9, మే 2020, శనివారం

మిణుకుమిణుకు కధ (9)

మిణుకుమిణుకు కధ (9)

#ఆఫీస్‌ నుండి వచ్చానో లేదో అన్నయ్య నుండి ఫోన్‌ వచ్చింది. వదినకి ఆరోగ్యం బాగా లేదని, బాగా నీరసమై పోయిందని చెప్పేసరికి గాబరా పడ్డాను. రెండిళ్ళ అవతలే అన్నయ్య కుటుంబం వుండేది. ఆలస్యం చెయ్యకుండా పరుగు పెట్టాను. దాదాపుగా అపస్మారక స్థితిలో వుంది వదిన. అబులెన్స్‌ రప్పించి, మా ఊర్లోనే వున్న ప్రసాద్‌ డాక్టర్‌ గారి దగ్గరికి తీసుకువెళ్ళాం. ''షుగర్‌ దాదాపుగా నాలుగు వందలు దాటింది. వెంటనే మీరు విశాఖపట్నం తీసుకెళ్ళిపోండి'' అని చెప్పగానే... అదే అంబులెన్స్‌లో విశాఖపట్నం తీసుకెళ్ళి కనకదుర్గ నర్సింగ్‌హోమ్‌లో జాయిన్‌ చేశాం.

అన్నయ్య గారబ్బాయి, కోడలు, పిల్లలతో కలిసి తిరుపతి వెళ్ళడం వల్ల... పూర్తి బాధ్యత నామీద పడింది. వదినకేమైనా అయితే తాను ఒంటరినై పోతానేమోనని అన్నయ్య భయపడిపోతూ... ఏడుస్తున్నాడు కూడా. అన్నయ్య ఏడవటం నేనెప్పుడూ చూడలేదు.

అందరికీ ఒకటే అనుమానం... వదిన ఇంక బతకదనే వారి నమ్మకం.
మరోవైపు వదినని ఎలాగైనా బతికించుకోవాలని తాపత్రయం నాది.

డాక్టర్లందరితోనూ మాట్లాడుతూనే వున్నాను. వదినకి షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోవడం వల్ల కిడ్నీ కూడా పనిచేయడం తగ్గిపోయింది. ఎవ్వరికీ ఎటువంటి ఆశలూ లేవు... నాకు మాత్రం ఏదో నమ్మకం... చిన్ని ఆశ ఏ మూలనో మిణుకుమిణుకు మంటూ వుండే దీపంలా కన్పిస్తోంది.

అన్నయ్య గారబ్బాయినీ, బంధువుల్నీ, దగ్గరివాళ్ళనీ రమ్మని అందరికీ కబుర్లు పంపేశారు. ఇవాళ్ళో రేపో ప్రాణం పోతుందన్నట్లుగా ఉంది వారి తీరు. నా ప్రయత్నం ఆపలేదు.

నా పరిచయాన్ని ఉపయోగించి మంచి డాక్టర్లనీ రప్పించాను. రెండ్రోజుల్లోనే షుగర్‌ లెవల్స్‌ బాగా తగ్గి, నార్మల్‌కి వచ్చేయి. కిడ్నీ పనితీరు కూడా సాధారణ స్థితికి వచ్చేసింది. వారం రోజుల్లో డిశ్చార్జ్‌ చేసేశారు. వదిన మరలా బతికి ఇంటికి వస్తుందనే నమ్మకం ఎవరికీ లేదు. తనలా వచ్చేసరికి... అన్నయ్య ముఖంలో ఏదో తెలీని ఆనందం. అవధులు లేని ధైర్యం కొట్టొచ్చినట్టుగా కన్పించడమే కాకుండా... నేనంటే అన్నయ్యకి ప్రత్యేకమైన అభిమానం, నమ్మకం ఏర్పడ్డాయి.

ఎవరెంతగా నిరుత్సాహ పరిచినా నేను వెనక్కి తగ్గలేదు. చివరి క్షణం దాకా ప్రయత్నిస్తూనే వున్నాను. ఏదైతేనేం ఫలితం దక్కింది. వదిన మామూలు మనిషయింది.
ఇంత జరిగినా అన్నయ్య ఒక్కడే సంతోషంగా వున్నాడు. మిగిలిన వాళ్ళంతా నిరుత్సాహంగానే వుండటం నేను గమనించకపోలేదు.
డబ్బు బాగా ఖర్చయిపోయిందనీ, తాము చనిపోతుందని చెప్పిన మనిషి, మరలా లేచి కూర్చుందనీ, తాము చెప్పింది నిజం కాలేదనీ... ఇలా ఏవేవో కారణాలతో వారు అసంతృప్తిగా వున్నారనే విషయం స్పష్టంగానే తెలుస్తోంది.
కాలచక్రం గిర్రున తిరిగింది.
ఐదు సంవత్సరాలు ఏమీ కాకుండానే గడిచిపోయాయి. వదిన ఆరోగ్యం పదిలంగానే ఉంది. అన్నయ్య ఆరోగ్యం కాస్త క్షీణించింది. అన్నయ్య నావైపు మరలా ఆశగా చూశాడు. నా ప్రయత్నం మరలా మొదలు పెట్టాను. మరలా విశాఖపట్నం తీసుకెళ్ళాలని నా వుద్దేశం. మరలా డబ్బు ఖర్చయిపోతుందేమోనని వారి భయం. అయినా అన్నయ్యను దక్కించుకోవాలంటే తప్పదు. దాదాపుగా బలవంతంగానే వాళ్ళకి పూర్తిగా ఇష్టం లేకపోయినా నా కారులో ఆసుపత్రి వరకూ తీసుకెళ్ళగలిగాను. పరీక్షలన్నీ అయ్యాయి. అవసరమైన మందులన్నీ ఇచ్చారు. నాకన్నా శ్రద్ధగా అన్నయ్య కోసం ఆలోచిస్తున్నట్లుగానే అన్పించింది. వాళ్ళపై నాకు నమ్మకం కలిగింది.

కానీ అన్నయ్యకు కలగలేదు. లేదు, బాగానే చూపిస్తున్నారులేమని చెప్పి, అన్నయ్యను నమ్మించాను.

దాదాపుగా ప్రతిరోజూ అన్నయ్యను కలిసేవాడిని. గతంలో తిరిగినట్లుగా బయటకు వెళ్ళలేకపోయేవాడు. ఇంటికే పరిమితమయ్యాడు.

ఏం కావాలంటే అవి కొని, ప్రతిరోజూ పట్టుకెళ్ళేవాడ్ని. కాసేపు కబుర్లు చెప్పి వచ్చేసేవాడ్ని.

అనుకోకుండా ఏవో పనులు తగిలినా, అన్నయ్యను కలవటం మానలేదు. అన్నయ్య కొడుక్కి ఇంకేం ట్రీట్‌మెంట్‌ చేస్తే బాగుంటుందో చెప్పి, అలా చేయించమని చెప్పేవాడ్ని ఎప్పటికప్పుడు. అన్నయ్య ఆరోగ్యం బాగవుతుందనే తప్ప, వేరే వుద్దేశ్యం నాకు లేదు.
ఒకసారి అనుకోకుండా అన్నయ్య గారమ్మాయి నుండి నాకు ఫోనొచ్చింది. 

''ఏంటి మీరు మా నాన్నగార్కి హాస్పిటల్‌ ట్రీట్‌మెంట్‌ చేయించమని మా తమ్ముడ్ని రోజూ సతాయిస్తున్నారట. ఆ మధ్య మా అమ్మ కోసమని మూడు లక్షల ఖర్చు పెట్టించారు. ఇప్పుడేమో మా నాన్న కోసం ఖర్చు పెట్టిదామనుకుంటున్నారు. వీళ్ళని చూసుకోవడం తప్ప, మా తమ్ముడింక బాగుపడక్కర్లేదా? జీవితాంతం వాళ్ళ గురించే వున్న డబ్బంతా ఖర్చు చేసేస్తే, ఇంక వాడు బతకక్కర్లేదా?'' దాదాపు నాకు వార్నింగ్‌ ఇచ్చింది.

ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ''అలాగే తల్లీ... నేన్జేసింది తప్పే'' అని మాత్రం చెప్పి ఫోన్‌ పెట్టేశాను.
ఈ సంఘటన జరిగిందగ్గర్నుండి నాకు లోలోపల ఏదో అపరాధ భావన కలిగేది. అన్నయ్య వద్దకు వెళ్దామనుకునేవాడ్ని. మరలా వెనకడుగు వేసేవాడ్ని.
అన్నయ్య ఫోన్‌ చేస్తేనే తప్ప వెళ్ళడానికి సంశయించేవాడ్ని.

అన్నయ్య వెళ్ళిన ప్రతిసారీ ఏవొక ఆరోగ్య సమస్యలు ఏకరువు పెట్టేవాడు. నేను అన్నయ్యని హాస్పిటల్లోకి తీసుకెళ్తే, వారిపరువుకి ఏదో భంగం కలిగినట్లు భావించేవారు. వాళ్ళు తీసుకెళ్ళేవారు కాదు. చివరికి ఒకసారి నేను ఆఫీస్‌ నుండి ఇంటికి చేరుకోగానే కబురొచ్చింది... పిలిచినా అన్నయ్య పలకడం లేదని!

మరలా యథావిధిగా పరుగు పెట్టాను. అప్పటికే అన్నయ్య గుండె ఆగిపోయింది. అంబులెన్స్‌, డాక్టర్లూ... అందర్నీ పిలిచినా వృథా ప్రయత్నమే అయ్యంది. ఏదైతేనేం... అన్నయ్యను మా నుండి దూరం చేసుకున్నాం. చివరకు వదిన ఒంటరయ్యింది. అన్నయ్య లేని జీవితాన్ని అలవాటు చేసుకోవటం మొదలుపెట్టింది. ఏదేమైనా డబ్బు కోసం కొడుకు, కోడలి మీద ఆధారపడాల్సిందే. 

వదిన పేరున కోట్ల విలువైన ఆస్తి వుంది. అన్నయ్య, వదినలకు నలుగురు సంతానం. ముగ్గురమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. అబ్బాయికి కూడా పెళ్ళయిపోయింది. ఆడపిల్లలు వాటాలడుగుతారేమోననే భయంతోనో, మరే కారణంతోనో అన్నయ్య కొడుకు... వదిన పేరనున్న ఆస్తినంతా తన పేరున రాయించేసుకున్నాడు. అదే వదిన పాలిట శాపమవుతుందని భావించి వుండదు పాపం! కొడుకు పేరునే కదా అని మరో ఆలోచన లేకుండా సంతకాలు చేసేసింది. 
అనుకోకుండా ఆ వెంటనే వదిన ఆరోగ్యం పాడయింది. మరలా షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోయాయి. తూతూమంత్రంగా ట్రీట్‌మెంట్‌ జరుగుతుందే తప్ప, సరైన చికిత్స అందలేదు. డయాబెటిక్‌ రెటినోపతి వచ్చి కంటి చూపు బాగా తగ్గిపోయింది. వదినకు ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరిపైనా ఆధారపడడం ఇష్టముండేది కాదు. తన వంట తనే చేసుకునేది. కంట్రోల్‌ లేకుండా తినేయటం వల్లే షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోయాయని, అందుకే చూపు కూడా పోయిందని తేల్చింది కోడలు. అన్నయ్యగారబ్బాయి కాదనలేదు. దాంతో వదిన దగ్గరున్న గ్యాస్‌ సిలెండర్‌ను వెనక్కి తీసేసుకున్నారు. ఫలితంగా కోడలు పెట్టిందే తప్ప అంతకు మించి తినే అవకాశం లేకుండా పోయింది. వదినది భారీ కాయం. ఏ మూలకీ రానంత తక్కువ తిండి ఆమెను బలహీనపరిచింది. దానికి తోడు ఆత్మాభిమానం చచ్చి మరింత కుంగిపోయింది. వదినని చూసి బాధపడటమే నా పనయింది.
ప్రతిరోజూ వెళ్ళినా గానీ, ఏం చెప్పినా గాని పట్టించుకునేవాళ్ళే లేకపోయారు. నేనేం తీసుకెళ్ళి పెట్టినా, తిననిచ్చేవారు కాదు. ట్రీట్‌మెంట్‌ చేయిద్దామని చెప్తే, చేయిస్తున్నాం కదా అనేవాళ్ళు. వారికి నచ్చిన మందులు ఇవ్వటమే కాని, డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్ళేవారు కాదు. నాతోపాటు ఇరుగుపొరుగు వారెవరు చెప్పినా వినిపించుకునేవారు కాదు.
వదిన మంచం పట్టింది. లేచి నిలబడే శక్తి కూడా లేకుండా పోయింది. మంచం పైనే అన్నీను. ''ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, తీసుకెళ్దాం'' ఈ సారి గట్టిగానే చెప్పాను.
''హాస్పిటల్‌ ఖర్చు ఎంతయినా నేను భరిస్తాను'' అని చెప్పాను. వారి నుండి అవునని గానీ, కాదనిగానీ ఏ సమాధానమూ లేదు. వదిన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఏం జరిగిందో తెలీదు. తిండితో పాటు, బీపీ టాబ్లెట్లు కూడా తగ్గించేశారేమో... వదిన మాట కూడా పడిపోయింది. తనకి అడిగే శక్తి లేదు. అడగాలనే ఆసక్తి వున్నా, మూగదైపోయిన నోరు ఆమెకు ఆ అవకాశం లేకుండా చేసింది. కళ్ళముందే అంతా జరుగుతున్నా, నైతిక విలువలు, కుటుంబ విలువలూ పతనమవుతున్నా... నేనూ మూగవాడ్నే అయ్యాను. నా మాటలు ఎవరూ వినిపించుకోలేదు. వదిన వేదననీ, నా ఆవేదననీ పట్టించుకునే వారే కరువయ్యారు.

ఏ కొంచెమో తిండి తినగలిగే నోరు, మింగే శక్తి కోల్పోయి, కేవలం ద్రవ పదార్థాల్ని మాత్రమే స్వీకరించే దీనస్థితికి చేరుకుంది.

ఈ సారి నోరు విప్పక తప్పలేదు. ''తల్లిదండ్రులనేవారు మనకి గొప్ప ఆస్తి. వారిని కాపాడుకోవటం మన విధి. కనీస చికిత్స చేయించకుండా వదిలేయటం దారుణం. తిండి తినలేని పరిస్థితుల్లో కూడా, మనం మెడికల్‌గా సపోర్టు ఇవ్వకపోవటం అత్యంత హేయం. ఆమెక ఖర్మకి ఆమెని వదిలేసి ఎప్పుడు చనిపోతుందా అని ఎదురు చూడటం... ఇంతకు మించిన ఘోరం ఇంకేముంటుంది? మీరు తీసుకెళ్తారా లేకుంటే నన్ను తీసుకెళ్ళమంటారా? ఏదో ఒకటి తేల్చుకోండి...'' దాదాపుగా పెద్ద గొడవే చేశాను.

మొక్కుబడిగా తీసుకెళ్ళి, ఒక్క రోజు మాత్రమే ఆసుపత్రిలో వుంచి, ఎవరికీ చెప్పకుండా వెనక్కి తీసుకొచ్చేశారు. కాని ఒక్క రోజులోనే ఆమెకి ఆరోగ్యం ఎంతో మెరుగు పడింది. ఎందుకు ఇంటికి తీసుకొచ్చారో కారణం వారికే తెలియాలి మరి! ఏదైతేనేం ఆమెను మంచానికే పరిమితం చేశారు.
రెండ్రోజుల్లోనే కోమాలోకి వెళ్ళిపోయింది. నోట్లో వేసినవి మింగటం తప్ప, చూపులేదు, మాటా లేదు. కనీసం ట్రీట్‌మెంటూ చేయించటం లేదు. దాదాపుగా పదిహేను రోజులు అలాగే గడిచిపోయాయి. తిండి లేకుండా, అనారోగ్యంతో వున్న వారెవరైనా అన్ని రోజులు ప్రాణంతో వుండగలరా? ఆరోగ్యంగా వున్నవాళ్ళు సైతం తిండి లేకపోతే ఆకలితో చచ్చిపోతారు. 
అన్నయ్య గారబ్బాయితో చెప్పాను... ''ఇప్పటికైనా డాక్టర్లకు చూపిద్దాం. కనీసం సుఖంగానైనా చచ్చిపోతుంది. ఇది కూడా హత్యే. ఇలా వదిలేయడం, తల్లి అనే దయాదాక్షిణ్యం కూడా లేకుండా తిండి లేని పరిస్థితుల్లో చంపేయటం క్రూరమైన హత్య కాకపోతే మరేమిటి?''
విన్నా విననట్లే వుండిపోయాడు. పదిహేను రోజులు ప్రాణంతో అచేతనంగా పడి వున్నా పట్టించుకోని ఆత్మీయులున్నారని తెలిసి, మర్నాడే ప్రాణం వదిలేసింది. ఏడుపాగలేదు నాకు. కళ్ళముందే నదిలో మునిగిపోతునన వ్యక్తిని కాపాడకుండా చూస్తూ వుండిపోవటం లాంటిదే ఇది.
ప్రమాదం జరిగి రక్తంతో రోడ్డంతా తడిసిపోయి, గిలగిల కొట్టుకుంటున్న ప్రాణాన్ని, ఏ ఆసుపత్రికీ తీసుకెళ్ళకుండా, ఏ సాయమూ చేయకుండా వదిలేసినట్లే అనిపిస్తోంది. నా నిస్సహాయ స్థితికి నన్ను నేనే నిందించుకున్నాను. ఈ పాపంలో ఎంతో కొంత నాక్కూడా భాగముందంటే అది అబద్దం కాదు. వదిననను ఈసారి కాపాడుకోలేకపోయాననే అపరాధ భావన నన్ను బాధిస్తోంది. గతంలో అన్నయ్య నాకు మద్దతుగా వున్నాడు. ఈసారి నాకు మద్దతిచ్చినవారే లేరు. వదిన వారికెవరికీ అక్కర్లేని ప్రాణమైపోవటం చాలా బాధగావుంది. తల్లిదండ్రులు సైతం అక్కర్లేని వారిగా, పనికిరాని వారిగా నేటి కాలంలో మారిపోతున్నారా అన్పించింది. 
వదిన కర్మకాండలు ఘనంగా జరిగాయి. మేళతాళాలతో, తప్పెడుగాళ్ళతో కోలాహలంగా సాగాయి. ఎక్కడా తక్కువ చేయలేదు. పెద్ద ఖర్మకి కూడా మరింత ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పత్రికలలో ప్రకటనలు - 'నీవు చనిపోయిననూ మా మదిలో నిలిచే వుంటావు... నీవు లేకపోయిననూ నీ జ్ఞాపకాలతో బతికేస్తాం'. 
అవాజ్యమైన ప్రేమను ఒలకబోస్తూ రాతలు... ఆమెకి కనీసం చివరి రోజుల్లో తిండి పెట్టకపోయినా, వేలాదిమందికి పెద్ద ఖర్మ రోజున విందు భోజనాలంట... ఆమె కడుపు కాలి మరణిస్తే, ఆమెకిష్టమైన కూరలూ, వంటకాలని చెప్పి వచ్చిన వారందరికీ వడ్డిస్తారట. 
ఆమె పేరున స్వయం పాక దానాలూ, నిలువెత్తు హోర్డింగులూ, బ్రాహ్మణులతో పూజలూ, గోదానం, వస్త్రదానం, ఛత్రదానం, పాదుకా దానం... ఒకటా రెండా! బతికున్నప్పుడు ఆమె బతిమిలాడినా కాశీకి తీసుకెళ్ళనివారు, కుటుంబమంతా ఆమె అస్థికలను కాశీకి తీసుకెళ్ళి గంగలో మునుగుతారంట. ఇవన్నీ చూస్తుంటే బాధగా, వింటుంటే కర్ణకఠోరంగా అన్పిస్తోంది. పూజలు జరుగుతుండగానే మధ్యలో లేచాను.
''బాబారు... ఉండండి... వెళ్ళిపోతున్నారేమిటి?'' మాటలు విన్పిస్తున్నాయి. కలకలం రేగిందక్కడ. 
మనస్సాక్షి అంగీకరించలేదు. మనిషిని బతికించడానికి పంచినా పర్వాలేదు... ఇంత క్రూరంగా చంపేశాక, ఇవన్నీ ఎవరికోసం?
వడివడిగా అక్కడ నుండి దూరంగా వచ్చేశాను.



*రచయిత - డా||ఎమ్‌.వి.జె.భువనేశ్వరరావు గారు*


చతుర్వేదాలు

ఎవరయినా వేదం నేర్చుకునేవారు చేయాలంటే మొత్తం వేదరాశిని అధ్యయనము చేయాల్సిందే.

వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది.

కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టమని ఎక్కువ మంది అంతగా ఉత్సాహము చూపించే వారు కాదు.

మొదట కలగలుపుగా ఉన్న వేదరాశి(వేదాలను)ని వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడు.

ఈ వేదరాశిని వ్యాసుడు ఋక్కులు అన్నింటిని ఋక్సంహితగాను, యజస్సులు అన్నింటిని యజుస్సంహితగాను, సామలన్నింటినీ సామసంహితగాను విడదీసి అలాగే అథర్వమంత్రాలన్నీ ఒకచోట చేర్చి అథర్వసంహితగా విభజన చేసాడు.

అలా నాలుగు వేదాలు మనకు లభించాయి.

1. ఋగ్వేదము
2. యజుర్వేదము
3. సామవేదము
4. అధర్వణవేదము

1. ఋగ్వేదము :

ఋగ్వేదః శ్వేత వర్ణస్యాత్ ద్విభుజో రాసబాననః |
అక్షమాలాదరః సౌమ్యః ప్రీతో వ్యాఖ్యా కృతో ద్యమః ||

ఋగ్వేదము తొలుత క్రీ.పూ. 1700 ప్రాంతములో ఉచ్చరించబడింది. ఋగ్వేదాన్ని దర్శించినప్పుడు ఆ వేదాన్ని ఒక రూపుతో దర్శించారు కనుక ఋగ్వేద పురుష అని వ్యవహరిస్తారు.

ఋగ్వేద పురుషుడు తెలుపు రంగులో ఉంటాడట. గాడిద ముఖం కలిగి ఉంటాడట. చేతిలో మాల ధరించి ఉంటాడట. ప్రశాంతంగా కనిపిస్తూ వేదాన్ని అందించాడట. సంహితలు ఎనిమిది ఆష్టకములుగా ఉంటుంది. ఒక్కో అష్టకం ఎనిమిది అధ్యాయాలుగా ఉంటుంది. మొత్తం 1028 సూక్తులుగా ఉంటుంది. 10552 ఋక్కులు(మంత్రాలు) ఉంటాయి. మొత్తం 397265 అక్షరాలు ఉంటాయి. ఈ మొత్తం 21 శాఖలుగా విభజించారు.

సంహితలని ఆ శిష్యుల పేర్ల రూపుతో వ్యాస, పైల, ఇంద్రప్రమాతి, మాండుకేయ, సత్య స్రవస్, సత్య హిత మరియూ సత్యశ్రీగా విభజించారు. ఒక్క సత్యశ్రీ శాఖను తీసుకుంటే అది వారి శిష్యులైన సాఖల, సాఖపూణి మరియూ భాష్కల అని మూడుగా విభాగం అయ్యింది. సాఖల మరో ఐదు భాగాలుగా, భాష్కల నాలుగు భాగాలుగా విభాగం అయ్యింది.

ఋగ్వేదంలో ఉపవేదంగా ఆయుర్వేదం ఉంటుంది. బ్రాహ్మణాలు నాలుగు భాగాలుగా, అవి పైంగ, బహ్-వ్రిచ, ఆశ్వలాయణ, గాలవ బ్రాహ్మణాలుగా విభాగం అయ్యాయి. ఆరణ్యకాలలో ఉపనిషత్తులు ఉంటాయి. అవి నిర్వాణ, ఐతరేయ, బహ్-వ్రిచ, సౌభాగ్య, కౌశీతకి, ముద్గల, నాదబిందు, త్రిపుర, ఆత్మ ప్రభోద మరియూ అక్షరమాలిక అని పది ఉపనిషత్తులుగా ఉంటాయి.

 2. యజుర్వేదము :

అజస్యపీత వర్ణస్యాత్ యజుర్వేదో అక్షసూత్ర ద్రుత్ |
వామే కులిసపాణిస్తూ భూతిదో మంగళప్రదః ||

మేక ముఖం కలిగి పసుపు రంగులో ఉంటాడు. ఎడమ చేతిలో కర్ర పట్టుకొని ఉంటాడు. సంపదలని, శుభముని ఇచ్చేలా ఉంటాడు. యజుర్వేద పురుషుడిని ఇలా దర్శించారు.

యజుర్వేదం రెండు భాగాలు ఉంటుంది.

౧. శుక్ల యజుర్వేదం
౨. కృష్ణ యజుర్వేదం.

శుక్ల యజుర్వేదం కాన్వ మరియూ మాద్యందిన అనే శాఖలుగా ఉంటుంది. కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ, మైత్రాయణి, కఠ మరియూ కపిస్తల అనే శాఖలుగా ఉంటుంది.
కాన్వ శాఖ 40 అధ్యాయాలు, 328 అనువాకాలు, 2086 మంత్రాలుగా ఉంటుంది. మాద్యందిన 40 అధ్యాయాలు, 303 అనువాకాలు, 1975 మంత్ర ఖండాలు, 3988 మంత్రాలు, 29626 పదాలు, 88875 అక్షరాలుగా ఉంటుంది. ఇంత లెక్కతో జాగ్రత్తగా బద్రపరిచారు. తైత్తిరీయ శాఖ 7 ఖాండాలు, 44 ప్రపాతకాలు, 635 అనువాకాలుగా ఉంటుంది. మైత్రాయణి శాఖ 4 ఖాండాలు, 54 ప్రపాతకాలు, 2144 మంత్రాలుగా ఉంటుంది. కఠ శాఖ 5 ఖాండాలు, 40 ఆధ్యాయాలు, 13 అనువాచకాలు, 843 అనువాకాలు మరియూ 3091 మంత్రాలుగా ఉంటుంది. బ్రహ్మణాలు చరక, కాతక, తుంబుర, జాబల, కన్కతి, స్వేతాస్వేతర, మైత్రాయణి, ఖాందికేయ, హారిద్ర, ఆహ్వరాక, ఔకేయ మరియూ చాగలేయ అనే శాఖలుగా ఉంటుంది. శుక్ల యజుర్వేద ఉపనిషత్తులు ఈసావాస్య, బృహదారణ్యక, జాబాల, సుభాల మొదలైనవి. కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులు కఠ, తైత్తిరీయ, స్వేతాస్వేతర మొదలైనవి.

 3. సామవేదము :

నీలోత్పలధలశ్యామోః సామవేదో హయాననః |
అక్షమాలాఅన్వితోదక్షే వామే కుంభదారణ స్మృతః ||

కృష్ణుడి వంటి నీలి రంగులో, గుఱ్ఱపు ముఖం కలిగి, ఒక చేతిలో కొరడా కలిగి, ఎడమ చేతిలో కుండ కలిగి ఉంటాడు. సామ వేద పురుషుడిని ఇలా దర్శించారు.

సామవేదం మొత్తం 1065 శాఖలుగా ఉంటుంది. అందులో ముఖ్యమైనవి తొమ్మిది. రాణాయణ, సాట్యాయన, సార్యముగ్ర, కల్వల, మహా కల్వల, లాంగల, కౌతుమీయ, గౌతమీయ, జైమినీయ అని ముఖ్య శాఖలు. అందులో రాణాయణ,కౌతుమీయ మరియూ జైమినీయ అనేవి మాత్రం ఉన్నాయి. మిగతా శాఖలు లభించడం లేదు.

సామవేద సంహితలు పూర్వర్చిక, ఉత్తరార్చిక మరియూ ఆరణ్యకాలుగా ఉంటుంది. పూర్వర్చిక 6 ప్రాతకాలు, 59 దషతీలు, 585 మంత్రాలుగా ఉంటుంది. ఉత్తరార్చిక 9 ప్రాతకాలు, 120 దషతీలు, 1220 మంత్రాలుగా ఉంటుంది. ఆరణ్యకాలు 55 మంత్రాలుగా ఉంటుంది.
బ్రాహ్మణాలు భాల్లవి, కాలబవి, రౌరుకి, సాట్యాయన అని నాలుగు భాగాలుగా ఉంటుంది.

ఉపనిషత్తులు చాందోగ్య, కేన, మైత్రాయణి, తల్వకారీయ మరియూ మహోపనిషత్తులుగా ఉంది.

 4. అధర్వణవేదము:

ఆధర్వణాభిదో వేదో ధవళో మర్కటాననః |
అక్షమాలాన్వితో వామే దక్షే కుంభదరః స్మృతః ||

తెలుపు రంగులో, కోతి ముఖం కలిగి, కుడి చేతిలో మాల ధరించి, కుడిచేతిలో కుండ కలిగి ఉంటాడు. ఆదర్వణ వేద పురుషుడిని ఇలా దర్శించారు.ఆదర్వణ వేదం 15 శాఖలు, 20 ఖండాలు, 736 సూక్తాలుగా ఉంటుంది. పైప్పాలద, సౌనక అనే శాఖలు మాత్రం లభిస్తున్నాయి.
శిల్పవేదం ఉపవేదంగా ఉంది.
By
Dr. Nerella Rajasekhar.
 దీనిని నేను మీకు అందించుచున్నాను.
🌷. శ్రీ శివ మహా పురాణము - 139 🌷
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
33. అధ్యాయము - 8

🌻. శబ్ద బ్రహ్మ - 4 🌻

ఏవం శబ్దమయం రూపమగుణస్య గుణాత్మనః | దృష్ట్వా తముమయా సార్ధం కృతార్ధోsభూన్మయా హరిః || 40

ఏవం దృష్ట్వా మహేశానం శబ్ద బ్రహ్మతనుం శివమ్‌ | ప్రణమ్య చ మయా విష్ణుః పునశ్చాపశ్యదూర్ధ్వతః || 41

ఓం కారప్రభవం మంత్రం కలాపంచక సంయుతమ్‌ | శుద్ధస్ఫటికం సంకాశం శుభాష్టత్రింశదక్షరమ్‌ || 42

మేధాకార మభూద్భూయస్సర్వదర్మార్ధసాధకమ్‌ | గాయత్రీ ప్రభవం మంత్రం సహితం వశ్యకారకమ్‌ || 43

చతుర్వింశతివర్ణాఢ్యం చతుష్కల మనుత్తమమ్‌ |

నేను మరియు విష్ణువు, నిర్గుణుడే అయిననూ గుణస్వరూపుడైన శివుని ఉమాసహితమైన ఈ శబ్దమయ రూపమును గాంచి కృతార్థులమైతిమి (40).

ఈ విధముగా నాదబ్రహ్మ రూపములో శివుని దర్శించి, నమస్కరించి, విష్ణువు మరియు నేను మరలపైకి చూచితిమి (41). …
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 10 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 4
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. వరాహావతార వర్ణనము - 2 🌻

వక్ష్యే పరశురామస్య చావతారం శృణు ద్విజ | ఉద్ధతాన్‌ క్షత్రియాన్‌ మత్వా భూభార హరణాయ సః. 12

అవతీర్ణో హరిః శాన్త్యై దేవవిప్రాదిపాలకః | జమదగ్నే రేణుకాయాం భార్గవః శస్త్రపారగః. 13

ఓ బ్రాహ్మణా! పరశురాముని అవతారమును గూర్చి చెప్పెదను వినుము. ఆ శ్రీమహావిష్ణువు, క్షత్రియులు ఉద్దతులుగా ఉన్నా రని తలచి, భూబారమును హరించుటకై, దేవతలను, విప్రాదులను పాలింపనున్నవాడై, శాంతిని నెలకొల్పుటకై, జమదగ్నినుండి రేణుకయందు సర్వశాస్త్రవిద్యాపారంగతు డైన భార్గవుడుగా (పరశురాముడుగా) ఆవతరించినాడు.

దత్తాత్రేయప్రసాదేన కార్తవీర్యో నృపస్త్వభూత్‌ | సహస్రబాహుః సర్వోర్యీపతిః స మృగయాం గతః. 14

కార్తవీర్యుడను రాజు దత్తత్రేయుని అనుగ్రహముచే వేయిబాహువులు కలవాడుగను, సకల భూమండలమునకును రాజుగను ఆయెను. అతడు వేటకు వెళ్లెను.

శ్రాన్తో నిన్త్రితో7రణ్య మునినా జమదగ్నినా | కామధేనుప్రభావేణ భోజితః సబలో నృపః. 15

అరణ్యములో అలసిన సేనానమేతు డైన ఆ రాజును జమదగ్ని మహర్షి నిమంత్రించి కామధేనవు ప్రభావముచేత భోజనము పెట్టెను.

అప్రార్థయత్కామధేను యదా స న దదౌ తదా | హృతవానథ రామేణ శిరశ్ఛిత్వా నిపాతితః. 16

యుద్ధే పరశునా రాజా సధేనుః స్వాశ్రమం య¸° |

కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువును తన కిమ్మని కోరెను. జమదగ్ని ఈయ నిరాకరించెను. ఆపుడాతడు దానిని అపహరించెను. పిదప పరశురాముడు యుద్దములో పరశువుచే అతని శిరస్సు ఛేదించి సంహరించి ధేనువుతో ఆశ్రమమునకు తిరిగి వెళ్లెను.

కార్తవీర్యస్య పుత్త్రెస్తు జమదగ్నిర్ని పాతితః.
రామే వనం గతే వైరాదథ రామః సమాగతః | 17

 పితరం నిహతం దృష్ట్వా పితృనాశాభిమర్షితః. 18

త్రిఃసప్తకృత్వః పృథివీం నిఃక్షత్రామకరోద్విభుః |
కురుక్షేత్రే పఞ్చకుణ్డాన్‌ కృత్వా సన్తర్ప్య వై పితౄన్‌.
కశ్యపాయ మహీం దత్వా మహేన్ద్రే పర్వతే స్థితః | 19

పరశురాముడు వనమునకు వెళ్ళి యుండగా కార్తవీర్యుని పుత్రులు పూర్వవైరమువలన జమదగ్నిని చంపిరి. అంత తిరిగి వచ్చిన ప్రభావశాలి యగు పరశురాముడు చంపబడిన తండ్రిని చూచి, తండ్రిని ఆ విధముగ చంపుటచే కోపించి, ఇరువదియొక్క పర్యాయములు పృథివిని క్షత్రియులు లేనిదానినిగాచేసి, కురుక్షేత్రమునందు ఐదు కుండములను చేసి, వాటితో పితృదేవతలను తృప్తిపరచి, భూమి నంతను కశ్యపునకు దానము చేసి, మహేంద్రపర్వతముపై నివసించెను.

కూర్మస్య చ వరాహస్య నృసింహస్య చ వామనమ్‌ |
అవతారం చ రామస్య శ్రుత్వా యాతి దివం నరః. 20

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే వరాహనృసింహాద్యవతారో నామ చతుర్థోధ్యాయః.

కూర్మ, వరాహ, నరసింహ, పరశురామావతారగథలు విన్న మానవుడు స్వర్గమునకు వెళ్లును.

అగ్ని మహా పురాణములో వరాహనృసింహాద్యవతార మనెడు చతుర్థాధ్యాయము సమాప్తము.

సశేషం......
🌹 🌹 🌹

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి