6, ఏప్రిల్ 2020, సోమవారం

.శ్రీ ఆదిశంకరుల విరచిత ఆత్మబోధ



ఓం నమః శివాయ:
ఓం నమః శివాయ:
5.శ్రీ ఆదిశంకరుల విరచిత ఆత్మబోధ
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

5. అజ్ఞాన కలుషం జీవం
జ్ఞానాభ్యాసాత్‌ వినిర్మలం
కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్‌
జలం కతకరేణువత్‌ || 5

జలం= నీటిని, కతక రేణువత్‌
= చిల్లగింజపొడివలె (ఇందుగు గింజ, ఇండుపుకాయ, ఇండుగు కాయ - పరిశుభ్రం చేసి నీటిలోనే కలిసిపోతూ ఉన్నట్లుగా), అజ్ఞాన కలుషం = అజ్ఞానం చేత కలుషితమైన, జీవం = జీవుని, జ్ఞానాభ్యాసాత్‌ = జ్ఞానాభ్యాసం వల్ల, వినిర్మలం = బాగా పరిశుద్ధునిగా, కృత్వా = చేసి, జ్ఞానం = గురుజ్ఞానం, స్వయం = తనంతట తానుగానే, నశ్యేత్‌ = నశించిపోతూ ఉంది.


తా|| చిల్లగింజపొడి మురికి నీటిని పరిశుభ్రం చేసి నీటిలోనే కలిసిపోతూ ఉన్నట్లుగా అజ్ఞానం చేత కలుషితమైన జీవుని జ్ఞానాభ్యాసం అనేటటువంటిది బాగా పరిశుద్ధునిగా చేసి గురువు ఇచ్చిన జ్ఞానం అనేది తనంతట తానుగానే లీనమైపోతూ ఉంది.
ఇక్కడ వివరించారు. అంతఃకరణ చతుష్టయంతో విచ్ఛిన్నం అవుతూ ఉండే ఆత్మే జీవుడుగా నిలుస్తున్నాడు. పారమార్థికమైనటువంటి విజ్ఞానం సరిగా లేకపోవటం వల్లే మానవుడు మనస్సుతో జీవిస్తూ అహంకారంతో సంచరిస్తూ ఉన్నాడు. అహంకారమే జీవుడుగా అయి జీవిస్తున్నాడు.


 ఇహలోక జీవభ్రాంతితో పరలోకాన్ని, శాంతిని విడిచిపెడుతూ ఉన్నాడు. కావున మానవుడు మనస్సుకు జీవభ్రాంతితో చేకూరుతున్న వ్యయ ప్రయాసల్ని, అశాంతిని తొలగించుకోవటానికి జ్ఞానాభ్యాసాన్ని నిరంతరం కొనసాగించవలసిన అవసరం కలుగుతుంది. దానికోసమే మానవుడు ధ్యానాన్ని స్వీకరించి ఆర్పడుత్మతో జీవించటానికి ప్రయత్నం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. నేనే ఆత్మను అనే భావంతో మానవుడు జీవించాలని నిరంతరం ఎంత ప్రయత్నం చేసినా, ఆలోచనా ప్రవాహాలు, అవసరాలు, స్వలాభాకాంక్షలు జ్ఞానానుభవాన్ని భంగం చేస్తూనే ఉంటాయి. గాఢ నిద్రలో (సుషుప్త్యవస్థలో) మాత్రమే అనగా అజ్ఞానంలో మనస్సు ఆత్మలో లీనం అవుతూ ఉంది. కాన మనస్సుని ఆ విధంగా జ్ఞానంలో ఉన్నప్పుడు లీనమయ్యేటట్లు చెయ్యాలి.


జాగ్రత్‌, స్వప్న, సుషుప్త్యవస్థలు అన్నిటిలోను, లోపల బయట అంతటాకూడా నిండి ఉన్నటువంటిది, సర్వావస్థలను ప్రకాశింప చేస్తూ ఉన్నటువంటిది అయిన చైతన్య స్వరూపం ఏదయితే ఉందో ఆ బ్రహ్మాన్ని నేనే అనే అనుభూతిని పొందటం అనేదే మోక్షం, అసలైన ఆనందం. అది నిరంతర జ్ఞానసాధన చేతనే సాధ్యం అవుతుంది. కనుక అటువంటి జ్ఞానం చేత అజ్ఞానాన్ని తొలగించాలి.


మనస్సు అనేది సంకల్ప వికల్పాలతో నిరంతరం చరిస్తూ ఉంటుంది. సెకండులో వందవ వంతు కాలంలో కూడా అది నిలువదు. అట్లా సంచరించటమే దాని సహజ స్వభావం అయి ఉంది. అటువంటి మనస్సుకి జ్ఞానేంద్రియాలనే అయిదు గుర్రాలు అయిదు ఆయుధాలై ఉండటం వల్ల అవి బహిర్ముఖం అయి వస్తు విషయ జ్ఞానంతో ఆనందిస్తూ గడపటానికి ప్రయత్నం చేస్తుంటాయి. కోరికల పుట్టతో పరిపరి విధాల సంచరిస్తూ మనిషికి శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. అటువంటి మనస్సుకి, ఇంద్రియాలకి గురుజ్ఞానం అనే దాన్ని తోడుగా చేయటం వల్ల మనస్సు, ఇంద్రియాలు అంతర్ముఖంగా ఉన్న దృశ్యాల్ని తిలకిస్తాయి.


దానితో మానవుని లోపలే ఉన్న విచిత్రమైన ఆత్మజ్యోతిని, అనంతమైన నాదాన్ని, నిశ్శబ్దమైన ప్రశాంతతను, అది శబ్దమైన పరావాణిని, అనంతమైన అమృతత్త్వాన్ని ఆస్వాదించాలనేది జ్ఞానసాధకునికి ఏర్పడుతుంది.


ఏనుగు తొండాన్ని ఒక్క సెకండు కూడా కదలకుండా ఏనుగు నిలుపలేదు. కాని మావటివాడు దానికి ఒక కర్రముక్కను అందిస్తే చాలు ఆ ఏనుగు ఆ కర్రముక్కను పట్టుకుని తొండాన్ని కదపకుండా నడుస్తుంది.


దొంగగొడ్డు బయట దొరికే రుచికరమైన దొంగమేత తింటానికి అలవాటుపడి, చిరుతిళ్లకు మరిగి నిరంతరం బయట పొలాలలోకి పోయి మేసి వస్తూ ఉంటుంది. దాన్ని అట్లా బయటకు వెళ్లనియ్యకుండా పట్టుకొని కట్టుకొయ్యకు కట్టిపడేస్తే నాలుగు రోజులు ఆహారం సరిగా తీసుకోవటానికి మొరాయిస్తుందే కాని క్రమేపి ఉన్న ఆహారంతోనే తృప్తిపడి జీవించటానికి అలవాటు పడుతుంది. ఇంటిముందుకు వచ్చే కుక్కకు రోజు ఆహారం వేస్తూ ఉంటే అది రోజూ ఇంటి ముందుకు వచ్చి నిలబడటానికే అలవాటుపడుతుంది. అదే విధంగా క్రమంతప్పకుండా వస్తూ ఉన్నదానికి ఆహారాన్ని వెయ్యటం మానేస్తే అదే రావటం మానేస్తుంది.
అదే విధంగా ఈ మనస్సును గురుజ్ఞాన సాధనలో నిలిపి ఆనందింప చేయటానికి ప్రయత్నం చేస్తే ప్రారంభంలో ఎక్కడెక్కడికో పోవటానికి మనస్సు ప్రయత్నం చేస్తూనే గడుపుతుంది. దాన్ని నిశితంగా పరీక్షిస్తూ దాని వెంట సాక్షిమాత్రంగా పయనించి దాని స్వభావాన్ని అర్థం చేసుకొని, దాన్ని మళ్ళీ మళ్ళీ బుజ్జగించి వెనుకకు, గురుజ్ఞానం మీదకు తీసుకువచ్చి, జ్ఞానంలో జీవించేటట్లు చేస్తుంటే మనస్సు అంతర్ముఖమై విచిత్రాలలో లీనమయి క్రమేపీ మిత్రుడుగా మారుతుంది.


మనస్సును ఈ విధంగా నిగ్రహింప వలసింది మళ్ళీ మనస్సే అయి ఉండటం వల్ల మనస్సు కొంతసేపు లయం చెందుతూనే మళ్ళీ ప్రకోపిస్తూ బహిర్ముఖంగా నడుస్తుంటుందే కాని పూర్తిగా నశించదు. మనస్సును సంపూర్ణంగా నశింప చేసినప్పుడు మాత్రమే జ్ఞానం చేత శుద్ధమైన మనస్సు ఆత్మగా నిలవటానికి వీలుకుదురుతుంది.


మనస్సు ఆత్మలో లయం కావాలంటే విచారణ ద్వారా వీలుకుదురుతుంది. ఆత్మానాత్మ వివేచనతోనే జ

్ఞానోదయం అనేది

 ప్రతి ఇంద్రియానికి చేకూరుతుంది. ప్రతి ఇంద్రియంలోను అణువణువు మార్పుచెందుతూ వస్తేకాని మనస్సు లయం కాదు. దాన్ని సాధించటం కోసం మనస్సునకు వస్తు విషయాల్ని దూరం చేసినంత మాత్రం చేత అది సిద్ధించదు. వాటి యందు మనస్సుకు కల రాగాన్నికూడా దూరం చెయ్యటానికి అభ్యాస వైరాగ్యాలచేత, విచారణతో ప్రయత్నం చేస్తేనే వీలు కుదురుతుంది. ఇంద్రియాలన్నిటిని నిరంతరం జ్ఞానంతో జీవించేటట్లు చెయ్యటానికి ప్రయత్నం చెయ్యాలి.


సాధకునికి నేనే బ్రహ్మాన్ని అనే భావపూరితజ్ఞానం నిరంతరం కదులుతూ ఉండాలి. భ్రమరకీటన్యాయంలా అంటే కీటకం భ్రమరాన్నే తలంచుకొంటూ భ్రమరంగానే రూపుదిద్దుకొంటున్నట్లు, మనస్సు ఎట్లా కదులుతూ ఉంటుందో మనిషి అట్లా అవుతాడు అనే దానికి అనుకూలంగా శరీరాన్ని, ఇంద్రియాల్ని మార్చాలి. నేనే సచ్చిదానంద బ్రహ్మాన్ని అనే జ్ఞానంతో నిరంతరం చింతించేవాడు, దానికి అనుకూలంగా జీవన విధానాన్ని కొనసాగించ గలిగేవాడు. బ్రహ్మమే అవుతాడు అని అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళు అందరూ బోధిస్తూవచ్చారు.


అనుభవజ్ఞులు చెప్పిన మాట నమ్మాలి, ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంది అని చెబితే ప్రతివాడు వెళ్ళి చూసి రాలేడు కదా ! ఉదాహరణలతో వివరించి నిరూపించి చూపిస్తూ ఉంటే అర్థం చేసుకొని విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాం కదా ! అమెరికా ఉంది అంటే ప్రతివాడు వెళ్ళి చూసిరాలేడు కదా! అమెరికా వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు చెబుతూ ఉంటే నమ్ముతూనే ఉన్నాం కదా! ఈ ఆత్మజ్ఞానం కూడ అటువంటిదే. ఈ ఆత్మజ్ఞానాన్ని కూడ అనుభవ పూర్వకంగా ఇతరులు అనుభవించి చెప్పినదాన్ని ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవలసిందే కాని ఇంకొక విధంగా వీలుకాదు.


గురువు ద్వారా జ్ఞానాన్ని పొంది, జ్ఞానానికి అనుకూలంగా విషయాల్ని, వస్తువుల్ని, కోరికల్ని వివేచనతో విచారణ చేస్తూ, అనవసరమైన వాటిని తొలగించు కొంటూవస్తే క్షణక్షణం అజ్ఞానం కాలుష్యం తొలగటానికి వీలవుతూ ఉంటుంది. విచారణ మార్గం ప్రతి సాధకునికి ప్రతిక్షణం అవసరమై ఉంటుంది.


 అజ్ఞానంతో ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ, సుఖభోగాలనే భ్రమలకు లోనవుతూ, దోషాల్లో కూరుకుపోతూ ఉన్న కలుషిత మనస్సును గురుజ్ఞానం శుద్ధి చేస్తుంది. విచారణ మార్గం మనస్సును సంపూర్ణంగా శుద్ధి చేసి ఆత్మలో లయం అయ్యేటట్లు చేస్తుంది. అంతః కరణ చతుష్టయం అయిన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వివేకంతో విచారణ మార్గంలో నడవటంవల్ల ఒకదానితో మరొకటి లీనమౌతూ అహంకారం కూడా సంపూర్ణంగా లయమైపోతుంది. ఆత్మ మాత్రమే ప్రశాంతంగా నిలుస్తుంది. ఈ విధంగా జ్ఞానం చేత మిత్రుడుగా పరిణామం చెందిన మనస్సు ఆత్మలో లీనమయి పోతుంది. అప్పుడు గురుజ్ఞానం కూడా సచ్చిదానందంలో లీనమై పోతుంది. దీన్ని సాధించటానికి సాధకునికి నిరంతరం దృఢమైన అభ్యాసం కావాలి. దానికి ఎటువంటి ఆటంకాలు వస్తున్నా, దేనికీ లొంగకుండా, పట్టుదలతో నిరంతరం ధ్యాన నిమగ్నుడై ఉండాలి, అప్పుడే జ్ఞానం జ్ఞానానందాన్ని ఇచ్చి లీనమైపోతుంది.


 ఏవిధంగానయితే చిల్లగింజ పొడి వర్షాకాలంలో మట్టితో మాలిన్యం తో ఎర్రగా తయారయిన నీళ్ళను పరిశుభ్రంచేసి తాగటానికి అనుకూలంగా అందించి అదికూడా చివరికి నీటిలో కలిసిపోతుందో అదేవిధంగా ఆత్మజ్ఞానం అనేది సాధకుడైన వానిని దేహాత్మబుద్ధినుంచి మరల్చి ఆత్మలో జీవించేటట్లు చేసి అఖండమైన సచ్చిదానందంలో లయమయ్యేటట్లు చేస్తుంది. దానికార్యం అది నెరవేర్చిన తర్వాత అది కూడా సచ్చిదానందంలో లయమైపోతుది.

🕉🌞🌏🌙🌟

ఓం నమః శివాయ:
6.శ్రీ ఆదిశంకరుల విరచిత ఆత్మబోధ
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩


6. సంసారః స్వప్నతుల్యోహి
రాగద్వేషాది సంకులః
స్వకాలే సత్యవత్‌ భాతి
ప్రబోధే అసత్యవత్‌ భవేత్‌ ||

రాగ ద్వేష ఆది = రాగద్వేషాలు , సుఖదుఃఖాలు మొదలైనవాటితో, సంకులః = ఒక దానితో ఇంకొకటి పొసగకుండా విరుద్ధంగా ఉండేటటువంటిది అయిన, కలుషితమైన, సంసారః = సంసారం, లేక ఈ ప్రపంచం, స్వప్నతుల్యోహి = స్వప్నంతో సమానం అయినటువంటిది, స్వకాలే = స్వప్నకాలమందుమాత్రమే, సత్యవత్‌ = సత్యమైందిగా, భాతి = గోచరిస్తూఉంది, ప్రబోధే = ఆత్మజ్ఞానం కలుగగానే, అసత్యవత్‌భవేత్‌ అసత్యం అవుతూ ఉంది.

తా : రాగద్వేషాలు, సుఖదుఃఖాలు మొదలైన వాటితో ఒకదానికి ఇంకొకటి పొసగకుండా విరుద్ధంగా ఉంటూ కలుషితమైన ఈ సంసారం లేక ప్రపంచం స్వప్నంతో సమానమైంది. స్వప్నకాలమందు మాత్రమే సత్యంగా తోచి మేల్కొనగానే స్వప్నం ఏవిధంగా అదృశ్యం అవుతుందో ఆవిధంగా ఆత్మజ్ఞానం కలుగగానే సంసారం కల వలె అసత్యం అవుతూ ఉంది.
వివరణ : ఎంతకాలం మానవుడు అజ్ఞానంతో ఉంటాడో అంతకాలం ప్రపంచం యథార్థంగానే కనిపిస్తుంది. జ్ఞానోదయం అయినవెంటనే ఈ ప్రపంచం కల వలె అసత్యం అవుతుంది. అంతేకాకుండా ఈ జాగ్రదవస్థ దీర్ఘకాల స్వప్నం వంటిదని తెలుస్తుంది.


అయితే ఈ స్వప్నతుల్యాన్ని ఎట్లా అర్థం చేసుకొంటాం, స్వప్నం అంటే ఏమిటి? అని ప్రశ్నించుకొని దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి జ్ఞానంతో జీవించటానికి ప్రయత్నించిన నాడు మాత్రమే దాని నిజస్వరూపం తెలుస్తుంది.


మానవుని జీవితం ప్రతిరోజూ మూడు అవస్థలతో నడిచిపోతూ ఉంది. 1.జాగ్రదవస్థ అంటే ఉదయం మేల్కొని నప్పటి నుంచి నిద్రపోయేవరకు ఉన్న అవస్థ 2. స్వప్నావస్థ అంటే మెలకువ కాకుండా గాఢనిద్రకాకుండా అనుభవిస్తూ ఉన్నకాలం ఏదయితే ఉందో అది 3. సుషుప్త్యవస్థ అంటే గాఢమైన నిద్రావస్థ.
జాగ్రదవస్థలో శరీరం ఉంది, మనస్సుఉంది, చైతన్యంఉంది. స్వప్నావస్థలో శరీరం లేదు, మనస్సుఉంది, చైతన్యం ఉంది.


 సుషుప్త్యవస్థలో శరీరంలేదు, మనస్సు లేదు, చైతన్యం మాత్రమే ఉంది. మూడు అవస్థల్లోను ఉన్న చైతన్యమే మానవునకు సాక్షిమాత్రంగా ఉన్న ఆత్మఅయి ఉంది. ఆ గాఢనిద్రలో మనస్సు సర్వేంద్రియాలతో కలిసి ఆ చైతన్యరూప మైన ఆత్మతో లీనం అవుతుంది. కనుక నిద్ర అజ్ఞానంలో ఆనందాన్ని అందిస్తుంది.


 నిద్ర సుఖాన్ని ఇస్తుంది. అందుకనే ఆ సుఖనిద్ర కోసం, ఆశాంతికోసం అనేకమంది అనేక విధాల పరితపిస్తు ఉంటారు. పురుషుడైతే స్త్రీ సాంగత్యాన్ని, స్త్రీ అయితే పురుషుని సాంగత్యాన్ని కోరి దాని వల్ల చేకూరే సుఖాన్ని అనుభవించి మత్తుగొని హాయిగా నిద్రిస్తూ ఉన్నారు. మరికొందరు అనేకమైన మత్తుమందులతో మైమరచి నిద్రిస్తూ అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నారు. అవే ఆనందానికి మార్గాలని నమ్మి అజ్ఞానంలో గడిపేస్తూఉన్నారు. ఇవేవీ శాశ్వత మైనవి కావని, ఈ సంసారం, ఈప్రపంచం స్వప్నతుల్యమని ఆత్మజ్ఞానం తెలిసిన గురువులు బోధిస్తున్నారు. దాన్ని అవగాహన అయ్యేటట్లు చెయ్యటానికే స్వప్నాన్ని ఉదాహరణగా స్వీకరించారు.


స్వప్నం అంటే మనస్సుచేత కల్పింపబడింది. స్వప్నం అనుభవిస్తున్నంత వరకూ అది యథార్థంగానే కనిపిస్తుంది. మేల్కొనగానే ఆ కల అబద్ధం అని, అది జరగలేదని అర్థం అవుతుంది. స్వప్నావస్థలో మానవుడు కాశీకి వెళ్ళి గంగలో మునిగాడు అనుకొందాం. ఆ గంగలో మునిగింది ఏది? శరీరం, మనస్సు రెండూ అని స్వప్నంలో భ్రమకొల్పుతుంది.


 మెలకువ రాగానే ఏమితెలిసింది? శరీరం మంచంమీదే ఉంది. మనస్సు మాత్రమే గంగలో మునిగింది అని తెలిసింది. కాని నిజానికి ఆ మనస్సుకూడా మునగలేదని, అదికూడా వట్టి భావనేఅని, వట్టి కల్పనే అని, భ్రమేఅని జాగ్రదవస్థ లోకి వచ్చినప్పుడు తెలిసింది కదా?
అదేవిధంగా జాగ్రదవస్థ యొక్క మిథ్యాజ్ఞానాన్ని కూడా ఆత్మ జ్ఞానంయొక్క అనుభవం చేత అర్థం చేసుకొంటున్నారు. అది ఎట్లా తెలుస్తుంది? అంటే ఆత్మ జ్ఞానసాధనలో సాధకుడు కూర్చొన్నప్పుడు ఈ దేహం, మనస్సు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అన్నీకూడా ఆత్మలో లీనమయి పోయి ఆత్మజ్యోతితో ఆనందిస్తున్నప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా భ్రమే నని, వట్టి కల్పనే అని తెలుసుకొంటున్నాడు. గాఢనిద్రలో ఏవిధంగా ఒక్క చైతన్యమే మిగిలిందో అదేవిధంగా ఆత్మజ్ఞాన సాధనలో మెలకువగా ఉన్న నిద్రను అనుభవిస్తూ చైతన్యంతో ఆనందాన్ని అనుభవించినప్పుడు తెలుసుకొంటున్నాడు. కాన స్వప్నం ఎటువంటి భ్రమో జాగ్రదవస్థ కూడ అటువంటి భ్రమే అని అనుభూతిని పొందుతున్నాడు.


(1) బ్రహ్మ సత్యం
(2) జగంమిథ్య
(3) బ్రహ్మసర్వస్వం.
అనగా ఆత్మ స్వరూపమైన బ్రహ్మ ఒక్కటి మాత్రమే సత్యమైంది అని, ఈ ప్రపంచంఅంతా నశించేటటువంటిదే అని, సర్వత్ర బ్రహ్మం ఉన్నాడని, అన్ని వస్తువుల్లోను అందరిలోను ఉన్నటువంటి బ్రహ్మాన్ని చూడాలని అవగతం చేసుకొంటున్నాడు. దీనివల్ల ప్రపంచం అంతా స్వప్నత్యుల్యమేగాని సర్వత్ర బ్రహ్మం వ్యాపించి ఉంది అని అద్వైతాన్ని ధ్యానంలో అనుభవపూర్వకంగా అవగాహన చేసుకొంటున్నాడు. ఆ విధంగా ఆత్మ తప్ప మిగిలిన నామరూపాలు అన్నీ కూడా మిథ్యారూపాలో అనిస్వప్నస మానమయినవే అని అవగతం చేసుకొంటాడు.


ఆత్మజ్ఞానం తెలియనంత వరకు దేహభ్రాంతితో ఉండటం వల్ల సంసారం సత్యమనిపించింది, అజ్ఞానం నశించగానే జ్ఞానోదయంతో స్వప్నం ఎంత భ్రమో జాగ్రదవస్థ కూడా అంతే భ్రమ అని, కాకపోతే అది దీర్ఘకాల స్వప్నం వంటిది అని తెలుసుకుంటున్నాడు.

🕉🌞🌏🌙🌟🚩

7..శ్రీ ఆదిశంకరుల విరచిత ఆత్మబోధ
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

7. తావత్సత్యం జగద్భాతి
శుక్తికా రజతం యథా
యావన్న జ్ఞాయతే బ్రహ్మ
సర్వాధిష్ఠాన మద్వయం ||

సర్వ + అధిష్ఠానం = సర్వానికి ఆధారమైన, అద్వయం = రెండుకానటువంటి అఖండమైన, బ్రహ్మ = పరబ్రహ్మస్వరూపమైన పరమాత్మ, యావత్‌ = ఎంత వరకు, నజ్ఞాయతే = తెలియకుండా ఉంటుందో, తావత్‌ = అంతవరకు,
జగత్‌ = ప్రపంచం,
శుక్తికా = ముత్యపు చిప్పయందు,
రజతం వెండి వలె,
భాతి = ప్రకాశిస్తుంది.


తా. సర్వసృష్టికి ఆధారమైన ఏకైక పర బ్రహ్మ స్వరూపం ఎంతవరకు తెలియకుండా ఉంటుందో అంతవరకు ప్రపంచం ముత్యపు చిప్ప వెండి అనిపించినట్లు సత్యమైందిగా ప్రకాశిస్తుంది.


వివరణ : కలుషితమైన మనస్సే జీవుడు అని ఆది శంకరాచార్యులవారు ముత్యపు చిప్ప మీద సూర్యరశ్మి ఉన్నంత సేపు అది వెండే అనిపిస్తుంటుంది. అదే విధంగా సర్వసృష్టికి మూలాధారమైన పరబ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోనంతవరకు ప్రపంచం అంతా కూడా సత్యమే అనిపిస్తుంది, ముత్యపు చిప్పను వెండి అనుకోవటం భ్రాంతే. అట్లాగే భ్రాంతి వల్లే ప్రపంచం సత్యం అనిపిస్తుంది. ఏకైకమైన పరమాత్మ యొక్క రసానుభూతి యందు సర్వాధిష్ఠానమైన ఆత్మయందు అనుభవం పొందిన నాడు ఈ ప్రపంచం మీద భ్రాంతి భావం అనేది ఉండదు. అది తొలగిపోతుంది.


మట్టితో కుండ చేసేటప్పుడు కుండ కార్యం అయింది. మట్టి కారణం అయింది. అట్లాగే ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు జగత్తు కార్యం అయింది. పరబ్రహ్మ స్వరూపం కారణం అయింది. కాన ప్రపంచం అంతా బ్రహ్మమే అయి ఉంది. దీన్నే కార్యకారణ సంబంధం అంటారు. నగలో బంగారాన్ని దర్శించినప్పుడు నగలేదు. కుండలో మట్టిని దర్శించినప్పుడు కుండలేదు. రజ్జు సర్వభ్రాంతిలో తాడును తాడుగానే చూసినప్పుడు సర్పం లేదు. అట్లాగే సృష్టిలో కార్యాన్నే చూసినప్పుడు బ్రహ్మంలేదు.


 ప్రపంచమే కనిపిస్తుంది. కారణమైన బ్రహ్మం కనపడదు. కారణమైన బ్రహ్మాన్ని చూసినప్పుడు కార్యం అయిన ప్రపంచం కనపడదు. కారణమైన బ్రహ్మానుభవం పొందినప్పుడు, సచ్చిదానందాన్ని అనుభవించినప్పుడు సృష్టి లేదు. సృష్టి భ్రమ అని మాయ అని అర్థం అవుతుంది. ఇదే తాత్త్వికులు చేప్పేటప్పుడు వివర్తం అంటారు. అంటే లేనిది ఉన్నట్లుగా గోచరించటం అని. దాన్నే శాస్త్రపరిభాషలో వివరిస్తే అధ్యాస అంటారు. అధ్యాస అన్నా లేనిది ఉన్నట్లుగా అనిపించటమే. ఇక్కడ ఉంది బ్రహ్మం. కాని ప్రపంచం ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. కాని ప్రపంచం అధ్యాస, వివర్తం అయింది. ఎవరికి? సాధకునికి.


సాధకునికి సాధనకు పూర్వం సాధన తర్వాత కూడా ప్రపంచం ఉంది. సాధనలోనే ప్రపంచం అంతరించింది. కాన సాధకుడు ప్రపంచం భ్రమ అని, బ్రహ్మమే సత్యం అని అనుభూతిని పొందగలిగాడు. కాన సాధకుడు జీవన విధనంలో ఆ విధంగా జీవించగలుగుతున్నాడు.
తాడు పాముగా అనిపించటాన్నే రజ్జు సర్పభ్రాంతి అంటారు. చీకట్లో కాలుకు తగిలిన తాడు సర్పం అనిపిస్తుంది. కాంతి రాగానే అది తాడు అని తెలుస్తుంది. బ్రహ్మజ్ఞానం రాగానే ప్రపంచం భ్రాంతి అని తెలుస్తుంది.


కాన శాశ్వతమైన దానిని సరైన మార్గంలో వివేకంతో, విజ్ఞానంతో అర్థం చేసుకోవాలి. దేనికైతే ఆది అంతం ఉంటాయో అది నశిస్తుంది. అది అనిత్యమైంది. దేనికైతే ఆది అంతం ఉండవో అది నిత్యమైంది. అది నశించదు. భ్రాంతిలో సర్పం ఉందని అనిపించింది. జ్ఞానం రాగానే పాము అదృశ్యమైపోయింది. కనుక సర్పానికి ఆది ఉంది. అంతం ఉంది. కనుక అది నశిస్తుంది. తాడు అనే అస్తిత్వానికి ఆది లేదు అంతం లేదు. కావున అది నశించదు. కావున సృష్టి ఆద్యంతాలు కలిగి నశించేది అయిఉంది. భ్రాంతితో అది శాశ్వతం అనిపిస్తూ ఉంటుంది.


 బ్రహ్మానికి ఆద్యంతాలు లేవు కనుక బ్రహ్మం శాశ్వతమైంది. బ్రహ్మం నిత్యుడు అనంతుడు అని అవగతం అయినవాడు ఈ ప్రపంచం మీద వ్యామోహం వదలి, సచ్చిదానందానికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి సాధకుడు ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. సాధకుడు లేక జ్ఞానానుభవం కలిగినవాడు జ్ఞానంతో జీవిస్తూ ప్రపంచంలోనే ఉంటూ సుఖంగా కాలాన్ని గడపగలుగుతున్నాడు. అంటే దృశ్యానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఏది పొందదగింది అయి ఉందో ఆ జ్ఞేయానికి ప్రాధాన్యాన్ని ఇచ్చి చిదాత్మకమైన జ్ఞానంతో జీవిస్తున్నాడన్న మాట.


ఈ ప్రపంచాన్నే నిర్వచించటానికి వీలుకాని ప్రకృతిశక్తి అని, మాయ అని, మిథ్యాజ్ఞానం అని, అవిద్య అని, అజ్ఞానం అని అనేకరకాలుగా వివరిస్తుంటారు. దీన్ని అర్థం చేసుకొని అంటే ఈ అజ్ఞానాన్ని అర్థం చేసుకొని సత్యమైన బ్రహ్మాన్ని తెలుసుకొని, బ్రహ్మం చేతిలో నేను సాధనాన్నే కాని నాదీ అనే అహంకారంతో వ్యక్తిత్వంతో నిలవగలిగింది ఏదీ లేదు అని అర్థం చేసుకొని మానవుడు జీవించటాన్నే జ్ఞానం అంటారు. అదే బ్రహ్మజ్ఞానం. అదే భగవత్తత్త్వం.


 ఆ భగవత్తత్త్వం తెలిసిననాడు మానవుడు విషయవాంఛలకు లో
నుకాకుండా బ్రహ్మానందానుభూతిని పొంద గలుగుతాడు. ముత్యపు చిప్పయందు వెండి, భ్రాంతి చేత భావించినట్లే, ఆత్మయందు ప్రపంచారోపణ భ్రాంతి చేత భావించటం జరుగుతుంది. అది భ్రాంతి అని నిరంతర ధ్యానంతో ఆరోపించబడిన దాన్ని తొలగించుకొని సచ్చిదానందంతో జీవించటానికి నిరంతరం పట్టుదలతో, ఆసక్తితో అభ్యాసం చెయ్యాలి.

🕉🌞🌏🌙🌟🚩

8..శ్రీ ఆదిశంకరుల విరచిత ఆత్మబోధ
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

8. ఉపాదానే 2 ఖిలాధారే
జగంతి పరమేశ్వరే
సర్గస్థితి లయాన్యాన్తి
బుద్బుదా నివ వారిణి ||

అఖిల + ఆధారే = సర్వానికి ఆధారమైన, ఉపాదానే = సృష్టి యొక్క మూలసామగ్రికి కారణమైన,
పరమేశ్వరే = పరమాత్మయందు, జగంతి = లోకాలు,
 వారిణి = నీటియందు బుద్బుదాన్‌ ఇవ = బుడగల వలె, సర్గ-స్థితి-లయాన్‌ = పుట్టుట పెరుగుట నశించుట,
యాంతి = పొందుతున్నాయి.

తా||సర్వానికి ఆధారమైన సృష్టియొక్క మూల సామగ్రికి కారణమైన పరమేశ్వరుని యందు ప్రపంచాలు నీటి యందు బుడగలవలె పుట్టి, పెరిగి, నశిస్తున్నాయి.

వివరణ :- ప్రపంచం క్రమం తప్పకుండా కార్యరూపంలో కనిపిస్తుంది కనుక దీనికి మూలాధారమైన కారణం ఏమిటి? అని ఆలోచించవలసిన అవసరం ఉంది. అట్లా పర్యాలోచన చేసిన నాడు సాధకునికి సాధనలో బ్రహ్మమే అని తెలుస్తుంది. కార్యకారణ సంబంధం బ్రహ్మమే అని తెలుస్తుంది. అయితే సర్వానికి ఆధారమైన బ్రహ్మసృష్టికి మూల సామగ్రి ఏది అని పరిశీలించిననాడు బ్రహ్మమే తప్ప మరొకటి లేదు అని తెలుస్తుంది.

కనుక బ్రహ్మ సృష్టి అయిన ప్రపంచాలన్నీ బ్రహ్మమే అయి ఉన్నాయి. అన్నీ కూడా బ్రహ్మం నుంచే పుడుతూ, పెరుగుతూ, లయించిపోతున్నాయి. నీటి బుడగ నీటికంటే అన్యమైంది అవదు కదా? నీటికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలే నీటి బుడగకు కూడా ఉంటాయి కదా! కాన నీటికి నీటి బుడగకు ఏ భేదం ఉంటానికి వీలు లేదు కదా ? అట్లాగే బ్రహ్మాన్ని బ్రహ్మ సృష్టి అయిన లోకాలకు ఏ భేదం ఉంటానికి వీలులేదు కదా? అందువల్ల లోకాలు బ్రహ్మం రెండు కూడా బ్రహ్మమే అయి ఉన్నాయి.

ఉదాహరణకు ఆత్మను తీసుకొన్నట్లయితే ఆత్మ బ్రహ్మం కంటె వేరు అయింది కాదు కదా? మాయ ఆవరించిన ఆత్మయే జీవుడుగా జీవిస్తున్నాడు కాన పరాత్పరుని నుండి ప్రతిరోజు అనేక లోకాలు సృష్టింపబడి పెరిగి లయించినట్లే జీవుని యందు ఈ లోకంలో అనేక లోకాలు సృష్టింపబడి పెరిగి లయిస్తున్నాయి. జీవుడు స్వార్థచింతనలతో జగత్తుతో తాదాత్మ్యం చెందటం వల్ల వాస్తవ స్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. కనుక జీవుడు అనేకమైన కోరికలను పుట్టిస్తూ, వాటిని వృద్ధిచేస్తూ, వాటితోనే లయించిపోతున్నాడు.

మానవుడు కలలో ఏ విధంగా తీరని కోరికలను తీర్చుకొంటూ, అనేకమైన వాటిని పుట్టిస్తూ, అనుభవిస్తూ, లయిస్తూ గడుపుతూ ఉన్నాడో అదే విధంగా జీవుడు భౌతికమైన జీవభ్రాంతితో ప్రతినిత్యం నూతనమైన కోరికలతో, విషవలయంలో పుడుతూ, పెరుగుతూ, లయిస్తూ గడుపుతున్నాడు. దాని నుంచి విముక్తి పొందగోరిన జీవుడు మాత్రమే ప్రయత్న పూర్వకంగా సాధన చేసినవాడు సాక్షిమాత్రంగా ఉన్న ఆత్మతో లీనం అవుతున్నాడు. అప్పుడు ఆత్మ బ్రహ్మంకంటే వేరు కాదు అని అటువంటి సాధకునికి తెలుస్తుంది.

ఒక వస్తువును సృష్టించాలంటే దానికి మూడు కారణాలు అవసరం.
1) ఉపాదాన కారణం,
2) నిమిత్త కారణం,
 3) సహకార కారణం.

 కుమ్మరికుండ చెయ్యాలనుకుంటే మూల సామగ్రి అయిన మన్ను ఉపాదాన కారణం అవుతుంది. కుమ్మరి నిమిత్త కారణం అవుతున్నాడు. అతని చక్రం సహకార కారణం అవుతుంది. ఇక్కడ సృష్టికి మూల సామగ్రి అయిన ఉపాదాన కారణం బ్రహ్మే అయ్యాడు. సృష్టించిన బ్రహ్మ నిమిత్తకారణం కూడా అయ్యాడు. ఉపాదాన కారణం, నిమిత్త కారణం రెండూ కూడా ఒక్కటే అయిపోయాయి.

కార్యకారణ సంబంధాన్ని ఆలోచించినప్పుడు బంగారం కారణం అయితే ఉంగరం కార్యం అయింది. దూది కారణం అయితే వస్త్రం కార్యం అయింది. మట్టి కారణం అయితే కుండ కార్యం అయింది. బ్రహ్మం కారణం అయితే సృష్టికార్యం అయింది. కావున సృష్టికి మూలద్రవ్యం అయిన ఉపాదాన కారణం బ్రహ్మమే అయింది. సాలెగూడుకు సాలీడే కారణం అయితే గూడు కార్యం అయింది.

 దానికి ఉపయోగపడిన మూలద్రవ్యమైన ఉపాదాన కారణం కూడా సాలీడే అయింది. ఈ విధంగా సాలెపురుగు సాలెగూడుకు నిమిత్త కారణం, సహాయ కారణం, ఉపాదాన కారణం మూడు కూడా తానే అయి ఉంది. అదే విధంగా బ్రహ్మం ఈ సృష్టికి అన్నీ తానే అయి ఉంది. అందువలన నీటిలో నీటిబుడగ పుట్టి పెరిగి లయించినట్లు ప్రపంచాలు బ్రహ్మంలోనే పుట్టి పెరిగి బ్రహ్మంలోనే లయిస్తున్నాయి.

అయినా ఏవీ బ్రహ్మంకు అంటటం లేదు. బ్రహ్మం సాక్షి మాత్రంగానే ఉంటుంది. దీనిని వర్ణించటానికే రమణ మహర్షి సినిమా హాలులో కనిపించే సినిమా తెరను ఉదాహరించారు. తెరపైకి బొమ్మలు వస్తుంటాయి. పోతుంటాయి. ఏవీ కూడా తెరకు అంటవు. అదే విధంగా సృష్టికర్తయైన బ్రహ్మానికి ఏదీ అంటకుండా సృష్టి సర్వం తనలోనే సాగిపోతుంటుంది. బ్రహ్మమయిన తెర నిత్యం అయితే సృష్టి అయిన ఈ ప్రపంచం లేక జీవరాసులు అనిత్యం అయి ఉన్నాయి.
సాధకుడు తానే బ్రహ్మమై నిలిచిన నాడు ఈ ప్రపంచం అంతా ఆతని హృదయ సీమయందు ఆ విధంగానే వస్తూపోతూ ఉంటుంది.

 ఏదీకూడా ఆ సిద్ధిపొందిన రమణ మహర్షి వంటి వారికి అంటదు. ఒక సందర్శకుడు రమణ మహర్షిని ''చిన స్వామి వారు ఈ పృచ్ఛకులతోనే ఎక్కువసేపు కాలం గడిపేస్తున్నారు. సాధనలో మునిగేది ఎప్పుడూ'' అని ప్రశ్నించాడు. రమణ మహర్షి ''మునగనిది ఎప్పుడు?'' అని ఎదురు ప్రశ్న వేశారు. అంటే నిరంతరం ఆత్మే అయి తాను జీవిస్తున్నానని చెప్పారు.

సుషుప్తి అంటే గాఢనిద్రలో మనస్సు లయించి పోవటం. అంత మాత్రాన మానవుడు లయించిపోతున్నాడా? లేదు కదా !'' మానవుడు మేల్కొనగానే జగత్తు అనుభవానికి వస్తుంది. మానవుని కోరికలే, ఆలోచనలే, భావనలే ప్రపంచాన్ని తయారుచేస్తున్నాయి. కనుక ప్రపంచం మానవునిలో ఉంది. మానవుడు ప్రపంచంలో ఉండటం కాదు.

 అందుకే సాధనలో ప్రపంచం లయించి పోతుంది. అట్లా అవ్వటానికి మూల కారణం సంకల్పాలే. కావున సంకల్పాలకు మూల కారణం అయిన కోరికలు జీవచైతన్యంలో అంటే ఆత్మలో లయించి పోయిననాడు సంకల్పాల చేత సృష్టింపబడ్డ జగత్తు కూడా లయించిపోతుంది. అంటే జీవుని యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్నీ కూడా జీవచైతన్యమైన ఆత్మజ్ఞాన స్వరూపంలో కలిసిపోతున్నాయి.

ఆ విధంగా నీటి బుడగలు నీటిలో కలిసిపోయినట్లు జీవుడు ఆత్మలో కలిసిపోతున్నాడు. జీవుడు నేను ఆత్మను అని గ్రహించి ఆత్మజ్ఞానంతో జీవించిన నాడు మాత్రమే ఆత్మ అనంతమైన ఆత్మలో కలిసిపోతుంది. లేనినాడు జీవుడు చావుపుట్టుకల విషవలయంలో చిక్కుకొంటూ పుడుతూ, పెరుగుతూ, లయిస్తూ గడుపుతుంటాడు.

సూర్యుడు ప్రధాన కేంద్రంగా ఉండి అనేకమైన గోళాలు దానిచుట్టూ తిరుగుతున్నాయి గదా ! అదే విధంగా సూర్యునిలా ఉన్నటువంటి మిగిలిన వాటిని పాలపుంతలు అంటున్నారు. అట్లాంటి పుంతలు ఇప్పటికి తొమ్మిదింటిని ఖగోళ శాస్త్రజ్ఞులు కనుక్కొన్నారు.

పూర్వులు సూర్యుని పుంతలనే సూర్యులన్నారేమోనని అనిపిస్తుంది. ద్వాదశాదిత్యులు భూమి చుట్టు వచ్చిననాడు భూమి లయించిపోతుంది అని చెప్పి ఉన్నారు కదా ! కాన సృష్టిరహస్యాలను సామాన్య జ్ఞానంతో వివరించలేము. బ్రహ్మం
నుంచి ఎన్నిలోకాలు పుడుతున్నాయో ఎన్ని లయిస్తున్నాయో సామాన్యమైన మానవులు చెప్పలేరు.

🕉🌞🌏🌙🌟


ఓం నమః శివాయ:
ఓం నమః శివాయ:
10..శ్రీ ఆదిశంకరుల విరచిత ఆత్మబోధ
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩


10 యథాకాశో హృషీకేశః
నానోపాధిగతో విభుః
తత్‌ భేదాత్‌ భిన్నవద్భాతి
తన్నాశే కేవలో భవేత్‌ ||

యథాకాశో = ఆకాశం, నానా + ఉపాధిగతః = రకరకాల ఉపాధులను పొందటంవల్ల, భిన్నవత్‌ భాతి = వేరువేరుగా ఉన్నట్లు అనిపిస్తూ, తత్‌ + భేదాత్‌ = ఆ ఉపాధుల భేదం, తత్‌ + నాశేసతి = నశించగానే, యథా = ఏ విధంగా అయితే, కేవలః = ఏకంగా, భవేత్‌ = అవుతుందో అదే విధంగా, హృషీక + ఈశః = ఇంద్రియాల్ని నిగ్రహించేటటువంటివాడైన, విభుః = పరమాత్మ (అవుతున్నాడు).


తా|| ఆకాశం రకరకాల ఉపాధులను పొందటం వల్ల వేరువేరుగా ఉన్నట్లు అనిపిస్తూ ఆ ఉపాధుల భేదం నశించగానే ఏ విధంగా ఒకటిగా అవుతుందో ఆ విధంగానే పరమాత్మ ఉపాధులతో కలవటం వల్ల వేరువేరుగా ఉన్నట్లు అనిపిస్తున్నా ఆ ఉపాధులు నశించగానే అఖండమై ప్రకాశిస్తున్నాడు.
వివరణ :- హృషీకేశుని సంబోధించటంవల్ల ఇంద్రియ నిగ్రహం కలిగిన సాధకులే శరీర రహితులై పరమాత్మానుభూతిని పొందుతారు అని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.


మానవుడు తాను ఆత్మే అయి ఉండి, తాను దేహంగా భ్రాంతి చెంది ఆత్మయందు దేహాన్ని ఆరోపించుకొంటూ దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. ఇదే బంధానికి కారణం. ప్రకృతి, సంసారం రెండూ కూడా మానవుణ్ణి బంధితుణ్ణి చేస్తున్నాయి. శరీరమే మానవునికి ఉపాధి అవటం వల్ల దేహమే ఆత్మ అనే భ్రాంతికి లోను అయ్యేటట్లు చేస్తుంది. దానివల్ల లోకంలో ఉపాధుల భేదంతో భిన్నంగా భావింపబడుతున్నాడు.


 ఈ ఉపాధియే అజ్ఞానానికి కారణం. సర్వత్ర వ్యాపించి ఉన్న పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మే తానై ఉన్నాడు. అది అర్థం చేసుకొని అనుభవించవలసిన అవసరం ప్రతి మానవునికి ఉంది. దాన్ని తెలియచెయ్యటానికే ఆకాశాన్ని ఉపమానంగా స్వీకరించారు.


తన కళ్ళను తాను నమ్మవద్దు అని, తన చెవులను తాను నమ్మవద్దు అని పెద్దలు చెప్పుతూ ఉంటారు. ఆకాశంలో చంద్రుడు కదులుతున్నట్లు అనిపిస్తుంది. నిజానికి కదులుతూ ఉంది మేఘం. మనం రైలులో కూర్చొని ఉండగా మన రైలు ఆగితే మన ప్రక్కరైలు పట్టాలపైన కదులుతూ ఉంటే మన రైలు కదులుతూ ఉంది అని అనిపిస్తుంది. నిజానికి కదులుతుంది మన ప్రక్క రైలు మాత్రమే.


అసలు మానవుడు దేహ భ్రాంతికి ఎందుకు లోనవుతున్నాడు? మానవుడు తల్లిదండ్రులనుండి పొందిన జీవాణువుల వల్ల, ప్రారబ్ధ కర్మల వల్ల, తనచుట్టూ ఉన్న పరిసరాలు నేర్పిన జ్ఞానంవల్ల మానవుడు దేహభ్రాంతికి లోనవుతున్నాడు. ఆత్మ జ్ఞానం తెలియక జీవిస్తున్నవారికి లోకాన్ని దర్శిస్తూ ఉన్నా, అనేక ఉత్తమ గ్రంథాలు చదువుతున్నా లోకజ్ఞానం సర్వస్వం గ్రహిస్తున్నాను అని భావించినా, మానసిక తత్త్వ పరిశీలనా జ్ఞానం సంపూర్ణంగా అవగాహన చేసుకొన్నాను అని తలంచినా అవి అన్నీ కూడా అసంపూర్ణంగానే ఉంటాయి.


అవి అన్నీ కూడా అరకొరగానే అర్థం అవుతుంటాయి. కారణం ఏమంటే రాజమార్గం అయిన ఆత్మజ్ఞానం తెలియక పోవటమే. దాన్నే కర్మపరిపాకం కాలేదు అని పెద్దలు ఒక్కముక్కలో తేల్చేస్తారు. ఆత్మజ్ఞానం తెలిసిన తర్వాత తాను పూర్వం చూసినవి, చదివినవి, గ్రహించినవి, అనుభవించినవి అన్నీ కూడా నూతనార్థాలతో స్ఫురిస్తుంటాయి.


 నూతనానుభవాల్ని చేకూరుస్తుంటాయి. విచారణా మార్గానికి దోహదం చేస్తుంటాయి. ఆత్మానందానికి మార్గాన్ని సుగమం చేస్తుంటాయి. ఆ విధంగా మానవుడు ఆత్మజ్ఞానంతో, ఆత్మ జ్ఞాన సాధనతో, ఆత్మానందాన్ని అనుభవిస్తూ జీవించిననాడు అఖండమైన పరమాత్మానుభవం చేకూరుతుంది.


ప్రపంచంలో మానవులు, వస్తువులు, జంతువులు, క్రిమికీటకాదులు, వృక్షాలు మొదలైనవి అన్నీ కూడా వివిధ రూపాల్లో కనిపిస్తుండగా, వివిధ రకాల అనుభవాలు అనుభవిస్తుండగా అంతా ఒక్కటేనని, చావుపుట్టుకలు లేని ఆత్మే అంతా కూడి ఉంది అని ఎట్లా అర్థం చేసుకోవటం అనే సమస్య మానవుణ్ణి ఎల్లవేళలా వేధిస్తుంటుంది.


 అద్వితీయమైన పరాత్పరుడే అయిన ఆ జీవచైతన్యం సత్యం అయితే అనుభవంలో ఈ వ్యత్యాసాలు ఎందుకు కనిపిస్తున్నాయి అనే ఆలోచన ప్రతి మానవుణ్ణి వేధిస్తుంది. మరి అట్లాంటి దాన్ని ఎట్లా అర్థం చేసుకొంటాం అంటే ఘటాకాశాన్ని ఉదాహరణగా తీసుకొని అవగాహన చేసుకోవటానికి వీలు కల్పించారు.
ఒక కుండలో నీళ్ళు ఉన్నాయి అనుకొందాం. ఆ కుండలోచూస్తే మనకు ఆకాశం కనిపిస్తుంది. అది ఘటాకాశం. దాని ప్రక్కనే ఉన్న అనేక కుండల్లో నీళ్ళుపోసి చూశాము అనుకోండి.


 అన్ని కుండల్లోను ఆకాశం కనిపిస్తుంటుంది. ఆకాశం ఏ కుండకు ఆ కుండకే పరిమితమై ఉండటం వల్ల అనేక ఆకాశాలు ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఒక కుండను పగలగొట్టాం అనుకొందాం. ఆ కుండలో ఆకాశం ఏమయింది ? నశించి పోయిందా? లేదు అన్ని కుండలు పోయాయి అనుకొందాం. ఆకాశం ఏ కుండలోనూ కనబడటం లేదు అంటే ఘటాలతోపాటు ఆకాశం కూడా నశించి పోయిందా అంటే నశించలేదు. ఎందుకని? ఆకాశం ఘటానికి పరిమితం కాలేదు.


ఆకాశం సర్వత్ర నిండిఉంది. అందువల్ల పుట్టటం, పెరగటం, నశించటం అనేవి ఆకాశానికి లేవు. కుండకు మాత్రమే వికారం కలిగింది. కనుక కుండకే మార్పు పరిమితమై ఉంది. ఆకాశానికి మార్పులేదు. అది వికారం చెందదు. ఆ విధంగా ఘటాకాశం ఉదాహరణతో మానవులు పరిమితమైన దేహభ్రాంతినుంచి విముక్తిని పొందాలి. ఆత్మ పరిమితమైంది

కాదని, అనంతమైంది అని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఆత్మ నశించదు. నశించేది దేహం మాత్రమే.


 చావుపుట్టుకలు దేహానికే ఉన్నాయి. మానవుడు దేహం నశిస్తుంది కాన తాను నశిస్తున్నాను అని భ్రాంతి చెందుతున్నాడు. అది నిజం కాదు. మానవుడు శరీరం అనే ఉపాధి కారణంగా పరిమితునిగా భావిస్తున్నాడు. శరీరం అనే ఉపాధి తొలగగానే అనంతమైన ఆత్మగా అర్థం చేసుకోగలుగుతున్నాడు. కాన మానవుడు ఉపాధితో భ్రాంతికిలోనుగాక అనంతమైన ఆత్మకోసం, ఆత్మజ్ఞానంతో, ఆత్మానందంతో జీవించాలి.


ప్రతి మానవునిలో ఉన్న జీవచైతన్యమైన ఆత్మయే సాక్షి మాత్రంగా ఉండి అనుభవాన్ని చేకూరుస్తుంది. లోకంలో దుమ్ము, పొగ వంటి రకరకాల మాలిన్యాలు ఉన్నా ఆకాశానికి ఏ మాలిన్యం అంటటం లేదు. అట్లా ప్రతి మానవునిలో సాక్షిమాత్రంగా ఉన్న ఆత్మకు ఏ మాలిన్యం అంటటంలేదు.


ఆత్మ అమలినమైంది. కర్మ సాక్షిమాత్రమైంది. అన్నిటికి శక్తిని ఇస్తూ, అన్నిటిని అనుభవింపచేస్తూ సాక్షిమాత్రంగా ఉంటుంది. ఆత్మే అయిన జీవుడే అన్నిటిని గ్రహిస్తున్నాడు. జడమైన దేహం దేన్నీ గ్రహించలేదు. దేహం అనేది దృశ్యం అనగా మానవుడు ఏది చూస్తున్నాడో అది. అయితే తానే దృక్కు అనగా చూపు అయి దేహం అనే దృశ్యాన్ని చూస్తున్నాడు. కళ్ళకి శక్తి లేదు. కళ్ళలో ఉన్న జీవచైతన్యానికి శక్తి ఉంది. కళ్ళజోడుతో అన్నిటినీ చూస్తున్నాడు.


అయితే కళ్ళద్దాలకు ఆ శక్తి ఉందా? లేదు ఆ శక్తి లోపల ఉన్నటువంటి ఆ జీవచైతన్యానికే ఉంది. కాని దేహం అనే ఉపాధితో మానవుడు ఆ జీవ చైతన్యాన్ని పరిమితం చేయటం వల్ల నేను అనే అహంకారానికి లోనవుతున్నాడు. దానితో బహురూపాలైన ఉపాధుల్ని ప్రపంచంలో అనుభవిస్తుండటం వల్ల నేను అనే అహంభావం సత్యం అని మానవుడు భ్రమ చెందుతున్నాడు. సర్వకాల సర్వావస్థల యందు కూడా మానవుని యందు ఉన్నటువంటిది శాశ్వతమెన జీవచైతన్యమే.


మానవుడు ఉపాధి కారణంగా అఖండమైన ఆ జీవచైతన్యాన్ని అజ్ఞానంతో దర్శిస్తూ రకరకాలుగా భావిస్తూ పరిమితంగా భావిస్తున్నాడు. కాన మానవుడు అనంతమైన ఆత్మ జ్ఞానాన్ని పొంది అద్వైతాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఈ విధంగా జీవించగలిగిన నాడు ఆతనిని జీవన్ముక్తుడు అంటారు. అంటే జీవించి ఉండగానే ముక్తి పొందాడు అని అర్థం. శరీరం ఉండగానే ఆత్మతో జీవించి, అనంతమైన ఆత్మను అనుభవించి, తామరాకుమీద నీటిబొట్టులాగా ప్రపంచంలో జీవయాత్రను కొనసాగించగలిగాడు అని అర్థం. అట్టి జీవన్ముక్తుడు పరమ సుఖాన్ని, పరమశాంతిని అనుభవిస్తూ జీవించగలుగుతాడు. రెండు పూటలా భోజనం చేస్తున్నా నిత్యనిరాహారిగానే ఉంటాడు. భార్యతో జీవిస్తున్నా నిత్య బ్రహ్మచారిగానే జీవిస్తాడు. అదే జీవన్ముక్తుని లక్షణం.

🕉🌞🌏🌙🌟🚩
ఓం నమః శివాయ:
ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.10
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ

కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.

ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.

ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.

మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.


ఆగమ ప్రకరణం

మాండూక్యోపనిషత్తు.

ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము కదా ! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరుగుతుంది, శంకరుల భాష్యముతో సహా.

శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.

ఒకటవ కారిక :

బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //

రెండవ కారిక : దక్షిణాక్షి ముఖే విశ్వ : మనస్యాన్తశ్చ తైజస : /
ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత : //

మూడవ కారిక విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస : ప్రవివిక్త బుక్ /
ఆనందభుక్ తథా ప్రాజ్ఞ : త్రిధాభోగం నిబోధత //

నాలుగవ కారిక : స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్త౦తు తైజసమ్ /
ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిమ్ నిబోధత //

అయిదవ కారిక : త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత : /
వేదైతదుభయం యస్తు స భుంజానో న లిప్యతే //

ఆరవ కారిక :  ప్రభవ స్సర్వభావానాం సతామితి వినిశ్చయ : /
సర్వం జనయతి ప్రాణ : చేతో>౦ శూ న్పురుష పృథక్ //

ఏడవ కారిక : విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకా :  /
                     స్వప్నమాయా సరూపేతి సృష్టిరన్వైర్వి కల్పితా  // 

సృష్టిని గురించి విచారణ చేసే వారిలో రెండు వాదనలు వున్నాయి.  కొంతమంది  సృష్టి అంతా భగవంతుని ఐశ్వర్యమని భగవంతుడు తన ప్రభావము చూపించడానికి సృష్టి చేస్తున్నాడని వీరి వాదం.  మరికొందరు,  మాయావాదులు, సృష్టి స్వప్నము వంటి మాయతో సమానమని విశ్లేషిస్తున్నారు.  వీరి వాదనలో సృష్టి తాత్కాలిక గోచరమే కానీ సృష్టికి ఎలాంటి నిత్యతగానీ, సత్యతగానీ లేదని మాయవాదుల  అభిప్రాయం. 

దీనిపై ఆదిశంకరుల భాష్యం లోఏమి చెప్పారో  తెలుసుకుందాం.


విభూతిఅంటే విస్తారమైన ఈశ్వరసృష్టి అనీ,  ఆ సృష్టి సత్యమని కొంతమంది భావిస్తూ వుంటారు.  ఈశ్వరుడంటే అందరినీ ఏలేవాడు, తన వైభవాన్ని ప్రదర్శించడానికి సృష్టి రూపంలో విస్తారముగా దేవతలను, భూతములను, జీవులను సృష్టించి వారి పూజలు, సేవలు అందుకుంటాడని ఈ వర్గము వాదము. 


కానీ పారమార్ధ చింతకులకు అనగా వేదాంతులకు, సృష్టి యందు ఆదరము వుండదు.  బ్రహ్మజ్ఞానము మీద దృష్టి వున్నవారు, సృష్టి మీద యెలాంటి అభిమానమూ పెంచుకోరు.  ద్వైతులు జగత్తు సత్యమనీ, అద్వైతులు జగత్తు మిధ్య అనీ చెబుతారు.  ఈ విషయంలో వేదాంతపరంగా శ్రుతులు ఏమి చెబుతున్నాయి ?


గారడీవాడు,  తన నైపుణ్యంతో, త్రాటినిఆకాశంలో ఎగరవేసి, దానిని కర్రగా భావించి, ఆయుధము తీసుకుని దానిమీదకు పాకుతాడు.  పైకెక్కి యుద్ధం చేసినట్లు గోచరిస్తాడు.  ముక్కలు ముక్కలై కిందపడి, మళ్ళీ అత్కుక్కుంటాడు.  ఈ వినోదం చూసేవారు, గారడీవాడిని  బాగా ప్రశంసిస్తారు.  కానీ వాడుచేసే గారడీమీద ఆదరము ప్రదర్శింపరు.  ఎందుకనీ ?  అది అంతా గారడీ అని చూసేవారందరికీ ముందుగానే తెలుసు కాబట్టి.   అంటే ఏమిటీ ?  ప్రేక్షకులు గారడీకన్నా,  గారడీవానికే ఎక్కువ ఆదరం కలిపిస్తారు. కాబట్టి, గారడీ చర్యలను మెచ్చుకునేవారు,  సృష్టి చింతకులు.  గారడీవాడిని స్తుతించే వారు, పారమార్ధ చింతకులని భావము.


అదే విధంగా,  గారడీవాడు త్రాటిని పైకి విసరడం ఎగబ్రాకడం అనేది ఎలా చూస్తున్నామో,  పట్టనట్లు ఎలా వుంటున్నామో,  అదే ' తురీయతత్వము '  అనే పేరు గల పారమార్ధ తత్వము.   తురీయుడు జాగ్రత్ స్వప్న నిద్రావస్థలను దాటి తన యదార్ధస్థితి తెలుసుకుని అందులో ఉండిపోవడం అనేది,  గారడీవాడు, త్రాటి యందు ఎగబ్రాకి,  తిరిగి తన నిజరూపం లోకి రావడంతో పోల్చవచ్చు. 


ఒక అవస్థలో ఉండే అహం, మరొక అవస్థలో ఉండదని గమనిస్తూనే వున్నాము.  కానీ ఈమూడు అవస్థలలోని అనుభవాలు, మనకే కలుగుతున్నాయి. 

దీనికి కారణం జ్ఞాపకం అని చెప్పుకోవచ్చు.  కానీ ఆ అవస్థ దాటి వేరొక అవస్థలో వున్నప్పుడు ఆ జ్ఞాపకం వుండే అవకాశం సామాన్యంగా వుండదుకదా !  కాబట్టి, మూడు అవస్థలలో ఎల్లవేళలా సాక్షిగా ఒక కర్త వుంటేగానీ అది సాధ్యంకాదు.


అలా అవస్థలు మారినప్పుడు వాటితోబాటు మారకుండా, వుండే ఆ నిత్యుడూ, అవికారుడూ, అయిన సాక్షి నిజమైన ఆత్మ, లేదా తురీయం.   ఈ ఆత్మే,  అన్ని వికారాలకూ వెనుక వున్న పరమతత్త్వం.  కాబట్తి తురీయస్థితి పైనే ముక్తి గోరేవారికి ఆదరం వుంటుంది.   నిష్ప్రయోజనమైన జాగ్రత్ స్వప్న సుషుప్తులయందు వీరికి ఆదరం వుండదు. 



 ఎనిమిదవ కారిక :  ఇఛ్ఛామాత్రం ప్రభో : సృష్టి : ఇతి సృష్టవ్ వినిశ్చితా :  /
                              కాలాత్ప్రసూతిమ్ భూతానాం మన్యంతే కాలచింతకా :  //

సృష్టిచింతకులలోనే,  సృష్టి విషయంలో మరికొందరి ఆలోచనలను ( ద్వైత, విశిష్టాద్వైత వాదనలను )  ఉదహరిస్తున్నారు.  


సృష్టి పరమేశ్వరుని యొక్క ఇచ్ఛమాత్రమే అనీ , భగవదిచ్ఛచే ప్రాప్టించిన జగత్తు భగవంతునివలె సత్యమని వీరి వాదము.  ఇక కాలమే సత్యమని వాదించే జ్యోతిష్కులు భూతములు- జన్మాదులు,  కాలము మహిమ వలన కలిగినట్లు భావిస్తారు.


ఈశ్వరుడు సత్యసంకలుపుడు అగుటవలన అనగా కేవలము అతని సంకల్పములకు  వెంటనే క్రియారూపము దాల్చే శక్తి వుండడం వలన,  కుమ్మరి కుండలను చేసినట్లు ఈశ్వర సృష్టి జరుగుతున్నదని ఈశ్వరవాదులు భావిస్తారు.   


ఇక కాలమే సత్యమని చెప్పే జ్యోతిష్కులు,  కాలము వలన సృష్టి జరుగుతున్నదని చెబుతారు.  వసంతములో చెట్టు చిగురించడం, శిశిరంలో ఆకులు రాలిపోవడం, ఎలాగో, అలాగే కాలానుగుణంగా జన్మ, వృద్ధి, క్షీణత, నాశనములు,  కాలమే సృష్టిస్తుందని వీరి వాదం.  


తొమ్మిదవ కారిక :  భోగార్ధం సృష్టి రిత్యంతే   క్రీడార్థమితి చాపరే  /
                             దేవస్యైష స్వభావో>యం ఆప్తకామస్యకా స్పృహా ?

' సృష్టి ఎలాగో అలా ఉండవచ్చు గాక !  దాని వలన ఈశ్వరునికి ఏమి ప్రయోజనం?  ' అ
నేదానికి రెండు విధములైన వాదనలు ఈశ్వర వాదులు చెబుతున్నారు. 


కొందరు సృష్టి ఈశ్వరుని భోగార్ధమనీ, కొందరు సృష్టి ఈశ్వరుని క్రీడార్థమనీ, తలుస్తుంటారు.   దీనిపైనా జగద్గురువులు చెప్పిన భాష్యమేమిటో చూద్దాం





🕉🌞🌙🌎🌟🚩





ఓం నమః శివాయ:
ఓం నమః శివాయ:
11..శ్రీ ఆదిశంకరుల విరచిత ఆత్మబోధ
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

11. నానోపాధివశాదేవ
జాతి వర్ణాశ్రమాదయః
ఆత్మ న్యారోపితా స్తోయే
రసవర్ణాది భేదవత్‌ ||

స్తోయే = నీటియందు, రసవర్ణ + ఆది భేదవత్‌ = రుచి రంగు మొదలైన భేదాల వలె, ఆత్మని = ఆత్మయందు, నానా +ఉపాధి వశాత్‌ + ఏవ = రకరకాలు అయిన ఉపాధుల సంబంధం వలననే, జాతి వర్ణ + ఆశ్రమాదయః = జాతి, కులం, ఆశ్రమం మొదలైనవి, ఆరోపితాః = ఆరోపింపబడుతున్నాయి.

తా|| నీటియందు రుచి, రంగు, వాసన మొదలైన భేదాలు ఏ విధంగా ఆరోపింపబడ్డాయో ఆ విధంగానే ఆత్మయందు రకరకాల ఉపాధుల సంబంధం చేత జాతి, కుల, ఆశ్రమాల వంటివి ఆరోపింపబడుతున్నాయి.


వివరణ :- వర్షం కురిసే నీటికి రుచి రంగు వాసన ఏవీ లేవు. ఆ నీరు క్రింద పడ్డ చోటునుబట్టి, ఆ భూమికి ఉన్న గుణాలను బట్టి రుచి రంగు వాసన కలుగుతున్నాయే కాని వేరుకాదు. అదే విధంగా మానవుల్లో పుట్టేటప్పుడు ఎవరికీ ఏ తేడాలేదు. మానవులందరికీ జాతి కుల ఆశ్రమాలు అనేవి మధ్యలో కల్పించినవే కాని వేరుకాదు. అవి అన్నీ కూడా ఆత్మకు ఆరోపింపబడుతున్నాయేకాని ఆత్మకు ఆ భేదాలు ఏవీలేవు. మానవులు అందరూ ఒకేలా పుడుతున్నారు. ఒకేలా మరణిస్తున్నారు. వాళ్ళు ఉన్న స్థితిగతుల్ని బట్టి వీళ్ళు బీదవాళ్ళు. వాళ్ళు ధనికులు అని వ్యత్యాసాలు చూపిస్తున్నారు.


అంతేకాని ఇవి ఏవీ ఆత్మకు అంటవు. విద్యుచ్ఛక్తిని ఉదాహరణంగా తీసుకొంటే ఉపయోగించే వస్తువునుబట్టి ఆ వస్తువు ప్రదర్శిస్తున్న గుణాన్ని బట్టి విద్యుచ్ఛక్తిని భేదభావంతో ఆలోచించేటట్లు చేస్తుందేకాని విద్యుచ్ఛక్తిలో ఏ భేదం లేదు. విద్యుచ్ఛక్తి బల్బుకు పంపితే కాంతిని ఇస్తుంది. పంకాకు పంపితే గాలిని ఇస్తుంది. కూలర్‌కి పంపితే చల్లదనాన్ని చేకూరుస్తుంది. రెఫ్రిజిరేటరుకు పంపితే వస్తువుల్ని చెడిపోనీయకుండా ఉంచి వాటిని చల్లగా చేస్తుంది. క్లీనర్‌కు పంపితే ఇంటిలో ఉన్న దుమ్మును తొలగిస్తుంది. ఆ విధంగా దాన్ని ఉపయోగించే వస్తువులనుబట్టి అది చేసే పని మారి, దాని గుణం వేరుగా ఉన్నట్లు కనిపిస్తుందే కాని నిజానికి వాటి అన్నిటిలోనూ ఉపయోగపడేది విద్యుచ్ఛక్తి ఒక్కటే. అదే విధంగా మానవులు అందరిలోను ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి అయిన ఆత్మ ఒక్కటే అయి ఉన్నా సంఘంలో జీవన విధానానికి నిర్ణయించిన నియమాలనుబట్టి వేరువేరుగా కనిపిస్తున్నారు.


మాయ ఆవరించిన మానవుని జీవన విధానానికి, సంఘం కట్టుబాట్లకు, సంఘాన్ని నడపటానికి జ్ఞానులైన వారు మానవుని మీద అనేక ప్రయోగాలు చేసినట్లు కనిపిస్తూ ఉంది. సత్త్వ రజ స్తమో గుణాలతో సంఘాన్ని మూడుగా విభజించినవారు తర్వతా చాతుర్వర్ణ్యం అని నాలుగు విభాగాలుగా విభజించారు. అదల్లా క్రమేపి అయిదు విభాగాలుగా చేసి పంచముల్ని సృష్టించారు.


 అవి క్రమేపి మారి మారి ఆంజనేయుని తోకలా పెరిగి పెరిగి నేటికి ఐదువందల కులాలకంటే ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ విధానంలో రానురాను ఆచార వ్యవహారాలే మతం అనే స్థాయికి హిందూమతం చేరి కులాలకుంపటి ఆరకుండా ఉండేటట్లు చేసింది. ఇది రావణ కాష్టం అవ్వటంతో అనాదరణ, అవమానాల వంటివాటిని సహించలేని దళితులు, స్వేచ్ఛాప్రియులు, ఆత్మాభిమానులు పరమతాల్ని ఆదరించారు. దానితో భారత జాతిలో జైనం ఉద్భవించింది. భౌద్ధం ప్రత్యేక స్థానం ఆక్రమించింది. వీటికి తోడు మహమ్మదీయ మతం, క్రైస్తవ మతం కూడా స్థానం ఏర్పరుచుకొన్నాయి.


ఇవి అన్నీ కూడా ఈ దేశంతో స్థానం సంపాదించటానికి కారణాల్లో భారతీయుల్లో ఉన్నతులుగా పరిగణింపబడుతూ ఉన్నవారు, అయాచితంగా లభించిన అధికారాన్ని పోనీయకుండా కాపాడుకోవటం కోసం, తోటి వారిమీద చూపిన అనాదరణ, తారతమ్యాలే కాని మరింకేమి కాదని ఈనాడు అందరికి అర్థమవుతూ ఉంది. మహమ్మదీయ, క్రైస్తవ మతాలు ప్రదర్శించిన ఆధ్యాత్మిక ప్రత్యేకతల వల్ల హిందూజాతి ప్రజలు వాటిలో చేరిన దాఖలాలు ఈ నాటికి కూడా కనిపించటం లేదు. ఈ నాటికి కూడా హిందూమతంలో అణగారిన జాతులు ప్రదర్శిస్తూ ఉన్న ఓర్పు, సహనం వాళ్ళ సంస్కారానికి, వాళ్ళ భగవద్భక్తికి నిదర్శనం అని అందరూ తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.


ఈనాడు కులవృత్తుల్ని పాటించవలసిన అవసరం లేదు. వాటిని రక్షించే రాజులు రాజరికాలు లేవు. అందరూ అన్నీచేస్తున్నారు. అందరూ అన్నిటికీ అర్హులని చాటి చూపిస్తున్నారు. అయినా మధ్యలో కల్పించిన కులం కలుషితం చేస్తూ జాతి మొత్తానికి సంకట స్థితిని కల్పిస్తున్నది. దీన్ని సరైన దారిలో పరిష్కరించి జాతికి శాంతి సుఖాల్ని చేకూర్చవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికే ఆత్మమార్గం, అద్వైత మార్గం ఉత్తమ మార్గాలుగా రూపుదిద్దుకొన్నాయి. సంఘానికి అవసరం ఏదైతే ఉందో దానికోసం, ఏదైతే సత్యం అయి ఉందో దానికోసం, ఆదిశంకరాచార్యులవారు స్వచ్ఛమైన నీటిని ఉపమానంగా తీసుకొని కులాలను, జాతులను, ఆశ్రమాలను అర్థం చేసుకోవటానికి వీలు కల్పించారు.


ప్రపంచం మానవుల్లో వారి వారి చదువుల వల్ల, వృత్తుల వల్ల, వయో భేదాల వల్ల అనేక రకాలుగా మానవులు కనిపిస్తున్నా వాళ్ళందరి అంతరంగాల్లో ఉన్న శుద్ధ చైతన్యమైన ఆత్మ యందు ఏ భేదం లేదు. ఏ జాతి వారైనా వారి ఆత్మ ఒక్కటే అయిఉంది. వారి జాతిని బట్టి, కులాన్ని బట్టి, ఆశ్రమాన్ని బట్టి వేషభాషల్లో జీవన విధానంలో వ్యత్యాసాలు కనిపిస్తూ ఉన్నా వారి అందరి యందు ఉన్న శుద్ధచైతన్యమైన ఆత్మ ఒక్కటే అయి ఉంది.


 క్రిమికీటకాదులు, పశుపక్ష్యాదులు, మానవులు వివిధ రూపాల్లో కనిపిస్తున్నా, భేదాలు దర్శింపబడుతున్నా అన్నిటియందు ఉన్న ఆత్మ ఒక్కటే అయి ఉంది. ఉపాధి భేదం వల్ల అవి అన్నీ వేరువేరుగా కనిపిస్తున్నాయి. వేష భేదం చేతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రకులాలుగా చెప్పబడుతూ ఉన్నారే అని ఆత్మచేత అందరూ ఒక్కటే అయి ఉన్నారు. ఆత్మకు లింగభేదంలేదు. పురుషుడు అని స్త్రీ అని వ్యత్యాసం లేదు. నియమాలలో ఉన్న వ్యత్యాసం వల్ల బ్రహ్మచారి అని, సన్యాసి అని ఆశ్రమ భేదాలను ప్రకటిస్తున్నారే కాని ఆత్మ స్థాయిలో వీరందరికీ ఏ భేదం లేదు. ఆత్మకు బాల్యం అని, ¸°వనం అని, వృద్ధాప్యం అని ఏ భేదాలు లేవు. వయస్సును బట్టే శరీరానికి మార్పు వస్తుంది కాని ఆత్మకు ఏ మార్పూ లేదు.
ప్రపంచంలో అనేక జాతుల వారు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక్కొక్క ఆత్మ లేదు. జైనుల ఆత్మ, బౌద్ధుల ఆత్మ, మహమ్మదీయుల ఆత్మ, క్రైస్తవుల ఆత్మ, యూదుల ఆత్మ, రెడ్‌ ఇండియన్ల ఆత్మ, నీగ్రోల ఆత్మ, జొరాస్ట్రియన్ల ఆత్మ, హిందువుల ఆత్మ అని అనేక రకాల ఆత్మలు లేవు. అందరికీ ఆత్మ ఒక్కటే.


అందరికీ భగవంతుడు ఒక్కడే. దానినే ఆది శంకరాచార్యులవారు వివరించారు.
ప్రపంచంలో మానవులందరు అనేక రకాలుగా జీవిస్తున్నారు. అందులో కొందరు మేము పాపులం, దొంగలం, హంతకులం, స్మగ్లర్లం అంటూ పలురకాలుగా చెపుతూ మా మనస్సు క్షణం కూడా నిలువదు, మేము ఆత్మ జ్ఞానాన్ని తీసుకోవటానికి తగిన వాళ్ళం కాదు, మా మనోమాలిన్యాలు, మా శరీరమాలిన్యాలు తొలగిపోయాకే ఆత్మజ్ఞానాన్ని తీసుకొని ఆత్మ మార్గంలో జీవిస్తాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఆలోచనా విధానమే చాలా తప్పు. అది ఎన్నటికీ నెరవేరేది కాదు. పెళ్ళి కుదిరితేగాని పిచ్చి కుదరడు, పిచ్చి కుదిరితే గాని పెళ్ళి కుదరదు అనే సామెత వంటిదిగా ఉంటుంది ఆ ఆలోచనా విధానం.


 ఆత్మను గురించి తెలిసిన మరు క్షణం గురువును ఆశ్రయించి, జ్ఞానాన్ని స్వీకరించి, ప్రతిరోజు సాధనచేస్తుంటేనే క్రమేపి, ఒక్కొక్క మాలిన్యం తొలగిపోతుంటుంది. సాధనలో ఆత్మజ్ఞానియైన మానవుడు నిజమైన మానవుడుగా రూపుదిద్దుకొంటాడు. పుట్టినప్పటినుంచి ఆవరించి ఉన్న అనేకమైన అజ్ఞానపు తొడుగులు సాధకునికి ధ్యానంలో తొలగిపోతుంటాయి. కాన ఆత్మ భావనతో అందరూ ఒక్కటేనని, ఆత్మజ్ఞానాన్ని స్వీకరించటానికి పిచ్చివాళ్ళు తప్ప అందరూ అర్హులేనని, తెలుసుకోవాలి. ఎవరు దుఃఖనివృత్తిని పొందాలను కొంటున్నారో, ఎవరు అశాంతిని పారదోలాలనుకొంటున్నారో, ఎవరు అసంతృప్తినుంచి సంతృప్తి దరిచేరాలనుకొంటున్నారో వాళ్ళందరు ఆత్మజ్ఞానాన్ని స్వీకరించి వాటిని అనుభవించండి అనే ఆదిశంకరులవారు నీటిని ఉపమానంగా తీసుకొని వివరించారు.


ఆదిశంకరుల వారు కన్యాకుమారినుంచి కాశ్మీరు వరకు వెళ్లి మళ్ళీ తిరిగి కన్యాకుమారి చేరేవరకు భారతదేశంలో ఉన్న అనేక ఆశ్రమాలను దర్శించారు. ఆ ఆశ్రమవాసులకు ఆయన అఖండమైన ఆత్మను గురించి, అద్వైత మార్గాన్ని గురించి బోధించారు. రకరకాల ఆశ్రమాలను రకరకాల దృక్పథాలతో ఉన్నటువంటి వారిని చూశారు. వాళ్ళందరిని ఆత్మ జ్ఞానపరులుగా చేసి జ్ఞాన మార్గంలో నడిచేటట్లు చేసి, జ్ఞానాన్ని ఇచ్చి సాధన చేయించి అనుభూతిని పొందేటట్లు చేశారు.


 ఆవిధంగా అనేక రకాలైన భగవద్భక్తుల్ని చూశారు కాన ఆత్మకు కూడా పలు ఆశ్రమాలలో పలురకాలైన ఆరోపణలు జరుగుతున్నాయి అని చెప్పారు. సగుణం నుంచి నిర్గుణానికి, సాకారం నుంచి నిరాకారానికి, ద్వైతం నుంచి అద్వైతానికి ఆశ్రమవాసుల్ని మార్చటంలో వచ్చిన అవాంతరాలను దర్శించబట్టే శంకరాచార్యులవారు ఆశ్రమాలలో ఆత్మకు అనేక ఆరోపణలు ఉన్నాయి అని చెప్పారు. ఒకసారి శంకరుల వారు ఆధ్యాత్మిక బోధ చేస్తు ఉండగా ఆయన మీదకు ఏనుగును తోలారట. ఆయన పలాయనం చిత్తగించగా స్వామీ గజం మిథ్య, గజం మిథ్య అని హేళన చేశారట. దానికి శంకరులవారు జగం మిథ్య, గజం మిథ్య, పలాయనం మిథ్య అని హేళన చేయదలచిన వారి నోరు మూయించారట.


నీకు గజం కనిపిస్తుంది, జగం కనిపిస్తుంది కనుక పలాయనం కనిపిస్తుంది అని అన్నారు. అంటే సాధకునకు సాధనకు పూర్వం, సాధనకు తర్వాత కూడా సృష్టి అంతా ఉంది. సాధనలోనే జగం అంతా మిథ్య అయి భాసించింది. సాధనలో లేని సమయంలో కూడా రమణ మహర్షి వంటి వారు సర్వత్ర ఆత్మనే దర్శించగలరు కాన అటువంటి వారికి జగం మిథ్యే అవుతుంది. అది తెలియక సామాన్యులు ఆదిశంకరులను హేళన చేశారు.


 శంకరులవారు బ్రహ్మసత్యం, జగం మిథ్య, బ్రహ్మ సర్వస్వం అన్నారు. జగం మిథ్యే కాని సర్వత్ర బ్రహ్మం ఉంది అని చెప్పారు. మిథ్యే అని ప్రకృతిని తేలిక భావంతో చూడమని చెప్పలేదు. జగం అంతా మిథ్యే అని తెలిసి జీవిస్తూ ఉండమన్నారు. అయినప్పటికి ప్రతిదానిలోను బ్రహ్మ ఉన్నాడు అని బ్రహ్మ భావంతో జీవించమన్నారు. రామకృష్ణ పరమహంసను ఒక భక్తుడు పులిని కూడా బ్రహ్మం అని చూడమంటారా అని అడిగాడట. తప్పకుండా అట్లాగే చూడమని చెప్పి, దూరం నుంచే దానికి నమస్కారం చేసి తప్పుకోమన్నారట. అద్వైత మార్గంలో సర్వత్ర పరమేశ్వర భావంతో ఆలోచించేటప్పుడు జీవించేటప్పుడు, సామాన్యులకు అనేక ఇబ్బందులు కలుగుతుంటాయి. సాధకునికి కూడా
అటువంటివే అనేకం ఎదురవుతుంటాయి.


కాని సాధకుడు నిరంతరం సాధనలో అంతర్ముఖం అయి నిజమైన తన భగవంతుని తాను అర్చన చేయటం వల్ల, తనను తాను తెలుసుకొని అనుభూతిని పొందటం వల్ల, తనను తాను ప్రతి రోజూ కలుసుకొంటూ ఉండటం వల్ల, సాధకుడే శుద్ధ చైతన్యమూ, ఆత్మా, దైవం అయి ఉన్నాడు అని తెలుసుకోవటం వల్ల, శాంతి సుఖాలు అనుభవిస్తూ ఉండటం వల్ల, గురువుల మాటలను నమ్మి, విశ్వాసంతో, శ్రద్ధతో లక్ష్యంకోసం జీవిస్తూ ఉండగలుగుతున్నాడు. అటువంటి సాధన లేనివారు మాటలలో, తర్కంలో నిజాన్ని అర్థం చేసుకోలేక ఆరోపణలతో భ్రాంతికి లోనవుతున్నారు. ఆయా ఆశ్రమాల్లో ఉన్న ఆశ్రమ వాసులు కూడా నిరంతరం సాధనలో ఉన్నారే కాని సాధన మార్గంలో వ్యత్యాసం ఉంది. అన్ని మార్గాల్లోను, వారికి చివరికి అహంకారం మిగులుతుంది. ఆత్మ మార్గంలో మాత్రం అహంకారం సంపూర్ణంగా నశిస్తుంది. ఆ అహంకారం నశించిన నాడే అద్వైతం అవగతం అవుతుంది. దానికి కులం, జాతి, ఆశ్రమం అనేవి ఏవీ లేవు అని అనుభవానికి వస్తుంది.

🕉🌞🌏🌙🌟🚩
ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.11
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ

కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.


ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.


ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.

మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.


ఆగమ ప్రకరణం

మాండూక్యోపనిషత్తు.

ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము కదా ! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరుగుతుంది, శంకరుల భాష్యముతో సహా.


శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.
ఒకటవ కారిక :
బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //
రెండవ కారిక : దక్షిణాక్షి ముఖే విశ్వ : మనస్యాన్తశ్చ తైజస : /
ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత : //
మూడవ కారిక విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస : ప్రవివిక్త బుక్ /
ఆనందభుక్ తథా ప్రాజ్ఞ : త్రిధాభోగం నిబోధత //
నాలుగవ కారిక : స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్త౦తు తైజసమ్ /
ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిమ్ నిబోధత //
అయిదవ కారిక : త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత : /
వేదైతదుభయం యస్తు స భుంజానో న లిప్యతే //
ఆరవ కారిక : ప్రభవ స్సర్వభావానాం సతామితి వినిశ్చయ : /
సర్వం జనయతి ప్రాణ : చేతో>౦ శూ న్పురుష పృథక్ //
ఏడవ కారిక : విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకా : /
స్వప్నమాయా సరూపేతి సృష్టిరన్వైర్వి కల్పితా //
ఎనిమిదవ కారిక : ఇఛ్ఛామాత్రం ప్రభో : సృష్టి : ఇతి సృష్టవ్ వినిశ్చితా : /
కాలాత్ప్రసూతిమ్ భూతానాం మన్యంతే కాలచింతకా : //
తొమ్మిదవ కారిక : భోగార్ధం సృష్టి రిత్యంతే క్రీడార్థమితి చాపరే /
దేవస్యైష స్వభావో>యం ఆప్తకామస్యకా స్పృహా ?

ఇక ఈ తొమ్మిది కారికల తరువాత ఏడవ మంత్రము చెప్పుకుందాము.

సప్తమ మంత్రము :
నా౦త : ప్రజ్ఞం, న బహిర్ప్రజ్ఞం, నో భయత : ప్రజ్ఞం, న ప్రజ్ఞానఘనం నప్రజ్ఞం, నాప్రజ్ఞం /
అదృష్ట మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణ మచింత్య మవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచోపశమం, శాన్తమ్ శివమద్వైతం చతుర్ధం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయా : //

అంత; ప్రజ్ఞ కలవాడు కాదు అనగా స్వప్నగత పురుషుడు కాదు. జాగ్రత్ పురుషుడు కాదు, జాగ్రత్ స్వప్న మద్య పురుషుడు కాదు. ప్రాజ్ఞుడుకాదు. అలా అని కేవలం అప్రాజ్ఞుడూ కాదు. ఇంద్రియాలకు గోచరించేవాడు కాదు. వ్యవహరించడానికి నామరూపాలు లేనివాడు. అంత:కరణమునకు అంతుపట్టని వాడు, యుక్తితో పట్టుకోవడం సాధ్యము కానివాడు, జాగ్రద స్వప్న సుషుప్తాదులందు సాక్షిగా ఒక్కడిగా వున్న, సుఖమైన, మంగళకరమైన భేదగుణరహిత అద్వైత స్థితిలోవున్న చతుర్థము ( తురీయము ) అని దేనిని పండితులు తలుస్తారో, అదేఆత్మ. అతడే తెలియదగిన పురుషుడు.


దీనికి ఆదిశంకరుల భాష్యమేమిటో గ్రహిద్దాం.

రెండవ మంత్రంలో,  ' అయమాత్మా బ్రహ్మయమాత్మా చతుష్పాత్ ' అని నాలుగు పాదములు వున్నవి అని చెప్పారు కదా !  మొదటి మూడు పాదముల గురించి వివరణ తెలిసిపోగానే, నాలుగవపాదం గురించి తెలిసిపోయింది కదా !   ఇక నేను అంత : ప్రజ్ఞను కాను, బహిర్ప్రఙ్ఞను కాను,అని ఈ విధంగా అన్నింటినీ నిషేధ వాచకములుగా చెప్పవలసిన పని ఏమున్నది ?  అనే ప్రశ్న తల యెత్తవచ్చును.


దానికి సమాధానం.  రజ్జు సర్ప భ్రాంతి మొదలైన ఉపమానములలో,  ఇది త్రాడు అనే త్రాడు స్వరూపజ్ఞానము కలిగేవరకు,  ఆ త్రాడును చూస్తుంటే వేరు వేరు అనుభవాలు కలుగుతాయి కదా !  అలాగే, ఆత్మకు తురీయత్వము  అనగా ఆత్మ నిజరూపము ప్రతిపాదించే ఉద్దేశ్యంతో, ' తత్వమసి ' అనే మహావాక్యంలో విధివాక్యములతో బోధ ఎలా చేస్తారో,  అలాగే తురీయవాక్యము చర్చించేటప్పుడు నిషేధ వాచ్య బోధనా,  న అంత : ప్రజ్ఞ మొదలైన ప్రయోగములు.   నీవే బ్రహ్మమువు అని చెప్పేకంటే ముందు, '  నీవు విశ్వుడవుకావు, నీవు తైజసుడవు కావు,  ప్రాజ్ఞుడవు కావు. ' అని నిషేధరూపములో చెప్పడమే ఈ సప్తమమంత్రం ప్రయోజనం.


ఒకవేళ జాగ్రద్ స్వప్న సుషుప్తులనే మూడు అవస్థలకు భిన్నంగా తురీయుడు వున్నాడని చెబితే, అట్టి భిన్న జ్ఞానము కలిపించడానికి నాలుగవ అవస్థ ప్రత్యేకంగా చూపించాలి.   అది వీలుగానిపని.    ఆత్మజ్ఞాన సంపాదనకు శృతి వాక్యాబోధమార్గము తప్ప వేరొక మార్గములేదు.   ఆత్మకు, పాదములు వున్నాయని చెప్పాలి అన్నా,  లేవని చెప్పాలి అన్నా, శ్రుతులే చెప్పాలి.


ఏవిధంగా త్రాడు కొద్దిసేపు సర్పము లాగా, కొద్దిసేపు జలధార లాగా కనిపిస్తూ వుంటుందో, అలాే జాగ్రద్ స్వప్న సుషుప్తులలో, కూడా ఒక్కడే అయిన పరమాత్మ,  అంత: ప్రజ్ఞ, బహిర్ప్రజ్ఞ,  ఘన ప్రజ్ఞగా వికల్పితమవుతున్నది.   ఎప్పుడైతే ఈ అన్ని విశేషములను త్రోసివేసి,  ఆత్మ యందు అనర్ధ ప్రపంచమును తీసివేసి,  ద్వైత నాశనము చేస్తామో అప్పుడు లక్షణమైన ఫలము చేకూరును.


ఆత్మజ్ఞాన సాధనలో ముందుగా చేయవలసినది,  అనాత్మ ప్రపంచ నివృత్తి జ్ఞానము.   అలా అవిద్య తొలగిపోయిన వెంటనే,  ఆత్మజ్ఞానము అనగా తురీయజ్ఞానము తక్షణమే ప్రాప్టించును.   తురీయజ్ఞానము ప్రాప్టించాలంటే,  సందేహ నివృత్తి వెంట వెంటనే జరగాల్సిందే.  ఎలాగంటే, త్రాడును చూడగానే సర్పం గా భావిస్తున్న తరుణంలోనే, , వివేకంతో అది పాముకాదు అని  తెలుసుకుంటే, అక్కడ త్రాడే  కనబడుతూ వుంటుంది కదా ! 


చీకటిలో వున్న కుండను తెలుసుకోవాలంటే, కిటికీలు తెరిచి వెలుగు ప్రసరింపజేయాలి.   ఈ ప్రమాణము సరిపోదని  ఎవరైతే అనుకుంటారో  వారికీ వృక్ష భేదనా దృష్టాంతరం ద్వారా చెప్పవలెను.  ' చెట్టును నరుకుట ' అంటే,  దాని మానును రెండుఖండములుగా  చేయడమని తెలుసుకోవాలి.  అంతేగానీ, చెట్టు నరకడమంటే, ' కొమ్మలు, ఆకులు, ఊడలు, మొదలైన భాగాలు ఛేదించడం  '  అని అధికక్రియల గురించి చెప్పవలసిన పనిలేదు.


చీకటిలో వున్న కుండ చూడడానికి వెలుగు ప్రసరిస్తే,  తమస్సునాశనమైనదను జ్ఞానము కలుగుతుంది.  అక్కడ వున్నది కుండ అనే  జ్ఞానం కలగాలంటే, కుండ యొక్క స్వరూపము అంతకు ముందే తెలిసివుండాలి.   కేవలము చీకటిపోగానే,  కుండకు సంబంధించిన జ్ఞానము కలుగదు.   అముఖ్యమైనప్రక్రియ చీకటీని తొలగించుట, ముఖ్యమైన ప్రక్రియ కుండ యొక్క జ్ఞానము.  ఒకటి బాహ్య నిషేధము, వేరొకటి అంతరీయకము.   చీకటి పోవడం వలన కుండ యొక్క జ్ఞాన రాదు.  అక్కడ కుండ వుండడము, తమస్సు పోవడము రెండూ వేరు వేరు కారణాలు.


అదే విధంగా, '  మంత్రములో చెప్పిన విశేషణములు యేవీ ఆత్మ కాదు ' అని చెప్పినంత మాత్రమున ఆత్మ అంటే ఏమిటో తెలిసే అవకాశం లేదు.  అవి ఆత్మ కాదు అని మాత్రమే తెలుస్తుంది.   అనగా తురీయ ప్రాప్తి కేవలం ఆజ్ణానంతో జరుగదు.


త్రిపుటి రూప భేద నివృత్తి అయినప్పుడే,  అనగా తెలియువాడు, తెలి
యబడునది, తెలియుమార్గము   ఒక్కటిగా చూడగల సామర్ధ్యము పొందినప్పుడు, క్షణకాలంలో తురీయస్థితి కలుగుతుంది. 


ఇది తెలుసుకోవడమంటే, ద్వైతభావము పోయి, అద్వైతస్థాయి స్థిరబడడం అన్నమాట !


ఓం నమః శివాయ:
ఓం నమః శివాయ:
12..శ్రీ ఆదిశంకరుల విరచిత ఆత్మబోధ
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

12 పంచీకృత మహాభూత
సంభవం కర్మసంచితం
శరీరం సుఖదుఃఖానాం
భోగాయతన ముచ్యతే || 12

కర్మసంచితం  = పూర్వజన్మ కర్మానుసారంగా నిర్ణయింపబడి, పంచీకృతం = పంచీకరణం చెందుట ద్వారా, మహాభూత సంభవం = పంచమహాభూతాలైన ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి నుండి ఏ తెంచిన, శరీరం = శరీరం (స్థూల శరీరం అని పిలువబడుతూ), సుఖదుఃఖానాం = సుఖదుఃఖాలకు, భోగ + ఆయతనం = అనుభవించే క్షేత్రం, ఉచ్యతే = చెబుతారు.
తా|| పూర్వజన్మ కర్మానుసారంగా నిర్ణయింపబడి పంచీకరణం చెందుట ద్వారా పంచమహాభూతాల నుండి ఏతెంచిన స్థూల శరీరం సుఖదుఃఖాలకు అనుభవించే క్షేత్రంగా ఉందని చెబుతారు.


వివరణ :- శరీరం, తల, వక్షం, వీపు, కాళ్ళు, చేతులు, తొడలు వంటి అంగాలు, ఉపాంగాలు కలిగి ఉంది. ఇది జడపదార్థాలు అయిన చర్మం, రక్తం, నరాలు, ఎముకలు, మూలుగ వంటి పదార్థాలతో కూడి ఉంది. ఇది ఆహార సారంతోనే నిర్మింపబడుతూ ఉంది. అన్నంతోనే జీవిస్తుంది. అన్నం లేకపోతే నశిస్తుంది. కాన ఇది ''అన్నమయ కోశాని'' కి చెంది ఉంది. మాయ కప్పబడిన ఆత్మ అయిన జీవుడు ఈ శరీరానికి ఆధారమై ఉన్నాడు. ఇది అహంకార నిలయమై ఉంది. నేను నాది అనే భ్రమతో, అహంకార మమకారాలతో జీవిస్తూ ఉంది.


 దీన్ని సరిగా అర్థం చేసుకోవటానికి శరీరంలో ఉన్న వివిధ రకాలైన భాగాలు, అవి పనిచేసే విధానం, అవి లోక జ్ఞానాన్ని గ్రహించే మార్గాలు వంటివి జాగ్రత్తగా పరిశీలించి చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అట్లా వాటన్నిటినీ తెలుసుకొన్ననాడు ఆ శరీరం అనేది ఒక శుద్ధ చైతన్యశక్తి ఆధారపడి నడుస్తుంది అని తెలుస్తుంది. ఈ శరీరాన్ని
(1) స్థూల శరీరం
(2) సూక్ష్మ శరీరం
 (3) కారణ శరీరం
అని మూడు భాగాలుగా విభజించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశారు. ఈ శ్లోకంలో స్థూల శరీరాన్ని గురించి వివరిస్తున్నారు.
శరీరానికి ఆరు విధాలైన వికారాలు ఉన్నాయి. అవి ఏవి అంటే అదిపుడుతుంది, ఉంటుంది, పెరుగుతుంది, మార్పు చెందుతుంది, కృశిస్తుంది, నశిస్తుంది. కావున దీన్ని ''షడ్భావ వికారం'' కలది అని అంటారు.


మాయకమ్మిన ఆత్మ అయిన జీవుడు శబ్ద స్పర్శ రూప గంధాలతో కూడి ఉన్న ఇంద్రియ విషయాలను అనుభవిస్తూ ఉన్నాడు. అందువల్ల శరీరాన్ని ''స్థూల భోగాయతనం'' అని కూడా అంటారు. ఈ స్థూల శరీరం భోగసాధనం కనుక కులం, మతం, జాతి, ఆశ్రమం వంటి వాటిని అనుసరించి సాంఘిక వ్యత్యాసాలు, నిందాస్తుతులు, సుఖదుఃఖాలు అనుభవిస్తూ ఉంటుంది. రోగాలు, బాధలు కూడా ఇదే అనుభవిస్తూ ఉంటుంది. ఇవి ఏవీ కూడా ఆత్మకు అంటవు.
ఈ శరీరాన్ని ''మల మూత్ర భాండం'' అని అంటారు. దీనిలో ఉన్న నవరంధ్రాల నుంచి కూడా వ్యర్థపదార్ధాలే బహిర్గతం అవుతాయి.


 కళ్ళనుంచి పుసి, చెవునుంచి గుబిలి, ముక్కునుంచి చీమిడి, నోటినుంచి కళ్ళి పాచి, శిశ్నం నుంచి మూత్రం, గుదం నుంచి మలం విసర్జింపబడుతూ ఉంటాయి. రోమకూపాలు అన్నిటి నుంచి కూడా చెమట బహిర్గతం అవుతూ ఉంటుంది. ఈ విధంగా శరీరం నుంచి అన్నీ కూడా ఏహ్యమైనవే విసర్జింపబడుతూ ఉండటం వల్ల దీన్ని మలమూత్రభాండం అన్నారు. మానవుడు ఎంతో ప్రేమతో, అనురాగంతో పోషించుకొంటూ జాగ్రత్తగా కాపాడుకొనే దేహంమీద మానవునికి అసహ్యమైన భావన కలిగించటానికే దీన్ని ''మలమూత్రభాండం''అన్నారు. మలమూత్రభాండాన్ని ఎవరూ ముట్టుకోవడానికి
 కూడా ఇష్టపడరు కదా !


శరీరం పంచమహాభూతాలైన ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అనే వాటి సూక్ష్మ రూపాలచేత ఏర్పడుతూ ఉంది. పంచమహాభూతాలను తన్మాత్రలు అంటారు. అంటే తత్‌ అనగ అది, మాత్రము అనగా కొలిచేది అని అర్థం. అంటే అది ఒక్కటే అయి ఉంది అని అర్థం. ఆ తన్మాత్రలు అప్పుడు తమ ప్రత్యేకమైన శుద్ధస్థితిలో ఉంటాయి. తర్వాత అవి పంచీకరణంచెందుతాయి.


ప్రతి తన్మాత్ర రెండుగా చీలి ఒక అర్థభాగం ఏ వికారం చెందకుండా నిలుస్తుంది. మిగిలిన సగభాగం నాలుగు భాగాలుగా చీలుతుంది. అంటే ప్రతి ఒక్క తన్మాత్రలోని సగభాగం, మిగిలిన తన్మాత్రలలో ఒక్కొక్క దాని నుండి ఎనిమిదవ వంతు చొప్పున గ్రహించి పూర్ణమయిన తన్మాత్ర అంతటి రూపం ధరిస్తూ ఉంది. దీనినే 'పంచీకరణం' చెందటం అంటారు. అంటే పంచమహాభూతాల సూక్ష్మాంగాలుగా మారటాన్నే పంచీకరణం అంటున్నారు. శరీరంలోని అవయవాలు ఈ విధంగా పంచీకరణం చెందినవాటి చేతనే ఏర్పడుతూ ఉన్నాయి. అవి అదే పాళ్ళలో ఉన్నాయి అని ఎట్లా చూపించటానికి వీలు అవుతుందో తెలియదు. అయినా ప్రాచీన కాలంనుంచి గురుపరంపరగా అదే విధంగా చెప్పబడుతూ ఉన్నాయి. అవి ఈ క్రింది పట్టికలో చూపబడుతూ ఉన్నాయి.

_________
1) పంచీకృతమైన ఆకాశం = 1/2 ఆకాశం + 1/8 గాలి + 1/8 అగ్ని +
= చెవి 1/8 నీరు + 1/8 భూమి
2) పంచీకృతమైన గాలి = 1/2 గాలి + 1/8 ఆకాశం + 1/8 అగ్ని +
= చర్మం 1/8 నీరు + 1/8 భూమి
3) పంచీకృతమైన అగ్ని = 1/2 అగ్ని + 1/8 ఆకాశం + 1/8 గాలి +
= కన్ను 1/8 నీరు + 1/8 భూమి
4) పంచీకృతమైన నీరు = 1/2 నీరు + 1/8 ఆకాశం + 1/8 గాలి +
= నాలుక 1/8 అగ్ని + 1/8 భూమి
5) పంచీకృతమైన భూమి = 1/2 భూమి + 1/8 ఆకాశం + 1/8 గాలి +
= ముక్కు 1/8 అగ్ని + 1/8 నీరు
________

ఇక ''ప

ంచ మహాభూతాల్ని'' గురించి ఆలోచించినట్లు అయితే సహజంగా క్రింద మనకు కనిపిస్తున్న భూమినుంచే మిగిలిన భూతాలు ఉత్పన్నం అయినాయి అని భావించటానికి అనుకూలంగా ప్రకృతి కనిపిస్తుంటుంది.


 కాని ఈ పంచమహాభూతాలు అట్లా ఉద్భవించలేదు. కార్యానికి ముందు కారణం ఉంటుంది కదా ! దానికి అనుకూలంగా అనంతము, ఆనందస్వరూపము అయిన ఆత్మ నుండి ప్రకృతి ప్రథమ వికారమైన ఆకాశం పుట్టింది. దాని సహజగుణము శబ్ధము. దాని నుండి రెండవ ప్రకృతి వికారమయిన వాయువు పుట్టింది దాని సహజ గుణము స్పర్శ. ఆ వాయువు నుండి తృతీయ ప్రకృతి వికారమయిన అగ్ని పుట్టింది. ఆ అగ్ని సహజ గుణము రూపము. దాని నుండి నాల్గవ ప్రకృతి వికారమయిన జలము పుట్టింది- దాని సహజగుణము రసము. జలము నుండి భూమి పుట్టింది. దాని సహజ గుణము గంధము (వాసన). ఈ విధంగా పంచమహా భూతముల పుట్టుకతో సృష్టి ప్రారంభమయింది. వీటిలో ప్రతి భూతమునకు దాని సహజగుణముతో పాటు ఆకాశాది పూర్వభూతముల గుణాలు కూడా సంక్రమించాయి.


అది ఈ క్రింది పట్టికతో వివరింపబడుతూ ఉంది.

ఆత్మ gనిత్యానంద స్వరూపం
$
ఆకాశం gశబ్దం
$
వాయువు gశబ్దం, స్పర్శ
$
అగ్ని gశబ్దం, స్పర్శ, రూపం
$
నీరు gశబ్దం, స్పర్శ, రూపం, రుచి
$
భూమి gశబ్దం, స్పర్శ, రూపం, రుచి, గంధం.
1) శబ్దం - చెవులు - ఉల్లం - ఆకాశతత్త్వం - కపాలం నుంచి కనుబొమల వరకు
2) స్పర్శ - చర్మం - మనస్సు - వాయుతత్త్వం - బొమముడి దగ్గరనుంచి గొంతు వరకు
3) రూపం - కళ్ళు - బుద్ధి - అగ్ని తత్త్వం - గొంతుకనుండి గుండె వరకు
4) రసం - నాలుక - చిత్తం - జల తత్త్వం - గుండెనుండి నాభి వరకు
5) గంధం - ముక్కు - అహంకారం - పృథ్వితత్త్వం - నాభినుంచి మూలాధారం వరకు
ఆత్మజ్ఞానాన్ని సాధనచేయు వారికి రమణ మహర్షి అంతఃకరణాన్ని అయిదుగా విభజించి వాటిని అర్థం చేసుకోవటానికి వీలుగా ఉల్లం అంటే శుద్ధ మనస్సు లేక తలంపులు లేని మనస్సు అనే దాన్ని చేర్చి పంచతత్త్వాలను వివరించిన విధానాన్ని తన్మాత్రలతో జతచేయటం జరిగింది.
ఆకాశాది సూక్ష్మ భూతాలు కలిసి క్రమేపి స్థూలరూపాలయి స్థూల శరీరానికి హేతువు అవుతున్నాయి. శబ్ద స్పర్శ రూప రస గంధాలు పంచీకరణం చెందని సూక్ష్మాంశాల వల్లనే ఏర్పడుతున్నాయి.


మానవుడు మరణించే ముందుకూడా పంచమహాభూతాలు ఏ క్రమంలో భూమి మీదకు వచ్చాయో అదే క్రమంలో మానవుని నుంచి నిష్ర్కమిస్తాయి. ముందు ఆతడు చెప్పేమాట వినిపించదు. ఆకాశం లోపిస్తూ ఉంటుంది. తర్వాత అతని నాడి చూస్తుంటే ఆ నాడి అందదు. ముక్కు వద్ద వేలు పెట్టి చూస్తే గాలి ఆడటం లేదని తెలుస్తుంది. వాయువు లోపిస్తుంటుంది. ఆ తర్వాత శరీరం చల్లబడుతుంటుంది. దానికిగాను ఆయుర్వేద వైద్యులు చింతామణి వేస్తారు. పసుపు వెల్లుల్లి నూరిన ముద్దను కాళ్ళకు రుద్దుతారు. అగ్ని లోపిస్తుంటుంది. ఆ తర్వాత మరణిస్తాడు. శవాన్ని తగులబెట్టినా పాతిపెట్టినా నీటిలోను భూమిలోను కలిసిపోతుంది.


కర్మ సంచితం : - మానవులందరి చావు పుట్టుకలు ఒకేలా ఉన్నా అవి ''కర్మసంచితం'' అని ఎందుకు అన్నారు. ఈ గీత కర్మ సంచితాన్ని ఎట్లా తెలుసుకోగలుగుతాం? అంటే అందరి దేహాలు ఒకేలా ఉన్నా రూపాల్లో భేదాలు కనిపిస్తున్నాయి. ప్రవర్తనలో భేదాలు కనిపిస్తున్నాయి. ఒకే విషయాన్ని అందరూ ఒకేలా దర్శించినా - అనుభూతులు పొందటంలో తారతమ్యాలు కనిపిస్తున్నాయి. కాన అందరిలో చైతన్యం ఒకేలా ప్రకాశిస్తున్నా సూక్ష్మ శరీరాల్లో గత కర్మానుసారం వ్యత్యాసం ఉండటం వల్ల అట్లా జరుగుతుంది అని భావిస్తున్నారు.


''సుఖదుఃఖానాం భోగాయతనం'' - జీవుడు గత జన్మలో పొందిన అనుభూతులు, ఆచరించిన కర్మలు ''వాసన''లుగా ఉన్న సూక్ష్మశరీరంలో స్థూల శరీరాన్ని పొందుతున్నాడు. అప్పుడు మాయకప్పిన జీవుడు శరీరంతో తాదాత్మ్యం చెందటం వల్ల జ్ఞానేంద్రియాలను అనుసరించి సుఖదుఃఖాలు అనుభవించే క్షేత్రంగా, స్థూల శరీరం సుఖదుఃఖాలు అనుభవించే అనుభవక్షేత్రంగా అవుతుంది.


జీవుడు స్థూల శరీరంతో, సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యం చెందటం వల్ల అనుభూతులు, అనుభవాలు అన్నీ స్థూల శరీరానికి కలుగుతున్నాయే కాని అవేవీ ఆత్మకు కలగటంలేదు. ఆత్మ సాక్షిమాత్రంగా ఉంది. ఆద్దంలో ఉన్న ప్రతిబింబానికి కలిగిన బాధలు, వికారాలు, సుఖాలు బింబానికి ఎట్లా అంటటం లేదో అట్లాగే అహంకార రూపుడైన జీవునికి పరిమితమైన బంధాలు, బాధలు ఆత్మకు అంటటంలేదు. అద్దానికి కళాయి సరిగా లేకపోయినా, అద్దం ఎత్తుపల్లాలుగా ఉన్నా ప్రతిబింబం రకరకాలుగా కనిపిస్తుంది. అవేవీ బింబానికి అంటవు. ఆ విధంగానే ఆత్మకు ఏవీ అంటవు.


''ఆయతనం'' అంటే ఇల్లు. ఇంటి యజమాని బయట ప్రపంచంలో తనకు కావలసినవి అన్నీ సంపాదించుకొని ఇంటిలో అనుభవిస్తుంటాడు. అదే విధంగా మాయకమ్మిన ఆత్మ అయిన జీవుడు ఇంద్రియ సాహచర్యంతో బయటి ప్రపంచంలోని వస్తువులతో సంబంధం పెట్టుకొంటాడు. వాటి వల్ల వచ్చిన సుఖదుఃఖాలు శరీరం అనే గృహంలో అనుభవిస్తుంటాడు. ఆ విధంగా స్థూల శరీరం సుఖదుఃఖాలు అనుభవించే క్షేత్రంగా ఉంది.

🕉🌞🌏🌙🌟🚩
ఓం నమః శివాయ:
మాండూక్యోపనిషత్.12
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
హరిॐఓంॐ

కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.


ఆదిశంకరుల గురుదేవులు గోవిందపాదుల గురువులైన గౌడపాదాచార్యులవారు 215 కారికలు రచించారు. 120 సంవత్సరాల వయసు వున్న గౌడపాదాచార్యులను తమ పన్నెండవయేట, ఆదిశంకరులు, తమగురువైన గోవిందపాదులతో కలిసి హిమాలయాలలోని, బదరికాశ్రమంలో దర్శించి, వారి ఆజ్ఞపై 215 కారికలకు భాష్యమును రచించారు. వాటినిచూసి యెంతో ఆనందించి తమ గురువులైన శుక, బాదరాయణులకు గౌడపాదులవారు ఆభాష్యములను చూపించగా, వారు కూడా శంకరుని భాష్యములను విని ఆనందించి, అద్వైత సిద్ధాన్త స్థాపన కార్యము శంకరునిపైనుంచి అదృశ్యులయ్యారు. ఈ విషయమును చిత్సుఖాచార్యుల వారు రచించిన ' బృహచ్ఛంకర విజయం ' నందు ఉటంకించడం జరిగింది.

ఈ కారికలకు భాష్యము వ్రాసిన సమయానికి ఆదిశంకరుల వయస్సు 12 ఏళ్ళు మాత్రమే.


మొదటిదైన ఆగమప్రకరణంలోని ఈ మాండూక్యోపనిషత్తులో పన్నెండు మంత్రములు, 29 కారికలు మాత్రమే వుంటాయి. మనము ముందుగా మొదటి ప్రకరణం స్టాలీపులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా ఆదిశంకరుల భాష్య సారాన్ని స్పృశిస్తూ, రోజుకు కొంత చెప్పుకుందాము.
.

ఆగమ ప్రకరణం

మాండూక్యోపనిషత్తు.

ప్రధమ ప్రకరణములో మొత్తము 29 కారికలు గౌడపాదాచార్యులు వ్రాసినవి ఉన్నాయని పీఠికలో చెప్పుకున్నాము కదా ! అందులో 9 కారికలు, సప్తమ మంత్రము లోపు చెప్పుకోవడం జరుగుతుంది, శంకరుల భాష్యముతో సహా.

శ్రీమత్ గౌడపాదాచార్యుల కారికలు.
ఒకటవ కారిక :

బహిష్ప్రజ్నో విభుర్విష : హ్య౦త : ప్రజ్ఞస్తు తైజస : /
ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ : ఏక ఏవ త్రిధాస్మృత : //
రెండవ కారిక : దక్షిణాక్షి ముఖే విశ్వ : మనస్యాన్తశ్చ తైజస : /
ఆకాశే చ హృది ప్రాజ్ఞ : త్రిధా దేహే వ్యవస్థిత : //
మూడవ కారిక విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస : ప్రవివిక్త బుక్ /
ఆనందభుక్ తథా ప్రాజ్ఞ : త్రిధాభోగం నిబోధత //
నాలుగవ కారిక : స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్త౦తు తైజసమ్ /
ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిమ్ నిబోధత //
అయిదవ కారిక : త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తాయశ్చ ప్రకీర్తిత : /
వేదైతదుభయం యస్తు స భుంజానో న లిప్యతే //
ఆరవ కారిక : ప్రభవ స్సర్వభావానాం సతామితి వినిశ్చయ : /
సర్వం జనయతి ప్రాణ : చేతో>౦ శూ న్పురుష పృథక్ //
ఏడవ కారిక : విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టి చింతకా : /
స్వప్నమాయా సరూపేతి సృష్టిరన్వైర్వి కల్పితా //
ఎనిమిదవ కారిక : ఇఛ్ఛామాత్రం ప్రభో : సృష్టి : ఇతి సృష్టవ్ వినిశ్చితా : /
కాలాత్ప్రసూతిమ్ భూతానాం మన్యంతే కాలచింతకా : //
తొమ్మిదవ కారిక : భోగార్ధం సృష్టి రిత్యంతే క్రీడార్థమితి చాపరే /
దేవస్యైష స్వభావో>యం ఆప్తకామస్యకా స్పృహా ?

ఇక ఈ తొమ్మిది కారికల తరువాత ఏడవ మంత్రము చెప్పుకుందాము.

సప్తమ మంత్రము :
నా౦త : ప్రజ్ఞం, న బహిర్ప్రజ్ఞం, నో భయత : ప్రజ్ఞం, న ప్రజ్ఞానఘనం నప్రజ్ఞం, నాప్రజ్ఞం /
అదృష్ట మవ్యవహార్య మగ్రాహ్య మలక్షణ మచింత్య మవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచోపశమం, శాన్తమ్ శివమద్వైతం చతుర్ధం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయా : //

అంత; ప్రజ్ఞ కలవాడు కాదు అనగా స్వప్నగత పురుషుడు కాదు. జాగ్రత్ పురుషుడు కాదు, జాగ్రత్ స్వప్న మద్య పురుషుడు కాదు. ప్రాజ్ఞుడుకాదు. అలా అని కేవలం అప్రాజ్ఞుడూ కాదు. ఇంద్రియాలకు గోచరించేవాడు కాదు. వ్యవహరించడానికి నామరూపాలు లేనివాడు. అంత:కరణమునకు అంతుపట్టని వాడు, యుక్తితో పట్టుకోవడం సాధ్యము కానివాడు, జాగ్రద స్వప్న సుషుప్తాదులందు సాక్షిగా ఒక్కడిగా వున్న, సుఖమైన, మంగళకరమైన భేదగుణరహిత అద్వైత స్థితిలోవున్న చతుర్థము ( తురీయము ) అని దేనిని పండితులు తలుస్తారో, అదేఆత్మ. అతడే తెలియదగిన పురుషుడు.


ఆత్మజ్ఞానం  తెలుసుకోవడమంటే, ద్వైతభావము పోయి, అద్వైతస్థాయి స్థిరబడడం అన్నమాట !

ద్వైతము నిలబడి వున్నచోట అద్వైతము వుండదు.  స్వస్వరూప జ్ఞానము తెలియాలంటే, త్రిపుటి పోవలసినదే.   ఈ సాధన నిరంతరమూ జరుగవలసినదే.  ఏకొద్ది యేమరు పాటువున్నా,  ద్వైత భావనలు ప్రవేశించి అద్వైత భావనలపై ప్రభావం చూపిస్తాయి.   దీనినే ' అనవస్థా దోషము ' అంటారు .


కాబట్టి ఏవైతే ఆత్మకు సంబంధించని విషయాలు వుంటాయో, వాటిని క్రమముగా   తెలుసుకుంటూ, ద్వైతమును నశింపజేసుకుని,  ఆత్మజ్ఞాన గమ్యం వైపు అడుగులు వేయాలి.


ఇక సప్తమ మంత్రం లో ఏయే విషయాలు ఆత్మకు సంబంధించినవి   కావని చెప్పబడినవో చూద్దాం !


తైజసుడు ఆత్మ కాదు. విశ్వుడు  ఆత్మ కాదు.  జాగ్రద్ స్వప్నముల మధ్య వున్న  ఉభయతా ప్రాజ్ఞుడు ఆత్మ కాదు.  సుషుప్తావస్థలోని ప్రాజ్ఞుడు ఆత్మకాదు.  సర్వ విషయములు దృశ్యములు ఆత్మకావు.  అవి ఆత్మ దర్శనానికి అవరోధములు.  అలాగే జడత్వ సంబంధ విషయములు ఆత్మ కావు.  అవి కూడా ఆత్మజ్ఞాన ప్రతిబంధకములు.


అయితే కొందరు సందేహప్రాణులు, ' జాగ్రత్తు స్వప్న సుషుప్తులలో ప్రజ్ఞ వుంటున్నది  కదా !  అది ఆత్మ సంబంధము కాదని ఎలా చెప

్పగలం ? వాటిని రోజూ అనుభవం లో చూస్తున్నాము  కాబట్టి అవి సత్యములే కదా ? '  అని  ప్రశ్నిస్తారు. 


దానికి సమాధానం.   జ్ఞ స్వరూపము తురీయము.  అంత : ప్రజ్ఞాదులు కల్పితములు.   కల్పితముల వలన మూలవస్తువునకు ఏ వికారము కలుగదు.   చుట్టూవున్న వారు ఎంతమంది త్రాడును చూసి పాము అన్నా కూడా,  ఆ త్రాడుకు కోరలు,  బుసకొట్టే లక్షణం రాదు కదా !


కొందరు, అవిద్య ( అనాత్మ తత్వము ) చే భిన్న భిన్న భావముల వలన భిన్న కోణములలో చూడడం వలన త్రాటికి  పాములక్షణాలను, కొందరు జలధార లక్షణాలను ఆపాదించి అదే త్రాటిని పాము అనీ,జలధార అనీ భావిస్తుంటారు.   అలాగే జ్ఞ స్వరూపమైన తురీయుని యందు విశ్వ, తైజస, ప్రాజ్ఞ పురుషులు  వికల్పాలు కల్పించుకుని,  వ్యవహారములు నడిపినా,  జ్ఞ స్వరూపమునకు ఎట్టి వికల్పములు కనబడవు. 


జ్ఞ స్వరూపము సుషుప్తిలో కూడా వున్నట్లు అనిపిస్తే, అది తప్పు.  సుషుప్తిలో సర్వమూ భావ రహితమైనందున అక్కడ తురీయుడు కూడా లేడని తెలుసుకోవాలి.   సుషుప్తి నుండి బయటకు వచ్చిన వాడు,  ' నేనుసుఖంగా నిద్రించాను '   అని చెప్పాడంటే, సుషుప్తిని మించిన స్థాయి ఒకటి వున్నదని ఒప్పుకోవాలికదా ! సుషుప్తిలో ఉన్నంతవరకూ  ఏ అనుభవమూ వ్యక్తమవదు.  


అందువలననే తురీయము అదృష్టము.  కనబడదు.  ఈ స్థితిని ఇంద్రియములు గ్రహించజాలవు.  అనగా వ్యవహారములకు తురీయుడు అయోగ్యుడు.   పొగనిచూసి నిప్పు వున్నదని గ్రహిస్తాము.  ఇక్కడ పొగ లింగము, వేదాంతపరిభాషలో.  తురీయుని యేవస్తువుతో పోల్చలేము కాబట్టి, అతడు అలింగుడు.  ప్రసిద్ధమైన దృష్టాంతరం తురీయుని విషయంలో చెప్పలేము.    అనగా తురీయస్థితి తర్కించుటకు వీలుగాని స్థితి.  కాబట్టి అననుమేయం.   అననుమేయం అనగా తర్కించ తగనిది. 


అలాగే తురీయష్టితి అచింత్యము.  చిత్తముతో చింతింపకలిగినది కాదు.  మౌనవ్యాఖ్య
కే అది అందుతుంది.   మూడు అవస్థలయందు నిర్వికారంగా  ఆత్మీ భూతంగా వున్నది తురీయము.  శృతి వాక్య ప్రమాణము ప్రకారము, తురీయుని ఆత్మగా ఉపాసించాలి.

🕉🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి