*🧘♂️3) శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి విరచితము ఆత
*03) శ్లోకం:-*
*మా తేవ పుత్రమనుబోధయతి శ్రుతిర్హ లోకం సమస్తమపి యోజయితుం సుఖేన ।*
*తస్మాచ్చుతే రభిహితార్ధ మతంద్రితేన చిత్తేన సాధయితు మత్ర జనా యతధ్వమ్ ॥ 3*
*టీకా*
శ్రుతిః = ఉపనిషత్తు, సమస్త లోకం అపి = యావత్తు ప్రపంచాన్ని, సుఖేన యోజయితుం = సుఖంతో జతపరచడానికి గాను, పుత్రం మాత ఇవ హి = కుమారుడికి తల్లిలాగా, అనుబోధయతి = నిరంతరం బోధిస్తుంది, తస్మాత్ = అందువల్ల, అత్ర = ఈ సందర్భంలో, అతంద్రితేన = విరామం లేకుండా, శ్రుతేః అభిహిత అర్థం = ఉపనిషత్తు బోధించే హితోక్తుల్ని, చిత్తేన సాధయితుం = మనస్సుతో సాధించడానికి, జనాః = ఓ జనులారా, యతధ్వం = ప్రయత్నించండి.
కేన 2వ అధ్యాయం 5వ మంత్రం, కఠ 6వ అధ్యాయం 4వ మంత్రం.
*భావం:-*
తల్లి కుమారుడికి బోధించినట్లుగా శ్రుతి యావత్ లోకానికి సుఖం సమకూర్చుడం కోసం నిరంతరం బోధ చేస్తుంది. అందువల్ల ఈ సందర్భంలో శ్రుతుల హిత వాక్యాలని చిత్తంతో సాధించడానికి ఓ జనులారా, ప్రయత్నించండి.
*వివరణ:-*
ఉపనిషత్తులు మన కోసం ఆక్రోశించ వలసిన పని ఏమున్నది అనే సందేహానికి సమాధానం ఇది "తల్లి కుమారుడికి బోధించినట్లు" అని. తల్లి తన కోసం చెప్పదు. కుమారుడి మేలు కోరి అతడు వినిపించుకున్నా వినిపించుకోక పోయినా, అతడు విసుక్కొని కేకలు వేసినా, అతడు నానాటికి దిగజారి తప్పు ద్రోవని పోతున్నా కన్నీళ్ళు పెట్టుకొని హీనస్వరంతోనైనా తల్లి హితాన్ని బోధిస్తూనే ఉంటుంది.
ఉపనిషత్తులు సమస్త మానవాళి కోసం ఉన్నాయి. ఏ ఒక్కరు తప్పిపోయినా ఉపనిషత్ మాతకు ఆవేదనే. ప్రపంచం అతి సుందరమైనది. మానవ జీవితం అరుదైన అవకాశం.
మనం హాయిగా సుఖంగా జీవిస్తూ మానసికంగా ఎదగడానికి చక్కని మార్గం ఉన్నది. అది తెలియక తప్పుదారి పట్టి బాధపడుతూంటే మార్గనిర్దేశం చెయ్యడానికి ఉపనిషత్తులు పూనుకుంటాయి.
రైలు మార్గాలు, రోడ్డుమార్గాలు ఉన్నట్లే ప్రపంచంలో మానవుల కోసం “మానవ మార్గం” ఒకటున్నది. అలా నడిచే వాళ్ళందరికీ సుఖం లభిస్తుంది.
*05) శ్లోకం:-*
*శ్లో॥ సూక్ష్మాఖ్య భూతగత సత్త్వ రజస్తమోభిః లింగం శరీర ముదభూ దత ఈశ్వరేచ్ఛా ।*
*పంచీ చకార వియదాదిక భూత సూక్ష్మా ణ్యండం హ్యభూదత ఇదం సహ జీవభోగ్యైః ॥ 5*
*టీకా*
సూక్ష్మ ఆఖ్య = సూక్ష్మమనే పేరుగల, భూతగత = భూతాలలో ఉన్న, సత్త్వరజః తమోభిః = సత్త రజస్తమోగుణాలతో, లింగం శరీరం = సూక్ష్మశరీరం, ఉదభూత్ = ఉదయించింది, అతః = అప్పుడు, ఈశ్వర ఇచ్ఛా = ఈశ్వరుని సంకల్పం, వియత్ ఆది భూత సూక్ష్మాణి = ఆకాశం మొదలైన సూక్ష్మ భూతాలని, పంచీ చకార = పంచీకరణం చేసింది, అతః = అందుండియే, జీవభోగ్యైః సహ = జీవుళ్ళు భోగించడానికి తగిన విషయ వస్తువులతో సహా, ఇదం = ఈ ప్రపంచం, ఆభూత్ = తయారైంది.
*భావం:-*
సూక్ష్మమనే పేరుగల ఈ పంచభూతాలలోని సత్త్వరజస్తమోగుణాలతో సూక్ష్మశరీరం ఉత్పన్నమైంది. అప్పుడు ఈశ్వరేచ్ఛ ఆ భూతాలని పంచీకరణ చేయగా జీవుల భోగ్యవస్తువులతో సహ ఈ ప్రపంచం తయారైంది.
*వివరణ:-*
“గాలి తాకిడివల్ల నీరు అలలతో నింపినట్లుగా” అనే ఉపమానం మన అనుమానాలని తీర్చదు. గాలి, నీరు, రెండూ జడమైనవి, వాటి వాటి సహజ ధర్మాల కారణంగా అలలు ఏర్పడుతాయి. ఇందులో గాలికి కాని నీటికి గాని అలలని ఏర్పరచాలనే సంకల్పం లేదు.
ప్రపంచం ఏర్పడడం కూడ ఇలా జడమైన సహజ కారణం చేతనేనా? ఎందుకు ఏర్పడుతోంది? ఎవరు దానిని సంకల్పించారు? ఈ ప్రశ్నలకి జవాబు ఈ శ్లోకంలో దొరుకుతుంది.
పరమాత్మ ఒక్కడే చైతన్యరూపుడు. సత్తా, శక్తీ రెండూ ఉన్నవాడు. ఆయన శక్తి, ఆయనలోని సత్తాని రెచ్చగొట్టడానికి కారణం ఈశ్వరుడుగా మారిన పరమాత్మ సంకల్పం.
ఆయన శక్తి సమష్టి వాసనలతో కూడుకొన్న మాయ తప్ప మరేది కాదు. త్రిగుణాత్మకమైన మాయ త్రిగుణాలు సమానంగా ఉన్నప్పుడు శాంతంగా, కదలిక లేకుండా ఉంటుంది. పరమాత్మ శుద్ధచైతన్య రూపంగా తన్ను తాను తెలుసుకునే యోగనిద్రలో శయనించి ఉంటారు. ఏయే జీవుళ్ళ వాసనలు సృష్టికోసం తపిస్తున్నాయో అవి సమిష్టిగా చేరి మాయా శక్తి అయిన పరమాత్మ చైతన్యాన్ని తమలో ప్రతిబింబించుకొని ఈశ్వరునిగా రూపొందిస్తాయి. "సమిష్టి కారణ శరీరాభిమానీ ఈశ్వరః" ఈశ్వరసాన్నిధ్యంలో మాయాశక్తి విజృంభించి పంచతన్మాత్రలు ఏర్పడుతాయి. అవే లింగశరీరం లేదా సమిష్టి సూక్ష్మశరీరం అవుతుంది.
ఈశ్వర చైతన్యం సమష్టి సూక్ష్మశరీరంలో ప్రతిబింబించినప్పుడు హిరణ్యగర్భుడై, సృష్టి సంకల్పాన్ని పొందుతాడు. "సమష్టి సూక్ష్మ శరీరాభిమానీ హిరణ్య గర్భః"
సృష్టికి నాందిగా సూక్ష్మతన్మాత్రలు పంచీకరణం చెంది స్థూల భూతాలుగా మారుతాయి. అవే జీవుళ్ళు భోగించడానికి వీలైన అశేష వస్తు సముదాయంగా తయారవుతాయి. ప్రపంచంలోని అన్ని విషయ వస్తువులూ పంచభూతాల కలయికవల్ల ఏర్పడినవే.
*సూక్ష్మాఖ్య భూతగత సత్వరజస్తమోభిః:-* మాయ త్రిగుణాత్మికమైనది. ఆకాశం నుండి పృథివి వరకు తన్మాత్రలు యేర్పడినప్పుడు తన్మాత్రలన్నింట్లో మూడు గుణాలు మిళితమై వుంటాయి.
ఒక్కొక్క తన్మాత్ర యొక్క సాత్వికాంశం నుండి ఒక్కొక్క జ్ఞానేంద్రియం, పంచతన్మాత్రల సమష్టి సాత్త్వికాంశాల నుండి మనోబుద్ధి చిత్తాహంకారాలనే అంతఃకరణాలు ఉదయిస్తాయి.
పై పందొమ్మిదీ కలిసి లింగశరీరం కాగా అందులో ప్రతిఫలించిన పరమాత్మ చైతన్యం ఈశ్వరేచ్ఛ అయి, హిరణ్యగర్భుని సృష్టి అయి స్థూల సృష్టికి నాంది పలికిస్తుంది.
దానితో అయిదు తన్మాత్రలు తమనికాంశలు పంచీకరణం చెందుతాయి. అంటే పరస్పరం కలిసి స్థూల రూపాలని పొందాయి. (పంచీకరణం చివరి పేజీలో గమనించండి)
నాలుగో దశవరకు తన్మాత్రల తమసికాంశలలో విభజనలు జరుగుతాయి. చివరిదశ పంచీకరణం. ప్రతి తన్మాత్ర తన సగభాగాన్ని ఉంచుకొని ఎనిమిదో వంతులుగా విభజితమైన నాలుగింటినీ మిగతా నాలుగు తన్మాత్రలకి తలోటి ఇస్తుంది. ఇలా కలిసిపోయిన తన్మాత్రల చివరి రూపం స్థూలమైన పంచ మహాభూతాలు.
ఈ పంచభూతాలు ఒండొరులతో కలిసి సజాతీయ విజాతీయ స్వగత భేదాలతో కూడిన నామ రూప జగత్తుగా భాసిస్తాయి.
జీవుడిలో సాత్త్వికాంశాల వల్ల జనించిన జ్ఞానేంద్రియాలు అంతఃకరణం నామ రూపాల విషయ వస్తువుల్ని చూచి ప్రేమిస్తాయి. అతనితో రజసికాంశల వల్ల జనించిన పంచప్రాణాలు, కర్మేంద్రియాలు విషయవస్తువులో విహరిస్తూ
భోగిస్తాయి. అందుచేత యావత్ ప్రపంచము జీవుడికి భోగభూమిగా భగవతీ సంకల్పం వల్ల ఏర్పడింది.
*07) శ్లోకం:-*
*ఇత్థం ప్రమాదవశతః పరిముహ్యమానః
దేహాత్మ బుద్ధి పరికల్పిత కర్మబంధః |*
*స్వర్గాదిభోగ గమనాగమనాతి భిన్నః
లూతావదేష భవ మభ్యగమ చ్చిదాత్మా ॥ 7*
*టీకా*
ఇత్థం = ఈ ప్రకారంగా, ప్రమాద వశతః = పొరపాటు వల్ల, పరిముప్యమానః = పూర్తిగా భ్రాంతి చెందినవాడై, దేహ ఆత్మ, బుద్ధి = నేను దేహాన్ని అనే బుద్ధి చేత, పరికల్పిత = పూర్తిగా కల్పించబడిన, కర్మబంధః = కర్మబంధనంలో చిక్కుకున్న వాడై, స్వర్గ ఆది భోగ = సర్వభోగ్యములు మున్నగు వాటికోసం, గమన ఆగమన అతిభిన్నః = రాకపోకల వల్ల అమితంగా దుఃఖం పొందినవాడై, లూతావత్ = సాలెపురుగువలె, ఏష చిదాత్మా = ఈ చిద్రూపుడు, భవం = సంసారాన్ని, అభ్యగమత్ = పొందాడు.
*భావం:-*
ఈ ప్రకారంగా ఆలోచనా రాహిత్యం వల్ల భ్రాంతిలో పడినవాడై దేహమే తాను అనే భావం కల్పించే కర్మబంధనంలో ఇరుక్కొని స్వర్గాది సుఖాల కోసం రాకపోకలు సాగించి చిక్కులు పడుతూ సాలెపురుగువలె ఈ చిత్స్వరూపుడు సంసారాన్ని పొందుతాడు.
*వివరణ:-*
వివేకం లేనప్పుడు పతనం ఎలా పూర్తి అవుతుందో ఈ శ్లోకం వర్ణిస్తుంది. సాలెపురుగు తన నోట్లోంచి సృష్టించిన తంతువుతో పైకి క్రిందికి తిరిగి గూడు అల్లుతుంది. ఆపై అందులో ఇరుక్కుపోతుంది.
అలాగే తనదైన స్వరూపాన్ని మర్చిపోవడం ఒక పొరపాటు. తాను కాని దేహాన్ని తాను అనుకోవడం రెండో పొరపాటు. తాను దేహమనుకోవడంతోటే అనేకావసరాలు, భోగ్య వస్తువులపట్ల మమకారాన్ని స్వర్గలోకాన్ని గురించి కలలు కనడం అన్నీ మొదలవుతాయి. దేనిని కోరినా కర్మ అనే రొంపిలోకి దిగడం, ఫలితాల కోసం ఎదురు చూడడం తప్పనిసరి.
పని సరిగ్గా జరగక, ఫలితాలు ఆశించినట్లుగా లేకపోతే తిరిగి కర్మలో ఇరుక్కుపోతారు. కర్మ బాగా జరిగి ఆశించిన ఫలితాలు వస్తే, మరో రకం ఫలితాల కోసం తపన.... కర్మబంధం ఎన్నో రకాలుగా ఉంటుంది.
స్వర్గాన్ని చేరుకున్నా అది నిలకడగా ఉండేది కానందున తిరిగి రావడం తప్పనిసరి. అలసట తప్పని సరి. అన్నింటికీ భ్రాంతి, పొరపాటు కారణం.
08) శ్లోకం:-
మాయాయుత స్త్వగమ దీశ్వరతాం చిదాత్మా చా విద్యయా యుగ భవద్ధృత జీవభావః |
మాయా భవే ద్విమల సత్త్వగుణ ప్రధానా ప్రోక్తా మలాపిహిత సత్త్వగుణా త్వవిద్యా ॥ 8
టీకా
చిదాత్మా తు = చైతన్యరూపి అయిన ఆత్మ, మాయాయుతః = మాయతో కూడినవాడై, ఈశ్వరతాం ఆగమః = ఈశ్వరత్వాన్ని పొందాడు. చ = మరియు, అవిద్య యాయుక్ = అవిద్యతో కూడుకొని, ధృతజీవభావః = జీవభావాన్ని స్వీకరించిన వాడయ్యాడు, విమలసత్త్య గుణ ప్రధానా = శుద్ధసత్త్వాన్ని ప్రధానంగా కలిగినది, మాయా భవేత్ = మాయ అవుతుంది, మల అపిహత సత్త్వగుణ తు = మలినం చేత కప్పబడిన సత్యగుణం, అవిద్యా ప్రోక్తా = అవిద్యయని చెప్పబడుతుంది.
భావం:-
శుద్ధమైన సత్త్వగుణం ప్రధానంగా కలిగినది మాయ అనబడుతుంది. మాలిన్యం చేత కప్పబడిన సత్త్వగుణం అవిద్య అని చెప్పబడుతుంది. మాయతో కూడిన చైతన్యరూపుడైన బ్రహ్మము ఈశ్వరత్వాన్ని పొందుతుంది. అవిద్యతో కూడినప్పుడు జీవభావాన్ని పొందుతుంది.
వివరణ:-
తాను సృష్టించుకొన్న దానితో తాదాత్మ్యం పొంది పైకీ క్రిందకీ అనేక లోకాలకి జీవుడైన దేవుడు వెళ్ళి తిరిగి వస్తూంటే, ఆయా లోకాలని సృజించి, అతడి రాకపోకలని నియమబద్ధం చేసేదెవరు?
ఈ సందేహాన్ని పైశ్లోకం తీర్చుతుంది. పూర్వసృష్టిలో ఉన్న
జీవుళ్ళందరూ సంపాదించుకున్న సంస్కారాలు లేదా వాసనలు మూడు గుణాలతో కూడిన అవ్యక్త ప్రకృతిగా నిలిచి ఉంటాయి. సమష్టిలో అవి సత్త్వగుణ ప్రధానంగా ఉంటాయి. వ్యష్టిలో సత్త్వగుణం రజస్తమోగుణాల వల్ల మలినమై వుంటుంది.
సమష్టి వాసనలని మాయ అంటారు. మాయతో కూడిన చైతన్యం సత్త్వగుణ ప్రధానమై సర్వజ్ఞానము, సర్వశక్తి కలిగిన ఈశ్వరునిగా ప్రకటితమౌతుంది. అదే చైతన్యం మలిన సత్త్వమైన అవిద్యతో కూడి జీవుడౌతుంది. అందువల్ల జీవుణ్ణి అజ్ఞానము అశక్తత ఆవహిస్తాయి.
ఈశ్వరుడు లోకాలకి అధిపతి. జీవుడు కర్మబద్ధుడై లోకాలలో నిస్సహాయంగా సంచరించేవాడు. ఈశ్వరుడు జీవుడికి కర్మఫలాన్ని ప్రదానం చేస్తాడు. కర్మఫలాన్ని అనుభవించేవాడు జీవుడు.
____
09) శ్లోకం:-
ఏకోఽప్యనేక ఇవ భాతి శరీర భేదాత్ ఆత్మా ఘటాదిగత భేదవశా ద్వియద్వత్ ।
దేహేంద్రియాదిషు చలత్సు నిజప్రకాశాత్ పూర్ణోఽపి నిశ్చలతరోఽపి వికారవద్వత్ ॥ 9
టీకా
ఏకః అపి = ఒక్కటే అయినప్పటికీ, ఆత్మా = ఆత్మ, శరీర భేదాత్ = శరీరాల భేదాలనిబట్టి, అనేక ఇవ = అనేకం వలె, ఘట ఆది భేద వశాత్ = కుండ మొదలైనవాటి భేదాలవల్ల, వియత్ వత్ = ఆకాశంలాగా, భాతి = ప్రకాశిస్తుంది, చలత్సు= కదులుతూండే, దేహ ఇంద్రియ ఆదిషు = శరీరము, ఇంద్రియాలు మొదలైన వాటిలో, పూర్ణః అపి = (తాను) పరిపూర్ణమైనదైనా, నిజప్రకాశాత్ = (ప్రతిఫలించే) తన ప్రకాశం ద్వారా, వికారవత్ = మార్పులు కలిగిన దానివలె, (భాతి = ప్రకాశిస్తుంది)
భావం:-
కుండలు మొదలైన వాటిలో భేదాలను బట్టి ఏకమైన ఆకాశం భిన్నంగా కనిపించినట్లు ఏకమైన ఆత్మ శరీర భేదాలని బట్టి అనేకంగా
కనబడుతుంది. తాను పూర్ణము, నిశ్చలము అయివుండి కదులుతూ ఉంటే దేహేంద్రియాలలో ప్రతి ఫలించే చైతన్యపు కదలిక వల్ల వికారాలు చెందుతున్నట్లు కనబడుతుంది.
వివరణ:-
ఏకమైన పరమాత్మకి జీవుళ్ళుగా అనేక రూపాలుగా మార్పులు లేని ఆయన మార్పులకు లోనైన జీవుళ్ళుగా ఎలా వ్యక్తమౌతాడనే అనుమానాన్ని ఈ శ్లోకం నివృత్తి చేస్తుంది. పరమాత్మ ఎప్పుడూ ఏకమే. నిజంగా అనేకంగా మారడు. వికారాలకి లోనుకాడు.
ఆకాశం ఎప్పుడూ ఒకటే. వేరు వేరు ఇళ్ళు, గాదెలు, ఫ్యాక్టరీలు, కుండలు, పిడతలు, నిర్మాణమైనప్పుడు అన్నింటిలోను వేరు వేరు కొలతలతో, వేరు వేరు స్థలాలుగా కనబడుతుంది. అవి వున్నంత కాలమే ఆకాశం వేరు వేరుగా విభజితమైనట్లు కనబడుతుంది. వాటిని తొలగించినప్పుడు ఆకాశం యధా ప్రకారం ఏకంగా కనబడుతుంది. అలాగే వేరు వేరు శరీరాలలో కనబడే ఆత్మ కూడా. అనేకత, చూచే వాళ్ళ దృష్టిలో ఉన్నది కాని నిజంగా లేదు.
పుట్టినప్పటి నుండి పోయేంతవరకు జీవుళ్ళలో కనబడే మార్పులు కూడా దేహేంద్రియాల కదలిలకు, వాటిలోని మార్పులే, పరమాత్మవి కావు. మారిపోతూ కదులుతూ ఉండే వాటిలో పరమాత్మ చైతన్యం ప్రతిబింబించి నప్పుడు వాటి కదలికనుబట్టి చైతన్యం కదలినట్లనిపిస్తుంది.
చైతన్యం నిజంగా కదలదు. ప్రవహించే నీటి మీద సూర్యకాంతి ప్రతిబింబించి నప్పుడు, కాంతి ప్రవహిస్తున్నట్లనిపిస్తుంది. కాంతి ప్రవాహం చూచేవాళ్ళ దృష్టిలో వున్నది, కానీ నిజంగా లేదు
*🧘♂️10) శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి విరచితము ఆత్మవిద్యా విలాసము🧘♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*10) శ్లోకం:-*
*ఏవం భవార్ణవ నిమజ్జన దుఃఖితేషు లోకేషు పూర్వజని సంచిత పుణ్య పుంజైః |*
*కశ్చి ద్విశుద్ధమతి రేత్య గురుం కృపాబ్ధిం ప్రాహ ప్రణమ్య భవసాగర లంఘనేచ్ఛుః ॥*
*టీకా*
ఏవం = ఈ ప్రకారంగా, భవ ఆర్ణవ = సంసార సముద్రంలో, నిమజ్జన దుఃఖితేషు = మునగడంవల్ల దుఃఖపడుతూండే, జీవేషు = జీవుళ్ళలో, కశ్చిత్= ఒకడు, పూర్వజని సంచిత = పూర్వజన్మలలో సంపాదించుకొన్న, పుణ్యపుంజైః = పుణ్యాల సముదాయం వల్ల, విశుద్దమతిః = శుద్ధమైన బుద్ధి కలవాడై, కృపాబ్దిం = కరుణా సముద్రుడైన, గురుం = గురువును, ఏత్య = సమీపించి, ప్రణమ్య = నమస్కరించి, భవ సాగర లంఘన ఇచ్ఛుః = సంసార సముద్రాన్ని దాటవలెనని కోరిక గలవాడై, ప్రాహ = అడిగాడు.
*భావం:-*
ఇలా సంసార సాగరంలో మునిగి దుఃఖించే జీవులలో ఒకడు పూర్వజన్మ పుణ్యాల వల్ల శుద్ధమైన బుద్ధి కలవాడై సంసార సముద్రాన్ని దాటవలెననే కోరికతో కరుణాసముద్రుడైన గురువును సమీపించి, నమస్కరించి అన్నాడు.
*వివరణ:-*
జీవులు ప్రపంచంలో నడుచుకునే తీరు, కర్మ చేసే పద్ధతి, పెట్టుకున్న దృక్పథాల వల్ల పుణ్యమో పాపమో సంపాదించుకొంటారు. వ్యక్తిత్వాలలో వాసనల పొరలు పెరుగుతాయి.
బాగా పుణ్యాన్ని సంపాదించుకొన్న వాని సంస్కారాలు లేదా వాసనలు శుద్ధంగా ఉంటాయి.
కాబట్టి సంస్కారాల పొరలమాటు నుండి పరమాత్మ చైతన్యం ఎక్కువగా వెలువడి బుద్ధికి శుద్ధత్వాన్ని సూక్ష్మత్వాన్ని కలుగుజేస్తుంది. ఇందువల్ల అతనికి ప్రాపంచిక సుఖాల పైన మక్కువ లేక, ప్రపంచం నుండి త్వరగా బయటపడాలనే తపన బయలుదేరుతుంది.
తపన ఉన్నా స్వయంగా దారి వెదుక్కొని బయటపడటం దుస్సాధ్యం. దారి చూపే గురువును వెదుక్కొవాలి.
*కృపాబ్ధం, గురుం :-* అన్ని పరిధుల్ని తరించి బయట పడ్డ మహాత్ముడికి శిష్యుడు ఇవ్వగలిగింది ఏమీ లేదు. ఆయన కరుణాంతరంగుడై శిష్యులకి సహాయం చెయ్యాలి. అందులోనూ అజ్ఞానంలో అనేక పొరపాట్లు చేసే శిష్యులని క్షమిస్తూ, ఉదారబుద్ధితో బోధచేసేంత కరుణ కావాలి. అందుకే కరుణాసముద్రుడు అన్నారు.
ఆయనకి జ్ఞానం ఉండాలి. లేకపోతే శిష్యుల అజ్ఞానాన్ని నాశనం చెయ్యలేడు. అలా చెయ్య గలిగినవారే *గురువులు. 'గు' అంటే అజ్ఞానం 'రు' అంటే తొలగించడం.*
*ప్రణమ్య ప్రాహ: :-* మహాత్ముడైన గురువును సమీపించే శిష్యుడికి ఆయనప ట్ల అమితమైన భక్తి శ్రద్ధలుండాలి. సమానులతో, మిత్రులతో వ్యవహరించినట్లు వ్యవహరించరాదు. అహంకారాన్ని అణగగొట్టే మార్గం గురువుకి ప్రణామం చెయ్యడం.
కేవలం దండ ప్రణామాలతో సరిపోదు. శిష్యుడు గురువుతో తనకున్న బాధ యేమిటో, తనకు కావలసినది ఏమిటో విన్నవించుకోవాలి. శిష్యుని మాటల ద్వారా అతడి మనస్సు ఎంత పరిపక్వ స్థితికి వచ్చిందో అతడికి ఏ స్థాయిలో ఏ బోధ చెయవలెనో గురువుకి అవగతమౌతుంది.
ఆదర్శప్రాయుడైన ఒక శిష్యుడు, మహాత్ముడైన ఒక గురువుని సమీపించి ఏమి చేశాడో ఈ శ్లోకం చెప్పింది.
🕉️🌞🌍🌙🌟🚩
*🧘♂️11) శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి విరచితము ఆత్మవిద్యా విలాసము🧘♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*11) శ్లోకం:-*
*సంసార ఘోర జలధౌ భగవ న్నపారే తాపత్రయోఘ దహనే సహజారి నక్రే ।*
*మోహాంభసి ప్రచల దుద్భవ మృత్యుభంగే దీక్ష్యాన్తరస్మి పతితం జగదద్య భీతః ॥ 11*
*టీకా*
భగవన్ = పూజ్యుడా! అపారే = అంతులేని, సంసార ఘోర జలధౌ = సంసార మనే భయంకర సముద్రంలో, తాపత్రయ దేహ దహనే = తాపత్రయ సమూహాల బడబాగ్నిలో, సహజారి నక్రే = సహజశత్రువులనే మొసళ్ళతో, మోహాంభసి = మోహ మనే నీటిలో, ప్రచలత్ = విశేషంగా కదులుతూ, ఉద్భవ = జనించే, మృత్యుభంగే = మృత్యువనే అలలలో, అంతః = మధ్యలో, పతితం జగత్ = పడిన ప్రపంచాన్ని, వీక్ష్య = చూచి, అద్య = నేడు, భీతః అస్మి= భయపడిన వాడనవుతున్నాను.
*భావం:-*
ఓ పూజ్యుడా! అంతులేని భయంకర సంసార సముద్రంలో, తాపత్రయ సమూహాల బడబాగ్నిలో సహజ శత్రువులనే మొసళ్ళతో మోహమనే జలం నుండి కదులుతూ ఉద్భవించే మృత్యు తరంగాలలో పడిన జగత్తుని చూచి నేడు నేను భయపడు తున్నాను.
*వివరణ:-*
శిష్యుడి మాటలలో అతని కున్న బాధ ఏమిటో వ్యక్తమవుతుంది. అతడి భయం వ్యక్తిగతమైన విషయాలని గురించి కాదు. ధనికులు, పేదలు, యువకులు, వృద్ధులు ఎవరూ తప్పించుకోలేని సంసారాన్ని గురించి అతడు చింతిస్తున్నాడు. భయంకరమైన సముద్రంలో ఏమేమి వుంటాయో అవి అన్నీ సంసారంలో ఉన్నాయి.
*తాపత్రయాలు :-* ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మికాలనే మూడు రకాల తాపాలు ఎవరికీ తప్పవు. ప్రకృతి పరమైనవి - పంచభూతాల వైపరీత్యం వల్ల వచ్చేవి ఆధిదైవిక తాపాలు. చుట్టూతా ఉండే జీవుల వల్ల వచ్చే బాధలు ఆధిభౌతిక తాపాలు. శారీరకంగా, మానసికంగా, తనలో ఉండే తాపాలు ఆధ్యాత్మికమైనవి. వీటిలో ఏదో ఒకటి తీయకుండా మానవుణ్ణి బాధిస్తూనే వుంటుంది. తపింపజేస్తాయి కాబట్టి బడబాగ్నితో పోల్చారు.
*సహజారులు :-* దాయాదులు బాహ్య ప్రపంచంలో సహజ శత్రువులు. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అంతశ్శత్రువులు. మొసళ్ళవలె పట్టుకు మ్రింగుతాయి.
*మోహాంభస్సు:-* నీళ్ళు లేకుండా సముద్రం లేదు. అలాగే సంసారానికి మూలం, ఆధారం భ్రాంతి. సంసారం, సముద్రం రెండూ అపారమైనవే.
*మృత్యు భంగాలు :-* క్షణ క్షణం ప్రపంచంలో కలిగే మార్పులే మృత్యువు. 'మార్పు' అంటే ఒక స్థితి పోయి మరొక స్థితి రావడం. అంటే ఉన్నస్థితి చనిపోతే గాని క్రొత్త స్థితి రాదు. ఆ క్రొత్త స్థితి కూడా పోయి మరోటి వస్తుంది. అందుచేత కెరటాలవలె మృత్యువు లేచి పడుతూంటుంది.
*అద్య:-* పైన చెప్పినవన్నీ ఎప్పుడూ ఉన్నవే. వాటిని గుర్తించగానే భయం వేస్తుంది. గుర్తించిన మరుక్షణంలో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు భయపడుతున్నాననడం అందుకే.
🕉️🌞🌍🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి