శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
501వ నామ మంత్రము
ఓం గుడాన్నప్రీత మానసాయై నమః
బెల్లంతోగూడిన యన్నమనిన ఎంతో మనసుపడే లాకినీస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి గుడాన్నప్రీత మానసా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం గుడాన్నప్రీత మానసాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ లాకినీస్వరూపిణియైన పరమేశ్వరిని ఉపాసించు సాధకులు శాంతిసౌఖ్యములతోను, సకలశుభములతోను విలసిల్లుచూ, పరమేశ్వరియందు అచంచలమైన భక్తిప్రపత్తులతో జీవించి తరించుదురు.
లాకినీదేవీ స్వరూపిణియైన పరమేశ్వరికి గుడాన్నము (బెల్లముతోగూడిన అన్నము) అనిన ప్రీతి. చక్కెరపొంగలినికూడా గుడాన్నమందురు. బెల్లము శరీరానికి పుష్టినిస్తుంది. పరమేశ్వరిని ఆరాధనచేసి, గుడాన్నమును నివేదనచేసి, ఆ ప్రసాదమును ఆరగించు భక్తులు శరీరపుష్టితో గలిగియుందురు. ఒక్కొక్క దేవతాస్వరూపిణియైన పరమేశ్వరిని ఆరాధిస్తూ, ఆ దేవతకు ఇష్టమైన వివిధ రకములైన అన్నములు (నెయ్యితో గలిపినది, పాయసాన్నము, గుడాన్నము, చిత్రాన్నము, పప్పు అన్నము, పెరుగు అన్నము) నివేదించి, భక్తిగా ఆరగించుట వలన ధాతుపుష్టిని పొందుదురను ఆంతర్యము ఇదియే. ఇక్కడ లాకినీస్వరూపిణియైన దేవతకు గుడాన్నమనిన ఇష్టము అని చెప్పుటకు ఆ దేవత మాంసధాతువుకు అధిదేవతయగుటయే కారణమని భావించవచ్చును. లలితా సహస్ర నామావళి యందలి ప్రతీ నామము ఒకమంత్రమై, ఆ నామ మంత్రమునకు ఒక పారమార్థిక భావన ఉన్నదనుటలో సందేహములేదు.
లాకినీస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం గుడాన్నప్రీత మానసాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీలలితా సహస్రనామ భాష్యము
541వ నామ మంత్రము
ఓం అనుత్తమాయై నమః
జగన్మాతకన్నా అధికులుగానీ, సమానులుగానీ ఎవరూ లేరు; అట్టి తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్రనామావళియందలి అనుత్తమా అను నాలుగక్షరముల (చతురక్షరి) నామ మంత్రమును అత్యంత భక్తిశ్రద్ధలతో ఉచ్చరిస్తూ ఆ జగజ్జననిని ఉపాసించు సాధకులను వారి వృత్తి ప్రవృత్తులయందు ప్రజ్ఞావంతులను జేసి తద్వారా చతుర్విధ పురుషార్థ సంపన్నులుగాను, జగజ్జననియందు అచంచల భక్తివిశ్వాసము లుండువారిగా అనుగ్రహించి తరింపజేయును.
శ్రీలలితా పరమేశ్వరి పరమాత్మ స్వరూపురాలు. ఎవరికంటే ఉత్తమమైన వస్తువు లేదో, అట్టి వస్తువే పరమాత్మస్వరూపము. ఆత్మతో సమానమైనది, అంతకన్నా అధికమైనదీ వేరొకటిలేదు అని వేదమునందు చెప్పబడినది. అట్టి ఆత్మయే పరమాత్మ. ఆ పరమాత్మయే పరమేశ్వరి. స్మృతులందుకూడా పరమాత్మ ఓ పరమాత్మా! నీతో సమానమైనవాడు లేనపుడు, నీకన్నా అధికుడు కుడా ఎవరూ ఉండరు అని కీర్తింపబడడం జరిగినది . అందుచే ఆ పరబ్రహ్మస్వరూపిణి, పరమాత్మయైన జగన్మాత అనుత్తమా యని అనబడినది. ఆ పరమేశ్వరి శ్రీమాతా యని అనబడినది. అనగా అనంతకోటి జీవరాశులనుసృష్టించి, రక్షిస్తూ, కల్పాంతమందు తనలో లయము చేసుకొనుచున్నది. ఈ పని చేయడానికి వేరొకరు లేరు. వేరొకరు చేయలేరుకూడా. ఇక ఆ తల్లి శ్రీమహారాజ్ఞి సకలలోకాలకు లోకపాలురుఉన్నారు. సృష్టిస్థితిలయల కోసం త్రిమూర్తులను నియమించినది ఆ తల్లియే. లోకాలన్నియు తనఅదుపు, ఆజ్ఞలయందు చరింపజేస్తూ శ్రీమహారాజ్ఞియై ఉన్నది గనుకనే ఆ పరమేశ్వరియే అన్నిటిలో అధికురాలు. గనుకనే ఆ తల్లి అనుత్తమా యని అనబడినది. ఆ పరమేశ్వరి శ్రీమత్సింహాసనేశ్వరి ఆ తల్లి అధిష్ఠించిన ఆసనములు వేరొకరు అధిష్ఠించవీలగాదు. ఎందుకంటే ఆ తల్లికన్నా అధికులు ఎవరూ లేరు. గనుకనే అమ్మవారు అనుత్తమా యని అనబడినది. ఆ పరమేశ్వరి కోటిసూర్యప్రభలతో తేజరిల్లుతూ ఉంటుంది. అనంతకోటి చంద్రుల చల్లదనంతో భాసిల్లుచున్నది. మహాచతుష్షష్టికోటి యోగినీ గణములచే సేవింపబడుచున్నది. ఇంత వైభవం ఎవరికి ఉన్నది? ఎవ్వరికీ లేదు. గనుకనే ఆ పరమేశ్వరి అనుత్తమా యని అనబడినది. సుమేరుశృంగ మధ్యమందు, చింతామణి గృహంలో, చతుష్షష్టికళాప్రపూర్ణగా విలసిల్లు పరమేశ్వరి వైభవానికి సాటిలేదు. వేరొకరు పోటీలేరు. గనుకనే ఆ అమ్మవారు అనుత్తమా యని అనబడినది. కోట్లాది సహస్రనామములు ఉన్నవి. వాటిలో గంగా, భవానీ, గాయత్రీ, కాళీ, లక్ష్మీ, సరస్వతీ, రాజరాజేశ్వరీ, బాలా, శ్యామలా, లలితా యను దశసహస్రనామములే ఉత్తమమనుకుంటే, ఆ దశ సహస్రనామములలో వశిన్యాది వాగ్దేవతలచే విరచించబడిన తన సహస్ర నామములే (లలితా సహస్ర నామములే) ఉత్తమమైతే, ఆ పరమేశ్వరికన్నా సమానులు ఎవరు? అధికులు ఎవరు? ఎవరూ లేరు. గనుకనే శ్రీలలితా పరమేశ్వరి అనుత్తమా యని అనబడినది. యజ్ఞకుండములందలి హవిస్సులను దేవతలకందించే స్వాహాదేవి తానే అయిఉన్నది. పితృదేవతలకు కవ్యములను (పితృయజ్ఞములలో సమర్పించే హోమద్రవ్యములు) అందించే స్వధాదేవికూడా తానే. వేదములు, స్మతులు అన్నీ తానై యున్న తనకు సాటి వేరొకరు లేరు గనుక ఆ పరమేశ్వరి అనుత్తమా యని అనబడినది. సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక, ఆదిపరాశక్తి, సృష్టికిముందును, సృష్టియందును, సకలలోకములు లయమయినపిదపను ఎల్లప్పుడూ ఉంటూ దేశకాలాపరిచ్ఛిన్నా యని అనబడిన ఆతల్లికి సాటి ఎవరు? మేటి ఎవరు? గనుకనే ఆ అమ్మ అనుత్తమా యని అనబడినది. శ్రీలలితా సహస్ర నామములు ఉన్నవి వేయి అయినా , ఆ నామములకు అర్థములు అనంతకోటి. అందుకే ఆ తల్లి అనుత్తమా యని అనబడినది. ఈ విధంగా ఆ తల్లికన్నా ఉత్తములు, అధికులు వేరొకరు లేరని వేదములే ఘోషించుచున్నవి గనుక పరబ్రహ్మస్వరూపిణియైన పరమేశ్వరి అనుత్తమా యని అనబడినది.
ఆ పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం అనుత్తమాయై నమః అని అన వలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీలలితా సహస్రనామ భాష్యము
542వ నామ మంత్రము
ఓం పుణ్యకీర్తయే నమః
పుణ్యమైన కీర్తి గల పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్రనామావళి యందలి పుణ్యకీర్తిః అను నాలుగక్షరముల(చతురక్షరి) నామమును ఓం పుణ్యకీర్తయే నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగజ్జననిని ఉపాసించు భక్తులకు ఆ దేవి కరుణచే అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదలకు కావలసిన సాధనాపటిమ కలిగి ఆ తల్లి పాదసేవ యందు నిరతులై తరించుదురు.
శ్రీలలితా పరమేశ్వరి మహత్తరమైన యశస్సు గలిగినది. శ్రీలలితా సహస్ర నామములు రహస్యాతి రహస్యమైనవి. అంతమాత్రమున రహస్యముగా, ఎవరూ వినకుండా పఠించమనికాదు. సహస్ర నామము లందలి ప్రతీ నామమునకు బాహ్యార్థము ఒకటే ఉన్నను, అంతరార్థము చాలా నిగూఢమైనది. కోట్లాది భక్తులు, శ్రీవిద్యోపాసకులు, వ్యాఖ్యాతలు ఉన్నారు. ఒక్కొక్కరికీ ఒక్కొక్క విధముగా భావము స్ఫురిస్తూ ఉంటుంది. అన్ని భావములలో అమ్మవారు కీర్తింపబడుతోంది. శ్రుతులందు, స్మృతులందు మహత్తరముగా కీర్తింపబడినది. కీర్తింపబడు ప్రతీ కీర్తనయు అనంతపుణ్యప్రదము. గనుకనే శ్రీమాత పుణ్యకీర్తిః యని వశిన్యాది వాగ్దేవతలచే నామకరణము చేయబడినది. ఓం లేదా ఓం ఐం హ్రీం శ్రీం లేదా ఓం ఐం హ్రీం శ్రీం క్లీం అను బీజాక్షరములు అమ్మవారి సహస్ర నామములలో ఏ నామమునకైనను ముందుచేర్చి, నామము తరువాత నమః అని చేర్చి ఉచ్చరించితే ఆ నామము ఒక నామమంత్రమై యలరారుచున్నది. అటువంటి సహస్ర నామములు సహస్రనామ మంత్రములైతే, ప్రతీ నామ మంత్రము ఉపాసకునికి కైవల్యదాయకమగుచున్నది. భక్తునికి ఇష్టకామ్యార్థసిద్ధి గలుగుచున్నది. అంతటి పుణ్యప్రదమైన నామములు కలిగి యుండుటచే శ్రీలలితా పరమేశ్వరి పుణ్యకీర్తిః యని అనబడినది.
తన భర్తను (పరమేశ్వరుని) యజ్ఞమునకు పిలువకుండా తన తండ్రి అవమానిస్తే, పిలవని పేరంటమునకు తానే వెళ్ళింది. యజ్ఞశాలలో తన భర్తను తన తండ్రి దుర్బాషలతో అవమానిస్తే, యజ్ఞకుండములో ఆత్మత్యాగము చేసుకొని, శక్తిపీఠాధిష్ఠానదేవతయై, ఒక్కొక్క పీఠమునకు ఒక్కొక్క పుణ్యప్రదగాథతో భక్తులను పునీతులనుజేయునను పుణ్యమైన కీర్తిని గలిగియున్నదగుటచే ఆ శ్రీలలితా పరమేశ్వరి పుణ్యకీర్తిః యని అనబడినది.
లోకకంటకులైన మహిషాసుర, భండాసురాది రాక్షసులను సంహరించి, దేవతలకార్యములను చక్కబెట్టుటకు మరల మరల యవతరించుచూ దేవకార్యసముద్యతా యను నామప్రసిద్ధయను కీర్తినందిన పరమేశ్వరి పుణ్యకీర్తిః యని అనబడినది.
కంచి కామాక్షిగా, మధుర మీనాక్షిగా, కాశీ విశాలాక్షిగా, దేవతలందరిలో అనుత్తమ గా, గ్రామ గ్రామాన గ్రామదేవతగా భాసిల్లు పరమేశ్వరి భక్తజనుల పాలిట పుణ్యప్రదాతయైనది గనుక ఆ పరమేశ్వరి పుణ్యకీర్తిః యని అనబడినది.
అమ్మవారికి నమస్కరించునపుడు ఓం పుణ్యకీర్తయే నమః అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
543వ నామ మంత్రము
ఓం పుణ్యలభ్యాయై నమః
ఎన్నోజన్మల పుణ్యఫలంగా సాక్షాత్కారం ఏ పరమాత్మవలన లభిస్తుందో, అటువంటి పరమాత్మ అయిన శ్రీలలితా పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్రనామావళిలోని పుణ్యలభ్యా అను నాలుగక్షరముల (చతురక్షరి) నామ మంత్రమును ఓం పుణ్యలభ్యాయై నమః అని ఉచ్చరిస్తూ ఆ పరాశక్తిని ఉపాసిస్తే అది జన్మ జన్మల పుణ్యఫలమే అవుతుంది, ఆతల్లి తమ కనులముందు మందస్మితయై కనుల ముందు నిలిచిన భావం కలుగుతుంది, సరస్వతీ దేవి కచ్చపీ వీణామాధుర్యంకన్నా మధురమైన పలుకులతో ఆ పరమేశ్వరి తన అనుగ్రహభాషణం ప్రసాదించిన అనుభూతి కలిగి ఈ జన్మకు ఇదిచాలు అనిపిస్తుంది.
అనంతకోటి జీవరాశులలో మానవజన్మ ఉత్తమోత్తమమైనది. అత్యంత దుర్లభమైన మానవ జన్మ ఎన్నోజన్మల పుణ్యఫలంగా లభిస్తుంది. ఉత్తమమైన మానవజన్మలో పరబ్రహ్మ స్వరూపిణియైన పరమేశ్వరిని ఆరాధించగలిగుటయన్నదికూడా మరింత ఉత్తమము. శ్రీవిద్యోపాసన, శ్రీలలితా సహస్రనామ పారాయణము చేయు భాగ్యము అనునది పుణ్యఫలమే గాని అన్యము కానేకాదు. ఆ పరమేశ్వరి అనుగ్రహము పొందాలంటే ఎంతోపుణ్యము చేసిఉండాలి గనుకనే ఆ తల్లి పుణ్యలభ్యా యని అనబడినది.
పరమాత్మను ఆరాధించాలన్నా, పరమాత్మ నామము ఉచ్చరించాలన్నా, ఆలయంలో పరమాత్మయొక్క మూర్తిని దర్శించాలన్నా కావలసినది పుణ్యఫలం మాత్రమే. వేదాధ్యయనం చేసినా, శాస్త్రాలు, పురాణాలు పుక్కిటబట్టినా పరమాత్మను పొందలేము. అందుకు కావలసినది కేవలం పరమాత్ముని సేవించాలనే ఆసక్తి మాత్రమే.
ఏ వేదంబు పఠించె లూత , భుజగం బే శాస్త్రముల్సూచె దా
నే విద్యాభ్యసనం బొనర్చె గరి , చెంచే మంత్ర మూహించె , బో
ధావిర్భావ నిధానముల్ చదువులయ్యా ? కావు , మీ పాద సం
సేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా!
ఓ ఈశ్వరా ! జ్ఞాన సముపార్జనకు ప్రాణులకు విద్య అవసరం లేదు. నీ పాదసేవయే సమస్తజ్ఞానమును కల్గించును . ఎట్లనగా నిన్ను సేవించిన సాలెపురుగు ఏ వేదాధ్యయనము చేసి,జ్ఞానమును సముపార్జించినది . నిన్ను సేవించిన సర్పము ఏ శాస్త్రమును చదివినది . నిను పూజించిన ఏనుగు ఏ విద్య నభ్యసించినది . బోయవాడైన తిన్నడు ఏ మంత్రమును చదివి నిన్ను సేవించి ముక్తి పొందినాడు . కావున నీ పాదములను సేవించాలనే కుతూహలమే సమస్త జ్ఞానమును కల్గించును ప్రభూ.
పరమాత్మ నామ స్మరణచేయాలను తలంపు అయినను గతంలో చేసిన పుణ్యఫలమే గాని ఇంకేమియు కాదు.
శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరిలో ప్రథమశ్లోకంలో ఇలా అన్నారు.
శివః శక్త్యా యుక్తో- యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి|
అతస్త్వామ్ ఆరాధ్యాం హరి-హర-విరిన్చాదిభి రపి
ప్రణంతుం స్తోతుం వా కథ-మక్ర్త పుణ్యః ప్రభవతి|| 1 ||
అమ్మా పరమేశ్వరీ! నిన్ను నిత్యము శివుడు,విష్ణువు, బ్రహ్మ మొదలైన దేవాదిదేవతలే కొలుస్తూ ఉంటారు.
అటువంటి నిన్ను కొలవాలన్నా నీ పాదపద్మాలు సేవించాలన్నా ఎన్నో జన్మ జన్మల పుణ్యం చేసినవారికి తప్ప అన్యులకు ఆ భాగ్యము దక్కదు కదా!
రాక్షసరాజైన హిరణ్యకశిపునికి భక్తుప్రహ్లాదుడు కుమారుడై పుట్టాడు. ఆ పరమాత్మను సేవించి ధన్యుడయాడు. ప్రహ్లాదునికి ఆ జన్మ గతజన్మ పుణ్యఫలము తప్ప అన్యముగాదు.
ఎంతటి పుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ
మంతనమెట్టిదో యుడుతమైని కరాగ్ర నఖాంకురంబులన్
సంతసమందఁజేసితివి సత్కులజన్మమ దేమిలెక్క వే
దాంతముగాదె నీ మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!
శబరి ఎంతటి పుణ్యాత్మురాలో గదా! ఆమె ఎంగిలి చేసిన పండ్లు
పరమాత్మ అవతారమైన రాముడు స్వీకరించాడు. ఉడుత తనకు చేతనైన సాయం మనస్ఫూర్తిగా చేసినందువలననే పరమాత్మస్వరూపుడైన రాముడు తన చేతులలోనికి తీసికొని దాని శరీరాన్ని చేతివేళ్ళతో నిమిరాడు. గనుక పరమాత్మను పొందాలంటే ఎంతో పుణ్యఫలం ఉండాలి.
జగన్మాతను ఆరాధించాలన్నా, ఆతల్లి నామాన్ని నోటితీరా ఉచ్చరించే భాగ్యముకావాలన్నా ఎన్నో జన్మల పణ్యఫలం ఉంటేనే అది సాధ్యమవుతుంది. శ్రీవిద్యో పాసన ఉపాసకుని చరమ జన్మయందుగానీ లభించదనియు, అట్టి ఉపాసకునికి గర్భనరకము లేదని పురాణ ప్రతీతి. శ్రీదేవి కృప గలిగిన జన్మ, జరా, మరణముల కతీతుడై, జీవన్ముక్తుడై తరించును. అంతటి పుణ్యం లభ్యమై ఉండాలి గనుకనే ఆ పరమేశ్వరి పుణ్యలభ్యా అని యనబడినది. మనము. మన భావములను బట్టి, శ్రద్ధను బట్టి ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. నామరూప వివర్జితా అని పరమేశ్వరిని అన్నాము. ఒక ప్రత్యేకమైన నామముగాని, రూపముగాని ఆ తల్లికి లేవు. కోట్లాది నామములు, అనంతకోటి రూపాలు ఉన్న ఆ పరమేశ్వరిని మన మనో నేత్రములతో ఏ రూపంలో దర్శిస్తే అదే ఆ తల్లి స్వరూపం. ఆ దర్శనభాగ్యమునకు కూడా గతజన్మ పుణ్యఫలమే కారణమౌతుంది. ఆ తల్లిని దర్శించేది భక్తులుమాత్రమేకాదు. మహిషాసుర, భండాసురాది రాక్షసులుకూడా. రాక్షసులు కూడా ఆ తల్లిని దర్శించారంటే, వారికి కూడా కొంత పుణ్యఫలం ఉన్నదనియే గదా!
అన్నీ మనం కల్పించుకున్నవే. మనం ఏది గీస్తే అదే ఆ పరమాత్మ స్వరూపము, పిలిచినదే నామము. చెక్కి నిర్మించినదే విగ్రహం, సకల జగత్తుకూ ఆ పరమేశ్వరియే ఆధారం. పుణ్యములు రెండు విధములు. కోరికలతో చేసే పుణ్యం కామ్యము. కోరికలు లేకుండా చేసేది నిష్కామ్యము. కోరికతో చేసే పుణ్యానికి బంధం ఏర్పడుతుంది. నిష్కామ్యమునకు బంధవిముక్తి ఉంటుంది. నిష్కామ కర్మ సుకృతమై నిలుస్తుంది. అట్టి సుకృతమే జన్మజన్మలపర్యంతం ఆత్మతో పయనిస్తుంది. అందుకే అన్నారు పోయేటప్పుడు తీసుకుపోయేది కర్మఫలం ఒక్కటే. అది పాపమైతే పాపఫలం, పుణ్యమైతే పుణ్యఫలం.
దేవీ భాగవతం తృతీయ స్కంధములో "అధికమైన పుణ్యముగలవారు, తపస్సంపన్నులు మంగళప్రదయైన దేవిని చూచుచున్నారు. రాగము, ఈ దేహముపై మోహము ఉన్నవారు ఎవ్వరును ఆ పరమాత్మను చూడలేకున్నారు" అని చెప్పబడినది. అందుచేత పుణ్యచరితులు మాత్రమే శ్రీలలితా పరమేశ్వరిని దర్శింపగలరు. కావున దేవి పుణ్యలభ్యా అనబడును.
శ్రీలలితా పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం పుణ్యలభ్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
544వ నామ మంత్రము
ఓం పుణ్యశ్రవణ కీర్తనాయై నమః
ఎవరి కథా శ్రవణకీర్తనలు పుణ్యమును ప్రసాదిస్తాయో అటువంటి జగన్మాతకు నమస్కారము
శ్రీలలితా త్రిపురసుందరీ సహస్రనామావళి యందలి పుణ్యశ్రవణకీర్తనా యను ఎనిమిద క్షరముల (అష్టాక్షరి) నామమంత్రమును ఓం పుణ్యశ్రవణకీర్తనాయై నమః అని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉచ్చరించుచూ ఆ తల్లిని ఉపాసించు సాధకులకు ఎనలేని బ్రహ్మజ్ఞాన సంపదలు లభించి ఆ జగజ్జననీ పాదసేవనా నిరతులై తరించుదురు.
ఆ పరమేశ్వరి కథలన్నియు పుణ్యప్రదమైనవి. కోట్లాది సహస్ర నామములలో ఏకైక సహస్ర నామము రహస్యాతి రహస్యమైన శ్రీీలలితా సహస్ర నామము. ప్రతీనామము బాహ్యముగా అర్థము ఒకటే యున్నను అనంతమైన అర్థములను తెలియజేసే పుణ్యప్రదమైన భావములు ఎన్నో ఉన్నవి. అందుకే శ్రీలలితా సహస్ర నామ పారాయణమాచరించు సమయంలో ప్రతీనామానికి గల బాహ్యార్థము, నిక్షిప్తమైన అంతర్భావము సమన్వియించుట అత్యంత పుణ్యప్రదము. అమ్మవారిని ఆనామములు, అంతర్లీనమైన భావములు అమ్మవారిని కీర్తించునవి అయితే, అవి అన్నియు మనకు పుణ్యశ్రవణములే. గనుకనే అమ్మవారు పుణ్యశ్రవణ కీర్తనా యని వశిన్యాదులు అయిదువందల నలుబది నాలుగవ (544వ) నామముగా కీర్తించారు.
శంకర భగవత్పాదులవారు తమ సౌందర్య లహరిలో అరువది ఆరవ (66వ) శ్లోకములో ఇలావివరించారు:-
విపంచ్యా గాయంతీ - వివిధ మపదానం పశుపతే
స్త్వయారబ్ధే - వక్తుం చలిత శిరసా సాధువచనే |
త్వదీయై ర్మాధుర్యై - రపలపిత తంత్రీకలరవామ్
నిజాం వీణాం వాణీ - నిచుళయతి చోళేన నిభృతమ్||66||
ఓ పరమేశ్వరీ! ఒకసారి నీవు సమస్త దేవతలతో సభలో కొలువుతీరి ఉన్నావు. అదే సమయం లో కచ్చపీ వీణ ధరించియున్న సరస్వతీదేవి నిన్ను ఆనందపరచుట కొరకై తన గాత్రాన్ని వీణతో అనుసంధానం చేస్తూ నీ భర్త యైన పరమేశ్వరుని యొక్క వీర గాథలను గానం చేయుచున్నది. అపుడు నీవు ఆ శివగాథా గాన శ్రవణంతో పరవశవై తల యాడించు చుంటివి. అది చూసిన సరస్వతీదేవి నేను పాడితే ఎవరైనా పరవశులు కావలసిందే అని కొంచం మనోగర్వమునకు లోనైనది. నిన్ను మరింత మెప్పించాలని ఆ వాణి ఇంకా అద్భుతంగా పాడుట మొదలుపెట్టినది. అప్పటివరకు మౌనంగా పరవశిస్తున్న నీవు, ఓ పరమేశ్వరీ! పరమానందంతో బాగు బాగు అని కచ్చపీవీణాపాణిని మెచ్చుకున్నావు. ఆ బాగు బాగు అను రెండు మాటలలో కోకిల కలకూజితాన్ని మించిన మాధుర్య శోభతో ఉన్న నీ కంఠస్వరం విని, నీ సామాన్య పలుకుల మధురిమ ముందు ఇంతవరకూ తను చేసిన విన్యాసమంతా ఎందుకూ కొరగాదని తెలుసుకుని ఇక పాడటం ఆపివేసింది. సిగ్గుతో తన కచ్చపి అను వీణను కనబడకుండా పైటకొంగుతో కప్పి దాచుకొనుచున్నది.
అమ్మా నీ పలుకులు సరస్వతీ గానాన్ని మించిన మధురాతి మధురమైనవి.
పుణ్యప్రదములైన వాక్కులను వినుటకునూ, పుణ్యప్రదమనందుటకై కీర్తించుటకును ఆ జగన్మాత తన భక్తులను అనుగ్రహించును. శ్రీలలితా పరమేశ్వరి నామకీర్తనము, నామకీర్తన శ్రవణము, ఆ పరమేశ్వరి రూపమునూహించి చేయు ధ్యానములు, అమ్మవారిని కీర్తించుచూ మహాత్ములు వినిపించు పుణ్యకీర్తనములు అపారమైన మరియు ఊహాతీతమైన పుణ్యఫలము లభించునట్లు చేయును ఆ జగన్మాత. ఆపదలనుండి కాపాడుటకు లలితా సహస్రనామ పారాయణమును భక్తితో ఆచరించు వారిని కంటికి రెప్పవలె కాపాడుతుంది ఆ పరమేశ్వరి. గనుకనే ఆ పరమేశ్వరికి పుణ్యశ్రవణ కీర్తనా అనే నామముతో వశిన్యాదులు అమ్మవారిని కీర్తించారు. ఆ కీర్తన అత్యంత పుణ్యప్రదమైనది. అటువంటి పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం పుణ్యశ్రవణ కీర్తనాయై నమః అని యనవలెను.
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
545వ నామ మంత్రము
ఓం పులోమజార్చితాయై నమః
పులోముని పుత్రికయైన ఇంద్రాణి (ఇంద్రుని భార్య) చేత అర్చించబడిన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి పులోమజార్చితా అను ఆరు అక్షరముల (షడాక్షరి) నామ మంత్రమును ఓం పులోమజార్చితాయై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు ఉపాసకులకు ఆ కరుణా మయి అనుగ్రహంచే జ్ఞాన సిద్ధులై, పరతత్త్వరూపిణియైన జగజ్జనని స్వరూపము అనుభవైకవేద్యమయి, ఇహమందు అన్నవస్త్రాది భోగభాగ్యములకు లోటులేక, అంత్యమున అమ్మనే స్మరిస్తూ తరించగలుగుతారు.
ఇంద్రుని భార్య అయిన ఇంద్రాణి (శచీదేవి) పులోముని కూతురు. గనుకనే శచీదేవి పులోమజ అని యనబడినది.
నహుషుడు చంద్రవంశంలో జన్మించిన గొప్ప రాజు. దానధర్మాలతో, యజ్ఞయాగాలతో, యయాతి వంటి పుత్రులతో ప్రపంచమంతటా వేనోళ్ల కీర్తింపబడిన వాడు. అలా దశదిశలకూ వ్యాపించిన అతని కీర్తి, ఇంద్రలోకానికి కూడా చేరుకుంది.
ఒకసారి ఇంద్రుడు వృత్రాసురుడు అనే రాక్షసుని సంహరించాడు. దాని వల్ల తనకు పాపం చుట్టుకుందని భావించిన ఇంద్రుడు, కొన్నాళ్ల పాటు నారాయణమంత్రాన్ని జపిస్తూ ఒక కమలంలో ఉండిపోవాలని నిశ్చయించుకుంటాడు. కానీ ఇంద్రుడు వచ్చేవరకూ ఇంద్రపదవిని అధిష్టించేది ఎవరు అన్న సమస్య మొదలైంది. ఇంద్రపదవిని చేపట్టేందుకు అందుకు సరైనవాడు ఎవరా అని అష్టదిక్పాలకులంతా ఆలోచించగా, నహుషుడే అందుకు తగినవాడు అని ముక్తకంఠంతో చెప్పారు. దాంతో ఒక సాధారణ రాజైన నహుషుడికి ఇంద్రపదవిని కట్టబెట్టారు.
ఇంద్రపదవిని చేపట్టిన నహుషుడు మొదట్లో బాగానే ప్రవర్తించాడు. కానీ రానురానూ అతనిలో అధికారం తలకెక్కింది. మదపు మత్తులో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అలాంటి నహుషునికి ఓమారు ఇంద్రుని భార్య అయిన శచీదేవి కనిపించింది. అంతే! ఇంద్రపదవి నాదే అయినప్పుడు ఇక ఇంద్రుని భార్య కూడా నాదే కావాలి అనుకున్నాడు నహుషుడు. వెంటనే ఆమెకు తన మనసులో మాటను తెలియచేశాడు. నహుషుని మాటలకు శచీదేవి విస్తుబోయింది. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. వద్దు అన్నా వినేలాగ లేడు నహుషుడు. ఆ సమయంలో దేవతల గురువు బృహస్పతి, శచీదేవికి భువనేశ్వరీ మంత్రాన్ని ఉపదేశించి "అమ్మా! ఇంద్రాణీ! ఈ మంత్రాన్ని ఉపదేశించి పరమేశ్వరి అనుగ్రహం సంపాదించుకో. ఆ తల్లే సమస్యను పరిష్కరిస్తుంది" అన్నాడు.
బృహస్పతి సలహామేరకు శచీదేవి పరమేశ్వరిని ఆరాధించింది.
పులోమజచే అర్చింపబడిన పరమేశ్వరి సంతసించి తన మాయను ప్రభావితంచేయుటచే ఇంద్రపదవిలో నున్న నహుషునికి గర్వం తలకెక్కింది. అగస్త్యుడు మొదలైన ఋషులందరి చేతా తన పల్లకీని మోయించుకున్నాడు. ఇంద్రపదవి, అందువల్ల శచీదేవి కూడా తనది కాబోతుందనుకున్నాడు. నహుషునిలోని గర్వానికి అంతులేకుండా పోయింది. శచీదేవిని చేరాలనే దుర్బుద్ధి అధికమైపోయింది. గర్వం తలకెక్కి పల్లకీని మోస్తున్న అగస్త్యుడిని ఒక్క తాపు తన్నాడు. సర్ప! సర్ప! (త్వరగా, త్వరగా) అంటూ ఆయనను తొందరపెట్టాడు. ఆ అవమానాన్ని అగస్త్యుడు ఓర్వలేకపోయాడు. ‘సర్ప! సర్ప! అంటున్నావు కదా! నువ్వు సర్పానివై భూలోకాన పడి ఉండు,’ అంటూ నహుషుడిని శపించాడు. నహుషుడు పామైపోయి భూలోకానికి వెళ్ళాడు. తరువాతకూడా శచీదేవి పరమేశ్వరిని ఆరాధించుతూనే ఉన్నది. పరమేశ్వరి కరుణచే ఇంద్రుడుకూడా తిరిగి ఇంద్రపదవి చేపట్టాడు. పామైపోయిన నహుషుడు తప్పు తెలిసికొని పరివర్తనచెందాడు. ఇదంతా పులోమజ చే (ఇంద్రాణిచే) పూజింపబడిన పరమేశ్వరి వలననే ఇంద్రునికి మరల ఇంద్రపదవి లభించుట, నహుషునికి శాపవిమోచనము కలిగి పరివర్తన చెందుట జరిగినది. ఆ విధముగా పులోమజచే అర్చింపబడిన పరమేశ్వరి పులోమజార్చితా యని వశిన్యాది వాగ్దేవతలచే కీర్తింపబడినది.
అమ్మవారికి నమస్కరించునపుడు ఓం పులోమజార్చితాయై నమః అని అనవలెను.
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
546వ నామ మంత్రము
ఓం బంధమోచన్యై నమః
జీవుణ్ణి అవిద్యా బంధముల నుండి విముక్తి లభింపజేయు పరమేశ్వరికి నమస్కారము
శ్రీలలితా సహస్రనామావళియందలి బంధమోచనీ యను ఐదు అక్షరముల (పంచాక్షరి) నామ మంత్రమును అత్యంత భక్తిశ్రద్ధలతో ఓం బంధమోచన్యై నమః అని ఉచ్చరిస్తూ ఆ పరాశక్తిని ఉపాసించు సాధకులకు ఆత్మానుభూతియు, విశ్వానుభూతియు అమ్మ దయచే ప్రాప్తించి తరించుదురు.
బంధములు (పాశములు) అనునవి అవిద్యాసంబంధమైనవి. అనగా అజ్ఞాన సంబంధమైనవి. జీవుడు తల్లిగర్భంనుండి భూమిపై పడినంతనే, ఆ శిశువుపై నీళ్ళు చిలకరించుతారు. అంతే ఆ శిశువు ఒక్క సారి కేర్ అంటూ ఏడుస్తాడు. ఆ ఏడుపు అర్థం ఏమిటంటే గతస్మృతులు పోయాయనియు, మళ్ళీ జన్మించానా? అనియు ఆ ఏడుపులోని అర్థం. అంతటితో ఆ శిశువు బంధాలలో పడ్డాడు. తల్లి, తండ్రి, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అను ఈ బంధాలలోనికి ప్రవేశించాడు. ఈ బంధాలు అన్నియు అవిద్యాపరమైనవి.
ఎలాగైతే అజ్ఞానము వ్యక్తిని సంసారములో', అంటే నిరంతర జనన-మరణ చక్రం లో పడవేసి, బాధకు గురిచేయునో, అలాగే, జ్ఞానమునకు వ్యక్తిని భౌతిక బంధము నుండి విడిపించే శక్తి కూడా ఉంటుంది. ఇటువంటి జ్ఞానము ఎప్పుడూ కూడా భగవంతుని పై భక్తితో కూడి ఉంటుంది.
తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః|
గచ్ఛంత్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః॥
(భ.గీ - 5.17)
తమ బుద్ధి భగవంతుని యందే స్థితులైనవారు, సంపూర్ణముగా భగవంతుని యందే నిమగ్నమైన వారు, ఆయనే పరమ లక్ష్యమని ధృఢ విశ్వాసం కలవారు - వారి పాపములు జ్ఞాన కిరణాలచే నిర్మూలింపబడి, త్వరిత గతిన, మరలా తిరిగిరాని స్థితిని పొందుతారు.
పరమేశ్వరి తన భక్తులకు ఏర్పడు సకల బంధములనుండి విముక్తిని కలుగజేయును.
ఈ శ్లోకం, సంపూర్ణ భగవంతుని ధ్యాసను సూచించటానికి చాలా బలమైన పద ప్రయోగం చేస్తున్నది.
బంధములు అనునవి మూడురకములు.
భౌతిక బంధమ అనునది, ఎవరి చేతనైనా చెరబట్టబడి యుండుట, కారాగార వాసము, ఆపదలో చిక్కుకుని ఎక్కడైనా ఉండిపోవడం అనునది భౌతిక బంధము.
మానసిక బంధము దేనికోసమైనా ఆశపడడం, అర్హతకు మించి ధనం సంపాదించాలనే దురాశ, కామము, క్రోధము, అభిమానము ఇలాంటివి అన్నియును మానసిక బంధములు.
ఆధ్యాత్మిక బంధము గురువుయెడ చేసిన తప్పు వలనగాని, మంత్రసాధనలో లోపము వలన ఏర్పడిన దోషము వలనగాని, ఎవరికో ఆపదకలిగించాలనే దురుద్దేశంతో చేయు పూజలవలన గాని మనసు దెబ్బతింటే ఆ బంధము ఆధ్యాత్మికమవుతుంది.
ఇటువంటి బంధాలనుండి జగన్మాత తన భక్తులను విముక్తులను చేస్తుంది గనుకనే ఆ తల్లి బంధమోచనీ యనిఅనబడినది.
ఉదయం లేచినప్పటి నుండి నిద్రపోయే వరకూ కూడా సంసారపరమైన, వృత్తిపరమైన వివిధబంధాలలో చిక్కుకుని క్షణకాలంకూడా పరమాత్మపై మనసు నిలుపలేక బాధ పడడం సహజం. అలా పరమాత్మయందు మనసు నిలుపలేక పోవుటయే ఒక పెద్ద బంధము. ఎంత పని ఉన్నా ఒక్క క్షణమైనా పరమాత్మయందు మనసు ఉంచితే అది పవిత్రబంధం అవుతుంది. దాని వలన అవిద్యాపరమైన బంధములన్నియు తొలగిపోయి శాశ్వతమైన పరమాత్మ బంధం ఏర్పడుతుంది. అదే అసలైన బంధము. ఈ పరమార్థాన్ని తెలుసుకొని ఇరువది నాలుగు గంటల సమయంలో కనీసం ఇరువది నాలుగు నిముషములు ఆ పరమేశ్వరిపై ధ్యానము ఉంచుట అత్యుత్తమము.
సర్వబంధముల (అవిద్యా సంబంధమైన బంధముల) నుండి విముక్తిని గావించు జగన్మాతకు నమస్కరించు నపుడు ఓం బంధమోచన్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీలలితా సహస్రనామ భాష్యము
547వ నామ మంత్రము
ఓం బన్ధురాలకాయై నమః
వంకీలు తిరిగి అందముగానున్న ముంగురులు కలిగిన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా పరమేశ్వరి సహస్రనామావళి యందలి బన్ధురాలకా అను అయిదక్షరముల (పంచాక్షరి) నామ మంత్రమును ఓం బన్ధురాలకాయై నమః అని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరి పాపపద్మములపై దృష్టి నిలిపి ఉచ్చరిస్తూ, ఆ తల్లిని ఉపాసించు భక్తులకు ఆత్మానుభూతియు, ఐహిక, ఆముష్మిక శుభాలను ఆ పరమేశ్వరి ప్రాప్తింపజేసి తరింపజేయును
ఇదంయతు మహాద్భూతం అనన్తమపారం ప్రజ్ఞానమేవచ ఆ జగదీశ్వరి ప్రభావము మహిమాన్వితమును, అనన్తమును, అపారమును, ప్రజ్ఞానమును అయినదని భావము.
అమ్మవారు అందముగా, దట్టముగా, వంకీలు తిరిగిన ముంగురులతో శోభిల్లుచున్నది.
బన్ధురాలక అనగా బన్ధుర+అలకా (బంన్ధురాలకా)
కొందరు ఈ నామ మంత్రమును బర్బరాలక అని చదువుతారు; పొట్టిగాను, వంకరులు గాను, అలలవలె, ఉంగరములుగా ఉండిన ముంగురులు కలిగినది ఆ పరమేశ్వరి అని భావము.
అమ్మవారు అపురూప లావణ్యవతి. అష్టమి చంద్రుని వలె ప్రకాశించే లలాటము (అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థలశోభిత), మన్మథుని మాంగల్య గృహమును బోలిన వదనానికి గృహతోరణాలై విరాజిల్లు కనుబొమలు (వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లిక), ముఖకాంతిప్రవాహంలో చలించే మీనముల వంటి నయనములు (వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచన), అప్పుడే వికసించిన సంపెంగవంటి నాసాదండము (నవచంపకపుష్పాభ నాసాదండ విరాజిత), శుక్రనక్షత్ర కాంతులను సైతం ధిక్కరించే నాసాభరణ కాంతులు (తారాకాంతి తిరస్కారి నాసాభరణ విరాజిత), పద్మరాగ శిలలను, అద్దమును తిరస్కరించే నిర్మలమైన, నున్ననైన చెక్కిళ్ళు (పద్మరాగ శిలాదర్శ పరిభావి కఫోలభూః), అప్పుడే సాన బట్టిన పగడము, దొండపండుల కాంతిని వెక్కిరించే ఎర్రని కాంతులతో ప్రకాశించే పెదవులు (నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛద), షోడశీమంత్రబీజాక్షరములవలె ప్రకాశించు పలువరసల జంట (శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్జ్వల)....ఇలా అవయవ సౌందర్యసంపదతో అపురూప లావణ్యవతియగు ఆ తల్లి దట్టముగా, నల్లగా, ఎత్తు పల్లములతో వంకీలుగా ఉన్న ముంగురులతో ద్విగుణీకృతమైన సౌందర్యముతో జగదేక సుందరియై భాసిల్లుచున్నది. ఆ అందమైన కేశసంపదతో లోకమోహన రూపధారిణియై విరాజిల్లు ఆ తల్లి బంధురాలకా యను నామముతో వశిన్యాదులచే కీర్తింపబడినది. శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరి, నలుబది ఐదవ శ్లోకంలో ఇలా వర్ణించారు:
అరాలై స్వాభావ్యా-దలికలభసశ్రీభిరలకైః
పరీతం తే వక్త్రం - పరిహసతి పంకేరుహ రుచిమ్ |
దరస్మేరే యస్మిన్ - దశనరుచి కింజల్కరుచిరే
సుగంధౌ మాద్యంతి - స్మరదహన చక్షుర్మధులిహః॥45॥
ముంగురులచే కమ్ముకొనిన జగన్మాత వదనము పద్మములను సైతము పరిహసించుచున్నది.
ఓ లలితాంబికా! పరమేశ్వరీ! సహజంగా వంకరలు తిరిగినవై తుమ్మెదల కాంతివంటి నల్లని కాంతి కలిగిన ముంగురులు మీద పడుచున్న నీ ముఖారవిందము పద్మముల అందమును ధిక్కరించుచిన్నది. అది ఎలాగ అంటే, ఆ పద్మాలు ఎంత అందంగా ఉన్నా - నీ ముఖం అంతకు మించిన సౌందర్యంతో ఉంటుంది.ఆ పద్మాలలో నిత్యం సువాసనలు వెదజల్లే కింజల్కాలు ఉంటే - నీ ముఖంలో నిత్యం చిరునవ్వుల పరిమళాలు వెదజల్లే దంతాలు ఉన్నవి. ఆ పద్మాల మీద తుమ్మెదలు వాలుతూ ఉంటే - నీ ముఖముపై నీ ముంగురులు దోబూచులాడుచున్నవి. అంతమాత్రంచేత ఆ పద్మాలతో నీ వదనారవిందాన్ని పోల్చరాదు. ఎందుచేతననగా ఆ పద్మముల మకరందమును గ్రోలుటకై తుమ్మెదలు మాత్రమే మోహపడుతున్నవి కాని పలువరుస తళుక్కులతో చిరునవ్వుల సోయగముతో నిండియున్న నీ ముఖ సౌందర్య మకరందాన్ని గ్రోలుటకు ఎటువంటి కామ వికారములు లేక ఆ మన్మథుడినే జయించిన ఆ కామేశ్వరుని చూపులు అను తుమ్మెదలు నిత్యం నీ ముఖముపైనే ముసురుకొనుచున్నవి. అనగా మన్మథుడిని సైతము జయించిన శంకరుడు అమ్మ సోయగమునకు వశుడైనాడు.
అటువంటి త్రిపురసుందరీ మాతకు నమస్కరించు నపుడు ఓం బన్ధురాలకాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
548వ నామ మంత్రము
ఓం విమర్శరూపిణ్యై నమః
విమర్శ రూప శక్తిగా (విచారణా శక్తిగా) విరాజిల్లుచున్న శ్రీలలితా పరమేశ్వరికి నమస్కారము
శ్రీలలితా సహస్ర నామావళి యందలి విమర్శరూపిణీ యను ఆరు అక్షరముల (షడాక్షరీ) నామ మంత్రమును ఓం విమర్శరూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకుడు విమర్శనాత్మక రూపమును తెలియకుండునా? (తెలియగలడు), బ్రహ్మజ్ఞానతత్త్వాన్ని తనలో ఇముడ్చుకొనుటకు ఆ పరమేశ్వరిని ఉపాసించు క్రమము కనగొనకుండునా? (కనుగొనును), ఆ తల్లి కరుణచే భౌతిక ఆధ్యాత్మిక శుభములను ప్రాప్తించి సర్వకాల సర్వావస్థలయందూ పరమేశ్వరి రక్షణతో జీవించి తరించును.
జగన్మాత పరబ్రహ్మ స్వరూపిణి. ఆ తల్లి పరమాత్మ. పరమాత్మయొక్క ప్రకాశస్వరూపస్ఫురణకు విమర్శ యని అందురు. పరమాత్మయైన పరమేశ్వరి అనగా పరబ్రహ్మము యొక్క సహజమగు ప్రకాశము. అటువంటి సహజప్రకాశము యొక్క స్ఫురణాశక్తియే విమర్శ. గనుకనే పరమాత్మయైన పరమేశ్వరి విమర్శరూపిణిీ యని అనబడినది.
ఆత్మ అనాత్మల యొక్క వివేక శక్తియే విమర్శ. మాయోపాధికమైన దృశ్యమాన బ్రహ్మాండ, పిండాండ ఆత్మసంబంధమైన ఆత్మానాత్మ వివేక, అవస్థాత్రయ ( జాగ్రదా వస్థ- మెళకువగా ఉన్నప్పటి స్థితి, స్వప్నావస్థ- కలలు కనే స్థితి, సుషుప్తావస్థ - నిద్రావస్థ, ఈ మూడే కాకుండా నాలుగవ అవస్థ మరొకటి ఉంది. అదే తురీయావస్థ దీనినే సమాధి స్థితి అన్నారు).
పంచకోశములు (1. అన్నమయ కోశము, 2. ప్రాణమయ కోశము, 3. మనోమయ కోశము, 4. విజ్ఞానమయ కోశము, 5. ఆనందమయ కోశము)
పంచభూతములు (ఆకాశం, గాలి, నిప్పు, నీరు, మట్టి).
సప్తధాతువులు ( రసము, రుధిరము, మాంసము, మేదస్సు, మజ్జ, శుక్లము, అస్థి).
సప్తచక్రములు (శ్రీవిద్యలోను, వివిధ తంత్రములలోను చెప్పిన ప్రకారము మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు అవి: మూలాధార చక్రము, స్వాధిష్ఠాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము మరియు సహస్రార చక్రము తో కలిపి సప్త చక్రాలు అని చెబుతారు)
వీటి యొక్క విజ్ఞానాత్మక విమర్శల వివేచనమే స్వరూపముగా గలిగిన పరమేశ్వరి విమర్శరూపిణీ యని అనబడినది.
మూలాధారాది షట్చక్రములు మరియు సహస్రార చక్రముతో మొత్తం సప్తచక్రములందును, పంచకోశములందును, సప్తధాతువు లందును అమ్మను విమర్శరూపిణిగా తెలియజేయు శ్రీలలితా సహస్రనామావళియందలి కొన్ని నామమంత్రములు:
మూలాధారచక్రంలో పరమేశ్వరి స్వరూపము
99వ నామ మంత్రము - ఓం మూలాధారైక నిలయాయై నమః (మూలాధార పద్మమునందు వసించు తల్లికి నమస్కారము - నాలుగు రేకుల గల మూలాధార పద్మములో నిద్రాణమైన కుండలినీ శక్తి రూపంలో జగన్మాత ఉంటుంది)
514వ నామ మంత్రము ఓం మూలాధారాంబుజారూఢాయై నమః (మూలాధారమనే చతుర్దళ పద్మంలో సాకినీ దేవతారూపంలో ఉండు తల్లికి నమస్కారము)
స్వాధిష్ఠాన చక్రంలో అమ్మస్వరూపము
504వ నామ మంత్రము ఓం సాధిష్ఠానాంబుజగతాయై నమః (స్వాధిష్ఠాన చక్రంలో కాకిని దేవతా రూపంలో ఉండు తల్లికి నమస్కారము)
మణిపూరక చక్రంలో అమ్మ స్వరూపము
495వ నామ మంత్రము ఓం మణిపూరాబ్జ నిలయాయై నమః (దశదళ పద్మమైన మణిపూరమునందు వసించు తల్లికి నమస్కారము - నాభి యందున్న పది రేకుల పద్మము మణిపూరచక్రం . అక్కడ లాకినీ అనే దేవతా రూపంలో జగజ్జనని కొలువై ఉంటుంది)
101వ నామ మంత్రము ఓం మణిపూరాంతరుదితాయై నమః (నాభియందున్న మణిపూరచక్రంలో భాసిల్లు తల్లికి నమస్కారము. మూలాధారాన్ని దాటి, బ్రహ్మగ్రంథిని భేదించి శ్రీమాత కుండలినీ శక్తి రూపంలో ఇక్కడ ప్రకటితమౌతున్నది)
అనాహత చక్రంలో అమ్మ స్వరూపము
485వ నామ మంత్రము ఓం అనాహతాబ్జ నిలయాయై నమః (అనాహత పద్మమునందు వసించు తల్లికి నమస్కారము - హృదయంలో పండ్రెండు దళములతో గూడిన కమలం అనే అనాహత చక్రం ఉంది. అందు రాకినీ యోగిని రూపంలో జగజ్జనని అధిష్ఠించి ఉన్నది)
విశుద్ధ చక్రంలో అమ్మ స్వరూపము
475వ నామ మంత్రము ఓం విశుద్ధచక్ర నిలయాయై నమః (కంఠమున ఉండే విశుద్ధ చక్రము నందు పదహారు దళముల పద్మమందు డాకినీ రూపిణియై వసించు తల్లికి నమస్కారము)
ఆజ్ఞాచక్రంలో అమ్మ స్వరూపము
103వ నామ మంత్రము *ఓం ఆజ్ఞా చక్రాంతరాళస్థాయై నమః (కనుబొమల మధ్యలో నున్న ఆజ్ఞాచక్రంలో, ద్విదళ పద్మమున హాకినీ రూపధారిణియై భాసిల్లు తల్లికి నమస్కారము)
సహస్రారచక్రంలో అమ్మ స్వరూపము
105వ నామ మంత్రము ఓం సహస్రారాంబుజారూఢాయై నమః (బ్రహ్మరంధ్రానికి దిగువున గల వేయి దళాలున్న పద్మమునందు యాకినీ రూపధారిణియై భాసిల్లు తల్లికి నమస్కారము)
106వ నామ మంత్రము ఓం సుధాసారాభివర్షిణ్యై నమః (సహస్రదళ పద్మం యొక్క కర్ణిక - బొడ్డు నుండి అమృతధారలను కురిపించు తల్లికి నమస్కారము. లలితాంబిక తన భక్తులకు అమృతత్త్వమును కలిగించును. సాధకుడు నేను అనే భ్రాంతిని వదిలి పరమాత్మతో ఐక్యమునొంది జీవన్ముక్తుడగును)
108వ నామ మంత్రము ఓం షట్చోక్రోపరి సంస్థితాయై నమః (ఆరు చక్రాలనుదాటి సహస్రారచక్రంలో భాసిల్లు తల్లికి నమస్కారము. మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలను దాటి సహస్రార చక్రాన్ని చేరి, అందు పరిపూర్ణంగా వ్యక్తమగు శ్రీమాతకు నమస్కారము)
524వ నామ మంత్రము ఓం మజ్జాసంస్థాయై నమః (ఎముకలలోని మజ్జ అనే ధాతువునకు అధిష్ఠాన దేవత అయిన తల్లికి నమస్కారము)
428వ నామ మంత్రము ఓం పంచకోశాంతరస్థితాయై నమః
(పంచకోశాలలో చివరిదైన ఆనందమయకోశం మధ్యలో స్థితమై ఉండు తల్లికి నమస్కారము. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను - పంచకోశాలు అని అంటారు)
అంతయు జ్ఞానమయమైనందున ఆ పరమేశ్వరి విమర్శరూపిణి అని నామప్రసిద్ధ మైనది.
అట్టి విమర్శరూపిణియైన అమ్మవారికి నమస్కరించునపుడు ఓం విమర్శరూపిణ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీలలితా సహస్రనామ భాష్యము
549వ నామ మంత్రము
ఓం విద్యాయై నమః
విద్యా అనగా మోక్షాన్నిచ్చే జ్ఞాన స్వరూపిణిగా తేజరిల్లుతున్న తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి విద్యా అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం విద్యాయై నమః అని ఉచ్చరిస్తూ ఆ జగజ్జననిని ఉపాసించు ఉపాసకులకు బ్రహ్మవిద్యాసంపదనొసగి అనుగ్రహించి తరింపజేయును.
విద్య అనగా జ్ఞానము. శ్రీలలితా పరమేశ్వరి నామము విద్య అని శ్రీలలితా సహస్ర నామావళి యందు వశిన్యాదులు చెప్పారంటే, అమ్మవారు విద్యాస్వరూపిణి. శ్రీవిద్యాస్వరూపిణి యని కూడా అంటాము. బ్రహ్మవిద్యా స్వరూపిణి ఆ జగన్మాత గనుక విద్యా యని అనబడినది. పరావిద్య, అపరావిద్య అని రెండువిధములు.
శౌనకుడు అనే జిజ్ఞాసువు అంగిరస మహర్షి వద్దకు వచ్చి "ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుంది?" అని అడిగిన ప్రశ్నకు అంగిరసుడు "పరావిద్య, అపరావిద్య అని రెండు రకాలు తెలుసుకోవలసినవి ఉన్నాయని బ్రహ్మవిదులు అంటారు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. అపరావిద్య అంటే లౌకికమయిన ధర్మాధర్మాలకు సంబంధించినది. రెండవదానికంటే మొదటిది గొప్పది. దాన్ని తెలుసుకున్నవాడు సంసారచక్రం నుంచి విముక్తుడవుతాడు." అంటూ ముండకోపనిషత్తును బోధించాడు.
ముండక ఉపనిషత్తు లేదా ముండకోపనిషత్తు అత్యంత ప్రాచీన ఉపనిషత్తులలో ఒకటి. ఈ ఉపనిషత్తు అధర్వణ వేదమునకు సంబంధించింది. ముక్తిత సూత్రాలననుసరించి ఇది నూటఎనిమిదవ ఉపనిషత్తులలో ఐదవది.
స్మృతులు అనగా ధర్మశాస్త్రములు. ఇవి వేదార్థ ప్రతిపాదక గ్రంథములు. అందు మనుస్మృతి మిక్కిలి గొప్ప గ్రంథము. ఈమానవ ధర్మశాస్త్రమున జగత్సృష్టి మొదలుకొని సర్వవిషయములును చెప్పబడినవి. ఇందు బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రులు అను చాతుర్వర్ణ్యాశ్రమ ధర్మములు, వివాహక్రమ పంచమహాయజ్ఞా తిథిపూజా పార్వణవిధి శ్రాద్ధవిధాన భోజననియమాదులు, స్త్రీపురుష ధర్మములు, రాజధర్మములు, వ్యవహార ధర్మములు, ప్రాయశ్చిత్త నియమములు మొదలుగాఁగల హిందువుల వైదిక లౌకిక విషయములు అన్నియు వచింపబడి యున్నవి. మఱియు స్మృతులు వేదముల వలెనే గౌరవింపబడుచున్నవి. కలియుగమునకు విహితములు అగు ధర్మములు పరాశర స్మృతియందు చెప్పఁబడి ఉన్నాయి. పురాణముల వలె స్మృతులును పదునెనిమిది. అవి మనుస్మృతి, బృహస్పతిస్మృతి, దక్షస్మృతి, గౌతమస్మృతి, యమస్మృతి, అంగీరసస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, ప్రచేతస్స్మృతి, శాతాతపస్మృతి, పరాశరస్మృతి, సంవర్తస్మృతి, ఔశనసస్మృతి, శంఖస్మృతి, లిఖితస్మృతి, ఆత్రేయస్స్మృతి, విష్ణుస్మృతి, ఆపస్తంబస్మృతి, హరీతస్మృతి అనునవి. ఇవికాక ఉపస్మృతులు పదునెనిమిది ఉన్నాయి. అవి కణ్వస్మృతి, కపిలస్మృతి, లోహితస్మృతి, దేవలస్మృతి, కాత్యాయనస్మృతి, లోకాక్షిస్మృతి, బుధస్మృతి, శాతాతపస్మృతి, అత్రిస్మృతి, ప్రచేతస్మృతి, దక్షస్మృతి, విష్ణుస్మృతి, వృద్ధవిష్ణుస్మృతి, వృద్ధమనుస్మృతి, ధౌమ్యస్మృతి, నారదస్మృతి, పౌలస్త్యస్మృతి, ఉత్తరాంగిరసస్మృతి అనబడు స్మృతులు, అష్టాదశ పురాణములు, సంగీత సాహిత్యాది చతుష్షష్టికళలు - వీటన్నిటి యందును నిక్షిప్తమైన జ్ఞానస్వరూపమే ఆ పరమేశ్వరి. జ్ఞాన (మోక్షదాయకమైన జ్ఞానము), జ్ఞేయ (తెలియదగినది), జ్ఞాతృ (తెలిసికోవలసిన వాడు) - ఈ మూడింటి స్వరూపము కూడా ఆ అమ్మవారే. గనుకనే ఆ పరమేశ్వరి విద్యా యని అనబడినది.
అమ్మవారు వేదస్వరూపిణి గనుక విద్యా యని అనబడినది.
సకల విద్యా స్వరూపిణి యైన జగదీశ్వరికి నమస్కరించునపుడు ఓం విద్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీలలితా సహస్రనామ భాష్యము
550వ నామ మంత్రము
ఓం వియదాది జగత్ప్రసవే నమః
ఆకాశము మొదలుగా గల పంచభూతములతో (భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశములతో) కూడిన జగత్తును సృష్టించిన తల్లికి నమస్కారము.
శ్రీ లలితా సహస్ర నామావళయందలి వియదాది జగత్ప్రసూః అను ఎనిమదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం వియదాది జగత్ప్రసవే నమః అని ఉచ్చరిస్తూ ఆ జగన్మాతను అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ విశ్వజనని సర్వసౌభాగ్యములను, బ్రహ్మజ్ఞాన సంపదను ప్రసాదించి ఆయురారోగ్యములతోను, భోగభాగ్యములతోను, కీర్తిప్రతిష్టలతోను జీవనమును కొనసాగించి అంత్యమున మోక్షసిద్ధి కలుగజేయును.
వియత్ అనగా ఆకాశము, ఆది అనగా మొదలైన, జగత్ అనగా జగత్తును, ప్రసూః అనగా సృష్టించినది
పంచభూతములు అనగా భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము. వీటిని పుట్టించిన ఆ తల్లి మూలప్రకృతి యైన ఆ పరమేశ్వరి.
చతుర్వింశతి తత్త్వములు మాయ కర్మ గుణములు. ఇవి పశుపతికి పాశములు. జీవులకు కలుగు క్లేశములు. ఇవియే పశుబంధ నములు. మనసు బుద్ధి అహంకారము ఆకాశము వాయువు అగ్ని జలము భూమి ఈ అష్ట ప్రకృతులును ఎనిమిది (8 )ఇతర పదార్థ వికారములు. శ్రోత్రము త్వక్ చక్షువు జిహ్వ ఘ్రాణము అనునవి ఐదు. జ్ఞానేంద్రియములు ఐదు (5), పాయు ఉపస్థ కర పాద వాక్కులు అనునవి ఐదు కర్మేంద్రియములు ఐదు (5) శబ్ద స్పర్శ రూప రస గంధములు ఐదు. విషయములు ఐదు (5) - ఇట్లు ఇవి ఇరువది మూడు (23), ప్రకృతి వలన ఏర్పడిన తత్త్వములు; ఇరువది నాలుగవ తత్త్వము అ వ్యక్తము లేదా ప్రధానమందురు; ఈ అవ్యక్తము గుణ సహితము. ఇదియే ఆది మధ్యాంతములు లేనిది. జగత్తునకు పరము కారణము. సత్వము, రజస్సు, తమస్సు అనునవి మూడు గుణములందురు. ఈ మూడిటి సామ్యావస్థ అవ్యక్తము ప్రకృతియని అందురు. సత్త్వము జ్ఞానము, తమస్సు అజ్ఞానము, రజస్సు మిశ్రమము అని చెప్పబడినవి. బుద్ధి వైషమ్యము వలన గుణ వైషమ్యము కలుగునని పండితులు చెప్పెదరు. ఆకాశము మొదలగు పంచభూతాత్మకమైన ప్రపంచమును చక్కగా సృజించినది జగజ్జనని. ఆకాశాది పంచభూతములకు, చతుర్వింశతి తత్త్వములతోగూడిన నామ, రూప, జగత్తును ఆవిర్భవింపజేసినందున ఆ పరమేశ్వరికి వశిన్యాదులు శ్రీలలితా సహస్రనామావళి యందు వియదాది జగత్ప్రసూః అను ఒక నామమును ప్రసిద్ధముచేశారు. అనగా దీనికి కారణము బ్రహ్మయే అని భావింపవలయును.
తస్మాద్వా ఏతస్మా దాత్మన ఆకాశస్సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నే రాపః ఆపః పృథ్వి పృథివ్యా ఓషధయః ఓషదిభ్యో అన్నం అన్నాత్పురుషః అని శ్రుతి వాక్యము.
మొదట ఆత్మనుండి ఆకాశం ఉద్భవించింది. ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మ. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి పృథ్వి, పృథ్వి నుండి ఓషధులు, ఓషధులనుండి అన్నము ఆ పిదప పురుషుడు ఉద్భవించడం జరిగినది.
అటువంటి పంచభూతాత్మక జగత్తును సృష్టించిన జగజ్జననికి నమస్కరించునపుడు ఓం వియదాది జగత్ప్రసవే నమః అని భక్తితో ఉచ్చరించవలయును.
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
551వ నామ మంత్రము ఓం సర్వవ్యాధి ప్రశమన్యై నమః
సమస్త ఆది, వ్యాధులను (మానసిక, శారీరక రోగాలను) శమింపజేయు జగన్మాతకు నమస్కారము
శ్రీలలితా సహస్రనామావళి యందలి సర్వవ్యాధి ప్రశమనీ యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) నామ మంత్రమును ఓం సర్వవ్యాధిప్రశమన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఎటువంటి అనారోగ్య బాధలుగాని, మానసిక బాధలు గాని లేకుండా అనుగ్రహించును.
వ్యాధులు అనునవి శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక రుగ్మతలకు మందులు వాడవచ్చును. కాని మనోవ్యాధికి మందులు ఉండవు.
మానవునికి తాపత్రయములు అనునవి ఉన్నాయి. ఇవి కూడా వ్యాధులే అనబడతాయి.
తాపత్రయం లేదా త్రివిధ తాపాలు అనగా మూడు రకాలైన తాపాలు అనగా బాధలు అని అర్ధం. ఇవి 1. ఆధ్యాత్మిక తాపం, 2. అధిభౌతిక తాపం మరియు 3. అధిధైవిక తాపం అని మూడు రకాలు.
ఆత్మ అనే దానికి శరీరం, మనస్సు, బుద్ధి , జీవాత్మ , పరమాత్మ అని వివిధ అర్ధాలున్నాయి. మనస్సు, శరీరం ఇత్యాదుల కారణంగా కలిగే శోకం, మోహం, జ్వరాది రోగాలు మున్నగు బాధలు ఆధ్యాత్మిక తాపాలు భూతములనగా ప్రాణులు. మనుష్యులు, పశువులు, పక్షులు, పాములు మొదలైన ప్రాణుల ద్వారా సంభవించే బాధలు అధిభౌతిక తాపాలు. యక్షరాక్షసుల చేత, గ్రహావేశాల చేత, దైవబలముతో కలిగేవి అధిదైవిక తాపాలు. భూకంపం, సునామీ, అతివృష్టి, అనావృష్టి మొదలైనవి ఇందులో చేరతాయి. మానవులమైన మనకు కలిగే నానావిధాలైన బాధలు ఈ త్రివిధతాపాలలో చేరిపోతాయి. వీటికి గురైనవారు తాపత్రయ పీడితులు అనబడతారు. ఆ పరమేశ్వరి మానవునికీ గల తాపత్రయములను పోగొడుతుంది.
శరీరంలో కాలమాన పరిస్థితులచేతను, శీతోష్ణములవలనను అనారోగ్యం వస్తుంది. మందులు వాడితే తగ్గిపోతాయి. మధుమేహము, రక్తపోటు వంటివి జీవితాంతం ఉంటాయి. ఇవి దీర్ఘవ్యాధులుగా చెప్పవచ్చును. వీటికి నిరంతరము వైద్యుని సంప్రదింపులతో నియంత్రణ జరుపుకుంటారు. దీర్ఘవ్యాధులు పూర్వజన్మల కర్మఫలంగా వస్తూ ఉంటాయి. వీటికి తాత్కాలిక నియంత్రణ మాత్రమే ఉంటుంది. శాశ్వత నివారణ ఉండదు. మానసిక వ్యాధులు అనేవి తనకు అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవడము, తనకు సంబంధించిన వారు దూరంకావడము, ఏదో కారణంచేత అవమానభారం ఏర్పడడం, ఎవరితోనో తనను పోల్చుకుని, అంతటి ఉన్నతి తనకు లేదనుకోవడము - ఇలాంటి కారణాలవలన ఏర్పడిన మానసిక క్షోభ అనునది మానసిక వ్యాధి అని అంటాము. సంతానం లేకపోవడం లేదా సంతానం ఉన్ననూ వారివలన మనశ్శాంతి లేకపోవడం, వివాహం కాకపోవడం, వివాహం జరిగినా దాంపత్య భాగస్వామివలన మనశ్శాంతి కరువగుట వంటిది కూడా మానసిక వ్యాధి అంటారు. అలాగే ఉద్యోగార్థికి ఉద్యోగము లేదను చింత, లేదా ఉన్న ఉద్యోగం పోయినచింత, అవసరాల మేరకు ధనము సమకూరలేదను చింత, దొంగలవలన ధనము పోగొట్టుకొనిన చింత, ఆర్థిక ఇబ్బందులవలన ఏర్పడిన చింత - ఇవి అన్నియునూ కూడా మనోవ్యాధులే అనిపించుకుంటాయి. మనోవ్యాధికి మందులేదు. కాని పరమేశ్వరిని నిరంతరం ధ్యానిస్తే, ఆ తల్లి కరుణచే మానసిక రుగ్మతలు గాలిగి మబ్బులు చెదిరినట్లు తొలగి పోతాయి. దీర్ఘవ్యాధులు, తాత్కాలిక రుగ్మతలు కలుగకుండా ఆ పరమేశ్వరి తన భక్తుల శరీరంలో వ్యాధినిరోధకత్వము ఏర్పడునట్లు అనుగ్రహించును. అరిషడ్వర్గాల (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యముల) వలన ఏర్పడు రుగ్మతలు మానసిక వ్యాధుల క్రింద వస్తాయి. వీటినే భవరోగములు అనికూడా అంటారు. ఇవి తొలగిపోవాలంటే నిరంతరము ధ్యాన నిమగ్నత అవసరము. ఓం సర్వవ్యాధిప్రశమన్యై నమః అను నామమంత్రము సంపుటముచేస్తూ శ్రీలలితా సహస్రనామ స్తోత్ర పారాయణము అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆ పరమేశ్వరిపై భారము, నమ్మకము ఉంచి చేయుట అనేది చాలా అవసరము. కళ్ళు ఎర్రనై మండుతూ నీళ్ళు కారితే రోగము అని అందురు. ఇతరుల బాగును చూచి అసూయ పడడం,రకరకాలైన దుర్వ్యసనాలు, పరస్త్రీవ్యసనాలోలత్వము, పరధనంపై దురాశ, జీవహింస వంటి చెడుకర్మలు చేయుటవంటి వన్నియు వ్యాధులే అంటాము; ఈ విధముగానే మనస్సు, ఇంద్రియములద్వారా గిట్టనివాటిన గ్రహిస్తే మానసిక వ్యాధులు రాగలవు. వీటికి కారణము రాగ, ద్వేష, క్రోధ, అసూయ, భవరోగములు మాత్రమే అగును; ఇట్లు అజ్ఞాన జన్యమైన అవివేకముతో తెచ్చుకొనుట వంటివి అధివ్యాధులు; కావున శ్రీమాత జ్ఞానస్వరూపిణి అయినందున ఈ వికారములన్ని పోగొట్టి పవిత్రుని జేసి కాపాడుతుంది కావున ఆ పరమేశ్వరి సర్వవ్యాధిప్రశమనీ యని వశిన్యాది వాగ్దేవతలచే కీర్తింపబడినది.
శ్రీలలితా సహస్ర నామస్తోత్రముయొక్క ఉత్తర పీఠిక (ఫలశ్రుతి) యందు ఇలా చెప్పబడినది:-
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
572వ నామ మంత్రము ఓం పరాశక్త్యై నమః
అన్ని శక్తులకూ మూలకారణమైన మహోత్కృష్ట శక్తి (పరాశక్తి) అయిన పరమేశ్వరికి నమస్కారము.
శరీరమునందుండు పదియవధాతు స్వరూపిణియౌ భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీ లలితా సహహ్రనామావళి యందలి పరాశక్తి అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం పరాశక్త్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ తల్లి కరుణచే తన శరీరము నందలి సప్తధాతువులు, షట్చక్రములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు మొదలగునవి అన్నియును తన వశములో నుండి, జితేంద్రియుడై, బ్రహ్మజ్ఞాన సముపార్జనలో పరాశక్తి అనుగ్రహమును బడయుటకై దీక్షాబద్ధుడై కఠోరసాధనతో ఆ తల్లి కరుణచే ఇహపర సుఖములను సాధించి తరించును.
ధాతువు అనగా మూలకము. అనగా మూలద్రవ్యము. శరీరనిర్మాణము ఈ మూలకములచే ఏర్పడినది. శరీరనిర్మాణమేర్పడిన తొమ్మిది మూలకములనే తొమ్మిది ధాతువులు లేదా నవధాతువులు అని యందురు. ఈ నవధాతువులు రెండుగా విభజింపబడియున్నవి. అవి ఐదు శక్తిమూలకధాతువులు, నాలుగు శివమూలక ధాతువులు. శక్తి మూలకధాతువులు : 1. చర్మము, 2. రక్తము, 3. మాంసము, 4. మేదస్సు, 5. ఎముకలు, శివమూలకము ధాతువులు: 1. మజ్జ, 2. శుక్లము, 3. ప్రాణము, 4. జీవుడు. వీటితో శరీర నిర్మాణము జరిగినది. శరీరమనకు చలనము కలిగించేది, ఇప్పుడు చెప్పబడిన తొమ్మిది ధాతువుల యునికిని కాపాడేది, తొమ్మిది ధాతువులతో ఏర్పడిన శరీరమునందు మార్పులనుకలిగించేది, జీవము ఉన్నదనిపించేది అయిన పదియవ ధాతువు, పరమోత్కృష్ట మైనదియగు పదియవధాతువునే పరాశక్తి యని అంటారు. ఈ పరాశక్తియే పరమేశ్వరి. ప్రాణరూపమున శరీరంలో విలసిల్లేదే పరాశక్తియను పదియవధాతువు. ఈ పదియవ ధాతువు లేకుంటే ఆ తొమ్మిది ధాతువులకు మనుగడ లేదు. అందుచేతనే పదియవ ధాతువు పరాశక్తి.
శ్రీచక్రమునందు తొమ్మిది ఆవరణలు గలవు. తొమ్మిది ఆవరణలు తొమ్మిది సమద్విబాహు త్రిభుజములుగా చెప్పుదురు. అందులో నాలగు ఊర్ధ్వముఖంగా ఉండి శివాత్మకమైన సమద్విబాహు త్రిబుజములనియు, ఐదు సమద్విబాహు త్రిభుజములు పైనుండి క్రిందికి శక్త్యాత్మకమైనవిగా చెప్పుదురు. ఈ తొమ్మిదింటిని తొమ్మిది ఆవరణలుగా కూడా చెప్పుదురు. అదేవిధంగా నవధాతువులతో ఏర్పడిన శరీరముకూడా ఒక శ్రీచక్రమని చెప్పవచ్చును.
నడుమనున్న పరాబిందువే పరాశక్తి. అలా ఒకటిగానున్న పరాబిందువు నుండి మూడు బిందువులేర్పడినవి.
పని చేయాలన్నా ఆ పని చేయాలనే ఇచ్ఛ (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎలా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి ఇచ్ఛ, ఆలోచన జ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపటమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయికే. ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే. ఈ మూడు బిందువులలో ఒకటి శివశక్తులొకటిగా నున్న బిందువు, రెండవది అచేతనంగా ఉన్న శివుడు, మూడవది చేతనా స్వరూపమైన శక్తి,
ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము. త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము. ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వర తత్వాన్ని సూచిస్తుంది.
విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే ప్రకృతి అని, పరాశక్తి అని, అవ్యక్తం, శుద్ధమాయ అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత (తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత లేదా పరాశక్తి, వారికి అందించుతున్నది.
శ్రీచక్రం - మానవ శరీరం
శక్త్యాత్మకమై ఐదుధాతువులతోను శివాత్మకమైన నాలుగు ధాతువులతోను నిర్మింపబడిన ఈ శరీరమే ఒక శ్రీచక్రము. శరీరమనందుండు జీవాత్మ, పరమాత్మలు శ్రీచక్రమునందలి కామేశ్వరీ, కామేశ్వరులు.
గమనించవలసిన విషయమేమంటే ఈ జగత్తులోని సకల తత్వాలు, సకల భువనాలు, పరమశివుడు, పరాశక్తి మానవుని యందు కూడా కలవు. మానవ శరీరమును రెండు భాగములుగా చూస్తే - నాభి నుండి పైభాగము ఊర్థ్వలోకమని, క్రింది భాగం అధోలోకమని, ఈ రెండింటిని కలిపే వెన్నెముకను మేరు దండమని అంటారు. శ్రీ చక్రమును కూడా మేరువు అంటాము. మేరుపర్వతము కూడా భూమికి ఇరుసు వంటిది. ఏ రకంగా పరాశక్తి దివ్యస్వరూప కాంతులచేత జగత్తంతా ప్రకాశవంత మవుతుందో మన మేరు దండములోని కుండలినీ శక్తిచేత శరీరమంత చైతన్య మవుతుంది.
మనలో ఆత్మ ఉన్నదని అంగీకరించినట్లే మన శరీర నిర్మాణ ప్రాధాన్యం కూడా గుర్తించాలి. నవావరణాత్మకమైన శ్రీచక్రానికి, మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రం చెబుతోంది. శ్రీచక్రాన్ని ఆరాధిస్తే అన్ని దేవతామూర్తులను ఆరాధించినట్లేనని తంత్రశాస్త్రం తెలుపుతోంది.
శ్రీ అంటే శుభకరమైనది. దీనిని నవచక్రమని, వియత్ చక్రమని, నవయోని చక్రమని అంటారు. చక్రము ఎప్పుడూ పరిభ్రమిస్తుంది. దీనికి ఆద్యంతము లుండవు.
కేంద్ర బిందువు నుండి పరిధి వరకు ఎక్కడ కొలిచిననూ సమానంగా ఉంటుంది. చక్రారాధనము ప్రతిమారాధన కన్న శక్తివంతం. మంత్రం వలె యంత్రం కూడా మహిమ గలదే. శరీరమే దేవాలయము. జీవుడే అక్కడి దేవుడు అజ్ఞానమనే మాలిన్యాన్ని త్యజించాలి. ఆ దేవుడే నేననే భావమే పూజ. ఆ భావనతోనే అర్పించాలి.
కాబట్టి సాధకుని ధ్యానము, పూజ, భావన బాహ్యము నుండి లోనికి చొచ్చుకొనిపోయి ఆత్మను చేరుకోవాలి.
విశ్వంలోని శక్తులన్ని తొమ్మిది ఆవరణముల ద్వారా ఉత్పతై మానవుని పంచకోశములందు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు ఇమిడి ఉన్నవి.
నిరంతర సాధన మార్గం
శ్రీచక్రాన్ని మన శరీరంతో పోల్చి పరిశీలిస్తే ఆ జగన్మాత శ్రీ లలితాదేవి దర్శనం ఎంత అదృష్టంగా అనిపిస్తుంది. మనలోని కర్మ, జ్ఞానేంద్రియాల వెంటపడి పరిగెత్తే మనస్సు, బుద్ధి, అహంకార, మమకారాలు, కామోద్రేకాలు, శృంగారాది నవరసాలు, జాగ్రద, స్వప్న, సుషుప్తాది అవస్థలు వీటిని నడిపే సత్వరజస్తమోగుణాలు - వీటిన్నిటిని ఆ శ్రీదేవి విభూతులుగా గ్రహించి వీటన్నింటినీ దాటి బిందుస్థానమునకు చేరుకోగానే అచట అద్వితీయమైన, సచ్చిదానంద రూపమైన, సస్వరూపానుభవము కలుగుతుంది. అదే పరమేశ్వరి దర్శనం. పరాశక్తి అంటేనే సర్వశక్తులకు అతీతమైన ఆదివ్యశక్తి స్వరూపిణి, శివశక్త్యైక్యరూపిణి అయిన జగజ్జనని.
పరాశక్తినే ఆదిపరాశక్తి అంటాము. హైందవ పురాణాల ప్రకారం సర్వశక్తిమంతురాలైన దేవత. పరబ్రహ్మ స్వరూపం. శాక్తేయంలో ఆది పరాశక్తే పరమసత్య స్వరూపంగా గుర్తింపబడింది. దేవి భాగవత పురాణములో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు, వినాశకారి ఆది పరాశక్తే అని సూచించబడింది. శాక్తేయంప్రకారం ఆది పరాశక్తి శూన్యబిందు, అనగా దివ్యమైన శూన్య స్త్రీ శక్తి, ఈ శక్తి యొక్క సార్వత్రిక ఆత్మ (పురుషుడు), ప్రకృతి శక్తికి జన్మించిన అంశములు జగన్మాత, ఆ శ్రీమాత సౌందర్యానికి దేవత, సాత్విక, రాజసిక, తామసిక గుణాలు మూడూ కలసిన ఆది పరాశక్తి. అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆది పరాశక్తి రూపం లేనిది, నిర్గుణ బ్రహ్మ అనే వాదన కూడా ఉంది. ఈ వాదన ప్రకారం ఆది పరాశక్తి ఒక దివ్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన చైతన్యము అయిన ఆదిపరాశక్తి, శ్రీమాతయే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాశక్తుల తనే మూలము. కావున ఆది పరాశక్తే అఖండ సత్యం. ఈ శక్తి దానికై అదే సంపూర్ణం. ఆది పరాశక్తి భర్త లేనిది. కానీ ఈ జగత్తుకి శివుడిని ఆహ్వానించటానికి తాను స్త్రీ రూపంలో జన్మనెత్తినది,
అటువంటి పరాశక్తికి నమస్కరించునపుడు ఓం పరాశక్త్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
576వ నామ మంత్రము
ఓం మత్తాయై నమః
బ్రహ్మానందముచే పరవశించి ఉన్న జగన్మాతకు నమస్కారము.
శ్రీ లలితా సహహ్రనామావళి యందలి మత్తా అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం మత్తాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించే వారిని తన బిడ్డలవలె అనంత కరుణతో రక్షిస్తుంది పరాశక్తి.
మత్తా అనగా పరవశమై ఉండునది, బ్రహ్మానందముతో పరవశమైనది శ్రీమాత. మాద్వీపానాలసా (575వ నామ మంత్రము) మత్తా (576వ నామ మంత్రము) - ఈ రెండు నామ మంత్రములు సంపుటీకరించితే తల్లి తన బిడ్డను ఒడిలో నిడుకొని వాత్సల్యముతో, అత్యంత ప్రేమతో మమేకమై అర్ధనిమీలిత నేత్రాలతో ఆబిడ్డను తదేకంగా చూచినట్లు జగన్మాత మనందరినీ (తన బిడ్డలను) ఎనలేని మాతృ ప్రేమలో ( మాధ్వీపాన యై) అలసత్వమంది (లాలసా) అర్ధనిమీలితనేత్రయై పరవశయై (మత్తా) వీక్షిస్తూ సంరక్షించుకుంటూ ఉన్నది.
మత్తా అనగా పరవశత్వముతో నుండునది. ఇంతకు ముందు నామములో మాధ్వీపానాలసా యని అనబడినది. పరమేశ్వరి మాధ్వీపానముచే మత్తెక్కియున్నది అని యనబడినది. శ్రీలలితా పరమేశ్వరి వశిన్యాది వాగ్దేవతలచే తన సహస్రనామాలు విరచింపజేసుకున్నది. దేవతా సమూహములు, విశ్వామిత్రుడు మున్నగు పుణ్యాత్ములు, సనకాది సిద్ధుల సమూహములు (దివ్యౌఘ గురువులు, సిద్ధౌఘ గురువులు, మానవౌఘ గురువులు) కూడా వచ్చియున్నారు. ఇంకను శ్రీలలితాంబ కొలువు దీరిన ఆ సభకు అత్యంత ముఖ్యులైన మంత్రిణి శ్యామలాంబ, దండిని వారాహీదేవి మాత్రమేగాక, లెక్కకు మిక్కిలి శక్తిస్వరూపిణిలు కూడా వచ్చియున్నారు. అంతమాత్రమే గాక రుద్రయామలాది గ్రంథములందు ప్రసిద్ధిగా చెప్పబడినటువంటి శక్తి సమూహములైన 1) పరాశక్తి, 2) ఆదిశక్తి, 3) ఇచ్ఛాశక్తి, 4) జ్ఞానశక్తి, 5) క్రియాశక్తి, 6) బలా, 7) బాల, 8) అన్నపూర్ణ, 9) బగళ, 10) తార, 11) వాగ్వాదిని, 12) పర, 13) గాయత్రి, 14) సావిత్రి, 15) సిద్ధలక్ష్మి, 16) స్వయంవర, 17) నకులి, 18) తురగారూఢ, 19) కురుకుళ్ళ, 20) రేణుక, 21) సంపత్కరి, 22) సామ్రాజ్యలక్ష్మి, 23) పద్మావతి, 24) శివ, 25) దుర్గ, 26) భద్రాకృతి, 27) కాళి, 28) కాళరాత్రి, 29) సుభద్రిక, 30) ఛిన్నమస్తక, 31) భద్రకాళి, 33) కాలకంఠి, 33) సరస్వతి మొదలైనవారు అమ్మవారిని సేవించుటకు వచ్చి ఉన్నారు. ఇంకనూ అనేక కోటి దిక్పాలకులతో కోట్లాది సంఖ్యలుగల సూర్యచంద్రులు, వసువులు, సనకాదులు, యోగీంద్రులు, సప్తమహర్షులు మొదలైనవారు పరివేష్టించి ఉన్నారు. ఆ పరమేశ్వరి మహాచతుష్షష్టికోటి యోగినీ గణములతోనూ కొలువుదీరి యున్నది. ఇంకనూ, ఆ తల్లికి ఇరువైపుల లక్ష్మీ, సరస్వతులు వింజామరలు వీచుచున్నారు. అట్టి మహాసభలో వశిన్యాది వాగ్దేవతలు వారికి నిర్దేశితమైన ఆసనములందు కూర్చుని యున్నారు. లలితాంబిక వారందరివైపు వాత్సల్యపూరిత దృక్కులతో వీక్షించుచున్నది. వెంటనే ఆ అమ్మవారి ప్రేమగల క్రీగంట చూపులకు ప్రేరణనందిన వశిన్యాదులు తమ స్థానములలోనే లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించుచూ తాము విరచించిన సహస్రనామములతో అమ్మవారిని స్తుతించారు. అమ్మవారు పరబ్రహ్మస్వరూపిణి. వశిన్యాదులు విరచించిన ఆ సహస్రనామములు ఏ ఇతర సహస్ర నామములకు లేని విశిష్టత సంతరించుకునేలా వారు విరచించారని గ్రహించిన అమ్మవారు ఎంతోసంతోషించినది. ఒక్కొక్క నామము అనేకానేకమైన భావములతో, అర్థములతో నిగూఢగుప్తమై యుండుటచే అవి రహస్యాతిరహస్యమైన శ్రీలలితా సహస్ర నామములుగా ఆవిర్భవించినవని ఆ పరమేశ్వరి గ్రహించి అత్యంత పారవశ్యమైనది. ఆ పరమేశ్వరి ఎంతటి పరవశమైనదంటే మాధ్వీపానము వలన కలిగిన పరవశతకన్నను అనేక కోట్లరెట్లు పారవశ్యతను చెందినది. నాటి నుండి నేటివరకును ఎచ్చట శ్రీలలితా సహస్ర నామ స్తోత్రపారాయణ జరుగుచున్ననూ, ఆ పరమేశ్వరి మహదానంద పరవశత నందుచున్నది. వశిన్యాదులు అమ్మవారిని మాధ్వీపానాలసా యని ఎందుకు అన్నారంటే తన సహస్రనామ పారాయణమే అమ్మవారికి అసలైన మాధ్వీపానము వంటిది అన్నది నిజమనిపించుచున్నది. భక్తపరాధీనతయే పరమాత్మకు మాధ్వీపానము. పరమాత్మను మత్తులో ముంచాలంటే భక్తుడు పరమాత్మను కీర్తించుటయే పరమాత్మకు సమర్పించిన మాధ్వీపానము వంటిది. ఈ విషయంలో ప్రహ్లాదుడు నవవిధభక్తిమార్గములు తెలియజేశాడు.
ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది. ఆ శ్లోకం:
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనమ్|
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనమ్|
ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవలక్షణా
క్రియతే భగవత్యద్ధా తన్మన్యేధీతముత్తమమ్
పై శ్లోకాలను పోతనగారి భాగవతంలో:
తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా
ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!
అనగా భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.
శ్రవణం: భగవంతుని గూర్చిన గాథలు, భజనలు, కీర్తనలు వినుట - (హరికథ శ్రోతలు, ధర్మరాజు, జనమేజయుడు, శౌనకాది మునులు.
కీర్తనం: భగవంతుని గుణగణములను కీర్తించుట: రామదాసు, దాసగణు, అన్నమయ్య, త్యాగరాజు, తులసీదాసు, మీరాబాయి - మరెందరో భక్త గాయకులు.
స్మరణం: భగవంతుని స్మరించుట - నిత్యం ధ్యానం చేసే కోట్లాది భక్తులు.
పాదసేవ: దేవుని పాదముల పూజ సేయుట
అర్చనం గుడిలోగాని, ఇంటిలోగాని, హృదయములో గాని విధివిధానములతో అర్చించుట.
వందనం ప్రణామం చేయుట
దాస్యం భగవంతునకు దాసుడగుట - హనుమంతుడు, రామదాసు
సఖ్యం అర్జునుడు
ఆత్మనివేదనం తనను పూర్తిగా దేవునకు సమర్పించుకొనుట - గోదాదేవి, మీరాబాయి.
పరవశత్వమునందినప్పుడు బహిరింద్రియ జ్ఞానశూన్యమై నిర్గుణ, నిర్వికారమగు తురీయస్దితికి పరమేశ్వరి చేరుటచే, మత్తా యని అనబడుతుంది.
మాధ్వీపానాలసా మత్తా అయిన అయిన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మత్తాయై నమః అనుట మాత్రమేగాక, ఇంతకు పూర్వపు నామ మంత్రమును కూడా చేర్చి ఓం మాధ్వీపానాలసా మత్తాయై నమః అని కూడా అనవచ్చును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
577వ నామ మంత్రము ఓం మాతృకా వర్ణ రూపిణ్యై నమః
మాతృకలే ( అ నుండి క్ష వరకు గల అక్షరములలో ముప్పదిరెండు మాతృకాక్షరములను మాతృకా వర్ణములందురు) తన స్వరూపంగా గల పరమేశ్వరికా నమస్కారము.
శ్రీ లలితా సహహ్రనామావళి యందలి మాతృకావర్ణరూపిణీ అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మాతృకా వర్ణ రూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులు సర్వమంత్ర శక్తి స్వభావమూ, సమస్త వేదశాస్త్రసారయుతమైన తేజస్సు, శుద్ధవిద్యాసమన్వితమైన దివ్యత్వముతో విరాజిల్లుతూ ఆ తల్లి పాదపద్మమలనారాధించి తరించుదురు.
క్షరము కానిది అక్షరము. భారతదేశపు సకలభాషలకు సంస్కృతము మూల భాష. సంస్కృత భాషను దేవనాగరి భాష అనికూడ అంటారు. సంస్కృత భాషకు అక్షరములు ఏబది ఒకటి. అవి:
అచ్చులు - 16
అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ౡ, ఏ, ఐ, ఓ, ఔ, అం, అః
హల్లులు - 35
క, ఖ, గ, ఘ, ఙ
చ, ఛ, జ, ఝ, ఞ
ట, ఠ, డ, ఢ, ణ
త, థ, ద, ధ, న
ప, ఫ, బ, భ, మ
య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష
మొత్తం అచ్చులు, హల్లులు లెక్కపెడితే - ఏబది ఒక అక్షరములు.
ఏబది ఒక అక్షరములలో ముప్పది రెండు అక్షరములు (32) మాత్రమే ప్రారంభాక్షరములై అమ్మవారి సహస్ర నామములు గలవు.
ఈ ఏబది ఒక అక్షరములలో ఎనిమిది హల్లుల (ఐ, ఔ, అః, ఊ, ఋ, ౠ, ఌ, ౡ) మరియు పదకొండు హల్లుల ప్రారంభములతో అమ్మవారి సహస్ర నామములలో నామములు లేవు.
గనుక ఏబది ఒక (51) అక్షరముల నుండి, పందొమ్మిది అక్షరములను (ప్రారంభాక్షరములుగా నామములు లేని) మినహాయిస్తే ముప్పది రెండు అక్షరముల (32) మాత్రమే ప్రారంభాక్షరములై అమ్మవారి సహస్ర నామములు గలవు. ఈ ముప్పది రెండు అక్షరములనే మాతృకా వర్ణములు అందురు. ఈ ముప్పది రెండు అక్షరముల (మాతృకా వర్ణముల) ప్రారంభములతోనే అమ్మవారికి గల నామములన్నియు గలవు గనుక అమ్మవారు మాతృకావర్ణరూపిణీ యని అనబడినది.
సంస్కృత భాషకు ఏబది ఒక అక్షరములు గలవు. అందు ముప్పది రెండు అక్షరములకు మాత్రమే (ప్రారంభాక్షరములుగా) సహస్రనామములు గలవు. ఈ ముప్పది రెండు అక్షరములనే మాతృకా వర్ణములు అని యందురు. గనక పరమేశ్వరి మాతృకావర్ణరూపిణీ యని అనబడినది.
వర్ణమాలలోని అక్షరములన్నియు వీటినుండే ఏర్పడినవి, సమస్త మంత్రములు, వేదశాస్త్రములు, సకల భాషలు ఉద్భవిస్తాయి, ఇటువంటి మాతృకా వర్ణస్వరూపమే జగజ్జనని అని ఈ నామ మంత్రమునకు అర్థము.
గమనించ వలసిన విషయము:-
మాతృకా వర్ణములు ముప్పది రెండు
అమ్మవారి సహస్ర నామములు ప్రారంభాక్షరములుగా తీసికొనిన అ అక్షరముల సంఖ్య ముప్పదిరెండు.
శ్రీలలితా సహస్ర నామస్తోత్ర శ్లోకములు విరచింపబడిన అనుష్టప్ ఛందస్సుకము అక్షరములు ముప్పదిరెండు
శుద్ధవిద్యాంకురములై భాసిల్లు అమ్మవారి రెండు దంతపంక్తుల సంఖ్య ముప్పది రెండు
ఇంకొక విషయము ఏమిటి అంటే, (సనత్కుమార సంహిత ప్రకారము) ఈ ఏబది ఒక అక్షరములకు వర్ణములు (రంగులు గలవు).
అచ్చులు పదహారు - ధూమ్ర వర్ణము
క నుండి ఠ వరకు - సిందూర వర్ణము.
డ నుండి ఫ వరకు తెల్లని (గౌర) వర్ణము.
బ నుండి ర వరకు అరుణ (లేత ఎఱుపు) వర్ణము.
ల నుండి స వరకు కాంచన (బంగారు) వర్ణము.
హ, క్ష అను ఈ రెండు అక్షరములు మెఱుపు వర్ణము.
ఈ ఏబది ఒక అక్షరములలో అచ్చులు శక్తిస్వరూపములు అనగా అమ్మవారి స్వరూపము. హల్లులు అన్నియును శివస్వరూపములు. హల్లలు అచ్చుల చేరిక లేనిదే అక్షరము సంపూర్ణ స్వరూపము గాదు. గనుక అక్షరము అనునది శివశక్త్యైక్యరూపము.
అక్షరము శబ్దస్వరూపమై నోటి నుండి వెలువడుతున్నది. అటువంటి ఈ అక్షరములకు వర్గములు, ఆ వర్గములకు అధిదేవతలు గలరు. వారిని వాగ్దేవతలు అందురు. వారే వశిన్యాది వాగ్దేవతలు. వశిన్యాదులు వాగ్దేవతలు ఎలాగ అయారు అనగా - వాక్కు అంటే మాట. మాట అంటే పదము. కొన్ని అక్షరముల సముదాయమే మాట. వశిన్యాదులు ఎనిమిదిమంది. ఏబది అక్షరములు
అ వర్గము (అ నుండి ఆః వరకు గల అక్షరములు) - వశిని
క వర్గము (క,ఖ,గ,ఘ,ఙ) - కామేశ్వరి.
చ వర్గము (చ,ఛ,జ,ఝ,ఞ) - మోదిని
ట వర్గము (ట,ఠ,డ,ఢ,ణ) - విమల.
త వర్గము (త,థ,ద,ధ,న) - అరుణ.
ప వర్గము (ప,ఫ,బ,భ,మ) - జయిని
య వర్గము (య,ర,ల,వ) - సర్వేశ్వరి
శ వర్గము (శ,ష,స,హ,క్ష) - కౌళిని అని ఎనిమిది వర్గములు ఆ వర్గములకు వశిన్యాదులు అధిష్ఠాన దేవతలు.
వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అను వీరు వైఖరీరూపంలో వెలువడు వాక్కునందున్న అక్షరములతో, జ్ఞానమును జోడించి వాక్కుగా వెలువడజేతురు. గనుకనే అమ్మవారు వీరిని వాగ్దేవతలు అని యన్నది.
ఇది మాత్రమే కాకుండా వైఖరీ రూపమైన వాక్కు వెలువడడానికి కంఠం నుండి శిరస్సు వరకు ఎనిమిది ప్రదేశములు గలవు. ఈ ఎనిమిదింటిని 1) ఐదు స్థానములు (కంఠము, తాలువులు అనగా దౌడలు, ఓష్ఠములు అనగా పెదవులు, దంతములు, అంగుడు) 2) రెండు ప్రయత్నములు (అభ్యంతరప్రయత్నము, బాహ్యప్రయత్నము - అనగా మాటలాడుటకు లోపలినుండి మాట వెలుపలకు వచ్చుటకు అభ్యంతర ప్రయత్నమనియు, లోపలి నుండి వచ్చిన మాట బయటకు వెలువడజేయుట బాహ్యప్రయత్నము అనియు అందురు), 3) ఒక కరణము (నాలుక). ఈ ఎనిమిదింటికి అధిదేవతలు పైన చెప్పబడిన వశిన్యాది వాగ్దేవతలు.
అలాగే ఈ ఏబది ఒక్క (51) అక్షరములకు (ల, ళ అను అక్షరములు ఒకటిగానే పరిగణింపబడుటచే (ఏబది మంది దేవతలు గలరు). శరీరంలోని షట్చక్రములందుండు వివిధ సంఖ్యలుగల పద్మములందు ఆ దేవతలు ఉన్నారు ఆ వివరములు:-
విశుద్ధిచక్రము అ నుండి అః వరకు పదహారు దళముల ఈ పద్మమునందు డాకిని అధిష్ఠానదేవతగా ఉండు దేవతలు పదహారు (16) మంది. వారు:-
1. అమృతా, 2. ఆకర్షిణి, 3. ఇంద్రాణి, 4. ఈశాని, 5. ఉషఃకేసి, 6. ఊర్ధ్వ, 7. ఋద్ధిత, 8. ౠకార, 9. కార, 10. షా, 11. ఏకపదా, 12. ఐశ్వర్యా, 13. ఓంకారి, 14. ఔషధి, 15. అంబికా, 16. అఃక్షరా.
అనాహతచక్రము క నుండి ఠ వరకు పండ్రెండు దళముల ఈ పద్మమునందు రాకిని అధిష్ఠానదేవతగా ఉండు దేవతలు పండ్రెండు (12) మంది. వారు:-
17. కాళరాత్రి 18. ఖాతీత, 19. గాయత్రి, 20. ఘంటాధారిణి, 21. ఙామిని, 22. చంద్రా 23. ఛాయా, 24. జయా, 25. ఝుంకారి, 26. జ్ఞానరూప, 27. టంకహస్తా, 28. ఠంకారిణి.
మణిపూరచక్రము డ నుండి ఫ వరకు పది దళముల ఈ పద్మమునందు లాకిని అధిష్ఠానదేవతగా ఉండు దేవతలు పది (10) మంది. వారు:-
29. డామరి, 30. ఢంకారిణి, 31. ణామిరి, 32. తామసి, 33. స్థాణ్వి, 34. దాక్షాయణి, 35. ధాత్రి, 36. నందా, 37. పార్వతి, 38. ఫట్కారిణి.
స్వాధిష్ఠానచక్రము బ నుండి ల వరకు ఆరు దళముల ఈ పద్మమునందు కాకిని అధిష్ఠానదేవతగా ఉండు దేవతలు ఆరు (6) మంది. వారు:-
39. బందిని, 40. భద్ర, 41. మహామాయ, 42. యశస్వినీ, 43. రమా, 44. లంబోష్ఠిత.
మూలాధారచక్రము వ నుండి స వరకు నాలుగు దళముల ఈ పద్మమునందు సాకిని అధిష్ఠానదేవతగా ఉండు దేవతలు నలుగురు (4) మంది. వారు:-
45 వరద, 46. శ్రియ, 47.షండా, 48. సరస్వతి.
ఆజ్ఞాచక్రము హ మరియు క్ష అను రెండు దళముల ఈ పద్మమునందు హాకిని అధిష్ఠానదేవతగా ఉండు దేవతలు ఇరువురు (2). వారు:-
49. హంసవతీ, 50. క్షమావతీ
ఆ, ఈ, ఊ, మొదలగు ప్రత్యేక వర్ణములు కలయికచేత మూడేసి వర్ణముల కలియికచేత మూడేసి వర్ణములు చేర్చుటతో క కారాది క్ష కారాంతము వరకు మార్చుచు, చేర్చుచూ, నేర్చుచూ పలుకులన్నీ పరమేశ్వరి నామములే కావున జగన్మాత మాతృకావర్ణరూపిణి అనబడును.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మాతృకావర్ణరూపిణ్యై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి