చర్యకు ప్రతిచర్య ఉంటుంది. దీనిని చట్టము అంటారు.
ఈ చట్టం విశ్వవ్యాప్తమైంది. దీనినే ధర్మము అని అంటారు.
కనుక...
ఇతరుల నుండి నీవు ఎటువంటి ప్రతిచర్య ఆశిస్తున్నా వో
దానికి సంబంధించిన చర్య మాత్రమే నీవు చేయాలి.
" ప్రతి చర్య "అని ఎందుకంటున్నానంటే మనిషి తాను చేస్తున్న పనులు ఏంటో తనకు నిజంగా తెలియదు...
తను చేసే పనులు తనకు తెలియవు కానీ తాను ఇతరుల నుండి ఏమి కోరుతున్నాడు అంటే దయ (ప్రేమ)ను దానమును(ఉచితంగా పొందడం)ను మరియు ఓర్పు (క్షమ)ను కోరుకుంటున్నాడు. కానీ మనం ఏవైతే కోరుతున్నామో
అవి ముందుగా మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి....
ఇవ్వకపోతే పొందలేవు అన్నది అద్ధము చెప్పే నగ్నసత్యం.
అద్దం ముందుకు వెళ్లి నీవు ఏదన్నా నీ ప్రతిబింబానికి ఇవ్వడానికి ప్రయత్నించు అది కూడా నీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది.
అద్దంతో నీ వ్యవహారం ఎలా ఉంటుందో అచ్చంగా ఈ లోకం కూడా అలాగే ఉంటుంది. నీ ముందు ఉన్న అద్దమే ఈ లోకం.
ఈ లోకం ఏమిటో కాదు నీకు ప్రతిబింబం. నీ చర్యను బట్టి ప్రతి చర్య లోకానిదై ఉంటుంది...
ఇస్తూ పోతావా!
నీవు పొందడం మొదలుపెడతావు. క్షమిస్తూ పోతావా నీవు కూడా క్షమించ బడతావు నవ్వులను పంచుతూ వెళతావా
నీవు నవ్వులను పొందుతావు. నీ కౌగిలింతకు ప్రతి కౌగిలి సమాధానం ఇది సత్యం....
ఇది నీ జీవన రహస్యం. అని చెప్పిన మహాత్మా గౌతమ బుద్ధుని మహత్తర వాక్యాలను స్మరిస్తూ బుద్ధ భగవానుని జీవిత చరిత్ర ఐదో భాగం లోనికి మిత్రులందరినీ స్వాగతం పలుకు తున్నాను.
నేను ఆయన చరిత్ర కన్నా ఆయన బోధనలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాను కనుక వాటిని మాత్రమే మీకు చెబుతూ వెళ్తాను...
ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి జనాలు ఇచ్చిన పేరు అంగుళీ మాల. అతనికి ఏదో ఒక సంఘటన జరిగింది. సమాజం తన పట్ల అన్యాయంగా ప్రవర్తించిందని, అతను ఒక కోపిష్టిగా
తయారయ్యాడు.
note :-యౌవ్వనంలో మనకు కు ప్రతిదీ అన్యాయం అనిపిస్తుంది. అలా అతను సమాజంపై కోపంతో,
తనతో అన్యాయంగా ప్రవర్తించిన ఈ ఊరిలోని 101 మందిని చంపి, వాళ్ళ ఒక వేలును కత్తిరించి, తన మెడ చుట్టూ ఒక దండలా వేసుకుంటానని. అతను ఒక ప్రతిజ్ఞ పూనాడు.
అతను ఆలా చేస్తూ పోయాడు. అతను ఒక అడవిలో ఉండేవాడు. కానీ, అది అనేక మార్గాల మధ్యలో ఉంది. అందువల్ల, కొన్ని సంవత్సరాలలో,అతను వంద మందిని చంపేశాడు. అయితే తన ప్రతిజ్ఞ పూర్తిచేయడానికి, ఇంకొకరు కావాలి. ఒక రోజున గౌతమ బుద్ధుడు ఆ ఊరికి వచ్చాడు. అప్పటికే, ఈ వేళ్ళను మాలగా ధరిస్తుండటం వలన, అతన్ని అంగుళీమాల అంటే - చేతి వేళ్ళను దండగా ధరించేవాడు - అని పిలిచేవారు. తన ప్రతిజ్ఞ పూరి చేసుకోవడానికి ఇంకొక చేతి వేలు కావాలి. ఇటువంటి సందర్భంలో గౌతమ బుద్ధుడు ఆ వూరికి వచ్చాడు.
గౌతమ బుద్ధుడు వచ్చాడు, ఆయన ఈ దోవనే వెళ్ళాలి. "ఆ
మార్గంలో వెళ్ళవద్దు. వాడు మనిషి కాడు, ఒక మృగం. బోధించడానికి కానీ, ధ్యాన పరుణ్ణి చేయడానికిగానీ, అతను తగిన వాడు కాదు, మీరు వెళ్ళవద్దు ఎందుకంటే అతనికి ఇంకొక ప్రాణం కావాలి. అది మీరేకావాలని మేము కోరుకోవడం
లేదు" అని ప్రజలు అన్నారు. అప్పుడు గౌతముడు "నేను వెళ్లక పొతే, ఎవరు వెళతారు. పాపం అతను కోరిక నెరవేర కుండానే ఉంటాడు. అతనికి ఇంకొక్క వేలే కదా కావాలి. నన్ను పోనివ్వండి" అంటూ ఆయన వెళ్లారు. అంగుళీమాల ఒక రాతి పైన కూర్చుని, మౌనంగా వస్తున్న సన్యాసిని చూసాడు.
ఇప్పటికే, తన పేరు ప్రఖ్యాతుల పట్ల అతనికి ఆనందంగా ఉంది. ప్రజలు అతనంటే భయ భీతులవుతున్నారు. అది అతనికి చాల ఇష్టం. ప్రజలు అతని పేరు వింటేనే వణికిపోతారు. ఆ రాతి మీద కూర్చుని, ఈ సన్యాసి ఆ విషయం
తెలుసుకోవాలన్నట్లుగా "నేను ఇక్కడ ఉన్నాను. నీ చావు మూడుతోంది రా " అంటూ గర్జించాడు. గౌతముడు అతని వైపు చూసి, తన ముఖంపై చిరునవ్వుతో మౌనంగా నడవ సాగాడు.
అది అతనికి నచ్చలేదు. సామాన్యంగా అతన్ని చూసినా, విన్నా ప్రజలు తమ ప్రాణాలు రక్షించుకోవడానికి, అస్తవ్యస్తంగా పరిగెత్తుతారు. అదంటే అతనికి ఇష్టం.
మరి, ఈ మనిషి చక్కగా నడిచి వెళుతున్నాడు.
అతను రాతి మీద నుండి దూకి, అతని ఎదుటికి
వచ్చి ఇలా అన్నాడు, "నువ్వు ఎవడివి? నేనెవరినో తెలుసా?" అంటూ తన వేళ్ళతో ఉన్న మాలను చూపించాడు. “నా గురించి నీకు తెలుసా?" అని అన్నాడు,
గౌతముడు "ఆఁ! నీ గురించి చాల విన్నాను. అయితే ఏమిటి?" అని నడుస్తూనే ఉన్నాడు . అంగుళీమాల "ఎక్కడికి పోదామను
కుంటున్నావు? నేను మాట్లాడుతుంటే, నువ్వు వెళ్తూనే ఉన్నావు?"...
దానికి గౌతముడు "నా పయనం ఎప్పుడో ఆగిపోయింది. నేను గమ్యం చేరుకున్నాను. నీవే ఎక్కడికో పోదామని ప్రయత్నిస్తున్నావు." అన్నాడు.
అప్పుడు అంగుళీమాల నవ్వి "చెత్త మాటలు. నువ్వో పిచ్చివాడవు. నేను స్థిరంగా నిలుచున్నాను. నీవేమో వెళ్తున్నానని అంటున్నావు, కానీ నువ్వు నడుస్తున్నావు, అయినా ఎక్కడికి వెళ్లడం లేదంటున్నావు. నీకేమయింది?" అన్నాడు. దానికి గౌతముడు "నేను చాలా కాలం క్రిందే
చేరుకున్నాను. నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. నీవే
ఎక్కడికో వెళ్లాలని ప్రయత్నిస్తున్నావు. కానీ, నీకు
ఎక్కడికి వెళ్లాలో తెలీదు. నీకు నా వేలు కావాలా
లేక నా మెడ కావాలా? నీ దగ్గర వేళ్ళు ఇప్పటికే ఉన్నాయి, నా తలను వెళ్ళాడ తీయి. అది నీ కంఠమాలలో మంచి పతకంగా ఉంటుంది. ఎందుకంటే నా పని పూర్తయింది, నేను చేరాను.
నేను భౌతికంగా ఇక్కడ ఉన్నా, లేకపోయినా పర్వాలేదు. నీకు కావాల్సింది చేసుకో" అన్నాడు. ఎవరినైనా చంపే ఆనందం, వారు భయ భ్రాంతులై, చావడానికి ఇష్టపడక పోతున్నప్పుడే. కాని, చావాలని నిశ్చయించుకుని, విచారించకుండా ఉంటే,
అటువంటివాడిని చంపి ప్రయోజనమేమిటి?
ఏమనిపిస్తోందంటే ఈ వ్యక్తిని చంపినప్పటికీ, 101
మందిని చంపాలన్న కోరిక తీరదు, ఎందుకంటే అది
ఆ ఆనందం ఇవ్వదు. అప్పుడు అంగుళీమాల "ఆఁగు!
నీవు ఇది ఏమిటో నాకు చెప్పు? నీవు కదుల్తున్నావు, నేను చేరాను అంటూనే నడుస్తున్నావు. నేను కదలటం లేదు కానీ
కదుల్తన్నానని అంటున్నావు" అన్నాడు. గౌతముడు,
“నీవు నీకు తెలసిన పద్ధతిలో తృప్తికై ఎదురుచూస్తున్నావు. నేను ఇప్పటికే తృప్తి పొందాను. ఇదే పెద్ద తేడా.
నీవు నా ప్రాణం తీయవచ్చు. దాని వల్ల నీకు తృప్తి వస్తుందని
నీవనుకుంటే, నువ్వు ఆ పని చెయ్యి, ఎందుకంటే
నా పని ప్రజలను తృప్తి పరచడమే. ఇతరులను తృప్తిపరచడం మే నా యొక్క ధర్మం. నాకు శ్రమ లేకుండా
కేవలం నా గొంతు కోసి నీవు తృప్తి పడగలను అని అనుకుంటున్నావు. నాకు కూడా నీవు తృప్తి చెందడం కావాలి. నేను కష్టపడి నీకు బోధ చేయాల్సిన అవసరం శ్రమ రెండు లేవు. ఇది నాకు చాలా సుఖం కూడా..
కానిచ్చేయి. సమస్య ఏముంది?" అని పరమానందంగా అన్నాడు. అతడు ఉన్నఫలంగా ఒకే ఒక క్షణం లో మారిపోయాడు.
Note: ఒక రాక్షసుడు ఉన్న ఫలంగా మారడం అంటే అతడు పొందిన బోధ సామాన్యమైనది కాదు.. దండిస్తే ఇతడు మారగలడా? మారే వాడ ?!
బుద్ధుని యొక్క అనంతమైన కరుణ ముందు అతడు తలవంచాడు. అప్పుడు అంగుళీమాల ఆయన శిష్యుడయ్యాడు. గౌతముడు "నీవు ఏ ఊరిలో వంద మందిని
చంపావో ఆ ఊరికి నీవు తప్పక వెళ్ళాలి" అన్నాడు.
దేవా ! నేను ఆ వూరికి వెళ్ళలేను. నేను వెళితే అందరూ అక్కడ భయపడి పారిపోతారు. నేను అక్కడికి వెళ్లి బోధ చేస్తే ఎవరు వింటారు. వారు నన్ను చంపుతారు. అని అన్నాడు అంగుళీమాల. ఇప్పుడు నీవు లేవు.నీవు నా స్వరూపం పొందావు. నిన్ను వారు చంపరు. ఒకవేళ వారి చేతిలో చంపబడిన అది నీకు మేలు చేస్తుంది. నేను నీ ముందుకు వచ్చాను నీవు చంపగలిగావా?!.వారు కూడా అంతే ఆలోచించకు వెళ్ళు. గౌతముడి సన్యాసులని బిక్కులు అంటారు. బిక్కులు అంటే యాచకులు అని అర్థం. అప్పుడు.
గౌతముడు అతనికి ఒక పసుపు పచ్చ గుడ్డ, భిక్ష పాత్ర ఇచ్చాడు. ఆయన "వెళ్ళు, ఊరిలో కొంత ఆహారం కోసం ప్రయత్నించు" అన్నాడు. ఒక చిన్న ఊరిలో వంద మంది చనిపోయారంటే, దాదాపు ప్రతి ఇంట్లో, ఒకరు ఇతని వల్ల చంపబడ్డారు. అంగుళీమాల ఈ ఊరికి ఒక సన్యాసిలా వచ్చాడు. ప్రజలు అది చూసి భయభీతులయ్యారు. అతను
ఏమి చేస్తాడో అని భయపడి, వారంతా మిద్దెల మీదకు వెళ్లారు.
ఎప్పుడయితే వారు ఇతను సాధువైనాడని, ముందటిలా, దుర్మార్గుడు కాదని చూశారో, అతనిపై రాళ్లు రువ్వడం మొదలు పెట్టారు. ఎందుకంటే ప్రతి కుటుంబం వీడివల్ల ఎవరో ఒకరిని కోల్పోయింది. అయినప్పటికీ అతను ఏమాత్రం బాధపడకుండా సంతోషంతోముందుకు పోతూనే ఉన్నాడు,
రాళ్లు తగిలి అతని దేహం అంతా రక్తసిక్త మయ్యింది. రాళ్లు విసరడం కొద్దిగా ఎక్కువైనప్పుడు, గౌతముడు వచ్చి వారిని ఆపి "ఇతడు ఇంతకు ముందులాంటి వాడు కాదు. వాడు లేడు చనిపోయాడు. ఈతడు నా ప్రతి రూపం. మీరు నా పై
రాళ్లు విసురుతున్నారు. వెంటనే ఆపండి. ఇతన్ని
చంపి ప్రయోజనం లేదు, ఎందుకంటే ఇతనికి అతి
కష్టమైన ఈ సమయంలో జ్ఞానోదయం అయింది. ఇప్పుడు
అతన్ని చంపడం ద్వారా, మీరు నష్టపోవద్దు" అన్నాడు. ఆ ప్రజలు అతని క్షమించారు. మహాత్ముడైన బుద్ధుని వల్ల ఒక రాక్షసుడే కాదు ఒక ఊరు కూడా ప్రేమ స్వరూపం గా మారిపోయారు...
ఆతరువాత అంగుళీమాల, ఒక ప్రసిద్ధ శిష్యుడై, బుద్ధుని జీవన శైలి, అవగాహనల గురించి దేశం నలుమూలల చాటాడు. కానీ, వారు అతన్ని అంగుళీమాల అనే పిలుస్తూ ఉండే వారు,
ప్రేమను ఇస్తే తిరిగి ప్రేమను పొందుతావు. ఇతరుల తప్పును క్షమిస్తూ పోతే నీ తప్పుల నుండి క్షమించ బడుతూ పోతావు ఏదైనా తొలి అడుగు నీదే కావాలి. అది మనదై ఉండాలి...
కథ విన్న మిత్రులందరికీ శుభ సాయంత్రం నమస్కారములు ధన్యవాదములు మీ మిత్రుడు
****
--6--
ఆకాశం ఒక గ్రహమా?!. కాదు ఏమీ కాదు.
ఆకాశం ఒక నక్షత్రమా ?!. కాదు ఏమి కాదు.
ఆకాశం ఒక మేఘమా ?! కాదు ఏమి కాదు ?!. అది శూన్యం.
కనుక అది గ్రహాలను నక్షత్రాలను అన్నింటిని తనలో చేర్చుకున్నది. అలాగే నీవు కూడా ఏదీ కాకూడదు. ఒకవేళ నీవు ఏదైనా అయితే అది గానే ఉండిపోతావు. ఆకాశం వలె నీవు శూన్యం అయితే సమస్తాన్ని నీలో కలుపుకుంటూ పోతావు.
అప్పుడు నీవు ఎవరో తెలుసా ?! నిన్ను ప్రేమ అంటారు..
ఇలా మహోన్నతమైన ప్రేమ మూర్తి బుద్ధ భగవానుని వచనాలను స్మరిస్తూ ఈ శుభోదయ వేళ మిత్రులందరినీ మహాత్మా గౌతమ్ బుద్ధ చరిత్ర 6వ భాగం లోనికి గతిస్తున్నాం.
మిత్రులందరికీ స్వాగతం...
***
బుద్ధ భగవానుడు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎంతో ప్రావీణ్యం గల ఒక జ్యోతిష్యుడు అక్కడ నదిలో స్నానానికి వచ్చి, నది ఒడ్డున ఒక కాలి గుర్తు చూశాడు.
పాదముద్రలు ఏ విధంగా ఉన్నాయో చూసి, ఆ పాదం కలిగిన వ్యక్తి ఎవరో..అతను ఏమి చేయగలడో కొందరు జ్యోతిష్యులు కచ్చితంగా చెప్పగలరు. ఇవి చక్రవర్తి పాదముద్రలు లాగా ఆయన చూశాడు, ఎవరైతే ఈ ప్రపంచాన్ని ఏల గలడో అటువంటి వాడు. అటువంటి మనిషి ఇలాంటి మారుమూల అడవిలో ఎందుకు ఉంటాడు? అని ఆశ్చర్యపోయాడు.
ఆ తరువాత, అతను ఆ పాదముద్రలు ఉన్న దిశగానే వెళ్ళాడు ఒక చక్రవర్తిని కలవబోతున్నాననే ఉద్దేశంతో.
కానీ ఆయన అక్కడి ఈ సాధువును, గౌతముడిని చెట్టు కింద కూర్చుని ఉండడం చూశాడు.
ఇది చూసి ఆయన, "ఏమిటిది. అయితే నా జాతకం అయినా తప్పి ఉండాలి లేదా నన్ను ఎవరో ఆటపట్టిస్తూ ఉండాలి లేదా నేను ఏదో భ్రమలోనో ఉండి ఉండాలి. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది?'' అని అనుకున్నాడు.
ఆయన గౌతముడి దగ్గరికి వెళ్లి, "నువ్వు ఎవరు?" అని అడిగాడు. గౌతముడు అతని వాలకాన్ని చూసి నవ్వి "నేను
ఎవరినీ కాదు. ఏమీ కాదు. కేవలం ఓ అనామకుడిని" అన్నాడు.
ఆశ్చర్యపడుతూ అతడు అన్నాడు" కాదు నీకు ఒక చక్రవర్తి పాదాలు ఉన్నాయి, నువ్వు ఈ ప్రపంచాన్ని జయించాలి" అన్నాడు. గౌతముడు"అది నేను చేస్తాను, కానీ యుద్ధం ద్వారా కాదు!" అన్నాడు.
Note:- ప్రపంచాన్ని జయించేందుకు రెండు మార్గాలు
ఉన్నాయి - ఒకటి ఆక్రమించడం ద్వారా లేదా అన్నింటిని తనలో కలుపుకోవడం ద్వారా రెండు విధానాల్లోనూ అది మీది అవుతుంది. మీరు ఆక్రమిస్తూ పోతే అది మీకు మరియు ఇతరులకు కూడా బాధ కలిగిస్తుంది. కానీ మీరు అన్నింటిని మమేకం చేసుకుంటే పోతే అది మీ జీవితాన్ని ఎంతగానో పెంపొందిస్తుంది. అప్పుడు బుద్ధుడు అన్నాడు ..
నీవు సరైన జ్యోతిష్కుడి వే నీవు చెప్పింది నిజం.
"నేను ఈ ప్రపంచానికి చక్రవర్తిని!" అన్నాడు.
దానికి జ్యోతిష్యుడు ప్రతి గా నవ్వుతూ "నువ్వు సాధువువి. ఏదీ నీది కాదు!" అన్నాడు.
"నాకు ఏదీ సొంతం కాదు. నేను ఎవరినీ
కాను. అందుకే అన్నీ నావే!" అన్నాడు బుద్ధుడు.
Dear friends....
బుద్ధుని లోని వ్యక్తిత్వం శూన్యం అయిపోయింది. శూన్యం అవడం(ఏమీ కాకపోవడం) అంటే, మీరు ఎందుకూ ఉపయోగపడరు అని కాదు అర్థం, మీరు శూన్యం అంటే మీరు అన్నింటినీ మీలో కలుపుకున్నారు అని అర్థం.
మీరు ఏదో ఒకటి అయితే, మీరు అంత మాత్రంగానే ఉండగలరు. కానీ మీరు ఏదీ కాకపోతే, అన్ని మీరై ఉంటారు.
ఇక మీ ఇష్టం ఒక వ్యక్తి గా జన్మ జన్మలుగా ఉండిపోతారా లేక శూన్యమై అనంతశక్తి గా జన్మరాహిత్యాన్ని పొందుతారా.
మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉండవచ్చు.
సరే అప్పుడు ఆ జ్యోతిష్యుడు బుద్ధుని ముందు కూర్చుని
"నువ్వు ఒక సాధువువి. నీ దగ్గర ఏదీ లేదు. కానీ నువ్వేమో 'నేను ఎవరిని కాదు, కానీ సర్వం నాదే' అంటున్నావు. ఇది ఏమిటి?" అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు ఆకాశాన్ని చూస్తూ ఇలా అన్నాడు..
ఆకాశం ఏమీ కాదు అది ఒక శూన్యం. కానీ ఆ సూన్యం లోని గ్రహాలు నక్షత్రాలు ఉల్కలు మేఘాలు సమస్త లోకాలు ఉన్నాయి. అలాగే నేను కూడా ఒక శూన్యం ఈ సమస్త ప్రాణి సమూహం నాలో ఉన్నది. అని చెప్పగానే....
ఆ జ్యోతిష్కుడు బుద్ధుని పాదాల ముందు శరణాగతి చెందాడు. బుద్ధుని ప్రేమలో మమైకం చెందాడు..
Note... వ్యక్తి ఎవరో కాదు మనస్సు యొక్క ఒక అభిప్రాయం.
ఈ అభిప్రాయమే వ్యక్తిగా ప్రాణం పోసుకుని అది నీవై జన్మ జన్మలుగా సాగుతూ ఉన్నది పిపీలికాది బ్రహ్మ పర్యంతం.
నీలోని వ్యక్తిని నీవు గుర్తిస్తే అదే క్షణంలో నీవు వ్యక్తిని కోల్పోయి...
అప్పుడు నీవు ఒక అనంతశక్తిగా ఉండిపోతావు...
పరిమితం వదలకపోతే అపరిమితం గా ఎలా ఉండగలవు ?!.
కాస్త ఆలోచించు మిత్రమా ఉంటాను మరి నీ మిత్రుడు
సశేషం......
-----------------------------
6
ఎదుటి వ్యక్తికి ప్రేమను అందుకునే అర్హత ఉందా? లేదా? అన్నదాన్ని గురించి ప్రేమ పట్టించుకోదు....
అట్లాటి దృష్టి లోభి దృష్టి. అది సరికాదు.కానీ ప్రేమ లోభి కాదు. భూమికి అర్హత ఉందా లేదా అని మేఘం పట్టించుకోదు.
అది పర్వతాల పైన రాళ్ళపైన కూడా వర్షిస్తుంది. దరమైన ఉద్యానవనాల పై అలాగే మురికి గుంటలపై కూడా తన ప్రేమను చూపుతోంది. ఎట్లాంటి నిబంధనలూ లేకుండా,
ఎటువంటి అనుబంధాలు అంటుకోకుండా, అది వర్షిస్తుంది,....
ప్రేమకూడా అలాటిదే అది కేవలం ఇస్తుంది.అది ఇవ్వడాన్ని ఆనందిస్తుంది...
నీవు కూడా ఒక మేఘం కావాలి అని చెప్పినా మహాత్ముడైన గౌతమబుద్ధుని స్మరిస్తూ...
ఆయన చరిత్ర ఆరో భాగం లోనికి ప్రవేశిస్తున్నాను.
గౌతమ బుద్ధుడి జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒక రోజు ఉదయం, ఆయన తన శిష్యుల మధ్య కూర్చుని ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. అతను రామ భక్తుడు. అతను తన జీవితం అంతా 'రామా రామా రామా' అంటూ కేవలం రామనామ జపం మాత్రమే చేస్తూ ఉన్నాడు.
అతను గుళ్లకు వెళ్లడం మాత్రమే కాదు, అతను ఎన్నో గుళ్ళను కట్టించాడు కూడా. అతను ఒక గొప్ప భక్తుడు. వయసు పైబడుతుంది, ఇప్పుడు అతనికి రాకూడని ఒక చిన్న అనుమానం తలెత్తింది. "జీవితమంతా నేను కేవలం 'రామా రామా రామా' అంటూ రామ నామ జపం చేస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుని పైన విశ్వాసం లేని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, వారుఇక్కడ కూర్చుని ప్రాపంచిక విషయాలలో
ఆనందాన్ని పొందుతున్నారు. నేను కేవలం ఇన్ని రోజులు దేవునిపేరు జపం చేయడం కోసం అన్నింటినీ విడచి
పెట్టాను. ఒకవేళ ఇతరులు చెబుతున్నట్టుగానే దేవుడే లేకపోతే, అప్పుడు నేను నా పూర్తి జీవితాన్ని వృధా చేసుకున్న వాడిని అవుతాను" అని సందేహం వచ్చింది.
అతనికి దేవుడున్నాడని తెలుసు, కానీ ఒక చిన్న సందేహం.
"ఎలాగూ, ఇక్కడ ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఉన్నాడు, అతనికి తెలిసే ఉండాలి."అని అనుకొని అతను గౌతముడి దగ్గరికి వెళ్ళాడు. ఉదయాన్నే, సూర్యోదయం కాకమునుపే, అతడు మసక చీకట్లో నుంచుని, "దేవుడు ఉన్నాడా?" అని అడిగాడు. ఈ ప్రశ్న ఎందుకు అడిగావు అన్నాడు గౌతముడు.
సత్యం ఏమిటో తెలుసుకోవాలని. అతడు చెప్పాడు. నీవు ఎన్ని రోజులనుండి దేవుని పూజిస్తున్నావు ?!.
చాలా రోజుల నుండి నా బాల్యం నుండి ఇంతవరకు పూజించాను. సమాధానం చెప్పాడు.
సరే బాగుంది దేవుడు ఉన్నాడా? లేడా ? అని నిర్ధారించు కోకుండా ఈ పని ఇంతకాలం ఎందుకు చేశావు.
విశ్వాసంతో నమ్మకంతో చేశాను.
అవును నువ్వు చెప్పింది నిజమే కనిపించే మనిషిని నమ్మనివారు కనిపించని దైవాన్ని మాత్రం నమ్ముతారు వాస్తవమే...
ఇంతకన్నా మోసం ఏముంది ?!
నీవు మోసపోయా వు , "లేడు!" అన్నాడు. మొట్టమొదటిసారిగా గౌతముడు స్పష్టంగా "దేవుడు లేడు!" అని చెప్పాడు.
అయితే దేవుడు లేడు అంటే నేను నమ్మాలా అని అడిగాడు.
నమ్మడం ఒకటే కదా నీకు తెలిసింది. మీ పెద్దలు చెప్పారు దేవుడున్నాడని..
నమ్మావు. నేను చెప్పాను లేడు అని.. నమ్ము ఇక అనుమానం దేనికి ?!...
కాదు దేవుడు ఉన్నాడు. అతను గట్టిగా అరిచాడు.
అయితే నన్ను ఎందుకు అడిగావు ఇక వెళ్ళవచ్చు నీవు.... ప్రేమతో చెప్పాడు నవ్వుతూ గౌతముడు. అక్కడ ఉన్న శిష్యులందరికీ ఆశ్చర్యం కలిగింది. ఆ రోజు సాయంత్రం మరొక వ్యక్తి వచ్చాడు. ఇతను ఒక చార్వకుడు. తమకు కనిపించేది తప్ప, మరి దేన్నీ నమ్మని పూర్తి లౌకికవాది.
చార్వాకులు అనేవాళ్ళు ఆ రోజుల్లో, అదే వృత్తిగా ఉండే వాళ్ళు. వీరిని నాస్తికులు అంటారు. వాళ్ళు ప్రజలకు ఒక
సవాలు విసిరే వాళ్ళు, "దేవుడు లేడని నేను మీకు
నిరూపిస్తాను. మీరు గనుక దేవుడు ఉన్నాడని నాకు
నిరూపిస్తే, నేను మీకు ఇంత డబ్బు ఇస్తాను, కానీ నేను దేవుడు లేడు అని నిరూపిస్తే మీరు నాకు ఇంత డబ్బు ఇవ్వాలి" అని సవాలు విసిరే వాళ్లు. ఇదే వాళ్ళ వృత్తి. అతను ఒక ప్రతిభావంతుడైన చార్వకుడు. అతను ఎటువంటి వాడు అంటే , ఒకవేళ మీరు 50 ఏళ్లుగా దేవుడిపై నమ్మకంతో
ఉండవచ్చు, కానీ మీరు అతనితో పదిహేను నిమిషాలు మాట్లాడితే, అతను మీకు దేవుడు లేడు అని నిరూపిస్తాడు.
ఇలా అతను దేవుడు లేడు అని కొన్ని వేల మందికి నిరూపించాడు. అటువంటి అతనికి ఇప్పుడు వయసు పైబడుతున్నది, ఇప్పుడు ఒక చిన్న సందేహం వచ్చింది. "ఒకవేళ దేవుడు ఉంటే? అని. దేవుడు లేడు అని అంతకాలంగా నిరూపించిన తరువాత, ఒకవేళ నేను అక్కడికి వెళితే, అతను నన్ను వదిలి పెడతాడా? ఇప్పటికే ఈ విశ్వాసులు దేవుడికి చాలా కక్ష ఉంటుంది అని చెబుతూ
ఉంటారు - అతను(దేవుడు) నన్ను విడిచి పెడతాడా?" ఒక
చిన్న భయం వచ్చింది. అతనికి కచ్చితంగా తెలుసు
దేవుడు లేడు అని, కానీ ఒక చిన్న సందేహం వచ్చింది.
అతను సాయంత్రాన సూర్యుడు అస్తమించిన తరువాత, గౌతముడి దగ్గరికి వచ్చి, మసక చీకటిలో నుంచుని, అదే ప్రశ్నను అడిగాడు, "దేవుడు ఉన్నాడా?"
గౌతముడు ఈ మనిషి వైపు చూసి, ఈ ప్రశ్న ఎందుకు అడిగావు ?!. ఒకవేళ ఉన్నాడేమో అన్న అనుమానం వచ్చి అడిగాను. అయితే బాగుంది. దేవుడు లేడు అని భావించే టప్పుడు.. ఆ విషయాన్ని సత్య మా కాదా అని నిర్ధారించు కోకుండా నీవు ఇంత కాలం ఎందుకు ఇలా వాదిస్తూ తిరుగుతున్నావు ?!
అది నా నమ్మకం నా ప్రగాఢ విశ్వాసం. దేవుడు కరుణామయుడు అంటారు కదా! ఒక జీవిని మరొక జీవికి ఆహారంగా ఎందుకు పెట్టారు చెప్పు మరి ?!
హింస తో నిండిన ఈ ప్రపంచాన్ని ఎందుకు చేశాడు చెప్పు మరి ?!.
అందుకే నేను దేవుడు లేడు అని అంటున్నాను.
ఒకవైపు దేవుడు లేడు అని నీవు అంటున్నావు. మరోపక్క అతడు హింసతో నిండిన ప్రపంచాన్ని చేశాడు అని అంటున్నావు ఇలా రెండు మాటలు ఎందుకు మాట్లాడు తున్నావ్.... సత్యము చెప్పు. దేవుడు ఉన్నాడో లేడో అర్థం కాక, నా బాధను చెబుతున్నాను....
అయితే విను "అతడు ఉన్నాడు!" అన్నాడు. కాదు నువ్వు చెప్పేది నిజం కాదు అతడు లేడు లేడు లేడు.. ఇలా చార్వాకుడు అరిచాడు...
అయితే నాతో నీకు ఏమి పని ?!
అతడు లేడో .. ఉన్నాడో అన్వేషించు శోధించు అది ఇతరుల కోసం కాదు నీ కోసం. నీవు వెళ్ళవచ్చు....
ఇక శిష్యులలో మళ్లీ అలజడి మొదలయ్యింది. ఉదయాన 'దేవుడు లేడు' అని తెలుసుకుని వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు.
సాయంత్రానికి వచ్చేసరికి అతను 'దేవుడు ఉన్నాడు'
అని అంటున్నాడు. గౌతముడు ఎందుకు ఇలా ఆడుతున్నాడు? అసలు ఏమిటీ ఆట? అతను
కేవలం గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడా?
అని శిష్యులు తమలోతాము అనుకుంటూ ఉండగా....
గౌతముడు ఇలా ప్రశాంతంగా అన్నాడు. ఇతర ప్రాణులకు లేనిది మనిషికి మాత్రమే ఉన్నది బుద్ధి. అది చాలా ప్రమాదకరమైనది. మనసు యొక్క విశ్వాసాలను అవిశ్వాసాలను అది లెక్కించదు. బుద్ధి కేవలం సత్యదర్శనం తోనే తృప్తి చెందుతుంది. అప్పుడే అది స్థితమ్ అవుతుంది.
అది ప్రేమను దర్శి స్తుంది ఎందుకంటే అది అనుభవం కనక....
అందరూ అనుకుంటున్న దేవుడు ప్రేమ తప్ప మరొకటి కాదు.
ప్రేమ ఉందా లేదా అని తర్కించ వలసిన అవసరం లేదు.
ప్రేమకై అన్వేషించాల్సిన పనిలేదు అది మీలో ఉంది.
అది పంచితే పెరుగుతుంది. తుంచి తే తరిగిపోతుంది.
ఒక మేఘం వలె కల్లాకపటం లేకుండా అంతట ప్రేమను పంచాలి...
ఇది ఒక్కటే మీరు సుఖ పడే మార్గం. కథ విన్న మిత్రులందరికీ శుభరాత్రి నమస్కారాలతో ధన్యవాదములు
***
7
తల్లిని చూసిన క్షణంలోనే బిడ్డ పరుగెత్తుకొని వచ్చి తల్లి ఒడిలో వాలింది...
ప్రియుడు వ్రాసిన ప్రేమ కవితను చదివి ప్రేయసి కన్నీరు కార్చెను ఆ కన్నీరు అమృతము తో నిండెను.
నేనున్నాను దిగులు చెందకు అన్న స్నేహితుని పిలుపు జీవితములో ఒకరిని నిలబెట్టెను. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ
నిజంగా నమస్కారానికి ఆస్కారమే లేదు. ఎందుకో తెలుసా?!.
తల్లికి బిడ్డకు మధ్య నమస్కారం ప్రవేశించదు. హత్తుకోవడం తప్ప ప్రేయసి ప్రియుని మధ్య నమస్కారం ప్రవేశించదు. కౌగిలింత తప్ప ప్రాణ స్నేహితుల మధ్య కూడా నమస్కారం ఉండదు. త్యాగం తప్ప. మరి దైవానికి భక్తునికి మధ్య లో నమస్కారం అన్నది ఎంతవరకు సత్యం ?!.
ఇది నీవు ఎప్పుడైనా ఆలోచించావా?!
అని సున్నితంగా మిత్రులను పలకరిస్తూగౌతమ బుద్ధుని చరిత్ర ఏడవ భాగం లోనికి ప్రవేశిస్తున్న. ఈ శుభ రాత్రి సమయాన మిత్రులందరికీ స్వాగతం...
ఇక్కడ నమస్కారం పెట్టాను ఏమీ అనుకోకు ప్లీజ్.....😊😊😊
ఒక రోజున, ఒక వ్యక్తి గౌతమ బుద్ధుని చూడడానికి వచ్చాడు. గౌతముడు ఏకాంతంగా ఒక చిన్న ఆవరణలో కూర్చుని ఉన్నాడు, ఆ వ్యక్తి తన రెండు చేతుల నిండా పూలను తీసుకుని వచ్చాడు, ఎందుకంటే గురువుకు అభివాదం చేసే విధానం.. అది ఒక సాంప్రదాయం. ఆ వ్యక్తి గౌతమ బుద్ధుడి వైపు వస్తూ ఉండగా, గౌతముడు అతని వైపు చూసి “పడేయి” అన్నాడు. తాను సమర్పణగా పూలను తీసుకొచ్చాడు కాబట్టి వాటిని క్రింద పడవేయమని గౌతముడు అంటున్నాడేమో అని అతను అనుకున్నాడు. అదిగాక ఒకవేళ వీటిని నేను ఎడమచేతిలో తీసుకుని వస్తున్నాను కాబట్టి, బహుశా అది అమంగళమైనదేమో అని అతను అనుకున్నాడు. ఇది కూడా మన నమ్మకాలలో ఒక భాగమే. మీరు దేన్నయినా మీ ఎడమచేతితో ఇస్తే, చాలా వరకు అందరూ దాన్ని అమంగళమైనదిగా భావిస్తారు. కాబట్టి అతను తన ఎడమ చేతిలోని పూలను పడేసి, వినయంగా ముందుకు సాగాడు.
గౌతముడు అతని వైపు చూసి మరొకసారి “పడేయి” అన్నాడు.
ఇప్పుడు అతనికి ఏం చేయాలో తెలియలేదు. ఈ పూలతో వచ్చిన తప్పేంటి? అతను మిగిలిన పూలను కూడా పడేశాడు.
అప్పుడు గౌతముడు నవ్వుతూ ఇలా అన్నాడు “నేను పడేయమన్నది, పూలను కాదు, ఈ పూలను తెచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో అతన్ని పడేయి."...
అతనికి అర్థం కాలేదు. ఈ పూలను తెచ్చింది నేనే కదా నన్ను నేను పడేసుకోవాలి అన్నమాట అని వెంటనే సాష్టాంగ పడిపోయాడు అతడు. మహాత్ముడైన గౌతముడు అతనిని వెంటనే లేపి తనవద్ద కూర్చోబెట్టుకుని సహజంగా ఉండు నేను చెప్పింది నీకు అర్థం కాలేదు జాగ్రత్త గా విను...
నీ చిన్నతనం లో నీ తల్లిదండ్రులతో నీవు ఉన్నప్పుడు వారికి నమస్కరించావా !
లేదు అని సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి. నీ చిన్ననాటి స్నేహితులతో కలసి ఆడుతున్నపుడు నీవు వారికి నమస్కరించావా!
లేదు అలాంటి ఆలోచనే రాలేదు. ఆనందంగా మనసు విప్పి మాట్లాడకోవడమే తప్ప అటువంటి ఆలోచన రాదు కదా అన్నాడు. నీవు ఎవరినైనా అమ్మాయిని ప్రేమించావా?!.
అవును ప్రేమించాను.. సమాధానం అయితే ఆ అమ్మాయి నీకు ఎప్పుడైనా నమస్కరించినదా ?!.
గౌతముడు అలా అనగానే ఆ వ్యక్తి సిగ్గుపడుతూ🥰
ఎవరైనా ప్రేయసీ ప్రేమికులు నమస్కరించుకుంటార . నమస్కరించరు కదా అని చెప్పాడు..
అప్పుడు గౌతముడు " చూశావా నీవు ప్రేమతో తిరిగిన వారందరి దగ్గర కూడా నీ నమస్కారం ఉంచలేదు.
ఇలాగే నీవు ఇక్కడ నమస్కారం ఉంచవలసిన అవసరం లేదు. నీ ప్రేమను ఉంచితే చాలు. .
నమస్కారం అన్నది నీకు నాకు అంతరం పెంచుతుంది.
ప్రేమ ప్రతిష్ట జరగదు. ఈమాటలు వినగానే ఆ వ్యక్తి కన్నుల నుండి ధారాపాతంగా కన్నీరు జాలువారింది. అతనిలోని అజ్ఞాని నిజంగా పడిపోయాడు ఒక జ్ఞాని నూతనంగా జన్మించాడు. గౌతముని పాదాలకు అప్రయత్నంగా నమస్కరించాడు. ఎందుకో ఈ సారి గౌతముడు అతని నమస్కారాన్ని స్వీకరించాడు. అతని లేపి హత్తుకున్నాడు.
కథ విన్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు...
మీకు స్వచ్ఛంగా నమస్కరిస్తున్నాను దయచేసి కాదనకండి ***
8
బాల్యంలోని నిష్కల్మష చూపులతో ప్రకాశించు వారు ధన్యులు...
అట్టి దృష్టికి శిరస్సువంచి నమస్కరిస్తూ మిత్రులందరికీ మీ శుభోదయం సమయాన స్వాగతం పలుకుతూ గౌతమబుద్ధుని చరిత్ర ఎనిమిదో భాగం లోనికి ప్రవేశిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. బుద్ధుని దగ్గర ఒక రాజకుమారుడు శిష్యుడిగా చేరాడు. అతడు కాస్త చపల చిత్తుడు అతనికి ఇంకనూ ప్రాథమిక పాఠాలు కావాలి. అందుకోసమని అతడిని బుద్ధుడు తన శిష్యురాలైన ఒక స్త్రీ వద్దకు పంపాడు.
బుద్ధుని ఆశ్రమానికి ఆయన శిష్యురాలు ఆశ్రమానికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఆశ్రమాన్ని చేరడానికి అతనికి దాదాపుగా నాలుగు గంటల ప్రయాణం పట్టింది.
సరిగ్గా మిట్టమధ్యాహ్న సమయానికి ఆశ్రమానికి చేరుకున్నాడు.
ఎండ తాపం వల్ల వళ్ళంతా చెమట పట్టింది. ఒకపక్క దాహం వేస్తుంది మరోపక్క ఆకలి వేస్తుంది కానీ స్నానం చేస్తే బాగుంటుందా! లేక ముందుగా భోజనం చేస్తే బాగుంటుందా అని అనుకుంటున్నాడు. ఇంతలో ఒక అద్భుతమైన సౌందర్యవతియైన ఒక స్త్రీ చెంబుతో నీరు తీసుకొని బయటికి వచ్చి అతడికి ఇచ్చి ముందుగా దాహం తీర్చు కోండి అని చెప్పింది. అతడు నీటిని సేవించిన తర్వాత, ఆమె మీరు మొదటగా వెళ్లి స్నానం చేయండి తర్వాత భోజనం చేస్తే బాగుంటుంది అని సూటిగా చెప్పింది. అతడు ఆశ్చర్యానికి లోనయ్యాడు ఎందుకంటే తన మనసులో ఏమని భావించాడో అవన్నీ ఆమె చాలా స్పష్టంగా చెబుతున్నది..
అతడు చాలా ఆశ్చర్యపడుతూ చుట్టుపక్కల చూస్తూ ఉన్నాడు ఎక్కడ స్నానం చేయాలని. ఆమె చెప్పింది ఇక్కడికి కాస్త దూరంలో ఒక సెలయేరు పారుతున్నది అక్కడికి వెళ్లి స్నానం చేయండి అని. అతడు ఆశ్చర్యపడుతూ సెలయేటి వద్దకు వెళ్లి స్నానం చేసి తిరిగి ఆశ్రమానికి వచ్చాడు.
అతడు ఆశ్రమానికి చేరుకునిన తర్వాత భోజనం వడ్డించింది ఆమే...
చిత్రమేమిటంటే ఆ రాజకుమారుడు ఎటువంటి భోజనం ఉంటే బాగుంటుందో అని అనుకున్నాడో సరిగ్గా అటువంటి భోజనమే ఆమె అతనికి వడ్డించింది...
అతడు ఆశ్చర్య పోవటమే అతని వంతు అవుతూ వస్తున్నది...
భోజనం చేశాడు ఇప్పుడు హాయిగా పడుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాడు. కానీ పాపం, అతడు రాజకుమారుడు కదా నేలపై పడుకోవడం కష్టం అందుకని ఏదైనా పరుపు ఉంటే బాగుంటుంది అని అతడి ఆలోచన. ఆమె శాంతంగా ప్రేమతో ఇలా చెప్పింది మన శరీరమే మనకు పానుపు వేరే పానుపు అక్కర్లేదు...
సన్యాసిగా దీక్ష తీసుకున్నప్పుడే దీనికి మనం సిద్ధపడాలి. అని ఆమె పలుకగానే అతడు మరింత ఆశ్చర్యంతో అలాగే ఉండి పోయాడు కొంత సేపు. అతడు పడుకున్నాడు కానీ నిద్ర పట్టలేదు. అంతయు తనకు ఆశ్చర్యం గా ఉంది ఒక గంట అటూ ఇటూ దొర్లుతూ ఇక అక్కడ ఉండలేక వెంటనే బుద్ధుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. హడావుడిగా ఆశ్రమం వైపు వస్తున్న రాజకుమారుని చూశాడు బుద్ధుడు. ఆ శిష్యుడు బుద్ధుని చెంతకు వచ్చి పాదాలకు ప్రణమిల్లాడు. మహాత్మ! మిమ్మలని వేడుకుంటున్నాను దయచేసి నన్ను అక్కడికి పంపించవద్దు అండి మీకు పుణ్యం ఉంటుంది అని ప్రాధేయపడ్డాడు.
నీకు ఏ బాధ కలిగింది అని ప్రశ్నించాడు బుద్ధుడు. శిష్యుడు నమస్కరిస్తూ ప్రభు! నా మనసులోని ప్రతిదీ ఆమెకు తెలిసిపోతున్నది అందువల్ల నేను భయపడుతున్నాను.
ఆమె సౌందర్యాన్ని చూసి నాలో కామం ప్రవృత్తి ప్రకోపిస్తున్నది. ఈ విషయం ఆమెకు తెలిసిపోతుంది అన్న భయంతో ఆవిడకు చెప్పకుండా నేను మీ చెంతకు వచ్చాను అని తన క్షమాపణలు చెప్పాడు...
అప్పుడు బుద్ధుడు నవ్వుతూ ఇలా చెప్పాడు. rajakumara మన లో నిత్యం మెలుకువ లో ఒక సాక్షి ఉంటుంది. అది సర్వం చూస్తూ ఉంటుంది అంత కూడా. అది మన సహజ స్థితి. ఆ స్థితికి వెళ్లిన వారు ఎవరైనా సరే సర్వజీవుల హృదయాల లోని భావాలు తెలుసుకోగలరు. ఆ సాక్షిని గురువు అని అంటారు.
కనుక మనం చేసే పనులు జాగ్రత్తగా పవిత్రంగా చేయాలి ఎందుకంటే మనల్ని ఒక సాక్షి చూస్తూ ఉన్నది. ఆ సాక్షి ఏ మన మూల స్వరూపం. అలా సాక్షిగా మన స్థానాన్ని చేరడమే ఈ జన్మకు సాఫల్యత. అని చెప్పగానే ఆ రాజకుమారుడు ఎంతో ఆశ్చర్యంతో ఇలా నివేదించాడు. సాక్షి అంటే ఏమిటి ప్రభు.?!
అది స్వయం జ్యోతి. శక్తి స్వరూపం.. మీ యొక్క నా యొక్క ఆ శ్రీ మూర్తి యొక్క సకల జీవ రాశుల యొక్క మూల స్థితి అదే... నీవు దేని నుండి అయినా తప్పించుకోవచ్చు కానీ ఒక్క సాక్షి స్థితి నుండి నీవు తప్పించుకోలేవు అది నీ మూలం అది నీకు ఆధారం. నాయనా! శ్రద్ధగా నన్ను.. నా మాటలపై ధ్యాస ఉంచు. ముందు నీవు పసి బాలుడిగా ఉంటివి.. అప్పుడు నిష్కల్మషంగా ఆహ్లాదకరంగా ఆడుతూ పాడుతూ ఉన్నావు. ఆ తర్వాత బాలుడు వెళ్ళాడు యువకుడు వచ్చాడు. నీవు ఆ బాలునితో ఉన్నావు అప్పుడు. కానీ ఇప్పుడు యువకునితో ఉన్నావు. బాలుని లో లేని కోరికలు యువకుని లో పుట్టాయి.... కొంతకాలం అవి ఉంటాయి అటు తర్వాత యువకుడు వెళ్ళిపోతాడు వృద్ధుడు వస్తాడు...
కానీ నీవు వెళ్ళవు స్థిరం గా ఉంటావు నీవు చూస్తూనే ఉంటావు.
ఇప్పుడు వృద్ధుడు కూడా వెళ్ళిపోతాడు నీ జ్ఞాపకం ఆగి పోతుంది మళ్ళీ బాలుడు వస్తాడు. బాలుడు వచ్చాడు పోయాడు యువకుడు వచ్చాడు పోయాడు వృద్ధుడు కూడా వచ్చి పోతున్నాడు కానీ నీవు ఎక్కడికి వెళ్లక స్థిరంగా వీరిని చూస్తూనే ఉన్నావు. ఇప్పుడు అర్థమైందా నీవు ఎవరో....
కానీ నీవు మఱుపు కు లోనై నేను బాలుని అంటున్నావు నేను యువకుని అంటున్నావు నేను వృద్ధుడను అని అంటావు రేపొద్దున. కానీ ఈ మూడు అవస్థలు వచ్చిపోతూ ఉంటాయి కానీ నీవు మాత్రం స్థిరంగా వీటిని చూస్తూ ఉంటావు. అది నీ మూల స్వరూపం. ఈ బోధ వినగానే అతడు సాక్షి కి ఉప లబ్దము యై నాడు....
అలాగే నిశ్చలంగా నిలబడి పోయాడు. ఇంతవరకు ఉన్న రకరకాల ముసుగులు తొలిగిపోయాయి. ఇప్పుడు అతనికి అసలు ముఖం తెలిసివచ్చింది అనుభవమైంది....
కొంతసేపటి తర్వాత కన్నులు తెరిచాడు బుద్ధుని పాదాల పై తన శిరస్సు వాలివుంది. ప్రేమమూర్తి యైనా బుద్ధుడు తన బిడ్డ యొక్క శిరస్సును దువ్వుతూఇలా చెప్పాడు.
తండ్రి! ఈ లోకంలో ఒక వస్తువుకు ఒక్క ఉపయోగం ఉంది ఆ ఉపయోగం కోసమే ఆ వస్తువులు కల్పించబడ్డాయి.
ఏ స్త్రీ శరీరము నిను ఆకర్షించినదో ఆ స్త్రీ శరీరం యొక్క భాగాలను ఉన్న వాటిని సహజంగా అర్థం చేసుకో.
స్త్రీ పాలిండ్లు కేవలం బిడ్డలకు పాలివ్వడానికే ఉద్భవించాయి ఇది సత్యం.
ఆ స్థన ద్వయానికి నమస్కరించు. ఎందుకంటే మనకు చిన్నప్పుడు ఆహారం ఇచ్చి పోషించాయి కనుక..
లోతైన నాభి నిను ఆకర్షించిన దాతల్లిగర్భమున నీ ఉన్నప్పుడు ఈ నాభియే నీకు ఆహారాన్ని అందించింది.
ఒక్క నమస్కారం చెయ్.సన్నటి నడుము నిన్ను ఆకర్షించిందా...
బిడ్డల కోసం సేవలు చేసే శ్రమకు గుర్తుగా ఉన్న దానికి గుర్తుగా ఆ సన్నని నడుము నిలిచింది...
ఆ అన్యమైన సేవకు నమస్కరించు. స్త్రీ యొక్క మర్మాంగం నిను ఆకర్షించిందా!
ఆ యోనియే సమస్త జీవరాసులకు ఈ లోకపు ద్వారము... నిష్కల్మష భావంతో నమస్కరించు
అయినను మనం కోరుకోని ఈ జన్మను ఎత్తలేదు. నీవు కోరుకుని పురుషుడుగా పుట్టలేదు ఒకవేళ ఆ బ్రహ్మ అనుకుంటే స్త్రీ గా కూడా పుట్టే వాడివి...
ఇదొక వేషం. అంతే.....
ఆహారం తో తయారుచేయబడిన ఈ శరీరం కొంత సమయం ఉండి ఆ తర్వాత పాచిపోతుంది . సత్య దృష్టి తో ఉన్న దానిని ఉన్నట్టు చూస్తే మోహం అన్నది ఎప్పుడూ మనల్ని దరిచేరదు....
అద్భుతమైన ఈ బోధ వింటూ ఆ రాజకుమారుడు ఇప్పుడు అతడు ఏ వస్తువును ఆ వస్తువు లాగే చూస్తున్నాడు...సమాధి పొందాడు.ఆయనకు సత్య దర్శనం జరిగింది.
****
9
ఇది నీకు తెలుసా మీరు అనంతం కానీ అజ్ఞానం వల్ల మీరు గుర్తింపు కావాలని అనుకుంటున్నారు. కానీ అది ఎలా సాధ్యం.
గుర్తింపు అనేది మిమ్మల్ని పరిమితం చేస్తుంది. ఈ అజ్ఞానం యొక్క ఆనందం ఏమిటి? కనీసం ఒక్కసారైనా ఆలోచించారా. ... అని పలికిన మహాత్మ గౌతమబుద్ధుని జ్ఞాన వచనాలను స్మరిస్తూ ఈ శుభ రాత్రి సమయాన ఆ మహానుభావుని చరిత్ర 9వ భాగం లోనికి ప్రవేశిస్తున్నాను...🌼🌼🙏
మనం మరీ ఎక్కువగా మనసుకు అతుక్కుపోయి వుంటాం.
అది చాలా అల్పమయింది. మనం మరీ శరీరానికి అతుక్కుపోయి వుంటాం. మరీ ఎక్కువగా దాని గుండా గుర్తింప బడతాం. ఇది కేవలం సామాన్యుల పరిస్థితి. కానీ జ్ఞాన మార్గంలో ఉండే వారికి సాధనసంపత్తి ఉన్నవారికి ఇది ఒక పెద్ద అవరోధం...
మనం ధ్యానం చేస్తాం కానీ ధ్యానం యొక్క పరమార్థం ఏమిటి!. అంటే ఏదో ఉన్నతమైన దానిని పొందాలి అన్నది దాని సారాంశం....
కానీ ఇందులో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే తాను ఉన్న స్థితిని ముందుగా వదలాలి. ఎందుకంటే ఇది పరిమితం కనుక. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ చిత్రాతి చిత్రం ఏమిటంటే మనం కోరుకునేది ఏమో అనంతం కానీ గట్టిగా పట్టుకున్నది మాత్రం పరిమితం. ఇది సాధ్యమేనా మీరే చెప్పండి. కనుక అది సాధ్యం కావాలంటే ముందుగా పరిమితమును వదలాలి..
కానీ మనం అలా చేయడం లేదు. ఉన్న ఈ పరిమితికి గొప్ప గుర్తింపు ఇవ్వాలి గుర్తింపు కావాలి అని తహతహ పడుతూ ఉంటాం. పరిమితం అంటే ఏమిటి ?!.
మనం కలిగిన పేరు. మనం పుట్టిన కులం. మనం అనుసరిస్తున్న సాంప్రదాయం. మనం ఉంటున్న దేశం.
ఫలానా వాడు ఇంత గొప్పవాడు రా అని అనుకోవాలి.
ఫలానా వాడు ఇంత గొప్ప అధికారి రా అని గుర్తించాలి.
వాడు అత్యంత పవర్ఫుల్ అని అందరికీ తెలియాలి.
వాడిని చూస్తే అందరు భయపడాలి. వాడిని మహాజ్ఞాని గా గుర్తించాలి. వాడు మహా గురువుగా గౌరవించ బడాలి.
ఇదంతా వ్యక్తిగతమైన కీర్తి వ్యక్తిగతమైన ప్రతిష్ట వ్యక్తిగతమైన పరిమితం ఈ పరిమితాన్ని వదలకుండా అనంతంగా వ్యాప్తి చెందాలి. ఇది సాధ్యమేనా ?!.
అహంకారపు గదిలో బంధించబడి సమస్త విశ్వము నేను అని అనుకుంటే ఎలా ?!
గదిని వదిలితే గగనాన్ని చేరగలం లేకుంటే గదిలోనే మగ్గి పోతాము. నిజం గా ధ్యానం యొక్క పరమావధి ఏమిటో తెలుసా ?!
అది నిన్ను మహోన్నతమైన సాక్షిగా నిలబెట్టడమే అది స్వయం అది తేజోమయం అది అనంతం అది అవధి లేని ఆకాశం. పరిమితమైన ఈ వ్యక్తిగత గుర్తింపు లేకపోవడం. అనంతం యొక్క లక్షణం అది. కేవలం నేను చైతన్యం మాత్రమే అని గుర్తించడం. నేను సాక్షిని అన్న విషయం గుర్తుంచుకోవాలి.....
లేకపోవడమే నిజమైన వుండడం.నువ్వు అహంగా మాయ మయిన క్షణం విశాలమవు తావు. అల గా నీ గుర్తింపును వదులుకున్న రోజున సముద్రానుభావానికి పొందుతావు.
సరిహద్దులు లేని సంతోషాన్ని అందుకుంటావు.దురదృష్ట మేమిటంటే మనం మరీ ఎక్కువగా మనసుకు అతుక్కుపోయి వుంటాం. అది చాలా అల్పమయింది. మనం మరీ శరీరానికి అతుక్కుపోయి వుంటాం. మరీ ఎక్కువగా దాని గుండా గుర్తింపబడతాం. అలా గుర్తించడానికి ఇష్టపడతాం. ఇది అజ్ఞానపు ఆనందం. మనము గా ఉన్న ఈ మనసు కేవలం ఒక యంత్రం ఒక సాఫ్ట్వేర్ సూక్ష్మ యంత్రమయిన మనసునీ వుపయోగించు. కానీ యంత్రానికి లొంగకు. డ్రైవరు కారు నడుపుతాడు. కార్లో వుంటాడు. కానీ కారు కాడుకదా!
మనకు సంబంధించిన వ్యవహారం కూడా అలాంటిదే. మనముంటున్న యంత్రం ద్వారా మనం గుర్తింపు పొందుతున్నాం. ఈ రకమైన గుర్తింపు అహాన్ని యిస్తుంది.
నేను శరీరం, నేను మనసు, నేను క్రిష్టియన్ని, నేను మహమ్మదీయుడను నేను హిందువుని, తెల్లవాణ్ణి, నల్లవాణ్ణి, నేను అది, నేను యిది! ఇవన్నీ కేవలం గుర్తింపులు.
ధ్యానమంటే గుర్తింపు లేకపోవడం. కేవలం. నేను చైతన్యం మాత్రమే. , మెలకువని, సాక్షిని, అన్న విషయం గుర్తుంచు కోవాలి. ఎందుకంటే వాస్తవంగా సత్యంగా అది నీవే కనుక...
ఆ సాక్షిగా వుండడంలో అహం అదృశ్యమవుతుంది.
ఎప్పుడైతే అహం అదృశ్యం అవుతుందో గొప్ప విప్లవాత్మకమైన మార్పు జరుగుతుంది.
నువ్వు అల్పమయిన, చిన్ని ప్రపంచం నించీ విశాలమైన, సౌందర్యభరితమైన వైశాల్యంలోకి, కాలం నించి శాశ్వతత్వంలోకి మరణం నించీ మరణ రాహిత్యానికి సాగుతావు......
అని నా మిత్రులందరికీ నివేదన చేస్తూ ఇది నా గురువు నాకు చెప్పిన బోధగా మీకు పరిచయం చేస్తూ మహాత్ముని కథలోనికి ప్రవేశిస్తున్నాను.
మహాత్మా బుద్ధుని ప్రముఖమైన శిష్యులలో ఆనందుడు ఒకడు.
బంధుత్వం రీత్యా, ఆనందుడు బుద్ధుడికి సోదరుడు
అ వుతాడు.
బుద్ధుడు ప్రజలకు సన్యాస దీక్ష ఇస్తున్న ఆ సమయంలో ఆనందుడు వచ్చి, “నేను కూడా సన్యాసి అవుతాను..
కానీ ...
నేను నీ శిష్యుడిని అవ్వాలి అంటే నాది ఒక షరతు, నువ్వు దానికి ఒప్పుకుని తీరాలి, ఎందుకంటే వరుసకు, నేను నీకు అన్నని. అయినా కూడా నేను నీ శిష్యుణ్ణి అవుతాను. నీవు నీ శిష్యుల లాగా నన్ను చూడకూడదు కానీ నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నువ్వు నన్ను ఎప్పుడూ ఏ పనికీ పంప కూడదు. నేను ఎప్పుడూ నీ నీడలా వెన్నంటి ఉంటాను.".. ఆనందుడు ఇలా చెప్పగానే గౌతముడు అతని వంక చూసి నవ్వుతూ “అది నీ ఇష్టం, నాకు ఏ సమస్య లేదు” అన్నాడు. నిజంగా అహంకారపు గుర్తులు జ్ఞానికి అవసరం ఏముంది?! ఇతరులకు ఉంటే ఆయనకు నష్టం ఏముంది?!
Not this point my dear friends
➖➖➖➖➖➖➖➖➖➖➖
మనం ఒక గురువు వద్ద విద్యను అభ్యసించే టప్పుడు...
శిష్యుడిగా ఉండడానికి సిద్ధమైనప్పుడు... మన అంతరంలో షరతులు ఉండకూడదు... అప్పుడు శిష్యుడుగా ఉండటంలోని మాధుర్యం ఏమిటో మనకు ఎప్పటికీ తెలియదు. ఒకవేళ గురువు మన కన్నా వయసులో చిన్నవాడైనప్పటికి కూడా తప్పక ఆ పదవిని గౌరవించి తీరాలి. అప్పుడే మనకు విద్య అనేది అబ్బుతుంది.
ఒకవేళ మనం లోపల నేను ప్రత్యేకిని అన్న అహంకారం ఉంచుకుంటే పొందాల్సిన ఉపయోగాలన్ని కూడా వృధా అయిపోతాయి. విద్య అనేది చేతికి రాదు.
సరే ఫ్రెండ్స్ ఆనందుడు పెట్టిన కండిషన్ కి గౌతముడు నవ్వి “సరే” అన్నాడు. శిష్యుడు ఈ షరతు పెట్టినప్పుడు గౌతముడు దాన్ని పాటించాడు, అతనికి ఏ సమస్యా లేదు. ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ పొందవలసిన లాభాన్ని ఆనంద్ కోల్పోయాడు.ఒకసారి గౌతముడు తన భార్యను చూడాలనుకున్నాడు, అతను ఆమెను దాదాపు 8 ఏళ్లకు పైగా చూడనేలేదు. తన కుమారుడు పసివాడుగా ఉన్నప్పుడు అతను అర్ధరాత్రి వదిలేసి వెళ్లిపోయాడు. యశోద చాలా అభిమానవతి. ఒక యశోధర మాత్రమే కాదు సహజంగా స్త్రీలు అభిమానవంతులు. గౌతముడు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా, అర్ధరాత్రి అతను వదిలి వెళ్ళిపోయాడని ఆమె చాలా బాధపడింది.
అతను తన రాజ్యాన్ని, తన కుమారుడిని, తన భార్యను వదిలేసి, వారితో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్లిపోయాడు.
ఇప్పుడు ఎనిమిదేళ్ల గడిచాయి. ఇంత కాలం తర్వాత అతను ఆమెను చూడాలని అనుకున్నాడు, ఎందుకంటే తాను అనుభూతి చెందిన ఈ సంభావ్యతను ఈ ఉన్నత స్థితిని ఆమెకు కూడా అందించాలని అనుకున్నాడు. ఎందుకు అలా అనుకున్నాడు అంటే ఆయన ప్రేమ మూర్తి. ఏ గొప్ప ప్రయోజనాన్ని ఆయన పొందాడో అది తనను ప్రేమించే వారికి ఇస్తున్నాడు. తన సంఘ పరివారంతో అక్కడికి వెళ్ళాడు.
ఇంతకాలానికి తనను చూడటానికి వచ్చిన భర్త అయినా గౌతముని చూసి యశోధర కోపంతో రగిలిపోయింది, రకరకాల శాపనార్థాలు పెట్టింది, అతనిపై కేకలేసింది, అతన్ని పిరికివాడు అని తిట్టింది. తిట్టదా మరి భార్యను కన్న కొడుకును నిష్కారణంగా వదిలేస్తే ఎందుకు తిట్టదు ?!.
ఒక సాటి గృహినికి ఏం తెలుస్తుంది యోగం జ్ఞానము ఇవన్నీ వారికి అక్కర్లేదు. ధర్మబద్ధంగా తాళికట్టి చేపట్టిన అర్థాంగిని వదిలేయకూడదు అన్నది వారికి తెలిసిన ధర్మం.
అందువల్ల ఆవిడ గౌతముని ఏమేమి అనాల్నో అవన్నీ అనేసింది...
కానీ గౌతముడు పరమ సాక్షి ఆయన పరిమితం కాదు అనంతం. పరిస్థితి ఎలా ఉంటుందో గౌతమునికి మాత్రం తెలియదా ?!అందుకు అతడు సిద్ధపడే అక్కడికి వెళ్ళాడు..
ఆమె పెట్టిన శాపనార్థాలు అన్నీ అతను విన్నాడు. అన్ని నూ
మౌనంగా విన్నాడు. అప్పుడు అతను ఆమెతో, “నిన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇప్పుడు లేడు, అతను పోయాడు, కానీ ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు.,
ఇప్పుడు ఇతడు జ్ఞానోదయం పొందిన వ్యక్తి. ఒకవేళ నీ భర్త వల్ల సాధ్యమైనది మహా అయితే ఇంకొంతమంది పిల్లలు.
కానీ ఇప్పుడున్న ఈ వ్యక్తి వల్ల మహత్తరమైనది జరగగలదు. ఈ వ్యక్తి పూర్తిగా భిన్నమైన వాడు. దయచేసి ఇటు వైపు చూడు, ఈ వ్యక్తి ఆ వ్యక్తి కాదు.” అన్నాడు.
అప్పుడు ఆమె “అదేం కాదు, నువ్వు నా భర్తవి!” అంది. ఇంతకన్నా ఆమెకు గౌతముని గురించి ఏమి తెలుసు. వారు కేవలం గుర్తించడమే తెలుసు పరిమితము చూడడమే తెలుసు.
గౌతముడు అన్న ఆ జ్ఞాన వచనాలు ఆమె అర్థం చేసుకోలేదు...
నువ్వు పిరికి వాడివి. ఈ పసివాడిని వదిలిపెట్టి వెళ్లిపోయావు. వాడికి కనీసం తన తండ్రి ఎవరో కూడా తెలీదు. నువ్వు పారిపోయావు” అంది. ఇంకా ఎన్నో అంది. ఆమె అనాలను కున్నవన్నీ అంది. గౌతముడు చాలా ప్రేమగా ఇలా అంటున్నాడు “పరవాలేదు!” ఇవన్నీ వినడానికి అతడు లేడుఅన్నాడు. అప్పుడు యశోద కోపంతో, “నీ కొడుకుకి నువ్వు ఇచ్చేది ఏమిటి?” అని అడిగింది. ఆమె తన కుమారున్ని తీసుకువచ్చి, “అతను నీకు ఏమిస్తాడో నీ తండ్రిని అడుగు” అంది. గౌతముడు సిద్ధమయ్యే వచ్చాడు.
అతడు ఆనందుడితో “దయచేసి నా భిక్ష పాత్రను తీసుకురా” అన్నాడు. అతను భిక్ష పాత్రను తీసుకువచ్చాడు.
అతను తన కుమారుడిని పిలిచి, “నువ్వు ఒక రాజుగా బాధ పడటాన్ని నేను కోరుకోవడం లేదు, అందుకే నీకు పరమోత్తమ స్వేచ్ఛను ఇస్తున్నాను. నా వారసత్వం ఈ భిక్షపాత్ర” అన్నాడు.
అతను తన బిక్ష పాత్రను తన ఎనిమిదేళ్ళ కుమారుడికి ఇచ్చాడు, ఇక ఆ కుమారుడు ఒక సన్యాసి అయ్యాడు.
గౌతముడు తన మరణశయ్య మీద ఉన్నప్పుడు,
కేవలం జ్ఞానోదయం పొందిన శిష్యులు మాత్రమే లోపల ఉన్నారు. వారికి మాత్రమే గౌతముడు అవకాశం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు ఎవరు ఆయన సమీపానికి రాలేకపోయారు అందుకు అతడు ఒప్పుకోలేదు. ఎందుకు ?!
ఎందుకంటే తను చెప్పేది జ్ఞానం తెలిసిన శిష్యులకు మాత్రమే అర్థం అవుతుంది. మిగతా వారు బయటే ఉంచ బడ్డారు. ఆనందుడు తనకు కలుగ గల గొప్ప స్థితిని కేవలం ఒక్క షరతు మూలంగా నాశనం చేసుకున్నాడు. అతను దాన్ని పూర్తిగా చేజార్చుకున్నాడు. ఆనందుడు “నేను అతనితో ఎంతో సన్నిహితంగా ఉన్నాను, కానీ నేను బయటి వారిలో ఉన్నాను. ఎందుకు నాకు జ్ఞానోదయం కాలేదు?” అని ఏడ్చాడు. ప్రజలు ఇదే ప్రశ్నను గౌతముడిని అడిగినప్పుడు,
గౌతముడు అన్నాడు “ఒక గరిటె, ఎన్ని వంట పాత్రల్లో తిరిగినా రుచిని ఎలా చూడ గలుగుతుంది? దానికి తెలిసింది కొలతలు మాత్రమే రుచి తెలియదు ఆనందుడు అంతే” అన్నాడు. ఒక గరిటె వంట రుచిని చూడాలి అంటే, దానికి నాలికకు ఉండే ఇంద్రియ జ్ఞానం ఉండాలి.
అలాగే శిష్యుడు కూడా తన అజ్ఞానాన్ని వదల లేక ఒక పాత్రకు పరిమితమై ఉంటే గురువు చెప్పిన అహంకార రాహిత్యం అతనికి ఎలా తెలుస్తుంది ?!. పరిమితాన్ని వదలలేని వాడు అనంతానికి పయనం ఎలా చేయగలుగుతాడు.
శిష్యుడు, నన్ను గౌరవించాలి నాకు గుర్తింపు ఇవ్వాలి అని షరతు పెట్టిన మరుక్షణమే గొప్ప యోగాన్ని కోల్పోయాడు..
అతను ఒక వస్తువుగా కుచించుకుపోతాడు. తాను అలా అవడమే కాదు అందులో భాగంగా గురువు యొక్క విశాలతను కూడా తగ్గించాలని ప్రయత్నిస్తారు. కానీ అది మీరు పొందాలనుకున్న జ్ఞానాన్ని మీకు చాలా దూరంగా ఉంచుతుంది..
ఆనందుడి విషయంలో అదొక దురదృష్టకరమైన విషయం..
అనంతుడైన ఆ పరమాత్మ దయ వలన మనలో పరిమి తత్వపు చాయలు తొలుగు గాక అని సంకల్పం చేస్తూ మిత్రులందరికీ కథ విన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ శుభరాత్రి మీ మిత్రుడు
****