేస్తూ కొత్తగా కొన్ని కర్మఫలాలను, వాసనలను ప్రోగు చేసుకుంటాము. మళ్లీ ఈ వాసనలు, కర్మఫలాల మూటను నెత్తిన పెట్టుకొని ఒక శరీరం నుండి మరో శరీరానికి ప్రయాణిస్తుంటాం. ఈ ప్రకారంగా అనేక జన్మలను మళ్లీ మళ్లీ ఎత్తుతూ ఉంటాం. ఈ జనన, మరణ చక్రంలో బంధింపబడతాం. ఈ వాసనలు, కర్మఫలాలు ఉన్నంతకాలం ఈ జనన, మరణాలు తప్పవు.
పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహిః మురారే
మళ్లీ మళ్లీ పుట్టడం, మళ్లీ మళ్లీ చావడం, మళ్లీ మళ్లీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడం, ఈ అంతులేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం ఎంతో కష్టమైన పని. ఇది బంధం అంటే.
ఇందుకు ఒక కథకూడా ఉన్నది. సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి. కేవలం పరమాత్మపై ధ్యాస తప్ప అన్య లంపటములు ఉండవు. ఆ సన్యాసి ఒక రోజున తన కౌపీనమును తడిపి ఆరవేసి తన పర్ణశాలలో ఒక కొయ్యకు తగిలించి ఉంచెను. అంతలో ఒక ఎలుక వచ్చి ఆ కౌపీనమును కొరికి ముక్కలు చేసెను. వెంటనే తన పర్ణశాలలో ఎలుకలు రాకుండా చేయాలని ఒక పిల్లిని పెంచెను. ఆ పిల్లికి పాలకోసం ఒక గోవును పెంచెను. ఆ గోవును మేపడానికి పాలికాపును పెట్టెను. ఇలా ఒక దానికోసం ఒకటి కూడబెట్టుకొని పోతూ, దైవధ్యానం విడిచి పెట్టవలసి వచ్చింది. దైవధ్యానం లేనివాడై, విషయ లంపటములు ఉన్నవాడు జన్మరాహిత్యమైన కైవల్యము సాధించలేడు. ఇదే పాశము అంటే.
బంధాల (పాశాల) వలన దైవచింతన గుర్తుకు రాదు. దైవచింతన లేనినాడు సంసారబంధ విముక్తి లభించదు. సంసారబంధ విముక్తిలేనపుడు జననమరణ చక్రములో పరిభ్రమించు చుండవలసి వస్తుంది. కర్మఫలానుసారము జన్మలు ఎత్తుచునేయుండవలయును. మోక్షం ఉండదు. ఇందుకు జడభరతుడు అను రాజు కథకూడా ఒక చక్కని ఉదాహరణ మవుతుంది.
జడభరతుడు రుషభుడనే రాజుకు కుమారుడు. రాజపుత్రుడుగా పుట్టినా, బాల్యం నుంచి విషయ వాంఛలకు అతీతంగా, దైవభక్తి కలిగి ఉండేవాడు. అందువల్ల అతనిని జడభరతుడని పిలిచేవారు. రుషభుని అనంతరం జడభరతుడు తనకు ఇష్టం లేకపోయినా, రాజ్యపాలన చేపట్టవలసి వచ్చింది. ఎన్నో సంవత్సరాలపాటు ప్రజానురంకజమైన పాలన అందించాడు. ఆయన పాలనలో ప్రజలు ఏ లోటూ లేకుండా హాయిగా ఉన్నారు. పాలన చేస్తూనే, జపధ్యానాలలో మునిగి తేలేవాడు. దేనినీ నిర్లక్ష్యం చేసేవాడు కాదు. చివరకు వృద్ధాప్యం మీదపడడంతో ఆయన పాలన బాధ్యతలను తన కుమారులకు అప్పగించి, ప్రజాజీవనానికి దూరంగా ఒక నదీతీరానికి వెళ్లి, అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకుని, ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. నిశ్చలమైన, నిర్మలమైన మనస్సుతో జన్మరాహిత్యాన్ని కోరి చేసే ఆయన తపస్సు శ్రీహరిని మెప్పించింది. శ్రీహరి అతనికి మోక్షం అనుగ్రహించాలనుకున్నాడు. కాని ఒక చిత్రమైన సంఘటన భరతుడి జీవితాన్ని మలుపు తిప్పింది. జడభరతుడికి ప్రతిరోజూ నదిలో స్నానం చేసిన తర్వాత, ఒడ్డునే కూర్చుని ధ్యానం చేసుకోవడం అలవాటు. ఒకరోజు ఆయన అలా ధ్యానానికి కూర్చున్నాడు. అదే సమయంలో నిండు చూలింత అయిన లేడి ఒకటి అక్కడ నీళ్లు తాగడానికి వచ్చింది. దానికి దగ్గరలో నుంచి ఒక పులిగాండ్రింపు వినపడింది. సరిగ్గా అప్పుడే పెద్దపెట్టున పిడుగు పడింది. ఈ రెండు సంఘటనలకు తీవ్రంగా బెంబేలెత్తిపోయింది ఆ లేడి. భయంతో వణికిపోతూ, ఒక్క గంతు వేసింది. ఆ గంతుకు లేడికి అప్పటికప్పుడు ప్రసవం జరిగిపోయింది. లేడి మాత్రం నీటిలో మునిగి చచ్చిపోయింది. దూరాన కూర్చుని ఇది గమనిస్తున్న జడభరతుడు అక్కడికి చేరుకునేలోపు అప్పుడే పుట్టిన లేడిపిల్ల కూడా నదిలో మునిగిపోతూ కనిపించింది. దాంతో ఆయన ఒక్క అంగలో దాన్ని అందుకుని, చేతుల్లోకి తీసుకున్నాడు. కళ్లు కూడా తెరవని ఆ పసిదాన్ని చూసేసరికి ఆయనలో వాత్సల్యం కలిగింది. దిక్కులేని ఆ పసికూనను కొన్నాళ్లు పెంచి, అది కాస్త పెద్దయ్యాక తిరిగి అడవిలో వదిలేద్దామనుకున్నాడు. తన పర్ణశాలకు తీసుకుని వెళ్లి, దానికి సపర్యలు చేశాడు. లేత గడ్డిపరకలు తినిపించాడు. అది కోలుకోవాలని కోరుకున్నాడు. అప్పటినుంచి తల్లి లేని దానికి అన్నీ తానే అయ్యాడు. బంగారు రంగులో మెరిసి పోతూ, అది ఆశ్రమ ప్రాంగణంలో చెంగనాలు వేస్తూ ఉంటే చూసి మురిసి పోయాడు. దాని ధ్యాసలో పడి తన తపోదీక్షను కూడా పక్కన పెట్టాడు.
సర్వసంగ పరిత్యాగి అయిన ఆ రాజర్షికి అనుక్షణం దాని ఆ లేడిపైనా ధ్యాస ఉండేది. దానితో ఆటపాటలయందు ములిగిపోయేవాడు. దైవధ్యానంమీద కూడా ధ్యాస ఉండేదికాదు. ఆ లేడి మీద అతడు ఎంతో ప్రేమను పెంచుకున్నాడు. ఆ లేడి అంటే ఎంతో ముద్దుగా చూడడంచేత, ఆ లేడి అతని యజ్ఞకుండాన్ని, యజ్ఞసామాగ్రిని కూడా అపరిశుభ్రం చేసినా ఏమీ అనుకోకుండా తిరిగి శుభ్రం చేసుకునేవాడు. ఆ లేడి మేతకు బయటకు వెళితే, అది వచ్చేవరకూ అతని ప్రాణం ఆ లేడిపైనే ఉండేది.
ఆలస్యమైతే క్రూరమృగ మేదైనా దానిని పొట్టన పెట్టుకుందేమోనని విలవిలలాడేవాడు. ఆ లేడి కూడా భరతునివద్ద చేరిక పెంచుకొంది. ఆయన తినిపిస్తే తప్ప పచ్చగడ్డి కూడా తినేది కాదు. ఒక రోజున ఆ లేడి ఎక్కడికో వెళ్లింది. నాలుగురోజులపాటు తిరిగి రాలేదు. ఎంత వెదికినా కనిపించలేదు. దానికి ఏమైనా అయిందేమోనని బెంగపెట్టుకుని, ఆయన మంచంపట్టాడు. తనకు మృత్యువు ఆసన్నమయింధి అంత్యసమయం వచ్చిందని గ్రహించాడు. సరిగ్గా అదే సమయంలో ఆ లేడి వచ్చి, ఆయన కాళ్లు నాకుతూ ఉండిపోయింది. దానినే చూస్తూ, తన తర్వాత దాని బాగోగులు ఎవరు చూస్తారా అనే బెంగతో ఆయన ప్రాణాలు విడిచాడు. జీవుడు చనిపోయే సమయంలో దేని గురించి ఆలోచిస్తే, ఆత్మ తిరిగి ఆ రూపం తీసుకుంటుందంటారు. జన్మరాహిత్యం కోరిన భరతుడు చివరి దశలో ఆ లేడిపిల్లను చేరదీసి, దాని ధ్యాసలో పడి మరణించడం వల్ల ఆయన అంతవరకు చేసిన తపస్సంతా వ్యర్థమై, మరుజన్మలో ఆయన లేడిగా పుట్టవలసి వచ్చింది. ఆ తర్వాత ఆయన మరో జన్మ కూడా ఎత్తవలసి వచ్చింది. అందుకే అంత్యసమయంలో భగవన్నామ స్మరణ చేయాలంటారు.
రాగ అనగా అనురాగ స్వరూప అనగా స్వరూపముగా గల పాశ అనగా పాశముతో ఆఢ్యా అనగా ఒప్పుచున్నది
చతుర్బాహు సమన్వితా అని ఇంతకు ముందు (7వ) నామ మంత్రములో నాలుగు బాహువులతో పరాశక్తి విరాజిల్లుచున్నదని ప్రస్తుతించాము. ఈ నామ మంత్రములో శ్రీమాత నాలుగు చేతులలో ఎడమవైపుగల క్రిందిచేతిలో అనురాగ స్వరూపమైన పాశము కలిగి యున్నదని ఈ నామ మంత్రములోని భావము. అమ్మవారి నాలుగు చేతులలోను ఆయుధములు కలిగియున్నది. ఆ ఆయుధములు నాలిగింటిని నాలుగు (రాబోవు) నామ మంత్రములలో వివరింపబడినవి. అమ్మవారి స్థూల, సూక్ష్మ, పర రూపములవలెనే, ఆయుధములు కూడా స్థూల, సూక్ష్మ, పర భేదములచే మూడు విధములుగా నున్నవి. అందులో ఎడమవైపు గల క్రింది చేతి యందు రాగమనెడి పాశము పరమేశ్వరి గలిగి యున్నది. ఇచట రాగమనగా మనసుకు సంబంధించినది. అనగా వాసనాత్మకము. ఆ రాగమే స్థూలరూపంలో పాశమై అమ్మవారి చేతిలో ఉన్నది. అటువంటి పరమేశ్వరి ఎడమచేతి వైపున గల క్రింది చేతిలోఈ పాశము ఉంటుంది. గనుకనే ఆ పరమేశ్వరి రాగస్వరూప పాశాఢ్యా యని అనబడినది.
అమ్మవారి చేతిలో ఉన్న పాశము రాగస్వరూపమయినది. అనగా ప్రేమస్వరూపమైనది. ఆ తల్లికి తన భక్తులనిన అనంతమైన అనురాగము. వారిని బంధించి తనపై మరల్చుకుంటుంది. సంసారబంధము లంటనీయదు. అరిషడ్వర్గములను తన భక్తుల దరికి చేరనీయదు.
ఈ పాశము ప్రేమస్వరూపమయిన ఆయుధము. జీవిని కట్టపడేస్తుంది. మనోవృత్తులు బాధాకరమైనవి. అందుకే అవి ఆయుధాలుగా చెప్పబడ్డాయి. రాగము అనేది అరిషడ్వర్గాలకు మూలమైనది.
అనురాగాన్ని గనక జయించినటైతే ముక్తి లభిస్తుంది. సుషుప్తిలో రాగము ప్రాణమునందు లయం చెందుతుంది. జాగ్రదవస్థలో బుద్ది జాగృదమవుతుంది. అందుచేత అది మనసులో ఉంటుంది. గాఢమైన సుపుప్తిలోను, లేదా తురీయావస్థలోను తప్ప అనురాగానికి అంతమనేది లేదు. ఇది అనంతమైనది. పూర్వజన్మలో తెలిసిన విషయాలను మాత్రమే జీవికోరతాడు. అంతేగాని తెలియని పదార్థాల జోలికిపోడు. ఎవరైనా కొత్తవ్యక్తులను చూసినప్పుడు వారిని ఎక్కడో చూసినట్లు, వారితో
మనకు బాగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది. నిజానికి వారితో మనకి ఏరకమైన పరిచయం లేదు. కాని గతజన్మలలో ఎప్పుడో వారితో బాగా పరిచయం ఉందన్నమాట.
అందుకే మనకు అలా అనిపిస్తుంది.
రాగము అనేది బుద్ధికి సంబంధించిన విషయము. అనగా చిత్తవృత్తి విశేషము. మాయ లేదా
అజ్ఞానము అనునవి ఇచ్చాజ్ఞాన క్రియాశక్తుల సమాహారము. ఈ మూడింటినీ విడదీయలేము.
ప్రాపంచికమైన ఈ అనురాగాలను అరికట్టే పరమేశ్వరి యొక్క శక్తియే పాశము. పైన చెప్పినటువంటి ఇచ్చాజ్డానక్రియాశక్తులలో
జ్ఞానశక్తి ఎక్కువగా ఉంటే ఉత్తమజన్మ, ఇచ్చా, క్రియాశక్తులపాలు ఎక్కువగా ఉంటే
- పశుపక్ష్యాదుల జన్మ కలుగుతుంది. జ్ఞానశక్తి ఎక్కువగా ఉన్నటువంటి వారు బుషులు,
గంధర్వులు, సిద్ధులుగ జన్మిస్తారు.
సాధకుడు పరమేశ్వరిని అర్చించేటప్పుడు ఈ రాగము
అనే దాన్ని పూర్తిగా వదిలివేసి, అంటే రాగాన్ని పరమేశ్వరికి అర్చించి, ఆవిడచేతిలో
పాశరూపంలో ఉంచి అర్చించాలి. అప్పుడే అతడికి ముక్తి లభిస్తుంది.
పరమేశ్వరి చేతిలో ఉన్నటువంటి పాశము వశీకరణము అని చెప్పబడుతోంది. ఈ పాశాన్ని అర్చించినవారు ముల్లోకాలను వశం చేసుకోగలుగుతారు. అందుకే నవావరణ పూజ చేసేటప్పుడు ఎనిమిదవ ఆవరణ అనగా త్రికోణంలో ముందుగా దేవి యొక్క ఆయుధాలను అర్చించటం జరుగుతుంది.
రాగస్వరూపమైన పాశమును తనచేతి యందుంచుకొని మనలోని అరిషడ్వర్గములను శాసించగల శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం రాగస్వరూప పాశాఢ్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః శ్రీలలితా సహస్రనామ భాష్యము
9వ నామ మంత్రము
ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః
దుష్టశక్తులను నాశనముచేయుటకు క్రింది కుడిచేతిలో క్రోధమనే అంకుశమును ధరించి తేజరిల్లు తల్లికి నమస్కారము.
శ్రీ లలితా సహహ్రనామావళి యందలి క్రోధాకారాంకుశోజ్జ్వలా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు ఆ తల్లి కరుణించి సమస్త బాధలు తొలగించును. మరియు ఈ నామ మంత్ర జపంతో సాధకునిలోని సాధనాశక్తి ప్రజ్జ్వలించి అసలైన శ్రీవిద్యోపాసన దిశగా సాధన కొనసాగును.
పరమేశ్వరి క్రోధజ్ఞానములనెడి రెండుఅంకుశములను కుడివైపు క్రిందిచేతిలో ధరించియున్నది.
అమ్మవారి బాహ్యస్వరూప వర్ణనలో ఉన్నాము. పరమేశ్వరి నాలుగు బాహువులతో విలసిల్లుచున్నదని ఏడవ నామ మంత్రములో వశిన్యాదులు చెప్పారు. నాలుగు చేతులలో నాలుగు ఆయుధములు గలవని ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు నామములలో చెప్పుచున్నారు. ఎనిమిదవ నామ మంత్రంలో అనురాగ స్వరూపమైన పాశము ధరించినది అని చెప్పబడినది. ఈ నామ మంత్రంలో జ్ఞానముతో కూడిన క్రోధస్వరూపమైన అంకుశములను ధరించియున్నది అని వశిన్యాదులు చెప్పారు.
1) అంకుశము జ్ఞానరూపము, 2) బాణము, ధనుస్సులు క్రియారూపము, 3) పాశము ఇచ్ఛారూపము అని కూడా భావించవచ్చును.
సాధారణంగా కోపం వస్తే విచక్షణ కోల్పోవడం జరుగుతుంది. అంటే జ్ఞానం కోల్పోవడం జరుగుతుంది. అప్పుడు తరతమ భేదాలు ఉండవు. ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అందుకే తన కోపమె తన శత్రువు అన్నారు. కాని, అమ్మవారి చేతిలో ఉన్న అంకుశము జ్ఞానముతో కూడిన క్రోధస్వరూపము. రాగద్వేషాలు, కామక్రోధాలు - ఒక్క మాటలో చెప్పాలంటే అరిషడ్వర్గములు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు) అనేవి చిత్తవృత్తులు. అనగా మనసుకు సంబంధించినవి. అమ్మవారి చేతిలో ఉన్న అంకుశము కోప-సవిషయక జ్ఞానము కలిగినది. గనుక అమ్మవారి చేతిలోని అంకుశము భక్తులకు జ్ఞానరూపమైనది, ఆభరణము వంటిది. దుష్టులకు అంకుశము వంటిది. ఇంకా చెప్పాలంటే, దుష్టులకు రజోగుణ క్రోధాకారిగా తోచిననూ, ఉపాసించే జ్ఞానులకు ఈ పరాశక్తి సాత్త్విక మూర్తియై ముక్తిప్రదాయిని గా విరాజిల్లుచున్నది.
కామము క్రోధము అనేవి రజోగుణం నుండి వస్తున్నాయని గీతావాక్యం కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవా అని. రాగస్వరూపపాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా అన్న రెండునామాలనూ కలిపి ఏకనామం వలె పారాయణం చేయాలని కొందరు దైవజ్ఞుల అభిప్రాయం. ఇవి రెండూ విడివిడి నామ మంత్రములుగా చెప్పుట యనునది అనూచానంగా వస్తున్న (పరంపరగా ప్రాప్తమైన) ఆచారం. శ్రీశృంగేరీ పీఠాచారం కూడా ఇదియే. బాహువులు రెండింటిలో రెండు ఆయుధాలున్నాయని చెప్పుటయే బాగుంటుంది. క్రోధాకారాంకుశోజ్జ్వలా అన్న దానికి అన్వయం క్రోధమనే అంకుశం కలిగి ఉజ్జ్వలంగా ఉన్నది అని చెప్పుట కన్నా ఉజ్జ్వలమైన క్రోధమనే అంకుశం కలది అని చెప్పుట కూడా బాగుంటుంది - అమ్మ ధరించుట వలన ఆ అంకుశం ఉజ్జ్వలమైనది (మంచి ప్రకాశం పొందినది) అని భావం స్ఫురిస్తున్నది.
అమ్మవారి చేతిలోని పాశము రాగాత్మకమైతే, అంకుశము ద్వేషాత్మకమని కూడా చెప్పబడినది. భక్తి తత్త్వమనిన రాగము (ప్రేమ లేదా వాత్సల్యము), దాష్టీకమువలన ద్వేషము (క్రోధము) అమ్మవారి తత్త్వము.
రాగద్వేషములు తూర్పుపడమరలు అయితే కామక్రోధములు ఉత్తరదక్షిణములు. ఈ ద్వంద్వములు ఒకదానికి ఒకటి పొటీ. అవి అనుకూల ప్రతికూలములు.
సాధకుడు ధ్యానాన్ని సక్రమదిశలో కొనసాగించాలంటే, ఆ తల్లి తన క్రోధాకారాంకుశముతో హెచ్చరికలు చేస్తూ ఉంటుంది.
అమ్మవారి నాలుగు ఆయుధములకు నాలుగు బీజాక్షరములు గలవు. అం అనే బీజాక్షరము పాశమునకు, క్రోం అనే బీజాక్షరం అంకుశమునకు ,ఓం అనే బీజాక్షరం ధనుస్సునకు, క్లీం అనే బీజాక్షరం బాణమునకు చెప్పబడినవి.
జగదీశ్వరికి నమస్కరించునపుడు ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః అని యనవలెను
*****
శ్రీమాత్రేనమః శ్రీలలితా సహస్రనామ భాష్యము
10వ నామ మంత్రము
ఓం మనోరూపేక్షు కోదండాయై నమః
తన మనస్సేరూపముగాగల ఇక్షుచాపమును (చెఱకు గడ విల్లు) ఎడమ వైపు ఊర్ధ్వకరమున (పై చేతిలో) ధరించి విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి మనోరూపేక్షు కోదండా యను ఎనిమిదక్షరముల నామ మంత్రమును ఓం మనోరూపేక్షు కోదండాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ పరమేశ్వరి కరుణచే వారి సాధన సఫలీకృతమై సహస్రారమందాన్న చంద్రమండల అమృత ధారలచే డెబ్బదిరెండువేల నాడీమండలములు తడిసి ముద్దలై, జన్మ పునీతమై తరింతురు.
మనోరూపేక్షు కోదండా మనసనే చెఱకు కోదండమును అమ్మవారు ఎడమ ప్రక్క పై చేతిలో ధరించి యున్నది. మనస్సు అనునది సూక్ష్మము. ఇక్షుచాపము అనునది స్థూలరూపము. ఇక్షుచాపములోని మాధుర్యము కారణరూపము. ఆ పరమేశ్వరి తన మనస్సులోని మాధుర్యమును తీయని రసధారల ద్వారా అనుగ్రహించుటకై ఇక్షుచాపమును ధరించియున్నది.
అమ్మ మనసు ఎల్లప్పుడూ వెన్నవలె మెత్తనైనది. అమృతమువలె మధురమైనది. వెన్నెలవలె చల్లనైనది. అమ్మ అంటే కన్నతల్లి అనబడితే అనంతకోటి జీవరాసులను సృష్టించిన ఆ పరమేశ్వరి జగత్తుకే అమ్మ అనబడుతుంది.
'చెఱకును పుండ్రేక్షువు అని అంటారు. తెలుగులో నామాల చెఱకు అని అంటారు' అని భాస్కరరాయలువారు తమ సౌభాగ్యభాస్కరంలో వ్యాఖ్యానించారు. నామాల చెఱకు అంటే నామాలవలె తెల్లని గీటులు గలిగిన చెఱకు అని అర్థము.
జీవులకన్నిటికీ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అను పది ఇంద్రియములు ఉంటాయి.
జ్ఞానేంద్రియములు: 1. శ్రోత్రము, 2. చర్మము, 3. చక్షుస్సు, 4. జిహ్వ, 5. నాసిక.
కర్మేంద్రియములు 1. వాక్కు, 2. హస్తములు, 3. పాదములు, 4. పాయువు, 5. ఉపస్థ (జననేంద్రియము)
ఈ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు గాక మనసు అను పదకొండవ ఇంద్రియము మానవునికి ఉంటుంది. సంకల్ప వికల్పములకు కారణము ఈ మనసను ఇంద్రియమే. యుక్తము (తగినది/ధర్మం), అయుక్తము (తగనిది/అధర్మం) అను విచక్షణ ఈ మనసుకు ఉంటుంది. యుక్తాయుక్తవిచక్షణా జ్ఞానము తమ పూర్వజన్మల కర్మలవాసనల ననుసరించి ఉంటుంది.
అమ్మవారి చేతియందున్న విల్లు ఆ తల్లి మనసువంటిది. శిష్టులు, దుష్టులు అను వారిని అమ్మ సులువుగా తెలిసికొనే శక్తి ఆ ఇక్షుచాపమునకు ఉంటుంది. శిష్టునికి రక్షణ, వరములు అనుగ్రహించే ఆ మనసే దుష్టులను శిక్షించి సన్మార్గములో ఉంచే పని కూడా చేస్తుంది.
ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి అమ్మవారి మనసైతే, అమ్మవారి చేతియందున్న విల్లు క్రియాశక్తి.
అమ్మవారు చతుర్బాహువులు గలిగినదిగాను, చెఱకుగడ విల్లును కూడా ధరించిన విధానాన్ని మహాకళి కాళిదాసు ఇలా చెప్పారు.
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః జగదేకమాతః
అమ్మవారి భ్రూమధ్యమునకు ఇరువైపులా గల కనుబొమలు కుడా ధనుస్సులవలె ఉంటాయి. రెండు కనుబొమలకు మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుంది. యుక్తాయుక్త విచక్షణచేసే జ్ఞాననేత్రము ఆజ్ఞాచక్రమునందు ఉంటుంది. భ్రూమధ్యమున దృష్టి నిలిపి ధ్యానమునందు నిమగ్నత నందితేనే ఈ జ్ఞానచక్షువు తెరచుకొంటుంది. అప్పుడే యుక్తాయుక్త విచక్షణను యోచించేశక్తి కలుగుతుంది. ఈ ధ్యాన నిమగ్నత అనేది పూర్వజన్మ వాసనలననుసరించి ఉంటుంది. మనస్సు యొక్క నిశ్చలతకూడా పూర్వజన్మల కర్మఫలాన్ననుసరించే ఉంటుంది. ఆత్మ స్థూల దేహాన్ని వీడితే సూక్ష్మదేహంతో ప్రయాణిస్తుంది. ఆత్మ తనతోబాటు కర్మఫలాలనుకూడా మోసుకొని వెళుతుంది. స్వర్గనరకాలను చవిచూసిన తరువాత ఇంకోదేహంలో ఆ ఆత్మప్రవేశించి మరుజన్మ ఎత్తడం జరుగుతుంది. గతజన్మ చివరి కోరికలననుసరించి మరుజన్మ ఎత్తగా గత జన్మ కర్మఫలాలకు ఆ జన్మకర్మఫలాలుకూడా చేరుతాయి. మనస్సు అనే క్రియాశక్తి ధనుస్సుగా పనిచేసి కర్మలనాచరిస్తుంది. అట్టి కర్మలకంతటికీ సూత్రధారణ ఆ పరమాత్మదే. పరమేశ్వరి చేతిలోని ఇక్షుచాపమే ఆ తల్లి మనసు. ఇదంతా నిర్వహిస్తుంది ఆ ఇక్షుచాపమే గనుక ఆ పరమేశ్వరి మనోరూపేక్షుకోదండా యని అనబడినది.
ఓం మనోరూపేక్షు కోదండాయై నమః అను నామాన్ని జపిస్తే జీవితలక్ష్యం సాధించగల దృఢ సంకల్పం సిద్ధిస్తుంది. స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. కావున శ్రీమాత మనోరూపేక్షు కోదండాయ నమః అని స్తుతింప బడుతున్నది.
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ|
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః॥
(భగవద్గీత, 2.69)
సర్వ భూతములకు ఏది పగలో అది పండితునికి అజ్ఞానపు రాత్రి, మరియు సర్వ భూతములకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు.
ఇతరులకు వెలుగువలె భాసిల్లే భౌతిక విషయాలు జ్ఞానికి చీకటివలె అప్రియములైనవి. నిత్యానిత్య వస్తు వివేకముచే జన్మమును మాధుర్యమయ మొనర్చుకొని తరింపవలయునన్నచో మనోరూపేక్షు కోదండ గా పరాశక్తిని ఉపాసింపవలయును అని భావము.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ఐం హ్రీం శ్రీం మనోరూపేక్షు కోదండాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః శ్రీలలితా సహస్రనామ భాష్యము
11వ నామ మంత్రము
ఓం పంచతన్మాత్రా సాయకాయై నమః
పంచతన్మాత్రలను బాణాలుగా గల పరమేశ్వరికి నమస్కారము.
శ్రీ లలితా సహహ్రనామావళి యందలి పంచతన్మాత్ర సాయకా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం పంచతన్మాత్ర సాయకాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు సమస్త బాధలు తొలగిపోవును మరియు ఆ తల్లి కరుణాంతరంగ దృష్టులు ప్రాప్తించి శాశ్వతమైన బ్రహ్మానందము లభించి తరించుదురు.
శబ్ద స్పర్శ రూప రస గంధములు అనునవి జ్ఞానేంద్రియ విషయ పంచకము యొక్క సూక్ష్మాంశలు. ఇవియే పంచతన్మాత్రలు అనబడును. పరమేశ్వరి వీటిని బాణములుగా ధరించి యున్నది. పరమేశ్వరి ధనుస్సును దక్షిణోర్ధ్వకరమున బాణములను ధరించి ఉన్నది. బీజరూపములగు శబ్దాదులు రూప రహితములగుట అగోచరములు. దృశ్యప్రపంచ నిర్మాణమునకు స్థూలదేహ నిర్మాణార్ధము పంచభూత తన్మాత్రల పంచీకరణమొనర్చి తన కార్యసాధనకు ఉపయోగించు కొనుటచే పరమేశ్వరి పంచతన్మాత్త్రసాయకా యని అనబడినది.
సాయకములు:
స్థూలసూక్ష్మ కారణములు అను మూడురకములు, పుష్ప బాణములు స్థూలములు, బీజరూపములు సూక్ష్మములు. వాసనా రూపములు కారణములు.
పూర్వ గ్రంథముల లోని కొన్ని సాయక పంచకములు చెప్పబడుచున్నవి.
పంచతన్మాత్రసాయకా అనగా అయిదు తన్మాత్రలను బాణములుగా గలిగినది (పరమేశ్వరి). పంచతన్మాత్ర సాయకా వివిధరీతులలో చెప్పబడియున్నది.
కాదిమతే - పద్మము, రక్త కైరవము, కల్హారము, ఇందీవరము, చూతము అనునవి - ఈ ఐదు అమ్మ వారి బాణములు.
జ్ఞానార్ణవే – ద్రాం ద్రీం క్లీం బ్లూం సః అనునవి పంచ బాణేశ్వర బీజములు . క్షోభణము, ద్రావణము, ఆకర్షణము, వశ్యము, ఉన్మాదకరము అనునవి - ఈ ఐదు అమ్మ వారి బాణములు.
మంత్రరాజే– మదన, ఉన్మాదన, మోహన, దీపన, శోషణములు అనునవి - ఈ ఐదు అమ్మ వారి బాణములుగా చెప్పబడినవి.
కాళికా పురాణే - షణము, రోచనము, మోహనము, శోషణము, మారణమ. శ్రీం దాహక:, హ్రీం తేజో, క్లీం ఆకర్షణ, సం శబ్ద:, సౌః విద్యుచ్ఛక్తులను పెంచి ప్రణవ బీజములు బాణములుగా గలది యనియు తలంపనగును.
జీవజాలము యొక్క సుషుప్తి దశయందు ఆ వ్యక్తియొక్క బుద్ధీంద్రియ క్రియాకారణ రూపమున దాని ముఖ్య ప్రాణమున లయించియుండును. జీవులన్నియు సుషుప్తి దశయండు ఉచ్చ్వాస నిశ్వాసముల చేయుచుండును. ఇందు మనుజులు, గోవులు, పులులు. పిల్లులు . ఏనుగులు, ఎలుకలు మొదలగు ఎనుబది నాలుగు లక్షల జీవజాతుల యొక్క ఉచ్చ్వాస నిశ్వాసములను వైజ్ఞానిక దృష్ట్యా పరీక్షించిన ఒకే విధమున నుండవనుట సత్య దూరము కాదు. దీనికి కారణం ఆయావ్యక్తి బుద్దీంద్రియ వ్యాపారముల యొక్క వాసనయేయగును. సర్వ సాధారణముగా సుషుప్తికాలిక ప్రాణమునందు ఐదు భాగములు ఉండును. ఇవియే పంచ తన్మాత్రలు అనబడును. జీవుల క్రియా విశేషములన్నియు ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు ప్రాణములు, మనో-బుద్ది-చిత్త-అహంకారములు అనబడే పందొమ్మిది తత్వముల ద్వారా జరుగుచుండును. ఇది సర్వసాధారణము. ఇది సమిష్టి సూక్ష్మశరీరం అనబడును. సృష్టి యందలి జీవజాలమున అల్పము, అల్పాల్పములగు జీవులకు పందొమ్మిది అంగముల సూక్ష్మ శరీరము ఉండక పోవచ్చును. ఏవో ఒకటి లేదా రెండుతత్వములు మాత్రమే ఉండవచ్చును. ఈ పందొమ్మిది యందును మూల భూతములగు ఐదింటిని పంచ తన్మాత్రలు అందురు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అని వాని సంజ్ఞలు. వీనిలోని సత్వాంశలు వ్యష్టిగా జ్ఞానేంద్రియ పంచకం అనబడును. శ్రోత్ర, త్వక్, నేత్ర, రసన, ఘ్రాణములని వీని సంజ్ఞలు. ఈ సత్వాంశల సమిష్టియే అంత:కరణం అనబడుచున్నది. ఇందు కర్త్రుత్వాంశమనియు కరణత్వాంశమనియు రెండు అవాంతర భేదములు కలవు. పంచతన్మాత్రలయొక్క వ్యష్టి రాజసాంశలు వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ అను సంజ్ఞలు గల కర్మేంద్రియ పంచకమనబడును. ఈ ప్రాణము ఒకటిగానే తెలియబడినను మెరక నుండి పల్లమునకు దిగునపుడును, పల్లమునుండి మెరక కెక్కునపుడును, ఆహారమును జీర్ణించునపుడును – జాగ్రత్ నించి సుషుప్తి లోనికి – సుషుప్తి నించి జాగ్రత్ దశలను పొందునపుడు పంచవిధ కృత్యములు గలదై ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు అను సంజ్ఞలు కలిగిఉన్నది. ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు ఏక కాలికములు అయియుండియు భిన్నములుగా తెలియబడుచున్నవి. ఎట్లన, మనము సంగీతము వినుచున్న, అదే కాలమున ఇంకొకరు పాడుచుండుట సంభవింపవలయును. ఈ రెండు ఏకకాలికం అగునపుడే సంగీతము వినుట అన్నది సంభవించును. పాడువానిది కర్మేంద్రియ వ్యాపారము, వినువానిది జ్ఞానేంద్రియ వ్యాపారము. ఇట్లగుట సర్వ జన విదితము. పాడెడువాని కనువగు ప్రాణ భేదము పానం అనబడును. వినువాని ప్రాణభేదం అపానం అనబడును. ఈ రీతినే మిగిలిన ఇంద్రియవ్యాపారములకు వ్యాన, ఉదానమను ప్రాణభేదములు తెలియవగుచున్నవి. ఈ మొత్తానికీ కారణం పంచాతన్మాత్రలనబడును.
ఇవి జీవ సృష్టికి పూర్వమే ఉండియుండుట పంచభూతములను సార్ధక సంజ్ఞ కలిగిఉన్నవి. వీని సూచకములైన పంచ సాయకములను పరమేశ్వరి తన కుడిపై హస్తమున ధరించియుండి పంచతన్మాత్ర సాయకా అనబడుచున్నది. జీవి యొక్క పూర్వకృతకర్మ వాసనలన్నియు ఈ పంచతన్మాత్ర సాయక రూపమున ఉండును. జీవి కర్మానుభవ కాలమున పరమేశ్వరి ఎవరికర్మల ఫలములను వారికే యథాన్యాయముగా అనుభవింపచేయును. ఈ పంచ తన్మాత్ర నామము యొక్క భావార్ధము నెరింగి ఉపాసించువారు ముముక్షత్వమును పొందగలరు. ఈ చతుర్బాహు విధానమును భారతీయ విజ్ఞానానుసారము అవగాహన చేసికొనుటయే సాధనా చతుష్ఠయ సంపత్తి సంజ్ఞ గలది. దీని పరిణత దశయే ముముక్షత్వం అనే పరమ పురుషార్ధము. భారతీయ విద్య వలన కలుగునగు పరమ ప్రయోజనము.
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అను పంచతన్మాత్రలను బాణములుగా ధరించియున్నది జగన్మాత.
ముక్కు, నాలుక, చక్షురింద్రియము, త్వగింద్రియము, శ్రోత్రేంద్రియముల అను పంచ జ్ఞానేంద్రియముల ద్వారా పొందిన జ్ఞానశుద్ధికి తగినట్లుగా ఆత్మ జ్ఞాన లక్ష్యమునకు చేర్చునది ఆ పరమేశ్వరి.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం పంచతన్మాత్రసాయకాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
****
శ్రీమాత్రేనమఃశ్రీలలితా సహస్రనామ భాష్యము
12వ నామ మంత్రము
ఓం నిజారుణ ప్రభాపుర మజ్జద్బ్రహ్మాండ మండలాయై నమః
తన అరుణ (ఎర్రని) శరీర కాంతులతో నిండియున్న సమస్త బ్రహ్మాండ సముదాయములను కలగియున్న పరమేశ్వరికి నమస్కారము.
శ్రీ లలితా సహహ్రనామావళి యందలి నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రభాతమునందే, సాయం సంధ్యాసమయమునందు ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు అనంత బ్రహ్మాండ విజ్ఞాన సంపదలు , లౌకిక, ఆముష్మిక సుఖసంతోషములు ప్రాప్తించున.
అమ్మవారి సహస్రనామ స్తోత్ర పఠనము చేయునపుడు ఎట్టి పరిస్థితిలోనూ ఈ నామమును నిజారుణ ప్రభాపూరా అనియు మజ్జద్బ్రహ్మాండ మండలా అని విరిచి చదవకూడదు, అందువలన అర్థం మారుతుంది.
జగన్మాత శరీరము అరుణకాంతి స్వతహాగానే ఉన్నది. తాను సృజించిన బ్రహ్మాండము లన్నియును తన శరీరము యొక్క అరుణకాంతులతో ప్రకాశిస్తున్నవి. అమ్మవారి తాటంకములు సూర్యచంద్రులు. అమ్మవారి త్రినేత్రములు సూర్యచంద్రాగ్నులు. ఇడ, పింగళ, సుషుమ్న నాడుల అధిష్ఠాన దేవతలు కూడా చంద్రసూర్యాగ్నులే. ఆ విధంగా సూర్యచంద్రాగ్ని మండలములకు కాంతులు ఆ పరమేశ్వరి పాదముల నుండియే లభించి యున్నది. అలాగే చంద్రమండలమునకు శీతలత్వము, అమృత తత్త్వము సహస్రారము నందలి చంద్ర మండలము నుండే లభించియున్నది.
పృథ్వీ తత్త్వాత్మిక మూలాధార చక్రమున - పృథ్వీ అగ్ని జ్వాలలు ఏబది ఆరు (56), మణిపూర చక్రమున - ఉదక తత్త్వాత్మిక జ్వాలలు ఏబది రెండు (52) కలిపి నూట ఎనిమిది (108) అగ్ని జ్వాలలు. అట్లే స్వాధిష్టాన - అగ్ని తత్త్వాత్మిక కిరణములు అరువది రెండు (62), అనాహత చక్రమున - వాయు తత్త్వాత్మిక కిరణములు ఏబది నాలుగు (54) కలిపి నూటపదహారు (116) సూర్య కిరణములు. ఆకాశ తత్త్వాత్మకమగు (విశుద్ధ చక్రమున డెబ్బది రెండు ( 72), మనస్తత్త్వాత్మకమగు (ఆజ్ఞా చక్రమున అరువదినాలుగు (64) కలిసి నూటమప్పది ఆరు (136) చంద్రుని కళలు అగుచున్నవి. ఇవి మొత్తం మూడవందల అరువది (360) కిరణములు అగును. ఈ కిరణములన్నియును అమ్మవారి శరీర అరుణ కాంతుల (పాదముల) నుండి వెడలినవే.
ఏదైనా పదార్థము ప్రకాశించు చున్నది అంటే అది పరమేశ్వరియొక్క శరీర అరుణకాంతి ప్రభావము తక్క అన్యము గాదు. పగటి పూట సూర్యుని వెలుతురునకు, రాత్రిపూట చంద్రకిరణ లేదా నక్షత్రకాంతికి, సంధ్యా సమయములందు గల ఉష్ణమునకు కారణము ఆ పరమేశ్వరి యొక్క నిజారుణ ప్రభాజాలములే. ఆ తల్లి శరీరకాంతులకు సూర్యచంద్రులుగాని, నక్షత్రములుగాని, అగ్నిభట్టారకుడు గాని కానేకాదు. తిరిగి సూర్యచంద్రాగ్నులకు లభించే కాంతిసమూహములు ఆ పరమేశ్వరి శరీర అరుణకాంతులు మాత్రమే. సమస్త బ్రహ్మాండలములు ఆ పరమేశ్వరి శరీర అరుణ కాంతులచే ప్రభాసిల్లుతున్నవి గనుక, ఆ తల్లిని వశిన్యాది వాగ్దేవతలు
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా యని అన్నారు.
అంతటి అనంతకోటి సూర్యప్రభా తేజస్సులయందు బ్రహ్మాండములను ముంచిన పరాశక్తికి నమస్కరించునపుడు ఓం నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
****
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
13వ నామ మంత్రము
ఓం చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః
చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక పుష్పములచే అలంకృతమైన శిరోజ సంపదతో విరాజిల్లు శ్రీలలితా పరమేశ్వరికి నమస్కారము
శ్రీ లలితా సహహ్రనామావళి యందలి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు సమస్త బాధలు తొలగిపోవును మరియు ఆ తల్లి కరుణాంతరంగ దృష్టులు ప్రాప్తించి శాశ్వతమైన బ్రహ్మానందము లభించి తరించుదురు.
ఉద్యద్భాను సహస్రాభా అని అమ్మ ఆవిర్భావాన్ని సూర్యోదయంతో పోల్చి చెప్పబడిన వర్ణన, ఆ తల్లి శిరోజముల నుండి ప్రారంభించి పాదాంతముతో పూర్తవుతుంది. అదే మనం ప్రస్తుతం చేస్తున్నాము. ఆ పరమేశ్వరి చిదగ్ని కుండమునుండి ఉద్భవించినప్పుడు తొలుత శిరస్సు దర్శనమిచ్చినది. గనుక అమ్మవారి స్థూలరూపమును వర్ణించుట శిరస్సుతో ప్రారంభించుట యనునది వశిన్యాది వాగ్దేవతలచే సంభవించినది. శరీరాంగములలో ఉత్తమాంగము శిరస్సు యగుటచే అమ్మవారి స్థూలరూప సందర్శనము పాదాలనుండి కాకుండా శిరస్సుతో ప్రారంభముగా సాగినది. అంతేకాదు పంచదశీ మంత్రము అమ్మవారి సూక్ష్మశరీరము. పంచదశీ మంత్రమునకు వాగ్భవ, కామరాజ, శక్తి యను మూడుకూటములు గలవు. అమ్మవారి శిరస్సు వాగ్భవకూటముగా చెప్పబడినది. గనుక ఆ పరమేశ్వరి యొక్క స్థూలరూప కీర్తనము శిరస్సుతో ప్రారంభమయినది.
పరమేశ్వరి ఆవిర్భావము దేవతలందరి శక్తులతోను జరిగినది. ఆ పరమేశ్వరి సర్వావయవములు వివిధ దేవతల అంశలనుండియే వచ్చెను. ఆ తల్లి యొక్క సర్వాయుధములు సకలదేవతల ఆయుధములై యున్నవి.
కేశా స్తస్యా స్తథా స్నిగ్ధా యామ్యేన తేజసాభవన్
వక్రాగ్రా శ్చాతిదీరా వై మేఘవర్ణా మనోహరాః॥63॥ (దేవీ భాగవతం, పంచమస్కంధము, అష్టమోధ్యాయము)
ఆ దేవి కేశములు వంకీలుగా, సహజ పరిమళముతో అతి దీర్ఘముగా నున్నవి.. చిక్కగ నునుపుగ సుమనోహరముగ మేఘవర్ణముతో నొప్పుచున్నవి. ఆ శిరోజములు యముని తేజము నుండి సంభవించినవి.
పరమేశ్వరి ఆ శిరోజములలో చంపక, అశోక, పున్నాగ, చంగల్వలను ధరించియున్నది. అమ్మవారి కేశసంపదయొక్క సహజపరిమళములచే, ఆ తల్లి ధరించిన ఆయా కుసుమములకు ఆయా పరిమళమలు లభించినవి. అంతేకాని అమ్మవారి తలలోని పుష్పముల వలన అమ్మ వారి శిరోజములకు సుగంధములు అబ్బలేదు.
ఈ పదహారక్షరముల నామ మంత్రములో లో అమ్మవారి శిరోజములు పుష్పములవలె అతి మృదువుగా ఉంటాయని వశిన్యాది వాగ్దేవతలు చెప్పారు. అంతేనా! ఆ సుమ సౌరభము, సంపంగి, అశోక, పున్నాగ పుష్పసౌరభాన్ని సహితం ధిక్కరిస్తున్నట్లనిపిస్తోంది. పుష్పములకు సుగంధమెంత సహజమో శ్రీమాత శిరోజములకు కూడా సుగంధము సహజమై ఒప్పారుచున్నది. జగన్మాత కదా, సృష్టియంతయు అనగా ఖనిజ, వృక్ష, జంతు, మానవులు - ఈ సృష్టి యంతయూ జగన్మాత నిర్వహణయేకదా, అందుచేత చంపకాశోకపున్నాగాదిపుష్పసమూహములు జగన్మాత శిరోజ సుగంధాన్ని పొంది, తాముకూడా జగన్మాత శిరోజములవలె సుగంధభరితము కావాలని, జగన్మాత వేణీబంధంలో చేరాలని కోరుకున్నాయని ఆదిశంకరాచార్యులు ఇలా అన్నారట
శ్లో.ధునోతు ధ్వాంతం న స్తులితదలితేందీవరవనమ్
ఘనస్నిగ్ధంశ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివేl|
యదీయం సౌరభ్యం సహజ ముపలబ్ధుం సుమనసో
వసంత్యస్మిన్మన్యే బలమథన వాటీ విటపినామ్ ll
తా: అమ్మా ! అప్పుడే వికసించిన నల్లకలువలను, నల్లని మేఘముల వలె దట్టముగా ఉండి సుకుమారమయి ఉన్న నీ కేశముల ముడి మా అజ్ఞానము అనబడు చీకటిని పారద్రోలును. వాటినుండి వెలువడు సువాసనలను పీల్చుటకు బలుడు అను రాక్షసుని చంపిన ఇంద్రుని కల్పవృక్షముల యొక్క పూలు వాటిని ఆశ్రయించును కదా !
అనగి ఇంద్రుని ఉద్యానవనములోని కల్పవృక్ష పుష్పములు జగన్మాత శిరోజములముడిలో తురమబడుటకు తహతహలాడుచున్నవని భావము.
చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా యను ఈ నామంఫై కొందరు కవుల చమత్కారము
నానాసూన వితానవాసనల నానందించు సారంగ మేలా నన్నొల్ల దఁటంచు గంధఫలి బల్కాలం దపం బంది యోషా నాసాకృతిఁ దాల్చి సర్వసుమనస్సౌరభ్యసంవాసి యైపూనెం బ్రేక్షణమాలికా మధుకర పుంజంబు లిర్వంకలన్
తుమ్మెదలు సంపెంగ పువ్వు మీద వాలవు. ఎందుకంటే ఆ ఘాటు తట్టుకోలేవు. సంపెంగ పువ్వు తన మీద తుమ్మెదలు వాలటంలేదని బాధపడి తపస్సు చేసిందిట, ఆ తపస్సుకి ఫలితంగా ఎప్పుడూ తుమ్మెదలను (నల్ల తుమ్మెదలను) తనతో కట్టిపరేసుకొనేలా పార్వతీ దేవి ముక్కుగా మారిందిట! (అంటే ఆవిడ ముక్కు సంపెంగి పువ్వైతే, కళ్ళు తుమ్మెదలన్న మాట) ఈ వర్ణన అక్కడితో ఆగలేదు. ఆవిడ మోము చంద్రబింబంలా ఉంటే చీకటి భయపడి ఆవిడ వెనక్కి చేరింది, నక్షత్రాలు తమ భర్తని తమకిమ్మని ఆవిడ(పార్వతీదేవి) కాళ్ళ మీద పడ్దాయట. ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ వర్ణన. ఈ పద్యం వసుచరిత్రలోనిది, వ్రాసినది ముక్కుతిమ్మన. ఈయన అసలు పేరు నంది తిమ్మన. ఈ పద్యం లో ఆయన , నాయిక పార్వతిదేవి ముక్కును వర్ణించినందు వలన ఆయనకు ముక్కు అన్న బిరుదు తగిలించారన్న ప్రచారం కూడా ఉన్నది. ఈ పద్యాన్ని రామరాజభూషణుడు నాలుగు వేల వరహాలిచ్చి కొనుకున్నాడన్న ప్రచారమూ ఉంది. కానీ రామరాజు భూషణుడికి ఇంకొకరి పద్యాలు సంగ్రహించేటటువంటి అవసరం లేదని కొంతమంది విజ్ఞులు అంటూ ఉంటారు. ఇది కవులను గూర్చి మనవారు కల్పించే కల్పనాకథ మాత్రమే. అయినా నంది తిమ్మన, రామరాజభూషణుడు సమకాలికులు కారు. ఒకవేళ సమకాలికులు అయినా వసుచరిత్ర అంతటి కావ్యం రాయగల వానికి ముక్కుపై ఇంత కల్పన చేయలేకపోయాడనడం పరిహాసాస్పదం అని వీరేశలింగంగారు అన్నారు. ఏది ఏమైతే మనకెందుకు? పద్యం సంపెంగ పువ్వంత సువాసనతో కూడుకొని ఉంది. ఇంతకీ ఆవిడ (పార్వతీదేవి ) ముక్కు ఏ సంపెంగతో పోల్చారని. ఎందుకంటే సంపెంగలు "బుట్ట సంపెంగ, ఆకు సంపెంగ, సింహాచలం సంపెంగ, కోడుగుడ్డు సంపెంగ అని ఉన్నాయి. అందుకు *సింహాచలం సంపెంగలా ఉండే తెల్లటి సంపెంగతో ఆవిడ ముక్కుని పోల్చరని అనుకోవచ్చు. .ఈ సింహాచలం సంపెంగకు చంపకము, చనుపకము, చాంపేయము, దీపపుష్పము, పచంపచము, పీతపుష్పము, భ్రమరాతిథి, సంపంగె, సంపెంగ, సురభి, స్థిరగంధము, స్థిరపుష్పము, హేమపుష్పము " అన్న పేర్లు ఉన్నాయి. ఏ స్త్రీయైనా శిరోజాలకు మంచి సువాసన కలగాలని కొప్పులో పూలు తురుముకుంటుంది, కానీ అమ్మవారి కొప్పులో పూలు మాత్రం ఆవిడ శిరోజాల వాసన గ్రహించడానికి చేరుకున్నాయిట.
స్థూలంగా ఈ నామ మంత్రమునకు ఈ విధముగా భావము గలదని గ్రహించవచ్చును:-
1) జగదీశ్వరి సంపంగి, అశోక, పున్నాగ, చంగల్వ పుష్పముల సుగంధము కలిగిన శిరోజములు కలిగినది.
2. చంపకాశోక పున్నాగసౌగంధికాది పుష్పసముదాయములకు సుగంధము ప్రసాదించునది జగన్మాత శిరోజ సంపదయే
3. ప్రధాన వర్ణములైన ఎఱుపు, ఆకుపచ్చ, నీలం రంగులు కలిగిన పుష్పములను ధరించిన కేశ సంపద జగన్మాతకు గలదు
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం చంపకాశోకపున్నాగ సౌగంధికలసత్కచాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
****
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
14వ నామ మంత్రము
ఓం కురువిందమణి శ్రేణీ కనత్కోటీర మండితాయై నమః
కురువింద (పద్మరాగ) మణులతో ప్రకాశించే కిరీటంతో విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.
కామము, అనురాగము మొదలైన బహుగుణములు గలిగినవి కురువిందమణులు. వీటిని పద్మరాగమణులు అనియు కూడా అందురు. ఇవి ఎర్రగా ఉండును. రావణగంగ అను ఒకనదిలో పుట్టిన ఉత్తమమైనవి ఈ పద్మరాగములు. రావణగంగ అను ఆ నదిలో సౌగంధికములు, కురువిందములు, స్ఫటికములు అను మూడు విధములగు శిలలు గలవని చెప్పారు. ఈ మూడు శిలలలో పద్మరాగములు మేలైనవి. ఈ మణులు బంధూకము అనగా మంకెనపువ్వు, ఇంద్రగోపము అనగా ఆరుద్రపురుగు, మందార పుష్పము, దాసాని పువ్వు, రక్తవర్ణము, దానిమ్మగింజ - వీటిరంగులో ఉండి ప్రకాశిస్తూ ఉంటాయి. కొన్ని మోదుగ పువ్వు రంగులో కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. రావణగంగ అను నదిలో గల కురువింద పాషాణమల నడుమనుండి పుట్టిన పద్మరాగ మణులు మేలైనవి. ఈ కురువిందమణులు కామాను రాగములను పుట్టించును. అటువంటి పద్మరాగమణులచే (కురువిందమణులచే) ప్రకాశించు కిరీటమును ధరించిన పరమేశ్వరి కురువిందమణి శ్రేణీ కనత్కోటీరమండితా యని అనబడినది.
అమ్మవారు కురువింద మణిశ్రేణీ అనగా పద్మరాగమణులు వరుసగా (పొదగబడాటచే), కనత్ అనగా ప్రకాశించు, కోటీర అనగా కీరీటము (తో) మండితా అనగా అలంకరింపబడినది.
ఆజ్ఞాచక్రములో అనగా కూటస్థములో క్రియాయోగ ధ్యానపరునికి కురువిందమణి కాంతులతో మహా ప్రకాశరూపములో ఆ తల్లి దర్శనములభించుట అనుభవైకవేద్యము.
శంకరాచార్యులవారు అమ్మవారి కిరీటాన్ని తమ సౌందర్యలహరిలో నలుబది రెండవ శ్లోకంలో ఇలా వర్ణించారు:
గతైర్మాణిక్యత్వం - గగనమణిభిః సాంద్రఘటితమ్|
కిరీటం తే హైమం - హిమగిరిసుతే కీతయతి యః|
స నీడేయచ్ఛాయా - చ్ఛురణపటలం చంద్రశకలమ్|
ధనుః శౌనాసీరం - కిమితి న నిబధ్నాతి ధిషణామ్॥42॥
అమ్మా! ఓ లలితాంబా! ద్వాదశాదిత్యులే ఎర్రని రత్నములు కాగా ఆ రత్నములు పొదగబడిన నీ కిరీటం ద్వాదశాదిత్యులకు ఆశ్రయమిచ్చిన గూడులా, అచ్చట ఉన్న చంద్రవంక ఈ కిరీటంలో పొదగబడిన రత్నాల కాంతులు పడుటచేత చంద్రశకలంలా కాక సప్తవర్ణాలతో భాసిల్లు ఇంద్రధనుస్సులా కనబడుతూ, ఒక్కసారిగా ఆకాశంలో ఇంద్రధనుస్సుతో కూడిన పండ్రెండు మంది సూర్యులు ఉదయించి నట్లుగా నీ కిరీటం శోభిల్లుతున్నది.
ద్వాదశాదిత్యులు వీరే:- (ధాత, అర్యమ్న, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వంత, త్వష్ట, విష్ణు, అంశుమంత, భగ, పూష, క్రతు) వీరు ద్వాదశాదిత్యులు. ఈ ద్వాదశాదిత్యులకు అమ్మ కిరీటం గూడుగా ఆశ్రయమైనది అని శ్రీ ఆదిశంకరుల చమత్కార భావన. ఇది నిజముగానే మనం భావింపవచ్చు ఎందుచేతననగా సూర్యుడు మండే గుణం కలవాడు కనుక అతనికి ఎవ్వరూ ఆశ్రయమివ్వ సమర్దులుకారు. ఈయన ఎవరిని ఆశ్రయ మడిగినా నీ వేడికి మా కొంపలు తగులబడి పోతాయని, మావల్ల కాదని నిర్మొహమాటంగా చెబుతున్నారు. ఈయన అవస్త గమనించి అమ్మ జాలిపడి తన కిరీటమందు ఆ ద్వాదశాదిత్యులకు ఆశ్రయమిచ్చింది. సూర్యునిలో అని ఆ తీక్షణ ప్రకాశకశక్తి, చంద్రునిలోని ఆ శీతల జ్యోత్స్న ప్రకాశకశక్తి, నీటిలో ప్రవాహక శక్తి, అగ్నిలో దాహకశక్తి ఇలా అన్నీ అందరికీ అమ్మ ఇచ్చినవే. అందువల్ల తనే ఇచ్చిన ఆ ఉష్ణము భరించుట అమ్మకు ఇబ్బంది ఏమీ కాదుకదా! అలా ఆశ్రయం పొంది అమ్మ కిరీటం లో చేరిన ఆ సూర్యులు కిరీటంలో పొదగబడిన ఎర్రటి కురువిందమణుల్లా ప్రకాశిస్తున్నారు.
కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండితా అని యనగా కురువింద మణులు వరుసగా పొదగబడిన కిరీటంతో అమ్మ శోభిల్లుతున్నదని అర్ధం. ఇది అత్యంత రమణీయమైన అమ్మ కిరీట వర్ణన.
ఓ జగన్మాతా! నీ మాణిక్య కిరీట కాంతుల సౌందర్యం అనుపమానమమ్మా! నీ మహిమాన్విత కిరీటమంతటా సూర్యకాంతమణులు పొదగబడి జిగేలున మెరసే ఆ కాంతులు నయనానందకరంగా ఉన్నాయి తల్లీ! నీకు శిరోభూషణమై స్వఛ్ఛస్ఫటికంలా భాసించే నెలవంకపై ఆ మాణిక్య కాంతులు ప్రతిఫలించి చూపరులకు ఇంద్రధనస్సుగా కనిపిస్తున్నదమ్మా ఓ జగదీశ్వరీ!
పద్మరాగమణులచే ప్రకాశించుచున్న కిరీటము ధరించియున్న అమ్మవారికి నమస్కరించునపుడు ఓం కురువిందమణిశ్రేణీ కనత్కటోర మండితాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
15వ నామ మంత్రము
ఓం అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభితాయై నమః
అష్టమి తిథినాటి చంద్రుని మాదిరిగా ప్రకాశించే లలాట ప్రదేశంగల పరమేశ్వరికి నమస్కారము.
శ్రీ లలితా సహహ్రనామావళి యందలి అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభితాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ జగన్మాతను ఆరాధించు భక్తులు సమస్త దురితయ క్షయమును పొందుదురు. మరియు భౌతిక మరియు ఆధ్యాత్మిక శుభములను పొంది తరించుదురు.
చంద్రకళలు పదహారు. పాడ్యమి నుండి పౌర్ణమి లేదా అమావాస్య వరకూ పదిహేను కళలు. పదహారవ కళ సచ్చిదానందస్వరూపిణియైన ఆ పరమేశ్వరి. అలాగే పదిహేను తిథులకు పదిహేను మంది దేవతలు గలరు. వారినే నిత్యాదేవతలు, లేదా తిథినిత్యలు అందురు. వారు:
కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండా, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతీ, త్వరితా, కులసుందరీ, నిత్యా, నీలపతాకా, విజయ, సర్వమంగళ, జ్వాలామాలినీ, విచిత్ర, మహానిత్య వీరందరూ మహానిత్య అయిన లలితాంగికి అంగములుగా భాసిల్లుదురు.
ఈ నిత్యలను వామకేశ్వరతంత్రంలోని ఖడ్గమాలలో కూడా ప్రస్తావించడం జరిగినది. ఈ నిత్యలు కళల రూపంలో ఉన్నారు గనుకనే చంద్రునికి వృద్ధిక్షయములు ఏర్పడినవి. ఒక నిత్యకు ఒకటే కళ వుంటుంది. శుక్లపక్షంలోని పాడ్యమినాడు కామేశ్వరికి గల కళ బహుళపక్షంలో అమావాస్యనాడు ఉండును. అనగా అమావాస్య నాడు, శుక్లపక్షములోని పాడ్యమినాడు మనకు చంద్రవంక కనబడదు.
శ్రీలలితాంబిక కురువింద మణిశ్రేణులతో కూడిన కిరీటమును ధరించి యుండుటచే అమ్మవారి ఫాలభాగము అష్టమినాటి చంద్రుని వలె శోభిల్లుతున్నది. విశేషమేమంటే శుక్లపక్షంలో చంద్రకళలు వృద్ధిపొంది అష్టమినాటికి చంద్రబింబము అర్ధచంద్రాకారమై ఒప్పుతుంది. అలాగే బహుళ పాడ్యమి నుండి బహుళ అష్టమి వరకూ చంద్రకళలు తగ్గుతో అష్టమినాటికి అదే చంద్రబింబము అర్ధచంద్రాకారము గానే ఉంటుంది. అష్టమినాటి వెన్నెల రెండుపక్షములందును ఒకే విధముగా ఉంటుంది. అందుకే అష్టమినాటి చంద్రుడు సమచంద్రుడు అనికూడా అంటారు.
బహుళపక్షములో పాడ్యమినాటి నిత్యాదేవత చిత్రా అయితే పూర్ణిమనాటి నిత్యాదేవతకూడా చిత్రా అవుతుంది. ఆనాటి చంద్రకళ ఊహిస్తే మనకు తెలుస్తుంది. అలాగే శుక్లపక్షమి పాడ్యమి నాటి నిత్యాదేవత, అమావాస్య నాటి నిత్యాదేవతకూడా ఒకే కళలో ఉంటారు. కాని శుక్లపక్షములోని అష్టమినాటి నిత్యాదేవత త్వరితా అనబడితే బహుళపక్షంలో అష్టమి నాటి నిత్యాదేవతకూడా త్వరితా ఉండడం సంభవిస్తుంది. అనగా ఏపక్షంలోనైనా చంద్రునికళ ఒకలాగే ఉంటుంది. అదే త్వరితకళ అనబడుతుంది. అది ఈ క్రింది పట్టికలో గమనించవచ్చును.
నిత్యాదేవతను బట్టి చంద్రకళలు ఉంటాయి.
శుక్ల పక్షము
1. పాడ్యమి - కామేశ్వరి
2. విదియ - భగమాలిని
3. తదియ - నిత్యక్లిన్నా
4. చవితి - భేరుండా
5. పంచమి - వహ్నివాసినీ
6. షష్టి - మహావజ్రేశ్వరీ
7. సప్తమి - శివదూతీ
8. అష్టమి - త్వరతా
9. నవమి - కులసుందరీ
10. దశమి - నిత్యా
11. ఏకాదశి - నీలపతాకా
12. ద్వాదశి - విజయ
13. త్రయోదశి-సర్వమంగళా
14. చతుర్దశి - జ్వాలామాలిని
15. పూర్ణిమ - చిత్రా
కృష్ణ పక్షము
1. పాడ్యమి - చిత్రా
2. విదియ - జ్వాలామాలిని
3. తదియ - సర్వమంగళా
4. చవితి - విజయా
5. పంచమి - నీలపతాకా
6. షష్టి - నిత్యా
7. సప్తమి - కులసుందరీ
8. అష్టమి - త్వరితా
9. నవమి - శివదూతీ
10. దశమి - మహావజ్రేశ్వరి
11. ఏకాదశి - వహ్నివాసిని
12. ద్వాదశి - భేరుండా
13. త్రయోదశి-నిత్యక్లిన్నా
14. చతుర్దశి - భగమాలిని
15. అమావాస్య - కామేశ్వరీ
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే శుక్లపక్షము నందలి నిత్యాదేవతలు పాడ్యమి నుండి పౌర్ణమి వరకు అనులోమక్రమం అనగా పాడ్యమి నాడు కామేశ్వరి నుండి పౌర్ణమి నాడు చిత్రగా గమనిస్తే, కృష్ణపక్షంలో విలోమము అనగా పౌర్ణమి నాటి నిత్యాదేవత చిత్ర కాగా కృష్ణపక్ష పాడ్యమికి కూడా నిత్యాదేవత చిత్రతో ప్రారంభమై విలోమక్రమంలో అమావాస్యనాటికి నిత్యాదేవత కామేశ్వరి అవుతుంది. ఇది చంద్రకళల క్రమంలో ఏర్పడింది. కాని శుక్లపక్షమునందు, కృష్ణ పక్షము నందు అష్టమి నాటి నిత్యాదేవత త్వరితా అగును. అంటే అష్టమీచంద్రవిభ్రాజదళకస్థల శోభితా అను నామ మంత్రములో వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అష్టమి చంద్రుడు శుక్లపక్షమైనా, కృష్ణపక్షమైనా ఒకే విధముగా ఉంటాడు అంటే అంతటి అష్టమి చంద్ర శోభతో జగన్మాత ఫాలభాగము శోభాయమానమై ఉన్నదని వశిన్యాది దేవతలు చెప్పారంటే అమ్మను వారు తిలకించియున్నారు గదా!
ఈ పదిహేను నిత్యలలో - శుక్లపక్షములో ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుంది. కృష్ణపక్షములో ఒక్కొక్క కళ తగ్గుతూ ఉన్న మూలభూతమైన కళను మహానిత్యయని అందురు. దీనినే లలితకళ, ఆద్యకళ, చిత్కళ, సంవిత్కళ అని అంటారు. ఈ మహానిత్య లలితాంగిగా ఉన్నందున మిగతా కళలు నిత్యల యందు అంగభాగములుగా ఉండును.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభితాయై నమః అని అనవలెను. ఈ నామ మంత్రమును రెండుగా విరచి చదువరాదు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹
శ్రీమాత్రేనమః శ్రీలలితా సహస్రనామ భాష్యము
16వ నామ మంత్రము
ఓం ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకాయై నమః
ముఖమనెడి చంద్రుని యందు మచ్చ (కళంకము) వంటి కస్తూరి తిలకమును కలిగిన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీ లలితా సహహ్ర నామావళి యందలి ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు సమస్త బాధలు తొలగిపోవును మరియు ఆ తల్లి కరుణాంతరంగ దృష్టులు ప్రాప్తించి శాశ్వతమైన ఆత్మానందము లభించి తరించుదురు.
ఆ పరమేశ్వరి లలాటము అష్టమీ చంద్రుని శోభతో తేజరిల్లుచున్నది. అటువంటి ముఖమనెడి చంద్రబింబమందు ఆ పరమేశ్వరి ధరించిన కస్తూరి తిలకము చంద్రునిలోని మచ్చవలె కనిపించుచున్నది.
ఆ కస్తూరి తిలకము మృగనాభి విశేషమై ఒప్పారుచున్నది. కస్తూరి - మగ కస్తూరి జింక యొక్క ఉదరము, పురుషాంగాల మధ్యన ఉండే ఒక ప్రత్యేక గ్రంధి నుండి వెలువడే తీవ్రమైన పరిమళము. ప్రాచీన కాలము నుండి దీనిని ప్రసిద్ధ సుగంధ పరిమళముగా ఉపయోగిస్తున్నారు. అత్యంత ఖరీదైన జంతు ఉత్పత్తులలో కస్తూరి ఒకటి.
అమ్మవారి నుదుటన ఉన్న కస్తూరీ తిలకము అమ్మవారి ముఖచంద్ర బింబమునకు శోభనిచ్చుటయేగాక, చక్కని కస్తూరీ పరిమళమును చిందించుచున్నది.
శ్రీలలితా సహస్ర నామస్తోత్ర ప్రారంభంలో కస్తూరీ తిలకము యొక్క ప్రస్తావన జరిగినది.
సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికామ్
సమందహసితేక్షేణాం సశరచాప పాశాంకుశామ్
ఆశేషజనమోహినీ మరుణ మాల్యభూషాంబరామ్
జపాకుసుమభసురాం జపవిధౌస్మరేదంబికామ్॥
అను ధ్యానశ్లోకం మనం పఠిస్తూ ఉంటాము. ఆ శ్లోకానికి అర్థం ఇలా ఉన్నది:-
పాదం నుండి తలవరకూ కుంకుమ లేపనముతో, కనుబొమల మధ్య కస్తూరీ తిలకమును ధరించి, చిరునవ్వు చిందిస్తూ, చేతులలో బాణము, ధనుస్సు, పాశాంకుశాలను ధరించి, సమస్త జనులను మోహింపజేస్తూ, ఎర్రని మాలికలతో, అలంకారాలతో, శ్రేష్ఠమైన వస్త్రాలతో, ఎర్రని పుష్పం మాదిరిగా ప్రకాశిస్తున్నట్టి అంబికను ధ్యానించుదాము.
చంద్రుడు షోడశకళాప్రపూర్ణుడు. అమ్మవారి లలాటము అష్టమీ చంద్రసమాభాసము. అంటే అమ్మవారికి గల ఆ (చంద్రునివంటి) షోషడశకళలు, ఆ తల్లి షోడశాక్షరీ మంత్రముతో సమానము. శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరి యందలి నలుబది నాలుగవ (44వ) శ్లోకంలో ఆ పరమేశ్వరిని ఇలా వర్ణించారు:-
తనోతు క్షేమం న-స్తవ వదనసౌందర్యలహరీ|
పరీవాహస్రోతః-సరణిరివ సీమంతసరణిః|
వహంతీ సిందూరం - ప్రబల కబరీభార తిమిర|
ద్విషాం బృందైర్బందీ - కృతమివ - నవీనార్క కిరణమ్॥44॥
ఆ పరమేశ్వరి పాపట నడుమనున్న సిందూరము ప్రభాతసూర్య బింబమువలె ఉన్నది.
ఓ జగదీశ్వరీ! సూర్యుని బయటకు రాకుండా ఆపుతూ సూర్యకాంతిని బంధించిన చీకట్లవలె నీ జుట్టు దట్టంగా వంకీలు తిరిగి ఉంటుంది. ఆ చీకట్లు తొలగించి సూర్యుని రక్షించడానికా అన్నట్లు ఉధృతంగా పొంగి పొరలు నీ ముఖసౌందర్య ప్రవాహమునుండి విడివడి వచ్చిన ఒక నీటిపాయలా నీ పాపట ప్రకాశిస్తూ ఆ జుట్టును రెండు పాయలుగా విభజించు చున్నది. అలా జుట్టును రెండుగా విడదీయుట వలన చీకట్లనుండి విడిపింపబడి అప్పుడే ఉదయిస్తున్న బాలసూర్యునిలా నీ పాపిటిలోని సిందూరం భాసిల్లుచున్నది. (పాపటి యందు సిందూర ధారణ సుమంగళి సంప్రదాయం. అది సౌభాగ్య లక్షణం). అలా సిందూర వెలుగులతో సౌభాగ్య వర్ధనంగా ప్రకాశిస్తున్న నీ పాపట, మా యోగక్షేమం వహిస్తూ మమ్ములను రక్షించు గాక.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
17వ నామ మంత్రము
ఓం వదసస్మరమాంగల్య గృహతోరణ చిల్లికాయై నమః
మన్మథుని మంగళ గృహమును బోలిన వదనానికి, గృహ తోరణాల మాదిరిగా ప్రకాశిస్తున్న కనుబొమలు గల తల్లికి నమస్కారము.
శ్రీ లలితా సహస్ర నామావళి యందలి వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ జగన్మాతను ఉపాసించు ఉపాసకులకు చిత్తైకాగ్రతయు, ఆత్మానుభూతియు లభించును.
మన్మథుడంటేనే చాలా అందమైన వాడు. అటువంటి అందగాని గృహము ఎంతటి శోభాయమానముగా ఉంటుందో చెప్పవలెనా! అంతటి శోభాయమానమైన గృహమునకు గల బాహ్యద్వారము మరింత శోభాయమానమైతే అటువంటి ద్వారమునకు తోరణమై విరాజిల్లుచున్నవి ఆ జగన్మాత కనుబొమలు.
ఇదే భావాన్ని మరింత అందమైన భావంతో ఆదిశంకరులు సౌందర్యలహరియందు నలుబది ఏడవ శ్లోకములో వర్ణించినవిధము గమనిద్దాము
ఆది శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో నలుబది ఏడవ శ్లోకములో అమ్మవారి కనుబొమలనుఇలా వర్ణించారు.
భ్రువౌ భుగ్నే కించిద్భువన-భయ-భంగవ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం మధుకర-రుచిభ్యాం ధృతగుణమ్|
ధను ర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతేః|
ప్రకోష్టే ముష్టౌ చ స్థగయతే నిగూఢాంతర-ముమే॥
పై శ్లోకమందు వ్యక్తీకరింపబడిన భావము
జగన్మాతా, జగములను రక్షించు తల్లీ నీవు త్రిపురసుందరివి. అందమైన ఆ ముఖమందు ,కనుబొమల తీరు వర్ణింప నా వశముగాదు. కొద్దిగా ధనుస్సు ఆకారములో కొద్దిగా వంపుగా వంగియున్న కనుబొమల తీరు తుమ్మెదల శోభను గలిగి, అడ్డముగా వరుసలో నున్న ఆ నేత్రద్వయము వింటినారిగా గలిగి మన్మథుని చేతి పిడికిలి నడుమి భాగములో పట్టుబడుటచే కనబడకుండా నున్న వింటినారి యొక్క కొంత భాగమును మరియు దండభాగమును విల్లు అనిపించుచున్నది. ఆ కనుబొమల శోభ వర్ణనాతీతము తల్లీ.
అమ్మవారి ముఖము మంగళప్రదమైన మన్మథ గృహముతో పోల్చబడినది. నిశ్చయంగా ఆ ముఖము కామేశ్వరీ కామేశ్వరుల శోభాయమానమైన గృహమే. అంతటి శోభతో విరాజిల్లు మన్మథమంగళ గృహము వంటి ఆ తల్లి వదనమునందు గల ఆ తల్లి కనుబొమలు మన్మథుని శోభాయమానమైన మంగళగృహమునకు మంగళతోరణములై భాసిల్లుచున్నవి. ఆ పరమేశ్వరి ముఖము మన్మథమంగళ గృహలక్షణములు గలిగియుండుటచే ఆ తల్లి కనుబొమ్మలు తోరణలక్షణములు వివరించబడినవి.
పరమేశ్వరి ఆవిర్భావనము ప్రాతఃస్సంధ్య, సాయంసంధ్యల వలన ఆ పరమేశ్వరి కనుబొమలు ఏర్పడినవి.
వక్రే స్నిగ్ధే కృష్ణవర్ణే సంధ్యయోస్తేజసా భ్రువౌ|
జాతే దేవ్యాః సుతేజస్కే కామస్య ధనుషీ వ తే॥65॥ (దేవీ భాగవతము, పంచమస్కంధము, అష్టమోధ్యాయము)
ఆ దేవి కనుబొమలు వంపులు తిరిగి కోమలములై మరుని చాపములను తలపించుచున్నది. అవి నీలవర్ణము గలవి. సంజకెంజాయలనుండి యేర్పడినవి.
చిల్లిక అంటే కనుబొమల మధ్య భాగాలు. అక్కడ ఉండే కస్తూరీ తిలకము రెండు తోరణముల సంధి భాగమున ఉండే ప్రత్యేకమైన అలంకారమై ఒప్పుచున్నది.
వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అను వారలు వశిన్యాది వాగ్దేవతలు. అమ్మవారినుండి వెడలిన తెల్లని కిరణములే ఈ వశిన్యాదులు. సాక్షాత్తు ఆ పరమేశ్వరినుండి వెలికి వచ్చిన బ్రహ్మజ్ఞాన స్వరూపిణులు. అంతటి జ్ఞానసంపన్నులగుటచే ఈ వదనస్మరమాంగల్యగృహతోరణ చిల్లికా యను ఈ నామమునందు ఐం, క్లీం, సౌః శ్రీం, హ్రీం అను పంచప్రణవములను నిక్షేపించారు. అది ఎలాగంటే అమ్మవారి వదనము పంచదశీ మంత్రంలోని వాగ్భవకూటము. గనుక
వదన - వాగ్భవబీజం - ఐం అను బీజాక్షరము.
స్మర అనగా మన్మథుడు - మన్మథబీజం - క్లీం అను బీజాక్షరము.
మాంగళ్య సౌభాగ్యబీజం - సౌః అను బీజాక్షరము
గృహ* - సంపత్కరము, శోభస్కరము - శ్రీం అను బీజాక్షరము.
తోరణ - హృల్లేఖ - హ్రీం అను బీజాక్షరము.
పై పంచప్రణవములు, నామమును అనుసంధానం చేసి గమనిస్తే ఐం క్లీం సౌః అను బీజాక్షరములు అమ్మవారి వదనమును చెపితే, శ్రీం హ్రీం అను ఈ రెండు బీజాక్షరములు ఆ పరమేశ్వరి కనుబొమలు.
ఆ పరమేశ్వరి కనుబొమలను శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు, నలుబది ఏడవ శ్లోకంలో వర్ణించారు. అది ఎలాగంటే-
భ్రువౌ భుగ్నే కించి - ద్భువనభయభజ్గవ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం - మధుకరరుచిభ్యాం ధృతగుణమ్, |
ధను ర్మన్యే సవ్యే - తరకరగృహీతం రతిపతేః
ప్రకోష్ఠే ముష్టౌచ - స్థగయతి నిగూఢాంతర ముమే॥47॥
దేవి కనుబొమలు ధనుస్సువలెనున్నవి. ఆమె సకల భువనముల భయమును పోగొట్టెడు ఉమాదేవి
ఓ పరమేశ్వరీ! సమస్త భువనమల యొక్క భయమును పోగొట్టు జగజ్జననీ, నీ కనుబొమలను వాటి క్రింద ఉన్న కనులను కలిపి మన్మధుడు చేబూనిన కోదండంగా భావించుచున్నాను. ఎందుచేతననగా కొంచెం వంగి ఉండి తుమ్మెదల వరుస వలె నీలిరంగు తో ప్రకాశిస్తున్న నీ కనుబొమలు కోదండంలా (వింటి కర్రలా), వాటి క్రింద సౌందర్య వంతమై, కాంతియుక్తమైన నీ కన్నులు ఆ వింటినారివలె, ఆ కనుబొమల మధ్య ప్రదేశం మన్మథుడు ఆ కోదండాన్ని తన ఎడమచేత్తో పట్టుకొనుటవలన ఆ ప్రదేశం కప్పబడినట్లుగా ఈ రీతిన నీ కనుబొమలను, కన్నులనూ కలిపి మన్మధుడు చేత పట్టిన ధనుస్సుగా భావించుచున్నాను.
ఓ పరమేశ్వరీ! అమ్మా శాంభవీ! సకల భువనాలకు కలిగే ఉపద్రవాలను తొలగించటంలో ఆసక్తిగల ఓ మహేశ్వరీ! కొంచెం చిట్లించిన నీ కనుబొమలు మన్మథుడి ధనుస్సును మరిపిస్తూ, తుమ్మెదల వంటి నీ కాటుక కన్నులు వింటినారి అయి శోభిల్లుతున్నాయి. నీ ముక్కుపుడక ధనుస్సు మధ్య భాగాన్ని కప్పిపుచ్చుతూ స్మరహరుడి (మన్మథుని) కుడిచేయి ముంజేయి పిడికిలా అన్నట్లు భాసిల్లుతున్నది.
పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం వదసస్మరమాంగల్య గృహతోరణ చిల్లికాయై నమః అని యనవలెను.
🌹
శ్రీమాత్రేనమః శ్రీలలితా సహస్రనామ భాష్యము
18వ నామ మంత్రము
ఓం వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనాయై నమః
ముఖకాంతి యొక్క ప్రవాహంలో చలించే మీనముల జంటతో సాటియైన కన్నులు గల పరమేశ్వరికి నమస్కారము.
శ్రీ లలితా సహహ్రనామావళి యందలి వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు ఉపాసకులు నామరూపరహితమైన సచ్చిదానంద స్థితిని దేవి కరుణచే పొందగలరు.
నయనత్రితయం తస్యా జజ్ఞే పావకతేజసా|
కృష్ణం రక్తం తథా శ్వేతం వర్ణత్రయవిభూషితమ్॥64॥(దేవీభాగవతం, పంచమస్కంధం, అష్టమాధ్యాయం)
శ్రీమాతయొక్క ఆవిర్భావ కాలమున అగ్నిదేవుని తేజస్సుచే నేత్రములు కలిగినవి. కుడి నేత్రము అ ఇకారము - అధిష్ఠాన దేవత ఇంద్రుడు, ఎడమ నేత్రము ఈ కారము - విరాట్పురుషుడు అధిష్ఠాన దేవత.
సాధారణంగా స్త్రీయొక్క కన్నులు మీనములతో పోల్చడం సహజం అంటే ఆ కన్నులు అంతశోభాయమానంగా ఉంటాయి. అంతేకాదు ఆ కన్నులు మిలమిల కనురెప్పలు కొట్టుకుంటూ ఆ చూపులు ఇటు అటు త్వరితంగా ఒక ప్రక్కనే కాక చలిస్తూ చంచలమని పించుకుంటాయి. అంటే ఆ మీనాక్షి చంచలాక్షి యని కూడా అనిపించుకుంటుంది. నీటిలో మీనము అర్ధచంద్రాకారమై ఒకింత రెప్పపాటు సమయం నిలకడవుతుంది. అంటే అది ఓరచూపు అని కూడా అంటాము. ఈ వర్ణన అంతా స్త్రీ నయన సౌందర్యం గురుంచేకదా. నయనములు మీనము (చిన్నవి) వలె ఉంటాయి. మీనములు నీటిలో ఒక చోట ఉండక ఒక చోటు నుండి మరొక చోటుకు త్వరితగతిని అందముగా కదులుతాయి. ఇంకొకసారి కొంచం వంగి రెప్పపాటు సేపు నిలకడగా ఉంటాయ. అంతలోనె తుర్రుమని మరొకచోటికి కదులుతాయి. ఇదంతా చాలా మనో హరంగా ఉంటుంది. ఆ పరమేశ్వరియొక్క నయన మనోహరము. అలాగే ఉంటుంది.
అమ్మ వదనంలో ఉన్న ఆ నయన మీనములకు జలములేవీ? లేవంటారా? జలములు ఉన్నాయి. ఆ వదనమే ఒక శోభాయమానమైన సరోవరమయితే ఆ త్రిపుర సుందరి సౌందర్యమే ఒక పరీవాహము. ఆ పరీవాహంలో అమ్మ కనులనే మీనములు విహరిస్తున్నాయి అందుకే శ్రీమాతను వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచనా అని వశిన్యాది వాగ్దేవతలు స్తుతించారు. అయినా వారు అంతటితో తృప్తి చెందలేదు. ఇంకా ముందు ముందు నామ మంత్రములలో మరింతగా వర్ణించారు.
అమ్మవారి కన్నులు చేపపిల్లలతో పోల్చడంలో ఒక చమత్కారము ఉన్నది. చేపలకు సంయోగ, సంపర్కము లేకుండా కేవలం చూపులతోనే గ్రుడ్లుపెట్టడం జరుగుతుంది. గ్రుడ్లు నీటి అడుగున ఉండగా, నీటికి పైన ఉన్న ఆ చేపల చూపులతో ఆ గ్రుడ్లనుండి పిల్లలు వస్తాయి. అలాగే మీనాక్షియైన ఆ పరమేశ్వరి వీక్షణముల నుండియే భక్తులు అనుగ్రహమును పొందుతారు. తమ మనో వాంఛితార్థములు ఆ పరమేశ్వరి వీక్షణములనుండియే పొందుతారు. శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు నలుబది ఎనిమిదవ శ్లోకంలో అమ్మవారి నయనములను ఇలా వర్ణించారు.
అహః సూతే సవ్య - తవ నయనమర్కాత్మకతయా
త్రియామాం వామంతే - సృజతి రజనీ నాయకతయా |
తృతీయా - తే దృష్టిర్దరదలిత హేమాంబుజ రుచిః
సమాధత్తే సంధ్యాం - దివసనిశయోరంతరచరీమ్॥48॥
దేవి కుడికన్ను సూర్యునివలె పగటిని, ఎడమకన్ను చంద్రునివలె రాత్రిని కలిగించుచున్నవి. మూడవ నేత్రము సంధ్యాకాలమును కలిగించుచున్నది.
ఓ జగన్మాతా! సూర్య రూపమైన నీ కుడికన్ను వలన ఈ లోకాలకు పగలు ఏర్పడుతున్నది. చంద్రుని స్వరూపమైన నీ ఎడమ నేత్రం వలన రాత్రి ఏర్పడుతున్నది. అగ్ని రూపమైన, కొద్దిగా వికసించిన సువర్ణ కమలము వంటి నీ ఫాల నేత్రము వలన పగలుకు రాత్రికి మధ్య ఏర్పడు ప్రాతఃసంధ్య, సాయంసంధ్య అనబడు ఉభయ సంధ్యలు ఏర్పడుతున్నాయి. ఇలా ఏర్పడు ఈ నాలుగు కాలాలు మాపై నీవు కురిపించు నీ కరుణా కటాక్ష వీక్షణాలే కదా తల్లీ!
అమ్మ వారి కన్నులు రాత్రి, పగలు, ఉదయసంధ్యలను ఏర్పరచుచూ, పగలు, రాత్రి, దినము, వారము, పక్షము, మాసము, ఋతువులు, సంవత్సరములు, యుగములు అను కాలగమనము కలిగించు చుండగా, అమ్మవారు మాత్రం దేశకాలాపరిచ్ఛిన్న అయి నిలుస్తున్నది. అనగా అమ్మవారు కాలమునకు అతీతురాలు. ఆ పరమేశ్వరి నేత్రములు అనేక విధములైన దృష్టులను కలిగి ఉన్నవి. ఈ వైనము శంకర భగవత్పాదుల వారు తమ సౌందర్యలహరియందలి నలుబది తొమ్మిదవ శ్లోకంలో ఇలా తెలియజేశారు:-
విశాలా కల్యాణీ - స్ఫుతరుచి రయోధ్యా కువలయైః
కృపాధారాధారా - కిమపి మధురాஉஉభోగవతికా |
అవంతీ దృష్టిస్తే - బహునగరవిస్తారవిజయా
ధ్రువం తత్తన్నామ-వ్యవహరణయోగ్యా విజయతే॥49॥
దేవి చూపు విపులమై, మంగళకరమై, దుర్జయమై, దయారసపూరితమై, అవ్యక్త మధురమై, పరిపూర్ణ భోగవతియై, భక్తులను రక్షించునదై అనేక నగరముల బహుముఖ విజయము కలదై యున్నది.
అమ్మా! జగన్మాతా! విశాలమైన నీ నేత్రములదృష్టి ప్రసరించుటచేత ఒక నగరానికి విశాలనగరము అని పేరు వచ్చినది. మంగళకరమైన, కళ్యాణప్రదమైన నీ వీక్షణం వల్లనే ఓ నగరానికి కళ్యాణి నగరము అను నామము వచ్చినది. చక్కని కాంతి కలిగి నల్లకలువల సోయగాన్ని త్రోసిరాజనునట్టి సొగసైన నీ చూపులు పడటం వల్లనే మరియొక నగరం అయోధ్యానగరము అని పిలువబడుతున్నది. నీ కంటి కృపాధారలే ఆధారమై ఉండుటచేత ఇంకొక నగరం ధారానగరంగా వ్యవహరించబడుతున్నది. నీ మధుర దృక్కుల ప్రసరణం వల్లనే వేరొక నగరం మధురానగరంగా శ్లాఘించబడుచున్నది. నీ భోగదత్త క్రీగంటి చూపులవల్లనే భోగవతీ నగరం ఏర్పడినది. నీ దుష్టశిక్షణ, శిష్టరక్షణా తత్పరత్వమైన చూపుల వలన అవంతీనగరం ఆవిర్బవించినది. నిత్య జయప్రదమైన సర్వోత్కృష్ట నీ జయ వీచికల వలన ఓ నగరం విజయనగరంగా పిలువబడుతున్నది.
ఈ రీతిన నీ నేత్రములనుండి వెలువడు ఈ పవిత్ర దృష్టుల వలననే ఈ అష్ట దివ్య నగరములు ఆవిర్బవించినవని నేను భావిస్తున్నాను.
అమ్మవారి కన్నులు అమాయకంగా, మీనద్వయము వలె ఆ పరమేశ్వరి ముఖకాంతిప్రవాహంలో చలించుచున్నను, ఆ కన్నుల నుండి వెడలు ప్రేమ, క్రోధ (భక్తులయెడ వాత్సల్యత, దుష్టులయెడ తీక్షణములైన అంకుశముల వంటి) వీక్షణములు ప్రసరించుచుండును. అవే మీనద్వయము వంటి కన్నులు కామేశ్వరుని యెడల అనురాగపూరితమైన దృక్కులై విలసిల్లును. ఆ పరమేశ్వరి కృపాపూరిత వీక్షణములు భక్తుల ఇష్టకామ్యములను సిద్ధింపజేయునవై యుండును.
పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనాయై నమః అని యనవలెను.
🌹
శ్రీమాత్రేనమః శ్రీలలితా సహస్రనామ భాష్యము
19వ నామ మంత్రము
ఓం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమః
అప్పుడేవిరిసి నవనవలాడుతూ సుమనోహరంగా గోచరమయే సంపెంగవంటి నాసాదండముతో విరాజిల్లు పరాశక్తికి నమస్కారము.
శ్రీ లలితా సహహ్రనామావళి యందలి నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా అను పదహారక్షముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించు ఉపాసకులను సంపంగినిబోలు నాసాదండ విరాజితయైన దేవేశి, తన భక్తులను కరుణించి వారికి సంపంగిసువాసనలవంటి సంస్కారయుతమైన మనస్సు, నడవడిక, ఆధ్యాత్మికతాభావము కలుగజేసి తరింపజేయును.
వశిన్యాది వాగ్దేవతలు శాంభవి నాసికను సంపెంగతో, అందునా అప్పుడే వికసించి, సౌరభాలను వెదజల్లే సపెంగతో పోల్చారంటే ఎంతటి మనోహరమైన భావము.
త్రిభువన సుందరి, ఇంతకు ముందు నామమంత్రములలో జగజ్జనని కనుబొమలు మన్మథుని గృహతోరణాలుగా, ఆజగదీశ్వరి నయనములు మనోహరమైన వదన సౌందర్య పరీవాహములో చలించు మీనములుగా, ఈ నామ మంత్రములో రేక సంపెంగ కాని వేరొక రకమైన (సింహాచలంలో విరివిగా దొరికే - ఎక్కువ పసుపు, ఓ మాదిరి ఎరుపు గలిగిన) సంపెంగవలె, అదికూడా అప్పుడే విరిసిన సుంగంధభరితమైన సంపెంగవలె, ఆ సంపెంగను చూస్తే రెండు ముక్కు పుటములు గలిగిన ముక్కువలె ఉంటుంది. అంటే సూటిగా, సొంపుగా తీరుగా, మీనములవంటి కన్నులకును, ఆ సొగసైన కనుబొమలకును, అంతకంటే తేజరిల్లే వక్త్రలక్ష్మీపరీవాహమైన మోమునకును సరియైన విధంగా త్రిపురసుందరీ దేవి నాసిక ఒప్పారుతున్నదని భావము.
ఆడవారి ముక్కు సంపెంగతో ఎందుకు పోల్చుతారో ఇక్కడ చిన్న ఉపాఖ్యానము చదవమని మనవి
నందితిమ్మన్నను ముక్కుతిమ్మన్న అని ఎందుకు అన్నారు అంటే దానికి ఒక ముచ్చట చెప్తారు. ఒకనాడు తనకు క్షౌరం చక్కగా చేసినందుకు సంతోషించి తిమ్మన్న మంగలికి బహుమతి ఇవ్వబోవగా, వాడు కవిగారూ నాకు డబ్బు వద్దు, మంచి పద్యం ఏదైనా వ్రాసి ఇవ్వండి అన్నాడుట. తిమ్మన్న సంతోషించి డబ్బుతోకూడ ఈక్రింది పద్యం ముక్కు మీద వ్రాసి ఇచ్చారుట.
శార్ధూలము
నానాసూన వితాన వాసనల నానందించు సారంగ మే
లానన్నొల్లదటంచు గంధఫలి బల్ కానందవంబంది, యో
షా నాసాకృతి బూని సర్వసుమనస్సౌరభ్య సంవాసియై
పూనెన్ ప్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్
"అన్ని పుష్పాల మీద వాలుతూంటుంది మిళిందము (తుమ్మెద) కానీ , ఆ తుమ్మెద నా మీద ఎందుకు వాలడం లేదు?" అని అలిగింది సంపెంగ పువ్వు. దుర్గ మారణ్యాలలోనికి వెళ్ళింది సంపంగి పూవు. తీవ్రంగా తపస్సు చేసి భగవంతుని వరం కోరినది. భగవంతుని వరం ప్రకారం
" స్త్రీయొక్క ముక్కుగా పునర్జన్మను పొందినది. ఆ నాటి నుండి వర ప్రభావముచే అన్ని పూవుల వాసనలని ఆస్వాదించసాగినది ముక్కుగా పునర్జన్మమందిన సంపంగి. అంతేనా తనకిరు వైపులా నయనములు - (గండు తుమ్మెద ) చూపులను తుమ్మెదల మాలగా ధరించింది.
ఇంత ప్రఖ్యాతిపొందిన ముక్కు పద్యం వ్రాసిన కవి కాబట్టి ఇతడు ముక్కు తిమ్మన్న అయిపోయాడంటారు.
అలాగే ఆది శంకరాచార్యులు వారు అమ్మవారి నాసిక యొక్క సౌందర్యమును తమ సౌందర్యలహరియందు అరువది ఒకటవ శ్లోకంలో వర్ణించిన విధానం ఆలా ఉన్నది:-
అసౌనాసా వంశస్తుహినగిరి వంశధ్వజ పటీ!
త్వదీయో నేదీయః ఫలతుమస్మాకముచితమ్|
వహంత్యన్తర్ముక్తా శ్మిశిరకర నిశ్వాస గళితమ్|
సమృద్ధ్యా, యత్తాసాం, బహిరపి నముక్తామణిధరః॥
హిమగిరి వంశధ్వజమునకు పతాకము వంటి పార్వతీ, నీ నాసిక లేత వెదురు దండమువంటిది. ఆనాసాదదండము మాకుకోరినవి ప్రాప్తింపజేయవలెనని అభిలషిస్తున్నామమ్మా. ఆ నాసాదండమునకు ధరించిన ముత్యములను ధరించుచున్నావు, అందుకు కారణమేమంటే, ఆ నాసాదండము ముత్యములతో సమృద్ధమై, నీ వామ నిశ్వాసమునండి ముత్యము రాలి అది నీ నాసికాగ్రమునకు ముత్యముతో కూడిన ఆభరణమగుచున్నది. తల్లీ! ఆనాసాభరణము నీ సౌందర్య అమృతధారలందు మేము అమరుల మయ్యెదము తల్లీ
ఈ సందర్భంగా ఆ పరమేశ్వరి ఆవిర్భావములోని మనోహరమైన అవయవసంపద ఏర్పడిన విధానంపై దేవీభాగవతంలో ఇచ్చిన వివరణ ఇచ్చట సమర్పించబడినది.
దేవతలకు, రాక్షసులకు యుద్ధము జరుగుచున్నది. దేవతలకు ఇంద్రుడు, రాక్షసులకు మహిషాసురుడు నాయకత్వం వహించారు. ఆ దేవాసురుల సంగ్రామంలో దేవతలు పరాజయాన్ని పొందారు. మహిషాసురుని ఎలా జయించాలో పాలుపోక దేవతలంతా త్రిమూర్తులను ఆశ్రయించారు. బ్రహ్మవరముచే మహిషాసురుడు పురుషులచే మరణం సంభవించనివాడగుటచే మిగుల విర్రవీగుచున్నాడు. ఇక స్త్రీ మాత్రమే సంహరించవలెను. ఆ రాక్షసుని వధించు శక్తి ఏ స్త్రీకి ఉన్నదని త్రిమూర్తులు కూడా తలలు పట్టుకుని కూర్చున్నారు. సకలదేవతల తేజస్సుతో అత్యంత సౌందర్యవతియైన ఒకానొక స్త్రీమూర్తి ప్రకటితము కావలెనని విష్ణుమూర్తి యోచించి చెప్పెను. ఆ స్త్రీమూర్తికి రుద్రుడు మొదలైన దేవతలనుండి త్రిశులాది పరమదివ్య ఆయుధములను సమర్పించ వలయును. అప్పుడు ఆ స్త్రీమూర్తి సకలదేవతల తేజస్సులతో ఆకారము, బలము మరియు సర్వదేవతలు సమర్పించిన ఆయుధములతోను సంపూర్ణ తేజస్సుతో బలసంపన్నురాలై ఆ దుష్టరాక్షసుని సంహారము జరుగును అని విష్ణుమూర్తి చెప్పెను. ఆ విధముగా బ్రహ్మాది దేవతల శరీరములనుండి అద్భుతమైన తేజస్సు బయటకు వచ్చినది. ఆ తేజస్సే ఒక మహత్తర స్త్రీమూర్తిగా రూపుదిద్దుకున్నది. ఆమెయె శ్రీలలితా త్రిపురసుందరి. ఆ లలితా పరమేశ్వరియొక్క అంగములు ఏయే దేవతల తేజస్సుతో ఏర్పడినవో దేవీభాగవతమునందు, పంచమస్కంధమునందు, అష్టమోధ్యాయములో ఈ విధముగా వివరించబడినది.
శంకరస్య చ యత్తేజ స్తేన తన్ముఖపంకజమ్|
శ్వేతవర్ణం శుభాకారమజాయత మహత్తరమ్॥62॥
కేశా స్తస్యా స్తథా స్నిగ్ధా యామ్యేన తేజసాఽభవన్|
వక్రాగ్రా శ్చాతిదీరా వై మేఘవర్ణా మనోహరాః॥63॥
నయనత్రితయం తస్యా జజ్ఞే పావకతేజసా|
కృష్ణం రక్తం తథా శ్వేతం వర్ణత్రయవిభూషితమ్॥64॥
వక్రే స్నిగ్ధే కృష్ణవర్ణే సంధ్యయోస్తేజసా భ్రువౌ|
జాతే దేవ్యాః సుతేజస్కే కామస్య ధనుషీ వ తే॥65॥
వాయో శ్చ తేజసా శస్తౌ శ్రవణా సంబభూవతుః|
నాతి దీర్ఘౌ నాతి హ్రస్వౌ దోలావివ మనోభువః॥66॥
తిలపుష్పసమాకారా నాసికా సుమనోహరా|
సంజాతా స్నిగ్ధవర్ణా వై ధనదస్య చ తేజసా॥67॥
దంతాః శిఖరిణః శ్లక్ష్ణాః కుందాగ్రసదృశాః సమాః|
సంజాతాః సుప్రభా రాజ న్ప్రాజాపత్యేన తేజసా॥68॥
అధరశ్చా తిరక్తోఽస్యాః సంజాతోఽరుణతేజసా|
ఉత్తరోష్ఠస్తథా రమ్యః కార్తికేయస్య తేజసా॥69॥
అష్టాదశభుజాకారా బాహవో విష్ణుతేజసా|
వసూనాం తేజసాఽంగుళ్యో రక్తవర్ణా స్తథాఽభవన్॥70॥
సౌమ్యేన తేజసా జాతం స్తనయో ర్ముగ్మముత్తమమ్|
ఇంద్రేణా స్యా స్తథా మధ్యం జాతం త్రివళిసంయుతమ్॥71॥
జంఘోరూ వరుణస్యాఽథ తేజసా సంబభూవతుః|
నితంబః స తు సంజాతో విపుల స్తేజసా భువః॥72॥॥
ఏవం నారీ శుభాకారా సురూపా సుస్వరా భృశమ్|
సముత్పన్నా తథా రాజం స్తజోరాశి సముద్భవా॥73॥
తాం దృష్ట్వా సుష్ఠుసర్వాంగీం సుదతీం చారులోచనమ్|
ముదం ప్రాపుః సురాః సర్వే మహిషేణ ప్రపీడితాః॥74॥
విష్ణు స్త్వాహ సురాన్సర్వా న్భూషణాన్యాయుధాని చ|
ప్రయచ్ఛంతు శుభాన్యస్యై దేవాః సర్వాణి సాంప్రతమ్॥75॥
స్వాయుధేభ్యః సముత్పాద్య తేజోయుక్తాని సత్వరాః|
సమర్పయంతు సర్వేఽద్య దేవ్యై నానాయుధానివై॥76॥
జనమేజయునికి వ్యాసభగవానుడు ఆ పరమేశ్వరి ఆవిర్భావంగూర్చి తెలుపుచున్నాడు: భగవానుడు శంకరుని తేజమునుండి శ్వేతవర్ణముతో, సుశోభితముగా, విశాలమై, మనోహరమై, విలసిల్లు పరమేశ్వరి ముఖకమలము రచింపబడెను. సుందరమై, సుదీర్ఘమై, సహజపరిమళలను విరజిమ్ముచూ, చిక్కగా, నునుపుగా మనోహరమైన మేఘశ్యామవర్ణముతో శిరస్సునందు అలరారు కేశనిర్మాణము యమరాజు తేజస్సుతో జరిగెను. కృష్ణ, రక్త, శ్వేతవర్ణములతో శోభిల్లు ఆ దేవి నేత్రములు అగ్నిదేవుని తేజస్సుతో ప్రకటితమయ్యెను. ప్రాతఃసంధ్య, ఉదయసంధ్యల తేజస్సుతో ఆ పరమేశ్వరి కనుబొమలు ఉత్పన్నములయ్యెను. తేజఃపరిపూర్ణములైన నల్లని వంపులు తిరిగిన కనుబొమలు మన్మథుని ధనుస్సువలె విలసిల్లుచుండెను. మరీ పొడవుగాని, మరీ పొట్టిగా గాని లేని రెండు చెవులు వాయువు తేజముతో ఉత్పన్నములయ్యెను. నూగుపూవులవలె కోమలమై, అప్పుడే విరిసీ విరియని సంపెంగవలె అత్యంత మనోహరమైన నాసిక కుబేరుని తేజస్సుతో ప్రకటమయ్యెను. అత్యంత ప్రకాశవంతమై, మనోహరములై, కుందములవలె కొనలు తేలియుండు దంతములు ప్రజాపతి తేజస్సుతో ప్రకటితములయ్యెను. సూర్యుని యొక్క తేజస్సుతో మిగుల లాలిమతో కూడిన అధరోష్ఠము (క్రిందిపెదవి) ప్రకటితమయ్యెను. పైపెదవి కార్తికేయుని తేజస్సుతో ఉత్పన్నమయ్యెను. పరమాత్ముడైన శ్రీమహావిష్ణువు యొక్క మహత్తరమైన తేజస్సుతో పదునెనిమిది భుజములు ఆవిర్భవించెను. అష్టవసువుల తేజస్సుతో ఎర్రనిరంగుగల వ్రేళ్ళు ప్రభవించెను. చంద్రుని తేజస్సుతో రెండు వక్షోజములు, ఇంద్రుని తేజస్సుతో మధ్యభాగమగు కటిప్రదేశము మరియు త్రివళులు (పొట్టపై ఉండు మూడు మడతలు), వరుణుని తేజస్సుతో తొడలు, పిక్కలు, భూదేవి తేజముతో విశాలమైన నితంబభాగము (పిరుదులు) ప్రకటితమయ్యెను.
ఇదే విషయము సప్తశతియందు, రెండవ అధ్యాయము, పదహారు, పదిహేడు, పదునెనిమిది (16, 17, 18) శ్లోకములలో ఇలా చెప్పబడినది.
బ్రహ్మణస్తేజసా పాదౌ తదంగుల్యోఽర్కతేజసా|
వసూనాం చ కరాంగుల్యః కౌబేరేణ చ నాసికా॥16॥
బ్రహ్మతేజముతో పాదములు, సూర్యతేజముతో కాలివ్రేళ్ళు, అష్టవసువుల తేజస్సుతో చేతివ్రేళ్ళు, కుబేరుని తేజముతో నాసిక (ముక్కు) ప్రకటిత మయ్యెను.
తస్యాస్తుదంతాః సంభూతాః ప్రాజాపత్యేనతేజసా|
నయనత్రితయం జజ్ఞే తథా పావకతేజసా॥17॥
ప్రజాపతి తేజముతో దంతములు, అగ్నితేజముతో మూడు కన్నులు ఉత్పన్నమయ్యెను.
భ్రువౌ చ సంధ్యయోస్తేజః శ్రవణావనిలస్య చ|
అన్యేషాం చైవ దేవానాం సంభవస్తేజసాం శివా॥18॥
రెండు సంధ్యల తేజమునుండి కనుబొమలు, వాయుతేజమునుండి చెవులు మరియు ఇతరదేవతల తేజములతో ఆ పరమేశ్వరి సంపూర్ణరూపము ఏర్పడెను.
ఈ నామ మంత్రములో చెప్పిన విరిసీ విరియని నవసంపంగివలె అత్యంత మనోహరమై ఒప్పు ఆ పరమేశ్వరి నాసిక కుబేరుని తేజస్సుతో ప్రకటితమయినది.
ఆ జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నవచంపక పుష్పాభ నాసాదండవిరాజితాయై నమః.
అని వినమ్రతతో ఉచ్చరించుదాము
🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
20వ నామ మంత్రము
ఓం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః
శుక్రనక్షత్రకాంతిని కూడ త్రోసిపుచ్చే కాంతి గల నాసాభరణం ధరించిన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీ లలితా సహహ్రనామావళి యందలి తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు ఉపాసకులకు ఆ శ్రీమాత కరుణించి కుజ, శుక్ర గ్రహముల వ్యతిరేకతలను నిరోధించి, సమస్త గ్రహబలమును, నక్షత్ర జాతకబలమును అధికముచేసి, నిర్మల జ్ఞానమార్గమును కలుగజేసి ఇహపర సుఖసౌఖ్యములు, ఆత్మానందమును కలుగజేయును.
అమ్మవారి ముఖసౌందర్య వర్ణనలో వశిన్యాది వాగ్దేవతలు తరించిపోయారు.
అమ్మవారి కుడి ముక్కుకు ఎఱుపు,తెలుపుల మిశ్రితవర్ణముగల పగడపు ముక్కెరను ధరించియున్నది. ఎడమ ముక్కుకు తెలుపు వర్ణముగల వజ్రపు ముక్కెర ధరించియున్నది. సౌభాగ్య చిహ్నమైన మంచిముత్యముతో చేసిన అడ్డబాస అమ్మవారు కుడిఎడమల ముక్కును విడదీస్తూయన్న నాసాదండమునకు ధరించియున్నది.
కుజనక్షత్రము ఎఱుపు రంగులోను, శుక్రనక్షత్రము తెలుపురంగులోను ఉండును అని రత్నశాస్త్రం చెప్పుచున్నది. దీనిని బట్టి కుడిఎడమలయందున్న ఎఱుపు, తెలుపు రంగుల ముక్కెరలు కుజగ్రహకాంతులను, శుక్రగ్రహ కాంతులను వెక్కిరించుచున్నవి. నాసా దండమునకు అలంకారమైయున్న మంచిముత్యపు బులాకీ (అడ్డబాస) సౌభాగ్యమును సూచించుచున్నది.
ఎడమ ముక్కు రంధ్రంలో ఇడా , కుడి ముక్కు రంధ్రంలో పింగళ మరియు నాసాదండమునందు సుషుమ్నా నాడి గలవు.
నవచంపకపుష్పాభ నాసాదండవిరాజిత అయిన ఆ పరమేశ్వరి కుజ గ్రహకాంతులను ధిక్కరించే ఎర్రని పగడపు ముక్కెర ముక్కునకు కుడివైపున, శుక్రగ్రహకాంతులను సైతము తిరస్కరించే తెల్లని వజ్రపు ముక్కెర ముక్కునకు ఎడమ ప్రక్కన ధరించియున్నది.
ఎర్రని పగడపు కాంతులు సూర్యసంబంధమైన తేజస్సును, తెల్లని వజ్రపు కాంతులు చంద్రసంబంధమైన తేజస్సును సూచించుచున్నవి. కుడి ఎడమల ముక్కును విడదీస్తూ మధ్యన ఉండే నాసాదండమునకు సౌభాగ్యచిహ్నమైన ముత్యాల (అడ్డబాస) బులాకీ అమ్మవారు ధరించియున్నది. నాసిక అనగా అజపాస్వరూపము అగుటచే, నిత్యమూ ప్రాణరూపంలో అమ్మవారు మనలో సంచరించు చున్నది. నాడీవ్యవస్థను దృష్టిలోపెట్టుకొని ఆలోచిస్తే కుడి పింగళానాడి, సూర్య సంబంధమైన ఎఱుపు (ఎర్రని పగడపు ముక్కెర) ఎడమ ఇడానాడి, చంద్రసంబంధమైన తెలుపు (తెల్లని వజ్రపు ముక్కెర) మధ్య ముక్కు దూలమునకు ఉన్న అడ్డబాస (బులాకీ) చల్లని సుషుమ్నానాడికి సంకేతము. మూడు నాడీ స్వరూపములను, గ్రహములకు సంబంధించిన రత్నశాస్త్రమును తెలియజేయుటకే అమ్మవారు ధరించిన నాసాభరణములను బ్రహ్మజ్ఞానస్వరూపులైన వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని ప్రప్రథమంగా తారాకాంతితిరస్కారినాసాభరణ భాసురా యని స్తుతించి ఆ పరమేశ్వరి అనుగ్రహమునకు పాత్రులయారు.
శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు అరువది ఒకటవ శ్లోకంలో అమ్మవారి నాసాభరణంగురుంచి ఇలా వర్ణించారు.
అసౌ నాసావంశ - స్తుహినగిరి వంశధ్వజపటి
త్వదీయో నేదీయః - ఫలతు ఫలమస్మాక ముచితమ్ |
వహత్యంతర్ముక్తాః - శ్శిశిరకర నిశ్వాస గలితం
సమృద్ధ్యా యత్తాసాం - బహిరపి స ముక్తామణిధరః॥61॥
హిమధ్వంస కీర్తిపతాకయైన దేవి నాసిక నుండి వెలువడు చల్లని నిశ్వాసము మాకు అభీష్ట ఫలములను ప్రసాదించును గాక.
ఓ పరమేశ్వరీ! హిమవంతుని వంశకీర్తిని వినువీదిన ఎగురవేసిన ధ్వజపటం వంటి ఓ పార్వతీదేవీ! నీ యొక్క నాసాదండము ( నాసిక - ముక్కుదూలం) మాకు మావారందరికీ మేము కోరిన కొర్కెలన్నీ తీర్చునుగాక. అమ్మా నీ నాసాదండము ( ముక్కు) లోపల ముత్యములు ఉన్నవి. ఆ లోపల ఉత్పన్నమైన ఆ ముత్యములే చంద్రనాడి స్థానమైన, నీ ఎడమ నాసికారంధ్రమునుంచి నిశ్వాస ( ఊపిరి వదులుట) రూపంలో వెలుపలకు వచ్చి నీ నాసిక క్రింద వేలాడుతూ నాసికా ముక్తాభరణంగా వెలుగొందు చున్నది.
అమ్మవారి నాసికను వర్ణిస్తూ లలితా సహస్రం నామావళియందు నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా అనునది పందొమ్మిదవ నామ మంత్రముతో వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కీర్తించారు. అనగా అప్పుడే వికశించిన సంపెంగపువ్వు లాంటి ముక్కు కలిగినది అని అలాగే అమ్మ ముక్కుకు ఉన్న ఆభరణాన్ని వర్ణిస్తూ తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా యను ఇరువదియవ నామ మంత్రంలో అమ్మవారిని ప్రస్తుతించారు.
అనగా నక్షత్ర కాంతిని మించిన కాంతితో ప్రకాశిస్తున్న నాసాభరణంతో అమ్మ ప్రకాశిస్తున్నదని అర్ధం.
అమ్మ ముక్కుకి మూడు ఆభరణములు ఉండును. అవి : కుడిప్రక్కన ముక్కుపుడక, ఎడమప్రక్క ముక్కెర ( ముక్కునుండి గుండ్రంగా ఉంగరంలా బయటకు వచ్చి ఉంటుంది). అడ్డబాస ( బులాకి) అని అందురు. ఇది ముక్కు మధ్యన క్రిందకు వేలాడుతూ ముత్యంతో ఉండును.) ఈ శ్లోకంలో జగద్గురువులు ఈ మూడవ దానినే వర్ణించిరి. పైగా ఆ ముత్యం అమ్మ నాసాదండం నుంచే ఉద్భవించింది అనడానికి కారణం ఉంది.
అమ్మ హిమవంతుని ఇంట పార్వతిగా పుట్టుట చేత అతని వంశ కీర్తి ఈమె వలన ప్రఖ్యాత మైనది. అందువల్లే ఆది శంకరులు ముందే ఈమెను ఆ కీర్తిని ఎగరేయు ద్వజపటంగా పోల్చినారు. ఆ ధ్వజం (జండా) ఎగరాలంటే వంశదండం ( వెదురు బొంగు) కావాలి. అమ్మ నాసాదండం వంశదండంలానే ఉన్నది.
ముత్యములు ఆరు చోట్ల పుట్టునని రత్నశాస్తం తెలుపుతున్నది. అందులో ఒకస్థానం వెదురుబొంగు. అందుకే వంశదండం వంటి ఆ నాసికలో ముత్యములు ఉత్పన్నమగుటలో ఆశ్చర్యం లేదు. అదీ కాక ఎడమప్రక్క నాసికలో చంద్రనాడి ఉండును. ముత్యములు సంభవించటానికి చంద్ర కిరణములు దోహదపడును. అందువలన ఆ ఎడమ రంధ్రం నుండి అమ్మ గాలి వదలినప్పుడు ఆ లోపల ఉత్పన్నమైన ముత్యము జారి బయట నాసాభరణం గా మారినదగుటచే చంద్ర కిరణములు అమృతమయములని ప్రతీతి. మనం వదులు గాలిని వృక్షములు ఎలా స్వీకరించునో అలా అమ్మ వదులు గాలి అమృతసదృశమై
ప్రాణాధారమై మనకు అందుచున్నది. ఇలా అమ్మవారి నాసాభరణానికి ఎన్నో ప్రత్యేకతలు, కథలు కూడా ఉన్నాయి. ఈ ముక్కెర కోసమే కృష్ణమ్మ తల్లి ( కృష్ణానది) దుర్గమ్మ ముక్కునంటుతుందట. కన్యాకుమారిలో అమ్మ నాసాభరణ కాంతి సముద్రంలో వెళ్ళు ఓడలకు మార్గం చూపు దీపస్తంభంవలె కనబడి అవి దారితప్పి ఇటు వచ్చేస్తున్నాయని అమ్మ ఎదుట ఉన్న తూర్పు ద్వారాలు ఇప్పటికీ మూసి ఉంచుతారు. అటువంటి దివ్యమైన నాసాభరణంతో ఒప్పారు ఆ నాశిక సదా మనలను కాచి కాపాడు గాక.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః అని అనవలెను.
*****
శ్రీలలితా సహస్రనామ భాష్యము
21వ నామ మంత్రము 15.1.2022
ఓం కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరాయై నమః
కదంబకుసుమముల గుత్తిని చెవులపైభాగంలో ధరించుటచే రమణీయంగా భాసిల్లుచున్న జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్రనామావళి యందలి కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి ప్రపత్తులతో శ్రీమాతను ఉపాసించు భక్తులకు జగన్మాత వారి గృహములు మంగళప్రదముగాను లక్ష్మీకరముగాను అనంత సుఖసౌఖ్యములను ప్రసాదించి, వారిలో తనయందు భక్తిప్రపత్తులు ఇనుమడింపజేసి ఆత్మానందానుభూతిని ప్రాప్తింపజేయును, కైవల్యమార్గమును చూపును.
జయహో శ్రీమాత! రావి, తులసి, కదంబము, మారేడు, పారిజాతము - వీటిని దేవతా వృక్షములంటారు. లక్ష్మీప్రదమైనవి. అందునా కదంబ కుసుమములు జగన్మాతకు ప్రియమైనవి, కదంబవృక్షము క్రింద ఉండుట జగన్మాతకు అత్యంత ప్రియకరము. అందుకే జగన్మాతను కదంబవనవాసినీ యనియు కదంబ కుసుమప్రియా అనియు స్తుతించుతాము. ఇక్కడ కదంబ వృక్షము అంటే - కాశీలో మాత్రమే ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోను, పశ్చిమగోదావరిజిల్లా ముక్కామలలోను బాలత్రిపురసుందరి, ఆలయములలో కదంబ వృక్షములు గలవు. త్రిపురాంతకంలో అయితే అమ్మవారి ఆలయం ఉన్న చెరువు కరకట్టయందు కదంబ కుసుమ వృక్షములు ఉన్నవి. అక్కడ ఒకనాడు కదంబ వనమే ఉండేదని అంటారు. ఈ కదంబం పూలు అరుణారుణవర్ణంతో పొడవైన సుమారు ఎనిమిది అంగుళముల తొడిమపై గెలల మాదిరిగా ఉండి అటువంటి తొడిమలు వృక్షము నిండా ఉంటాయి. వీటిని దైవ కదంబములు అని అంటారు. సాధారణంగా బంతిపువ్వు సైజులో కదంబం పువ్వు చూస్తూ ఉంటాము. అది కదంబకుసుమమే కావచ్చు. కాని అమ్మవారికి ప్రియమైన కదంబ వనంలోని కదంబ కుసుమం మాత్రం కాదు. వాటిని రాక్షస కదంబములు అని అంటారు. దైవకదంబ కుసుమముల పూలగుత్తిని చెవులపైభాగంలో అమ్మవారు ధరించినది. కేవలం కదంబం పూవు మాత్రమే కాదు, పూలగుత్తిని ధరించింది అంటే జగన్మాత చెవులు విశాలంగా, సుదీర్ఘంగా ఉండి, పూలగుత్తులను భరించగలిగినంత దృఢత్వముగా ఉన్నవని భావించదగును. శ్రీమాత కర్ణములు శ్రీకారములవలెను, శ్రీకరములుగాను శ్వాసలోని సోహంలో ఓం కార శ్రవణానందమును గూర్చు మంగళకరమైన శ్రవణములు మరియు అమ్మవారి కుడిచెవిని ఉ కారం తోను, ఎడమ చెవిని ఊ కారం తోను న్యాసం చేయవలెను. న్యాసము అనగా జపతపాలు చేసేటప్పుడు ఆయా అవయవాల వద్ద మంత్రాక్షరాలను ఉంచడం అని విశేషార్థం. అంగన్యాస, కరన్యాసాలు ఈవిధమైనవే. మంత్ర పఠనంతో ఆయా అవయవాల విూద దేవతలను ఉంచినట్లు భావించడం. గణేశ, గ్రహ, నక్షత్ర, యోగినీ, రాశి, పీఠ న్యాసాలు అనే ఆరు న్యాసాలు ఉన్నాయి.
కదమ్బమంజరీక్లుప్తకర్ణపూర మనోహరి అయిన శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరాయై నమః అని అనవలెను.
*****
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
23వ నామ మంత్రము
ఓం పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభువే నమః
పద్మరాగ శిలలను, అద్దాన్ని తిరస్కరించే చెక్కిలిగల (నున్నని, నిర్మలమైన గండ స్థలం గల) పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్రనామావళి యందలి పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూః అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభువే నమః అని ఉచ్చరించుచూ మిగుల భక్తిప్రపత్తులతో ఆ జగదాంబను ఆరాధించు సాధకునకు భౌతిక, ఆధ్యాత్మికములైన కామనలు సిద్ధించును.
పద్మరాగమణులతో తయారైన అద్దము చాలా నున్నగా, నిర్మలంగా అందులో చూచువారి ముఖము కడు నిర్మలంగా గోచరిస్తుంది. పద్మరాగ మణులను సహితం తిరస్కరించేటంతటి అందముగాను, నిర్మలముగాను జగదాంబ కపోలములు ఉండునని వశిన్యాది వాగ్దేవతలు వర్ణించి తరించారు.
పద్మరాగమణులు పండుదానిమ్మగింజ వంటి ఎఱుపుగా ఉంటాయి, ఈ రంగు ప్రేమకు, అనురాగానికి చిహ్నము, అలాగే పద్మరాగమణులకు సహజముగానే కాంతి ఎక్కువ.
అమ్మవారి ముఖము అంతకన్నా అందముగా ఉంటుందని భావమ.
జగదాంబ త్రిపురసుందరి, పైగా నిత్య యౌవన సంపన్నురాలు, యుక్తవయసు స్త్రీలు లావణ్యవతులేగదా! అంతటి అందమైన మగువల కపోలములు సహజంగానే మెరుస్తూ ప్రతిబింబం గోచరించునంతటి శోభకలిగి ఉండునుగదా! అంతటి మృదుత్వము, నునుపుదనము, నిర్మలత్వము అమ్మవారి కపోలములకు గలదని వశిన్యాది వాగ్దేవతల స్వయంగా అమ్మవారిని దర్శించి లోకానికి తెలియజేశారు.
ఆది శంకరాచార్యులవారు తమ సౌందర్యలహరియందు, ఏబది తొమ్మిదవ (59వ) శ్లోకములో అమ్మవారి కపోలములను, చెవి తాటంకములను ఈ విధంగా వర్ణించారు.
స్ఫురద్గండాభోగ - ప్రతిఫలిత తాటంక యుగళం
చతుశ్చక్రం మన్యే - తవ ముఖమిదం మన్మథరథమ్|
యమారుహ్య ద్రుహ్య - త్యవని రథ మర్కేందుచరణం
మహావీరో మారః - ప్రమథపతయే సజ్జితవతే||59||
దేవి చెక్కిళ్ళలో ప్రతిబింబించుచున్న ఆమె తాటంకముల కారణముగ ఆమె ముఖము నాలుగు చక్రములు కలిగిన మన్మథుని రథమువలె నున్నది. అట్టి సుందర ముఖము నాశ్రయించి మన్మథుడు శివునితో తలపడుటకు సంసిద్ధుడయ్యెను.
ఓ జగదంబా! నీ ముఖం నా హృదయకమలమునందు మన్మథ రథంలా గోచరమగుచున్నది. ఎందుచేతననగా - నీ చెక్కిళ్ళు ( బుగ్గలు, దవడలు) అద్దమువలె నున్నగా నిగనిగలాడుతూ ప్రకాశించుటచేత నీ చెవులకు ధరించిన ఆ చెవి తాటంకముల జంట యొక్క నీడ నీ బుగ్గలపై పడి పెద్ద వలయాకార నీడలతో రెండు చక్రములుగా అగుపించుచున్నవి. అలాగే నీ చెవులకు ధరించిన చెవి తాటంకములు రెండూ మరోరెండు చక్రముల వలె కనిపించుచున్నవి. ఇలా వెనుక తాటంకములు, ముందర బుగ్గలపై వాటి నీడలు మొత్తం నాలుగు చక్రాల మధ్య అతి సుందరమైన నీ ముఖము మన్మథుని రథంలా కనబడుచున్నది. అటువంటి నీ ముఖాన్ని రథం చేసుకుని ఆ మన్మథుడు అమిత పరాక్రమముతో అతిలోక వీరుడై, సూర్య చంద్రులే రెండు చక్రములుగా ఉన్న రథం కలిగిన, ఆ త్రిపురాంతకుడైన పరమశివునిపై యుద్దము ప్రకటించుచున్నట్లు అనిపించుచున్నది.
ఇచట శంకరుడు అమ్మ వశమగుటలో మన్మథుని గొప్ప ఏమియూ లేదు. అదంతయూ ఆ పరమేశ్వరి సౌందర్యం యొక్క గొప్పదనము. అందుకే ఆనాడు శంకరుని తన మన్మథ బాణాలతో జయించలేక దగ్ధమైన కాముడు ఈనాడు అమ్మ సౌందర్యమును ఆలంబనగా చేసుకుని శంకరుని జయించగలిగానని మురిసిపోవుచున్నాడు అని ఆ జగద్గురువుల భావన. అంతేకాదు మన్మథుడు అందానికి ప్రతీక. మన్మథునితో పోల్చడం అంటే అమ్మ సౌందర్యం అందానికి పరాకాష్ట అని భావించారు.
శ్రీలలితామాత చెక్కిళ్ళు లేత ఎఱుపు రంగులో ఉండి, కామేశ్వరుని ప్రతిబింబిస్తున్నాయి. అందుచేతనే క్రమ బద్ధంగా సమస్త సంసారాన్ని కలిగిస్తున్నాయి.
అద్దంకూడా దుమ్ముపట్టి, అందులో కనబడే ప్రతిబింబము స్పష్టతో కోల్పోయి ఉండవచ్చు.
పద్మరాగములు సహితం ఎప్పటికప్పుడు శుభ్రపరచకపోతే తమ కాంతిని స్పష్టంగా చూపలేవు.
కాని అమ్మవారి కపోలములు సతతము నిర్మలంగానే ఉంటాయి. అందుకనే పద్మరాగములను, అద్దమును కూడా అమ్మవారి కపోలములు పరాభవించునంతటి నిర్మలత్వము, నునుపు, కాంతివంతము సంతరించుకుని ఉంటాయి. అందుకనే ఆ పరమేశ్వరి పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూః అని యనబడినది.
అంతటి అందమైన కపోలములు కలిగిన తల్లికి నమస్కారించునపుడు ఓం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభువే నమః అని అనవలెను.
******
శ్రీమాత్రేనమఃశ్రీలలితా సహస్రనామ భాష్యము
24వ నామ మంత్రము
ఓం నమవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదాయై నమః
అప్పుడే సానబట్టిన ఎర్రని పగడముల రంగును, బాగాపండి ఉన్న దొండపండు ఎఱుపును సహితం ధిక్కరించేటటువంటి పెదవులతో భాసిల్లు జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్రనామావళి యందలి నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా అను పదునారు అక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం నవవిద్రమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరాశక్తిని దీక్షతో ఉపాసన చేయు సాధకులు నిశ్చయంగా ఎదుటవారిని నొప్పించకుండా ఉపాసనను కొనసాగిస్తూ పరాశక్తి అనుగ్రహంతో బ్రహ్మజ్ఞాన సంపదలతో పాటు ఆత్మానుభూతిని పొందగలరు.
మహిషాసురుని సంహరించుట దేవతలవలన సాధ్యపడలేదు. దేవతలందరూ త్రిమూర్తులను శరణుకోరారు. మహిషాసురుడు కేవలం ఒక స్త్రీశక్తిచేత మాత్రమే సంహరింపబడునని విష్ణుమూర్తి చెప్పాడు. ఆ స్త్రీశక్తి వివిధ దేవతల అంశలతో ఏర్పడిన అవయవ సంపదగలిగినదై, సకల దేవతల నుండి పొందిస ఆయుధ బలశ్రీ గలిగినదిగా ఉండవలెను అని కూడా శ్రీమహావిష్ణువు వచించడం జరిగినది. ఆ విధముగా బ్రహ్మాది దేవతల శరీరములనుండి అద్భుతమైన తేజస్సు బయటకు వచ్చినది. ఆ తేజస్సే ఒక మహత్తర స్త్రీమూర్తిగా రూపుదిద్దుకున్నది. ఆమెయె శ్రీలలితా త్రిపురసుందరి. వివిధ దేవతల అంశల నుండి ఆ పరమేశ్వరికి అంగసంపద లభించినది. ఆ క్రమంలోనే అమ్మవారికి సూర్యుని యొక్క తేజస్సుతో మిగుల లాలిత్యము, మృదుత్వములతో కూడిన అధరోష్ఠము (క్రిందిపెదవి) ప్రకటితమయ్యెను. పైపెదవి కార్తికేయుని తేజస్సుతో ఉత్పన్నమయ్యెను. ఈ విషయము దేవీభాగవతమునందు, పంచమస్కంధమునందు, అష్టమోధ్యాయమునందు
అధరశ్చా తిరక్తోఽస్యాః సంజాతోఽరుణతేజసా|
ఉత్తరోష్ఠస్తథా రమ్యః కార్తికేయస్య తేజసా॥69॥
అని ఈ అరువది తొమ్మిదవ శ్లోకంలో వివరించబడినది.
అమ్మవారి అధరోష్థము (క్రింది పెదవి) సూర్యుని తేజముచే ప్రకటితమయ్యెను. అమ్మవారి క్రింది పెదవిని బింబము (దొండపండు అని అంటారు.
అమ్మవారి పై పెదవి కార్తికేయుని తేజస్సుతో ఉత్పన్నమయ్యెను. అమ్మవారి పైపెదవి విద్రుమము (పగడము) వలె ఎర్రగా ఉన్నది.
కాని అమ్మవారి పెదవులు సానబట్టిన పగడమును, బాగా పండిన దొండపండ్లను వెక్కిరించుచున్నవి అని వశిన్యాదులు అన్నారు. అది ఎలాగ అంటే అమ్మవారి పైపెదవి సానబట్టిన పగడమువలె ఎర్రగా ఉన్నది, కాని సానబట్టిన పగడమువలె గరుకుగాను, రాయివలెను గాక లాలిత్యము, మృదుత్వముతోను ఉన్నది. అందుచేతనే అమ్మవారి పైపెదవి సానబట్టిన (ఎర్రని) పగడములను (నవవిద్రుమమును) సైతము ధిక్కరించుచున్నది అని చెప్పబడినది. అలాగే అమ్మవారి క్రిందిపెదవి బింబశ్రీ (దొండపండుయొక్క శోభతో) తేజరిల్లుచున్ననూ, బింబశ్రీవలె (దొండపండుశోభవలె) అశాశ్వతముగాక (దొండపండు స్థిరత్వము రెండు లెేదా మూడురోజులు మాత్రమే. బాగా ఎరుపెక్కిన పిదప మృదుత్వం పోయి చితికి పోవును) గనుకనే నిత్యయౌవనవతియైన అమ్మవారి క్రింది పెదవి సతతము శోభిల్లుచూ బింబశ్రీలను (దొండపండు యొక్క శోభలను) తిరస్కరించుచున్నది అని చెప్పబడినది.
శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు అరువది రెండవ శ్లోకంలో అమ్మవారి పెదవులను ఇలా వర్ణించారు:-
ప్రకృత్యాஉஉరక్తాయాం -స్తవ సుదతి దంతచ్ఛదరుచేః
ప్రవక్ష్యే శాదృశ్యం - జనయతు ఫలం విద్రుమలతా |
న బింబం తద్బింబ -ప్రతిఫలనరాగా దరుణిమమ్
తులామధ్యారోఢుం - కథమివ న లజ్జేత కలయాః || 62 ||
అమ్మా! జగదీశ్వరీ! చక్కని పలువరుసతో ఒప్పారు ఓ పరమేశ్వరీ! సహజసిద్దంగా మిక్కిలి ఎర్రగా కెంపువర్ణంతో విరాజిల్లుతున్న నీ పెదవులకు ఉపమానంగా పోలిక చెబుదామంటే ఈ లోకంలో అందుకు సరిపడునది ఏమియూ కనబడుటలేదు. ఎందుచేతననగా నీ క్రింది పెదవి సహజమైన ఎర్రని కాంతి కలిగినది. అంత ఎర్రదనం కావాలంటే ఎర్రని పగడపు తీగెలకు కాయలు కాసి అవి ఎర్రగా పండితే వాటితో తప్ప నీ పెదవులను వేరే వాటితో పోల్చలేము. కాని అసలు లోకంలో పగడపు తీగలు అనేవి లేవు. అవి కవుల యొక్క అతిశయోక్తి వర్ణనతప్ప అవి నిజం కాదు. పోని ఎర్రని దొండపండుతో పోల్చుదామా అంటే అదీ కుదరదు ఎందుకంటే దానికి బింబఫలమని పేరు. అనగా ప్రతిరూపమైన ఫలము అని. దానికి ఆపేరు ఎలా వచ్చిందంటే అది ఎర్రగా ఉండటం చూసి అరే ఇది అమ్మ పెదవులకు ప్రతిబింబంలా ఎర్రగా ఉందే అని దానికి బింబఫలం అన్న పేరు నీ పెదవులను బట్టి వచ్చింది. పైగా దానికా వర్ణం నీ అనుగ్రహం వల్లే వచ్చినదే. అందువల్ల అమ్మా నీ పెదవులు నిరుపమానమైన శోభతో ఒప్పారుచున్నవి.
ఈ విషయాన్ని వశిన్యాదులు గ్రహించి నవవిద్రుమబింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా - క్రొత్తపగడముయొక్క (నవవిద్రుమ) మరియు దొండపండుయొక్క శోభను (బింబశ్రీ) తిరస్కరించిన (న్యక్కారి) పెదవులు గలది (రదనచ్ఛదా) యని అమ్మవారిని కీర్తించారు. ( రదన అనగా పలువరస. ఛదము అనగా కప్పునది లేదా తెర. రదనచ్ఛద అనగా పలువరుసను కప్పునది అనగా పెదవి). అప్పుడే సానబట్టి ఎర్రని కాంతులు విరజిమ్మే పగడమును, బాగా పండిన ఎర్రని దొండపండును సహితము ధిక్కరించు నటువంటి పెదవులు గలిగినది శ్రీమాత అను భావము వెల్లడియగును. అంతటి శుభప్రదమైన పెదవులు భక్తులయెడ కరుణారస పూరిత అనురాగ వచనములు పలుకును. దుష్టులయెడ మరింత ఎరుపెక్కి, నొక్కిపెట్టి రౌద్రమునిండిన పరుషవచనములు పలుకును. అమ్మవారి పెదవులు ఆమె బిడ్డలైన భక్తులకు అత్యంత మనోహరమై, ద్విజపంక్తిద్వయోజ్వలమైనపలువరసకు తెరలై శోభాయమానమై విరాజిల్లుచూ కరుణాపూరిత అనుగ్రహ భాషణము, మంజులమైన దరహాసచంద్రికలు భక్తులమైన మనకందరికీ అభీష్టదాయకములు.
ఆ తల్లి పాదపద్మములకు నమస్కరించునపుడు ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా అని అనవలెను.
🌹
శ్రీమాత్రేనమః శ్రీలలితా సహస్రనామ భాష్యము
25వ నామ మంత్రము
ఓం శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలాయై నమః
శ్రీవిద్య (శుద్ధవిద్య) యందుగల పదహారు వర్ణరూపాల (బీజాక్షరముల) వలె ప్రకాశిస్తున్న దంతపంక్తుల జంట గల తల్లికి నమస్కారము.
శ్రీలలితాసహస్ర నామావళి యందలి శుద్ధవిద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్జ్వలా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామమంత్రమును ఓం శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని ఆరాధించు ఉపాసకులను అమ్మ కరుణిస్తుంది. అజ్ఞానాన్ని తొలగిస్తుంది. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. క్రమంగా వారికి సాధనా పటిమచే పరమపద సోపానములు ఆసన్నమగును.
అమ్మవారి పలువరుస శుద్ధవిద్యాంకురాకారములు అని వశిన్యాది వాగ్దెేవతలు అన్నారు. అమ్మను సంతోషపెట్టడానికి అన్నారా? అంటే కాదు. శ్రీవిద్యయే శుద్ధవిద్య. శుద్ధవిద్య అనగా జ్ఞానవిద్య. నేను-ఇది అను భేదబుద్ధి లేనిదే ఈ శుద్ధవిద్య. పరమేశ్వరి శుద్ధవిద్యాంకుర స్వరూపులగు బ్రాహ్మణులు (ద్విజులు) అను పలువరుసలతో ప్రకాశిస్తున్నదని యనబడినది. అమ్మవారి పలువరుస షోడశీమంత్రములోని పదహారు బీజాక్షరములతో సమన్వయించబడినది.
త్రిపురసుందరినే షోడశీ మంత్రస్వరూపిణి (శుద్ధవిద్యాస్వరూపిణి) యని అన్నారు. దశమహావిద్యలలో కాళి, తార తరువాత మూడవ మహావిద్యయే త్రిపురసుందరి. శ్రీవిద్యలో ఈ త్రిపురసుందరి శ్రీలలితా పరమేశ్వరిగా ఆరాధింప బడుచున్నది. ఈ త్రిపురసుందరినే రాజరాజేశ్వరి, కామేశ్వరి మరియు మహాత్రిపురసుందరి అని అంటారు. ఈ తల్లి ముల్లోకములయందును సాటిలేని దివ్యమైన, మహోత్కృష్టమైన సౌందర్యవతి యగుటచే త్రిపురసుందరి యని అనబడినది. సత్త్వ, రజస్, తమములు అను త్రిగుణములకు అతీతురాలు. షోడశకళాప్రపూర్ణురాలు ఈ లలితా త్రిపురసుందరి యగుటచే షోడశి యని అనబడినది. చంద్రునికి గల షోడశకళలు అమ్మవారినుండే లభించినవి. వీరినే షోడశనిత్యలనియు, పదహారవదియగు మహానిత్యయే ఈ త్రిపురసుందరి. షోడశీ మంత్రమునకు పదహారు బీజాక్షరములు. క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం - అనునది పంచదశీ మంత్రము అయితే పంచదశీమంత్రమునకు శ్రీం అను బీజాక్షరం చేర్చితే శ్రీం క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం అను షోడశీ మంత్రం వస్తుంది. షోడశీ మంత్రంలోని పదహారు అక్షరములను శుద్ధ విద్యాంకురములు అని వశిన్యాదులు చెప్పారు.
అ నుండి అః వరకూ గల అక్షరాలు అచ్చులు. ఇవి శక్తిస్వరూపాలు. క నుండి క్ష వరకూ గల హల్లులు శివస్వరూపాలు. అక్షరమునకు పూర్తి స్వరం రావాలంటే అచ్చులు, హల్లుల కలియిక ఏర్పడాలి. షోడశిమంత్రంలోని పదహారు బీజాక్షరములు పదహారు అచ్చులు, పదహారు హల్లుల కలియిక (పదహారు జతలు) అగుటచే ముప్పది రెండు అవుతాయి. ఈ ముప్పది రెండు సంఖ్యయే అమ్మవారి రెండు పలువరసలలోని ముప్పది రెండు దంతముల సంఖ్య.
మంత్రము ఉచ్చారణ అనేది శబ్దము. ఆ శబ్దమునకు (వాక్కునకు) స్పష్టత చేకూరుటకు పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అను నాలుగు దశలు గలవు.
పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ వాక్స్వరూపములు
పరబ్రహ్మతత్త్వ విచారణ సందర్భంలో వాక్కు నాలుగు విధాలుగా చెప్పారు. 1. పరా, 2. పశ్యంతి, 3, మధ్యమ, 4. వైఖరి. మనిషి అక్షర సముదాయాన్ని ఏర్పరచుకొని, వాటి సహాయంతో అంతులేని సాహిత్యాన్ని సృష్టించుకొన్నాడు. కాని, దృగ్గోచరమైన సృష్టికి మూలాన్ని అన్వేషించడానికి సతమతం అవుతున్నాడు. ఈ పరిస్థితిని చిత్రించే ఒక శ్లోకం ఉంది. పరా వృక్షేషు సంజాతా, పశ్యంతీ భుజగీషుచ, మధ్యమావై పశుశ్చైవ, వైఖరీ వర్ణ రూపిణీ. చెట్టు నుంచి చివుళ్లు, ఆకులు, కొమ్మలు, పూలు, ఫలాలు వస్తాయి. కాని తన వల్లనే వస్తున్నాయని చెట్టు గుర్తించదు. పాముకు చూడటానికి కళ్లేగాని, వినడానికి ప్రత్యేకం ఒక శ్రవణేంద్రియం అనేది లేదు. పశువు అంబా అంటుంది. కాని, అంబను తెలుసుకొనలేదు. మనిషి కూడా అలాగే సృష్టిమూలాన్ని తెలుసుకొనలేక పోతున్నాడు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ శబ్దాలకు నిర్వచనం చెప్పే సందర్భంలో ఇచ్చిన ఈ నాలుగు ఉపమానాలు వరుసగా ఈ పదాలకు వర్తిస్తాయి. మరొక విధంగా కూడా ఈ పదాలకు అర్థం చెప్పారు.
ఏదైనా ఒక పనిని తలపెట్టినప్పుడు తలపునకు పూర్వస్థితి పరా వాక్కు. తలపు పశ్యంతీ వాక్కు. ఆలోచన కార్యరూపం ధరించే ముందున్న ఊహస్థితి మధ్యమ వాక్కు. తలపు కార్య రూపం ధరించడం వైఖరీ వాక్కు. పరా విత్తు మొలకెత్తడానికి ముందు స్థితి.
అంటే, విత్తు భూమిలో పడి, ఉబ్బి, మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నస్థితి. మొలక విత్తులోనుంచి పైకి రావడం, అంటే ఆలోచన మొలకెత్తడం పశ్యంతి మొక్క ఎదిగి, వృక్షంగా మారడం మధ్యమ స్థితి. పూత పూయడం, పూలు ఫలాలు కావడం, పరిపూర్ణం చెందడం వైఖరి
ఇందులో పరా అనునది ఊహ, బ్రహ్మరంధ్రంలో ఇది పుడుతుంది. పశ్యంతి అనునది మూలాధారంలో గాలిబుడగగా మారి పశ్యంతీ వాక్కుగా పరిణమిస్తుంది. దీనినే మొలకెత్తుతున్న విత్తనము అనవచ్చు. తరువాత పరిణామంలో మొలకకు రెండు దళములు వచ్చి అది ఏ మొలక తెలియని స్థితివలె పశ్యన్తీ వాక్కు అయి ఉంటుంది. మూడవ దశలో ఆ మొలకలోని రెండు దళములు విడిపోయి కొంత వరకూ తెలిసినట్లు మధ్యమవాక్కు కంఠమువద్ద ఉన్న విశుద్ధి చక్రంలోని పదహారు దళములలోని అచ్చులతో చేరి నాలుగవ దశలో మొలక ఏ మొక్క అయినదో తెలిసినట్లు వాక్కుకు స్పష్టత ఏర్పడి శబ్దము అర్థమవుతుంది. దీనినే వైఖరీ వాక్కు అంటారు. బ్రహ్మరంధ్రంలో జనించిన ఊహామాత్రపు శబ్దము, మూలాధారము నుండి అనాహతము వరకూ కేవలము హల్లులుగా ఉండి స్పష్టతలేని వాక్కును పరా, పశ్యంతి, మధ్యమ వాక్కులుగా చెపుతారు. విత్తనము మొలకెత్తు రీతిలో కూడా పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అను దశలు గలవు. వీటినే బీజమువలె ఉబ్బుట (పరా), స్ఫుటము అగుట (పశ్యంతి), ముకుళించి దళ ద్వయము అగుట (మధ్యమ), వికసించుట (వైఖరి) అనేవి నాల్గు దశలు అందురు.
పరమేశ్వరి షోడశీ విద్యను ఉచ్చరించి తన శిష్యలకు ఉపదేశించెను. ఆ శిష్యులు తమ శిష్యులకు ఉపదేశీంచిరి. శ్రీవిద్య అలాగే గురుశిష్యపరంగా వ్యాప్తినొందినది. విత్తనసారము చెట్టంతయు ఇమిడినట్లు షోడశీ బీజములలో శబ్దసముదాయము అంతయూ ఇమిడి ఉన్నది.
అమ్మవారి పలువరుసను ద్విజపంక్తిద్వయము అని వశిన్యాదులు అన్నారు. దంతములు తొలుత పాలదంతములు ఊడి మరల రెండవమారు దంతములు రెండవసారి పుట్టును. గనుక ద్విజపంక్తిద్వయము అంటే దంతపంక్తుల జంట అని భావము.
వేదములు, ఉపనిషత్తులు వంటి విద్యలన్నియును బ్రాహ్మణులను ఆశ్రయించుకొని ఉన్నవి. ఈ మాట వేదములందు చెప్పబడినది. కాని బ్రాహ్మణునిగా పుట్టినంత మాత్రమున వేదాది విద్యలకు అర్హుడు కాలేడు. బ్రాహ్మణునికి ఏడవ ఏట ఉపనయనం జరిపించుతారు. ఉపనయనాన్ని వడుగు అని కూడా అంటారు. బాల్యావస్థ నుండి బ్రహ్మచర్యవస్థకు మారే సమయాన ఇది చేయడం ఆనవాయితీ. అప్పటి వరకు నియమ నిష్ఠ లతో పనిలేకుండా సంచరించే బాలుడు నియమ నిష్ఠలతోకూడిన జీవితంలో ప్రవేశించడానికి చేసే శాస్త్రీయమైన ప్రక్రియ ఇది. ఉపనయనానికి ముందు ఒక జన్మ తరువాత ఒక జన్మగా కూడా వ్యవహరించడం వలన ఉపనయనానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చే బ్రాహ్మణుని సమాజంలో ద్విజుడు అని నామాంతరంతో వ్యవహరిస్తుంటారు. అటువంటి ద్విజులు తాము అభ్యసించిన వేదములను తమ శిష్యులకు ఉపదేశింపగా, వారు తమ శిష్యులకు ఉపదేశింపగా, వారు తమ తమ శిష్యులకు ఉపదేశింపగా వేదవిద్య విత్తనం నుండి చెట్టు విస్తరించినట్టు వేదవిద్యా వృక్షము విస్తరించినది. గనుక ద్విజులు (బ్రాహ్మణులు) విద్యాంకుర స్వరూపులు. అంతేకాదు వేదస్వరూపిణి అయిన శ్రీమాత శుద్ధవిద్యాస్వరూపిణి యగుటచే శుద్ధవిద్యకూడా వేదవిద్యయే గనుక ద్విజులు (బ్రాహ్మణులు) శుద్ధవిద్యాంకురాకారములు అయారు. అటువంటి శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయముతో భాసిల్లు పరమేశ్వరి శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా యని వశిన్యాది వాగ్దేవతలచే కీర్తించబడినది.
అటువంటి పరాశక్తికి నమస్కరించునపుడు ఓం శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలాయై నమః అని అనవలెను
🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
26వ నామ మంత్రము 20.1.2022
ఓం కర్పూరవీటికామోద సమాకర్ష ద్దిగంతరాయై నమః
కర్పూరాది సుగంధచూర్ణ మిశ్రితమైన తాంబూల చర్వణముతో దిగంతముల వరకూ పరిమళములను వెదజల్లు శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళియందలి కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం కర్పూరవీటికామోద సమాకర్ష ద్దిగంతరాయై నమః అని ఉచ్చరించుచూ శ్రీమాతను ఉపాసించు భక్తులకు ఆతల్లి కరుణచే సర్వవిద్యలు, కళలు అనాయాసముగా ప్రాప్తించి ఐహికముగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానసంపదలు పొంది తరింతురు.
తమలపాకుకు సున్నంరాసి, కవిరి (కాచు) పొడి జల్లి,పచ్చి పోక, వక్కపొడి, పచ్చకర్పూరము, యాలకులు, లవంగాలు, చలువ మిరియాలు, నాగకేసరములు, జాజికాయ, జాపత్రి, కుంకుమపువ్వు, ఎండుకొబ్బరి, పొదీనా పువ్వు తగుపాళ్ళలో వేసిన తాంబులము పరిమళ భరితంగా ఉంటుంది. అట్టి తాంబూల చర్వణము వలన పరిమళములు నలుదిశల వ్యాప్తిచెందుతాయి. అటువంటి తాంబులము శ్రీమాత వేసుకుంటే నోరు పండిందట, పరిమళములు దిగంతములవరకు వ్యాపించినవట. అమ్మను తాంబూల పూరిత ముఖీ (తాంబూలముతో పూరింపబడడం వల్ల ఎర్రబడిన నోరు గలిగిన తల్లి) అని 559వ నామంలో కూడా శ్రీమాతను స్తుతించాము.
తాంబూల సేవనం వలన పళ్ళకు గట్టితనము, జీర్ణశక్తి కలిగించడమేగాక, నోరు ఎర్రగా పండి అందంగా ఉంటుంది. పచ్చ కర్పూరము స్వచ్ఛముగా, తెల్లగా, నిర్మలంగా, చల్లగా, తేలికగా ఉంటుంది. తన స్థూల అస్తిత్వాన్ని తక్కువకాలంలో పోగొట్టుకుంటుంది. తనలోని అగ్నిని తక్కువ కాలంలో వ్యక్తం చేస్తుంది. వెలుగును పరిమళాన్ని ఇస్తుంది. పచ్చకర్పూరము స్థూలస్థితి అయినా ఘనస్థితిలో ఉన్నా - ద్రవస్థితి చెందకుండానే సూక్ష్మస్థితి అయిన వాయుస్థితి లోనికి సూటిగా తక్కువ కాలంలో మారగలదు. అందువల్ల స్థూలలోకంలో ఉండేవారి నుండి వారి సూక్ష్మశరీరం వేరై తక్కువకాలంలోనే సూక్ష్మలోకాల్లో విహరించడానికి వారికి అనుభూతిపరంగా ఈ కర్పూరం దోహదపడుతుంది.
అమ్మవారు తాంబూలచర్వణము చేస్తుంటే, తాంబూలములోని సుగంధద్రవ్యముల పరిమళము దిగంతములవరకూ వ్యాప్తిచెందియున్నది. ఆ తాంబూల పరిమళమూలను ఆఘ్రాణించిన దేవతలు అమ్మవారి తాంబూల కబళములు తమ ప్రసాదంగా సేవించాలని తహతహలాడారు. అంతేకాదు అమ్మవారి నోటతాంబూల పరిమళములకు నలుదిశల ఉన్న భ్రమరములు ఆ పరమిళమనునది ఏదో సుమ పరిమళముగా భావించి ఝంకారములు చేస్తూ అమ్మవారి దిశగా ఎగిరి వచ్చినవి. తీరా అమ్మవారి వద్దకు వచ్చి పరికించితే, అమ్మవారి తాంబూల పరిమళములతో బాటు, అమ్మవారి కేశసంపదనుండి వెడలివచ్చు పరిమళములను కూడా గ్రహించాయి. ఆ భ్రమరములు మకరందము కొరకు అమ్మవారి తలలోని చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక పుష్పములమీద వ్రాలాయి. అమ్మవారి అనుగ్రహానికి ఆరాటపడు భక్తులు కూడా ఇంతే. ఆ తాంబూల పరిమళము అమ్మవారి కరుణాంతరంగము అయితే, శ్రీలలితా సహస్ర నామ స్తోత్రపఠనమధురస్వన మకరందమును గ్రోలుటకు ఆరాటపడు భక్తులు కూడా ఆ భ్రమరములవంటివారే.
అమ్మవారి తాంబూల చర్వణము పై శంకరభగవత్పాదులవారు తమ సౌందర్య లహరియందు అరువది ఐదవ శ్లోకంలో ఇలా వర్ణించారు:
రణే జిత్వా దైత్యా - నపహృతశిరస్త్రైః కవచిభిః
ర్నివృత్తై శ్చండాంశ - త్రిపురహరనిర్మాల్యవిముఖైః|
విశాఖేంద్రో పేంద్రై - శ్శశి విశద కర్పూరశకలా
విలీయంతే మాత - స్తవ వదన తాంబూలకబళాః ||
అమ్మా! పరమేశ్వరీ! ఒకసారి శివుని ఆజ్ఞతో కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువు ముగ్గురు రాక్షసులపైకి యుద్దానికి వెళ్ళి వారిని జయించి తిరిగి కైలాసం చేరుకున్నారు. యుద్దవిజేతలైన వారిని సత్కరించదలచి శివుడు వారికి ఏవో బహుమానాలు ఇవ్వబోగా శివద్రవ్యం ( నిర్మాల్యం) పొందే అర్హత చండీశ్వరునికే కాని మనం పుచ్చుకోరాదనుకున్నారో ఏమో గాని, వారు అవి స్వీకరించకుండా అక్కడనుండి వారు సరాసరి లోపల అంతఃపురంలో విలాసంగా బంగారు ఊయల ఊగుతూ తాంబూలం చర్వణం ( నములుతూ) చేస్తున్న నీ వద్దకు వచ్చారు. వారి శిరములపై ఉన్న కిరీటాలు తీసి ప్రక్కన పెట్టి నీ పాదాలకు నమస్కరించగా నీవు వారిని చూసి మాతృ వాత్సల్య పూరిత కటాక్షం తో వారిని అనుగ్రహించుచూ చక్కటి దరహాసం చేసినావు. అదుగో అప్పుడే నీ నోటినిండా తాంబూలం ఉండుట చేత, నవ్వుటకై నీవు నోరు తెరచిన వెంటనే నీ నోటి నుండి పచ్చకర్పూర సహితమైన తాంబూల తమ్మల కబలములు ( ముద్దలు) క్రింద పడినవి. అంతే అది చూచిన ఆ కుమార, ఇంద్ర, విష్ణువులు శంకరుడు ఇవ్వబోయిన వజ్ర వైడూర్య రత్నఖచితములైన సంపదలు సైతం ఆశించని ఆ మువ్వురూ నీ నోటి నుండి క్రింద పడిన తాంబూల ముద్దలకై పోటీపడి వాటిని కాజేసి వాటిని భుజించుచున్నారు.
అమ్మకు కుమారస్వామి మాత్రమేకాదు ఇంద్రాది దేవతలు, బ్రహ్మ, విష్ణు, రుద్రులు అందరూ బిడ్డలే. యా విద్యా శివకేశవాది జననీ , యా బ్రహ్మాది పిపీలకాంత జననీ అని కదా అమ్మ జ్ఞాన శ్లోకములు. ఈ జగత్తులోని వారంతా ఆమె బిడ్డలే. అందుకే అమ్మ జగన్మాత. బిడ్డకు తల్లి భుజించునది తన నోటినుండి తీసి పెట్టిన పరమానందము కలుగును. అమ్మ వద్ద పసిబిడ్డలుగా మసలు ఆ దేవతలకు ( మనకు కూడా ) సంపదల కన్నా అమ్మ ప్రేమయే ముఖ్యం అని భావము). అమ్మా నీ నోటిలోని తాంబూలము అంత విశేషమైనది.
అటువంటి శ్రీమాతకు నమస్కరించు నపుడు ఓం కర్పూరవీటికామోద సమాకర్ష ద్దిగంతరాయై నమః అని అనవలెను.
🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
27వ నామ మంత్రము
ఓం నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛప్యై నమః
సంగీత, సాహిత్యములకు అధినేత్రి సరస్వతీదేవి కచ్ఛపీ వీణా మాధుర్యమును సహితం ధిక్కరించునట్లు గలిగిన సంభాషణా మధురిమ గలిగిన శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్రనామావళియందలి నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛప్యై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఉపాసించు ఉపాసకులకు ఆ తల్లి కరుణచేత వారి పలుకులలో మధురిమలు, వినసొంపుగా, ఎదటివారిని మంత్రముగ్ధులను చేసి పలువురిలో కీర్తిప్రతిష్టలు, తద్ద్వారా సకల సౌభాగ్యములు కలుగజేయును. మరియు మంత్రోచ్చారణలో స్పష్టత ఏర్పడి తత్సంబంధమైన దేవతారాధనలో కృతకృత్యులై తరింతురు.
సల్లాపము అంటే మాట్లాడడం లేదా సంభాషించడం. నిజసల్లాపము అంటే శ్రీమాత సంభాషణల లోని మాధుర్యము అనగా అమ్మ మాటలలోని తీయదనం కచ్ఛపీ వీణ అనగా సంగీత, సాహిత్యముల కధినేత్రి అయిన సరస్వతీ దేవి యొక్కవీణా నాదపు తీయదనాన్ని వినిర్భితం (తిరస్కరణ) చేయుచున్నదట.
విష్ణు మూర్తి ఆయుధములైన చక్రం పేరు సుదర్శనం, శంఖం పేరు పాంచ జన్యం, గద పేరు కౌముది, ఖడ్గం పేరు నందకం (ఈ నందకము యొక్క అంశ అన్నమయ్యది), విల్లు శార్ఙ్గము. శివుని విల్లు పేరు పినాకము అందుకే శివుడికి పినాకపాణి అని ఇంకొక పేరు గలదు. అదే విధంగా వీణలకు కూడా పేర్లు ఉన్నాయి ఈ శ్లోకమును గమనిద్దాము.
విశ్వావసో స్సా బృహతీ తుంబురోస్తు కళావతీ
సా నారదస్య మహతీ సరస్వత్యాస్తు కఛ్ఛపీ (సౌభాగ్య భాస్కరము, 203వ పుట)
అనగా యాజ్ఞవల్క్యమహర్షి శిష్యుడు విశ్వావసువు అను గంధర్వరాజు వీణపేరు బృహతి, తుంబురుని వీణ పేరు కళావతి, నారదుని వీణపేరు మహతి మరియు సరస్వతీ దేవి వీణ పేరు కచ్ఛపి ఈ నాలుగు వీణలకు గల తంత్రులు భిన్నముగా ఉంటాయి. కళావతి అనగా తుంబురుని వీణకు నాలుగు తంత్రులు, కచ్ఛపి మరియు మహతీ వీణల్లో ఏడు తంత్రులు, బృహతికి పదిహేను తంత్రులు ఉంటాయి.
కళావతీ వీణ తుంబురునిది కనుక తుంబురుని వీణను తంబురా అన్నారు ఇది వివిధ శృతులను పలకించుతుంది. బృహతి మరియు మహతి వీణలు ఉత్తర హిందుస్థానములో ప్రసిద్ధి అయితే కచ్ఛపీ వీణ దక్షిణ భారతంలో ప్రసిద్ధి.
కచ్ఛపీ వీణకు ఇరువదినాలుగు మెట్లు ఉంటే మిగిలిన రకాల్లో ఇరువది మెట్లే ఉంటాయి, కచ్ఛపీ వీణకు మెట్లు ఎక్కువ ఉండడంచే స్వరస్థానములు ఎక్కవ పలికి స్పష్టత గోచరించడం ప్రత్యేకత.
అంత స్పష్టముగా, మధురముగా కచ్ఛపీ వీణానాదం ఉండడం చేత వశిన్యాది వాగ్దేవతలు (వశినీ, కామేశ్వరి, మోదీని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని) అమ్మ సంభాషణా మాధుర్యం కచ్ఛపీ వీణానాద మధురిమను కూడా తలదన్నుతుందని చెప్పారు. అంటే ఆ పరమేశ్వరి పలుకులు తేనె చినుకులు కన్నా, అమృత బిందువులకన్నా, స్వాతిచినుకుల మధురిమలకన్నా మధురాతి మధురం. అమ్మవారి నిజసల్లాపములకు (పలుకులకు) పోల్చడానికి పోలికలేలేవు. గనుక అమ్మవారి పలుకుల మాధుర్యానికి, ఆ పలుకుల మాధుర్యమేసాటి. పోటీ అని ఇంకే సామ్యమును తెచ్చి చూపలేము.
శంకరాచార్యుల వారు ఇదే సందర్భంలో సౌందర్యలహరియందు తమ అరువది ఆరవ శ్లోకంలో ఇలా అన్నారు
విపంచ్యా గాయంతీ - వివిధ మపదానం పశుపతే|
స్త్వయారబ్ధే - వక్తుం చలిత శిరసా సాధువచనే |
త్వదీయై ర్మాధుర్యై - రపలపిత తంత్రీకలరవాం
నిజాం వీణాం వాణీ - నిచుళయతి చోళేన నిభృతమ్॥66॥
అమ్మా! ఓ లలితాంబా! ఒకసారి నీవు సమస్త దేవతలతో సభలో కొలువుతీరి ఉన్నావు.అదే సమయం లో వీణాపాణి సరస్వతీదేవి నిన్ను ఆనందపరచటం కోసం తన గాత్రాన్ని వీణతో అనుసంధానం చేస్తూ నీ భర్త యైన శివుని వీర గాథలను గానం చేస్తున్నది. అపుడు నీవు ఆ శివగాథా గాన శ్రవణంతో పరవశవై తల ఆడిస్తూ ఉంటావు. అది చూసిన శారద నేను పాడితే ఎవరైనా పరవశులు కావలసిందే అని ఒకింత తాత్కాలిక గర్వమునకు లోనై నిన్ను ఇంకా మెప్పించాలని ఆ వాణి ఇంకా అద్భుతంగా పాడటం మొదలుపెట్టింది. అప్పటివరకు మౌనంగా పరవశిస్తున్న నీవు అపుడు పరమానందంతో సాధు సాధు ( బాగుంది, బాగుంది ) అని శారదను మెచ్చుకున్నావు. అదిగో అప్పుడే కోకిల కలకూజితాన్ని మించిన మాధుర్య శోభతో ఉన్న నీ కంఠస్వరం విని, నీ సామాన్య పలుకుల మధురిమ ముందు ఇంతవరకూ తను చేసిన విన్యాసమంతా ఎందుకూ కొరగాదని తెలుసుకుని ఇక పాడటం ఆపివేసి 'ఎవరైనా చూస్తే పాడలేనమ్మ వీణ పట్టుకు తయారైందని అనుకుంటారేమో' నని సిగ్గుపడి, తన కచ్ఛపి అను వీణను కనబడకుండా తన పైటకొంగుతో కప్పి దాచుకొనుచున్నది.
అమ్మా! నీ పలుకులు సరస్వతీ గానాన్ని మించిన మధురాతి మధురమైనవి.
అమ్మ మామూలుగా సాధు! సాధు అను రెండు మాటలే అంత మాధుర్యంగా ఉంటే, వాత్సల్యంగా, లాలనగా తన బిడ్డలతో మాట్లాడు అనేకపలుకుల మాధుర్యం ఇంకెంత మధురిమలను రుచిచూపించునో! ఆ పలుకుల మాధుర్యం ముందు సంగీత, సాహిత్యాల మేళవింపుతో సాగు గానంలోని తన గాత్రం ఎందుకూ కొరగానిదని సిగ్గుపడి సరస్వతి కచ్చపి అను తన వీణ పై తన పైటకొంగుతో కప్పివేసినది అని అర్ధం. పరాశక్తి సల్లాపము జుంటి తేనియలకన్నా, చిలుకల పలుకల కన్నా ఇంకనూ సరస్వతీ దేవి కచ్ఛపీ వీణానాదమధురిమలకన్నా మధురాతిమధురంగా ఉన్నది
శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సిత కచ్ఛప్యై నమః అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
28వ నామ మంత్రము
ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసాయై నమః
అవధులు లేని చిఱునవ్వు కాంతిప్రవాహములో లయమయిపోయిన కామేశ్వరుని మనస్సును కలిగియున్న జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్రనామావళియందలి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని ఉపాసించు భక్తులు జీవితమంతయు ఒక ప్రక్క చిఱునవ్వుల వెన్నెలలై, తులలేని సుఖసౌఖ్యములనుభవించుట, వేరొక ప్రక్క ఆధ్యాత్మికానందమందుచూ, జగజ్జనని పాదసేవ చేయుట - యను జీవన పయనముగా భావించి తరించుచుందురు.
జగన్మాత త్రిపురసుందరి. అమ్మవారి అందానికి కామేశ్వరుడు మామూలుగానే పులకించి పోతూంటాడు. ఇక ఆ తల్లి కామేశ్వరుని మందస్మితయై ఓరగంట చూస్తే ఆ చిఱునవ్వుల ప్రవాహంలో మునకలు వేస్తూ మనసును అమ్మకు ఇచ్చేస్తాడు, ఆవిధంగా కామేశ్వరుని మనసును దోచేసుకున్న జగన్మాత మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా అను నామముతో స్తోత్రము చేయబడుచున్నది.
సౌందర్య లహరియందు అరువది మూడవ శ్లోకంలో శంకరాచార్యులవారు అమ్మ చిఱు నవ్వును ఇలా వర్ణించారు
స్మితజ్యోత్స్నాజాలం - తవ వదనచంద్రస్య పిబతాం
చకోరాణామాసీ -దతిరసతయా చంచుజడిమా |
అతస్తే శీతాంశో -రమృతలహరీ మామ్లరుచయః
పిబంతీ స్వచ్ఛందం - నిశి నిశి భృశం కాంజి కధియా॥63॥
చకోర పక్షులు దేవి చిఱునగవులనే వెన్నెలను గ్రోలుచున్నవి. అవి అతి మధురములైనందున అందుకు విరుగుడుగా అమృతమును పుల్లని కడుగునీళ్ళగా భావించి త్రాగుచున్నవి.
అమ్మా! జగజ్జననీ! నీ వదనం చంద్రబింబం అయితే నీ చిరునవ్వు చంద్రుడి నుండి కురిసే వెన్నెల. ఆ చిరునవ్వనే వెన్నెలను తాగిన పులుగు ( చకోర) పక్షులు అమృతతుల్యమైన, అతి మాధుర్యమయమైన ఆ తీపికి తమ నోటికి మాధ్యం ( అరుచి లేదా మొహంమొత్తి) కలిగి కొంచెం మార్పు కోసం పులుపును కోరి ఆ అసలు చంద్రుడు యొక్క వెన్నెలను పులికడుగు నీళ్ళుగా భావించి త్రాగుచున్నవి. ( అనగా ఆ చంద్రుని వెన్నెల కాంతులకన్నా అమ్మ ముఖ చంద్రుని మందహాస వెన్నెల కాంతులు గొప్పవని భావన)
{ ఈ శ్లోకంలో అమ్మ ముఖమును, అమృతతుల్య అమ్మ మధుర దరహాసం ను వర్ణించిరి. లోకంలో చకోర పక్షులను ఒక జాతి కలదు.ఈ పక్షులు వెన్నెలరాత్రులలో తల పైకెత్తి చంద్రుని నుండి కురిసే వెన్నెలలోని అమృత బిందువులను త్రాగుతూ ఉంటాయని ప్రతీతి. కవి దీనిని ఉపయోగించుకుంటూ అతిశయోక్తి గా అమ్మా నీ ముఖంలోని చిరునవ్వుల వెన్నెల మాధుర్యం తాగి అతి తీపితో మొహం మొత్తిన ఆ పక్షులు కొంచెం రుచి మార్పు కోసం ( నోరంతా తీపి అయినప్పుడు కారం తిన్నట్లుగా) ఆ చంద్రుని వెన్నెల త్రాగుచున్నాయి తప్ప ఆ వెన్నెల నీ ముఖ మండల చిరునవ్వు వెన్నెల కన్నా గొప్పది కాదు అని శ్రీ శంకరుల వర్ణన.
ప్రళయ కాలమందు అతి కోపంగా ఉన్న కామేశ్వరుని అమ్మ తన చల్లని చిరునవ్వుల వెన్నెలలతో ఆయన మనస్సుని ప్రభావితం చేసి శాంత పరచునని అర్ధం.
పార్వతీ, పరమేశ్వరుల జంట లోకమునకే ఆదర్శమైనది. పుష్పము-పరిమళమ, భ్రమరము-మకరందము వంటివి. అంతటి ఆదర్శజంటయగుటచేతనే ప్రతీ నవవధువుకూడా పాణిగ్రహణానికి ముందు గౌరీపూజను ఆచరిస్తుంది. తనకు కాబోయే భర్త పరమేశ్వరునివంటి వాడనియు, పరమేశ్వరునిలో సగంకావాలని పార్వతి కఠోరమైన వ్రతములాచరించి ఆయనలో చెరిసగము ఎలా అయినదో అదేవిధంగా తమదాంపత్యము కూడా పార్వతీపరమేశ్వరుల వలెనే వర్ధిల్లాలనేది ఆ గౌరీపూజలోని అంతర్భావం. ఒకరికోసం ఒకరైన ఆ పార్వతీ పరమేశ్వరులు, ఈ సృష్టిలోని ప్రకృతి-పురుషులయారు. ఆ తల్లి మందస్మిత, ఒక కాంతి ప్రవాహము. ఆ ప్రవాహంలో పరమేశ్వరుడు మునకలువేస్తూ, ఆనందించిన మనసుకలిగినవాడు. ఆ మనసును తనదిగా చేసుకున్న ఆ పరమేశ్వరి మందస్మితప్రభాపూర మజ్జత్కామేశ మానసా అని వశిన్యాది వాగ్దేవతలచే కీర్తించబడినది.
ఆ పరమేశ్వరి మందస్మితము
కాంతి స్వరూపమైన బ్రహ్మము. అందులో మొదటి కదలికవలన నాదము ఏర్పడినది. ఈ ప్రథమ నాదము సూక్ష్మరూపమైన బిందువుగా ఏర్పడినది. ఈ బిందువునందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభణము కలదు. దీనినే పరాబిందువు అందురు. ఇందులో కామేశ్వర, కామేశ్వరీ స్వరూపములు కలవు. ఈ బిందువే మూల ప్రకృతి దీనికే సర్వానందమయ చక్రమని పేరు. ఈ బిందువే శ్రీచక్రమునకు ఆధారము ఈ పరాబిందువు నందే సృష్టికి కావలసిన శక్తి అంతా బీజప్రాయంగా ఉన్నది. ఆ తల్లి నివాసం బిందుత్రికోణమయితే,
ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులే ఆ త్రికోణములు. ఆ త్రికాణములే భూతభవిష్యద్వర్తమానములకు ప్రతీక. ముల్లోకములకు మూలములు. సత్త్వరజస్తమో గుణములకు అతీతములు.
శ్రీ లలితా కామేశ్వరుల జంట పరస్పరాకర్షణతో, అవినాభావంతో విరాజిల్లుతోంది. అట్టి స్థితిలో ఆ జగన్మాత యొక్క చిఱునగవు కాంతిలో శ్రీకామేశ్వరుని మనస్సు విలీనమైపోవడం అనేది సహజమే అనబడుతుంది. అందుచేతనే ఆ పరమేశ్వరిని వశిన్యాదులు మందస్మితప్రభాపూర మజ్జత్కామేశ మానసా యని కీర్తించారు.
మందస్మిత అయిన శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం మందస్మితప్రభాపూర మజ్జత్కామేశ మానసాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
29వ నామ మంత్రము
ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయై నమః
పోల్చనలవి (వర్ణింపశక్యము) గాని అందమైన చుబుకముతో విరాజిల్లు జగన్మాతకు నమస్కారము
శ్రీలలితా సహస్ర నామావళి యందలి అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః అని ఉచ్చరించుచూ ఆ అఖిలాండేశ్వరి అయిన శ్రీలలతాంబికను అత్యంత భక్తితత్పరులై సేవించు భక్తులు ఆ తల్లి కరుణతో నిరుపమానమైన కీర్తిప్రతిష్టలు, అందుకు తగిన సిరిసంపదలు గణించుకొనుటయే గాక నిశ్చలమైన శ్రీమాత పాదసేవా తత్పరులై తరించుదురు.
జగన్మాత త్రిభువన సుందరి యనియు, ఆమె చిఱునవ్వుల జల్లులో అయ్యవారే అమ్మవారికి మనసు సమర్పించుకున్నాడని అనుకున్నాము. జగన్మాత ముఖసౌందర్యవాహినిలో కామేశ్వరుడు ఆలాగే అమ్మవారి ముఖంలోకి తన్మయంగా జూస్తూ కపోలాన్ని పద్మరాగశిలలకన్నా నునుపుగా, సుతి మెత్తగా ఉందని భావించాడు, కనుబొమలు మన్మథగృహద్వార తోరణములు అన్నాడు, నయనములు మీనములతో పోల్చాడు, నాసికను సంపెంగ పుష్పంతో పోల్చుకున్నాడు, పెదవులు సానబట్టిన పగడములను, దొండపండ్లను సైతం ధిక్కరిస్తున్నాయి అనుకొంటూ అందమైన చుబుకాన్ని చూస్తూ పోలిక కోసం ఆలోచిస్తున్నాడు...దేనితో పోల్చాలో పరమశివునికి అంతుచిక్కలేదు...ఇక వశిన్యాదులు సరేసరి...కవులూ చెప్పలేక పోయారు..అంతటి చుబకశ్రీతో జగదాంబ అమ్మ విరాజిల్లుతోందట...గిరిసుత చుబుకము తండ్రిచే ప్రేమగా పుణకబడింది. శివునికి దేవి ముఖము అద్దము కాగా ఆ అద్దమునకు పిడివంటిది ఆమె చుబుకము. దానిని పోల్చుటకు మరేదియును సాటిరాదు.
ఇదే భావమును శంకరాచార్యులవారు తమ సౌందర్యలహరిలో అరువది ఏడవ శ్లోకంలో ఇలా చెప్పారట.
కరాగ్రేణ స్పృష్టం - తుహినగిరిణా వత్సలతయా
గిరీశే నోదస్తం - ముహు రధరపానాకులతయా |
కరగ్రాహ్యం శంభో - ర్ముఖముకురవృంతం గిరిసుతే
కథంకారం బ్రూమ - స్తవ చుబుక మౌపమ్యరహితమ్॥67॥
ఓ త్రిపురసుందరీ! గిరిజాదేవీ! నీ చుబుకమును( గడ్డము) వర్ణించుటకు ఏ ఉపమానమూ ఈ లోకమున లేదు. నీ అందమైన చుబుకము దానికదే సాటి కాని వేరొకటి దానికి సాటి రాదు. నీ చిన్నతనంలో నీవు బాలగా ఉన్న సమయమున నీ తండ్రి అయిన హిమవంతుడు నీ మీద పుత్రికా వాత్సల్యంతో నిన్ను ముద్దాడతలచి నీ వద్దకు వస్తే, నీవు అతనికి అందకుండా పరిగెడుతుంటే ఆ హిమవంతుడు నీ వెనుకబడి, నిన్నందుకుని నిన్ను ఒక ముద్దియ్యమ్మా.. నా తల్లి కదా అంటూ నీ గడ్డం పుచ్చుకుని నిన్ను బ్రతిమలాడేవాడు. అంతేకాదు నీ వివాహమైన పిదప నీ భర్తయైన సదాశివుడు నీవు ఏకాంతముగా ఉన్న సమయమున నీ అధర చుంబన లాలనతో నీ వద్దకు ఏతెంచగా స్త్రీ సహజ లజ్జా స్వభావముతో నీవు తలదించుకొనగా నీ ముఖమును పైకెత్తి నీ బింబాధర రస గ్రాహణము చేయుటకై నీ గడ్డమును తన చేత్తో పట్టుకుని నీ ముఖమును శంకరుడు పైకెత్తువేళ నీ ముఖము అను అద్దమునకు నీ గడ్డము ఆ అద్దము పట్టుకొనుటకు క్రింద అమర్చబడిన వజ్రాలపిడి వలె అత్యంత అద్భుత సౌందర్యముతో ఉన్నది👏👏👏👏👏🙏🙏🙏జయహో మాతా🙏🙏🙏
అమ్మ చుబుకానికి ఉపమానం లేని కారణంగానే తరువాతి కాలంలో ఏ కవి కూడా అమ్మ చుబుకాన్ని వర్ణించలేదు
అమ్మ చుబుకాన్ని మానసికంగా ఊహించి ఆ పరమాద్బుతమైన ఆహ్లాదాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం
సాక్షాత్తు హిమవంతునికిగాని, పరమేశ్వరునికి గాని, ఆ వాగ్దేవికి గాని, నాటికీ, నేటికీ కవులకు గాని
పోలిక దొరకలేదు, వర్ణింప శక్యము కాలేదు జగన్మాత సొగసులొలుకు చుబుకము, అందుకే వశిన్యాదులు అమ్మవారిని అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితా అను నామముతో స్తుతించారు.
జగన్మాతకు నమస్కరించు నపుడు ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః అని అనవలెను
******
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
30వ నామ మంత్రము
ఓం కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరాయై నమః
పరమశివునిచే కట్టబడిన మంగళసూత్రముచే శోభించుచున్న గళసీమ గలిగిన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్రనామావళియందలి కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా యను పదహారు అక్షరముల (షోడశాక్షరీ) మంత్రమును ఓం కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో జగన్మాతను ఆరాధించు భక్తులకు జగన్మాత సమస్త మంగళములను ప్రసాదించును.
కామేశుడు అనగా శ్రీచక్రము మధ్యభాగమున బిందుమండల నివాసియైన నిశ్చల పరమాత్మ. అతనిచే కంఠసీమయందు కట్టబడిన మంగళ సూత్రముచే శోభిల్లునది పరాశక్తి శ్రీ లలితాదేవి.
పార్వతీ కళ్యాణం
పుట్టింటి మమకారంతో సతీ దేవి పిలువకపోయినా తన తండ్రి దక్షుడు చేయు యజ్ఞమునకు వెళుతుంది. అక్కడ జరిగిన అవమానంతో సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది. విషయం తెలిసిన శివుడు వీరభద్రుడిని పంపుతాడు వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. పరమేశ్వరుడు కాలిపోతున్న సతీదేవి దేహాన్ని భుజాన ధరించి వైరాగ్యంతో తిరుగుతుంటాడు. ఎన్నాళ్లయినా అలాగే తిరుగుతుంటాడు ఆ స్థితి నుండి ఆయనను బయటకు తీసుకురావడానికి శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఛేదిస్తాడు . ఆ సమయంలో భూమి మీద పడిన సతీదేవి దేహ భాగాలే శక్తి పీఠాలుగా వెలసినవి. శివుడు ధ్యానంలో మునిగిపోతాడు. మరణించిన సతీ దేవి హిమవత్పర్వత రాజుకు కుమార్తెగ జన్మించింది. ధ్యానంలో మునిగిన శివుడు తన దర్శనానికి వచ్చిన దేవతలు, ఋషులు, మునుల వలన తన ధ్యానానికి ఆటంకం కలుగుతోందని భావించి హిమవత్పర్వతం మీద తపస్సు చేసుకునేందుకు వెళ్తాడు. హిమవత్పర్వత రాజు శివుడిని దర్శించి సవినయంగా పార్వతీ దేవిని అయన సేవకు నియమిస్తాడు. పార్వతీ దేవి ఎంతో భక్తిశ్రద్ధలతో సపర్యలు చేస్తున్నది . పూర్వ జన్మవాసనల చేత పార్వతి దేవి శివుడిని ఆరాధిస్తూ వుంటుంది . ఇదే సరయిన సమయమని భావించిన దేవతలు మన్మథుడిని పంపించారు . మన్మథ భాణం తగలడం వల్ల శివుని తపస్సు భంగమై అయన చూపు పార్వతి మీద పడింది . అంతలోనే తేరుకుని కారణం తెలుసుకుని మన్మథుడిని మూడో నేత్రంతో భస్మం చేశాడు శివుడు. వెంటనే అక్కడ నుండి ఎక్కడికో వెళ్ళిపోయాడు శివుడు. కళ్ళ ముందు జరిగిన ఈ పరిణామానికి నిశ్చేష్టురాలు అయింది పార్వతి దేవి. తపస్సును తపస్సు తోనే గెలవాలని నిర్ణయించుకుని తండ్రి అనుమతి తీసుకుని తపస్సుకి తన చెలికత్తెలతోపాటు అరణ్యానికి బయలుదేరింది. చక్కటి యజ్ఞవాటికను ఏర్పాటు చేసుకుని చుట్టు ప్రక్కల మొక్కలు నాటి వాటికి స్వయంగా తనే నీళ్ళు పోసి పెంచుతూ తన తపస్సును కొనసాగిస్తోంది. ఆ మొక్కలన్నీ పెరిగి పెద్దవై ఫలాలను ఇస్తున్నాయి. కాని పార్వతి తపస్సు ఇంకా ఫలించలేదు . న ధర్మవృద్ధేషు వయః సమీక్ష్యతే ధర్మ పరంగా పెద్దలు అయిన వారి విషయం లో వయస్సు లెక్కించకూడదు. అనగా అటువంటి వారు మనకన్నా చిన్నవారయినా చేతులు ఎత్తి నమస్కారం చేయవచ్చు. మునులు, ఋషులు వచ్చి పార్వతి దేవిని దర్శించుకుని నమస్కారం చేసుకుని వెళ్తున్నారు. పార్వతి తపస్సు పరాకాష్ఠకు చేరుకున్నది. ఇక రాలిన ఆకులను మాత్రమే భుజిస్తూ తపస్సు చేయుట ప్రారంభించినది. ఆ దశను కూడా దాటి పార్వతి ఆకులను కూడా భుజించుటం మానివేసింది. అది చూసిన మునులు, ఋషులు పర్ణాలు అనగా ఆకులు వాటిని కూడా భుజించుట మానివేసిన పార్వతిని అపర్ణ అని పిలిచారు.
ఇంకా తపస్సును ఉదృతం చెయ్యాలని భావించిన పార్వతీదేవి మండు వేసవికాలంలో మిట్ట మధ్యాహ్నంవేళ చుట్టూ అగ్నిని పెట్టుకుని ఒంటికాలితో నిలబడి తదేక దృష్టితో సూర్యుణ్ణి చూస్తూ తపస్సు చేసింది. మహారాజు కుమార్తె అయినప్పటికీ అల్లారుముద్దుగా పెరిగినప్పటికినీ ఎంతో కఠోర దీక్షతో తపస్సు చేస్తోంది. హంస తూలికాతల్పం మీద నిద్రించే సందర్భాలలో తలలోని పువ్వులు రాలి శయ్య మీద పడితే కందిపోయే సుకుమారి బండ రాళ్ళ మీద తన చేతినే దిండుగా చేసుకుని నిద్రిస్తోంది . చెలికత్తెలతో పూల బంతితో ఆడినంత మాత్రానే అలసిపోయే తల్లి అనితరులకు సాధ్యం కానీ కఠినాతి కఠినమయిన దీక్షతో తపస్సు చేస్తోంది. వర్షాకాలంలో భయంకరమయిన వానలో కదలకుండా వృక్షాలు ఏవిధంగా అయితే కదలకుండా ఉంటాయో అలా రాత్రి పగలు తేడా లేకుండా ఆరుబయటే నిలబడి ఉరుములు మెరుపులే సాక్షులు అన్నట్లుగా తపస్సు చేసింది. శీతాకాలంలో తెల్లవారుజామున పీకల వరకు సరస్సులో నిలబడి చకోర పక్షులను చూస్తూ తపస్సు చేసింది. ఆమె శరీరం బ్రహ్మ దేవుడు బంగారు పద్మంతో నిర్మించి ఉంటాడు కావునే పద్మధర్మం చేత సుకుమారం గాను బంగారుధర్మం చేత దృడం గాను ఉండగలుగుతోంది. పరమేశ్వరుడు మెచ్చి పార్వతీ దేవిని పరీక్షించడానికి బ్రహ్మచారి రూపంలో వచ్చి పార్వతి తపస్సుకు కారణం అడిగి వివాహం కోసమే ఆమె తపస్సు అయితే తనను వివాహం చేసుకోమనియు, ఏమీ లేని శివుడు నిన్ను ఏమి సుఖపెడతాడని ఆ పరమశివుని దుర్భాషలాడాడు ఆ బ్రహ్మచారి రూపంలో ఉన్న శివుడు. పార్వతీ దేవి పెద్దల గురించి తప్పుగా మాట్లాడిన అలాంటి మాటలు విన్నా పాపం వస్తుంది అని భావించి, ఆ బ్రహ్మచారిని బయటకు గెంటేయండి అని తన చెలికత్తెలను ఆజ్ఞాపిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు నిజ రూపంలో ప్రత్యక్షమయి వివాహం చేసుకోమని అడుగుతాడు . పార్వతీ దేవి సిగ్గుతో అడుగు వెనక్కు వేసి తండ్రిని అడిగి వివాహం చేసుకోమని చేబుతుంది.
శివుడు కైలాసానికి వెళ్లి సప్తఋషులను అరుంధతీ దేవిని తలుచుకుంటాడు. వారు నిముష మాత్రం లోనే శివుడి ముందు ప్రత్యక్షం అవుతారు . వారికి విషయం చెప్పి హిమవత్పర్వత రాజు వద్దకు వెళ్లి వివాహం నిశ్చయించ వలసినదిగా చెపుతాడు. వారు వెంటనే తరలి వెళ్లి వివాహం నిశ్చయింపజేస్తారు. బ్రహ్మాది దేవతలు పెద్దరికం వహించగా దేవతలు, ఋషులు ,మునులు, సకల లోకములవారు సమక్షంలో పార్వతీపరమేశ్వరుల కళ్యాణం వైభవంగా జరిగుతుంది. అంతటి కఠోరమైన తపస్సుచే పార్వతి పరమశివుని శరీరంలో సగభాగమును తనది చేసుకొని అర్ధనారీశ్వర తత్త్వమును లోకానికి తెలియజేసినది.
పరమేశ్వరి అంతటి కఠోరమైన తపస్సుతో పరమశివుని మెప్పించి వివాహము చేసుకొన్నది. ఆ పరమశివుడు (కామేశుడు) తన మెడలో కట్టిన మంగళసూత్రముచే పరమేశ్వరి ప్రకాశించు కంఠము గలిగినది గనుక ఆ తల్లిని వశిన్యాదులు కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంధరా యని అనబడినది.
వేదంలో మంగళసూత్రం అను మాట చెప్ఫక పోయి ఉండవచ్చు. కాని వశిన్యాదులు చెప్పిన ప్రకారం పరమశివుడు పార్వతీ దేవి మెడలో మంగళ సూత్రం ప్రస్తావన వచ్చింది గనుక పరమశివుడు ఇక్కడ ఇచ్చిన మాంగల్యధారణ మంత్ర చెప్పి ఉండునని భావించుదాము.
మాంగల్యం తంతునాఽనేన మమజీవన హేతునా|
కంఠే బధ్నామి సుభగే! త్వం జీవ శరద శ్శతం
పెళ్ళికొడుకునైన నేను పెళ్ళి కూతురివైన నీ మెడలో ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నీవు దీనిని ధరించి నా జీవితంలో అన్నింట సగభాగమై, నాకు తోడు నీడగా ఉంటూ మనమిద్ధరం నిండు నూరేళ్ళు కలిసి ఆనందంగా జీవిద్ధాం.
సౌభాగ్యాభరణములలో మాంగల్యము అతి ముఖ్యమైనది. ప్రణవ మంత్ర స్థానము కంఠము - విశుద్ధచక్ర స్థానము - శబ్ద, విద్యా మంత్రములకు మూలము అగును. మంగళసూత్రమునకు రెండు దళములు ఉండును. ఈ రెండు దళములు శివపార్వతులని యర్థము.
శివపార్వతుల వివాహం కొరకై మన్మథుడు సుమబాణం వేశాడు, అప్పటికి విముఖుడైయున్న పరమశివుడు తన మూడవకంటి మంటతో మన్మథుడిని భస్మం చేశాడు. ఆ తరువాత మళ్ళీ వివాహ చిహ్నమైన మంగళ సూత్రం అమ్మవారి మెడలో కడతాడు అంటే మన్మథుడు తిరిగి పునర్జీవుడై (అమ్మదయతో) తన సుమబాణంతో గెలిచినట్లు అయింది. అనగా సృష్టికి సంబంధించిన కామం మరల జీవం పోసుకుంది - (ఇక్కడ లలితా సహస్ర నామావళియందలి 84వ నామ మంత్రంలో ఈ సందర్భంగలదు - హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనైషధిః అనగా శివుని నేత్రాగ్నిచే భస్మమైన మన్మథుడిని బ్రతికించి అతని పాలిట, శ్రీమాత సంజీవనౌషధి అయినదని భావము).
పరమేశ్వరుడు కట్టిన మంగళ సూత్రం ఎంతబలమైనదో, శ్రీమాత ఎంతగా ఆ బలమును నమ్ముకుందంటే అమృతమథనం సమయంలో వెడలిన హాలాహలాన్ని ధైర్యంగా పరమశివుని సేవించమందంటే పోతనా మాత్యులవారి ఈ పద్యాన్ని చూద్దాం
క.కంద పద్యము
మ్రింగెడి వాఁడు విభుం డని
మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!
ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది.
(ఇది అసామాన్య శబ్దార్థసౌందర్యభరితమైన పద్యం. శివుడు లోకాలన్ని దహించేస్తున్న ఆ హాలాహలాన్ని మింగాడు అనగానే. కాపాడమని అడిగిన గొప్పవాళ్ళు బ్రహ్మాది దేవతలు కనుక లోకమంగళం కోసం మింగాడు. సరే మరి ఆయన భార్య అడ్డుపడకుండా ఎలా ఒప్పుకుంది. భార్య తన భర్త ఇంతటి సాహసానికి పూనుకుంటే చూస్తూ ఊరుకుంటుందా. అందులో ఈవిడ భర్త శరీరంలో సగం పంచుకొన్నావిడ.
పరమేశ్వరి సర్వమంగళ కనుకనే వివాహ సమయంలో వధువుచే మంగళగౌరీ పూజ చేయించడం ఒక సాంప్రదాయమయినది.
అంతటి శ్రీమాతకు నమస్కరించు నపుడు ఓం కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
31వ నామ మంత్రము
ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః
కేయూరముల (దండకడియములు లేదా దండ వంకీల) వంటి కాంచనాభరణములతో కూడిన (అలంకరింపబడిన) బాహువులతో ప్రకాశించు జగజ్జననికి నమస్కారము.
శ్రీలలితా సహస్రనామావళి యందలి కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు అష్టైశ్వర్య సంపదలతో, కీర్తి ప్రతిష్టలతో ఆధ్యాత్మికతనిండిన మనస్తత్త్వంతో జీవించి తరించును.
శ్రీమాత త్రిభువన సుందరి. అపురూప లావణ్యవతి. కామేశ్వరుని మనసునుదోచిన అనాకలిత చుబకశ్రీ విరాజిత, అటువంటి తల్లికి అంగద, కేయూరములు వంటి కాంచనాభరణములు భుజములందలంకరింపబడి శ్రీమాత సౌందర్యముతో ప్రకాశించుచున్నది. అంగద, కేయూరములనగా దండకడియములు, దండవంకీలు - ఇవి మహిళా మణులు మోచేతికి పైన భుజములకు క్రింద అమర్చుకుంటారు. ఇవి వజ్రవైడూర్యాది మణులు పొదగబడి కాంతివంతమై, సౌందర్యమును ఇనుమడింప జేసేవిగా ఉంటాయి.
అంతకు ముందే మనోజ్ఞ అయిన శ్రీమాత, ఈ భుజకీర్తులు భూషణములుగా అలంకృత అయేసరికి అతిశయించిన సౌందర్యరాశి అయినది. ఆ పరమేశ్వరి ఉద్యద్భానుసహస్రాభ అనంతకోటి ఉదయభానుని కిరణముల ప్రకాశమునకు కేంద్రము. అటువంటి అనంతకోటి కిరణములన్నియును ఆ పరమేశ్వరికి భుజాలు అవుతాయి. అట్టి భుజములయొక్క ప్రకాశమే కీర్తులనబడును, భుజకీర్తులు రెండు విధములైన ఆభరణములు.
దధానం నాగవలయ కేయూరాంగదముద్రికాః (సౌభాగ్యభాస్కరం, 207వ పుట)
నాగవలయము, కేయూరము, అంగదము, ముద్రికలు అను ఆభరణములను పరమేశ్వరి ధరించినది.
కేయూరాంగదహార కంకణ ముఖాలంకార విభ్రాజితా (సౌభాగ్యభాస్కరం, 207వ పుట)
ఆ పరమేశ్వరి బంగారముతో చేయబడిన కేయూరము, అంగదము, హారము, కంకణము మొదలైన ఆభరణములు ధరించి భాసిల్లుచున్నది. అగ్నిపురాణము నందు కేయూరములు, అంగదములతో ఆ పరమేశ్వరి ప్రకాశిస్తున్నదని చెప్పబడినది.
కనకాంగద, కేయూరములు ధరించిన సుందరమైన భుజములతో ఆ అమ్మవారు భాసిల్లుచున్నది.
ఈ విషయము దేవీభాగవతములో ఇలా చెప్పబడినది.
అష్టాదశభుజాకారా బాహవో విష్ణుతేజసా| (దేవీభాగవతం, పంచమస్కంధము, అష్టమాధ్యాయము, 70వ శ్లోకము మొదటి పాదము)
పరమాత్ముడైన శ్రీమహావిష్ణువు యొక్క మహత్తరమైన తేజస్సుతో పదునెనిమిది భుజములు ఆవిర్భవించెను. ఆభరణ విశేషములచే అతిశయించిన సౌందర్యముతో విరాజిల్లుచున్నదనియు గమనార్హము.
నారాయణుడు అలంకార ప్రియుడు. ఆ నారాయణియైన పరమేశ్వరికూడా అలంకార ప్రియయే. ఆ తల్లి నాసాభరణములు, తాటంకములు, కామేశుడు కట్టిన బాలసూర్యప్రభాకలితమైన మాంగల్యము, కనకాంగదకే యూరములు, ఇంకనూ ఎన్నో సర్వాభరణములు ఆ పరమేశ్వరి ధరించి, ఆ నారాయణునివలెనే ఈ నారాయణి కూడా అలంకార ప్రియయని నిరూపింపబడినది.
ఆ జగదాంబకు నమస్కరించు నపుడు ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
32వ నామ మంత్రము
ఓం రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్వితాయై నమః
రత్నహారములు, ప్రకాశవంతమగు మంచి ముత్యాల సరములు, కాంథివంతమైన చింతాకు పతకములవంటి కఠాభరణములు ధరించి ప్రకాశించుచున్న తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి రత్నగ్రైవేయ ముక్తా ఫలాన్వితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్వితాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో జగన్మాతను ఆరాధించు సాధకునికి ఆ మంగళప్రదమైన పరమేశ్వరి కరుణించి సర్వశుభములను కలుగజేసి అంతులేని ఆధ్యాత్మిక సంపదలు, బ్రహ్మజ్ఞాన తేజస్సును కలుగజేసి తరింపజేయును.
జగన్మాత అంగద కేయూరములతో కూడిన భుజములతో ప్రకాశిస్తోందని (31వ నామ మంత్రంలో - కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా అని అన్నాము), నేడు ఆ తల్లిని రత్నహారములు, ముత్యాల సరములు, చింతాకు పతకములు ఒకటేమిటి ఎన్నోవిధమలైన కాంచన కంఠాభరణములను ధరించి సాక్షాత్తు మంగళస్వరూపిణియై, శ్రీమహారాజ్ఞియై ప్రకాశించు ఆ తల్లికి నమస్కరిస్తేనే మనం తరించుతాము. అమ్మవారి స్వరూపాన్ని ఆపాదమస్తకము తన్మయత్వంతో చూస్తూ ఆ తల్లి ఒక్కొక్క అవయవాన్ని ధ్యానం చేస్తే ఒక్కొక్క ఫలం వస్తుంది...శంకరాచార్యులవారు తమ సౌందర్యలహరియందు నలుబది మూడవ శ్లోకంలో ఇలాఙ చెప్పారు.
ధునోతు ధ్వాంతం న - స్తులిత దలితేందీవర వనం
ఘనస్నిగ్ధ శ్లక్ష్ణం - చికుర నికురుంబం తవ శివే |
యదీయం సౌరభ్యం - సహజ ముపలబ్ధుం సుమనసో
వసంత్యస్మిన్మస్యే - బలమథన వాటీవిటపినామ్॥43॥
ఓ పరమేశ్వరీ! నీ కురులు అప్పుడే వికశించిన నల్లకలువ పూలకన్నా అందంగా ప్రకాశవంతంగా ఉన్నాయి, , కారుమబ్బువలె ఒత్తుగా నునుపుగా కూడా ఉన్నవి, ఆపైన సుగంధ పరిమళములు వెదజల్లుతూ మృదువుగాను ఉన్నవి, ఇంద్రుని నందనవనం లోని పుష్పసముదాయమంతయూ నీకురుల సుగంధమును పొందుట కొరకై వచ్చి చేరిన కేశసంపదతో శోభిల్లు నీ కురులు మాలోని అజ్ఞానము అను చీకటిని చీల్చివేయుగాక
శ్రీలలితా పరమేశ్వరి ఉన్నది మణిద్వీపం. అందులో చింతామణి గృహమునందు సువర్ణరజిత సుందరగిరులు, వజ్రపుకోటలు, వైడూర్య, పుష్యరాగమణి నిర్మిత ప్రాకారములు, మిలమిలలాడే వైడూర్యములతో నిర్మితమైన స్తంభములు, ముత్యాల తోరణములు, మరకతమణులతో చేయబడిన అరుగులు, పద్మరాగశిలలతో ఏర్పరచబడిన నిలువుటద్దములు - అంతటి అత్యంత వైభవోపేతమైయున్న చింతామణిగృహంలో ఆ తల్లి విలసిల్లుచున్నది. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురగా, కదంబమంజరీక్లుప్తకర్ణపూర మనోహరియై, సూర్యచంద్ర మండలములే తన తాటంకములై తేజరిల్లుచూ, కనకాంగదకేయూర కమనీయ భుజాన్వితయైన ఆ పరమేశ్వరి, కదలికలలో తళతళలను చిందించు ముత్యములు, రత్నములతో చేయబడిన కాంచన చింతాకు పతకములు, ముత్యాలహారములు ధరించి భాసిల్లుచున్నది.
నాడు రామభక్తుడైన రామదాసుగారు సీతమ్మకు చింతాకు పతకమును చేయించారు. బహుశా ఆయన శ్రీలలితా సహస్రనామ స్తోత్ర పారాయణచేసి ఉండవచ్చు. అమ్మవారిని సీతాదేవిగా భావించి, అమ్మ వారికి వశిన్యాదులు కీర్తించిన ఆభరణములలోని చింతాకు పతకమును, ముత్యాల హారములను సీతామ్మవారికి చేయించి ఉండవచ్చునేమో! వశిన్యాదులు కీర్తించిన అమ్మవారిని రామదాసుగారు సీతామ్మవారిలో భావించి ఉండవచ్చు.
అమ్మవారి మెడయందుగల రత్నములు, ముత్యములతో చేయబడిన కంఠాభరణము గల అమ్మవారి మెడయందు దృష్టినిలిపి ధ్యానముచేయువారు మధ్యములు. మోక్షచింతనతో అమ్మవారిని ఉపాసించువారు ఉత్తములు. భౌతిక పరమైన కోర్కెలతో ధ్యానించువారు అధములు. అనగా లౌకిక పరమైన కోర్కెలు మాత్రమే గలవారు పునర్జన్మను పొందుదురు.
శంకరభగవత్పాదులవారు ఆ పరమేశ్వరి మెడలోని హారములను వర్ణిస్తూ, తమ సౌందర్యలహరి యందు, డెబ్బది నాలుగవ శ్లోకంలో ఇలా అన్నారు:-
వహ త్యంబ స్తంబేరమదనుజ కుంభ ప్రకృతిభిః
సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికామ్|
కుచాభోగో బింభాధరరుచిభి రంత శ్శబలితాం
ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివ తే॥74॥
లలితాసహస్రం లో అమ్మ వేసుకున్న ముత్యాలహారమును వర్ణిస్తూ..... మెడనుండి గుండెలదాకా వేలాడే రత్నాల పేటల హారములకు క్రింద వేలాడే లోలాకులతో కూడిఉన్న ముత్యాలతో కూడిన చింతాకు పతకం అను ఒక హారాన్ని అమ్మవారు ధరించి ఉన్నది అని భావము. కాని శ్రీ శంకరులు దీనిని అంగీకరించలేదు ఎందుచేతననగా ఆయన ఉద్దేశ్యంలో లోకంలో ఎక్కడైనా స్త్రీలు క్రింద ముత్యాల పతకము ఉన్నప్పుడు పైన ఉన్న గొలుసులు కూడా ముత్యాలతో ఉంటాయి అని ఆయన అభిప్రాయం. మరి వశిన్యాది దేవతలు పైన గొలుసులు రత్నాలు అని చెప్పటానికి కారణం నీ పెదవుల ఎర్రదనం ఆ గొలుసుల ముత్యాల మీద పడి అవి ఎర్రగా కనబడుటచేత రత్నాలు ఎర్రగా ఉంటాయి గనుక, శంకరభగవత్పాదులవారు అలావర్ణించారు కాని అక్కడ ఉన్నవన్నీ ముత్యాలే అని ఆయన అభిప్రాయం. ఇంకో విశేషం ఏమిటంటే, అమ్మ మెడలో ఉన్న ముత్యాలు గజకుంభము నుండి పుట్టినవి అన్నారు. ముత్యాలు ముత్యపు చిప్పలలోనే కాకుండా వేరే ఐదు చోట్ల సంభవిస్తాయని రత్నశాస్త్రంలో చెప్పబడినది. అవి గజకుంభేషు, వంశేషు, ఫణేసు, జలదేమచ, శు(ము)క్తికాయా, మిక్షుదండే, షోడా మౌక్తిక సంభవా
1. ఏనుగు కుంభస్థలములయందు - వివిధ వర్ణములు గలవి, 2. వెదురు బొంగులయందు - తెలుపుతో కూడిన ఎరుపు వర్ణము (పాటల వర్ణము), 3. సర్పముల పడగల యందు - నీలవర్ణములు, 4. మేఘములయందు - మెరుపు వర్ణము గలవి, 5. ముత్యపు చిప్పలయందు - శ్వేతవర్ణము గలవి, 6.చెరకు గడలయందు - పసుపు వర్ణము గలవి.
సంభవించునని అర్థం. వీటన్నిటిలో గజకుంభాతరమున జన్మించినవి శ్రేష్టములు. ఎందుకంటే వాటి వర్ణములు వివిధములుగా ఉండును. అమ్న వాటినే ధరించినది. అంతేకాదు ఈ హారమునకు పెద్దలు ఇంకొక విశేషార్ధము చెబుతూ అమ్మ తన గుండెలపై ( గుండెల్లో) పెట్టుకున్న ఆ హారము పతకము కాదట, చింతా కరొతీతి చింతాక భగవంతుని గూర్చి చింత కలిగిన వారు చింతాకులు. ఆ చింతాకులు కూడా మూడు రకములు 1. గ్రైపేయ చింతాకులు ( తమ కంఠంతో అమ్మను ధ్యానించేవారు), 2. లోల చింతాకులు ( కోరికతో అమ్మను కొలిచేవారు), 3. ముక్త చింతాకులు ( ముక్తిని కాంక్షిస్తూ అమ్మను కొలిచేవారు) ఈ హారం ఈ భక్తులకు ప్రతీక అని పెద్దల భావం. ఈ మూడు విధములైన భక్తులను అమ్మ తన గుండెల్లో పెట్టుకుని కాపాడుతున్నదని వారి భావన.
ఆ పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్వితాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
33వ నామ మంత్రము
ఓం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తన్యై నమః
కామేశ్వరుని భౌతాకాతీతమైన ప్రేమరత్నమును పొందుటకు కామేశ్వరి (శ్రీమాత) తన భౌతికమైన స్తనరత్నములను పణముగా సమర్పించుకున్న జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తనీ అను పదహారు అక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తన్యై నమః అని ఉచ్చరించుచూ భక్తితత్పరతతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునకు భౌతికపరమైన వాంఛలు పోయి ఆధ్యాత్మికతా తత్త్వ మానసుడై ఆ పరమేశ్వరీ పాదసేవాపరాయణుడై శాశ్వత బ్రహ్మత్వసాధనలో తరించును.
ఈ నామ మంత్రమందు విశేషమైన ఆధ్యాత్మికతత్త్వము ఇమిడి ఉంది. అదేమిటంటే పార్వతీ పరమేశ్వరులవలె అన్యోన్యంగా జీవించండి అని నూతన దంపతులను ఆశీర్వదించడం జరుగుతూ ఉంటుంది.
ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోళాశంకరుడిగా, పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే పరమేశ్వరుడు. లింగ స్వరూపంలో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను నిర్వహిస్తూఉంటాడు. పరమేశ్వరుడిని నిరంతరారాధన చేసేవారి హృదయమే కైలాసమై, వారి మనసులోని కామక్రోధాదులు శమించి నిరంతరానందాన్ని పొందుతారన్నది సత్యము. నిర్గుణ పరబ్రహ్మ యొక్క కర్మ స్వరూపం శ్రీమహావిష్ణువు అయితే, జ్ఞాన స్వరూపం పరమేశ్వరుడు. అందుకే లౌకిక పురోగతికి విష్ణు రూపాన్ని, ఆధ్యాత్మిక పురోగతికి శివ స్వరూపాన్ని ఆరాధన చేయాలి. ఇంతటి భౌతికాతీతమైన పరమేశ్వరుని ప్రేమ అనే ఒక రత్నాన్ని పొందడానికి జగన్మాత తన స్తన రత్నములను రెండిటిని పణముగా పరమేశ్వరునికి ఇచ్చినది. ఇలా ఆ ఆది దంపతులు వారి ప్రేమ అనే వస్తువులను ఇచ్చి పుచ్చుకున్నారు అంటే పరమేశ్వరుని ప్రేమరత్నంపై శ్రీమాతకు, శ్రీమాత స్తన రత్నములపై పరమేశ్వరునకు హక్కులు ఇచ్చి పుచ్చుకున్నారు అంటే అయ్యవారి ప్రేమ ఇంక అమ్మవారిదే...అమ్మవారికొక్కదానికే...ఆ ప్రేమలో ఇంకొకరికి భాగంలేనట్లే అంటే అయ్యవారు ఏక పత్నీవ్రతుడే గదా. అలాగే అమ్మవారి స్తనరత్నాలు అయ్యవారికి మాత్రమే అంటే అమ్మవారి పాతివ్రత్యానికి నిదర్శనమేగదా. అయ్యవారి, అమ్మవారి దివ్యమైన మరియు పవిత్రమైన దాంపత్య ఫలితమే ఈ విశ్వం గనుక దంపతులైనవారు అందరూ ఇదే పాతివ్రత్యాన్ని, ఏక పత్నీవ్రతాన్ని కలిగి ఉండాలని సూచనయే కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తనీ అను నామ మంత్రములోని భావము.
వశిన్యాది వాగ్దేవతలు అమ్మ ఆదేశం మేరకు కోట్లాది సహస్ర నామాలలో శ్రీలలితా సహస్ర నామములను అత్యంత ప్రాధాన్యమైనదిగా రచించారు. శ్రీలలితా సహస్ర నామాలు ఇతర సహస్ర నామాలవలె ఋషులుగాని, తాపసులుగాని ఇంకెవరో మానవమాత్రులు రచించినవి కావు. సాక్షాత్తు ఆదిపరాశక్తి నుండి వెడలివచ్చిన ఎనిమిది అద్భుతమైన కిరణములే ఆ వశిన్యాదులు (వశినీ, కామేశ్వరి, మోదిని, విమల, జయిని, అరుణ, సర్వేశ్వరి, కౌళిని). వారు పరబ్రహ్మస్వరూపిణియైన పరమేశ్వరి అంశ నుండి వ్యక్తమైన బ్రహ్మజ్ఞానస్వరూపులు. అమ్మవారిని కీర్తించడానికి, ఆ తల్లికి ప్రియాతి ప్రియమైన సహస్రనామములు మాత్రమేగాక, బ్రహ్మజ్ఞాన తత్త్వము, పిండాండము నుండి బ్రహ్మాండము వరకు ఇమిడియున్న అనంతమైన పంచకృత్యపరాయత్వము, ఆ పరమేశ్వరియొక్క స్థూల, సూక్ష్మ, కారణ రూపముల తత్త్వము, శ్రీయంత్రము, బ్రహ్మాండము, పిండాండము - ఈ మూడింటియొక్క సమన్వయమును తెలిపే షట్చక్రాది విశేషములు, చతుష్షష్టికోటి యోగినీ గణదేవతలు, తిథిమండలములు... ఇంకను ఎన్నో పరబ్రహ్మ తత్త్వమునకు సంబంధించిన విషయములను రహస్యాతి రహస్యమైన శ్రీలలితా సహస్ర నామములలో నిక్షిప్తముజేసి అనంతమైన బ్రహ్మజ్ఞాననిధిని మనకు సమర్పించారు. అమ్మవారి నామములు కేవలము సహస్రము మాత్రమేకాదు. పంచదశీమంత్ర స్వరూపమైన త్రిశతి మాత్రమేకాదు. సకలదేవతా స్వరూపిణియైన ఆ పరమేశ్వరికి అనంతకోటి నామములు గలవు. అనంతకోటి స్వరూపములుగలవు. అంతటి అమ్మవారు పరమేశ్వరుని ప్రేమ యనే రత్నమును పొందుటకు తన స్తనద్వయం పణంగా (మూల్యముగా) సమర్పించినది అంటే పరమేశ్వరుడు ఎవరు? ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోళాశంకరుడిగా, పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే పరమేశ్వరుడు.
పరమేశ్వరుడిని నిరంతరారాధన చేసేవారి హృదయమే ఒక వెండికొండ. నిరంతరానందాన్ని పొందుతుంది. జ్ఞాన స్వరూపం ఆ పరమేశ్వరుడు. ఆధ్యాత్మిక పురోగతికి శివ స్వరూపాన్ని ఆరాధన చేయాలని వేదాలు చెబుతున్నాయి.
వేదం శివుడిని సకల దుఃఖ హరుడైన రుద్రుడిగా చెబుతోంది. శత్రుబాధ, పిశాచపీడ, దుఃఖము పోవడానికి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని,
విషపూరిత జీవుల నుండి రక్షణకై ఓం నమో భగవతే నీలకంఠాయ అనే మంత్రాన్ని పఠించాలన్నది వేదవచనం. అంతటి వాడైన పరమేశ్వరునికి ఆ పరమేశ్వరి ఆ విధంగా తనను తాను సమర్పించుకున్నది. ఆయనలో సగం తానై అర్ధనారీశ్వర తత్త్వాన్ని లోకానికి తెలియజేసింది ఆ పరమేశ్వరి.
అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తన్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
34వ నామ మంత్రము
ఓం నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయ్యై నమః
నాభి (అను పాదు) నుండి వక్షస్థలం వరకూ ఉన్న నూగారు (సన్నని నూగువలె ఉన్న రోమాళి) అను తీగ (లత) కు ఫలముల వలె ఉన్న స్తనములతో తేజరిల్లు జగన్మాతకు నమస్కారము
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయీ అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయ్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఉపాసించు సాధకుడు రాగద్వేషరహితుడై, ఆత్మానందానుభూతిని పొందును.
పొట్ల, చిక్కుడు వంటి తీగ మొక్కలను పెంచుటకు ముందు ఒక చిన్న గుంటచేసి, గింజను వేసి కొంచం మట్టితో కప్పి చిన్న పళ్ళెంవలె మట్టిని ఆ గుంటకు చుట్టూ ఏర్పాటు చేస్తారు. దానిని పాదు అంటారు. అందులో నీరు పోస్తూండగా గింజ మొలకెత్తి తీగవస్తే దానిని పందిరిపైకి వచ్చేలా ఏదైనా ఆధారం ఏర్పాటు చేస్తారు. తీగ పందిరిపైకి వచ్చిన తరువాత ద్రాక్షతీగ వంటిదైతే ఆ తీగకు పందిరిపై ద్రాక్షపళ్ళు ఏర్పడతాయి. అలాగ శ్రీమాత అమ్మవారి బొడ్డు అనే పాదునుండి సన్నని రోమాళి నాభి నుండి వక్షస్థలం క్రింది వరకూ ఊర్థ్వముఖంగా ఉంటుంది, దీనినే నూగారు అంటారు, అటువంటి నూగారు అనే తీగకు అమ్మవారి స్తనయుగము తీగకు రెండు ప్రక్కల ఫలముల వలె ఉండి జగన్మాత విరాజిల్లుచున్నదని వశిన్యాదులు ఈ నామ మంత్రములో వర్ణించారు.
ఇచ్చట నాభి అనునది మణిపూర చక్రస్థానము అయితే, స్తన మధ్యభాగం - అనాహత చక్రస్థానము అవుతుంది. ఇడా, పింగళా నాడుల ఆ పరమేశ్వరి స్తనములుగా భావించితే, బొడ్డు నుండి వక్షస్థలంవరకూ ఉర్ధ్వముఖంలో ఉన్న సన్నని రోమాళిని సుషమ్నా నాడిగా భావించవచ్చును.
నాభియందు ఆలవాలత్వము (పాదు అనే భావము), రోమాళియందు లతాత్వము సమన్వయించబడినవి. కుచముల యందు ఫలత్వము సమన్వియింపబడినది. మొదటి సమన్వయము రెండవ సమన్వయత్వమునకు కారణములుగా భావింపదగును. తల్లీ బిడ్డల మధ్యగల పుట్టిన వెంటనే బొడ్డును కోయడంతో భౌతిక బంధం తెగుతుంది. అందుకే బొడ్డును కోస్తారు. అయితే ప్రేమబంధంతో సంబంధం ఉండదు అని తెలియదగును. శివుని కోపాగ్నికి మన్మథుడు కాలిపోతే, ఆ తాపం తగ్గడం కోసం అమ్మవారి నాభి అనే సరసులో దూకితే - అప్ఫుడు ఆ బొడ్డు అనే సరస్సునుండి సన్నని తీగలాగా పైకిలేచిన పొగతీగవలె అమ్మవారి నూగారు (సన్నని) రోమాళి ఉంటుందని శంకరాచార్యులవారు సౌందర్యలహరియందు డెబ్బది ఎనిమిదవ శ్లోకంలో ఇలా వర్ణించారు.
స్థిరో గంగావర్త - స్తనముకుళ రోమావళిలతా
కలావాలం కుండం - కుసుమశరతేజో హుతభుజః ||
రతేర్లీలాగారం - కిమపి తవ నాభి ర్గిరిసుతే
బిలద్వారం సిద్ధే - ర్గిరిశ నయనానాం విజయతే॥78॥
ఓ పరమేశ్వరీ! నీ నాభి నిశ్చలమైన గంగ ప్రవాహం. స్తనములు అను పూలమొగ్గలకు ఆధారమైన రోమరాజి యనెడు తీగకు పాదు. మన్మథుని పరాక్రమాగ్నికి హోమగుండము. రతీ దేవికి విహార గృహము. ఈశ్వరుని కనుల సిద్ధికి గుహాముఖము. అయి విరాజిల్లుచున్నది.
జననీ! ఓ జగన్మాతా! నీ నాభిని, వక్షస్థలం పైకి ఊర్ధ్వమఖంగా ఉన్న సన్నని రోమాళి - నూగారును ఎంత వర్ణించినా తక్కువే తల్లీ. అవి అంత సౌందర్యవంతమైనవి. నీ నాభి గంగానదియందు పుట్టిన స్థిరమైన సుడిగుండమయితే, పయోధరములు అను రెండు పుష్పములు పూచిన రోమావళి (నూగారు) అను లతకు ఆధారమైన పాదులా ఉంటుంది. (అమ్మ నాభి పాదు ఐతే నూగారు దానినుండి వచ్చిన తీగగా, ఆపైన పాలిండ్లు ఆ తీగకు పూచిన రెండు పుష్పములు గా ఉన్నవి అని) మన్మథుని తేజస్సు అను కాంతితో ప్రకాశించుచున్న అగ్నిహోత్రంతో కూడిన హోమగుండలా ఉంటుంది, రతీదేవి విహరించే గృహంలా ఉంటుంది, ఇక పరమేశ్వరుని కంటికేమో తనకు తపస్సిద్ది నొసంగు గుహద్వారంలా ఉంటుంది ఇలా ఎంతని చెప్పను జగన్మాతా! ఎంత వర్ణించినా తనివి తీరనంతటి అందంతో నీ నాభి విరాజిల్లుతున్నది - ఇక్కడ వర్ణింపబడిన అమ్మ నాభి పాదువలె, రోమావళి లతవలె చెప్పబడినది.
శంకరాచార్యులవారు పై శ్లోకములో పూలమొగ్గలని చెప్పినవి ఈ నామ మంత్రంలో వశిన్యాదులు ఫలములుగా వర్ణించారు.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
35వ నామ మంత్రము
ఓం లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమాయై నమః.
కనబడుచున్న నూగారు (రోమలత) అను తీగకు ఆధారంగా విరాజిల్లు సన్నని నడుము గలిగిన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమా అను పదహారు అక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రముసు ఓం లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమాయై నమః అని ఉచ్చరించుచూ పరమేశ్వరీ పాదసేవాపరాయణులైన భక్తులకు పరమేశ్వరి అనుగ్రహంలభించి శ్రీవిద్యా తత్త్వము పూర్తిగా అవగాహన చేసుకొని ఆత్మానందానుభూతిని పొంది తరించుదురు.
పందిరి మీదకు తీగ పాకాలంటే ఆలంబన అవసరము. పాదులో మొక్క తీగ వేయుట ప్రారంభించిందంటే ఏదో ఒక సన్నని కర్రవంటిది లేదా పాదుకు చూట్టూ కంపకట్టి ప్రారంభమైన తీగ పందిరి మీదకు వెళ్ళడానికి ఆధారం ఇస్తారు. ఆ తీగ చాలా సున్నితంగా ఉంటుంది. ఇచ్చిన ఆలంబనను తీసుకొని పందిరి మీదకు తీగ ప్రాకడం ప్రారంభిస్తుంది. అమ్మ వారి నాభి అనే పాదులో ప్రారంభమైన నూగారు (నూగువంటి రోమాళి) అను తీగ వక్షస్థలము పైకి ప్రాకుతుంది. ఆ నూగారు తీగకు అమ్మవారి స్తనములు ఫలములైనవని ఇంతకు ముందు నామములో చెప్పబడినది. ఆ నూగారు అను తీగ పైకి పాకడానికి ఆలంబన (ఆధారం) అవసరము. అమ్మవారి సన్నని అందమైన నడుమే ఆ నూగారు అను తీగకు ఆధారము.
సన్నని నడుము గల స్త్రీని సింహమధ్య అంటారు. స్త్రీలకు నడుము అందంగా సన్నగా ఉండడం శుభప్రదమైన సాముద్రిక లక్షణము.
అమ్మవారి నడుమును శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరి, ఏడవ శ్లోకంలో ఇలా వర్ణించారు:-
క్వణత్కాంచీ-దామా కరి కలభ కుంభస్తనభరా
పరిక్షీణా మధ్యే - పరిణత శరచ్చంద్రవదనా |
ధనుర్బాణాన్ పాశం - సృణిమపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః - పురమథితు రాహోపురుషికా॥7॥
మంగళప్రదమైన సవ్వడులు చేయుచున్న మెరయుచున్న మణులతో కూడిన బంగారు మొలనూలు ధరించినదియు, మదపుటేనుగుల కుంభస్థలముల వంటి స్తనముల భారముచే కొంచము ముందుకు వంగినదియు, (సాధారణ తల్లులే తమ బిడ్డలకై క్షీరసమృద్ధితో భారమైన స్తనద్వయం కలిగియుండగా సకల జగత్తుకూ తల్లియైన జగన్మాత, జగత్తులోని అందరి బిడ్డల ఆకలినీ పోగొట్టుటకు భారమైన స్తనములతో ఒప్పారుచున్నది)
కృశించిన సన్నని నడుము కలదియు, శరత్కాల పూర్ణిమనాటి చంద్రబింబమువంటి ముఖారవిందము కలిగినదియు, చతుర్భుజముల కరములయందు చెరకువిల్లు, పుష్పబాణములు, పాశ, అంకుశములు ధరించునదియు, త్రిపురాసురులను సంహరించిన పరమేశ్వరుని యొక్క అహంకారమే స్వరూపముగా కలిగినదియు అయిన అటువంటి జగన్మాతయైన ఆదేవి ఎల్లవేళలా నా మనోనేత్రములయందు గోచరమవుతూ నా మనో ఫలకముపై సుఖాసీనయై ఉండుగాక!
అందమైన సన్నని నడుము గల స్త్రీలను అసలు నడుము ఉందా లేదా అని సందేహించేంత సన్నని నడుము కలది అని అంటూంటారు.. స్త్రీలకి నడుము బాగము ఎంత సన్నగా ఉంటే అంత తేలికగా పిల్లలను ప్రసవించ గలుగుతారు అని అంటారు. ఇది కూడా ఉత్తమ సాముద్రిక లక్షణము. జగదేక సుందరి, సకలజగములకు తల్లి అయిన పరమేశ్వరికి నడుము ఈ కారణం చేతనే సన్నగా ఉన్నది అని భావము.
శంకరభగవత్పాదులవారు ఇంకను తమ సౌందర్యలహరియందు డెబ్బది తొమ్మిదవ (79వ) శ్లోకంలో ఇలా వర్ణించారు.
నిసర్గక్షీణస్య - స్తనతటభరేణక్లమజుషో
నమన్మూర్తే ర్నారీతిలక శనకైస్త్రుట్యత ఇవ|
చిరం తే మధ్యస్య - త్రుటితతటినీతీర తరుణా
సమావస్థాస్థేమ్నో - భవతు కుశలం శైలతనయే||79||
సహజముగానే కృశించింది. స్తన భారముచే వంగినది. నాభియు, వళులు (మడతలు) ను ఉన్న చోట విఱిగిపోవునో యన్నట్లున్నది. ఒడ్డు విఱిగిన నదీ తీరమున ఉన్న చెట్టువలె ఊగుచున్నది.
ఓ జగన్మాతా! నారీ శిరోమణీ! అతి సన్నగా ఉన్న నీ నడుమును చూస్తుంటే అది ఎక్కడ తునిగిపోవునో (విరిగిపోవునో) అని నాకు కంగారు కలుగుచున్నది. సహజంగానే మిగుల కృశించి సన్నంగా ఉండేది, స్తన భారంచేత బడలిపోయి కొంచెం వంగిన ఆకారము కలిగినది, ఒడ్డు (గట్టు) మీద ఉండి వాగువైపునకు వంగిన చెట్టులా వంపుతిరిగి ఉండేది అయిన నీ నడుము చిరకాలమూ కుశలంగా ఉండి మాకు క్షేమం కలిగించుగాక.
సన్నగా కృశించి ఉన్న నడుము స్త్రీ అందంలో ప్రధాన. భూమిక పోషించును. అమ్మవారి నడుము అత్యంత సుకుమారంగా సుందరంగా ఉన్నది అని కవి భావన. అమ్మ నడుముకు పై భాగము, క్రింద భాగము విశాలముగా ఉండి మధ్యలో ఈ నడుము ఉన్నదా లేదా అని అనిపించేంత అతి సన్నదిగా ఉన్నది అని భావము.
దేవియొక్క ఆవిర్భావ కాలమున ఇంద్రుని తేజముచే నడుము ఏర్పడెను అని దేవీభాగవతంలో పంచమస్కంధంలో, పదకొండవ అధ్యాయంలో డెబ్బది ఒకటవ శ్లోకంలో చెప్పబడినది.
సౌమ్యేన తేజసా జాతం స్తనయో ర్ముగ్మముత్తమమ్|
ఇంద్రేణా స్యా స్తథా మధ్యం జాతం త్రివళిసంయుతమ్॥71॥
చంద్రుని తేజస్సుతో రెండు వక్షోజములు, ఇంద్రుని తేజస్సుతో మధ్యభాగమగు కటిప్రదేశము మరియు త్రివళులు (పొట్టపై ఉండు మూడు మడతలు),
సమున్నేయ మధ్యమా అనగా చక్కగా ఉద్ధరింపబడిన నడుముకలిగినది అని అర్థము. అమ్మవారి విరాట్స్వరూపంలో నాభికి పైన ఊర్ధ్వలోకములు, నాభికి దిగువన అధోలోకములు ఉన్నవి. ఊర్ధ్వలోకములను, అధోలోకములను ఉద్ధరించేందుకే అంతసన్నని నడుము ఉన్న పరమేశ్వరిని సమున్నేయ మధ్యమా యని విశేషించి చెప్పడం జరిగినది.
శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమాయై నమ అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
36వ నామ మంత్రము
ఓం స్తనభారదళన్మధ్యపట్టబన్ధ వళిత్రయాయై నమః
దృఢమైన స్తనముల భారముచే నడుము విరుగునేమోయని నడుము చుట్టూ పట్టీలువలెనున్న వళిత్రయము (పొట్టపై మూడు మడతలు) గలిగిన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళియందలి స్తనభారదళన్మధ్యపట్టబన్ధ వళిత్రయా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం స్తనభారదళన్మధ్యపట్టబన్ధ వళిత్రయాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఉపాసించు సాధకులకు కాలస్వరూపిణియైన శ్రీమాత కరుణచే సర్వసౌభాగ్యములు, సుఖసంతోషములు, ఎనలేని ఆత్మానందము కలుగును మరియు పరాశక్తి ఆరాధనలో మరింత ఏకాగ్రత ఏర్పడి పరమపదమునకు సోపానములు ప్రాప్తించి తరించుదురు.
అమ్మవారి స్తనద్వయం రవిసోమాత్మకమైన కాలాన్ని తెలియజేస్తుంది. అట్టి కాలమును భరించునది కావున ఆ పరమేశ్వరి కాలస్వరూపిణి యను భావము గ్రహించునది. స్తనముల బరువుచే నడుము విరుగునేమో యని కట్టిన పట్టీలవలె ఆ అమ్మవారి పొట్టమీద మూడు ముడుతలు గలవట. చాలా సహజంగా యుక్తవయసు రాగానే పొట్టమీద మడతలు ప్రతివారికిని ఏర్పడుతాయి. జగన్మాత విషయంలో కొంచం ఉత్ప్రేక్షించడం జరిగింది. స్తనభారముచే సన్నని నడుము వంగిపోవునేమోనని భయంతో బంగారు పట్టీని నడుముచుట్టూ కట్టినట్లుగా శ్రీమాత వళిత్రయము (పొట్టపైగల మూడు మడతలు) ఒప్పుచున్నదట..ఆ వళిత్రయముతో అమ్మవారి సౌందర్యము మరింత ఇనుమడిస్తోందట. ఇది అంతయు వశిన్యాదులు జగన్మాత సౌందర్య వర్ణనలో ఉపయోగించిన ఉత్ప్రేక్షాలంకారమే అవుతుంది. అలా ఈ నామ మంత్రమును వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి ఎదుట పఠించారట. ఆ తల్లి కన్నులు అరమోడ్పులయాయట. ఆ పెదవులపై మందస్మితము తళుక్కున మెరసిందట.
అమ్మవారి నడుముచుట్టూగల ఆ మూడు ముడుతలు గుణత్రయముగా (సత్త్వరజస్తమో గుణములు), స్దూల, సూక్ష్మ కారణదేహములుగా,. అలాగే మువురమ్మలుగా(మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి), త్రిమూర్తులుగా (బ్రహ్మవిష్ణుమహేశ్వరులు), ముల్లోకములుగా (భూ, భువ, సువర్లోకములు) సమన్వయించు కోవచ్చును.
శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు ఎనుబదియవ శ్లోకంలో అమ్మవారి వళిత్రయాన్ని ఇలా వర్ణించారు.
కుచౌ సద్య స్స్విద్య - త్తటఘటితకూర్పాసభిదురౌ
కషంతౌ దోర్మూలే - కనకకలశాభౌ కలయతా|
తవ త్రాతుం భంగా - దలమితి వలగ్నం తనుభవా
త్రిధా నద్ధం దేవి - త్రివళిలవలీవల్లిభి రివ॥80॥
మన్మథ నిర్మితములై కాంచన కలశములవంటి ఆ శ్రీమాత స్తనములు ఈశ్వర స్మరణచేత సారెకు ప్రక్కలయందు చెమర్చుచు రవికను పిగుల్చుచున్నవి. చంకలను ఒరయుచున్నవి. ఆ కుచ భారమునకు నడుము విరిగిపోకుండా కాపాడుటకై దేవి వళులు (నడుముపైని మూడు ముడుతలు) లవలీలతచే కట్టబడిన మూడు కట్లవలెనున్నవి.
ఓ తల్లీ! పరమేశ్వరీ! నిరంతరం స్వేదంతో తడచి ఇరు పార్శ్వములయందు అంటుకుని ఉన్న రవికను ఛిద్రం చేయుచున్న, బాహుమూల సమీప ప్రదేశముల ఒరిపిడికి గురయగుచున్న, బంగారు కలశముల కాంతితో, అత్యంత సౌందర్య సౌభాగ్యాలతో ఒప్పు నీ స్తనముల బరువు వలన అతి సున్నితము, సుకుమారము సూక్ష్మము ఐన నీ నడుమునకు భంగపాటు కలుగకుండా ఉండడానికా అన్నట్లు, ఆ మన్మథుడు ఏలకి లత (ఏలక్కాయ లత) తీగలచేత మూడు చుట్లుతో మూడు కట్లు కట్టినట్లుగా నీ ఉదరం(పొట్ట) మీద ఉన్న ఆ మూడు మడతలు మూడు రేఖలుగా తోచుచున్నవి.
ఇచ్చట గమనించవలసిన విషయం ఒకటున్నది. అమ్మ సౌందర్యం కన్యా సౌందర్యంగా వర్ణించుటలేదు. కన్యగా అయితే ఆ ముడుతలు అందం కాకపోవచ్చు,కాని ఇక్కడ అమ్మను మన అందరి కన్నతల్లిలా, ప్రౌడ సౌందర్యంగా శ్రీ శంకరులు వర్ణించారు. బిడ్డల తల్లి అయిన ప్రౌఢ స్త్రీకి ఉదరంపై ముడుతలు అందమేకాక స్త్రీత్వానికి పరిపూర్ణతనిచ్చు మాతృమూర్తిగా, సంతానవతి ఈమె అను గొప్పను తెలుపునది కూడా. అందువల్ల అమ్మ ముడుతలతో అందంగా శోభిల్లుతున్నది. స్తనభారము మోయు నడుమును కాపాడుటకు మధ్యన పట్టబంధముతో కట్టబడినట్లు మూడు ముడుతలతో అమ్మ ఒప్పారుచున్నది అని భావము.
శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం స్తనభారదళన్మధ్యపట్టబన్ధ వళిత్రయాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
37వ నామ మంత్రము
ఓం అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతట్యై నమః
బాలభానుని (ఉదయించు సూర్యుని) ఎఱుపు రంగువలెను, కుంకుమపువ్వు ఎఱుపు రంగువలెను కనిపించు వస్త్రముతో ప్రకాశించు కటి ప్రదేశం కలిగిన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ అను పదహారు అక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతట్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు జీవనమే శుభప్రదమై, భోగభాగ్యములతోను, సుఖసంతోషములతోను విలసిల్లుచూ, పరమేశ్వరీ పాదసేవలో పరమపద సోపానములు కూడా అనాయాసముగా లభించును.
అరుణవర్ణము అంటే ఎఱుపు వర్ణము. అరుణారుణము అనగా అరుణవర్ణాన్ని మరింత ఎక్కువజేసే మిక్కిలి అరుణవర్ణము. ఆ అరుణవర్ణము ఎలాంటిదంటే కౌసుంభ (కుంకుమ వర్ణము). అనూరునివలె (అనూరుడు అరుణవర్ణంలో ఉంటాడు. అందుచే అరుణుడు అని కూడా అన్నారు. సూర్యుని రథచోదకుడు అనూరుడు. ఇతనికి ఊరువులు లేవు. ఊరువులు లేకుండా పుట్టాడు. మిక్కిలి అరుణవర్ణంలో ఉన్న అనూరునివలె) ఎర్రని రంగువస్త్రములతో ప్రకాశించే కటిప్రదేశముగలిగినది ఆ పరమేశ్వరి. గనుకనే అమ్మవారు అరుణారుణకౌసుంభవస్త్ర భాస్వత్కటీతటీ యని అనబడినది.
అమ్మవారికి అరుణవర్ణం అంటే చాలా ఇష్టము. ధ్యాన శ్లోకములో
సిందూరారుణ విగ్రహాం సిందూరం మాదిరిగా ఎర్రనైన శరీరము గలిగినది అమ్మవారు. రక్తోత్పలం బీభ్రతీమ్ ఎర్రని కలువను ధరించియున్నది. రత్నఘటస్థరక్తచరణాం రత్న ఘటమునందు రక్తమువలె ఎర్రని పాదములు గలిగినది అరుణాం కరుణా తరఙ్గితాక్షీం ఆపాద మస్తకమూ ఎర్రని రంగులో ప్రకాశించునదియు, సదా కనులనుండి కరుణా తరంగములు ప్రసరించునది ఆ పరమేశ్వరి. అమ్మవారు ఇష్టపడే మందారములు, కదంబములు, దాడిమీ కుసుమములు, అమ్మవారి పెదవులు అన్నియునూ అరుణవర్ణమే. అందుకే అమ్మవారు సర్వారుణా యని కూడా అనబడినది.
సాయ సంధ్యవేళలో కుంకుమపరచినట్లు ఉండే పడమటిదిశ చూడముచ్చటగాను, వర్ణనాతీతముగాను ఉంటుంది. సకలవేదవేదాంగములను పుక్కిటబట్టిన వేదబ్రాహ్మణుని ముఖకమలం అరుణవర్ణ రంజితమై ఉంటుంది. అంటే అతనిలో వేదరూపములో బ్రహ్మజ్ఞానము ప్రస్ఫుటమౌతున్నది గదా! ప్రేమకు, అనురాగమునకు ఎర్రని గులాబీ సంకేతము. సృష్టి అనేది ఉదయసంధ్యవంటిది. ఉదయసంధ్య ఎర్రని బాలభానుని వంటిది. జాగ్రదావస్థ అంటే అరుణవర్ణరంజితమైన ఉదయసంధ్యవంటిది. అరుణవర్ణము చైతన్యమునకు సంకేతము. పరమేశ్వరి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి, అనంతకోటి జీవరాశికి అనురాగభరితమైన మాతృశ్రీ. గనుకనే అమ్మవారు అన్నివిధముల అరుణారుణ వర్ణరంజితమూర్తి.
అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతట్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
38వ నామ మంత్రము
ఓం రత్నకింకిణికా రమ్య రశనా దామ భూషితాయై నమః
రత్నములతోను, చిఱుగజ్జెలతోను మిక్కిలి రమణీయమై అలరారే ఒడ్డాణపు త్రాడును ధరించియున్న శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళియందలి రత్నకింకిణికా రమ్య రశనా దామ భూషితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం రత్నకింకిణికా రమ్య రశనా దామ భూషితాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ జగన్మాత కరుణించి సకలాభీష్టములను నెరవేర్చును.
అమ్మవారు ఆపాద మస్తకమూ సకలాభరణభూషిత. ఆ ఆభరణములు నవరత్నఖచితములు. అమ్మవారి ఒడ్డాణము సువర్ణముతో చేయబడినది. ఆ ఒడ్డాణమునకు అంచులందు రత్నములు పొదిగిన చిఱుగంటలు ఉన్నవి. అటువంటి రత్నఖచితమైన చిఱుగంటల అంచులుగలిగిన అందమైన బంగారపు ఒడ్డాణముతో అలంకృత అయిన పరమేశ్వరి రత్నకింకిణికారమ్య రశనాదామ భూషితా యని అనబడినది.
మగవాళ్ళకు మొలత్రాడు, ఆడవాళ్ళు బంగారు మొలనూలు లెేదా ఒడ్డాణము ధరించుట సాంప్రదాయము. మొలనూలు లేదా ఒడ్డాణము శరీరమునందు మధ్యభాగమున ఉంటుంది. అమ్మవారు ధరించిన ఒడ్డాణము నాభిమీదుగా ఉండును. అమ్మవారి విరాట్స్వరూపమును ఆలోచిస్తే ఆ తల్లి నాభికి పైనగల ఊర్ధ్వలోకములు, నాభికి క్రిందగల అధోలోకములను అనుసంధానము చేయుచున్నట్లుగా ఉండును.
సౌమ్యేన తేజసా జాతం స్తనయో ర్ముగ్మముత్తమమ్|
ఇంద్రేణా స్యా స్తథా మధ్యం జాతం త్రివళిసంయుతమ్॥71॥
జంఘోరూ వరుణస్యాఽథ తేజసా సంబభూవతుః|
నితంబః స తు సంజాతో విపుల స్తేజసా భువః॥72॥॥
(దేవీభాగవతము, పంచమస్కంధము, పదకొండవ అధ్యాయము)
చంద్రుని తేజస్సుతో రెండు వక్షోజములు, ఇంద్రుని తేజస్సుతో మధ్యభాగమగు కటిప్రదేశము మరియు త్రివళులు (పొట్టపై ఉండు మూడు మడతలు), వరుణుని తేజస్సుతో తొడలు ప్రకటితమయ్యెను
శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం రత్నకింకిణికా రమ్య రశనా దామ భూషితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
39వ నామ మంత్రము
ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః
పరమేశ్వరునికి (శ్రీమాత భర్తకు) మాత్రమే తెలిసిన సౌభాగ్యశ్రీలతోను మృదుత్వంతోను కూడిన ఊరువులు కలిగిన శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః అని ఉచ్చరించుచూ శ్రీమాతను పూజించు భక్తులకు ఆ తల్లి ఆత్మానందమును, బ్రహ్మానందమును ప్రసాదించి కరుణించును.
భార్యయొక్క అంగాంగములు భర్తకు మాత్రమే తెలియును. ఇందుకు పార్వతీ పరమేశ్వరులు ఏమాత్రమూ మినహాయింపుకారు. ఆదర్శదాంపత్యానికి పార్వతీపరమేశ్వరులే ప్రతీకలు. అమ్మవారి సర్వాంగములు వివిధ దేవతలయొక్క అంశలనుండి ప్రకటితమయినవి.
జంఘోరూ వరుణస్యాఽథ తేజసా సంబభూవతుః|
నితంబః స తు సంజాతో విపుల స్తేజసా భువః॥72॥॥ (దేవీభాగవతం, పంచమస్కంధం, పదకొండవ అధ్యాయము)
వరుణుని తేజస్సుతో తొడలు, పిక్కలు, భూదేవి తేజముతో విశాలమైన నితంబభాగము (పిరుదులు) ప్రకటితమయ్యెను.
పరమేశ్వరుడు ఈ జగత్తుకే సాక్షీభూతుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఆయన కామేశ్వరుడు. ఆ పరమేశ్వరి కామేశ్వరి. కామేశునికి మాత్రమే తెలియదగిన ఊరుద్వయము కామేశ్వరి కలిగియున్నది. ఈ విషయాన్నే శ్రీలలితా సహస్ర నామావళిలో వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా యని అన్నారు. కామేశజ్ఞాత అనగా కామేశ్వరునికి మాత్రమే తెలిసిన, సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా సౌభాగ్యము, మార్దవముగలిగిన ఊరుద్వయముతో కూడినది ఆ పరమేశ్వరి. అమ్మవారి ఊరువుల జంటలో ఎడమ తొడ సౌభాగ్య సంకేతము, కుడి తొడ మార్దవ సంకేతము గలిగి యున్నది. ఊరు అనగా ఊ అను అక్షరము, రు లో ఉ కారము గలవు. ఇందులో ఉ కారము దక్షిణోరువు, ఊ కారము వామోరువు. వామోరువు పరాసూచితము. దక్షిణోరువు అపరాసూచితము. వామోరువు జగత్తులోని బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రులు అను నాలుగువర్ణములకు సూచన అయితే, దక్షిణోరువు భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము అను పంచభూతములను మరియు మనోబుద్ధ్యహంకారములను సూచిస్తాయి.
అమ్మవారి కపోలము అష్టమీచంద్రుడనియు, కనుబొమలు మన్మథగృహ తోరణమునియు, రెండు కన్నులు ఆ తల్లి ముఖప్రవాహమున చలించెడి మీనముల జంట అనియు, నాసాదండము నవ సంపెంగవంటి దనియు, చెక్కిళ్ళు పద్మరాగ శిలలను, అద్దమును తిరస్కరించుచుండెననియు, ఆ తల్లి పెదవులలో ఒక పెదవి క్రొత్తపగడమును, క్రింది పెదవి దొండపండును వెక్కిరించు చున్నవనియు, ఆ తల్లి దంతపంక్తులజంట శుద్ధవిద్యాంకురములైన ద్విజులనియు, ఆ తల్లి పలుకులు కచ్ఛపి వీణానాదముకన్నా మధురమనియు... ఇలా అన్నిటికీ ఉపమానములు చెప్పగా, అమ్మవారి ఊరుద్వయము కామేశ్వరునికి మాత్రమే తెలియడం చేత వశిన్యాది వాగ్దేవతలు ఉపమానమును చెప్పలేదు.
శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరిలో ఎనుబది రెండవశ్లోకంలో వర్ణించినవిధం ఇలా ఉన్నది:
కరీన్ర్దాణాం శుండాన్ - కనక కదళీకాండపటిలీం
ముభాభ్యా మూరుభ్యా - ముభయమపి నిర్జిత్య భవతి|
సువృత్తాభ్యాం పత్యుః - ప్రణతికఠినాభ్యాం గిరిసుతే
విధిజ్ఞే జానుభ్యాం - విబుధకరికుంభద్వయమసి॥82॥
అమ్మా! ఓ పరమేశ్వరీ! వేదవిహితమైన ధర్మానుష్టానము కలిగినదానా.. నీ ఊరువులు ( తొడలు) రెండూ, దిగ్గజముల యొక్క తొండాల శోభనూ, బంగారు అరటిబోదెల అందాన్ని కూడా ధిక్కరిస్తూ అత్యంత శోభాయమానంగా వెలుగొందుచున్నవి. అలాగే నీ జానువులు (మోకాళ్ళు) రెండూ చక్కనైన వట్రువులు (గోళాకారం) కలిగి ఉండి, నీవు నిరంతరం పతివ్రతా ధర్మంతో అనునిత్యం నీ భర్తకు సేవలు చేస్తూ ఆయనకు నీవు మోకాళ్ళపై పాదాభివందనములు చేయుటచేత, ఆ మోకాళ్ళు నేలకు తగిలి అవి కఠినములై ఐరావత దిగ్గజముయొక్క కుంభస్థలాలను సైతం త్రోసి రాజిల్లుతూ అవి జయకరంగా ప్రకాశించుచున్నవి.
శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః అని అనవలెను.
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
40వ నామ మంత్రము
ఓం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః
మాణిక్య కిరీటము వంటి మోకాలు చిప్పల జంటతో విరాజిల్లు లలితాంబకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు బ్రహ్మజ్ఞాన సంపదలతో ఆత్మానందమునంది తరించును.
మహిషాసురాది రాక్షస సంహారమునకు దేవతలవలన పరమేశ్వరి శరీరము మొత్తము వివిధ వారివారి అంశలతో ప్రకటితమయ్యెను. ఆ తల్లి ధరించిన ఆయుధములుకూడ దేవతలనుండి లభించినవే. అందుచే అమ్మవారి శరీర నిర్మాణములో వివిధ అంగములు ప్రత్యేకతను సంతరించుకొని యున్నవి.
అమ్మవారి మోకాలి చిప్పలు మాణిక్య ఖచితమైన మకుటములవలెనున్నవి. వేరే మాటలో చెప్పాలంటే పెద్దమాణిక్యము ఒకటి తీసుకొని, ఆ మాణిక్యముతో చేసిన టోపీలవలవంటి మోకాలి చిప్పలతో అమ్మవారు ప్రకాశించుచున్నది.
శంకర భగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు ఎనుబది రెండవ శ్లోకంలో అమ్మవారి ఊరువులను, జానువులను ఇలా వర్ణించారు.
కరీన్ర్దాణాం శుండాన్ - కనక కదళీకాండపటిలీం
ముభాభ్యా మూరుభ్యా - ముభయమపి నిర్జిత్య భవతి|
సువృత్తాభ్యాం పత్యుః - ప్రణతికఠినాభ్యాం గిరిసుతే
విధిజ్ఞే జానుభ్యాం - విబుధకరికుంభద్వయమసి||82||
అమ్మా! పార్వతీ! వేదవిహితమైన ధర్మానుష్టానము కలిగిన ఓ జగన్మాతా! నీ ఊరువులు ( తొడలు) రెండూ, దిగ్గజముల యొక్క తొండాల శోభనూ, బంగారు అరటిబోదెల అందాన్ని కూడా ధిక్కరిస్తూ అత్యంత శోభాయమానంగా వెలుగొందుచున్నవి. అలాగే నీ జానువులు (మోకాళ్ళు) రెండూ చక్కనైన వట్రువులు (గోళాకారం) కలిగి ఉండి, నీవు నిరంతరం పతివ్రతా ధర్మంతో అనునిత్యం నీ భర్తకు సేవలు చేస్తూ ఆయనకు నీవు మోకాళ్ళపై పాదాభివందనములు చేయుటచేత, ఆ మోకాళ్ళు నేలకు తగిలి అవి కఠినములై ఐరావత దిగ్గజముయొక్క కుంభస్థలాలను సైతం త్రోసి రాజిల్లుతూ అవి జయకరంగా ప్రకాశించుచున్నవి.
ఆ జగన్మాత మోకాళ్ళు కఠినములై ఉన్నవి అని ఇచట అమ్మను విధిజ్ఞే అని కీర్తించారు అనగా వేదవిహిత కర్మానుష్టానము కలిగినదానా అని. అందువల్ల అమ్మ పతివ్రతా ధర్మాన్ని తను పాటించి లోకానికి తెలిపినది. అందువలనే తను సర్వం సహా మహారాజ్ఞి అయినప్పటికిని తన భర్త అయిన పరమేశ్వరుని సన్నిధిలో మాత్రం మామూలు స్త్రీ వలె తన ధర్మాన్ని పాటించి, మోకాళ్ళపై సాష్టాంగపడి భర్తను పూజించడం వలన అమ్మ జానువులు (మోకాళ్ళు) కఠినములై మాణిక్యములతో చేయబడిన మకుటములుగా విరాజిల్లు చున్నవి.. ఈ శ్లోకంలో శ్రీ శంకరులు అమ్మ తొడలను మోకాళ్ళను వర్ణించారు. ఈ రెండిటినీ వర్ణిస్తూ లలితా సహస్రం నామావళి యందు కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా అని ఊరువులను మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా అని జానువులను వర్ణించిరి. అనగా కామేశ్వరునికి మాత్రమే తెలిసిన మెత్తనైన ఊరువులు కలిగినదానా అని ఓ నామం అర్ధం. అంటే స్త్రీ గోప్య సౌందర్యం రతీ విలాసవేళ భర్తకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి అలా వర్ణించారని భావించవచ్చు. కాని అదికాక వేరే నిగూఢ రహస్యం ఉన్నది. పార్వతి పరమేశ్వరులు అర్ధనారీశ్వరులు. శంకరుడు పద్మాసనంలో కూర్చుని ఉండువాడు (శాంత పద్మాసనస్తం) అలా పద్మాసనం లో కూర్చుని ఉన్నప్పుడు ఎడమ తొడమీదకు కుడి అరికాలు వచ్చి చేరును .ఆ ఎడమ తొడ అమ్మవారిది దాని మీదకు చేరిన అరికాలు శివునిది. ఆ అరికాలి స్పర్శతో పరమేశ్వరి తొడ మార్ధవం అర్ధనారీశ్వర తత్వంలో శంకరునికి గోచరమైనది. అంతే కాని రతికేళీ విలాసంలో కాదు. ఇక అమ్మ మోకాళ్ళు మాణిక్యాలు పొదిగిన కిరీటాల్లా విరాజిల్లుతున్నాయని మరొక నామం అర్ధం. మాణిక్యం ఎర్రగా ఉండును. అమ్మ ఎర్రచీరతో కూర్చుని ఉంటే మోకాళ్ళు ముందుకి పొడుచుకుని వచ్చి ఆ ఎర్రచీర కప్పబడి ఉన్న ఆ మోకాళ్ళు మాణిక్య మకుటాల్లా ఉన్నాయని దాని భావము.
ఆ పరమేశ్వరి బ్రహ్మానందస్వరూపిణి, పరబ్రహ్మస్వరూపిణి, సచ్చిదానందస్వరూపిణి, శివశక్త్యైక్యరూపము, సర్వవేదవేదాంగవేద్య. బ్రహ్మానందపు అంశయైన ఆనందకలిక కలిక అనగా మొగ్గ. ప్రతీ జీవిలోను మొగ్గస్థితిలో అవ్యక్తంగా ఉన్న బ్రహ్మానందాన్ని జగన్మాత యొక్క కృపతో సాధన ద్వారా వికసింపజేసుకోవచ్చని అనగా అనుభవంలోకి తెచ్చుకోవచ్చని ఈ కలిక అను శబ్దములో గుప్తముగానున్న భావము.
శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
41వ నామ మంత్రము
ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః.
ఎర్రని రంగులో ఉన్న ఆరుద్ర పురుగులచే చుట్టూ చెక్కబడిన మన్మథుని అమ్ములపొదుల బోలిన జంఘికలు (పిక్కలు) గలిగిన జగదాంబకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి ఇంద్రగోప స్మరతూణాభి జంఘికా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరుని పూజించు భక్తులకు అనంతమైన సుఖసంతోషములు, భౌతికానందముతో బాటు బ్రహ్మానందమును ప్రాప్తించును.
మోక్షమునిచ్చి రక్షించేది మరియు స్మరణ మాత్రముచే కోరికలను పూరించు ప్రకాశావిర్భావము గలిగినది శ్రీమాత.
అమ్మవారి జంఘికలు మన్మథుని యొక్క సుమబాణ తూణీరము వంటిది. మన్మథుని బాణతూణీరము ఇంద్రగోపములు పొదగబడి ఉంటాయి. ఆరుద్ర పురుగులు ఎర్రని గురువింద గింజల రంగులో ఉంటాయి. ఆరుద్ర పురుగులు వ్యవసాయము మొదలు పెట్టుటకు,ఆరుద్ర కార్తె అనుకూలమైనది. ఈ కార్తెలో మాత్రమే కనబడేది ఆరుద్ర పురుగు. ఇది మొఖమల్లు వస్త్రమును (అందమైన, సున్నితమైన, ఎర్రని పట్టువస్త్రమును) చుట్టుకున్నట్లుగా ఉండి, ఎర్రగా బుర్రగా, బొద్దుగా ఉంటుంది. అమ్మవారి జంఘములు ఇంద్రగోపములు అతుకబడిన మన్మథుని బాణతూణీరములను బోలి ఉన్నవి. ఆ బాణ తూణీరముల యందు మల్లెలు, చంపకములు (సంపంగిలు), పున్నాగములు మొదలైన సుగంధభరిత పుష్పములతో చేయబడిన బాణములు ఉంటాయి. మన్మథుని విల్లు ఇక్షుకముతోను (చెఱకు గడతోను), ఆ వింటినారి బిసతంతువులతోను తామరతూడులోని సన్నని దారముతో) చేయబడి, ఆ విల్లుపై సమ్మోహనమంత్ర మరియు వశీకరణమంత్ర బీజాక్షరములు లిఖింపబడి ఉంటాయి.
శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో ఎనుబది మూడవ శ్లోకంలో అమ్మ జంఘికలను ఇలా చెప్పారు.
పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే
నిషజ్గౌ జజ్ఘే తే విషమవిశిఖో బాఢమకృత||
యదగ్రే దృశ్యంతే దశ శరఫలాః పాదయుగళీ
నఖాగ్ర చ్ఛద్మాన స్సురమకుటశాణైకనిశితా ||83||
గిరిసుతా! ఈశ్వరుని గెలుచుట కొఱకు మన్మధుడు నీ పిక్కలను పదేసి బాణములున్న అమ్ముల పొదులుగా చేసికొనెను. (ఎందుకంటే మన్మధుని దగ్గర ఉన్న ఐదే బాణాలు చాలవని). వాని చివరల నీ గోటికొనలనెడు బాణాగ్రములు (ములుకులు) కనుపించుచున్నవి. ఆ బాణాగ్రములు (అమ్మవారి పాదములకు మ్రొక్కుచున్న) దేవతల కిరీటములచే పదునుపెట్టబడియున్నవి.
ఇంద్రగోప (ఆరుద్ర పురుగులచే), పరిక్షిప్త (చుట్టును అమర్చబడిన) స్మర - తూణ (మన్మథుని అమ్ములుపొదుల వంటి), జంఘిగా (పిక్కలు గలిగిన తల్లీ).
వర్షాకాలములో ఆరుద్ర కార్తెయందు వ్యవసాయ భూములలో ఆరుద్ర పురుగులు పుట్టుకొస్తుంటాయి. అవి ఎర్రగా ముక్కమల్లు గుడ్డవలె చిన్నవిగా ఉంటాయి. వర్షంలో ఆవి చావకుండా వర్షాధిపతి ఇంద్రుడు కాపాడుతాడనియు, అందుకనే వీటికి ఇంద్రగోపములనియు పిలుస్తారు.
ఇంద్రగోపములు అనగా మంత్రములోని బీజాక్షరములు అని రహస్యార్థము. తూణము (తూణీరము) అనగా మంత్ర సముదాయము. తూణమునందు ఉండే బాణములచే మంత్రములు సూచితమైనవి. దేవి జంఘికలు మహావర్ణ సంపుటికలు అని తెలియదగును. స్మర శబ్దము సగుణ బ్రహ్మయు, ప్రపంచ సృష్టికర్తయు అయిన పరమేశ్వరునకును - తూణా శబ్దము మాయా శక్తికిని బోధకములు అగును.
శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
42వ నామ మంత్రము
ఓం గూడగుల్ఫాయై నమః
నిండైన, సుందరమైన, నిగూఢంగా ఉండే చీలమండలు గలిగిన పరాశక్తికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి గూఢగుల్ఫా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం గూడగుల్ఫాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు ఉపాసకుడు ఆ తల్లి కరుణతో నిగూఢతత్త్వమైన పరాశక్తి తత్త్వమును పరిపూర్ణముగా గ్రహించి, బ్రహ్మత్వమును ప్రాప్తింపజేసుకొని ఆత్మానందమునందును
ధ్యానించు వారిని రక్షించు స్వభావం గలిగినదని ఈ నామ మంత్రములోని అంతరార్థము. గూఢ (లావైన, ఇంపైన) గుల్ఫా (చీలమండలు గలిగినది). లావైన లేదా అందమైన లేదా ఇంపైన చీలమండలు గలిగినది.
గూఢ అనగా రహస్యమైన, గాన అమ్మవారి చీలమండలు రహస్యంగా కనబడకుండా ఉంటాయి; స్త్రీలు సాధారణంగా పాదములు కనబడనట్లు చీర కుచ్చెళ్ళను పాదములవరకూ జారవిడుస్తారు, అనగా కాలిమట్టెలు కూడా కనబడనంతగా చీర కప్పబడి ఉంటుంది; శ్రీమాత కూడా ఆ సాంప్రదాయం పాటించునది ఎందుకంటే కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా అనగా వివాహితయొక్క సౌందర్యము భర్తకు మాత్రమే అంకితము, ఆ అవయవ సొంపులు భర్తకు మాత్రమే తెలియనగును.
అయితే అమ్మవారి చీలమండలు కనబడకుండా ఎలా ఉంటాయి? అమ్మవారు పద్మాసన స్థితిలో కుర్చుని ఉంటుంది గదా అప్పుడు చీలమండలు కనబడవు అలాగే ఒక కాలు పీఠం మీద, రెండవ కాలు పద్మాసనస్థితిలో ఉన్నప్పుడు? అప్పుడు కూడా అమ్మవారి చీర అంచు పూర్తిగా చీలమండలను కప్పి ఉంటుంది కాని చీలమండల పైకి ఉండదు గాన ఈ రహస్య (గూఢ) అర్థాన్ని బట్టి ఈ నామమంత్రాన్ని అర్థం చేసుకోవాలి.
గుహ్యస్థానము రత్నమణి సూచికము. చీలమండలము సంధిస్థానము - ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అను ఈ నవార్ణవ మంత్రమునందలి
మధ్య వర్ణము చింతామణి గుర్తుగలది; మిగిలిన ఎనిమిది వర్ణములు అష్టప్రకృతులు అనబడును.
నవార్ణవ మంత్రము అనగానేమి?
నవార్ణవ మంత్రము అంటే చండీ నవార్ణవ మంత్రము. అత్యంత ప్రభావవంతమైన విద్యలలో చండీ, దుర్గా విద్యలు చాలా ప్రభావవంతమైనవి. ఎటువంటి కోరికలనైనా సిద్ధింపజేస్తుంది. ఆ చండీ దేవి తన భక్తులకు ఏమికావాలో తెలిసుకొని ఆ కోరికలను సిద్ధింపజేస్తుంది. దీనికి సంబంధించిన కథ ఒకటి కలదు.
వారు ఇద్దరు చండీ ఉపాసకులు. చాలా నిరాశతో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకడు మహారాజు. కాని రాజ్యాన్ని కోల్పోయాడు. రెండవవాడు సాధారణ ఉపాసకుడు. అతడు కడు పెదవాడు. బలహీనుడు కూడా. వారిద్దరూ చాలానిరాశతో జీవితం విరక్తి కలిగి ఉంటారు. వారు ఇద్దరూ అడవిలో కలిసినప్పుడు ఒకరి వృత్తాంతమును మరియొకరు చెప్పుకుంటారు. వారు ఇద్దరూ స్నేహితులయారు. వారికి అడవిలో ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఆ ఆశ్రమంలోని మునీశ్వరులను సేవించుతారు. వారిద్దరూ ఆ ఆశ్రమానికి కేవలం ప్రశాంతతకోసమే వెళ్ళారు. నిరాశానిస్పృహలచేత ఏ కోరికలు లేనివారుగా మారుతారు. అయినప్పటికినీ ఆ మునీశ్వరునికి తమ బాధలను విన్నవించు కుంటారు. ఆ మునీశ్వరుడు వారిపై జాలిపడి మహత్తరమైన చండీమంత్రాన్ని ఉపదేశించుతాడు. వారు ఆ చండీమంత్రాన్ని చాలాతీవ్రతరముగా సాధనచేస్తారు. వారి సాధనలో ఆ చండీమంత్ర జపంచేయునప్పుడు ఆ చండీమాతకు తమ వ్రేలిని కోసి, స్రవించిన రక్తముతో ఆ చండీమాత పాదములకు ఆభిషేకము చేస్తూ ఉంటారు. వారి మంత్రసాధనకు ఆ చండీమాత వారియందు కరుణించి వారికి కనిపిస్తుంది. వారికి ఏమికోరిక ఉన్నదో తెలియజేయమని ఆ చండీమాత వాళ్ళను అడుగుతుండి. అందులో సాధారణ వ్యక్తి సంపదలు, గృహము వంటివి కోరుతాడు. మహారాజు మాత్రం పోయిన తన రాజ్యాన్ని తిరిగి వచ్చేలా కరుణించమని కోరుతాడు. కాని చండీ మంత్ర సాధనా ప్రభావానికి, వారు కోరిన కోరికలకు ఎక్కడా పొంతనలేదు. వారి కఠోరసాధనకు వారు కోరికలు చాలా చిన్నవి అని చండీమాత అంటుంది. అప్పుడు ఆ చండీమాత ఆ వారిరువురికి వారి కోరికలు సిద్ధించుననియు, మరియు బ్రతికినంత కాలము సకలభోగాలు, అష్టైశ్వర్యాలు అనుభవించి అంత్యమున మనువుగా మారతారు అని చెప్పింది. మనువు అంటే ప్రజాపతులలో ఒకడు. ఆ స్థాయికి చండీమాత అతనికి వరమిస్తుంది. అంటే చండీమాత నవార్ణవ మంత్రప్రభావము అంతటిది.
చండీ నవార్ణవ మంత్రము అంటే తొమ్మిది అక్షరములు గల చండీ మంత్రము.
గూఢగుల్ఫా యని నామప్రసద్ధమైన తల్లికి నమస్కరించునపుడు ఓం గూఢగుల్పాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
43వ నామ మంత్రము
ఓం కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమః
తాబేలు పృష్ఠ (వీపు) భాగము కంటెను సుందరమైన మీగాళ్ళు (పాదాగ్రములు) కలిగి యలరారు తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా యను పండ్రెండక్షరముల (ద్వాదశాక్షరీ) నామ మంత్రమును ఓం ఐం హ్రీం శ్రీం కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమః అని ఉచ్చరించుచూ ఆ అఖిలాండేశ్వరిని అత్యంత భక్తి ప్రపత్తులతో ఆరాధించు సాధకులను ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా ఉద్దరించి సమస్త భౌతిక సుఖసంతోషములను లభింపజేసి, జీవితమంతా ఆధ్యాత్మికచింతనతో ప్రవర్తింపజేసి తరింజేయును.
కూర్మపృష్ఠ (తాబేటి వీపును) జయిష్ణు (జయించు స్వభావముగల) ప్రపద (ముంగాలు అనగా పాదాగ్రము) కూడినది - కలిగియున్నది. ఈ పండ్రెండక్షరముల నామ మంత్రమును ఓం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై నమః అని ఆపకుండా ఉచ్చరించ వలెను. ఏ పరిస్థితిలోనూ కూర్మపృష్ఠా అని ఆపి చదవకూడదు...ఇంతకన్నా వివరించి చెప్పకూడదు..
తాబేటి వీపున కంటె ప్రశస్తముగా, సుందరమై ఒప్పారే పాదోపరిభాగములతో శ్రీమాత అలరారుచున్నది. అమ్మవారి పాదములు మోక్షప్రదములు. నాలుగు వేదాలకు సంబంధమైన నాలుగు వాక్యాలైన అహం బ్రహ్మాస్మి, తత్త్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, ఈ నాలుగు మహావాక్యాలు అమ్మవారి పాదాలను ప్రస్తుతించే వేదాలకు చెందినవి. అమృత మథనసమయంలో శ్రీమహావిష్ణువు ఆదికూర్మమై తన పృష్ఠభాగముతో మందరగిరిని క్షీరసాగరములోనికి క్రుంగకుండా ఉద్ధరించెను. అటువంటి బహు సుందరమైన ఆ ఆది కూర్మము యొక్క పృష్ఠభాగముకంటెను శ్రీమాత పాదాగ్రములు సుందరమై, అత్యంత మృదుత్వంతో అలరారు చున్నవని ఈ నామ మంత్రములోని భావము.
అంత శ్రేష్ఠమైన జగన్మాత పాదములు ఆశ్రితులకు అమృతపదముసు కలిగిస్తాయి, మోక్షదాయకములై పాపకూపములో పడకుండా ఉద్ధరిస్తాయి.
శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు ఎనుబది ఎనిమిదవ శ్లోకంలో అమ్మవారి ముంగాళ్ళను ఇలా వర్ణించారు:
పదం తే కీర్తీనాం - ప్రపద మపదం దేవి విపదాం
కథం నీతం సద్భిః - కఠినకమఠీకర్పరతులామ్|
కథం వా పాణిభ్యా ముపయమనకాలే పురభిదా
యదాదాయ న్యస్తం - దృషది దయమానేన మనసా॥88॥
ఓ అఖిలాండేశ్వరీ! నీ పాదములు యశస్సును కలిగించునవి, విపత్తులను హరించునవి. పురారియైన శివుడు దయామయుడై వివాహ సమయమున నీ సుకుమార పాదములను తన చేతబట్టి మృదువుగా సన్నెకల్లును త్రొక్కించెను. అట్టి పాదాగ్రములను పూజ్యులైన పూర్వకవులు కఠినమైన తాబేటి పెంకుతో ఎట్లు పోల్చిరో తెలియరాదు.
ఓ లలితాపరమేశ్వరీ! నిన్ను ఆశ్రయించిన వారికి సత్కీర్తులను కలిగించుచు, సకల ఆపదలను తొలగించుచు, మంచికి పుట్టిల్లుగా, చెడు అనేది దరిచేరలేని శుభవాకిళ్లుగా వెలుగొందుచుండేవి, నీ పాదముల పైభాగాన ఉండు నీ మీగాళ్ళు, అటువంటి నీ పాదమును నీ వివాహ వేళ, రాతియందు వధువు పాదము పెట్టించుట అను ఒక తంతుయందు దయాపూర్ణమైన మనసు కల నీ భర్తయైన శివుడు తన చేతితో నీ పాదములు పట్టుకుని రాతియందు ఉంచుటకు ( వధువుచే సన్నికల్లు తొక్కించుట) చాల సందేహించి నాడు. ఎందుకనగా అతి మృదువులైన నీ పాదములు ఆ కఠిన రాతి స్పర్శ తో ఎక్కడ కందిపోవునో అని. మరి అంత సున్నితమైన ఆ సుకుమార పాదాన్ని, ఆ పాదంపై నున్న మీగాలుని ( అరికాలు పై భాగం) కొందరు సత్కవులు ( లలితా సహస్ర నామావళియందు వశిన్యాది వాగ్దేవతలు) కఠినంగా ఉండే ఆడ తాబేలు వీపు చిప్పతో ఉపమానం చెబుతూ ఎలా వర్ణించగలిగారమ్మా!
ఆ లలితా పరమేశ్వరి పాదపద్మములపై దృష్టి నిలిపి నమస్కరించునపుడు ఓం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
44వ నామ మంత్రము
ఓం నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై నమః
నమస్కరించు భక్తజనుల అజ్ఞానాంధకారాన్ని పోగొట్టగలిగిన కాలిగోళ్ళ కాంతులు గలిగిన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని ఉపాసించు భక్తులకు ఆ పరమేశ్వరి కాలిగోళ్ళ కాంతికిరణముల వలన తమ అజ్ఞానమును నశింపజేసికొని బ్రహ్మజ్ఞానప్రకాశముతో తేజరిల్లుచూ జగన్మాత పాదసేవాపరాయణులై జన్మతరింపజేసికొందురు.
దేవతలందరూ జగన్మాత పాదములకు శిరస్సులుతాకుచూ నమస్కరించునపుడు వారి కీరీములందున్న వివిధ రత్నములు జగన్మాత కాలిగోళ్ళకు సానబెట్టినట్లుతాకగా సహజంగానే ప్రకాశవంతముగా ఉండే ఆ తల్లి కాలిగోళ్ళు మరింత ప్రకాశవంతంగా కాంతులు విరజిమ్ముచూ, నమస్కరించు భక్తజనుల అజ్ఞానతిమిరములను పారద్రోలుచు ప్రజ్ఞానకాంతులను ప్రసాదించుచున్నవని ఈ నామమంత్రమందలి భావము.. అమ్మవారి పాదాలు షట్చాక్రాలకు పైన ఉండి, చక్రాలపై అనంతమైన కిరణాలను వర్షింపజేస్తాయి. అలా వర్షించు కిరణాల్లో అగ్నికి సంబంధించినవి 108, సూర్యసంబంధమైనవి 116, చంద్రసంబంధమైనవి 136 వెరసి 360 కిరణాలు మాత్రమే ఆ షట్చక్రాలు గ్రహిస్తాయి. వీటినే సౌర సంవత్సరమందున్న రోజులు.
శంకరాచార్యులవారు క్రింది శ్లోకాలలో వర్ణించిన విధాన్ని పరిశీలించుదాము.
సుధాధారాసారై-శ్చరణయుగలాంతర్విగలితైః
ప్రపంచం సించన్తీ - పునరపి రసామ్నాయమహసః|
అవాప్య స్వాం భూమిం - భుజగనిభ మధ్యుష్ట వలయం
స్వమాత్మానం కృత్వా - స్వపిషి కులకుండే కుహరిణి || 10 ||
అమ్మా! పరమేశ్వరీ! బ్రహ్మరంధ్ర స్థానములో ఉన్న సహస్రార చక్రమందు అయ్యవారితో విహరించు ఓ జగన్మాతా! నీ పాదద్వయం మధ్యబాగము నుండి స్రవించిన అమృతధారా వర్షములచేత (మనలోని అంతః ప్రపంచమైన) వేల నాడుల ప్రపంచమును తడుపుతున్నదానివై,అమృతాతిశయ కాంతిగల చంద్రుని స్థానమును (బ్రహ్మరంధ్రమును) వీడి, మరలా స్వస్థానమైన మూలాధారమును చేరి, నీ రూపాన్ని నీవే చుట్టుకుని, పామువలె చుట్టలు చుట్టుకుని, పృధివీతత్వమగు మూలాధారమందు, తామరదుద్దు మధ్యలోని సన్నని రంధ్రములో సూక్ష్మముగా నున్న దానియందు కుండలినీశక్తిగా నిద్రిస్తూ ఉంటావు.
క్షితౌ షట్పంచాశ - ద్ద్విసమధిక పంచాశ దుదకే
హుతాశే ద్వాషష్టి - శ్చతురధిక పంచాశ దనిలే |
దివి ద్విఃషట్త్రింశ - న్మనసి చ చతుఃషష్టిరితి యే
మయూఖాస్తేషామప్యుపరి తవ - పాదాంబుజయుగమ్ || 14 ||
షట్చక్రాలలోని సహస్రారములో ఉండు దేవి పాదప్రకాశ వైభవం.
అమ్మా! శ్రీమాతా! యోగసాధనలో సాధకుడు షట్చక్రాలనూ అధిగమించి,సహస్రారములో ఉన్న నీపాదపద్మాలు చేరాలంటే తన దేహంలో ఉన్న పృధివీతత్వంతో కూడిన మూలాధార చక్రంలో ఏబదియారు (56) కిరణములను దాటి, జలతత్వాత్మికమైన మణిపూరక చక్రంలో ఏబది రెండు మయూఖములను దాటి, అగ్నితత్వాత్మికమైన అనాహత చక్రంలో ఏబది నాలుగు కాంతిరేఖలు దాటి, ఆకాశతత్వాత్మికమైన విశుద్దచక్రమునందు డెబ్బదిరెండు కాంతికిరణాలు దాటి, మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రము నందు అరువది నాలుగు కిరణపుంజాలు దాటి, ఈ ప్రకారముగా ప్రసిద్ధములైన ఈ మయూఖములు దాటి పైకి చేరుకోగా అచట సహస్ర దళ మధ్యగత చంద్రబింబాత్మకమైన బైందవ స్థానమున, సుధాసింధువునందు నీయొక్క పాదపద్మముల జంట గోచరమగుచున్నది.
శంకర భగవత్పాదులవారు, సౌందర్యలహరియందు, ఎనుబది తొమ్మిదవ శ్లోకంలో అమ్మవారి నఖములను ఇలా వర్ణించారు.
నఖై ర్నా కస్త్రీణాం - కరకమలసంకోచశశిభి
స్తరూణాం దివ్యానాం - హసత ఇవ తే చండి చరణౌ|
ఫలాని స్వస్థ్సేభ్యః - కిసలయకరాగ్రేణ దదతామ్
దరిద్రేభ్యో భద్రాం - శ్రియమనిశ మహ్నాయ దదతౌ॥89॥
చండీమాత పాదములు బీదలకు భద్రమైన సకలైశ్వర్యములను ప్రసాదించును. చండీమాత పాదములకు దేవతలు చేతులు జోడించి అంజలి ఘటించుచున్నారు. మాత కాలిగోళ్ళనెడు చంద్రుల కాంతికి ఆదేవతాస్త్రీల కర పద్మముల ముకుళించుచున్నట్లుగా అనిపించుచున్నది. ఆ చంద్రులు స్వర్గములో (దేవతలకు సంపదలనిచ్చెడు) కల్పవృక్షములను పరిహసించుచున్నట్లున్నది.
అమ్మా! పరమేశ్వరీ! .దేవలోకంలో ఇంద్రుని నందనవనంలో కోరికలు తీర్చే నందనవనం ఉన్నది. అది తన చిగురుటాకుల చేత కోరిన కోరికలు తీర్చును.కాని ఆ కల్పవృక్షం దేవలోక వాసులైన దేవతల కోరికలు మాత్రమే తీర్చును.మరి నీ దివ్య చరణములు - ఆలోకం ఈ లోకం అను భేదము లేక నిన్ను నమ్మిన సర్వలోకములలో ఉండు దరిద్రులైన వారందరికీ ఎల్లవేళలా తరుగు లేనన్ని సంపదలను శీఘ్రముగా అనుగ్రహిస్తూ ఉంటాయి. ఏదో ఒక్క స్వర్గలోక వాసులకు మాత్రమే సంపదలిచ్చి మిడిసిపడు ఆ కల్పవృక్షమును చూసి, సమస్త లోకవాసులనూ అనుగ్రహించు నీ పాదములు చాల్లే నీ బడాయి అన్నట్లు ఆ కల్పవృక్షాన్ని చూసి పరిహసిస్తూ ఉంటాయి. అంతే కాదు ఇంద్రుని భార్య అయిన శచీదేవి మొదలుగా గల స్త్రీలు నిన్ను సేవించుటకు అర్చించుటకు నీ పాదముల వద్దకు రాగానే పద్మములవంటి వారి చేతులు, చంద్రోదయం వంటి నీ నఖ( గోటి) కాంతులవలన అవి ముకుళింపబడి ( రెండుచేతులు దగ్గరకు ముడవబడి) నీకు నమస్కరించుచున్నవి. అటువంటి శోభతో నీ పాదాలు నీ నఖములు అలరారుచున్నవి.
పద్మములు చంద్రోదయం కాగానే ముడుచుకుపోతాయి. అమ్మ దగ్గరకు రాగానే ముడుచుకుపోయే ఆ దేవతా స్త్రీల చేతులను కరపద్మాలుగా పోల్చి, అమ్మ కాలిగోళ్లను చంద్రునితో పోల్చి శ్రీ శంకర భగవత్పాదులవారు చక్కగా వర్ణించారు. అనగా అమ్మ పాదాలు దేవతల చేత, దేవతా స్త్రీలచేత కూడా నమస్కరింపబడునని చెప్పబడినది. అందుకే కదా! పోతనగారు అమ్మలగన్నయమ్మ అను పద్యం లో వేల్పుటమ్మల మనమ్ములనుండేడియమ్మ అని వర్ణించారు. మనమందరమూ ఇష్టదైవాలుగా కొలచే ఈ దేవతలంతా, వారు తమ ఆరాధ్య దేవతగా అమ్మనే పూజించుచున్నారని పోతనగారి పద్య భావము.
మత్స్య మరియు పద్మపురాణములందు నారదుడు హిమవంతునికి ఇలా చెప్పెనని గలదు:
నారదుడు పార్వతీదేవి యొక్క సాముద్రిక లక్షణములను చూచి ఇలా వివరించాడు:-
ఈమెకు (పార్వతికి) భర్త పుట్టలేదు. ఈమె లక్షణములు లేనిది, చేతులు ఎల్లప్పుడును పైకి ఎత్తబడి మాత్రమే ఉంటాయి. ఈ పార్వతి యొక్క పాదములు వ్యభచరించునవి లేదా కాంతులు లేకయుండును అని చెప్పెను. అంతట నారదుడు పార్వతి నుదహరించి చెప్పిన ఆ విషయములు చెడ్డవి అని హిమవంతుడు కంగారు పడెను. అంతట నారదుడు ఇట్లు చెప్పదొడగెను. "ఓ పర్వతరాజా! నేను చెప్పిన ఈ లక్షణములు సంతోషింపదగినవే. ఎందుచేతనంటే 'ఈమె భర్త జన్మించలేదని యనగా లోకములోనున్న అందరివలె తల్లిదండ్రులకు జన్మించలేదు. అలా జన్మించితే మరణించుట తథ్యము. కాని ఈ పార్వతిభర్త పుట్టుక, నాశనములేని అయోనిజా సంభూతుడైన పరమశివుడు. ఈ పార్వతి చేతులు ఎల్లప్పుడూ పైకే ఉంటాయి అనగా దానము ఇచ్చువారి చేయివలె ఈ పార్వతీదేవి చేయి పైచేయిగా ఉంటుందని భావము. పరమేశ్వరి పాదములు కాంతులచే వ్యభిచరిస్తాయి అనగా, ఆ పరమేశ్వరి పాదాల గోళ్ళతో ప్రకాశించే ఆ తల్లి పాదాలు పద్మములవలె ఉంటాయి. అనగా దేవదానవులు నమస్కరించు నపుడు వారి కిరీటములలోని మణుల కాంతులు పరమేశ్వరి కాలి గోళ్ళ కాంతులముందు వెలవెలబోతున్నాయి. మరియు ఆ తల్లి పాదాల గోళ్ళ కాంతులు, తనను నమస్కరించువారి హృదయములలో ప్రవేశించి వారి అజ్ఞానమును తొలగించుచున్నవి' అని భావము అని నారదుడు చెప్పెను. ఆ జగన్మాత పాదనఖకాంతులు ఈ విధమగా చెప్పబడినవి.
పృథ్వీ తత్త్వాత్మిక మూలాధార చక్రమున (పృథ్వీ అగ్ని జ్వాలలు 56), మణిపూర చక్రమున (ఉదక తత్త్వాత్మిక జ్వాలలు 52) కలిపి 108 అగ్ని జ్వాలలు.
అట్లే స్వాధిష్టాన (అగ్ని తత్త్వాత్మిక కిరణములు 62), అనాహత చక్రమున (వాయు తత్త్వాత్మిక కిరణములు 54) కలిపి 116 సూర్య కిరణములు.
ఆకాశ తత్త్వాత్మకమగు (విశుద్ధ చక్రమున 72), మనస్తత్త్వాత్మకమగు (ఆజ్ఞా చక్రమున 64) కలిసి 136 చంద్రుని కళలు అగుచున్నవి. ఇవి 108+116+136 మొత్తం 360 కిరణములు అగును. ఈ కిరణాలన్నియు అమ్మవారి పాదములనుండి వెడలినవే.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
39వ నామ మంత్రము 2.2.2022
ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః
పరమేశ్వరునికి (శ్రీమాత భర్తకు) మాత్రమే తెలిసిన సౌభాగ్యశ్రీలతోను మృదుత్వంతోను కూడిన ఊరువులు కలిగిన శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః అని ఉచ్చరించుచూ శ్రీమాతను పూజించు భక్తులకు ఆ తల్లి ఆత్మానందమును, బ్రహ్మానందమును ప్రసాదించి కరుణించును.
భార్యయొక్క అంగాంగములు భర్తకు మాత్రమే తెలియును. ఇందుకు పార్వతీ పరమేశ్వరులు ఏమాత్రమూ మినహాయింపుకారు. ఆదర్శదాంపత్యానికి పార్వతీపరమేశ్వరులే ప్రతీకలు. అమ్మవారి సర్వాంగములు వివిధ దేవతలయొక్క అంశలనుండి ప్రకటితమయినవి.
జంఘోరూ వరుణస్యాఽథ తేజసా సంబభూవతుః|
నితంబః స తు సంజాతో విపుల స్తేజసా భువః॥72॥॥ (దేవీభాగవతం, పంచమస్కంధం, పదకొండవ అధ్యాయము)
వరుణుని తేజస్సుతో తొడలు, పిక్కలు, భూదేవి తేజముతో విశాలమైన నితంబభాగము (పిరుదులు) ప్రకటితమయ్యెను.
పరమేశ్వరుడు ఈ జగత్తుకే సాక్షీభూతుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఆయన కామేశ్వరుడు. ఆ పరమేశ్వరి కామేశ్వరి. కామేశునికి మాత్రమే తెలియదగిన ఊరుద్వయము కామేశ్వరి కలిగియున్నది. ఈ విషయాన్నే శ్రీలలితా సహస్ర నామావళిలో వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా యని అన్నారు. కామేశజ్ఞాత అనగా కామేశ్వరునికి మాత్రమే తెలిసిన, సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా సౌభాగ్యము, మార్దవముగలిగిన ఊరుద్వయముతో కూడినది ఆ పరమేశ్వరి. అమ్మవారి ఊరువుల జంటలో ఎడమ తొడ సౌభాగ్య సంకేతము, కుడి తొడ మార్దవ సంకేతము గలిగి యున్నది. ఊరు అనగా ఊ అను అక్షరము, రు లో ఉ కారము గలవు. ఇందులో ఉ కారము దక్షిణోరువు, ఊ కారము వామోరువు. వామోరువు పరాసూచితము. దక్షిణోరువు అపరాసూచితము. వామోరువు జగత్తులోని బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రులు అను నాలుగువర్ణములకు సూచన అయితే, దక్షిణోరువు భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము అను పంచభూతములను మరియు మనోబుద్ధ్యహంకారములను సూచిస్తాయి.
అమ్మవారి కపోలము అష్టమీచంద్రుడనియు, కనుబొమలు మన్మథగృహ తోరణమునియు, రెండు కన్నులు ఆ తల్లి ముఖప్రవాహమున చలించెడి మీనముల జంట అనియు, నాసాదండము నవ సంపెంగవంటి దనియు, చెక్కిళ్ళు పద్మరాగ శిలలను, అద్దమును తిరస్కరించుచుండెననియు, ఆ తల్లి పెదవులలో ఒక పెదవి క్రొత్తపగడమును, క్రింది పెదవి దొండపండును వెక్కిరించు చున్నవనియు, ఆ తల్లి దంతపంక్తులజంట శుద్ధవిద్యాంకురములైన ద్విజులనియు, ఆ తల్లి పలుకులు కచ్ఛపి వీణానాదముకన్నా మధురమనియు... ఇలా అన్నిటికీ ఉపమానములు చెప్పగా, అమ్మవారి ఊరుద్వయము కామేశ్వరునికి మాత్రమే తెలియడం చేత వశిన్యాది వాగ్దేవతలు ఉపమానమును చెప్పలేదు.
శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరిలో ఎనుబది రెండవశ్లోకంలో వర్ణించినవిధం ఇలా ఉన్నది:
కరీన్ర్దాణాం శుండాన్ - కనక కదళీకాండపటిలీం
ముభాభ్యా మూరుభ్యా - ముభయమపి నిర్జిత్య భవతి|
సువృత్తాభ్యాం పత్యుః - ప్రణతికఠినాభ్యాం గిరిసుతే
విధిజ్ఞే జానుభ్యాం - విబుధకరికుంభద్వయమసి॥82॥
అమ్మా! ఓ పరమేశ్వరీ! వేదవిహితమైన ధర్మానుష్టానము కలిగినదానా.. నీ ఊరువులు ( తొడలు) రెండూ, దిగ్గజముల యొక్క తొండాల శోభనూ, బంగారు అరటిబోదెల అందాన్ని కూడా ధిక్కరిస్తూ అత్యంత శోభాయమానంగా వెలుగొందుచున్నవి. అలాగే నీ జానువులు (మోకాళ్ళు) రెండూ చక్కనైన వట్రువులు (గోళాకారం) కలిగి ఉండి, నీవు నిరంతరం పతివ్రతా ధర్మంతో అనునిత్యం నీ భర్తకు సేవలు చేస్తూ ఆయనకు నీవు మోకాళ్ళపై పాదాభివందనములు చేయుటచేత, ఆ మోకాళ్ళు నేలకు తగిలి అవి కఠినములై ఐరావత దిగ్గజముయొక్క కుంభస్థలాలను సైతం త్రోసి రాజిల్లుతూ అవి జయకరంగా ప్రకాశించుచున్నవి.
శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః అని అనవలెను.
40వ నామ మంత్రము 3.2.2022
ఓం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః
మాణిక్య కిరీటము వంటి మోకాలు చిప్పల జంటతో విరాజిల్లు లలితాంబకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు బ్రహ్మజ్ఞాన సంపదలతో ఆత్మానందమునంది తరించును.
మహిషాసురాది రాక్షస సంహారమునకు దేవతలవలన పరమేశ్వరి శరీరము మొత్తము వివిధ వారివారి అంశలతో ప్రకటితమయ్యెను. ఆ తల్లి ధరించిన ఆయుధములుకూడ దేవతలనుండి లభించినవే. అందుచే అమ్మవారి శరీర నిర్మాణములో వివిధ అంగములు ప్రత్యేకతను సంతరించుకొని యున్నవి.
అమ్మవారి మోకాలి చిప్పలు మాణిక్య ఖచితమైన మకుటములవలెనున్నవి. వేరే మాటలో చెప్పాలంటే పెద్దమాణిక్యము ఒకటి తీసుకొని, ఆ మాణిక్యముతో చేసిన టోపీలవలవంటి మోకాలి చిప్పలతో అమ్మవారు ప్రకాశించుచున్నది.
శంకర భగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు ఎనుబది రెండవ శ్లోకంలో అమ్మవారి ఊరువులను, జానువులను ఇలా వర్ణించారు.
కరీన్ర్దాణాం శుండాన్ - కనక కదళీకాండపటిలీం
ముభాభ్యా మూరుభ్యా - ముభయమపి నిర్జిత్య భవతి|
సువృత్తాభ్యాం పత్యుః - ప్రణతికఠినాభ్యాం గిరిసుతే
విధిజ్ఞే జానుభ్యాం - విబుధకరికుంభద్వయమసి||82||
అమ్మా! పార్వతీ! వేదవిహితమైన ధర్మానుష్టానము కలిగిన ఓ జగన్మాతా! నీ ఊరువులు ( తొడలు) రెండూ, దిగ్గజముల యొక్క తొండాల శోభనూ, బంగారు అరటిబోదెల అందాన్ని కూడా ధిక్కరిస్తూ అత్యంత శోభాయమానంగా వెలుగొందుచున్నవి. అలాగే నీ జానువులు (మోకాళ్ళు) రెండూ చక్కనైన వట్రువులు (గోళాకారం) కలిగి ఉండి, నీవు నిరంతరం పతివ్రతా ధర్మంతో అనునిత్యం నీ భర్తకు సేవలు చేస్తూ ఆయనకు నీవు మోకాళ్ళపై పాదాభివందనములు చేయుటచేత, ఆ మోకాళ్ళు నేలకు తగిలి అవి కఠినములై ఐరావత దిగ్గజముయొక్క కుంభస్థలాలను సైతం త్రోసి రాజిల్లుతూ అవి జయకరంగా ప్రకాశించుచున్నవి.
ఆ జగన్మాత మోకాళ్ళు కఠినములై ఉన్నవి అని ఇచట అమ్మను విధిజ్ఞే అని కీర్తించారు అనగా వేదవిహిత కర్మానుష్టానము కలిగినదానా అని. అందువల్ల అమ్మ పతివ్రతా ధర్మాన్ని తను పాటించి లోకానికి తెలిపినది. అందువలనే తను సర్వం సహా మహారాజ్ఞి అయినప్పటికిని తన భర్త అయిన పరమేశ్వరుని సన్నిధిలో మాత్రం మామూలు స్త్రీ వలె తన ధర్మాన్ని పాటించి, మోకాళ్ళపై సాష్టాంగపడి భర్తను పూజించడం వలన అమ్మ జానువులు (మోకాళ్ళు) కఠినములై మాణిక్యములతో చేయబడిన మకుటములుగా విరాజిల్లు చున్నవి.. ఈ శ్లోకంలో శ్రీ శంకరులు అమ్మ తొడలను మోకాళ్ళను వర్ణించారు. ఈ రెండిటినీ వర్ణిస్తూ లలితా సహస్రం నామావళి యందు కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా అని ఊరువులను మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా అని జానువులను వర్ణించిరి. అనగా కామేశ్వరునికి మాత్రమే తెలిసిన మెత్తనైన ఊరువులు కలిగినదానా అని ఓ నామం అర్ధం. అంటే స్త్రీ గోప్య సౌందర్యం రతీ విలాసవేళ భర్తకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి అలా వర్ణించారని భావించవచ్చు. కాని అదికాక వేరే నిగూఢ రహస్యం ఉన్నది. పార్వతి పరమేశ్వరులు అర్ధనారీశ్వరులు. శంకరుడు పద్మాసనంలో కూర్చుని ఉండువాడు (శాంత పద్మాసనస్తం) అలా పద్మాసనం లో కూర్చుని ఉన్నప్పుడు ఎడమ తొడమీదకు కుడి అరికాలు వచ్చి చేరును .ఆ ఎడమ తొడ అమ్మవారిది దాని మీదకు చేరిన అరికాలు శివునిది. ఆ అరికాలి స్పర్శతో పరమేశ్వరి తొడ మార్ధవం అర్ధనారీశ్వర తత్వంలో శంకరునికి గోచరమైనది. అంతే కాని రతికేళీ విలాసంలో కాదు. ఇక అమ్మ మోకాళ్ళు మాణిక్యాలు పొదిగిన కిరీటాల్లా విరాజిల్లుతున్నాయని మరొక నామం అర్ధం. మాణిక్యం ఎర్రగా ఉండును. అమ్మ ఎర్రచీరతో కూర్చుని ఉంటే మోకాళ్ళు ముందుకి పొడుచుకుని వచ్చి ఆ ఎర్రచీర కప్పబడి ఉన్న ఆ మోకాళ్ళు మాణిక్య మకుటాల్లా ఉన్నాయని దాని భావము.
ఆ పరమేశ్వరి బ్రహ్మానందస్వరూపిణి, పరబ్రహ్మస్వరూపిణి, సచ్చిదానందస్వరూపిణి, శివశక్త్యైక్యరూపము, సర్వవేదవేదాంగవేద్య. బ్రహ్మానందపు అంశయైన ఆనందకలిక కలిక అనగా మొగ్గ. ప్రతీ జీవిలోను మొగ్గస్థితిలో అవ్యక్తంగా ఉన్న బ్రహ్మానందాన్ని జగన్మాత యొక్క కృపతో సాధన ద్వారా వికసింపజేసుకోవచ్చని అనగా అనుభవంలోకి తెచ్చుకోవచ్చని ఈ కలిక అను శబ్దములో గుప్తముగానున్న భావము.
శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
41వ నామ మంత్రము 4.2.2022
ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః.
ఎర్రని రంగులో ఉన్న ఆరుద్ర పురుగులచే చుట్టూ చెక్కబడిన మన్మథుని అమ్ములపొదుల బోలిన జంఘికలు (పిక్కలు) గలిగిన జగదాంబకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి ఇంద్రగోప స్మరతూణాభి జంఘికా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరుని పూజించు భక్తులకు అనంతమైన సుఖసంతోషములు, భౌతికానందముతో బాటు బ్రహ్మానందమును ప్రాప్తించును.
మోక్షమునిచ్చి రక్షించేది మరియు స్మరణ మాత్రముచే కోరికలను పూరించు ప్రకాశావిర్భావము గలిగినది శ్రీమాత.
అమ్మవారి జంఘికలు మన్మథుని యొక్క సుమబాణ తూణీరము వంటిది. మన్మథుని బాణతూణీరము ఇంద్రగోపములు పొదగబడి ఉంటాయి. ఆరుద్ర పురుగులు ఎర్రని గురువింద గింజల రంగులో ఉంటాయి. ఆరుద్ర పురుగులు వ్యవసాయము మొదలు పెట్టుటకు,ఆరుద్ర కార్తె అనుకూలమైనది. ఈ కార్తెలో మాత్రమే కనబడేది ఆరుద్ర పురుగు. ఇది మొఖమల్లు వస్త్రమును (అందమైన, సున్నితమైన, ఎర్రని పట్టువస్త్రమును) చుట్టుకున్నట్లుగా ఉండి, ఎర్రగా బుర్రగా, బొద్దుగా ఉంటుంది. అమ్మవారి జంఘములు ఇంద్రగోపములు అతుకబడిన మన్మథుని బాణతూణీరములను బోలి ఉన్నవి. ఆ బాణ తూణీరముల యందు మల్లెలు, చంపకములు (సంపంగిలు), పున్నాగములు మొదలైన సుగంధభరిత పుష్పములతో చేయబడిన బాణములు ఉంటాయి. మన్మథుని విల్లు ఇక్షుకముతోను (చెఱకు గడతోను), ఆ వింటినారి బిసతంతువులతోను తామరతూడులోని సన్నని దారముతో) చేయబడి, ఆ విల్లుపై సమ్మోహనమంత్ర మరియు వశీకరణమంత్ర బీజాక్షరములు లిఖింపబడి ఉంటాయి.
శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో ఎనుబది మూడవ శ్లోకంలో అమ్మ జంఘికలను ఇలా చెప్పారు.
పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే
నిషజ్గౌ జజ్ఘే తే విషమవిశిఖో బాఢమకృత||
యదగ్రే దృశ్యంతే దశ శరఫలాః పాదయుగళీ
నఖాగ్ర చ్ఛద్మాన స్సురమకుటశాణైకనిశితా ||83||
గిరిసుతా! ఈశ్వరుని గెలుచుట కొఱకు మన్మధుడు నీ పిక్కలను పదేసి బాణములున్న అమ్ముల పొదులుగా చేసికొనెను. (ఎందుకంటే మన్మధుని దగ్గర ఉన్న ఐదే బాణాలు చాలవని). వాని చివరల నీ గోటికొనలనెడు బాణాగ్రములు (ములుకులు) కనుపించుచున్నవి. ఆ బాణాగ్రములు (అమ్మవారి పాదములకు మ్రొక్కుచున్న) దేవతల కిరీటములచే పదునుపెట్టబడియున్నవి.
ఇంద్రగోప (ఆరుద్ర పురుగులచే), పరిక్షిప్త (చుట్టును అమర్చబడిన) స్మర - తూణ (మన్మథుని అమ్ములుపొదుల వంటి), జంఘిగా (పిక్కలు గలిగిన తల్లీ).
వర్షాకాలములో ఆరుద్ర కార్తెయందు వ్యవసాయ భూములలో ఆరుద్ర పురుగులు పుట్టుకొస్తుంటాయి. అవి ఎర్రగా ముక్కమల్లు గుడ్డవలె చిన్నవిగా ఉంటాయి. వర్షంలో ఆవి చావకుండా వర్షాధిపతి ఇంద్రుడు కాపాడుతాడనియు, అందుకనే వీటికి ఇంద్రగోపములనియు పిలుస్తారు.
ఇంద్రగోపములు అనగా మంత్రములోని బీజాక్షరములు అని రహస్యార్థము. తూణము (తూణీరము) అనగా మంత్ర సముదాయము. తూణమునందు ఉండే బాణములచే మంత్రములు సూచితమైనవి. దేవి జంఘికలు మహావర్ణ సంపుటికలు అని తెలియదగును. స్మర శబ్దము సగుణ బ్రహ్మయు, ప్రపంచ సృష్టికర్తయు అయిన పరమేశ్వరునకును - తూణా శబ్దము మాయా శక్తికిని బోధకములు అగును.
శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
42వ నామ మంత్రము 5.2.2022
ఓం గూడగుల్ఫాయై నమః
నిండైన, సుందరమైన, నిగూఢంగా ఉండే చీలమండలు గలిగిన పరాశక్తికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి గూఢగుల్ఫా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం గూడగుల్ఫాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు ఉపాసకుడు ఆ తల్లి కరుణతో నిగూఢతత్త్వమైన పరాశక్తి తత్త్వమును పరిపూర్ణముగా గ్రహించి, బ్రహ్మత్వమును ప్రాప్తింపజేసుకొని ఆత్మానందమునందును
ధ్యానించు వారిని రక్షించు స్వభావం గలిగినదని ఈ నామ మంత్రములోని అంతరార్థము. గూఢ (లావైన, ఇంపైన) గుల్ఫా (చీలమండలు గలిగినది). లావైన లేదా అందమైన లేదా ఇంపైన చీలమండలు గలిగినది.
గూఢ అనగా రహస్యమైన, గాన అమ్మవారి చీలమండలు రహస్యంగా కనబడకుండా ఉంటాయి; స్త్రీలు సాధారణంగా పాదములు కనబడనట్లు చీర కుచ్చెళ్ళను పాదములవరకూ జారవిడుస్తారు, అనగా కాలిమట్టెలు కూడా కనబడనంతగా చీర కప్పబడి ఉంటుంది; శ్రీమాత కూడా ఆ సాంప్రదాయం పాటించునది ఎందుకంటే కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా అనగా వివాహితయొక్క సౌందర్యము భర్తకు మాత్రమే అంకితము, ఆ అవయవ సొంపులు భర్తకు మాత్రమే తెలియనగును.
అయితే అమ్మవారి చీలమండలు కనబడకుండా ఎలా ఉంటాయి? అమ్మవారు పద్మాసన స్థితిలో కుర్చుని ఉంటుంది గదా అప్పుడు చీలమండలు కనబడవు అలాగే ఒక కాలు పీఠం మీద, రెండవ కాలు పద్మాసనస్థితిలో ఉన్నప్పుడు? అప్పుడు కూడా అమ్మవారి చీర అంచు పూర్తిగా చీలమండలను కప్పి ఉంటుంది కాని చీలమండల పైకి ఉండదు గాన ఈ రహస్య (గూఢ) అర్థాన్ని బట్టి ఈ నామమంత్రాన్ని అర్థం చేసుకోవాలి.
గుహ్యస్థానము రత్నమణి సూచికము. చీలమండలము సంధిస్థానము - ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అను ఈ నవార్ణవ మంత్రమునందలి
మధ్య వర్ణము చింతామణి గుర్తుగలది; మిగిలిన ఎనిమిది వర్ణములు అష్టప్రకృతులు అనబడును.
నవార్ణవ మంత్రము అనగానేమి?
నవార్ణవ మంత్రము అంటే చండీ నవార్ణవ మంత్రము. అత్యంత ప్రభావవంతమైన విద్యలలో చండీ, దుర్గా విద్యలు చాలా ప్రభావవంతమైనవి. ఎటువంటి కోరికలనైనా సిద్ధింపజేస్తుంది. ఆ చండీ దేవి తన భక్తులకు ఏమికావాలో తెలిసుకొని ఆ కోరికలను సిద్ధింపజేస్తుంది. దీనికి సంబంధించిన కథ ఒకటి కలదు.
వారు ఇద్దరు చండీ ఉపాసకులు. చాలా నిరాశతో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకడు మహారాజు. కాని రాజ్యాన్ని కోల్పోయాడు. రెండవవాడు సాధారణ ఉపాసకుడు. అతడు కడు పెదవాడు. బలహీనుడు కూడా. వారిద్దరూ చాలానిరాశతో జీవితం విరక్తి కలిగి ఉంటారు. వారు ఇద్దరూ అడవిలో కలిసినప్పుడు ఒకరి వృత్తాంతమును మరియొకరు చెప్పుకుంటారు. వారు ఇద్దరూ స్నేహితులయారు. వారికి అడవిలో ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఆ ఆశ్రమంలోని మునీశ్వరులను సేవించుతారు. వారిద్దరూ ఆ ఆశ్రమానికి కేవలం ప్రశాంతతకోసమే వెళ్ళారు. నిరాశానిస్పృహలచేత ఏ కోరికలు లేనివారుగా మారుతారు. అయినప్పటికినీ ఆ మునీశ్వరునికి తమ బాధలను విన్నవించు కుంటారు. ఆ మునీశ్వరుడు వారిపై జాలిపడి మహత్తరమైన చండీమంత్రాన్ని ఉపదేశించుతాడు. వారు ఆ చండీమంత్రాన్ని చాలాతీవ్రతరముగా సాధనచేస్తారు. వారి సాధనలో ఆ చండీమంత్ర జపంచేయునప్పుడు ఆ చండీమాతకు తమ వ్రేలిని కోసి, స్రవించిన రక్తముతో ఆ చండీమాత పాదములకు ఆభిషేకము చేస్తూ ఉంటారు. వారి మంత్రసాధనకు ఆ చండీమాత వారియందు కరుణించి వారికి కనిపిస్తుంది. వారికి ఏమికోరిక ఉన్నదో తెలియజేయమని ఆ చండీమాత వాళ్ళను అడుగుతుండి. అందులో సాధారణ వ్యక్తి సంపదలు, గృహము వంటివి కోరుతాడు. మహారాజు మాత్రం పోయిన తన రాజ్యాన్ని తిరిగి వచ్చేలా కరుణించమని కోరుతాడు. కాని చండీ మంత్ర సాధనా ప్రభావానికి, వారు కోరిన కోరికలకు ఎక్కడా పొంతనలేదు. వారి కఠోరసాధనకు వారు కోరికలు చాలా చిన్నవి అని చండీమాత అంటుంది. అప్పుడు ఆ చండీమాత ఆ వారిరువురికి వారి కోరికలు సిద్ధించుననియు, మరియు బ్రతికినంత కాలము సకలభోగాలు, అష్టైశ్వర్యాలు అనుభవించి అంత్యమున మనువుగా మారతారు అని చెప్పింది. మనువు అంటే ప్రజాపతులలో ఒకడు. ఆ స్థాయికి చండీమాత అతనికి వరమిస్తుంది. అంటే చండీమాత నవార్ణవ మంత్రప్రభావము అంతటిది.
చండీ నవార్ణవ మంత్రము అంటే తొమ్మిది అక్షరములు గల చండీ మంత్రము.
గూఢగుల్ఫా యని నామప్రసద్ధమైన తల్లికి నమస్కరించునపుడు ఓం గూఢగుల్పాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
43వ నామ మంత్రము 6.2.2022
ఓం కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమః
తాబేలు పృష్ఠ (వీపు) భాగము కంటెను సుందరమైన మీగాళ్ళు (పాదాగ్రములు) కలిగి యలరారు తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా యను పండ్రెండక్షరముల (ద్వాదశాక్షరీ) నామ మంత్రమును ఓం ఐం హ్రీం శ్రీం కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమః అని ఉచ్చరించుచూ ఆ అఖిలాండేశ్వరిని అత్యంత భక్తి ప్రపత్తులతో ఆరాధించు సాధకులను ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా ఉద్దరించి సమస్త భౌతిక సుఖసంతోషములను లభింపజేసి, జీవితమంతా ఆధ్యాత్మికచింతనతో ప్రవర్తింపజేసి తరింజేయును.
కూర్మపృష్ఠ (తాబేటి వీపును) జయిష్ణు (జయించు స్వభావముగల) ప్రపద (ముంగాలు అనగా పాదాగ్రము) కూడినది - కలిగియున్నది. ఈ పండ్రెండక్షరముల నామ మంత్రమును ఓం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై నమః అని ఆపకుండా ఉచ్చరించ వలెను. ఏ పరిస్థితిలోనూ కూర్మపృష్ఠా అని ఆపి చదవకూడదు...ఇంతకన్నా వివరించి చెప్పకూడదు..
తాబేటి వీపున కంటె ప్రశస్తముగా, సుందరమై ఒప్పారే పాదోపరిభాగములతో శ్రీమాత అలరారుచున్నది. అమ్మవారి పాదములు మోక్షప్రదములు. నాలుగు వేదాలకు సంబంధమైన నాలుగు వాక్యాలైన అహం బ్రహ్మాస్మి, తత్త్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, ఈ నాలుగు మహావాక్యాలు అమ్మవారి పాదాలను ప్రస్తుతించే వేదాలకు చెందినవి. అమృత మథనసమయంలో శ్రీమహావిష్ణువు ఆదికూర్మమై తన పృష్ఠభాగముతో మందరగిరిని క్షీరసాగరములోనికి క్రుంగకుండా ఉద్ధరించెను. అటువంటి బహు సుందరమైన ఆ ఆది కూర్మము యొక్క పృష్ఠభాగముకంటెను శ్రీమాత పాదాగ్రములు సుందరమై, అత్యంత మృదుత్వంతో అలరారు చున్నవని ఈ నామ మంత్రములోని భావము.
అంత శ్రేష్ఠమైన జగన్మాత పాదములు ఆశ్రితులకు అమృతపదముసు కలిగిస్తాయి, మోక్షదాయకములై పాపకూపములో పడకుండా ఉద్ధరిస్తాయి.
శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు ఎనుబది ఎనిమిదవ శ్లోకంలో అమ్మవారి ముంగాళ్ళను ఇలా వర్ణించారు:
పదం తే కీర్తీనాం - ప్రపద మపదం దేవి విపదాం
కథం నీతం సద్భిః - కఠినకమఠీకర్పరతులామ్|
కథం వా పాణిభ్యా ముపయమనకాలే పురభిదా
యదాదాయ న్యస్తం - దృషది దయమానేన మనసా॥88॥
ఓ అఖిలాండేశ్వరీ! నీ పాదములు యశస్సును కలిగించునవి, విపత్తులను హరించునవి. పురారియైన శివుడు దయామయుడై వివాహ సమయమున నీ సుకుమార పాదములను తన చేతబట్టి మృదువుగా సన్నెకల్లును త్రొక్కించెను. అట్టి పాదాగ్రములను పూజ్యులైన పూర్వకవులు కఠినమైన తాబేటి పెంకుతో ఎట్లు పోల్చిరో తెలియరాదు.
ఓ లలితాపరమేశ్వరీ! నిన్ను ఆశ్రయించిన వారికి సత్కీర్తులను కలిగించుచు, సకల ఆపదలను తొలగించుచు, మంచికి పుట్టిల్లుగా, చెడు అనేది దరిచేరలేని శుభవాకిళ్లుగా వెలుగొందుచుండేవి, నీ పాదముల పైభాగాన ఉండు నీ మీగాళ్ళు, అటువంటి నీ పాదమును నీ వివాహ వేళ, రాతియందు వధువు పాదము పెట్టించుట అను ఒక తంతుయందు దయాపూర్ణమైన మనసు కల నీ భర్తయైన శివుడు తన చేతితో నీ పాదములు పట్టుకుని రాతియందు ఉంచుటకు ( వధువుచే సన్నికల్లు తొక్కించుట) చాల సందేహించి నాడు. ఎందుకనగా అతి మృదువులైన నీ పాదములు ఆ కఠిన రాతి స్పర్శ తో ఎక్కడ కందిపోవునో అని. మరి అంత సున్నితమైన ఆ సుకుమార పాదాన్ని, ఆ పాదంపై నున్న మీగాలుని ( అరికాలు పై భాగం) కొందరు సత్కవులు ( లలితా సహస్ర నామావళియందు వశిన్యాది వాగ్దేవతలు) కఠినంగా ఉండే ఆడ తాబేలు వీపు చిప్పతో ఉపమానం చెబుతూ ఎలా వర్ణించగలిగారమ్మా!
ఆ లలితా పరమేశ్వరి పాదపద్మములపై దృష్టి నిలిపి నమస్కరించునపుడు ఓం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
44వ నామ మంత్రము 7.2.2022
ఓం నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై నమః
నమస్కరించు భక్తజనుల అజ్ఞానాంధకారాన్ని పోగొట్టగలిగిన కాలిగోళ్ళ కాంతులు గలిగిన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని ఉపాసించు భక్తులకు ఆ పరమేశ్వరి కాలిగోళ్ళ కాంతికిరణముల వలన తమ అజ్ఞానమును నశింపజేసికొని బ్రహ్మజ్ఞానప్రకాశముతో తేజరిల్లుచూ జగన్మాత పాదసేవాపరాయణులై జన్మతరింపజేసికొందురు.
దేవతలందరూ జగన్మాత పాదములకు శిరస్సులుతాకుచూ నమస్కరించునపుడు వారి కీరీములందున్న వివిధ రత్నములు జగన్మాత కాలిగోళ్ళకు సానబెట్టినట్లుతాకగా సహజంగానే ప్రకాశవంతముగా ఉండే ఆ తల్లి కాలిగోళ్ళు మరింత ప్రకాశవంతంగా కాంతులు విరజిమ్ముచూ, నమస్కరించు భక్తజనుల అజ్ఞానతిమిరములను పారద్రోలుచు ప్రజ్ఞానకాంతులను ప్రసాదించుచున్నవని ఈ నామమంత్రమందలి భావము.. అమ్మవారి పాదాలు షట్చాక్రాలకు పైన ఉండి, చక్రాలపై అనంతమైన కిరణాలను వర్షింపజేస్తాయి. అలా వర్షించు కిరణాల్లో అగ్నికి సంబంధించినవి 108, సూర్యసంబంధమైనవి 116, చంద్రసంబంధమైనవి 136 వెరసి 360 కిరణాలు మాత్రమే ఆ షట్చక్రాలు గ్రహిస్తాయి. వీటినే సౌర సంవత్సరమందున్న రోజులు.
శంకరాచార్యులవారు క్రింది శ్లోకాలలో వర్ణించిన విధాన్ని పరిశీలించుదాము.
సుధాధారాసారై-శ్చరణయుగలాంతర్విగలితైః
ప్రపంచం సించన్తీ - పునరపి రసామ్నాయమహసః|
అవాప్య స్వాం భూమిం - భుజగనిభ మధ్యుష్ట వలయం
స్వమాత్మానం కృత్వా - స్వపిషి కులకుండే కుహరిణి || 10 ||
అమ్మా! పరమేశ్వరీ! బ్రహ్మరంధ్ర స్థానములో ఉన్న సహస్రార చక్రమందు అయ్యవారితో విహరించు ఓ జగన్మాతా! నీ పాదద్వయం మధ్యబాగము నుండి స్రవించిన అమృతధారా వర్షములచేత (మనలోని అంతః ప్రపంచమైన) వేల నాడుల ప్రపంచమును తడుపుతున్నదానివై,అమృతాతిశయ కాంతిగల చంద్రుని స్థానమును (బ్రహ్మరంధ్రమును) వీడి, మరలా స్వస్థానమైన మూలాధారమును చేరి, నీ రూపాన్ని నీవే చుట్టుకుని, పామువలె చుట్టలు చుట్టుకుని, పృధివీతత్వమగు మూలాధారమందు, తామరదుద్దు మధ్యలోని సన్నని రంధ్రములో సూక్ష్మముగా నున్న దానియందు కుండలినీశక్తిగా నిద్రిస్తూ ఉంటావు.
క్షితౌ షట్పంచాశ - ద్ద్విసమధిక పంచాశ దుదకే
హుతాశే ద్వాషష్టి - శ్చతురధిక పంచాశ దనిలే |
దివి ద్విఃషట్త్రింశ - న్మనసి చ చతుఃషష్టిరితి యే
మయూఖాస్తేషామప్యుపరి తవ - పాదాంబుజయుగమ్ || 14 ||
షట్చక్రాలలోని సహస్రారములో ఉండు దేవి పాదప్రకాశ వైభవం.
అమ్మా! శ్రీమాతా! యోగసాధనలో సాధకుడు షట్చక్రాలనూ అధిగమించి,సహస్రారములో ఉన్న నీపాదపద్మాలు చేరాలంటే తన దేహంలో ఉన్న పృధివీతత్వంతో కూడిన మూలాధార చక్రంలో ఏబదియారు (56) కిరణములను దాటి, జలతత్వాత్మికమైన మణిపూరక చక్రంలో ఏబది రెండు మయూఖములను దాటి, అగ్నితత్వాత్మికమైన అనాహత చక్రంలో ఏబది నాలుగు కాంతిరేఖలు దాటి, ఆకాశతత్వాత్మికమైన విశుద్దచక్రమునందు డెబ్బదిరెండు కాంతికిరణాలు దాటి, మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రము నందు అరువది నాలుగు కిరణపుంజాలు దాటి, ఈ ప్రకారముగా ప్రసిద్ధములైన ఈ మయూఖములు దాటి పైకి చేరుకోగా అచట సహస్ర దళ మధ్యగత చంద్రబింబాత్మకమైన బైందవ స్థానమున, సుధాసింధువునందు నీయొక్క పాదపద్మముల జంట గోచరమగుచున్నది.
శంకర భగవత్పాదులవారు, సౌందర్యలహరియందు, ఎనుబది తొమ్మిదవ శ్లోకంలో అమ్మవారి నఖములను ఇలా వర్ణించారు.
నఖై ర్నా కస్త్రీణాం - కరకమలసంకోచశశిభి
స్తరూణాం దివ్యానాం - హసత ఇవ తే చండి చరణౌ|
ఫలాని స్వస్థ్సేభ్యః - కిసలయకరాగ్రేణ దదతామ్
దరిద్రేభ్యో భద్రాం - శ్రియమనిశ మహ్నాయ దదతౌ॥89॥
చండీమాత పాదములు బీదలకు భద్రమైన సకలైశ్వర్యములను ప్రసాదించును. చండీమాత పాదములకు దేవతలు చేతులు జోడించి అంజలి ఘటించుచున్నారు. మాత కాలిగోళ్ళనెడు చంద్రుల కాంతికి ఆదేవతాస్త్రీల కర పద్మముల ముకుళించుచున్నట్లుగా అనిపించుచున్నది. ఆ చంద్రులు స్వర్గములో (దేవతలకు సంపదలనిచ్చెడు) కల్పవృక్షములను పరిహసించుచున్నట్లున్నది.
అమ్మా! పరమేశ్వరీ! .దేవలోకంలో ఇంద్రుని నందనవనంలో కోరికలు తీర్చే నందనవనం ఉన్నది. అది తన చిగురుటాకుల చేత కోరిన కోరికలు తీర్చును.కాని ఆ కల్పవృక్షం దేవలోక వాసులైన దేవతల కోరికలు మాత్రమే తీర్చును.మరి నీ దివ్య చరణములు - ఆలోకం ఈ లోకం అను భేదము లేక నిన్ను నమ్మిన సర్వలోకములలో ఉండు దరిద్రులైన వారందరికీ ఎల్లవేళలా తరుగు లేనన్ని సంపదలను శీఘ్రముగా అనుగ్రహిస్తూ ఉంటాయి. ఏదో ఒక్క స్వర్గలోక వాసులకు మాత్రమే సంపదలిచ్చి మిడిసిపడు ఆ కల్పవృక్షమును చూసి, సమస్త లోకవాసులనూ అనుగ్రహించు నీ పాదములు చాల్లే నీ బడాయి అన్నట్లు ఆ కల్పవృక్షాన్ని చూసి పరిహసిస్తూ ఉంటాయి. అంతే కాదు ఇంద్రుని భార్య అయిన శచీదేవి మొదలుగా గల స్త్రీలు నిన్ను సేవించుటకు అర్చించుటకు నీ పాదముల వద్దకు రాగానే పద్మములవంటి వారి చేతులు, చంద్రోదయం వంటి నీ నఖ( గోటి) కాంతులవలన అవి ముకుళింపబడి ( రెండుచేతులు దగ్గరకు ముడవబడి) నీకు నమస్కరించుచున్నవి. అటువంటి శోభతో నీ పాదాలు నీ నఖములు అలరారుచున్నవి.
పద్మములు చంద్రోదయం కాగానే ముడుచుకుపోతాయి. అమ్మ దగ్గరకు రాగానే ముడుచుకుపోయే ఆ దేవతా స్త్రీల చేతులను కరపద్మాలుగా పోల్చి, అమ్మ కాలిగోళ్లను చంద్రునితో పోల్చి శ్రీ శంకర భగవత్పాదులవారు చక్కగా వర్ణించారు. అనగా అమ్మ పాదాలు దేవతల చేత, దేవతా స్త్రీలచేత కూడా నమస్కరింపబడునని చెప్పబడినది. అందుకే కదా! పోతనగారు అమ్మలగన్నయమ్మ అను పద్యం లో వేల్పుటమ్మల మనమ్ములనుండేడియమ్మ అని వర్ణించారు. మనమందరమూ ఇష్టదైవాలుగా కొలచే ఈ దేవతలంతా, వారు తమ ఆరాధ్య దేవతగా అమ్మనే పూజించుచున్నారని పోతనగారి పద్య భావము.
మత్స్య మరియు పద్మపురాణములందు నారదుడు హిమవంతునికి ఇలా చెప్పెనని గలదు:
నారదుడు పార్వతీదేవి యొక్క సాముద్రిక లక్షణములను చూచి ఇలా వివరించాడు:-
ఈమెకు (పార్వతికి) భర్త పుట్టలేదు. ఈమె లక్షణములు లేనిది, చేతులు ఎల్లప్పుడును పైకి ఎత్తబడి మాత్రమే ఉంటాయి. ఈ పార్వతి యొక్క పాదములు వ్యభచరించునవి లేదా కాంతులు లేకయుండును అని చెప్పెను. అంతట నారదుడు పార్వతి నుదహరించి చెప్పిన ఆ విషయములు చెడ్డవి అని హిమవంతుడు కంగారు పడెను. అంతట నారదుడు ఇట్లు చెప్పదొడగెను. "ఓ పర్వతరాజా! నేను చెప్పిన ఈ లక్షణములు సంతోషింపదగినవే. ఎందుచేతనంటే 'ఈమె భర్త జన్మించలేదని యనగా లోకములోనున్న అందరివలె తల్లిదండ్రులకు జన్మించలేదు. అలా జన్మించితే మరణించుట తథ్యము. కాని ఈ పార్వతిభర్త పుట్టుక, నాశనములేని అయోనిజా సంభూతుడైన పరమశివుడు. ఈ పార్వతి చేతులు ఎల్లప్పుడూ పైకే ఉంటాయి అనగా దానము ఇచ్చువారి చేయివలె ఈ పార్వతీదేవి చేయి పైచేయిగా ఉంటుందని భావము. పరమేశ్వరి పాదములు కాంతులచే వ్యభిచరిస్తాయి అనగా, ఆ పరమేశ్వరి పాదాల గోళ్ళతో ప్రకాశించే ఆ తల్లి పాదాలు పద్మములవలె ఉంటాయి. అనగా దేవదానవులు నమస్కరించు నపుడు వారి కిరీటములలోని మణుల కాంతులు పరమేశ్వరి కాలి గోళ్ళ కాంతులముందు వెలవెలబోతున్నాయి. మరియు ఆ తల్లి పాదాల గోళ్ళ కాంతులు, తనను నమస్కరించువారి హృదయములలో ప్రవేశించి వారి అజ్ఞానమును తొలగించుచున్నవి' అని భావము అని నారదుడు చెప్పెను. ఆ జగన్మాత పాదనఖకాంతులు ఈ విధమగా చెప్పబడినవి.
పృథ్వీ తత్త్వాత్మిక మూలాధార చక్రమున (పృథ్వీ అగ్ని జ్వాలలు 56), మణిపూర చక్రమున (ఉదక తత్త్వాత్మిక జ్వాలలు 52) కలిపి 108 అగ్ని జ్వాలలు.
అట్లే స్వాధిష్టాన (అగ్ని తత్త్వాత్మిక కిరణములు 62), అనాహత చక్రమున (వాయు తత్త్వాత్మిక కిరణములు 54) కలిపి 116 సూర్య కిరణములు.
ఆకాశ తత్త్వాత్మకమగు (విశుద్ధ చక్రమున 72), మనస్తత్త్వాత్మకమగు (ఆజ్ఞా చక్రమున 64) కలిసి 136 చంద్రుని కళలు అగుచున్నవి. ఇవి 108+116+136 మొత్తం 360 కిరణములు అగును. ఈ కిరణాలన్నియు అమ్మవారి పాదములనుండి వెడలినవే.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
45వ నామ మంత్రము 8.2.2022
ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః
పద్మములను సైతము తిరస్కరించునటువంటి పాదద్వయ ప్రభాజాలములు (కాంతులు) కలిగిన శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ఆ తల్లి కరుణించి సకలాభీష్టములను నెరవేర్చును, శాశ్వతమైన బ్రహ్మజ్ఞానమును సంప్రాప్తింపజేయును.
భగవంతుని పాదపద్మములు అనడం సాధారణం. అంటే పాదాలను పద్మములతో పోల్చిచెప్పడము అని అర్థం. కాని అమ్మవారి పదద్వయమును పోల్చుటకు సరోజములు (తామరపువ్వులు - పద్మములు) సైతము చాలవు. ఎందుకంటే అమ్మవారి పాదముల కాంతులు పద్మముల కాంతుల వలెకాదట. అంతకన్నా దివ్యకాంతితోను, మృదువుగాను, కోమలంగాను అమ్మవారి పాదములు విరాజిల్లుతున్నాయని వశిన్యాది వాగ్దేవతలు వివరించారు. కారణ మేమిటంటే పద్మములకాంతి మూడునాళ్ళముచ్చటయే రెండుమూడు రోజులలో నీటిలో ఉన్ననూ వాటికాంతులు వెలవెలపోతాయి. అమ్మవారి పాదద్వయము నిరంతరం దివ్యకాంతులు వెదజల్లుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నీటిలో ఉన్నంతవరకే వాటికాంతులు ఒక్కరోజైనా. ఇంకనూ కలువలకు చంద్రకాంతి, కమలములకు సూర్యుకాంతి ఉంటేనే కళకళలాడుతూ ఉంటాయి. అమ్మవారి పాదములు ఎల్లవేళలా ప్రభాసించుతూ ఉంటాయి. అమ్మవారి పదద్వయ ప్రభాజాలములను ఇలా వర్ణించారు:-
క్షితౌ షట్పంచాశ - ద్ద్విసమధిక పంచాశ దుదకేఙా
హుతాశే ద్వాషష్టి - శ్చతురధిక పంచాశ దనిలే |
దివి ద్విఃషట్త్రింశ - న్మనసి చ చతుఃషష్టిరితి యే
మయూఖాస్తేషామప్యుపరి తవ - పాదాంబుజయుగమ్ || 14 ||
పృథ్వీ తత్త్వాత్మిక మూలాధార చక్రమున (పృథ్వీ అగ్ని జ్వాలలు 56), మణిపూర చక్రమున (ఉదక తత్త్వాత్మిక జ్వాలలు 52) కలిపి 108 అగ్ని జ్వాలలు.
అట్లే స్వాధిష్టాన (అగ్ని తత్త్వాత్మిక కిరణములు 62), అనాహత చక్రమున (వాయు తత్త్వాత్మిక కిరణములు 54) కలిపి 116 సూర్య కిరణములు.
ఆకాశ తత్త్వాత్మకమగు (విశుద్ధ చక్రమున 72), మనస్తత్త్వాత్మకమగు (ఆజ్ఞా చక్రమున 64) కలిసి 136 చంద్రుని కళలు అగుచున్నవి.
ఈ మొత్తము (108 అగ్నిజ్వాలలు + 116 సూర్యకిరణములు + 136 చంద్రకళలు) 360 కిరణములు - అమ్మవారి పదద్వయ ప్రభాజాలములే. ఇవి పద్మముల కాంతులను తిరస్కరించుచున్నవి.
పదద్వయప్రభాజాలములైన ఈ అమ్మవారి కిరణ సముదాయములే చరాచర జగత్తును ప్రకాశింపజేయు చున్నవి.
శంకరభత్పాధులవారు అంటున్నారు అమ్మా! ఆ కిరణ సముదాయమును ప్రవేశించియే చరాచరమైన లోకము భాసిల్లుచున్నది. మహేశాని! అమ్మా! మీ ప్రకాశము చేత సర్వము ప్రకాశించుచున్నది. అమ్మా! నీ భాస ప్రసరింపనియెడల కించితైనను -- ఏ వస్తువైననూ ప్రకాశింపదు. అమ్మా! మీ ప్రకాశము లేని యెడల ఈ చరాచర జగమంతయు అంధకారమున పడిపోవును. అమ్మా! అనంతకోట్ల సంఖ్యగల ఆ మయూఖములతో (కిరణములతో) -- 360 కిరణములు మాత్రమే సోమ సూర్య అగ్నుల ద్వారా బ్రహ్మాండమును వ్యాపించుచున్నవి.
బ్రహ్మవిష్ణుమహేశాన వేద పూజితాంఘ్రద్వయే అని వశిష్ట మహర్షి అంటారు అనగా బ్రహ్మవిష్ణుమహేశ్వరుల చేతను, చతుర్వేదముల చేతను పూజింపబడే అమ్మవారి పాదములు సరోజములతో (పద్మములు) ఎలా పోల్చగలము? అమ్మవారి కుడిపాదము శుక్లవర్ణము, ఎడమ పాదము రక్తవర్ణము గలవి. ఈ రెండునూ అజ్ఞానము, అవిద్యా రూప సంసార బంధమును తొలగించునని భావము. బ్రహ్మ తేజస్సుచే పరమేశ్వరి పాదద్వయ మేర్పడినది.
అందుకనే జగన్మాతకు నమస్కరించునపుడు ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః అని అంటాము, ఆరాధిస్తాము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
46వ నామ మంత్రము
ఓం శింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజాయై నమః
మధురమైన సవ్వడులను వినిపించే మణిఖచితమైన కాలియందెలలంకృతమైన పాదపద్మములతో శోభిల్లు శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి శింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామమంత్రమును ఓం శింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజాయై నమః అని ఉచ్చరించుచూ భక్తిప్రపత్తులతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకుడు ఆ తల్లి కరుణచే సుఖసంతోషములు, భౌతిక మరియు ఆధ్యాత్మిక తత్త్వము సంప్రాప్తమై ప్రశాంత జీవనము కొనసాగించును.
శింజాన (మధురముగా లయబద్ధంగా సవ్వడిచేసే), మణి (వజ్ర వైడూర్యాది మణిఖచితమైన), మంజీర (అందెలచే), మండిత (అలంకరింపబడిన), శ్రీ (శుభప్రదమైన) పదాంబుజా (పాదకములములు గలిగిన), (పరమేశ్వరి).
ఆ తల్లి తన రాయంచగమనముతో కదిలితే, వజ్రవైడూర్యాదిమణిగణ ఖచితమైన మంజీరములు అలంకరింపబడిన ఆ పరమేశ్వరి పాదాంబుజములు శ్రవణానందము గూర్చెడి మధురస్వనములను అనుగ్రహించుచున్నవి.
ఆ పరమేశ్వరునితో తాండవమొనర్చు వేళ ఆ పరమేశ్వరి పాదకమలముల మంజీరములు తాళబద్ధమై ధ్వనించునట్లున్నవి.
బ్రహ్మోపేంద్రమహేంద్రాది దేవతలు, సిద్ధులు, ఇంకెందరో మహనీయుల వందనములనందుకొనిన ఆ పాదములను అర్చించితే ముక్కోటి దేవతలకు, సిద్ధులకు, ఇంకెందరో మహనీయులకు పూజలుసలిపిన ఫలము దక్కును. గనుకనే అమ్మవారు పాదద్వయమును మండితశ్రీ యనియనుట యుక్తమే యగును. ఆ పరమేశ్వరి పాదద్వయ దర్శనము భుక్తి, ముక్తి ప్రదాయకము.
అమ్మవారి నుండి వెడలిన కిరణముల నుండి ఆవిర్భవించిన వశిన్యాది వాగ్దేవతలు బ్రహ్మజ్ఞాన సంపన్నులు. వారు అమ్మవారి పదద్వయప్రభాజాలములు (పాదపద్మముల ధగద్ధగాయమాన కాంతులు కొలనులోని పద్మముల కాంతులనే ధిక్కరించినవి అన్నారు. ఎందుకంటే ఆ తల్లి ఉద్యద్భానుసహస్రాభ (వేయి ఉదయకాల సూర్యకాంతులు గలిగినది). ఈ నామ మంత్రమునందు వజ్రవైడూర్యాది మణులు పొదగబడిన మంజీరములచే అలంకృతములైన పాదద్వయము మధురాతి మధురమైన సవ్వడులను ప్రసాదించుచుండెను. ఆ సవ్వడులు ప్రణవనాదమును మరిపింపజేయు చున్నవి. పంచదశీ మంత్ర జపము ధ్వనించుచున్నది. శుద్ధవిద్యాంకుర స్వరూపులైన బ్రాహ్మణులు వల్లెవేయు వేదాధ్యయనస్వనము కర్ణములను తాకుచున్నది.
ఇలాంటి పాదాలను పూజిస్తే మహనీయులందరినీ పూజించినట్లౌతుంది. ఎందుకనగా మహనీయులగు పూజ్యులందరు తలలు వంచి అమ్మ పాదాలకు ఎల్లప్పుడు మ్రొక్కుచునే ఉంటారు.
ఈ నామ మంత్రముతో వశిన్యాదులు అమ్మవారిని రెండు విశేషణములతో కీర్తించుచున్నారు. ' శింజానమణిమంజీరమండిత (వజ్రవైడూర్యాది మణులు పొదగబడిన మంజీరములతో అలంకృతమైనది) ఆ పరమేశ్వరి' యనునది ఒక విశేషణము అయితే, శ్రీ (శోభస్కరము) యనునది మరియొక విశేషణము. అమ్మవారి కాలియలంకార సవ్వడుల మహనీయత ద్విగుణీకృతమై ధ్వనింపజేశారు ఆ వశిన్యాది వాగ్దేవతలు.
ఆ పరమేశ్వరి కాలి అందెలను శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు ఎనుబదియారవ శ్లోకంలో ఈ విధంగా వర్ణించారు:
మృషా కృత్వా గోత్ర - స్ఖలన మథ వైలక్ష్యనమితం
లలాటే భర్తారం - చరణకమలే తాడయతి తే|
చిరా దంత శ్శల్యం - దహనకృత మున్మూలితవతా
తులాకోటిక్వాణైః - కిలికిలిత మీశానరిపుణా॥86॥
ఓ పరమేశ్వరీ! అలా నీచే గావించబడిన అశోకవృక్ష పాదతాడనం ఆ శివుడు ఆ పాదతాడనం ఎలాగైనా పొందాలని కావాలనే నీ దగ్గర నీ సవతి గంగాదేవి పేరును ఉచ్చరించాడు. అందువలస నీకు ఆగ్రహము వచ్చినది. నీ పాదపద్మములతో నీ భర్త నుదుట తాడనం చేసావు. (రాసలీలల వేళ, భార్యవద్ద నవ్వులాటకైనను వేరొక భామిని నామము ఉచ్చరించిన పురుషుడెవ్వరికైనను ఈ పరాభవము సహజమేగదా). శివుడు తనను భస్మము చేసినప్పటి నుండి వైరభావంతో ఎదురుచూస్తున్న ఆ మన్మథుడు వెంటనే కిలకిలా నవ్వినట్లుగా నీ పాద మంజీరములు (గజ్జెలు) సవ్వడి చేసెను.
అనగా అమ్మవారి కాలి అందెల సవ్వడి మన్మథుని పరిహాసపూరిత హాసమువలె ఉన్నదని భావము.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం శింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ
47వ నామ మంత్రము
ఓం మరాళీమందగమనాయై నమః
ఆడ హంస వలె మందగమనము (మెల్లని నడక) గలిగిన లలితాంబకు నమస్కారము.
ఆడహంస మందగమనము వంటి నెమ్మది గలిగిన శ్వాసద్వారా సాధకుని లక్ష్యమును జేర్చు తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి మరాళీమందగమనా అను ఎనిమిదక్షరముల(అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మరాళీమందగమనాయై నమః అని ఉచ్చరించుచూ జగన్మాతను ఉపాసించు సాధకుని శ్వాస ఆడహంసవలె మందగమనముతో, నిదానముగా లక్ష్యమును చేరుదిశగా గొనిపోవును.
హంసగమనము అత్యంత మనోహరంగా ఉంటుంది. మరాళ (మగహంస) అయినా మరాళి (ఆడ హంస) అయినా చాలా సొంపుగా, కనువిందుగా ఉంటుంది ఆ గమనము. ఇక మరాళి (ఆడహంస) గమనము మరింత మెల్లగా, నాట్యభంగిమతోకూడినదైన నడకవలె ఉంటుంది. అందుకనే వశిన్యాది వాగ్దేవతలు అమ్మను ఆనందింపజేయడానికి అమ్మవారి మంద గమనాన్ని మరాళి (ఆడహంస) మంద గమనముగా అభివర్ణించి విశేషించి అమ్మవారిని అలాకీర్తించారు. ఈ నామ మంత్రము వశిన్యాది వాగ్దేవతల నుండి అమ్మవారు వినగానే ఆనందంతో ముసిముసినవ్వులు నవ్వి ఉంటుంది. మంద గమనమనేది పరమేశ్వరి వంటి ఉత్తమజాతి స్త్రీలకు చక్కని సాముద్రిక లక్షణముగా భావించవచ్చును.
మూలాధారమునందున్న కుండలినీ శక్తి మరాళి వంటిది. సాధకుడు తన యోగసాధనలో కుండలినీ శక్తిని (మరాళి) జాగృతము చేయగా సుషుమ్నానాడి ద్వారా సహస్రారానికి చేరి యచటి నుండి మరల మూలాధారమునందు ప్రవేశించును. ఈ విధముగా మూలాధారంలో బయలుదేరిన మరాళి (ఆడహంస) యనబడే కుండలినీశక్తి సుషుమ్నానాడి ద్వారా పయనిస్తూ, బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులను ఛేదిస్తూ, షట్చక్రములకావల సహస్రారమును చేరి మరల మూలాధారము చేరువరకును మందగమనయై యుండును. వివిధకారణములచే ఉద్రేకపడు సమయములు తప్ప మిగిలిన అన్నివేళలా మందగమనయై యుండును. ఇక జపము, అర్చన, యజ్ఞయాగాదుల సమయములలో మందగమనయై ఆయా వేదికలయందు చరించుచుండును. ఆ పరమేశ్వరి హంసస్వరూపిణి. భక్తమానస సరోవరంలో విహరించు హంస స్వరూపిణి. భక్తమానస హృదయాలలో హంస (పరమాత్మ) స్వరూపిణి. జీవాత్మ, పరమాత్మలొకటని భావనచేసే అద్వైతసిద్ధాంత స్వరూపిణి. అందుకే ఆ పరమేశ్వరి మరాళీమందగమనా యని వసిన్యాది (వశిని, కామేశ్వరి, మోదిని, విమల, జయిని, సర్వేశ్వరి, కౌళిని యను) వాగ్దేవతలచే కీర్తింపబడినది.
అటువంటి పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం మరాళీమందగమనాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
48వ నామ మంత్రము
ఓం మహాలావణ్య శేవధియే నమః
అతిశయించిన అందానికి నిధి తానయి త్రిపురసుందరిగా విరాజిల్లు శ్రీచక్రవాసినికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాలావణ్య శేవధిః అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామమంత్రమును ఓం మహాలావణ్య శేవధియే నమః అని ఉచ్చరించుచూ ఉపాసించు సాధకునికి ఆ జగన్మాతలోని ఆధ్యాత్మిక సౌందర్యము, మాతృస్వరూపమైన తత్త్వదర్శనము దృశ్యమై జగమంతా జగన్మాతగా గోచరించి నిరంతరం శ్రీమాతా నామస్మరణలో తరించును.
సేవధిః అనగా నిధిః. లావణ్యము అంటే సౌందర్యము. అతిశయించిన సౌందర్యమునకు నిధి గనుక ఆ పరమేశ్వరి మహాసౌందర్యనిధి. యందుచేతనే మహాలావణ్య సేవధిః యని వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కీర్తించారు. ఈ నామ మంత్రములో అమ్మవారి సౌందర్యము విశేషించి చెప్పబడియున్నది. అమ్మవారి స్థూలరూప సందర్శనము చేస్తూ ఆ తల్లిని ఆ పాదమస్తకమూ అనేకమైన సామ్యములతో కీర్తించారు ఆ వశిన్యాదులు. ఆ తల్లి శిరోజములు సుగంధపరిమళభరితములు. చంపకాశోకపున్నాగసౌగంధిక పుష్పములకు సుగంధములు అమ్మవారిశిరోజములే వితరణకావించినట్లు చెప్పబడినది. అష్టమిచంద్రునిబోలిన లలాటము, మన్మథగృహ తోరణములవంటి కనుబొమలు, ముఖసౌందర్య కాంతి ప్రవాహమునందు చలించు మీనములవంటి నయనములు, అప్పుడే వికసించిన సంపంగినిబోలిన నాసిక, తారలకాంతులను ధిక్కరించు ముక్కెర, ఎర్రని కదంబ కుసుమ గుచ్ఛముతో నిండుగా శోభించు కర్ణములు (చెవులు), సూర్యచంద్ర మండలములే చెవికమ్మలుగా ధరించి తేజరిల్లు ముఖసౌందర్యము, పద్మరాగశిలలను, అద్దములను తిరస్కరించే నున్నని, నిర్మలమైన చెక్కిళ్ళు, ఎర్రని పగడములు మరియు దొండపండ్ల కాంతులను మించిన పెదవులు, శుద్ధవిద్యాంకురములవలె ప్రకాశించు దంతపంక్తులు, కర్పూరాది సుగంధచూర్ణ మిళితమైన తాంబూల చర్వణముతో దిశలన్నిటిని ఆకర్షించుచున్న ముఖపరిమళము, సరస్వతి కచ్ఛపీ వీణాస్వనములను మీరగలిగే మధురాతి మధురమైన సల్లాపములు (పలుకులు), కామేశ్వరుని మనసును సైతము వశపరచుకోగల హద్దులు లేని చిఱునవ్వుల కాంతిప్రవాహము, వర్ణింపనలవిలేని, పోలికలే కానరాని శోభాయమానమైన చుబుకము, కామేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్ర శోభతో భాసిల్లు కంఠసీమ, అంగదకేయూరములు అను కాంచనాభరణములతో తేజరిల్లు చతుర్భుజములు, వజ్రవైడూర్యాది మణులు, ముత్యములతో చేయబడిన హారములు, కామేశ్వర ప్రేమరత్నమునకు బదులిచ్చిన స్తనరత్నములు, చిఱుగంటలతో కూడిన వడ్డాణము, మాణిక్య మకుటములవంటి జానువులు (మోకాళ్ళు), ఎర్రని ఆరుద్రపురుగులతో అమర్చబడిన మన్మథుని యమ్ముల పొదులవంటి జంఘికలు (పిక్కలు), నమస్కరించువారి అజ్ఞాన తిమిరములను బాపు కాలిగోళ్ళ కాంతులు, పద్మముల సుకుమారాన్ని సైతం మించిపోగల పాదములు, ఘల్లుఘల్లుమను ప్రణవధ్వానములనిచ్చే మణిగణఖచితమైన మంజీరములు (కాలియందెలు), మరాళి (ఆడ హంస వలె) వంటి మందగమనము - ఇదంతయును వశిన్యాదులచే కీర్తింపబడిన అమ్మవారి అతిశయించిన సౌందర్యానికి మహత్తరమైన వర్ణన. గనుకనే ఆ పరమేశ్వరి మహాలావణ్యశేవధిః యని అనబడినది. అనగా అతిశయించిన సౌందర్యమునకు పరమేశ్వరి ఒక మహానిధి వంటిది అని వశిన్యాది వాగ్దేవతల భావన. పూలకు సుగంధము పరమేశ్వరి నుండి లభించినది. ఎత్తైన పర్వత శిఖరముల నుండి ఉరకలు వేసే సెలయేళ్ళ సౌందర్యము అమ్మవారి శిరోజముల నుండే అబ్బినది. అమ్మవారి నాసాదండమును చూచి సంపెంగ ఈర్ష్యజెంది వాడిపోయినదట. అమ్మవారి పెదవుల ఎర్రదనమునకు దొండపండ్లు మత్సరపడి కుళ్ళుకున్నవట. అందుకే జాలిపడిన అమ్మవారి మీనములవంటి కళ్ళు చెవులవరకూ సాగి చెవులతో చెప్పగా అమ్మవారు ప్రకృతిని సౌందర్యమయము చేయనారంభించినదట. ఆ తల్లి కరుణించి ఎన్నోరంగుల పువ్వులను, ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క విధమైన పరిమళమును ప్రసాదించినదట. పర్వత శిఖరాగ్రములనుండి క్రిందికి ఉరకాలని ఉబలాటపడే సెలయేళ్ళకు నడక నేర్పినదట అమ్మవారు. పువ్వులలోని మకరందమునకు మాధుర్యము అమ్మవారి తీయని పలుకులనుండే లభించినదట.
ఈ జగత్తులో ఏ వస్తువూ శాశ్వతంకాదు. అలాగే ఆ వస్తువుల సౌందర్యము కూడా శాశ్వతముకాదు. అన్నియును క్షణభంగురములే. కాని అమ్మవారు సౌందర్యనిధి. ఆ సౌందర్యము శాశ్వతమైనది. సచ్చిదానంద స్వరూపమైనది. ఆ తల్లి సౌందర్యానికి పరాకాష్ఠ. జగన్మాత మహాలావణ్యముతో అఖండానందమునకు నిధి. అనగా ఆ పరమేశ్వరి సందర్శనమున అఖండమైన బ్రహ్మానందము లభించును. శ్రీలలితా పరమేశ్వరి చైతన్యము అత్యద్భుతము.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహాలావణ్య శేవధియే నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
49వ నామ మంత్రము
ఓం సర్వారుణాయై నమః
శరీరచ్ఛాయ ఎఱుపు, ధరించిన ఆభరణములు ఎఱుపు, దంతముల చివుళ్ళు ఎఱుపు, పెదవులు ఎఱుపు, కట్టిన వస్త్రం ఎఱుపు, తాను ఇష్టపడే రంగు ఎఱుపు, సర్వం అరుణమయమై సర్వారుణా యని నామ ప్రసిద్ధ అయిన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వారుణా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం సర్వారుణాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ఆ తల్లి అయినవారిలో ఆప్యాయతను, అనురాగాన్ని ప్రాప్తింపజేసి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని, జ్ఞానోదయాన్ని కలిగించి జీవితాన్ని పరమపదమువైపు నడిపించును.
శ్రీలలితా పరమేశ్వరి సిందూరారుణ విగ్రహామ్ అని యనబడినది. అమ్మవారి శరీరము సిందూరము వలె ఎర్రని ఎఱుపు. చేతిలో ఎర్రని కలువను ధరించియున్నది. రత్నఘటమునందుంచిన ఎర్రని పాదములతో ప్రకాశిస్తున్నది. ఆ తల్లి ధరించిన వస్త్రములు ఎఱుపు. ఆభరణములు ఎఱుపు. శిరోజములందలి కదంబము, మందారము, దాడిమీ కుసుమము మొదలైన పుష్పములన్నియును ఎఱుపు. ఆ తల్లి ముక్కెర పగడము వలె ఎఱుపు. ఒక పెదవి విద్రుమమువలెను, మరియొక పెదవి దొండపండు వలెను ఎఱుపు. చిదగ్నికుండ సంభూత యగుటచే ఆ పరమేశ్వరి ఆపాదమస్తకమూ ఎర్రని కాంతులతో ప్రకాశించుచున్నది. ఉద్యద్భానుసహస్రాభా (కోట్లాది ఉదయభానుకిరణములతో భాసిల్లు పరమేశ్వరి) యనబడిన జగన్మాత సహజముగానే అరుణవర్ణము.
కావున శ్రీమాత సర్వారుణ అనబడుచున్నది. ఇచ్చట అరుణ అను పదము ఉదయభానుని అరుణ వర్ణమునకు, ప్రాతః సంధ్యారుణ వర్ణమునకు బోధకములు అని తెలియదగును. ఆ అరుణ వర్ణము భక్తులకు అనుగ్రహింపబడే జ్ఞానోదయమునకు సంకేతము. అద్వైత చైతన్యమునకు ప్రతీక. అమ్మవారి శరీర అరుణకాంతులు ఆ తల్లి కరుణాంతరంగ వీక్షణములకు నిదర్శనము.
సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికామ్|
సమందహసితేక్షణాం సశరచాప పాశాంకుశామ్|
అశేషజన మోహినీ మరుణమాల్య భూషాంబరామ్|
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికామ్॥
పాదం నుండి తల వరకూ ఎర్రని కుంకుమ పూతతో, కనుబొమల మధ్య ఎర్రని కస్తూరిని తిలకంగా ధరించి, చిఱునవ్వు చిందిస్తూ, చేతులలో బాణము-ధనుస్సు-పాశాంకుశములను ధరించి, సమస్త జనులను మోహింపజేస్తూ, ఎర్రని మాలికలతో, అలంకారములతో, శ్రేష్ఠమైన వస్త్రాలతో, ఎర్రని పుష్పం మాదిరిగా ప్రకాశించుచున్నట్టి అంబికను ధ్యానించవలయును.
శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం సర్వారుణాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
50వ నామ మంత్రము
ఓం అనవద్యాంగ్యై నమః
దోషరహితమై, ఏవిధమైన అవయవలోపములేనిదై , సౌందర్యముతో శోభించు జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి అనవద్యాంగీ యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం అనవద్యాంగ్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఉపాసించు సాధకుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడై, దీర్ఘాయుష్షుతో, సుఖసంతోషములతో జీవించును మరియు జగన్మాత పాదార్చనయందు జన్మతరింపజేసికొనును.
చల్లని శరత్కాలపు వెన్నెలలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. ఆ వెన్నెలలు ప్రసాదించే ఆ చంద్రబింబముకూడా అందముగా ఉంటుంది. కాని ఆ చంద్రునిలో చిన్న మచ్చ ఉన్నది. ఆ చంద్రుని అందమునకు ఆ మచ్చ ఒక దోషము. కాని త్రిభువన సుందరియైన పరమేశ్వరికి చంద్రుని వంటి దోషములు లేవు. ఇంతకు ముందు నామ మంత్రములలో అమ్మవారి స్థూలరూప వర్ణన చేయునపుడు వశిన్యాదివాగ్దేవతలు అమ్మవారి సర్వాంగములను అతిశయించిన సౌందర్యము ఒప్పారినవిగా వర్ణించారు. అందుకనే ఆ తల్లిని మహాలావణ్యశేవధిః అని విశేషించి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అదే నామ మంత్రంలో నర్మగర్భంగా అమ్మవారి అందాన్ని విశేషించి వర్ణించుచున్నారు. అంతటి మహాలావణ్యశేవధిః అని యనబడిన అమ్మవారికి దోషపూరితమైన అంగములెట్లుండును? గనుకనే అనవద్యాంగీ (నింద్యములు కాని అంగములు గలది) అని విశేషించి చెప్పారు. అంటే అమ్మవారు సర్వారుణాఽనవద్యాంగీ యని కీర్తించుటకు ఈ నామ మంత్రమును చెప్పి ఉంటారు. అనగా సర్వారుణమైన శరీరంతో, ఆ పరమేశ్వరి నింద్యములు కాని అంగములతో శోభిల్లుచున్నదని భావము. గనుకనే నలుబది తొమ్మిదవ నామ మంత్రముతో ఈ నామ మంత్రమును చేర్చి ఓం సర్వారుణాఽనవద్యాంగ్యై నమః అని యనుచూ అమ్మవారికి నమస్కరించవచ్చును.
త్రిభువన సుందరి. చక్కని అవయవ సౌష్టవముతో, పరిపూర్ణ లావణ్యముతో, సర్వారుణయై, మనోజ్ఞయై కామేశ్వరుని ప్రేమయను మణిరత్నమును పొందినది.. అటువంటి శ్రీమాత శరీరావయవములలో లోపము ఎట్లుండును? అందుకే అనవద్యాంగీ అని స్తుతింపబడినది. అంతేనా సర్వారుణా అను నామముతో కలిపి సర్వారుణాఽనవద్యాంగీ అని స్తోత్రం చేస్తే అమ్మకాదు, అయ్యవారు ఉప్పొంగి వరాల జల్లు కురిపిస్తాడు. ఎందుకంటే అమ్మను త్రిభువనసుందరిగా వర్ణించాము కదా. జగన్మాత శ్రీచక్ర బిందు నివాసిని, పరబ్రహ్మస్వరూపిణి అయినది, బిందువు అంగియే గాని అంగము కాదు. విశ్వమంతయూ జగన్మాత స్వరూపమే.
వామకేశ్వర తంత్రంలో చెప్పబడిన శ్రీదేవీ ఖడ్గమాలలో న్యాసాంగదేవతలను చెప్తూంటాము. వారు హృదయదేవీ, శిరోదేవీ, శిఖాదేవీ, కవచదేవీ, నేత్రదేవీ, అస్త్రదేవీ. ఈ అనవద్యులైన అంగదేవతల సమిష్టిరూపమే పరమేశ్వరి గనుక అమ్మవారు అనవద్యాంగీ యని అనబడినది. ఈ న్యాసాంగదేవతలను కూడా చక్కగా ఉచ్చరిస్తూ, ఖడ్గమాలా స్తోత్రమును పారాయణము చేయువారు ఆ పరమేశ్వరి కరుణచే అనవద్యాంగులై, ఆరోగ్యసంపన్నులై, ఆయుష్మంతులై వర్ధిల్లుదురు.
అటువంటి అనవద్యాంగియైన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం అనవద్యాంగ్యై నమః అని అనవలెను.
ఆ పరమేశ్వరికి నమస్కరించునపుడు (49వ నామ మంత్రముతో కలిపి) ఓం సర్వారుణాఽనవద్యాంగ్యై నమః అని కూడా అనవచ్చును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
నేటి ఆద్యాత్మిక భావ మే జీవితం
సృష్టి చైతన్యం ప్రకృతి
ఆత్మా చైతన్య ఆకృతి
దైవ చైతన్యం స్వీకృతి
పుర్ష చతన్యం జాగృతి
సర్వం ఆనందం ధర్మమే ఈశ్వరా
ఆత్మ తత్త్వం తెలుసు కోలేని జన్మ
యోగ తత్త్వం కనికరించలేని జన్మ
మౌన తత్త్వం ఆచరించుటయే జన్మ
ప్రేమ తత్త్వం తో భక్తియే కలియుగ జన్మ
సర్వ శ్రేయస్సు కు జ్ఞాన ముపంచె జన్మ ఇవ్వు ఈశ్వరా
పరాత్పర శబ్దము గ్రహించలేము
పశ్యంతీ, శబ్దము వినిపించుకోలేము
మధ్యమ శబ్దము బతికి బతికించ గలము
వైఖరీ శబ్దము 84 లక్షల ప్రాణుల భాష ఫలము
సృష్టి ధర్మము అనుసరించి బత్కి బతికించుటే ఈశ్వరా
సర్వోత్కృష్ట శబ్దం ఓంకార నాదము
ఆచరించిన వానికి జన్మ పరిపక్వత శబ్దము
మోక్షదాయక సులభ మార్గమే దేహము
ఇదియే కలియుగ జీవిత సత్యమే కదా ఈశ్వరా
-(())--
ఉ
"ఎన్నటికిన్ రఘూద్వహుని నేనును నన్నిక రామ చంద్రుడున్
గన్నుల జూడ గల్గదొకొ! కల్గక యుండిన బ్రాణమేల పో
దన్న! రఘుప్రవీరు చెవులారగ నింతయు దెల్పు, నాదు మే
నున్నది, చెంత గంగ మడుగున్నది, యైనటు లయ్యెడున్ దుదిన్"
"…
అంతఃకరణ చతుష్టయం:-
మనస్సు - సంకల్ప వికల్పాలు చేసేది
బుద్ధి - మంచి, చెడు చెప్పేది
చిత్తం - నిరంతర చింతన చేసేది
అహంకారం - నేను, నాది అనేది
యోగ చతుష్టయం:-
సంకల్ప, వికల్పాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ 'మనస్సు'ని శుద్ధి చేసుకోవడమే - కర్మయోగం।
'బుద్ధి'ని సునిశితం చేసుకుంటూ, అంటే నిత్యానిత్య విచక్షణాజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ పోవడమే - జ్ఞాన యోగం।
'చిత్తవృత్తులను' నిరోధించుకుంటూ కావలసినప్పుడల్లా సమాధి ప్రజ్ఞను పొందడమే - రాజయోగం।
'నేను', 'నాది' (అహంకారం) అనే భావాలను పూర్తిగా తుడిచి పెట్టుకుంటూ ఉండడమే - భక్తియోగం।
మీరు పిచ్చి ఏనుగును నియంత్రించవచ్చు; మీరు ఎలుగుబంటి మరియు పులి నోరు యవచ్చు;
సింహాన్ని తొక్కండి మరియు నాగుపాముతో ఆడుకోండి; రసవాదం ద్వారా మీరు మీ జీవనోపాధిని సంపాదించుకోవచ్చు; మీరు విశ్వంలో అజ్ఞాతంలో సంచరించవచ్చు; దేవతల సామంతులను చేయండి; ఎప్పుడూ యవ్వనంగా ఉండండి; మీరు నీటి మీద నడవవచ్చు మరియు అగ్నిలో జీవించవచ్చు:కానీ మనస్సు యొక్క నియంత్రణ చేయడం చాలా మంచిది కానీ,అంత సులభతరమైనది కాదు మరింత కష్టతరమైనది।
****
నేటి పద్యాలు
స్త్రీ విద్యా సకలమ్ముకే శ్రేయో సహాయమ్ముయే
స్త్రీ శక్తీ సహనమ్ముయే ప్రేమా గుణాన్విత్వమే
స్త్రీ యుక్తీ చరితార్ధమే సేవా సమానత్వమే
స్త్రీ భక్తీ వినయమ్ముయే సద్భావనా స్నేహమే
శ్రీసూర్యా వెదజల్లు వేడే మా మనో తృప్తియే
శ్రీ సూర్యా తెలిపేటి పొద్దే తీర్పుగా వేదమే
శ్రీ సూర్యా పిలుపే సహాయమ్ సంభవమ్ సంతసమ్
శ్రీ సూర్యా కిరణమ్ వికాశమ్ సంఘమమ్ నమ్మకమ్
కాలమ్మే కదిలే సుధామాధుర్యమే నిత్యమై
కాలమ్మే వికసించు ప్రేమామృతమ్మే సత్యమై
కాలమ్మే దరిచేర్చు సేవామృతమ్మే భవ్యమై
కాలమ్మే మనసిచ్చి సౌందర్య సేవాదివ్యమై
సత్య మునే పల్కు సత్యము వల్లనే నిత్య నిష్ఠ కలుగు
నిత్య ము న్యాయాన్ని నిత్యము ధర్మాన్ని ఆచరణే సుఖమగు
పత్య మువల్లనే సాంప్ర దాయ మవగ కుదుట కారోగ్యం
ముత్య మంటి వెలుగు మోద మంద గలదు నిత్య ఆనందమె
న్యాయ మార్గముయే నడుపవ లెనందరు కాల మాయ తొలుగు
ధ్యేయ మువల్లనే ధర్మ నిరతిఁ గుండి భువిని ఆచరించు
ప్రాయ మునుండియే భక్తి పెరుగు చుండు ఆచరణలు జరుగు
సాయ మనేదియూ జనుల కరుణ తోను హితము జేయు శుభము।।
ఉ
"ఇంతకు బూని వచ్చి వచియింపక పోదునె విన్ము తల్లి ,దు
శ్చింతులు దైత్యుచే బడిన సీతను గ్రమ్మర నేలు చున్నవా
డెంత విమోహి రాముడని యెగ్గులు బల్కిన నాలకించి భూ
కాంతుడు వంత జెంది నిను గానల లోపల డించి రమ్మనెన్"
కార్యా యణం నటనపారాయణం మదనపారాయణం సుమనసామ్
ధైర్యా యణం కలితధీరాయణం కుసుమవారాయణం సుమనసామ్
సౌర్యా యణం సుగుణవారాయణం నయనపారాయణం సుమనసామ్
ధీరా యణం ప్రకృతిమారాయణం విమలనారాయణం హృది శివమ్
-
వృందావనే సదరవిందాసనాది వర బృందారకస్తుతివచో-
మందారపుష్ప మకరందానుభూతి సుఖసందానితాశయగజమ్।
వృందారకేంద్ర మణిబృందాయితాత్మతనుకందాద్యుదంచితరుచి-
స్యందానుమోదిత సునందాదిగోపమరవిందాంబకం హృదిభజే॥
-
పున్నాగ వేత్సి కిము మన్నాథమభ్రతనుభృన్నాయకీజన శుభం
సన్నాథవక్త్రమరిభిన్నాగబాహుమవనున్నాశ్రితాఘచరణమ్।
పున్నాగయానమలిజిన్నారదాలకమఖిన్నాశయం శుభదృశా-
ఽఽపన్నావనం చ తిలసన్నాసికం భవుకకృన్నామకం నరవరమ్॥
-
దోషాకరః క్వ బత శోషాశ్రయః శశకపోషాకృతిస్తవ పతే
దోషాపహం యువతిశోషాపహం స్వరసపోషాకృతి క్వ వదనమ్।
రోషాత్ పికవ్రతతిరేషా వినిందతి చ యోషా ఇమాస్తవ ముఖాత్
భాషా వినిస్సరతు యైషాం ప్రభూతమదదోషా కృతార్థయ జనమ్॥
-
హంసాయ దుష్టబకహింసాయ చంపకవతంసాయ యాదవకులో-
త్తంసాయ భక్తజనసంసారదుస్తిమిరహంసాయ పావనదృశే।
కంసారయే పరమహంసావలీవినుతహంసాయుతాకృతిధృతే
హంసాత్మనే శశివతంసాదిదృగ్జలజ హంసాయ మే నతిరియమ్॥
-
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
551వ నామ మంత్రము 7.1.2022
ఓం సర్వవ్యాధి ప్రశమన్యై నమః
సమస్త ఆది, వ్యాధులను (మానసిక, శారీరక రోగాలను) శమింపజేయు జగన్మాతకు నమస్కారము
శ్రీలలితా సహస్రనామావళి యందలి సర్వవ్యాధి ప్రశమనీ యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) నామ మంత్రమును ఓం సర్వవ్యాధిప్రశమన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఎటువంటి అనారోగ్య బాధలుగాని, మానసిక బాధలు గాని లేకుండా అనుగ్రహించును.
వ్యాధులు అనునవి శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక రుగ్మతలకు మందులు వాడవచ్చును. కాని మనోవ్యాధికి మందులు ఉండవు.
మానవునికి తాపత్రయములు అనునవి ఉన్నాయి. ఇవి కూడా వ్యాధులే అనబడతాయి.
తాపత్రయం లేదా త్రివిధ తాపాలు అనగా మూడు రకాలైన తాపాలు అనగా బాధలు అని అర్ధం. ఇవి 1. ఆధ్యాత్మిక తాపం, 2. అధిభౌతిక తాపం మరియు 3. అధిధైవిక తాపం అని మూడు రకాలు.
ఆత్మ అనే దానికి శరీరం, మనస్సు, బుద్ధి , జీవాత్మ , పరమాత్మ అని వివిధ అర్ధాలున్నాయి. మనస్సు, శరీరం ఇత్యాదుల కారణంగా కలిగే శోకం, మోహం, జ్వరాది రోగాలు మున్నగు బాధలు ఆధ్యాత్మిక తాపాలు భూతములనగా ప్రాణులు. మనుష్యులు, పశువులు, పక్షులు, పాములు మొదలైన ప్రాణుల ద్వారా సంభవించే బాధలు అధిభౌతిక తాపాలు. యక్షరాక్షసుల చేత, గ్రహావేశాల చేత, దైవబలముతో కలిగేవి అధిదైవిక తాపాలు. భూకంపం, సునామీ, అతివృష్టి, అనావృష్టి మొదలైనవి ఇందులో చేరతాయి. మానవులమైన మనకు కలిగే నానావిధాలైన బాధలు ఈ త్రివిధతాపాలలో చేరిపోతాయి. వీటికి గురైనవారు తాపత్రయ పీడితులు అనబడతారు. ఆ పరమేశ్వరి మానవునికీ గల తాపత్రయములను పోగొడుతుంది.
శరీరంలో కాలమాన పరిస్థితులచేతను, శీతోష్ణములవలనను అనారోగ్యం వస్తుంది. మందులు వాడితే తగ్గిపోతాయి. మధుమేహము, రక్తపోటు వంటివి జీవితాంతం ఉంటాయి. ఇవి దీర్ఘవ్యాధులుగా చెప్పవచ్చును. వీటికి నిరంతరము వైద్యుని సంప్రదింపులతో నియంత్రణ జరుపుకుంటారు. దీర్ఘవ్యాధులు పూర్వజన్మల కర్మఫలంగా వస్తూ ఉంటాయి. వీటికి తాత్కాలిక నియంత్రణ మాత్రమే ఉంటుంది. శాశ్వత నివారణ ఉండదు. మానసిక వ్యాధులు అనేవి తనకు అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవడము, తనకు సంబంధించిన వారు దూరంకావడము, ఏదో కారణంచేత అవమానభారం ఏర్పడడం, ఎవరితోనో తనను పోల్చుకుని, అంతటి ఉన్నతి తనకు లేదనుకోవడము - ఇలాంటి కారణాలవలన ఏర్పడిన మానసిక క్షోభ అనునది మానసిక వ్యాధి అని అంటాము. సంతానం లేకపోవడం లేదా సంతానం ఉన్ననూ వారివలన మనశ్శాంతి లేకపోవడం, వివాహం కాకపోవడం, వివాహం జరిగినా దాంపత్య భాగస్వామివలన మనశ్శాంతి కరువగుట వంటిది కూడా మానసిక వ్యాధి అంటారు. అలాగే ఉద్యోగార్థికి ఉద్యోగము లేదను చింత, లేదా ఉన్న ఉద్యోగం పోయినచింత, అవసరాల మేరకు ధనము సమకూరలేదను చింత, దొంగలవలన ధనము పోగొట్టుకొనిన చింత, ఆర్థిక ఇబ్బందులవలన ఏర్పడిన చింత - ఇవి అన్నియునూ కూడా మనోవ్యాధులే అనిపించుకుంటాయి. మనోవ్యాధికి మందులేదు. కాని పరమేశ్వరిని నిరంతరం ధ్యానిస్తే, ఆ తల్లి కరుణచే మానసిక రుగ్మతలు గాలిగి మబ్బులు చెదిరినట్లు తొలగి పోతాయి. దీర్ఘవ్యాధులు, తాత్కాలిక రుగ్మతలు కలుగకుండా ఆ పరమేశ్వరి తన భక్తుల శరీరంలో వ్యాధినిరోధకత్వము ఏర్పడునట్లు అనుగ్రహించును. అరిషడ్వర్గాల (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యముల) వలన ఏర్పడు రుగ్మతలు మానసిక వ్యాధుల క్రింద వస్తాయి. వీటినే భవరోగములు అనికూడా అంటారు. ఇవి తొలగిపోవాలంటే నిరంతరము ధ్యాన నిమగ్నత అవసరము. ఓం సర్వవ్యాధిప్రశమన్యై నమః అను నామమంత్రము సంపుటముచేస్తూ శ్రీలలితా సహస్రనామ స్తోత్ర పారాయణము అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆ పరమేశ్వరిపై భారము, నమ్మకము ఉంచి చేయుట అనేది చాలా అవసరము. కళ్ళు ఎర్రనై మండుతూ నీళ్ళు కారితే రోగము అని అందురు. ఇతరుల బాగును చూచి అసూయ పడడం,రకరకాలైన దుర్వ్యసనాలు, పరస్త్రీవ్యసనాలోలత్వము, పరధనంపై దురాశ, జీవహింస వంటి చెడుకర్మలు చేయుటవంటి వన్నియు వ్యాధులే అంటాము; ఈ విధముగానే మనస్సు, ఇంద్రియములద్వారా గిట్టనివాటిన గ్రహిస్తే మానసిక వ్యాధులు రాగలవు. వీటికి కారణము రాగ, ద్వేష, క్రోధ, అసూయ, భవరోగములు మాత్రమే అగును; ఇట్లు అజ్ఞాన జన్యమైన అవివేకముతో తెచ్చుకొనుట వంటివి అధివ్యాధులు; కావున శ్రీమాత జ్ఞానస్వరూపిణి అయినందున ఈ వికారములన్ని పోగొట్టి పవిత్రుని జేసి కాపాడుతుంది కావున ఆ పరమేశ్వరి సర్వవ్యాధిప్రశమనీ యని వశిన్యాది వాగ్దేవతలచే కీర్తింపబడినది.
శ్రీలలితా సహస్ర నామస్తోత్రముయొక్క ఉత్తర పీఠిక (ఫలశ్రుతి) యందు ఇలా చెప్పబడినది:-
23వ శ్లోకము
జ్వరార్తం శిరసి స్పృష్ట్వా పఠేన్నామసహస్రకమ్|
తత్క్షణాత్ప్రశమం యాతి శిరస్తోదో జ్వరోఽపి చ॥23॥
శ్రీలలితా సహస్ర నామ పారాయణము నొనరించు ఉపాసకుడు జ్వరపీడితుడైయున్న రోగి శిరస్సుపై చేయి ఉంచి శ్రీలలితా సహస్రనామ స్తోత్రపారాయణ చేసినట్లైతే జ్వరము, తన్మూలంగా వచ్చిన తలనొప్పి మరియు ఇతర బాధలు తొలగిపోవును.
ఓం సర్వవ్యాధి ప్రశమన్యై నమః అను ఈ నామముతో లలితాసహస్రనామస్తోత్ర శ్లోకములను సంపుటీకరణము చేసి పారాయణచేస్తే రోగబాధలు ఉపశమించుతాయి.
ఈ విధానము ఎలాగ అనగా - జ్వరము వచ్చిన రోగిని ఉత్తరముఖముగా కూర్చుండనియోగించి పారాయణ చేయు ఉపాసకుడు తూర్ఫుముఖముగా కూర్చుని భస్మమును చేతనుంచి, సహస్రనామములతో మంత్రించి భస్మమును జ్వరపీడుతునకు పెట్టవలెను. మంత్రజలముతో జ్వరితునకు అభిషేకము చేసినను జ్వరము తగ్గును. ఈ విధానములో ఉపాసకుడు తన నిత్యకృత్యమైన సంధ్యావందనాదులు పూర్తిచేసికొని మొదట పూర్వపీఠికను పఠించి, జ్వరముతో బాధపడువాని శిరస్సుపై చేయి ఉంచి, పిదప శ్రీలలితా సహస్రనామ స్తోత్రపారాయణము చేసి, ఆ తరువాత ఉత్తరభాగము అనగా ఫలశ్రుతి పఠించి బ్రాహ్మణునికి స్వయంపాకము సమర్పించుట గాని, భోజనముగాని పెట్టవలయును. అదే ఉపాసకునికే జ్వరము సోకితే, అతడు తన చేయిని తన శిరసుపై పెట్టుకొని పారాయణము పూర్వపీఠిక పఠనము, సమస్రనామస్తోత్ర పారాయణము అనంతరము ఉత్తరపీఠిక (ఫలశ్రుతి) పఠించవలయును. జ్వరము ఇంకను తగ్గనిచో పూర్వపీఠిక పఠనముచేసి, సహస్రనామస్తోత్ర పారాయణము ఎన్ని ఆవృత్తులయినను చేసి, అనంతరము ఉత్తరపీఠిక పఠనము చేయ వలయును. అనగా పూర్వపీఠిక, అనంతరము సహస్రనామ స్తోత్ర పారాయణము (ఎన్నిసార్లయినను) చేసి అనంతరము ఉత్తర పీఠిక పఠనము చేయవలయును.
24వ శ్లోకము
సర్వవ్యాధినివృత్త్యర్థం స్పృష్ట్వా భస్మ జపేదిదమ్|
తద్భస్మధారణాదేవ నశ్యన్తి వ్యాధయః క్షణాత్॥24॥
జలం సమ్మన్త్ర్య కుంభస్థం నామసాహస్రతో మునే|
అభిషిఞ్చేద్గ్రహగ్రస్తాన్గ్రహా నశ్యన్తి తత్ క్షణాత్॥25॥
ఉపాసకుడు సహస్రనామములతో విభూతిని మంత్రించి, ఆ విభూతిని రోగి శరీరంపై పడునట్లు ఊదవలెను . లేదా రోగి శరీరమునకు ఆ విభూతిని పూయవలెను. అట్లు చేసినచో సర్వరోగనివారణము కాగలదు. మంత్రించుట అనగా విభూతిని ఉపాసకుడు చేతిలో ఉంచుకొని, తన చేతి వ్రేళ్ళతో కదుపుచూ, సహస్రనామస్తోత్ర పారాయణము చేయవలెను. అనంతరము రోగి శరీరముపై విభూతిని చేతిలోనుండి ఊదవలెను లేదా శరీరముపై పూయవలెను.
బిందెలో నీటిని పోసి, సహస్ర నామ స్తోత్ర పారాయణము చేయుచూ అభిమంత్రించి, ఆ నీటిని గ్రహబాధా పీడితునికి స్నానము చేయించవలెను. తత్ఫలితముగా బాలగ్రహములు మరియు పిశాచబాధలు ఉపశమించును. నవగ్రహదోషములు తొలగును.
26వ శ్లోకము
సుధాసాగరమధ్యస్థాం ధ్యాత్వా శ్రీలళితాంబికామ్|
యః పఠేన్నామసాహస్రం విషం తస్య వినశ్యతి॥26॥
శ్రీలలితా పరమేశ్వరిని సుధాసాగరమధ్యమున ఉన్నట్లు భావించి, శ్రీలలితా సహస్రనామస్తోత్ర పారాయణము చేస్తే ఉపాసకుని తాపత్రయములు తొలగిపోవును. బాధాపీడితులు తమగోత్ర నామముల సంకల్పంతో ఉపాసకునిచే పారాయణ చేయించినట్లయిన, బాధాపీడుతులకు సర్వరోగములు, సర్వభూతప్రేతపిశాచా పీడనము, నవగ్రహదోషములు తొలగిపోవును. శ్రీపురమెచ్చట ఉన్నదో, అచ్చట సుధతో కూడిన కొలనులు (చెఱువులు) అనేకము ఉన్నవి. ఆ శ్రీపురమునందు అర, ణ్య ములను రెండు హ్రదములు (కొలనులోని లోతైన మడుగులు) ఉన్నవి. అలాగే బ్రహ్మరంధ్రమునందు సహస్రారంలోని చంద్రమండలములోని సుధాసాగరము నందు ఒక హ్రదము గలదు. ఈ మూడింటిలో పరమేశ్వరి ఉంటుంది. తమతమ శక్తికొలది ఆ పరమేశ్వరిని ధ్యానము చేసి, మానసిక పంచోపచారములు (గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాలు) చేయవలయును. అలాచేస్తే ఉపాసకుల సకల బాధలు తొలగిపోవును.
వన్ధ్యానాం పుత్రలాభాయ నామసాహస్రమన్త్రితమ్|
నవనీతం ప్రదద్యాత్తు పుత్రలాభో భవేదధ్రువమ్॥27॥
సంతానభాగ్యము లేని వంధ్యులకు ఈ సహస్రనామపారాయతో మంత్రించిన వెన్నను భక్షింపజేసిన సత్సంతాన భాగ్యము కలుగును.
28వ శ్లోకము
దేవ్యాః పాశేన సంబద్ధాభాకృష్టాభఙ్గుశేన చ|
ధ్యాత్వాఽభీష్టాం స్త్రియం రాత్రౌ జపేన్నామసహస్రకమ్|
ఆయాతి స్వసమీపం సా యద్యప్యన్తః పురం గతా॥29॥
ఈ శ్లోకంలోని భావము ఇలా తీసుకోవలయును:-
శ్రీలలితాసహస్రనామస్తోత్ర పారాయణ ప్రభావముచే ఉపాసకుడు తాను పరిణయ మాడదలచిన కులాంగన అంతఃపురకాంతయైనను (బాగా కలిగినవారి ఇంటి కన్య అయినను), పెద్దల అంగీకారంతో తనదగును అని భావించవచ్చును.
పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం సర్వవ్యాధి ప్రశమన్యై నమః అని యనవలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి