5, ఏప్రిల్ 2020, ఆదివారం

ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు*

135.ఉపనిషద్విచారణ

135. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు
ద్వితీయ, తృతీయ, చతుర్ధ ఖండాలు:

నాలుగు వేదాలు, ఇతిహాసాలు, వేదాంగాలు, ఇతర శాస్త్రాలు, గారుడవిద్య, దేవజనవిద్య, ద్యులోకం, భూలోకం, వాయుభూతం, ఆకాశము, నీరు, అగ్ని, దేవతలు, మానవులు, పశుపక్ష్యాదులు, తృణములు, వనస్పతులు, క్రిమికీటకాదులు, ధర్మాధర్మములు, సత్యాసత్యములు, ప్రియాప్రియములు మొదలైన ఈ సమస్త ప్రకృతిని వాక్కు తెలియజేస్తోంది.

వాక్కు లేకపోతే ధర్మధర్మములను, సత్యా సత్యములను, మంచిచెడ్డలను, ప్రియా ప్రియములను తెలుపుటకు వీలుకాదు. ఈ సర్వస్వాన్ని వాక్కు తెలియజేస్తోంది. వాక్కును బ్రహ్మము గా ఉపాసించాలి.

వాక్కును పరబ్రహ్మముగా ఉపాసించేవాడు వాక్కు యొక్క పూర్ణజ్ఞానాన్ని పొంది వాక్కు ఎంతగా వ్యాప్తి చెంది ఉందో అంతవరకూ స్వేచ్ఛగా విహరిస్తాడని చెప్పేడు సనత్కుమారుడు.

నారదుడు అప్పుడు “భగవన్!వాక్కు కంటే అధికమైన జ్ఞానమేదైనా ఉందా?” అని అడిగేడు. ‘ఆ ఉంది’ అని సనత్కుమారుడు చెప్పేడు.

మనస్సు వాక్కు కంటె గొప్పది. రెండు ఉసిరి కాయలు లేదా రెండు రేగికాయలు, లేదా రెండు తాటికాయలు ఒకే పిడికిలిలో ఇమిడ్చు కున్నట్లు, మనస్సులో నామము, మరియు వాక్కు ఇమిడ్చు కోబడి ఉన్నాయి. అంటే మనస్సులో అంతర్భూతములై ఉన్నాయి.

మంత్రములను ఉచ్ఛరించాలని మనుష్యుడు మనస్సులో ఎప్పుడు కోరుకుంటాడో అప్పుడతడు మంత్రాలను ఉచ్ఛరిస్తాడు. కర్మల నాచరించాలని ఎపుడు సంకల్పిస్తాడో అప్పుడా కర్మల నాచరిస్తాడు. పసువులు, పుత్రాదులు పొందాలని ఎప్పుడు కోరుకుంటేఅప్పుడు వాటిని పొందుతాడు. ఈ లోక పరలోకములను ఇష్టపడిన వెంటనే పొంద గలుగుతాడు.
మనస్సే ఆత్మ, మనస్సే లోకము. మనస్సే బ్రహ్మము. మనస్సును పరబ్రహ్మము గా ఉపాసించాలి. మనస్సును పరమాత్మగా ఉపాసించువాడు మనస్సు ఎంత వరకూ వ్యాపించగలదో, అంత వరకూ యథేచ్ఛగా విహరిస్తాడు.

అప్పుడు నారదుడు మనస్సు కంటే గొప్పదేమైనా ఉందాఇని అడుగగా సనత్కుమారుడు ఉంది అంటూ చెబుతున్నాడు.

సంకల్పము మనస్సు కంటే చాలా పెద్దది. మానవుడు సంకల్పం చేసేటప్పుడు మనస్సుతోనే కోరుతూ ఉంటాడు. మనస్సు వాక్కును ప్రేరేపిస్తుంది. వాక్కులో నామము చేరి ఉంటుంది. నామము మంత్రములోను, మంత్రము కర్మలలో చేరి ఉంది. నామములు, మనస్సు మొదలైన వాటికి సంకల్పమే ఆశ్రయం. అన్నింటికీ మూలము సంకల్పమే.

 సంకల్పము యొక్క ఆధారముతోనే, నామాదులు మనస్సు ఉనికి గలవై ఉన్నాయి.
స్వర్గము, భూమి, వాయువు, ఆకాశము, తేజస్సు, అన్నము, ప్రాణము, మంత్రము, ఖర్మఫలము మొదలైనవన్నీ సంకల్పము వల్లే కలుగుతున్నాయి. సమస్త సృష్టి సంకల్పమయము. సంకల్పమునే పరబ్రహ్మము గా ఉపాసించు నారదా! అన్నాడు సనత్కుమారుడు.

సంకల్పమునే పరబ్రహ్మగా ఉపాసించేవాడు సృష్టింపబడిన ధ్రువలోకానికి తానే ధ్రువుడై, ప్రతిష్ట చేయబడిన లోకములకు తానే ప్రతిష్టితుడై, దుఃఖము లేని లోకములకు తాను దుఃఖ రహితుడై ఉంటాడు. సంకల్పము ఎంత దూరం వ్యాప్తమై ఉందో అంత దూరం, అంతటా స్వేచ్ఛగా అతను సంచరించగలడు.
భగవన్! సంకల్పము (నిశ్చయాత్మక బుద్ధి) కన్నా కూడా గొప్పదైనది ఏమయినా ఉందా? అని నారదుడడుగగా సనత్కుమారుడు ఉంది అంటూ ఇలా చెబుతున్నాడు.

136. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు

పంచమ ఖండం నుంచి అష్టమ ఖండం వరకూ:
చిత్తము సంకల్పము కంటే గొప్పది. మనుష్యుడు చిత్తముతో నిండి ఉన్నప్పుడే సంకల్పము చేస్తాడు, వాంఛిస్తాడు. వాగీంద్రియము ప్రేరణ కలుగ జేస్తుంది. వాక్కు నామములో ప్రతిష్టింప బడుతుంది. నామములో మంత్రాలు ఏకమవుతున్నాయి. మంత్రాలలో కర్మలు ఏకమవుతున్నాయి. వీటన్నిటికీ చిత్తమే చివరి ఆశ్రయము. చిత్తమే వాటి ఆత్మ. ఇవన్నీ చిత్తములోనే ప్రతిష్టింప బడి ఉన్నాయి.

అందుకే ఎక్కువగా విషయములు తెలిసిన విద్వాంసుడు కూడా చిత్తము యొక్క సహకారములేకపోతే, ఏకాగ్రత లేనివాడైన యెడల అతనిని విద్వాంసుడని కాని తెలిసినవాడని కాని చెప్పరు కదా। ఇతడు నిజముగా విద్వాంసుడైతే ఈ విధంగా అజ్ఞానిలా మతిలేకుండా ఉండడు అంటారు.
గొప్ప విద్వాంసుడు కాకపోయినా కొంచెం విషయజ్ఞానం ఉన్నవాడయినా, జనులందరూ ఆతని మాటలు వినడానికి ఇష్టపడతారు. అందువల్ల చిత్తమే అన్నిటికీ చివరి ఆశ్రయము. చిత్తమే ఆత్మ. చిత్తమే ఆధారము. చిత్తమును పరబ్రహ్మము గా ఉపాసించు అని నారదునకు సనత్కుమారుడు చెప్పేడు.

ఈ రీతిగా చిత్తాన్ని ఉపాసించేవ్యక్తి దృఢచిత్తు డౌతాడు. ఈతడు సర్వాత్మకుడుగా అన్ని లోకాలలోను ప్రతిష్ఠ కలవాడవుతాడు. బుద్ధిని పరబ్రహ్మ గా ఉపాసించిన అతడు అన్ని భావాలు స్వతంత్రంగా కలవాడవుతాడు.
ఈ చిత్తానికంటే అధికమైన దేదయినా ఉందా? అని నారదుడు ప్రశ్నించగా ఉంది అంటూ సనత్కుమారుడు ధ్యాన స్థితి అనేదాని గురించి ఇలా చెబుతున్నాడు.

ధ్యానస్థితి అనేది చిత్తం కంటే చాలా గొప్పది. అంతరిక్షం, ద్యులోకం, నీరు, కొండలు, దేవతలు, మానవులు, మొదలైన సర్వమూ ధ్యానం చేస్తున్నట్లే కనిపిస్తాయి. ధ్యాన సిద్ధి వల్లనే మానవులు ఔన్నత్యాన్ని పొందుతున్నారు.

ధ్యానము చేయలేని వారు క్షుద్రులుగా, కలహప్రియులుగా, ఇతరుల తప్పుల నెంచు వారుగా అవుతున్నారు. పరోపకారి చేయాలనే మనస్సు ఉన్నవారు, మంచి ప్రకాశ వంతులు ధ్యానము యొక్క సత్ఫలితాలను అనుభవిస్తారు. అందువల్ల ధ్యానాన్ని పరబ్రహ్మముగా ఉపాసించాలి.
ధ్యానం కంటే కూడా మరేదయినా గొప్పది ఉందా అని అడిగిన నారదుని ప్రశ్నకు సనత్కుమారుడు ఇలా చెప్పేడు.

ధ్యానం కంటే కూడా విజ్ఞానం చాలా గొప్పది. విజ్ఞానం వల్లే, చతుర్వేదాలు, పంచమ వేదము అయిన ఇతిహాస పురాణాలు, షడంగాలు, భూత తంత్ర విద్య, క్షత్రవిద్య, నక్షత్తవిద్య, సర్వదేవ జన విద్యలు, భూమి, వాయువు, ఆకాశము, జలము, తేజస్సు, దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు, తృణములు, వనస్పతులు, క్రిమికీటకాలు, పతంగములు, ధర్మాధర్మములు, సత్యాసత్యములు, మంచి చెడ్డలు, ప్రియా ప్రియములు మొదలైన సర్వస్వము విజ్ఞాన మయమై ఉన్నాయి. ఇవన్నీ విజ్ఞానం వల్లే తెలుస్తున్నాయి. కనుక విజ్ఞానాన్నే బ్రహ్మము గా ఉపాసించాలి.
విజ్ఞానాన్ని బ్రహ్మము గా ఉపాసించే వాడు విజ్ఞానమయలోకాల్ని చేరుతున్నాడు. ఆ విజ్ఞానం ఎంత వరకూ వ్యాప్తిచెందుతుందో అంతవరకూ ఆ ఉపాసకుడు స్వేచ్ఛగా సంచరిస్తాడు. అందుకే విజ్ఞానమే సర్వస్వమై ఉంది.

విజ్ఞానం కన్నా గొప్పదేదయినా ఉందా అని నారదుడడుగగా బలం విజ్ఞానంకన్నా గొప్పది అంటూ సనత్కుమారుడు ఇలా అన్నాడు. బలం గల వ్యక్తి ఒకసారి వందమంది జ్ఞానవంతులైన పండితుల్ని భయపెట్ట గలడు. మానవుడు బలవంతుడైతే అతనికి ధైర్యం చేకూరుతుంది.

అలా ధైర్యం గా నిలపగలిగిన వాడే సద్గురువు యొక్క సాన్నిధ్యాన్ని పొంది ఆత్మజ్ఞానాన్ని తత్వాన్ని తెలుసుకోగలడు. బాగా వినగలుగుతాడు. మంచి బుద్ధితో మంచి పనులు చేయగలుగుతారు. చక్కగా జ్ఞానాన్ని ఆర్జిస్తాడు.

పృథివి, ఆకాశం, ద్యులోకం, దేవతలు, కొండలు మనుషులు, పశువులు, పక్షులు, క్షీరములు, వనస్పతులు, క్రిమికీటకాది సర్వ ప్రాణులు, సర్వలోకాలు, ఇవి అన్నీ బలం అనే ఆధారంతోనే నిలిచి ఉన్నాయి. కనుక నీవు బలాన్ని పరబ్రహ్మ గా ఉపాసిస్తే గొప్ప బలం కలవాడవవుతావు. అన్నాడు సనత్కుమారుడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి