7, ఏప్రిల్ 2020, మంగళవారం



-గీతా మకరందము
అక్షరపరబ్రహ్మయోగము
🕉🌞🌙🌎🌟🚩

అ|| ప్రపంచము యొక్క నశ్వరస్వభావమును, పరిణామశీలత్వమును తెలియజేయుచున్నారు -

అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవన్త్యహరాగమే |
రాత్ర్యాగమే ప్రలీయన్తే తత్రైవావ్యక్తసంజ్ఞకే ||

తా:- బ్రహ్మదేవుని పగలు ప్రారంభమగునపుడు అవ్యక్తము (ప్రకృతి) నుండి సమస్త చరాచరవస్తువులు పుట్టుచున్నవి. మరల రాత్రి ప్రారంభమగునపుడు ఆ అవ్యక్తమునందే లీనమగుచున్నవి.


వ్యాఖ్య:- ఒక్క పరమాత్మ తప్ప తక్కిన వస్తువులన్నియు పుట్టుక, చావు కలవియేయగును. ఆ పదార్థాలన్నియు పరమాత్మయందే కల్పితముగనున్న మాయయందు (అవ్యక్తము, లేక, మూలప్రకృతి యందు) ఉద్భవించి లయించుచుండును.


 నిద్రయను తమస్సునందు స్వప్నపదార్థములన్నియు సృష్టింపబడి మరల ఆ తమస్సునందే విలీనములైపోవునట్లును, మేలుకొనినవానికి వానితో ఏ సంబంధమును లేనట్లును, ఈ సమస్త జగత్తుకూడ పరమాత్మయందు ఆభాసరూపముననున్న అవ్యక్తము (ప్రకృతి) నందు ఉద్భవించుచు, తిరిగి దానియందే లయించుచున్నది. కావున ఈ సృష్టిప్రళయములతో వాస్తవముగ పరమాత్మకు ఏ సంబంధమున్ను  లేదు. అయినను వాని యన్నింటికిని ఆధారభూతుడై అధిష్ఠానరూపుడై వెలయుచున్నాడు.


ప్ర:- ఈ సమస్త జగత్పదార్థములు దేనినుండి పుట్టుచున్నవి?
ఉ:-   అవ్యక్తమునుండి (అవ్యక్తము = మూలప్రకృతి, మాయ).


ప్ర:- ఎప్పుడు పుట్టును?
ఉ:-  బ్రహ్మదేవుని పగలు ప్రారంభమగునపుడు.





ప్ర:- ఎపుడు లయించును? ఎచ్చోట లయించును?
ఉ:- బ్రహ్మదేవునియొక్క రాత్రి ప్రారంభమగునపుడు లయించును. ఎచట పుట్టుచున్నవో ఆ అవ్యక్తమునందే తిరిగి లయించుచున్నవి.

🕉🌞🌙🌎🌟



08-21-గీతా మకరందము
అక్షరపరబ్రహ్మయోగము
🕉🌞🌎🌙🌟🚩

అ|| అట్టి పరమాత్మను బొందినవారికి మరల జన్మ లేదని వచించుచున్నారు -
అవ్యక్తోక్షర ఇత్యుక్తః
తమాహుః పరమాం గతిమ్  |
యం ప్రాప్య న నివర్తన్తే 
తద్ధామ పరమం మమ ||

తా:- ఏ పరమాత్మ (ఇంద్రియములకు) అగోచరుడనియు,  నాశరహితుడనియు చెప్పబడెనో, అతనినే సర్వోత్తమమైన ప్రాప్యస్థానముగా (వేదవేత్తలు) చెప్పుచున్నారు. దేనిని పొందినచో మరల (వెనుకకు తిరిగి ఈ సంసారమున) జన్మింపరో, అదియే నాయొక్క శ్రేష్ఠమైన స్థానము (స్వరూపము) అయియున్నది.


వ్యాఖ్య:- ప్రపంచములోని  అన్నిపదవులకంటెను, ప్రాప్యస్థానములకంటెను సర్వశ్రేష్ఠమైనది ఏది అను విషయమున్ను, దేనిని పొందినచో మరల జీవునకు పునరావృత్తి  (పునర్జన్మము) కలుగదో ఆ విషయమున్ను ఇచట చెప్పబడినది. స్థూలదృష్టికి అగోచరుడును, నాశరహితుడునగు పరమాత్మయే సర్వోత్తమ ప్రాప్యస్థానమని వేదశాస్త్రాదులన్నియు వచించుచున్నవి. కావున క్షరమును (నశించుదానిని) ఆశ్రయించినచో, లేక ఆశించినచో ఏమి ప్రయోజనము? అక్షరమునే (నశింపనిదానినే) ఆశ్రయించవలెను. ప్రపంచములోని సమస్తదృశ్యపదార్థములున్ను నాశవంతములు. కావున అవి జీవులకు ఉత్తమ ప్రాప్యస్థానములు కానేరవు.


 పరమగతియేదియో దానినే అన్వేషింపవలెను. గాని అల్పగతిని, అల్పస్థానమును గాదు. ఆ పరమగతియో అక్షరపరమాత్మయే యని ఇట వచింపబడినది. కావున వివేకవంతులగువారు మాయాప్రభావమునకు లోబడక సర్వశ్రేష్ఠమగు పరమాత్మస్థానమునే అవలంబించవలెనుగాని అల్పప్రాపంచిక పదములనుగాదు. (Aim at the lion and miss it rather than hunt a jackal and catch it - గురితప్పినను సింహమునే వేటాడవలెనుగాని, చేతికి చిక్కినను నక్కవలన ప్రయోజనమేమి? అని ఆంగ్లసామెత.) 


    ఇక నట్టి పరమాత్మను పొందినవారికి గలుగు పరమప్రయోజనమేమియో తెలుపుచున్నారు. అదియే జన్మరాహిత్యము. ప్రపంచములోని ఏ లోకమును బొందినను జీవుడు మరల జన్మింపవలసినదే. కాని పరమాత్మను పొందినవారికి మరల జన్మలేదు. సంసారదుఃఖము లేదు. మాయకులోబడిన ఏస్థానమైనను వికారముతోను, పరిణామముతోను, పుట్టుక చావులతోను గూడియుండును. మాయకులోబడని స్థానమొక్కటి మాత్రమే కలదు.


 అదియే దైవస్థానము. అట్టి పరంధామమును జెందినవాడు జననమరణాదులనుండి విముక్తిని బడసి పునరావృత్తిరహిత శాశ్వతకైవల్యమునే బడయుచున్నాడు. కావున అట్టి మహోన్నతస్థానమునే అన్వేషింపవలయును. జన్మదుఃఖము, జరాదుఃఖము, మరణదుఃఖము మహాభయంకరములైనవి. అట్టి దారుణ సంసృతియందు మరల పడకయుండవలెననిన అక్షయ పరమాత్మ స్థానమునే ఆశ్రయించవలసియుండును.


ప్ర:- ప్రపంచములోని అన్ని స్థానములకంటె శ్రేష్ఠమైనదేది?
ఉ:- అవ్యక్తమై, నాశరహితమైనట్టి,  పరమాత్మస్థానమే.


ప్ర:-   దానిని పొందినవారికి గలుగు ప్రయాజనమేమి?
ఉ:-  వారు మరల  జననమరణాది సంసారదుఃఖమందు ఎన్నటికిని తగుల్కొనరు. మరల జన్మింపరు. 


ప్ర:- దేనిని పొందినచో జీవుడు తిరిగి జన్మాదులను బొందకుండును?
ఉ:- పరమాత్మ పదవిని.




ప్ర:- పరమాత్మ యెట్టివాడు?
ఉ:- అవ్యక్తుడు (ఇంద్రియములకు అగోచరుడు), నాశరహితుడు.

🕉🌞🌎🌙🌟🚩



08-23-గీతా మకరందము
అక్షరపరబ్రహ్మయోగము
🕉🌞🌎🌙🌟🚩

అ|| ఏ మార్గమున బోయిన జనులు తిరిగి సంసారమున జన్మింపకుందురో, ఏ మార్గమున బోయిన తిరిగి జన్మింతురో, ఆ రెండు మార్గములనుగూర్చి నాలుగు శ్లోకములద్వారా యిపుడు తెలుపుచున్నారు -


యత్ర  కాలే త్వనావృత్తిం
ఆవృత్తిం చైవ యోగినః |
ప్రయాతా యాన్తి తం కాలం
వక్ష్యామి భరతర్షభ ||

తా:- భరతకులశ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఏ కాలమందు (లేక, ఏమార్గమందు) (శరీరమును విడిచి) వెడలిన యోగులు మరల తిరిగిరారో (జన్మమునొందరో), ఏ కాలమందు వెడలిన యోగులు మరల తిరిగివచ్చుదురో (జన్మించుదురో), ఆ యా కాలవిశేషములను చెప్పచున్నాను. (వినుము)

🕉🌞🌎🌙🌟🚩
💖సహజ స్థానం💖
🕉🌞🌎🌙🌟🚩

నీటిలో ఉన్న చేపను బయటకు పెట్టి బంగారు కుర్చీలో కూర్చోబెట్టి,వజ్రకిరీటం ధరింపచేసి ధనము,మద్యము మరియు వివిధ రకాల ఆహరాలు ఇచ్చినా సంతోషంగా ఉండలేనట్లే, భగవంతుని అంశయైన జీవుడు ఆ భగవంతుని సేవలో ఉండలేనట్లైతే ఆనందంగా జీవించలేడు. చేపకు నీరు సహజసిద్ధమైన స్ధానం అయినట్లు, జీవునికి సదా భగవంతుని సేవయే సహజసిద్ధమైన స్ధానం.

🕉🌞🌎🌙🌟🚩 


08-25-గీతా మకరందము
అక్షరపరబ్రహ్మయోగము
🕉🌞🌎🌙🌟🚩

అ|| ఇక పునరావృత్తి గలిగియుండువారి ‘ధూమాది’ మార్గమును వచించుచున్నారు -

ధూమో రాత్రిస్తథా కృష్ణః
షణ్మాసా దక్షిణాయనమ్ |
తత్ర చాన్ద్రమసం జ్యోతిః
యోగీ ప్రాప్య నివర్తతే ||

తా:- పొగ, రాత్రి, కృష్ణపక్షము, ఆరునెలలుగల దక్షిణాయనము ఏ మార్గమునగలవో ఆ మార్గమున (వెడలిన) సకామకర్మయోగి చంద్రసంబంధమైన ప్రకాశమును బొంది మఱల వెనుకకు వచ్చుచున్నాడు (తిరిగి జన్మించుచున్నాడు.)

వ్యాఖ్య:- జ్ఞానము ప్రకాశరూపమైయున్న చందమున అజ్ఞానము అంధకార రూపమైయున్నది. అట్టి అంధకారమార్గమున జనువాడు మరల జన్మించును. మరల సంసారచక్రమున తగుల్కొనును. ఇచట ‘యోగి’ అనగా ఫలాపేక్షతో గూడుకొనిన కర్మలనాచరించువాడని అర్థము. ఆత్మజ్ఞానములేమిచే అతడు మరల జన్మించును.


 అజ్ఞానాంధకారమును సూచించుటకు ఇచట కొన్ని పదార్థములు తెలుపబడినవి. అవి యేవియనిన -

(1) పొగ,
(2) రాత్రి,
(3) కృష్ణపక్షము,
(4)దక్షిణాయనము.
 ఇందు మొదటిమూడును అంధకారసూచకములై యున్నవి. నాల్గవది అధోమార్గమును సూచించుచున్నది. ఇట్టి అంధకారమార్గముగుండా చనువాడు అనగా ఆత్మజ్ఞానము లేనివాడు అతని కర్మననుసరించి చంద్రలోకము మున్నగువానిని బొంది, మరల కొంతకాలమునకు భూలోకమున జన్మించును. (క్షీణేపుణ్యే మర్త్యలోకం విశన్తి). పైనదెల్పిన దక్షిణాయనము అవిద్యావశమున జీవునకుగలుగు అధోదృష్టిని తెలుపుచున్నది.


       పై శ్లోకములందలి ‘ఉత్తరాయణ, దక్షిణాయన’ పదములకు అంతరార్థమును గూడ గైకొనుట ఉత్తమముగ తోచుచున్నది. ఏలయనిన మహనీయు లెందరో దక్షిణాయనమున గూడ దేహమును వీడుచున్నారు. మూర్ఖులెందరో ఉత్తరాయణమునగూడ దేహమును వదలుచున్నారు. బాహ్యార్థమును మాత్రము గైకొనినచో దక్షిణాయనమున దేహమును వీడిన జ్ఞానులు తిరిగి జన్మించుదురనియు, ఉత్తరాయణమున దేహమును వదలు మూఢులు జన్మరాహిత్యము నొందుదురని చెప్పవలసివచ్చును. అది కేవలము సత్యదూరమే యగును. కాబట్టి ఉత్తరాయణ, దక్షిణాయణములకు ఉత్తరమార్గము, దక్షిణమార్గములనిగాని;
జ్ఞాన, అజ్ఞానములని గాని కూడ అర్థముచెప్పుట సమంజసముగ తోచుచున్నది.


ప్ర:- సకామకర్మయోగి (లేక, అజ్ఞాని) ఏ మార్గముగుండా చనును?  
ఉ:- పొగ, రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయనము - అనునవి కల అంధకారమార్గముగుండా చనును.


ప్ర:- అతనికి జన్మరాహిత్యము కలుగునా?
ఉ:- కలుగదు. అతడు తిరిగి జన్మించియే తీరును.
ప్ర:- కాబట్టి ఫలితాంశమేమి?


ఉ:- ఆత్మజ్ఞానమునుబొంది, ఊర్ధ్వమార్గమునజని, పునరావృత్తిరహితశాశ్వతపదవి నొందుటయే యుక్తము.

🕉🌞🌎🌙🌟🚩 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి