2, ఫిబ్రవరి 2022, బుధవారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము-- 601- 650

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

601 నామ మంత్రము 26.2.2022

ఓం దరాందోళిత దీర్ఘాక్ష్యై నమః

కొంచము చంచలత్వము, సోగగా,విశాలంగా, మనోహరంగా, చెంపకు చేరెడుగా ఉన్న నేత్రములతో భాసిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితాసహస్రనామావళి యందుగల దరాందోళితదీర్ఘాక్షి అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం దరాందోళిత దీర్ఘాక్ష్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత వినమ్రతతో జగన్మాతను ఉపాసించు ఉపాసకుడు బ్రహ్మానందము, ఆత్మానందము ఏర్పడి ఆ తల్లి అనుగ్రహముతో జన్మరాహిత్యము కలిగి తరించును.

ఇంతకు ముందు వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభ లోచనా యను (18వ) నామ మంత్రమునందు జగన్మాతను స్తుతించాము.  ముఖకాంతి అనే సౌందర్యప్రవాహములో చలించున్న మీనములుగా ఆ శ్రీమాత నయనములు ఉన్నవి యని యన్నాము. ఇప్పుడు ఈ నామ మంత్రములో కొంచముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు కలిగినది అని చెప్పాము అంటే ఆ తల్లి నయనసౌందర్యాన్ని మరొకసారి స్మరణం చేసుకుంటూ తరించాలని భావము. లోలాక్షీ కామరూపిణీ  యను (454వ) నామ మంత్రములో కామస్వరూపిణియై (భక్తల కామితార్థములను) తీర్చేవిగా, కామేశ్వరునికి అనురాగప్రదాయమైనవిగా ఉన్నవని శ్రీమాతను స్తుతించాము. 

ఇప్పుడు దరాందోళితదీర్ఘాక్షీ యని ఈ (601వ) నామ మంత్రములోను స్తోత్రం చేస్తున్నాము అనగా ఆ పరమేశ్వరి చంపకుచారెడు కళ్ళు ఉన్న దీర్ఘాక్షి గాను,  ఇటునటు త్రిప్పు చూపులతో చంచల స్వభావము గలిగిన కనులు గల చంచలాక్షి గాను, తనను ఆర్తితో ఆశ్రయించే భక్తుల భయాన్ని  పోగొట్టి కామ్యములను తీర్చే కామాక్షి గానూ ఆ  దరాందోళితదీర్ఘాక్షి యైన పరమేశ్వరిని దరాందోళితదీర్ఘాక్షీ యను నామ మంత్రముతో  ఆ త్రినేత్రిని కీర్తించుచున్నాము.  త్రినేత్రి యయిన ఆ పరమేశ్వరి త్రినయనా యను (453వ) నామ మంత్రములో కూడా స్తుతింపబడినది. ఈ మూడు కన్నులు తేజోమూర్తులనబడిన

సూర్య, చంద్ర, అగ్నులకు తేజస్సు ప్రసాదించుచున్నవి, భూత, భవిష్యద్, వర్తమాన మూడు కాలములకు ప్రతీకలై యున్నవి, పగలు, సంధ్య, రాత్రులు అను కాలగమన సూచికలై విరాజిల్లుచున్నవి.

భక్తులు ఆచరించే పూజలు, యజ్ఞములు, స్తోత్రపారయణములు చకచకా ఇటునటు కదులుతూ, వీక్షిస్తూ, దీర్ఘముగా చెవులవరకూ వ్యాపించి పరమేశ్వరికి చెవిలో తాము వీక్షించినవి వీక్షించినట్లుగా విన్నవిస్తున్నట్లున్నవి ఆ నయనములు.

అటువంటి దరాందోళిత దీర్ఘాక్షియైన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం దరాందోళిత దీర్ఘాక్ష్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

635వ నామ మంత్రము 1.4.2022

ఓం గౌర్యై నమః

శంఖము, బంగారము, చంద్రుడు - ఈ మూడువర్ణముల సమ్మిళిత వర్ణమైన గౌర వర్ణపు మేని ఛాయతో శోభిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి గౌరీ అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం గౌర్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు ఆ పరాశక్తి కరుణతో మధుర భాషణా చతురులై, పలువురి మన్ననలందుతూ, కీర్తిప్రతిష్టలతో బాటు, సుఖసంతోషములు, సిరిసంపదలతో జీవనము కొనసాగిస్తూ, అమ్మవారి పాదసేవలో కూడా తరిస్తారు.

శైలపుత్రి, శైలేంద్ర, పార్వతి, హైమవతి యనునవి ఆ పరమేశ్వరికి గల అనేక నామములలో కొన్ని. ఆమె శైలపుత్రి అనడానికి పౌరాణిక గాథ గలదు. నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రీ దుర్గా పర్వతరాజు హిమవంతుని కుమార్తె. తపస్సు ఆచరించిన ఆమె శివుణ్ణి భర్తగా పొందింది.  

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రీ దుర్గా దేవి వృషభవాహనంపై తిరుగుతుంది. కుడిచేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి, ఎడమచేతిలో కమలం పట్టుకుంటుంది. పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతిదేవి. తండ్రికి ఇష్టం  లేకపోయినా నిత్య  శివకుటుంబిని అయిన అమ్మవారు శివుణ్ణి  వివాహం చేసుకుంటుంది. ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు పెద్ద  యజ్ఞం తలపెట్టి, శివుణ్ణీ, సతీదేవినీ ఆహ్వానించడు. పుట్టింటిపై  ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు. నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైన నాశనమవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికిస్తూ, అవమానభారంతో కాలిగోటితో అగ్నిని సృజించి, అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి. తనను దాక్షాయణీ పేరుతో కీర్తించవద్దనీ, అలా పిలిచినపుడు వెంటనే దక్షయజ్ఞ వినాశినీ అని పిలవాలనీ శాసించి అంతర్ధానమవుతుంది. ఆ తరువాత తిరిగి శివుడిని వివాహం చేసుకునేందుకు, మేనకా, హిమవంతులకిచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు. ఈమెనే హైమవతీ, శైలజ, శైలపుత్రీ, గౌరీ అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు. 

శివమహాపురాణం, దేవి భాగవతం వంటి ఇతరన పురాణాల్లోనూ సతీ, పార్వతీ దేవిల కథలు మనం చూడవచ్చు.

రుతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రీదేవి. నందిపై కూర్చుని ములాధారా చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు. లౌకికంగా తండ్రి(హిమవంతుని) నుంచి భర్తను (శివుని) వెతుక్కుంటూ ప్రయాణించింది శైలపుత్రీదేవి. మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన. అందుకే నవరాత్రి పూజలు చేసేవారు, యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి, ధ్యానిస్తారు. ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలి మెట్టుగా చెప్తుంటారు. ఇదే యోగసాధనకు ప్రధమమైనది. శైలపుత్రీదేవి మూలాధారా శక్తికి అధిష్టాన దేవత. ఎన్ని జన్మలకైన శివకుటుంబిని గనుక తన భర్త అయిన శివుణ్ణి వెతికి, ధ్యానించి, సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా  తనలోఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తుంటారు.

యోగ పరంగా నవరాత్రులలోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది, కీలకమైనది. ఈ రాత్రి శైలపుత్రీ దుర్గా దేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటంది అని అంటారు. ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు.

యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఇంకా ఉన్నత ఆధ్యాత్మికానుభూతుల్ని అందుకోవాలని కోరుకుంటారు. అలాంటప్పుడు మూలాధారా చక్రానికి అధిష్టాన దేవతైన శైలపుత్రి దేవిని ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరవచ్చు. శైలపుత్రీ దుర్గా దేవి అచ్చంగా పార్వతీదేవి. శివమహాపురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రీదేవిలో నిబిడీకృతమై ఉంది. ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది.

శైలపుత్రీదేవిది పృధ్వీ తత్త్వం, సందర్భశుద్ధి అయిన గుణం, గ్రాహణ, భేద శక్తులతో ప్రకాశిస్తుంది.

శైలపుత్రీ అమ్మవారు గౌర వర్ణము అనగా శంఖము, బంగారము, చంద్రుడు - ఈ మూడు వర్ణముల సమ్మిళిత మైన  గౌర వర్ణపు మేని ఛాయతో శ్రీమాత శోభిల్లుచుండుటచే గౌరీ యని పిలవబడుచున్నది.   

ఆ తల్లి దేహచ్ఛాయ శంఖము, బంగారము, చంద్రుడు - ఈ మూడు రంగులసమ్మిళతమైన గౌర వర్ణముతో విరాజిల్లుచుండుటచే గౌరి అను నామముతో స్తుతింపబడుచున్నది.

శ్రీమాత గౌర వర్ణమునకు మరొక ఇతిహాసము కూడా గలదు. పరమశివుడు తన ధర్మపత్ని అగు కాళీదేవిని చూచి నల్లపిల్లా అని పరిహసింపగా అమ్మవారు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసి ఆయన వరం వలన గౌర వర్ణ శరీరం పొందినది అగుటచే గౌరి అని పిలువబడినది. కన్యకలయందు ఎనిమిది సంవత్సరాలు వయస్సు గలది గౌరి అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం గౌర్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

602వ నామ మంత్రము 27.2.2022

ఓం దరహాసోజ్జ్వలన్ముఖ్యై నమః

మందహాసముతో ప్రకాశించుచున్న ముఖము కలిగిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్రనామావళి యందలి దరహాసోజ్జ్వలన్ముఖీ అను ఎనిమిదక్షరముల(అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం దరహాసోజ్జ్వలన్ముఖ్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ కరుణామయిని ఆరాధించు భక్తులకు ఆ తల్లి దరహాసంలో బ్రహ్మాండములన్నియు గోచరించుచూ ఆధ్యాత్మిక తన్మయత్వంతో, నిష్కాములై తరించుదురు.

పరమేశ్వరి పరబ్రహ్మస్వరూపిణి. బ్రహ్మానంద స్వరూపిణి. చిదానంద స్వరూపిణి. ఆ పరమేశ్వరి హృదయంలో ఆనందం ఆ తల్లి ముఖంలో కనిపిస్తోంది. ఆ ఆనందం ఆ తల్లి ముఖంలో  మందస్మితమై మెరయుచున్నది. ఆ మందస్మితమే దరహాసోజ్జ్వలము. అందుకే ఆ పరమేశ్వరి దరహాసోజ్జ్వలముఖీ యని అనబడినది. ఆ తల్లి బ్రహ్మానందరూపిణి అని యన్నాము. ఆనందానికి బ్రహ్మానందానికి వ్యత్యాసం ఉన్నది. ఏమిటా వ్యత్యాసం?

ఆనందముల మధ్యగల సంబంధం తెలియాలంటే అది మానుషానందంతో ప్రారంభించాలి. ఆనందములన్నిటికీ   పరాకాష్ఠగా చివరగా బ్రహ్మానందము వరకూ చెప్ఫాలి. అది ఎలాగంటే 

1. వంద మనుష్యానందములు అయితే ఒక మనుష్య గంధర్వానందము.

2. వంద మానుష్య గంధర్వానందములు అయితే ఒక దేవ గంధర్వానందము.

3. వంద దేవ గంధర్వా నందములు అయితే ఒక చిరలోక పితరుల ఆనందము.

4. వంద చిరలోక పితరుల ఆనందములు అయితే ఒక అజానజ దేవానందము.

5. వంద అజానజదేవానందములు అయితే ఒక కర్మదేవానందము.

6. వంద కర్మదేవానందములు అయితే ఒక దేవానందము.

7. వంద దేవానందములు అయితే ఒక ఇంద్రానందము.

8. వంద ఇంద్రానందములు అయితే ఒక బృహస్పతి ఆనందము.

9. వంద బృహస్పతి ఆనందములము అయితే ఒక ప్రజాపతి ఆనందము.

10. వంద ప్రజాపతి ఆనందములు అయితే ఒక బ్రహ్మానందము.

బ్రహ్మానంద స్వరూపిణియైన పరమేశ్వరి ముఖమునందు దరహాసము బహు ఉజ్జ్వలంగా ఉంటుంది గనుకనే అమ్మవారు దరహాసోజ్జ్వలన్ముఖీ యని అనబడినది.

 మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా- యను (28వ) నామ మంత్రము వలన అవధులు లేని తన దరహాసచంద్రికలనే (చిరునవ్వు అనే) కాంతిప్రవాహంలో కామేశ్వరుని మనస్సు సహితం తనలో కలుపుకుంటున్నదని భావము వ్యక్తమయినది గనుకనే అమ్మవారు దరహాసోజ్జ్వలన్ముఖీ యని అనబడినది. జగజ్జనని ముఖం అప్పటికే ప్రకాశమానమై ఉంటుంది, ఆపైన మందస్మిత అయితే కామేశ్వరుడు అనురాగపూరితుడైతే బ్రహ్మాండములన్నియు ఆధ్యాత్మికానందములో మునిగిపోతాయి అని ఈ నామ మంత్రములోని ఆధ్యాత్మిక భావము గనుకనే అమ్మవారు దరహాసోజ్జ్వలన్ముఖీ యని అనబడినది.

అమ్మవారి ముఖం నుండి ఆధ్యాత్మిక వాఙ్మయము, వేదవేదాంగముల వాఙ్మయము వ్యక్తమౌతుంది, అందుకే కదా వెర్రిగొల్ల మహాకాళిదాసు అయాడు, అమ్మవారి ముఖ పద్మంలో పద్మవికాసం కనిపిస్తోందంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా - తన భర్త అయిన కామేశ్వరుని ముఖమును తన పద్మవికాసం కలిగిన ముఖంతో చూచినంతనే మహాగణపతిని ఆవిర్భవింపజేసినది. ఇదంతా  దరహాసోజ్జ్వలన్ముఖీ అను నామ మంత్రముతో అమ్మను నామప్రసిద్ధము చేయడమే కదా!

అటు వంటి దరహాసోజ్జ్వలన్ముఖికి ప్రణామము చేయునపుడు ఓం దరహాసోజ్జ్వలన్ముఖ్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

603వ నామ మంత్రము 28.2.2022

ఓం గురుమూర్తయే నమః

బ్రహ్మజ్ఞాన స్వరూపిణియై, గురురూపిణియై, జ్ఞానప్రదాతగా విరాజిల్లు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్రనామావళి యందలి గురుమూర్తిః అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం గురుమూర్తయే నమః అని ఉచ్చరించుచూ శ్రీమాతను ఆరాధించు ఉపాసకులకు శ్రీమాత గురురూపిణియై విశేషమైన బ్రహ్మజ్ఞాన సంపదలు ప్రసాదించి తరింపజేయును.

జీవనగమ్యానికి దారి చూపేది గురువు. అంధుడు ఎలా అయితే విశిష్టవస్తువులను కానని వాడగునో, జీవనగమ్యానికి దారిచూపే గురువు లేని వానికి జగమంతా చీకటిమయము అవుతుంది. గనుక గురువు లేకపోతే అంధుడితో సమానం అనే నానుడి ఇక్కడ ఉటంకించబడుచున్నది. అమ్మ అనే మాట నేర్పిన తల్లి తొలి గురువు. ఆ అమ్మ అనే పదానికి ఉన్న విశిష్టతను తెలియజేసి, గురుతరమైన బాధ్యతను బోధించే గురువుది తరువాత స్థానము. మనిషి రెండు సార్లు జన్మిస్తాడని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. తల్లి గర్భంనుండి లోకంలోకి రావడ మొదటి జన్మ అయితే,  విశ్వసనీయమైన గురువును అంగీకరించడం అనేది రెండవ జన్మ అవుతుంది.. ఉపనయన కాలంలో గాయత్రీ ఉపదేశం చేయు తండ్రి కూడా గురువవుతాడు. జీవనగమ్యం సక్రమమార్గంలో సాగడానికి గురువు చేయు బోధనలు ఉపయోగపడతాయి. గురువే లేకపోతే అజ్ఞానం అనే చీకటిలోనే మనిషి కూరుకుపోతాడు. ఉపనిషత్తులలో కఠోపనిషత్తుకు విశిష్ట స్థానం ఉన్నది. ఇది హృదయోపాసన ద్వారా ముక్తిని సాధించే విద్యను ప్రవచించింది. దీనిలో మృత్యువే గురువు. ఇది మృత్యుంజయ విద్యను ఉపదేశించింది. శంకరభగవత్పాదులవారు భాష్యం రాసిన పది ఉపనిషత్తులతో కఠోపనిషత్తు కూడా ఒకటి.   అస్పష్టమైన ఆలోచనలుండే వ్యక్తి పొగమంచులాంటి వాడు. పొగమంచులో ప్రయాణం, అంధుడి ప్రయాణం లాంటిది. అటువంటి పొగమంచును జ్ఞానమనే సూర్యకిరణాలు తొలగించుతాయి. అటు జ్ఞానమనే సూర్యకిరణాలు ప్రసాదించు గురువు సాక్షాత్తు ఆదిత్యస్వరూపుడు.

గురువులు, పరమ గురువులు లేరని కొందరు వాదిస్తారు. తన గురించి తెలుసుకోవాలనే తపించువారికి గురువు దర్శనమిస్తాడు. ప్రతి సద్గురువు ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. తన చుట్టూ చేరిన శిష్యులకు వారి నిజ స్వరూపాన్ని గుర్తుచేసి,  జీవిత సత్యాన్ని తమంతట తామే అనుభవం ద్వారా తెలుసుకొనే విధంగా గురువుచేయు బోధనలు ఉంటాయి.  గురువు సాన్నిధ్యం శిష్యుడిలోని మార్పునకు శ్రీకారం అవుతుంది.

 గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః| గురుదేవో మహేశ్వరః|

గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మైశ్రీ గురువేనమః॥

గురువు త్రిమూర్తి స్వరూపుడు మాత్రమే కాకుండా సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు. అటువంటి గురువుకు నమస్కారము. ఇక్కడ శ్రీమాత అంతటి విశిష్ట గురుస్వరూపిణి. పరబ్రహ్మస్వరూపిణి. బ్రహ్మజ్ఞాన ప్రదాత అందుకే ఆ జగన్మాత గురుమూర్తిః అని స్తోత్రం చేయబడుచున్నది. నిరక్షరకుక్షియైన     గొల్లపిల్లవాడికి బ్రహ్మోపదేశాన్ని అతని నాలుకపై బీజాక్షరరూపంలో వ్రాసి కాళిదాసుగా మార్చి గురురూపిణియైనది.
 
సప్తకోటి మంత్రాలకు సర్వాధిష్ఠాన దేవత పరమేశ్వరి. గురుముఖతా మంత్రోపదేశం పొందుట కుదరని వాళ్ళు, ఆ పరమేశ్వరినే మూలాధిష్ఠాతగా స్వీకరించి మంత్రసాధన ప్రారంభించవచ్చని పెద్దలు చెబుతారు. గనుకనే వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని గురుమూర్తిః అని కీర్తించారు. 

తల్లిదండ్రులు జన్మనిస్తే దాన్ని సార్థకం చేసేది గురువులు. ఆచార్యులే లేకుంటే అజ్ఞానంతో అలమటిస్తాం. అంధకారంలో కొట్టుకుపోతాం. అయోమయంలో మునిగిపోతాం! కుంగిపోతాం, కుమిలిపోతాం. పురాణాలూ ఇతిహాసాల్లో గురుశిష్యబంధం అమోఘమని చాటే కథలెన్నో ఉన్నాయి. ఆ సూచనలన్నీ ఇప్పటికీ అనుసరణీయమే.

నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమామ్

అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్

గురు పరంపరకు నమస్కరించే ఈ శ్లోకం నిత్యం ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. జ్ఞానసాగరాన్ని మథించినప్పుడే జీవన పరమార్థం నెరవేరుతుంది. ఇలాంటి ఉదాత్త జ్ఞానసాగర యానంలో గురుశిష్యులిద్దరికీ సనాతన ధర్మం కొన్ని నియమాలను నిర్దేశించింది. వాటిని అనుసరించినట్లయితే శిష్యుడి జీవనం సుడిగుండంలో చిక్కిన నావలా కాక సక్రమంగా సాగి, విజయం సాధిస్తాడు, గురువు తన జన్మను సార్థకం చేసుకోగలుగుతాడు. శిష్యులు గురువు నుంచి నేర్చుకుంటూ అభివృద్ధి పథంలో సాగాలన్నదే తాత్త్విక దృష్టికోణం.

స్కాంద పురాణంలో గురువు బాధ్యతలు, కర్తవ్యాల గురించి శివుడు పార్వతీదేవికి ఇలా వివరించాడు:-

శాంతో దాన్తో కులీనశ్చ వినీతశ్శుద్ధవేషవాన్‌

సదాచార స్సుప్రసిద్ధః శుచిర్దక్ష స్సుబుద్ధిమాన్‌

ఆశ్రయే ధ్యాననిష్ఠశ్చ మంత్ర తంత్ర విచక్షణః

నిగ్రహానుగ్రహేశక్తో గురురిత్యభిధీయతే॥

గురువు శాంతంగా ఉండాలి. వేషధారణ ఆదర్శవంతంగా ఉండాలి. నీతి నియమాలను పాటిస్తుండాలి. సద్బుద్ధి, మంత్ర తంత్రాలపై అవగాహన, అభినివేశం, నిగ్రహ, అనుగ్రహ సామర్థ్యాలు ఉండాలి. స్కందపురాణంతోపాటు యోగశిఖోపనిషత్‌, ముక్తికోపనిషత్‌, బ్రహ్మవిద్యోపనిషత్తులూ భారత భాగవతాది ఇతిహాస పురాణాలూ గురువును ఎలా సేవించాలి, గురువు అవసరం ఏమిటనే విషయాలను పలు సందర్భాల్లో పేర్కొన్నాయి. ఈ లక్షణములన్నియూ పరమేశ్వరిలో ఉన్నవి కనుకనే, ఆ తల్లి గురుమూర్తిః అని యనబడినది.

ఘటము, కలశము, కుంభము అను మూడు పదములకు కడవ అను అర్థము ఏవిధముగా ఉన్నదో, అలాగే మంత్రము, దేవత, గురువు అను ఈ మూడును ఒకే అర్థమును ఇచ్చును.  గు అనగా చీకటి, రు అనగా పోగొట్టునది. గురు అను శబ్దము నకు అజ్ఞానపు చీకట్లను పోగొట్టునది అని వ్యుత్పత్తి స్వీకరించదగును. గు కారము అనగా సత్తు అనగా బ్రహ్మ. రు కారమనగా జ్ఞానము. గురు అనగా బ్రహ్మజ్ఞానము పరమేశ్వరి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి గనుక గురుమూర్తిః అని యనబడినది.

శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం గురుమూర్తయే నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

604వ నామ మంత్రము 1.3.2022

ఓం గుణనిధయే నమః

సకల గుణములకు నిధి అయిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్రనామావళి యందలి గుణనిధిః అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం గుణనిధయే నమః అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని ఉపాసన చేయు ఉపాసకులు ఆ తల్లి అనుగ్రహంచే సద్గుణ సంపన్నులై, జితేంద్రియులై, బ్రహ్మజ్ఞానసంపన్నులై జీవితాంతం ఆధ్యాత్మికచింతనతో ధన్యతనందెదరు.

గుణనిధిః అని జగన్మాతను అని వశిన్యాదు వాగ్దేవతలు చెప్పారంటే ఐశ్వర్య, వీర్య, యశః, శ్రీ, జ్ఞాన, వైరాగ్యములనే షడ్గుణములు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే పంచభూతగుణములు, త్యాగ శౌర్యాది ఉత్తమ గుణములు, సత్త్వరజస్తమస్సులనే ప్రకృతి గుణములు - ఇవి అన్నియు లలితాంబిక నుండి వచ్చినవే అవడంచేత, జగన్మాత గుణనిధిః అని కీర్తింపబడుచున్నది.

గుణము అనేపదాన్ని త్రిగుణాలకు సంకేతంగా చెపుతారు, సత్త్వరజస్తమో గుణాలకు సంబంధించిన, ఈ త్రిగుణాల నుండే  వివిధ కలియికలతో మిగిలిన గుణములన్నియు ఏర్పడినవి గనుక  ఈ గుణములకు నిధి అమ్మవారు అని భావించదగును. గుణము అంటే త్రిగుణాలకు సూచకంగనుక, ఆ మూడు గుణములు త్రిభుజంలోని మూడు భూజాలు లేదా మూడు శీర్షములు లేదా ఆ త్రిభుజంలోని మూడు కోణాలతో సూచిస్తారు.

కాబట్టి అటువంటి త్రిభుజాలతో ఏర్పడిన శ్రీ చక్రాన్ని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఇలా చెప్పారు:

చతుర్భిః శ్రీకంఠైః -  శివయువతిభిః పంచభిరపి|

ప్రభిన్నాభిః శంభో ర్నవభిరపి మూలప్రకృతిభిః |

చతుశ్చత్వారింశ - ద్వసుదల-కలాశ్చ్త్రివలయ

 త్రిరేఖభిః సార్ధం - తవ శరణకోణాః పరిణతాః || 11 ||

ఓ పరమేశ్వరీ! శ్రీచక్రంలో శివకోణములు నాలుఘు,( వీటి కోణములు క్రిందకు ఉండును.) శక్తికోణములు ఐదు ( వీటి కోణములు పైకి ఉండును.) మూలప్రకృతులు తొమ్మిది ,అష్టదళములు ఎనిమిది, షోడశదళములు పదహారు , త్రివలయములు మూడు, భూపురత్రయములు మూడు. ఈ తీరున శ్రీచక్రంలో మొత్తం నలుబది నాలుగు కోణములు ఉండును.అటువంటి శ్రీచక్రము నీకు నిలయముగా నీ స్థానమై ఉన్నది తల్లీ. శ్రీచక్రము నందు సృష్టికి  మూల కారణమైన మూల ప్రకృతులను పేరుగల తొమ్మిది త్రికోణములు గలవు. శ్రీచక్రమునందు నలుబది నాలుగు కోణములు, ఇరువది ఎనిమిది మర్మ స్థానములు,  ఇరువది నాలుగు సంధులు గలవు.   తొమ్మిది త్రికోణములు గలవు గనుక నవయోన్యాత్మక మందురు. ఈ నవ యోనులు నవ ధాతువులై సృష్టి మూలకము లగుచున్నవి. త్వక్కు, రుధిరము, మాంసము, మేధస్సు, ఆస్థి అనునవి ఐదు శక్తి మూలకములు,  ధాతువులు.  మజ్,శుక్రము,ప్రాణము, జీవుడు అను నాలుగు ధాతువులు శివ మూలకములు. మన దేహము నవ ధాతుమయము, నవ యోని సముద్భవము. దశమ యోని బైన్ధవ స్థానము. ఇట్లు పిండాండము, బ్రహ్మాండము వీని వలన జనించినది. పంచ మహా భూతములు, పంచ తన్మాత్రలు,
పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు,మనస్తత్వము, మాయ, శుద్దవిద్య, మహేశ్వరుడు,సదాశివుడు, అను పంచ వింశతి తత్వములు శ్రీచక్రమునందంత ర్భూతములై యున్నవి. శివశక్త్యాత్మకమైన శ్రీచక్రము చరాచర జగత్తునకు సృష్టికి మూలమై యున్నది. షట్చక్ర భేదనముచే శ్రీచక్రోపాసన చేసే శ్రీదేవీ భక్తులకు అణిమాది అష్ట సిద్దులు అతి సునాయాసముగా సిద్ధించును. సిద్ధించే ముందు పరీక్షలు చాలా తీవ్రముగా వుండును. మానసిక, శారీరిక పరీక్షలు వుండును. ఎన్నో రకముల భ్రమలు గల్పించబడును. కంటి ముందు మెరుపు తీగలు మెరియును. చెవులు హోరెత్తును. తల పగలి పోవునట్లుగా వుండును. భరించలేని మాడు పోటు, తల గిర్రున తిరుగును. ఒకే సమయములో శీతోష్ణస్థితులు గలుగును. వున్నది లేనట్టుగా లేనిది వున్నట్టుగా అగుపించును. రకరకాల మాయలు గనిపించును. మనస్సు తీవ్ర భయాందోళనలకు లోనగును. శరీరము తీవ్ర కంపనములకు లోను అగును. శరీరము చెమట పట్టును. వెన్నులోని నాడులు తీవ్రముగా స్పందించును. తరువాత శరీరము నెమ్మదిగా తేలిక అగును. నాగ బంధములో కదలిక గల్గును. మూలాధారములో శక్తి చలనము, ఉత్కీలనము, ఆ తరువాత షట్చక్ర భేదనము.

ఆజ్ఞాచక్రములో త్రికోణ దర్శనము, త్రికోణాంతర దీపికా దర్శనము కలుగును.

 ఆ తరువాత ఆనందమే బ్రహ్మానందం. ఇక మిగతా విషయములు చెప్పకూడదు.

 అతి రహస్యములు. స్వయముగా ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవాలి. మొదట సారి మాత్రమే ఈ సాదృశ్యములు అగుపించును. ఆ తరువాత నీ మానసిక,శారీరిక స్థితిగతులను బట్టి, నీకు తెలియకుండానే కుండలినీశక్తి సహస్రారము వరకు గమనము చేయుచూ వుండును. రహస్యమైన విషయమేమంటే సాధకుడు అఖండ బ్రహ్మచర్య నిష్ఠలో, పంచదశీ మంత్ర పునఃశ్చరణ దీక్షలో  వుండవలెను. అప్పుడే ఇది సాధించగలడు. లేనిచో ఇది కుదరదు. గురు ముఖతః దీక్ష తీసుకొన్నవారిలో మాత్రమే ఈ సిద్ధి కలుగును. ఇతరులు ఈ సాధన చేయకూడదు. చాలా తీవ్ర పరిమాణాలు వుంటాయి.

ఎవరికి వారు తమ్ము తాము ఉద్దరించుకోవడానికి మాత్రమే ఈ సాధన చేయవలెను. అన్యధా తగు మూల్యము చెల్లించుకోక తప్పదు. శ్రీవిద్య మోక్ష సాధనకు మాత్రమే అని గుర్తెరున్గవవలెను.

సాధకుడు అమ్మ పెట్టే పరీక్షలకు నిలబడాలి. సాధన తీవ్రముగా వుండాలి. మధ్యలో చలించగూడదు. ఏకోన్ముఖులై వుండాలి. ఎవరికి ఏయే బలహీనతలు గలవో, అవే పరీక్షలకు తావుగా నిలబడును. మెట్టు మెట్టుకూ చిత్ర విచిత్రమైన పరీక్షలు కల్గును.
 
 శ్రీచక్రం అమ్మవారి స్వరూపానికి  ప్రతీక గనుక గుణనిధిః అను నామముతో కీర్తింపబడుచున్నది.

శ్రీచక్రాధిదేవతయైన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం గుణనిధయే నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

605వ నామ మంత్రము 2.3.2022

ఓం గోమాత్రే నమః

గోవులకు తల్లి అయిన కామధేనుస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.

వాక్కులకు మూలకారణమైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్రనామావళి యందలి గోమాతా అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును జపించుచూ ఆ జగన్మాతను ఆరాధించు సాధకుడు కామధేను స్వరూపిణి అయిన పరాశక్తి కరుణతో సర్వాభీష్టములు నెరవేరును మరియు ముక్కోటి దేవతల ఆరాధనా ఫలమునంది తరించును. 

మాత అనగా  నవమాసములు మోసి కని, చిన్నతనంలో మలమూత్రములను శుద్ధిచేసి, స్తన్యమునిచ్చి, పెంచి, పోషించి బిడ్డను తనకాళ్ళపై తాను నిలబడు వరకూ వెన్నంటి ఉంటూ, బిడ్డ క్షేమమే కోరుతూ, ఆపదవస్తే ప్రాణాలు కూడా పణంపెట్టునది కన్నతల్లి, గోమాత (ముక్కోటి దేవతల ప్రత్యక్షదైవము, తల్లి వలె పాలు, ఆరోగ్యమునకు మూత్రము, పరిసరాల శుభ్రమునకు గోమయము, నిత్యాగ్ని హోత్రమునకు నెయ్యి ప్రసాదించు కామధేనువు) మరియు భూమాత (పుట్టినది మొదలు గిట్టువరకూ మనను భరిస్తూ మన కాలిముద్రలను సహనముతో భరిస్తూ గిట్టినపుడు తిరిగి తనలో కలుపుకొనునది భూమాత. ఇలా మాత, గోమాత, భూమాతల స్వరూపమే శ్రీమాత గాన అమ్మవారిని గోమాతా అని స్తుతిస్తున్నాము, అర్చిస్తున్నాము.  గో అనే పదానికి చాలా అర్థములు గలవు. కిరణము అనగా మనకు వెలుగు కిరణములు ప్రసాదించు సూర్యుడు అని తెలియదగును, గో అంటే భూమి, అలాగే తల్లి (మాత) అని కూడా అర్థముగలదు. ఇంకను మూలము, నేపథ్యము అని అర్థంగా విశ్లేషిస్తే భూమి మొదలైన వాటికి కారణమైనది అని తెలియవచ్చు.  గో అంటే తల్లి లేదా మాత, మాత అనగా పార్వతి అనగా శ్రీమాత కాబట్టి జగన్మాతను గోమాత అని అన్నాము.

ఇంత విశేషార్థములు కలిగి ఉన్న జగన్మాత నామ మంత్రము గోమాత  ను ఓం గోమాత్రే నమః అని ఉచ్చరిస్తూ ఆ తల్లికి నమస్కరించవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

606వ నామ మంత్రము 3.3.2022

ఓం గుహజన్మ భువే నమః

కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వరునికి) కి జనని అయిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్రనామావళి యందలి గుహజన్మభూః అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం గుహజన్మ భువే నమః అని ఉచ్చరించుచూ ఆ జగజ్జననిని ఆరాధించు భక్తులకు సమస్త గ్రహదోషములు తొలగి కార్యసిద్ధి కలుగును. 

గుహుడు అంటే  కుమారస్వామి. స్కందుడు, షణ్ముఖుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శరవణభవుడు మొదలైన నామములు కలిగినవాడు. వృశ్చికరాశికి అధిపతి కుజుడు అనగా కుమారస్వామియే. శివశక్తులు కలిసి నందువల్లనే జ్ఞానజ్యోతి ఏర్పడింది. అట్లేర్పడిన జ్యోతిస్వరూపుడైన కుమారుడే శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆయన శివశక్తుల సమ్మేళనం వలన ప్రభవించిన జ్ఞానఫలం. అందువలన ఆయన తన దివ్యశక్తిచే మన బాహ్యాంతరములందలి అజ్ఞానాన్ని శాశ్వతంగా పోగొట్టి మనకు అమరత్వాన్ని, అమృతత్వాన్ని కలుగజేస్తున్నాడు. వైదిక కర్మలలో అగ్నికార్యం హోమం ప్రధానమైనది. శ్రీసుబ్రహ్మణ్యుడు దేవతా విశేషములలో అగ్నిస్వరూపుడు. బయట అగ్ని స్వరూపుడు, ఆత్మ
స్వరూపాన గుహుడు. ఆయనకు అగ్నిభూః అనే పేరున్నది. సేనాని,  అగ్నిభూః, గుహః అని శ్రీ సుబ్రహ్మణ్య నామావళి కూర్చబడింది. అందుచే జగన్మాత గుహజన్మభూః (గుహకి జన్మనిచ్చినది) అను నామ మంత్రముతో స్తుతింపబడుచున్నది. శ్రీసుబ్రహ్మణ్యుడు (గుహుడు) జ్ఞాన స్వరూపి, తేజస్వి. అగ్నితేజం గలవాడు. కాని, గంగా తనయుడగుటచే అమృతంవలె చల్లదనమునిచ్చే స్వభూవము గలదు. తిథులలో అరవది షష్టి. ఆయన జన్మతిథి కూడా అదే. షష్ఠి ప్రియుడు, షడాననుడు అనగా ఆరు ముఖములుగలవాడు. ఆయన మంత్రం షడక్షరి శరవణభవ. ఇది మిక్కిలి మహిమాన్వితమైనది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము లను ఆరు దుర్గుణములను నశింపచేసి విజ్ఞానవంతులుగ రూపొందించునట్టిది. ఇహపర సుఖదాయకమైనది. శ, ర, వ, ణ, భ, వ: శరవణభవ అనే మంత్రాన్ని పఠిస్తేచాలు సమస్త సన్మంగళాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. శరవణభవ మంత్రంలో –
శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు
ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని
వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు
ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు
భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి
వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు. ఈ షడాననుడైన సుబ్రహ్మణ్యేశ్వరునికి - యోగపరంగా చాలా సంబంధమున్నది. కుండలినీ శక్తి జాగృతమైన షట్చక్రాల నుండి పైకిప్రాకి అగ్ని తత్త్వమైన సుషుమ్నా మార్గంలో ఉత్పన్నమయ్యే శక్తియే ఆయన. సంవత్సరాగ్నిగా, కాలస్వరూపుడిగా…ఆరు ఋతువులు ఆయనకు ఆరు ముఖాలు. పన్నెండు మాసాలు ఆయనకు గల పన్నెండు చేతులు. ఆయన అభయ స్వరూపుడు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా అనే మూడు శక్తులమయమైన శక్తిని ధరించిన కుమారస్వామి,  అమోఘమైన శివతేజాన్ని, పృథ్వి, అగ్ని, జలం, షట్ కృత్తికల శక్తిని (నక్షత్రశక్తి) ధరించి, చివరకు బ్రహ్మ తపోనిర్మితమైన అలౌకిక మహాగ్ని శరవణంలో (అగ్నితో కూడిన రెల్లుతుప్ప) రూపుదిద్దుకుంది. అందుకే స్వామి శరవణభవుడు. స్వామి తల్లి పార్వతీదేవి, సుబ్రహ్మణ్యస్వామిని ఆరు తామరపుష్పాలలో గమనించినపుడు తెలుసుకుని మురిసిపోయింది. అలాగే ‘స్కంద’ అంటే ఒకటిగా చేరినది అని అర్థం. పార్వతీదేవి ఆరుపద్మాలలో ఆరు శిశువులను చూసిన కాసేపటికి ఆ ఆరు శిశువులు ఒకే శిశువుగా మారి ఆరు తలలతో పన్నెండు చేతులతో ప్రత్యక్షమయ్యాడు. అందుకే స్కందుడయ్యాడు. సుబ్రహ్మణ్యేశ్వరుని, ప్రతి జీవిలోను ఉండే వ్యష్టి కుండలినీ అని అంటారు, కుండలినీ శక్తి అనగా అమ్మవారు తల్లివేరు లాంటిది అయితే అమ్మవారికి వ్యష్టి కుండలినీ అయిన గుహ (కుమారస్వామి - సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) పిల్లవేరు వంటిది, అందుచే అమ్మవారు గుహజన్మభూః అని నామ ప్రసిద్ధమైనది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం గుహజన్మ భువే నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

607వ నామ మంత్రము 4.3.2022

ఓం దేవేశ్యై నమః

సర్వదేవతలకు పాలకురాలుగా విరాజిల్లు జగన్మాతకు నమస్కారము. 

శివునికి ప్రాణేశ్వరిగా విరాజిల్లు లలితాపరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్రనామావళి యందలి దేవేశీ అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం దేవేశ్యై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు ఆ తల్లి కరుణించి సర్వాభీష్టములను నెరవేర్చి, ఆత్మానందమును కలుగజేయును. 

దేవ అనగా దేవతలకు, ఈశీ అనగా ఈశ్వరి, పాలకురాలు - దేవతలకు పాలకురాలు, దేవః ప్రత్యేకంగా ఈశ్వరుడు అని అర్థం వస్తుంది. అందుచే ఈశ్వరునికి ప్రాణేశ్వరి అని   ఈ నామమునకు భావము. ఈ సందర్భంలో శ్రీ లలితా  సహస్రనామావళియందలి కామేశ్వర ప్రాణనాడీ అను 373వ నామ మంత్రమును ఇచ్చట గమనించవలసియుండును. ఈ నామ మంత్రమును ఓం  కామేశ్వరప్రాణనాడ్యై నమః అని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులకు జగన్మాతయే సర్వకారణం అని విదితం అవుతుంది మరియు ఆ తల్లిని పూర్వశరణాగతితో ఆరాధించి తరించుదురు. పరమేశ్వరుడు ఎంతటి గొప్ప వాడైనను పరాశక్తి తోడుగా లేనిచో సృష్టి కార్యమును ఏ మాత్రమును చేయ జాలడు. అందుచే శివుడికి శ్రీలలితా పరాభట్టారిక, ప్రాణనాడి వంటిది. పరాశక్తి లేనిది శివుడు అయోగ్యుడే, శవతుల్యుడే యగును.

 శివః శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం|

నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి (సౌందర్యలహరి) 

అనగా శక్తితో గూడినచో బహుధా సంసార రూపంగా విస్తరించడానికి సమర్థుడు అగును. అలా కానిచో కదలడానికిని యోగ్యతలేని అచలుడు అగును. పరమేశ్వరుడును శ్రీదేవియు శ్రీచక్రంలో బిందు భాగంలో ఉంటారు. కామేశ్వరుడిని ప్రకాశం, గురువు, పరమేశ్వరుడు ఇత్యాది నామాలతో వ్యవహరిస్తారు. పరాశక్తిని శ్రీలలిత, విమర్శ, శ్రీదేవి, రాజరాజేశ్వరి, త్రిపురసుందరీ మొదలైన నామాలతో పిలుస్తారు. కామేశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటే శ్రీశక్తి నర్తిస్తూ, విస్తరిస్తూ నామ రూపాత్మకమైన ఈ ప్రపంచాన్ని సృజిస్తూ గోచరిస్తుంది శ్రీ గురుః సర్వకారణభూతా శక్తిః (భావనోపనిషత్ మంత్రము) అనగా  చరా చరాత్మకమైన ఈ ప్రపంచానికి అంతకును ఆదికారణం శ్రీగురు శక్తియే అగును.

 ఏకోఽహం బహుస్యామ్

సోకగామయత్ బహుస్యాం ప్రజాయేయేతి

ఇత్యాది శ్రుతుల భావమును ఇదియే అని తెలియదగును.
 
ఆ పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం దేవేశ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

608వ నామ మంత్రము 5.3.2022

ఓం దండనీతిస్థాయై నమః

సామ, దాన, భేద, దండనములను దండనీతి శాస్త్ర విషయముల రూపములో ఉండు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి  యందలి దండనీతిస్థా అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం దండనీతిస్థాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఉపాసించు భక్తులకు జగన్మాత కరుణతో ఆత్మానందము మరియు బ్రహ్మజ్ఞానసంపద ప్రాప్తించి తరించుదురు.

శ్రీమహారాజ్ఞి (2),  శ్రీమత్సింహాసనేశ్వరి (3), సర్వేశ్వరి  (202),నిఖిలేశ్వరి (569), దేవేశి (607) అంటూ శ్రీలలితా సహస్ర నామావళిలో వశిన్యాది వాగ్దేవతలు ఒక మహారాజ్ఞిగా చెపుతూనే ఉన్నారు అంటే సింహాసనేశ్వరిగా పరిపాలనా దక్షత వహిస్తోంది అమ్మవారు అని కదా అర్థం!  అలాగే భండాసురుని, మహిషాసురుని ఇలా ఎందరో రాక్షసులను కూడా తుదముట్టించింది, ఇంకా మహేశ్వరుని మూడోనేత్రాగ్నికి భస్మమైన మన్మథుని బ్రతికించి రతీ, మన్మథుల దాంపత్యానికి శుభముచేకూర్చి హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవనౌషధిః అనియు స్తుతింపబడినది అంటే రాజ్యపాలన, దుష్టశిక్షణ, ఆర్తజనరక్షణ ఇలా ఎన్నో కార్యక్రమములను మహారాజ్ఞిగా నేరవేర్చినది యని భావము. దేవతలకు ధర్మసంస్థాపనార్థం  వారు  చేయు పనులలో ఎన్నో అవతారములు ఎత్తి సహాయపడి దేవకార్య సముద్యత గాను, సాక్షాత్తు నారాయణుని తన చేతివ్రేళ్ళ గోళ్ళనుండి అవతారములను ఉద్భవింపజేసి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః యనుచును స్తుతింపబడినది. ఇంత కార్యదక్షత ఒక మహారాజ్ఞిగానే నిర్వహించింది గనుక అటువంటి మహారాజ్ఞి దండ (సామ, దాన, భేద, దండోపాయముల) నీతి నియమములయందు నిలిచియున్నది యని చెప్పాలి. అందుచే ఆ పరమేశ్వరి దండనీతిస్థా యని అనబడినది.

ఆ పరమేశ్వరి సృష్టికి కారణభూతురాలు. అఖిలాండములకు నాయకి. రాజరాజేశ్వరి యని అనబడినది. అనగా రాజులకే మహారాజ్ఞి. తాను సృష్టించిన సకల సృష్టిలోని  ముల్లోకములకు త్రిమూర్తులను    అధిపతులను జేసినది. ఇంద్రుడు, అష్టదిక్పాలకుల వంటి లోకపాలకులను ఏర్పాటు చేసి పరిపాలన సౌలభ్యతనేర్పరుచుకొని అనంతకోటి జీవరాశుల తన బిడ్డలుగా ఆహారము, నీరు, గాలి, గూడు ఏర్పరచి పోషించుచున్నది. ఆ విధంగా సమస్త జగత్తును పరిపాలించిన దేవేశి యగుటచే దండనీతి గలిగినది అయినది. తాను నియమించిన త్రిమూర్తులుగాని, లోకపాలకులు గాని తన మాటను మీరరాదు ఆలా మీరకుండా ఉండాలంటే దండనీతి కలిగియుండాలి. సూర్యుడు మితిమీరి ప్రకాశించకూడదు. వరుణుడు అనావృష్టికి గాని అతివృష్టికి గాని కారకుడు కూడదు.  వాయువు ఆహ్లాదభరితమైన వాయువులు మాత్రమే ప్రసరింపజేయాలి. ఈ విధంగా పరిపాలన సక్రమ మార్గంలో నడవాలంటే ఒక మహారాజ్ఞికి దండనీతికూడా అవసరమే. అందుకనే తనకొక దండనీతిని ఏర్పరుచుకొన్నది. ఆ దండనీతితో విలసిల్లుచూ, పరిపాలనను కొనసాగిస్తుంది గనుక ఆ పరమేశ్వరి దండనీతిస్థా యని అనబడినది. 
ఎప్పుడైనా ధర్మదేవత నడక కుంటుపడినదంటే తన దండనీతిని ప్రయోగించి  తుపానులు, ప్రకృతి కల్లోలాలు, విలయములు సృష్టించి పాపభారాన్ని తగ్గించి తన దండనీతిని నిరూపిస్తుంది ఆ పరమేశ్వరి. శ్రీలలితాంబిక ప్రేమమూర్తి గనుక మాతయై పెంచుతుంది, రక్షించుతుంది, దుర్మార్గులను శిక్షించుతుంది; దుష్టులను, దుర్మార్గులను ఒకేరీతిగా శిక్షించక వారి వారి దుష్కృత్యములు, మోసపూరిత కార్యములను తర్కించి ఎవరికి ఎటువంటి శిక్షను విధించాలో అటువంటి శిక్షను విధిస్తుంది. ఆవిధంగా దండనీతియందు జగన్మాత నిష్ణాతురాలు గనుక జగన్మాత విధించే ఆజ్ఞలు, విధివిధానాలు దండనీతిలో ఏర్పరచుకొని ఆ దండనీతిలో ఉంటుంది గనుక పరాశక్తిని దండనీతిస్థా అని వశిన్యాది వాగ్దేవతలు స్తుతించారు.  

అన్యాయమార్గంలో నడిచే వారిని ఆ పరమేశ్వరి శిక్షిస్తుంది గనుక దండనీతిస్థా యని అనబడినది.

అటువంటి దండనీతిస్థాయని స్థుతింపబడు జగన్మాతకు నమస్కరించునపుడు ఓం దండనీతిస్థాయై నమః  అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

609వ నామ మంత్రము 6.3.2022

ఓం దహరాకాశ రూపిణ్యై నమః

హృదయమనే ఆకాశంలో పరబ్రహ్మస్వరూపిణియై తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి దహరాకాశ రూపిణి అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం దహరాకాశ రూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ భక్తిప్రపత్తులతో జగన్మాతను ఆరాధించు సాధకుడు సంకల్పశుద్ధుడై పరాశక్తిని మూలమంత్రాత్మికగా తలుస్తూ ధ్యానిస్తే సాధకుడు హృదయకుహరంలో జరిగే స్పందనయే జగన్మాత ఉనికి అని గ్రహించి ఆత్మానందమందును, అంతకు మించి ఏమియు కోరని స్థితిలో ఉండి తరించును. 

మహదాకాశము, ఘటాకాశము, దహరాకాశము అని ఆకాశములను చెప్పుకుంటే వాటి వివరణ ఇలా ఉంటుంది:

పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, నక్షత్రములు మొదలైనవి చూస్తూ ఉంటాము. ఇవన్నీ తలపైకెత్తి చూస్తే కనిపిస్తాయి. దానిని మహదాకాశము అందురు. 

ఘటాకాశం మహాకాశ ఇవాత్మానం పరాత్మని|

విలాప్యాఖండభావేన తూష్ణీం భవ సదా మునే॥

ఘటమునకు పరిమితమైనది ఘటాకాశము. అట్లే ఉపాధివశమున జీవి, శరీరమునకు పరిమితము. ఘటాశ్రయము లేనప్పుడు ఘటాకాశము, మహాకాశములో విలీనమైనట్లు, ద్వంద్వ భావన నశించినపుడు, ఆ పరమాత్మ స్వరూపమే నేను అనే ఏకైక (అద్వైత) మనోభావన సునిశ్చితవౌను. అందువలన నిశ్చల మనస్సుతో బ్రహ్మైక్యత సాధించి, నీవు అఖండ స్వరూపుడవు కమ్ము. ధీమంతుడవైన నీవు మౌనముగా ఎట్టి కార్యాసక్తిలేక ఎల్లవేళల ఉండుము.

శంకరభగవత్పాదులవారి వివేకచూడామణిలో చెప్పిన పై శ్లోకమును బట్టి ఘటములో కనిపించే ఆకాశమును ఘటాకాశము అని యందురు.

దహరాకాశము అనగా హృదయంలో ఉండే ఆకాశాన్ని దహరాకాశము అందురు. 

వివరణాత్మకముగా తిలకిస్తే:- దహరము సూక్ష్మము, ఆ దహరమునందలి ఆకాశము పరబ్రహ్మము. జీవులకు గల హృదయమనే గుహయందు సూక్ష్మమైన ఆకాశము ఉండును. దానినే దహరాకాశము అని అందురు. అద్వైతభావనయందు జీవుడు హృదయంలో ఉంటే ఆ జీవునికి యునికినిచ్చిన దేవుడు ప్రాణంరూపంలో ఉండడం జరుగుతుంది. ఆ ప్రాణము సూక్ష్మముగా ఉంటుంది. దేవుడు పరమాత్మ. పరమాత్మ అంటే పరమేశ్వరి. హృదయమనే గుహయందు దహరాకాశమనబడే సూక్ష్మమైన ఆకాశరూపంలో పరమేశ్వరి ఉంటుంది.

 గనుక అమ్మవారు దహరాకాశరూపిణీ యని అనబడినది. "

ఈ శరీరమునందు హృదయమనే పద్మమునందు గృహము గలదు.  ఆ గృహములో మిక్కిలి సూక్ష్మమైన ఆకాశము గలదు. దానిలో పరబ్రహ్మ ఉన్నాడు" అని సూత్రభాష్యములో చెప్పబడినది. 

దహరా అనగా హృదయములో ఆకాశరూపముగా ఉండునది అని కూడా అనవచ్చు. హృదయ కమలమందున్న సూక్ష్మమైన ఆకాశము దహరాకాశమనియు, ఆ దహరాకాశము సకల దేవతలకు స్థానమని అంటారు.

భాస్కరాచార్యులవారు ఇలా అన్నారు:-

అథయదస్మిన్ బ్రహ్మ పురే దహరం పుండరీకం (శ్రుతివాక్యం - సౌభాగ్యభాస్కరం, 727వ పుట). ఆకాశము - మహాకాశము, ఘటాకాశము, చిత్తాకాశమని ఉండును. పిండాండము (శరీరము) నందలి హృదయ పుండరీకమునందు గల పరమాత్మ ఆవరణము దహరాకాశము. దీననే హృదయాకాశమందురు. పరమే వ్యోమ (శ్రుతి). పరబ్రహ్మము నామరూప రహితమైనది. సర్వవ్యాపి. అంతటా ఉండునది. అన్ని రూపములలో తానుండునది గాన దహరాకాశమున గల శ్రీమాత దహరాకాశరూపిణి అని భావము. సామాన్యంగా ఆకాశము అనగా గగనం శూన్యం అంటారు. కాని ఆలోచిస్తే శూన్యం కాదు. ఎందుకనగా ప్రపంచోత్పత్తికి ముందుగా అవ్యక్త ఆకాశము నుండి వాయువు, అగ్ని, జలము, పృథ్వినుండి ఓషధులు, ఓషధులనుండి అన్నము, అన్నముతో జీవులు కలిగినట్లుగా తైత్తరీయములో తెలుపబడినది.

 ఆకాశాద్వాయుః. వాయోరగ్నిః. అగ్నేరాపః. అద్భ్యః పృథివీ. పృథివ్యా ఓషధయః. ఓషధీభ్యోన్నమ్. అన్నాత్పురుషః. 

కావున ఆకాశము పూర్ణమైనది. శూన్యం కాదని భావము. 

ఈ విధముగా పూర్ణమైన ఆకాశము ప్రతిజీవుని హృదయములో దహరాకాశ రూపమున ఉండును.  బయట కనిపించే ఆకాశమునకు ఆకారము లేక పోవచ్చును, కాని ప్రతిప్రాణి హృదయములో ఉండే ఆకాశము దహరాకాశము రూపంలో ఉంటుంది. ప్రతిజీవిలో దహరాకాశ రూపిణియై పరమేశ్వరి ఉంటుందని తెలియగలము.

అటువంటి శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం దహరాకాశ రూపిణ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

610వ నామ మంత్రము 7.3.2022

ఓం  ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితాయై నమః

పాడ్యమి నుండి పూర్ణిమ వరకు గల పదునైదు తిథులలో పూజింపబడు జగన్మాతకు నమస్కారము.

నిత్యా దేవతలచే పూజింపబడు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా అను పదహారు అక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితాయై నమః అని ఉచ్చరించుచూ భక్తి ప్రపత్తులతో ఆ శ్రీమాతను పూజించు సాధకునికి ఆ శ్రీమాత పంచదశీ మంత్ర జప ఫలమును ప్రసాదించి సర్వాభీష్టములను నెరవేర్చును.

పాడ్యమి నుండి పూర్ణిమ వరకూ గల పదునైదు తిథులందు అమ్మవారిని పూజించుతారు గనుక ఆ తల్లి
ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా యని అనబడినది.

తిథుల భేదములను బట్టి పాడ్యమి నుండి పౌర్ణమివరకూ తంత్రములందు ఆ పరాశక్తిని పూజించుతారు. ఒక్కొక్క తిథియందు ఒక్కొక్క విధమగా పూజచేయవలెనని  పూజాభేదములతో సహా తంత్రశాస్త్రములందు చెప్పబడినది. 

తంత్ర శాస్త్రము శక్తి ఉపాసనా శాస్త్రము. శక్తిని ఆధారం చేసుకున్నవి తంత్ర శాస్త్రములు. ఆత్మ జ్ఞాన గ్రంథాలు రహస్య గ్రంథాలన్నారు పెద్దలు.కనుక తంత్ర శాస్త్రమును రహస్య భాషలో వ్రాసారు. ఈభాషను సంధ్యా భాష అంటారు. సంధ్య వేళయందు చీకటి, వెలుగులు రెండున్నట్లు, సంధ్యా భాషకు రెండర్ధాలున్నవి.తెలిసిన వారు చదివితే ఒక అర్ధం, తెలియని వారు చదివితే వేరొక అర్ధం. మహానిర్వాణ తంత్ర శాస్త్రమును పరమేశ్వరుడు పార్వతీదేవికి కైలాసంలో చెప్పాడు. అలగే ఖడ్గమాల వామకేశ్వర తంత్రము. తంత్రశాస్త్రము కర్మకాండను తెలియజేస్తుంది. తంత్రశాస్త్రంలో చెప్పిన ప్రకారం అమ్మవారిని తిథులప్రకారం చేసే విధానము ఒకటి ఉన్నది.  


చంద్రకళలు తిథుల ననుసరించి ఉంటాయి. ఆ తిథులలో చంద్రకళలు  నిత్యాదేవతలను అనుసరించి ఉంటాయి.

ఇప్పుడు శుక్లపక్షములోని తిథులు, ఆ తిథులకు నిత్యాదేవతలను గమనిద్దాము.

 శుక్ల పక్షము

  1. పాడ్యమి - కామేశ్వరి
  2. విదియ    - భగమాలిని
  3. తదియ    - నిత్యక్లిన్నా
  4. చవితి      - భేరుండా
  5. పంచమి  - వహ్నివాసినీ
  6. షష్టి        - మహావజ్రేశ్వరీ
  7. సప్తమి   -  శివదూతీ
  8. అష్టమి  -   త్వరతా
  9. నవమి  -   కులసుందరీ
10. దశమి   -   నిత్యా
11. ఏకాదశి -   నీలపతాకా
12. ద్వాదశి -   విజయ
13. త్రయోదశి-సర్వమంగళా
14. చతుర్దశి  - జ్వాలామాలిని
15. పూర్ణిమ  -  చిత్రా

శుక్లపక్షంలో పాడ్యమి నాడు ఆనాటి నిత్యాదేవి అయిన కామేశ్వరిని పూజించాలి. ఎందుకు అంటే ఆనాటి చంద్రకళ చంద్రునికి కామేశ్వరి నుండి వచ్చినది. అలాగే విదియనాడు భగమాలినిని పూజించాలి. ఆ క్రమంలో పౌర్ణమి నాడు చిత్రా అనే నిత్యా దేవతను పూజించాలి. అయితే నిత్యాదేవతలు పదహారు. కాని పైన పదిహేను మందినే చూపించాము. గనుక పదహారవ నిత్య మహానిత్య అయిన మహాత్రిపురసుందరి అనగా అమ్మ వారు. ప్రతీరోజు ఆయా తిథులలోని నిత్యాదేవతలను పూజించుతూ, మహానిత్య అయిన త్రిపురసుందరిని కూడా పూజించవలెను. అమ్మవారు నిత్యాదేవతాస్వరూపిణి. గనుక ప్రతిరోజు ఆ తిథి నాటి నిత్యాదేవత, మహానిత్యాస్వరూపిణియైన మహాత్రిపురసుందరీ పూజింపబడతారు. దీనినే తిథిమండల పూజ అని యందురు. అందుచే అమ్మవారు ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండలపూజితా యని అనబడినది. 

ఇప్పుడు కృష్ణపక్షములోని నిత్యాదేవతలు, తిథులను పరిశీలిద్దాము.

చంద్రకళలు తిథులప్రకారం ఉంటాయి. శుక్లపక్షంలో పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ చంద్రకళలు వృద్ధిచెందుతూ ఉంటాయి. అది పదిహేను తిథులకు (పాడ్యమి నుండి పౌర్ణమి వరకు) 
 
 కృష్ణ పక్షము

  1. పాడ్యమి - చిత్రా
  2. విదియ    - జ్వాలామాలిని
  3. తదియ    - సర్వమంగళా
  4. చవితి      - విజయా 
  5. పంచమి  - నీలపతాకా
  6. షష్టి        - నిత్యా
  7. సప్తమి   -  కులసుందరీ
  8. అష్టమి  -   త్వరితా
  9. నవమి  -   శివదూతీ
10. దశమి   -   మహావజ్రేశ్వరి
11. ఏకాదశి -   వహ్నివాసిని
12. ద్వాదశి -   భేరుండా
13. త్రయోదశి-నిత్యక్లిన్నా
14. చతుర్దశి  - భగమాలిని
15. అమావాస్య  -  కామేశ్వరీ

ఇక్కడ పాడ్యమి నాడు శుక్ల పక్షములోని పౌర్ణమి నాటి నిత్యాదేవతయైన చిత్రా గలదు. కారణమేమంటే చిత్రా యొక్క స్వభావం పౌర్ణమినాటి వెలుతురు. అనగా పౌర్ణమినాడు చంద్రునకు ఇచ్చు కళ. కృష్ణ పక్షము లోని పాడ్యమి నాడు కూడా చంద్రుడు పౌర్ణమినాటి కళతోనే ఉండడం జరుగుతుంది. అలాగే కృష్ణపక్షములోని విదియ నాడు చంద్రుని వెలుతురు శుక్లపక్షములోని   చతుర్దశి నాటి వెలుతురు. ఎందుచేతనంటే ఆ రోజు నిత్యాదేవత జ్వాలామాలిని జ్వాలామాలిని స్వాభావిక వెలుతురు శుక్లపక్షము లోని చతుర్దశి వెలుతురు. అంటే కృష్ణపక్షము లోని చంద్రుని కళ జ్వాలామాలిని నుండి లభించును. ఆ క్రమంలో అమావాస్యనాడు చంద్రుని వెలుతురు కామేశ్వరి యను నిత్యాదేవతనుండి లభించును. కామేశ్వరి చంద్రునికి ఏవిధమైన వెలుతురును ఈయదు. అందుకే అమావాస్యనాడు చంద్రుడు కాంతి హీనుడై ఉంటాడు. అలాగే శుక్లపక్షంలో పాడ్యమినాడు కూడా కామేశ్వరి యను నిత్యా దేవతయే చంద్రునికి వెలుతురు ఇస్తుంది గనుక శుక్లపక్షములోని పాడ్యమినాడు మనము చంద్రుని అమావాస్య నాటి చంద్రుని వలెనే చూడలేము.

దీనిని బట్టి చంద్రునికి తిథులు, తిథులకు నిత్యాదేవతలు దానిని బట్టి చంద్రునికి కళలు అన్నది గమనించవలయును.

ఈ విధంగా శుక్లపక్షములోని తిథులు, ఆ తిథులనాటి నిత్యాదేవతలకు పూజలు, మరియు నిత్యమూ మహానిత్య అయిన మహాత్రిపురసుందరికి కూడా ఆనాటి నిత్యాదేవతకు పూజ యనునదియే తిథిమండల పూజ యని అందురు.

వరాహపురాణం ప్రకారం తిథిదేవతల ఉత్పత్తి ఇలా ఉన్నది:

 1. పాడ్యమి - అగ్ని

 2. విదియ - అశ్వనీదేవతలు

 3. తదియ - ఉమ

 4. చవితి - విష్ణు

 5. పంచమి - భుజంగ 

 6. షష్టి - షణ్ముఖ

 7. సప్తమి - సూర్య 

 8. అష్టమి - మాతృకలు

 9. నవమి - దుర్గ

10. దశమి - దిక్కులు

11. ఏకాదశి - కుబేరుడు

12. ద్వాదశి - విష్ణువు 

13. త్రయోదశి - యముడు

14. చతుర్దశి - శంకరుడు

15. పౌర్ణమి - చంద్రుడు

16. అమావాస్యకు - పితృదేవతలు.

ఇక్కడ వరాహపురాణములో చెప్పబడినది తిథిమండల పూజయని భావించనవసరము లేదు.

చంద్రుని యనుసరించి తిథులు, తిథల ననుసరించి నిత్యాదేవతలు ఆ ప్రకారం తిథిమండల పూజ. ప్రతినిత్యము నిత్యాదేవత పూజతోబాటు పదహారవ నిత్య యయిన మహానిత్యకు (మహాత్రిపురసుందరికి) పూజ చేయుటయే తిథిమండలపూజ యని అనబడును. అమ్మవారు సకల (పదహారు) నిత్యాదేవతా స్వరూపిణి. ఆ విధముగా అమ్మ పూజింపబడుచున్నది గనుక ప్రతిపన్ముఖ్యరాకాంతా తిథిమండల పూజితా యని అనబడినది. అనగా పాడ్యమి మొదలు పున్నమి వఱకు గల పదునైదు తిథులందును పూజింపబడునది అమ్మవారు.

గనుక ఆ శ్రీమాతకు నమస్కరించు నపుడు ఓం ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

611వ నామ మంత్రము 8.3.2022

ఓం కళాత్మికాయై నమః

చతుష్షష్టి కళలకూ తానే స్వరూపంగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము. 

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కళాత్మికా అను నాలుగక్షరముల  (చతురక్షరీ) నామ మంత్రమును ఓం కళాత్మికాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను పూజించు భక్తులకు చక్కని విద్యాబుద్ధులు, ఆలోచనాశక్తి, ఎటువంటి కళలందు అభ్యాసము చేసినను అనాయాసముగా పట్టు సాధించుకొని, అన్నవస్త్రములకు, సుఖసౌఖ్యములకు లోటు లేక జీవించుచూ జగన్మాత నామస్మరణయందు నిమగ్నులై తరించుదురు. 

కళాత్మికా అనగా కళలే తన ఆత్మగా (స్వరూపముగా) విరాజిల్లునది గనుక ఆ పరమేశ్వరి కళాత్మికా యని అనబడినది. ఈ నామములోని కళా యను శబ్దమునకు పది అగ్నికళలు, పండ్రెండు సూర్యకళలు, పదునారు చంద్రకళలు, చతుష్షష్టి విద్యా కళలు.

దశాగ్నికళలు (అగ్నికళలు పది)

 (అగ్నికి గల పది కళలు. అవి :1. ధూమ, 2. అర్చి (అర్చిస్సు), 3. ఉష్ణ, 4. జ్వలినీ, 5. జ్వాలినీ, 6. విస్ఫు లింగినీ, 7. సుశ్రీ, 8. సురూప, 9. కపిల, 10. హవ్యకవ్యవహా), 
 
 ద్వాదశ సూర్యకళలు

1. తపిని, 2. తాపిని, 3. ధూమ్ర, 4. మరీచి, 5. జ్వాలిని, 6. రుచి, 7. సుషుమ్న, 8. భోగద, 9. విశ్వబోధిని, 10. ధరణి, 11. క్షమ, 12. ప్రభ), 

షోడశ చంద్రకళలు 

(1.అమృత, 2. మానద, 3. పూష, 4. తుష్టి, 5. పుష్టి, 6. రతి, 7. ధృతి, 8. శశిని, 9. చంద్రిక, 10. కాంతి, 11. జ్యోత్న్స, 12. శ్రీ, 13. ప్రీతి, 14. అంగద, 15. పూర్ణ, 16. అమృత),
 

చతుష్షష్టి కళలు

1. గీతము (స్వర ప్రధానముగా, పద ప్రధానముగా, లయ ప్రధానముగా మనస్సు యొక్క అవధానము ప్రధానముగా లోలోపల గానము చేయబడునది),

2. వాద్యము (ఇది తత-ఘన-అనవద్ధ-సుషిర భేదములచే నాలుగు విధములు ),

3. నృత్యము (భావాభినయము),

4. అలేఖ్యము (చిత్రలేఖనము),

5. విశేషకచ్ఛేధ్యము (తిలక-పత్రభంగాది రచన),

6. తండులకుసుమ బలివికారములు (బియ్యపుపిండితో, పూలతో భూతతృప్తి కొఱకు పెట్టెడి ముగ్గులు),

7. పుష్పాస్తరణము (పూలశయ్యలను, అసనములను ఏర్పఱచుట),

8. దశన వసనాంగరాగము (దంతములకు, వస్త్రములకు రంగులద్దుట),

9. మణిభూమికాకర్మ (మణులతో బొమ్మలను చేయుట),

10. శయన రచనము (ఋతువుల ననుసరించి శయ్యలను కూర్చుట),

11. ఉదక వాద్యము (జలతరంగిణి),

12. ఉదకాఘాతము (వసంతకేళిలో పిచికారుతో నీళ్ళు చిమ్ముట),

13. చిత్రయోగములు (రకరకముల వేషములతో సంచరించుట),

14. మాల్యగ్రథన వికల్పములు (చిత్ర విచిత్రములైన పూలమాలలను కూర్చుట),

15. శేఖరకాపీడ యోజనము (పూలతో కిరీటమును, తలకు చుట్టును అలంకరించుకొనెడి పూల నగిషీని కూర్చుట),

16. నేపథ్య ప్రయోగము (అలంకరణ విధానములు),

17. కర్ణపత్రభంగములు (ఏనుగు దంతములతోను శంఖములతోను చెవులకు అలంకారములను కల్పించుకొనుట),

18. గంధయుక్తి (అత్తరువులు మొదలగునవి చేసే నేర్పు ),

19. భూషణ యోజనము (సామ్ములు పెట్టుకొను విధానము ),

20. ఇంద్రజాలములు (చూపఱుల కనులను భ్రమింప జేయుట),

21. కౌచిమారయోగము (సుభగంకరణాది యోగములు),

22. హస్త లాఘవము (చేతులలోనున్న వస్తువులను మాయము చేయుట),

23. విచిత్ర శాఖయూష భక్ష్యవికారములు (రకరకముల తినుబండములను వండుట),

24. పానక రసరాగాసవ యోజనము (పానకములు, మద్యములు చేయుట),

25. సూచీవానకర్మ (గుడ్డలు కుట్టుట),

26. సూత్రక్రీడ (దారములను ముక్కలు చేసి, కాల్చి మరల మామూలుగా చూపుట),

27. వీణాడమరుక వాద్యములు (ఈవాద్యములందు నేర్పు),

28. ప్రహేళికలు (సామాన్యార్థము మాత్రము పైకి కనబడునట్లును, గంభీరమైన యర్థము గర్భితమగునట్లును కవిత్వము చెప్పుట),

29. ప్రతిమాల (కట్టుపద్యములను చెప్పుట),

30. దుర్వాచక యోగములు (విలాసము కొఱకు క్లిష్ట రచనలను చదువులట),

31. పుస్తక వాచకము (అర్థవంతముగా చదివెడి నేర్పు),

32. నాటకాఖ్యాయికా దర్శనము (నాటకములకు, కథలకు సంబంధించిన జ్ఞానము ),

33. కావ్యసమస్యాపూరణము (పద్యములతో సమస్యలను పూరించుట),

34. పట్టికా వేత్రవాన వికల్పములు (పేముతో కుర్చీలు, మంచములు అల్లుట),

35. తక్షకర్మ (విలాసము కొఱకు బొమ్మలు మొదలైనవి చేయుట),

36. తక్షణము (కఱ్ఱపని యందు నేర్పు),

37. వాస్తువిద్య (గృహాదినిర్మాణ శాస్త్రము ),

38. రూప్యరత్నపరీక్ష (రూపాయలలోను, రత్నములలోను మంచి చెడుగులను పరిశీలించుట),

39. ధాతువాదము (లోహములుండెడి ప్రదేశములను కనుగొనుట),

40. మణిరాగాకర జ్ఞానము (మణుల గనులను కనిపెట్టుట),

41. వృక్షాయుర్వేద యోగములు (చెట్లవైద్యము),

42. మేషకుక్కుటలావక యుద్ధవిధి (పొట్టేళ్ళు, కోళ్ళు, లావుక పిట్టలు మొదలగు వానితో పందెములాడుట),

43. శుకశారికా ప్రలాపనము (చిలుకలకు, గోరువంకలకు మాటలు నేర్పుట),

44. ఉత్సాధన, సంవాహన, కేశమర్దన కౌశలము (ఒళ్ళుపట్టుట, పాదములోత్తుట, తలయంటుట వీనియందు నేర్పు),

45. అక్షరముష్టికా కథనము (అక్షరములను మధ్య మధ్య గుర్తించుచు కవిత్వము చెప్పుట),

46. మ్లేచ్ఛితక వికల్పములు (సాధుశబ్దమును గూడ అక్షర వ్యత్యయము చేసి అసాధువని భ్రమింపజేయుట),

47. దేశభాషా విజ్ఞానము (బహుదేశ భాషలను నేర్చియుండుట),

48. పుష్పశకటిక (పూలతో రథము, పల్లకి మొదలగునవి కట్టుట),

49. నిమిత్త జ్ఞానము (శుభాశుభ శకునములను తెలిసియుండుట),

50. యంత్ర మాతృక (యంత్ర నిర్మాణాదులు),

51. ధారణ మాతృక (ఏకసంధా గ్రహణము),

52. సంపాఠ్యము (ఒకడు చదువుచుండగా పలువురు వానిననుసరించి వల్లించుట),

53. మానసీక్రియ (మనస్సుయొక్క అవధానమునకు సంబంధించిన క్రియ),

54. కావ్యక్రియ (కావ్యములను రచించుట),

55. అభిధాన కోశచ్ఛందో విజ్ఞానము (నిఘంటువులు, ఛందోగ్రంథములు-వీని పరిజ్ఞానము),

56. క్రియాకల్పము (కావ్యాలంకార శాస్త్ర పరిజ్ఞానము),

57. ఛలితక యోగములు (మాఱువేషములతో నింకొక వ్యక్తివలె చలామణి యగుట),

58. ద్యూతవిశేషములు (వస్త్రములను మాయము చేయుట మొదలగు పనులు),

59. ద్యూతవిశేషములు (జూదము లోని విశేషములను తెలిసికొని యుండుట),

60. ఆకర్షక్రీడలు (జూదములందలి భేదములు),

61. బాలక్రీడనకములు (పిల్లల ఆటలు),

62. వైనయిక జ్ఞానము (గజ అశ్వ-శాస్త్ర పరిజ్ఞానము),

63. వైజయిక విద్యలు (విజయసాధనోపాయములను తెలిసియుండుట),

64. వ్యాయామిక జ్ఞానము (వ్యాయామపరిజ్ఞానము).

ప్రతీ జీవునకు మూడు అవస్థలు ఉండును. అవి 1. జాగ్రదవస్థ, 2. స్వప్నావస్థ, 3. సుషుప్త్యవస్థ. ఈ మూడు అవస్థలకు,  ఒక్కొక్క అవస్థకు నాలుగు చొప్పున పండ్రెండు కళలు గలవు.

జాగ్రదవస్థ కళలు 1. ఉత్పత్తి, 2. జాగరము, 3. బోధము (జ్ఞానము), 4. మనస్సు ఎల్లప్పుడును నివృత్తిని పొందియుండుట.

సుషుప్త్యావస్థ (నిద్రావస్థ) కళలు

1. మరణము, 2. విస్మృతి (మరుపు), 3. మూర్ఛ, 4. అజ్ఞానావృతమగు నిద్ర.

స్వప్నావస్థ కళలు

1. అభిలాష, 2. భ్రమ, 3. చింత, 4. మాటిమాటికి విషయములను స్మరించుకొనుట

ఈ జాగ్రద్, సుషుప్తి, స్వప్న ములకు సంబంధించిన పండ్రెండు కళలు శివరూపములు, శక్తిరూపములు గలవి.

తురీయావస్థ కళలు

1. వైరాగ్యము, 2. ముముక్షుత్వము, 3. సమాధియందు నిర్మలమగు మనస్సు, 4. సద్వస్తువేది? అసద్వస్తువేది? అని విచారించి నిర్థారణ చేయుట. 

ఇంకను దూతీయాగప్రకరణము నందు పదహారు కామకళలు చెప్పబడినవి.

అంతరదూతీ యాగప్రకరణము నందు శ్రీవిద్యకు షోడశకళలు చెప్పబడినవి.

ఇంకను బిందువునకు కొన్ని కళలు, అర్ధచంద్రునకు కొన్ని కళలు, రోధినికి  కొన్ని కళలు వేరు వేరుగా స్వచ్ఛందభైరవి మొదలైన గ్రంథములలో చెప్పబడినది.

పైన చెప్పిన కళలన్నిటి స్వరూపము ఆ పరమేశ్వరియే గనుక అమ్మవారు కళాత్మికా యని అనబడినది.
 
సౌందర్య లహరిలో ఆదిశంకరులు తమ సౌందర్యలహరియందు పదునాలుగవ శ్లోకములో ఈ విధంగా చెప్పారు.
 
క్షితౌ షట్పంచాశ -   ద్ద్విసమధిక పంచాశ దుదకే

హుతాశే ద్వాషష్టి - శ్చతురధిక పంచాశ దనిలే |

దివి ద్విఃషట్త్రింశ - న్మనసి చ చతుఃషష్టిరితి యే

మయూఖాస్తేషామప్యుపరి తవ -  పాదాంబుజయుగమ్ || 14 ||

షట్చక్రాలలోని సహస్రారములో ఉండు దేవి పాదప్రకాశ వైభవం.

 ఓ పరమేశ్వరీ! యోగసాధనలో సాధకుడు షట్చక్రాలనూ అధిగమించి, సహస్రారములో ఉన్న నీ పాదపద్మాలు చేరాలంటే తన దేహంలో ఉన్న పృధివీతత్వంతో కూడిన మూలాధార చక్రంలో ఏబది కిరణాలను దాటి, జలతత్వాత్మికమైన మణిపూరక చక్రంలో ఎబదిరెండు మయూఖములను దాటి, అగ్నితత్వాత్మికమైన అనాహత చక్రంలో ఏబది నాలుగు కాంతిరేఖలు దాటి, ఆకాశతత్వాత్మికమైన విశుద్దచక్రమునందు డెబ్బదిరెండు కాంతికిరణాలు దాటి, మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రము నందు అరువది నాలుగు కిరణపుంజాలు దాటి, ఈ ప్రకారముగా ప్రసిద్ధములైన ఈ మయూఖములు దాటి పైకి చేరుకోగా అచట సహస్ర దళ మధ్యగత చంద్రబింబాత్మకమైన   బైందవ స్థానమున, సుధాసింధువునందు నీయొక్క పాదపద్మముల జంట గోచరమగుచున్నది.
 
పై శ్లోకములో ఆది శంకరులు చెప్పిన ప్రకారం

శ్రీ చక్రమునందు మూలాధార, స్వాదిష్టాన, మణిపూర. అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములును, ఃసహస్రారము కలవు. ఈ ఆరు చక్రములును సోమ, సూర్య, అనిలా(అగ్ని)త్మకములుగా మూడు ఖండములు. "మూలాధార, స్వాదిష్టాన యుగళమైన ప్రథమ ఖండమునకు పై భాగమున అగ్నిస్థానము అదియే (రుద్రగ్రంథి). మణిపూర, అనాహత చక్రములు రెండోవ ఖండము. సూర్యస్థానము అదియే (విష్ణుగ్రంథి). విశుద్ధ, అజ్ఞాచక్రములు మూడవ ఖండము చంద్రస్థానము అదియే (బ్రహ్మగ్రంథి) ప్రథమఖండము పైనున్న అగ్ని తన జ్వాలలచేత ప్రథమఖండమును వ్యాపింప జేయును. రెండవ ఖండము పైనున్న సూర్యుడు తన కిరణముల చేత రెండవ ఖండమును వ్యాపింపజేయును.
మూడవఖండము పైనున్న చంద్రుడు తన కళలచేత మూడవఖండమును వ్యాపింపజేయును. పృథ్వీ తత్త్వాత్మిక మూలాధార చక్రమున (పృథ్వీ అగ్ని జ్వాలలు ఏబది  ఆరు), మణిపూర చక్రమున (ఉదక తత్త్వాత్మిక జ్వాలలు ఏబది రెండు) కలిపి నూటఎనిమిది అగ్ని జ్వాలలు. అట్లే స్వాధిష్టాన (అగ్ని తత్త్వాత్మిక కిరణములు అరువది రెండు), అనాహత చక్రమున (వాయు తత్త్వాత్మిక కిరణములు ఏబది నాలుగు) కలిపి నూటపదహారు సూర్య కిరణములు. 
ఆకాశ తత్త్వాత్మకమగు (విశుద్ధ చక్రమున డెబ్బదిరెండు), మనస్తత్త్వాత్మకమగు (ఆజ్ఞా చక్రమున అరువది నాలుగు) కలిసి నూట ముప్పది ఆరు చంద్రుని కళలు అగుచున్నవి. ఇవి 108+116+136 మొత్తం 360 కిరణములు అగును. ఈ కిరణాలన్నియు అమ్మవారి పాదములనుండి వెడలినవే. ఇవికాకుండా కళావతీ అను (327వ) నామ మంత్రంలో చెప్పిన చతుష్షష్టివిద్యా కళలు, చతుష్షష్టి వృత్తి కళలు కూడా జగన్మాత స్వరూపములే. ఇంకను ప్రతి నామ మంత్ర మందు ప్రతిపాదింప బడిన బీజ, శక్తి, కీలక రూపంలో ప్రధాన బీజాక్షరములు కూడా జగన్మాత స్వరూపములే.  ఆ విధంగా జగన్మాత సకల కళల స్వరూపిణి అని గ్రహించవచ్చును. సకల కళాస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కళాత్మికాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

612వ నామ మంత్రము 9.3.2022

ఓం కళానాథాయై నమః

కళలన్నిటికి తానే పరమావధియై విలసిల్లు పరాశక్తికి నమస్కారము.

కళలందు జగన్మాతయే అని తెలియదగినదిగా ఉన్న పరమేశ్వరికి నమస్కారము.

చంద్రస్వరూపురాలై షోడశకళాప్రపూర్ణగా విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళియందలి కళానాథా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం కళానాథాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి వారు సాధనము చేయు విద్యలందు   (శ్రీవిద్య కూడా) ను మరియు వృత్తి వ్యాపారములందును దినదినాభివృద్ధి నొసగుచూ, అన్న వస్త్రములకు, సుఖ సంతోషములకు కొదవ లేకుండా చేయును. ఇంకను ఆ భక్తులకు ఆధ్యాత్మిక చింతన నందజేసి తరింపజేయును. 

సర్వకళలూ జగన్మాత స్వరూపాలే, సర్వవిద్యల పరిపూర్ణతకు కూడా అమ్మవారే అవధియై ఉండును. ముఖ్యంగా శ్రీవిద్యా స్వరూపిణి మరియు సర్వమంత్ర స్వరూపిణియై భక్తజనులకు బ్రహ్మతత్త్వమే పరమావధియై ఉంటుంది. కళానాథుడు అంటే చంద్రుడు. శ్రీచక్రమధ్యమున అయ్యవారు అమ్మవారు రెండు బిందువులై ఆ రెండు బిందువులలో అయ్యవారు సూర్యునికి సంకేతమైతే అమ్మవారు చంద్రునికి సంకేతముగాను శ్రీమాత చంద్రస్వరూపిణ అని కూడా ఈ నామమంత్రములోని భావము. సర్వేంద్రియములను కళలుగా భావిస్తే ఇంద్రియాలకు అధిపతి మనస్సు, ఆ మనస్సును సూచించేది చంద్రుడు కళానాథుడైతే, అమ్మవారు చంద్రస్వరూపిణి గనుక అమ్మవారిని ఇంద్రియాధినాథురాలి గా కూడా అమ్మవారని ఈ నామ మంత్రములోని భావము.

అట్టి సకలకళాస్వరూపిణి, కళానాథా యని స్తుతింపబడే జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కళానాథాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

613వ నామ మంత్రము 10.3.2022

ఓం కావ్యాలాప వినోదిన్యై నమః

మణిద్వీప సభావేదికపై నిత్యము జరుగు సాహిత్యగోష్ఠులతోను, వేదాంత చర్చలతోను, శ్రీలలితా రహస్యనామ స్తోత్ర పారాయణములతోను, వాణీ వీణానాద వినోదముతోను సంతసమందే పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కావ్యాలాప వినోదినీ అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం ఐం కావ్యాలాప వినోదిన్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఉపాసించు సాధకుడు చతుష్షష్టి కళలలో తానభ్యసించు లేదా ప్రవేశమున్న విద్యలందు రాణించి ప్రావీణ్యతను పొంది కీర్తిప్రతిష్టలతోబాటు, సుఖసంతోషములకు కావసిన ఆర్ధికాభివృద్ధి సాధించుకొనును మరియు ఆధ్యాత్మికతానందము కూడా పొందును.

జగన్మాత మణిద్వీపమునందు కొలువుదీరి, లక్ష్మీ సరస్వతులు కుడి ఎడమలందు ఉండి వింజామరలు వీచుచుండగా  (సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా), వశిన్యాది వాగ్దేవతల దేవీ స్తోత్రపఠనములతోను, నారదాది మహర్షుల వేదాంత గోష్ఠులతోనూ, ఇంకను గంధర్వుల మధుర గీతాలాపనములతోను, వాణీ వీణానాద వినోదముతోను ఆహ్లాదభరితమైన సభామధ్యమున మిక్కిలి సంతోషభరితయై విరాజిల్లుచున్నది ఆ పరమేశ్వరి. అమ్మ చతుష్షష్టి కళలందు ప్రవీణురాలైన కళాస్వరూపిణి కనుకనే కవిత్వమనిననూ, కావ్యాలాపమనిననూ ఎంతో ప్రీతిగలిగినది గనకనే కావ్యాలాపవినోదిని అని నామ ప్రసిద్ధమైనది.

అటువంటి పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం కావ్యాలాపవినోదిన్యై నమః అని   అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

614వ నామ మంత్రము 11.3.2022

ఓం సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితాయై నమః

కుడిఎడమలందు లక్ష్మీసరస్వతులు  వింజామరలతో సేవింపబడు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళిలో  సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా అను పదహారు అక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితాయై నమః అని ఉచ్చరించుచూ ఆ శ్రీమాతను ఉపాసన చేయు ఉపాసకులకు లక్ష్మీ, సరస్వతుల వలన జ్ఞానసంపదలు, అష్టైశ్వర్యములు, శ్రీమాత కరుణచే సర్వమంగళములు ప్రాప్తించును మరియు నిరంతరం శ్రీమాత సేవనుకూడా చేయుచు తరింతురు.

లక్ష్మీసరస్వతులు ఇరువురు సింహాసనారూఢురాలైన శ్రీమాతకు, వరుసగా ఎడమ, కుడివైపున నిలబడి వింజామరలు వీచుతూ ఉంటారు. ఒకరు విత్తమునకు మరియొకరు విద్యలకు అధిష్ఠాన దేవతలవడంచేత, జగన్మాత సేవాభాగ్యంచే లక్ష్మీకటాక్షము, ఆ పైన సరస్వతీ కటాక్షము కూడా అనుగ్రహింపబడడం జరుగుతుంది. శ్రీలలితా సహస్రనామార్చన చేయునపుడు ప్రతీ నామ మంత్రమునకు ముందు ఓం ఐం హ్రీం శ్రీం అను బీజాక్షరములను పలుకుతాము కదా! వీటిలో, మఖ్యంగా, అమ్మవారి యొక్క శక్తి బీజం హ్రీం నకు ఇరువైపుల సరస్వతీ బీజం ఐం మరియు లక్ష్మీ బీజం శ్రీం ఉండుట మనం గమనించవచ్చును. సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా యను నామముతో ఐం హ్రీం శ్రీం అను బీజాక్షరములను సమన్వియించి వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కీర్తించారని భావించవచ్చును. అది మాత్రమే గాక, ఇదే క్రమంలో మువురమ్మలను అనేక విధాలుగా స్మరిస్తూ .ఉంటాము. ఐం హ్రీం శ్రీం అను ఈ మూడు ఆ మువురమ్మల సూక్ష్మస్వరూప సందర్శనము అయితే మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతి అనునది స్థూలరూప సందర్శనము అని కూడా భావించవచ్చును. అదేవిధంగా సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా యను నామ మంత్రమును కూడా ఈ భావమునకు అనుసంధానింప బడినది అని కూడా తలవవచ్చును. అది ఎలాగ అంటే అమ్మవారు మధ్యన ఉండగా ఎడమ, కుడి ప్రక్కలలో లక్ష్మీసరస్వతులు గలరని ఈ నామ మంత్రములోని అంతరార్థము. సాధకుడు ఈ నామ మంత్రమును సంపుటీకరించి శ్రీలలితా సహస్ర నామ స్తోత్రమును పారాయణ చేస్తే, లక్ష్మీకటాక్షముతో బాటు సరస్వతీ కటాక్షము కూడా లభించి అష్టైశ్వర్యములు, అఖండమైన జ్ఞానసంపద సంప్రాప్తమగుననుట అతిశయోక్తి కానేరదు. విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఈ నామ మంత్ర పారాయణము అత్యుత్తమ ఫలములను ఈయగలదని భావించవచ్చును. 

శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

615వ నామ మంత్రము 12.3.2022

ఓం ఆదిశక్త్యై నమః

అన్నిటికి ప్రప్రథమంగా ఉన్న శక్తిస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి ఆదిశక్తిః అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం ఆదిశక్త్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరాశక్తిని ఆరాధించు భక్తులకు ఆ తల్లి విశేషమైన జ్ఞానసంపదను, ఆధ్యాత్మకానందమును సంప్రాప్తింపజేసి తరింపజేయును.

సకల జగత్తులకును ఆది (ముందుగా ఉన్న) శక్తి (శక్తిస్వరూపిణి). ఆ పరబ్రహ్మస్వరూపిణి యైన పరమేశ్వరి దేశకాలాఽపరిచ్ఛిన్నా యని అనబడినది. అనగా ఆ తల్లి ఉనికి (ఉన్న ప్రదేశముగాని), ఎప్పటి నుండి ఎప్పటి వరకూ ఉంటుంది అని దేశకాలములచే విభజించి చెప్ప శక్యముకానిది. సృష్టికి ముంది, సృష్టి ఉన్నంత వరకును, లయము తరువాతను కూడా, ఇప్పుడు, అప్పుడు, ఇక్కడ, అక్కడ అనే శబ్దాదులకు అతీతంగా ఉంఢు ఆ తల్లి అన్ని వస్తువులకు ముందుగా  ఉండు శక్తిస్వరూపిణి అయినది గనుక అమ్మవారు  ఆదిశక్తిః యని అనబడినది.  ఆ పరమేశ్వరి ఉండడానికి హద్దులు లేవు. కొలవడానికి కాలమానము ఏదియును లేదు. సదా అనే శబ్దానికి ముందే ఉన్నది ఆ పరాశక్తి. అందుకే ఆ అమ్మ ఆదిశక్తిః యనిఅనబడినది. 

కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు. ఇది 432 కోట్ల సంవత్సరాలు. ఒక కల్పంలో పదునాలుగు మన్వంతరాలుంటాయి. మన్వంతరాన్నే మనుయుగమని కూడా అంటారు. మన్వంతరానికి 31,10,40,000 సంవత్సరాలు. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పాలిస్తాడు. ప్రస్తుతం నడుస్తున్నది ఏడవ మన్వంతరం. పాలిస్తున్నది వైవస్వత మనువు. దీన్ని వైవస్వత మన్వంతరం అంటారు. ఒక్కో మన్వంతరంలో 71 మహాయుగాలు, ఒక్కో మహాయుగంలో నాలుగు యుగాలు (కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలు) ఉంటాయి.

దేవతల కాల ప్రమాణము మన (మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.

 కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి వంద సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.

కాలమానము సౌర (మానవ) సంవత్సరాలు దివ్య

అమ్మవారు ఈ కాలము, కల్పములు, యుగములు, చతుర్యుగములు అను శబ్దాలకు అతీతురాలు. గనుక ఆ తల్లి దేశకాలాఽపరిచ్ఛిన్నా యని అనబడినది. అలా అనబడినది గనుకనే ఆదిశక్తిః యని అనబడినది.

శరీరములు నిత్యముకావు. అటువంటి అనిత్యమైన శరీరముల మధ్యన మరియు శాశ్వతముకాని అశాశ్వతముల మధ్య శాశ్వతమైనదిగా ఉంటున్నది పరమేశ్వరి. ఆత్మ నిత్యము. అశాశ్వతమైన ఒక శరీరం నుండి నిష్క్రమిస్తే ఇంకొక అశాశ్వతమైన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆత్మకు ఉపాధి శరీరము. కాని పరమాత్మయైన పరాశక్తి నిత్యమైనది, సత్యమైనది, సర్వవ్యాపకమైనది, ఉపాధి అవసరము లేనిది, సకలమునకు తొలుత, సకలముతోను, సకలము తరువాతనూ కూడా ఉంటుంది. గనుకనే ఆ పరమాత్మ ఆదిశక్తిః యని అనబడినది.

ఆ తల్లి బైందవాసని. అనగా శ్రీచక్రమునందు బిందుస్థానంలో ఉంటుంది. అంటే తొలుత బిందువు.  ఆ బిందువు ఆధారంగా త్రికోణములు, ఆవరణలు అన్నీ ఉన్న శ్రీచక్రము అంటాము. మహాచతుష్షష్టి కోటి  యోగినీ గణములచే సేవింపబడుచున్నది. అంటే అన్ని కోట్లమంది యోగినీ శక్తులకు నాయిక. ముందుగా బిందుస్వరూపిణియైన పరమేశ్వరిని పరిగణించి పిదప మహాచతుష్షష్టి యోగినీ గణములను తిలకించాలి. గనుకనే అమ్మవారు ఆదిశక్తిః యని అనబడినది.

భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము అనునవి పంచభూతములు. వీటితో ఏర్పడిన ప్రకృతియే ఈ జగత్తు. కాని ఈ ప్రకృతులకు (పంచభూతములకు) మూలమైన పరమేశ్వరి మూలప్రకృతి యైనది, సకల శక్తులకు మూలమైనది. గనుకనే ఆదిశక్తిః యని అనబడినది. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులు మువురమ్మలు. కాని ఈ మువురమ్మలకు మూలపుటమ్మ మహాకాళి, ఆ మహాకాళియే మూలశక్తి. ఆ మూలశక్తియే ఆదిశక్తిః యని అనబడినది.

సకలజగతాముత్పాదకత్వాదాదికారణభూతా చ సా శక్తిశ్చ (సౌభాగ్యభాస్కరం, 732వ పుట)  అనగా సకల లోకములు పరమేశ్వరిచే సంభవించినవి. జగత్తులన్నిటికి ఆదికారణభూతురాలు. కార్యమునకన్నా ముందుగా కారణముండును గనుక, పరాశక్తియే కారణమైనది (ముందుగా ఉన్నది యైనది) గనుక అమ్మవారు ఆదిశక్తిః యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించు నపుడు ఓం ఆదిశక్త్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

616వ నామ మంత్రము 13.3.2022

ఓం అమేయాయై నమః

కొలతలకు, వచనములకు, నిర్వచనములకు, ప్రవచనములకు, నుతులకు, నేత్రములకు, మనో నేత్రములకు పరమేశ్వరి ఫలానా అని  చెప్పుటకు యలవి కాని తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి అమేయా అను  మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును భక్తిశ్రద్ధలతో ఓం అమేయాయై నమః అని ఉచ్చరించుచూ ఉపాసించు భక్తులకు ఆ జగన్మాత అనన్యభక్తిప్రపత్తులను కలుగజేసి, ఆత్మానందానుభూతి ప్రసాదించి అనుగ్రహించును.

అన్నింటికి అతీతమైన పరబ్రహ్మాన్ని కేవలం సాధనతో అనుభూతమొనర్చు కోవాలి. అయితే సగుణ సాకార రూపము, తల్లి భక్తుల నిమిత్తం ధరించునది మాత్రమే. కాని జగన్మాత స్వరూపము సగుణ, సాకారమునకు, నిర్గుణ, నిరాకారమునకు కూడా అతీతమైనది. అమేయా అనగా కొలుచుటకు, నిర్వచించుటకు సాధ్యము కానిది. 

మాటలద్వారా చెప్పడానికి, మనసారా ఇలాగ అని చింతింప శక్యము గానిది ఆ పరబాహ్మస్వరూపిణియైన పరమేశ్వరి.   సర్వమునకు అతీతమైనది.  ఆ పరమేశ్వరిని గురుంచి ప్రవచించాలన్నా, ఆ మహిమలు ఇవి మాత్రమేనని వచించాలన్నా, భక్తవాత్సల్యత ఇలా ఉంటుదని నిర్వచించాలన్నా - సర్వమునకూ కూడా అతీతమైనది.  ఆ పరమాత్మ సకలజీవులలో ఆత్మగాను పరమాత్మగాను ఉంటుంది గాని, ఆ ఆత్మకు గల గుణములుగాని, ఆ పరమాత్మయొక్క తత్త్వములు గాని వివరించ సాధ్యము గాని పరబ్రహ్మస్వరూపము ఆ పరాశక్తిది. ఆ తల్లి ఆర్తత్రాణపరాయణత్వము
అనంతమైనది, గణింప శక్యముగానిది. దేనితోను గుణింపతరముగానిది. ఆ తల్లి  కరుణాంతరంగమును గాని, వాత్సల్యపూరితమైన దృక్కులుగాని కొలచుటకు, విభజించుటకు, పంచుటకు అలవి కానివి. ఆ కరుణాతరంగిత వీక్షణములు ఎల్లెడలా వ్యాప్తమైనవి. అనంతకోటి జీవరాశులలో  నేను అని తెలియబడే ఆ నేను అనే ఆ ఆత్మ ఆ పరమాత్మయే.  ఆ ఆత్మ నిత్యమైనదే. సత్యమైనదే. అనంతమైనదే. కాని ఆ నిత్య, సత్య, అనంతముల పరిమాణము అమేయము. గనుకనే ఆ పరమాత్మ అమేయాత్మ యని అనబడినది.

అట్టి అమేయాత్మకు నమస్కరించునపుడు ఓం అమేయాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

617వ నామ మంత్రము 14.3.2022

ఓం ఆత్మనే నమః

సకలమునకు ప్రాణాధారమైన ఆత్మస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. శివుని అష్టమూర్తుల (పంచభూతములు, సూర్యచంద్రులు, పురుషుడు) లో చంద్రుడు (చంద్రస్వరూపిణి) అయిన జగన్మాతకు నమస్కారము.

ఆ తల్లి ఒక చైతన్య శక్తి. ఆ చైతన్యశక్తియే ఆత్మ. ఆ ఆత్మయే పరమాత్మ గనుక ఆ తల్లి పరమాత్మా యని అనబడినది.
ఆత్మా అనగా ఆత్మస్వరూపిణి. 

శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీతలో, ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు. ఆత్మ రెండు విధాలు. 1. జీవాత్మ 2. పరమాత్మ. విశ్వవ్యాప్తంగా ఉండే శక్తి పరమాత్మ అనియు, జీవులలో ఉండే తన అంశను జీవాత్మ అని వివరించాడు. ఈ జీవాత్మే ఆత్మ. ఆత్మ నాశనం కానిది, శస్త్రం ఏదీ ఛేదించలేనిది, అగ్ని దహించలేనిది, నీరు తడపలేనిది, వాయువు ఆర్పలేనిది అని వివరించాడు. ఇంతేకాక అహం బ్రహ్మస్మి మరియు అయమాత్మ బహ్మ అనే ఉపనిషద్ వాక్యాలు కూడా నీలో ఉన్న ఆత్మ భగవంతుని అంశే కనుక ఆవిషయాన్ని తెలుసుకోమని చెబుతున్నాయి. 

అగ్నినుండి అగ్నికణములు ఎలా అయితే బయలుదేరుచున్నవో, అలాగే సదాశివుని వలన అనంతకోటి జీవరాశులు బయల్వెడలుచున్నవి అని లింగపురాణమునందు చెప్పబడినది. ఆ సదాశివుడు పరమాత్మ అని చెప్పబడుచున్నాడు. ఆ బయల్వెడలిన జీవులన్నిటిలోను ప్రాణశక్తిగా ఉండే పరమాత్మయే ఆత్మ యని అనబడుచున్నది. గనుక పరమాత్మస్వరూపిణియైన పరమేశ్వరి ఆత్మా యని అనబడినది. శివపురాణంలో  శంకరుడు అష్టమూర్తి. వానిలో శంకరుడు గొప్పదియగు ఎనిమిదవ మూర్తి.

1. భవుడు, 2. శర్వుడు, 3. ఈశానుడు, 4. పశుపతి, 5. భీముడు, 6. ఉగ్రుడు, 7. మహాదేవుడు, 8. శంకరుడు.

ఎనిమిది స్వరూపములు గలవాఁడు, శివుఁడు. అవి ఏవి అంటే పంచభూతములును, సూర్యచంద్రులును, యాగముచేయు యజమానుఁడును శివుని యష్టమూర్తులు. పురుషుడు అనగా యాగము చేయు యజమాని కూడా శివస్వరూపుడు. 

పరమాత్మ ప్రతీజీవిలోను జీవాత్మకు  తోడుగా ఆత్మస్వరూపుడై యుంటున్నాడు. ఆ ఆత్మస్వరూపుడైన పరమాత్మ జీవాత్మతో ఉంటున్నాడు గనుకనే శరీరానికి చైతన్యం కలుగుతోంది. బిడ్డగా పుట్టిన శరీరం పెరుగుతూ, ఆకలికి అన్నంతింటూ, దాహానికి నీరుత్రాగుతూ, నడుస్తూ, ఏడుస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ, బంధాలను పెంచుకుంటూ పెరుగుతోంది. బాల్యము, యౌవనము, కౌమారము, వృద్ధాప్యము అను దశలను పొందుతూ ఉంటున్నది. శిధిలావస్థకు చేరిన శరీరాన్ని విడిచి మరల వేరొక శరీరంలో ప్రవేశిస్తున్నది. మళ్ళీ అన్ని దశలూ పునరావృతమౌచున్నవి. కాని ఆత్మకు ఏవిధమైన వికారములు లేవి. పరమాత్మ ఏ శరీరానికి తీసుకువెళితే ఆ శరీరంలో ప్రవేశిస్తున్నది. ఆత్మలో ఆత్మగా ఉండేది పరమాత్మ. గనుకనే పరమేశ్వరి ఆత్మా యని అనబడినది.
 
అమ్మవారికి నమస్కరించునపుడు ఓం ఆత్మనే నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

618వ నామ మంత్రము 15.3.2022

ఓం పరమాయై నమః

సర్వోత్కృష్టమైన (అన్నింటికి మిన్నయై) విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము. 

.శ్రీలలితా సహస్ర నామావళి యందలి పరమా అను మూడక్షరముల (త్ర్యక్షరి) నామ మంత్రమును ఓం పరమాయై నమః అని ఉచ్చరించుచూ శ్రీమాతను ఉపాసించు సాధకుని అమ్మవారు కరుణించి అతని జ్ఞానసంపదలను వృద్ధిజేసి  అతనికి ప్రవేశమందున్న న్యాయ బద్ధమైన విద్యలందు సర్వోత్తమునిగా ఉద్ధరించి ఎనలేని కీర్తిప్రతిష్టలు ప్రాప్తింపజేయును. 

పరమేశ్వరి శేష్ఠమైన రూపము గలిగియున్నది. బ్రహ్మ అని చెప్ఫబడే పరం అంటే శివుడు. అతడే పరబ్రహ్మ. పరబ్రహ్మకు నాలుగు రూపములు గలవు అని విష్ణు పురాణంలో చెప్పబడినది. 

1. పురుషుడు. 2. వ్యక్తము, 3. అవ్యక్తము, 4. కాలము. ఈ నాలుగింటికన్నా గొప్పది పరమేశ్వరి. అంటే శ్రేష్ఠమైనది. గనుక ఆ పరమేశ్వరి పరమా యని అనబడినది.  పరమశివుని ఐశ్వర్య స్వరూపురాలు పరమేశ్వరి. పరమాత్మను కొలుచునది పరమేశ్వరి. ఆ పరమేశ్వరి శ్రేష్ఠమైనరూపము గలది గనుక పరమా యని అనబడినది.  సృష్టిస్థితిలయసంహారములను కార్యకారణములకన్నా పరమైనది గనుక ఆ తల్లి పరమా యని అనబడినది.

అది ప్రాతఃకాలము అనగా సూర్యుడుదయించక పూర్వము. తూర్పు తెల్లవారుతోంది. సూర్యుడు క్రమంగా కనిపిస్తున్నాడు. తూర్పుదిశ అంతయు కుంకుమ ఆరబోసినట్లు ఉంది. ఆ మధ్యలో కనిపించే  సూర్యకిరణముల రమణీయత చూడాలే గాని మాటలలో చెప్పలేము. పక్షుల  కిలకిలారవములు వీనులవిందుగా ఉన్నాయి. చల్లని వసంతకాలపు వాయువులు శరీరానికి హాయిగొలుపుతున్నాయి. గుంజకు కట్టబడియున్న లేగదూడ పాలకొరకు తల్లిప్రక్కకు చూస్తున్నది.  తన బిడ్డకోసం దూరంగా కట్టబడి ఉన్న గోమాత అలాచూస్తూ, దీనంగా అరుస్తోంది. ఇదంతా ఆ పరమేశ్వరి ప్రకృతి ప్రసాదించిన రమణీయత.

రకరకాల పుష్పములకు రకరకాల వన్నెలు. రకరకాల సుమగంధములు. ఎన్ని పూలనో ఎన్నెన్నో రంగులతో ఇచ్చి ఆ పరమాత్మ తన రసికతను చాటుకున్నాడు. జీవులు - తల్లీ, తండ్రి, బిడ్డలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ఎన్నో బంధాలు. ఒకరికోసం ఒకరు త్యాగమూర్తులు కాగల పెనుబంధాలు. ఇదే జగత్తుయొక్క అందం. ఇంత అందం జగత్తుకు  ప్రసాదించిన పరమేశ్వరి తత్త్వమే పరమా యని అనబడుచున్నది.

అటువంటి శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం పరమాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

619వ నామ మంత్రము 16.3.2022

ఓం పావనాకృతయే నమః

పవిత్రమైన ఆకృతులకు మూలమై, జ్ఞానరూపిణియై, లోకములో పవిత్రతనంతయూ రూపుకట్టుకొనిన ఆకారము గలిగినదై, పరమ పవిత్రస్వరూపిణియై విరాజిల్లు పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి పావనాకృతిః అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం పావనాకృతయే నమః అని ఉచ్చరించుచూ జగన్మాతను ఉపాసించు సాధకులు పరమపవిత్రతను ఆ తల్లి కరుణచే ప్రాప్తింపజేసుకుని, నిరంతరము జగన్మాత పాదసేవయే పరమావధిగా జీవించి తరించుదురు.

పావనకృతిః యనగా స్మరించినంతనే  పరమేశ్వరి మనను పావనముచేయును. అను నిత్యము ఖడ్గమాలా స్తోత్రపారాయణము, లలితాసహస్రనామస్తోత్రము ప్రథమోఽధ్యాయము, ద్వితీయ, తృతీయోఽధ్యాయములు చక్కని ఉచ్చారణతో, ఏకాగ్రతతో, అవకాశమైతే గురుసమక్షంలో సాధనచేసి నిత్యము పారాయణచేసి, యథాశక్తి నివేదన సమర్పించి, ఆ ప్రసాదము స్వీకరించి, మంచి ఆలోచనలతో, అందరి మంచిని కోరుతూ, పదిమందికి జగన్మాత కథాశ్రవణమును చేయగలిగితే మనంకూడా పావనమౌతాము. వ్యాసభగవానుడు, శంకరాచార్యులవారు, కంచి పరమాచార్యులవారు, నడిచే దేవుడైన మహాస్వాములు చంద్రశేఖరేంద్ర సరస్వతులవారు మొదలైన పీఠాధిపతుల వంటి పావనాకృతులకు జగన్మాతయే ములకారణము, సర్వాంతర్యామి అయిన ఆ పరమేశ్వరి పవిత్రస్వరూపిణి. జ్ఞానరూపిణి. పరబ్రహ్మస్వరూపిణి. గనుకనే పరమాత్మ అయిన శ్రీమాత పావనాకృతిః అని స్తుతింపబడుతున్నది. ఆ పవిత్రత అంతా రూపుకట్టుకొనిన ఆకారము జగన్మాతదే.  

జగన్మాత చిదగ్నికుండ సంభూత,  మూలమంత్రాత్మిక, సృష్టి - స్థితి - లయ - సంహార - తిరోధాన అనుగ్రహములు అనే అయిదు కార్యములందును (పంచకృత్యములందును) ఆసక్తి కలగినది, విరాట్స్వరూపుడైన విష్ణుమూర్తి దశాకృతులను తనచేతివ్రేళ్ళ గోళ్ళసందుల నుండి ఉత్పన్నము చేసిన శ్రీమన్నగరనాయిక, భండాసురాది లోకకంటకులైన రాక్షసులను సంహారముచేసి ధర్మాన్ని సుస్థిరంచేసిన పరబ్రహ్మస్వరూపిణి, కోట్లాది సహస్ర నామములలో తన (రహస్యాతి రహస్యమైన శ్రీలలితా) సహస్ర నామములే శ్రేష్ఠములైనంతగా విరాజిల్లిన అఖిలాండేశ్వరి గనుకనే ఆ జగన్మాత పావనాకృతిః అని యనబడినది.

సతీదేవిగా యజ్ఞకుండము నందు ఆత్మార్పణము చేసికొని, దక్షయజ్ఞవినాశినియై, భారతదేశమంతటనూ గల శక్తిపీఠములకు అధిష్ఠానదేవతయై విరాజిల్లుతూ, స్మరణ మాత్రముననే భక్తులను పవిత్రులను  చేయుచున్నది గనుకనే పరమేశ్వరి పావనాకృతిః అని యనబడుచున్నది.

అటువంటి పావనాకృతిః యని అనబడిన ఆ పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం పావనాకృతయే నమః యని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

620వ నామ మంత్రము 17.3.2022

ఓం అనేకకోటిబ్రహ్మాండ జనన్యై నమః

అనేక బ్రహ్మాండ సముదాయములకు సృష్టికారకురాలై, జనయిత్రియైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి అనేకకోటిబ్రహ్మాండ జననీ యను పదకొండక్షరముల నామ మంత్రమును ఓం అనేకకోటిబ్రహ్మాండ జనన్యై నమః అని ఉచ్చరించుచూ ఆ మహాతల్లిని అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకునికి సృష్టి, సృష్టికి కారణభూతురాలైన జగన్మాతను ప్రసన్నం చేసుకోవడానికీ కావలసిన ఏకాగ్రత లభించి నిరంతర సాధనతో  బ్రహ్మతత్త్వాన్ని అర్థంచేసుకుని శాశ్వతమైన పరంధామమునకు మార్గము లభించి తరించును.

అనేకకోటి బ్రహ్మాండజననీ - అనగా అనంతమైన అనగా లెక్కింప శక్యముకాని బ్రహ్మాండములను ఆ పరమేశ్వరి సృష్టించినది. 

వేదంలో చెప్పబడిన విరాట్ పురుషుడు, పరమాత్మ అన్నియును ఆ పరమేశ్వరియే. 

వేదములు ఆ పరమాత్మను ప్రతిపాదించు చున్నవి. దేవతలు ఎల్లరును ఆ పరమాత్మ అంగములనుండియే ఉద్భవించిరి. లోకములన్నియును ఆ పరమాత్మ చేతనే వ్యాప్తములై యున్నవి. క్రతువులన్నింటి ద్వారా ఆ పరమాత్మయే ఆరాధింపబడుచుండెను. ఆ పరమాత్మను పొందుటకే ఉపాసనాత్మక యోగములన్నియును ఆచరింపబడుచున్నవి. సకల తపశ్చర్యల లక్ష్యమూ ఆ పరమాత్మయే. జ్ఞానసాధనలు అన్నియునూ ఆ పరమాత్మను జేరుటకే.  ఆ పరమాత్మ ద్రష్ట, నియామకుడు, సకల ప్రాణులకును ఆత్మయైనవాడు, నిర్వికారుడు, బ్రహ్మ కూడా ఆయనచేతనే సృష్టింపబడెను.  ఆ పరమాత్మ త్రిగుణాతీతుడు, అనంతుడు. ఐననూ, అతడు లోకములయొక్క సృష్టి, స్థితి, లయముల కొరకే మాయద్వారా సత్త్వరజస్తమో గుణములను (త్రిగుణములను) స్వీకరించెను. జీవుడు తాను నిత్యముక్తుడేయైనను, ఈ మూడు గుణములను ఆశ్రయించియే, శరీరము, జ్ఞానేంద్రియములు, వాటి కార్యకలాపముల మాయలో చిక్కుకొని, కార్య, కారణ, కర్తృత్వముల అభిమానముచే బంధింపబడుచున్నాడు.  ఇంద్రియాతీతమైన ఆ పరమాత్మ ఈ మూడు గుణముల చేత కప్పబడియుండును. ఆ కారణముననే ఆ పరమాత్మయొక్క నిజస్వరూపము లోకమునకు గోచరింపదు. కేవలము గుణములే కనబడుచుండును. కావున లోకులు పరమాత్మను ఎరుగజాలరు. పరమాత్మ శక్తి ప్రభావమున కాలము మూడు గుణములచే సంక్షోభము చెందెను.  కర్మ మహత్తత్త్వమును ఉత్పన్నము గావించెను. రజోగుణము, సత్త్వగుణము వృద్ధిజెందుటవలన వికారమును పొందుచున్న మహత్తత్త్వమునుండి తమోగుణప్రధానమైన వికారము ఉత్పన్నమయ్యెను. దాని నుండి ద్రవ్య, జ్ఞాన, క్రియారూపములు ప్రకటమయ్యెను. ఇది అహంకారముగా చెప్పబడినది. సాత్త్వికాహంకారము, వైకారికము అనియు రాజసాహంకారము తైజసము అనియు, తామసాహంకారము తామసము అనియు వ్యవహరింపబడెను. ఇవియే క్రమముగా జ్ఞానశక్తి, క్రియాశక్తి, ద్రవ్యశక్తి ప్రధానములు అయ్యెను. పంచమహాభూతముల కారణరూపమైన తామసాహంకారమునందు వికారము ఏర్పడినప్పుడు దానినుండి ఆకాశము ఉత్పన్నమాయెను.  ఆకాశముయొక్క తన్మాత్ర శబ్దగుణమయ్యెను. ఆకాశమునందు వికారము ఏర్పడినప్పుడు దానినుండి వాయువు ఉత్పన్నమయ్యెను. దాని గుణము స్ఫర్శ. ఆ వాయువు శబ్దగుణముతో గూడ మిళితమై యుండును. ఇంద్రియములయందు స్ఫూర్తి శరీరమునందు జీవనశక్తి, ఓజస్సు, బలము అనునవి ఈ వాయువుయొక్క రూపములే. కాల, కర్మ, స్వభావమువలన వాయవునందు గూడ వికారము ఏర్పడెను. దానినుండి తేజస్సు ఉత్పన్నమాయెను. దాని గుణము, రూపము, ఆకాశ-వాయువుల గుణములైన శబ్దస్పర్శలు గూడ ఈ రూపగుణముతో మిళితములై యుండును. తేజస్సు యొక్క వికారము నుండి జలము ఉత్పన్నమయ్యెను. దీని గుణము రసము. దీనియొక్క కారణతత్త్వగుణములైన శబ్ద, స్పర్శ, రూపములు దీనితో అనగా జలముతో కలసియుండును. జలముయొక్క వికారమువలన పృథ్వి ఉత్పన్నమయ్యెను. దీని గుణము గంధము.శబ్ద, స్పర్శ, రూప, రసములు అను నాలుగు గుణములుగూడ ఇందు కలిసియుండును. వైకారికము అనగా సాత్త్వికాహంకారము నుండి మనస్సు మరియు పది ఇంద్రియములయొక్క అధిష్టానదేవతల ఉత్పత్తి జరిగెను. వారి పేర్లు వరుసగా దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీకుమారులు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి.తైజసము నుండి అనగా రాజసాహంకార వికారమునుండి శ్రోత్రము, చర్మము, నేత్రము,జిహ్వ, నాసిక అను ఐదు జ్ఞానేంద్రియములు, అట్లే వాక్, పాణి, పాద, పాయూపస్థలు అను కర్మేంద్రియములు ఉత్పన్నములయ్యెను. వాటితో పాటు జ్ఞానశక్తి రూపమైన బుద్ధి, క్రియాశక్తి రూపమైన ప్రాణముగూడ తైజసాహంకారము నుండియే ఉద్భవించెను. ఈ పంచమహా భూతములు, ఇంద్రియములు, మనస్సు, సత్త్వాది త్రిగుణములు, పరస్పరము సంఘటితము కానంతవరకు విషయభోగములకు సాధనరూపమైన శరీరము నిర్మింపబడుటకు సమర్థము కాకుండెను. భగవంతుడు తన శక్తి ప్రభావముచేత ఈ తత్త్వములను ప్రేరేపించినప్పుడు అవి పరస్పరము ఒకదానితో మరియొకటి కలిసిపోవును. అప్పుడు కార్యకారణ భావములను స్వీకరించి, వ్యష్టి, సమిష్టిరూప, పిండ, బ్రహ్మాండములను రచించుటకు  వీలుపడును. విరాట్ పురుషుడు వేలకొలది ఊరువులు, పాదములు, భుజములు, నేత్రములు, ముఖములు, శిరస్సులతో శోభిల్లుచుండెను. విద్వాంసులు ఉపాసన కొరకై ఆ   విరాట్ పురుషుని అంగములయందే సమస్త లోకములను , అందలి వస్తువులను కల్పన చేయుదురు. ఆ విరాట్ పురుషుని నడుమునకు క్రింది భాగమున గల అవయవముల యందు పాతాళాది ఏడు అధో లోకములను, నితంబనమునకు పై భాగమున గల అంగములయందు భువర్లోకము మొదలుకొని సత్యలోకమ వరకు ఏడు ఊర్ధ్వలోకములు కల్పించెదరు. ఆ విధముగా వారు తమ ఉపాసనలను కొనసాగింతురు. 

ఆ విరాట్ పురుషుని ముఖమునుండి బ్రాహ్మణులు, బాహువులనుండి క్షత్రియులు, ఊరువులనుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు ఉద్భవించిరి. 

పరమాత్మ పాదముల నుండి కటి ప్రదేశము వరకు పాతాళలోకము నుండి భువర్లోకము వరకు ఏడు అధోలోకములు మరియు భూలోకము కల్పింప బడినది. నాభి యందు భువర్లోకము, హృదయమునందు స్వర్లోకము, వక్షస్థలమున మహర్లోకము ఉన్నట్లు కల్పింపబడెను. ఆ విరాట్ పురుషుని కంఠసీమ యందు జనలోకము, స్తనద్వయమునందు తపోలోకము, మూర్ధస్తానమునందు బ్రహ్మకు నివాసస్థానమైన సత్యలోకము కలవు. ఆ విరాట్ పురుషుని నడుము భాగమునందు అతలము, తొడలయందు వితలము, మోకాళ్ళయందు శుద్ధమైన సుతలము, పిక్కలయందు తలాతలము కల్పించబడినవి. చీలమండల యందు మహాతలము, ముంగాళ్ళయందు రసాతలము, అరికాళ్ళయందు పాతాళము అను లోకములు గలవు. విరాట్ పురుషుని యొక్క అంగములయందు మరొకవిధముగా ముల్లోకములును కల్పింపబడినవి. దాని ప్రకారము ఆయన పాదములు భూలోకముగా, నాభిని భువర్లోకముగా, శిరస్సు స్వర్లోకముగా కల్పింపబడినవి.

విరాట్ పురుషని ముఖమునుండి వాగింద్రియము, దాని అధిష్ఠానదేవతయైన అగ్నియు ఉద్భవించెను. ఆ విరాట్ పురుషుని ఏడు ధాతువులనుండి గాయత్రి, అనుష్టుప్, ఉష్ణిక్, త్రిష్టుప్, జగతీ, పంక్తి, బృహతీ అను ఏడు ఛందస్సులు ఉద్భవించెను. దేవతలు భుజించే హవ్యము, పితృదేవతలు భుజించెడు కవ్యము, మనుష్యులు భుజించుటకు యోగ్యమైన అమృతమయమగు అన్నము, వివిధములైన రసవస్తువులు, రసనేంద్రియము, దానికి అధిష్ఠానదైవమైన వరుణుడును విరాట్ పురుషుని జిహ్వనుండి ఉద్భవించినవి. ఆ విరాట్ పురుషుని నాసా పుటమునుండి ప్రాణము-అపానము-వ్యానము-ఉదానము-సమానము అనెడు పంచప్రాణములును, వాయువు ఉత్పన్నములయ్యెను. ఘ్రాణేంద్రియము - నాసికా రంధ్రమల నుండి అశ్వినీ కుమారులు, సమస్త ఓషధులు అనగా యవాది ధాన్యములు, మోదప్రమోదములు అనగా సామాన్యమగు మరియు విశేషమగు గంధములు ఆవిర్భవించినవి. ఆ విరాట్ పురుషుని నేత్రేంద్రియమునుండి రూపము, తేజస్సు, కన్నులనుండి ద్యులోకము మరియు సూర్యుడు; చెవుల నుండి దిక్కులు, తీర్థములు; శ్రోత్రేంద్రియమునుండి ఆకాశము, శబ్దము ఉద్భవించెను. ఆ విరాట్ పురుషుని శరీరము సమస్తపదార్థముల సారములకును, సౌందర్యమునకును నిధి. ఆ పరమాత్మ చర్మమే సకల యజ్ఞములకును స్థానము. దానినుండి వాయువు, స్పర్శతన్మాత్ర ఉత్పన్నమాయెను. భూమినుండి జన్మించు వివిధములగు వనస్పతులు, వృక్షములు మొదలగునవి ఆ విరాట్ పురుషుని రోమములు. ఆ వనస్పతుల ద్వారానే యజ్ఞములకు కావలసిన సామాగ్రి సమకూరును. ఆ పరమపురుషుని కేశములు, గడ్డము, మీసములు, నఖములు మొదలగు వాటినుండి మేఘములు, విద్యుత్తు, శిలలు, లోహములు మొదలగు ధాతువులు ఉద్భవించెను. ఆ విరాట్ పురుషుని బాహువులనుండి ప్రపంచమును రక్షించే లోకపాలకులు ఉద్భవించిరి. భూలోకము, భువర్లోకము సువర్లోకము అను మూడును ఆ పరమాత్మ యొక్క పాదన్యాసము. అది సకల లోక  కల్యాణ కారకము. సర్వ శరణ్యము, భయమును దూరమొనర్చును. అది సకల జనుల కోరికలను ఈడేర్చు చుండును. విరాట్ పురుషుని జననేంద్రియమే జలములకు, వీర్యములకు, (శుక్లములకు) సృష్టికిని, మేఘములకు, ప్రజాపతికిని ఆధారము. ఆ పరమాత్మ జననేంద్రియము సంతానోత్పత్తికిని, ఆనందములకును, సుఖములకును నిధానము. యమునికిని, మిత్రదేవతకును ఆ విరాట్ పురుషుని పాయువు ఉత్పత్తిస్థానము. మలత్యాగమునకును హింసకును, నిరృతికి, మృత్యువునకును, నరకమునకును గుదము ఉత్పత్తిస్థానము. పరాజయమునకును అధర్మమునకును, అజ్ఞానమునకును ఆ పరమపురుషుని పృష్ఠభాగము ఉత్పత్తిస్థానము. నదీనదములు ఆ పరమాత్మ యొక్క నాడులనుండి సంభవించును. పర్వతములు పరమాత్మయొక్క అస్థులు. ఆ పరమాత్మ యొక్క ఉదరమునందు అవ్యక్తము (మూలప్రకృతి), రసధాతువులు, సముద్రములు, ప్రాణులయొక్క మృత్యువు వసించును. ఆ పరమాత్మ హృదయము మనస్సునకు పుట్టుకస్థానము. ధర్మమునకును, సనకాది మునులకును, శంకరునకును, విజ్ఞానమునకును, అంతఃకరణమునకును ఇవి అన్నింటికిని పరమాత్మయొక్క ఆత్మయే నివాసస్థానము. శంకరుడు,  సనకాదిమునులు, దేవతలు, అసురులు, మానవులు, నాగులు, పక్షులు, మృగములు, సరీసృపములు అనగా పాములు మొదలగునవి, గంధర్వులు, అప్సరసలు, యక్షులు,రాక్షసులు, భూతగణములు, సర్పములు, పశువులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు, వృక్షములు, ఇంకను, ఆకాశమునందును, జలములలోను, స్థలములలోను సంచరించెడి ఇతర ప్రాణులు, గ్రహములు, నక్షత్రములు, తోకచుక్కలు, తారకలు, విద్యుత్తు, మెరుపులు, మేఘములు, మొదలగునవి అన్నియును విరాట్ పురుషుని అవయవములే. వేయేల? భూత,భవిష్యత్, వర్తమానములకు చెందిన విశ్వమంతయును, సర్వమూ ఆ విరాట్ పురుషునిలో చేరియన్నట్టివే. ఆ పరమాత్మయందు ఈ విశ్వమంతయును కేవలము పది అంగుళముల పరిమాణములోనే వ్యాపించియన్నవి.

విరాట్స్వరూపురాలైన ఆ పరమాత్మయే పరమేశ్వరి. స్థావరజంగమాత్మకమైన జగత్తే ఒక బ్రహ్మాండమయితే, అటువంటి అనేక బ్రహ్మాండములను సృష్టించిన ఆ పరమేశ్వరి అనేకకోటి బ్రహ్మాండ బ్రహ్మాండ జననీ యని అనబడినది.

అటువంటి జనయిత్రికి నమస్కరించునపుడు ఓం అనేకకోటిబ్రహ్మాండ జనన్యై నమః అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

621వ నామ మంత్రము 18.3.2022

ఓం దివ్యవిగ్రహాయై నమః

జ్ఞానస్వరూపిణియై, అజ్ఞానాసురులను అంతమొందించు దివ్యరూపిణిగా తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి  దివ్యవిగ్రహా యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం దివ్యవిగ్రహాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఆరాధించు ఉపాసకులను అనంతమైన బ్రహ్మజ్ఞానభిక్షను ప్రసాదించి భౌతిక మరియు ఆధ్యాత్మిక సుఖసంపదలిచ్చి బ్రోచును. 

దివ్యవిగ్రహా అనగా దివ్యమైన రూపము. ఆ పరమేశ్వరి సకలదేవతా స్వరూపిణి. దేవాసుర సంగ్రామంలో రాక్షస సంహారం నిమిత్తమై ఆ పరమేశ్వరి సకల దేవతల అంశలతో ఏర్పడిన దివ్యస్వరూపమును గూర్చి దేవీభాగవతంలో ఇలా చెప్పబడినది.

దేవతలకు, రాక్షసులకు యుద్ధము జరుగుచున్నది. దేవతలకు ఇంద్రుడు, రాక్షసులకు మహిషాసురుడు నాయకత్వం వహించారు. ఆ దేవాసురుల సంగ్రామంలో దేవతలు పరాజయాన్ని పొందారు. మహిషాసురుని ఎలా జయించాలో పాలుపోక దేవతలంతా త్రిమూర్తులను ఆశ్రయించారు. బ్రహ్మవరముచే మహిషాసురుడు పురుషులచే మరణం సంభవించనివాడగుటచే మిగుల విర్రవీగుచున్నాడు. ఇక స్త్రీ మాత్రమే సంహరించవలెను. ఆ రాక్షసుని వధించు శక్తి ఏ స్త్రీకి ఉన్నదని త్రిమూర్తులు కూడా తలలు పట్టుకుని కూర్చున్నారు. సకలదేవతల తేజస్సుతో అత్యంత సౌందర్యవతియైన ఒకానొక స్త్రీమూర్తి ప్రకటితము కావలెనని విష్ణుమూర్తి యోచించి చెప్పెను. ఆ స్త్రీమూర్తికి రుద్రుడు మొదలైన దేవతలనుండి త్రిశూలాది పరమదివ్య ఆయుధములను సమర్పించ వలయును. అప్పుడు ఆ స్త్రీమూర్తి సకలదేవతల తేజస్సులతో ఆకారము, బలము మరియు సర్వదేవతలు సమర్పించిన ఆయుధములతోను సంపూర్ణ తేజస్సుతో బలసంపన్నురాలై ఆ దుష్టరాక్షసుని సంహారము జరుగును అని విష్ణుమూర్తి చెప్పెను.  ఆ లలితా పరమేశ్వరియొక్క అంగములు ఏయే దేవతల తేజస్సుతో ఏర్పడినవో దేవీభాగవతమునందు, పంచమస్కంధమునందు, అష్టమోధ్యాయములో ఈ విధముగా వివరించబడినది.

శంకరస్య చ యత్తేజ స్తేన తన్ముఖపంకజమ్‌|

శ్వేతవర్ణం శుభాకారమజాయత మహత్తరమ్‌॥62॥

కేశా స్తస్యా స్తథా స్నిగ్ధా యామ్యేన తేజసాఽభవన్‌|

వక్రాగ్రా శ్చాతిదీరా వై మేఘవర్ణా మనోహరాః॥63॥

నయనత్రితయం తస్యా జజ్ఞే పావకతేజసా|

కృష్ణం రక్తం తథా శ్వేతం వర్ణత్రయవిభూషితమ్‌॥64॥

వక్రే స్నిగ్ధే కృష్ణవర్ణే సంధ్యయోస్తేజసా భ్రువౌ|

జాతే దేవ్యాః సుతేజస్కే కామస్య ధనుషీ వ తే॥65॥

వాయో శ్చ తేజసా శస్తౌ శ్రవణా సంబభూవతుః| 

నాతి దీర్ఘౌ నాతి హ్రస్వౌ దోలావివ మనోభువః॥66॥

తిలపుష్పసమాకారా నాసికా సుమనోహరా|

సంజాతా స్నిగ్ధవర్ణా వై ధనదస్య చ తేజసా॥67॥

దంతాః శిఖరిణః శ్లక్ష్ణాః కుందాగ్రసదృశాః సమాః|

సంజాతాః సుప్రభా రాజ న్ప్రాజాపత్యేన తేజసా॥68॥

అష్టాదశభుజాకారా బాహవో విష్ణుతేజసా|

వసూనాం తేజసాఽంగుళ్యో  రక్తవర్ణా స్తథాఽభవన్‌॥70॥

సౌమ్యేన తేజసా జాతం స్తనయో ర్ముగ్మముత్తమమ్‌|

ఇంద్రేణా స్యా స్తథా మధ్యం జాతం త్రివళిసంయుతమ్‌॥71॥

జంఘోరూ వరుణస్యాఽథ తేజసా సంబభూవతుః| 

నితంబః స తు సంజాతో విపుల స్తేజసా భువః॥72॥॥

ఏవం నారీ శుభాకారా సురూపా సుస్వరా భృశమ్‌|

సముత్పన్నా తథా రాజం స్తజోరాశి సముద్భవా॥73॥

తాం దృష్ట్వా సుష్ఠుసర్వాంగీం సుదతీం చారులోచనమ్‌|

ముదం ప్రాపుః సురాః సర్వే మహిషేణ ప్రపీడితాః॥74॥

విష్ణు స్త్వాహ సురాన్సర్వా న్భూషణాన్యాయుధాని చ|

ప్రయచ్ఛంతు శుభాన్యస్యై దేవాః సర్వాణి సాంప్రతమ్‌॥75॥

స్వాయుధేభ్యః సముత్పాద్య తేజోయుక్తాని సత్వరాః|

సమర్పయంతు సర్వేఽద్య దేవ్యై నానాయుధానివై॥76॥

జనమేజయునికి వ్యాసభగవానుడు  ఆ పరమేశ్వరి ఆవిర్భావంగూర్చి తెలుపుచున్నాడు: భగవానుడు శంకరుని తేజమునుండి శ్వేతవర్ణముతో, సుశోభితముగా, విశాలమై, మనోహరమై, విలసిల్లు  పరమేశ్వరి ముఖకమలము రచింపబడెను. సుందరమై, సుదీర్ఘమై, సహజపరిమళలను విరజిమ్ముచూ, చిక్కగా, నునుపుగా మనోహరమైన మేఘశ్యామవర్ణముతో శిరస్సునందు అలరారు కేశనిర్మాణము యమరాజు తేజస్సుతో జరిగెను. కృష్ణ, రక్త, శ్వేతవర్ణములతో శోభిల్లు ఆ దేవి నేత్రములు అగ్నిదేవుని తేజస్సుతో ప్రకటితమయ్యెను. ప్రాతఃసంధ్య, ఉదయసంధ్యల తేజస్సుతో ఆ పరమేశ్వరి కనుబొమలు ఉత్పన్నములయ్యెను. తేజఃపరిపూర్ణములైన నల్లని వంపులు తిరిగిన కనుబొమలు మన్మథుని ధనుస్సువలె విలసిల్లుచుండెను. మరీ పొడవుగాని, మరీ పొట్టిగా గాని లేని రెండు చెవులు వాయువు తేజముతో ఉత్పన్నములయ్యెను. నూగుపూవులవలె కోమలమై, అప్పుడే విరిసీ విరియని సంపెంగవలె అత్యంత మనోహరమైన నాసిక కుబేరుని తేజస్సుతో ప్రకటమయ్యెను. అత్యంత ప్రకాశవంతమై, మనోహరములై, కుందములవలె కొనలు తేలియుండు దంతములు ప్రజాపతి తేజస్సుతో ప్రకటితములయ్యెను. సూర్యుని యొక్క తేజస్సుతో మిగుల లాలిమతో కూడిన అధరోష్ఠము (క్రిందిపెదవి) ప్రకటితమయ్యెను. పైపెదవి కార్తికేయుని తేజస్సుతో ఉత్పన్నమయ్యెను. పరమాత్ముడైన శ్రీమహావిష్ణువు యొక్క మహత్తరమైన తేజస్సుతో పదునెనిమిది భుజములు ఆవిర్భవించెను. అష్టవసువుల తేజస్సుతో ఎర్రనిరంగుగల వ్రేళ్ళు ప్రభవించెను. చంద్రుని తేజస్సుతో రెండు వక్షోజములు, ఇంద్రుని తేజస్సుతో మధ్యభాగమగు కటిప్రదేశము మరియు త్రివళులు (పొట్టపై ఉండు మూడు మడతలు), వరుణుని తేజస్సుతో తొడలు, పిక్కలు, భూదేవి తేజముతో విశాలమైన నితంబభాగము (పిరుదులు)  ప్రకటితమయ్యెను.

ఇదే విషయము సప్తశతియందు, రెండవ అధ్యాయము,  పదహారు, పదిహేడు, పదునెనిమిది (16, 17, 18) శ్లోకములలో ఇలా చెప్పబడినది.

బ్రహ్మణస్తేజసా పాదౌ తదంగుల్యోఽర్కతేజసా|

వసూనాం చ కరాంగుల్యః కౌబేరేణ చ నాసికా॥16॥

బ్రహ్మతేజముతో పాదములు, సూర్యతేజముతో కాలివ్రేళ్ళు, అష్టవసువుల తేజస్సుతో చేతివ్రేళ్ళు, కుబేరుని తేజముతో నాసిక (ముక్కు)  ప్రకటిత మయ్యెను.

 తస్యాస్తుదంతాః సంభూతాః ప్రాజాపత్యేనతేజసా|

నయనత్రితయం జజ్ఞే తథా పావకతేజసా॥17॥

ప్రజాపతి తేజముతో దంతములు, అగ్నితేజముతో మూడు కన్నులు ఉత్పన్నమయ్యెను.

భ్రువౌ చ సంధ్యయోస్తేజః శ్రవణావనిలస్య చ|

అన్యేషాం చైవ దేవానాం సంభవస్తేజసాం శివా॥18॥

రెండు సంధ్యల తేజమునుండి కనుబొమలు, వాయుతేజమునుండి చెవులు మరియు ఇతరదేవతల తేజములతో ఆ పరమేశ్వరి సంపూర్ణరూపము ఏర్పడెను.

అత్యంత మనోహరమై ఒప్పు ఆ పరమేశ్వరి నాసిక కుబేరుని తేజస్సుతో ప్రకటితమయినది.

ఇట్లు సకల దేవతా స్వరూపిణి యగుటచేత ఆ పరమేశ్వరి విగ్రహము (రూపము) దేవతలందరివలె గాక విభిన్నము. అత్యంత దివ్యమైన విగ్రహము. ఆ విగ్రహము ఎలాంటిది అంటే

సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్|

తారా నాయక శేఖరామ్ స్మితముఖీమాపీన వక్షోరుహామ్|

పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీమ్|

సౌమ్యామ్ రత్న ఘటస్థ రక్త చరణాం, ధ్యాయేత్ పరామంబికామ్॥

పై శ్లోకమునకు భావము

సిందూరము వలె ఎర్రనైన శరీరమును, మూడు కన్నులతో, తారానాయకుడైన చంద్రుణ్ణి మాణిక్యములతో చేయబడిన కిరీటమును ధరించి, ఆ కిరీటాగ్రమున మహా మాణిక్యములా ప్రకాశించే చంద్రుడిని శిరోభూషణమై ఒప్పుచుండగా, ఎల్లవేళలా చిరునగవుతో, ఉన్నతమైన వక్షస్థలంతో, ఒకచేతిలో  మద్యముతో నిండిన రత్నభాండముతో, మరొకచేతిలోఎర్రని కలువతోను, రత్నఘటము నందు తన ఎర్రని పాదములను ఉంచి, సౌమ్యముగా కూర్ఛున్న పరాదేవిని  ధ్యానిస్తున్నాను.

 ఉద్యద్భాను సహస్రాభ అయిన అటువంటి జగన్మాత దివ్యవిగ్రహా యని అనబడినది. ఆ తల్లి జ్ఞానస్వరూపిణి, మనలోని అజ్ఞానాసురులను సంహరించి తనభక్తులకు బ్రహ్మవర్చస్సు ప్రసాదించును. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం దివ్యవిగ్రహాయై నమః అని అనవలెను. 
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

621వ నామ మంత్రము 18.3.2022

ఓం దివ్యవిగ్రహాయై నమః

జ్ఞానస్వరూపిణియై, అజ్ఞానాసురులను అంతమొందించు దివ్యరూపిణిగా తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి  దివ్యవిగ్రహా యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం దివ్యవిగ్రహాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఆరాధించు ఉపాసకులను అనంతమైన బ్రహ్మజ్ఞానభిక్షను ప్రసాదించి భౌతిక మరియు ఆధ్యాత్మిక సుఖసంపదలిచ్చి బ్రోచును. 

దివ్యవిగ్రహా అనగా దివ్యమైన రూపము. ఆ పరమేశ్వరి సకలదేవతా స్వరూపిణి. దేవాసుర సంగ్రామంలో రాక్షస సంహారం నిమిత్తమై ఆ పరమేశ్వరి సకల దేవతల అంశలతో ఏర్పడిన దివ్యస్వరూపమును గూర్చి దేవీభాగవతంలో ఇలా చెప్పబడినది.

దేవతలకు, రాక్షసులకు యుద్ధము జరుగుచున్నది. దేవతలకు ఇంద్రుడు, రాక్షసులకు మహిషాసురుడు నాయకత్వం వహించారు. ఆ దేవాసురుల సంగ్రామంలో దేవతలు పరాజయాన్ని పొందారు. మహిషాసురుని ఎలా జయించాలో పాలుపోక దేవతలంతా త్రిమూర్తులను ఆశ్రయించారు. బ్రహ్మవరముచే మహిషాసురుడు పురుషులచే మరణం సంభవించనివాడగుటచే మిగుల విర్రవీగుచున్నాడు. ఇక స్త్రీ మాత్రమే సంహరించవలెను. ఆ రాక్షసుని వధించు శక్తి ఏ స్త్రీకి ఉన్నదని త్రిమూర్తులు కూడా తలలు పట్టుకుని కూర్చున్నారు. సకలదేవతల తేజస్సుతో అత్యంత సౌందర్యవతియైన ఒకానొక స్త్రీమూర్తి ప్రకటితము కావలెనని విష్ణుమూర్తి యోచించి చెప్పెను. ఆ స్త్రీమూర్తికి రుద్రుడు మొదలైన దేవతలనుండి త్రిశూలాది పరమదివ్య ఆయుధములను సమర్పించ వలయును. అప్పుడు ఆ స్త్రీమూర్తి సకలదేవతల తేజస్సులతో ఆకారము, బలము మరియు సర్వదేవతలు సమర్పించిన ఆయుధములతోను సంపూర్ణ తేజస్సుతో బలసంపన్నురాలై ఆ దుష్టరాక్షసుని సంహారము జరుగును అని విష్ణుమూర్తి చెప్పెను.  ఆ లలితా పరమేశ్వరియొక్క అంగములు ఏయే దేవతల తేజస్సుతో ఏర్పడినవో దేవీభాగవతమునందు, పంచమస్కంధమునందు, అష్టమోధ్యాయములో ఈ విధముగా వివరించబడినది.

శంకరస్య చ యత్తేజ స్తేన తన్ముఖపంకజమ్‌|

శ్వేతవర్ణం శుభాకారమజాయత మహత్తరమ్‌॥62॥

కేశా స్తస్యా స్తథా స్నిగ్ధా యామ్యేన తేజసాఽభవన్‌|

వక్రాగ్రా శ్చాతిదీరా వై మేఘవర్ణా మనోహరాః॥63॥

నయనత్రితయం తస్యా జజ్ఞే పావకతేజసా|

కృష్ణం రక్తం తథా శ్వేతం వర్ణత్రయవిభూషితమ్‌॥64॥

వక్రే స్నిగ్ధే కృష్ణవర్ణే సంధ్యయోస్తేజసా భ్రువౌ|

జాతే దేవ్యాః సుతేజస్కే కామస్య ధనుషీ వ తే॥65॥

వాయో శ్చ తేజసా శస్తౌ శ్రవణా సంబభూవతుః| 

నాతి దీర్ఘౌ నాతి హ్రస్వౌ దోలావివ మనోభువః॥66॥

తిలపుష్పసమాకారా నాసికా సుమనోహరా|

సంజాతా స్నిగ్ధవర్ణా వై ధనదస్య చ తేజసా॥67॥

దంతాః శిఖరిణః శ్లక్ష్ణాః కుందాగ్రసదృశాః సమాః|

సంజాతాః సుప్రభా రాజ న్ప్రాజాపత్యేన తేజసా॥68॥

అష్టాదశభుజాకారా బాహవో విష్ణుతేజసా|

వసూనాం తేజసాఽంగుళ్యో  రక్తవర్ణా స్తథాఽభవన్‌॥70॥

సౌమ్యేన తేజసా జాతం స్తనయో ర్ముగ్మముత్తమమ్‌|

ఇంద్రేణా స్యా స్తథా మధ్యం జాతం త్రివళిసంయుతమ్‌॥71॥

జంఘోరూ వరుణస్యాఽథ తేజసా సంబభూవతుః| 

నితంబః స తు సంజాతో విపుల స్తేజసా భువః॥72॥॥

ఏవం నారీ శుభాకారా సురూపా సుస్వరా భృశమ్‌|

సముత్పన్నా తథా రాజం స్తజోరాశి సముద్భవా॥73॥

తాం దృష్ట్వా సుష్ఠుసర్వాంగీం సుదతీం చారులోచనమ్‌|

ముదం ప్రాపుః సురాః సర్వే మహిషేణ ప్రపీడితాః॥74॥

విష్ణు స్త్వాహ సురాన్సర్వా న్భూషణాన్యాయుధాని చ|

ప్రయచ్ఛంతు శుభాన్యస్యై దేవాః సర్వాణి సాంప్రతమ్‌॥75॥

స్వాయుధేభ్యః సముత్పాద్య తేజోయుక్తాని సత్వరాః|

సమర్పయంతు సర్వేఽద్య దేవ్యై నానాయుధానివై॥76॥

జనమేజయునికి వ్యాసభగవానుడు  ఆ పరమేశ్వరి ఆవిర్భావంగూర్చి తెలుపుచున్నాడు: భగవానుడు శంకరుని తేజమునుండి శ్వేతవర్ణముతో, సుశోభితముగా, విశాలమై, మనోహరమై, విలసిల్లు  పరమేశ్వరి ముఖకమలము రచింపబడెను. సుందరమై, సుదీర్ఘమై, సహజపరిమళలను విరజిమ్ముచూ, చిక్కగా, నునుపుగా మనోహరమైన మేఘశ్యామవర్ణముతో శిరస్సునందు అలరారు కేశనిర్మాణము యమరాజు తేజస్సుతో జరిగెను. కృష్ణ, రక్త, శ్వేతవర్ణములతో శోభిల్లు ఆ దేవి నేత్రములు అగ్నిదేవుని తేజస్సుతో ప్రకటితమయ్యెను. ప్రాతఃసంధ్య, ఉదయసంధ్యల తేజస్సుతో ఆ పరమేశ్వరి కనుబొమలు ఉత్పన్నములయ్యెను. తేజఃపరిపూర్ణములైన నల్లని వంపులు తిరిగిన కనుబొమలు మన్మథుని ధనుస్సువలె విలసిల్లుచుండెను. మరీ పొడవుగాని, మరీ పొట్టిగా గాని లేని రెండు చెవులు వాయువు తేజముతో ఉత్పన్నములయ్యెను. నూగుపూవులవలె కోమలమై, అప్పుడే విరిసీ విరియని సంపెంగవలె అత్యంత మనోహరమైన నాసిక కుబేరుని తేజస్సుతో ప్రకటమయ్యెను. అత్యంత ప్రకాశవంతమై, మనోహరములై, కుందములవలె కొనలు తేలియుండు దంతములు ప్రజాపతి తేజస్సుతో ప్రకటితములయ్యెను. సూర్యుని యొక్క తేజస్సుతో మిగుల లాలిమతో కూడిన అధరోష్ఠము (క్రిందిపెదవి) ప్రకటితమయ్యెను. పైపెదవి కార్తికేయుని తేజస్సుతో ఉత్పన్నమయ్యెను. పరమాత్ముడైన శ్రీమహావిష్ణువు యొక్క మహత్తరమైన తేజస్సుతో పదునెనిమిది భుజములు ఆవిర్భవించెను. అష్టవసువుల తేజస్సుతో ఎర్రనిరంగుగల వ్రేళ్ళు ప్రభవించెను. చంద్రుని తేజస్సుతో రెండు వక్షోజములు, ఇంద్రుని తేజస్సుతో మధ్యభాగమగు కటిప్రదేశము మరియు త్రివళులు (పొట్టపై ఉండు మూడు మడతలు), వరుణుని తేజస్సుతో తొడలు, పిక్కలు, భూదేవి తేజముతో విశాలమైన నితంబభాగము (పిరుదులు)  ప్రకటితమయ్యెను.

ఇదే విషయము సప్తశతియందు, రెండవ అధ్యాయము,  పదహారు, పదిహేడు, పదునెనిమిది (16, 17, 18) శ్లోకములలో ఇలా చెప్పబడినది.

బ్రహ్మణస్తేజసా పాదౌ తదంగుల్యోఽర్కతేజసా|

వసూనాం చ కరాంగుల్యః కౌబేరేణ చ నాసికా॥16॥

బ్రహ్మతేజముతో పాదములు, సూర్యతేజముతో కాలివ్రేళ్ళు, అష్టవసువుల తేజస్సుతో చేతివ్రేళ్ళు, కుబేరుని తేజముతో నాసిక (ముక్కు)  ప్రకటిత మయ్యెను.

 తస్యాస్తుదంతాః సంభూతాః ప్రాజాపత్యేనతేజసా|

నయనత్రితయం జజ్ఞే తథా పావకతేజసా॥17॥

ప్రజాపతి తేజముతో దంతములు, అగ్నితేజముతో మూడు కన్నులు ఉత్పన్నమయ్యెను.

భ్రువౌ చ సంధ్యయోస్తేజః శ్రవణావనిలస్య చ|

అన్యేషాం చైవ దేవానాం సంభవస్తేజసాం శివా॥18॥

రెండు సంధ్యల తేజమునుండి కనుబొమలు, వాయుతేజమునుండి చెవులు మరియు ఇతరదేవతల తేజములతో ఆ పరమేశ్వరి సంపూర్ణరూపము ఏర్పడెను.

అత్యంత మనోహరమై ఒప్పు ఆ పరమేశ్వరి నాసిక కుబేరుని తేజస్సుతో ప్రకటితమయినది.

ఇట్లు సకల దేవతా స్వరూపిణి యగుటచేత ఆ పరమేశ్వరి విగ్రహము (రూపము) దేవతలందరివలె గాక విభిన్నము. అత్యంత దివ్యమైన విగ్రహము. ఆ విగ్రహము ఎలాంటిది అంటే

సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్|

తారా నాయక శేఖరామ్ స్మితముఖీమాపీన వక్షోరుహామ్|

పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీమ్|

సౌమ్యామ్ రత్న ఘటస్థ రక్త చరణాం, ధ్యాయేత్ పరామంబికామ్॥

పై శ్లోకమునకు భావము

సిందూరము వలె ఎర్రనైన శరీరమును, మూడు కన్నులతో, తారానాయకుడైన చంద్రుణ్ణి మాణిక్యములతో చేయబడిన కిరీటమును ధరించి, ఆ కిరీటాగ్రమున మహా మాణిక్యములా ప్రకాశించే చంద్రుడిని శిరోభూషణమై ఒప్పుచుండగా, ఎల్లవేళలా చిరునగవుతో, ఉన్నతమైన వక్షస్థలంతో, ఒకచేతిలో  మద్యముతో నిండిన రత్నభాండముతో, మరొకచేతిలోఎర్రని కలువతోను, రత్నఘటము నందు తన ఎర్రని పాదములను ఉంచి, సౌమ్యముగా కూర్ఛున్న పరాదేవిని  ధ్యానిస్తున్నాను.

 ఉద్యద్భాను సహస్రాభ అయిన అటువంటి జగన్మాత దివ్యవిగ్రహా యని అనబడినది. ఆ తల్లి జ్ఞానస్వరూపిణి, మనలోని అజ్ఞానాసురులను సంహరించి తనభక్తులకు బ్రహ్మవర్చస్సు ప్రసాదించును. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం దివ్యవిగ్రహాయై నమః అని అనవలెను. 
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

623వ నామ మంత్రము 20.3.2022

ఓం కేవలాయై నమః

ధ్యానానుభూతి పరాకాష్ఠయందు ఏవిధమైన భేదములు, వేరింకేమియు లేని పరబ్రహ్మ స్వరూపిణియై కేవలా యని నామ ప్రసిద్ధమైన తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కేవలా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం కేవలాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఉపాసించు భక్తులకు ఆ తల్లి కరుణచే ఆత్మానందానుభూతి ప్రాప్తించును, జీవితం సుఖసంతోషాలతో కొనసాగుతుంది. 

ధర్మములకు అతీతురాలు. కేవలము తానే ఒక ధర్మము. తనకన్నా అద్వితీయులు ఎవరూ లేరు. కేవలము తానే అద్వీతీయురాలు. అనగా ప్రథమురాలు. గనుకనే ఆ పరమేశ్వరి కేవలా యని అనబడినది. జ్ఞానవిశేష స్వరూపురాలు. ఆ పరమేశ్వరితో సమానమైన ఇంకొక పరమేశ్వరి ఎవరునూ లేరు. తానే ఆదిపరాశక్తి. తానే మూలప్రకృతి. ఆ తల్లి మాత్రమే శ్రీమాతా యని అనబడినది. కోట్లాది సహస్ర నామములలో కేవలము శ్రీలలితా సహస్ర నామములు మాత్రమే శ్రేష్ఠమైనవి యగుటచే జగన్మాత కేవలా యని అనబడినది. మూలాధారములో కేవలము తానే కుండలినీ శక్తిగా విరాజిల్లు చున్నది. సర్వయంత్రములందును శ్రీచక్రయంత్రమే శ్రేష్ఠమైనది. సర్వతంత్రములందును శ్రీలలితోపాసనా విధానమే శ్రేష్ఠమైనది. సర్వమంత్రములకును శ్రేష్ఠమైనది పంచదశి మాత్రమే. 

ఈ విషయం శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర మహాత్మ్యములో (ఉత్తరపీఠిక - ఫలశ్రుతిలో) చెప్పబడినది.

48వ శ్లోకము

శ్రీమన్త్రరాజసదృశో యథా మన్‍రో న విద్యతే॥48॥

దేవతా లలితాతుల్యా యథా నాస్తి ఘటోద్భవ|

రహస్యనామసాహస్రతుల్యా నాస్తి తథా స్తుతి॥49॥

హయగ్రీవులవారు అగస్త్యమహర్షితో అన్నారు ఇలా:-

ఓ అగస్త్యమహర్షీ! పంచదశాక్షరీ మంత్రము అంతటి మంత్రముగాని, శ్రీలలితా పరమేశ్వరి యంతటి దేవతగాని, రహస్యాతి రహస్యమైన  శ్రీలలితా సహస్య నామ స్తోత్రమంతటి స్తోత్రము గాని లేదు.

70వ శ్లోకము

లౌకికాద్వచనాన్ముఖ్యం విష్ణునామానుకీర్తనమ్|

విష్ణునామసహస్రాచ్చ శివనామైకముత్తమమ్॥70॥

71వ శ్లోకము

శివనామసహస్రాచ్చ దేవ్యా నామైకముత్తమమ్|

దేవీనామసహస్రాణి కోటిశః సన్తి కుంభజ|

తేషు ముఖ్యం దశవిధం నామసాహస్రముచ్యతే|

72వ శ్లోకము

గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ|

రాజరాజేశ్వరీ బాలా శ్యామలా  లలితా దశ॥72॥

73వ శ్లోకము

రహస్యనామసాహస్రమిదం శస్తం దశస్వపి|

తస్మాత్సఙ్కీర్తయేన్నిత్యం కలిదోషనివృత్తయే|

ముఖ్యం శ్రీమాతృనామేతి న జానన్తి విమోహితాః॥74॥

లౌకిక వాక్యములలో విష్ణునామ కీర్తనము ఉత్తమము. అటువంటి విష్ణు సహస్ర నామములకన్నా శివసహస్రనామము ఉత్తమము. శివ సహస్ర నామములకన్నా శ్రీలలితా సహస్ర నామములు ఉత్తమము. కోట్లాది దేవీ సహస్ర నామములలో గంగా, భవానీ, గాయత్రీ, కాళీ, లక్ష్మీ, సరస్వతీ, రాజరాజేశ్వరీ, బాలా, శ్యామలా, లలితా అను పదిసహస్ర నామములు అత్యంత ఉత్తమమైనవి.  అటువంటి పది దేవీసహస్ర నామములలో రహస్యాతి రహస్యమైనది శ్రీలలితా సహస్ర నామము. వైదికకర్మాచరణములో కలియుగ ప్రభావమున సంభవించే లోపముల వలన కలిగే దోషముల నివారణకు రహస్యాతి రహస్యమైన శ్రీలలితా సహస్ర నామ స్తోత్రము ఉత్తమమైనది.

అన్నిటికీ కేవలము ఆ పరమేశ్వరి మాత్రమే అద్వితీయురాలై విరాజిల్లుచున్నది గనుక, ఆ తల్లి కేవలా యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కేవలాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

623వ నామ మంత్రము 20.3.2022

ఓం కేవలాయై నమః

ధ్యానానుభూతి పరాకాష్ఠయందు ఏవిధమైన భేదములు, వేరింకేమియు లేని పరబ్రహ్మ స్వరూపిణియై కేవలా యని నామ ప్రసిద్ధమైన తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కేవలా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం కేవలాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఉపాసించు భక్తులకు ఆ తల్లి కరుణచే ఆత్మానందానుభూతి ప్రాప్తించును, జీవితం సుఖసంతోషాలతో కొనసాగుతుంది. 

ధర్మములకు అతీతురాలు. కేవలము తానే ఒక ధర్మము. తనకన్నా అద్వితీయులు ఎవరూ లేరు. కేవలము తానే అద్వీతీయురాలు. అనగా ప్రథమురాలు. గనుకనే ఆ పరమేశ్వరి కేవలా యని అనబడినది. జ్ఞానవిశేష స్వరూపురాలు. ఆ పరమేశ్వరితో సమానమైన ఇంకొక పరమేశ్వరి ఎవరునూ లేరు. తానే ఆదిపరాశక్తి. తానే మూలప్రకృతి. ఆ తల్లి మాత్రమే శ్రీమాతా యని అనబడినది. కోట్లాది సహస్ర నామములలో కేవలము శ్రీలలితా సహస్ర నామములు మాత్రమే శ్రేష్ఠమైనవి యగుటచే జగన్మాత కేవలా యని అనబడినది. మూలాధారములో కేవలము తానే కుండలినీ శక్తిగా విరాజిల్లు చున్నది. సర్వయంత్రములందును శ్రీచక్రయంత్రమే శ్రేష్ఠమైనది. సర్వతంత్రములందును శ్రీలలితోపాసనా విధానమే శ్రేష్ఠమైనది. సర్వమంత్రములకును శ్రేష్ఠమైనది పంచదశి మాత్రమే. 

ఈ విషయం శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర మహాత్మ్యములో (ఉత్తరపీఠిక - ఫలశ్రుతిలో) చెప్పబడినది.

48వ శ్లోకము

శ్రీమన్త్రరాజసదృశో యథా మన్‍రో న విద్యతే॥48॥

దేవతా లలితాతుల్యా యథా నాస్తి ఘటోద్భవ|

రహస్యనామసాహస్రతుల్యా నాస్తి తథా స్తుతి॥49॥

హయగ్రీవులవారు అగస్త్యమహర్షితో అన్నారు ఇలా:-

ఓ అగస్త్యమహర్షీ! పంచదశాక్షరీ మంత్రము అంతటి మంత్రముగాని, శ్రీలలితా పరమేశ్వరి యంతటి దేవతగాని, రహస్యాతి రహస్యమైన  శ్రీలలితా సహస్య నామ స్తోత్రమంతటి స్తోత్రము గాని లేదు.

70వ శ్లోకము

లౌకికాద్వచనాన్ముఖ్యం విష్ణునామానుకీర్తనమ్|

విష్ణునామసహస్రాచ్చ శివనామైకముత్తమమ్॥70॥

71వ శ్లోకము

శివనామసహస్రాచ్చ దేవ్యా నామైకముత్తమమ్|

దేవీనామసహస్రాణి కోటిశః సన్తి కుంభజ|

తేషు ముఖ్యం దశవిధం నామసాహస్రముచ్యతే|

72వ శ్లోకము

గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ|

రాజరాజేశ్వరీ బాలా శ్యామలా  లలితా దశ॥72॥

73వ శ్లోకము

రహస్యనామసాహస్రమిదం శస్తం దశస్వపి|

తస్మాత్సఙ్కీర్తయేన్నిత్యం కలిదోషనివృత్తయే|

ముఖ్యం శ్రీమాతృనామేతి న జానన్తి విమోహితాః॥74॥

లౌకిక వాక్యములలో విష్ణునామ కీర్తనము ఉత్తమము. అటువంటి విష్ణు సహస్ర నామములకన్నా శివసహస్రనామము ఉత్తమము. శివ సహస్ర నామములకన్నా శ్రీలలితా సహస్ర నామములు ఉత్తమము. కోట్లాది దేవీ సహస్ర నామములలో గంగా, భవానీ, గాయత్రీ, కాళీ, లక్ష్మీ, సరస్వతీ, రాజరాజేశ్వరీ, బాలా, శ్యామలా, లలితా అను పదిసహస్ర నామములు అత్యంత ఉత్తమమైనవి.  అటువంటి పది దేవీసహస్ర నామములలో రహస్యాతి రహస్యమైనది శ్రీలలితా సహస్ర నామము. వైదికకర్మాచరణములో కలియుగ ప్రభావమున సంభవించే లోపముల వలన కలిగే దోషముల నివారణకు రహస్యాతి రహస్యమైన శ్రీలలితా సహస్ర నామ స్తోత్రము ఉత్తమమైనది.

అన్నిటికీ కేవలము ఆ పరమేశ్వరి మాత్రమే అద్వితీయురాలై విరాజిల్లుచున్నది గనుక, ఆ తల్లి కేవలా యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కేవలాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

624వ నామ మంత్రము 21.3.2022

ఓం గుహ్యాయై నమః

తలచిన కొలదీ, వివరించిన కొలదీ, ఎన్ని నామాలతో స్మరించిననూ, ఇంకా తెలుసకోవలసినది ఎంతైనా ఉందనిపించే బ్రహ్మోపేంద్రాదులకు సైతం అంతుబట్టని గుహ్యాతి గుహ్యమైన తత్త్వం గలిగిన జగన్మాతకు నమస్కారము. 

శ్రీలలితా సహస్ర నామావళి యందలి గుహ్యా అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం గుహ్యాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునకు ఆ తల్లి కరుణచే జగన్మాతను సాక్షాత్కరింప జేసుకోవడానికి, ఆ తల్లి పాదసేవయందు మరింత ఆసక్తి పెరగి, భౌతిక సంబంధమైన సుఖసంతోషములతోబాటు ఆత్మానందమును కూడా సంప్రాప్తింపజేసుకొనును.

శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర మహాత్మ్యములో (ఫలశ్రుతిలో) ఇలా చెప్పబడినది:-

ఇత్యేతన్నామసాహస్రం కథిత తే ఘటోద్భవ|

రహస్యానాం రహస్యం చ లలితాప్రీతిదాయకమ్॥

రహస్యాతి రహస్యమైన ఈ లలితా సహస్ర నామములు అమ్మవారి ప్రీతికొరకై పారాయణ చేయుచున్నాము గనుక, ఏ కోరికతో  పారాయణ చేయుట జరుగునో, ఆ కోరిక నెరవేరును అని హయగ్రీవులవారు ఫలశ్రుతిని చెప్పారు.

ఇతి తే కథితం స్తోత్రం రహస్యం కుంభసంభవ|

నాఽవిద్యావేదినే బ్రూయాన్నాఽభక్తాయ కదాచన॥82॥

యథైవ గోప్యా శ్రీవిద్యా తథా గోప్యమిదం మునే|

హయగ్రీవులవారు అగస్త్యులవారితో వచించుచున్నారు "ఓ అగస్త్య మహర్షీ! శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణముచే శ్రీపరమేశ్వరికి ప్రీతి గలుగును గనుక నీకు నేను చెప్పియుంటిని. ఓ మహర్షీ! శ్రీవిద్య నెరుగని వానికి, దైవమందు విశ్వాసము లేని వానికి శ్రీలలితా సహస్ర నామ స్తోత్రమును చెప్పవలదు. శ్రీవిద్య ఎంతటి రహస్యమైనదో, శ్రీలలితా సహస్ర నామ స్తోత్రము కూడా అంతే రహస్యము.  

పశుతుల్యేషు న బ్రూయాజ్జనేషు స్తోత్రముత్తమమ్॥83॥

యో దదాతి విమూఢాత్మా శ్రీవిద్యారహితాయ చ|

తస్మై కుప్యన్తి యోగిన్యః సోఽనర్‍థః సుమహాన్‍స్మృతః॥84॥

రహస్యనామసాహస్రం తస్మాత్సఙ్గోపయేదిదమ్|

హయగ్రీవులవారు అగస్త్యులవారికి ఇలా వచించుచున్నారు "శఠులు, మూఢులు, విశ్వాసము లేనివారు పశుతుల్యులు. అటువంటి పశువులకు రహస్యాతి రహస్యమైన శ్రీలలితా సహస్ర నామములు చెప్పవలదు. శ్రీవిద్యయు, భక్తియు లేనివారుకూడా పశుతుల్యులే.  గనుక శ్రీలలితా సహస్ర నామముల యొక్క రహస్యమును కాపాడవలెను.

గుహ్య యనగా మిక్కిలి రహస్యమైనది. పరమేశ్వరి శ్రీవిద్యాస్వరూపిణి. శ్రీవిద్య యనునది గుహ్యవిద్య. అనగా మంత్రవిద్య. మంత్రములు రహస్యములు. అవి బీజాక్షరములు  గలిగినవి. మంత్రములు మననము చేయవలసినవి తప్ప బిగ్గరగా పఠించకూడదు. ఆ మంత్రమునకు సంబంధించిన దేవతను ప్రసన్నముచేయవలసిన గూఢోక్తి. 

శ్రీలలితా సహస్ర నామావళిలోని ప్రతీనామమూ మంత్ర సమానమే. గనుక శ్రీలలితా సహస్ర నామములను రహస్యాతి రహస్యమైన శ్రీలలితా సహస్ర నామములు అని చెప్పబడినది. 

హయగ్రీవులవారు అగస్త్యునితో ఇలా అన్నారు

న శఠాయ న దుష్టాయ నావిశ్వాసాయ కర్హిచిత్|

శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీవిద్యారాజవేదినే॥

హయగ్రీవ స్వామి అగస్త్యునకు ఈ విధముగా చెప్పెను. ఓ అగస్త్యా! రహస్యాతి రహస్యమైన శ్రీలలితా సహస్ర నామములు నీకు చెప్పుచున్నాను. కాని శఠునకు (కుత్సితునకు), దుష్టునకు, విశ్వాసహీనునకు ఈ రహస్యాతి రహస్యమైన శ్రీలలితా సహస్ర నామములు చెప్పరాదు. కేవలం శ్రీమాతయందు భక్తిప్రపత్తులు గలవానికి శ్రీవిద్యావేత్తలకు, ఆ పరమేశ్వరియందు భక్తిగలవారికి మాత్రమే చెప్పవలయును.

వేదములలో ఇలా ఉన్నది. ఒకసారి విద్య బ్రాహ్మణుని వద్దకు వచ్చి తనను రక్షింపుమని వేడుకొన్నది. ఆలా రక్షించినట్లయితే చతుర్విధపురుషార్థ ఫలములనుఇచ్చెదనని చెప్పినది.  అలాకాకుండా నిజాయతీపరుడు కానివానికి, ఇంద్రియనిగ్రహము లేనివానికి, హేళనచేయువానికి, నమ్మకము లేనివానికి బోధించవలదని చెప్పినది. అనగా అపాత్రునకు విద్యను బోధింపరాదని ఆ విద్య బ్రాహ్మణునకు చెప్పినది. బ్రాహ్మణుడు ఆ విద్య చెప్పినది పెడచెవిని పెట్టి అపాత్రవిద్యా దానముచేసినచో, తను (ఆ విద్య) ఆ బ్రాహ్మణుని మస్తిష్కము నుండి వెడలిపోవుదును (నేర్చిన విద్య కొరగానిదిగా చేతును) అని చెప్పినది.  తనకు గురువుబోధించునది అంతకు మునుపే తనకు తెలియుననువాడును, గురువు ఎంత చెప్పినను తెలియనట్లు నటించువాడును శఠుడనబడును. విద్య నేర్పెడి గురువులను దూషించువాడును, గురువు చెప్పినది విని వితండవాదము చేయువాడును, గురువునందు భక్తి, విశ్వాసము లేనివాడు, గురువు ఋణము చెల్లించనివాడు, గురువు వద్ద అబద్ధములాడువాడును, తల్లిదండ్రులను చులకనభావముతో  చూచువాడును శ్రీలలితా సహస్ర నామములు బోధింపబడుటకు అపాత్రుడు. అటువంటి వాడిని దూరముగానుంచవలెను. ఇక్కడ విద్య అనగా శ్రీవిద్యగా భావించవలెను.

శ్రీలలితా పరమేశ్వరి తనయొక్క కాంతికిరణముల నుండి ఎనిమిది కిరణములను వశిన్యాది వాగ్దేవతలుగా (వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అను వారిని) సృజించి, తనను సంతోషపెట్టుటకై శ్రీలలితా సహస్ర నామములను విరచించమని చెప్పినది. ఆ వశిన్యాదులు ఆ పరమేశ్వరి ఆదెశము మేరకు శ్రీలలితా సహస్ర నామములను విరచించారు. ఆ లలితా సహస్రనామములను గూర్చి శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర మహాత్మ్యము (ఫలశ్రుతి) లో ఇలా చెప్పబడినది.

గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ|

రాజరాజేశ్వరీ బాలా శ్యామలా  లలితా దశ॥72॥

రహస్యనామసాహస్రమిదం శస్తం దశస్వపి|

తస్మాత్సఙ్కీర్తయేన్నిత్యం కలిదోషనివృత్తయే|

ముఖ్యం శ్రీమాతృనామేతి న జానన్తి విమోహితాః॥74॥

లౌకిక వాక్యములలో విష్ణునామ కీర్తనము ఉత్తమము. అటువంటి విష్ణు సహస్ర నామములకన్నా శివసహస్రనామము ఉత్తమము. శివ సహస్ర నామములకన్నా శ్రీలలితా సహస్ర నామములు ఉత్తమము. కోట్లాది దేవీ సహస్ర నామములలో గంగా, భవానీ, గాయత్రీ, కాళీ, లక్ష్మీ, సరస్వతీ, రాజరాజేశ్వరీ, బాలా, శ్యామలా, లలితా అను పదిసహస్ర నామములు అత్యంత ఉత్తమమైనవి.  అటువంటి పది ఉత్తమమైన దేవీసహస్ర నామములలో రహస్యాతి రహస్యమైనది శ్రీలలితా సహస్ర నామము. వైదికకర్మాచరణములో కలియుగ ప్రభావమున సంభవించే లోపముల వలన కలిగే దోషముల నివారణకు రహస్యాతి రహస్యమైన శ్రీలలితా సహస్ర నామ స్తోత్రము ఉత్తమమైనది. ఎందుచేతనంటే శ్రీలలితా సహస్ర నామములలోని ప్రతీనామమునకు  బాహ్యముగా ఒక అర్థము ఉంటే, అంతరార్థములు అనేకముగా ఉన్నవి. వ్యాఖ్యాతలు తమ పాండిత్యమునకు తగినట్లుగా తత్త్వవిచారణచేసి విస్తృతమైన భావాలను వెలికి తీసియున్నారు, ఇంకనూ వెలికి తీయుచున్నారు. అంటే ప్రతీనామములోని గుహ్యాతి గుహ్యమైన భావములు వెలువడదగినంతటి శ్రేష్ఠముగా వశిన్యాది విగ్దేవతలు విరచించారు గనుక శ్రీలలితా సహస్ర నామములు ఆ విధముగా కూడా గుహ్యాతి గుహ్యములైనవి. గనుకనే అమ్మవారికి వశిన్యాదులు శ్రీలలితా పరమేశ్వరిని గుహ్యా యను నామ మంత్రముతో కీర్తించారు.

ధనధాన్యములు గాని, రాజ్యాలుగాని, కడకు ప్రాణములు గాని ఇవ్వవచ్చు. కాని శ్రీవిద్యను (శ్రీలలితా సహస్ర నామములు కూడా శ్రీవిద్యలో భాగములైనవే) మాత్రము అర్హత లేనివారికి చెప్పకూడదు. అందుకే జగన్మాతకు నమస్కరించునపుడు ఓం గుహ్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

625వ నామ మంత్రము 22.3.2022

ఓం కైవల్య పదదాయిన్యై నమః

ఉపాసకులకు సాధనలో అనన్యస్థితికిజేర్చి కైవల్యపదమును ప్రసాదించి అంతకన్నా వారికి ఉత్తమగతులు లేవనిపించే తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కైవల్య పదదాయినీ అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ)నామ మంత్రమును ఓం కైవల్య పదదాయిన్యై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఆరాధించు సాధకులకు సుఖసంతోషములతో బాటు ఉత్తమగతులు ప్రసాదించును.

 కోరికలతో పరమాత్మను ఉపాసించితే కోరికలు తీరుతాయి. కాని మళ్ళీ పునర్జన్మ ఉంటుంది. అంటే జననమరణచక్రభ్రమణం తప్పనిసరి అవుతుంది. అదే నిష్కామంగా ఉపాసనచేస్తే జన్మరాహిత్యమైన మోక్షమును పొందవచ్చు. 

నిష్కామము అంటే నాకు మోక్షం కావాలి అనుటకూడా సకామమే. భారం పరమాత్మపై ఉంచి, కేవలం ఉపాసకుడు మాత్రమే అయితే నిష్కామం అవుతుంది.

పరమేశ్వరి కేవలా యని అనబడినది. అంటే స్వభావము, నిర్గుణత్వము ఉంటాయి. సాయుజ్యముక్తిని పొందడం జరుగుతుంది.  ధర్మి (ధర్మము గలిగి యుండుట) మాత్రమే ఉంటుంది. దీనినే ఐదవ ముక్తి యందురు.

సార్షికము, సాలోక్యము, సామీప్యము, సారూప్యము అను నాలుగు ముక్తులుగాక సాయుజ్యము అనునది ఐదవముక్తి. ఈ ఐదు ముక్తులను కైవల్యము అంటారు. అమ్మవారు ఈ కైవల్యమును ప్రసాదించుతుంది గనుక కైవల్యపదదాయినీ యని అనబడినది.

కైవల్యము అనగా చైతన్యశక్తి నిజస్వరూపముతో ఉండుట. 

1. అమ్మవారిని మణిపూరంలో అర్చించుట లేదా తనకు భగవంతునకు భేదము గలదనియు, తనకంటె భగవంతుడు అధికుడని తలచుచూ విగ్రహములు, సాలగ్రామములు లేకుండా ఉపాసిస్తే సమానరూపముక్తి అనగా సార్ష్టితరూపముక్తి యనిపేరు. 

2. అనాహతంలో ఆ పరమేశ్వరిని ఉపాసిస్తే లేదా విగ్రహములు, సాలగ్రామములు మొదలగునవి ఉపాసించినచో సాలోక్యముక్తి కలుగును. అనగా అమ్మవారు ఉండు ప్రదేశములోనే ఉండడం జరుగుతుంది.

3. పరమేశ్వరిని విశుద్ధిచక్రంలో పూజించితే లేదా బ్రహ్మచర్య నియమమును పాటించుచు, ఉపాసకుడు తానున్న ఆశ్రమధర్మమును (ఆశ్రమములు అనగా బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్దు, సన్న్యాసి) పాటిస్తూ ఆశ్రమధర్మానుష్ఠానమును ఆచరించు వానికి సామీప్యముక్తి లభించును. పరమేశ్వరికి సేవకులుగా ఉపాసకులు ఉంటారు.

4. పరమేశ్వరిని ఆజ్ఞాచక్రంలో పూజించితే లేదా తనలో తానే పరమాత్మను ఊహించుకుంటూ అమ్మవారిని ఉపాసిస్తే, అట్టి ఉపాసకునికి సారూప్యముక్తి లభించును. పరమేశ్వరితో సమానమైన రూపంలో ఉంటారు.

5. జగన్మాతను సహస్రారంలో అర్చిస్తే లేదా భగవంతుని రూపమును కల్పించి ఉపాసన చేసిన, ఆ ఉపాసకుడు ఆ భగవంతుని తాదాత్మ్యము పొందును. దీనినే సాయుజ్యముక్తి యందురు. దీనినే శాశ్వతముక్తి యందురు.

తపస్సు, శ్రద్ధ కలవారై, వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను చేయుచు, అరణ్యవాసులై, ప్రశాంతమనస్కులై, కేవలం భిక్షాటనమునందు లభించిన ఆహారమే భుజించుచు ఉందురో అట్టివారు పరమాత్మను అర్చిరాది మార్గము అనే సూర్యద్వారము ద్వారా చేరుదురు. అర్చిరాది మార్గము అనగా ఇది సగుణబ్రహ్మోపాసకులు బ్రహ్మలోకమునకు పోవుమార్గము. ఆమార్గము మొదట సూర్యలోకముగుండను ఆవల చంద్రలోకముగుండను ఆవల విద్యుల్లోకముగుండను ఉండును.

ఉత్తరాయణమున చనిపోవు వాడు దేవతల మహిమను పొంది, సూర్యసాయుజ్యమును పొందుచున్నాడు.

దక్షిణాయణమునందు చనిపోవు నతడు పితృదేవతల మహిమలను పొంది చంద్రసాయుజ్యమును పొందుచున్నాడు.

కర్మఫలముల శేషము ఉన్నంతకాలము జీవునకు జన్మరాహిత్యము ఉండదు. మళ్ళీ మళ్ళీ పుట్టడం జరుగుతుంటుంది. పరమేశ్వరిని నిష్కాములై కేవలం ఆ  పరమాత్మసన్నిధియే తమ పరమావధిగా భావించి ఆ జగన్మాతను ఉపాసిస్తే, ఆ తల్లి, అట్టి ఉపాసకుల కర్మఫలములు నశింపజేసి పునర్జన్మ రహితమైన కైవల్యమును అనుగ్రహించును. గనుకనే ఆ పరమేశ్వరి కైవల్యపదదాయినీ యని అనబడినది.

అమ్మవారికి నమస్కరించునపుడు ఓం కైవల్య పదదాయిన్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

626వ నామ మంత్రము 23.3.2022

ఓం త్రిపురాయై నమః

ఇచ్ఛా, క్రియా, జ్ఞానల శక్తులు, మనో, బుద్ధి, చిత్తములు, భూః, భువః, సువః అనే లోకములు, సుషుమ్న, ఇడ, పింగళ నాడీత్రయము, స్థూల, సూక్ష్మ, కారణ దేహత్రయము, మొదలైన స్వరూపములలో త్రిపురా రూపిణియై విరాజిల్లు తల్లికి నమస్కారము.

లలితా సహస్ర నామావళి యందలి త్రిపురా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం త్రిపురాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకుడు  ఆ త్రిపుర సుందరి కరుణతో సర్వాభీష్టములను నెరవేర్ఛుకొని ఆత్మానందమునంది తరించును. 

ఇచ్ఛాశక్తి-జ్ఞానశక్తి-క్రియాశక్తి యను ఈ మూడింటిని జ్ఞానము-ఇచ్ఛ-క్రియ అను ఈ  క్రమములో చెప్పవలయును ఏలననగా జ్ఞానము ఇచ్ఛకు కారణమవుతుంది. ఇచ్ఛ క్రియకు కారమవుతుంది.

ఇచ్ఛాది చలనాత్మకమైన క్రియలు (క్రియాశక్తి రూపములు) ఆ పరమేశ్వరి స్వరూపములయి ఉన్నవి. ఈ చలనాత్మక క్రియలు ఐదు. 1. స్పందము, 2. పరిస్పందము, 3. క్రమము, 4. పరిశీలనము, 5. ప్రచారము.

శిరస్సుఇచ్ఛాశక్తి, శిరస్సునకు క్రింది భాగము జ్ఞానశక్తి మరియు పాదములు క్రియాశక్తియై, అటువంటి ఇచ్ఛాశక్తి-జ్ఞానశక్తి-క్రియాశక్తుల సమిష్టి రూపమై తేజరిల్లు పరమేశ్వరి త్రిపురా యని అనబడుచున్నది.

బ్రహ్మ-విష్ణు-మహేశ్వరుల సమిష్టిరూపమే తానై ఆ పరమేశ్వరి త్రిపురా యని అనబడుచున్నదని వామకేశ్వర తంత్రమునందు చెప్పబడినది.

సత్త్వగుణము, రజోగుణము, తమోగుణము అను ఈ మూడుగుణములను గుణత్రయము అనియందురు.

సత్త్వగుణ స్వభావము

సత్త్వగుణము రజోగుణము, తమోగుణముల కంటే పవిత్రమైనది, క్షేమదాయకమైనది. ఈ గుణంతో చేసిన పనులు పవిత్రమైన ఫలితాలను ఇస్తాయి. సత్త్వగుణ ప్రధానంగా జీవించి మరణించిన వారు జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను చేరుకుంటారు.

రజోగుణ స్వభావము

భగవద్గీత ప్రకారం రజోగుణం అధికమైనప్పుడు మరణిస్తే కర్మయందు ఆసక్తి గలవారికి జన్మిస్తాడు. ఈ రజో గుణం వల్ల ప్రాపంచిక భోగాల మీద ఆసక్తి కలుగుతుంది. అది కోరికని, ఆసక్తిని కలుగజేసి కర్మఫలాలతో జీవుణ్ణి బంధిస్తుంది. రజోగుణం అభివృద్ధి చెందినపుడు లోభం, ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి, అశాంతి కలుగుతాయి. కోరికలు తీర్చుకునే కర్మలు చేస్తారు. ఆశ ప్రధాన లక్షణంగా ఉంటుంది.

తమోగుణము స్వభావము

అజ్ఞానంచే జనించే తమోగుణం జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము. ఈగుణం వల్ల సమస్త జీవరాశులు నిర్లక్ష్యము, సోమరితనంతో భ్రమకు గురవుతాయి. అజ్ఞానం, జడత్వము, నిర్లక్ష్యము, మోహము మొదలైనవి ఈ గుణంయొక్క ప్రధాన లక్షణాలు. తమోగుణ ప్రభావంతో మరణించిన వారు జంతువుల జీవరాశిలో పుడతారు.

కాని పరమాత్మయైన అమ్మవారు ఈ గుణత్రయమునకు అతీతురాలైై ఉంటుంది. అది ఎలాగ అంటే పరమాత్మ లోకములయొక్క సృష్టి, స్థితి, లయముల కొరకే మాయద్వారా సత్త్వరజస్తమో గుణములను (త్రిగుణములను) స్వీకరించెను. జీవుడు తాను నిత్యముక్తుడేయైనను, ఈ మూడు గుణములను ఆశ్రయించియే, శరీరము, జ్ఞానేంద్రియములు, వాటి కార్యకలాపముల మాయలో చిక్కుకొని, కార్య, కారణ, కర్తృత్వముల అభిమానముచే బంధింపబడుచున్నాడు. 

పరమాత్మ లోకములయొక్క సృష్టి, స్థితి, లయముల కొరకే మాయద్వారా సత్త్వరజస్తమో గుణములను (త్రిగుణములను) స్వీకరించెను గనుక పరమేశ్వరి ఈ మూడింటిని తన సృష్టిస్థితిలయ కార్యములకు ఉపకరణములుగా స్వీకరించినది యగుటచే అమ్మవారు త్రిపురా యని అనబడినది.

మూర్తిత్రయము (బ్రహ్మ, విష్ణు, రుద్రులు), (త్రేతాగ్నులు -   గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని), త్రివిధ-శక్తులు (జ్ఞానశక్తి,  క్రియాశక్తి,  ఇచ్ఛాశక్తి), వేదసంబంధమైన త్రిస్వరములు (ఉదాత్త, అనుదాత్త, స్వరితము), స్వర్గ మర్త్య పాతాళములు  లేదా భూలోక, భువర్లోక, సువర్లోకములు అను మూడు లోకములు, త్రివేణీ (గంగాయమునాసరస్వతులు అను మూఁడునదుల సంగమము), త్రిబ్రహ్మలు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు), త్రివర్ణములు (ఎరుపు, ఆకుపచ్చ, నీలిరంగులు వీటి వివిధ ప్రమాణ సంకలనములే ఇంద్రధనుస్సు మరియు అనేక రంగులు), అకార-ఉకార-మకార యుత ఓంకారము, త్రికాలములు (భూత, భవిష్యద్వర్తమానములు) ఈవిధంగా ఉన్న త్రిపుటీ స్వరూపమైన పరమేశ్వరి త్రిపురా యని అనబడినది.

అమ్మవారికి నమస్కరించునపుడు ఓం త్రిపురాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

627వ నామ మంత్రము 24.3.2022

ఓం త్రిజగద్వంద్యాయై  నమః

ముల్లోకములచే (స్వర్గ, మర్త్య, పాతాళ లోకములచే - భూః - భువః - సువః లోకముల వారిచేతనూ పూజింపబడు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి త్రిజగద్వంద్యా అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును  ఓం త్రిజగద్వంద్యాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకులు జగన్మాత కరుణించి బ్రహ్మజ్ఞాన సంపద నొసంగి ఆత్మానందానుభూతిచే తరింపజేయును. 

శ్రీమాత అఖిలాండేశ్వరి, సర్వేశ్వరి యగు ఆ పరమేశ్వరి ముల్లోకములందు పూజింపబడుచున్నది. స్వర్గ, మర్త్య, పాతాళ లోకములు వారందరిచేతను, భూలోకము, భువర్లోకము, సువర్లోకము వారందరి చేతనూ పూజింపబడుచున్నది గనుకనే త్రిజగద్వంద్యా యని అనబడినది.

మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి యను జగద్వంద్యులగు ముగ్గురు దేవతల స్వరూపమై విరాజిల్లునది గనుక త్రిజగద్వంద్యా యని అనబడినది.
 
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం త్రిజగద్వంద్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

628వ నామ మంత్రము 25.3.2022

ఓం త్రిమూర్త్యై నమః

సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల స్వరూపిణియై త్రిమూర్తిః అను నామముతో స్తుతింపబడు జగన్మాతకు నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి త్రిమూర్తిః అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం త్రిమూర్త్యై నమః  అని ఉచ్చరించుచూ ఆ జగదాంబను ఆరాధనచేయు భక్తులకు ఆ జగన్మాత త్రిమూర్తి స్వరూపముగా గోచరించును. వారు  నిత్యము ఆ పరమేశ్వరి నామ స్మరణలో కాలము గడుపుచు ఆ తల్లి కరుణ వలన భౌతికముగా సుఖసంతోషములు, ఆధ్యాత్మికముగా ఆత్మానందమును  పొందుదురు.

జగన్మాత సృష్టి కార్యములయందు బ్రహ్మ స్వరూపిణియై జీవకోటిని సృష్టించును. ఆ జీవకోటికి జీవనాధారమైన ప్రాణవాయువును గాలిలోను, ఆహారమును, ఓషధులను వృక్షజాతుల నుండియు, నీటిని భూమినుండియు ఇచ్చు  స్థితికార్యమునందు మహావిష్ణురూపములోను, జగత్తును లయమొనర్చునపుడు రుద్రుని రూపంలోను అమ్మవారే ఉంటుంది. అంటే బ్రహ్మ,విష్ణు,మహేశ్వర రూపములలో అనగా త్రిమూర్తితత్త్వాన్ని ఏర్పరచుకొని ఉంటుంది. అందుకే ఆ తల్లి త్రిమూర్తిః అని యనబడినది.

ధౌమ్యుడు పాండవుల పురోహితుడు. ఇతడు అమ్మవారి ఉపాసకుడు. వివిధ వయసులున్న బాలికలను అమ్మవారి స్వరూపములుగా భావించి వయసును బట్టి నామమును నిర్ణయించాడు. అలాగే ఆయా వయసులో ఉన్న బాలికా స్వరూపిణియైన అమ్మవారిని అర్చన, ముఖ్యంగా, నవరాత్రులలో చేయుట వలన లభించే ఫలములను కూడా ఆయన వివరించాడు. అందులో కొన్ని:

రెండు సంవత్సరాల పాపను కుమారి అని పిలుస్తారు. ఈ అమ్మను పూజించడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి.

మూడు  సంవత్సరాల పాపను త్రిమూర్తి అని పిలుస్తారు, ఈ అమ్మను పూజించడం వల్ల ధనం, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది.

నాలుగు సంవత్సరాల పాపను  కల్యాణి అంటారు. ఈ అమ్మను పూజిస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది

అయిదు సంవత్సరాల పాపను రోహిణి అంటారు. ఈ అమ్మను పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి  ఆరోగ్యం చేకూరుతుంది.

ఆరు సంవత్సరాల పాపను కాళిక అంటారు. ఈ అమ్మను పూజిస్తే శత్రువుల వల్ల కలిగే ప్రమాదాలు తగ్గుతాయి. శత్రువులు తొలగిపోతారు.

ఏడు సంవత్సరాల పాపను చండిక అంటారు. ఈ అమ్మను పూజిస్తే పేదరికం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. 

ఎనిమిది  సంవత్సరాల పాపను శాంభవి అంటారు. ఈ అమ్మను పూజిస్తే ప్రతి పనిలో ఆటంకాలు తొలగి, అనుకూలత ఏర్పడుతుంది.

 తొమ్మిది సంవత్సరాల పాపను దుర్గ అని అంటారు. దుర్గాష్టమి రోజున ఈ పూజ ఎక్కువ చేస్తారు. ఈ అమ్మను పూజించడం వల్ల అన్ని రకాల సుఖ సంతోషాలు చేకూరుతాయి.

ఇక్కడ త్రిమూర్తిః అంటే మూడుసంవత్సరముల బాలిక. గనుక అమ్మవారు త్రిమూర్తిః అని యనబడినది.

మూర్తిత్రయము (బ్రహ్మ, విష్ణు, రుద్రులు), (త్రేతాగ్నులు -   గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని), త్రివిధ-శక్తులు (జ్ఞానశక్తి,  క్రియాశక్తి,  ఇచ్ఛాశక్తి), వేదసంబంధమైన త్రిస్వరములు (ఉదాత్త, అనుదాత్త, స్వరితము), స్వర్గ మర్త్య పాతాళములు  లేదా భూలోక, భువర్లోక, సువర్లోకములు అను మూడు లోకములు, త్రివేణీ (గంగాయమునాసరస్వతులు అను మూఁడునదుల సంగమము), త్రిబ్రహ్మలు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు), త్రివర్ణములు (ఎరుపురంగు, తెలుపురంగు, మిశ్రవర్ణము), అకార-ఉకార-మకార యుత ఓంకారము, త్రికాలములు (భూత, భవిష్యద్వర్తమానములు) ఈవిధంగా ఉన్న త్రిపుటీ స్వరూపమైన పరమేశ్వరి త్రిపురా యని అనబడినది. ఈ రకంగా మూడుగా చెప్పబడినవి అన్నియు త్రిపుటి యని అనబడినది.  అట్టి త్రిపురా యని అనబడిన పరమేశ్వరియే త్రిమూర్తిః అని యనబడినది.

ఒక సారి బ్రహ్మ, శంకరుడు ఒకచోట చేరారు. బ్రహ్మ  ఏదో చెబుతూ శంకరుని వైపు చూచెను. అప్పుడు శంకరుడు విష్ణుమూర్తిని మనసులో భావించుకున్నాడు.  విష్ణుమూర్తి వారి మధ్యకు వచ్చాడు. ఈ త్రిమూర్తులు మువ్వురు సంతోషంచినవారై సూక్ష్మదృష్టితో ఒకరినొకరు తిలకించినవారయారు. అనంతరము వారి సూక్ష్మ దృష్టి మూడువిధములుగా మారింది. ఆ మూడువిధములైన దృష్టితో ఒక దివ్యస్వరూపము ఉన్న కుమారి పుట్టినది. ఆ కుమారి నలుపు, తెలుపు, ఎఱుపు గల మూడువర్ణములతో ఉన్నది. ఆ కుమారిని "నీవు ఎవరు? నీకేమి పని?" అని అడిగారు. ఆ కుమారి "ఓ మహనీయులారా! దివ్యదృష్టి ఉన్న మీరు నన్ను ఎరుగరా? నేను పరమాత్మస్వరూపిణియైన పరమేశ్వరిని" అని చెప్పినది. ఆ త్రిమూర్తులు సంతోషించి "కుమారీ! నీవు త్రిపుర యను నామముతో జగత్తును రక్షించుము. నీకు నీగుణములను అనుసరించి, ఇంకను ఇతర నామములు ఉండును. అవి వశిన్యాది వాగ్దేవతలు నిర్ణయిస్తారు. నీ నామములన్నియు సర్వసిద్ధులను కలిగించును. నీవు తెలుపు, ఎరుపు, నలుపు రంగులు గలిగినదానవు గనుక మూడుస్వరూపములు పొందుము. అని చెప్పగా ఆ కుమారి సిత-రక్త-కృష్ణ వర్ణములు గలిగినదిగా మారెను. అందుచే ఆ కుమారికి వారు త్రిమూర్తి యని నామమును పెట్టారు. ఆ కుమారి మూడు స్వరూపములే బ్రాహ్మి, వైష్ణవి, రౌద్రి అను నామములతో ప్రసిద్ధి చెందినది.

శాంభవీ శుక్లరూపా చ శ్రీవిద్యా రక్తరూపిణీ|

శ్యామలా శ్యామరూపా స్యాత్  ఇత్యేతా గుణశక్తయః॥ (సౌభాగ్యభాస్కరం, 748వ పుట/దేవీభాగవథం) 

శాంభవి - తెలుపురంగు, శ్రీవిద్య - ఎరుపురంగు, శ్యామ - నలుపురంగు

అటువంటి త్రిమూర్తి స్వరూపిణికి నమస్కరించునపుడు ఓం త్రిమూర్త్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

629వ నామ మంత్రము 26.3.2022

ఓం త్రిదశేశ్వర్యై నమః

దేవతలకు ఈశ్వరిగా, జాగ్రత్స్వప్నసుషుప్త్యావస్థలకు అతీతముగా, సృష్టిస్థితిలయలకు అతీతమై వాటిని నిర్వహించుచూ, పదార్థ, మనో, ప్రజ్ఞాస్థాయిలపై ఆధిపత్యం వహించు జగన్మాతకు నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి త్రిదశేశ్వరీ అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం త్రిదశేశ్వర్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఉపాసించు సాధకునికి తన జీవితంలో ఏదశయందును సర్వాభీష్టసిద్ధి ప్రాప్తించి అంత్యమున ముక్తిపదము లభించును.

దేవతలకు అమరకోశంలో త్రిదశులు అను పేరు కలదు. దానిని బట్టి త్రిదశులకు ఈశ్వరి అనగా దేవతలకు ప్రభ్వి సర్వదేవతల ప్రార్థనవలన, ఆరాధన వలన మరియు అభ్యర్థనవలన చిదగ్నికుండము నుండి ప్రభవించి దేవతలను, రాక్షసులబారినుండి కాపాడినది కావున శ్రీమాత త్రిదశేశ్వరి అను నామముతో స్తుతింపబడుచున్నది.

ఇక దశ అనగా జాగ్రత్స్వప్నసుషుప్త్యావస్థలను మూడు దశలందు ఏవిధమైన మార్పులేక ఈ మూడుదశలకు అతీతంగా ఉండేది పరమేశ్వరి అని గ్రహించదగును. మరియు సృష్టి, స్థితి, లయలను విశ్వమునకు గల మూడుదశలకు అతీతంగా భాసిల్లును గనుక అమ్మవారు త్రిదశేశ్వరీ యని అనబడినది.

పరమాత్మ నిరాకారుడు. కేవలం జ్ఞానమే ఆయన స్వరూపం.ఆంతటా మహా శూన్యంగా వ్యాపించిన వ్యోమమే (గగనమే) ఆయన దేహం . నిజానికి ఆయన శూన్యం కాదు. అనంత శూన్యములో ఆయన పరిపూర్ణ జ్ఞానం వ్యాపించే ఉన్నది. ఆ విశుద్ధ జ్ఞాన దేహుడైన పరమాత్మ యొక్క ప్రత్యక్ష మూర్తులే విశ్వే దేవతలు.  ప్రతీ బ్రహ్మాండం లోను (ప్రతి సూర్య కుటుంబంలో) ఈ విశ్వే దేవతలు మూడు గణాలుగా వ్యక్తమవుతున్నారు. ఈ వ్యక్త మూర్తులలో ఉన్న పరమాత్మ చైతన్యమే ఈ సృష్టి ని లయబద్ధంగా నడిపిస్తున్నది. కనుక విశ్వే దేవతలు ఎవరో తెలుసుకొందాము.

1. ద్వాదశాదిత్యులు

మానవులందరికి స్వర్గలోకము అంటే సూర్య మండలమే. అదే దేవతలందరికి నివాస స్థానము. సూర్యమండలమును పరిపాలించు వాడు సూర్యుడు. ఆయనే ఆదిత్యుడు. ఒక్కో మాసం లో సూర్యకిరణాలు ఒక్కొక గుణము కలిగి ఉంటాయి గనుక ఆదిత్యుడు పండ్రెండు రూపాలు ధరిస్తాడు. వీరే ద్వాదశాదిత్యులు.-- ధాత, అర్యముడు, మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, త్వష్ట, విష్ణువు, తర్యముడు, భగుడు, పూషణుదు, క్రతువు- స్వర్గాన్ని వీరి రూపంలొ ఆదిత్యుడు పండ్రెండు నెలలు పరిపాలిస్తాడని మనం అర్ధం చేసుకోవాలి.

2. ఏకాదశరుద్రులు

రుద్రుడు అనగా రోదసికి అధిపతి. ఇతడు పదకొండు రూపములలో వ్యక్తమవుతున్నాడు. అంతరిక్షమున ఏర్పడు స్పందనలన్నియు రుద్రుడు సృష్టించునవియే పంచ భూతాత్మకమైన ప్రకృతి యందు గల మార్పులన్నియు వీరు సృష్టించు స్పందనలే గనుక ప్రాణుల జీవనము వీరి దయపై ఆధార పడి యున్నది. మానవుల యందు పంచ జ్ఞానేంద్రియములను పంచ కర్మేంద్రియములను, మనసును శాసించు ప్రత్యక్ష మూర్తులు గనుక జీవులందరు వీరి రూపములుగానే భావించ వలెను. వీరే రుద్రులు - అజుడు, ఏకపాదుడు, అహిర్బుధ్న్యుడు, త్వష్ట, రుద్రుడు, శంభుడు, హరుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, ఈశానుడు త్రిభువనుడు - రుద్రుడు ఇన్ని రూపములు ధరించును.

3. అష్టవసువులు

భూమి పైగల సమస్త పదార్ధములకు రంగు, రుచి, వాసన, గుణములను ఆకారములు కల్పించుచు ప్రకాశింపజేయు వారు. వీరు పరమాత్మ చైతన్య విజ్ఞానముతో ఏర్పడిన ప్రత్యక్ష మూర్తులు.భూమియందలి ఏ రూపమైనను వీరు లేక ఏర్పడజాలదు. వీరే అష్ట వసువులు.-- ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు.
ఈ ఆదిత్యులు, రుద్రులు,వసువులు పరమాత్మ ప్రత్యక్ష రూపములుగా వేదకాలము నాటి ఋషులు భావించిరి. అందరూ ఏదో ఒక రూపములో వీరిని ప్రతినిత్యము ఆరాధిస్తూనే ఉన్నారు. 

ద్వాదశాదిత్యులు (12), ఏకాదశరుద్రులు (11), అష్టవసువులు (8) వీరు స్వర్గలోకమునేలు ఇంద్రుడు, ప్రజోత్పత్తి కారకుడైన ప్రజాపతి అనగా బ్రహ్మ - మొత్తం ముప్పది ముగ్గురు - ఈ ముప్పది మూడు దేవతలకు ఈశ్వరి గనుక పరమేశ్వరి త్రిదశేశ్వరీ యని అనబడినది.

అటువంటి త్రిదశేశ్వరికి నమస్కరించునపుడు ఓం త్రిదశేశ్వర్యై నమః అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

630వ నామ మంత్రము 27.3.2022

ఓం త్ర్యక్షర్యై నమః

శ్రీవిద్యా పంచదశీ మంత్రస్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి త్ర్రక్షరీ అను  మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం త్ర్యక్షర్యై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను పూజించు భక్తులు త్రికరణ శుద్ధిగా ఆ తల్లిని ఆరాధించు భక్తులకు పవిత్రభావము దినదినమూ అధికమగుచూ, పరమానందకారణమైన బ్రహ్మతత్త్వము తెలిసికొని ఆత్మానందానుభూతి సంప్రాప్తమగును.

వాగ్భవ, కామరాజ, శక్తికూటములకు చెందిన క కార, ల కార, ఈం కార (త్ర్యక్షరి) బీజాత్మక స్వరూపిణిగా జగదీశ్వరి విరాజిల్లుచున్నది.

వాగేశ్వరీ జ్ఞానశక్తిః వాగ్భవే మోక్ష రూపిణీ

కామరాజే క్రియాశక్తిః కామేశీ కామ రూపిణీ 

శక్తి బీజేపరాశక్తిః ఇచ్ఛైవ శివరూపిణీ

ఏవందేవి త్ర్యక్షరేతు మహాత్రిపురసుందరీ (సౌభాగ్య భాస్కరం, 747వ పుట)

పై శ్లోకమును ఈ రకముగా భావింపవచ్చును:-

వాగ్భవ బీజము నందు వాగీశ్వరి యను జ్ఞానశక్తి గలదు. ఆ వాగేశ్వరి మోక్షరూపిణి.

కామరాజ బీజము నందు కామేశ్వరి యను క్రియాశక్తిగలదు. ఆ కామేశ్వరి కోరికలను సిద్ధింపజేయు కామరూపిణి.

శక్తిబీజము నందు శివరూపిణి యను ఇచ్ఛాశక్తి గలదు. ఈ విధముగా మూడక్షరములతో వాగీశవరి, కామేశ్వరి, శివరూపిణి యను మూడు స్వరూపములను పొందిన ఆ పరాశక్తి యను మహాత్రిపురసుందరి త్ర్యక్షరీ యని అనబడినది. ఈ మహాత్రిపురసుందరియే శుద్ధవిద్యామంత్ర స్వరూపిణి, కుమారీ మంత్రస్వరూపిణి 
యని చెప్పవచ్చును.

గౌడపాద సూత్రములో త్ర్యక్షరీ యనగా శుద్ధవిద్యాకుమారి యని గలదు. త్ర్యక్షరీ యనగా హృదయస్వరూపురాలు, సత్యస్వరూపురాలు అనికూడా చెప్పబడినది.

అ నుండి క్ష వరకూ గల ఏబది (50) అక్షరములు నిత్యాక్షరములు.

ఈ ఏబది అక్షరములలో ముప్పది నాలుగు హల్లులను పదహారు అచ్చులతో కూర్చగా వచ్చిన మాసాక్షరములకు ఆ, ఈ అను అక్షరములు చేర్చిన ఏర్పడు మూడు అక్షరముల సమూహమును యుగాక్షరములు అందురు. ఈ నిత్యాక్షర, మాసాక్షర, యుగాక్షరములు అనే త్ర్యక్షర సమూహము వలన, ఆ పరమేశ్వరి త్ర్యక్షరీ యని అనబడినది.

త్ర్యక్షర స్వరూపిణికి నమస్కరించునపుడు ఓం త్ర్యక్షర్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

631వ నామ మంత్రము 28.3.2022

ఓం దివ్య గంధాఢ్యాయై నమః

పరమ పవిత్రమైన, దివ్యమైన హరిచందనాదుల పరిమళములతో తేజరిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి దివ్యగంధాఢ్యా యను  ఐదు అక్షరముల  (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం దివ్యగంధాఢ్యాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి సకలార్థసద్ధిని అనుగ్రహించును.

 చైతన్యస్వరూపులు దేవతలు. ఆ దేవతలు ఉపయోగించే సుగంధద్రవ్యములు దివ్యగంధములను ఒసగును. మణిద్వీపమునందు సకల సంపదలతోను, దేవతా గణములతోను సేవింపబడుచూ, దివ్యసుగంధముల వ్యాపనముతో ఆ పరమేశ్వరి సుసంపన్నయై విరాజిల్లుచున్నది. 

అమ్మవారిని కర్పూరవీటికామోద సమాకర్షదిగంతరా  యను (26వ) నామ మంత్రంలో అమ్మవారి తాంబూల సుగంధమును కీర్తించాము. అమ్మవారి తాంబూలము అంతపరిమళభరితమగుటకు కారణము ఆ తాంబూలములో వాడిన సుగంధద్రవ్యములు దివ్యగంధములను ఒసగునవే. ఆ తాంబులం ఇలా ఉండవచ్చు:-
తమలపాకుకు సున్నంరాసి, కవిరి (కాచు) పొడి జల్లి,పచ్చి పోక, వక్కపొడి, పచ్చకర్పూరము, యాలకులు, లవంగాలు, చలువ మిరియాలు, నాగకేసరములు, జాజికాయ, జాపత్రి, కుంకుమపువ్వు, ఎండుకొబ్బరి, పొదీనా పువ్వు తగుపాళ్ళలో వేసిన తాంబులము పరిమళ భరితంగా ఉంటుంది. అట్టి తాంబూల చర్వణము వలన పరిమళములు నలుదిశల వ్యాప్తిచెందుతాయి. అటువంటి తాంబులము శ్రీమాత వేసుకుంటే నోరు పండిందట, పరిమళములు దిగంతములవరకు వ్యాపించినవట.   అందుకే ఆ పరమేశ్వరి దివ్యగంధాఢ్యా యని అనడినది.

శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం దివ్య గంధాఢ్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

632వ నామ మంత్రము 29.3.2022

ఓం సిందూర తిలకాంచితాయై నమః

నుదుటి యందు తిలకము, పాపటయందు మంగళకరమైన సిందూరము ధరించి ఉన్న శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సిందూర తిలకాంచితా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం సిందూర తిలకాంచితాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకులకు ధర్మార్థకామములను పురాషార్థముల సార్థకత సిద్ధించి కైవల్యమును పొందునటులు అనుగ్రహించును.

నుదుట కుంకుమ తిలకము, పాపట సిందూరము ధరించియున్న జగన్మాతయని ఈ నామ మంత్రములోని భావము

అమ్మవారి ఫాలభాగములో కస్తూరి బొట్టు ఉంటే, పాపటలో సిందూర రేఖ ఉంటుంది. సౌందర్యలహరిలో శంకరాచార్యులవారు నలుబది నాలుగవ శ్లోకంలో  అరుణారుణ సిందూర రేఖాంచిత సీమంతంతో జగన్మాత ఎంత సౌందర్యముతో కామేశ్వరునికి అనిపించిందో ఆ శ్లోకాన్ని పరిశీలిద్దాము.
 
తనోతు క్షేమం న-స్తవ వదనసౌందర్యలహరీ
పరీవాహస్రోతః-సరణిరివ సీమంతసరణిః|
వహంతీ సిందూరం -  ప్రబల కబరీభార తిమిర
ద్విషాం బృందైర్బందీ - కృతమివ - నవీనార్క కిరణమ్ || 44 ||

దేవి పాపట నడుమనున్న సిందూరము ఉదయించుచున్న సూర్యునివలెనున్నది.

శంకరభగవత్పాదులవారు పరమేశ్వరి సంబోధించుచూ ఇలా అంటున్నారు: అమ్మా! ఓ పరమేశ్వరీ! సూర్యుని బయటకు రాకుండా ఆపుతూ సూర్యకాంతిని బంధించిన చీకట్లవలె నీ జుట్టు దట్టంగా వంకీలు తిరిగి ఉంటుంది.(అమ్మది గిరజాల జుట్టుగా భావించవచ్చు) ఆ చీకట్లు తొలగించి సూర్యుని రక్షించడానికా అన్నట్లు ఉధృతంగా పొంగి పొరలు నీ ముఖసౌందర్య ప్రవాహమునుండి విడివడి వచ్చిన ఒక నీటిపాయలా నీ పాపట ప్రకాశిస్తూ ఆ జుట్టును రెండు పాయలుగా విభజించుచున్నది.అలా జుట్టును రెండుగా విడదీయుట వలన చీకట్లనుండి విడిపింపబడి అప్పుడే ఉదయిస్తున్న బాలసూర్యునిలా నీ పాపిటలోని సింధూరం ప్రకాశిస్తున్నది. ( పాపట యందు సింధూర ధారణం సుమంగళి సంప్రదాయం, సౌభాగ్యలక్షణం.) అలా సిందూర వెలుగులతో సౌభాగ్య వర్ధనంగా ప్రకాశిస్తున్న నీ పాపట,మా యోగక్షేమం వహిస్తూ మమ్ములను రక్షించు గాక.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి పదహారవ నామ మంత్రము నందు కూడా అమ్మవారిని దాదాపు ఇలాగే వశిన్యాదులు స్తుతించారు.

ఓం ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకాయై నమః 

ఆ పరమేశ్వరి లలాటము  అష్టమీ చంద్రుని శోభతో తేజరిల్లుచున్నది. అటువంటి ముఖమనెడి చంద్రబింబమందు ఆ పరమేశ్వరి ధరించిన కస్తూరి తిలకము చంద్రునిలోని మచ్చవలె కనిపించుచున్నది.  

ఆ కస్తూరి తిలకము మృగనాభి విశేషమై ఒప్పారుచున్నది. కస్తూరి -  మగ కస్తూరి జింక యొక్క ఉదరము, పురుషాంగాల మధ్యన ఉండే ఒక ప్రత్యేక గ్రంధి నుండి వెలువడే తీవ్రమైన పరిమళము. ప్రాచీన కాలము నుండి దీనిని ప్రసిద్ధ సుగంధ పరిమళముగా ఉపయోగిస్తున్నారు. అత్యంత ఖరీదైన జంతు ఉత్పత్తులలో కస్తూరి ఒకటి.

అమ్మవారి నుదుటన ఉన్న కస్తూరీ తిలకము అమ్మవారి ముఖచంద్ర బింబమునకు శోభనిచ్చుటయేగాక, చక్కని కస్తూరీ పరిమళమును చిందించుచున్నది.

శ్రీలలితా సహస్ర నామస్తోత్ర ప్రారంభంలో కస్తూరీ తిలకము యొక్క ప్రస్తావన జరిగినది.

సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికామ్

సమందహసితేక్షేణాం సశరచాప పాశాంకుశామ్

ఆశేషజనమోహినీ మరుణ మాల్యభూషాంబరామ్

జపాకుసుమభసురాం జపవిధౌస్మరేదంబికామ్॥

అను ధ్యానశ్లోకం మనం పఠిస్తూ ఉంటాము. ఆ శ్లోకానికి అర్థం ఇలా ఉన్నది:-

పాదం నుండి తలవరకూ కుంకుమ లేపనముతో, కనుబొమల మధ్య కస్తూరీ తిలకమును ధరించి, చిరునవ్వు చిందిస్తూ, చేతులలో బాణము, ధనుస్సు, పాశాంకుశాలను ధరించి, సమస్త జనులను మోహింపజేస్తూ, ఎర్రని మాలికలతో, అలంకారాలతో, శ్రేష్ఠమైన వస్త్రాలతో, ఎర్రని పుష్పం మాదిరిగా ప్రకాశిస్తున్నట్టి అంబికను

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సిందూర తిలకాంచితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

633వ నామ మంత్రము 30.3.2022

ఓం ఉమాయై నమః

అర్ధనారీశ్వరతత్త్వంతో విరాజిల్లు ఉమామాతకు నమస్కారము.

శ్రీ లలితా సహస్ర నామావళి యందలి ఉమా అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం ఉమాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరాత్పరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు అనిర్వచ నీయమైన ఆత్మానందమును చేకూర్చి ఆ జగదీశ్వరి నామస్మరణమందు ధ్యానముండునట్లుజేసి తద్వారా తరింపజేయును.

పరాశక్తి  పార్వత రాజపుత్రిక పార్వతీదేవిగా అవతరించ వలయునని బాల్యమునుండియే కఠోర తపమాచరించబోగా ఆమె తల్లియైన మేనాదేవికి బాధ కలిగి ఉ ఇక తపస్సు చాలు ఆపుము, అనినా, ఆమె తపస్సు  మాననందున మా (అమ్మా అని కూతురిని పిలిచే ఆప్యాయమైన పిలుపు)  ఇంక వద్దు తపస్సు అని అనురాగంగా అన్నదని కాళిదాసు మహాకవి తన కుమారసంభవమందు చమత్కరించారట. అలా మొదట అన్న ఉ రెండవసారి అన్న మ తో చేరి ఉమ అను సార్థకనామాంకిత అయినదని అంటారు. 

అలాగే ఈ ఉమ అను నామములో అ కార ఉ కార మ కారములు ప్రణవరూపమగుటచే శ్రీమాత ప్రణవస్వరూపిణి గనుక ఆ తల్లికి ఉమ అను నామము సార్థకమయినది. 

కేశోపనిషత్తులో ప్రతిపాదింపబడిన  అమ్మవారే లతితాదేవి  ఉమ  అనియు మరికొందరు విజ్ఞులు ఉ కారము శివునికి, మ కారము శక్తికి, ఆ శక్తే పార్వతి గనుక శివుని అర్ధనారీశ్వరతత్త్వమును తెలియజేసేదే ఈ ఉమ నామమని అంటారు. అందుకు జగన్మాత ఉమా నామాన్వితురాలుగా ఈ నామంలోని భావము అయిఉన్నది.

శంకరుని గృహలక్ష్మి అయిన పరమేశ్వరికి ఉమ యను నామము గలదు. గనుకనే వశిన్యాది  వాగ్దేవతలు అమ్మవారిని ఉమా యను నామముతో స్తుతించారు.

పరమశివుని ఔన్నత్యమునకు పరమేశ్వరి ఆదిశక్తి పరాయణతయే ఒక ప్రమాణమై నిలచి, పరమేశ్వరుని ఉనికిని మరింత వెల్లడి చేసినది గనుక అమ్మవారు ఉమా యని అనబడినారు.

ఉమ అనగా అవిసెపువ్వు (ఈ పూవు లేత పసుపు రంగులో ఉండును) గనుక అమ్మవారు ఉమా యని అనబడినది.

ఉమ యను శబ్దమునకు పసుపు యను అర్థము ఉన్నది. పసుపు మంగళకారము. అమ్మవారు సర్వమంగళ, మంగళగౌరి యని అనబడుతుంది. గనుక ఆ పరమేశ్వరి ఉమా యని అనబడినది.

అటువంటి ఉమా నామాన్వితురాలైన పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం ఉమాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

634వ నామ మంత్రము 31.3.2022

ఓం శైలేంద్రతనయాయై నమః

పర్వతరాజ కుమార్తె అయిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి శైలేంద్రతనయా యను  ఆరు అక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును ఓం శైలేంద్రతనయాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులు ఆ పరమేశ్వరి కరుణచే, సిరిసంపదలు, పాడిపంటలు, భోగభాగ్యములకు లోటులేక జీవించుచూ, ఆ పరమేశ్వరి నామ స్మరణతో జీవతమంతయు గడపి తరించుదురు.

అమ్మకు సహస్ర నామావళి ఉంది. అంతేనా అష్టోత్తర శతనామావళి ఉన్నది. ఖడ్గమాలాస్తోత్రం అంటూ శ్రీచక్రాధిష్ఠాన దేవతలనందరినీ స్తుతిస్తూ బిందు మండలం వరకూ వెళ్ళి త్రిపురే, త్రిపురేశి, త్రిపురసుందరీ, త్రిపురవాసిని, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ, త్రిపురాంబ, మహాత్రిపురసుందరీ, మహామహేశ్వరీ, మహామహారాజ్ఞీ, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా శ్రీచక్రసమ్రాజ్ఞీ నమస్తే నమస్తే నమస్తే నమః అని అంటూ ఆ తల్లిని ఎన్నెన్నో నామాలు వల్లిస్తున్నాము. ఇంతేనా? ఎన్నో ఉన్నాయి. అఖిలాండేశ్వరిని వర్ణించడానికి ఎన్నికోట్లనామాలైనా చాలవు. అంటే అమ్మ హిమగిరి తనయ. హిమవన్నగ మెంతటి ఉన్నతమో, మరెంత విశాలమో, ఎన్నెన్ని పుణ్యతీర్థములుగలవో, ఎచ్చట మానస సరోవరమున్నదో అంతటి మహామహా హిమవన్నగ పుత్రికయైన హిమగిరితనయ, శైలేంద్రతనయ అయిన శ్రీమాతను శైలేంద్రతనయా అని నామ మంత్ర తత్త్వవిచారణ ఎంత చేసినా తక్కువే. మనవల్ల సాధ్యమా? అంతటి వారెవరున్నారు?  హిమవంతము, నషిదము, వింద్యము, మాల్యవంతము, పారియాత్రము, గంధమాదనము, హేమకూటము అను సప్తశైలములు గలవు. ఇందులో హిమవత్పర్వతము ముఖ్యమైనది. కావున శైలేంద్రతనయా అను నామము జగన్మాతకు ఉన్నది. ఈ పర్వతరాజమునకు పుత్రిక అయినందున శైలేంద్ర తనయా అని భావము. 

తన తండ్రి చేయు యజ్ఞములో శివనింద భరించలేక యోగాగ్నిలో తన దేహాన్ని చాలించి మళ్ళీ పరమేశ్వరిగా తనకు పరమ భక్తుడైన హిమవంతునికి కుమార్తెగా అవతరించి నాటినుండి శ్రీదేవి, హైమవతి, శైలజ, శైలేంద్రతనయా అని ఇంకనూ ఎన్నో నామములతో పిలువబడినది. 

అటువంటి శైలేంద్రతనయకు నమస్కరించునపుడు ఓం శైలేంద్రతనయాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

635వ నామ మంత్రము 1.4.2022

ఓం గౌర్యై నమః

శంఖము, బంగారము, చంద్రుడు - ఈ మూడువర్ణముల సమ్మిళిత వర్ణమైన గౌర వర్ణపు మేని ఛాయతో శోభిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి గౌరీ అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం గౌర్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు ఆ పరాశక్తి కరుణతో మధుర భాషణా చతురులై, పలువురి మన్ననలందుతూ, కీర్తిప్రతిష్టలతో బాటు, సుఖసంతోషములు, సిరిసంపదలతో జీవనము కొనసాగిస్తూ, అమ్మవారి పాదసేవలో కూడా తరిస్తారు.

శైలపుత్రి, శైలేంద్ర, పార్వతి, హైమవతి యనునవి ఆ పరమేశ్వరికి గల అనేక నామములలో కొన్ని. ఆమె శైలపుత్రి అనడానికి పౌరాణిక గాథ గలదు. నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రీ దుర్గా పర్వతరాజు హిమవంతుని కుమార్తె. తపస్సు ఆచరించిన ఆమె శివుణ్ణి భర్తగా పొందింది.  

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రీ దుర్గా దేవి వృషభవాహనంపై తిరుగుతుంది. కుడిచేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి, ఎడమచేతిలో కమలం పట్టుకుంటుంది. పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతిదేవి. తండ్రికి ఇష్టం  లేకపోయినా నిత్య  శివకుటుంబిని అయిన అమ్మవారు శివుణ్ణి  వివాహం చేసుకుంటుంది. ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు పెద్ద  యజ్ఞం తలపెట్టి, శివుణ్ణీ, సతీదేవినీ ఆహ్వానించడు. పుట్టింటిపై  ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు. నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైన నాశనమవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికిస్తూ, అవమానభారంతో కాలిగోటితో అగ్నిని సృజించి, అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి. తనను దాక్షాయణీ పేరుతో కీర్తించవద్దనీ, అలా పిలిచినపుడు వెంటనే దక్షయజ్ఞ వినాశినీ అని పిలవాలనీ శాసించి అంతర్ధానమవుతుంది. ఆ తరువాత తిరిగి శివుడిని వివాహం చేసుకునేందుకు, మేనకా, హిమవంతులకిచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు. ఈమెనే హైమవతీ, శైలజ, శైలపుత్రీ, గౌరీ అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు. 

శివమహాపురాణం, దేవి భాగవతం వంటి ఇతరన పురాణాల్లోనూ సతీ, పార్వతీ దేవిల కథలు మనం చూడవచ్చు.

రుతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రీదేవి. నందిపై కూర్చుని ములాధారా చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు. లౌకికంగా తండ్రి(హిమవంతుని) నుంచి భర్తను (శివుని) వెతుక్కుంటూ ప్రయాణించింది శైలపుత్రీదేవి. మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన. అందుకే నవరాత్రి పూజలు చేసేవారు, యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి, ధ్యానిస్తారు. ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలి మెట్టుగా చెప్తుంటారు. ఇదే యోగసాధనకు ప్రధమమైనది. శైలపుత్రీదేవి మూలాధారా శక్తికి అధిష్టాన దేవత. ఎన్ని జన్మలకైన శివకుటుంబిని గనుక తన భర్త అయిన శివుణ్ణి వెతికి, ధ్యానించి, సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా  తనలోఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తుంటారు.

యోగ పరంగా నవరాత్రులలోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది, కీలకమైనది. ఈ రాత్రి శైలపుత్రీ దుర్గా దేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటంది అని అంటారు. ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు.

యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఇంకా ఉన్నత ఆధ్యాత్మికానుభూతుల్ని అందుకోవాలని కోరుకుంటారు. అలాంటప్పుడు మూలాధారా చక్రానికి అధిష్టాన దేవతైన శైలపుత్రి దేవిని ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరవచ్చు. శైలపుత్రీ దుర్గా దేవి అచ్చంగా పార్వతీదేవి. శివమహాపురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రీదేవిలో నిబిడీకృతమై ఉంది. ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది.

శైలపుత్రీదేవిది పృధ్వీ తత్త్వం, సందర్భశుద్ధి అయిన గుణం, గ్రాహణ, భేద శక్తులతో ప్రకాశిస్తుంది.

శైలపుత్రీ అమ్మవారు గౌర వర్ణము అనగా శంఖము, బంగారము, చంద్రుడు - ఈ మూడు వర్ణముల సమ్మిళిత మైన  గౌర వర్ణపు మేని ఛాయతో శ్రీమాత శోభిల్లుచుండుటచే గౌరీ యని పిలవబడుచున్నది.   

ఆ తల్లి దేహచ్ఛాయ శంఖము, బంగారము, చంద్రుడు - ఈ మూడు రంగులసమ్మిళతమైన గౌర వర్ణముతో విరాజిల్లుచుండుటచే గౌరి అను నామముతో స్తుతింపబడుచున్నది.

శ్రీమాత గౌర వర్ణమునకు మరొక ఇతిహాసము కూడా గలదు. పరమశివుడు తన ధర్మపత్ని అగు కాళీదేవిని చూచి నల్లపిల్లా అని పరిహసింపగా అమ్మవారు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసి ఆయన వరం వలన గౌర వర్ణ శరీరం పొందినది అగుటచే గౌరి అని పిలువబడినది. కన్యకలయందు ఎనిమిది సంవత్సరాలు వయస్సు గలది గౌరి అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం గౌర్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

636వ నామ మంత్రము 2.4.2022

ఓం గంధర్వ సేవితాయై నమః

గంధర్వులచే సేవింపబడు పరాశక్తికి నమస్కారము.

అద్భుత గాయకులైన గంధర్వులు తమ గానంతో జగన్మాతను సేవిస్తారని భావము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి గంధర్వ సేవితా అను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును ఓం గంధర్వ సేవితాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులు షడ్గుణ సంపన్నులై, ఆ షడ్గుణములే సకల సంపదలై, జగన్మాత పాదపద్మముల నారాధిస్తూ జీవనం కొనసాగించి తరించుదురు.

వేదాది సాహిత్యం లోనూ, పురాణాలలో, ఇతిహాసాలలోనూ ఈ గంధర్వుల ప్రస్తావన ఉన్నది. పురాణాల ప్రకారం వీరు కశ్యప ప్రజాపతికి పుట్టిన వారు. వీరు మానవులవలె, మనకు భౌతిక నేత్రాలకు కనిపించకపోవడం వలన(సామాన్య దృష్టికి) , వీరు మానవ తలాలకు చెందిన వారు కాదని అర్థం చేసుకోవాలి. మహా భారతంలో సాత్యవతేయుడైన చిత్రాంగదుడు, ఒక పరాక్రమ వంతుడైన గంధర్వరాజుతో పోరాడి మరణించడం మనం గాంచవచ్చు. దీనిని బట్టి గంధర్వులలో పరాక్రమశాలురు కూడా ఉన్నట్లు గమనించవచ్చు. అలాగే, భారతంలో అంగార పర్ణుడు అను వీరుడైన గంధర్వుడు, అర్జునుడి చేతిలో ఓడి, అర్జునిడికి , చాక్షుసి అనే విద్యను ఇస్తాడు. ప్రతిగా అర్జునుడు ఇతనికి ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాడు. ఈ అంగార పర్ణునికే  చిత్ర రథుడు అనే పేరు కూడా ఉన్నది.ఈ అంగార పర్ణుడు, యక్షరాజైన కుబేరుని కి  మిత్రుడు.

గంధర్వులు. మన పురాణాలలో, ఇతిహాసాలలో, వీరు మానవ లోకాలకు - గంధర్వ లోకాలకు సంచారం చేసినట్లు చెప్పబడినది. వీరు అదృశ్య ప్రపంచానికి చెందిన జీవులు. వీరు  దేవతలు పానం చేసే సోమ రసాన్ని రక్షించే వారిగా చెప్పబడ్డారు. స్వర్గలోకపు సభ అయిన అమరావతిలో, వీరు ఆస్తాన సంగీత కారులు కూడా. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం ఈ గంధర్వులు మనవ లోకానికి-దేవ లోకానికి మధ్య అనుసంథాన కర్తలుగా కూడా పనిచేసారు.  

శ్రీమద్రామాయణంలో  దనువు అనే గంధర్వుడు, కబంధుడినే రాక్షసుడిగా కావాలని శపించబడతాడు అయితే గంధర్వులలో కూడా కొన్ని వర్గాలున్నట్లు మన పురాణాల సమాచారం. 

1. మానవ గంధర్వులు మానవులు తమ పుణ్యకర్మల ఫలితంగా గంధర్వత్వం పొందినవారు.

2. దేవగంధర్వులు దేవతలలో ఒక జాతి. చాలా అందంగా ఉంటారు. నాట్య, సంగీత శాస్త్రములలో ప్రావీణ్యత చెందినవారు. వీరి గాత్రం చాలా బాగుంటుంది. 

గంధర్వులు పర్వతాగ్ర భాగాలలో విహరిస్తారు. ఆ దేవిని ఉమా, గౌరీ, శైలేంద్రతనయా అంటూ శ్రీమాతను కర్ణ పేయముగా ఆహ్లాదకరంగా కలిగించే సుమధురస్తోత్ర గానములచేత సేవిస్తారు. 

గంధర్వులు మంచి సంగీత విద్వాంసులు, చక్కని గాత్రశుద్ధి గలవారు అవడంచేత, గంధర్వగానం అంటే చాలా ప్రసిద్ధిచెందిన గానము.

సంగీతం బాగా వచ్చియుండి, చక్కని కంఠంతో వినసొంపుగా పాడేవారి గానం గంధర్వగానం అని అంటాము. 

తుంబురుడు అనే గంధర్వుడు మంచి వీణావిద్వాంసుడు. తుంబురుని వీణపేరు తుంబుర అని అంటారు. 

తిరుమలగిరులలో తుంబుర తీర్థమని ఒక ప్రసిద్ధిపొందిన ఆకాశధార గలదు. అది సాక్షాత్తు ఆకాశంనుండి పడినంత ఎత్తునుండి పడుతూ ఉంటుంది. ఆ జలము అమృతమయమైన రుచిలో ఉంటుంది. అక్కడ స్నానంచేస్తే ఆ శరీరం అత్యంత కాంతిభరిత మౌతుంది. కారణమేమంటే ఆ జలములకు మురికిని పారద్రోలే లక్షణము ఉన్నది. వెండి, బంగారు వస్తువులు ఆ జలములలో ఒక గంట ఉంచితే మెరుగు పెట్టినట్లు ధగధగ కాంతులు గలిగి ఉంటాయి. ఆ జలములు ఏదైనా పాత్రలో ఉంచి మూతపెడితే సంవత్సరము తరువాతకూడా ఆ జలములలో క్రిములు లేకుండా, రుచి మారకుండా ఉంటాయి. తుంబురుని గాన మహిమచే ఆజలములకు అంతటి మహత్తత్త్వం వచ్ఛిందని అంటారు.

తుంబురతీర్థం

తిరుమలలో పాపవినాశనం నుండి సుమారు పదికిలోమీటర్లు ఉంటుంది. కొండలు, లోయల్లోంచి, వాగులు, వంకలు దాటుతూ, బండలు ఎక్కిదిగి సుమారు ఐదు గంటలు నడకసాగిస్తే చేరుతాము తుంబురతీర్థానికి. ఈ నామ మంత్ర వ్యాఖ్యాత (పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం) సతీసమేతంగా ఈ క్షేత్రాన్ని రెండుసార్లు దర్శించడం జరిగింది.

విశ్వావసు మొదలైన గంధర్వులతో సేవింపబడుచున్నదని ఈ నామ మంత్రములోని భావము. 

మానవ గంధర్వులు, దేవ గంధర్వులు వీరిద్దరి చేత శ్రీమాత పూజింపబడినందున గంధర్వ సేవితా అని జగన్మాత స్తుతింపబడుచున్నది. 

ఆ పరాశక్తికి నమస్కరించునపుడు ఓం గంధర్వ సేవితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

637వ నామ మంత్రము 3.4.2022

ఓం విశ్వగర్భాయై నమః

విశ్వమును తన గర్భమునందు ధరించిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి విశ్వగర్భా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం విశ్వగర్భాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఉపాసించు సాధకులకు భౌతికమైన ఆనందాలతో పాటు క్రమంగా శాశ్వతమైన ఆత్మానందమును లభిస్తాయి.

పంచకృత్యములు
పరమాత్మ సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము అను  ఐదు కార్యములను నెరపును. వీనినే పంచకృత్యములు అంటారు. 

సృష్టి : సకల చరాచరములను సృష్టించు పరమాత్మ యొనరించు కార్యక్రమమునే సృష్టి అంటారు.

స్థితి : పరమాత్మ తాను చేసిన సృష్టిని నిర్వహించుటయే స్థితి అంటారు. అనంతకోటి జీవరాశులకు ఆహారము, నీరు, గాలి, వెలుతురు ప్రసాదించి, జీవకోటి మనుగడను సుస్థిరముజేసి, జీవులొనరించు పుణ్య, పాపకార్యములను గమనిస్తూ, వాటికి తగిన ప్రతిఫలములను ఏర్ఫరచుతూ, పుట్టిన జీవి జీవనరంగం నుంచి నిష్క్రమణ యగు (మరణించు) వరకూ -  ఆ పరమాత్మచే నిర్వహింపబడు ఈ ప్రక్రియయే స్థితి యని అనబడును.

సంహారము నాటక రంగంలో పాత్ర ప్రవేశించడం, పాత్ర పోషింపబడడం, నిష్క్రమించడం అనేది జీవన నాటక రంగంలో పుట్టుక, జీవించుట, మరణించుట వంటిది. అలాగే కల్పాంతంలో సృష్టియావత్తూ లయమయిపోతుంది. అనగా పరమాత్మలో కలసిపోతుంది - దీనినే సంహారము అంటారు.

తిరోధానము :  లయమయిన జగత్తునందలి జీవులను, జీవుల కర్మఫలములను సూక్ష్మమొనరించి మరల సృష్టింపబడేవరకూ తనలో మఱుగుపరచుకోవడమే తిరోధానము అనబడుతుంది.
 
అనుగ్రహము: పై నాలుగు స్థితులలో పరిభ్రమించుచున్న జీవుడిని తిరిగి పరమాత్మలో కలుపుకోవటాన్ని అనుగ్రహం అంటారు.

 కావున జగన్మాత విశ్వగర్భా అని నామ ప్రసిద్ధమైనది. 

పంచకృత్యములలో మూడవదైన లయము అనగా జగత్ప్రళయము. కర్మక్షయమైన జీవులు మోక్షంపొందడం జరుగుతుంది. కర్మక్షయంకాని జీవులకు మరల జన్మమంది ఆ కర్మఫలాన్ని పొందాలంటే పరమాత్మలో లీనమవాలి. ఆ విధంగా కర్మక్షయంగాని జీవులను కర్మపరిపక్వతచెందేవరకూ తనలో అనగా తనగర్భంలో నిక్షిప్తంజేసుకుంటుంది. విశ్వంలోని జీవులను కర్మపరిపక్వత నందువరకూ తనలోనే ఆ పరమేశ్వరి దాచుకుంటుంది గనుక అమ్మవారు విశ్వగర్భా యని అనబడినది.

జీవులకు కర్మలనాచరించిన వెంటనే కర్మఫలం లభించదు. కర్మపరిపక్వత అయిన తరువాతనే కర్మఫలం లభిస్తుంది. జీవులు తాము చేసిన కర్మల ఫలంకోసం కర్మపరిపక్వత జెందు వరకూ నిరీక్షించాలి. ఆ విధంగా లయకాలంలో కర్మపరిపక్వతకాని విశ్వంలోని జీవులన్నియు పరమేశ్వరిలో లీనమవుతాయి. 

అమ్మవారు మూలప్రకృతి. ప్రకృతి అనగా పంచభూతాలు. మాయనుంఢి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలము నుండి భూమి వస్తాయి. మరల వచ్చిన క్రమంలోనే లయకాలము నందు భూమి జలము లోనికి, జలము అగ్నిలోనికి, అగ్ని వాయువు లోనికి, వాయువు ఆకాశంలోనికి, ఆకాశం మాయలోనికి లీనమవుతాయి. ఈ మాయ పరమేశ్వరిలోనికి లీనమువుతుంది. ఆ విధంగా లీనమైన విశ్వముము పరమేశ్వరి తనలో నిక్షిప్తం చేసుకుంటుంది గనుక అమ్మవారు విశ్వగర్భా యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం విశ్వగర్భాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

638వ నామ మంత్రము 4.4.2022

ఓం స్వర్ణగర్భాయై నమః

స్వర్ణతుల్యమైన వేదవేదాంగాదులను తన గర్భమునందు ధరించుటయే గాక, హిరణ్యగర్భుడైన బ్రహ్మయొక్క సృష్టి కార్యాదులను నిర్వహించు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి స్వర్ణగర్భా యను నాలుగక్షరముల నామ మంత్రమును ఓం స్వర్ణగర్భాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఉపాసించు సాధకులకు సుఖసంతోషాలకు, సిరిసంపదలకు, అనిర్వచనీయమైన ఆత్మానందానికి లోటులేకుండా కరుణించుచూ, అంతకన్నా స్వర్ణతుల్యమైన శ్రీమాత పాదసేవాపరాయణతను అనుగ్రహించి తరింపజేయును.

స్వర్ణగర్భా అనగా బంగారు గర్భముగలిగినది అని అర్థము.

 వాయుపురాణంలో ఇలా చెప్పబడినది:

హిరణ్య మస్య గర్భోఽభూ ద్ధిరణ్యస్యాపి గర్భజః|

యస్మాద్ధిరణ్యగర్భః సై పురణేఽసి న్నిరుచ్యతే॥ (సౌభాగ్య భాస్కరం, 757వ పుట)

ఈమ గర్భము హిరణ్యమువంటిది. లేదా హిరణ్యముయొక్క గర్భము నుండి జన్మించినది. గనుకనే హిరణ్యగర్భ యను నామము గలదు.  హిరణ్యమనగా స్వర్ణము. గనుకనే అమ్మవారు స్వర్ణగర్భా యని అనబడినది.

హిరణ్యగర్భుడు అనగా హిరణ్యము గర్భములో ఉన్నవాడు. హిరణ్యము గర్భములో ఉన్నవాడు బ్రహ్మ.  ఆ పరమేశ్వరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపిణి గనుక స్వర్ణగర్భా యని అనబడినది.

భూమి (భూదేవి) స్వర్ణాది తొమ్మిది ధాతువుల నిలయము. అనగా భూదేవి తనలో స్వర్ణమును నిక్షిప్తము చేసికొనియున్నది యని భావము. పరమేశ్వరి భూదేవత వంటిది. గనుక అమ్మవారు స్వర్ణగర్భా యని అనబడినది.

అమ్మవారు మాతృకావర్ణరూపిణి. అనగా వర్ణములన్నియును (అక్షరములన్నియును) మంత్రాక్షరములే. మంత్రములన్నియు స్వర్ణతుల్యములే. గనుక అమ్మవారు స్వర్ణగర్భా యని అనబడినది.

హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్‌|

చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ మావహ॥ (శ్రీసూక్తం)

ఆకాశంలో సూర్యోదయానికి ముందు కనిపించే బాల భాస్కరుని రంగు... హిరణ్య వర్ణం. చీకటికి ఉత్తర రూపం హిరణ్యవర్ణం. బంగారు రంగుతో ఉషోదయమౌతుంది. అంటే అమ్మవారిని మొదటగా మనం హిరణ్యవర్ణంలో చూస్తాము. హరిణ అంటే సూర్యుడు, విష్ణువు, శివుడు అని చెప్తారు. సూర్యుడు జ్ఞానానికి ప్రతీక, విష్ణువు ఆ జ్ఞానవ్యాప్తికి ప్రతీక కాగా శివుడు ఆ జ్ఞానం వల్ల మనం పొందే ఆనందానికి ప్రతీక. హ కారం ఆకాశాన్ని, ర కారం అగ్నిని, ణ కారం నివృత్తి మార్గాన్ని సూచిస్తున్నాయి.

పై శ్లోకంలో అమ్మవారిని మొదటగా మనం హిరణ్యవర్ణంలో చూస్తాము అని చెప్పబడినది గనుక అమ్మవారు హిరణ్య (స్వర్ణ) మయము అనియు, ఆ తల్లి స్వర్ణ గర్భా యనియు భావించదగును.

స్వర్ణతుల్యమైన వేదవేదాంగాదులు స్వర్ణతుల్యములు. అటువంటి వేదవేదాంగములను తన గర్భమునందు ధరించుటయే గాక, హిరణ్యగర్భుడైన బ్రహ్మయొక్క సృష్టి కార్యాదులను నిర్వహించు చున్నది గనుక పరమేశ్వరి స్వర్ణగర్భా యని అనబడినది.  

ఆ పరాశక్తికి నమస్కరించునపుడు ఓం స్వర్ణగర్భాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

639వ నామ మంత్రము 5.4.2022

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

ఓం అవరదాయై నమః

తనకు సాటి వరదాతలు లేనట్టి తల్లికి నమస్కారము.

కాంతివంతమైన దంతములు, జ్ఞానదంతము కలిగిన పరమేశ్వరికి నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి అవరదా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం అవరదాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ పరమేశ్వరి జ్ఞానసంపదలు, కీర్తిప్రతిష్టలు, సిరిసంపదలు అనుగ్రహించి, వారిని ఎనలేని దైవభక్తి తత్పరతతో తరింపజేయును.

అవరులు  అనగా నీచమైన ప్రవర్తన గలవారు. అటువంటి ప్రవర్తన రాక్షసులకుండును. దేవతలను, మునులను, స్త్రీలను వారి వారి సత్కార్యములకు విఘాతము కలిగించి హిసించు తత్వము గల రాక్షసులను అవరులు అందురు. అవరులు అనగా దుష్టులు అనికూడా అందురు. రాక్షసులు దుష్టస్వభావముగల వారే గనుక అవరులు అనబడినారు. అటువంటి అవరులను సంహరించు పరమేశ్వరి అవరదా యని అనబడినది. 

అవరదా అనగా కాంతివంటి దంతములు గలిగినది పరమేశ్వరి. శుద్ధవిద్యాంకురములవంటి  (షొడశాక్షరీ మంత్రబీజ సమూహముల వంటి) దంతపంక్తులు గలిగినది ఆ పరమేశ్వరి. శుద్ధవిద్య అంటే పరిశుద్ధమైన జ్ఞానము. తెలుపు వర్ణము స్వచ్ఛతకు ప్రతీక.  తెల్లని అమ్మవారి దంతపంక్తి ద్వయము ప్రకాశిస్తున్నవి. గనుక అమ్మవారు అవరదా యని అనబడినది. ఇంతకు ముందు శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్జ్వలా యను (25వ) నామ మంత్రములో శ్రీవిద్యా మంత్రబీజాక్షరరూపములై ప్రకాశించు దంతములు గలిగినది శ్రీమాత యని అనబడినది.  గనుకనే కాంతిగల దంతములు గలిగిన పరమేశ్వరి అవరదా యని అనబడినది.

కొన్ని చోట్ల స్వర్ణగర్భా, వరదా యని పదచ్ఛేదము చేయుటచేత వరదా యని ఉచ్చరింపబడు ఈ నామము వలన, పరమేశ్వరి తనను  భక్తితో అర్చనచేయు భక్తులకు జ్ఞానాన్ని, వరములను ప్రసాదించుటయే గాక జన్మరాహిత్యమైన కైవల్యము అను వరమును కూడా అనుగ్రహించును. 
 
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం అవరదాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

640వ నామ మంత్రము 6.4.2022

ఓం వాగధీశ్వర్యై నమః

వాగ్దేవతా స్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.

వశిన్యాది దేవతలకు అధీశ్వరి అయిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళియందలి  వాగధీశ్వరీ యను ఐదక్షరముల (పంచాక్షరీ నామ మంత్రమును ఓం వాగధీశ్వర్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదాంబికను అత్యంత భక్తిప్రపత్తులతో పూజించు భక్తులకు ఆ తల్లి కారుణ్యమూర్తిగా వారికి చక్కని వాక్చతురితను, జనరంజకముగా సంభాషించి, మంచి కీర్తిప్రతిష్టలను సంప్రాప్తింపజేసి, పరమేశ్వరీ పాదసేవలో నిమగ్నులను జేసి తరింపజేయును.

పరమేశ్వరి వాక్కుకు అధీశ్వరి. అనగా వాక్కు అనేది మాట్లాడాలనే తలపు అనే మూలమునకు పరాశక్తి. అంటే పరాశక్తి పరబ్రహ్మ స్వరూపిణి. పరబ్రహ్మతత్త్వ విచారణ సందర్భంలో వాక్కు నాలుగు విధాలుగా చెప్పారు.  1. పరా, 2. పశ్యంతి, 3, మధ్యమ, 4. వైఖరి. మనిషి అక్షర సముదాయాన్ని ఏర్పరచుకొని, వాటి సహాయంతో అంతులేని సాహిత్యాన్ని సృష్టించుకొన్నాడు. కాని, దృగ్గోచరమైన సృష్టికి మూలాన్ని అన్వేషించడానికి సతమతం అవుతున్నాడు. ఈ పరిస్థితిని చిత్రించే ఒక శ్లోకం ఉంది. పరా వృక్షేషు సంజాతా, పశ్యంతీ భుజగీషుచ, మధ్యమావై పశుశ్చైవ, వైఖరీ వర్ణ రూపిణీ  చెట్టు నుంచి చివుళ్లు, ఆకులు, కొమ్మలు, పూలు, ఫలాలు వస్తాయి. కాని తన వల్లనే వస్తున్నాయని చెట్టు గుర్తించదు. పాముకు చూడటానికి కళ్లేగాని, వినడానికి ప్రత్యేకం ఒక శ్రవణేంద్రియం అనేది లేదు. పశువు అంబా అంటుంది. కాని, అంబను తెలుసుకొనలేదు. మనిషి కూడా అలాగే సృష్టిమూలాన్ని తెలుసుకొనలేక పోతున్నాడు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ శబ్దాలకు నిర్వచనం చెప్పే సందర్భంలో ఇచ్చిన ఈ నాలుగు ఉపమానాలు వరుసగా ఈ పదాలకు వర్తిస్తాయి. మరొక విధంగా కూడా ఈ పదాలకు అర్థం చెప్పారు.

 ఏదైనా ఒక పనిని తలపెట్టినప్పుడు తలపునకు పూర్వస్థితి పరా వాక్కు. తలపు పశ్యంతీ వాక్కు ఆలోచన కార్యరూపం ధరించే ముందున్న ఊహస్థితి మధ్యమ వాక్కు. తలపు కార్య రూపం ధరించడం .వైఖరీ వాక్కు. 

ఈ విషయాన్ని ఇంకో విధంగా ఆలోచిస్తే పరా విత్తు మొలకెత్తడానికి ముందు స్థితి. అంటే, విత్తు భూమిలో పడి, ఉబ్బి, మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నస్థితి.

మొలక విత్తులోనుంచి పైకి రావడం, అంటే ఆలోచన మొలకెత్తడం అనేది పశ్యంతి యను రెండవ దశ. మొక్క ఎదిగి, వృక్షంగా మారడం మధ్యమ యను మూడవ స్థితి. పూత పూయడం, పూలు ఫలాలు కావడం, పరిపూర్ణం చెందడం వైఖరి యను నాలుగవ స్థితి.

పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ యను వాక్కుయొక్క నాలుగు దశలలో మొదటి మూడును అవ్యక్తములు. అనగా కనిపంచని దశలు. వైఖరీ రూపమైన వాక్కు మాత్రము స్పష్టతనిచ్చు మాట. 

మొదటి దశ యను పరా- ఇది పరాస్థానమైన సహస్రారంలో పుట్టుతుంది. ఎందుకంటే విజ్ఞానశాస్త్ర రీత్యా మెదడు అనేది ఆలోచనా స్థానము. మెదడు సహస్రారంలో ఉన్నది. ఈ పరావాక్కు అనేది అమ్మవారి (పరాదేవతా) స్వరూపము. అందుచే అన్నిటికీ మూలమైన పరమేశ్వరి వాగధీశ్వరీ యని అనబడుచున్నది. ఈ వాగధీశ్వరి వాగ్దేవతలకు అధీశ్వరి.  ఆ వాగ్దేవతలను వశిన్యాది వాగ్దేవతలు అందురు.  

వశిన్యాదులు వాగ్దేవతలు ఎలాగ అయారు అనగా - వాక్కు అంటే మాట. మాట అంటే పదము. కొన్ని అక్షరముల సముదాయమే మాట. వశిన్యాదులు ఎనిమిదిమంది. ఏబది అక్షరములు అ వర్గము (అ నుండి ఆః వరకు గల అక్షరములు),  క వర్గము (క,ఖ,గ,ఘ,ఙ), చ వర్గము (చ,ఛ,జ,ఝ,ఞ), ట వర్గము (ట,ఠ,డ,ఢ,ణ), త వర్గము (త,థ,ద,ధ,న), ప వర్గము (ప,ఫ,బ,భ,మ), య వర్గము (య,ర,ల,వ) శ వర్గము (శ,ష,స,హ,క్ష) అని ఎనిమిది వర్గములు.  ఈ ఎనిమిది వర్గములకు వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అను ఈ వశిన్యాది వాగ్దేవతలే అధిదేవతలు. వీరు వైఖరీరూపంలో వెలువడు వాక్కునందున్న అక్షరములతో, జ్ఞానమును జోడించి వాక్కుగా వెలువడజేతురు.  గనుకనే అమ్మవారు వీరిని వాగ్దేవతలు అని యన్నది. ఇది మాత్రమే కాకుండా వైఖరీ రూపమైన   వాక్కు వెలువడడానికి కంఠం నుండి శిరస్సు వరకు ఎనిమిది ప్రదేశములు. ఈ ఎనిమిదింటిని 1) స్థానములు (కంఠము, తాలువులు అనగా దౌడలు, ఓష్ఠములు అనగా పెదవులు, దంతములు, అంగుడు), 2) ప్రయత్నములు (అభ్యంతరప్రయత్నము, బాహ్యప్రయత్నము - అనగా మాటలాడుటకు లోపలినుండి మాట వెలుపలకు వచ్చుటకు అభ్యంతర ప్రయత్నమనియు, లోపలి నుండి వచ్చిన మాట బయటకు వెలువడజేయుట బాహ్యప్రయత్నము అనియు అందురు), 3) కరణము (నాలుక). ఈ ఎనిమిదింటికి అధిదేవతలే వశిన్యాది వాగ్దేవతలు. ఈ వాగ్దేవతలకు అధీశ్వరి గనుక అమ్మవారు వాగధీశ్వరీ యని అనబడినది.

అమ్మవారికి నమస్కరించునపుడు ఓం వాగధీశ్వర్యై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

641వ నామ మంత్రము 7.4.2022

ఓం ధ్యానగమ్యాయై నమః

ధ్యానముచే సాక్షాత్కారమునందగల పరమేశ్వరికి నమస్కారము.

ధ్యానమే లక్ష్యంగా గలిగిన భక్తునికి ప్రసన్నమయే లలితాంబికకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి ధ్యానగమ్యా యను నాలుగక్షరముల (చతురాక్షరీ) నామ మంత్రమును ఓం ధ్యానగమ్యాయై నమః   అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని భక్తిప్రపత్తులతో ఉపాసించు భక్తులు అమ్మపై పరిపూర్ణ శరణాగతితో వర్తిస్తారు. అమ్మ కరుణచే తరిస్తారు.

జగన్మాత ధ్యానమునకు లక్ష్యమైనది. మహర్షులకు ధ్యానముచేత నిర్విషయ స్థితి యందు పొందబడునది.

పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జపః|

జపః కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమో లాయః॥

కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానము. కోటి స్తోత్రములు ఒక జపంతో సమానము. కోటి జపాలు ఒక ధ్యానంతో సమానము.
కోటి ధ్యానములు ఒక లయంతో సమానము. లయము అనగా ఎట్టి ఆలోచనలు లేని స్థితి. యథావిధిగా అర్చన చెయ్యాలంటే, అనగా శుభ్రం చేయడము, సామగ్రిసమకూర్చు కోవడం షోడశోపచార అర్చన వీటి అన్నిటికి రమారమి ఒక గంట పడుతుంది. ఈ గంట సమయంలో మనం స్తోత్రము, అష్టోత్తరము లేదా సహస్రము చేస్తాము. ఒక అష్టోత్తరాశతమునకు ఒక నామము ఒక సారే వస్తుంది. అదే ఒక గంట సమయంలో ఒక నామము మూడువేల సార్లు చేస్తాము. ఈ విధంగా నామ జపం చేస్తూ ఉంటే ..
ఒక్క సారి మనని మనం మరచి పోతాము. ఇది ధ్యానము. 
ఇలాగే ధ్యానం చేయగా చేయగా
మనస్సు నిశ్చలం అవుతుంది. 
దీనినే లయము అంటాము. అటువంటి ధ్యానమాత్రముచే పరమేశ్వరి అనుగ్రహము పొందవచ్చును. గనుకనే అమ్మవారు ధ్యానగమ్యా యని అనబడినది.

ఉన్నది నీవే అని తెలుసుకోవడం జ్ఞానం. నీవు నీవుగా ఉండేందుకు చేసే ప్రయత్నం ధ్యానం. మనసుతో మనం కలిసి నడిస్తే అది వ్యవహారం. మనతో మనసు కలిసి ఉండటం ధ్యానం. మనం నడిచినా, కూర్చున్నా, కర్మ లాచరించినా, ఆచరించకపోయినా మనసు మనతో కలిసి ఉండటం, ఏ వ్యాపారాలు లేకుండా మనసు ఉండటమే ధ్యానంలో ప్రధానమైన విషయం. అందుకే ధ్యానం నిర్విషయం మనః అన్నారు.

భగవంతుడిని ఏ విధంగానైనా అర్చించవచ్చని మన ధర్మశాస్త్రాలు చెబుతాయి. పరమాత్ముడిని పూజించే అనేక మార్గాలను సూచిస్తాయి. వాటిలో సగుణ, నిర్గుణ మార్గాలు ప్రధానమైనవి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనమ్‌ అనే నవవిధ భక్తి మార్గాలను భాగవతం గొప్పగా ప్రతిపాదించింది. అయితే ఇందులో ఆత్మనివేదనం నిర్గుణ భక్తిని సూచిస్తుంది. దీనికి కూడా సగుణారాధనలో బలిచక్రవర్తిని ప్రముఖంగా చెప్తారు. కానీ దీన్ని హృదయ సంబంధిగా, మనిషి అంతర్ముఖత్వంతో సాధించే ఆత్మసాధనగా చెప్పవచ్చు. నిరాకారతత్వంలో కూడా భగవంతుని చిరునామాను మనవాళ్లు ప్రతిపాదించారు. 

తల్లిదండ్రుల మీద ధ్యాస ; భార్య మీద ధ్యాస ; పిల్లల మీద ధ్యాస ; ఉద్యోగం మీద ధ్యాస ;… వీటన్నింటితో పాటు విధిగా శ్వాస మీద ధ్యాస కూడా ఉంచాలి.  ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక గంట శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అదే ధ్యాన మార్గం – అంటే శ్వాస మీద ధ్యాస అంటే ఆనాపానసతి.

జీవాత్మలకు పరమాత్మలకు భేదము కలదు. పరమాత్మ సత్యము అయితే జీవాత్మ అసత్యము అనబడుతుంది. పరమాత్మ శాశ్వతము అయితే జీవాత్మ అశాశ్వతము అనబడుతుంది. పరమాత్మ అనంతము అయితే జీవాత్మ అంతముగలది. పరమాత్మ జ్ఞానస్వరూపుడు అయితే జీవాత్మ అజ్ఞాని. పరమాత్మ శాశ్వతమైన ఆనందము అయితే జీవాత్మ క్షణికానందము.  జీవాత్మ పరమాత్మలకు గల వ్యత్యాసము తెలుసుకున్న సాధకుడు బ్రహ్మజ్ఞాని యవుతాడు. బ్రహ్మజ్ఞాన సాధనకు పరమేశ్వరిని ధ్యానముద్వారానే పొందడము జరుగుతుంది. ఈ సత్యమును తెలిసిన సాధకుడు ఆ పరమేశ్వరి అనుగ్రహమును పొందగలడు.

సగుణధ్యానము, నిర్గుణధ్యానము అని రెండు విధములైన ధ్యానములు గలవు. అందు సగుణధ్యానము అంటే సగుణబ్రహ్మ అనగా రూపం ఉన్నదని చెప్పబడే భగవంతుడు. నిర్గుణధ్యానమంటే సత్వ, రజ, తమో గుణాలకు అతీతంగా ఉండే పరబ్రహ్మధ్యానం. ఈ ధ్యానం చేసేవారికి నిర్గుణత్వం, నిరాకారత్వం కలుగుతాయి. దీనినే సాయుజ్యమని అంటారు. పరమేశ్వరి అన్నిటికీ అతీతురాలు. అట్టి పరమేశ్వరిని ధ్యానం చేస్తే కైవల్యము లభించును.

ఆ జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ధ్యానగమ్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

642వ నామ మంత్రము 8.4.2022

ఓం అపరిచ్ఛేద్యాయై నమః

హద్దులు, పరిమితులు, నిర్వచనములు మొదలైన -  ఇలాంటివి ఏవియులేక అనంతరూపిణి అయి విరాజిల్లు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి అపరిచ్ఛేద్యా యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం అపరిచ్ఛేద్యాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించు భక్తులకు భక్తపరవశయైన పరాశక్తి అన్ని ఆపదలనుండి రక్షిస్తుంది. ఐహిక, ఆధ్యాత్మికాది శుభాలను అన్నింటినీ అనుగ్రహిస్తుంది.

 భావములు నాలుగు విధములు. 1.ప్రాగభావము, 2. ప్రధ్వంసాభావము, 3. అన్యోన్యాభావము, 4. అత్యంతాభావము.  ఏదైనా ఒక వస్తువు తయారు కావడానికి ముందు ఆ వస్తువు గురించిన భావం లేక పోవడం ప్రాగభావం. ఘటమో, మరొక వస్తువో ధ్వంసమైపోయినప్పుడు ఆ వస్తువు రూపం కనిపించకపోవడం ప్రధ్వంసాభావం. ఒక వస్తువును గురించిన రూపం ఎప్పుడూ లేకపోవడం (ఉదాహరణకు గాలికి రూపం లేదు) అత్యంతాభావం రెండు విభిన్న వస్తువులు ఉన్నప్పుడు ‘అది ఇది కాదు, ఇది అది కాదు’ అనే తేడా తెలియడం అన్యోన్యాభావం.  ఇలాంటి అభావములకు ప్రతీ వ్యక్తి పరిచ్ఛేద్యుడౌతాడు. అనగా ఇదమిత్థంగా అనగా అనుమానాలకు తావులేకుండా; ఖచ్చితంగా చెప్పబడడం అవుతాడు. ఏదైతే పరిచ్ఛేద్యముకాదో దానినే అపరిచ్ఛేద్యము అంటాము. ఆ అపరిచ్ఛేద్య అని చెప్పబడునదే పరమేశ్వరి. అనగా అమ్మవారు కంటికి కనబడదు, ఇటువంటిది అని  చెప్పబడదు, ఇంకేదైనా చెప్ఫాలంటే మనకు శక్యముకాదు.  గనుక ఆ తల్లి అపరిచ్ఛేద్యా యని అనబడినది. అమ్మవారు నిర్గుణ. అనగా రూపము లేనిది. ఇందుగలదందులేదను సందేహమువలదు అనుచు ఎల్లెడలా ఉండునది. సర్వయంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక, సర్వమంత్రాత్మిక, అనంతకోటి జీవులలో తానే ఉంటుంది. కాని అంతుచిక్కదు. గనుకనే అపరిచ్ఛేద్యా యని అనబడినది.

ఆ పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం అపరిచ్ఛేద్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

643వ నామ మంత్రము 9.4.2022

ఓం జ్ఞానదాయై నమః

ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు జగన్మాతకు నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి జ్ఞానదా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసించు ఉపాసకునకు ఆ తల్లికరుణచే అఖండమైస బ్రహ్మజ్ఞాన సంపదతోబాటు కావలసిన లౌకికజ్ఞానముకూడా సంప్రాప్తింపజేసి భౌతిక సుఖసంతోషములతోబాటు బ్రహ్మానందమును కూడా లభింపజేయును. 

జ్ఞాన యోగము, భగవద్గీతలో నాలుగవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము ఇరువది ఐదవ అధ్యాయము మొదలు నలుబదిరెండవ అధ్యాయము వరకు పదునెనిమిది అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని గీతోపనిషత్తు అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

జ్ఞానయోగం పూర్వం సూర్యునికి ఉపదేశించగా అతడు మనువుకు, మనువు ఇక్ష్వాకునకు చెప్పాడు. కాని కాలక్రమంలో ఇది మరుగున పడిపోయింది. అర్జునుడు సందేహంతో "సూర్యుడు ఎప్పటినుండో ఉన్నాడు. మరి మనము ఇప్పటి వాళ్లము. నీవు చెప్పినది ఎలా సాధ్యము?" అన్నాడు. కృష్ణుడు "నీకు, నాకు ఎన్నో జన్మలు గడిచాయి. అవన్నీ నాకు తెలుసు. నీకు తెలియదు. నేను భగవంతుడిని అయినా నా మాయచే నాకు నేనే జన్మిస్తుంటాను. ధర్మహాని-అధర్మవృద్ది జరిగినప్పుడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు ప్రతి యుగంలోను నేను అవతరిస్తాను. ఈ విధంగా తెలుసుకొన్నవాడు, రాగ, ద్వేష, క్రోధ, భయాలను విడిచి నన్ను ధ్యానించేవాడు నన్నే పొందుతాడు. నన్ను ఏఏ విధంగా ఆరాధిస్తే వారిని ఆయా విధంగా అనుగ్రహిస్తాను. మనుషులు అన్నివిధాలుగా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు. కర్మ ఫలితాలు త్వరగా భూమిపైనే పొందుతున్నారు. గుణకర్మలచేత నాలుగు వర్ణాలని నేనే సృష్టించాను. నేను ఆ కర్తను, అవ్యయుడను. నిష్కాముదనై కర్మలను ఆచరించడం వలన నాకు అవి అంటవు. ఇలా చేసేవారిని కూడా అంటవు. జ్ఞానులు నిష్కామంగానే కర్మలు చేస్తారు. ఏ కర్మలు చేయాలో, ఏవి చేయకూడదో చెప్తాను విను. కర్మ, అకర్మ, వికర్మ అని మూడు రకాలు. కర్మగతి గాఢమైనది. కర్మలలో ఆకర్మలను, ఆకర్మలలో కర్మలను చూసేవాడు, ఫలాపేక్ష రహితుడు, కర్తను అనే అహంకారాన్ని జ్ఞానాగ్నిచే దగ్దం చేసేవాడు బుద్ధిమంతుడు. కోరికలేనివాడు, జయాపజయాల పట్ల సమబుద్ధిగలవాడు, సందేహ రహితుడు, ఈర్ష్యా రహితుడు బంధాలలో చిక్కుకోడు.

ఈశ్వర ప్రీతిగా మాత్రమే కర్మలు చేయువాడికి ప్రారబ్దము కూడా నశిస్తుంది కాని బాధించవు. ఇవ్వబడునది, ఇచ్చేవాడు, ఇచ్చుటకు ఉపయోగించే పదార్థాలు అన్ని కూడా బ్రహ్మమే.

కొందరు ఆత్మను ఆత్మ యందె, ఇంకొందరు ఇంద్రియాలను నిగ్రహమనే అగ్నిలో, మరికొందరు విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో, మరికొందరు వాయు గమనాన్ని నిరోదించి అపానంలో ప్రాణాన్ని, ప్రాణంలో అపానాన్ని, ఇంకొందరు ప్రాణాలను ప్రాణాలలోనే హోమం చేస్తున్నారు.

ద్రవ్యరూప యజ్ఞాన్ని, వ్రతరూప తపోయజ్ఞాన్ని, ప్రాణాయామ పరమైన యోగయజ్ఞాన్ని, వేదాభ్యాస స్వాధ్యాయ యజ్ఞాన్ని ఇలా రకరకాలైన యజ్ఞాలు చేయబడుతున్నాయి. ఈ విధంగా వారు పాపాలను పోగొట్టుకుంటున్నారు. యజ్ఞశేషం అమృతం లాంటిది. యజ్ఞం చేయనివాడికి ఇహపరాలు రెండూ ఉండవు. ఇలా ఎన్నో యజ్ఞాలు వేదాలలో చెప్పబడ్డాయి. అవన్నీ కర్మలపై ఆధారపడ్డవే.

తత్వవేత్తలను వినయముతో సేవించి, ప్రార్థించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి.

ఆ జ్ఞానాన్ని తెలుసుకొంటే పరమాత్మ వలెనే సమస్తాన్ని నీయందే చూడగలవు. మోహానికి గురికావు. ఎంతపాపి అయినా జ్ఞానం చేత సంసారాన్ని తరింపవచ్చు. కర్రలను అగ్ని వలె, కర్మలను జ్ఞానం భస్మం చేస్తుంది. జ్ఞానమును మించినది లేదు. కర్మయోగసిద్ధిని పొందిన వాడు జ్ఞానాన్ని తనలోనే తెలుసుకొంటున్నాడు. శ్రద్ధజ్ఞానాలు లేనివారు, సందేహాలు కలిగినవాడు, నమ్మకం లేని వాడు చెడిపోతారు. ఇహపరాలు రెండింటికీ దూరమవుతారు. పరమార్థ జ్ఞానంతో కర్మలను, బ్రహ్మజ్ఞానంతో సందేహనివృత్తిని చేసుకొన్నవాడిని కర్మలు బంధించవు. కాబట్టి జ్ఞానంచే సందేహాలను నివృత్తి చేసుకొని యోగాన్ని ఆశ్రయించు. 

భగవానుడైన శ్రీకృష్ణుడు పరమాత్మ.  పరమాత్మయే పరమేశ్వరి. గనుక ఇటువంటి జ్ఞానమును ఆ పరమేశ్వరి తన భక్తులకు ప్రసాదిస్తుంది గనుక అమ్మవారు జ్ఞానదా యని అనబడినది.

అటువంటి  వివేక జ్ఞానప్రసాదిని అయిన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం జ్ఞానదాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

644వ నామ మంత్రము  10.4.2022

ఓం జ్ఞాన విగ్రహాయై నమః

వేద వేదాంగాదులకు, సర్వశాస్త్రములకు సంబంధించిన విషయములయందు మూర్తీభవించిన జ్ఞాన స్వరూపిణియైన తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి జ్ఞాన విగ్రహా యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం జ్ఞాన విగ్రహాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జ్ఞాన స్వరూపిణిని అత్యంత భక్తి ప్రపత్తులతో ఆరాధించు సాధకుడు ఆ తల్లి కరుణచే అఖండ సర్వ శాస్త్రజ్ఞానమును ఆకళింపు చేసికుని, పండితునిగా రాణించి, లౌకిక జ్ఞానముతో బాటు, ఆధ్యాత్మిక తత్త్వమందు తనదైన నడతతో పలువురికి మార్గదర్శకుడై, లబ్ధప్రతిష్టుడై  జీవించును. శ్రీమాత పాదసేవతో తరించును.

ఈ నామ మంత్ర భావముచే అమ్మ జ్ఞానమే కలిగినది కాదు. జ్ఞానమే తానై, మూర్తీభవించిన జ్ఞాన స్వరూపిణియై, జ్ఞానవిగ్రహా యని స్తుతింపబడుచున్నది.  జ్ఞానమనగా ఏదో ఒక శాస్త్రముగాని, ఏదో ఒక అంశము అని గాని కాదు. వేదవేదాంగములకు, సర్వశాస్త్రములకు తానే సారమై, అందలి జ్ఞానమే తన రూపముగా, జ్ఞానమూర్తిగా, జ్ఞానవిగ్రహగా విరాజిల్లుచున్నది. అందుచే జగన్మాత జ్ఞానవిగ్రహా యని అనబడినది.

ఈ జగత్తే జ్ఞానాత్మకము. ఆ పరమేశ్వరి జగద్రూపురాలు గనుక జ్ఞానమే తన శరీరమైనది. అందుచే అమ్మవారు జ్ఞానవిగ్రహా యని అనబడినది.

జ్ఞానమే పరబ్రహ్మము, జ్ఞానమే బంధమును కలిగించును. జ్ఞానాత్మకమైన జగత్తే పరమేశ్వరి గనుక జ్ఞానవిగ్రహా యని అనబడీనది. ఈ జగత్తు జ్ఞానాజ్ఞానముల మిళితము.  విద్యయు, అవిద్యయు రెండునూ జ్ఞానమే అని విష్ణుపురాణద్వితీయాంశమునందు చెప్పబడినదని భాస్కరరాయలు వారు చెప్పారు. గనుక జగత్తు జ్ఞానాజ్ఞానముల మిళితము అని తెలియుచున్నది. అట్టి జ్ఞానాజ్ఞానముల  మిళితమైన జగత్తే తన స్వరూపము గనుక ఆ పరమేశ్వరి జ్ఞానవిగ్రహా యనిఅనబడినది.

అమ్మవారు శ్రీలలితా సహస్ర నామావళిలో  ప్రజ్ఞానఘనరూపిణీ యని
 (574వ) నామమంత్రము నందు స్తుతింప బడినది. లేశమైనను అజ్ఞానసంపర్కములేనట్టిది పరమేశ్వరి. పరమేశ్వరి కేవలం జ్ఞానస్వరూపిణి. అంతకన్నా వేరేస్దితిలేనిది. ఉప్పురాయి ఎట్లు లోపలబైటను ఇతర రసములులేక లవణరసముతోనే ఘనీభవించియుండునో, అట్లే పరమాత్మ కూడ లోపలబైట ఇతరము లేవియు లేక కేవలము జ్ఞానస్వరూపిణియై విరాజిల్లుచున్నది గనుకనే ఆ తల్లి జ్ఞానవిగ్రహా యని అనబడినది.

అట్టి జ్ఞానమూర్తికి నమస్కరించు నపుడు ఓం జ్ఞాన విగ్రహాయై నమః అని అనవలెను.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

645వ నామ మంత్రము 

ఓం సర్వవేదాంత సంవేద్యాయై నమః

సర్వోత్కృష్టమైన ఉపనిషత్తులచే తెలియబడు జగజ్జననికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వవేదాంత సంవేద్యా అను ఎనిమిదక్షరముల  (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం సర్వవేదాంత సంవేద్యాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి కరుణచే భౌతిక జీవనమునందు సుఖసంతోషములు, భోగభాగ్యములు సంప్రాప్తించును, ఆధ్యాత్మికజీవనము కొనసాగించుటకు అంతులేని ఆత్మానందము లభించును. ఆ పరమేశ్వరి యందు భక్తిప్రపత్తులు ఇనుమడించి తరించు మార్గమును కనుగొందురు.

 వేద వేదాంగములన్నిటిలోను ఆ జగన్మాతగూర్చి చక్కగా తెలియబడునని ఈ నామ మంత్రములోని భావము.

వేదాంతము అనగా వేదములలోని సారమైన ఉపనిషత్తులు.

హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు. ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు.

సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు.

బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.

అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.

ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిలో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆదిశంకరాచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదహరించారు.

వీటన్నిటిలోను ఆ పరమేశ్వరి చక్కగా, వివరంగా తెలియజేయబడుచున్నది. అందుచేతనే ఆ పరాశక్తి సర్వవేదాంత సంవేద్యా అని స్తుతింపబడుచున్నది.

అందుకే ఆ శ్రీమాత జ్ఞానజ్ఞేయ స్వరూపిణి, ధ్యాన, ధ్యాతృ, ధ్యేయ రూపిణి, ముక్తిరూపిణి, జ్ఞానగమ్యా , జ్ఞానవిగ్రహా అని వేదవేదాంగములందు తెలియబడుచున్నది. 

అంతటి సర్వవేదాంత సంవేద్య అయిన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వవేదాంత సంవేద్యాయై నమః అని అనవలెను.

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐
శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

646వ నామ మంత్రము

ఓం సత్యానంద రూపిణ్యై నమః

నిత్యమై, సత్యమై, పరబ్రహ్మమైన ఆనంద స్వరూపిణి అయిన జగదాంబకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సత్యానంద స్వరూపిణీ అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం సత్యానంద రూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగదీశ్వరిని సేవించు భక్తులు సత్యమైన నిత్య సంతోషంతో సమస్త సుఖములతో, బ్రహ్మానందభరితులై జీవనము సాగించి తరించుదురు.

పరమేశ్వరి నిత్యసత్యమైన ఆనందమే స్వరూపంగా గలతల్లి.

మనం ఏదైనా మంచి జరిగితే ఆనందం అనుభవిస్తాము. ఇంకేదైనా చెడు జరిగితే అంతవరకూ ఉన్న ఆనందం బుడగలా బ్రద్దలవుతుంది. అంటే అది నిత్యమైన ఆనందంకాదు. సత్యమసలేకాదు.  కాని అమ్మవారు నిత్యమైన మరియు సత్యమైన, ఇంకను పరబ్రహ్మసహితం, శాశ్వతంగా అనుభవించే ఆనందానికి స్వరూపం. నిత్యమైన మరియు సత్యమైన ఆనందానికి ప్రతిరూపం గనుక శ్రీమాతను నిత్యానంద స్వరూపిణీ అని ప్రస్తుతిస్తాము.  నిత్య, సత్య నిరతిశయానందమే పరమేశ్వరి స్వరూపం అని ఈ నామ మంత్ర భావన.

లౌకికానందము క్షణికము. శాశ్వతం కానిది. ఇందుకు ఒక గాథగలదు. పూర్వకాలంలో దశార్ణ మనే దేశాన్ని పాలించు రాజుకు హేమచూడుడు, మణిచూడుడు అను ఇద్దరు కుమారులు గలరు. రెండవవాడు మణిచూడడు. ఆ ఇద్దరూ చాలా అందగాళ్ళు, మంచి గుణవంతులు. ఆ  రాజకుమారులు ఇరువురు వేదవేదాంగములు,సకల శాస్త్రవిశారదులు  ఒక రోజున ఆ రాజకుమారులు ఇరువురు అడవికి వేటకు వెళ్ళారు. అక్కడ పెద్ద తుఫాను వంటి వాన వచ్చినది. హేమచూడుని గుర్రము దారితప్పి వ్యాఘ్రపాదుడు అను ముని ఆశ్రమానికి చేరుకున్నది. పెద్దవాడైన హేమచూడుడు ఆ గుర్రమును వెతుకుతూ ఆ ముని ఆశ్రమమునకు చేరుకున్నాడు. అత్యంత రూప లావణ్యవతియైన ఆ వ్యాఘ్రపాదుని కుమార్తె అయిన హేమలతను ప్రేమించి, వ్యాఘ్రపాదుని అనుమతితో ఆమెను వివాహమాడాడు. హేమలేఖతో సహా తన రాజ్యానికి చేరుకున్నాడు. ఆమెతో సుఖంగా కాపురం చేయుచున్నాడు. కాని హేమలేఖ మాత్రం అతనితో ఎప్పుడూ పరాకుగా ఉండడం, అతని రాకను గమనించకపోవడం వంటివి చేస్తూ ఉండేది. హేమచూడుడు ఎంతో విచారంగా "హేమలేఖా! మనం ఇద్దరం ఇష్టపడే వివాహం చేసుకున్నాము కదా. నీవు ఎందుకు ఎక్కువ సమయం పరాకుగాను, మౌనంగాను ఉంటావు? ఈ రాజభోగాలు, ఆనందాలు నీకు చాలడంలేదా?" అని అన్నాడు. అందుకు హేమలేఖ ఇలా బదులు ఇచ్చినది "రాజకుమారా! ఆనందం ఇదికాదు. ఈ సుఖాలు, ఆనందాలు దుఃఖహేతువులు. క్షణికం. ఈ సుఖాలే నిజమైతే రతిక్రీడ జరిపిన పశువు, తరువాత వళ్ళునొప్ఫులతో ఎందుకు బాధపడుతుంది? పెళ్ళినాటి ఆనందం పిల్లలు పుట్టిన తరువాత క్రమంగా ఆనందం తగ్గిపోతుంది. ఆలుమగలు పెళ్ళినాటి కొత్తలో కన్నా తరువాత తరువాత దూరం క్రమంగా పాటిస్తారు. పిల్లలు, బాధ్యతలు, ధనార్జన, సంపాదన ఉంటే ఇంకా కావాలని అంతులేని కోరికలతో  అసంతృప్తితో ఉండడం జరుగుతుంది. మరి నిత్యమైన, సత్యమైన ఆనందం ఏది. క్షణికమైన  ఈ సుఖాలు అనుభవించినంత వరకే. ఆ తరువాత ఉండవు. ఈ క్షణిక ఆనందాలన్నీ దుఃఖ హేతువులేకదా. మరి నిత్యమైన, సత్యమైన ఆనందం ఈ లౌకికానందంలో ఉంటుందా?". అని జ్ఞానాన్ని బోధిస్తూ లౌకికానందం శాశ్వతమైనది కాదని చెప్పింది.

శాశ్వతమైన ఆనందమే నిత్యమైనది. సత్యమైనది. పరబ్రహ్మ  అనుభవించు ఆనందం. అమ్మవారు శ్రీచక్రం తొమ్మిదవ ఆవరణ అయిన సర్వానందమయ చక్రంలో ఉంటుంది. అందుకే ఆ తల్లి ఆనందమయి. ఆ తల్లి సత్యానంద స్వరూపిణి 

సాధకుడు మూలాధారంలోనున్న కుండలినీ శక్తిని సహస్రారానికి చేర్చి అక్కడ కురిసే అమృత ధారలతో ఆ సాధకుని (యోగి) శరీరంలో నాడీ మండలం అంతా తడిస్తే అప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం. కేవలం అనుభవైక వేద్యము మాత్రమే. పంచకోశాంతరస్థిత అను నామమంత్రం ప్రకారం జగన్మాత పంచకోశములలో  ( అన్నమయ, ప్రాణమయ,  మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ)  ఆనందమయకోశము నందు శ్రీమాత ఉంటుంది. అందుకనే ఆ తల్లిని సత్యానంద స్వరూపిణి అని కీర్తిస్తున్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సత్యానంద స్వరూపిణ్యై నమః అని అనవలెను.

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

647వ నామ మంత్రము

ఓం లోపాముద్రార్చితాయై నమః

శ్రీవిద్యోపాసనలో శ్రేష్ఠులైన పండ్రెండు మందిలో ఏకైక స్త్రీమూర్తి మరియు అగస్త్యమహాముని ధర్మపత్ని అయిన లోపాముద్రచే అర్చింపబడిన తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి లోపాముద్రార్చితా అను ఆరక్షరముల (షడాక్షరీ) నామ మంత్రమును ఓం లోపాముద్రార్చితాయై నమః అని ఉచ్చరించుచూ ఆ అఖిలాండేశ్వరిని ఉపాసించు ఉపాసకులకు ఆ పరాశక్తి కరుణతో ఆయురారోగ్యములు, సుఖసంతోషములు, సిరిసంపదలు అనుగ్రహించి, పరమేశ్వరీ ఆరాధనకు కావలసిన దృఢసంకల్పము ప్రసాదించి, ఆ జగన్మాత తన ధ్యానచింతనలో తరింపజేయును.

శ్రీవిద్యోపాసకులు మొత్తం పద్నాలుగు మంది ప్రధానంగా ఉన్నారు. కొందరు పన్నెండు అంటారు కానీ మరొక ఇద్దరిని కూడా ప్రముఖంగా తీసుకొచ్చి పధ్నాలుగురు గురించి మానసోల్లాస గ్రంథం చెప్పింది. శ్రీవిద్యను మనదాకా తీసుకువచ్చిన మహానుభావులు వీరు. వీళ్ళందరూ కూడా దేవతా స్థాయి వాళ్ళు. మానవ స్థాయిలో ఉన్న ఋషులు చాలామంది ఉన్నారు. శంకరులు మొదలైన వారెందరో. కానీ దేవతలకు సంబంధించిన మనం వారి సిద్ధ్యౌఘ, దివ్యౌఘ, పాదౌఘ అని కూడా అంటూంటాం. ఇలా అనేకమంది ఉన్నారు. కానీ ప్రధానంగా పద్నాలుగు మంది. వీరిని ఎప్పుడూ తలంచుకోవాలి. వీళ్ళు శ్రీవిద్య ఉపాసన వల్ల శక్తి పొంది జగద్రచన చేస్తారు. వాళ్ళు ముందుగా - శివుడు - ఆయనొక పెద్ద భక్తుడు. అందుకే జగన్మాతను శివారాధ్యా అని అంటున్నాం. శ్రీవిద్యోపాసకులలో విష్ణువు, బ్రహ్మ, మనువులు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, మన్మథుడు - (మన్మథుడు ఉపాసించిన శ్రీవిద్యే మనకు ప్రసిద్ధి) ఇప్పుడు చేస్తున్న పంచదశీ విద్య అంతా మన్మథుడు చేసినదే వీళ్ళు ఎలా ఉపాసించారు అన్నది మనకు తెలియదు. వాళ్ళయొక్క మంత్రవిద్యలు వేరు. వాళ్ళందరూ అమ్మను ఉపాసించారు అని తెలుసు కానీ వాళ్ళ పద్ధతులు ఏవో మనకు తెలియవు. మనం ఉపాసిస్తున్నది మన్మథ విద్య - కామరాజ విద్య. అదే ఆత్మ విద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా అమ్మ ఇచ్ఛాశక్తి స్వరూపిణి కదా! ఆవిడ అనుగ్రహం లేకపోతే మన్మథుడు ఈ ప్రపంచం నడపలేడు. ఇంకను ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు
ఇందులో మన్మథుని వరకు చెప్పి ఊరుకుంటారు కొందరు. దత్తాత్రేయుడు పెద్ద శ్రీవిద్యోపాసకుడు. ఆయన పరశురాముడికి శ్రీవిద్యోపాసన తెలియజేశాడు. కనుక అమ్మను ఆరాధించేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కదా! అందుకే శంకరులు హరిహర విరించాదిభిరపి అని. ఇలా వీళ్ళందరి చేతా ఆరాధించబడినది. వీరిలో లోపాముద్ర ఏకైక స్రీ శ్రీవిద్యోపాసకురాలు. 

అగస్త్యమహాముని భార్య అయిన లోపాముద్ర  అమ్మవారి పంచదశాక్షరీ మంత్రాన్ని ఉపాసించి, ఆ అమ్మవారి సాక్షాత్కారాన్ని పొంది శ్రేష్ఠులైన శ్రీవిద్యోపాసకులలో స్థానం కల్పించుకున్నది.

ముఖ్యంగా ఇక్కడ చెప్పవలసింది ఏమంటే - హయగ్రీవుని ద్వారా శ్రీవిద్యను తెలుసుకున్న అగస్త్యముని తన భార్యకు కూడా వివరించడం జరిగింది. ఆమె తన భర్తవద్ద వినడంతో సరిపెట్టక పంచదశాక్షరీ మహా మంత్రాన్ని త్రికరణశుద్ధిగా ఉపాసించింది. శ్రీవిద్యోపాసకులలో స్థానం పొందినది. లోపాముద్రచే ఆరాధింపబడిన శ్రీమాత లోపాముద్రార్చితా అని నామప్రసిద్ధ అయినది. 

అటువంటి లోపాముద్రార్చిత అయిన లలితాంబికను ఓం లోపాముద్రార్చితాయై నమః అని అనవలెను.
*****
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

648వ నామ మంత్రము

ఓం లీలాక్లప్త బ్రహ్మాండ మండలాయై నమః

సంకల్పమాత్రము చేతనే క్రీడా మాత్రముగాను, అనాయాసముగాను బ్రహ్మాండములను సృజించు పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి లీలాక్లప్త బ్రహ్మాండ మండలా యను పదిఅక్షరముల (దశాక్షరీ) నామ మంత్రమును ఓం లీలాక్లప్త బ్రహ్మాండ మండలాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను భక్తిప్రపత్తులతో ఆరాధించు సాధకునికి ఆ తల్లి ఎనలేని బ్రహ్మజ్ఞాన సంపదలొసంగుటయే గాక భౌతికపరమైన సుఖశాంతులు కూడా ప్రసాదించును.

సృష్టికి పూర్వం జగన్మాత పరమేశ్వరుని యందు ఇచ్ఛాశక్తిగా ఉన్నది.  ఏం జరిగినా, ఏదో ఒక ప్రేరణవల్లనే కలుగుతాయి. ఇచ్ఛాశక్తిగా పరమేశ్వరునిలో నున్న పరమేశ్వరికి  బ్రహ్మాండాలు సృజించాలనే ప్రేరణ కలిగింది.  అది క్రీడవంటిది మాత్రమే. ఆ క్రీడలో వినోదం కూడా కలసి ఉండడంచేత, ఆ క్రీడ ఆది దంపతులకు లీల అయింది. బ్రహ్మాండాలలో జరిగేవన్నీ ఆ ఆది దంపతుల లీలలయ్యాయి. అందుకే అంటారు శివుడాజ్ఞాలేనిదే చీమ అయినా కుట్టదని. ఆవిధంగా ఆ ఆది దంపతుల క్రీడాత్మక వినోదమే బ్రహ్మాండాల సృష్టి. ఆ ఆది దంపతులకు బ్రహ్మాండాలు సృష్టించడము ఒక బంతి ఆటవంటి క్రీడ. ఆట అయిపోయిన తరువాత పిల్లలు బంతి దాచేసినట్లు మళ్ళీ ఆ బ్రహ్మాండాలను వారిలోనే లీనంచేసుకుంటారు. అటువంటి లీలలకు ఇచ్ఛాశక్తిగా పరమేశ్వరునిలో ఉన్న అమ్మవారే ప్రేరణ గనుక జగన్మాతకు లీలాక్లప్త బ్రహ్మాండమండలా అని వశిన్యాదులు నామకరణం ఒకటి చేశారు.

ఆ జగన్మాతకు నమస్కరించునపుడు ఓం లీలాక్లప్త బ్రహ్మాండ మండలాయై నమః అని అనవలెను.

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

649వ నామ మంత్రము

ఓం అదృశ్యాయై నమః

దర్శింప వీలుకాని సత్, చిత్, ఆనందం అను ఈ మూడు లక్షణములు కలిగి, అదృశ్యా అను నామముతో వశిన్యాది వాగ్దేవతలచే స్తుతింపబడిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి అదృశ్యా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును  ఓం అదృశ్యాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ జగదీశ్వరిని ఆరాధించు భక్తులను ఆ తల్లి వారి భక్తికి సంతసమంది సర్వాభీష్టములను సిద్ధింపజేసి, ఆత్మసాక్షాత్కారము కలిగించి తరింపజేయును. 

పంచ లక్షణములైన అస్తి, భాతి, ప్రియం, రూపం నామం అను వాటిలో మొదటి మూడు పరమాత్మ లక్షణములు. ఈ మూడు లక్షణములే సత్, చిత్, ఆనందము అంటారు. ఈ లక్షణములు గల పరమాత్మ దృగ్గోచరము కాదు. అనగా ఈ చర్మచక్షువులతో చూడలేము.  కంటికి చూపు, చెవులకు వినికిడి, మిగిలిన ఇతర ఇంద్రియములకు ఆయా లక్షణములను ప్రసాదించునది ఆ పరమాత్మయే.  మనకున్న ఇంద్రియాలతో పరమాత్మ  గురుంచి తెలుసుకోలేము, కంటితో చూడలేము. అందుకే ఆ పరమేశ్వరి అదృశ్యా అను నామ మంత్రముతో  వశిన్యాదులచే ప్రస్తుతింపబడినది. ఇంతకు ముందు నామంలో ఆ జగన్మాతను లీలాక్లప్త బ్రహ్మాండ మండలా అని స్తుతించాము. అంటే బ్రహ్మాండాలన్నీ ఆ తల్లి చేతే సృష్టింపబడుతాయి, తనలోనే ఇముడుతాయి అని. అంటే ఎవరు ఆ తల్లిని చూడగలరు? ఒక్కరైనా చూడగలరా? చర్మచక్షువులతో, సామాన్యులకు అదృశ్య కదా ఆ తల్లి. చూడగలరు. చూసినట్లు భావించగలరు. ఎవరైతే మూలాధారంలో ఉన్న కుండలినీ శక్తిని బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథిని ఛేదించుకుంటూ, షట్చక్రములు దాటి, సహస్రారం చేరి అక్కడ అమ్మ కురిపించే సుధామృత  ధారలలో (సహస్రారాంబుజారూఢా, సుధాసారాభివర్షిణీ) తడిసిముద్దయిన సాధకుడు మాత్రమే అమ్మను చూశానని తృప్తినందుతాడు. గాన సాధకేతరులెవ్వరికైనా ఆ తల్లి అదృశ్యా అని మాత్రమే భావించాలి. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం అదృశ్యాయై నమః అని అనవలెను.

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

650వ నామ మంత్రము

ఓం దృశ్య రహితాయై నమః

బ్రహ్మాండములన్నీ తనలోనే ఇముడ్చుకొని తనముందు వేరేమియు లేక దృశ్యరహితయైన స్థితిలో నుండు అఖిలాండేశ్వరికి నమస్కారములు

శ్రీలలితా సహస్ర నామావళి యందలి దృశ్య రహితా అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం దృశ్య రహితాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులకు దృశ్యరహితయైన ఆతల్లి మనోనేత్రములకు లీలామాత్రముగా గోచరించి అభీష్టములను నెరవేర్చి, నిత్యము, సత్యమైన ఆనందాన్ని ఫ్రాప్తింపజేయును.

అండ పిండ వేదాండో సంహతుల నెల్ల

గుప్త గతిబొజ్జ లో నుంచుకున్నయట్టి తోయజాక్షునితో అని ముత్తరాజు సుబ్బారావుగారు శ్రీకృష్ణతులాభారం నాటకంలో శ్రీకృష్ణపరమాత్ముని గురుంచి నారదమహర్షిద్వారా మనకు చెప్పారు. ఆయన నారాయణుడు. శ్రీమాత నారాయణి - నారాయణీ నాదరూపా నామరూప వివర్జితా    అని వశిన్యాదులు అన్నారు కదా! నారాయణి నారాయణుని సోదరి. నామ రూప వివర్జితా అనగా నామరూపాలు లేని పరబ్రహ్మ స్వరూపిణి. జ్ఞానశక్తి చేత నామరూపాలు నశించగా, బ్రహ్మము  ఒక్కటే మిగిలి ఉంటుంది.  అట్టి పరబ్రహ్మమే లలితాంబిక కదా! అలాగ లోకాలనన్నింటినీ నారాయణుని వలెనే అమ్మవారు కూడా ప్రళయకాలంలో తనతో ఇముడ్చుకొని తనకు చూడడానికి దృశ్యమే లేని స్థితి ఏర్పడినది.. ఆవిధంగా దృశ్యరహిత అయినది శ్రీమాత. అదృశ్యా అను నామంలో చెప్పినట్లు అస్తి, భాతి, ప్రియం, రూపం, నామం అనూ ఈ ఐదు లక్షణములలో మొదటి మూడు లక్షణములు పరమాత్మవి. ఈ మూడింటిని సత్, చిత్, ఆనందాలు అంటారు. ఇవి దృగ్గోచరములు కావు. ఈ లక్షణములు గల పరమాత్మ ఐన పరాశక్తి కూడా అదృశ్య. అలాగే బ్రహ్మాండాలను విలయకాలంలో తనలో బ్రహ్మాండాలను దాచుకొని, తనకు చూడడానికి దృశ్యమే లేని జగన్మాత  దృశ్యరహిత అని వశిన్యాదులచే నామాంకిత అయినది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి