8, ఏప్రిల్ 2020, బుధవారం




🌷. శ్రీ శివ మహా పురాణము - 111 🌷
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴 
అధ్యాయము - 2
🌻. నారదుని తపస్సు  - 1 🌻

సూత ఉవాచ -

ఏకస్మిన్‌ సమయే విప్రా నారదో మునిసత్తమః | బ్రహ్మపుత్రో వినీతాత్మా తపోర్థం మన ఆదధే || 1

హిమశైల గుహా కాచిదేకా పరమశోభనా | యత్సమీపే సురనదీ సదా వహతి వేగతః || 2

తత్రాశ్రమో మహాదివ్యో నానాశోభాసమన్వితః | తపోర్థం స య¸° తత్ర నారదో దివ్యదర్శనః || 3

తం దృష్ట్యా మునిశార్దూలస్తేపే స సుచిరం తపః | బద్ధ్వాసనం దృఢం మౌనీ ప్రాణానాయమ్య శుద్దధీః || 4

సూతుడిట్లు పలికెను -

ఓ విప్రులారా! ఒకప్పుడు మునిశ్రేష్ఠుడు, బ్రహ్మ గారి కుమారుడు, వినయస్వభావము కలవాడు నగు నారదుడు తపస్సును చేయు సంకల్పించెను (1).

హిమవత్పర్వతము నందు ఒక మిక్కిలి సుందరమగు గుహ కలదు. దాని సమీపమునందు జీవనదియగు గంగ వేగముగా ప్రవహించుచుండును (2).

అచట అనేక శోభలతో గూడిన దివ్యమగు ఆశ్రమము గలదు. పుణ్యదర్శనుడగు నారదుడు తపస్సు చేయుటకు అచటికి వెళ్లెను (3).

ఆ ముని పుంగవుడు ఆ ఆశ్రమమును చూచి, అచటనే దృఢమగు ఆసనమును వేసి, మౌనియై, ప్రాణయామమునుచేసిస పవిత్రాంతః కరణుడై దీర్ఘకాలము తపమాచరించెను (4).

చక్రే మునిస్సమాధిం తమహం బ్రహ్మేతి యత్ర హ | విజ్ఞానం భవతి బ్రహ్మసాక్షాత్కారకరం ద్విజాః || 5

ఇత్థం తపతి తస్మిన్‌ వై నారదే మునిసత్తమే | చకంపేsథ శునాసీరో మనస్సం తాపవిహ్వల ః|| 6

మనసీతి విచింత్యాసౌ మునిర్మే రాజ్యమిచ్ఛతి | తద్విఘ్న కరణార్థం హి హరిర్యత్న మియేష సః || 7

సస్మార స్మరం శక్రశ్చేతసా దేవనాయకః | ఆజగామ ద్రుతం కామస్సుమధీర్మహి మాన్వితః || 8

నారదముని 'అహం బ్రహ్మాస్మి  (బ్రహ్మము నేనే)' అను దర్శనము గల సమాధిని పొందెను. ఓ ద్విజులారా! ఇట్టి తపస్సు వలన బ్రహ్మ సాక్షాత్కారహేతువగు జ్ఞానము సిద్ధించును (5).

మునిశ్రేష్ఠుడగు నారదుడు ఈ తీరున తపస్సు చేయుచుండగా, ఇంద్రుని మనస్సు తీవ్రమగు ఆదుర్ధాతో కంపించెను (6).

'ఈమహర్షి నారాజ్యమును కోరుచున్నాడు' అని తలపోసిన వాడై ఇంద్రుడు నారదుని తపస్సునకు విఘ్నము చేయ నిశ్చయించుకొనెను (7).

దేవతలకు నాయకుడగు ఇంద్రుడు మనస్సులో మన్మథుని స్మరించెను. అపుడు మహిమ గలవాడు, పుష్పబాణుడు నగు మన్మథుడు వెంటనే విచ్చేసెను.

అ ధాగతం స్మరం దృష్ట్వా సంబోద్య సురరాట్‌ ప్రభుః | ఉవాచ తం ప్రపశ్యాశు స్వార్థే కుటిలశేముషిః || 9

ఇంద్ర ఉవాచ |

మిత్రవర్య మహావీర సర్వదా హితకారక | శృణు ప్రీత్యా వచో మే త్వం కురు సాహాయ్యమాత్మనా || 10

త్వద్బలాన్మే బహూనాం చ తపోగర్వో వినాశితః | మద్రాజ్యస్థిరతా మిత్ర త్వదనుగ్రహతస్సదా || 11

హిమశైల గుహాయాం హి మునిస్తపతి నారదః | మనసోద్దిశ్య విశ్వేశం మహా సంయమవాన్‌ దృఢః || 12

దేవతలకు ప్రభువగు ఇంద్రుడు మన్మథుని రాకను చూచెను. ఆతడు స్వార్ధమును సాధించుకొనుటలో కుటిలమగు బుద్ధి చతురత గలవాడు. ఆతడు మన్మథుని వెంటనే పిలిచి ఇట్లు పలికెను (9).

ఇంద్రుడిట్లు పలికెను -

ఓ శ్రేష్ఠమిత్రమా! నీవు గొప్ప వీరుడవు. మాకు ఎల్లవేళలా హితమును చేయువాడవు. నీవు నా మాటను ప్రీతితో విని, సాహాయ్యమును చేయుము (10).

నేను నీ బలముతోనే అనేకుల తపోగర్వమును అడంచితిని . ఓ మిత్రమా! నా రాజ్యము యొక్క స్థిరత్వము అన్ని వేళలా నీ అనుగ్రముపై నాధారపడి యున్నది (11).

హిమవత్పర్వత గుహలో నారదముని జగత్పితను ఉద్దేశించి గొప్ప నియమముతో కఠినమగు తపము నాచరించు చున్నాడు (12).

యాచేన్న విధితో రాజ్యం స మమేతి విశంకితః | అద్యైవ గచ్ఛ తత్ర తత్తపోవిఘ్నమాచర || 13

ఇత్యాజ్ఞప్తో మహేంద్రేణ స కామస్సమధుప్రియః | జగామ తత్థ్సలం గర్వాదుపాయం స్వం చకార హ || 14

రచయామాస తత్రాశు స్వకలాస్సకలా అపి | వసంతోsపి స్వప్రభావం చకార వివిదం మదాత్‌ || 15

న బభూవ మునేశ్చేతో వికృతం మునిసత్తమాః | భ్రష్టో బభూవ తద్గర్వో మహేశానుగ్రహేణ హ || 16

ఆ నారదుడు బ్రహ్మ నుండి నా రాజ్యమును వరముగా కోరునేమో యను శంక నాకు గలదు. నీవీనాడే అచటకు వెళ్లి, ఆయన తపస్సునకు విఘ్నమును కలిగించుము (13).

ఈ విధముగా మహేంద్రునిచే ఆజ్ఞాపింపబడిన ఆ మన్మథుడు ప్రియమిత్రుడగు వసంతునితో గూడి గర్వముతో ఆ ప్రదేశమునకు వెళ్లి తన ఉపాయమును మొదలిడెను (14).

ఆతడచట వెనువెంటనే తన కళలనన్నిటినీ ప్రదర్శింపజొచ్చెను. వసంతుడు కూడా గర్వించిన వాడై, తన ప్రభావమును అనేక విధములుగా చూపెట్టెను (15).

ఓ మునిశ్రేష్ఠులారా! నారదముని యొక్క మనస్సు మహేశుని అనుగ్రహముచే వికారమును పొందలేదు. మన్మథునకు గర్వభంగమాయెను (16).

సశేషం......
🌹 🌹 🌹 🌹 🌹

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి