3, మే 2019, శుక్రవారం


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

🌸 మహాస్వామి వారి అన్నపూర్ణావతారం🌸

పరమాచార్య స్వామివారు ఒక తమిళ సామెతను ఎప్పుడూ చెప్పేవారు, “అందరికీ అన్నం పెట్టు, భేదం చూపకుండా” అని. ఆహారం పెట్టేటప్పుడు ఎవరు, ఏమిటి అన్న ఎటువంటి బేధం చూపరాదని చెప్పేవారు. రాత్రిపూట దొంగలకు కూడా ఆహారం అందించే ఒక కేరళ సంప్రదాయం గూర్చి ఎప్పుడూ తెలిపెవారు. కేరళలోని చేరుక్కుణ్ణం అన్న ప్రాంతంలో ఉన్న అన్నపూర్ణ దేవాలయంలో ఈ పధ్ధతి ఉంది. దేవాలయంలోని భక్తులందరి భోజనాలు అయ్యాక, ఆహార పొట్లాలు కట్టి, వాటిని చెట్టుకు వేలాడదీసేవారు అటుగా వెళ్ళే దొంగలకోసమని.

సంగం సాహిత్యంలో ఉధియన్ చేరాళదన్ అన్న చేర రాజు మహాభారత యుద్ధ సమయంలో పాండవ కౌరవ ఇరు పక్షాల వారికీ అన్నం పెట్టి ‘పేరుం సోట్రు చేరాళదన్’ అన్న పేరు ఎలా పొందాడో తెలిపేవారు.

వేటగాడైన కన్నప్ప శివునికి ఆహారం పెట్టాడు. వేటగాడైన గుహుడు శ్రీరామునికి ఆహారం పెట్టాడు. ఇక్కడ, శ్రీశైలం అడవులలో ఉండే చెంచులు పరమాచార్య స్వామివారిచే ఆహారం పొందారు.

రవాణా వ్యవస్థ అంతగా లేని 1934లో పరమాచార్య స్వామివారు మందీమార్బలంతో కీకారణ్యంలో ఉన్న శ్రీశైలం వెళ్తున్నారు. దారిలో ఒకచోట వారికి చెంచులు ఎదురయ్యారు. ఆ చెంచులు మొదట వీరిని శతృవులుగా భావించి బాణాలు చేతబూని విల్లు ఎక్కుపెట్టారు. కాని స్వామివారి దివ్య తేజస్సు చూసి, తప్పు తెలుసుకుని వీరిని ఆదరించారు.

వీరిని అడ్డగించాలని వచ్చినవారే వీరికి కాపలావాళ్లై, సామాను మోస్తూ, రాత్రిపూట పహారా కాస్తూ పరమాచార్య స్వామివారిని సపరివారంగా తదుపరి చోటుకు చేర్చారు. సెలవు తెసుకునే ముందు అందరూ ఒకచోట చేరారు.

మహాస్వామి వారి వారికి కొంచం ధనం ఇవ్వమని మేనేజరును ఆదేశించగా వారు దాన్ని తాకడానికి కూడా ఇష్టపడలేదు. ఆ చెంచుల నాయకుడు మేనేజరుకు ఎదో చెబితే, వారు దాన్ని నిరాకరిస్తూ తల అడ్డంగా తిప్పి కుదరదన్నారు.
మహాస్వామివారు చిటికె వేసి మేనేజరును పిలిచి, “అతను ఏమి అడిగాడు, నువ్వు ఎందుకు లేదన్నావు?” అని అడిగారు.

“పెరియవా ముందర వారు నృత్యం చేయాలనుకుంటున్నారు”

“నృత్యం చూడడం వల్ల శ్రీమఠం గౌరవం తగ్గుతుందని మేనేజరుగా నీ అభిప్రాయం కనుక నేను వారి నృత్యం చూడనని నువ్వు అన్నావు”
మహాస్వామి వారి మాటల్లో ఎక్కడా కోపం కనబడలేదు. మేనేజరు మౌనంగా నిలబడ్డారు.

ఎంతో గొప్ప కళాకారుల నృత్యాలు కూడా చూడని మహాస్వామివారు వారి నృత్యాన్ని చూడడానికి అంగీకరించారు ఒక షరతు పైన; మగవారు ఎవరైనా నృత్యం చెయ్యవచ్చు. కాని వారితో పెద్దవారు కాని బాలికలు మాత్రమే కలిసి నృత్యం చెయ్యాలి.

“సందర్భాన్ని బట్టి మీకు వివిధ నృత్యాలు ఉన్నాయి కదా; దేవుని కోసం, గెలిచినప్పుడు, ఆటలకోసం అలా. మరుప్పుడు మీరు చెయ్యదలచుకున్న నృత్యం ఎలాంటిది” అని అడిగారు మహాస్వామివారు.

“మేము ఇప్పుడు చెయ్యబోయే నృత్యం కేవలం మాకు అత్యంత దగ్గరైన ఆప్తులకు మాత్రమే” అని తెలిపారు.

పరమాచార్య స్వామి వారు వారి నృత్యాన్ని చూసి, వారినందరినీ ఆశీర్వదించి, వారికి మంచి విందు ఏర్పాటు చేశారు.

--- రా. గణపతి, “మహా పెరియవాళ్ విరుంధు” నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

      --((**))--


మే నెల 7 వ తేదీ 
మంగళ వారము అక్షయతృతీయ రోజున
బంగారం తప్పక కొనాలా?

అక్షయతృతీయ అంటే ఏమిటి?వివరణ?

ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి  చందనోత్సవం.
అదే రోజున పరశురామ జయంతి మరిన్ని  అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు.
అక్షయ తృతీయ ప్రాముఖ్యత

1. పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి  “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో,
      వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” 
      ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు     సంరక్షకునిగా
     నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

అక్షయ తృతీయ రోజున బంగారం తప్పక కొనాలా?
అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది.ఈ రోజున కొన్నది 
అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని
కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది.

అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు, తప్పులు
తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి.

అసలు ఈరోజున బంగారం  కొనాలి అని శాస్త్రంలో ఎక్కడా చెప్పబడిలేదు. 
ఇది కేవలం వ్యాపార జిమ్మిక్ మాత్రమే
అక్షయ తృతీయ నాడు, మనం  చేపట్టిన ఏ  కార్య  ఫలమైనా, [ అది  పుణ్యం కావచ్చు;లేదా  పాపం  కావచ్చు.] అక్షయంగా,  నిరంతరం, జన్మలతో  సంబంధం
లేకుండా,  మన  వెంట  వస్తూనే ఉంటుంది. 
పుణ్య  కర్మలన్నీ  విహితమైనవే. అందునా,  ఆ రోజు ఓ  కొత్త  కుండలో గానీ,
కూజాలో గానీ,  మంచి నీరు  పోసి, దాహార్తులకు శ్రధ్ధతో  సమర్పిస్తే, ఎన్ని  జన్మలలోనూ,  మన  జీవుడికి దాహంతో  గొంతు ఎండి పోయే పరిస్థితి  రాదు.
అతిధులకు, అభ్యాగతులకు, పెరుగన్నంతో  కూడిన భోజనం  సమర్పిస్తే,  
ఏ  రోజూ  ఆకలితో  మనం అలమటించవలసిన రోజు  రాదు.

వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది.
అర్హులకు  స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు సమర్పించుకుంటే,  
మన  ఉత్తర జన్మలలో, వాటికి  లోటు  రాదు.
గొడుగులు, చెప్పులు, విసన కర్రల లాటివి దానం  చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఆ  రోజు నిషిధ్ధ  కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో  శ్రేయస్కరం. 

ఓ  సారి  పరిశీలిస్తే,"భాగవతం" ప్రధమ స్కంధం ప్రకారం, పరీక్షిన్మహా రాజు  
కలి పురుషుడికి  ఐదు  నివాస స్థానాలను కేటాయించాడు.  
అవి: 
1 .జూదం, 2 .  మద్య పానం, 3 . స్త్రీలు, 4 . ప్రాణి వధ, 5 . బంగారం.  
వీటితో పాటు కలి కి  లభించినవి 
 ఇంకో  ఐదు*
అసత్యం, గర్వం, కామం, హింస, వైరం.  
జాగ్రత్తగా  పరిశీలిస్తే, ఆ పైన  ఉన్న  ఐదిటికీ ఇవి  అనుషంగికాలు.
ఆ  పై  ఐదిటినీ ఇవి  నీడలా వెన్నంటే  ఉంటాయి.
అక్షయ తృతీయ  రోజు ఎవరైనా, ఈ  ఐదిటిలో దేని  జోలికి  వెళ్ళినా,  
కలి పురుషుడి దుష్ప్రభావం అక్షయంగా వెంటాడుతూనే  ఉంటుంది.

--((**))--


శ్రీ ఆది శంకరాచార్య విరచితం
సాధన పఞ్చకమ్ (ఉపదేశపఞ్చకమ్)
🕉ఓంశ్రీమాత్రేనమః🕉
అద్వైత చైతన్య జాగృతి

పఞ్చరత్నమాలికా
వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతి స్తజ్యతామ్ !
పాపౌఘః పరి ధూయతామ్ భవసుఖే దోషోనుసన్ధీయతాం
ఆత్మేచ్ఛావ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతామ్ !! 1

ప్రతిదినము వేదాధ్యయనము చేయవలెను, అందులో చెప్పిన కర్మలు శ్రద్ధగ ఆచరించుము. ఈ కర్మాచరణమే ఈశ్వర పూజగా మారును గాక! కామ్య కర్మలను త్యజింపుము నిష్కామ కర్మలను చేయుము. పాపములను బోగొట్టుకొనుము. సంసార సుఖములోగల దోషముల నెరుగి జీవితమును అనుసంధానము చేసుకొనుము. ఆత్మ జ్ఙానము నందు ఇచ్చమును పెంపొందించుకొనుము. శీఘ్రమే నిజ గృహమునుండి వెడలుము.

సఙ్గః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాధీయతాం
శాన్త్యాదిః వరిచీయతాం దృఢతరం కర్మాశు సన్త్యజ్యతామ్ !
సద్ విద్వానుపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం
బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శృతిశిరోవాక్యంస మాకర్ణ్యతామ్ !! 2

సజ్జనులతో కలిసి ఉండుము, భగవంతుని యందు ధృఢమైన భక్తిని కలిగి యుండుము.
శాంత్యాది గుణములను ఆశ్రయించుము. కామ్య కర్మలను విసర్జించుము. సద్ విద్వాంసులను ఉపాసింపుము (సత్ యందు రమించు విద్వాంసులు అందుకే సద్ అను పదమ వేఱుగా చూపబడినది అని ఒక భావము). వారి పాదుకలను ప్రతి దినమూ సేవింపుము. బ్రహ్మ ప్రాప్తికి తోడ్పడు ఏకాక్షర బ్రహ్మ మంత్రమైన ఓం కారమంత్రమను సేవించుము, ఉపాసించుము. శ్రుతి శిరస్సులైన ఉపనిషత్ వాక్యములను వినుము.

వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరఃపక్షః సమాశ్రీయతాం
దుస్తర్కాత్ సుమిమ్యతాంశృతిమతిస్తర్కోనుసన్థీయతామ్ !
బ్రహ్మైవాస్మి విభావ్యతామహరహర్తర్వః పరిత్యజ్యతాం
దేహేహం మతిరుజ్ ఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్ !! 3

తత్త్వమసి ఇత్యాది మహావాక్యముల అర్థమును విచారింపుము, వేదాంతమును ఆశ్రయింపుము.
“కుతర్కమును వీడుము”. శ్రుతిసమ్మతమగు తర్కమును గ్రహింపుము. “నేను బ్రహ్మమును” అని ప్రతిదినము భావింపుము. గర్వాహంకారములను వీడుము. శరీరమున అహంబుద్ధిని వదిలి వేయుము. పెద్దలతో వాదులాడకుము (ఇక్కడ పెద్దలనగా జ్ఙానముచేత, అనుభవముచేత అని వ్యాఖ్యానము).

క్షుద్ వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నంనతు యాద్యతాంవిధివశాత్ ప్రాప్తేనసంతుష్యతామ్ !
శీతోష్ణా విసహ్యతాం స తు వృథావాక్యం సముచ్చార్యతాం
ఔదాసీస్యమభీప్స్యతాం జనకృపానైష్ఠుర్యముత్సృజ్యతామ్ !! 4

ఆకలి దప్పిక అను వ్యాధులకు చికిత్స కావింపుము. భిక్షాన్నమను ఔషధమును సేవింపుము. రుచికరమగు భోజనపదార్థములను యాచింపక, విధివశాత్ లభించిన దానితో తృప్తిని పొందుము. చలి, వేడి వంటి ద్వంద్వములను తితిక్షాబుద్ధితో సహింపుము. వ్యర్థముగ వాక్యోచ్చారణ చేయకుము ( అనవసర ప్రసంగములు అనవసర మాటలాడకుము). ఔదాసీన్యమును వహించుము. లోకుల యెడ నైష్ఠురడవు కాకూడదు.

ఏకాన్తే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం
పూర్ణాత్మా సునమీక్ష్యతాం జగదిదంతద్బాధితందృశ్యతామ్ !
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నావ్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబ్ధస్త్విహ భుజ్యతామథ పరబ్రహ్మాత్మనా స్థీయతామ్ !! 5

ఏకాంత ప్రదేశమున సుఖముగ కూర్చుండుము. పర బ్రహ్మమున చిత్తమును సమాధాన మునర్చుము. ఈ జగత్తును పూర్ణబ్రహ్మముగ జూచుచు అది అంతయును విలీనమైనదిగ భావింపుము. పూర్వ కర్మముల క్షయమునొనర్చుకొనుము. జ్ఙానము నాశ్రయించి రాబోవు కర్మలయందాసక్తుడవు కాకుండ ఉండుము. ప్రారబ్ధ భోగము ననుభవించుచు, బ్రహ్మమున నెలకొనియుండుము.


యః శ్లోకపఞ్చకమిదం పఠతే మనుష్యః
నఞ్చిన్తయత్యనుదినం స్థిరతాముప్యేత !
తస్యాశు సంసృతిదవానలతీవ్రఘోర
తాపః ప్రశాన్తిముపయాతిచితి ప్రసాదాత్ !! 6

ఏ మానవుడు నిత్యమూ ఈ శ్లోక పంచకమును పఠించుచు, స్థిర చిత్తముతో భావార్థమును చింతించుచుండునో, అతడు శీఘ్రముగనే సంస్మృతి, తీవ్ర దావానల, తీవ్ర ఘోర తాపమును, చైతన్య స్వరూపుడైన ఈశ్వరును అనుగ్రహముచేత పోగొట్టుకొనును.

!!ఇతి శ్రీ శఙ్కరభగవత్పూజ్యపాదవిరచిత సాధన పఞ్చకమ్!!
ఇది శ్రీ శంకర భగవత్ పాదులు రచించిన సాధన పంచకమ

--((**))--


సంసారం నుంచి తప్పించే సంస్కారం
🕉ఓంశ్రీమాత్రేనమః🕉
అద్వైత చైతన్య జాగృతి

మన వేదాంతమంతా రెండు పదాల చుట్టూ తిరుగుతుంది. ఒకటి మమకారం, రెండోది అహంకారం. ఈ రెండూ మనిషి చుట్టూ చేరడమే సంసారం. దీన్నే మాయ అని పిలిచారు. ఆ మాయ ఏడుస్తున్న చంటి పిల్లాడిలాంటిది. చంకలోకి ఎక్కదు. క్రింద నిలబడదు. ఈ మాయారూపమైన అహంకారం మనిషి నుంచి దూరమైతే అతనిలో వ్యక్తమయ్యేది ఓంకారమే. అహంకారాన్ని అణచివేసే శక్తి ఓంకారానికి ఉంది. ఓంకారం పరమాత్మ స్వరూపంగా చెప్పబడింది. ఈ రెండింటిలో ఏదైనా ఒక దానికే మనలో స్థానం ఉంది. అహంకారమనే మాయా సంసారం దాటాలంటే సంస్కారం కావాలి. అది మనిషిని ప్రభావితం చేసినప్పుడు అహంకారం దూరం అవుతుంది. రెండు రూపాయల విలువ చేసే ఇనుముకు సంస్కరిస్తే వందల రూపాయల విలువ చేసే వస్తువుగా మారుతుంది. ఖర్చు లేకుండా పొందేది సంస్కారం.

సంసార విష వృక్షస్య ద్వే ఫలే అమృతోపమే
కావ్యామృత రసాస్వాదః సంగమస్సజ్జనైస్సహ

సంసారం అనే విష వృక్షానికి రెండే రెండు అమృత ఫలాలు కాస్తుంటాయి. మొదటిది కావ్యామృత రసాపానం, రెండోది సజ్జనుల సాంగత్యం అని హితోపదేశం తెలిపింది. అత్యద్భుత జ్ఞాన సముద్రాన్ని అందించిన రుషులకు కృతజ్ఞత తెలిపి, రుషి రుణం తీర్చుకోవడానికి గ్రంథపఠనం చేయాలి. ఆ గ్రంథాల సారాంశాన్ని మనసు నిండా నింపుకోవడానికి సజ్జన సాంగత్యం చేయాలి. ఈ రెండింటివల్ల చంచలమైన మనస్సు స్థిరీకృతమై మనల్ని సత్యం వైపు నడిపిస్తాయి. లేదంటే సమయపేదరికంతో బాధపడుతున్న మనుషులంతా బాహ్యమైన వినోదకార్యక్రమాల్లో జీవిస్తారు. ఇవాళ ఆధ్యాత్మికత కూడా వినోదాత్మకంగా మారడం దురదృష్టకరం. దేవునిలో వినోదం ఉండాలి గాని వినోదంలో, ఆడంబరంలో దేవుడు ఉండకూడదు. ఇటీవల ఆరాధనలు, పూజలు, బాహ్యాండర వినోదంగా మార్చే ప్రయత్నం జరుగుతున్నది. అందువల్ల అంతర్గత శుద్ధికి ఆస్కారం ఉండదు. వినోదం చుట్టూ తిరిగే మనసు పొందే ఫలితం కోరికలేగాని ఇంకోటి కానేరదు. అందుకే గీతాచార్యుడు.

--((**))-- 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి