7, అక్టోబర్ 2019, సోమవారం

రోజువారి కధలు

ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ: - ప్రాంజలి ప్రభ 
(ఆనందం - ఆరోగ్యం- ఆధ్యాత్మికం )

ప్రాంజలి ప్రభ - రోజువారి కధలు (5)
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


ఓంకారం

చాలామంది నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీతంగా ఇష్టపడతారు.



పంచభూతాల్లో శబ్దం ముందు ఉంది. ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. శబ్దానికి ఆధారం ఓంకారమే!


ఓంకారం దేహంలో ఉంది. ‘ఓం’ అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితమవుతుంది. దివ్య ప్రకంపనలు శరీరాన్ని చుట్టుముడతాయి. అప్పుడు శరీరం సహజ ధ్యానంలోకి అత్యంత సహజంగా వెళుతుంది. ఆ తరవాత నిశ్శబ్దంలో ఓలలాడుతుంది.

ఓంకారానికి, ఓంకారానికి మధ్య ఏర్పడుతున్న నిశ్శబ్దాన్ని సాధకుడు గమనించాలి. అక్కడ మనసు ఆగిపోతుంది. ఆ నిశ్చలత్వమే ఓంకారాన్ని ఉద్దీపింపజేస్తుంది. ప్రయత్నపూర్వకంగా ప్రతి రోజూ ఓంకారాన్ని జపిస్తే, కొంతకాలం గడిచాక మనసులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది.

‘ప్రశాంతత కావాల్సినవారు ఓంకార ధ్యానం చేయాలి’ అంటారు ఓషో. నమ్మకం ఉన్నవారైనా, లేనివారైనా ఓంకారాన్ని జపిస్తూ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ‘అ’కార, ‘ఉ’కార, ‘మ’కారాలు కలిసి ‘ఓంకారం’ అయిందని పండితులు చెబుతారు.

ఔషధాన్ని నమ్మనివారైనా, దాన్ని తీసుకున్నప్పుడు దాని పని అది చేస్తుంది. ఓంకారమూ అంతే! ఆ శబ్దాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టగానే, అది సాధకుల్ని చక్కగా పట్టుకుంటుంది. ఆరోగ్యం కలిగించేవరకు అది విడిచిపెట్టదు- అంటారు యోగ నిపుణులు.

వేదభూమికి ఆధారం ఈశ్వరుడు. ఆయనకు శబ్దరూపం ఓంకారం. ఓంకారంతో ధ్యానంలోకి ప్రవేశిస్తే చాలు. ఆనందం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదని ఉపనిషత్తులు చెబుతున్నాయి.

ఓంకారం అంటే, ఆనంద స్వరూపం. అది ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ కోశాల్ని దాటి వెలుగులీనుతూ ఉంటుంది అది. ఎవరు ఆ ప్రణవ శబ్దం చేస్తారో, వారితో సులువుగా కలుస్తుంది. వారిని తనలో కలుపుతుంది.

నిశ్శబ్దానికి నేపథ్యంగా ఉండేది ఓంకారమే. అది విశ్వంలో ఆత్మగా ఉంది. ఓంకారం- పిలిస్తే పలుకుతుంది. రుషుల చుట్టూ తిరుగుతుంది. ధ్యానుల శరీరాల్ని డమరుకాలు చేస్తుంది. జ్ఞానుల దేహాల్ని పాంచజన్యాలుగా మారుస్తుంది. శ్రీకృష్ణుడి మురళిలోకి ప్రవేశించిన ఓంకారం బృందావనమంతా విహ రించిందని పురాణ గాథలు చెబుతాయి.

ఓంకారం ప్రాణం. చైతన్యం, సత్యం, ఆనందం... అన్నీ ఓంకారమే.

శివుడి మాటలకు భాష ఓంకారం. ఆ శివతాండంలో ఓంకారం ప్రణవ నాదమవుతుంది. ముల్లోకాలూ ఆనంద సాగరంలో తేలియాడేలా చేస్తుంది. ఓంకారమే ప్రకృతిని నడిపిస్తుంది. ఆ ఓంకారాన్ని ఆహ్వానించి, ఆవాహన చేసుకున్న మానవ జన్మ ధన్యమైనట్లే!

ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ... ఇలా ప్రతి నామం ముందూ ఓంకారం భూషణమై వెలుగుతుంది. ప్రతి స్తోత్రమూ ఓంకారంతోనే ప్రారంభమవుతుంది. ప్రతి శ్లోకమూ ఓంకారంతోనే జీవిస్తుంది. ఓంకారంతోనే విశ్వం ప్రారంభమైంది. అది చివరికి ఓంకారంలోనే లీనమవుతుంది. ‘ఓం’ అని ధ్యానిస్తే పరమశివుడికి మోకరిల్లినట్లే!

సకల జీవులూ ఓం తోటలో పూచిన పుష్పాలు. ఓంకార వర్షంతోనే అవి పెరుగుతాయి. ఓంకార కాంతిలోనే అవి హాయిగా జీవిస్తాయి. ఓంకారం వాటికి ప్రాణవాయువు. వాటికి శక్తి, ధైర్యం, శాంతి ఓంకారమే. అందుకే అందరూ ‘ఓం’కారాన్ని శాంతితో జతచేస్తారు. శాంతిలో ‘ఓం’ చూస్తారు.

‘సమస్తం ఓంకారం నుంచే ఉద్భవించింది’ అంటారు కబీర్‌. దైవం ఓంకార ప్రేమ స్వరూపం. ఆయన రూప రహితుడు, నాశన రహితుడు, నిర్గుణుడు. ఆయనతో ఐక్యం కావడానికి యత్నించు. సమస్తమూ ఆయన ఆనందంలోనే ఉంది’ అని చాటిన కబీర్‌ మాటలు అక్షర సత్యాలు!స్వస్తి!
--((**))--

ప్రాంజలి ప్రభ - రోజువారి కధలు (4)
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

#ప్రపంచంఅంతాఒకనాడుభరతవంశానికిచెందినదే

(#దయచేసికొంచెంఓపికగాచదవండి.)



వేదాన్ని మన జాతి తన సంపదగా పరిరక్షించుకుంటూ వస్తుంది. మరి వేదాన్ని ఆచరించని పాశ్చాత్యుల విషయం ఏమి. మనం ఈనాడు చూస్తున్న ఇన్ని మతాలు ఎక్కడివి.



రామాయణ, భారత కాలాల్లో మతాలు అంటూ ఏమి లేవు. మతం అంటూ చెప్పాలంటే వైధిక మతం అని చెప్పాలి. కొందరు దాన్ని అచరించేవాల్లు. మరికొందరు పాటించనివారుండే వారు.



అయితే ఆ వేదాలని ఆచరించే వారిలో కూడా ఎన్నో శాఖలు ఉండేవి.



అయితే ఈ భూమిమీద ఉండే ప్రతి మానవుడూ భరత వంశంలోంచి వచ్చినవారే. ఈ విషయం శ్రీమద్భాగవతం అయిదవ స్కదంలో ఉంది.



ఈ భూమి సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం అంతా ఒకే భూ భాగం క్రింద ఉండేది ఒక నాడు. అందుకే సంధ్యా వందనాదుల్లో "చతుస్సాగర పర్యంతం" అని కనిపిస్తుంది మనకు.



సుమారు 100 కోట్ల సంవత్సరాల క్రితం నుండి విడిపోవడం ప్రారంభించినది.


సుమారు 50 లక్షల సంవత్సరాల కాలంగా మనం ఇప్పుడు చూస్తుండే ఖండంగా ఏర్పడ్డది.

మన పురాణాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అందుకే మన పంచాంగల్లో సృష్టి ఆది 198 కోట్ల 58 లక్షల సంవత్సరాలు అని ఉంది.

అమేరికాలోని చికాగో లో న్యాచురల్ సైన్స్ మ్యుజియంలో ఈ భూమి ఆకృతి 200 కోట్ల సంవత్సరాల క్రింద ఇలా ఉంది, 100 కోట్ల సంవత్సరాల క్రితం ఇలా అంటూ చూపిస్తూ 50 లక్ష్లల సంవత్సరాల క్రితంగా మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచ ఆకృతిని చూపించారు. వాటికి వారి వద్ద ఏ ఆధారాలు లేవు.

మనం కచ్చితంగా 198 కోట్ల సంవత్సరాలు అని చెప్పగల్గుతున్నాం. మన వద్ద గ్రహించిన విషయాన్నే వాళ్ళు తిరిగి ప్రపంచానికి తెలియజేస్తున్నారు మేం చెబుతున్నాం అన్నట్టుగా. వాళ్ళు ఇంతవరకే చెబుతున్నారు.

మన వద్ద ఇంతకు మించి ఆధారాలు కనిపిస్తున్నాయి.

ఈ భూమిని ఖండాలుగా విభజించిన " నాభి " అనే చక్రవర్తి ఉన్నాడు. భరత వంశానికి చెందిన వాడు. తన సంతానానికోసం ఇలా విభజించి మొత్తం తన వంశాలవారినే అన్ని ఖండాల్లో విస్తరించాడు. వారే ఒక రథాన్ని ఉపయోగించి భూభాగాన్ని జరిపారు అని తెలుస్తోంది.

మనం ఇప్పుడు చూస్తున్న ఆస్ట్రేలియా ఖండం ఒకనాడు భారతదేశపు ఆగ్నేయ భాగంలో ఉండేదని ఇప్పటి శాస్త్రవెత్తలూ అంగీకరిస్తారు.ఆస్ట్రేలియా లో ఉత్తర భాగంలో ఉన్న అడవులూ, పక్షులూ మన తమిళనాటి అడవులను, పక్షులను పోలి ఉంటాయి.

ఈ భూమి అలా క్రమేపీ జరుగుతూ ఉండటంచే అక్కడి పక్షులూ తమిళనాటికి వలస వస్తూ ఉంటాయి ఈ కాలం వరకు.

అక్కడ ఉన్న ఒకప్పటి వాళ్ళు మన దేశ తమిళనాటి వారిలాగే ఉంటారు. వారి భాష కూడా అట్లానే ఉంటుంది. అక్కడ ఉండే బంగారు నిధుల కోసం బ్రిటీష్ వారు అక్కడ కాలు పెట్టి వారిని నామ రూపాలు లేకుండా చేసారు.

ఇప్పుడు మనం అనుకుంటున్న అమేరికా కూడా అంతే. అక్కడి వారిని అనిచివేసి మేం అమెరికా అని ఈనాడు చెప్పుకుంటున్నారు.

అమేరికాలోని మనం ఈ నాడు కాలిఫోర్నియా కూడా మనం మన పురాణాల్లో చూడవచ్చు. మనకు సగర చక్రవర్తి కుమారులు కపిల మహర్షిని వల్ల కాలి బూడిదైపోతే భగీరతుడు గంగను రప్పించాడు అని మనకు తెలుస్తుంది. అయితే ఆ కపిల మహర్షి ఉన్న అరణ్యమే మనం ఇప్పుడు చూస్తున్న కాలిఫోర్నియా.

అదెలా అంటే, సంసృతంలో కొన్ని పదాలు వాటి స్వభావన్ని బట్టి అక్షరాలు మారుతాయి. హింస చేయునది సింహం అంటారు.

ఇక్కడ 'స' 'హ' అక్షరాలు మారాయి.అలాగే కపిలారణ్య లో 'ప''ల' అక్షరాలు తిరగరాస్తే క-లి-ప అరణ్య, అలా కాలిఫోర్నియా అయ్యింది.

ఆ నాడు భరత వంశానికి చెందిన వాళ్ళు ఈ భూమిని విభజించాక బర్డ్ ఐ వ్యూ ఎట్లా ఉందో మన పురాణాల్లో ఉంది. అదెలా అంటే ఒక కుందేలు తన కాల్లపై లేచి ఎదురుగా ఉండే గడ్డి పొదకై చూస్తున్నట్లుగా ఉందని మన పురాణాల్లో ఉంది.

మన పురాణాల లోనికి వారు వెల్లలేదు కనక ఈ విషయం పాశ్చాత్యులకి దొరకలేదు. లేకుంటే ఈ విశయాన్ని కూడా వాల్లే చెప్పే వాళ్ళు . ఈ చిత్రం మనం ప్రపంచ పటాన్ని తిప్పి చూస్తే కనిపిస్తుంది.

మొత్తం ఆసియా, యూరోప్ ఖండాలు గడ్డిగా, అమేరిక కుందేలుగా కనిపిస్తుంది. దక్షిణ అమేరికా కుందేటి తల, ఇక ఉత్తర అమేరికా ఆ కుందేటి పొట్ట భాగం. అందుకే కాబోలు ప్రపంచాన్నంతా దోచుకుతిన్నారు!! అమేరికాలో ఉన్న విలువైన బంగారం అంతా ఒక నాడు ఇక్కడి నుండి దోచుకున్నదే.

ఈ విషయం పక్కన పెడుదాం. ప్రపంచ పటాన్ని మేం తయారు చేసాం అని చెబుతున్న వాల్లకు ఇన్ని విషయాలు తెలియవు.

ఈ పాశ్చాత్యులు అలా చీలిన భూభాగాల్లో నివసించే వారిలో వేదాలని ఆచరించక బ్రతికేవాల్లలోకి చెంది ఉంటారు. భూమిని విభాగలుగా చీల్చిన వృషభుడి కుమారుడు భరతుడు. ఆయన తన నియంత్రణ కేవలం తన భూభాగానికే పరిమితం కాక పాలించేవాడు.

అందరూ ఆయన పేరు చెప్పుకొనే వారట, అందుకే భరతీయ అనే పేరు ఈ భూమి అంతటా ఉండేది. ఈ భరతుడు స్వాయంభువ మన్వంతరానికి చెందినవాడు. అయితే ఈ నాడు మనం శకుంతల కుమారుడు భరతుడు, అతని ద్వారా భారతదేశం అని చెప్పుకుంటున్నాం. ఈ భరతుడు వైవత్సువ మన్వంతరానికి చెందినవాడు.

దురదృష్ట కరం ఈనాడు మనం వాటి విలువను తెలియక మన పురాణలపై, ఇతిహాసాలపై ఏమాత్రం గౌరవంలేనివాల్లలా తయారయ్యాం. ఇవి వాస్తవం అని గుర్తించాలి.

--((**))--



ప్రాంజలి ప్రభ - రోజువారి కధలు (3)
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

జీవన్ముక్తి 

ఓరామచంద్రా ! హృదయమను బిలమున  చుట్టచుట్టుకొని గర్వపరవశమై ఉన్న మనస్సు అను మహాసర్పము ఎవనికి సంపూర్ణముగ నశించి పోయినో మరియు ఎవడు స్వస్వరూప అనుభూతి

పొందెనో అనగా ఆత్మానందమును పూర్తిగ అనుభవించినాడో అట్టి మహానిర్మలుడు అగు తత్వవేత్తకునమస్కరించు చున్నాను. మహా నరకము అను సామ్రాజ్యమున అభిషిక్తము లైనివియు, పాపములు అను మద గజములతో కూడి ఉండినవియు, ఆశలను బాణశకలాలచే పూర్ణమై ఉన్న ఇంద్రియములను శత్రువులను జయించుట మహాకష్టతరము. కళేబరమగు ఈ శరీరమున ఎవడు వివేకము అను ధనము కలిగి ఉండునో ఆతడు తన యందు ఉన్న
ఇంద్రియములు అను శత్రవులచే బంధిపబడడు. మనస్సును స్వాధీనపరుచుకొనిన వారును తమ శరీరమను పట్టణమునకు ప్రభువులై ఉండువారునగు మనుజులు ఎట్టి సుఖమును పొందుదురో అట్టి సుఖమును పామరులు పొందజాలరు. ఏకత్వమగు బ్రహ్మతత్వమును గూర్చిన అభ్యాసముచే మనస్సు  జయింపబడనంత వరకు అజ్ఞానమను గాడాంధకారమున హృదయవాసనలను బేతాళములు విజృభించుచునే ఉండును . అనగా కోరికలు పుట్టుచునే
ఉండును అని అర్ధము. 

ఓరామచంద్రా ! ఈ ప్రకారముగ అజ్ఞానము అను బురదచే విశేషముగ

కళింకతమై ఉన్న మనస్సు అను మణిని మోక్షసిద్ధి కొరకై వివేకము అను జలముచే బాగుగా కడిగి ప్రకాశవంతుడవు కమ్ము. అనగా జ్ఞానయుక్తుడువు కమ్ము అని అర్ధము. ఓరామచంద్రా! అనేక ఆపదలచే పరిపూర్ణములైనట్టి భయంకరములైన సంసారమునందు వివేకము లేనివాడివై
ప్రవర్తించకుము.మరియు పామరునివలె సంసారమందును వివశుడవై పడిపోకుము.
అనగా ఆత్మానందముతో ఉండుము అని అర్ధము.

--((**))--


ప్రాంజలి ప్రభ - రోజువారి కధలు (2)
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ:

శ్రీకృష్ణుడు నెమలి పించం ధరించడం వెనుక అసలు కథ
కృష్ణుడు అంటేనే లీలలు .. కృష్ణుడు ఎప్పుడు నెమలిపించం ధరించకుండా కనబడడు.. అసలు శ్రీకృష్ణుడు నెమలి పించం ఎందుకు ధరిస్తాడు ?
ఒక విశ్లేషణ నెమలి శారీరిక సంపర్కం చేయదు కాబట్టి:
ఈ సమస్త సృష్టిలో శారీరిక సంపర్కం లేకుండా సంతానం పొందగలిగేది ఒక్క నెమలి మాత్రమేనటుంది శాస్త్రం.

మగనెమలికి పించం ఉంటుంది. వర్షాకాలంలో గంభీరంగా ఉరుముతున్నప్పుడు పులకించిన మగనెమలి నాట్యం చేసినపుడు కంటి నుండి ఆనంద భాష్పాలు రాలుతాయి. ఆ సమయంలో మగనెమలి కంటి నుంచి పడే బిందువులను ఆడనెమలి వచ్చి త్రాగుతుంది. ఆ నీటిని త్రాగడం ద్వారా ఆడనెమలి సంతాన భాగ్యాన్ని పొంది గర్భం ధరిస్తుందట.


ఎటువంటి శారీరిక సంబంధం లేకుండా జరుగుతుంది ఈ ప్రక్రియ. శ్రీ కృష్ణుడు యోగి. ద్వాపరయుగంలో భూమిపై తిరగాడిన సిద్ధపురుషుడు. అటువంటి శ్రీ కృష్ణుడు తనకు అందరితో ఉన్నది ఆత్మ సంబంధమేనని, ఎవరితోనూ తనకు శారీరిక సంబంధం లేదని, తాను ఒక యోగినని తెలుపడానికే నెమలి పించం ధరించి కనిపిస్తాడు అని ఒక విశ్లేషణ.
మరో విశ్లేషణ బ్రహ్మదేవుడు నెమలికి ఇచ్చిన వరం:
ఒకానొక రోజు బ్రహ్మ లోకాన బ్రహ్మదేవుడు దీక్షగా కూచుని రకరకాల పక్షులను తీర్చిదిద్దుతున్నాడు. చిలకలు, పిచ్చికలు , గోరువంకలు, పాలపిట్టలు, పావురాలు ఇలా ఒక్కోదానికి ఒక్కొక్క పేరు ఖాయం చేస్తున్నాడు.

అన్ని పక్షులు చిన్న చిన్నవే అవుతున్నాయని అప్పుడు ఒక పెద్ద పక్షిని ఊహించి, తయారుచేయడం మొదలు పెట్టాడు. దాని రూపురేఖలు, రంగులు అన్నీ కొత్తగా దిద్దాడు. దానికి రెక్కలను చిన్నదిగా, చిత్రంగా అమర్చాడు. పొడవైన తోక పెట్టాడు. దానికి చిత్రాతిచిత్రమైన యీకలు సమకూర్చాడు. అది తలుచుకుంటే ఆ తోకను విసనకర్రలా విప్పాలి . అప్పుడు ఆ పక్షి ఆకర్షణీయంగా కనిపిస్తుంది అనుకున్నాడు .

ఇదంతా ఒక పక్కనుంచి గమనిస్తున్న సరస్వతీదేవి ఆ పక్షి అందచందాలకు చాలా మురిసిపోయింది. “దానికి మంచి నాట్యకౌశలం కూడా వుంటే, ఆ చక్కదనానికి మరింత శోభ చేకూరుతుంది” అని బ్రహ్మ కు సలహా ఇచ్చింది.

విద్యా బుద్ధులు అనేది నీపని, నువ్వే అనుగ్రహించాలి అని బ్రహ్మ అనగా, అనుగ్రహించి దానికి “నెమలి” అని పేరు పెట్టింది సరస్వతి. అంతే కాకుండా తన వాహనంగా స్థానం కల్పించింది.

నెమలి అందానికి, ఆటకి సార్ధకత చేకూరిందని బ్రహ్మ ఆనందించాడు. కానీ నెమలి ముఖంలో మాత్రం ఆనందం కనిపించలేదు. ఏమిటీ నీ కోరిక? అన్నాడు బ్రహ్మ .
ఒక్క బ్రహ్మ లోకానికే పరిమితం కావడమా? అని అడిగింది నెమలి
అయితే కుమారస్వామికి వాహనమై కైలాసంలో గెంతులు వెయ్యమని కటాక్షించాడు. నెమలి ఆ మాట వినగానే ఒక్కసారి పురివిప్పి ఆనందంతో నాట్యం చేసింది.
కొంత సేపు నాట్యం కాగానే నెమలి పించం ముడుచుకుంది. దానితో పాటు దాని ముఖమూ చిన్నపోయింది.
నీకు మళ్ళీ ఏమైంది? అన్నారు బ్రహ్మ మరియు సరస్వతి.
మరి విష్ణులోకంలో నా సంగతి తెలిసేదెలా? అని దీనంగా ముఖం పెట్టింది నెమలి తెలివిగా .
బ్రహ్మకు ఆ మాట వినగానే కోపం వచ్చింది. కాని నిదానించుకొని, ఎంతైనా తను ఏరికోరి తయారుచేసిన ప్రాణి కదా!

పైగా అది అనూహ్యంగా అద్భుతంగా కూడా తయారైంది. అందుకని తెలియకుండానే దాని మీద, మమకారం ఏర్పడింది.

అంతే కోపాన్ని అణచుకొని విష్ణులోకంలో కాదు కానీ, ద్వాపర యుగంలో ని నెమలి పించం కృష్ణుని తలపై కిరీటంలో నిత్యం రెపరెపలాడుతుంది. సరేనా!” అన్నాడు.
అప్పుడు నెమలి ముఖం దీపంలా వెలిగింది..


ఈ విధం గా బ్రహ్మ వారానికి ఫలితం గా ద్వాపరయుగం లో శ్రీకృష్ణుడు నెమలి పించం ధరిస్తాడని మరొక విశ్లేషణ.

--((**))--

ప్రభ - రోజువారి కధలు(1)
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ:


వాతావరణం బాగుంది. ఇంకా సూర్యుడు నిండుగా రాలేదు. కానీ చలిగా కూడా లేదు.

చలిలో తిరిగితే నాకు ఆయాసం వస్తుంది. అందుకే నాకు తెల్లవారుజామునే మెలుకువ వచ్చినా, ఏడింటికి వరకు ఇంటి బయటకు రాను. చలి తగ్గగానే, మా అపార్ట్ మెంటు బిల్డింగ్ గేటు దాటి ఇందిరా పార్కు వైపు నడక సాగించాను.

చిన్నప్పుడు పార్కులో ఎక్కువ సేపు ఆడుకుంటే మా నాన్న తన్నేవాడు. ఇప్పుడేమో, 'ఎప్పుడూ ఇంట్లో కూర్చోకండి. పొద్దున్నపూట తప్పనిసరిగా నాలుగు కిలోమీటర్లు నడవండి. మధ్యాహ్నం, రాత్రి భోజనం తిన్న తర్వాత కూడా వెంటనే పడుకోకుండా కాసేపు బయట తిరిగితే మంచిది' అని డాక్టర్లు చెప్పడంతో, ఉదయం, రాత్రి నడక అలవాటు చేసుకున్నాను.

ఇందిరా పార్కులో కొన్ని రోజుల్లోనే మాకొక గ్రూపు తయారయింది. అందరం రిటైరైనవాళ్ళమే. వాళ్ళందరినీ కలిస్తే చాలా ఉత్సాహంగా ఉంటుంది. అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తాము. ఉదయం పూట ఇందిరా పార్కు మహా సంరంభంగా ఉంటుంది. ఏదో పెళ్ళికో,  పండగరోజున గుడికి వచ్చినట్టుగానో వేలాది మంది హడావుడిగా నడుస్తుంటారు.

ఇందిరా పార్కు ఉదయం పూట ఒక చిన్న సైజు సూపర్ మార్కెట్టులా ఉంటుంది. పళ్ళూ, కూరగాయలూ, రకరకాల సూప్స్, బట్టలూ అమ్మే సమస్త దుకాణాలు ఉంటాయి. కానీ,  పదింటికల్లా నిర్మానుష్యమై పోతుంది.

మా గ్రూపులో నాతో పాటు రెడ్డి, రాజారావు, పద్మనాభం, శేషగిరి, రామ్మూర్తి మెంబర్లు ఉన్నారు. ఒక్కోరోజు మా గ్రూపులో ఉన్న మితృలకు తెలిసిన మితృలు కూడా కలుస్తుంటారు.

మేము చివరగా పార్కు మధ్యలో ఉన్న వినాయకుడికి దండం పెట్టుకుని నడక ముగించి, ముఖద్వారం దగ్గరున్న మెట్ల మీదనో, బెంచీ మీదనో కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటుంటాము.

మా మాటల్లో ఎక్కువగా రాజకీయాలు, మేము చేసిన ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు దొర్లుతుంటాయి. ఎప్పుడైనా ఆరోగ్యం గురించిన ప్రస్తావన వస్తే, అందరి మనసులూ భారమౌతాయి.

మా గ్రూపులో డెభ్భై ఏళ్ళు దాటిన వాళ్ళు ఇద్దరున్నారు. ఆరోగ్యం గురించి మాట్లాడగానే, అందరి దృష్టి వాళ్ళ మీదనే పడుతుంది. వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఈ వయసులో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేము. ఆ భయం మా అందరిలోనూ అంతర్లీనంగా ఉంది.

ఒక్కొక్కరోజు నడక ముగిసిన తర్వాత విడిపోతుంటే, మా ఆరేడుగురిలో మరునాడు ఏ ఒక్కరైనా మిస్ అవుతారేమోనని;  మరునాడు పేపర్లో 'నిర్యాణం' కాలంలో ఫోటో వస్తుందేమోనని లేదా ఏ వారం రోజులకో, 'దశదిన కర్మ' కార్డు వారి మరణ సందేశం మోసుకొస్తుందేమోనన్న ఒక అదృశ్యపు సందేహపు మొలక మా మనసు పొరల్లో ప్రతీరోజూ ప్రాణం పోసుకుంటూనే ఉంటుంది.

మా మధ్య కుటుంబ స్నేహాలు లేవు కాబట్టి మా పరిచయాలు నడక వరకు మాత్రమే పరిమితం. తరువాత ఎవరి జీవితాల గురించి, ఎవరికీ తెలియదు కాబట్టి ఒక్కోసారి మరణ వార్త తెలియదు కూడా.

ఇంతలో రమణ అనే మితృడు మా గ్రూపులోకి వచ్చి చేరాడు. ఒక జాతీయ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజరుగా ఈ మధ్యనే రిటైరయ్యాడు.

రమణ రాకతో మా గ్రూపు రూపురేఖలే మారిపోయాయి. రమణ మాటల పుట్ట. ఎన్నో విషయాల గురించి అనర్ఘళంగా మాట్లాడేవాడు. అప్పటివరకు పైపైన, పలుచగా ఉన్న మా స్నేహం అతని రాకతో చిక్కబడింది, గాఢంగా మారింది.

అసలు ఆయన చెబితేనే గానీ ఆయన రిటైరయ్యాడని నమ్మలేం. స్లిమ్ గా, లేటెస్ట్ మాడల్ రీబాక్ షూ, కళ్ళకు గాగుల్స్, ఒంటి మీద నుండి తేలుతూ వచ్చే కమ్మనైన సెంటు మధురిమలతో కులాసాగా ఉంటాడు. ప్రతీరోజూ తన ఇన్నోవా క్రిస్టా కారులో పార్కుకు వస్తాడు.

రమణ వచ్చిన తర్వాత నడక పూర్తి కాగానే మమ్మల్ని తన కారులో ఎక్కించుకుని రోజుకో హోటలుకు తీసికెళ్ళి కాఫీ, టిఫిన్లు ఇప్పించేవాడు.

పరిచయమైన మొదటి రోజు సాయంత్రమే పళ్ళబుట్ట పట్టుకుని మా ఇంటికి వచ్చాడు. మా ఆవిడతో 'అక్కయ్యా' అని వరస కలిపి క్లోజ్ అయిపోయాడు. మా కోడలితో ముచ్చట్లు పెట్టాడు. ఆరునెలల వయసున్న మా మనుమణ్ణి ఎత్తుకుని వాడి చేతిలో ఐదువందల నోటు పెట్టాడు.

'బయటకు వెళ్దాం పదమని' నన్ను బలవంత పెట్టాడు. కారు తిన్నగా క్రిస్టల్ బారు ముందు ఆపాడు. రమణని చూడగానే, గుమ్మంలో ఉన్న 'వాలె' పార్కింగ్ బాయ్ నుంచి లోపల స్టీవార్డ్ వరకూ ఆప్యాయంగా విష్ చేయడం చూసి నేను విస్తుపోయాను.

నేను మొహమాటపడుతుంటే,

"ఫర్వాలేదు సార్! రెండు పెగ్గుల విస్కీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. హెచ్డీయల్ కొలెస్టరాల్ పెరుగుతుంది. గుండె గట్టి పడుతుంది!" అంటూ బుజ్జగించి మందు పోయించాడు. రెండు పెగ్గులు కాగానే ముగించాడు. అందరికీ భారీగా టిప్పులు ఇచ్చాడు.

రమణ కారు దిగగానే, రోజూ 'వాలే' బాయ్, రమణ డ్రైవరుకు ఫోన్ చేస్తాడంట. అందుకే మందు తాగి బయటకు రాగానే, కారు దగ్గర నిలబడిన డ్రైవరుకు, రమణ మా ఇంటి అడ్రస్ చెప్పాడు. నన్ను ఇంటి దగ్గర దించి, 'గుడ్ నైట్' అని చెప్పి వెళ్ళిపోయాడు.

చాలా రోజుల తర్వాత నాకు ఆ సాయంత్రం సంతోషంగా గడిచినట్టనిపించింది. హాయిగా నిద్రపోయాను. కలలో రమణ ముఖమే కనిపించింది.

మరునాడు, అందరం కలుసుకున్నాం. రమణతో గడిపిన సాయంత్రం గురించి చెప్పుకున్నాము. రమణ మా వాకర్స్ గ్రూపులోని అందరి ఇళ్ళకు వెళ్ళాడు. నన్ను తోడు రమ్మంటే నేను కూడా వెళ్ళాను. ఎవ్వరింటికి వెళ్ళినా అక్కడ నవ్వుల పువ్వులు పూయించేవాడు.

అలా ఒక నెలరోజుల్లో రమణ మా అందరి ఇళ్ళకు వచ్చాడు. అందరిని పిలిచి వాళ్ళ ఫార్మ్ హౌజులో వన భోజనాలు ఏర్పాటు చేసాడు.

డిసెంబర్ నెలలో తన కారులోనే గోవా ట్రిప్ ప్లాన్ చేసాడు. మేమందరం వెళ్ళడానికి సిద్ధమే అయినా, అంత ఖర్చు అతనితో పెట్టించడం బాగుండదని తలా కొంత కంట్రిబ్యూట్ చేస్తామని చెప్పాము.

"ఏం ఫర్వాలేదు సార్! డబ్బుల విషయాలన్నీ గోవా నుండి వచ్చాక చూసుకుందాం!" అని అన్ని ఖర్చులు తనే పెట్టుకున్నాడు. గోవాలో మా కోసం ఒక పెద్ద బంగళా రిజర్వ్ చేసాడు. డిసెంబర్ నెలలో గోవాలో అంతా పండగ వాతావరణం ఉంది. పడుచు జంటల కోలాహలంతో, ఒక సీతాకోకచిలుకల వనంలా ఉంది.

మేమంతా కొంచెం మొహమాట పడుతుంటే, రమణే,

"సార్! మనం ఉద్యోగం నుండి మాత్రమే రిటైరయ్యాము. జీవితాల నుండి కాదు. అందరూ 'శేషజీవితం' అంటూ మనకు వీడ్కోలు పలుకుతూ అంటారు. కానీ… నిజంగా మనది శేష జీవితం కాదు. బరువులు, బాధ్యతలు లేని చిన్న పిల్లవాడి లాంటి 'విశేషజీవితం' మనది. మనముందు ఇంకా చాలా జీవితం ఉంది. అందుకే, మరణించేవరకు జీవించాలి,
హాయిగా గడపాలి !" అని మమ్మల్ని ఉత్సాహపరిచాడు.

దాంతో, అక్కడి యౌవ్వనపు వాతావరణం చూస్తుంటే మాక్కూడా హుషారు పుట్టుకొచ్చింది. మేము రిటైరయిన వృద్ధులమన్న విషయమే మరిచిపోయి, కేరింతలు కొడుతూ బీచుల్లో సరదాగా గడిపాము.

నాలుగు రోజుల తర్వాత హైదరాబాదుకు తిరిగొచ్చాము. నాకైతే, ఈ గోవా ట్రిప్పు బాగా నచ్చింది. శరీరం, మనసూ రిజొవనేట్ అయి, పునరుజ్జీవనం పొందినట్టయింది. అంతకు ముందులాగా నిస్తత్తువగా, నిరాసక్తంగా కాకుండా జీవితం కొత్త అందాలతో కనిపించసాగింది.

రెండు రోజుల విరామం తర్వాత, ఇందిరా పార్కుకు వెళ్ళాను. ఆ రోజు రమణ రాలేదు. బహుశా అలసట తీరలేదేమోననుకుని, ఫోన్ చేసాను.

ఫోన్ లో వాళ్ళబ్బాయి చెప్పిన వార్త విని మ్రాన్పడిపోయాను.

అందరం కలిసి రమణ ఉన్న హాస్పిటలుకు పరుగు పరుగున వెళ్ళాము.

"గోవా నుండి వచ్చిన రోజు తెల్లవారుఝామున తీవ్రమైన గుండె పోటు వచ్చిందనీ, వెంటనే హాస్పిటలుకు తీసుకు వస్తే రెండు స్టెంట్లు వేసారని, ఇప్పుడు బాగానే ఉన్నారని" వాళ్ళబ్బాయి చెప్పాడు.

మేమందరమూ తీవ్ర దుఃఖంతో బయటకు నడిచాము. నేనైతే ప్రతీరోజు హాస్పిటలుకి వెళ్ళి రమణని కలిసేవాణ్ణి. కొంత కోలుకోగానే రమణలో మళ్ళీ అదే హూషారు కనిపించింది.

రెండు నెలల తర్వాత రమణ ఇందిరా పార్కుకు, వాకింగుకు వచ్చాడు. నడక పూర్తయిన తర్వాత, పార్కు బయట టీ తాగుతూ,

"సర్దేసుకున్నాను బాస్!" అన్నాడు నవ్వుతూ. మాకర్థం కాలేదు. మళ్ళీ ఏదైనా ట్రిప్పుకు కు ప్లాన్ చేస్తున్నాడేమోననుకుని,

"ఈ సారి ట్రిప్ ఎక్కడికి?" అని అడిగాను నేను కుతూహలంగా.

రమణ నవ్వుతూ,

"బాస్! ఈ సారి ట్రిప్ అంటూ వేస్తే, అది పైకే! అందుకే అన్నీ సర్దేసుకున్నాను. అన్ని బాకీలు తీర్చేసుకున్నాను. ఈ జీవితం ప్రసాదించిన అందమైన మధురస్మృతులన్నీ మూటకట్టి మనో మంజూషలో దాచుకుని, మిగిలినవన్నీ వొదిలించుకున్నాను. ఆత్మీయులందరినీ కలిసి నా జీవితాన్ని ఇంత అందంగా మలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేసాను. నా వల్ల కష్టం కలిగిన వాళ్ళందరినీ;  తెలిసో తెలియకో, ఉద్యోగ ధర్మం మీరలేకో నా వల్ల నష్టం కలిగినవారందరినీ కలిసి సారీ చెప్పాను. మనస్ఫూర్తిగా క్షమాభిక్ష కోరాను. నాకు నష్టం కలిగించినవారిని, నన్ను నమ్మించి మోసం చేసినవారిని కూడా కలిసి, వాళ్ళను కూడా క్షమించేసాను. ఇంకా ఒకరిద్దరిని కలిసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను.

అందుకే, మీ అందరికి కూడా థ్యాంక్స్ చెబుదామనే వచ్చాను. గత కొద్ది నెలలు, మీరందరూ నాకు ఆనందాన్ని పంచారు. థ్యాంక్యూ వన్స్ అగైన్!

ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఏ కోరికలు లేవు. ఏ అసంతృప్తి, నిరాశానిస్పృహలు లేవు. ఒక అలౌకిక ఆనందంలో మునిగి తేలుతున్నాను.

ఐయాం రెడీ ఫర్ హిస్ కాల్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ కాబట్టి, జీవితాంతం ఆరాటంతో సంపాదించిన వస్తువులనన్నింటినీ వదిలించుకుని నా భౌతిక జీవితాన్ని శుభ్రపరుచుకున్నాను. ద్వేషాన్ని, కోపాన్ని అసంతృప్తిని వీడి ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాను. దీన్నే 'డెత్ క్లీనింగ్' (Death Cleaning) అంటారని, ఈ మధ్యనే ఒక వాట్సప్ మెసేజ్ లో చదివాను. నేను డెత్ క్లీనింగ్ చేసుకుని సిద్ధంగా ఉన్నాను. అంత మాత్రాన నేను ఇవ్వాళ్ళో రేపో చనిపోతానని కాదు. కానీ, ఈ గుండె ఉంది చూసారూ... ఎప్పుడేం చేస్తుందో చెప్పలేము." అంటూ వీడ్కోలు తీసుకున్నాడు.

+++

అదే చివరిసారిగా రమణని చూడడం. 'గోవా' ట్రిప్పు ఖర్చు బాకీ తీర్చే అవకాశమే లేకుండా పోయింది మాకు. మరో జన్మంటూ ఉంటే మమ్మల్ని మళ్ళీ కలపడానికి ఋణశేషం మిగిలే ఉంది.

ఇప్పుడు నేను ఇందిరా పార్కుకు ఎక్కువగా పోవడం లేదు. నేను కూడా 'డెత్ క్లీనింగ్' పనిలో ఉన్నాను.

+++

దీపావళి పండగ రోజు గుడికి  వెళ్ళే హడావుడిలో ఉండి మా కోడలు,

"అత్తయ్యా! అన్నీ సర్దుకున్నారా?" అని అడగడం వినిపించింది.

ఆ ప్రశ్న వినగానే మా ఆవిడ తన చీరె కొంగుతో కళ్ళొత్తుకోవడం, నేను దూరం నుండి చూస్తూనే ఉన్నాను. ఈ రోజంతా ఉదయం నుండీ తను అలాగే, దిగులుగా, ముఖానికి మబ్బులు కమ్మినట్టుగా ఉంది. దానికి కారణం కూడా నాకు తెలుసు.

నేను ఫోన్ తీసి చూసాను. ఆ మబ్బుల్లో నుంచే మొలిచిన హరివిల్లు ఆమె ముఖంలో విరిసే క్షణం ఇంకెంతో దూరం లేదు. నాకు తెలుసు, ఎందుకంటే......

+++

నేను ఎప్పటిలాగానే, ఇంకా కొంచెం ముందుగానే, మా ఆవిడకు ఇందిరా పార్కకు వాకింగుకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటపడ్డాను. నా చేతిలో ఎప్పుడూ ఉండే చిన్న బ్యాగు తప్ప మరేం లేదు. బయటకు రాగానే, నేను బుక్ చేసిన  క్యాబ్ నంబరు సరి చూసుకొని కారులో ఎక్కాను.

ఇందిరా పార్కుకు అని నా భార్యకు చెప్పిన నేను పది గంటలకల్లా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ రెండులో దిగాను. క్యాబ్ బుక్ చేసి, అది వొచ్చేలోగా, రెస్ట్ రూములోకి వెళ్ళి ఫ్రెష్ అయి, బ్యాగులో నుంచి తీసిన టై కట్టుకుని, కోట్ వేసుకుని క్యాబ్ వాడు ఫోన్ చేయగానే వెళ్ళి కారులో కూర్చున్నాను.

నా మనసు చాలా ఉద్విగ్నంగా ఉంది. దాదాపు పదేళ్ళ తర్వాత నేను నా కూతురును చూడడానికి వెళ్తున్నాను. ఈ రోజు సోమవారం. అల్లుడికి ఆఫీసు ఉంటుంది. అమ్మాయి మాత్రం 'వర్క్ ఫ్రం హోం' చేస్తుంది. దాని కూతురు, ఎనిమిదేళ్ళ మైత్రేయి ఖాన్, నాలుగేళ్ళ మనుమడు సలీం శాస్త్రి స్కూలుకు వెళ్ళి ఉంటారు.

మా అమ్మాయి చందన మా అభీష్టానికి వ్యతిరేకంగా ఒక ముస్లిం కుర్రాడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. మమ్మల్ని అనుమతి అడిగితే మేము నిరాకరించాము. తను వినలేదు. ఒకరోజు ఆఫీసుకు వెళ్ళిన చందన తిరిగి మా ఇంటికి రాలేదు.

ఆ రోజు రాత్రి పదకొండింటికి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి తనూ, సలీంఖానూ పెళ్ళి చేసుకున్నామని చెప్పింది. నా భార్య విభ్రాంతికి గురయింది. ముందు ఏడ్చింది. తర్వాత వాళ్ళను ఇంటికి రమ్మని చెప్పింది. నాన్న పిలిస్తే వస్తానంది. నా భార్య నా వైపు దీనంగా చూసింది. నేను పిలవలేదు. తను రాలేదు. పది సంవత్సరాలు గడిచిపోయాయి. ఇద్దరు పిల్లలు పుట్టారనీ, అతగాడికి ఢిల్లీ సెక్రెటేరియట్లో పెద్ద పదవి వచ్చిందన్న విషయాలు తెలుస్తూనే ఉన్నాయి.

నేను గుండె రాయి చేసుకుని  బతుకుతున్నాను. కానీ, ఎక్కడ ఒక చక్కని భార్యాభర్తల జంట, ఇద్దరు పిల్లలతో కలిసి నడుస్తున్న దృశ్యం కనపడ్డా గుండెలో కలుక్కుమంటుంది. ఆ రోజు నా చందనను మన్నించి, నేనెందుకు పిలవలేదానన్న ప్రశ్న నన్ను చిత్రవధకు గురిచేస్తుంది.

ఇన్నాళ్ళూ ఈ బాధను, భారాన్నీ గరళ కంఠుడిలా దిగమింగుకుంటూ జీవిస్తున్నాను. నా భార్య, నా భుజం మీద వాలి తనివితీరా ఏడ్చి తన భారాన్ని దించుకుంటుంది. మగవాడినైన నాకా అదృష్టం లేదు.

అయితే, రమణ చివరిసారిగా కలిసి 'సర్దుకున్నాను బాస్!' అని చెప్పిన కొన్నాళ్ళకే చనిపోవడంతో నాలో భయం మొదలైంది. నేను కూడా అన్నీ సర్దుకోవాల్సిన ఆవశ్యకత ఆసన్నమైందని గుర్తించాను.

నేను సర్దుకునే సామాను ఢిల్లీలో ఉందని నాకర్థమయ్యింది. వెంటనే, అభిఙ్ఞవర్గాల ద్వారా, అంటే ఎవ్వరికీ చెప్పకూడదని ఒట్టేయించుకుని, మా అబ్బాయి ద్వారా చందన ఇంటి అడ్రస్, ఫోను నెంబర్లు, మిగిలిన వివరాలు సంపాదించాను. వాడే నాకు ఢిల్లీకి టిక్కెట్లు బుక్ చేసాడు. వాడు అక్కతో టచ్ లోనే ఉన్నట్టుంది.

చందనను సర్ప్రైజ్ చేద్దామని వెళ్తున్నాను కానీ అక్కడ ఎటువంటి స్వాగతం ఎదురవుతుందోనని కొంచెం గాభరాగానే ఉంది. ఒక వేళ అల్లుడు ఆఫీసుకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాడేమో, ఒకవేళ వాళ్ళు ఇల్లు మారి ఉంటారేమో లేక ఏదైనా ట్రిప్పుకు వెళ్ళి ఉంటారేమోనన్న సవాలక్ష ప్రశ్నలు నన్ను వేధిస్తున్నప్పటికీ, ఏదైతే అదవుతుందని, మనసును నిబ్బర పరుచుకుని, ఢిల్లీ వీధులను చూస్తూ కూర్చున్నాను.

ముప్పావు గంట తరువాత, నేను దిగాల్సిన సమయం ఆసన్నమయింది. అల్లుడు పెద్ద ఆఫీసరేమో కాబోలు, పెద్ద క్వార్టర్ ముందర నిలబడ్డాను. గేటు తీసుకుని లోపలికి వెళ్ళి బెల్ మోగించాను. అది నా గుండెల్లోనే మోగినట్టుగా అనిపించింది.

తలుపు తెరిచిన నా కూతురు నన్ను చూసి ముందు ఒక్క క్షణం గుర్తు పట్టక "కౌన్...?" అని అనబోయిందల్లా నన్ను తేరిపార చూసి,

"నాన్నా...! నాన్నా..! మీరూ..!" అంటూ మాటలు రాక నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను పదేళ్ళ పాటు కనీసం చూసుకోలేని దురదృష్టానికి చింతిస్తూ, దుఃఖిస్తూ నేను నిలబడ్డాను.

ఏడుస్తున్న నన్ను చూసి, నా చందన, కంగారుగా,

"నాన్నా! ఏమైంది నాన్నా!" అంటూ నన్ను కౌగలించుకుంది. నేను ఒక అపురూపమైన ఆత్మీయ ఆలింగనంలో, నోటమాట రాక నిలబడిపోయాను.

ఆ అలికిడికి, లోపలి నుంచి ఎవరో వచ్చారు.

"మేరా బాబూజీ! కాఫీ బనావో!" అని చెప్పి నా చేతులు పట్టుకుని లోపలికి నడిచింది.

ఒక్క క్షణం నిలబడి, నా కూతురిని చూసుకున్నాను. ఇరవయ్యేళ్ల వయస్సులో మమ్మల్ని వదిలిన చందన ఈ పదేళ్ళలో, సంపూర్ణ మహిళగా రూపాంతరం చెందింది. కొంత పెద్దరికం వచ్చినట్టుగా, మరింత అందంగా తయారయింది.
మన పిల్లలు మనకు ఎప్పుడూ అందంగానే, అపురూపంగానే కనిపిస్తారు కదా!

"ఏంటి నాన్నా! అలా చూస్తున్నావ్?" అని అడిగితే,

"పదేళ్ళయ్యింది కదమ్మా! తనివితీరా చూసుకుంటు... " అని అంటుండగానే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

"ఏమయింది నాన్నా! అందరూ బాగున్నారా? అమ్మ బాగుందా?" అని ఆదుర్దాగా ప్రశ్నించింది.

"చందూ! నన్ను క్షమిస్తావా తల్లీ!" అని అడిగాను.

"అయ్యో! అదేంటి నాన్నా! నిన్ను నేను క్షమించడమేంటి? మీరే నన్ను క్షమించాలి!" అంటూ నా చేతులు పట్టుకుంది.

పరస్పరం క్షమించేసుకున్నాము. తరువాత సంఘటనలు చకచకా జరిగిపోయాయి. నేను వచ్చానని చందన చెప్పగానే, అల్లుడు భోజనానికి మధ్యాహ్నం ఇంటికి వస్తున్నానని చెప్పాడు. కారు డ్రైవరును పంపించి మనుమణ్ణి, మనుమరాలిని స్కూలు నుండి పిలిపించింది. వాళ్ళను చూసి నా కళ్ళు చెమర్చాయి. వాళ్ళ జీవితాల్లో పదేళ్ళ పాటు అమ్మమ్మ, తాతయ్యల ప్రేమ లేకుండా చేసిన దుర్మార్గుణ్ణనిపించింది. భోజనాలయ్యాక, అల్లుడు ఆఫీసుకు వెళ్తుంటే,

"ఇంటికి రండి అల్లుడు గారూ!" అన్నాను.

"ష్యూర్! మీరెప్పుడు పిలుస్తారా అని చందూ ఎదురు చూస్తుంది." అన్నాడు.

సాయంత్రం హైదరాబాదు తిరుగు ప్రయాణం అయ్యాను. అమ్మాయి, మనుమడు, మనుమరాలు టాటా చెప్తుంటే, తృప్తిగా ఏర్ పోర్టులోకి నడిచాను.

పదింటికి ఇంటికి చేరిన నన్ను చూసి,

"ఎటు వెళ్ళారండీ! పొద్దటి నుంచి ఫోన్ కూడా కలవడం లేదు. ఎంత కంగారు పడ్డానో తెలుసా!.... " అని నా భార్య చివాట్లు పెడుతుంటే, కమ్మగా అనిపించింది.

+++

దీపావళి రోజే మా అమ్మాయి చందన పుట్టినరోజు. అందరూ మహాలక్ష్మి పుట్టిందన్నారు. ఆ మహాలక్ష్మే, పదేళ్ళ తర్వాత మళ్ళీ ఈ రోజు మా ఇంట అడుగుపెట్టబోతుంది. శంషాబాద్ ఏరుపోర్టులో దిగగానే చందన ఫోన్ చేసింది. అందుకే, ఇప్పుడో మరో క్షణంలోనో....

ఇంతలో, "అమ్మా!" అని చందన పిలుపు వినబడగానే, నా భార్య ముఖంలో సప్తవర్ణాల ఇంద్రధనస్సు వింతగా మెరిసింది.

+++

నేను కూడా అన్నీ సర్దేసుకున్నాను.

+++

#PS కథ మీకు నచ్చితే, మీ గ్రూపుల్లో షేర్ చేస్తే మరింత మందికి చేరే అవకాశం ఉంటుందని మనవి.

మన పెద్దాలు భార్యాభర్త ల సంసారా భధ్యత లు ను జొడెడ్ల బండి తో పోల్చరూ.....ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు ....ఒకరి కి ఒకరు కట్టె కాలే వరకు ....వెనుక ముందు అంతే ... పాల నుండీ పెరుగు తరువాత మజ్జిగ, వెన్న నుండి నేయి.... 

మన జీవితం కుడా ఈ చిన్న కధ లోనే ఇమిడి ఉంది,  నిశితముగా పరిశీలిస్తే .. ఎలా అంటే మగవాడు మరిగిన పాలు చల్లారి గొరువెచ్చని .... పాలు లాంటి మగని కి తోడు అంటూ మజ్జిగ అనే మగువను చేరిస్తే చక్కటి చిక్కటి గడ్డ పెరుగు లాంటి మంచి సంసారం మొదలైంది. 

 ఈ చక్కని చిక్కని సంసారం చిలికితేనే మజ్జిగ,వెన్న అనబడే చిట్టి పిల్లలు, సిరి సంపదలు .ఆలుమగలు కరిగి .. మధుర మైన నేతి గా మారి వారి ఆ నేతి తో పిల్లలకూ బంగారూ భవిష్యత్తు తీర్చి దిద్ది ....  కడకు కాటి కి ఆవిరి అయి ఈ లోకం నుండీ ఆవిరి గాల్లో కలిసి పోయి ఎగసి పోతారూ..... చూసారా...తరిచి..తెరచి చూస్తే .... జీవితం ఎంతా చిన్నాదో ....ఏన్ని అరాటాలు ...ఎన్ని ...పోరాటాలో....

దానికి నీవు తగవు 







1 కామెంట్‌: