ఈరోజు కధలు (3) మరియు కవితలు
నేటి శ్లోక సూక్తి
శ్రేయో హి జ్ఞాన మభ్యసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే!
ధ్యానాత్ కర్మ ఫలత్యాగ: త్యాగాత్ శాంతి రనంతరం!!
తా:
అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్ఠమయినది, జ్ఞానముకంటె ధ్యానము శ్రేష్టమైనది,
ధ్యానము కంటే కర్మ ఫలత్యాగము శ్రేష్టమైనది, ఆకర్మఫల త్యాగము వలన గొప్ప
శాంతి లభించును.
_*🌅గురుభక్తి 🌅*_
_*గురువు* అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం.._
_*"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః*_
_*గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"*_
_అయితే ఈ శ్లోకం ఎందులోది ?_
_ఏ సందర్భంలోది ? ఎవరు వ్రాశారు ? వంటి సందేహాలు ఎవరికయినా ఎప్పుడయినా వచ్చాయా ? నాకొచ్చాయిగా ! అందుకే ఈ టపా._
_ఈ
శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ ఉంది. ఈ కథ ఇంతకుముందు తెలిసినవారు
మళ్ళీ చదివేయండి, తెలియని వాళ్ళు శ్రద్ధగా చదవండి (ప్రశ్నలేమీ
అడగనులెండి)._
_కొనేళ్ళ
క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు
ఉండేవారు ఆయన పేరు వేద ధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య
శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం
పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ
ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ,
విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు
ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి)
ముగించుకుని గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు._
_అలా
కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒక సారి గురువుగారు ఏదో
పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు.
ఆయన తిరిగివచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యధావిధిగా జరుగుతుండటం
చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు._
_ఇదిలా
ఉండగా, స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న
అనుబంధాన్ని చెప్పుకుని, ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో
తమ తమ ఇళ్ళకు వెళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు, తల్లి దండ్రులు
ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని
తల్లిదండ్రులు వెళిపోతారు._
_గురువుగారు
ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్లకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు
కౌత్సుడు బోరున విలపిస్తూ "గురువుగారూ! మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు
నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను, ఈ కార్తీక మాసం (పదిహేను
రోజుల్లో) నుండి తమకి దారుణమయిన కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి
చెబుతోంది. నాకు చదువు నేర్పించి, తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమయిన కాలంలో
వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన
తరువాతే వెళతాను, అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను" అంటాడు. అది విన్న
గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద
భాష్పాలు రాలుస్తారు._
_కౌత్సుడు
మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువు గారితో ఫలానా
జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి
గురువుగారు "ప్రారబ్ధం భోగతో నస్యేత్" అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది
ఎప్పుడయినా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని
అవుతున్నాను అన్న ఆనందముతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు._
_అప్పుడు
గురువుగారి మాటను కాదనలేక, కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు
ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడకి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాం
తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడకి
ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తరువాత అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరీ
మంత్ర జపం చేయించటం, చేతనయినంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం, ఇలా
ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సుడు._
_మిట్టమధ్యాహ్నం
కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని (భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే
తినేవారు అప్పట్లో) తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి, తను
తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక, తినని తిననీయక అన్నాన్ని
విసిరేసేవారు. చీటికీ మాటికీ కౌత్సుడిని కొట్టడం, తిట్టడం చేయటం,
చీదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా
గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని
ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు.
కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం
వేసుకున్నారు, "మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్దనుండి
పంపుతారో వారే మనలో గొప్పవారు" అని._
_ఇక్కడ
మనం గమనించాల్సిన ముఖ్య విషయం, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం
దేవుళ్ళ లక్ష్యం కాదు, కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని
చేరుకున్నాడు అని._
_సరే,
అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారు వేషంలో వచ్చి "నువ్వు కాశీ
వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను, ఎందుకాయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు,
పెద్ద వాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో"
అంటాడు. దానికి కౌత్సుడు "గురువుని, అదీ ఇటువంటి పరిస్థితుల్లో
బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు ? మీరు మా
గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా
?" అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు._
_తదుపరి
విష్ణువు మారు వేషంలో వచ్చి "రోగముతో ఉన్న గురువుగారికి సేవ
చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కానీ చేసిన మేలు
మఱిచే కృతఘ్నునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి
వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "కృతఘ్నత అన్నది ఏదయినా ఉంటే ఇటువంటి
సమయములో వదిలి వెళిపోతే నాదవుతుంది కానీ నన్ను చేరదీసి, భోజనం పెట్టి, నా
నుండీ ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది కాదు" అనేసరికి
విష్ణువు వెను తిరుగుతాడు._
_ఇహ
ఈశ్వరుడు మారు వేషములో వెళ్ళి "మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ
ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు ? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు
కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా ? నువ్వు దూరమయితేనే నీ
విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు" అంటాడు. దానికి కౌత్సుడు
సాష్టాంగ పడి, "తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా
జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువయిన విద్యని నాకు ధారపోశారు.
కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని
రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావా !! వీలయితే నాకొక
సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి
అనవసరమయిన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు" అంటాడు._
_అంతే
ఆ ముగ్గురూ ఇతని గురుభక్తికి మెచ్చి "కౌత్సా! మేము త్రిమూర్తులం. నీ
గురుభక్తికి మెచ్చాం, మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమయిన
గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము" అంటారు. దానికి
ఆనందించిన కౌత్సుడు "మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు
చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ
గురువుగారే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే
మహేశ్వరుడు, మీ ముగ్గురినీ సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరయితే ఉన్నారో ఆయన కూడా
నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే, నాకు ఇన్ని
నేర్పించి, ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే
కనుక ఆయనకే ఇవ్వండి" అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడినీ,
అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువునీ ఇద్దరినీ మెచ్చిన
త్రిమూర్తులు ఇరువురికీ మోక్షాన్ని ప్రసాదిస్తారు._
_ఇటువంటి
కథలు విన్నప్పుడు, చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. ఏ పనయినా
పూర్తి చేయటానికి అత్యంత ముఖ్యం, అతి ముఖ్యం, ముఖ్యం అని మూడు
కారణాలుంటాయి(ట). ఉదాహరణకి అన్నం వండాలనుకోండి, అత్యంత ముఖ్యమయినది బియ్యం,
అతి ముఖ్యమయినవి నీళ్ళు, మంట, పాత్ర, మొ., ముఖ్యమయినది వండే విధానం
తెలియటం. అదే విధముగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే
గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమయినది, అతి ముఖ్యమయినవి మన శ్రద్ధ,
క్రమశిక్షణ, మొ., గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల
బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమయినవారు. అందుకనే మాతృదేవోభవ,
పితృదేవోభవ తరువాత ప్రాముఖ్యతని ఆచార్యదేవోభవ అంటూ గురువుకి ఇచ్చారు.
ఇటువంటి జ్ఞానం మనకి అలవడిన నాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది
అన్న అహంకారం ఉండదు. మరీ కౌత్సుడంత లేకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకుని,
గురువులని గౌరవించాలని ఆశిస్తూ గురువులందరికీ అంకితం..!_
--(())--
"అహం కృత్స్నస్య జగతః - ప్రభవః ప్రలయస్తథా|"
(" నేనే యావత్పప్రంచానికీ మూలమూ,అంతమూ కూడా!")
- గీతా 7-6
అహంభావము
క్షణం మనిషిలో ఉండేది అహం
అహం ప్రభావం చేదు అనుభవం
క్షణ భంగురమైనది మనిషి జీవితం
తనకు తానుగా చెప్పుకోలేనిది ప్రపంచం
పరమాత్మ స్తూల పదార్ధంకు అతీతం
నిద్రలేకుండా చేస్తుంది నేను అనే అహం
ఊహల ద్వారా కలల్లో చేరు తెలియని దాహం
సాక్షిగా మారి నిరంతరం కలిగించును ఆవేశం
రక్తమాంసముల లో ఇమిడి యుండి ధనదాహం
భవిషత్ వర్తమాన కాలాల్లో చూపుతార్భుద్ది మాన్యం
శాంతి అశాంతిఁ లమధ్య జరుగు నిరంతర పోరాటం
అహం చేరిన వారిని ఆపటం సాధ్యముకాని సత్యం
శాశ్వితము కాని శరీర పోషణకు చేస్తావు వ్యర్థం
వంశమని, కుటుంబమని తపనతో పొందవు ఆనందం
అంతర్గత యొక్క సత్యముతో పొందాలి పూర్ణ జ్ఞానం
భౌతిక భావాన్ని తెలుసుకొని అహం వదిలితే జీవితం
--(())--
*బ్రహ్మరాత*
బోధ
చేస్తూ ఒక మునిదంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు.
సకలశాస్త్రాలు, విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తూ అన్నపూర్ణయే.
ఆమె శిష్యులను తన కన్నబిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా
లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా, ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు
అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు
కావడంతో, అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి.
వసంతుడు
కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు.
ఇక అతనికి నేర్పడానికి తనవద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో, తనకు గురువులైన
వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు. ఆ గురువర్యుడు. అయితే
కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమవద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ
పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు.
ఇదిలావుండగా
నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో, వసంతుడు ఆశ్రమంలో అన్ని
పనులు తానే చూసుకుంటూ, తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు క్రింద
పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి.
ఆశ్రమంలోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు.
కాసేపట్లో
లోపలి నుండి చంటిబిడ్డల ఏడుపులు వినవచ్చాయి. గురుపత్ని కవలపిల్లలకు
జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి
దిగివచ్చిన ఒక దివ్యపురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెడుతూ, గుమ్మం ముందు
కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి
వుండేవాడు కాదు. కాని వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ
వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు ''బ్రహ్మ''. అప్పుడే
పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు
ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు వసంతుడు. బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు
ప్రణామం చేసి ''స్వామి'' మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి
సెలవివ్వగలరు అనరి వినమ్రపూరితంగా అడిగాడు.
బ్రహ్మ
తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని, వసంతుడు
అడిగిన విధానానికి ముచ్చటపడి, ఇతరులకు తెలియజెయ్యరాని రహస్యాన్ని అతనికి
చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు - నాయనా! ఈ అబ్బాయి
నిరక్షర కుక్షి అవుతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము, ఒక
ఆవు, ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల
కష్టంతో కనాకష్టంగా పెళ్లాన్ని, పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు.
ఇక
ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో
సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ.
అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తూ దైవసమానులైన తన
గురుదంపతులకి పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాసాడేమిటా విధాత అని విచారంగా
ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువుగారిని బ్రహ్మ రాత మార్చగలమా అని
అడిగాడు వసంతుడు. దానికి, ఆయన అది సాధ్యం కాదు నాయనా. అది ఎవ్వరికీ సాధ్యం
కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం
వసంతుడికి కనిపించసాగింది.
ఆ
ఇద్దరికీ చదువులు వంటపట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన
గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా? అనే దిగులుతో, వసంతుడికి దేనిమీద
ఏకాగ్రత కుదరడంలేదు. దానికితోడు ఆ పిల్లలిద్దరు వసంతుడి వెంటపడి అన్నయ్య,
అన్నయ్య అని తిరుగుతూ వుంటే, అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు
గురువుగారితో చెప్పి, ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి
వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిసాడు.
వారందరిని
వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా? దానికి వసంతుడికి
అందరు చెప్పిన సమాధానం బ్రహ్మరాత మార్చడం అసాధ్యం. అది ఎవరితరమూ కాదు అని.
అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ, తన అన్వేషణను కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలకు
పైగా గడిపాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు పాతికేళ్ళు వచ్చాయి. వసంతుడికి
వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది.
ఆశ్రమానికి
తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి గురువుగారి కుమారుడి పేరు
శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలిపని చేస్తునా&ఉనడని, గురువుగారి కుమార్తె
పేరు వసంతసేన అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని
తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి,
గురు దంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు.
వసంతుడు
బాగా ఆలోచించాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని
చూడగానే అన్నయ్యా! అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన
దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న
కటిక దారిద్య్రం ఇదీ శంకరుడి దుస్థితి. తమ్ముడూ, నువ్వు బాధపడకు.
ఇప్పటినుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు,
''సరే అన్నయ్యా! ఇకనుండి నువ్వు ఎలా చెపితే అలానే
చేస్తాను'' అన్నాడు శంకరుడు.
ముందు
ఆ ఆవుని తోలుకుని పట్టణానికి వెళదాం పద అన్నాడు వసంతుడు. ఏమి మాట్లాడకుండా
ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్టణంలోని
సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఈ ఆవుని ఎంతకు
కొంటావు అని అడిగాడు వసంతుడు. తరువాత అతను చెప్పిన ధరకు అమ్మేసాడు వసంతుడు.
శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా, వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా
వచ్చిన డబ్బుతో వంటకు అవసరం అయిన సరుకులను, శంకరుడి భార్యకు, పిల్లలకు
కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ
సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురుమని తిని
ఆకలి తీర్చుకున్నారు.
తర్వాత
వసంతుడు శంకరుడితో తమ్ముడూ అన్నదానం చేద్దాం. ఆకలితో ఎవరు వచ్చినా
లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు.
కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్యా! ఇంతవరకు ఆ ఆవు వుంది కదా
అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని
అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా
గడపాలో అని భయంగా వుంది అని అన్నాడు. దానికి వసంతుడు తమ్ముడూ, నువ్వు ఏమీ
ఆలోచించకుండా సుఖంగా నిద్రపో. ప్రొద్దునకంతా సర్దుకుంటాయి అని ధైర్యం
చెప్పాడు.
ప్రొద్దున్నే
లేచి తలుపు తెరచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతులేకుండా
పోయింది. శంకరుడి ఇంటిముందు ఒక ఆవు నిలబడి వుంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ
ఒక్క ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి
బ్రహ్మయే స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేసాడు.
ఆ
రోజు కూడా ఆవును తీసుకెళ్ళి సంతలో అమ్మి, వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం
చేయించాడు వసంతుడు. తమ్ముడూ, ఇక ఇలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తూ
ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు.
అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున
శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు.
వసంతుడు
వాళ్ళని, వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక
అవ్వతో కలసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది.
అన్నయ్యా! నేను మహాపాపిని. ఈ పాపపంకిలంలో కూరుకుపోయాను. మీలాంటి
ఉన్నతుడిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని బావురు మంది. ఊరుకో చెల్లీ!
ఊరుకోమ్మా! ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను. ఇక
ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు.
దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన.
ఆ
రాత్రికి విటులు ఎవ్వరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం
అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. ఆమె
ఆశ్చర్యపడుతూ అయ్యా! ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది.
వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు
ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆ రాత్రి ఇద్దరు, ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు
అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం.
కాని
అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి
ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటిరోజు రాత్రి కూడా అలాగే
జరిగింది. తన రాత తప్పకూడదని, లక్ష వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది
సాక్షాత్తూ ఆ బ్రహ్మే నని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన
అప్పటివరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఆమె జన్మ
చరితార్థమైంది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి,
గురుదంపతుల రుణం తీర్చుకున్నాడు.
ఈ
ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా
తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని
గ్రహించాడు, దానిని నిరూపించాడు. అలా బ్రహ్మ రాతను సైతం బ్రహ్మాండమైన రాతగా
మార్చి చూపాడు వసంతుడు.
🙏🙏🙏
-+(())--
నా
మిత్రుడి బంధువు ఒకాయనకి ఒకడే కొడుకు. వాడికీ ఒకడే కొడుకు. అమెరికాలో
శాశ్వతంగా సెటిలై అక్కడే కోట్లు సంపాదిస్తున్నాడు. అక్కడి నుంచి వాడు పంపే
డబ్బుతో ఇక్కడ ఇతడు భూములు కొంటూ ఉంటాడు. భార్య మరణించింది. ఇండియాలో
ఒక్కడే ఉంటాడు. డెబ్భై ఏళ్ళు. ఒక రోజు రాత్రి తమ ఎకరం భూమిని ఎవరో
పొలిటీషియన్ తాలుకు మనుష్యులు ఆక్రమించుకున్నారని తెలిసింది. ఆ రాత్రి
గుండెపోటు వచ్చి ఆస్పత్రి పాలయ్యాడు. పాతిక లక్షలు ఖర్చు. ఆ పైన ఆర్నెల్లకి
మరణించాడు. తండ్రికి గుండె జబ్బు వచ్చి మరణించినప్పుడు మాత్రం కొడుకు
విదేశాల్నుంచి వచ్చి ఓ నాలుగు రోజులు వెళ్ళాడు.
ఈ
సందర్భంగా బుద్ధుడి కథ ఒకటి చెపుతాను. ఒక ఇల్లు తగలబడి పోతోంది. జనం
చుట్టూ చేరి చూస్తున్నారు. యజమాని దూరoగా నిల్చుని రోదిస్తున్నాడు. ఎంతో
అందమైన ఇల్లు. పది రోజుల క్రితం ఎవరో రెట్టింపు ధర ఇస్తామన్నా అమ్మలేదు.
అందుకే దుఃఖం. ఇంతలో పెద్ద కొడుకు వచ్చాడు. "నీకు తెలీదా నాన్నా? మూడు
రెట్లు ధర వస్తే, ఇల్లు నిన్నే అమ్మేసాను. నీకు చెప్పేటంత సమయం లేక
పోయింది" అన్నాడు. చేత్తో తీసేసినట్టు ఒక్క సారిగా వేదన పోయింది.
గుండెల్నిండా సంతోషంగా గాలి పీల్చుకున్నాడు. ఆ తరువాత తనూ ఒకడిగా మంటల్ని
చూస్తూ పక్క వారి సంభాషణలో పాలు పంచుకొనసాగాడు…!
అదే
ఇల్లు. అవే మంటలు. క్షణం క్రితం వరకూ ఉన్న అటాచ్మెంట్ పోయింది. ఇప్పుడు
నిజం చెప్పాలంటే, కా... స్త ఆనందిస్తున్నాడు కూడా. ఇంతలో రెండో కొడుకు
వచ్చాడు. "నువ్వు సంతకం పెట్టకుండా అమ్మకం ఎలా పూర్తి అవుతుంది నాన్నా.
ఆమాత్రం తెలీదా?" అన్నాడు. అంతే. తిరిగి దుఃఖం చుట్టు ముట్టింది. ఈ లోపులో
మూడో కొడుకు వచ్చి, "మాట మీద నిలబడే నిజాయితీ గల మనిషి ఆయన. మాటతోనే అమ్మకం
జరిగిపోయిందన్నాడు. సగం డబ్బు చెల్లించేశాడు కూడా" అన్నాడు. తిరిగి సంతోషం
పెనవేసుకుంది.
‘ఇది
నాది’ అనుకున్నప్పుడు దుఃఖం వస్తోంది. కాదనుకున్నప్పుడు పోతోంది. నిజానికి
ఏమీ మారలేదు. ఇదే బుద్ధుడు చెప్పిన నిర్వికార నిర్వాణ యోగం. అప్పుడు దుఃఖం
మిమ్మల్ని వదిలేస్తున్నందుకు దుఃఖిస్తుంది.
తాపత్రయ
విమోచనం గురించి మరో కథ. అయిదేళ్ళ వయసులో ఒక కుర్రవాడు హిమాలయ పర్వత
శిఖరాగ్రాల మీద ఉండే బౌద్ధారామాలకి విద్యాభ్యాసం కోసం పంపబడ్డాడు. బయట
ప్రపంచంతో సంబంధం లేకుండా సంవత్సరాల తరబడి సిద్ధాంత మూలసార జ్ఞానాన్ని
సముపార్జించుకున్న తరువాత, ఆ జ్ఞానాన్ని ప్రజలకు పంచమన్న గురువు ఆదేశంతో, ఆ
భిక్షువు పర్వతశ్రేణుల మధ్య నుంచి దిగి మొట్ట మొదటిసారి నాగరిక ప్రపంచంలో
అడుగుపెట్టాడు. అప్పటి వరకూ ఆశ్రమం దాటి బయటకురాని ఆ పద్దెనిమిదేళ్ళ
యువకుడికి అంతా కొత్తగా ఉంది. బౌద్ధసాధువులకు సాంప్రదాయకమైన భిక్షాటన
నాశ్రయించి, ఒక ఇంటి ముందు నిలబడి మధుకరము అర్థించాడు. ఇంటి యజమాని యువ
సాధువు కాళ్ళు కడిగి సగౌరవంగా లోపలికి ఆహ్వానిoచి, భిక్ష వేయమని కూతుర్ని
ఆదేశించాడు. ఒక పదహారేళ్ళమ్మాయి లోపల్నుంచి ఏడు రోజులకి సరిపడా బియ్యాన్ని
తీసుకొచ్చి అతడి జోలెలో నింపింది. ఆమెని చూసి యువకుడు చకితుడయ్యాడు.
అప్పటివరకూ పురుషులనే తప్ప ‘స్త్రీ’ని చూడలేదతడు. ఆమె గుండెల కేసి చూపించి
తామిద్దరి మధ్య తేడా గురించి గృహస్థుని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి తండ్రికి
కోపం రాలేదు. ఎదుట ఉన్నది మనుష్యుల మధ్యకి తొలిసారి వచ్చిన సన్యాసి అని
తెలుసు. స్త్రీ పురుషుల తేడా గురించి చెపుతూ, ‘...వివాహం జరిగి తల్లి అయిన
తరువాత పాలు ఇచ్చి పిల్లల్ని పోషించవలసిన బాధ్యత స్త్రీకి ఉన్నది కాబట్టి
ప్రకృతి ఆమెకు ఆ విధమైన అవయవాలను సమకూర్చింది’ అని వివరణ ఇచ్చాడు.
సుదీర్ఘమైన
ఆలోచనలో పడిన యువకుడు, ఆ రోజుకు సరిపడా బియ్యం మాత్రం ఉంచుకొని, మిగతా ఆరు
రోజుల దినుసులు వెనక్కి ఇచ్చి తిరిగి తన గురువు దగ్గరకు చేరుకున్నాడు.
‘అలా ఎందుకు చేశావ’ని అడిగాడు గురువు.
“తర్వాతెప్పుడో
దశాబ్ద కాలం తరువాత ప్రపంచంలోకి అడుగిడబోయే బిడ్డ కోసం తగు ఏర్పాట్లన్నీ
ప్రకృతి ముందే సమకూర్చినప్పుడు, రేపటి ఆహారం గురించి ఈ రోజు తాపత్రయపడటం
ఎంత నిష్ప్రయోజనమో నాకు అర్థమయింది స్వామీ..!” అన్నాడా భిక్షువు.
“బౌద్ధం గురించీ, బంధం గురించీ సంపూర్ణమయిన జ్ఞానం నీకు లభించింది నాయనా" అంటూ శిష్యుణ్ణి కౌగిలించుకొని అభినందించాడు ఆచార్యుడు.
--(())--
డెలివరీ బాయ్..💐🤝
--------------
మా అబ్బాయి బిర్యాని కావాలన్నాడు.. హోటల్ కి వెళ్లి తేవాలంటే ఒళ్ళు బద్దకం కదా..
జొమాటోలో
రెండు బిర్యానీలు ఆర్డర్ ఇచ్చా.. ఈ 'బద్దకం' కూడా ఒకందుకు మంచిదే.
ఎందుకంటే..మాలాంటి బద్దకిస్టుల వల్లే కదా.. కొంతమంది నిరుద్యోగులకు డెలివరీ
బాయ్ ల కింద ఉపాధి లభిస్తోంది.. జొమాటో యాప్ ఓపెన్ చేయగానే 'ON TIME OR
FREE 'అనే అప్షన్ కనిపించింది.. దానికి అదనంగా ఇంకో ఇరవై
తీసుకున్నాడనుకోండి.. ఇచ్చిన టైం లో డెలివరీ ఇవ్వకపోతే ఆ ఫుడ్ మొత్తం ఫ్రీ
అనేది దాని సారాంశం..'ఫ్రీ 'అనగానే దానికి పడిపోని భారతీయుడు ఉంటారా... ఆ
అప్షన్ కింద రేటింగ్స్ చూసుకుని మరీ ఒక రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్
ఇచ్చా..
అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అయింది.. జొమాటో యాప్
లో నేను మా అబ్బాయి శాస్త్రవేత్తల మాదిరి వెదుకుతున్నాం.. ఆర్డర్ రెడీ
నుంచి మొదలు పెట్టి డెలివరీ బాయ్ బైక్ సింబల్ మ్యాప్ లో మూవ్ అవుతున్న
ప్రతి అంశం భూతద్దంతో చెక్ చేస్తున్నాం..సగటు భారతీయ మెంటాలిటీ కదా.. ఒకవేళ
డెలివరీ బాయ్ అనుకున్న టైం కి ' ఫుడ్' డెలివరీ ఇవ్వకపోతే..జొమాటో మొత్తం
ఫుడ్ ఫ్రీగా ఇస్తుంది కదా.. బుద్ధులు ఎక్కడికి పోతాయ్.. అందుకే బాయ్ లేట్
కావాలని ఎదురు చూస్తున్నా.. టైం స్కెల్ మీద 32 నిమిషాల నుంచి తగ్గుతూ
వస్తోంది...ఇంకా ఇరవై నిమిషాల్లో డెలివరీ అని చూపిస్తోంది.. యాప్ లో రెడ్
కలర్ లో బైక్ సింబల్ వేగంగా కదులుతోంది.. లేట్ గా వస్తాడా..టైం కి ఇస్తాడా
ని ఎదురు చూపులు..లేట్ అయితే బాగుండు అని కుట్రపూరిత ఆలోచనలు..
ఇంకా
పదిహేడు నిమిషాల్లో డెలివరీ అని టైం చూపిస్తున్న టైం లో జొమాటో నుంచి కాల్
వచ్చింది.. అవతలి నుంచి డెలివరీ బాయ్.. ఆయాసపడుతూ మాట్లాడుతున్నాడు..
సార్.. వస్తున్నాను సర్.. కొద్దిగా ఆలస్యం అవుతుందేమో సర్.. క్షమించండి
..అంటున్నాడు..
అప్పుడే నాలో ఒకప్పటి కన్నింగ్ నాగభూషణం, రాజనాల,
రావుగోపాల్ రావు, అమ్రిష్ పురి లు మేల్కొన్నారు.. ఒంటికన్నుతో జొమాటో యాప్
చూస్తూ యాహూ ..అని అరిచా.. ఇవాళ 493 రూపాయల బిల్ మిగిలిపోయినట్టే.. వాడు
లేట్ అవడమే నాకు కావాలి.. ఫ్రీ అప్షన్ కింద మొత్తం కొట్టేయాలి.. నాలో ఉన్న
కక్కుర్తి టన్నుల కొద్దీ ఆ టైం లో బయట పడింది.. పైకి మాత్రం ఆ కుర్రాడి మీద
విపరీతమైన ప్రేమాభిమానాలు కురిపిస్తూ.. పర్వాలేదు..జాగ్రత్తగా రా..అని
చెప్పా..
ఎదుటోడి కష్టం గురించి ఆలోచించకుండా మన స్వార్ధం
మనం చూసుకున్నప్పుడు వచ్చే ఆలోచనలు బుర్రలో కిలోల కొద్దీ పైశాచికానందాన్ని
నింపుతాయి.. ఇలాంటి టైం లో మన హోదా, స్థాయి ఏమీ గుర్తుకు రావు..ఎదుటోడు
నాశనం అయిపోయిన పర్వాలేదు.. మనం మాత్రం బాగుండాలి కదా.. ఆ అరగంట లో మనకి
ప్రపంచంతో సంబంధం లేదు..ఎలాగైనా సరే 'బేవార్స్' గా బిర్యాని దొబ్బేయాలి
అంతే..
టైం దగ్గర పడింది... ఇంకో ఐదు నిమిషాల్లో డెలివరీ
అని చూపిస్తోంది.. నేను విజయానికి చేరువలో ఉన్నాను.. రన్నింగ్ రేసులో
ఉన్నోడు..పక్కోడి కంటే ఒక సెకన్ వెనుక పడినప్పుడు. ముందున్న వాడికి గుండె
పోటు వచ్చి పడిపోతే.. నేనే ముందుకెళ్తా అని దుష్ట ఆలోచనతో ఎదురు చూసినట్టు,
ఓడిపోయే క్రికెట్ మ్యాచ్ లో వర్షం వచ్చి మ్యాచ్ ఆగిపోతే బావుండు అని ఎదురు
చూసే క్రికెటర్ లా.. నేను ఎదురు చూస్తున్నా..
అప్పుడే మళ్లీ ఫోన్ వచ్చింది...సర్..అడ్రెస్ ఒకసారి చెబుతారా.. మీ స్ట్రీట్ లోనే..
ఉన్నాను..అంటున్నాడు
డెలివరీ బాయ్.. అప్పుడే ఎలా వస్తాడు..రాకూడదు..వాడు టైం కి వస్తే నా పధకం
ఫెయిల్ అవుతుంది.. వాడిని ఎలా అయినా సరే ఇంకో ఐదు నిమిషాలు లేట్
చేయించాలి.. అని ఎక్కడున్నావ్ అంటూనే సెకండ్ ఫ్లోర్ బాల్కనీలోకి వచ్చి ఫోన్
మాట్లాడుతున్నాను.. ఇంతలో అతనే కింద నుంచి పైకి అరుస్తున్నాడు..సార్..
మీరే కదా పైన ఉంది అంటున్నాడు.. అయ్యో దొరికిపోయానే.. ఇంకా ఎలాగోలా లేట్
చేయిద్దామనుకుంటే.. నన్ను చూసేసాడే.. ఏమి చేయాలి.. మనకి బేవార్స్ బిర్యానీ
దక్కదా.. అనేలోపు ఆ కుర్రాడు పైకి వచ్చాడు..
రెండు
ఫ్లోర్లు ఎక్కి పైకి వచ్చి బ్యాగ్ ఓపెన్ చేసి రెండు బిర్యానీ ప్యాకెట్లు
చేతికిచ్చాడు.. అప్పుడు యాప్ లో చూసా.. ఇంకా ఒక నిమిషంలోడెలివరీ అని
చూపిస్తోంది.. సార్ లేట్ అయ్యుంటే..సారీ సర్ అంటున్నాడు.. అప్పటికే చెమటల
తో పూర్తిగా తడిసిపోయాడు.శీతాకాలం చలిలో కూడా అతను వేసుకున్న ఎర్ర చొక్కా..
చెమటతో తడిసిపోయింది.. నుదుటి నుంచి చెమట చుక్కలు కళ్ల మీదికి కారుతుంటే
తుడుచుకుంటున్నాడు..చూడటానికి బక్కపల్చగా ఉన్నాడు ఆ కుర్రాడు..నన్ను చూసి
లేట్ అయ్యుంటే కాస్త చెప్పకండి సర్..నాకు పెనాల్టీ వేస్తారు ..సైకిల్ కదా
.. తొక్కి.. తొక్కి కాళ్ళు నొప్పులు పడుతున్నాయి..అప్పటికీ ఫాస్ట్ గానే
తొక్కాను.. మీకు లేట్ కాకూడదని.. షార్ట్ కట్ లో వచ్చాను..అని చెబుతూ మెట్లు
మీది నుంచి కిందికి వెళ్లి పోతున్నాడు..
బాబూ...నీ
పేరేంటి అన్నాను..నవీన్ సర్ అన్నాడు.. సైకిల్ మీద వచ్చావా. అని
అడిగా..అవును సర్.. ఉదయం నుంచి పధ్నాలుగు డెలివరీలు ఇచ్చాను.. ఇదే లాస్ట్
డెలివరీ..అన్నాడు..అతని కడుపు నింపుకోవడానికి అంత దూరం సైకిల్ తొక్కుకుంటూ
బిర్యానీ తెచ్చి..మా కడుపులు నింపాడు..
ఇప్పుడు నాకు డెలివరీ
తెచ్చిన హోటల్ ఎంత దూరం ఉంటుంది అని అడిగా.. నాలుగున్నర కిలోమీటర్లు
ఉంటుంది...అన్నాడు.. అక్కడి నుంచి సైకిల్ మీదే వచ్చావా..అని అడిగా.. ..
అవును సర్ సైకిల్ మీదే..
సరే
వెళ్ళొస్తా సర్..మా అమ్మ ఇంటిదగ్గర ఎదురు చూస్తుంటుంది.. మళ్లీ పరీక్షలు
దగ్గర పడుతున్నాయి..చదువుకోవాలి అంటూ ఈల వేసుకుంటూ మెట్లు దిగుతుంటే మళ్లీ
నవీన్ అని పిలిచా..ఏంటి సర్.. అంటూ పైకి వచ్చాడు.. నువ్వు
చదువుకుంటున్నావా..అన్నాను..
అవును సర్ బీటెక్ ఫైనల్ ఇయర్..కాలేజీకి
వెళ్లి పర్మిషన్ తీసుకుని ఈ ఉద్యోగం చేస్తాను..అన్నాడు.. ఎంత వస్తాయి
రోజుకి అంటే..ఎంత సైకిల్ తొక్కితే అంత సర్.. ఒక్కోరోజు ఆరు వందల వరకూ
వస్తాయి అన్నాడు.. ఆ డబ్బులు ఏమి చేస్తావు అంటే.. ఇంట్లో అవే ఆధారం సర్..ఆ
డబ్బుతోనే అందరం బతుకు తాం.. నా కాలేజీ ఫీజులు నేనే
కట్టుకుంటాను..అన్నాడు..ఎక్కడో నాలో దాగి ఉన్న మానవత్వం అప్పుడు నిద్ర
లేచింది...అతని చెమట చుక్కల్లో నాకు అసలైన జీవితం కనిపించింది.. అతని
మాటల్లో తత్వం బోధపడింది..
ఒక్కసారిగా అతన్ని హగ్
చేసుకున్నా..ఎండిపోయిన చెరువులో నీళ్లు ఉబికినట్టు.. నా కళ్ళల్లోంచి
కన్నీటి బొట్లు బయటకు రావడానికి ట్రై చేశాయి..జర్నలిస్టుని కదా ..కంట్రోల్
చేసుకుని.. అతన్ని సారీ..నవీన్ అన్నాను.. ఎందుకు సారీ చెబుతున్నానో అతనికి
అర్ధం కాలేదు.. బిర్యానీ తిను నవీన్ అని ఒక ప్యాకెట్ ఇవ్వబోయా.కానీ అతను
తీసుకోలేదు..వద్దు సర్..మా అమ్మ ఇంట్లో వండుతుంది.. ఇవాళ బిర్యానీ
తింటే..రేపు తినాలనిపిస్తుంది..మేము బిర్యానీ తేవాలి..మీలాంటోళ్లు బిర్యానీ
తినాలి అంతే సర్.. అంటుంటే.. అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న కన్నీళ్లని
ఇక నేను అపలేనంటూ నా కళ్ళు బయటకి పంపేసాయి..... 😢😭
--(())--
వనితా లతా కవితా మనలేవు లేక జత...ఇవ్వాలి చేయూత మనసివ్వడమే మమత
చిత్రం : కాంచన గంగ (1984)
రచన : వేటూరి
సంగీతం : చక్రవర్తి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పల్లవి :
వనితా లతా కవితా మనలేవు లేక జత
వనితా లతా కవితా మనలేవు లేక జత
ఇవ్వాలి చేయూత మనసివ్వడమే మమత
మనసివ్వడమే మమత...
వనితా లతా కవితా మనలేవు లేక జత
చరణం : 1
పూలు రాలి నేలకూలి తీగబాల సాగలేదు
చెట్టు లేక అల్లుకోక పూవు రాదు నవ్వులేదు
మోడుమోడని తిట్టుకున్నా తోడు విడిచేనా
తొలకరించే కొత్త ఆశ తొలగిపోయేనా
వనితా లతా కవితా మనలేవు లేక జత
చరణం : 2
ఆదరించే ప్రభువు లేక కావ్యబాల నిలువలేదు
కవిత అయినా వనిత అయినా ప్రేమలేక పెరగలేదు
చేదు చేదని తిట్టుకున్నా చెలిమి విడిచేనా
చేదు మింగి తీపి నీకై పంచ మరిచేనా
వనితా లతా కవితా మనలేవు లేక జత
చరణం : 3
తనది అన్న గూడు లేక కన్నెబాల బతకలేను
నాది అన్న తోడు లేక నిలువలేదు విలువలేదు
పీడపీడని తిట్టుకున్నా నీడ విడిచేనా
వెలుగులోనా నీడలోనా నిన్ను మరిచేనా
వనితా లతా కవితా మనలేవు లేక జత
ఇవ్వాలి చేయూత మనసివ్వడమే మమత
మనసివ్వడమే మమత...
https://www.youtube.com/watch?v=TO4IEjwtnQI |
|