5, జనవరి 2022, బుధవారం

501-- 600

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

501వ నామ మంత్రము 13.11.2021

ఓం గుడాన్నప్రీత మానసాయై నమః

బెల్లంతోగూడిన యన్నమనిన ఎంతో మనసుపడే లాకినీస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి గుడాన్నప్రీత మానసా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ)  నామ మంత్రమును ఓం గుడాన్నప్రీత మానసాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ లాకినీస్వరూపిణియైన పరమేశ్వరిని ఉపాసించు సాధకులు శాంతిసౌఖ్యములతోను, సకలశుభములతోను విలసిల్లుచూ, పరమేశ్వరియందు అచంచలమైన భక్తిప్రపత్తులతో జీవించి తరించుదురు.


లాకినీదేవీ స్వరూపిణియైన పరమేశ్వరికి గుడాన్నము (బెల్లముతోగూడిన అన్నము) అనిన ప్రీతి. చక్కెరపొంగలినికూడా గుడాన్నమందురు. బెల్లము శరీరానికి పుష్టినిస్తుంది. పరమేశ్వరిని ఆరాధనచేసి, గుడాన్నమును నివేదనచేసి, ఆ ప్రసాదమును ఆరగించు భక్తులు శరీరపుష్టితో గలిగియుందురు. ఒక్కొక్క దేవతాస్వరూపిణియైన పరమేశ్వరిని ఆరాధిస్తూ, ఆ దేవతకు ఇష్టమైన వివిధ రకములైన అన్నములు (నెయ్యితో గలిపినది, పాయసాన్నము, గుడాన్నము, చిత్రాన్నము, పప్పు అన్నము, పెరుగు అన్నము) నివేదించి, భక్తిగా ఆరగించుట వలన ధాతుపుష్టిని పొందుదురను ఆంతర్యము ఇదియే. ఇక్కడ లాకినీస్వరూపిణియైన దేవతకు గుడాన్నమనిన ఇష్టము అని చెప్పుటకు ఆ దేవత మాంసధాతువుకు అధిదేవతయగుటయే కారణమని భావించవచ్చును. లలితా సహస్ర నామావళి యందలి ప్రతీ నామము ఒకమంత్రమై, ఆ నామ మంత్రమునకు ఒక పారమార్థిక భావన ఉన్నదనుటలో సందేహములేదు. 


లాకినీస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం గుడాన్నప్రీత మానసాయై నమః అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

502వ నామ మంత్రము 14.11.2021

ఓం సమస్తభక్త సుఖదాయై నమః

తనను అత్యంత భక్తిప్రపత్తులతో సేవించు భక్తులందరి కోర్కెలనూ సిద్ధింపజేసి సకల సుఖములనూ ప్రసాదించు లాకినీదేవీ స్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సమస్తభక్త సుఖదా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం సమస్తభక్త సుఖదాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ లాకినీస్వరూపిణియైన జగన్మాతను అత్యంతభక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకులు ఇహపరసౌఖ్యములకు లోటులేకుండా జీవించి తరించుదురు.

మణిపూరాబ్జమునందు విలసిల్లు లాకినీదేవతా స్వరూపిణియైన పరమేశ్వరి తనను అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించు భక్తులకు శాంతిసౌఖ్యములు, సకలసంపదలు, కీర్తిప్రతిష్టలను ప్రసాదించును. భక్తులయొక్క ధర్మబద్ధమైన కోరికలను సిద్ధింపజేయుటయేగాక, కైవల్యపదమును పొందుటకు కావలసిన సాధనాపటిమను కలుగజేయును. 

లాకినీదేవి మాంసధాతువునందు ఉంటుంది గనుక తనను సేవించు భక్తులకు శరీరమునందు మాంసపుష్టిని అనుగ్రహించి శక్తిమంతులుగా విలసిల్లజేయును. భగవదారాధనకు కావలసినది ధ్యాననిమగ్నత, భక్తిప్రపత్తులేగాదు.    దీక్షాబద్ధులై ఆహారపానీయములను సైతము లెక్కచేయకుండా సాధనచేయుటకు శరీరములో శక్తిసంపదలుకూడా పుష్కలంగా అవసరం. మానావమానముల యందు, నిందాస్తుతుల యందు, సుఖదుఃఖముల యందు, శత్రు మిత్రాదులందు, మృణ్మయ కాంచనముల యందు గుణాతీతులు కావలెనన్నచో భక్తులకు నిరంతర సాధనకావలెను. అట్టి భక్తులు నిరంతరము ఆత్మస్థితియందు మాత్రమే నిలకడ కలిగియుండుటనే నిజమైన సుఖము అని అన్నారు. అంతటి మహోన్నతమైన సుఖమును పొందిన భక్తులను మిథ్యారూప ప్రపంచమునందలి ఇట్టి ద్వంద్వములు వారినేమియు చేయజాలవు.  ఇట్టి మహోన్నత స్థితిపొందుటయే సుఖము అని అన్నారు గనుక అట్టి సుఖమునకై ప్రయత్నించి కృతార్థత బడయవలెనన్న సాధనాపటిమ ఎంతైనను అవసరము. అటువంటి సాధనా పటిమను లాకినీ స్వరూపిణియైన పరమేశ్వరి తన భక్తులకు అనుగ్రహించును. అచంచల భక్తితో తనను సేవించు భక్తులు త్రిగుణములను దాటి బ్రహ్మ సాక్షాత్కారమును పొందునటు వంటి అసలైన సుఖమును  అనుగ్రహించు లాకినీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం సమస్తభక్తసుఖదాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

503వ నామ మంత్రము 14.11.2021

ఓం లాకిన్యంబా స్వరూపిణ్యై నమః

మణిపూరచక్రాధిష్ఠానదేవతయైన లాకినీదేవీ స్వరూపంలో తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి లాకిన్యంబా స్వరూపిణీ యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం లాకిన్యంబా స్వరూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ లాకినీదేవీ స్వరూపిణియైన పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి భౌతికపరముగా సమస్త శాంతిసౌఖ్యములనూ ప్రసాదించుటయేగాక, ఆముష్మికపరమైన స్థితిని పొందుటకు కావలసిన దీక్షాసంపదనుకూడా ప్రసాదించును.

మణిపూరచక్రాధిష్ఠాన యోగినీశక్తి వయోవస్థావివర్జిత యను నామము గలిగిన దేవత. ఈ దేవతయొక్క మంత్రమునకు బీజము, శక్తి, కీలకములు ల కార సంకేతములు  గనుక, ఈ తల్లి లాకిన్యంబా యని అనబడినది. శ్రీమాత చతుష్షష్టికోటి యోగినీ గణములచే సేవింపబడు చుండుటయే గాక, చతుష్షష్టికోటి యోగినీ దేవతల స్వరూపిణిగా అలరారుచున్నది. అంతేకాదు ఆ పరమేశ్వరి సకలదేవతా స్వరూపిణి కూడా! గనుకనే ఇక్కడ అమ్మవారిని లాకిన్యంబాస్వరూపిణీ యని భక్తిప్రపత్తులతో కీర్తిస్తున్నాము. 

నాభిస్థానమునందు గల మణిపూరాబ్జమునకు పదిదళములు ఉన్నవి. పదిదళములందు డ నుండి ఫ అను పది బీజాక్షరములు గలవు. ఆయా బీజాక్షరములే తమ నామములకు ప్రారంభాక్షరములుగా  గల పదిమంది యోగినీశక్తులు పరివేష్టించి ఉండగా, మధ్యగల మణిపూరాబ్జకర్ణికయందు లాకినీదేవి కొలువుతీరియున్నది.  శ్రీమాత సాక్షాత్తు ఆ లాకినీదేవీ స్వరూపిణి గనుక, ఆ పరమేశ్వరి లాకిన్యంబాస్వరూపిణి యని అనబడినది. లాకినీదేవికి మూడు ముఖములు (శిరస్సులు), కోరలు గలవు. మూడు చేతులలో వజ్రము, శక్తి, దండము గలిగి, నాలుగవ చేతితో అభయముద్రతో ఈ లాకినీదేవి విరాజిల్లుచున్నది. ఈ దేవత మాంసధాతువునందు ఉన్నది. ఈమెకు బెల్లముతోగూడిన అన్నము అనిన ప్రీతి. లాకినీదేవి తన భక్తులకు సమస్త సుఖములను ప్రసాదించును. లాకినీదేవికి సంబంధించిన ఈ విశేషణములు అన్నియును లలితా సహస్ర నామావళి యందు మణిపూరాబ్జనిలయా యను (495వ) నామ మంత్రము నుండి సమస్తభక్తసుఖదా యను (502వ) నామ వరకునూ గల నామ మంత్రములలో చెప్పబడినది. శ్రీమాత లాకిన్యంబా స్వరూపిణి గనుక ఈ విశేషణములు అన్నియును ఆ తల్లికే సమన్వయింపబడి, ఆ తల్లినే ఆ నామములతో కీర్తించుచున్నాము.  ఈ సందర్భంలో శంకర భగవత్పాదుల వారు తమ సౌందర్యలహరిలో నలుబదియవ (40వ) శ్లోకంలో ప్రస్తుతించారు.

తటిత్వంస్తం శక్త్యా - తిమిరపరిపంథి స్ఫురణయా

స్ఫురన్నానారత్నాభరణ -పరిణద్ధేంద్ర ధనుషమ్ |

తవ శ్యామం మేఘం - కమపి మణిపూరైక శరణం

నిషేవే వర్షంతం-హరమిహిరతప్తం త్రిభువనమ్ || 40 ||

మణిపూరక చక్రము నందుండి ముల్లోకములను తడుపు నీలమేఘమునకు ధ్యానము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - మేఘేశ్వరుడు, సౌదామిని.

పరమేశ్వరీ! జలతత్వమైన మణిపూరక చక్రాన్ని గృహముగా చేసుకుని అచట ఉండు చీకట్లను పోగొట్టుటకు, అంధకారమును నిర్మూలము చేయు విద్యుత్ కాంతి శక్తి కలిగిన మెరుపుతో కూడిన ప్రకాశంతో వెలుగొందుతూ, అనేక రత్నాలు పొదగబడిన, నగలచేత కూర్చబడిన ఇంద్రధనుస్సు కలిగి, నీలవర్ణ ఛాయతో ప్రకాశిస్తూ సూర్యుని ప్రచండాగ్నిచే కాల్చబడిన ముల్లోకములను తన వర్షధారలచే తడుపుతూ మాటలతో చెప్పనలవి కానంత శ్రేష్ఠముగా అలరారుతున్న ఆ మేఘమును అనగా ఆ సదాశివుని (మేఘము అనగా అమృతేశ్వరాఖ్య దంపతీయుగ్మంగా కూడా అర్ధం కలదు.అందువలన అమ్మను, అయ్యవారిని అనికూడా భావింపవచ్చును) భక్తితో సేవించుచున్నాను.
ఇక్కడ మెరుపు అమ్మవారు, మేఘం అయ్యవారైన పరమేశ్వరుడు. మెరుపు మరియు మేఘము కలసి సాంబశివులుగా వెలుగొందుచున్నారు. మణిపూరకచక్రమందు శోభిల్లు వీరిని మేఘేశ్వర, సౌధామినిలుగా అమృతేశ్వర, అమృతేశ్వరిలుగా ఉపాసించుట కూడా గలదు.

ఆ తల్లిని ఇలా ధ్యానిస్తున్నాము:- అమ్మా! జగన్మాతా! మణిపూరచక్రమే ముఖ్యస్థానంగా గలిగినదానవై, ప్రళయకాల రుద్రుడనే సూర్యుడిచే (దుఃఖం) తపింపచేయబడిన ఈ ముల్లోకాలను ( కృపామృత) వర్షధారలచే తడుపుతూ, మెరపు తీగలతో కూడి అంధకారాన్ని (అజ్ఞాన) రూపుమాపుతూ, రత్నాలచేత నిర్మించబడిన ఆభరణాల కాంతిచే ఏర్పడిన ఇంద్రధనస్సుతో (జ్ఞానదీప్తితో) కూడిన, అనిర్వచనీయమైన, శివశక్త్యాత్మకమైన నీ నీలిమేఘాన్ని (దయాస్వరూపం) నేను ఆరాధిస్తున్నాను.

లాకినీస్వరూపిణియైన పరమేశ్వరికి  నమస్కరించునపుడు ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

504వ నామ మంత్రము 15.11.2021

ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః

స్వాధిష్ఠానచక్రము నందు కాకినీ యను దేవతాస్వరూపిణియై భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి స్వాధిష్ఠానాంబుజగతా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ కాకినీదేవీ స్వరూపిణియైన పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు సాధకులు ఆ తల్లి కరుణచే అంతులేని ఆత్మానందానుభూతిని పొందుదురు.

మూలాధారమునకు పైన, మణిపూరమునకు క్రిందనూ స్వాధిష్ఠానచక్రము గలదు. ఇది జననేద్రియం వెనుక భాగాన, వెన్నుముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మ, తత్వం జలం. సిందూరవర్ణంలో ఉంటుంది, దీనినే స్వాధిష్ఠానాంబుజము లేదా స్వాధిష్ఠాన పద్మము అందురు. ఈ పద్మమునకు ఆరు దళములు గలవు. ఈ ఆరుదళములందును బ, భ, మ, య, ర, ల అను బీజాక్షరములు, ఆ బీజాక్షరములే తమ నామములకు ప్రారంభముగా గలిగిన యోగినీ దేవతలు వున్నారు.   స్వాధిష్ఠానాబ్జమునకు గల మధ్యగల కర్ణికలో కాకినీదేవి కొలువుదీరి ఉండును. ఆ కాకినీదేవిని ఈ విధముగా ధ్యానముచేయుట గలదు ఆరుదళముల స్వాధిష్ఠాన పద్మమందు నాలుగు ముఖములు గలిగి, మూడునేత్రములతోను, నాలుగు చేతులతోను, నాలుగు చేతులందు త్రిశూలము, పాశము, కపాలము, అభయముద్రలతోను అలరారుతూ, గర్వము గలిగినదియు, మేదస్సు అను ధాతువు నందుండునదియు, మద్యపాన మదముచే సంతోషించునదియు, బందిన్యాది దేవతలచే పరివేష్టింపబడినదియు, పచ్చని, ఎర్రని వర్ణములతో శోభిల్లునదియు, పెరుగన్నము నందు ప్రీతిగలిగినదియు, ఇష్టకామ్యములను సిద్ధింపజేయునదియు అయిన కాకినీదేవిని ధ్యానించు చున్నాను  స్వాధిష్ఠాన పద్మమందు వశించు కాకినీ దేవీ స్వరూపిణి యైన పరమేశ్వరి స్వాధిష్ఠానాంబుజగతా యని అనబడినది.

స్వాధిష్ఠానాంబుజమునందు విలసిల్లు కాకినీదేవీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

505వ నామ మంత్రము 15.11.2021

ఓం చతుర్వక్త్ర మనోహరాయై నమః

నాలుగు ముఖములతో (శిరస్సులతో) మనోహరముగా భాసిల్లు కాకినీదేవీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి చతుర్వక్త్ర మనోహరా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం చతుర్వక్త్ర మనోహరాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ కాకినీ స్వరూపిణియైన పరమేశ్వరిని ఆరాధించు సాధకులకు ఎనలేని పరమేశ్వరీ ధ్యాన నిరతితోబాటు, సాధనయందు అకుంఠిత దీక్ష, నిశ్చలమైన జ్ఞానసంపద, శాంతిసౌఖ్యములు ఆ తల్లి కరుణచే సంప్రాప్తించును.

విశుద్ధచక్రాధిష్ఠాన దేవతయైన డాకినీ దేవి వదనైకసమన్విత (ఒక శిరస్సుగలిగి యుండును), అనాహతచక్రాధిష్ఠానదేవతయైన రాకినీ యోగిని వదనద్వయ (రెండు శిరస్సులు గలిగియుండును), మణిపూర చక్రాధిష్ఠానదేవతయైన లాకినీ దేవి వదనత్రయ సంయుత (మూడు శిరస్సులు గలిగియుండును), స్వాధిష్ఠాన చక్రాధిష్ఠాన దేవతయైన కాకినీ దేవి చతుర్వక్త్ర మనోహర (నాలుగు శిరస్సులు గలిగియుండును).  

కాకినీదేవియొక్క నాలుగు శిరస్సులు నాలుగు వేదములుగా భావించవచ్చును.

కాకినీ దేవియొక్క నాలుగు ముఖములు వేదములందు చెప్పిన  బ్రహ్మక్షత్రియవైశ్యశూద్ర యను చతుర్వర్ణములకు సంకేతములుగా భావించవచ్చును.

కాకినీదేవి నాలుగు శిరస్సులు ధర్మార్థకామమోక్షములనెడు చతుర్విధపురుషార్థములుగా భావించవచ్చును.

కాకినీ దేవి నాలుగు ముఖములతో మనోహరముగా ఉన్న కాకినీ దేవీ స్వరూపిణి యైన పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

506వ నామ మంత్రము 16.11.2021

ఓం శూలాద్యాయుధ సంపన్నాయై నమః

నాలుగు చేతులయందును శూలము, పాశము, కపాలము, అభయముద్రలతో భాసిల్లు కాకినీస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి శూలాద్యాయుధ సంపన్నా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం శూలాద్యాయుధ సంపన్నాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ కాకినీ యోగినీదేవతా స్వరూపిణియైన లలితాంబికను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ తల్లి సిరిసంపదలతోను, శాంతిసౌఖ్యములతోను, విద్యాసంపన్నతతోనూ వర్ధిల్లు వారిగా అనుగ్రహించును.

స్వాధిష్ఠాన పద్మమునందుండు కాకినీదేవి నాలుగు చేతులందును శూలము, పాశము, కపాలము మరియు అభయముద్రలతో భాసిల్లుచుండును.   సత్యం, ధర్మం, న్యాయం, నీతి తదితర దైవీ గుణాలను పెంపొందించేందుకును,  కామ, క్రోధ, ఈర్ష్య, రాగ, ద్వేషాలైన రాక్షస గుణాలు తొలగించేందుకును కాకినీదేవి ఈ  ఆయుధములను ధరించినది. భక్తులను పీడించే దుష్టశక్తులను, భయములను కూడా పారద్రోలి, అభయాన్ని ప్రసాదిస్తుంది కాకినీదేవీ స్వరూపిణియైన పరమేశ్వరి.

శూలం అనగా త్రిశూలం. ఇది మూడు గుణాలైన సత్వ ,రజో , తమో గుణాలకి ప్రతీక త్రిశూలం . శారీరక,మానసిక, ఆధ్యాత్మిక అవరోధాలను  కాకినీ స్వరూపిణియైన పరమేశ్వరి ఈ త్రిశూలంతో తొలగిస్తుంది.

కాకినీదేవి ధరించిన పాశం అంటే బంధం. అది ఎప్పుడూ ఆలంబనగా ఉంటూ బలం కావాలి. అదే బంధనంగా మారి బలహీనత అవ్వకూడదు. స్త్రీ ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో బంధాలను బలంగా మార్చుకోగలగాలి. ఆ దృఢత్వాన్ని సాధించడానికి, దాన్ని ఆలంబనగా చేసుకోడానికి ఎంతో ఓర్పు కావాలనే సందేశాన్నిస్తుంది కాకినీ దేవి ధరించిన పాశం.

కాకినీదేవి ఒక చేతిలో కపాలమును ధరించియున్నది. దుష్టులను సంహరించి, ఆ దుష్టుల కపాలములను చేతధరించి, దుష్టస్వభావమునకు హెచ్చరికగా కపాలమును చేతధరించినది. 

కపాలము మేదస్సునకు స్థానము. బ్రహ్మజ్ఞాన సంపదలు సైతము మేదస్సునందు ఉంటాయి. కాకినీ దేవి కపాలమును చేత ధరించినదంటే, ఆ కాకినీస్వరూపిణియైన పరమేశ్వరి తన భక్తులకు భక్తిప్రపత్తులు, ధ్యాననిరతితోబాటు బ్రహ్మజ్ఞాన సంపదలను కూడా అనుగ్రహించగలదనుటకు  ఒక సంకేతముగా భావించవచ్చును.

ఆ నాలుగవ చేతిలోని అభయముద్ర భక్తులకు సర్వకాల సర్వాషస్థలయందును వెన్నంటి ఉంటూ ఆపదలనుండి రక్షిస్తూ, దుష్టశక్తులను నిరోధిస్తూ ఉండునని భావించదగును.

శూలాద్యాయుధసంపన్నయగు స్వాధిష్ఠానచక్రాధిదేవతయైన కాకినీస్వరూపిణిగా భాసిల్లు పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం శూలాద్యాయుధ సంపన్నాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

507వ నామ మంత్రము 16.11.2021

ఓం పీతవర్ణాయై నమః

పసిడివర్ణములో ప్రకాశించు స్వాధిష్ఠానచక్రాధి దేవతయైన కాకినీస్వరూపిణిగా భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి పీతవర్ణా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం పీతవర్ణాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ కాకినీదేవీస్వరూపిణియైన పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను మంచివిద్యాబుద్ధులు గలవారిగను, భక్తిజ్ఞానసంపన్నులుగను, చక్కని నడవడిక గలవారిగను ప్రవర్తింపజేయును.

స్వాధిష్ఠానచక్రాధిదేవతయైన కాకినీదేవి పీతవర్ణంలో ఉంటుంది. అనగా బంగారు వర్ణంలో స్వాధిష్ఠానచక్రాధిదేవతయైన కాకినీదేవి బంగారువర్ణంలో ప్రకాశిస్తోంది. సకల శుభములకు కారణమైన పసిడివర్ణముగల కాకినీదేవి తన భక్తులకు శుభములను కలుగజేయును. ఇష్టకామ్యార్థసిద్ధిని సిద్ధింపజేస్తుంది గనుకనే సిద్ధేశ్వరీ యని అనబడినది. అనగా కాకినీదేవిని సిద్ధేశ్వరియని కూడా అంటారు. సిద్ధేశ్వరి తన భక్తులకు అష్టసిద్ధులను అనుగ్రహించును. అటువంటి సిద్ధేశ్వరి (కాకినీదేవి) పీతవర్ణంలో ప్రకాశిస్తున్నది. 

స్వాధిష్ఠానాంబుజగతా యని యనబడే కాకినీస్వరూపిణియైన పరమేశ్వరి పీతవర్ణములో ఉంటుంది గనుక, ఆ తల్లికి నమస్కరించునపుడు ఓం పీతవర్ణాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

508వ నామ మంత్రము 17.11.2021

ఓం అతిగర్వితాయై నమః

అత్యంత సౌందర్యాతిశయముచే అతిగర్వితయై భాసిల్లు కాకినీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి అతిగర్వితా యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం అతిగర్వితాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ కాకినీ దేవీస్వరూపిణియైన పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులు చక్కని రూపలావణ్యముతోను, తెలివితేటలతోను, చక్కని సంభాషణాచాతుర్యంతోను విలసిల్లుదురు. 

స్వాధిష్ఠాన పద్మమునందు విరాజిల్లు కాకినీస్వరూపిణియైన పరమేశ్వరి బంగారువర్ణముగల శరీరముతో అత్యంత సౌందర్యవతియై భాసిల్లుచున్నది. సౌందర్యమునకు తగినట్లుగా ఆ తల్లి నిజసల్లాప మాధుర్య వినిర్భత్సితకచ్ఛపి అనగా సరస్వతీ దేవి కచ్ఛపీ వీణామాధుర్యమును సైతం తిరస్కరించే పలుకుల మధురిమలు గలిగినది. ఆ తల్లి తను సేవించిన కర్పూరాది సుగంధమిశ్రిత తాంబూల పరిమళంతో దిగంతాలను కూడా ఆకర్షిస్తున్నది (కర్పూరవీటికామోద సమాకర్ష దిగంతరా). కాకినీస్వరూపిణియైన పరమేశ్వరి రత్నాలు, బంగారం, ముత్యాలతో చేయబడిన కంఠాభరణాలు (రత్నగ్రైవేయ చింతాకలోలముక్తా ఫలాన్విత).   తన రూపలావణ్యముతోను, మాటల మాధుర్యంతోను, పరిమళాలు వెదజల్లే తాంబూలచర్వణముతోను మహాసౌందర్యవతియై భాసిల్లు కాకినీదేవి అతిశయముతో రాజిల్లు కాకినీస్వరూపిణియైన పరమేశ్వరి అతిగర్వితా యని అనబడినది.

అంతటి సౌందర్యాతిశయంతో అతిగర్వితా యని అనబడిన కాకినీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం అతిగర్వితాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

509వ నామ మంత్రము 17.11.2021

ఓం మేదోనిష్ఠాయై నమః

మేదస్సు (క్రొవ్వు) అను ధాతువునందు విలసిల్లు కాకినీస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మేదోనిష్ఠా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మేదోనిష్ఠాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ కాకినీయోగినీ స్వరూపిణియైన పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకులకు వృత్తి వ్యాపారాదులయందు విశేషమైన ప్రతిభ, సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు అనుగ్రహించును.

శరీరమునందు షట్చక్రములు (సహస్రారంతో సప్తచక్రములు - విశుద్ధ, అనాహత, మణిపూర, స్వాధిష్ఠాన, మూలాధార, ఆజ్ఞ, సహస్రారములు) గలవు. డాకినీ, రాకిణీ, లాకినీ, కాకినీ, సాకినీ, హాకినీ, యాకినీ యను యోగినీ శక్తులు అధిష్ఠానదేవతలు. వీరు శరీరములోని త్వక్కు, రుధిర, మాంస, మేదస్సు, అస్థి, మజ్జ, శుక్ల అను సప్తధాతువుల యందు ఈ ఏడుగురు యోగినీశక్తులరూపంలో పరమేశ్వరి ఉంటూ, శరీరమునకు తగిన రక్షణ సమకూరుస్తున్నది. అదే క్రమంలో కాకినీదేవీ స్వరూపిణియను స్వాధిష్ఠానచక్రాధిష్ఠాన దేవతాస్వరూపిణియైన పరమేశ్వరి మేదస్సు అను ధాతువునందు విలసిల్లుచూ తగినపాళ్ళలో క్రొవ్వుపదార్థములుండునటులు ఈ పాంచభౌతిక శరీరమునకు తగిన రక్షణనిచ్చుచున్నది. ఇదియే గదా పరమాత్మ యునికికి నిదర్శనము. శరీరంలో తగినంతగా క్రొవ్వు పదార్థములు లేని వారు ఆ పరమేశ్వరిని ఓం మేదోనిష్ఠాయై నమః అను నామ మంత్రజపము చేసి ఆ పరమేశ్వరి అనుగ్రహంతో శరీరంలోని మేదస్సు సమకూర్చుకొనవచ్చును.

స్వాధిష్ఠానచక్రాధిష్ఠానదేవతగా మేదస్సునందు విలసిల్లు కాకినీదేవీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం మేదోనిష్ఠాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

510వ నామ మంత్రము 18.11.2021

ఓం మధుప్రీతాయై నమః

తేనె యనిన ఇష్టము గలిగిన స్వాధిష్ఠానపద్మాధిదేవతయగు కాకినీదేవీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మధుప్రీతా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మధుప్రీతాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ కాకినీస్వరూపిణియైన పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ తల్లి ఆయురారోగ్యములతోను, సిరిసంపదలతోను, శాంతిసౌఖ్యములతోను విలసిల్లునటులు అనుగ్రహించును.

ఇక్కడ మధువు అంటే తేనె అని భావించినచో, ఆకాకినీస్వరూపిణియైన పరమేశ్వరికి తేనెయనిన మహాప్రీతి.    

పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార అనునవి పంచామృతములు. 

ఆవుపాలు పంచామృతములలో పాలు అనగా ఆవుపాలు. ఆవుపాలు సమీకృతాహారము. తల్లి లేని పిల్లలకు ఆవుపాలు తల్లిపాలవంటివి. షడ్రసోపేతమైన భోజనంలో లభించే పోషకవిలువలు  అన్నియూ కేవలం ఆవుపాలలో లభిస్తాయి. ముక్కోటిదేవతా స్వరూపిణియైన గోవు యొక్క క్షీరము అమృతతుల్యము. అందుకే పంచామృతములలో మొదటగా చెప్పిన ఆవుపాలు అమృతము తో సమానము.

ఆవు పెరుగు యందు ఉండే పోషకవిలువల కంటె పెరుగులో ఉండే పోషకవిలువలను మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. మనం తీసుకున్న తర్వాత ఒక గంటలో పెరుగు తొంబై శాతం జీర్ణం అయితే అదే సమయంలో పాలు ముప్పై శాతం మాత్రమే జీర్ణం అవుతాయని పెద్దలు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండే వాళ్ళకు పెరుగు అమృతం వంటిది. ముఖ్యంగా పిల్లలు, వయసు మళ్లిన వారిలో పెరుగు వారి జీర్ణ శక్తిని అనుసరించి పనిచేస్తుంది. ఆవు పెరుగు నిత్యం  తినేవారికి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు పరిశోధనల్లో తేలింది.  నిత్యం పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు పరిశోధనల్లో తేలింది.  గనుకనే పంచామృతాలలో పెరుగు కూడా ఒక అమృతము

ఆవు నెయ్యి రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి ఉత్సాహాన్ని, బలాన్ని ఇస్తుంది. చర్మ సంరక్షణలోనూ నెయ్యి బాగా పనిచేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి, ఆరోగ్యకరంగా మార్చడానికి ఆవునెయ్యి ఉపయోగపడుతుంది. 

ఆవు నెయ్యిలో మిరియాలు, ఉప్పు, అల్లంరసం మరియు తులసి ఆకులు వేసిన ఈ మిశ్రమంతో తేనె కలిపి తాగితే గొంతునొప్పి తగ్గుతుంది. సర్వరోగ నివారిణి యగు ఆవునెయ్యి  ఆ విధంగా   అమృతము తో సమానము.  
  
తేనె యోగ సాధన చేసే వారికి ఎంతో ఉపయోగమైంది
యోగ సాధన చేసే వారు తేనె వాడడం వల్ల రక్తంలోని రసాయనంలో సమతుల్యత వస్తుంది. తేనెను రోజూ తీసుకోవడం వల్ల శరీర వ్యవస్థ మరింత శక్తివంతం అవుతుంది. ప్రొద్దున యోగ సాధనకు ముందు గోరువెచ్చని నీటితో తేనెను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని అన్ని వ్యవస్థలు బాగా తెరుచుకుంటాయి. అందుకే పంచామృతాలలో తేనె ఒక అమృతము.

పంచదార ను చక్కెర అంటారు. సకలశుభాలకు మూలం ఈ మధుర పదార్థమైన పంచదార.  చెఱకు రసం నుండి తయారైనది పంచదార.  మనోరూపేక్షుకోదండా యని లలితా సహస్ర నామావళిలో పదియవ (10వ) నామ మంత్రంలో అమ్మవారిని కీర్తించాము.  అనగా అమ్మవారి మనసు చెఱకువలె మధురమైనది. క్షీరసాగర మథనంనుండి వెడలిన అమృతమంత మధురంగా ఉంటుంది.   అటువంటి చెఱకురసం నుండి వెడలిన పంచదారకూడా అమృతము వంటిది. 

దేవతలకు క్షీరసాగరం నుండి లభించినది అమృతము ఒక్కటే అయితే, పరమాత్మకు అభిషేకమాచరించి, తీర్థముగా స్వీకరించు ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార అను ఈ పంచామృతములు పరమాత్మ మానవాళికి అనుగ్రహించిన ఐదు అమృతములు. 

అటువంటి ఐదు పంచామృతములలో ఒకటి అయిన తేనె (మధువు) అనిన కాకినీదేవీ స్వరూపిణియైన పరమేశ్వరికి ప్రీతియగుటచే, ఆ తల్లి మధుప్రీతా యని అనబడినది. 

లలితా సహస్ర నామావళి ప్రారంభము నందు గల ధ్యానశ్లోకంలో అమ్మవారు పాణిభ్యామలిపూర్ణరత్న చషకం  ('పాణిభ్యాం అలిపూర్ణ రత్నచషకమ్' అనగా అమ్మవారికి మద్యముచే నింపబడిన రత్నభాండము చేతిలో గలదు). అంతటి రత్నభాండంనిండా మద్యము నింపుకొని చేతిలో పెట్టుకొని ఉన్న అమ్మవారికి (మధువు) మద్యము అనిన మిక్కిలి ప్రీతి అని భావించుటచే, ఆ తల్లి మధుప్రీతా యని అనబడినది.

మధుప్రీతయగు    స్వాధిష్ఠానచక్రాధిదేవతయైన  కాకినీదేవీ స్వరూపిణియగు పరమేశ్వరికి నమస్కరించునపుడు
ఓం మధుప్రీతాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

511వ నామ1 మంత్రము 18.11.2021
 
ఓం బందిన్యాది సమన్వితాయై నమః

బందిని మొదలగు ఆరుగురు దేవతలచే పరివేష్టిత అయిన స్వాధిష్ఠానచక్రాధి దేవతయగు కాకినీస్వరూపిణియై భాసిల్లు జగన్మాతకు నమస్కారము

🌹🌹🌹స్వాధిష్ఠాన పద్మమునకు  ఆరుదళములుకలవు; కనుక ఆచక్రాధిష్ఠాన దేవతయైన కాకినీ యోగిని ఆరుగురు దేవతలచే పరివేష్టితయై ఉండును.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి శ్రీలలితా త్రిపురసుందరి నామావళిలోని బందిన్యాది సమన్వితా  అను   ఎనిమిదక్షరముల (అష్టాక్షరి)  నామ మంత్రమును ఓం బందిన్యాది సమన్వితాయై నమః ఉచ్చరించుచు ఆ జగదీశ్వరిని భక్తిప్రపత్తులతో ఉపాసించు భక్తులకు అష్టైశ్యర్య ఐహిక  సౌకర్యములతోబాటు, బ్రహ్మజ్ఞాన సంపదలు కూడ ఆ పరాశక్థి కరుణవలన కలిగి అంత్యమున ముక్తి లభించును.

బందిన్యాది సమన్వితా అనగా బందినీ మొదలైన పరివార దేవతలచే ఆ పరాశక్తి పరివేష్టింప బడియున్నది. ఆరు దళములు కల్గిన స్వాధిష్ఠాన కమలకర్ణికలో కాకినీ దేవికి చుట్టునూ వరుస క్రమమున తమ నామములకు బ, భ, మ, య, ర, ల యను అక్షరములు ప్రారంభములుగా నామములు గలిగిన బందిని, భద్ర, మహామాయ, యశస్వినీ, రమా, లంబోష్ఠితా అను పరివార దేవతలచే ఆరుదళముల యందు విలసిల్లు చుండును గాన జగజ్జనని బందిన్యాది సమన్వితా అని నామ ప్రసిద్ధమైనది. గర్భస్థపిండము నాల్గవ మాసమున జీవికి కలిగే పోటీ తత్త్వ లక్షణం తాను, తనను పరిమితంలో బంధించు కొనడము మొదలగు వాటికి తగు బీజము లేర్పడ గలవు, అందుచే బందీయని భావము. అమ్మవారికి నమస్కరించునపుడు ఓం బందిన్యాది సమన్వితాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

512వ నామ మంత్రము 19.11.2021

ఓం దధ్యన్నాసక్త హృదయాయై నమః

దధ్యోదనము అనిన ప్రీతిగలిగిన స్వాధిష్ఠానచక్రాధిదేవత యైన కాకినీయోగినీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి దధ్యన్నాసక్త హృదయా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం దధ్యన్నాసక్త హృదయాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ కాకినీదేవీస్వరూపిణియైన జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరాశక్తిని ఉపాసించి, దధ్యోదనము నివేదించి నమస్కరించు భక్తులను ఆ తల్లి కరుణతో చల్లగా చూచి అన్నవస్త్రములకు లోటు లేక, సకల ఐశ్వర్యవంతులుగా విలసిల్లునటులును, బ్రహ్మజ్ఞానసంపన్నులుగాను, కీర్తిప్రతిష్టలనార్జించిన వారిగను, అంత్యమున మోక్షప్రాప్తిని పొందునటుల జేయును.

దధి   అనగా పెరుగు, దధ్యన్నము అనగా పెరుగుకలిపిన అన్నము, దధ్యన్నమునందు ఆసక్త అనగా ఇష్టము గలిగినది ఆ జగదీశ్వరి.  ఓం గుడాన్నప్రీతమానసాయై నమః (502వ నామ మంత్రము), ఓం దధ్యన్నాసక్త హృదయాయై నమః (512వ నామ మంత్రము), ఓం హరిద్రాన్నైకరసికాయై నమః (526వ నామ మంత్రము). అమ్మకు ఇష్టమనవి:- 1) బెల్లము కలిపిన అన్నము (బెల్లము కలిపిన అన్నము, చక్కెరపొంగలి, బెల్లము వేసిన పాయసము) , 2) పెరుగు కలిపిన అన్నము (దధ్యోదనము - కమ్మనిపెరుగు, అల్లమ్ముక్కలు, కరివేపాకు, కొత్తిమిరి, మిరియాలు, వాము, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, రెండు మెంతిగింజలు, జిడిపప్పు, బాదంపప్పు కలిపి ఆవు నేతిపోపు పెట్టిన పెరుగు అన్నము), 3) పసుపుకలిపిన అన్నము (మామిడి పులిహోర, నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, పెసరపప్పు-బియ్యం పులగంతో పచ్చిపులుసు, కొబ్దరి అన్నము) ఇవి అన్నీ ఆ పరాత్పరికి ఇష్టమే అంటే ఏదైనా ఇష్టమే భక్తితో నివేదించితే అనగా మనంకూడా ఏదైనా ఇష్టపడాలి (కలగినకాడికి గంజైనా, పరమాన్నమైనా) అనే పరమార్థమిమిడి ఉన్న నామమంత్రములు ఇవి.

పెరుగన్నము నందు ఇష్టము గలది కావున  దధ్యన్నాసక్తహృదయా అని నామ ప్రసిద్ధమైనది  ఆ కాకినీ దేవీ స్వరూపిణిగా భాసిల్లు ఆ పరమేశ్వరి.

స్వాధిష్ఠానచక్రాధిదేవతయగు కాకినీ స్వరూపిణిగా భాసిల్లు పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం దధ్యన్నాసక్త హృదయాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

513వ నామ మంత్రము 19.11.2021


 ఓం కాకినీ రూప ధారిణ్యై నమః

స్వాధిష్ఠానచక్రాధి దేవతయైన కాకినీ దేవతా రూపధారిణియై భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి  కాకినీరూపధారిణీ యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును  ఓం కాకినీ రూప ధారిణ్యై నమః అని ఉచ్చరించుచూ, కాకినీదేవీ స్వరూపిణియైన పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకులకు ఆ పరమేశ్వరి ఇష్టకామ్యార్థసిద్ధిని అనుగ్రహించును.

సిద్ధేశ్వరి యను ఈ స్వాధిష్ఠానచక్రాధి దేవతకు సంబంధించిన బీజ, కీలక, న్యాస మంత్రములన్నీ క కారముతోనే ఉండును.  అందుచేతనే ఈదేవత కాకినీ అని అనబడినది. స్వాధిష్ఠానాంబుజగతా యను (504వ) నామ మంత్రము నుండి దధ్యన్నాసక్తహృదయా యను (512వ) నామ మంత్రము వరకు కాకినీదేవతగా చెప్పబడే సిద్ధేశ్వరి యొక్క విశేషణములే వివరించబడినవి.

స్వాధిష్ఠానపద్మమునకు అధిదేవత సిద్ధేశ్వరి (కాకినీదేవి). స్వాధిష్ఠానపద్మమునకు ఆరు దళములు ఉండును. ఈ ఆరు దళములందు బ, భ, మ, య, ర, ల అను బీజాక్షరముల ఉండి, ఈ బీజాక్షరములే తమ నామములకు ప్రారంభాక్షరములుగా గల బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమా, లంబోష్ఠితా యను యోగినీ దేవతలు (బందిన్యాది శక్తులు) పరివేష్టించియుండగా ఆ పద్మముయొక్క కర్ణికయందు సిద్ధేశ్వరి (కాకినీదేవి) విలసిల్లుచున్నది. సిద్ధేశ్వరి యను ఈ కాకినీదేవి నాలుగు ముఖములు, మూడునేత్రములు, నాలుగు చేతుల యందును త్రిశూలము, పాశము, కపాలము, అభయముద్రలతోను భాసిల్లుచున్నది. ఈమె పీతవర్ణము గలిగిన శరీరముతో, అత్యంత సౌందర్యాతిశయంతో అతిగర్వితయై, మధుపానమనిన (మద్యము లేదా తేనె అనిన) ఇష్టముగలిగినదిగాను, మేదస్సు అను ధాతువునందు ఉండునదిగాను, దధ్యన్నమునందు (దధ్యోదనమునందు) ప్రీతిగలగినదిగాను విశేషించి చెప్పబడినది.

 మహాచతుష్షష్ఠికోటి యోగినీగణ సేవితా యను (237వ) నామ మంత్రములో అమ్మవారు అరవైనాలుగు కోట్ల యోగినీదేవతలచే సేవింపబడుచున్నదిగా అమ్మవారు కీర్తింపబడినది. అటువంటి యోగినీ దేవతలలో సిద్ధేశ్వరి (కాకినీదేవి) కూడా ఉన్నది. అమ్మవారు చతుష్షష్టికోటి యోగినీ గణములచే సేవింపబడునది మాత్రమే గాక, ఆ యోగినీ గణముల స్వరూపములతో కూడా భాసిల్లుచున్నది. ఆ యోగినీ గణములలోని కాకినీదేవీ స్వరూపంతో కూడా అమ్మవారు  భాసిల్లుచున్నది గనుక, అమ్మ కాకినీస్వరూపిణీ యని అనబడినది.

స్వాధిష్ఠానచక్రాధిదేవతయగు కాకినీదేవీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం కాకినీ రూప ధారిణ్యై నమః అని యనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

513వ నామ మంత్రము 19.11.2021


 ఓం కాకినీ రూప ధారిణ్యై నమః

స్వాధిష్ఠానచక్రాధి దేవతయైన కాకినీ దేవతా రూపధారిణియై భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి  కాకినీరూపధారిణీ యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును  ఓం కాకినీ రూప ధారిణ్యై నమః అని ఉచ్చరించుచూ, కాకినీదేవీ స్వరూపిణియైన పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకులకు ఆ పరమేశ్వరి ఇష్టకామ్యార్థసిద్ధిని అనుగ్రహించును.

సిద్ధేశ్వరి యను ఈ స్వాధిష్ఠానచక్రాధి దేవతకు సంబంధించిన బీజ, కీలక, న్యాస మంత్రములన్నీ క కారముతోనే ఉండును.  అందుచేతనే ఈదేవత కాకినీ అని అనబడినది. స్వాధిష్ఠానాంబుజగతా యను (504వ) నామ మంత్రము నుండి దధ్యన్నాసక్తహృదయా యను (512వ) నామ మంత్రము వరకు కాకినీదేవతగా చెప్పబడే సిద్ధేశ్వరి యొక్క విశేషణములే వివరించబడినవి.

స్వాధిష్ఠానపద్మమునకు అధిదేవత సిద్ధేశ్వరి (కాకినీదేవి). స్వాధిష్ఠానపద్మమునకు ఆరు దళములు ఉండును. ఈ ఆరు దళములందు బ, భ, మ, య, ర, ల అను బీజాక్షరముల ఉండి, ఈ బీజాక్షరములే తమ నామములకు ప్రారంభాక్షరములుగా గల బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమా, లంబోష్ఠితా యను యోగినీ దేవతలు (బందిన్యాది శక్తులు) పరివేష్టించియుండగా ఆ పద్మముయొక్క కర్ణికయందు సిద్ధేశ్వరి (కాకినీదేవి) విలసిల్లుచున్నది. సిద్ధేశ్వరి యను ఈ కాకినీదేవి నాలుగు ముఖములు, మూడునేత్రములు, నాలుగు చేతుల యందును త్రిశూలము, పాశము, కపాలము, అభయముద్రలతోను భాసిల్లుచున్నది. ఈమె పీతవర్ణము గలిగిన శరీరముతో, అత్యంత సౌందర్యాతిశయంతో అతిగర్వితయై, మధుపానమనిన (మద్యము లేదా తేనె అనిన) ఇష్టముగలిగినదిగాను, మేదస్సు అను ధాతువునందు ఉండునదిగాను, దధ్యన్నమునందు (దధ్యోదనమునందు) ప్రీతిగలగినదిగాను విశేషించి చెప్పబడినది.

 మహాచతుష్షష్ఠికోటి యోగినీగణ సేవితా యను (237వ) నామ మంత్రములో అమ్మవారు అరవైనాలుగు కోట్ల యోగినీదేవతలచే సేవింపబడుచున్నదిగా అమ్మవారు కీర్తింపబడినది. అటువంటి యోగినీ దేవతలలో సిద్ధేశ్వరి (కాకినీదేవి) కూడా ఉన్నది. అమ్మవారు చతుష్షష్టికోటి యోగినీ గణములచే సేవింపబడునది మాత్రమే గాక, ఆ యోగినీ గణముల స్వరూపములతో కూడా భాసిల్లుచున్నది. ఆ యోగినీ గణములలోని కాకినీదేవీ స్వరూపంతో కూడా అమ్మవారు  భాసిల్లుచున్నది గనుక, అమ్మ కాకినీస్వరూపిణీ యని అనబడినది.

స్వాధిష్ఠానచక్రాధిదేవతయగు కాకినీదేవీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం కాకినీ రూప ధారిణ్యై నమః అని యనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

514వ నామ మంత్రము 20.11.2021

ఓం మూలాధారాంబుజా రూఢాయై నమః

మూలాధారమనే చతుర్దళ పద్మంలో సిద్దవిద్యాదేవిగా (సాకినీ దేవత రూపంలో) ఉండు జగన్మాతకు నమస్కారము

శ్రీలలితా  సహస్ర నామావళి యందలి మూలాధారాంబుజారూఢా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) నామ మంత్రమును అత్యంత భక్తిశ్రద్ధలతోనూ, ఏకాగ్రచిత్తముతోనూ ఓం మూలాధారాంబుజారూఢాయై నమః అని ఉచ్చరిస్తూ ఆ జగజ్జననిని ఉపాసించు భక్తులకు భౌతిక బాధలు తొలగి, సర్వ శత్రు విజేతలై ప్రశాంత జీవనమును గడుపుదురు.

మూలాధార పద్మమునంధు అధివసించు సాకినీ దేవతా స్వరూపిణి ఆ పరాత్పరి. మనలోని ముఖ్యమైన విద్యుద్భాండారములో నింపబడిన దివ్యశక్తి అయిన నాలుగు దళములు గల్గిన మూలాధార పద్మ కర్ణికా మధ్యమున అధివసించి ఉండు ఈ దేవతను సిద్ధ విద్యాదేవి  అందురు. పిరుదుల స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆలింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.

మూలాధారచక్ర అధిష్టాన దేవత సిద్ధవిద్యాదేవి సాకినీ రూపములో ఉంటుంది. ఈ దేవతకు సంబధించిన బీజ, కీలక, న్యాస మంత్రాలన్నీ స కార సంబంధముగా ఉంటాయి. మూలాధారాంబుజారూఢా యను (514వ) నామ మంత్రం నుండి మద్గౌదనాసక్త చిత్తా యను (519వ) నామ మంత్రం వరకూ గల నామములు సాకిన్యంబా దేవి (సిద్ధవిద్యాదేవి) యొక్క విశేషణములే చెప్పబడినవి. 

మూలాధారస్థపద్మే, శృతి దళలసితే, పంచవక్త్రాం త్రినేత్రాం, ధూమ్రాభా, మస్థిసంస్థాం సృణి మపి కమలం పుస్తకం జ్ఞానముద్రాం బిభ్రాణం బాహుదండైస్సులలిత వరదా పూర్వ శక్త్యన్వితాంతం ముద్గాన్నాసక్త చిత్తాం మధుమదముదితాం సాకినీ భావయామి

మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము. ఇది షట్చక్రాలలో మొదటిది. ఇది నాలుగు దళాల పద్మము. ఈ మూలాధార చక్రములో సాకిన్యాంబ’ నివసిస్తుంది. ఈమెకు ఐదు ముఖములు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. గర్బస్ధ శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది. ఈమె ఆస్ధి సంస్దిత అనగా ఎముకలను అంటిపెట్టుకుని ఉంటుంది. వజ్రేశ్వరి. ఈ దేవతకి నాలుగు చేతులు. అంకుశము, కమలం, పుస్తకము, జ్ఞానముద్ర కలిగి ఉంటుంది. సాకిన్యాంబ వరదాది దేవతలు : 1. వరద 2. శ్రియ 3. షండా 4. సరస్వతి ( వ, శ, ష, స అను మూలాక్షరములు అనగా తమ నామములకు ప్రథమ అక్షరములుగా గల) దేవతలచే కొలువబడుతూ ఉంటుంది. సాకిన్యంబకు (సిద్ధవిద్యా దేవికి) పెసరపప్పుతో చేసిన పులగం అంటే ఇష్టము (మూద్గౌదనాసక్తచిత్తా - 519వ నామము) గర్భస్థ శిశువు విషయమున పంచమే మాసే పృష్ఠవంశో భవతి అనగా పంచమ మాసమున వెన్నెముక ఏర్పడును

మూలాధార చక్రాధిదేవతయగు సాకినీదేవీ (సిద్ధవిద్యా దేవీ) స్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కరించు నపుడు ఓం మూలాధారాంబుజా రూఢాయై నమః అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

515వ నామ మంత్రము 20.11.2021

ఓం పంచవక్త్రాయై నమః

అయిదు ముఖములతో తేజరిల్లు మూలాధారచక్రాధిష్ఠాన దేవతయగు సాకినీ దేవీ    (సిద్ధవిద్యా దేవీ) స్వరూపిణియైన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా  సహస్రనామావళి యందలి పంచవక్త్రా యను నాలుగక్షరముల (చతురక్షరి) నామ మంత్రమును ఓం పంచవక్త్రాయై నమః అని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఆరాధించు భక్తులకు ఆ తల్లి కరుణచే జ్ఞానసిద్ధి లభిస్తుంది, పవిత్రమైన కోరికలు నెరవేరి ఆ తల్లి పాదములను సేవిస్తూ తరించుదురు.

మూలాధార అధిష్ఠాన దేవతయగు సిద్ధవిద్యా దేవి (సాకినీ దేవి) అయిదు ముఖములు కలిగియున్నది.  అనగా అయిదు శిరస్సులు సద్యోజాత, వామదేవము, అఘోర, తత్పురుష, ఈశానము.  పంచభూతములు (భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము),  పంచజ్ఞానేంద్రియములు (1. శ్రోత్రము, 2. చర్మము, 3. చక్షుస్సు, 4. జిహ్వ, 5. నాసిక), పంచకర్మేంద్రియములు (1. వాక్కు, 2. హస్తములు, 3. పాదములు, 4. పాయువు, 5. ఉపస్థ), పంచతన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు) ఈ మూలాధారచక్రము నందు పనిచేయును అని భావించవచ్చును. 

విశుద్ధచక్రాధిష్ఠాన దేవతయైన డాకినీ దేవి వదనైకసమన్విత (ఒక శిరస్సుగలిగి యుండును), అనాహతచక్రాధిష్ఠానదేవతయైన రాకినీ యోగిని వదనద్వయ (రెండు శిరస్సులు గలిగియుండును), మణిపూర చక్రాధిష్ఠానదేవతయైన లాకినీ దేవి వదనత్రయ సంయుత (మూడు శిరస్సులు గలిగియుండును), స్వాధిష్ఠాన చక్రాధిష్ఠాన దేవతయైన కాకినీ దేవి చతుర్వక్త్ర మనోహర (నాలుగు శిరస్సులు గలిగియుండును).  మూలాధారచక్రాధిష్ఠాన దేవతయగు   సాకినీ దేవి పంచవక్త్రా(ఐదు శిరస్సులు గలిగియుండును).

మూలాధారచక్రాధిష్ఠాన దేవతయగు సిద్ధవిద్యా దేవీ(సాకినీ దేవీ) స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం పంచవక్త్రాయై నమః అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

516వ నామ మంత్రము 21.11.2021


 ఓం అస్థిసంస్థితాయై నమః

అస్థి (ఎముకలు) యందు అధిష్ఠాన దేవతగా ఉండు సాకినీ స్వరూపిణియైన (సిద్ధవిద్యా దేవీ స్వరూపిణి అయిన) పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి అస్థిసంస్థితా యను ఐదక్షరముల (పంచాక్షరి) నామ మంత్రమును ఓం అస్థిసంస్థితాయై నమః అని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉచ్చరిస్తూ ఆ జగజ్జననిని ఉపాసించు భక్తులను  ఆ తల్లి కరుణతో అనంత శివములు గల్గును, జ్ఞానసిద్ధియు పరమ శివమైనదియు ప్రాప్తిస్తుంది. బ్రహ్మజ్ఞాన సంపన్నులగుటకు కావలసిన సాధనాపటిమను పొందగలరు.

మూలాధార చక్రాధిదేవతయైన సాకినీ యోగినియను సిద్ధవిద్యాదేవి ఎముకలను చక్కగా ఆశ్రయించి ఉండును; మూలాధారమునందుండు  ఈ యోగినీ దేవత అస్థి ధాతవుకు సంబంధించి ఉండును; ఎముకులను అభివృద్ధి చేయుచుండును; ఎముకలు శరీరమునకు చాలా ముఖ్యమైనవి; దేహమందు ఎముకలు విరిగినా, ప్రక్కకు జరిగినా, పెరిగినా, ఓం అస్థి సంస్థితాయైనమః అంటూ దేవిని ధ్యానిస్తూ ఈ మంత్రమును సంపుటి చేసి మండలము రోజులు జపించి ఆఖరి రోజు పులగము (పెసరపప్పు, బియ్యము కలిపి వండిస అన్నము) నివేదస చేసిన వెంటనే సత్ఫలితములు కలుగును అని విశ్వాసము.

మూలాధార చక్రాధిష్ఠాన దేవతయైన సాకినీ (సిద్ధవిద్యా) స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం అస్థిసంస్థితాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

 517వ నామమంత్రము 21.11.2021

 ఓం అంకుశాది ప్రహరణాయై నమః

అంకుశము మొదలైన నాలుగు ఆయుధములను నాలుగు చేతులలో ఉన్న సిద్ధవిద్యాదేవీ స్వరూపిణియైన జగన్మాతకు  నమస్కారము.

శ్రీలలతా త్రిపురసుందరీ నామావళి యందలి అంకుశాది ప్రహరణా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) నామ మంత్రమును ఓం అంకుశాది ప్రహరణాయై నమః అని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉచ్చరించుచూ  ఆ మూలాధార చక్రాధిష్ఠాన దేవతయగు సిద్ధవిద్యా దేవీ (సాకినీదేవీ) స్వరూపిణియైన పరమేశ్వరిని ఉపాసించు ఉపాసకులు అజ్ఞాన నివృత్తిగలిగి, బ్రహ్మజ్ఞాన సంపన్నులై, అమ్మనామ తత్త్వవిచారణయందు విశేషమైన అవగాహనను పొంది, ఆ తల్లి పాదసేవయందే జీవించి తరించుదురు.

అంకుశాది ప్రహరణా యనగా అంకుశము మొదలైన ఆయుధములుగలిగియున్న సాకినీదేవి (సిద్ధవిద్యా దేవి). మూలాధార చక్రాధిష్ఠాన దేవతయైన సాకినీదేవి (సిద్ధవిద్యా దేవి) నాలుగు చేతులయందు అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్రలతో భాసిల్లుచున్నదని ఈ నామ మంత్రములోని భావము. అమ్మవారు చతుష్షష్టికోటి యోగినీ గణములచే సేవింపబడుచున్నది. సకలదేవతా స్వరూపిణియైన ఆ తల్లి చతుష్షష్టికోటి యోగినీ గణముల స్వరూపములు కూడా తనవిగా భాసిల్లుచున్నది.  మూలాధార చక్రాధిష్ఠానదేవతయైన సాకినీదేవీ (సిద్ధవిద్యాదేవి) స్వరూపిణిగా అమ్మవారు తేజరిల్లుచున్నది గనుక, ఆ అమ్మ అంకుశాది ప్రహరణా యను నామముతో స్తుతింపబడుచున్నది. ఆ పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం అంకుశాది ప్రహరణాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

518వ నామ మంత్రము 22.11.2021

 ఓం వరదాది నిషేవితాయై నమః

వరద  మొదలైన నాలుగు యోగినీ శక్తులచే సేవింపబడు మూలాధారచక్రాధిష్ఠాన దేవతయగు సాకినీదేవీ (సిద్ధవిద్యా దేవీ) స్వరూపిణిగా తేజరిల్లు జగన్మాతకు
నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి వరదాదినిషేవితా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం వరదాది నిషేవితాయై నమః అని ఉచ్చరిస్తూ, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరాశక్తిని ఉపాసించు భక్తులు కనులు మూసుకొని ధ్యాననిమగ్నులై యుండు తరుణంలో తమ కనుల ముందు సాక్షాత్కరించిన భావముగలిగి, ఆ దివ్యస్వరూప దర్శనంతో జన్మ తరించిన వారగుదురు.

నాలుగు దళాలు కలిగిన మూలాధార పద్మమునందు ఒక్కొక్క దళానికి ఒక్కొక్క దేవత చొప్పున నలుగురు దేవతా శక్తులచే జగన్మాత సాకినీ రూపంలో సేవింపబడుచున్నది.

మూలాధార పద్మమునకు నాలుగు దళములు గలవు. ఆ నాలుగు దళములందు వ, శ, ష, స అను బీజాక్షరములు ఉండును. మూలాధార పద్మముయొక్క కర్ణికలో సిద్ధవిద్యా దేవి (సాకినీ దేవి) ఉంటుంది. అవే బీజాక్షరములు తమ నామములకు ప్రథమాక్షరములుగా వరద, శ్రియ, షండా, సరస్వతి అను నలుగురు యోగినీదేవతలు ఆ సిద్ధవిద్యా దేవిని (సాకినీ దేవిని) సేవించుచున్నారు.  గనుకనే సాక్షాత్తూ మూలాధారచక్రాధిష్ఠాన దేవత యగు సిద్ధవిద్యా దేవీ (సాకినీ దేవీ) స్వరూపిణి యైన పరమేశ్వరి వరదాది నిషేవితా  యని అనబడినది. 

అటువంటి పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం వరదాది నిషేవితాయై నమః అని   యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

519వ నామ మంత్రము  22.11.2021

ఓం ముద్గౌదనాసక్త చిత్తాయై నమః

పెసరపప్పుతో కలిసిన (పెసరపప్పు-బియ్యంతో చేసిన పులగము) అనిన ఇష్టము గలిగిన చిత్తము ఉన్న మూలాధారచక్రాధిష్ఠాన దేవతయగు సిద్ధవిద్యా దేవీ (సాకినీ దేవీ) స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళిలోని ముద్గౌదనా సక్తచిత్తా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఉచ్చరిస్తూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ తల్లిని ఆరాధించి, పులగము నైవేద్యము పెట్టి,ఆ పరాశక్తికి నమస్కరించి తమ ఆర్తిని నివేదించు భక్తులకు అమ్మ కరుణించి సర్వాభీష్టములను   ఈడేర్చును.

దేహంలోని భౌతిక శక్తి అంతయు నియంత్రణ చేయు శక్తి మూలాధారమునకు కలదు, అట్టి భౌతిక శక్తిని సిద్ధవిద్యా దేవీ (సాకినీ దేవీ) స్వరూపిణి యైన పరమేశ్వరి మనకు అనుగ్రహించడానికి పులగము నివేదిస్తాము.

ముద్గౌదనము అనగా పులగము. అనగా పెసరపప్పు-బియ్యము కలిపి వండిన అన్నము. కుమార సంహితయందు పులగము వండు విధానము ఈవిధముగా వివరింపబడినది.

సుశాలితండుల ప్రస్థం తదర్ధముద్గభిన్నకమ్|

చతుఃఫలం గుడం ప్రోక్తం తన్మానం నారికేళకమ్|

ముష్టి మాత్రం మరీచం  స్యాత్ తదర్ధం  సైంధవం రజః|

తదర్ధం జీరకం విద్యాత్ కుడపం గోఘృతంవిదుః|

గోక్షీరేణ స్వమాత్రేణ సంయోజ్యా కమలాననమ్|

మందాగ్ని పచనా దేవ సిద్ధాన్న మిదముత్తమమ్॥

1. బియ్యం మంచివి ఒక ప్రమాణము (ప్రస్థము - కుంచెడు అనగా నాలుగు మానికలు  అనగా నాలుగు శేర్లు అని భాస్కరాచార్యులవారు చెప్పారు)

2. పెసరపప్పు బియ్యములో సగము.

3. బెల్లము బియ్యములో నాలుగవ వంతు. (నాలుగు ఫలములు అని భాస్కరాచార్యులవారు చెప్పిన కుంచెడు బియ్యమునకు)

4. కొబ్బరికోరు లేదా కొబ్బరి ముక్కలు బెల్లము కొలతతో సమానముగా (కుంచెడు బియ్యమునకు)

5. మిరియాలపొడి లేదా నేతిలో వేచిన మిరియాలు పిడికెడు (గుప్పెడు).


6. జీలకర్ర ఇదికూడా నేతిలో వేయించవలెను.

7. ఆవుపాలు అవసరమైనంత (కాచినవి) ఉడికినతరువాత చివరలో ఐదు నిమిషముల ముందు పోయవలెను. ఇప్పుడే సైంధవలవణము సరిపడినంత పాలలో కలిపి వేయవలెను. బాగుగా కలుపవలెను.

8. నెయ్యి అవసరంమేరకు. 

పై వాటిని అన్నింటిని సన్నని సెగపై వండినదే ఉత్తమమైన ముద్గాన్నము. ఈ ముద్గాన్నము తయారు చేయు విధానములో అనుభవం ఉన్న మహిళామణులు తమతమ పద్ధతిలో కూడా తయారుచేయవచ్చును. ఏది ఏమైనా పైన వివరించిన దినుసులుమాత్రం ఆయాపాళ్ళలో సేకరించి వాడవలయును. బియ్యం కావలసిన మేరకు తగ్గించి ఆ మేరకే మిగిలిన దినుసులు కూడా వేయవలెను. ఇటువంటి ముద్గాన్నమనినచో సిద్ధవిద్యా దేవికి (సాకినీ దేవికి) ఇష్టము. 

పసిపిల్లలకు అన్నప్రాశన సమయంలో పాయసాన్నము, ఆ తరువాత క్రమముగా నెయ్యి (కొంచం ఉప్పు కలిపి) అన్నం, బెల్లము కలిపిన అన్నము, పెరుగు అన్నము, తరువాత పప్పు అన్నము  (జీర్ణశక్తి క్రమంలో) తినిపించడం     అనే సూచనకూడా ఈ నామ మంత్రములో గలదు.

మూద్గాన్నము అనిన  ప్రీతిగలిగియుండుటచే సిద్ధవిద్యా దేవీ (సాకినీ దేవీ) స్వరూపిణియైన పరమేశ్వరి ముద్గౌదనాసక్తచిత్తా యని అనబడినది.  అటువంటి అమ్మవారికి నమస్కరించునపుడు ఓం ముద్గౌదనాసక్త చిత్తాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🌸💐💐💐
[ శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

520వ నామ మంత్రము 23.11.2021

 ఓం సాకిన్యంబా స్వరూపిణ్యై నమః.

మూలాధారాధిష్ఠాన దేవతయగు సాకిన్యంబా దేవీ (సిద్ధవిద్యా దేవీ) స్వరూపంలో భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్రనామావళిలోని సాకిన్యంబా స్వరూపిణీ అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) నామ మంత్రమును ఓం సాకిన్యంబా స్వరూపిణ్యై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సాధకులు సమస్త విద్యలయందు ప్రావీణ్యత, వాక్పటుత్వము కలిగి ఆత్మానందాన్ని పొంది తరించుదురు. 

సాకిన్యంబ అనగా సాకినీ దేవతాస్వరూపిణిగా జగజ్జననిని దర్శించడం. మూలాధార చక్రాధి దేవత అయిన సిద్ధవిద్యా దేవతయే సాకినీ శక్తిరూపంలో వసించుచున్నది.  బీజ, శక్తి, కీలక, న్యాస మంత్రములు అన్నియును సకార సంకేతముగా అనగా సాకినీ నామములోని మొదటి అక్షరము స గా తెలియగలము.

మూలాధారాంబుజా రూఢా యను (514వ) నామ మంత్రము మొదలుకొని  సాకిన్యంబాస్వరూపిణీ అను ఈ (520వ) నామము వరకు సాకినీ దేవతయొక్క విశేషణములే చెప్పబడినవి. 


శ్లో॥ మూలాధారస్థ పద్మే శృతిదళసితే పంచవక్త్రాం త్రినేత్రాం దూమ్రాభామ్అస్థిసంస్థాం సృణి మపి కమలం పుస్తకం జ్ఞానముద్రామ్

భిభ్రాణాం బాహుదండైః సులలిత వరదామ్  పూర్వ శక్త్యావృతాం తామ్ ముద్గాన్నాసక్తచిత్తాం మధు ముదముదితాం సాకినీం భావయామః॥

మూలాధారం అనగానే ఇది చక్ర వ్యవస్థకంతటికి పునాది అని తెలుస్తోంది. ఇది పృధ్వీతత్వం గల చక్రం. బ్రహ్మదండమునకు అట్టడుగున, ఆసనానికి రెండంగుళములపైన, జననేంద్రియానికి క్రిందుగా మూలాధార చక్రము కలదు. ఈ చక్రంలో మూడు ప్రధాన నాడులు ఇడ, పింగళ, సుషుమ్న మరియు ఇతర నాడులు శక్తివంతములై ఊర్థ్వముఖంగా పయనిస్తాయి. ఇది సంకోచ వ్యాకోచాలు కలిగి ఉంటుంది. చిక్కటి ఎరుపు రంగు కలిగిన నాలుగు దళములు గల పద్మం వలె ఉంటుంది. ఈ మూలాధార పద్మము యొక్క కర్ణికలో సాకినీ దేవి (సిద్ధవిద్యా దేవి)   దేవతామూర్తిగా అధిష్ఠించి ఉన్నది. ఈ దేవత నాలుగు చేతులతో ఉన్నది. ఆ నాలుగు చేతులలో అంకుశము, కమలము, పుస్తకము జ్ఞానముద్ర అనునవి ఉన్నవి. ఇక్కడ త్రైలోక్య మోహన చక్రము మనల్ని మోహంలోకి నెట్టే సర్వమోహినిగా విజ్ఞులు చెప్పారు. అజ్ఞానావృతం జ్ఞానం తేన ముహ్యంతిజంతవః జ్ఞానము అజ్ఞానముచే కప్పబడగా జీవులు మోహమును పొందుదురు. శ్రీ మహాగణపతి ఈ చక్రానికి పురుష అధిదేవత. ఈ చక్రమందలి నాలుగు రేకుల పైన వరుసగా బంగారు రంగులో  వం, శం, షం, సం (వ, శ, ష, స) అను బీజాక్షరాలు కలవు. బ్రహ్మకు స్థానమైన, ఈ మూలాధార చక్రం పై దృష్టినిలిపి ధ్యానించి సిద్ధి పొందితే సమస్త విద్యలలో ప్రావీణ్యంతో పాటు వాక్పటుత్వము కలగడంతో పాటు అట్టి సాధకునికి కోరికలు నశించి ఆత్మానందాన్ని పొందుదురు. గణపతిని , శివుని అష్టమూర్తులలో  శర్వుని గా చెప్పారు. అంటే పృథ్వీతత్వంగా మూలాధారంలో గణేశుడు ఉంటాడు.

శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు నలుబది ఒకటవ శ్లోకంలో మూలాధార చక్రమును ఈ విధంగా చెప్పారు.

తవాధారే మూలే - సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే - నవరస మహాతాండవ నటమ్ |

ఉభాభ్యామేతాభ్యా -ముదయవిధి ముద్దిశ్య దయయా

సనాథాభ్యాం జఙ్ఞే - జనక జననీమత్జగదిదమ్ || 41 ||

మూలాధార చక్రములో నటన చేయు ఆనందభైరవునికి వందనము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - ఆదినటుడు, లాస్యేశ్వరి.

అమ్మా! శ్రీమాతా! మూలాదారచక్రంలో ఆనందభైరవీ నామంతో శక్తిస్వరూపంగా ఉన్న నీతో కలసి శివుడు నవరసభరితమైన,నవ వ్యూహాత్మకమైన, లాస్య రూపమైన నాట్యం చేస్తాడు. మీ ఇద్దరి నాట్యంలోంచి ఈ జగత్తు మరల సృష్టించబడుతున్నది.ఆనందభైరవి,మహాబైరవులుగా మీచే సృజింపబడిన ఈ జగత్తుకు మీరే జగన్మాత, జగత్పితరులుగా భావించి నమస్కరించుచున్నాను.

 స్త్రీ _ పురుష నాట్యాలకు ప్రతీకలైన సమయ_ తాండవ నృత్య కేళిలో అంబా పరమేశ్వరుల నవరసాత్మక సమ్మేళనం చేతనే, ప్రళయమందు దగ్దమైన జగత్తు తిరిగి సృష్టించబడుతుంది. ఇది ఆనంద తాండవనృత్యం. జగదుత్పాదక సూత్రం .

ఆనందలహరి విభాగానికి అంతంలోచెప్పబడిన ఈ శ్లోకము వల్ల ఆనందభైరవీ _ మహాభైరవుల శృంగార మే నృత్య మని తెలియ దగును. తల్లీ ! నీయొక్క మూలాధారచక్రమందు , లాస్య నాట్యమునందు ఆసక్తి గల సమయా అనిపేరుగల ఆనందభైరవి అనే శక్తితో కలసి శృంగారాది నవరసములతో కూడిన మహాతాండవ నృత్యాన్ని నటించే నటుడైన వానిని , నవాత్ముడైన ఆనంద భైరవునిగా భావిస్తాను.
దగ్దమైన జగత్తును మరలా సృష్టించే విధానానికై దయతో కలసియున్న మీ యిద్దరి చేతనే ఈ జగత్తు తల్లి దండ్రులు కలదైయున్నది . శివ దంపతులు సమయాంబ _ మహానటేశ్వరనామములతో మూలాధారచక్రములో పృథివీతత్త్వానికీ తొమ్మిది మూల ప్రకృతులకూ ఉత్పాదకులుగా ఉంటారు. ఈ జగత్తు యొక్క సృష్టి కార్యంలో శివాశివులు ఇద్దరూ నవరసానంద సంధాయకమైన లాస్య తాండవము అనే నృత్యములు చేస్తారు. అందువల్ల వారులోకానికి జ…

****
 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

521వ నామ మంత్రము 23.11.2021

ఓం ఆజ్ఞాచక్రాబ్జ నిలయాయై నమః

కనుబొమల మధ్యలో ద్విదళకమలం కమలమయిన ఆజ్ఞాచక్రంలో సిద్ధమాతా స్వరూపమున (హాకినీ దేవతా స్వరూపమున) ఉండి సమస్త బ్రహ్మాండములను  తన ఆజ్ఞలతో శాసించు జగజ్జననికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి ఆజ్ఞాచక్రాబ్జ నిలయా అను  ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం ఆజ్ఞా చక్రాబ్జ నిలయాయై నమః అని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉచ్చరిస్తూ ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు  బ్రహ్మజ్ఞానసిద్ధిని పొంది జీవితంలో ఆధ్యాత్మికసామ్రాజ్యంలో మహోన్నత స్థానమును పొంది కీర్తిప్రతిష్ఠలను సాధించుచూ, ప్రశాంతచిత్తుడై ఆ పరాత్పరి పాదసేవలో తన్మయుడై తరించును.

కనుబొమ్మలయందు రెండు దళములు గల ఆజ్ఞాచక్రపద్మ మందలి కర్ణికా స్థానమునందు అధిష్ఠించిన దేవత, ఆజ్ఞాచక్రాబ్జ నిలయ అయిన సిద్ధమాతా స్వరూపిణియగు ఆ పరమేశ్వరి, ఈ రెండు దళముల యందు హ, క్ష అను బీజాక్షర స్వరూపిణిగా భాసిల్లుచున్నది ఆ పరమేశ్వరి. ఇక్కడే ఇడా, పింగళా, సుషుమ్మా నాడుల సంగమము గలదు. ఇదియే శివుని ఫాలాగ్ని నేత్రస్థానము. ఆజ్ఞాచక్రమే వివేక సూర్యోదయం జరుగబడే కేంద్రము. సర్వేంద్రియ నియామక స్థానము కావున ఆజ్ఞాచక్రమైనది. హాకిని అను యోగిని ఉన్నది ఇక్కడనే.
భ్రూమధ్యమునందు, రెండు కనుబొమల మధ్యలో తెల్లని రంగు కలిగి, కరముల యందు జ్ఞానముద్ర, ఢమరుకము, అక్షమాల, కపాలము ధరించి యుండి, హాకినీ యోగినియై (సిద్ధమాతా దేవిగా) మూడు నేత్రములతో ప్రజ్వలించునది, హంసవత్యాది శక్తులతో గూడినది, హరిద్రాన్నమపై ఇచ్ఛ గలిగినది, సర్వసుఖములను ప్రసాదించు యోగినీ దేవతయే ఈ హాకినీ దేవి (సిద్ధమాతా దేవి).  

భ్రూమధ్యే బిందుపద్మే దళయుగలసితే శుక్లవర్ణాం కరాబ్ జ్యైః

బిభ్రాణాం జ్ఞానముద్రాం ఢమరుక మమలామక్షమాలాం కపాలమ్

షట్చక్రాధారమధ్యాం త్రినయన లసితాం హంస  వత్యాదియుక్తామ్ 

హరిద్రాన్నైక చిత్తాం సకల శుభకరీం హాకినీం భావయామః

 ఆజ్ఞచక్రం - వైరాగ్యం - ఆజ్ఞ చక్రం జ్ఞానం పొందడానికి మూలం. సూక్ష్మపరిశీలనకు అది ఉన్నతమైన స్థాయి. ఎలాగైతే తెల్లని కాంతి మౌలికంగా సప్త వర్ణముల మిశ్రమమో, ఇది కూడా అంతే.  ఒకవేళ కాంతికి ఒకే ఒక రంగు ఉంటే – అంటే అది ఊదా రంగు అనుకుందాం – అది ఒక ప్రత్యేక ప్రయోజనానికే పనికి వస్తుంది, అయితే రంగు లేని కాంతి అన్నిటికీ పనికివస్తుంది. మనం సాధారణంగా దానిని తెలుపు రంగు అని అంటాము కానీ అసలైతే అది ఏ రంగూ లేనిది – దానిని చూడము. కాంతికి మూలాన్ని చూడగలము, ఇంకా కాంతిని పరావర్తనం చేసే వస్తువును చూడగలము, కాని ఆ కాంతిని మాత్రం చూడలేము. కాంతిని ఏదైనా ఆపినపుడు మాత్రమే దానిని చూడగలము. నిజానికి కాంతి రంగు లేనిది. ఈ వర్ణ రహితమైన కాంతిని సప్తవర్ణములుగా వక్రీభవనం చెందించవచ్చు. ఆజ్ఞచక్రం వర్ణ రహితమైనది. ఇందువలననే ఆజ్ఞా చక్రం వైరాగ్యానికి సంబంధించినది, వర్ణ రహితమైన స్థితి లేదా వర్ణాతీతమైనది, మనపై ఒక్క ఆనవాలు వదలకుండా ఏ రంగునైనా గ్రహించే అనుకూలత కలిగిస్తుంది. ఒకవేళ మనం ఎరుపు, నీలం లేదా పసుపు కాంతిని ప్రసరింపజేస్తే – ప్రతీది వైవిధ్యంగా కనిపిస్తుంది. రంగులేని కాంతి ప్రతీదానిని యథాతథంగా స్పష్టంగా చూసే అనుకూలత కలిగిస్తుంది. అదేవిధంగా మనము ఆజ్ఞ చక్రము చేరితే మనము ప్రతీదానిని యదాతథంగా స్పష్టంగా చూస్తాము.

 అంతః స్వేచ్ఛ - బాహ్యపరమైనవేవీ మనలో ఏమి జరుగుతోందో నిర్ణయించలేనప్పుడు, ఆజ్ఞాచక్రం ఇచ్చే స్వేచ్ఛా స్థాయి అద్బుతమైనది, ఇంకా మనలో మనకు ఆవశ్యకత అనిపించే విషయాల మీద మనము వెచ్చించే శక్తి చాలా అసాధారణంగా ఉంటుంది. బాహ్య విషయాలు  లెక్కలోనికి రావు, ఎందుకంటే  అవి ఎలా ఉన్నాయో అలాగే చూడడం జరుగుతుంది.

ఆజ్ఞ మరియు ఈషా - చుట్టూ వృత్తముతో ఉండే ఒక త్రికోణం ఈషా యోగా కేంద్రానికి గుర్తు – ఇది ఆజ్ఞ చక్రపు గుర్తు. మనం ఎవరినైనా కలిస్తే, ముందుగా వారికి చూపించేది మన ముఖం. సాధారణంగా జనం మనను ముఖం చూసే గుర్తుపడతారు. అంటే మన ముఖమే అంతా ప్రధానమని అర్థంకాదు – జీవితం సాగించేందుకు యదార్థంగా కావలిసినవన్నీ మనలోనే ఉన్నాయి.  ఈషా యోగా కేంద్రంలో అయినా అందరికీ ముందుగా మనం చూసేది ఆజ్ఞ చక్రమే, ఎందుకంటే ఇదే ఎక్కువగా ప్రపంచంలో అంగీకరించబడింది. ఆజ్ఞ చక్రంపై సాధన చేసే వాళ్లందరూ ఎల్లప్పుడూ గౌరవింపబడతారు.

అటువంటి హాకినీ దేవీ (సిద్ధమాతా దేవీ) స్వరూపిణి అయిన అమ్మవారికి నమస్కరించునపుడు ఓం ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

522వ నామ మంత్రము 24.11.2021

 ఓం శుక్లవర్ణాయై నమః

తెల్లని రంగులో ప్రకాశించు సిద్ధమాతా (హాకినీ దేవీ) స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్రనామావళిలోని శుక్లవర్ణా యను నాలుగక్షరముల (చతురక్షరి)   నామ మంత్రమును ఓం శుక్లవర్ణాయై నమః అని ఉచ్చరిస్తూ ఆ పరాత్పరిని సేవించు భక్తులకు అభీష్టములు సిద్ధించును.

హాకినీ దేవి (సిద్ధమాత), ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవత. హాకినీ దేవి తెల్లని కాంతి కలిగియున్నది. ఆజ్ఞాచక్రం వద్ద మిగతా క్రింది చక్రాలకు కావలసిన నియంత్రణ బీజాలు ఉండును. ఆజ్ఞాచక్రం సంపూర్ణముగా జ్ఞాన సంబంధమైనది. జ్ఞాన సంకేతమైన శుక్లవర్ణమునకు అర్థము తెలుపు రంగు.  తెలుపురంగు జ్ఞానమునకు సంకేతము. జ్ఞానస్వరూపిణియైన సరస్వతి తెలుపు వర్ణము. సరస్వతీదేవి ధరించిన వస్త్రము తెలుపురంగు, ఆ తల్లి వాహనమైన హంస తెలుపురంగు, ఆ విద్యాస్వరూపిణి ఆసనమైన పద్మము తెలుపురంగు. తెలుపురంగు అనేది జ్ఞానసంకేతం. అందుచే ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవతయగు సిద్ధమాతా దేవి (హాకినీ దేవి) శుక్లవర్ణంలో ఉంటుంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం తెలుపు పవిత్రత, శాంతి, స్వచ్ఛతకు సంకేతం. వివాహ సమయంలో వధూవరులు తెల్లని మధుపర్కములు ధరిస్తారు అంటే తెలుపు శుభప్రదం.

 అందుచేతనే ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవత యగు సిద్ధమాతా దేవీ (హాకినీ దేవీ) స్వరూపిణియైన పరమేశ్వరి శుక్లవర్ణా యని అనబడు అమ్మవారకి నమస్కరించునపుడు ఓం శుక్లవర్ణాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[05:22, 24/11/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

523వ నామ మంత్రము 24.11.2021

ఓం షడాననాయై నమః

ఆరుముఖములతో అలరారు ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవతయగు సిద్ధమాతా దేవీ (హాకినీ దేవీ) స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా  సహస్ర నామావళి యందలి షడాననా అను నాలుగక్షరముల (చతురక్షరి) నామ మంత్రమును ఓం షడాననాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవతయగు హాకినీ దేవీ స్వరూపిణియగు ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు ఆ అమ్మ కరుణతో ఐశ్వర్యాది సర్వ విభూతియుతులు అగుదురు. శాశ్వత బ్రహ్మానందభరితులై, దేవీ తత్త్వము వారి వదనంలో ప్రదర్శితమై, తాము తరించుచూ, ఇతరులనుకూడా తరింపజేయుదురు. 

సిద్ధమాతా దేవి (హాకినీ దేవి) ఆరు ముఖములతో అలరారుచున్నది. హాకినీ దేవీ (సిద్ధమాతా దేవీ) స్వరూపిణియైనటువంటి ఆ  శ్రీచక్రాధిష్ఠానదేవతయైన పరమేశ్వరి షడాననగా భక్తులను అనుగ్రహించుచున్నది. ఆరు వర్ణములు గలదని కూడా ఇక్కడ భావించవలయును. హాకినీ దేవి (సిద్ధమాతా దేవి) యొక్క ఆరు ముఖములు, ఆరు ముఖములవాడైన కుమారస్వామియొక్క ఆరు ముఖములతో సమన్వయించి, హాకినీ దేవిని కుమారశక్తిగా భావించవచ్చును.
 
గర్భస్థ శిశువునకు ఆజ్ఞా చక్రసంఖ్య ఆరు అనబడే ఆరుమాసములు వచ్చేసరికి పంచేంద్రియాలతో బాటు మనస్సుకూడా ఏర్పడుతుంది.
 
ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవతయగు సిద్ధమాతా దేవికి (హాకినీ దేవికి) ఆరుముఖములు ఉండుటచే, సిద్ధమాతా దేవీ (హాకినీ దేవీ) స్వరూపిణియైన పరమేశ్వరి షడాననా యని అనబడినది. ఆ పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం షడాననాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

524వ నామ మంత్రము 25.11.2031

ఓం మజ్జాసంస్థాయై నమః

సప్తధాతువులలో మజ్జ అనే ఎముకలకు సంబంధించిన ధాతువునకు అధిదేవతయై విలసిల్లునదియు, ఆజ్ఞాచక్రాధిష్ఠానదేవత యగు సిద్ధమాతా దేవీ (హాకినీ దేవీ) స్వరూపిణిగా భాసిల్లు తల్లికి నమస్కారము.

శ్రీ లలితా సహస్రనామావళి యందలి మజ్జాసంస్థా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మజ్జాసంస్థాయై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ జగజ్జననిని ఉపాసన చేయు సాధకులకు ధాతుపుష్టి కలిగి, అఖిలాండేశ్వరీ పాదసేవాతత్పరులై, బ్రహ్మజ్ఞాన సంపన్నులై తరించుదురు.

సిద్ధమాత (హాకినీ దేవి) యను దేవత మజ్జయను ధాతువునందు అధిష్ఠానముగా నున్నదని ఈ నామమంత్రభావన. ఎముకలలో ఉండే క్రొవ్వు పదార్థమును మజ్జా అని అందురు. ఈ మజ్జ బ్రతికియున్నవారి ఎముకలలోనే ఉంటుంది. ఈ ధాతువు నిర్జీవమైన ఎముకలలో ఉండదని భావము. ఆ పరాశక్తి ఈ ధాతువునందు వశించి మనలను ఆరోగ్యపుష్టితో కాపాడునని ఈ నామ మంత్ర సారము.

ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవతయగు సిద్ధమాతా (హాకినీ దేవీ) స్వరూపిణియైన అమ్మవారికి నమస్కరించునపుడు ఓం మజ్జాసంస్థాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

525వ నామ మంత్రము 25.11.2021

ఓం హంసవతీ ముఖ్య శక్తి సమన్వితాయై నమః

హంసవతి, క్షమావతి అనే యోగినీ దేవతలతో కూడి ఉన్న ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవతయగు సిద్ధమాతా (హాకినీ దేవీ) స్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము. 

శ్రీలలితా సహస్రనామావళియందలి హంసవతీముఖ్యశక్తిసమన్వితా అను పండ్రెండు అక్షరముల  (ద్వాదశాక్షరీ) నామ మంత్రమును ఓం హంసవతీముఖ్యశక్తి సమన్వితాయై నమః అని ఉచ్చరిస్తూ ఆ జగజ్జననిని ఉపాసించు ఉపాసకులు ప్రశాంతచిత్తులై, అఖండమైన బ్రహ్మజ్ఞాన సంపన్నులై ఆధ్యాత్మికతకు ప్రతిరూపులై నిత్యమూ ఆ సర్వేశ్వరి పాదసేవనాతత్పరులై జీవించి తరించుదురు. 

హంస శక్తితో బాటు ముఖ్యమైన శక్తులతో కూడియుండు ఈ సిద్ధమాత (హాకినీ దేవి) అను దేవత రెండు దళములతో ఉండును. హ,క్ష అక్షరములుగల బీజములు పద్మముయొక్క రెండవ దళమునందే ఉండును. వాటియందు హంసవతీ, క్షమావతీ అను ముఖ్య శక్తి దేవతలుంటారు. అన్ని చక్రాలలో ఆజ్ఞాచక్రం అతి ముఖ్యమైనది. ఈ పద్మం యొక్క రెండు దళములయందు ఉచ్ఛ్వాస, నిశ్వాసలు కలిగే కారణమైన కేంద్రాలు, నియంత్రణ చేయు హ, క్ష యను బీజములు ఉండును. వీటికి సంబంధించిన దేవతలే హంసవతి, క్షమావతి. ఈ ఆజ్ఞాచక్రం మనస్సునకు సంబంధం గలది. మనస్సు వాయుతత్త్వం కావున వాయువునకు సంబంధం ఉన్నది. మనస్సుకు శ్వాసకు ఉండే అనుసంధానము ఆజ్ఞాచక్రము వద్దనే ఉంటుంది. కొన్ని విపరీత ప్రమాద పరిస్థితులలో ఈ దేవత తెలివికీ, శ్వాసకూ మధ్యయుండే శక్తిని లేకుండా చేస్తుంది.  విద్యుదాఘాతమే ఇందుకు ఒక ఉదాహరణ. ప్రథమము తెలివి పనిచెయ్యకుండా ఉండి శ్వాస మాత్రమే ఉంటుంది. శ్వాస జరుగుతూనే ఉంటుంది.  క్రమేపి కొంత సమయమునకు తెలివి వస్తుంది. 

కావున ప్రాణాధారమునకు, శ్వాసకు సంబంధించిన శక్తులగుటచేత హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా యని అనబడు అమ్మవారికి నమస్కరించునపుడు ఓం హంసవతీ ముఖ్యశక్తి సమన్వితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[05:35, 26/11/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

526వ నామ మంత్రము 26.11.2021

ఓం హరిద్రాన్నైక రసికాయై నమః 

పసుపుతో కూడిన అన్నము (చిత్రాన్నము) అనిన మక్కువ కలిగిన ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవతయగు సిద్ధమాతా (హాకినీ దేవీ) స్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్రనామావళి యందలి హరిద్రాన్నైకరసికా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం హరిద్రాన్నైక రసికాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగజ్జననిని భక్తిప్రపత్తులతో ఉపాసించు భక్తులను ఆ తల్లి కరుణించి వారిని అష్టైశ్వర్యములతో, సుఖసంతోషాలతో, బ్రహ్మజ్ఞాన సంపన్నతతో విలసిల్లేలాచేసి, ఆతల్లి పదసేవా తత్పరతతో తరించువారిగా అనుగ్రహించును.

హరిద్రాన్నము  అనగా పసుపుతోకూడిన అన్నము. ఇది సాధారణముగా నిమ్మరసము లేదా దబ్బరసము, లేదా చింతపండు పులుసుతో కలిపిన అన్నమునందు అల్లము, కరివేపాకు, పచ్చిమిరప కాయలు వేసి, ఎండుమిరప కాయలు, శనగపప్పు, మినపపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ మొదలగు వానితో పోపు వేసి, ఆపైన నువ్వులపొడి కలిపిన చిత్రాన్నము (పులిహోర) అనబడే హరిద్రాన్నమనిన అత్యంత ప్రీతిగలిగినది ఆ ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవతయగు సిద్ధమాత (హాకినీదేవి). 

మరీచీ రజనీ చూర్ణైః జీరకాద్యైశ్చ సంయుతమ్|

ఆజ్యై సంప్లుతహవిర్హరిద్రాన్న మతీరితమ్.  

అనగా మిరియాలు పసుపు చూర్ణం తో జీలకర్ర మొదలైనవి  నేతితో కలిపిన హరిద్రాన్నము  హవిస్సుగా శ్రేష్ఠమని కూడా చెప్పబడినది. 

అన్నప్రాశన అయిన శిశువు పాలు, నేతి అన్నం, తీపి అన్నం, పెరుగన్నం, పప్పు అన్నం తర్వాత పసుపుతోకూడిన ఈ పుల్లపుల్లగా, జిహ్వకు రుచిగా ఉండే ఈ పచ్చని అన్నం రుచికి అలవాటు పడతారని ఈ నామ మంత్రములోని అంతరార్థము.

హరిద్రాన్నము అన్నము అనిన ప్రీతి గలిగినదియగు ఆజ్ఞాచక్రాధిష్ఠాన  దేవతయైన సిద్ధమాతా (హాకినీ దేవీ) స్వరూపిణియగు లలితాంబ హరిద్రాన్నైక రసికా యని అనబడినది. అటువంటి సర్వేశ్వరికి నమస్కరించు నపుడు ఓం హరిద్రాన్నైక రసికాయై   నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌸💐💐💐
[05:35, 26/11/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

527వ నామ మంత్రము 26.11.2021

ఓం హాకినీ రూప ధారిణ్యై నమః

ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవతయైన సిద్ధమాతా (హాకినీ దేవీ) స్వరూపిణిగా  దర్శనమిచ్చే పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ)  హాకినీరూపధారిణీ  యను నామ మంత్రమును ఓం హాకినీ రూపధారిణ్యై నమః అని ఉచ్చరిస్తూ,  ఆ ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవతయైన సిద్ధమాతా (హాకినీ దేవీ) స్వరూపిణియగు పరమేశ్వరిని ఉపాసించు ఉపాసకులకు జగత్తంతయు ఆ పరమేశ్వరి ఆజ్ఞకు లోబడినదనియు, ఆ తల్లి నామ మంత్ర ఉచ్చారణమే బ్రహ్మజ్ఞానపదమునకు మార్గమని గ్రహించి ఆ పరాశక్తిని ధ్యానించి విశేషమైన బ్రహ్మజ్ఞాన సంపదలను పొంది తరించుదురు.

జగన్మాత ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవతయగు సిద్ధమాత, (హాకిని దేవీ) స్వరూపిణిగా విరాజిల్లుచున్నది. అటువంటి హాకినీ రూపధారిణియైన శ్రీమాతకు నమస్కారములు.

శ్రీచక్రాధిష్ఠాన దేవతకు అనుగుణమైన బీజ, కీలక, న్యాస మంత్రములన్ని హ యగునని గమనించగలమని ఇంతకు ముందు  చెప్పుకున్న ఆజ్ఞాచక్రాబ్జనిలయా అను  (521వ) నామ మంత్రము నుండి హాకినీరూపధారిణీ అను ఈ (527వ) నామ మంత్రమువరకు సిద్ధమాతా (హాకినీ దేవీ) స్వరూపిణియైన పరమేశ్వరియొక్క విశేణములు చెప్పబడినవి.

భ్రూమధ్యే బిందుపద్మే దళయుగలసితే శుక్లవర్ణాం కరాబ్-జ్యైః

బిభ్రాణం జ్ఞానముద్రాం ఢమరుక మమలామక్షమాలాం కపాలమ్

షట్చక్రాధారమధ్యాం త్రినయనలసితాం హంస వత్యాదియుక్తామ్

హరిద్రాన్నైక చిత్తాం శుభకరీం హాకినీం భావయామః

భావము

భ్రూమధ్యమున గల రెండుదళముల పద్మమందు సిద్ధమాత యను హాకిని యను యోగినీ దేవత నాలుగుచేతులందు జ్ఞానముద్ర, డమరుకము, అక్షమాల, కపాలములతో విలసిల్లుచున్నది.  మూడుకన్నులు గలిగిన ఆ యోగినీ దేవతకు హరిద్రాన్నము అనిన ప్రీతి.

శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరిలోని ముప్పది ఆరవ శ్లోకంలో ఆజ్ఞాచక్రమును వివరించిన విధము ఇలా ఉన్నది:

తవాఙ్ఞచక్రస్థం - తపన శశికోటి ద్యుతిధరం

పరం శంభు వందే -  పరిమిలితపార్శ్వం పరచితా |

యమారాధ్యన్ భక్త్యా - రవి శశిశుచీనామవిషయే

నిరాలోకే ‌உలోకే నివ - సతి హి భాలోకభువనే || 36 ||

ఆజ్ఞా చక్రమునందున్న పరమ శివునికి నమస్కారము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - పరశంభునాధుడు, పరచిదంబలు.
 
అమ్మా! పరమేశ్వరీ! ఎవరిని భక్తితో ఆరాధించుటవలన సూర్య, చంద్ర, అగ్నులకు సైతం అగోచరమై చూడశక్యము కాకుండా ఉన్నదియు, ఇతర జనరహితమైనదియు, చంద్రికామయమై ప్రకాశించునదియు అగు సహస్రారచక్రంలో నీ సాయుజ్యాన్ని పొందిఉన్నాడో అతనిని, ఆ ప్రసిద్ధుని, ఆజ్ఞాచక్రమందున్న కోటి సూర్యచంద్రుల కాంతిని ధరించిన వానిని, ఇరు ప్రక్కలయందు జ్ఞానముచేత ఆవరింపబడి ఉన్నవాడగు ఆ పరాత్పరుడైన శంభునికి నమస్కరించుచున్నాను.

అమ్మా! జగన్మాతా! నీ ఆజ్ఞాచక్రంలో విరాజిల్లుతూ కోటిసూర్య
చంద్రుల తేజంతో భాసిల్లే పరమశివ మూర్తిని ధ్యానిస్తున్నాను. ఆరాధించేవారు సూర్యచంద్రాగ్నుల
ప్రకాశానికి అతీతమైన లోకంలో నివశిస్తారు. ఆ పరమ శివదేవుడు సూర్య చంద్రాగ్ని ప్రకాశాలను
అధిగమించిన మహత్తర తేజంతో భాసిల్లుతుంటాడు.
అక్కడ విఘ్నబాధలేవీ వుండవు.
ఎవరిని భక్తితో ఆరాధించడంవలన సూర్యచంద్రాగ్నులకు అతీతమైనది, చూడబోతే ఏమీ లేనిది, చూడటానికి యితర జనరహితమైనదీ అయి ప్రకాశించే సహస్రార చక్రంలోని జీవుడు అట్టి పరాత్పరునికీ సూర్యచంద్రుల్లాగా ప్రకాశించే నీ ఆజ్ఞాచక్రంలో  (పరాకారజ్ఞానంతో) యిరు పార్శ్వాలనూ ఆక్రమించి వున్న ఆ పరాత్పరునకు, జగన్మాతవైన నీకు నమస్కరిస్తున్నాను.

ఆజ్ఞాచక్రాధిష్ఠానదేవతయగు సిద్ధమాతా (హాకినీదేవీ) స్వరూపిణియైన అమ్మవారికి నమస్కరించునపుడు ఓం హాకినీ రూపధారిణ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[05:22, 27/11/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

528వ నామ మంత్రము 27.11.2021

ఓం సహస్రదళ పద్మస్థాయై నమః

బ్రహ్మరంధ్రంలోని సహస్రదళ పద్మమందు యశస్వినీ దేవీ (యాకినీ దేవీ) రూపధారిణియై విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సహస్రదళ పద్మస్థా అను  ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును  ఓం సహస్రదళ పద్మస్థాయై నమః అని ఉచ్చరిస్తూ, ఆ యశస్వినీ (యాకినీ దేవీ) స్వరూపిణియై తేజరిల్లు ఆ జగజ్ఞననిని ఉపాసించు భక్తులను ఆ తల్లి అన్ని ఆపదల నుండి రక్షించి, ఐహిక, ఆధ్యాత్మికాది  శుభాలను అన్నింటినీ అనుగ్రహిస్తుంది.

శిరస్సు పై మధ్యభాగమున సహస్రార కమలము ఉన్నది. సహస్రదళ పద్మమునకు ఎనిమిది దిశలయందును ఎనిమిది దళములుండును. ఈ ఎనిమిది దళములకు (ఒక్కొక్క దళమునకు నూట ఇరువది యైదు చిన్న దళముల చొప్పున మొత్తం) వేయి దళములుండును. గనుకనే ఈ పద్మమును సహస్రదళ పద్మమనియు,  సహస్రార చక్రమనియు అంటారు. ఈ సహస్రార చక్రమునకు యశస్వినీ దేవి అను ఒక యోగినీ దేవత అధిష్ఠాన దేవతగా భాసిల్లుచున్నది. యశస్వినీ దేవతా మంత్రము యొక్క బీజము, శక్తి, కీలకములు య కారయుతముగా ఉండుటచే ఈ యశస్వినీదేవి యాకినీ దేవి అని కూడా అనబడుచున్నది.

ఈ యాకినీ దేవిని ఈ విధముగా ధ్యానించుట గలదు -

ముండవ్యోమస్థపద్మే దశశతదళకే కర్ణికా చంద్ర సంస్థామ్|

రేతోనిష్ఠాం సమస్తాయుధకలితకరాం సర్వతోవక్త్ర పద్మామ్|

ఆదిక్షాంతర్ణశక్తి ప్రకటపరివృతాం సర్వవర్ణాం భవానీమ్|

సర్వాన్నాసక్తచిత్తాం పరశివరసికాం యాకినీం భావయామః॥

 "శిరస్సునందలి బ్రహ్మ రంధ్రమునందు వేయిరేకుల పద్మమందలి కర్ణిక యనెడు చంద్రమండలమునందు విలసిల్లునదియు, శుక్లధాతువునందు ఉండునదియు, అన్ని ఆయుధములు కలిగినదియు, అన్నివైపులకు ముఖములు ఉన్నదియు, అ కారము మొదలు క్ష కారము వరకు గల అక్షర యోగినీ శక్తులతో పరివేష్ఠింపబడినదియు, సర్వవర్ణములతో శోభిల్లునదియు, సర్వౌదనమలందు (అన్ని అన్నములందు) ప్రీతి గలిగినదియు, భవానీయని అనబడినదియు (భవుని భార్యయైనదియు), పరమశివునితో అభేదమునందినదియు అయిన యాకినీ దేవికి నమస్కరిస్తున్నాను"

ఈ సహస్రార కమల (చక్ర) స్థానము పరమ పవిత్రమైన శివశక్తుల నిలయము, అందు పరాశక్తి పరబ్రహ్మస్వరూపిణి. సాధకుడు ఈ సహస్రారమునకు చేరగలిగిన భాగ్యవంతుడైతే  అదియే ఆత్మసాక్షాత్కారము. ఈ స్థితియందు సాధకుడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడై, జగత్సర్వమూ శక్తి మయముగా భావిస్తాడు.

సహస్రదళ పద్మమందు యశస్వినీ (యాకినీ దేవీ) స్వరూపిణియై విలసిల్లుచున్నది గనుక ఆ పరమేశ్వరి సహస్రదళపద్మస్థా యని అనబడినది. 

అటువంటి శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం సహస్రదళ పద్మస్థాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[05:22, 27/11/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

529వ నామ మంత్రము 27.11.2021

ఓం సర్వవర్ణోపశోభితాయై నమః

రక్తము, పీతము, శ్యామలము, పాటలము మొదలైన వర్ణములతో శోభిల్లు సహస్రారపద్మస్థయైన యశస్వినీ (యాకినీ దేవీ) స్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.

అ కారాది, క్ష కారాంత సర్వవర్ణములతో శోభిల్లు సహస్రారపద్మస్థయైన యశస్వినీ (యాకినీ దేవీ) స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి  సర్వవర్ణోపశోభితా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) నామ మంత్రమును ఓం సర్వవర్ణోపశోభితాయై నమః అని ఉచ్చరిస్తూ ఆ జగదీశ్వరిని భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకులు పరాశక్తి కరుణచే తాపస నియమము, జ్ఞానసంపదను పొందగలరు మరియు గురు సన్నిధిని తీవ్ర సాధనచేసి కుండలినీ జాగృతితో ఆత్మానుభూతిని పొంది తరింపగలరు.

 అన్నిరంగులు, ధ్వనులు, అక్షరములతో ఆ పరాశక్తి శోభిల్లుచుండుట యనునది ఈ నామ మంత్రములోని  అంతర్భావము. సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతీ. యశస్వినీ రూపిణి అయిన పరమేశ్వరికి సహస్రార కమలమునందుగల దళములు అనంతమై ఉన్నవి. అటువంటి అనంతమైన దళములయందు విశ్వములో ఉండు అన్ని రంగులు, అన్ని ధ్వనులు, వాఙ్మయమగు అన్ని అక్షరములకు వలసిన బీజములు ఉండును, గాన, పరాశక్తి సర్వవర్ణోపశోభితా అను నామముచే ప్రసిద్ధిబడసినది.

ఇంతవరకును షట్చక్రములందు విలసిల్లు దేవతలను ఇలా చెప్పుకున్నాము.

1. విశుద్ధి చక్రము - పదహారు దళముల ఈ పద్మమునందు పదహారు దళములందు అ నుండి అః వరకు గల అక్షరసంయుతమైన అమృతాది మహాశక్తులు (యోగినీ దేవతలు) గలరు.

2. అనాహత చక్రము - పండ్రెండు దళముల ఈ పద్మమునందు పండ్రెండు దళములందు క నుండి ఠ వరకు గల అక్షరసంయుతమైన కాళరాత్రి మొదలైన పండ్రెండు మంది యోగినీ శక్తులు గలరు.

3. మణిపూర చక్రము - పది దళముల ఈ పద్మమునందు పది దళములందు డ నుండి ఫ వరకు గల అక్షరసంయుతమైన డామరి మొదలైన పదిమంది యోగినీ శక్తులు గలరు.

4. స్వాధిష్ఠాన చక్రము - ఆరు దళముల ఈ పద్మమునందు ఆరు దళములందు బ నుండి ల వరకు గల అక్షరసంయుతమైన బందిని మొదలైన ఆరుగురు యోగినీ శక్తులు గలరు.

5. మూలాధార చక్రము - నాలుగు దళముల ఈ పద్మమునందు నాలుగు దళములందు వ నుండి స వరకు గల అక్షరసంయుతమైన వరద మొదలైన నలుగురు యోగినీ శక్తులు గలరు.

6. ఆజ్ఞా చక్రము - రెండు దళముల ఈ పద్మమునందు రెండు దళములందు హ మరియు క్ష  అక్షరములు గల హంసవతి, క్షమావతి యను ఇరువురు యోగినీ శక్తులు గలరు.

షట్చక్రములందు, ఆయా పద్మములకు తగినవిధమగా యోగినీ గణములు (పదహారు, పండ్రెండు, పది, ఆరు, నాలుగు, రెండు) మొత్తము ఏబది మంది విరాజిల్లుచున్నారని చెప్పబడినది.

ఈ విధముగా 

1. విశుద్ధి చక్రము - పదహారుదళముల పద్మము, మహేశ్వరుడు అధిపతి, డాకినీ దేవి దేవత, అ నుండి అః వరకు అక్షరములు, తత్త్వము ఆకాశ తత్త్వము.

2. అనాహత చక్రము - పండ్రెండు దళముల పద్మము, రుద్రుడు అధిపతి, రాకినీ దేవి దేవత, క నుండి ఠ వరకు అక్షరములు, తత్త్వము వాయు తత్త్వము.

3. మణిపూర చక్రము - పది దళముల పద్మము, విష్ణువు అధిపతి, లాకినీ దేవి దేవత, డ నుండి ఫ వరకు అక్షరములు, తత్త్వము జల తత్త్వము.

4. స్వాధిష్ఠాన చక్రము - ఆరు దళముల పద్మము, బ్రహ్మ అధిపతి, కాకినీ దేవి దేవత, బ నుండి ల వరకు అక్షరములు, తత్త్వము అగ్ని తత్త్వము.

5. మూలాధార చక్రము - ఆరు దళముల పద్మము, గణపతి అధిపతి, సాకినీ దేవి దేవత, వ నుండి స వరకు అక్షరములు, తత్త్వము భూమి తత్త్వము.

6. ఆజ్ఞా చక్రము - రెండు దళముల పద్మము, సదాశివుడు అధిపతి, హాకినీ దేవి దేవత, హ, క్ష అను  అక్షరములు, తత్త్వము మనస్సు.

7. సహస్రారము - వేయి దళముల పద్మము, పరమేశ్వరుడు అధిపతి, యాకినీ దేవి దేవత, సర్వ వర్ణములు (అన్ని అక్షరములు),  ఆత్మ (పరమాత్మ).

మూలాధార చక్రంతో ప్రారంభించి సహస్రారంతో చెప్పవలసిన వివరణ విశుద్ధి, అనాహత, మణిపూర, స్వాధిష్ఠాన, మూలాధార, ఆజ్ఞాచక్ర, సహస్రార క్రమంలో చెప్పుటకు గల కారణము,  ఆయా పద్మములందలి దళముల సంఖ్య, ఆయా దళములందలి అ కారము నుండి క్ష కారము వరకూ గల అక్షరసంయుతమైన నామములుగల యోగినీ గణముల ననుసరించి వివరణనిచ్చుట జరిగినది. ఇది భాస్కరరాయలువారు ఇచ్చిన వివరణను అనుసరించడమైనది. 

సర్వవర్ణోపశోభితా అనగా ఇంతకు ముందు చెప్పిన ఏబది అక్షరములే సర్వవర్ణములు. ఆ సర్వవర్ణములు సహస్రదళ పద్మమునందు ఏవిధముగా యోగినీ గణములై విలసిల్లుచున్నవో భాస్కరరాయలు వారు చెప్పినదే మరింత అర్థమగునట్లు ఇచ్చట వివరించుట జరిగినది. అది ఏవిధముగా అనిన:

అక్షరములు ఏబది. అ నుండి క్ష వరకు ఏబది, మరల క్ష నుండి అ వరకు ఏబది. మొత్తము వంద. ఉన్నవి వేయిదళములు. ఈ వందమంది దేవతలు వేయిదళములందు ఉండుటకు పది పర్యాయములు ఈ  వందమంది యోగినీ గణములుగా ఆవృత్తి చేయబడినది. ఆ విధముగా యాకినీ దేవి అను యశస్వినీ దేవి ఆ వందమంది దేవతలచే ఆవృత్తి చేయబడినది గనుకను, పరమేశ్వరి యాకినీ స్వరూపిణి  (యశస్వినీ స్వరూపిణి) యైనది గనుకను, శ్రీమాత సర్వవర్ణోపశోభితా యని అనబడిన అమ్మవారికి నమస్కరంచునపుడు ఓం సర్వ వర్ణోప శోభితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

530వ నామ మంత్రము 28.11.2021

ఓం సర్వాయుధ ధరాయై నమః

ఆయుధములను అన్నింటిని ధరించి యున్న సహస్రదళపద్మస్థ అయిన యశస్వినీ (యాకినీ దేవి) స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము. 

శ్రీలలితా సహస్రనామావళిలోని సర్యాయుధధరా అను ఆరుఅక్షరముల (షష్టాక్షరి) నామ మంత్రమును ఓం సర్వాయుధ ధరాయై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు ఉపాసకులకు ఆ పరమేశ్వరి మహిషాసురాది దుష్టరాక్షులనే గాక అంతకన్నా భయంకరమైన మనిషిలోని అంతర్గతశత్రువులైన (అరిషడ్వర్గములు - కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు) నశింపజేసి బ్రహ్మపదమును చూపించి, బ్రహ్మజ్ఞాన సంపన్నులను జేసి తరింపజేయుటకు సర్వాయుధములను ధరించి యున్న ఆ శక్తి రూపిణి అయిన జగజ్జనని వచ్చి కనులముందు దర్శనమయిన భావము కలుగును.

అరిషడ్వర్గాలు అంటే, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అనే ఆరింటిని కలిపి అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనషిని ఎంతటి క్రింది స్థాయికైన దిగాజారుస్తాయి. మనిషి పతనానికి మరియు ప్రకృతి వినాశనానికి కూడా ముఖ్య కారణం ఈ అరిషడ్వర్గములే. ఈ అరిషడ్వర్గాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్ధం మరియు సంకుచిత భావాలే ఎక్కువగా కలిగి ఉంటాయి. దుఃఖానికి ఇవి మొదటి హేతువులు. ఈ అరిషడ్వర్గాల గురించి వివరంగా తెలుసుకుందాం.

1.కామము – కామము అంటే కోరిక. ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండడము;  

2. క్రోధము – క్రోధము అంటే కోపము. ఇది కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉద్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము. 

3. లోభము – లోభము అంటే కోరికతో తాను సంపాదించు కున్నది, పొందినది తనకే కావాలని పూచిక పుల్ల కూడా అందులోనుండి ఇతరులకు చెంద గూడదని దానములు, ధర్మ కార్యములు చేయకపోవడము.

4. మోహము - తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడము.

5. మదము – మదము అంటే అహంకారం. ఇది తాను కోరిన కోరికలన్ని తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరియెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయక పోవడము.

6. మాత్సర్యము - తను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి యుండడము. అరిషడ్వర్గాలను అంటే ఏమిటో తెలుసుకున్నాము. వీటిని మనం అదుపులో ఉంచితేనే మనం అనుకున్న స్థాయికి చేరుతాము లేకపోతే వీటి బారిన పడి మనం పతనం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వీటిని జయించాలి (లేక అదుపులో ఉంచడం) అంటే ముఖ్యమైన ఆయుధం పరమేశ్వరి అనుగ్రహించు సత్యమైన దివ్యమైన జ్ఞానం మాత్రమే. ఆ జగజ్జనని అనుగ్రహం  ఎపుడు పొందుతామో (తెలుసుకుంటామో), అప్పుడు అరిషడ్వర్గాలు అన్నియు సమస్తము మన మనసు నుండి సర్వం నశించిపోతాయి. 

అరిషడ్వర్గములనన్నింటిని అంతరింపజేయడానికి అన్ని ఆయుధములను ధరించియుండునది ఆ యశస్వినీ (యాకినీ దేవీ) స్వరూపిణియైన సహస్రదళకమలాధిష్ఠాన దేవత అయిన పరమేశ్వరి అన్ని రకములైన ఆయుధములు తన వేయి చేతులందు ధరించి ఉంటుంది.

సహస్రాణి సహస్రధా బాహ్వోస్తవ హేతయః (రుద్రనమకం).

ఈ మంత్రాన్ని సమన్వయ పరచుకుంటే  యశస్వినీ దేవతకు (యాకినీ యోగినికి) లెక్కలేనన్ని హస్తములుంటాయి.

ఆ హస్తములలో అనేక రకములైన అస్త్రములు ధరిస్తుంది అని భావించవలయును.

యశస్వినీ (యాకినీ యోగినీ) స్వరూపిణియైన అమ్మవారికి నమస్కరించు నపుడు ఓం సర్వాయుధ ధరాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[05:59, 28/11/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

531వ నామ మంత్రము 28.11.2021

ఓం శుక్ల సంస్థితాయై నమః

శుక్ల  ధాతువునందు అధిష్ఠాన దేవతగా విరాజిల్లు యశస్వినీ (యాకినీ దేవీ) స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీ లలితా సహస్ర నామావళి యందలి శుక్ల సంస్థితా అను ఐదు అక్షరముల (పంచాక్షరి) నామ మంత్రముసు ఓం శుక్ల సంస్థితాయై నమః అని ఉచ్చరిస్తూ ఆ పరమేశ్వరిని అచంచలమైన భక్తివిశ్వాసములతో ఆరాధించు భక్తులు ఆ జగజ్జనని కరుణతో మాయా విలాసంలో చిక్కుకొనక, బ్రహ్మజ్ఞాన పదమునందు ముందుకు సాగి శాశ్వత బ్రహ్మానందమునంది తరించుదురు. శుక్ల ధాతువును చక్కగా ఆశ్రయించి ఉండు యశస్వినియను సహస్రార కమలాధిష్ఠాన దేవతా స్వరూపిణియై పరమేశ్వరి తేజరిల్లు చున్నది. శుక్లం అనునది జీవియొక్క సారము, అందుకే దీని సారాంశము సప్తధాతువులలో ఆఖరున తెలుపడమైనది. అన్నిటి కంటే విలువైన ధాతువు, దీనికంటే విలువైన ధాతువు, దీనిని మించినది వేరొకటి లేదని తెలియవలయును. ఈ శుక్లధాతువు సర్వ శరీరమున వ్యాపించియుండు ఓజస్సు అను ధాతువునకు అధిష్ఠానముగా ఉన్నది. ఈ శుక్ల బిండువులో రాబోయే జీవియొక్క అన్ని లక్షణాలు, రూప, గుణ విశేషములు సూక్ష్మరూపముగా దీనిలోనే ఇమిడి ఉంటాయి. కావున సర్వవర్ణోపశోభితా అనే నామము యొక్క లక్షణాలన్నీ శుక్లసంస్థితా అనబడే నామం ధ్రువ పరుస్తుంది. శుక్ల శబ్దము వలన కలుగు వివరాలు శోణిత పదమునకు కూడ వర్తిస్తుందని భావించవలయును.

శుక్లధాతువునందు విలసిల్లు యశస్వినీ (యాకినీ దేవీ) స్వరూపిణియై తేజరిల్లు ఆ జగదాంబకు నమస్కరించునపుడు ఓం శుక్ల సంస్థితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[05:42, 30/11/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

532వ నామ మంత్రము 30.11.2021

ఓం సర్వతోముఖ్యై నమః 

అన్నివైపుల ముఖములు కలిగి, అన్ని దిక్కులను చూచునదైన సహస్రదళపద్మస్థయగు యశస్వినీ (యాకినీ దేవీ) స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వతోముఖీ అను ఐదక్షరముల (పంచాక్షరి) నామ మంత్రమును ఓం సర్వతో ముఖ్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాత్పరిని అచంచలమైన భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి దయతో అజ్ఞాన నివృత్తియు తద్ద్వారా ఆత్మనుభూతియు అనుగ్రహించును. 

సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష స్సహస్రపాత్ అన్నది శ్రుతి వాక్యము. సహస్రార పద్మమునందలి దళముల యందు అధివసించు అమృతాది పరివార దేవతలు మరియు విశ్వమునందు అనంత జీవరాశులును తానేయగుటచేత, ఆ పరాశక్తి సర్వతోముఖీ అను నామముతో ప్రసిద్ధినంది యున్నది. జగత్తులోని సర్వప్రాణుల ముఖములు జగన్మాత ముఖములుగాను, అన్ని ప్రాణుల కన్నులు, పాదాలు, చేతులు, శిరస్సులు, ముఖములు అన్నియు అమ్మవిగానే సమన్వయం చేసుకొనే భావములో అమ్మను దర్శించాలి. ప్రపంచములోని అనంత జీవరాసులు శ్రీమాత రూపముగనే భావించవలెను. గర్భస్థమగా పిండమునందు ఏడవ మాసమున జీవుడు పిండములోనికి  ప్రవేశిస్తాడు. గృహ యజమాని ఇల్లు నిర్మాణము అయిన పిదప గృహప్రవేశం చేసినట్లు ఈ స్థితియందు గర్భస్థ పిండములోనికి జీవుని ప్రవేశము కలుగుతుంది. సర్వ జ్ఞాన సముపార్జనకు అక్కరకు వచ్చే బీజములన్నియు మానవునికి (జీవునికి) లభించుతాయి. 

అమ్మవారు బ్రహ్మాత్మైక్య స్వరూపిణి సకల జగత్తు బ్రహ్మమనందే ఉద్భవించి, వృద్ధి చెంది, లయమగుచున్నది. ఆ తల్లి లీలాక్లుప్త బ్రహ్మాండ మండల క్రీడా మాత్రముగనే బ్రహ్మాండాలను సృజిస్తుంది. అనంతకోటి జీవరాశలు తన రూపమై, అనంతకోటి జీవరాశుల శిరస్సులు, ముఖములు తనవై, తానొక విశ్వరూపిణియై, జగత్తునందలి జీవరాశికి ప్రతీకగా నిలుస్తూ, తనకున్న అన్ని ముఖములతో అన్నివైపులా చూచుచూ సర్వతోముఖి గా విలసిల్లు ఆ పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం సర్వతోముఖ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

[05:42, 30/11/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

533వ నామ మంత్రము 30.11.2021

ఓం సర్వౌదన ప్రీత చిత్తాయై నమః. 

అన్ని రకముల అన్నముపై ప్రీతిని కలగియున్న  యశస్వినీ యాకినీ దేవీ) స్వరూపిణియైన లలితాంబికకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వౌదన ప్రీత చిత్తా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) నామ మంత్రమును ఓం సర్వౌదన ప్రీత చిత్తాయై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరాశక్తిని అర్చించు భక్తులను ఆ తల్లి కరుణచే అన్నవస్త్రములకు లోటులేక, సకల ఐశ్వర్య సంపన్నతతో, బ్రహ్మజ్ఞాన సంపదతో విలసిల్లుచూ, అచంచలమైన ఆ తల్లియొక్క పాదసేవనాతత్పరతతో తరింపజేయును. 

సహస్రార కమలాధిష్ఠాన దేవతయైన
యశస్వినీ (యాకినీ దేవీ) స్వరూపిణియగు పరమేశ్వరి అన్నిరకముల ఆహారములు ప్రీతిగా స్వీకరించును. అన్నము పరబ్రహ్మ స్వరూపము యగుటచే తాను భోక్త యొక్క స్వరూపముగా ఉండును. ఆహారము జీవుని శరీరాభివృద్ధికి తోడ్పడుచున్నది. అందుచేతనే అన్నం న నింద్యా, అన్నం న పరిరక్షత అను శ్రుతి వాక్యము ప్రకారము అన్నము పారవేయకూడదు మరియు దొంగిలించకూడదు. ధాన్యమును సమృద్ధిగా పండించవలయును. అన్నం పరబ్రహ్మస్వరూపము. శరీర పోషణాదులకు అవసరమైనది అన్నము. ఆ తల్లి సర్వౌదనప్రీతచిత్తా యని అనబడినది గనుక వివిధ రకములైన ఆహారములు పరమ భక్తితో అమ్మవారికి సమర్పించినచో ఆనందముతో స్వీకరించుతుంది. శ్రీకృష్ణపరమాత్మ భక్తితో విదురుని ధర్మపత్ని సమర్పించిన అరటి తొక్కలు సహితము ఆరగించాడు. ఆ యదువంశ శిరోమణి కుచేలుని ముక్కిపోయిన అటుకులు స్వీకరించి ఆయనకు అష్టైశ్వర్యములను ప్రసాదించినాడు. రంతిదేవుని మంచినీరు, శబరియొక్క ఎంగిలి రేగుపండ్లు శ్రీరాముడు సేవించి వారిని తరింపజేశాడు. భక్త కన్నప్ప సమర్పించిన తన ఎంగిలి మాంసమును ఆ పరమశివుడు ఎంతో ప్రీతితో గ్రహించినాడు. సకలదేవతా స్వరూపిణియైన ఆ శ్రీమాత అందుకే సర్వౌదనప్రీతచిత్తా యని అనబడినది. అనంతకోటి జీవరాశలలో పరమాత్మయై విలసిల్లు ఆ జగన్మాత అన్ని జీవుల ఆహారములను స్వీకరించుచున్నది గనుకనే సర్వౌదనప్రీతచిత్తా యని అనబడినది. శిశువునకు అన్నప్రాశననాడు తీయని పరమాన్నము తినిపిస్తాము. తరువాత వరుసగా పాలు, అన్నము, నెయ్యి అన్నము, బెల్లము అన్నము (గట్టిగా ఉండే చక్కెరపొంగలి), పెరుగన్నము, పప్పుబియ్యం కలిపి వండిన పులగము, అటు పిమ్మట క్రమేపి మనం తినే అన్ని ఆహార పదార్థములను పెట్టడమనేది ఈ నామ మంత్రములోని పరమార్థమే గదా!
 
శ్రీలలితా సహస్రనామావళి యందలి :-

492వ నామ మంత్రము: ఓం స్నిగ్ధౌదన ప్రియాయై నమః

 (నేతితో కూడిన అన్నమునందు ప్రీతిగలది జగజ్జనని)

501వ నామ మంత్రము: ఓం గుడాన్న ప్రీత మానసాయై నమః

(బెల్లముతో కలిపిన అన్నము  అనిన ఇష్టము కలిగినది పరమేశ్వరి)

512వ నామ మంత్రము: ఓం దధ్యన్నాసక్త హృదయాయై నమః

(పెరుగుతో కలిపిన అన్నము - దధ్యోదనము అనిన శ్రీమాతకు ఇష్టము)

519వ నామ మంత్రము: ఓం ముద్గౌదనాసక్త చిత్తాయై నమః

(పెరపప్పుతో కలిపి వండిన అన్నము - పులగము అనిన ఆ అమ్మకు ఇష్టము)

526వ నామ మంత్రము: ఓం హరిద్రాన్నైక రసికాయై నమః

(పసుపు వేసిన అన్నము - పులిహోర, పులగము వంటి పసుపువేసిన అన్నము అనిన లలితాంబికకు ప్రీతి)

అనంతకోటి జీవరాశుల స్వరూపిణియైన పరమేశ్వరి సర్వతోముఖీ యని అనబడినది. అందుకే అన్ని జీవరాశులు స్వీకరించు అన్ని ఆహారములు ప్రీతియను సంకేతము కారణముగా, సహస్రార కమలాధిష్ఠాన దేవతయగు యశస్వినీ (యాకినీ దేవీ)  స్వరూపిణియైన పరమేశ్వరి సర్వౌదనప్రీతచిత్తా యని అనబడినది. అటువంటి శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం సర్వౌదన ప్రీతచిత్తాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

[07:03, 01/12/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

534వ నామ మంత్రము 1.12.2021

ఓం యాకిన్యంబా స్వరూపిణ్యై నమః

సహస్రదళ పద్మము (సహస్రారము) నందు యశస్సినీ (యాకినీ యోగినీ) రూపంలో ఉన్న లలితాంబికకు నమస్కారము. 

శ్రీలలితా సహస్ర నామావళి యందలి యాకిన్యంబా స్వరూపిణీ అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) నామ మంత్రమును ఓం యాకిన్యంబా స్వరూపిణ్యై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తితత్పరతతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులు శ్రవణాది సర్వేంద్రియాలను దేవిపరం గావించి తీవ్రసాధనా పరులై అమ్మ కరుణను పొంది, బ్రహ్మజ్ఞానసంపన్నులై తరించుదురు. సహస్రార కమలాధిష్ఠాన దేవతయగు యశస్వినీ దేవత యాకినీ దేవతయై, ఆ యాకినీ రూపధారిణియైన జగజ్జననిని కి సంబంధించిన బీజ, శక్తి, కిలక, న్యాస మంత్రాదులన్నియు య కారముతో ప్రారంభమగును. బ్రహ్మ రంధ్రమునకు అధో ముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొంద గలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీ భక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈస్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు. యాకిన్యంబస్వరూపిణి- 534వ నామము, అనియు మరియు సహస్రదళ పద్మస్థా - 528వ నామము, సర్వవర్ణోపశోభితా - 529వ నామము, సర్వాయుధధరా - 530వ నామము, శుక్లసంస్థితా - 531వ నామము, సర్వతోముఖీ - 532వ నామము, సర్వౌధన ప్రీతచిత్తా 533వ నామమంత్రము
 వరకూ నామములు ఆ పరమేశ్వరి యొక్క విశేషణములే చెప్పబడినవి. 

శిరస్సు మధ్యభాగములో సహస్త్రార చక్రము ఉంటుంది. ఇది వేయి దళములు కలది. యశస్వనీ దేవత ఈ చక్రాధిష్ఠానదేవత. ఏడవ మాసములోనే గర్భస్ధ శిశువులో జీవుడు ప్రవేశించేది. ఇందు విశ్వంలోని సకల వర్ణములు, రంగులు, అక్షరములు, విద్యలు, ధ్వనులు, బీజాక్షరములు ఉంటాయి. యశస్వినీ దేవతకు లెక్కలేనన్ని చేతులు, అన్ని చేతులలో సకల ఆయుధములు ధరించునది. ఈమె సృష్టికి ఆధారభూతమైన శుక్ర ధాతువుని ఆశ్రయించునది పరాశక్తి. ఈమె సర్వతో ముఖ అభివృద్ధి చేయునది. ఈమె అన్ని రకముల అన్నమునూ ఇష్టపడుతుంది. మిగిలిన  ఆరు  (మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక,అనాహత, విశుద్ధి, ఆజ్ఞాచక్రము) చక్రములను షట్చక్రములుగా పేర్కొంటారు. ఏడవది సహస్రారంగా వర్ణిస్తారు. ఇందు మొదటి ఆరింటి యందును ప్రజ్ఞ మేల్కొని పరిపూర్ణత చెంది, ఏడవది యగు సహస్రారమందు లయము చెందుటయే యోగం. ఇదియే మోక్షం. ఇదియే నిర్వాణం. ఇదియే అద్వైతస్థితి. ఆజ్ఞా విశుద్ధి చక్రములు సత్వగుణమునూ, అనాహతం మణిపూరక చక్రములు రజోగుణమునూ, స్వాధిష్టానం, మూలాధార చక్రములు తమోగుణమును వ్యక్తం చేయును. తమోగుణం దేహధాతువుల నిర్మాణమునకు, వానియందలి రసాయనిక మార్పులకు ఆధిపత్యం వహించడమే కాకుండా భౌతికదేహ నిర్మాణం కూడా దీని ప్రవృత్తియే. రజస్సు వలన శరీరం లోని వివిధ అవయములు పనిచేయుచున్నవి. ఇక సత్వం వలన గ్రహణశక్తి, వివేకం, విచక్షణ, విమర్శన మున్నగు లక్షణములు మేల్కొనును. ఈ మూడును మూడు లోకములుగా అంటే, భూలోకం (తమస్సు), భువర్లోకం (రజస్సు), సువర్లోకం (సత్వం)లుగా మనదేహంనందునూ,సౌరమండలం నందునూ ఏర్పడుచున్నవి; సహస్రార  కమలం వేయిదళాలతో వికసించి యుంటుంది. అధిదేవత యాకిని. అకారాది క్షకారంత వర్ణమాల యోగినీగణం చేత సేవించబడుచున్నది; మస్తిష్కం పైన బ్రహ్మరంధ్రం క్రిందిభాగమున విలసిల్లే ఈ చక్రం విశ్వాత్మ నివాసస్థానం. పరమాత్మ స్థానం. ఇది మానసికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక చక్రం. ఆత్మసాక్షాత్కారానికి దోహదం చేసే చక్రం. ఆత్మశక్తిగా అలరారే సుందర సుదర్శన చక్రం. విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా పరిఢవిల్లే కమలం ఈ సహస్రారం. పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీక. ఆనందమయకోశంతో సంబంధం. ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - షట్చక్రాలు బలహీనపడతాయి. గ్రహణశక్తి లోపిస్తుంది. భూత వర్తమానాలోనికి పయనిస్తూ అలసిపోతుంటారు. కష్టదుఃఖాలు పొందుతుంటారు. పునర్జన్మలు తప్పవు. ఈ చక్ర మానసిక స్వభావం - ఈ చక్రం జాగృతయితే సాధకుడు అమరుడౌతాడు. పరమాత్మగా వ్యక్తమౌతాడు. తనకు తాను తెలుసుకుంటాడు. ఇది ఈశ్వరీయత స్థితి. సాధకులు ఈశ్వరత్వం పొందుతారు. ఈ చక్రమును శుద్ధిచేసుకోవాలంటే - తలపు, మాట, చేత యోగ్యంగా వుండాలి. క్రమశిక్షణ, ఆచరణ, విశ్వాసం కలిగియుండాలి. ధ్యానం, బ్రహ్మతత్త్వజ్ఞానం, స్థితప్రజ్ఞ (గతాన్ని తలవక, భవిష్యత్తు ఊహించక, వర్తమానంలో వర్తించడం అంటే ఏ క్షణానికి ఆ క్షణంలో జీవించడం) ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోవడం చేయాలి. ఇక ఈ చక్రమునకు అధిపతి గ్రహం సూర్యుడు. ఋజువర్తన, నాయకత్వలక్షణాలు, అందర్నీ ఆకట్టుకునే ఆకర్షణీయశక్తి, సునిశితమైన చూపులు, విశాలమైన నుదురు, ఎందులోనూ ఓటమిని పొందని, మాటపడని తత్త్వం, విభిన్నమైన ఆలోచనావిధానంతో విజయమును సాధించే కార్యదక్షత సూర్యుని లక్షణాలు.  సాధన ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకుంటే సహస్రారం శక్తివంతమై, తద్వారా ఈ చక్రంతో అనుసంధానింప బడియున్న షట్చక్రాలు శక్తి సామర్ధ్యాలు కలిగియుండి మన జీవితములు ఆనంద నందన వనములు అవుతాయి. ప్రతీరోజూ సూర్యోదయ సమయానికి స్నాన పానాదులు ముగించుకొని సూర్యునికి ఎదురుగా కూర్చొని, సూర్యోపాసన చెయ్యాలి. అంటే సూర్యకిరణాలు తాకిడిని అనుభవిస్తూ, సూర్యభగవానుని శక్తి మన సహస్రారం గుండా అన్ని చక్రాలయందు నిబిడీకృత మవుతున్నట్లు భావిస్తూ, ప్రశాంత చిత్తంతో కాసేపు ధ్యానించాలి. క్రమం తప్పని ఈ ఆచరణ వలన సూర్యభగవానుని శక్తి, గాయత్రి శక్తి మనకు లభించి తేజోమూర్తు లవుతాం. కుండలినీశక్తి స్థూల శరీరం నుండి ప్రజ్ఞామయ శరీరం వరకు వ్యాపించియున్నది.ాఈ శక్తిని చైతన్యవంతం చేయాలి;  ఆయా చక్ర దేవతలను ప్రార్థించాలి. {ప్రార్థన అంటే దైవస్మరణ మాత్రమే కాదు, మన మనస్సును ఇహం నుండి పరం వైపు త్రిప్పడానికే అన్న నిజాన్ని అర్ధంచేసుకొని, దేహమే దేవాలయమని, అంతరంగమందే ఆ  అంతర్యామి కొలువై వున్నాడని గ్రహించి అందుకు తగ్గ ప్రార్థన చేయాలి}. ప్రకృతి సహజంగానే ప్రతీ మనిషికి కొంతశక్తి వస్తుంది. ఆ శక్తి కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుకుని, ఉన్నశక్తిని ఉపయోగించుకుంటూ ఆత్మశక్తిని పెంపొందించుకోగలగాలి. ఈ విధమైన సాధనే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం సుగమం చేస్తుంది.
ఈ సాధన వలన ఆలోచనల్లో స్పష్టత, నడవడికలో సరళత, దృక్పదంలో విశాలత, అందర్నీ ప్రేమించగల సౌశీల్యత, ఆదరించగల సేవాతత్పరత, అన్ని పరిస్థితులలోనూ సంయమనం, స్థితప్రజ్ఞత అలవడతాయి. నేను అనెడి అహం నశిస్తుంది; నేను అనెడి సంకుచిత స్వాభిమాన మదృశ్యమైనచో అనంతమగు అహంబ్రహ్మాస్మి అనెడి ఉత్తమస్థితి తనంతటదియే సాక్షాత్కారమగును. అప్పుడు ఆనందం ఓ స్రవంతిలా ప్రవహిస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఉండుటయేఈవిధంగా సరైనరీతిలో సప్తచక్రాలను సాధన చేస్తే, సంసారంలో తిరిగి జన్మింపరు. మనలోనున్న సప్తచక్రాలను చైతన్యవంతం చేసే సాధనతో స్థూలంనుండి ప్రజ్ఞామయం వరకు పయనించి అహం బ్రహ్మాస్మి అన్న స్థితిని పొందడమే జీవన పరమావధి.

సహస్రారకమలాధిష్ఠాన దేవతయగు   యశస్వీనీ (యాకినీ దేవీ) స్వరూపిణియైన జగన్మాతకు నమస్కరించు నపుడు ఓం యాకిన్యంబా స్వరూపిణ్యై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[07:03, 01/12/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

535వ నామ మంత్రము 1.12.2021

ఓం స్వాహాయై నమః

స్వాహాదేవి స్వరూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారము.

 శ్రీలలితా సహస్ర నామావళి యందలి స్వాహా అను రెండక్షరముల (ద్వ్యక్షరీ)  నామ మంత్రమును ఓం స్వాహాయై నమః అని ఉచ్చరిస్తూ ఆ జగజ్జననిని అత్యంత   భక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ జగజ్జనని కరుణించి బ్రహ్మజ్ఞానసంపదలతో బాటు వారి వారి వృత్తి కార్యక్రమములందు నిష్ణాతను ప్రసాదించి తద్వారా ఐహిక జీవనమందు కీర్తిప్రతిష్టలు, సమస్త భోగభాగ్యములు కలుగజేయును .

వేదములందు,  పురాణములలోను స్వాహాదేవి సర్వశక్తి స్వరూపిణిగా చెప్పబడినది. ఒకానొక సమయంలో దేవతలకు భోజనము దొరకని సమయం ఏర్పడినది. వారు వెంటనే బ్రహ్మలోకం చేరి బ్రహ్మ సభకు వెళ్లారు. వారు తమ ఆహార విషయం కొరకు ప్రార్థన చేశారు.   అప్పుడు "దేవతలారా! భూలోకంలో బ్రాహ్మక్షత్రియులు యజ్ఞయాగములు చేస్తూ హోమద్రవ్యములను (హవ్యములను) మీ పేరున (దేవతల పేరున) అగ్నిలో వేస్తూ ఉంటారు. వాటివలన మీ ఆకలి తీరుతుంది" అని చెప్పాడు.  కాని అగ్నిలో ఆయా దేవతల పేరున వేసిన హవ్యములు అగ్నిద్వారా ఆయా దేవతలకు అందించే శక్తి వేరేగా ఒకటి ఉన్నది. ఆ శక్తి కోసం ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తే, ఆ తల్లి ఆ శక్తిని పంపుతుంది అని బ్రహ్మ మరల చెప్పాడు. దేవతలంతా భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించగా, అమ్మవారు అనుగ్రహించి ఆ శక్తిని పంపించినది.  ఆ శక్తి చాలా అందమైనది.  అప్పుడు బ్రహ్మ ఆ శక్తికి నమస్కరించి, "తల్లీ నీవు అగ్నికి దాహకశక్తివై, హవ్యములను గ్రహించి దేవతలకు అందించుము" అని ఆ శక్తిని ప్రార్థించాడు. అంతట ఆ శక్తి తాను శ్రీహరికి తప్ప వేరొకరికి (అగ్నికి) చెందను అని చెప్పి ఆ శక్తి విష్ణుమూర్తికి మాత్రమే చెందాలని, ఆ స్వామి ప్రసన్నతకోసం తపస్సుచేసినది. అంతట విష్ణుమూర్తి ప్రత్యక్షమయాడు. ఆమె మనసును తెలుసుకున్న విష్ణుమూర్తి ఆమెతో ఇలా అనడం జరిగినది "దేవీ నీవు వరాహకల్పంలో నా ప్రియురాలివి కమ్ము. అప్పుడు నీ పేరు నాగ్నజితి. నగ్నజిత్తు రాజు నీ తండ్రి. ఇప్పుడు నీవు దహన శక్తితో సంపన్నురాలవై అగ్నికి ప్రియపత్నివగుము. నా దయతో నీవు మంత్రముల అంగమై పూజలందుకుంటావు. అగ్నిదేవుడు నిన్ను తన గృహస్వామిగా చేసికొని భక్తభావంతో పూజిస్తాడు. అపుడు నీవు సౌభాగ్యమును పొందుతావు" అంటూ అంతర్థానమైనాడు. 
ఆ సమయంలో అగ్ని దేవుడేతెంచి స్వామి ఆదేశానుసారం సామవేదంలో తెల్పిన విధానంతో జగజ్జనని భగవతిని ధ్యానించి పూజించి స్తుతించినాడు. పిదప స్వాహాదేవికి, అగ్నిదేవునకు మంత్రపూర్వకంగా వివాహం జరిపినది. శత సంవత్సరాలు ఆనందంతో గడిపారు. 

దేవతలకు హవిస్సును సమర్పించునపుడు ఉచ్చరించునదే స్వాహా అను శబ్దము. హవిస్సు అనగా హోమద్రవ్యము.
హోమాగ్నిలో  దేవతలకు సమర్పించునది హవ్యము అనియు పితృ దేవతలకు సమర్పించునది కవ్యము అనియు అందురు. స్వాహా అనగా అత్యంత భక్తిప్రపత్తులతో ఆహ్వానించుట స్వాగతించుట. అమ్మవారు సాక్షాత్తు స్వాహా స్వరూపురాలు. యజ్ఞమునందు దేవతలకు హవిస్సు నొసంగునప్పుడు ఏ దేవతను గురించి చెప్పాలో ఆ దేవత పేరు చెప్పుచూ స్వాహా అని ఉచ్చరించవలయును. ఉదాహరణకు ఓం నారాయణాయ స్వాహా,నారాయణాయ ఇదం నమమ అనగా ఈ సమర్పించు ద్రవ్యము (హవిస్సు) నారాయణుని కొరకు - అందుచే నారాయణుని ఆహ్వానించుచున్నాను. ఇది నారాయణమూర్తిదే కాని నాది కాదు అని అర్థము. కావున స్వాహా అనే పదము దేవతా హవిర్దానవాచకము. స్వాహా అను శబ్దము దేవతలకు హవ్యము సమర్పించునపుడును,  స్వధా అను శబ్దము పితృదేవతలకు కవ్యములను సమర్పించునపుడును పలుకబడును. స్వాహా, శ్రీషట్, ఔషట్, వషట్, స్వధా అను శబ్దములు గూడ ఉపయోగించుదురు. అగ్నిస్వరూపుడైన ఈశ్వరునికి దోహదపడే, పరమేశ్వరీ అంశ రూపమగు తేజస్వరూపిణియే స్వాహా అనబడును. స్వాహంతు దక్షిణపార్శ్వే అనగా అగ్నిదేవునికి ఆమె కుడివైపున నుండునది స్వాహాదేవి. సంపూర్ణ ప్రకాశరూపిణియై ఉండునది పరాశక్తి, ఆమె తనయుడే కుమార స్వామి.  స్వాహామహ్నానీత్మనస్తస్వ ప్రోక్తా పశుపతేః ప్రియాషణ్ముఖో భగవాన్దేవః బుధైఃపుత్ర ఉదాహృతః. స్వాహాదేవి మంత్రము ద్వాదశాక్షరములు గలిగి ఉండును. ఈ మంత్రము గురు ముఖతః తెలియవలసినది. ఈ స్వాహా దేవియొక్కనామములు: 1) స్వాహా, 2) వహ్నిప్రియా, 3) వహ్నిజాయా, 4) సంతోషకారిణి, 5) క్రియా, 6) శక్తి, 7)  కాళరాత్రి, 8) దహనక్షమ, 9) సంసారసారరూప, 10) దేహ పోషణకాం, 11) మోద సంహార తారణి, 12) దేహ జీవనరూపా అనునామ స్తుతి సర్వార్థ సాధనము.  ఈ  శ్లోక రూపమున స్వాహాదేవిని స్తోత్రము చేసినచో వివాహ సిద్ధియు, సంతానసిద్ధితో బాటు తమ తమ ఇష్టార్థ సిద్ధులు చేకూరును. విశుద్ధిచక్ర దేవత వజ్రేశ్వరి యొక్క మంత్ర విశేషము అగును. పద్మపురాణమునందు స్వాహా మహేశ్వరీ పీఠాధిష్ఠాన దేవత. కావున స్వాహా అను నామము జగజ్జననికి గలదు అని భావము. 

స్వాహాకారములతో చేయబడు యజ్ఞముల హవిర్భాగము, స్వాహాదేవి ద్వారానే దేవతలకు చెందుచున్నది. స్వాహాంతము గాకుండా చేయబడు యజ్ఞముల హవిర్భాగములు నిర్దేశించిన దేవతలకు చెందవు అని తెలియదగును. మనలో త్రివిధములగు అగ్నులు (త్రేతాగ్నులు) గలవు. 1) ఆహవనీయము, 2) గార్హపత్యము, 3) దక్షిణాగ్ని - ఇవియే త్రేతాగ్నులు.   ఈ త్రేతాగ్నులు యజ్ఞముచేయువారి బ్రహ్మతేజస్సును పెంపొందింపజేయును. శుక్రసంబంధమైన తేజస్సు ఆహవనీయము .సత్సంతానమకై ఉపయోగించు శుక్రము యొక్క తేజస్సు గార్హపత్యము. కేవలము ఇంద్రియ తృప్తి, మోహం, కామ తృప్తికై ఉపయోగించే తేజస్సు దక్షిణాగ్ని అందురు. అందుచే స్వాహాదేవికి ఈ త్రేతాగ్నులు ముగ్గురు పుత్రులన బడుదురు. స్వాహా స్వరూపిణి అయిన జగజ్జననికి నమస్కరించునపుడు ఓం స్వాహాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[06:20, 02/12/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

536వ నామ మంత్రము 2.12.2021

ఓం స్వధాయై నమః

స్వధాదేవి రూపధారిణియైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్రనామావళి యందలి స్వధా అను రెండక్షరముల నామ మంత్రమును ఓం స్వధాయై నమః  అని భక్తితత్పరతతో ఉచ్చరించుచూ జగజ్జననిని ఉపాసించు సాధకులు నిస్సందేహముగా బ్రహ్మజ్ఞాన సంపన్నులై  ఆతల్లి కరుణచే సత్కర్మల నాచరించు దిశగా మనసును ఏర్పడి శాశ్వతా నందమునంది తరించుదురు.

అగ్నికార్యంలో లేదా యజ్ఞాలలో స్వాహా శబ్దం వినిపించినట్లే పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వడంలో స్వధా శబ్దం వినిపిస్తుంది. పితృయజ్ఞాలలో స్వాహాదేవియే తర్పణాలలో స్వధా రూపిణిగా వస్తున్నదని శాస్త్రం. (పితృ యజ్ఞేషు స్వధా మాతా.) పితృ దేవతలను ఉద్దేశించి వషట్కారం చేయడం స్వధాకారం.(స్వధానమ ఇతి వషట్కారపి.)

అగ్ని దేవుని భార్య స్వాహాదేవి. ఆమె మరో రూపం స్వధా.

దేవతలకు హవిస్సు సమర్పించు నపుడు స్వాహా అని ఏవిధముగా అందురో అలాగే పితృదేవతలకు తర్పణాదులు సమర్పించునపుడు స్వధా అను నామమును ఉచ్చరించెదరు. 
 స్వధా యనగా శరీరధారణకు గల ప్రక్రియకు స్వాగత వచనము. ప్రాణుల సృజనాత్మిక శక్తులకు సంబంధించినవారు దేవతలైతే ఇక్కడ జీవుల దేహధారణకు సహకరించెవారు పితృదేవతలు. ఈ పితృదేవతలకు అర్పించే తర్పణాలు ముందు స్వధా అని తర్పణం వదలవలయును. అగ్నిదేవునికి ఇద్దరు భార్యలు ) స్వాహాదేవి, 2) స్వధాదేవి. తేజస్వరూపిణియగు స్వధాదేవి మానవులు సమర్పించు పిండ దానములను స్వీకరించి పితృదేవతలకు పంపును. ఈ  స్వాహా, స్వధా అను దేవతాద్వయం అగ్నిదేవునికి కుడి, ఎడమ పార్శ్వములలో ఉందురు. ఒకరు సవ్యము మరియొకరు అపసవ్యము పద్ధతిలో ఉంటారు. అందుకనే పిండప్రధాన పితృ కార్యక్రమములలోను,  తర్పణం విడచునప్పుడు యజ్ఞోపవీతము అపసవ్యముగా కుడి భుజముపై వేసుకుంటారు. దేవతల  యజ్ఞయాగాదులందు పుణ్యకర్మలయందూ జంధ్యము (యజ్ఞోపవీతము) సవ్యముగా అనగా కుడిభుజముపై ఉంచుకొందురు. జగజ్జనని  అంశావతారాలుగా అనగా. దేవికి ప్రతి రూపాలుగా స్వాహాదేవి, స్వధాదేవి, దక్షిణాదేవి, మంగళ చండిక, మానసాదేవి, షష్ఠీ దేవి అనే వారు దిగివచ్చారు. నేడు సందర్భం వచ్చినది గనుక స్వధాదేవి  వృత్తాంతమును సంగ్రహంగా పరిశీలిద్దాం. బ్రహ్మదేవుడు, పితృదేవతా గణాలకు శ్రాద్ధ కర్మలలో తర్పణ పూర్వకంగా సమర్పించే పదార్థాన్ని (కవ్యము)  ఆహారంగా నియమించాడు.  బ్రాహ్మణులు తర్పణం ఇస్తున్నప్పటికీ పితృదేవతలకు సంతృప్తి కలుగలేదు. ఆ పితృగణాలు బ్రహ్మను ప్రార్థించగా ఆయన ధ్యాన నిమగ్నుడై మానస పుత్రికను సృష్టించి, ఆమెను గుణవతిగా, విద్యావతిగా తీర్చిదిద్ది, ఆకన్యకు స్వధాదేవి అని నామకరణం చేశాడు. పితృదేవతలకు పత్నిగా స్వధాదేవిని నియమించాడు. ఆనాటి నుండి పితృదేవతలు, మహర్షులు, విప్రులు, మానవులు స్వధాదేవిని పూజిస్తూ, ఆమె అనుగ్రహంతో పితృదేవతలను సంతృప్తి పరుస్తూ వచ్చారు

పరాశక్తి అంశావతారంగా స్వధాశక్తి ఆవిర్భవించి, పితృదేవతలకు సంతృప్తిని ప్రసాదించిందిశ్రాద్ధ కర్మలలో, బలితర్పణాల్లో తీర్థస్నానాల్లో స్వధాదేవీ నామాన్ని ఉచ్చరిస్తే సర్వపాపాల నుండి విముక్తి లభిస్తుందని వ్యాసమహర్షి వివరించారు. ఈ స్వధా దేవి కూడా అగ్నిమూర్తి స్వరూపుడగు శివుని అంశకు భార్య అనబడును;  దేవంనామే స్వధాంతధా పూర్వకాలమున ద్విజులందరూ భయభ్రాంతి గలవారై  బ్రహ్మదేవుని సన్నిధి చేరి, స్వామి, పితృ దేవతలకు పిండ దానములు ఎవ్వరి ద్వారా ఇవ్వవలయునని ప్రార్ధింపగా బ్రహ్మదేవుడు తన మానసమునుండి ఒక సుందరమైన స్త్రీని సృజించి ఆమె పేరు స్వధా అని నామకరణము చేసి పితరులకిచ్చెను. ఆ నాటినుండి స్వధాంతముగా జేయబడు పిండ దానములను పితృదేవతలు గ్రహించుచున్నారని గ్రహింపగలము; స్వధాదేవికి ఏడు నామములు గలవు: 1) పితృప్రాణతుల్య, 2) ద్విజజీవనరూపిణి, 3) శ్రాద్ధాదిష్టాత్పదేవి, 4) శ్రాద్ధఫలప్రదా, 5) బ్రహ్మమానసకన్యా, 6) పితృతుష్టిప్రదా, 7) ద్విజప్రీతికదా. స్వధా పూజనము సకల సకల వాంఛా ఫలప్రదము. ఈ స్వధాదేవి గోలోకమున రాధాదేవి సఖియనియు, రాధికచే శపింపబడియు సుశీలయను పేరుతో అగ్నిదేవునికి సతియైనదనియు ఆ తర్వాత దళిణయై వల్లభుని దక్షిణ భాగమున వసించునది. అనాహత చక్రాధిష్ఠాన దేవతయు, వామదేలి మంత్ర విశేషమును, ద్వితీయ మాస గర్భస్థ పిండమును సమన్వయ పరచుకొనవలయును. దేవతలకు హవ్యము సమర్పించుటకైనను లేదా పితృదేవతలకు కవ్యమును సమర్పించుటకైనను స్వాహా లేదా స్వధా స్వరూప ధారిణియైన జగన్మాతయే ప్రధాన దేవత, జగన్మాత స్వధారూపిణియై లేకున్న పితృ దేవతలకు సమర్పించు తర్పణములుగాని, పిండప్రధానములుగాని వారికి చెందవు. కావున స్వధారూపధారిణియైన జగన్మాతకు నమస్కరంచునపుడు ఓం స్వధాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
537వ నామ మంత్రము 2.12.2021

ఓం అమత్యై నమః

అమతిగా అనగా జ్ఞానరూపిణిగా లేదా మూలప్రకృతి రూపంలో, అవ్యక్త రూపిణిగా ఉన్నతల్లికి నమస్కారము. 

శ్రీలలితా సహస్ర నామావళి యందలి అమతిః అను మూడక్షరముల (త్ర్యక్షరి) నామ మంత్రమును  ఓం అమత్యై నమః అని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉచ్చరించుచూ ఉపాసించు సాధకుడు అమ్మ కరుణచే చందనం కర్రవలె (చందనం కర్ర అరగదీసిన కొలదీ తన సుగంధము ఇనుమడింపజేసుకొనును)
 చలింపక, (చందనం కర్ర పదే పదే అరగదీయునప్పుడు చింతింపక,  తననుండి వెడలిన  భగవదర్పితము చందనముతో ధన్యతనందును) అట్లే  (చందనం చెక్కవలె) సాధకుడు తాత్కాలికంగా సంభవించు ఆపదలకు సహనంతో తలవంచి, దృఢతరమైన భక్తితో వర్తించును, అమ్మ కరుణతో తరించును. 

అమతిః అనగా మనస్సుకు అతీతమైనది, అవిద్యా స్వరూపిణి, బుద్ధి వికసించడానికి ముందు ఉండే స్థితిగా తెలియవలెను. అమతి అనగా ప్రజ్ఞాశక్తి అనికూడా భావించదగును. నిశ్శబ్దమునుండి శబ్దము పుట్టినట్లు అమతి అనే దానినుంఢి మతి పుట్టిందని భావించగలము. భావమునకు ముందు ఉండే అనిర్వచనీయం వాక్కు నిర్వచించలేదు. బుద్ధి యుత్పన్నమగుటకు పూర్వమే ఉన్నది (అమతిః) కావున, మేధా అను నామ మంత్రము   అమతిః అనునామము తర్వాత గలదు. గాన అమతి అను నామము సమంజసమయినది. బుద్ధి యున్నప్పుడే తత్త్వం వ్యక్తముగును, అదే బుద్ధికి పూర్వం అమతిః అను నామ మంత్రమునకు అవ్యక్తమన బడుచున్నదను భావన సహజ మయినది. కావున శ్రీమాత అమతిః అను నామముతో ప్రసిద్ధమైనది. మణిపూరక చక్రాధిష్ఠాన దేవత అయిన వయోవస్థా వివర్జితా శక్తి ఆదేవతయొక్క మంత్రవిశేషమును గర్భస్థ పిండ విశేషముగా తృతీయ మాస స్థితిని తెలియ జేయుచున్నది. 

స్వధాదేవీ స్వరూపిణియైన అమ్మవారికి నమస్కరించునపుడు ఓం అమత్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

538వ నామ మంత్రము 3.12.2021

ఓం మేధాయైనమః

జీవులన్నిటియందు మేధా బుద్ధి రూపంలో విరాజిల్లు జగజ్జననికి నమస్కారము. 

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మేధా అను రెండక్షరముల (ద్వ్యక్షరి) నామ మంత్రమును ఓం మేధాయై నమః అని ఉచ్చరిస్తూ భక్తిశ్రద్ధలతో ఉపాసించు భక్తులకు విశేషమైన బ్రహ్మజ్ఞాన సంపద, అత్యద్భుతమైన జ్ఞాపకశక్తి, ధారణాశక్తి, చక్కని వాక్పటుత్వము, అంతకు మించిన ఆధ్యాత్మిక తత్త్వజ్ఞానమును ఆ జగజ్జనని ప్రసాదించి తరింపజేయును. 

మేధా అనగా బుద్ధి విశేషము గలది. ధారణశక్తి గల బుద్ధి మేధా అనబడును. బుద్ధి సకలముసు వ్యక్తము చేయునది. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా. పరబ్రహ్మమునకు అభిన్నత్వమును సూచించునది మేధా అనబడును. బ్రహ్మాఽహమస్మీతి స్మృతి రేవమేధా అని ఆది శంకరులు అన్నారు. ఎన్నెన్నో రూపములతో ఉంటూ అన్ని నామాలతో పిలువబడుచూ, అన్ని జన్మలు తాత్కాలికమే కావున తాను  బ్రహ్మ యొక్క అంశమేనని తెలుసుకొనే బుద్ధిని మేధా అని అంటారు. స్వాధిష్ఠాన చక్రదేవతయైన సిద్ధేశ్వరీ మంత్ర విశేషాంశములను గర్భములో నుండు పిండము యొక్క చతుర్ధ మాస స్వరూప, స్వభావమును తెలుపునది. కావున ఆ పరమేశ్వరి మేధా అను నామ ప్రసిధ్ధమైనది.

మేధా స్వరూపిణియైన అమ్మవారికి నమస్కరించునపుడు ఓం మేధాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

539వ నామ మంత్రము 3.11.2021

ఓం శ్రుత్యై నమః.

 వేద (శ్రుతి) స్వరూపిణిగా ప్రభాసిల్లు  జగన్మాతకు నమస్కారము. 

శ్రీలలితా సహస్రనామావళి లోని శ్రుతి అను రెంక్షరముల (ద్వ్యక్షరి) నామ మంత్రమును ఓం శ్రుత్యై నమః అని ఉచ్చరిస్తూ ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు భక్తులను వేద స్వరూపిణియైన జగజ్జనని కరుణించి బ్రహ్మజ్ఞాన సంపన్నులనుచేసి, ఆ తల్లి తనను చేరే మార్గమును సులభతరముచేసి తరింపజేయును. 

శ్రుతి అనగా చెవులతో వినునది. సంగీతశాస్త్రంలో స్థాయిని విశేషించుటను కూడా శ్రుతి యని చెప్తారు. వినుటద్వారా తెలుసు కొనవలసిన అత్యంత మహిమగల వేదసముదాయము (ఋక్ యజుస్సామ అధర్వణ వేదము) లను శ్రుతులనికూడా అంటారు.  ఆ కాలములో ఋషుల సన్నధానములో శిష్యులు శ్రవణమాత్రముననే  వేదాధ్యయనం చేసి వేదవేద్యులయేవారు. అప్పుడు వారికి కాగితములు, కలములు లేవు. కేవలము వినుట ద్వారానే ఎక్కడ అడిగినను చెప్పగలిగే సామర్థ్యము కలిగి యుండే వారు. ఈ విధమైన జ్ఞానము కేవలం శ్రవణం ద్వారానే పొంద గలిగినందున వీటిని  శ్రుతులు అన్నారు. మునులు ప్రకృతిలో గల దర్శనీయమైన విజ్ఞాన విశేషాన్ని, శ్రుతులు అని  అన్నారు. మూలాధార చక్రదేవతయైన సిద్ధవిద్య యొక్క మంత్ర విశేషాన్ని ఐదవ మాసమున గర్భస్థ పిండము యొక్క స్వరూప స్వభావమును ఈ నామముతో సమన్వయం చేసుకొనవచ్చును. హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరి భాగములే ఉపనిషత్తులు. ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు, బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు. అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మ విధులను ప్రస్తావిస్తాయి. ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి  ;నాలుగు వేదాలకు కలిపి ఒక వేయి నూటఎనబది (1180) ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి; వాటిలో నూట ఎనిమది (108) ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిలో పది ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదహరించారు. మొదట మూడు. తరువాత నాలుగు. వేదం అంటే విద్య లేదా జ్ఞానం అని అర్థాలు. తొలి దశలో వేదం ఒకటే. ఆపై మూడు విభాగాలై త్రయీ విద్య అయింది; ఋక్‌, యజుర్‌,  సామ అని ఆ విభాగాలకు పేర్లు. మహాభారత కాలానికి కూడా వేదం త్రయీ విద్య గానే ఉండేది. అటు తరువాత అథర్వ అన్న మరొకదానితో వేదం నాలుగు విభాగాలు లేదా శాఖలయింది. వేదం అన్నది నైతిక మార్గదర్శకాల, కర్మ కాండల, ప్రవర్తనా సూత్రాల క్రోడీకరణ కూడా. దైనందిన జీవనానికీ, అధ్యాత్మిక అభ్యాసానికీ మహర్షులు పలువురి సమష్టి ప్రయత్నమే వేద సంపుటి. వేద యతి యతో ధర్మాధర్మ ఇతి వేదః ధర్మా ధర్మాలను తెలియజేసేది వేదం. మంత్రాలు... బ్రాహ్మణాలు... ఆరణ్యకాలు... ఉపనిషత్తులు. వేదం నాలుగు భాగాలుగా ఉంటుంది. మంత్రం, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్‌ అనేవి. మంత్ర భాగాన్ని సంహిత అని కూడా అంటారు. ఈ సంహితలు అయిదు. అవి ఋక్‌ సంహిత, కృష్ణ యజుస్సంహిత, శుక్ల యజు స్సంహిత, సామ యజుస్సంహిత, అథర్వ సంహిత అనునవి. ఇక, బ్రాహ్మణాలు అయిదు. అవి ఐతరేయ బ్రాహ్మణం, తైత్తిరీయ బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం, షడ్వింశ బ్రాహ్మణం, గోపథ బ్రాహ్మణం. మంత్రం అన్నదానికి పలు అర్థాలున్నాయి.  యజ్ఞం చేసే వాళ్లు పలికే శబ్ద సమూహం మంత్రాలే. మంత్రాలను ఋక్‌, యజుస్‌, సామ లని అన్నారు. ఋక్‌లు అంటే స్తుతులు, దైవ ప్రార్థనలు. వీటిని సూక్తాలు అని అన్నారు. వేద సాహిత్యమంతా మంత్రాలే. మంత్రం లేదా సంహిత భాగానికి వివరణలు బ్రాహ్మణాలు. యజ్ఞాలను నిర్వహించే తీరును బ్రాహ్మణాలు వివరిస్తాయి. ఋక్‌లు, బ్రాహ్మణాలు కర్మకాండకు సంబంధించినవి. మంత్రం, బ్రాహ్మణ శాఖల తరువాత ఆరణ్యకాలు ఉంటాయి. ఆరణ్య కాలు రెండు మాత్రమే కనిపిస్తు న్నాయి. అవి ఐతరేయారణ్యకం, తైత్తరీ యారణ్యకం. ఆరణ్యకాలు వైరాగ్యాన్ని ఉపదేశిస్తాయి. వానప్రస్థాశ్రమంలో అరణ్యాలలో అధ్యయనం చెయ్యడం వల్ల అవి అరణ్యకాలు అని అనిపించు కున్నాయి. చివరి సమన్వయం  ఉపనిషత్తులలో తెలుస్తుంది. ఉపనిషత్తులు ఆధ్యాత్మికత వైపు నడిపిస్తాయి. అందుకనే వాటిని బ్రహ్మకాండ అని అన్నారు. ఉపనిషత్తులు నూట ఎనిమిది (108) కనిపిస్తున్నా,  పది ఉపనిషత్తులు మాత్రమే మౌలికమైనవి, ముఖ్యమైనవి ఋగ్వేదానికి సంబంధించినవి - పది (10),
కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి - ముప్పదిరెండు (32),
శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి - పందొమ్మిది (19),  సామ వేదానికి సంబంధించినవి - పదహారు (16),
అధర్వణ వేదానికి సంబంధించినవి - ముప్పది ఒకటి (31) - (మొత్తం - 108) ఆది శంకరాచార్యులు దశోపనిషత్తులకు మాత్రమే భాష్యాలు రాశారు. అవి- ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరి, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యకాలు. ఇవన్నీ కలుపుకొంటేనే వేద వాఙ్మయము.

వేదమాతా స్వరూపిణి అయిన అమ్మవారికి నమస్కరించు నపుడు  ఓం శ్రుత్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹



శ్రీలలితా సహస్రనామ భాష్యము

541వ నామ మంత్రము 28.12.2021

 ఓం అనుత్తమాయై నమః

జగన్మాతకన్నా అధికులుగానీ, సమానులుగానీ ఎవరూ  లేరు; అట్టి తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్రనామావళియందలి అనుత్తమా అను నాలుగక్షరముల (చతురక్షరి) నామ మంత్రమును అత్యంత భక్తిశ్రద్ధలతో ఉచ్చరిస్తూ ఆ జగజ్జననిని ఉపాసించు సాధకులను వారి వృత్తి ప్రవృత్తులయందు ప్రజ్ఞావంతులను జేసి తద్వారా చతుర్విధ పురుషార్థ సంపన్నులుగాను, జగజ్జననియందు అచంచల భక్తివిశ్వాసము లుండువారిగా అనుగ్రహించి తరింపజేయును.

 శ్రీలలితా పరమేశ్వరి పరమాత్మ స్వరూపురాలు. ఎవరికంటే ఉత్తమమైన వస్తువు లేదో, అట్టి వస్తువే పరమాత్మస్వరూపము. ఆత్మతో సమానమైనది, అంతకన్నా అధికమైనదీ వేరొకటిలేదు అని వేదమునందు చెప్పబడినది. అట్టి ఆత్మయే పరమాత్మ. ఆ పరమాత్మయే పరమేశ్వరి. స్మృతులందుకూడా పరమాత్మ ఓ పరమాత్మా! నీతో సమానమైనవాడు లేనపుడు, నీకన్నా అధికుడు కుడా ఎవరూ ఉండరు అని కీర్తింపబడడం జరిగినది . అందుచే ఆ పరబ్రహ్మస్వరూపిణి, పరమాత్మయైన జగన్మాత అనుత్తమా యని అనబడినది. ఆ పరమేశ్వరి శ్రీమాతా యని అనబడినది. అనగా అనంతకోటి జీవరాశులనుసృష్టించి, రక్షిస్తూ, కల్పాంతమందు తనలో లయము చేసుకొనుచున్నది. ఈ పని చేయడానికి వేరొకరు లేరు. వేరొకరు  చేయలేరుకూడా.  ఇక ఆ తల్లి శ్రీమహారాజ్ఞి సకలలోకాలకు లోకపాలురుఉన్నారు. సృష్టిస్థితిలయల కోసం త్రిమూర్తులను నియమించినది ఆ తల్లియే. లోకాలన్నియు తనఅదుపు, ఆజ్ఞలయందు చరింపజేస్తూ శ్రీమహారాజ్ఞియై ఉన్నది గనుకనే ఆ పరమేశ్వరియే అన్నిటిలో అధికురాలు. గనుకనే ఆ తల్లి అనుత్తమా యని అనబడినది. ఆ పరమేశ్వరి  శ్రీమత్సింహాసనేశ్వరి ఆ తల్లి అధిష్ఠించిన ఆసనములు వేరొకరు అధిష్ఠించవీలగాదు. ఎందుకంటే ఆ తల్లికన్నా అధికులు ఎవరూ లేరు. గనుకనే అమ్మవారు అనుత్తమా యని అనబడినది. ఆ పరమేశ్వరి కోటిసూర్యప్రభలతో తేజరిల్లుతూ ఉంటుంది. అనంతకోటి చంద్రుల చల్లదనంతో భాసిల్లుచున్నది. మహాచతుష్షష్టికోటి యోగినీ గణములచే సేవింపబడుచున్నది. ఇంత వైభవం ఎవరికి ఉన్నది? ఎవ్వరికీ లేదు. గనుకనే ఆ పరమేశ్వరి అనుత్తమా యని అనబడినది. సుమేరుశృంగ మధ్యమందు, చింతామణి గృహంలో, చతుష్షష్టికళాప్రపూర్ణగా విలసిల్లు పరమేశ్వరి వైభవానికి సాటిలేదు. వేరొకరు పోటీలేరు. గనుకనే ఆ అమ్మవారు అనుత్తమా యని అనబడినది. కోట్లాది సహస్రనామములు ఉన్నవి. వాటిలో గంగా, భవానీ, గాయత్రీ, కాళీ, లక్ష్మీ, సరస్వతీ, రాజరాజేశ్వరీ, బాలా, శ్యామలా, లలితా యను దశసహస్రనామములే ఉత్తమమనుకుంటే, ఆ దశ సహస్రనామములలో వశిన్యాది వాగ్దేవతలచే విరచించబడిన తన సహస్ర నామములే (లలితా సహస్ర నామములే) ఉత్తమమైతే, ఆ పరమేశ్వరికన్నా సమానులు ఎవరు? అధికులు ఎవరు? ఎవరూ లేరు. గనుకనే శ్రీలలితా పరమేశ్వరి అనుత్తమా యని అనబడినది. యజ్ఞకుండములందలి హవిస్సులను దేవతలకందించే స్వాహాదేవి తానే అయిఉన్నది. పితృదేవతలకు కవ్యములను (పితృయజ్ఞములలో సమర్పించే హోమద్రవ్యములు) అందించే స్వధాదేవికూడా తానే. వేదములు, స్మతులు అన్నీ తానై యున్న తనకు సాటి వేరొకరు లేరు గనుక ఆ పరమేశ్వరి అనుత్తమా యని అనబడినది. సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక,  సర్వతంత్రాత్మిక, ఆదిపరాశక్తి, సృష్టికిముందును,  సృష్టియందును, సకలలోకములు లయమయినపిదపను ఎల్లప్పుడూ ఉంటూ దేశకాలాపరిచ్ఛిన్నా యని అనబడిన ఆతల్లికి సాటి ఎవరు? మేటి ఎవరు? గనుకనే ఆ అమ్మ అనుత్తమా యని అనబడినది. శ్రీలలితా సహస్ర నామములు ఉన్నవి వేయి అయినా , ఆ నామములకు అర్థములు అనంతకోటి. అందుకే ఆ తల్లి అనుత్తమా యని అనబడినది. ఈ విధంగా ఆ తల్లికన్నా ఉత్తములు, అధికులు వేరొకరు లేరని వేదములే ఘోషించుచున్నవి గనుక పరబ్రహ్మస్వరూపిణియైన పరమేశ్వరి అనుత్తమా యని అనబడినది.

ఆ పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం అనుత్తమాయై నమః అని అన వలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీలలితా సహస్రనామ భాష్యము

542వ నామ మంత్రము 29.12.2021

ఓం పుణ్యకీర్తయే నమః

పుణ్యమైన కీర్తి గల పరమేశ్వరికి నమస్కారము. 

శ్రీలలితా సహస్రనామావళి యందలి   పుణ్యకీర్తిః అను నాలుగక్షరముల(చతురక్షరి) నామమును ఓం పుణ్యకీర్తయే నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగజ్జననిని ఉపాసించు భక్తులకు ఆ దేవి కరుణచే అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదలకు కావలసిన సాధనాపటిమ కలిగి ఆ తల్లి పాదసేవ యందు నిరతులై  తరించుదురు. 

శ్రీలలితా పరమేశ్వరి మహత్తరమైన యశస్సు గలిగినది. శ్రీలలితా సహస్ర నామములు రహస్యాతి రహస్యమైనవి. అంతమాత్రమున రహస్యముగా, ఎవరూ వినకుండా పఠించమనికాదు. సహస్ర నామము లందలి ప్రతీ నామమునకు బాహ్యార్థము ఒకటే ఉన్నను, అంతరార్థము చాలా నిగూఢమైనది.     కోట్లాది భక్తులు, శ్రీవిద్యోపాసకులు, వ్యాఖ్యాతలు ఉన్నారు. ఒక్కొక్కరికీ ఒక్కొక్క విధముగా  భావము స్ఫురిస్తూ ఉంటుంది. అన్ని భావములలో అమ్మవారు కీర్తింపబడుతోంది. శ్రుతులందు, స్మృతులందు మహత్తరముగా కీర్తింపబడినది. కీర్తింపబడు ప్రతీ కీర్తనయు అనంతపుణ్యప్రదము. గనుకనే శ్రీమాత పుణ్యకీర్తిః యని వశిన్యాది వాగ్దేవతలచే నామకరణము చేయబడినది. ఓం లేదా ఓం ఐం హ్రీం శ్రీం లేదా ఓం ఐం హ్రీం శ్రీం క్లీం అను బీజాక్షరములు అమ్మవారి సహస్ర నామములలో ఏ నామమునకైనను ముందుచేర్చి, నామము తరువాత నమః అని చేర్చి ఉచ్చరించితే ఆ నామము ఒక నామమంత్రమై యలరారుచున్నది. అటువంటి సహస్ర నామములు సహస్రనామ మంత్రములైతే, ప్రతీ నామ మంత్రము ఉపాసకునికి కైవల్యదాయకమగుచున్నది. భక్తునికి ఇష్టకామ్యార్థసిద్ధి గలుగుచున్నది. అంతటి పుణ్యప్రదమైన నామములు కలిగి యుండుటచే శ్రీలలితా పరమేశ్వరి పుణ్యకీర్తిః యని అనబడినది. 

తన భర్తను (పరమేశ్వరుని) యజ్ఞమునకు పిలువకుండా తన తండ్రి అవమానిస్తే, పిలవని పేరంటమునకు తానే వెళ్ళింది. యజ్ఞశాలలో తన భర్తను తన తండ్రి  దుర్బాషలతో అవమానిస్తే, యజ్ఞకుండములో ఆత్మత్యాగము చేసుకొని, శక్తిపీఠాధిష్ఠానదేవతయై, ఒక్కొక్క పీఠమునకు ఒక్కొక్క పుణ్యప్రదగాథతో భక్తులను పునీతులనుజేయునను పుణ్యమైన కీర్తిని గలిగియున్నదగుటచే ఆ శ్రీలలితా పరమేశ్వరి పుణ్యకీర్తిః యని అనబడినది. 


లోకకంటకులైన మహిషాసుర, భండాసురాది రాక్షసులను సంహరించి, దేవతలకార్యములను చక్కబెట్టుటకు మరల మరల యవతరించుచూ దేవకార్యసముద్యతా యను నామప్రసిద్ధయను కీర్తినందిన పరమేశ్వరి పుణ్యకీర్తిః యని అనబడినది. 


కంచి కామాక్షిగా, మధుర మీనాక్షిగా, కాశీ విశాలాక్షిగా, దేవతలందరిలో అనుత్తమ గా, గ్రామ గ్రామాన గ్రామదేవతగా భాసిల్లు పరమేశ్వరి భక్తజనుల పాలిట పుణ్యప్రదాతయైనది గనుక ఆ పరమేశ్వరి పుణ్యకీర్తిః యని అనబడినది.


అమ్మవారికి నమస్కరించునపుడు ఓం పుణ్యకీర్తయే నమః అని అనవలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

543వ నామ మంత్రము 30.12.2021

ఓం పుణ్యలభ్యాయై నమః

ఎన్నోజన్మల పుణ్యఫలంగా సాక్షాత్కారం ఏ పరమాత్మవలన లభిస్తుందో, అటువంటి పరమాత్మ అయిన శ్రీలలితా పరమేశ్వరికి నమస్కారము.

 శ్రీలలితా సహస్రనామావళిలోని పుణ్యలభ్యా అను నాలుగక్షరముల (చతురక్షరి) నామ మంత్రమును ఓం పుణ్యలభ్యాయై నమః అని ఉచ్చరిస్తూ ఆ పరాశక్తిని ఉపాసిస్తే అది జన్మ జన్మల పుణ్యఫలమే అవుతుంది, ఆతల్లి తమ కనులముందు మందస్మితయై కనుల ముందు నిలిచిన భావం కలుగుతుంది, సరస్వతీ దేవి కచ్చపీ వీణామాధుర్యంకన్నా మధురమైన పలుకులతో ఆ పరమేశ్వరి తన అనుగ్రహభాషణం ప్రసాదించిన అనుభూతి కలిగి ఈ జన్మకు ఇదిచాలు అనిపిస్తుంది.

అనంతకోటి జీవరాశులలో మానవజన్మ ఉత్తమోత్తమమైనది. అత్యంత దుర్లభమైన మానవ జన్మ ఎన్నోజన్మల పుణ్యఫలంగా లభిస్తుంది. ఉత్తమమైన మానవజన్మలో పరబ్రహ్మ స్వరూపిణియైన పరమేశ్వరిని ఆరాధించగలిగుటయన్నదికూడా మరింత ఉత్తమము. శ్రీవిద్యోపాసన, శ్రీలలితా సహస్రనామ పారాయణము చేయు భాగ్యము అనునది పుణ్యఫలమే గాని అన్యము కానేకాదు.  ఆ పరమేశ్వరి అనుగ్రహము పొందాలంటే ఎంతోపుణ్యము చేసిఉండాలి గనుకనే ఆ తల్లి పుణ్యలభ్యా యని అనబడినది. 

పరమాత్మను ఆరాధించాలన్నా, పరమాత్మ నామము ఉచ్చరించాలన్నా, ఆలయంలో పరమాత్మయొక్క మూర్తిని దర్శించాలన్నా కావలసినది పుణ్యఫలం మాత్రమే. వేదాధ్యయనం చేసినా, శాస్త్రాలు, పురాణాలు పుక్కిటబట్టినా పరమాత్మను పొందలేము. అందుకు కావలసినది కేవలం పరమాత్ముని సేవించాలనే ఆసక్తి మాత్రమే. 

ఏ వేదంబు పఠించె లూత , భుజగం బే శాస్త్రముల్సూచె దా

      నే విద్యాభ్యసనం బొనర్చె గరి , చెంచే మంత్ర మూహించె , బో

     ధావిర్భావ నిధానముల్ చదువులయ్యా ? కావు , మీ పాద సం

     సేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీ  కాళహస్తీశ్వరా!

                   

 ఓ ఈశ్వరా  ! జ్ఞాన సముపార్జనకు ప్రాణులకు విద్య అవసరం లేదు. నీ పాదసేవయే సమస్తజ్ఞానమును కల్గించును . ఎట్లనగా నిన్ను సేవించిన సాలెపురుగు ఏ వేదాధ్యయనము చేసి,జ్ఞానమును సముపార్జించినది . నిన్ను సేవించిన సర్పము ఏ శాస్త్రమును చదివినది . నిను పూజించిన ఏనుగు   ఏ విద్య నభ్యసించినది .  బోయవాడైన తిన్నడు  ఏ మంత్రమును చదివి   నిన్ను సేవించి ముక్తి పొందినాడు .  కావున నీ పాదములను సేవించాలనే కుతూహలమే సమస్త జ్ఞానమును కల్గించును ప్రభూ. 

పరమాత్మ నామ స్మరణచేయాలను తలంపు అయినను గతంలో చేసిన పుణ్యఫలమే గాని ఇంకేమియు కాదు.

శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరిలో ప్రథమశ్లోకంలో ఇలా అన్నారు.

శివః శక్త్యా యుక్తో- యది భవతి శక్తః ప్రభవితుం

న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి|

అతస్త్వామ్ ఆరాధ్యాం హరి-హర-విరిన్చాదిభి రపి

ప్రణంతుం స్తోతుం వా కథ-మక్ర్త పుణ్యః ప్రభవతి|| 1 ||

అమ్మా పరమేశ్వరీ! నిన్ను నిత్యము శివుడు,విష్ణువు, బ్రహ్మ మొదలైన దేవాదిదేవతలే కొలుస్తూ ఉంటారు.

అటువంటి నిన్ను కొలవాలన్నా నీ పాదపద్మాలు సేవించాలన్నా ఎన్నో జన్మ జన్మల పుణ్యం చేసినవారికి తప్ప అన్యులకు ఆ భాగ్యము దక్కదు కదా!

రాక్షసరాజైన హిరణ్యకశిపునికి భక్తుప్రహ్లాదుడు కుమారుడై పుట్టాడు. ఆ పరమాత్మను సేవించి ధన్యుడయాడు.  ప్రహ్లాదునికి ఆ జన్మ గతజన్మ పుణ్యఫలము తప్ప అన్యముగాదు.   

ఎంతటి పుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ

మంతనమెట్టిదో యుడుతమైని కరాగ్ర నఖాంకురంబులన్‌

సంతసమందఁజేసితివి సత్కులజన్మమ దేమిలెక్క వే

దాంతముగాదె నీ మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!

 శబరి ఎంతటి పుణ్యాత్మురాలో గదా! ఆమె ఎంగిలి చేసిన పండ్లు

పరమాత్మ అవతారమైన రాముడు స్వీకరించాడు.  ఉడుత తనకు చేతనైన సాయం మనస్ఫూర్తిగా చేసినందువలననే పరమాత్మస్వరూపుడైన రాముడు తన చేతులలోనికి తీసికొని దాని శరీరాన్ని చేతివేళ్ళతో నిమిరాడు. గనుక పరమాత్మను పొందాలంటే ఎంతో పుణ్యఫలం ఉండాలి.

జగన్మాతను ఆరాధించాలన్నా, ఆతల్లి నామాన్ని నోటితీరా ఉచ్చరించే భాగ్యముకావాలన్నా ఎన్నో జన్మల పణ్యఫలం ఉంటేనే అది సాధ్యమవుతుంది. శ్రీవిద్యో పాసన ఉపాసకుని చరమ జన్మయందుగానీ లభించదనియు, అట్టి ఉపాసకునికి గర్భనరకము లేదని పురాణ ప్రతీతి. శ్రీదేవి కృప గలిగిన జన్మ, జరా, మరణముల కతీతుడై, జీవన్ముక్తుడై తరించును. అంతటి పుణ్యం లభ్యమై ఉండాలి గనుకనే ఆ పరమేశ్వరి పుణ్యలభ్యా అని యనబడినది. మనము.  మన భావములను బట్టి, శ్రద్ధను బట్టి ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. నామరూప వివర్జితా అని పరమేశ్వరిని అన్నాము. ఒక ప్రత్యేకమైన నామముగాని, రూపముగాని ఆ తల్లికి లేవు. కోట్లాది నామములు, అనంతకోటి రూపాలు ఉన్న ఆ పరమేశ్వరిని మన మనో నేత్రములతో ఏ రూపంలో దర్శిస్తే అదే ఆ తల్లి స్వరూపం. ఆ దర్శనభాగ్యమునకు కూడా గతజన్మ పుణ్యఫలమే కారణమౌతుంది. ఆ తల్లిని దర్శించేది భక్తులుమాత్రమేకాదు. మహిషాసుర, భండాసురాది రాక్షసులుకూడా. రాక్షసులు కూడా ఆ తల్లిని దర్శించారంటే, వారికి కూడా కొంత పుణ్యఫలం ఉన్నదనియే గదా! 

అన్నీ మనం కల్పించుకున్నవే. మనం ఏది గీస్తే అదే ఆ పరమాత్మ స్వరూపము, పిలిచినదే నామము.  చెక్కి నిర్మించినదే విగ్రహం, సకల జగత్తుకూ ఆ పరమేశ్వరియే ఆధారం. పుణ్యములు రెండు విధములు. కోరికలతో చేసే పుణ్యం కామ్యము. కోరికలు లేకుండా చేసేది నిష్కామ్యము. కోరికతో చేసే పుణ్యానికి బంధం ఏర్పడుతుంది. నిష్కామ్యమునకు బంధవిముక్తి ఉంటుంది. నిష్కామ కర్మ సుకృతమై నిలుస్తుంది. అట్టి సుకృతమే జన్మజన్మలపర్యంతం ఆత్మతో పయనిస్తుంది. అందుకే అన్నారు పోయేటప్పుడు తీసుకుపోయేది కర్మఫలం ఒక్కటే. అది పాపమైతే పాపఫలం, పుణ్యమైతే పుణ్యఫలం.

దేవీ భాగవతం తృతీయ స్కంధములో "అధికమైన పుణ్యముగలవారు, తపస్సంపన్నులు మంగళప్రదయైన దేవిని చూచుచున్నారు. రాగము, ఈ దేహముపై మోహము ఉన్నవారు ఎవ్వరును ఆ పరమాత్మను చూడలేకున్నారు" అని చెప్పబడినది. అందుచేత పుణ్యచరితులు మాత్రమే శ్రీలలితా పరమేశ్వరిని దర్శింపగలరు. కావున దేవి పుణ్యలభ్యా అనబడును.

శ్రీలలితా పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం పుణ్యలభ్యాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

544వ నామ మంత్రము 31.12.2021


 ఓం పుణ్యశ్రవణ కీర్తనాయై నమః


ఎవరి కథా శ్రవణకీర్తనలు పుణ్యమును ప్రసాదిస్తాయో అటువంటి జగన్మాతకు నమస్కారము


శ్రీలలితా త్రిపురసుందరీ సహస్రనామావళి యందలి పుణ్యశ్రవణకీర్తనా యను ఎనిమిద క్షరముల (అష్టాక్షరి)  నామమంత్రమును ఓం పుణ్యశ్రవణకీర్తనాయై నమః అని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉచ్చరించుచూ ఆ తల్లిని ఉపాసించు సాధకులకు ఎనలేని బ్రహ్మజ్ఞాన సంపదలు లభించి ఆ జగజ్జననీ పాదసేవనా నిరతులై తరించుదురు. 


ఆ పరమేశ్వరి కథలన్నియు పుణ్యప్రదమైనవి. కోట్లాది సహస్ర నామములలో ఏకైక సహస్ర నామము రహస్యాతి రహస్యమైన శ్రీీలలితా సహస్ర నామము. ప్రతీనామము బాహ్యముగా అర్థము ఒకటే యున్నను అనంతమైన అర్థములను తెలియజేసే పుణ్యప్రదమైన భావములు ఎన్నో ఉన్నవి. అందుకే శ్రీలలితా సహస్ర నామ పారాయణమాచరించు సమయంలో ప్రతీనామానికి గల బాహ్యార్థము, నిక్షిప్తమైన అంతర్భావము సమన్వియించుట అత్యంత పుణ్యప్రదము. అమ్మవారిని ఆనామములు, అంతర్లీనమైన భావములు అమ్మవారిని కీర్తించునవి అయితే, అవి అన్నియు మనకు పుణ్యశ్రవణములే. గనుకనే అమ్మవారు పుణ్యశ్రవణ కీర్తనా యని వశిన్యాదులు అయిదువందల నలుబది నాలుగవ (544వ) నామముగా కీర్తించారు. 


శంకర భగవత్పాదులవారు తమ సౌందర్య లహరిలో అరువది ఆరవ (66వ) శ్లోకములో ఇలావివరించారు:-


విపంచ్యా గాయంతీ - వివిధ మపదానం పశుపతే


స్త్వయారబ్ధే - వక్తుం చలిత శిరసా సాధువచనే |


త్వదీయై ర్మాధుర్యై - రపలపిత తంత్రీకలరవామ్


నిజాం వీణాం వాణీ - నిచుళయతి చోళేన నిభృతమ్‌||66||


ఓ పరమేశ్వరీ! ఒకసారి నీవు సమస్త దేవతలతో సభలో కొలువుతీరి ఉన్నావు. అదే సమయం లో కచ్చపీ వీణ ధరించియున్న సరస్వతీదేవి నిన్ను ఆనందపరచుట కొరకై తన గాత్రాన్ని వీణతో అనుసంధానం చేస్తూ నీ భర్త యైన పరమేశ్వరుని యొక్క వీర గాథలను గానం చేయుచున్నది. అపుడు నీవు ఆ శివగాథా గాన శ్రవణంతో పరవశవై తల యాడించు చుంటివి. అది చూసిన సరస్వతీదేవి నేను పాడితే ఎవరైనా పరవశులు కావలసిందే అని కొంచం మనోగర్వమునకు లోనైనది.  నిన్ను మరింత మెప్పించాలని ఆ వాణి ఇంకా అద్భుతంగా పాడుట మొదలుపెట్టినది. అప్పటివరకు మౌనంగా పరవశిస్తున్న నీవు, ఓ పరమేశ్వరీ!  పరమానందంతో  బాగు బాగు అని కచ్చపీవీణాపాణిని  మెచ్చుకున్నావు. ఆ బాగు బాగు అను రెండు మాటలలో  కోకిల కలకూజితాన్ని మించిన మాధుర్య శోభతో ఉన్న నీ కంఠస్వరం విని, నీ సామాన్య పలుకుల మధురిమ ముందు ఇంతవరకూ తను చేసిన విన్యాసమంతా ఎందుకూ కొరగాదని తెలుసుకుని ఇక పాడటం ఆపివేసింది. సిగ్గుతో తన కచ్చపి అను వీణను కనబడకుండా పైటకొంగుతో కప్పి దాచుకొనుచున్నది.

అమ్మా నీ పలుకులు సరస్వతీ గానాన్ని మించిన మధురాతి మధురమైనవి.


పుణ్యప్రదములైన వాక్కులను వినుటకునూ, పుణ్యప్రదమనందుటకై కీర్తించుటకును ఆ జగన్మాత తన భక్తులను అనుగ్రహించును. శ్రీలలితా పరమేశ్వరి నామకీర్తనము, నామకీర్తన శ్రవణము, ఆ పరమేశ్వరి రూపమునూహించి చేయు ధ్యానములు,  అమ్మవారిని కీర్తించుచూ మహాత్ములు వినిపించు  పుణ్యకీర్తనములు అపారమైన మరియు ఊహాతీతమైన పుణ్యఫలము లభించునట్లు చేయును ఆ జగన్మాత. ఆపదలనుండి కాపాడుటకు లలితా సహస్రనామ పారాయణమును భక్తితో ఆచరించు వారిని కంటికి రెప్పవలె కాపాడుతుంది ఆ పరమేశ్వరి. గనుకనే ఆ పరమేశ్వరికి పుణ్యశ్రవణ కీర్తనా అనే నామముతో వశిన్యాదులు అమ్మవారిని కీర్తించారు. ఆ కీర్తన అత్యంత పుణ్యప్రదమైనది. అటువంటి పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం పుణ్యశ్రవణ కీర్తనాయై నమః అని యనవలెను.


శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


545వ నామ మంత్రము 1.1.2022


ఓం  పులోమజార్చితాయై నమః


పులోముని పుత్రికయైన ఇంద్రాణి (ఇంద్రుని భార్య) చేత అర్చించబడిన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి పులోమజార్చితా అను ఆరు అక్షరముల (షడాక్షరి) నామ మంత్రమును ఓం పులోమజార్చితాయై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు ఉపాసకులకు ఆ కరుణా మయి అనుగ్రహంచే జ్ఞాన సిద్ధులై, పరతత్త్వరూపిణియైన జగజ్జనని స్వరూపము అనుభవైకవేద్యమయి, ఇహమందు అన్నవస్త్రాది భోగభాగ్యములకు లోటులేక, అంత్యమున అమ్మనే స్మరిస్తూ తరించగలుగుతారు.


ఇంద్రుని భార్య అయిన ఇంద్రాణి (శచీదేవి) పులోముని కూతురు. గనుకనే శచీదేవి పులోమజ అని యనబడినది.


నహుషుడు చంద్రవంశంలో జన్మించిన గొప్ప రాజు. దానధర్మాలతో, యజ్ఞయాగాలతో, యయాతి వంటి పుత్రులతో ప్రపంచమంతటా వేనోళ్ల కీర్తింపబడిన వాడు. అలా దశదిశలకూ వ్యాపించిన అతని కీర్తి, ఇంద్రలోకానికి కూడా చేరుకుంది.  


ఒకసారి ఇంద్రుడు వృత్రాసురుడు అనే రాక్షసుని సంహరించాడు. దాని వల్ల తనకు పాపం చుట్టుకుందని భావించిన ఇంద్రుడు, కొన్నాళ్ల పాటు నారాయణమంత్రాన్ని జపిస్తూ ఒక కమలంలో ఉండిపోవాలని నిశ్చయించుకుంటాడు. కానీ ఇంద్రుడు వచ్చేవరకూ ఇంద్రపదవిని అధిష్టించేది ఎవరు అన్న సమస్య మొదలైంది. ఇంద్రపదవిని చేపట్టేందుకు అందుకు సరైనవాడు ఎవరా అని అష్టదిక్పాలకులంతా ఆలోచించగా, నహుషుడే అందుకు తగినవాడు అని ముక్తకంఠంతో చెప్పారు. దాంతో ఒక సాధారణ రాజైన నహుషుడికి ఇంద్రపదవిని కట్టబెట్టారు.


ఇంద్రపదవిని చేపట్టిన నహుషుడు మొదట్లో బాగానే ప్రవర్తించాడు. కానీ రానురానూ అతనిలో అధికారం తలకెక్కింది. మదపు మత్తులో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అలాంటి నహుషునికి ఓమారు ఇంద్రుని భార్య అయిన శచీదేవి కనిపించింది. అంతే! ఇంద్రపదవి నాదే అయినప్పుడు ఇక ఇంద్రుని భార్య కూడా నాదే కావాలి అనుకున్నాడు నహుషుడు. వెంటనే ఆమెకు తన మనసులో మాటను తెలియచేశాడు. నహుషుని మాటలకు శచీదేవి విస్తుబోయింది. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. వద్దు అన్నా వినేలాగ లేడు నహుషుడు. ఆ సమయంలో దేవతల గురువు బృహస్పతి, శచీదేవికి భువనేశ్వరీ మంత్రాన్ని ఉపదేశించి "అమ్మా! ఇంద్రాణీ! ఈ మంత్రాన్ని ఉపదేశించి పరమేశ్వరి అనుగ్రహం సంపాదించుకో. ఆ తల్లే సమస్యను పరిష్కరిస్తుంది"  అన్నాడు. 


బృహస్పతి సలహామేరకు శచీదేవి పరమేశ్వరిని ఆరాధించింది. 


 పులోమజచే అర్చింపబడిన పరమేశ్వరి సంతసించి తన మాయను ప్రభావితంచేయుటచే ఇంద్రపదవిలో నున్న నహుషునికి  గర్వం తలకెక్కింది. అగస్త్యుడు మొదలైన ఋషులందరి చేతా తన పల్లకీని మోయించుకున్నాడు. ఇంద్రపదవి, అందువల్ల  శచీదేవి కూడా తనది కాబోతుందనుకున్నాడు.  నహుషునిలోని గర్వానికి అంతులేకుండా పోయింది. శచీదేవిని చేరాలనే దుర్బుద్ధి అధికమైపోయింది. గర్వం తలకెక్కి  పల్లకీని మోస్తున్న అగస్త్యుడిని ఒక్క తాపు తన్నాడు. సర్ప! సర్ప! (త్వరగా, త్వరగా) అంటూ ఆయనను తొందరపెట్టాడు. ఆ అవమానాన్ని అగస్త్యుడు ఓర్వలేకపోయాడు. ‘సర్ప! సర్ప! అంటున్నావు కదా! నువ్వు సర్పానివై భూలోకాన పడి ఉండు,’ అంటూ నహుషుడిని శపించాడు. నహుషుడు పామైపోయి భూలోకానికి వెళ్ళాడు. తరువాతకూడా శచీదేవి పరమేశ్వరిని ఆరాధించుతూనే ఉన్నది.  పరమేశ్వరి కరుణచే ఇంద్రుడుకూడా తిరిగి ఇంద్రపదవి చేపట్టాడు. పామైపోయిన నహుషుడు తప్పు తెలిసికొని పరివర్తనచెందాడు. ఇదంతా పులోమజ చే (ఇంద్రాణిచే) పూజింపబడిన పరమేశ్వరి వలననే ఇంద్రునికి మరల ఇంద్రపదవి లభించుట, నహుషునికి శాపవిమోచనము కలిగి పరివర్తన చెందుట జరిగినది. ఆ విధముగా పులోమజచే అర్చింపబడిన పరమేశ్వరి పులోమజార్చితా యని వశిన్యాది వాగ్దేవతలచే కీర్తింపబడినది.


అమ్మవారికి నమస్కరించునపుడు ఓం పులోమజార్చితాయై నమః అని అనవలెను.


శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


546వ నామ మంత్రము 2.1.2022


ఓం బంధమోచన్యై నమః


జీవుణ్ణి అవిద్యా బంధముల నుండి విముక్తి లభింపజేయు పరమేశ్వరికి నమస్కారము


శ్రీలలితా సహస్రనామావళియందలి బంధమోచనీ యను ఐదు అక్షరముల (పంచాక్షరి) నామ మంత్రమును అత్యంత భక్తిశ్రద్ధలతో ఓం బంధమోచన్యై నమః అని ఉచ్చరిస్తూ ఆ పరాశక్తిని ఉపాసించు సాధకులకు ఆత్మానుభూతియు, విశ్వానుభూతియు అమ్మ దయచే ప్రాప్తించి తరించుదురు.


బంధములు (పాశములు) అనునవి అవిద్యాసంబంధమైనవి. అనగా అజ్ఞాన సంబంధమైనవి. జీవుడు తల్లిగర్భంనుండి భూమిపై పడినంతనే, ఆ శిశువుపై నీళ్ళు చిలకరించుతారు. అంతే ఆ శిశువు ఒక్క సారి కేర్ అంటూ ఏడుస్తాడు. ఆ ఏడుపు అర్థం ఏమిటంటే గతస్మృతులు పోయాయనియు, మళ్ళీ జన్మించానా? అనియు ఆ ఏడుపులోని అర్థం. అంతటితో ఆ శిశువు బంధాలలో పడ్డాడు. తల్లి, తండ్రి, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అను ఈ బంధాలలోనికి ప్రవేశించాడు. ఈ బంధాలు అన్నియు అవిద్యాపరమైనవి. 


ఎలాగైతే అజ్ఞానము వ్యక్తిని సంసారములో', అంటే నిరంతర జనన-మరణ చక్రం లో పడవేసి, బాధకు గురిచేయునో, అలాగే, జ్ఞానమునకు వ్యక్తిని భౌతిక బంధము నుండి విడిపించే శక్తి కూడా ఉంటుంది. ఇటువంటి జ్ఞానము ఎప్పుడూ కూడా భగవంతుని పై భక్తితో కూడి ఉంటుంది. 


తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః|


గచ్ఛంత్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః॥ 

             (భ.గీ - 5.17)


తమ బుద్ధి భగవంతుని యందే స్థితులైనవారు, సంపూర్ణముగా భగవంతుని యందే నిమగ్నమైన వారు, ఆయనే పరమ లక్ష్యమని ధృఢ విశ్వాసం కలవారు - వారి పాపములు జ్ఞాన కిరణాలచే నిర్మూలింపబడి, త్వరిత గతిన, మరలా తిరిగిరాని స్థితిని పొందుతారు.


పరమేశ్వరి తన భక్తులకు ఏర్పడు సకల బంధములనుండి విముక్తిని కలుగజేయును.


ఈ శ్లోకం, సంపూర్ణ భగవంతుని ధ్యాసను సూచించటానికి చాలా బలమైన పద ప్రయోగం చేస్తున్నది.


బంధములు అనునవి మూడురకములు.


భౌతిక బంధమ అనునది, ఎవరి చేతనైనా చెరబట్టబడి యుండుట, కారాగార వాసము, ఆపదలో చిక్కుకుని ఎక్కడైనా ఉండిపోవడం అనునది భౌతిక బంధము.


మానసిక బంధము దేనికోసమైనా ఆశపడడం, అర్హతకు మించి ధనం సంపాదించాలనే దురాశ, కామము, క్రోధము, అభిమానము ఇలాంటివి అన్నియును మానసిక బంధములు. 


ఆధ్యాత్మిక బంధము గురువుయెడ చేసిన తప్పు వలనగాని, మంత్రసాధనలో లోపము వలన  ఏర్పడిన దోషము వలనగాని, ఎవరికో ఆపదకలిగించాలనే దురుద్దేశంతో చేయు పూజలవలన గాని మనసు దెబ్బతింటే ఆ బంధము ఆధ్యాత్మికమవుతుంది.


ఇటువంటి బంధాలనుండి జగన్మాత  తన భక్తులను విముక్తులను చేస్తుంది గనుకనే ఆ తల్లి బంధమోచనీ యనిఅనబడినది.


ఉదయం లేచినప్పటి నుండి నిద్రపోయే వరకూ కూడా సంసారపరమైన, వృత్తిపరమైన వివిధబంధాలలో చిక్కుకుని క్షణకాలంకూడా పరమాత్మపై మనసు నిలుపలేక బాధ పడడం సహజం.  అలా పరమాత్మయందు మనసు నిలుపలేక పోవుటయే ఒక పెద్ద బంధము. ఎంత పని ఉన్నా ఒక్క క్షణమైనా పరమాత్మయందు మనసు ఉంచితే అది పవిత్రబంధం అవుతుంది. దాని వలన అవిద్యాపరమైన బంధములన్నియు  తొలగిపోయి శాశ్వతమైన పరమాత్మ బంధం ఏర్పడుతుంది. అదే అసలైన బంధము. ఈ పరమార్థాన్ని తెలుసుకొని ఇరువది నాలుగు గంటల సమయంలో కనీసం ఇరువది నాలుగు నిముషములు ఆ పరమేశ్వరిపై ధ్యానము ఉంచుట అత్యుత్తమము.


సర్వబంధముల  (అవిద్యా సంబంధమైన బంధముల) నుండి విముక్తిని గావించు జగన్మాతకు నమస్కరించు నపుడు ఓం బంధమోచన్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹



శ్రీలలితా సహస్రనామ భాష్యము


547వ నామ మంత్రము 3.1.2022


ఓం బన్ధురాలకాయై నమః


వంకీలు తిరిగి అందముగానున్న ముంగురులు కలిగిన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా పరమేశ్వరి సహస్రనామావళి యందలి బన్ధురాలకా అను అయిదక్షరముల (పంచాక్షరి) నామ మంత్రమును  ఓం బన్ధురాలకాయై నమః అని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరి పాపపద్మములపై దృష్టి నిలిపి ఉచ్చరిస్తూ, ఆ తల్లిని ఉపాసించు భక్తులకు ఆత్మానుభూతియు, ఐహిక, ఆముష్మిక శుభాలను ఆ పరమేశ్వరి ప్రాప్తింపజేసి తరింపజేయును 


ఇదంయతు మహాద్భూతం అనన్తమపారం ప్రజ్ఞానమేవచ ఆ జగదీశ్వరి ప్రభావము మహిమాన్వితమును, అనన్తమును, అపారమును, ప్రజ్ఞానమును అయినదని భావము.


అమ్మవారు అందముగా, దట్టముగా, వంకీలు తిరిగిన ముంగురులతో శోభిల్లుచున్నది.

బన్ధురాలక అనగా బన్ధుర+అలకా (బంన్ధురాలకా)

కొందరు ఈ నామ మంత్రమును బర్బరాలక అని చదువుతారు; పొట్టిగాను, వంకరులు గాను, అలలవలె, ఉంగరములుగా ఉండిన ముంగురులు కలిగినది ఆ పరమేశ్వరి అని భావము.


అమ్మవారు అపురూప లావణ్యవతి.     అష్టమి చంద్రుని వలె ప్రకాశించే లలాటము (అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థలశోభిత), మన్మథుని మాంగల్య గృహమును బోలిన వదనానికి గృహతోరణాలై విరాజిల్లు కనుబొమలు (వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లిక), ముఖకాంతిప్రవాహంలో చలించే మీనముల వంటి నయనములు (వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచన), అప్పుడే వికసించిన సంపెంగవంటి నాసాదండము (నవచంపకపుష్పాభ నాసాదండ విరాజిత), శుక్రనక్షత్ర కాంతులను సైతం ధిక్కరించే నాసాభరణ కాంతులు (తారాకాంతి తిరస్కారి నాసాభరణ విరాజిత), పద్మరాగ శిలలను, అద్దమును తిరస్కరించే నిర్మలమైన, నున్ననైన చెక్కిళ్ళు (పద్మరాగ శిలాదర్శ పరిభావి కఫోలభూః), అప్పుడే సాన బట్టిన పగడము, దొండపండుల కాంతిని వెక్కిరించే ఎర్రని కాంతులతో ప్రకాశించే పెదవులు (నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛద),  షోడశీమంత్రబీజాక్షరములవలె ప్రకాశించు పలువరసల జంట (శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్జ్వల)....ఇలా అవయవ సౌందర్యసంపదతో అపురూప లావణ్యవతియగు  ఆ తల్లి దట్టముగా, నల్లగా, ఎత్తు పల్లములతో వంకీలుగా ఉన్న ముంగురులతో ద్విగుణీకృతమైన సౌందర్యముతో జగదేక సుందరియై భాసిల్లుచున్నది.  ఆ అందమైన కేశసంపదతో లోకమోహన రూపధారిణియై విరాజిల్లు ఆ తల్లి బంధురాలకా యను నామముతో వశిన్యాదులచే కీర్తింపబడినది. శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరి, నలుబది ఐదవ శ్లోకంలో ఇలా వర్ణించారు:


అరాలై స్వాభావ్యా-దలికలభసశ్రీభిరలకైః


పరీతం తే వక్త్రం - పరిహసతి పంకేరుహ రుచిమ్ |


దరస్మేరే యస్మిన్ - దశనరుచి కింజల్కరుచిరే


సుగంధౌ మాద్యంతి - స్మరదహన చక్షుర్మధులిహః॥45॥

 

ముంగురులచే కమ్ముకొనిన జగన్మాత వదనము పద్మములను సైతము పరిహసించుచున్నది.  


ఓ లలితాంబికా! పరమేశ్వరీ! సహజంగా వంకరలు తిరిగినవై తుమ్మెదల కాంతివంటి నల్లని కాంతి కలిగిన ముంగురులు మీద పడుచున్న నీ ముఖారవిందము పద్మముల అందమును ధిక్కరించుచిన్నది. అది ఎలాగ అంటే, ఆ పద్మాలు ఎంత అందంగా ఉన్నా - నీ ముఖం అంతకు మించిన సౌందర్యంతో ఉంటుంది.ఆ పద్మాలలో నిత్యం సువాసనలు వెదజల్లే కింజల్కాలు ఉంటే - నీ ముఖంలో నిత్యం చిరునవ్వుల పరిమళాలు వెదజల్లే దంతాలు ఉన్నవి. ఆ పద్మాల మీద తుమ్మెదలు వాలుతూ ఉంటే - నీ ముఖముపై నీ ముంగురులు దోబూచులాడుచున్నవి. అంతమాత్రంచేత ఆ పద్మాలతో  నీ వదనారవిందాన్ని పోల్చరాదు. ఎందుచేతననగా ఆ పద్మముల మకరందమును గ్రోలుటకై తుమ్మెదలు మాత్రమే మోహపడుతున్నవి కాని పలువరుస తళుక్కులతో చిరునవ్వుల సోయగముతో నిండియున్న నీ ముఖ సౌందర్య మకరందాన్ని గ్రోలుటకు ఎటువంటి కామ వికారములు లేక ఆ మన్మథుడినే జయించిన ఆ కామేశ్వరుని చూపులు అను తుమ్మెదలు నిత్యం నీ ముఖముపైనే ముసురుకొనుచున్నవి. అనగా మన్మథుడిని సైతము జయించిన శంకరుడు అమ్మ సోయగమునకు వశుడైనాడు.   

 

అటువంటి త్రిపురసుందరీ మాతకు నమస్కరించు నపుడు ఓం బన్ధురాలకాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹



శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


548వ నామ మంత్రము  4.1.2022


ఓం విమర్శరూపిణ్యై నమః


విమర్శ రూప శక్తిగా (విచారణా శక్తిగా) విరాజిల్లుచున్న శ్రీలలితా పరమేశ్వరికి నమస్కారము


శ్రీలలితా సహస్ర నామావళి యందలి విమర్శరూపిణీ యను ఆరు అక్షరముల (షడాక్షరీ) నామ మంత్రమును ఓం విమర్శరూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకుడు విమర్శనాత్మక రూపమును తెలియకుండునా? (తెలియగలడు), బ్రహ్మజ్ఞానతత్త్వాన్ని తనలో ఇముడ్చుకొనుటకు ఆ పరమేశ్వరిని   ఉపాసించు క్రమము కనగొనకుండునా? (కనుగొనును), ఆ తల్లి కరుణచే భౌతిక ఆధ్యాత్మిక శుభములను ప్రాప్తించి సర్వకాల సర్వావస్థలయందూ పరమేశ్వరి రక్షణతో జీవించి తరించును.


జగన్మాత పరబ్రహ్మ స్వరూపిణి. ఆ తల్లి పరమాత్మ. పరమాత్మయొక్క ప్రకాశస్వరూపస్ఫురణకు విమర్శ యని అందురు. పరమాత్మయైన పరమేశ్వరి అనగా  పరబ్రహ్మము యొక్క సహజమగు ప్రకాశము. అటువంటి సహజప్రకాశము యొక్క స్ఫురణాశక్తియే విమర్శ. గనుకనే పరమాత్మయైన పరమేశ్వరి విమర్శరూపిణిీ యని అనబడినది.  


ఆత్మ అనాత్మల యొక్క వివేక శక్తియే విమర్శ.  మాయోపాధికమైన దృశ్యమాన బ్రహ్మాండ, పిండాండ ఆత్మసంబంధమైన ఆత్మానాత్మ వివేక, అవస్థాత్రయ ( జాగ్రదా వస్థ- మెళకువగా ఉన్నప్పటి స్థితి,  స్వప్నావస్థ- కలలు కనే స్థితి, సుషుప్తావస్థ - నిద్రావస్థ, ఈ మూడే కాకుండా నాలుగవ అవస్థ మరొకటి ఉంది. అదే తురీయావస్థ దీనినే   సమాధి స్థితి అన్నారు).


పంచకోశములు (1. అన్నమయ కోశము, 2. ప్రాణమయ కోశము, 3. మనోమయ కోశము, 4. విజ్ఞానమయ కోశము, 5. ఆనందమయ కోశము) 


పంచభూతములు  (ఆకాశం, గాలి, నిప్పు, నీరు, మట్టి).


సప్తధాతువులు  ( రసము, రుధిరము, మాంసము, మేదస్సు, మజ్జ, శుక్లము, అస్థి).


సప్తచక్రములు  (శ్రీవిద్యలోను, వివిధ తంత్రములలోను చెప్పిన ప్రకారము మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు అవి: మూలాధార చక్రము, స్వాధిష్ఠాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము మరియు సహస్రార చక్రము తో కలిపి సప్త చక్రాలు అని  చెబుతారు) 


వీటి యొక్క విజ్ఞానాత్మక విమర్శల వివేచనమే స్వరూపముగా గలిగిన పరమేశ్వరి విమర్శరూపిణీ యని అనబడినది.

 

మూలాధారాది షట్చక్రములు మరియు సహస్రార చక్రముతో మొత్తం సప్తచక్రములందును, పంచకోశములందును, సప్తధాతువు లందును అమ్మను విమర్శరూపిణిగా తెలియజేయు  శ్రీలలితా సహస్రనామావళియందలి కొన్ని నామమంత్రములు:


మూలాధారచక్రంలో పరమేశ్వరి స్వరూపము


99వ నామ మంత్రము - ఓం మూలాధారైక నిలయాయై నమః (మూలాధార పద్మమునందు వసించు తల్లికి నమస్కారము - నాలుగు రేకుల గల మూలాధార పద్మములో నిద్రాణమైన కుండలినీ శక్తి రూపంలో జగన్మాత ఉంటుంది)


514వ నామ మంత్రము ఓం మూలాధారాంబుజారూఢాయై నమః (మూలాధారమనే చతుర్దళ పద్మంలో సాకినీ దేవతారూపంలో ఉండు తల్లికి నమస్కారము)


స్వాధిష్ఠాన చక్రంలో  అమ్మస్వరూపము


504వ నామ మంత్రము ఓం సాధిష్ఠానాంబుజగతాయై నమః (స్వాధిష్ఠాన చక్రంలో కాకిని దేవతా రూపంలో ఉండు తల్లికి నమస్కారము)


మణిపూరక చక్రంలో అమ్మ స్వరూపము

495వ నామ మంత్రము ఓం మణిపూరాబ్జ నిలయాయై నమః (దశదళ పద్మమైన మణిపూరమునందు వసించు తల్లికి నమస్కారము - నాభి యందున్న పది రేకుల పద్మము మణిపూరచక్రం . అక్కడ లాకినీ అనే దేవతా రూపంలో జగజ్జనని కొలువై ఉంటుంది)

101వ నామ మంత్రము ఓం మణిపూరాంతరుదితాయై నమః (నాభియందున్న మణిపూరచక్రంలో భాసిల్లు తల్లికి నమస్కారము. మూలాధారాన్ని దాటి, బ్రహ్మగ్రంథిని  భేదించి శ్రీమాత కుండలినీ శక్తి రూపంలో ఇక్కడ ప్రకటితమౌతున్నది)

అనాహత చక్రంలో అమ్మ స్వరూపము

485వ నామ మంత్రము ఓం అనాహతాబ్జ నిలయాయై నమః (అనాహత పద్మమునందు వసించు తల్లికి నమస్కారము - హృదయంలో పండ్రెండు దళములతో గూడిన కమలం అనే అనాహత చక్రం ఉంది. అందు రాకినీ యోగిని రూపంలో జగజ్జనని అధిష్ఠించి ఉన్నది)

విశుద్ధ చక్రంలో అమ్మ స్వరూపము 

475వ నామ మంత్రము ఓం విశుద్ధచక్ర నిలయాయై నమః (కంఠమున ఉండే విశుద్ధ చక్రము నందు పదహారు దళముల పద్మమందు డాకినీ రూపిణియై వసించు తల్లికి నమస్కారము)

ఆజ్ఞాచక్రంలో అమ్మ స్వరూపము

103వ నామ మంత్రము *ఓం ఆజ్ఞా చక్రాంతరాళస్థాయై నమః (కనుబొమల మధ్యలో నున్న ఆజ్ఞాచక్రంలో, ద్విదళ పద్మమున హాకినీ రూపధారిణియై భాసిల్లు తల్లికి నమస్కారము)

సహస్రారచక్రంలో అమ్మ స్వరూపము


105వ నామ మంత్రము ఓం సహస్రారాంబుజారూఢాయై నమః (బ్రహ్మరంధ్రానికి దిగువున గల వేయి దళాలున్న పద్మమునందు  యాకినీ రూపధారిణియై భాసిల్లు తల్లికి నమస్కారము)


106వ నామ మంత్రము ఓం సుధాసారాభివర్షిణ్యై నమః (సహస్రదళ పద్మం యొక్క కర్ణిక - బొడ్డు నుండి అమృతధారలను కురిపించు తల్లికి నమస్కారము. లలితాంబిక తన భక్తులకు అమృతత్త్వమును కలిగించును. సాధకుడు నేను అనే భ్రాంతిని వదిలి పరమాత్మతో ఐక్యమునొంది జీవన్ముక్తుడగును)


108వ నామ మంత్రము ఓం షట్చోక్రోపరి సంస్థితాయై నమః (ఆరు చక్రాలనుదాటి సహస్రారచక్రంలో భాసిల్లు తల్లికి నమస్కారము. మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలను దాటి సహస్రార చక్రాన్ని చేరి, అందు పరిపూర్ణంగా వ్యక్తమగు శ్రీమాతకు నమస్కారము)


524వ నామ మంత్రము ఓం మజ్జాసంస్థాయై నమః (ఎముకలలోని మజ్జ అనే ధాతువునకు అధిష్ఠాన దేవత అయిన తల్లికి నమస్కారము)


428వ నామ మంత్రము ఓం పంచకోశాంతరస్థితాయై నమః

(పంచకోశాలలో చివరిదైన ఆనందమయకోశం మధ్యలో స్థితమై ఉండు తల్లికి నమస్కారము. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను - పంచకోశాలు అని అంటారు)


 అంతయు జ్ఞానమయమైనందున ఆ పరమేశ్వరి విమర్శరూపిణి అని నామప్రసిద్ధ మైనది.


అట్టి విమర్శరూపిణియైన అమ్మవారికి నమస్కరించునపుడు ఓం విమర్శరూపిణ్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీలలితా సహస్రనామ భాష్యము

549వ నామ మంత్రము 5.1.2022

 ఓం విద్యాయై నమః

విద్యా అనగా మోక్షాన్నిచ్చే జ్ఞాన స్వరూపిణిగా తేజరిల్లుతున్న తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి విద్యా అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం విద్యాయై నమః అని ఉచ్చరిస్తూ ఆ జగజ్జననిని ఉపాసించు ఉపాసకులకు బ్రహ్మవిద్యాసంపదనొసగి అనుగ్రహించి తరింపజేయును.

విద్య అనగా జ్ఞానము. శ్రీలలితా పరమేశ్వరి నామము విద్య అని శ్రీలలితా సహస్ర నామావళి యందు వశిన్యాదులు చెప్పారంటే, అమ్మవారు విద్యాస్వరూపిణి. శ్రీవిద్యాస్వరూపిణి యని కూడా అంటాము. బ్రహ్మవిద్యా స్వరూపిణి ఆ జగన్మాత గనుక విద్యా యని అనబడినది. పరావిద్య, అపరావిద్య అని రెండువిధములు.

శౌనకుడు అనే జిజ్ఞాసువు అంగిరస మహర్షి వద్దకు వచ్చి "ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుంది?" అని అడిగిన ప్రశ్నకు అంగిరసుడు "పరావిద్య, అపరావిద్య అని రెండు రకాలు తెలుసుకోవలసినవి ఉన్నాయని బ్రహ్మవిదులు అంటారు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. అపరావిద్య అంటే లౌకికమయిన ధర్మాధర్మాలకు సంబంధించినది. రెండవదానికంటే మొదటిది గొప్పది. దాన్ని తెలుసుకున్నవాడు సంసారచక్రం నుంచి విముక్తుడవుతాడు." అంటూ ముండకోపనిషత్తును బోధించాడు.

ముండక ఉపనిషత్తు లేదా ముండకోపనిషత్తు అత్యంత ప్రాచీన ఉపనిషత్తులలో ఒకటి. ఈ ఉపనిషత్తు అధర్వణ వేదమునకు సంబంధించింది. ముక్తిత సూత్రాలననుసరించి ఇది నూటఎనిమిదవ ఉపనిషత్తులలో ఐదవది. 

స్మృతులు అనగా ధర్మశాస్త్రములు. ఇవి వేదార్థ ప్రతిపాదక గ్రంథములు. అందు మనుస్మృతి మిక్కిలి గొప్ప గ్రంథము. ఈమానవ ధర్మశాస్త్రమున జగత్సృష్టి మొదలుకొని సర్వవిషయములును చెప్పబడినవి.  ఇందు బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రులు అను చాతుర్వర్ణ్యాశ్రమ ధర్మములు, వివాహక్రమ పంచమహాయజ్ఞా తిథిపూజా పార్వణవిధి శ్రాద్ధవిధాన భోజననియమాదులు, స్త్రీపురుష ధర్మములు, రాజధర్మములు, వ్యవహార ధర్మములు, ప్రాయశ్చిత్త నియమములు మొదలుగాఁగల హిందువుల వైదిక లౌకిక విషయములు అన్నియు వచింపబడి యున్నవి. మఱియు స్మృతులు వేదముల వలెనే గౌరవింపబడుచున్నవి. కలియుగమునకు విహితములు అగు ధర్మములు పరాశర స్మృతియందు చెప్పఁబడి ఉన్నాయి. పురాణముల వలె స్మృతులును పదునెనిమిది. అవి మనుస్మృతి, బృహస్పతిస్మృతి, దక్షస్మృతి, గౌతమస్మృతి, యమస్మృతి, అంగీరసస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, ప్రచేతస్స్మృతి, శాతాతపస్మృతి, పరాశరస్మృతి, సంవర్తస్మృతి, ఔశనసస్మృతి, శంఖస్మృతి, లిఖితస్మృతి, ఆత్రేయస్స్మృతి, విష్ణుస్మృతి, ఆపస్తంబస్మృతి, హరీతస్మృతి అనునవి. ఇవికాక ఉపస్మృతులు పదునెనిమిది ఉన్నాయి. అవి కణ్వస్మృతి, కపిలస్మృతి, లోహితస్మృతి, దేవలస్మృతి, కాత్యాయనస్మృతి, లోకాక్షిస్మృతి, బుధస్మృతి, శాతాతపస్మృతి, అత్రిస్మృతి, ప్రచేతస్మృతి, దక్షస్మృతి, విష్ణుస్మృతి, వృద్ధవిష్ణుస్మృతి, వృద్ధమనుస్మృతి, ధౌమ్యస్మృతి, నారదస్మృతి, పౌలస్త్యస్మృతి, ఉత్తరాంగిరసస్మృతి అనబడు స్మృతులు, అష్టాదశ పురాణములు, సంగీత సాహిత్యాది చతుష్షష్టికళలు  - వీటన్నిటి యందును నిక్షిప్తమైన జ్ఞానస్వరూపమే ఆ పరమేశ్వరి. జ్ఞాన (మోక్షదాయకమైన జ్ఞానము), జ్ఞేయ (తెలియదగినది), జ్ఞాతృ (తెలిసికోవలసిన వాడు) - ఈ మూడింటి స్వరూపము కూడా ఆ అమ్మవారే. గనుకనే ఆ పరమేశ్వరి విద్యా యని అనబడినది. 

అమ్మవారు వేదస్వరూపిణి గనుక విద్యా యని అనబడినది.

సకల విద్యా స్వరూపిణి యైన జగదీశ్వరికి నమస్కరించునపుడు ఓం విద్యాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  

శ్రీలలితా సహస్రనామ భాష్యము

550వ నామ మంత్రము 6.1.2022

 ఓం వియదాది జగత్ప్రసవే నమః

ఆకాశము మొదలుగా గల పంచభూతములతో (భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశములతో) కూడిన జగత్తును సృష్టించిన తల్లికి నమస్కారము.

శ్రీ లలితా సహస్ర నామావళయందలి వియదాది జగత్ప్రసూః అను ఎనిమదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం వియదాది జగత్ప్రసవే నమః అని ఉచ్చరిస్తూ ఆ జగన్మాతను అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ విశ్వజనని సర్వసౌభాగ్యములను, బ్రహ్మజ్ఞాన సంపదను ప్రసాదించి ఆయురారోగ్యములతోను, భోగభాగ్యములతోను, కీర్తిప్రతిష్టలతోను జీవనమును కొనసాగించి అంత్యమున మోక్షసిద్ధి కలుగజేయును. 

వియత్ అనగా ఆకాశము, ఆది అనగా మొదలైన, జగత్ అనగా జగత్తును, ప్రసూః అనగా సృష్టించినది

పంచభూతములు అనగా భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము. వీటిని పుట్టించిన ఆ తల్లి మూలప్రకృతి యైన ఆ పరమేశ్వరి. 

చతుర్వింశతి తత్త్వములు మాయ కర్మ గుణములు. ఇవి పశుపతికి పాశములు. జీవులకు కలుగు క్లేశములు. ఇవియే పశుబంధ నములు. మనసు బుద్ధి అహంకారము ఆకాశము వాయువు అగ్ని జలము భూమి ఈ అష్ట ప్రకృతులును ఎనిమిది (8 )ఇతర పదార్థ వికారములు. శ్రోత్రము త్వక్‌ చక్షువు జిహ్వ ఘ్రాణము అనునవి ఐదు. జ్ఞానేంద్రియములు  ఐదు (5), పాయు ఉపస్థ కర పాద వాక్కులు అనునవి ఐదు కర్మేంద్రియములు ఐదు (5) శబ్ద స్పర్శ రూప రస గంధములు ఐదు. విషయములు ఐదు (5) - ఇట్లు ఇవి ఇరువది మూడు (23),  ప్రకృతి వలన ఏర్పడిన తత్త్వములు;  ఇరువది నాలుగవ తత్త్వము అ వ్యక్తము లేదా ప్రధానమందురు; ఈ అవ్యక్తము గుణ సహితము. ఇదియే ఆది మధ్యాంతములు లేనిది. జగత్తునకు పరము కారణము. సత్వము, రజస్సు, తమస్సు అనునవి మూడు గుణములందురు. ఈ మూడిటి సామ్యావస్థ అవ్యక్తము ప్రకృతియని అందురు. సత్త్వము జ్ఞానము, తమస్సు అజ్ఞానము, రజస్సు మిశ్రమము అని చెప్పబడినవి. బుద్ధి వైషమ్యము వలన గుణ వైషమ్యము కలుగునని పండితులు చెప్పెదరు. ఆకాశము మొదలగు పంచభూతాత్మకమైన ప్రపంచమును చక్కగా సృజించినది జగజ్జనని. ఆకాశాది పంచభూతములకు, చతుర్వింశతి తత్త్వములతోగూడిన నామ, రూప, జగత్తును ఆవిర్భవింపజేసినందున ఆ పరమేశ్వరికి వశిన్యాదులు శ్రీలలితా సహస్రనామావళి యందు   వియదాది జగత్ప్రసూః అను ఒక నామమును  ప్రసిద్ధముచేశారు.  అనగా దీనికి కారణము బ్రహ్మయే అని భావింపవలయును.

 తస్మాద్వా ఏతస్మా దాత్మన ఆకాశస్సంభూతః  ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నే రాపః ఆపః పృథ్వి పృథివ్యా ఓషధయః ఓషదిభ్యో అన్నం అన్నాత్పురుషః అని శ్రుతి వాక్యము.

మొదట ఆత్మనుండి ఆకాశం ఉద్భవించింది. ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మ. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి పృథ్వి, పృథ్వి నుండి ఓషధులు, ఓషధులనుండి అన్నము ఆ పిదప పురుషుడు ఉద్భవించడం జరిగినది.

అటువంటి పంచభూతాత్మక జగత్తును సృష్టించిన జగజ్జననికి నమస్కరించునపుడు ఓం వియదాది జగత్ప్రసవే నమః అని భక్తితో ఉచ్చరించవలయును.

   

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

551వ నామ మంత్రము 7.1.2022

ఓం సర్వవ్యాధి ప్రశమన్యై నమః

సమస్త ఆది, వ్యాధులను (మానసిక, శారీరక రోగాలను) శమింపజేయు జగన్మాతకు నమస్కారము 

శ్రీలలితా సహస్రనామావళి యందలి  సర్వవ్యాధి ప్రశమనీ  యను  ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) నామ మంత్రమును ఓం సర్వవ్యాధిప్రశమన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఎటువంటి అనారోగ్య బాధలుగాని, మానసిక బాధలు గాని  లేకుండా అనుగ్రహించును.

వ్యాధులు అనునవి శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక రుగ్మతలకు మందులు వాడవచ్చును. కాని మనోవ్యాధికి మందులు ఉండవు.

మానవునికి తాపత్రయములు అనునవి ఉన్నాయి. ఇవి కూడా వ్యాధులే అనబడతాయి.

తాపత్రయం లేదా త్రివిధ తాపాలు అనగా మూడు రకాలైన తాపాలు అనగా బాధలు అని అర్ధం. ఇవి 1. ఆధ్యాత్మిక తాపం, 2. అధిభౌతిక తాపం మరియు 3. అధిధైవిక తాపం అని మూడు రకాలు.

ఆత్మ అనే దానికి శరీరం, మనస్సు, బుద్ధి , జీవాత్మ , పరమాత్మ అని వివిధ అర్ధాలున్నాయి. మనస్సు, శరీరం ఇత్యాదుల కారణంగా కలిగే శోకం, మోహం, జ్వరాది రోగాలు మున్నగు బాధలు ఆధ్యాత్మిక తాపాలు భూతములనగా ప్రాణులు. మనుష్యులు, పశువులు, పక్షులు, పాములు మొదలైన ప్రాణుల ద్వారా సంభవించే బాధలు అధిభౌతిక తాపాలు. యక్షరాక్షసుల చేత, గ్రహావేశాల చేత, దైవబలముతో కలిగేవి అధిదైవిక తాపాలు. భూకంపం, సునామీ, అతివృష్టి, అనావృష్టి మొదలైనవి ఇందులో చేరతాయి. మానవులమైన మనకు కలిగే నానావిధాలైన బాధలు ఈ త్రివిధతాపాలలో చేరిపోతాయి. వీటికి గురైనవారు తాపత్రయ పీడితులు అనబడతారు. ఆ పరమేశ్వరి మానవునికీ గల తాపత్రయములను పోగొడుతుంది.

శరీరంలో కాలమాన పరిస్థితులచేతను, శీతోష్ణములవలనను అనారోగ్యం వస్తుంది. మందులు వాడితే తగ్గిపోతాయి. మధుమేహము, రక్తపోటు వంటివి జీవితాంతం ఉంటాయి. ఇవి దీర్ఘవ్యాధులుగా చెప్పవచ్చును. వీటికి నిరంతరము వైద్యుని సంప్రదింపులతో నియంత్రణ జరుపుకుంటారు. దీర్ఘవ్యాధులు పూర్వజన్మల కర్మఫలంగా వస్తూ ఉంటాయి. వీటికి  తాత్కాలిక నియంత్రణ మాత్రమే ఉంటుంది. శాశ్వత నివారణ ఉండదు. మానసిక వ్యాధులు అనేవి తనకు అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవడము, తనకు సంబంధించిన వారు దూరంకావడము, ఏదో కారణంచేత  అవమానభారం ఏర్పడడం, ఎవరితోనో తనను పోల్చుకుని, అంతటి ఉన్నతి తనకు లేదనుకోవడము - ఇలాంటి కారణాలవలన ఏర్పడిన మానసిక క్షోభ అనునది మానసిక వ్యాధి అని అంటాము. సంతానం లేకపోవడం లేదా సంతానం ఉన్ననూ వారివలన మనశ్శాంతి లేకపోవడం, వివాహం కాకపోవడం, వివాహం జరిగినా దాంపత్య భాగస్వామివలన  మనశ్శాంతి కరువగుట వంటిది కూడా మానసిక వ్యాధి అంటారు. అలాగే ఉద్యోగార్థికి ఉద్యోగము లేదను చింత, లేదా ఉన్న ఉద్యోగం పోయినచింత, అవసరాల మేరకు ధనము సమకూరలేదను చింత, దొంగలవలన ధనము పోగొట్టుకొనిన  చింత, ఆర్థిక ఇబ్బందులవలన ఏర్పడిన చింత - ఇవి అన్నియునూ కూడా మనోవ్యాధులే అనిపించుకుంటాయి. మనోవ్యాధికి మందులేదు. కాని పరమేశ్వరిని నిరంతరం ధ్యానిస్తే, ఆ  తల్లి కరుణచే మానసిక రుగ్మతలు గాలిగి మబ్బులు చెదిరినట్లు తొలగి పోతాయి. దీర్ఘవ్యాధులు, తాత్కాలిక రుగ్మతలు కలుగకుండా ఆ పరమేశ్వరి తన భక్తుల శరీరంలో వ్యాధినిరోధకత్వము ఏర్పడునట్లు అనుగ్రహించును. అరిషడ్వర్గాల (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యముల) వలన ఏర్పడు రుగ్మతలు మానసిక వ్యాధుల క్రింద వస్తాయి. వీటినే భవరోగములు అనికూడా అంటారు. ఇవి తొలగిపోవాలంటే నిరంతరము ధ్యాన నిమగ్నత అవసరము. ఓం సర్వవ్యాధిప్రశమన్యై నమః అను నామమంత్రము సంపుటముచేస్తూ శ్రీలలితా సహస్రనామ స్తోత్ర పారాయణము అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆ పరమేశ్వరిపై భారము, నమ్మకము ఉంచి చేయుట అనేది చాలా అవసరము. కళ్ళు ఎర్రనై మండుతూ నీళ్ళు కారితే రోగము అని అందురు. ఇతరుల బాగును చూచి అసూయ పడడం,రకరకాలైన దుర్వ్యసనాలు, పరస్త్రీవ్యసనాలోలత్వము, పరధనంపై దురాశ, జీవహింస వంటి చెడుకర్మలు చేయుటవంటి వన్నియు వ్యాధులే అంటాము; ఈ విధముగానే మనస్సు, ఇంద్రియములద్వారా గిట్టనివాటిన గ్రహిస్తే మానసిక వ్యాధులు రాగలవు. వీటికి కారణము రాగ, ద్వేష, క్రోధ, అసూయ, భవరోగములు మాత్రమే అగును; ఇట్లు అజ్ఞాన జన్యమైన అవివేకముతో తెచ్చుకొనుట వంటివి అధివ్యాధులు; కావున శ్రీమాత జ్ఞానస్వరూపిణి అయినందున ఈ వికారములన్ని పోగొట్టి పవిత్రుని జేసి కాపాడుతుంది కావున ఆ పరమేశ్వరి సర్వవ్యాధిప్రశమనీ యని వశిన్యాది వాగ్దేవతలచే కీర్తింపబడినది.

శ్రీలలితా సహస్ర నామస్తోత్రముయొక్క ఉత్తర పీఠిక (ఫలశ్రుతి) యందు ఇలా చెప్పబడినది:-

*****
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

552వ నామ మంత్రము 8.1.2022

ఓం సర్వమృత్యు నివారిణ్యై నమః

సర్వవిధములయిన అకాల, ఆకస్మిక మరణములను నివారించు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వమృత్యు నివారిణీ యను ఎనిమిదక్షరముల  (అష్టాక్షరీ) నామమంత్రమును ఓం సర్వమృత్యు నివారిణ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు భక్తులను అన్నివిధములైన అపమృత్యు దోషములను నివారించి కాపాడును.

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ|

తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి॥ (భగవద్గీత, 2.27)

పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించ వద్దు అర్జునా! (ఇది శ్రీకృష్ణభగవానుని మాట)

పరమేశ్వరి సర్వమృత్యు నివారిణీ యని అన్నాము. అంటే పరమాత్మ ఇచ్చిన ఆయువు మేరకు జీవించి, తదనంతరం అనాయాస మరణము (వ్యాధిపీడితులై, మరణశయ్యపైఉండి, మలమూత్రాదులకు కూడా లేవలేక, తనతిండికూడా తినలేకపోవుట, తనవారిచే సర్వమూ చేయించుకుంటూ, వారి కోపతాపాలకు గురియగుట వంటి బాధలు లేకుండా తిరుగుతూ తిరుగుతూ పోవడం అనేది అనాయాస మరణం) పొందేవిధంగా ఆ పరమేశ్వరి అనుగ్రహింస్తుంది. సర్వమృత్యునివారిణీ అంటే భూమి మీద కలకాలం మృత్యువు లేకుండా ఉండిపోవడం కాదు అని భావించవలెను.

కొందరు తాము ఏదో ఒకనాడు చావక తప్పదు అని తెలిసి కుమిలిపోతూ ఉంటారు. దీనినే మృత్యుభయము అంటారు. అలాంటి భయము ఉన్నవారు నిత్యం చస్తూనే ఉంటారు. అలాంటి వారికి ఆ మనోవ్యాధి లేకుండా ఆ పరమేశ్వరి రక్షిస్తుంది.  సర్వమృత్యునివారిణీ యను నామమంత్రమునకు ఈ విధమైన సమన్వయము స్వీకరించవలెను. 

ఇంకొక రకమైన మృత్యువు ఉన్నది. అది ఏమిటంటే వయసు దాచుకోవడానికి జుట్టుకు రంగు వేసుకోవడము, పడిపోయిన దంతములకు బదులుగా కృత్రిమ దంతములు కట్టించుకోవడము , వయసు దాచుకొని ప్రవర్తించడము మొదలైన వాటిపై దృష్టిని పెట్టుకొని పరమాత్మపై ధ్యానము ఉంచకపోవడం  కూడా నిత్యం మరణంతో పోరాడుటవంటిదే. ఉద్యోగరీత్యా, సంఘంలో ప్రవర్తించే రీత్యా శరీరానికి మెరుగులు పెట్టుకోవచ్చు. పరమాత్మపై ధ్యానం పెట్టుకోవడం చాలా అవసరము. అలా అయితే ఆ పరమేశ్వరి మృత్యుభయాన్ని నివారిస్తుంది గనుక ఆ పరమేశ్వరి సర్వమృత్యు నివారిణీ యని అనబడినది. మృత్యువును జయించడం అంటే అకాల మృత్యువు ఉండకూడదు. కఫవాతపిత్తములయొక్క బాధ ఉండకూడదు. తాను సంసారంలో ఉన్నా, తనలో సంసారాన్ని ఉంచుకోకుండా, తనలో పరమాత్మను మాత్రమే ఉంచుకోవాలి. అప్పుడే ఆ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది.

నీటిగండము, వాహనగండము, సర్పగండము, యుద్ధమునందు మరణించుట, భూకంపాలు, వరదలవలన మృత్యువు వంటివి అన్నియు అకాలమృత్యు కారకములు. ఇటువంటి అకాల మృత్యువులను నివారిస్తుంది గనుక ఆ పరమేశ్వరి సర్వమృత్యునివారిణీ యని అనబడినది.

నేటి మానవుడు మృత్యువును జయించడం అంటే అకాలమృత్యువును జయించడం. పరమాత్మ ఇచ్చిన ఆయువుతీరిన పిదప అనాయాసంగా మరణించడం అనేది ఆ పరమాత్మ అనుగ్రహిస్తుంది గనుక ఆ తల్లి సర్వమృత్యునివారిణీ యని అనబడినది.

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ| జన్మించితే మృత్యువు తప్పదు. మరణించితే పుట్టుక తప్పదు. అసలు పుట్టక పోతే. అంటే జన్నరాహిత్యం. అంటే మరణం లేదుగదా! కర్మపరిపక్వమై, కైవల్యం లభిస్తే తరువాత పుట్టుక, మరణములు ఉండవుగదా. అంటే దాని అర్థం మృత్యువును జయించినట్లే గదా! ఆ పరమేశ్వరి తన భక్తులకు జన్మరాహిత్యమైన కైవల్యాన్ని ప్రసాదిస్తుంది గనుక ఆ పరమేశ్వరి సర్వమృత్యునివారిణీ యని అనబడినది.  పరమేశ్వరి ఆ విధంగా అనుగ్రహించాలంటే జ్ఞానవైరాగ్యాలు ఆ పరమేశ్వరి నుండి పొందాలి. అందుకు కావలసిన సాధనా పటిమ సంపాదించాలంటే ఆ పరమేశ్వరిని ఓం సర్వమృత్యు నివారిణ్యై నమః అను నామ మంత్రము సంపుటీకరణ చేస్తూ శ్రీలలితా సహస్ర నామ స్తోత్రమును పారాయణ చేయవలెను. శ్రీలలితా సహస్ర నామస్తోత్ర పారాయణము అంటే: - ముందు పూర్వపీఠిక, తరువాత ధ్యానశ్లోకములతో సహా సహస్రనామ స్తోత్ర పారాయణము, అనంతరము ఉత్తరపీఠిక (ఫలశ్రుతి)  పఠించవలయును. పూర్వపీఠిక, ఉత్తర పీఠికల మధ్య గల సహస్రనామస్తోత్ర పారాయణము ఎన్ని ఆవర్తములైనను చేయవచ్చును. అధికస్య అధికం ఫలం

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వమృత్యు నివారిణ్యైనమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

553వ నామ మంత్రము 9.1.2022

ఓం  అగ్రగణ్యాయై నమః

అన్నింటికీ మూలకారణమవడం చేత మొట్టమొదటగా లెక్కింపదగినదైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్రనామావళి యందలి అగ్రగణ్యా అను నాలుగక్షరముల   (చతురక్షరి) నామ మంత్రమును ఓం అగ్రగణ్యాయై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరాశక్తిని ఉపాసన చేయు సాధకులు ఆ తల్లి దివ్యానుగ్రహముచే పలువురిలో కీర్తిప్రతిష్టలు పొందినవారై, అగ్రగణ్యులుగా గౌరవింపబడుతారు. మరియు ఆ పరమేశ్వరిని పాదసేవయందు నిరతిని సాధించి, భక్తాగ్రగణ్యులై తరించుదురు.

సకలచరాచరసృష్టికి మూలమైయున్నది ఆ పరమేశ్వరి. అనాదినిధనా (ఆది, అంతములు లేనిది) అని రెండువందల తొంబదియారవ (296వ) నామ మంత్రములో వశిన్యాది వాగ్దేవతలు ప్రస్తుతించారు. అంటే సృష్టికి పూర్వము మూలప్రకృతియై యున్నది. పంచభూతాత్మకమైన జగత్తు, అనంతకోటి జీవరాశులు ఆ పరమేశ్వరినుండియే వెడలివచ్చినవి. ఆ పరమేశ్వరియే పోషించి, రక్షించు భారము వహించియున్నది. లోకపాలురు, త్రిమూర్తులు, సకలదేవతలు ఆ పరమేశ్వరిచేతనే నియమింపబడినారు. సూర్యునికి ప్రకాశముగాని, చంద్రునికి వెన్నెలగాని, అగ్నికి ఉష్ణముగాని, వాయువుకు కదిలే లక్షణముగాని, వరుణునికి వర్షము కురిపించే శక్తిగాని, యమునికి జీవుల ఆయుఃప్రమాణములను కొలిచే సామర్థ్యముగాని ఆ పరమేశ్వరి అనుమతిలేనిదే అనుగ్రహింపబడవు. జీవునికి ఆకలి, దాహము, జీర్ణశక్తి, చలనశక్తి, మంచిచెడులను యోచించే విచక్షణాజ్ఞానము, స్త్రీపురుష సంబంధములు - ఇవి అన్నియును అ తల్లి ఆజ్ఞమేరకే సర్వసాధారణమై ఉంటున్నాయి.
లోకములు-లోకపాలురు, జీవులు-జీవనము, జీవాత్మ-పరమాత్మ అను అవినాభావ సంబంధములు అన్నియును ఆ పరమేశ్వరి చేతనే ఏర్పడినవి.  ఏదైనా ఆ పరమేశ్వరి తరువాతనే గణింపబడతాయి. అన్నిటికీ ముందు తానే. తనతోటే సర్వమూ యగుటచేత ఆ అమ్మ అగ్రగణ్యా యని అనబడినది.

మూలాధారము నందు నిద్రాణంలో ఉన్న కుండలినీ స్వరూపిణియైన పరమేశ్వరి సాధకుని యోగసాధన చేత జాగృతమై, సుషుమ్నా మార్గంద్వారా బ్రహ్మవిష్ణురుద్ర గ్రంథులను భేదించుకుంటూ, షట్చక్రములను దాటి, ఊర్ధ్వంగా శరీరమునకు ఉత్తమాంగమైన శిరస్సుయందలి సహస్రార కమలమున ప్రవేశించి, అచ్చట ఉన్న సదాశివునితో బిందురూపిణియై ఉంటున్నది. మూలాధారము శరీరమునకు దక్షిణభాగమైతే, సహస్రారంలోని బిందువు శరీరానికి ఉత్తరదిశ అనగా శరీరానికి ఊర్ధ్వభాగమున అగ్రస్థానాన విలసిల్లుచున్నది గనుక ఆ పరమేశ్వరి అగ్రగణ్యా యని అనబడినది.

సర్వమంత్రాత్మిక. సర్వతంత్రాత్మిక. సర్వయంత్రాత్మిక. సర్వమూ తానై యున్న ఆ పరమేశ్వరి అన్నిటికీ తానే ముందైయున్నది. గనుకనే అగ్రగణ్యా యని అనబడినది. 

అటువంటి అగ్రగణ్యా  యను నామప్రసిద్ధమైన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం అగ్రగణ్యాయై నమః అని అనవలెను.ధ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీలలితా సహస్రనామ భాష్యము

554వ నామ మంత్రము 10.1.2022

 ఓం  అచింత్యరూపాయై నమః

అచింత్య అనగా ఊహించుటకు శక్యంకాని రూపము గలిగిన తల్లికి నమస్కారము.

శ్రీలలితాసహస్ర నామావళి యందలి   అచింత్యరూపా అను ఐదక్షరముల (పంచాక్షరి) నామ మంత్రమును ఓం అచింత్యరూపాయై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరాశక్తిని ఉఫాసించు ఉపాసకులు శబ్దబ్రహ్మ స్వరూపిణియైన పరాశక్తిని చక్కగా అవగతం చేసికొని తరిస్తారు.

జగజ్జనని శుద్ధచైతన్య స్వరూపురాలు అవడంచేత ఆ తల్లి స్వరూపాన్ని ఊహించడానికి ఇంద్రియములకు, మనస్సుకు శక్యం కాదు. గనుకనే అచింత్యరూపా యని అనబడినది.

ఆ పరమేశ్వరి వ్యక్తావ్యక్తస్వరూపిణి ఆ పరమేశ్వరి వ్యక్తావ్యక్తస్వరూపిణి. 
ఆ తల్లి సృష్టికి పూర్వము అవ్యక్తమై యున్నది. అవ్యక్తమునుండి వ్యక్తమైనది.  సృష్టితో అనంతకోటి జీవులను వ్యక్తముచేయుటకు ముందు తానే వ్యక్తమయినది.  వ్యక్తమయినను, అవ్యక్తమయినను 
శ్రీజగన్మాత మనస్సునకు, వాక్కుకు కూడా అందనిది. ఆలోచించి ఆ తల్ఞి ఇలా ఉంటుందని చెప్పలేము.  ఈ రూపమున తల్లిని చూడగలము అని అనుకోవలసిన స్వరూపం అమ్మది కాదు. యద్భావం తద్భవతి అన్నట్లు వారి వారి భావాలకు అనుగుణంగా అనిపిస్తుంది తప్ప అదికూడా ఆ తల్లి స్వరూపంకాదు. చింతన చేయువారికి ధ్యాన, ధ్యాతృ, ధ్యేయ; ప్రమాత, ప్రమాణ, ప్రమేయము; జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయము అను త్రిపుటికి అతీతమైనది ఆ జగన్మాత. గనుకనే ఆ తల్లి అచింత్యరూపా యని అనబడినది. అమ్మవారిని స్థూలరూపంలో ఎవరికి ఎలా అనిపిస్తే అలా ఊహించుకుంటారు. అంతాగాని అందరూ ఆ తల్లి ఇలా ఉంటుందని చెప్పలేరు. కొండలలో కొండదేవతగా, గ్రామాల్లో గ్రామదేవతగా, శక్తిపీఠాలలో శక్తిగా నవదుర్గలుగా భావిస్తూ ఏవేవోరూపాలు మనోఫలకంపై చిత్రించుకుంటాము.  అదేరూపాన్ని ఒక విగ్రహంగానో, ఒక చిత్రపటంగానో సృష్టిస్తాము. ఆ తల్లి అసలురూపం ఏమిటి? అంటే మన చింతనలకు అందని స్వరూపం. అందుకే అచింత్యరూపా యని అనబడినది. నిగ్రహంకోసం విగ్రహం వద్దకూచుంటాము. అయినా సరే నిగ్రహించలేము. అమ్మ ఎలా ఉంటుంది అనే ప్రశ్నతో ఆలోచిస్తాము. సహస్రనామాలు చదువుతాము. వెయ్యిరూపాలు మనసులో మెదులుతాయి. అందులో అమ్మవారిది అసలు రూపం ఏమిటి అని చింతిస్తే, మన చింతనల కతీతురాలై నిలుస్తుంది ఆ పరమేశ్వరి. అందుకే ఆతల్లి అచింత్యరూపా యని అనబడినది. 

ఈ జగత్తంతయు త్రిగుణాత్మకమైనది. అనగా సత్త్వరజస్తమోగుణముల స్వభావమైనది. కాని ఆ పరమేశ్వరి త్రిగుణములకు అతీతురాలు. గనుకనే ఆ తల్లి అచింత్యరూపా యని అనబడినది.

పంచభూతములు - అవి భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము. ఈ ఐదూ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు.  ఇవి ప్రకృతులైతే వీటికి కారణమైన ఆ తల్లియే మూలప్రకృతి. ఈ ప్రకృతులను గూర్చి చెప్పగలము గాని మూలప్రకృతి ఇలా ఉంటుందని చింతించలేము (ఊహించలేము) గనుకనే మూలప్రకృతియైన ఆ పరమేశ్వరి అచింత్యరూపా యని అనబడినది. ఆ తల్లి రూపాలు అనంతకోటి. అందులో ఏ రూపమో మనం ఊహించలేము. గనుక ఆ అమ్మ అచింత్యరూపా యని వశిన్యాది వాగ్దేవతలే చెప్పారంటే, మనమెంత. వశిన్యాదులు అలా అమ్మను కీర్తించగా, ఆ తల్లి అత్యంతానందభరితురాలైనది. గనుకనే మన ఇష్టకామ్యములను తలచుకుంటూ ఆ తల్లికి నమస్కరించునపుడు  ఓం అంచింత్యరూపాయై నమః అని అనవలెను. అంతే ఆ అమ్మ మన ఇష్టకామ్యములను సిద్ధింపజేసి, అనంతకోటి జన్మల కర్మఫలాలను విముక్తిచేసి, జన్మరాహిత్యమైన కైవల్యమును ప్రసాదిస్తుంది. 
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

555వ నామ మంత్రము 11.1.2022

 ఓం కలికల్మషనాశిన్యై నమః

కలిలోని పాపములన్నిటిని నశింపజేయు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితాసహస్ర నామావళి యందలి  కలికల్మషనాశనీ యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం కలికల్మష నాశిన్యై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు వారి అజ్ఞానత్వంతో తెలియక చేసిన పాపములు నశించి పరమా నందమైన బ్రహ్మజ్ఞానసంపదనొసంగి జీవించు నంతకాలము సర్వశుభములను, సౌఖ్యములను పొందజేస్తూ అంత్యమున మోక్షసామ్రాజ్యాధి పత్యము కలుగజేయును

ఇది కలియుగం. కలిపురుషుడు ఆధిపత్యం వహించిన యుగము కలియుగము. మూడుపాదాలు అధర్మము, ఒక పాదము ధర్మము. ధర్మదేవత ఒకపాదంతో కుంటుతూ ఉన్నది. అరిషడ్వర్గాలు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు) విజృంభించి పాపభీతిని లేకుండా చేస్తున్నాయి. ఐహికవాంఛ బాగా పెరిగిపోయింది. కల్మషమనస్తత్త్వం లోకంలో పెరిగిపోయింది. కలిలోని ఈ కల్మషమును కలికల్మషము అని అంటారు. ఈ కలికల్మషమును ఆ పరమేశ్వరి నశింపజేస్తుంది గనుక ఆ తల్లి కలికల్మషనాశనీ యని అనబడినది.

"అగ్నిని చల్లార్చడానికి నీరు, చీకట్లను పోగొట్టడానికి సూర్యుని వెలుగు ఏవిధంగా ఉన్నదో,  కలియుగపాపాలు  నశింప జేయుటకు ఆ పరమేశ్వరి ఉన్నది" అని కూర్మపురాణంలో చెప్పబడినది. 

నిప్పు అనేది తెలిసి తాకినా, తెలియక తాకినా సరే కాలుతుంది. అలాగే పాపాలు తెలిసి అయినా జరుగుతాయి, తెలియక యుండిననూ జరుగుతాయి. కాని చేకూరే పాపఫలం మాత్రం ఒకటే. అటువంటి తెలిసిగాని, తెలియకగాని చేసిన పాపాలు పరమేశ్వరిని స్మరించిమాత్రమున పోతాయి అని బ్రహ్మాండపురాణములో చెప్పబడినది.

శ్రీలలితా సహస్ర నామస్తోత్ర ఫలశ్రుతిలో కొన్ని శ్లోకములలో ఈ విధంగా చెప్పబడినది:-

 13వ శ్లోకము

రహస్యనామసాహస్రే నాంరోఽప్యేకస్య కీర్‍త్తనాత్|

రహస్యనామసాహస్రే నామైకమపి యః పఠేత్॥13॥

14వ శ్లోకము

తస్య పాపాని నశ్యన్తి మహాన్త్యపి న సంశయః|

నిత్యకర్‍మాననుష్ఠానాన్నిషిద్ధకరణాదపి॥14॥

15వ శ్లోకము

యత్పాపం జాయతే పుంసాం తత్సర్‍వం నశ్యతి ధ్రువమ్|

బహునాత్ర కిముక్తేన శృణు త్వం కుంభసంభవ॥15॥

16వ శ్లోకము

అత్రైకనాంనో యా శక్తిః పాతకానాం నివర్‍తనే|

తన్నివర్త్యమఘం కర్తుం నాలం లోకాశ్చతుర్దశ॥16॥

అగస్త్యులవారికి హయగ్రీవస్వామి శ్రీలలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయుటవలన కలుగు ఫలమెలాంటిదో ఇలా వివరించుచున్నారు. 'మనస్ఫూర్తిగా వేయి వత్సరములపాటు అన్నదానంచేసిన పుణ్యం ఒక్కసారి శ్రీలలితా సహస్రనామస్తోత్ర పారాయణ చేయుటవలన లభిస్తుంది. రహస్యాతి రహస్యమైన  శ్రీలలితా సహస్ర నామములలో ఒక్కనామం శ్రద్ధతో పఠిస్తే ఘోరమైన పాపాలు నశిస్తాయి. అలాగే సంధ్యావందనాది నిత్యకర్మలు చేయకపోవుటచే కలిగిన పాపాలుకూడా అమ్మవారి సహస్రనామములందలి ఒక్క నామ పఠనం మాత్రముననే నశిస్తాయి. ఒక్క శ్రీలలితా సహస్ర నామ పఠనంచేత పదునాలుగు లోకాలలోని వారంతా చేసిన పాపాలను నశింపజేయు శక్తి అమ్మవారి నామములకు గలదని అగస్త్యులవారికి హయగ్రీవులవారు వివరించారు.   శ్రీలలితా సహస్ర నామములు కేవలం అమ్మవారి నామములు మాత్రమే కావు. ఒకే ఒక్క నామ పఠనమునందు గల మహిమను హయగ్రీవలవారు అనేకమైన ఉదాహరణలతో చెపుతున్నారంటే, అగస్త్యులవారికి మాత్రమే కాక లోకములలోని ఎల్లరికీ ఈ సందేశం సమన్వయమవుతుంది మరియు శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము అందరూ ఆచరింపవలయునని చెప్పుచున్నది.

ఈ జన్నలో చేసిన పుణ్యపాప ఫలములు రాబోవు జన్మలలో లభించును. ఈ జన్మలో చేసిన పుణ్యపాపములు అత్యధికమయినచో ఫలములు కూడా ఈ జన్మలోనే లభించును. అదే విధముగా శ్రీలలితా సహస్ర నామ పారాయణము అత్యంతమగు భక్తినిరతితో, క్రమము తప్పకుండా చేసినచో అమ్మవారు మిక్కిలి ప్రీతిని పొందినదై, కోరిన కోర్కెలు నెరవేర్చుటయేగాక, ధనధాన్యసమృద్ధి, శాంతిసౌఖ్యములు సంప్రాప్తింపజేయును.

67వ శ్లోకము

నానేన సదృశం స్తోత్రం భోగమోక్షప్రదం మునే|

కీర్త్తనీయమిదం తస్మార్భోగమోక్షార్థిభిర్నరైః॥67॥

భౌతికపరమైన భోగములు, చతుర్విధములైన మోక్షములు ప్రసాదించు శ్రీలలితా సహస్ర నామ స్తోత్రమునకు సాటియైనది వేరొక స్తోత్రంలేదు. ఐహిక సుఖములు, మోక్షసామ్రాజ్య సుఖములు కోరువారు శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము చేయవలెను.  శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము అత్యంత శ్రేష్ఠమైనది. భౌతికపరమైన కోరికలు లేని వారికి మోక్షము అనుగ్రహించును. అష్టైశ్వర్యములు, శాంతిసౌఖ్యములు, సంతోషము, విద్య, యశస్సు వంటి భౌతికసంబంధమైన కోరికలు కోరువారికి ఆ ఐహికపరమైన కోరికలు కూడా సిద్ధింపజేయును.

68వ శ్లోకము

చతురాశ్రమనిష్ఠైశ్చ కీర్తనీయమిదంసదా|

స్వధర్మసమనుష్ఠానవైకల్యపరిపూర్తయే॥68॥

బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్న్యాసి యను చతురాశ్రమములవారు, ఆయా ఆశ్రమముల ధర్మముల నాచరించునపుడు, వైగుణ్యము (గుణదోషము), వైకల్యము కలిగినచో, తత్ప్రభావమున ఏర్పడిన దోషములు శ్రీలలితా సహస్రనామ స్తోత్ర పారాయణచే పటాపంచలగును.

తెలిసి పాపము చేయకూడదు. కాని కలిధర్మము. పాపముచేయడము అనేదే జరుగుతుంది. స్వార్థపూరిత కోర్కెలు విజృంభించినపుడు, పాపభీతి ఉండదు. ఎందుకంటే ధర్మం ఒకపాదం మీద నడచుచున్నది. నేడుకూడా మహిషాసురులు, భండాసురులు మానవుల మధ్యసంచరిస్తున్నారు. వారివలన ఆపదలు ఎప్పుడూ పొంచి ఉంటాయి.  అలాంటివి అన్నియూ కూడా కలికల్మషములే అవుతాయి. గనుక మనమధ్యనే తిరుగుచున్న భండాసురులు, మహిషాసురులనుండి ఆపదలు రాకుండా ఉండాలంటే ఆ పరమేశ్వరిని శ్రీలలితా సహస్రనామ స్తోత్రపారాయణ ద్వారా శరణు వేడుకుంటే ఆ పరమేశ్వరి ఆ కలికల్మషములను నశింపజేయును.   
 

అటువంటి కలకల్మషమనే పాపాన్ని నశింపజేసి శాశ్వతమైన బ్రహ్మానందమును అనుగ్రహించు పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం కలికల్మషనాశిన్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

556వ నామ మంత్రము 12.1.2022 

ఓం  కాత్యాయన్యై నమః

సకల దేవతల తేజస్సుచే ఆవిర్భవించిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్రనామావళి యందలి కాత్యాయని అను నాలుగక్షరముల (చతురక్షరి) నామ మంత్రమును ఓం కాత్యాయన్యై నమః అని ఉచ్చరిస్తూ ఆ జగదీశ్వరిని అత్యంత భక్తి ప్రపత్తులతో ఉపాసించు సాధకునికి ఆ జగజ్జనని కరుణించి భౌతిక మరియు ఆధ్యాత్మి కానందములను రెండిటినీ ప్రసాదించి తరింపజేయును.

దేవతలకు, రాక్షసులకు యుద్ధము జరుగుచున్నది. దేవతలకు ఇంద్రుడు, రాక్షసులకు మహిషాసురుడు నాయకత్వం వహించారు. ఆ దేవాసురుల సంగ్రామంలో దేవతలు పరాజయాన్ని పొందారు. మహిషాసురుని ఎలా జయించాలో పాలుపోక దేవతలంతా త్రిమూర్తులను ఆశ్రయించారు. బ్రహ్మవరముచే మహిషాసురుడు పురుషులచే మరణం సంభవించనివాడగుటచే మిగుల విర్రవీగుచున్నాడు. ఇక స్త్రీ మాత్రమే సంహరించవలెను. ఆ రాక్షసుని వధించు శక్తి ఏ స్త్రీకి ఉన్నదని త్రిమూర్తులు కూడా తలలు పట్టుకుని కూర్చున్నారు. సకలదేవతల తేజస్సుతో అత్యంత సౌందర్యవతియైన ఒకానొక స్త్రీమూర్తి ప్రకటితము కావలెనని విష్ణుమూర్తి యోచించి చెప్పెను. ఆ స్త్రీమూర్తికి రుద్రుడు మొదలైన దేవతలనుండి త్రిశులాది పరమదివ్య ఆయుధములను సమర్పించ వలయును. అప్పుడు ఆ స్త్రీమూర్తి సకలదేవతల తేజస్సులతో ఆకారము, బలము మరియు సర్వదేవతలు సమర్పించిన ఆయుధములతోను సంపూర్ణ తేజస్సుతో బలసంపన్నురాలై ఆ దుష్టరాక్షసుని సంహారము జరుగును అని విష్ణుమూర్తి చెప్పెను. ఆ విధముగా బ్రహ్మాది దేవతల శరీరములనుండి అద్భుతమైన తేజస్సు బయటకు వచ్చినది. కిరణరూపమైన ఆ తేజస్సు కాత్యాయనుడు అను ఋషి యొక్క ఆశ్రమంలో కిరణములై స్ఫుటీకరించబడ్డాయి ,  కాత్యాయన మహర్షి ఆ కిరణాలకు సరైన రూపాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ దేవి కాత్యాయని లేదా కాత్యాయనుని కుమార్తె అని పిలువబడినది. ఆ కాత్యాయనియే శ్రీలలితా త్రిపురసుందరి. ఆ లలితా పరమేశ్వరియొక్క అంగములు ఏయే దేవతల తేజస్సుతో ఏర్పడినవో దేవీభాగవతమునందు, పంచమస్కంధమునందు, అష్టమోధ్యాయములో ఈ విధముగా వివరించబడినది. భగవానుడు శంకరుని తేజమునుండి శ్వేతవర్ణముతో, సుశోభితముగా, విశాలమై, మనోహరమై, విలసిల్లు  పరమేశ్వరి ముఖకమలము రచింపబడెను. సుందరమై, సుదీర్ఘమై, సహజపరిమళలను విరజిమ్ముచూ, చిక్కగా, నునుపుగా మనోహరమైన మేఘశ్యామవర్ణముతో శిరస్సునందు అలరారు కేశనిర్మాణము యమరాజు తేజస్సుతో జరిగెను. కృష్ణ, రక్త, శ్వేతవర్ణములతో శోభిల్లు ఆ దేవి నేత్రములు అగ్నిదేవుని తేజస్సుతో ప్రకటితమయ్యెను. ప్రాతఃసంధ్య, ఉదయసంధ్యల తేజస్సుతో ఆ పరమేశ్వరి కనుబొమలు ఉత్పన్నములయ్యెను. తేజఃపరిపూర్ణములైన నల్లని వంపులు తిరిగిన కనుబొమలు మన్మథుని ధనుస్సువలె విలసిల్లుచుండెను. మరీ పొడవుగాని, మరీ పొట్టిగా గాని లేని రెండు చెవులు వాయువు తేజముతో ఉత్పన్నములయ్యెను. నూగుపూవులవలె కోమలమై, అప్పుడే విరిసీ విరియని సంపెంగవలె అత్యంత మనోహరమైన నాసిక కుబేరుని తేజస్సుతో ప్రకటమయ్యెను. అత్యంత ప్రకాశవంతమై, మనోహరములై, కుందములవలె కొనలు తేలియుండు దంతములు ప్రజాపతి తేజస్సుతో ప్రకటితములయ్యెను. సూర్యుని యొక్క తేజస్సుతో మిగుల లాలిమతో కూడిన అధరోష్ఠము (క్రిందిపెదవి) ప్రకటితమయ్యెను. పైపెదవి కార్తికేయుని తేజస్సుతో ఉత్పన్నమయ్యెను. పరమాత్ముడైన శ్రీమహావిష్ణువు యొక్క మహత్తరమైన తేజస్సుతో పదునెనిమిది భుజములు ఆవిర్భవించెను. అష్టవసువుల తేజస్సుతో ఎర్రనిరంగుగల వ్రేళ్ళు ప్రభవించెను. చంద్రుని తేజస్సుతో రెండు వక్షోజములు, ఇంద్రుని తేజస్సుతో మధ్యభాగమగు కటిప్రదేశము మరియు త్రివళులు (పొట్టపై ఉండు మూడు మడతలు), వరుణుని తేజస్సుతో తొడలు, పిక్కలు, భూదేవి తేజముతో విశాలమైన నితంబభాగము (పిరుదులు)  ప్రకటితమయ్యెను.

ఇదే విషయము సప్తశతియందు, రెండవ అధ్యాయము,  పదహారు, పదిహేడు, పదునెనిమిది (16, 17, 18) శ్లోకములలో ఇలా చెప్పబడినది.

బ్రహ్మణస్తేజసా పాదౌ తదంగుల్యోఽర్కతేజసా|

వసూనాం చ కరాంగుల్యః కౌబేరేణ చ నాసికా॥16॥

బ్రహ్మతేజముతో పాదములు, సూర్యతేజముతో కాలివ్రేళ్ళు, అష్టవసువుల తేజస్సుతో చేతివ్రేళ్ళు, కుబేరుని తేజముతో నాసిక (ముక్కు)  ప్రకటిత మయ్యెను.

 తస్యాస్తుదంతాః సంభూతాః ప్రాజాపత్యేనతేజసా|

నయనత్రితయం జజ్ఞే తథా పావకతేజసా॥17॥

ప్రజాపతి తేజముతో దంతములు, అగ్నితేజముతో మూడు కన్నులు ఉత్పన్నమయ్యెను.

భ్రువౌ చ సంధ్యయోస్తేజః శ్రవణావనిలస్య చ|

అన్యేషాం చైవ దేవానాం సంభవస్తేజసాం శివా॥18॥

రెండు సంధ్యల తేజమునుండి కనుబొమలు, వాయుతేజమునుండి చెవులు మరియు ఇతరదేవతల తేజములతో ఆ పరమేశ్వరి సంపూర్ణరూపము ఏర్పడెను.

సర్వదేవతల తేజస్సముదాయమునకు కాత్యాయని యని పేరు. పరమేశ్వరి ఆ తేజస్సముదాయ స్వరూపిణి గనుక కాత్యాయని అనబడినది.

కాత్యాయనీ చోడ్డియానే కామాఖ్యా కామరూపకే|

పూర్ణేశ్వరీ పూర్ణగిరౌ చణ్డీ జాలంధరేస్మృతే॥ (సౌభాగ్య భాస్కరం, 689వ పుట)

ఓఢ్యాణపీఠమునకు అధిదేవత కాత్యాయని గనుక అమ్మవారు కాత్యాయనీ యని అనబడినది. కాళికా పురాణమునందు పీఠాధిష్ఠానదేవతలను వివరించునపుడు "ఓడ్యాణ పీఠాభిమానినీ దేవత కాత్యాయని, కామరూప పీఠమందు కామ అనియు, పూర్ణగిరి పీఠమునందు పూర్ణేశ్వరి అనియు, జాలంధర పీఠమందు చండి అనియు వివరింప బడెను.  దేవీపురాణంలో

కం బ్రహ్మ కం శిరః ప్రోక్త మశ్మసారం చ కం మతమ్|

ధారణాద్వాసనా ద్వాపి తేవ కాత్యాయినీ మతా॥ (సౌభాగ్య భాస్కరం, 689వ పుట)

కం అనగా బ్రహ్మ, శిరస్సు, అశ్మసారము (ఇనుము) అనబడును. వానిని ధరించుట వలనగాని,  వానియందుండుట వలననే పరమేశ్వరి కాత్యాయనీ యనిఅనబడినది.

నవరాత్రుల్లో ఆరవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు.

అమరకోశం పార్వతీదేవికి ఇచ్చిన రెండో పేరు కాత్యాయని

 అట్టి తల్లికి నమస్కరించునపుడు ఓం కాత్యాయన్యై నమః అని అనవలెను
****
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

557వ నామ మంత్రము 13.1.2022

ఓం కాలహంత్ర్యై నమః

 కాలమును అనగా మృత్యువును హరించునదైన జగజ్జననికి నమస్కారము.

సమస్తాన్ని హరించే కాలాన్ని ప్రళయము నందు జగన్మాత తన లోనికి లీనం కావించుకునే పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్రనామావళి యందలి కాలహంత్రీ అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం  కాలహంత్ర్యై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు అకాల మృత్యుభయం లేకుండా కాపాడి రక్షించును; మరియు తన భక్తజనులకు అభీష్ట సిద్ధికలుగ జేయును; ఇంకను బ్రహ్మజ్ఞాన సందలనొసంగి అత్యంత దుర్లభమైన తన చిదానందస్వరూపము అనుభవైక వేద్యముజేసి తరింపజేయును.

అగస్త్యమహర్షికి హయగ్రీవులవారు  శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర మహత్మ్యము (ఫలశ్రుతి) లో ఇలా వివరించారు.

70వ శ్లోకము

లౌకికాద్వచనాన్ముఖ్యం విష్ణునామానుకీర్తనమ్|

విష్ణునామసహస్రాచ్చ శివనామైకముత్తమమ్॥70॥

71వ శ్లోకము

శివనామసహస్రాచ్చ దేవ్యా నామైకముత్తమమ్|

దేవీనామసహస్రాణి కోటిశః సన్తి కుంభజ|

తేషు ముఖ్యం దశవిధం నామసాహస్రముచ్యతే|

72వ శ్లోకము

గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ|

రాజరాజేశ్వరీ బాలా శ్యామలా  లలితా దశ॥72॥

73వ శ్లోకము

రహస్యనామసాహస్రమిదం శస్తం దశస్వపి|

తస్మాత్సఙ్కీర్తయేన్నిత్యం కలిదోషనివృత్తయే|

ముఖ్యం శ్రీమాతృనామేతి న జానన్తి విమోహితాః॥74॥

లౌకిక వాక్యములలో విష్ణునామ కీర్తనము ఉత్తమము. అటువంటి విష్ణు సహస్ర నామములకన్నా శివసహస్రనామము ఉత్తమము. శివ సహస్ర నామములకన్నా శ్రీలలితా సహస్ర నామములు ఉత్తమము. కోట్లాది దేవీ సహస్ర నామములలో గంగా, భవానీ, గాయత్రీ, కాళీ, లక్ష్మీ, సరస్వతీ, రాజరాజేశ్వరీ, బాలా, శ్యామలా, లలితా అను పదిసహస్ర నామములు అత్యంత ఉత్తమమైనవి.  అటువంటి పది దేవీసహస్ర నామములలో రహస్యాతి రహస్యమైనది శ్రీలలితా సహస్ర నామము. వైదికకర్మాచరణములో కలియుగ ప్రభావమున సంభవించే లోపముల వలన కలిగే దోషముల నివారణకు రహస్యాతి రహస్యమైన శ్రీలలితా సహస్ర నామ స్తోత్రము ఉత్తమమైనది.

భావము దేవీ సహస్ర నామములు కోట్ల కొలదీ ఉన్నవి. అందులో పది సహస్ర నామములు మిక్కిలి ముఖ్యమైనవి. అటువంటి మఖ్యమైన దేవీ సహస్ర నామములలో అతిముఖ్యమైనది రహస్యాతిరహస్యమైన శ్రీలలితా సహస్ర నామము. అనగా వైదికకర్మాచరణమునందును, వర్ణాశ్రమాచారములు పాటించుటయందును కలియుగ ప్రభావమున కలుగు దోషనివారణమునకు శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము నిత్యము ఆచరించవలెను. 

ఈ నిజాన్ని తెలిసిన జనులు వాడవాడలా సమూహములుగా ఏర్పడి శ్రీలలితా సహస్ర నామ పారాయణమొనరించుచున్నారు.  

రహస్యాతి రహస్యమైన అనగా అమ్మవారి (లలితా) సహస్రనామములలో ఏ ఒక్క నామాన్ని పరిశీలించినా అనేకమైన భావములు వెడలివస్తూంటాయి. ఎందుచేత సాక్షాత్తు అమ్మవారి అంశనుండి కిరణరూపంలో ఉద్భవించిన వశిన్యాది వాగ్దేవతలు (వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని) అనువారు బ్రహ్మజ్ఞాన స్వరూపులు. ఒక్కొక్క శ్రీలలితా సహస్రనామాన్ని ఒక్కొక్క మంత్రంగా విరచించి ప్రతీ మంత్రానికి అనేకమైన సిద్ధులు ఒనకూరే మహిమను సంతరింపజేశారు. అలాగే ప్రతీనామ మంత్రంలోను అమ్మవారిని అనేక విధాలుగా భావనచేసి తరించు భాగ్యాన్ని సమకూర్చారు. 

కాలహంత్రీ యను ఈ నామ మంత్రాన్ని పరిశీలిస్తే కాల అంటే కాలమును హంత్రీ అనగా హరించునది (ఆ పరమేశ్వరి). ఇది యథాతథమైన భావము సంక్షిప్తముగా.

విశ్లేషించి పరిశీలిస్తే:-

కాలముఅను శబ్దమునకు అనేకమైన అర్థములు గలవు. అందులోకొన్ని:- సమయము, నలుపు, చావు, నుదుటివ్రాత, ప్రారబ్ధం 

 పరమాత్మ జ్ఞానస్వరూపుడు, కాలకాలుడు అంటే మృత్యువుకే మృత్యువు - మృత్యువునుకూడా తన నియంత్రణలో ఉంచువాడు - అంటారుగదా! శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అని - ఇంకా చెప్పవచ్చు మృత్యుహరుడు, గుణరహితుడు, అన్ని తెలిసినవాడు అని వేదమందు గలదు. గనుకనే పరమాత్మస్వరూపిణియైన పరమేశ్వరి కాలహంత్రీ యని అనబడినది.

బ్రహ్మకాలము  కల్పము అనగా బ్రహ్మ ఆయువు. బ్రహ్మఆయువు తీరుటకే కల్పాంతము అనబడును. ఆ విధంగా పరమాత్మ బ్రహ్మకాలమునకే కాలుడు. ఇక్కడ బ్రహ్మ ఆయువు అనగా నేమియో పరిశీలించుదాము.

కృత యుగము అనగా 4,800 దివ్య సంవత్సరములు అనగా 17,28,000 మానవ సంవత్సరములు.
త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు అనగా 12,96,000 మానవ సంవత్సరములు.
ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు అనగా 8,64,000 మానవ సంవత్సరములు.
కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు అనగా 4,32,000 మానవ సంవత్సరములు
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు అనగా 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము. ఇదియే కల్పాంతము. కల్పాంతమున సృష్టిని అంతటినీ అంతరింపజేసి, మహాప్రళయానికి సాక్షీభూతురాలుగా తనలో ఇముడ్చుకుంటుంది గనుక ఆ పరమేశ్వరి కాలహంత్రీ యని అనబడినది.

కాలము సమయము. కొందరు ఏదైనా ఇష్టమైన పనిలో నిమగ్నమైతే కాలము చాలాతొందరగా గడచిపోతుంది. అంటే శ్రీలలితా సహస్రనామ పఠనము అత్యంత భక్తిశ్రద్ధలతో పారాయణచేస్తుంటే ప్రక్కనే పరమేశ్వరి అదృశ్యరూపంలో వింటూ ఉంటూ, వాగ్దేవిగా ఉండి, ఆనందపరవశ యగుచూ పారాయణచేయు భక్తజనులకు గుర్తురాకుండా కాలాన్ని హరిస్తుంది. అందుచేతనే అమ్మవారు కాలహంత్రీ యని అనబడినది.

కాలము అంటే మృత్యువు అని అర్థం ఉందిగదా. హంత్రీ అంటే మృత్యువునే హరిస్తుంది గనుక అమ్మవారు కాలహంత్రీ యని అనబడినది.

కాలము అంటే ఆపత్కాలము. ఆపత్కాలము అంటే ఆపదలు సంభవించు సమయము. అకాలమృత్యువు జీవుడిని కబళించు సమయము. అమ్మవారు సర్వమృత్యు నివారిణీ యని స్తుతించాము. అంటే అకాలమృత్యువు అనే దయలేని కాలుడు జీవునిపై విజృంభిస్తే పరమేశ్వరి ఆ కాలుడికి కాలస్వరూపంతో (మృత్యువుకు మృత్యుస్వరూపిణియై) తన భక్తులను రక్షించుతుంది గనుక ఆ తల్లి కాలహంత్రీ యని అనబడినది.

కాలము అనగా నలుపు (నల్లదనము). నలుపు చీకటికి సంకేతము. అటువంటి చీకటి అనేది  అవిద్యాస్వరూపము (అజ్ఞానము). హంత్రీ అనగా హరించునది. అమ్మవారు అజ్ఞానమును చీకట్లను నశింపజేసి తనను సేవించు భక్తులకు జ్ఞానమును ప్రసాదిస్తుంది గనుక, ఆ తల్లి కాలహంత్రీ యని అనబడినది.

ప్రారబ్ధం అనగా జన్మము కలిగించు పూర్వకర్మము ఎన్నో జన్మల పుణ్యకర్మల ఫలముగా దుర్లభమైన మానవ జన్మ లభించినది. శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణము చేసి ఆ పరమేశ్వరి అనుగ్రహము లభించుట అనేది అత్యంత ఉత్తమమైన కర్మఫలము. అటువంటి కర్మఫలాన్ని తన భక్తులకు అనుగ్రహిస్తూ, పాపకర్మల ప్రారబ్ధమును తన భక్తుల చేరువకూడా రానీయకుండా రక్షించు ఆ పరమేశ్వరి కాలహంత్రీ యని అనబడినది.
 
అటువంటి కాలహంత్రీ స్వరూపిణికి నమస్కరించునప్ఫుడు ఓం కాలహంత్ర్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

558వ నామ మంత్రము 14.1.2022

ఓం  కమలాక్ష నిషేవితాయై నమః
 
కమలాక్షుని (శ్రీమహావిష్ణుమూర్తి) చేత సేవింపబడు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా త్రిపురసుందరీ నామావళి యందలి కమలాక్షనిషేవితా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం కమలాక్ష నిషేవితాయై నమః అని యెనలేని భక్తిప్రపత్తులతో ఆ జగదీశ్వరిని ఉపాసించు భక్తులకు సకల వేద శాస్త్రసారమైన ముక్తి రూపిణియైన జగన్మాత తన దివ్యమంగళస్వరూపముతో స్పష్టంగా సాక్షాత్కరించిన భావం కలుగుతుంది.

ఇంద్రనీలమయీం దేవీం విష్ణురర్చయతే సదా  విష్ణుత్వం ప్రాప్తివాన్ 

అమృతమథనసమయంలో ఉద్భవించిన అమృతమును పొందుటకు దేవదానవులు పోటీ పడ్దారు. శ్రీమహావిష్ణు ఆ అమృతమును ధర్మపక్షపాతులైన దేవతలకే దక్కవలెననియు, లోకకంటకులైన రాక్షసులకు లభింపకూడదని జగన్మోహినిగా అవతరించాలని అనుకున్నాడు.  జగన్మోహిని యనగా అమ్మవారే గనుక అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలని అమ్మవారిని విష్ణువు ఇంద్రనీలమణులతో చేయబడిన దేవీస్వరూపమును సతతము అర్చనచేయుట జరుగినది. గనుక ఆ పరమేశ్వరి తన చేతిపదివ్రేళ్ళగోళ్ళ సందులనుండి నారాయణుని పది అవతారములను ఉద్భవింపజేసినది. కమలాక్షుడైన విష్ణువుచే సేవింపబడిన పరమేశ్వరి కమలాక్షనిషేవితా యని  వశిన్యాది వాగ్దేవతలచే నామమును పొందియున్నది. 

కమలము అనగా పద్మము. శరీరంలో షట్చక్రములు మరియు సప్తమచక్రమైన సహస్రారము పద్మములు అనబడతాయి. అక్షము  అనగా ఇరుసు. షట్చక్రములు అనగా షట్పద్మమములకు శరీరముయొక్క వెన్నుముక అక్షమైయుండగా సషుమ్నామార్గం ద్వారా సాధకులచే నిశ్శేషముగా(పరిపూర్ణంగా) సేవింపబడి (సాధనచేయబడి) సహస్రారపద్మముచేరిన పిదప బిందుస్వరూపిణిగా సేవింపబడుచున్నది గనుక ఆ పరమేశ్వరి కమలాక్షనిషేవితా యని అనబడినది.
 
శ్రీమాత బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుల (త్రిమూర్తులు) మరియు ఇంద్రాది దేవతలచేతను, సనకాది మహర్షులచేతను, లోపాముద్ర, పులోముని కూతురు అయిన ఇంద్రుని భార్య సచీదేవి మొదలైన వారిచే సేవింప బడుచున్నది

1) 80వ నామ మంత్రము - ఓం  కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః

(తన చేతుల పది వ్రేళ్ళ గోళ్ళ సందుల నుండి నారాయణుని దశావతారములు ప్రభవింపజేసిన పరమేశ్వరికి నమస్కారము - భండాసురుడు దైత్యులను ఉద్భవింపజేసే సర్వాసురాస్త్రం ప్రయోగించగా, హిరణ్యకశిప రావణాది దైత్యులు ఆవిర్భవించి యుద్ధం చేయనారంభించిరి, అందుకు ప్రతిగా జగజ్జనని నారాయణుని దశావతారములను తనచేతి పది వ్రేళ్ళ గోళ్ళ సందుల నుండి ఉద్భవింపజేసి రాక్షస సంహారము కావింపజేసినది)

2) 83వ నామ మంత్రము ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవాయై నమః

 (భండాసుర వధ సమయంలో లలితాంబిక పరాక్రమమునకు బ్రహ్మ,విష్ణు, ఇంద్రాది దేవతలు ఆ జగజ్జనని స్తుతించారు. అట్టి పరమేశ్వరికి నమస్కారము)

3) 230వ నామ మంత్రము ఓం మహాయాగ క్రమారాధ్యాయై నమః  (మహాయాగం - అనేక యోగినీ పూజలతో కూడినది మహాయాగం చేత ఆరాధింపబడు పరమేశ్వరికి నమస్కారము)

4) 231వ నామ మంత్రము ఓం మహాభైరవ పూజితాయై నమః  (మహాభైరవుని చేత - పరమ శివునిచేత పూజింపబడు తల్లికి నమస్కారము)

5) 297వ నామ మంత్రము ఓం  హరిబ్రహ్మేంద్ర సేవితాయై నమః (హరి, బ్రహ్మ, ఇంద్రాది దేవతలచే సేవింపబడు తల్లికి నమస్కారము)

6) 345వ నామ మంత్రము ఓం    క్షేత్రపాల సమర్చితాయై నమః (క్షేత్రమును అనగా శరీరమును పాలించి జీవుని చేత అర్చించబడు తల్లికి నమస్కారము)

7) 375వ నామ మంత్రము ఓం   కామపూజితాయై నమః (మన్మథునిచే పూజింపబడు తల్లికి నమస్కారము)

8) 545వ నామ మంత్రము ఓం   పులోమజార్చితాయై నమః (పులోముని పుత్రికయైన ఇంద్రాణి - ఇంద్రుని భార్య చేత అర్చింపబడిన తల్లికి నమస్కారము)

9) 586వ నామ మంత్రము ఓం  కామసేవితాయై నమః (మహా కామేశునిచే - శివునిచే లేదా మన్మథునిచే పూజింపబడు తల్లికి నమస్కారము)

10) 590వ నామ మంత్రము  ఓం   కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవితాయై నమః (కేవలం వీక్షణ మాత్రంచే కోటి లక్ష్ములచే సేవింపబడు తల్లికి నమస్కారము. జగన్మాత కటాక్షానికి నోచుకున్న భక్తుడు అనంతకోటి లక్ష్ముల అనుగ్రహానికి పాత్రుడవుతాడని భావము)

11) 614వ నామ మంత్రము ఓం  సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితాయై నమః  (ఎడమ, కుడి భాగములలో వింజామరలతో కూడిన లక్ష్మి, సరస్వతులచే సేవింపబడు తల్లికి నమస్కారము)

12) 636వ నామ మంత్రము ఓం  గంధర్వ సేవితాయై నమః (గంధర్వులచే సేవింపబడు తల్లికి నమస్కారము)

13) 647వ నామ మంత్రము ఓం   లోపాముద్రార్చి తాయై నమః (అగస్త్యుని భార్యయైన లోపాముద్రచే - శ్రీవిద్యా మంత్రంచే పూజింపబడిన తల్లికి నమస్కారము)

14) 726వ నామ మంత్రము ఓం   సనకాది సమారాధ్యాయై నమః (సనకాది మహర్షులచే పూజింపబడు తల్లికి నమస్కారము)

15) 785వ నామ మంత్రము ఓం  మార్తాండ భైరవారాధ్యాయై నమః (మార్తాండభైరవునిచే - శివునిచే ఆరాధింపబడు తల్లికి నమస్కారము)

16) 825వ నామ మంత్రము ఓం  బుధార్చితాయై నమః (బుధజనులచే - జ్ఞానులచే పూజింపబడు తల్లికి నమస్కారము)

అంతటి అఖిలాండేశ్వరికి శతకోటి పాదాభివందనములు

 జగద్రూపమగు నామ రూపములతో ఉండే జీవుల ద్వారా సేవింపబడునది కావున శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం కమలాక్షనిషేవితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

559వ నామ మంత్రము 15.1.2022

ఓం తాంబూల   పూరిత ముఖ్యై నమః

తాంబూలముతో పూరింపబడడం వలన ఎర్రబడిన నోరు గల పరమేశ్వరికి నమస్కారము.

శ్రీ లలితా సహస్ర నామావళి యందలి తాంబూలపూరిత ముఖీ అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం తాంబూల పూరిత ముఖ్యై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరాశక్తిని ఉపాసించు సాధకుడు నిశ్చయముగా ఆ తల్లి అనుగ్రహపాత్రుడై తన కఠోర సాధన వలన బ్రహ్మజ్ఞాన సంపన్నుడై, పరిపూర్ణమైన ఆత్మానందము ననుభవించుచు శాశ్వతమైన పరమపదముపై ధ్యాసయుంచి తల్లి కరుణతో దివ్యత్వమునంది తరించును.

తాంబూల పూరిత ముఖీ అనగా తాంబూలసేవనము చేత పూరితమైన ముఖముతో అమ్మ నోరుమాత్రమే కాక  ముఖమంతయు ఆ తాంబూలము యొక్క ఎర్రనికాంతులతో నిండి ఆ తల్లిని చూడగానే విశ్వమంతయు తన బిడ్డలవలె అనురాగము చూపు పరిపూర్ణమైన మాతృ స్వరూపము కనబరచు చున్నదని భావము. 

ఇంతకు ముందు అమ్మ వారిని కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా యను (26వ) నామ మంత్రంలో జగన్మాతను (కర్పూరాది సుగంధచూర్ణముతో మిశ్రితమైన తాంబూలాన్ని సేవించుచున్నందున ఏర్పడిన ముఖపరిమళంతో దిగంతములన్నిటినీ అమ్మవారు ఆకర్షిస్తున్నదని వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కీర్తించారు.  సాధారణంగా ఆకువక్క సున్నంతో వేసుకుంటేనే పరిమళం పరిమళం గుబాళిస్తూ ఉంటుంది. అటువంటిది  అమ్మవారు తన తాంబూలంలో యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరము, కస్తూరి, కవిరి, నాగకేసరములు, జాజికాయ, కొబ్బరి ముక్కలు, మిరియాలు, శొంఠి మొదలైన సుగంధ ద్రవ్యములను వేసుకొంటే ఆ కర్పూరవిడియము యొక్క పరిమళం అద్భుతంగా ఉంటుంది. ఆ తాంబూలం అమ్మవారు మాత్రమే వేసుకుంటోందా అంటే, వశిన్యాదులు చెప్పలేదుకాని, వారు అనుకొనే ఉంటారు! అది ఏమంటే  కామేశ్వరుని ప్రక్కనే కూర్చున్న అమ్మవారు ఇన్ని దినుసులతో తయారు చేసిన తమలపాకు చిలుకలను వ్రేళ్ళకు పెట్టుకొని ఓరకంటచూస్తూ, తాను ఆ  కర్పూరవిడియము నమలుతూ, ఆ స్వామికి నోట పెడుతున్న మనోహరదృశ్యము తలుచుకొంటే జన్మ ధన్యమేకదా. అందుకే వశిన్యాదులు మళ్ళీ ఈ నామ మంత్రంలో అన్నారు అమ్మవారిని తాంబూల పూరితముఖీ యని. అమ్మవారు అపురూపలావణ్యవతి. తాంబూలముతో నిండిన నోటికాంతికి ఆ తల్లి ముఖముకూడా అరుణ వర్ణరంజితమై భాసిల్లు చున్నది. ఆ మనోహరదృశ్యము వశిన్యాది వాగ్దేవతల మనోనేత్రములందు మెదలి అమ్మవారిని తాంబూలపూరితముఖీ యని కీర్తించగానే అమ్మవారి ముఖము ఆనందంతో మరింత అరుణిమ సంతరించుకునే ఉంటుందిగదా! సర్వారుణా యను (49వ) నామ మంత్రంలో కీర్తించినట్లు ఆ తల్లి శరీరము, ధరించిన వస్త్రములు, ఆభరణములు, తాంబూలము సర్వమూ అరుణమై, సర్వారుణా యని అనబడగా, తాంబూలపూరిత ముఖముతో మరింత అరుణిమను పొందియున్నది ఆ త్రిభువనసుందరి యైన లలితాంబ.

ఇంతకు ముందు ఆరవ (6వ) నామ మంత్రం నుండి ఏబది నాలుగవ (54వ) నామ మంత్రం వరకూ ఆ పరమేశ్వరి స్వరూపం వర్ణింపబడినది.  ఇక్కడ  ఇహము, పరములను వాఛించెడి ద్వైదీభావ భక్తుల కోసం అమ్మవారి స్థూలరూపాన్ని మళ్ళీ ఇక్కడ వశిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. 

 ఈ నామము నుండి నిఖిలేశ్వరీ అను నామ మంత్రము వరకు శ్రీమాతయొక్క కొన్ని లక్షణములు వివరించడమైసది.

అమ్మను ధ్యానములోనే భావనచేసేందుకు అవసరమైయుండును.

త్రిభువన సుందరియైన మన అమ్మ తాంబూలపూరితముఖియై ఉండడం మరింత అందం కోసం కాదు. తాంబూల చర్వణంతో ఎన్నో రకాల అన్నములు తన బిడ్డలు (మనం) గుడాన్నం, దధ్యన్నం, చిత్రాన్నం, స్నిగ్ధౌదనము ఇంకా ఇంకా సర్వౌదనప్రీతచిత్తా అన్నట్లు అన్ని రకాల అన్నములు నివేదన చేస్తే జీర్ణశక్తి కోసం (మనభావన) తాంబూలం వేసుకుందేమో? తాంబూలపూరితముఖంతో అమ్మ ముఖంలో తనబిడ్డలయెడ ప్రేమపూరితమైన అరుణకాంతులతో ప్రకాశిస్తోంది అనికూడా భావిద్దాం.

అమ్మవారి తాంబూల చర్వణము పై శంకరభగవత్పాదులవారు తమ సౌందర్య లహరియందు అరువది ఐదవ శ్లోకంలో ఇలా వర్ణించారు:

రణే జిత్వా దైత్యా - నపహృతశిరస్త్రైః కవచిభిః

ర్నివృత్తై శ్చండాంశ - త్రిపురహరనిర్మాల్యవిముఖైః|

విశాఖేంద్రో పేంద్రై - శ్శశి విశద కర్పూరశకలా

విలీయంతే మాత - స్తవ వదన తాంబూలకబళాః ||

 అమ్మా! పరమేశ్వరీ! ఒకసారి శివుని ఆజ్ఞతో  కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువు ముగ్గురు రాక్షసులపైకి యుద్దానికి వెళ్ళి వారిని జయించి తిరిగి కైలాసం చేరుకున్నారు. యుద్దవిజేతలైన వారిని సత్కరించదలచి శివుడు వారికి ఏవో బహుమానాలు ఇవ్వబోగా శివద్రవ్యం ( నిర్మాల్యం) పొందే అర్హత చండీశ్వరునికే కాని మనం పుచ్చుకోరాదనుకున్నారో ఏమో గాని, వారు అవి స్వీకరించకుండా అక్కడనుండి వారు సరాసరి లోపల అంతఃపురంలో విలాసంగా బంగారు ఊయల ఊగుతూ తాంబూలం చర్వణం ( నములుతూ) చేస్తున్న నీ వద్దకు వచ్చారు. వారి శిరములపై ఉన్న కిరీటాలు తీసి ప్రక్కన పెట్టి నీ పాదాలకు నమస్కరించగా నీవు వారిని చూసి మాతృ వాత్సల్య పూరిత కటాక్షం తో వారిని అనుగ్రహించుచూ చక్కటి దరహాసం చేసినావు. అదుగో అప్పుడే నీ నోటినిండా తాంబూలం ఉండుట చేత, నవ్వుటకై నీవు నోరు తెరచిన వెంటనే నీ నోటి నుండి పచ్చకర్పూర సహితమైన తాంబూల తమ్మల కబలములు ( ముద్దలు) క్రింద పడినవి. అంతే అది చూచిన ఆ కుమార, ఇంద్ర, విష్ణువులు  శంకరుడు ఇవ్వబోయిన వజ్ర వైడూర్య రత్నఖచితములైన సంపదలు సైతం ఆశించని ఆ మువ్వురూ నీ నోటి నుండి క్రింద పడిన తాంబూల ముద్దలకై పోటీపడి వాటిని కాజేసి వాటిని భుజించుచున్నారు. 

అమ్మకు కుమారస్వామి మాత్రమేకాదు ఇంద్రాది దేవతలు, బ్రహ్మ, విష్ణు, రుద్రులు అందరూ బిడ్డలే. యా విద్యా శివకేశవాది జననీ , యా బ్రహ్మాది పిపీలకాంత జన‌నీ అని కదా అమ్మ జ్ఞాన శ్లోకములు. ఈ జగత్తులోని వారంతా ఆమె బిడ్డలే. అందుకే అమ్మ జగన్మాత. బిడ్డకు తల్లి భుజించునది తన నోటినుండి తీసి పెట్టిన పరమానందము కలుగును. అమ్మ వద్ద పసిబిడ్డలుగా మసలు ఆ దేవతలకు ( మనకు కూడా ) సంపదల కన్నా అమ్మ ప్రేమయే ముఖ్యం అని భావము). అమ్మా నీ నోటిలోని తాంబూలము అంత విశేషమైనది.

అటువంటి శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం తాంబూల పూరిత ముఖ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

560వ నామ మంత్రము 16.1.2022

ఓం  దాడిమీ కుసుమ ప్రభాయై నమః

 దానిమ్మ పుష్పముల యొక్క అరుణవర్ణ కాంతులతో ప్రకాశించు పరమేశ్వరికి నమస్కారము

శ్రీలలితాసహస్రనామావళి యందలి దాడిమీ కుసుమ ప్రభా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం దాడిమీ కుసుమ ప్రభాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగజ్జననిని ఉపాసన చేయు సాధకులు దేవి కరుణచే మాయా బంధ విముక్తులై బ్రహ్మజ్ఞాన సంపన్నులై తరించుచూ ఇతరులను కూడా తరింపజేయుదురు.

దాడిమీ కుసుమము అనగా దానిమ్మ పుష్పము. దానిమ్మ చెట్లు 1. కాయదానిమ్మ, 2. పువ్వు దానిమ్మ రెండురకములు. 

పువ్వు పూసి, కాయకాచి పండు ఇచ్చు చెట్లకు కేవలం కాయలే ప్రధానమై యుండునవి కాయదానిమ్మ  అందురు. ఈ చెట్టుకు పువ్వులు అంతగా ఉన్ననూ, అంత మనోహరముగా నుండవు.

పువ్వు దానిమ్మ చెట్టు పువ్వులు ఎర్రగా   ఉంటాయి. చాలా అందంగా అరుణవర్ణంలో, అమ్మవారి శరీరవర్ణంలో ఉంటాయి.  ఈ దానిమ్మపువ్వులు పరిమళభరితముగా కూడా ఉంటాయి. స్త్రీలకు పరమళ భరితమైన పువ్వులు ఇష్టమైనట్లే వనితాలలామ అయిన అమ్మవారుకూడా పరిమళ భరితమైన పువ్వులు అనిన ఇష్టపడుతుంది. అమ్మవారు శిరోజములందు దాడిమీ కుసుమములను ధరించి, కామేశ్వరునికి అత్యంత మనోహరమై భాసిల్లుచుండుటచే వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని దాడిమీ కుసుమప్రభా యని కీర్తించారు. 

దానిమ్మ పువ్వు యొక్క చక్కని అరుణవర్ణ వికాసముతో జగదీశ్వరి విరాజిల్లుతున్నదని భావము.

ఆ పరమేశ్వరి సౌందర్యవతి మాత్రమే కాదు, అత్యంత సౌమ్యవతి. ఆ తల్లి మాట్లాడితే సరస్వతీ వీణ అయిన కచ్ఛపి వీణానాదముకన్నా మధురముగా ఉంటుంది. ఆ అమ్మ యొక్క మందస్మిత వదనారవిందము శరత్కాల చంద్రబింబము కన్నను మనోహరమైనది. తన భక్తులు తనను (శ్రీలలితా సహస్ర నామ పారయణతో) కీర్తిస్తుంటే ఆ భోళాశంకరునికన్నా భోళాగా భక్తవశయగుతుంది. ఈ విషయంలో పరమేశ్వరి మాత్రమేకాదు, ఏ రమణీమణియైనను తన అందాన్ని పొగిడితే పరవశచిత్తముతో ముగ్ధత్వమును సంతరింపజేసు కుంటుంది.

 ఇంతకు ముందు తాంబూలపూరితముఖీ యని కీర్తింపబడినది. అనగా తాంబూల చర్వణముతో  అరుణవర్ణమైన నోరు, తన్మూలంగా అరుణవర్ణ రంజితమైన వదనము, దాడిమీకుసుమప్రభా యను ఈ నామ మంత్రముతో ఆ పరమేశ్వరి సర్వారుణా యని యనదగినది అయినది. 

జగన్మాతను దాడిమీ కుసుమ ప్రభా అని కీర్తించాము.  జగజ్జనని సౌందర్యాన్ని కొన్ని పూలతోను,  కొన్ని పుష్పములనిన ఆ తల్లికి ప్రీతి యను కారణముచేతను, అలాగే కదంబవన వాసినియై తేజరిల్లుచుండుట చేతను, కదంబ కుసుమ ప్రియా యనికూడా కీర్తింపబడుటచేతను, ఆ తల్లి ఎన్నోరకములైన సుమసముదాయములతో అమ్మకు గల అనుబంధాన్ని చెప్పుకున్నాము. అన్ని పుష్పముల వర్ణము దాదాపు అరుణ వర్ణమే యగుటచే ఆ తల్లి సర్వారుణాఽనవద్యాంగీ యని కూడా కీర్తింపబడినది.

అమ్మవారి సర్వాభరణములు, ధరించిన వస్త్రములు, పుష్పములు, శరీర కాంతులు అన్నియు  అరుణ వర్ణమై తేజరిల్లుచున్నవి. అటువంటి అరుణ వర్ణంతో తేజరిల్లు తల్లికి శత సహస్ర వందనములు.

శ్రీలలితా త్రిపురసుందరి సహస్ర నామావళిలోని కొన్ని నామ మంత్రములను సంస్మరిస్తూ అమ్మకు,  పుష్పములకు గల బంధాన్ని మననము చేసుకొంటూ ఆనందంలో తన్మయులమై తరించుదాము.

1) 12వ నామ మంత్రము ఓం నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలాయై నమః తన అరుణ (ఎర్రని) శరీర కాంతితో సమస్త బ్రహ్మాండ మండలాలను ప్రకాశింపజేస్తున్న పరమేశ్వరికి నమస్కారము

2) 13వ నామ మంత్రము 1) 12వ నామ మంత్రము ఓం  నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలాయై నమః తన అరుణ (ఎర్రని) శరీర కాంతితో సమస్త బ్రహ్మాండ మండలాలను ప్రకాశింపజేస్తున్న లలితా పరమేశ్వరికి నమస్కారము

2) 12వ నామ మంత్రము ఓం నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలాయై నమః తన అరుణ (ఎర్రని) శరీర కాంతితో సమస్త బ్రహ్మాండ మండలాలను ప్రకాశింపజేస్తున్న జగన్మాతకు నమస్కారము

2) 13వ నామ మంత్రము ఓం చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః చంపక, అశోక, పున్నాగ మొదలైన పుష్పములకు సుగంధాన్ని అందజేసిన లలితాంబకు నమస్కారము (జగన్మాత శిరోజములు సహజ సుగంధం కలిగినవి. అందుచేత ఆ కేశముల సువాసన అమ్మ ధరించిన చంపకాశోక పున్నాగ మొదలైన పుష్పములకు ఆ లలితాంబిక అందజేస్తున్నది)

3) 21వ నామ మంత్రము ఓం కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాయై నమః - చెవుల పైభాగంలో కడిమి వృక్షపు పూలగుత్తిని ధరించడంచే రమణీయంగా భాసించు శ్రీమాతకు నమస్కారము

4) 60వ నామ మంత్రము ఓం కదంబ వనవాసిన్యై నమః - కడిమి వృక్షముల వనమందు వసించు శ్రీదేవికి నమస్కారము. పరమేశ్వరి వసించు   స్థానం - కడిమి (కదంబ) వృక్షముల నడుమ, మణి మండప ప్రాకార మధ్యలో చింతామణి గృహము.

5)  323వ నామ మంత్రము ఓం శ్రీం కదంబ కుసుమ ప్రియాయై నమః - కడిమి పువ్వుల పట్ల ప్రీతి గల పరమేశ్వరికి నమస్కారము

6) 435వ నామ మంత్రము ఓం  చాంపేయ కుసుమ ప్రియాయై నమః - చంపక (సంపెంగ) పుష్పంపై ప్రీతిగల జగన్మాతకు నమస్కారము.

7) 560వ నామ మంత్రము ఓం దాడిమీ కుసుమ ప్రభాయై నమః -  దానిమ్మ పుష్పం వంటి కాంతితో ప్రకాశించు జగదీశ్వరికి నమస్కారము.

8) 766వ నామ మంత్రము ఓం జపాపుష్ప నిభాకృత్యై నమః - దాసాని పూవును బోలిన రంగుతో (అరుణ వర్ణముతో)  ప్రకాశించు కాత్యాయనికి నమస్కారము.

9) 773వ నామ మంత్రము ఓం పాటలీ కుసుమ ప్రియాయై నమః - తెలుపు, ఎఱుపు మిశ్రమ వర్ణపు పాటలీపుష్పంపై మక్కువ గల శ్రీమాతకు నమస్కారము.

10) 776వ నామ మంత్రము ఓం  మందార కుసుమ ప్రియాయై నమః - దేవ పుష్పమైన  మందారము నందు ప్రీతిగల జగన్మాతకు నమస్కారము.

11) 919వ నామ మంత్రము ఓం  చైతన్య కుసుమ ప్రియాయై నమః - చైతన్య మనే పుష్పం (హృదయ పద్మం) పట్ల ప్రీతి గల శ్రీమాతకు నమస్కారము.

12) 964వ నామ మంత్రము ఓం  బంధూక కుసుమ ప్రఖ్యాయై నమః - బంధు జీవక పుష్పం యొక్క కాంతి (రక్తవర్ణం) వంటి కాంతితో ప్రకాశించు శ్రీమత్సింహాసనేశ్వరికి నమస్కారము.

అటువంటి దాడిమీకుసుమవికాసముతో తేజరిల్లు తల్లకి నమస్కరించునపుడు ఓం దాడిమీ కుసుమప్రభాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

561వ నామ మంత్రము 17.1.2022

ఓం మృగాక్ష్యై నమః

లేడి కన్నులవలె చంచలమై శోభిల్లు కన్నులు గల జగన్మాతకు నమస్కారము

శ్రీ లలితా సహస్రనామావళి యందలి మృగాక్షీ యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం  మృగాక్ష్యై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో  ఆ పరాశక్తిని  ఉపాసించు సాధకులకు ఆ కరుణామయి అనుగ్రహముచే సర్వశుభములు చేకూరును, ఆత్మానందము ఏర్పడి తరించుదురు.

మృగము అను శబ్దమునకు జింక, మృగశిర అను నక్షత్రము, అన్వేషణము (వెదకుట), వేట, వేడుట అను అర్థములు గలవు. 

జింక అనగా లేడి. జింకకు ఉన్న కన్నులు చంచలమై ఉంటాయి. ఆ చంచలత్వము కూడా చాలా రమణీయంగా ఉంటుంది.  ఆ చూపులు బెదురుచూపులవలె ఉంటాయి. ఆ కన్నులు సోగదేరి ఉంటాయి. కాటుక అలదిన ఆ కన్నులు మీనద్వయమును బోలి ఉంటాయి గనుక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా (ముఖసౌందర్యశ్రీ ప్రవాహమునందు చలించు మీనములై ఒప్పారుతాయి) యని ఆమ్మవారి కన్నులు విశేషించి చెప్పబడినవి.

మృగము అనగా మృగశిర అను నక్షత్రము. మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము.  అధిపతి కుజుడు, రాశ్యాధిపతి శుక్రుడు.
అందుచేతనే పరమేశ్వరి కుజ గ్రహకాంతులను ధిక్కరించే ఎర్రని పగడపు ముక్కెర ముక్కునకు కుడివైపున, శుక్రగ్రహకాంతులను సైతము తిరస్కరించే తెల్లని వజ్రపు ముక్కెర ముక్కునకు ఎడమ ప్రక్కన ధరించియున్నది.  అలాగే  అధిదేవత కుమారస్వామి తన తనయుడగుట కూడా యాదృచ్ఛికమైనది.

మృగము అను పదమునకు అన్వేషణము లేదా వెదకుట. ఆ పరమేశ్వరి కన్నులు వెతుకుతూ ఉంటాయి. పాపాత్ములలో ఏమాత్రమైనా మంచితనపు ఛాయలేమైనా ఉన్నవా? అను కోణంలో అమ్మవారి కన్నులు పాపాత్ముల హృదయాలను వెతుకుతూ ఉంటుంది. మంచితనపు ఛాయలు కొరవడితే వారి ఆత్మలను తనలో లీనంచేసుకుంటుంది. మంచితనపు ఛాయలు గోచరిస్తే పాపభీతి వారిలో ప్రవేశపెట్టి సన్మార్గములోనికి  నడుపుతుంది. అనునిత్యమూ తన సహస్రనామములను స్తోత్రముచేయు భక్తుల మనసుల కొరకై వెతకి, భక్తజనోద్ధరణము కావించుతుంది. 

మృగము అనగా వేడుకొనుట. నాడు పరమేశ్వరుడు తనపై మరులుగొనుటకై మన్మథుడు సుమబాణములు ప్రయోగించగా, కోపోద్రిక్తుడైన పరమేశ్వరుడు ఆ మన్మథుని భస్మము కావించగా,  పరమేశ్వరి ఆ కాముని సజీవునిచేయమని పరమేశ్వరునివైపు వేడుకొనుచు చూచినది. కాముని ఆ విధముగా సజీవునిచేయుటలో కృతకృత్యురాలైనది.  వేడుకొనుచు చూచిన చూడ్కులు గలిగిన పరమేశ్వరి మృగాక్షీ యని అనబడినది. ఆ తల్లి కనులలో బ్రహ్మజ్ఞానము, అద్వైతసిద్ధి, అమరత్వలబ్ధికి సంబంధించిన  వాటికి గమ్యము నన్వేషించగలము.

మృగ యను శబ్దమునకు గమ్యము అను అర్థము గలదు. ఆ తల్లి నయనములు జ్ఞానసముపార్జనా గమ్యమును అనుగ్రహించును.

విశాలాక్షి, కామాక్షి, మీనాక్షి యని పలు విధములుగా అమ్మవారి నయనములు కీర్తింపబడినవి.

అటువంటి అఖిలాండేశ్వరికి నమస్కరించునపుడు ఓం  మృగాక్ష్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

562వ నామ మంత్రము 18.1.2022

ఓం మోహిన్యై నమః

జగత్తంతటిని మోహింపజేయు జగన్మాతకు నమస్కారము.

శ్రీ లలితా సహస్రనామావళిలోని మోహినీ అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం మోహిన్యై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకులకు ధన, కనక, పుత్రపౌత్రాది లౌకిక సిద్ధులతో పాటు జ్ఞానసిద్ధియు, క్రమంగా శాశ్వతమైన పరమసిద్దియు ప్రాప్తిస్తాయి.

మోహం అంటే భ్రమకు గురికావడం, ఆత్మభావనను వీడి, దేహ భావనకు లోనై జన్మ-మృత్యు భ్రమణంలో (పునరపి జననం - పునరపి మరణం)  పడడానికి కారణం  జగజ్జనని యొక్క మాయా (భ్రమ) కల్పనయే. భ్రమ అనునది మహామాయా స్వరూపము. ఆ మాయయే ఆది పరాశక్తి. ఆది పరాశక్తి హైందవ పురాణాల ప్రకారం సర్వశక్తి మంతురాలైన దేవత. పరబ్రహ్మ స్వరూపం. శాక్తేయంలో ఆది పరాశక్తి మాత్రమే పరమసత్య స్వరూపంగా గుర్తింపబడింది. దేవి భాగవత పురాణములో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు, వినాశకారి ఆది పరాశక్తే అని సూచించబడింది. శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి శూన్యబిందు, అనగా దివ్యమైన శూన్య స్త్రీ శక్తి. ఈ శక్తి యొక్క సార్వత్రిక ఆత్మ (పురుషుడు), ప్రకృతి శక్తికి జన్మించిన అంశములు. దుర్గా దేవి ఆది పరాశక్తి యొక్క సమీప రూపాంతరము. ఆది పరాశక్తి యొక్క మానవ రూపమే శక్తికి, సౌందర్యానికి దేవత అయిన దుర్గా దేవి. దుర్గా దేవి సాత్విక, రాజసిక, తామసిక గుణాలు మూడూ కలసిన ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము. అయితే, అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆది పరాశక్తి రూపం లేనిది, నిర్గుణ బ్రహ్మ అనే వాదన కూడా ఉంది. ఈ వాదన ప్రకారం ఆది పరాశక్తి ఒక దివ్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన చైతన్యము. ఆదిమ శక్తి తనే కావటం మూలాన ఇతర దేవతలకి కూడా తనే మూలము. కావున ఆది పరాశక్తే అఖండ సత్యం. ఈ శక్తి తనకుతనే సంపూర్ణం. ఆది పరాశక్తి భర్త లేనిది. కానీ ఈ జగత్తుకి శివుడిని ఆహ్వానించటానికి తాను స్త్రీ రూపంలో జన్మనెత్తినది. హిందూ మతంలో ఆది పరాశక్తి అనగా ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్య శక్తి. స్త్రీ యొక్క సృజనాత్మక శక్తికి దైవత్వాన్ని ఆపాదించే ఒక భావన. భూభాగం పై ఆది పరాశక్తి ప్రాథమికంగా ఫలవంతమైన స్త్రీ స్వరూపంలో అవతరించిననూ పురుషావతారం లోనూ ఆ శక్తి నిగూఢంగా దాగి ఉంది. సృష్టికే కాక, సకల మార్పులకు కూడా శక్తే మూలం. శక్తి మాత్రమే దైవత్వానికి ఉనికి. శక్త మాత్రమే విముక్తి. మానసిక, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే శక్తి యొక్క రూపాంతరమైన కుండలిని శక్తికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ ఆధారం అవసరం లేకుండా, స్వతంత్రంగా ఉండటంలోనూ, సమస్త సృష్టిపై ఆధారితమై ఉండుటలోనూ శక్తి మాత్రమే కీలకం. శక్తి ఆరాధన లోనూ శైవము లోనూ ఆది పరాశక్తి సర్వశక్తిమంతురాలిగా పూజించబడుతోంది. సాక్షాత్ పరమశివుడి స్త్రీ రూపమే ఆది పరాశక్తిగా, ఈ రూపమే మహాదేవిగా, పార్వతీ దేవిగా గుర్తింపబడుతోంది. "నాడు అమృతమథన సమయంలో, అమృతమును దేవతలకు మాత్రమే  దక్కేలా చేయడానికి శ్రీమహావిష్ణువు మోహినీ రూపమును ధరించి, ప్రవరానదీ తీరమందలి నివాసపురమున నివసించుచుండెను. ఆ మోహినీ రూపమైన శక్తియగు పరమేశ్వరియే మోహినీ" యని అనబడెనని" కూడా చెప్పబడినది. "పరమాత్మ ధ్యానము చేయుచుండగా ఆ ధ్యానమునుండి ఒక శక్తి ఆవిర్భావమయ్యెను. ఆ శక్తికే ప్రకృతియని పేరు. ఆ శక్తి దేవతలందరి కోరికలను నెరవేర్చును. ఆ శక్తియే అమృతమథన సమయంలో అవాఙ్మానసగోచరము, సర్వసమ్మోహమును గలిగించునదైన రెండవ స్వరూపమైన మోహినీ రూపము. ఆ రూపమును జూచిన శంకరుడు మోహమును పొందినవాడయ్యెను" అని బ్రహ్మాండపురాణమునందు చెప్పబడెను. బ్రహ్మాండ పురాణమునందే "పరమాత్మ ధ్యానించుచు తనయందే అభేదమును పొందియున్న ఒక రూపమును కనుగొనెను" అని కూడా గలదు. దీనిని బట్టి మూలప్రకృతి స్వరూపమైన పరమేశ్వరికిని, పరమాత్ముని మోహినీ అవతారమునకును భేదము లేదని తెలియుచున్నది. గనుకనే పరమేశ్వరి మోహినీ యని అనబడినది  హ్రీం అనునది మోహమునకు మాయా బీజాక్షరం. 
 హ్రీం  అను బీజాక్షరములో హ కార ఈం కారములున్నాయి. ఇవి క్రమేపి నాదాన్ని, శక్తినీ ప్రసాదించును. ఉత్తేజ, ఉత్సాహములు, మోహ, వైభవ, శోభలు, వ్యామోహములు ప్రకృతినుండే వెలువడతాయి.  .  "ఓ దేవీ! నీవు లోకములను అన్నిటిని మోహపెట్టు చున్నావు. అందుచేతనే మోహినీ యను నామము నీకు కలుగును" అని లఘునారదపురాణమునందు చెప్పబడినది. 

అటువంటి అమ్మవారికి నమస్కరించునపుడు ఓం మోహిన్యై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

563వ నామ మంత్రము 19.1.2022

ఓం ముఖ్యాయై నమః

హిరణ్యగర్భరూపంలో  (నాలుగు ముఖాల బ్రహ్మరూపంలో)  ఈ సృష్టికి ముఖ్యప్రాణంగా ఉన్న ఆ జగన్మాతకు నమస్కారము

 శ్రీలలితా సహస్ర నామావళి యందలి ముఖ్యా అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం ముఖ్యాయై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసిస్తే సర్వ సృష్టియును దేవీరూపంగా భాసిస్తుంది మరియు రాగద్వేషములు అంతరించి తరిస్తారు.

ముఖ్యా అంటే ముఖ్యమైనది. ఆ తల్లి సాక్షాత్తు హిరణ్యగర్భ స్వరూపిణి. శాస్త్రీయ పురాణ హిందూ మతంలో, హిరణ్యగర్భ అనేది వేదాంతంలో సృష్టికర్త కోసం ఉపయోగించే పదం. హిరణ్యగర్భను కూడా బ్రహ్మ అని పిలుస్తారు, ఎందుకంటే అతను బంగారు గుడ్డు నుండి జన్మించాడని  మనుస్మృతిలో చెప్పబడింది. ఋగ్వేదంలోని హిరణ్యగర్భ సూక్తం, భగవంతుడు తనను తాను విశ్వం యొక్క సృష్టికర్తగా ప్రారంభంలో వ్యక్తం చేసాడు, తనలో ఉన్న ప్రతీదీ, సమిష్టి సంపూర్ణతతో సహా, సమస్త సృష్టిని, దానిని సర్వోత్కృష్టమైన మేధస్సుగా జీవింపజేసాడు.

సృష్టి, జీవనోపాధి మరియు విధ్వంసం (లయము) త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణువు మరియు శివుడు అని కూడా అంటారు. సూత్రాల పట్ల పవిత్రుడైన పరమాత్మ అయిన నారాయణుడు మాత్రమే ఆదిలో ఉన్నాడని భాగవతం పేర్కొంది - పరమ హరి, బహుళ తలలు, బహుళ కన్నులు, బహుళ పాదాలు, బహుళ చేతులు, బహుళ అవయవాలు. ఇది సకల సృష్టికి అత్యున్నతమైన బీజము, సూక్ష్మమైన వాటి కంటే సూక్ష్మమైనది, గొప్పదానికంటే గొప్పది, అతి పెద్దదానికంటే పెద్దది మరియు అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే గొప్పది, శక్తిమంతమైనది, గాలి కంటే మరియు అన్ని దేవతల కంటే, మరింత ప్రకాశవంతమైనది. సూర్యుడు మరియు చంద్రుడు, మరియు మనస్సు మరియు బుద్ధి కంటే కూడా అంతర్గతంగా ఉంటాయి. ఆయనే సృష్టికర్త, సర్వోన్నతుడు. ఈ పదానికి మొదట సృష్టికర్త అయిన తరువాత, అన్ని వస్తువుల గర్భంగా పరిగణించ బడేవాడు అని కూడా హిరణ్యగర్భ అను శబ్దానికి అర్ధం గలదు. హిరణ్యగర్భుడు అంటే చతుర్ముఖుడైన బ్రహ్మ అనికూడా కలదు. సృష్టిస్థితిలయ తిరోధానానుగ్రహములను పంచకృత్యములను నెఱపుచున్న పరమేశ్వరి సాక్షాత్తు నారాయణియే. చతుర్ముఖ బ్రహ్మస్వరూపిణి కూడా ఆ తల్లియే. ఎందుకంటే సర్వమంత్రస్వరూపిణి. అంటే బీజాక్షరస్వరూపమైన మంత్రంలో దైవము సూక్ష్మరూపంలో ఇమిడియుండుట గలదు. సర్వమంత్రస్వరూపిణి గనుక సర్వదేవతాస్వరూపిణి యని అనబడినది. అంతేకాదు సర్వయంత్రాత్మిక అంటే యంత్రమునందు బీజాక్షరస్వరూపమైన  దైవము ప్రతిష్టింపబడియుండును. ఈ విధంగా తలచినాకూడా అమ్మవారు సర్వదేవతా స్వరూపిణి. ఆ పరమేశ్వరి సర్వదేవతాస్వరూపిణి గనుక సర్వతంత్రాత్మికయై భక్తులచే సర్వతంత్రములందుగల సర్వదేవతారాధనమును ఆ పరమేశ్వరి స్వీకరిస్తున్నది. గనుక అమ్మ సర్వదేవతా స్వరూపిణి. సర్వయంత్రాత్మిక. సర్వమంత్రాత్మిక.  సర్వమంత్రాత్మిక గనుక ఆ పరమేశ్వరి అన్నిటిలోనూ ప్రప్రథమంగా పరిగణింప బడుచున్నది. గనుకనే అగ్రగణ్యా  (అన్నింటికీ మూలకారణమవడం వల్ల మొట్టమొదటగా లెక్కింపదగిన పరమేశ్వరి) యను (553వ) నామ మంత్రంతో వశిన్యాదులు అమ్మవారిని కీర్తించారు. ఈ నామ మంత్రంలో మొట్టమొదటగా అనడం జరిగినది. అంటే ముఖ్యురాలే గదా!  ముఖ్యమైనవాళ్ళే అగ్రగణ్యులు. గనుకనే ఆ పరమేశ్వరి ముఖ్యా యని అనబడినది. అమ్మవారు ముఖ్యా అని అనుటకు కారణం ఆ తల్లి ఆదిపరాశక్తి యని అనబడుటయే. అంటే సృష్టికి పూర్వం, స్థితి కాలంలో సర్వరక్షకిగా, లయకాలంలో సమస్త జగత్తునూ తనలో నిక్షేపించుకుంటూ, ఇందుగలదందు లేదని ఎల్లెడలా ఉంటూ దేశకాలాఽపరిచ్ఛిన్నా యను (701వ) నామ మంత్రంలో పరబ్రహ్మ స్వరూపిణి కావడంచే దేశ-కాలాలచే విభజింప శక్యము కానిది యని వశిన్యాదులచే కీర్తింపబడినది ఆ పరమేశ్వరి గనుకనే ముఖ్యా యని అనబడినది.

 అమ్మ వాగ్దేవతగా విరాజిల్లుతున్నది. వాక్కుకు గల పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ నాలుగు స్వరూపాలు ఆ పరమేశ్వరి గనుకనే అమ్మవారు వాగ్దేవత యని అనబడుచున్నది. వశినీ, కామేశ్వరి, మోదినీ, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళినీ అను వశిన్యాదుల స్వరూపం తానయి ఉన్నది గనుక అమ్మవారు వాగ్దేవత అయినది. సర్వమంత్రాలలోని బీజాక్షరములు, సర్వ యంత్రాలలోను ప్రతిష్టింపబడిన దేవతలు, సర్వతంత్రములలో ప్రస్తావింపబడిన దైవస్వరూపముల యొక్క వాక్కుగా విలసిల్లు ఆ పరమేశ్వరి ముఖ్యమైన దేవతయగుటచే ముఖ్యా అని నామప్రసిద్ధ అయినది. శ్రీమాత ముఖము నుండియే వాక్కు వచ్చినది అందుకే శ్రీమాత వాగ్దేవత అని అనవచ్చును. ఈ వాక్ప్రపంచమునకు, భౌతిక ప్రపంచమునకు, ప్రకాశమయ లోకమునకు, దీనికంతటికీ ముందుగా నాదలోకం - ఈ బ్రహ్మమునుండియే సకల జగత్తు ఆవిర్భవించినది. శబ్దము అనేది ముఖము నుండియే వెడలి వచ్చుచున్నది. ఆ పరమేశ్వరి వాగ్దేవత యని ప్రస్తావింపబడినది కావున ముఖ్యా యను నామ మంత్రంతో ఆ పరమేశ్వరి వశిన్యాదులచే కీర్తింపబడినది. అహమస్మి ప్రథమజా ఋతస్య (సౌభాగ్యభాస్కరం, 693వ పుట) అను శ్రుతి వాక్యమును భాస్కరరాయలువారు ప్రస్తావించారు.  పంచకృత్య పారాయణ యను సర్వకార్య నిర్వాహకురాలు ఆ పరమేశ్వరి కావున ఆ పరమేశ్వరి ముఖ్యా యని అనబడినది.

సృష్టి,స్థితి,లయములకును, మువురమ్మలకును మూలపుటమ్మయైన శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం ముఖ్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

564వ నామ మంత్రము 20.1.2022

ఓం  మృడాన్యై నమః

ఇహపర సుఖములను ప్రసాదించు మృడునకు (శివునికి) పత్నియై విరాజిల్లుతున్న జగన్మాతకు నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి మృడానీ అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం మృడాన్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు సమస్త బాధలు తొలగిపోవును మరియు ఆ తల్లి కరుణాంతరంగ దృష్టులు ప్రాప్తించి శాశ్వతమైన బ్రహ్మానందమునకు కావలసిన సాధనాపటిమ సంప్రాప్తమగును.

మృడుడు అంటే శివుడు. పరమశివుడు. పరమేశ్వరికి ఆయన  విభుడు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. శివుని మహిమను వర్ణించడం దేవతలకే సాధ్యం కాలేదు. అటువంటిది మానవులకు సాధ్యమా? శివుని పరమభక్తుడైన పుష్పదంతుడు పరమశివుని ఎంతో రమణీయంగా వర్ణించాడు. ఆయన వర్ణనలో సాక్షాత్తు సరస్వతీ దేవియే విశ్వప్రయత్నమే చేసినది యని పుష్పదంతుడు తన వివరణ ఈ విధంగా కొనసాగించాడు:- కల్పవృక్షమునుండి ఒక కొమ్మను తన కలముగా స్వీకరించినది ఆ చదువుల తల్లి.  నల్లటి కాటుక కొండను సప్తసముద్రాలలో కలిపి ఆ కలమునకు సిరాగా మార్చుకొన్నది. భూమిని మొత్తము తాళపత్రముగా మార్చి ఆ పరమశివుని వర్ణన ప్రారంభించినది. ఆ వాగ్దేవి సర్వకాలాల్లోనూ ఆయన మహిమలను, గుణగణములను అలా వ్రాయుచునే యున్నది. ఆ పరమశివుని వర్ణన అలా కొనసాగుతోందిగాని, ఒక దరికి చేరలేదు. మహేశ్వరుని మహిమలు ఇన్ని అన్ని కావు. ఆ గీర్వాణికి  ఆయన గుణగణముల అంతు ఎంతకునూ చిక్కలేదు. ఆయన తేజస్సు అన్ని వర్ణనలకూ అతీతమైనది.  ఆయన యొక్క నామము ఒక్కొక్కటి ఒక్కొక్క గుణమును తెలియజేస్తుంది. భవుడు అను ఆయన పేరు విశ్వసృష్టికి అవసరమైన రజోగుణాన్ని తెలుపుతోంది.  హరుడు అనే పరమశివుని నామము జగత్ప్రళయ కారణమైన తమోగుణాన్ని తెలియజేస్తోంది. మృడుడు అను ఆ శివునినామము విశ్వసౌఖ్యానికి అవసరమైన సాత్వికతను ఇస్తుంది.  మృడుడు అనే శబ్దమే శివుని సాత్వికతకు ప్రతీక. ఏ విధమైన గుణం అధికంగా ఉంటుందో, ఆ విధమైన నామరూపాలే ఆయనలో కనపడుతుంటాయి. ఇదీ శివుడి మహిమలలోని విశిష్టత.

ఒకసారి త్రిపురాసురుడు మదగర్వంతో స్వర్గంపైకి దండెత్తాడు. దేవతల్ని నానా కష్టాలకు గురిచేశాడు. అప్పుడు వారంతా ఆ రాక్షసుణ్ని సంహరించాల్సిందిగా శివుణ్ని వేడుకొన్నారు. అందుకు పరమ శివుడు అంగీకరించాడు. భూదేవి, తాను రథంగా మారినది. బ్రహ్మదేవుడు సారథి అయాడు. వహిస్తానన్నాడు. మేరు పర్వతం తాను ధనుస్సుగా సహాయపడానది. సూర్యచంద్రులు ఆ రథానికి చక్రాలుగా రూపొందుతామని ప్రకటించారు. విష్ణువు తాను బాణమవుతానన్నాడు. ఇలా యుద్ధానికి వ్యూహమంతా సిద్ధమైంది. యుద్ధయాత్ర ప్రారంభ మయ్యే వేళలో, వారందరిలోనూ గర్వరేఖలు పొడచూపాయి. శివుడి యుద్ధయాత్రలో రథంగా ఉన్న నా పాత్రే ఎంతో ప్రముఖమైంది. నేను లేకుంటే శివుడు ఎలా ప్రయాణిస్తాడు? అని భూదేవి అనుకొన్నది. రథం ఉంటే సరిపోదు కదా, దాన్ని చక్కగా నడపగలిగే సారథి కావాలి. నేను లేకుంటే, శివుడు సమరాన్ని ఎలా చేయగలడు? అని బ్రహ్మదేవుడు భావించాడు. రథము, రథసారథి ఉన్నంత మాత్రాన లాభమేమిటి? అసలైన పరికరం ధనుస్సే కదా! అది లేకుంటే శివుడు సంగ్రామంలో ఎలా విజయం సాధిస్తాడు? అని మేరు పర్వతం తలపోసింది. చక్రాలు లేనిదే రథం ముందుకు ఎలా సాగుతుంది? అందువల్ల మేమే అత్యంత కీలక స్థానంలో ఉన్నాము అని సూర్యచంద్రులు అతిశయం చూపారు. శత్రువును ఛేదించేది బాణమే కదా? కాబట్టి నేనే ప్రధానమైనవాణ్ని అనుకున్నాడు విష్ణువు. ఇలా ఎవరికివారే గర్వంతో మిడిసిపడుతున్నారు.
ఇదంతా గ్రహించాడు శివుడు. వారి గర్వాన్ని అణచివేయాలని భావించాడు. మరుక్షణంలోనే తన మూడో కన్ను తెరిచి త్రిపురాసురుణ్ని, అతడి త్రిపురాల్ని కాల్చి బూడిద చేశాడు. అప్పటివరకు గర్వించిన వారంతా శివుణ్ని ఆశ్చర్యంగా చూశారు. వారి గర్వమంతా నాశనం అయింది. శివుడికి అందరూ నమస్కారం చేశారు. పరమశివుని మహిమలు అలాంటివి.
దక్షప్రజాపతి సామాన్యుడు కాదు. అతడు తలపెట్టిన యాగమూ సామాన్యమైనది కాదు. ముల్లోకాల్లోని వారంతా వచ్చి, ఆ యాగంలో పాల్గొన్నారు. దక్షుడు చక్కని క్రియాదక్షుడు. కాని దైవమైన పరమశివుని దూషణ చేశాడు. పరమమశివుడు తన జటాజూటం నుండి  వీర భద్రుడిని సృష్టించి దక్షయజ్ఞ వినాశనం కావించి దక్షనికి గర్వభంగం కలిగించాడు. అంతటి మహిమోన్నతుడు పరమశివుడు. 
పరమేశ్వరుణ్ని ఆహ్వానించకుండా యాగం చేయడం దక్షుడి వినాశానికే కారణమైంది. శివుడి క్రోధాగ్నికి దక్షయజ్ఞం విధ్వంసమైంది. అతడి శిరస్సు పతనమైంది. ఇలా శివతేజం దుష్టసంహారకమై నిలిచింది. శిష్టరక్షణాత్మకంగా విలసిల్లింది. సమస్త లోకం స్తుతించేలా, శివ తేజస్సు విరాజిల్లుతున్నది. అంతటి మహిమాన్వితుడైన శివుడు సత్త్వగుణం గలవాడైనవేళ మృడుడు అను నామముతో విరాజిల్లాడు. ఆ మృడుని పత్ని అయిన పరమేశ్వరిని సత్త్వగుణసంపన్నతతో వశిన్యాదులు తిలకించుచూ మృడానీ  యను నామముతో కీర్తించారు.

పరమశివుడు ఇహపర సుఖప్రదాత యగుటచే మృడుడు యనిఅనబడ్డాడు.  తురీయాతీతుడైనవాడు.   సృష్టిస్థితిలయతిరోధాననుగ్రహములైన పంచకృత్యములకు సాక్షీభూతుడు. మృడ యను సంజ్ఞ గల పరమశివుని భార్యయగు శక్తి స్వరూపిణియైన ఆ పరమేశ్వరి మృడాని అను నామముతో వశిన్యాదులచే కీర్తింపబడినది. శివుడు అనగా పరమేశ్వరుడు. శివాని అనగా పరమేశ్వరి. అలాగే మృడుడు అనగా శివుడు. అలాగేఆయన పత్నియైన పరమేశ్వరి మృడానీ యని అనబడినది.

పరమ శివుని పత్నియైన పరాశక్తి, మృడానికి నమస్కరించు నపుడు ఓం మృడాన్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

565వ నామ మంత్రము 21.1.2022

ఓం మిత్రరూపిణ్యై నమః

సూర్యునివలే అరుణ కాంతులతో ప్రకాశిస్తున్న పరమేశ్వరికి నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి మిత్రరూపిణీ అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం మిత్రరూపణ్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ జగజ్జననిని ఉపాసించు భక్తుల అమ్మకరుణచే  జ్ఞానసిద్ధులగుదురు మరియు శాశ్వతమైన బ్రహ్మానందమునంది తరించుదురు.

 హిందూ పురాణాలలో అదితి కశ్యపుని యొక్క పండ్రెండు మంది పుత్రులను ఆదిత్యులు అందురు. వారు పండ్రెండుమంది గనుక ద్వాదశాదిత్యులు అని అంటారు. సంవత్సరంలోని పన్నెండు నెలల కాలంలో సూర్యుడు ఉండే స్థితులను బట్టి ద్వాదశాదిత్యుల పేర్లతో వర్ణించారు:

శ్రీవేదవ్యాస విరచితమైన సంస్కృత మహాభాగవతంలో ద్వాదశ స్కంధం, పదకొండవ అధ్యాయములో ముప్పదియవ శ్లోకము నుండి నలుబది ఎనిమిదవ శ్లోకము వరకును వేదవ్యాసుల వారి ద్వాదశాదిత్యుల వర్ణ ఉన్నది. ఒక్కొక్క నెలలో సూర్య భగవానుడు ఆయా ఆదిత్యుని నామంతో ఆరాధింపబడుతుంటాడు. ఆదిత్యుని వెంట ఆరుగురు పరిజనులు ఉంటారు. వాఱు కూడా మాసాన్ని బట్టి మారుతుంటారు. కాలరూపధరుడైన నారాయణుడే సూర్యభగవానుడు. నారాయణుడు మరియు నారాయణి (అమ్మవారికి) అభేదమున్నది గనుక పరమేశ్వరియే ద్వాదశాదిత్యస్వరూపిణిగా భావించి ఆవివరణ ఇచ్చటనీయబడినది (కాస్త ఓపికగా చదివి భాగవత మహాపురాణము, శ్రీపరమేశ్వరీ నామ పారాయణము చేసిన పుణ్యము దక్కించుకొనందులకు విజ్ఞప్తి):-

ముఖ్యగమనిక:- ఈ వివరణలో భాద్రపదమాసమునకు పిమ్మట మాఘమాసము చెప్ఫబడినది. ఆవిధమగా మాసనామక్రమము ఉల్లంఘింపబడినది. మాసక్రమ ఉల్లంఘనంతు కూర్మోక్తాదిత్య కమాను సారేణ అని కూర్మపురాణమున చెప్పబడినరీతిగా ద్వాదశాదిత్యుల క్రమమును అనుసరించి, మాసనామములతో క్రమము పాటింపబడలేదు.

మాసక్రమమున క్లుప్తముగా ఆదిత్యులు మరియు వారి పరివారములు

ధాత- మాసం: చైత్రం - పరిజనులు: కృతస్థలి (అప్సరస), హేతి (రాక్షసుడు), వాసుకి (నాగువు), రథకృత్తు (యక్షుడు), పులస్త్యుడు (ఋషి), తుంబురుడు (గంధర్వుడు)

అర్యముడు - మాసం: వైశాఖం - పరిజనులు: పుంజికస్థలి (అప్సరస), పులహుడు (రాక్షసుడు), ఓజస్సు (నాగువు), ప్రహేతి (యక్షుడు), నారదుడు (ఋషి), కంజనీరుడు (గంధర్వుడు)

మిత్రుడు - మాసం: జ్యేష్ఠం - పరిజనులు: మేనక (అప్సరస), పౌరషేయుడు (రాక్షసుడు), తక్షకుడు (నాగువు), రథస్వనుడు (యక్షుడు), అత్రి (ఋషి, హాహా (గంధర్వుడు)

వరుణుడు - మాసం: ఆషాఢం - పరిజనులు: రంభ, శుక్రచిత్తు సహజన్యుడు, హూహూ, వసిష్ఠుడు, సృనుడు

ఇంద్రుడు - మాసం: శ్రావణం - పరిజనులు: విశ్వావసువు, శ్రోత, ఏలా పుత్రుడు, అంగిరసు, ప్రమ్లోచ, చర్యుడు

వివస్వంతుడు- మాసం: భాద్రపదం - పరిజనులు: అనుమ్లోద, ఉగ్రసేనుడు, వ్యాఘ్రుడు, అసారణుడు, భృగువు, శంఖపాలుడు

అంశుమంతుడు - మాసం: మార్గశిరం - పరిజనులు: కశ్యపుడు, తార్క్ష్యుడు, ఋతసేన, ఊర్వశి, విద్యుచ్ఛత్ర, మహాశంఖులు

త్వష్ట- మాసం: ఆశ్వయుజం - పరిజనులు: జమదగ్ని, కంబళాశ్వుడు, తిలోత్తమ, బ్రహ్మపేతుడు, శతజిత్తు, ధృతరాష్ట్రుడు.

విష్ణువు - మాసం: కార్తీకం- పరిజనులు: అశ్వతరుడు, రంభ, సూర్యవర్చుడు, సత్యజిత్తు, విశ్వామిత్రుడు, మఖాపేతుడు

భగుడు - మాసం: పుష్యం- పరిజనులు: స్ఫూర్జుడు, అరిష్టనేమి, ఊర్ణువు, ఆయువు, కర్కోటకుడు, పూర్వజిత్త

పూషుడు- మాసం: మాఘం - పరిజనులు: ధనుంజయుడు, వాతుడు, సుషేణుడు, సురుచి, ఘృతావి, గౌతముడు

క్రతువు (పర్జన్యుడు) మాసం: ఫాల్గుణం - పరిజనులు: వర్చుడు, భరద్వాజుడు, పర్జన్యుడు, సేనజిత్తు, విశ్వుడు, ఐరావతుడు

ఇంకా భాగవతంలో శౌనకుడు సూతునకిలా చెప్పాడు - ఈ పన్నెండుగురు ఆదిత్యులును విష్ణువుయొక్క సూర్యరూప విభూతులు. సూర్యుని వెంబడించేవారిలో ఋషులు వేదత్రయాన్ని చదువుతుంటారు. గంధర్వులు గానాన్ని చేస్తుంటారు. అప్సరసలు నాట్యం చేస్తుంటారు. నాగులు సూర్య రథాన్ని చుట్టుముట్టి ఉంటారు. యక్షులు రథయోజన చేస్తారు. రాక్షసులు రథాన్ని వెనుకనైపునుండి తోస్తుంటారు. వాలఖిల్యులనే పేరుగల బ్రహ్మర్షులు అరువదివేలమంది రథం ముందు నిలచి సూర్య భగవానునికి అభిముఖులై త్రయీమూర్తిని ప్రస్తుతిస్తుంటారు.

   ***** 

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

566వ నామ మంత్రము 22.1.2022

ఓం  నిత్య తృప్తాయై నమః

సర్వ కాలాలలో, సర్వదా తృప్తితో (సంతోషంతో) ఉండు  పరమేశ్వరికి నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి నిత్యతృప్తా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిత్య తృప్తాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు ఆ పరమేశ్వరి బ్రహ్మానందము, ఆత్మానందము ఇలయందు సర్వ సుఖ సంతోషములు, ఎనలేని ఆత్మ సంతృప్తి, చతుర్విధ పురుషార్థ సిద్ధి కలుగజేసి తనయందు ఎనలేని భక్తిప్రపత్తులతో ఆధ్యాత్మికానుభూతి కలుగజేసి పరమపద మార్గాన్ని సుగమంచేసి ఆ తల్లి తన భక్తులను తరింపజేస్తుంది.

 పుట్టిన ప్రతీ జీవికి కోరికలు ఉంటాయి.  కోరికలు అనేక రకాలు. ఆకలి, దాహం, సంభోగేచ్ఛ ఇలాంటివి అన్నియు అన్ని జీవులకు సాధారణమైనవి. ఇవి తీరిన తరువాత మళ్ళీ కొంత సమయం వరకూ అవి మళ్ళీ పుట్టవు. గూడు, నీడ కూడా అన్ని జీవులకు అలాంటివే. అన్ని జీవులకు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు మొత్తం పది ఉన్నవి. మానవునికి మాత్రం మనసు ఒకటి అదనంగా ఉన్నది. ఈ మనసు ఉన్న మానవునకు ఆకలి వేస్తే తింటాడు. ఆకలి తీరుతుంది. తాను కోరిన ఆహారం తింటే తృప్తి చెందుతాడు. అలాగే దాహం వేస్తే నీరు త్రాగుతాడు. దాహం తీరుతుంది. కాని తాను కోరుకున్న రుచి గల నీరు అయితే తృప్తి చెందుతాడు. పూటకు లేని వాడు గంజి తాగి తృప్తి పడతాడు. బాగా ఉన్నవాడు పంచబక్ష్యాలు పెట్టినా తానుకోరిన రుచులుగల ఆహారమైతేనే తృప్తి చెందుతాడు. పక్షి గూడు కట్టుకుంటుంది. అందులో తన పిల్లలతో తృప్తిగా ఉంటుంది. పశువుకు ఇంత గడ్డి వేస్తే   తృప్తిగా తిని సేదతీరుతుంది. కాని మనసనే పదకొండవ ఇంద్రియం ఉన్న మానవుడు ఆహారంలో రుచులుకావాలి, గుడ్డ ఉంటే మరింత ఖరీదైనది కావాలి. ఇల్లు ఉంటే అంతకన్నా మంచి ఇల్లుకావాలి.  ఒకటి కలిగితే అంతకన్నా మంచిది ఇంకొకటి కావాలి. ఇలా అనంతమైన కోరికలతో అసంతృప్తమైన మానవుడు నిత్యతృప్తుడు కాలేడు. అరిషడ్వర్గములను జయించి, కేవలం ధ్యానము పరమాత్మ మీద నిలిపే సాధకుడు మాత్రమే ఆత్మానందాన్ని పొందుతాడు.

యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః|

సమః సిద్ధావసిద్దౌ చ కృత్వాపి న నిబధ్యతే॥22॥
(భగవద్గీత, నాలుగవ అధ్యాయము)

అప్రయత్నముగానే లభించిన దానితో సంతృప్తి చెంది, అసూయారహితులై, వారు సుఖ-దుఃఖాలు, లాభ-నష్టాలు వంటి జీవన ద్వందములకు అతీతులై ఉంటారు. అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్నా, గెలుపు-ఓటమిలలో సమత్వ బుద్ధితో ఉండి, వారు తమ కర్మలచే బంధింపబడరు.
 
పరమాత్మ ఈ ప్రపంచాన్ని ద్వందములతో సృష్టించాడు.  పగలు-రాత్రి, తీపి-చేదు, వేడి-చల్లదనము, కరువు-సమృద్ధి మొదలగునవి అన్నియు నాణెమునకు బొమ్మా-బొరుసు వంటివి. గులాబి మొక్కకి అందమైన పువ్వు ఉన్నది, గుచ్చుకొనే ముల్లు ఉన్నది.  జీవితం కూడా తన వంతు ద్వందములను తెస్తుంది - సుఖము-దుఃఖము; గెలుపు-ఓటమి; కీర్తి-అపకీర్తి. ఆ పరమాత్మ స్వరూపుడైన రాముడు కూడా పట్టాభిషేకానికి బదులుగా అరణ్యాలకు పంపబడ్డాడు. భార్యా వియోగం అనుభవించాడు. చాకలివాని నిందకు గురి అయాడు. గనుకనే మనసున్న మానవుడు ఎవరైననూ ఈ ద్వంద్వములకు అతీతులు కారు. కేవలం అనుకూల పరిస్థితులే ఉండాలని ఆశించకూడదు. ఆటుపోట్లకు సిద్ధమై ఉండాలి. జీవితంలో ఎదురయ్యే ద్వందములను విజయవంతంగా ఎలా ఎదుర్కోవాలి? ఈ ద్వందములకు అతీతంగా ఎదిగి అన్ని పరిస్థితులను సమానంగా స్వీకరిస్తూ, సమస్థితిలో ఉండటమే దీనికి పరిష్కారం. ఫలితాలపై ఆశ లేకుండా మన కర్తవ్యాన్ని చేస్తూపోతూ, మన కర్మ ఫలాలపై అనాసక్తి పెంచుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. మనం భగవంతుని ప్రీతి కోసం కర్మలను ఆచరించినప్పుడు, అనుకూల-ప్రతికూల ఫలితాలను ఈశ్వర సంకల్పం గా పరిగణించి రెండిటినీ సంతోషంగా స్వీకరిస్తాము. దీనినే తృప్తి అంటాము.

అట్టి నిత్యతృప్త అయిన శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం నిత్య తృప్తాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

567వ నామ మంత్రము 23.1.2022

ఓం భక్తనిధయే నమః

భక్తుల పాలిట గొప్పనిధియై భక్తుల కోరికలను తీర్చు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి భక్తనిధిః అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం భక్తనిధయే నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులకు  ఆ భవానీ దేవి కరుణచే వారికి భౌతిక సుఖాలు, ఆధ్యాత్మిక సుఖాలూ అన్నియూ లభిస్తాయి మరియు శివాత్మకమైన బ్రహ్మస్వరూపము ప్రాప్తిస్తుంది.

భక్తులకు, ఉపాసకులకు అమ్మ వారు ఎన్నటికినీ తరగని నిధి వంటిది. 

నిధి అనగా ఎన్నటికీ తరగని, మార్పుచెందనిది, నశించనిదైన నిధి వంటిది, భక్తుల వాంచితార్థములను తీర్చు పెన్నిధి వంటిది, ధనమునకు, ఐశ్వర్యమునకు తులలేని మహానిధి, తనను నమ్మ కొలిచిన వారి ఆశయములకు, ఆదర్శములకు, ఆశలకు, అవసరాలకు, ఏర్పరచుకున్న లక్ష్యములకు సాటిలేని కరుణా నిధివంటిది.

నవవిధ భక్తి మార్గములు

శ్రీ వ్యాసప్రణీత శ్రీమద్భాగవతంలో సప్తమస్కంధంలో, పంచమోధ్యాయంలో (23 మరియు 24 శ్లోకములలో) ప్రహ్లాదుడు నవవిధ భక్తిమార్గముల గూర్చి ఇలా  వివరించెను.

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్|

అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్|

ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవలక్షణా|

క్రియతే  భగవత్యద్ధా తన్మన్యేఽధీతముత్తమమ్॥

తండ్రీ! శ్రీమహావిష్ణువును సేవించుటకు భక్తిమార్గములు తొమ్మిదిగలవు. శ్రీహరి గుణములు, లీలలు, నామములు మున్నగునవి వినుట, వాటిని కీర్తించుట, ఆ ప్రభువుయొక్క నామరూపాదులను స్మరించుట, ఆయన పాదములను సేవించుట, అర్చించుట, ఆ స్వామికి  ప్రణమిల్లుట, దాస్యము చేయుట, సఖ్యభావమును నెఱపుట, ఆత్మ నివేదనము చేయుట ఈ తొమ్మిది మార్గములనే నేను ఉత్తమ విద్యగా భావింతును. దీనినే నవవిధభక్తి యని వ్యవహరింతురు.

ఇవి శ్రీమద్భాగవతాంతర్గతముగా  చెప్పబడిన భక్తిమార్గములు .
 
శ్రీమదాంధ్రభాగవతం లో పోతన గారు దీని యొక్క ఆంధ్రానువాదం చేస్తూ సప్తమ స్కంధంలో ఈ క్రింది పద్యాన్ని ప్రహ్లాదునిచే చెప్పించారు

మత్తేభ విక్రీడితము

తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా

ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం

బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స

జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్ సత్యంబు దైత్యోత్తమా!

రాక్షసరాజా! భక్తి మార్గాలు తొమ్మిది; అవి సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మనివేదనం, కీర్తనం, చింతనం; ఈ నవ విధ భక్తులు అనే తొమ్మిది భక్తి మార్గాలను మనోవాక్కాయకర్మల (మనస్సు చేత, మాట చేత, క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ, త్రికరణశుద్ధిగా) సర్వాంతర్యామి అయిన శ్రీహరిని నమ్మి ఉత్తముడుగా జీవించుట మానవులకు ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. ఇది కాక మరొక సత్యం నాకు కనబడుట లేదు.
 
భగవంతుని లీలలను వినడం శ్రవణం, ఆయన లీలలను కీర్తించడం, అదే పని గా భగవంతుని నామ స్మరణ చేయడం, స్వామివారి పాదసేవనము చేయడము, స్వామిని అర్చించడం
భక్తి తో  వందనము చేయడము, 
దాస భక్తి తొ స్వామికి దాసుడ ననే  భావము తో  దాస్యము చేయడం, స్వామి నా చెలికాడు అనే భావన తో  సఖ్యము  చేయుట, స్వామీ  నీవే నా సర్వస్వము , ఈ మనో వాక్కాయములు ఉన్నది నీ కొరకే అనే భావన తో  ఆత్మ నివేదన చేయడం  
 
ఈ తొమ్మిందింటిని నవవిధ భక్తులు అని అంటారు . ఈ నవవిధ భక్తులలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా మనం దైవానుగ్రహం పొంది పునరావృత్తి రహిత స్థితిని పొందవచ్చు.
 
ఇక్కడ ఒక్కో భక్తి మార్గం లో తరించిన మహానుభావుల  గూర్చి  మనం తెలుసుకోవాలి.

శ్రవణం పరీక్షిత్ మహారాజు (భాగవతాన్ని (భగవత్ భక్తుల కధలను)విని తరించాడు )

కీర్తనం శుక బ్రహ్మ  (భాగవతాన్ని చెప్పి తరించిన మహనీయుడు) .

స్మరణం ప్రహ్లాదుడు .(ఎప్పుడూ స్వామి నామం చెప్తూ తరించిన మహనీయుడు)

పాదసేవనం లక్ష్మీదేవి (అమ్మ గూర్చి ఏమని చెప్పేది.. అమ్మ భక్తి తెలియనిదెవరికి )

అర్చనం పృథు మహారాజు (ఈయన కథ కూడా భాగవతం లో వస్తుంది)

వందనం అక్రూరుడు (భాగవతం లో దశమస్కంధం లో శ్రీ కృష్ణ బలరాములను కంసుని వద్దకు తీసుకు వెళ్ళడానికి వస్తాడు అక్రూరుడు, శ్రీ కృష్ణుని పరమ భక్తుడు ,ఈయన చేసే వందనానికి శ్రీ కృష్ణుదు పొంగిపోయాడంటే ఎంత గొప్పవాడో మనం అర్ధం చేసుకోవాలి)

దాస్యం ఆంజనేయ స్వామి (స్వామి హనుమ యొక్క దాస భక్తి ,వారు శ్రీ రామ చంద్రమూర్తి ని సేవించిన తీరు , తెలియని వారు ఉండరు)

సఖ్యం అర్జునుడు (శ్రీ కృష్ణార్జునల బంధము లోకవిహితమే కదా)

ఆత్మనివేదనం — బలిచక్రవర్తి
(వామనావతరం లో  స్వామికి మూడడుగుల నేల దానమిచ్చి మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అంటే తన శిరస్సుని చూపి స్వామికి తనని తాను సమర్పించుకొని తరించిన మహనీయుడు.)

ఈ నవవిధ భక్తిమార్గములలో మనం ఏ మార్గమందు ఆ పరాశక్తిని సేవించిననూ ఆ తల్లి అనుగ్రహమును పొందగలము 

అందుకే ఆ పరమేశ్వరి భక్తుల పాలిట భక్తనిధి యని కీర్తింప బడుచున్నది.

పరమ శివుని పత్నియైన పరాశక్తి,, భక్తుల పాలిట పెన్నిధియైన భక్తనిధి కి నమస్కరించు నపుడు ఓం భక్తనిధయే నమః అని అనవలెను.
*****

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

568వ నామ మంత్రము 24.1.2022

ఓం నియంత్ర్యై నమః

లోకములను అన్నిటిని నియమించి,     సర్వమునకు తానే ఆధారమై లోకపాలన సజావుగా ఉండేవిధంగా  నియంత్రణ జరుపు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి నియంత్రీ యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం నియంత్ర్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులు తమ బ్రహ్మజ్ఞానమార్గమును అమ్మ నియంత్రించిన విధముగా పయనించుచూ ఆ తల్లి కరుణచే అఖండ బ్రహ్మజ్ఞాన సంపన్నులై, జ్ఞానమయులై సమస్త భౌతిక మరియు ఆధ్యాత్మిక సుఖములనుభవించుచూ తరించుదురు.

ఆ తల్లి ఆదిపరాశక్తి. సకల సృష్టికీ పూర్వమే తానున్నది. కల్పాంతమందు జగత్తులన్నిటిని లయంచేసి తనలో నిక్షిప్తమొనర్చుకొనినది. పరమేశ్వరి పార్వతీ దేవిగా అవతరించే ముందు ఆది పరాశక్తి హిమాలయ పర్వత మహారాజుకి ప్రత్యక్షమై తనని తాను పరిచయం చేసుకొని అతనికి దివ్యోపదేశము చేసి అనంత జ్ఞానాన్ని ప్రసాదించింది.  ఆది పరాశక్తి అనగా నిత్య, అపరిమిత శక్తి.  సృష్టిని మించిన శక్తి. యావత్ సృష్టి యొక్క పుట్టుకకి, వినాశనానికి కారకమైన క్రియాత్మక అదృశ్య శక్తి. వేదములలోని పదములతో పరాశక్తి అయిన తనకి ఆద్యంతాలు లేవని వివరించింది. విశ్వంలో తానే అఖండ సత్యమని తెలిపినది. ఈ విశ్వమంతయు తన సృష్టియేనని, తనే పరబ్రహ్మ స్వరూపము అని రహస్యము తెలిపినది. జయం, విజయం తానేనని, వాటి రూపాంతరాలు కూడా తానేనన్న సత్యము తెలిపినది. బ్రహ్మ తన స్పష్టమైన రూపాంతరమేనని, ఆయన సృష్టికార్యమును నిర్వహించునట్లుగా నియమించినది. విష్ణువు తన అస్పష్టమైన రూపాంతరమని, ఆయన జగత్తుయొక్క స్థితికారకుడుగా ఏర్పాటుచేసినది. శివుడు తన అతిశయ రూపాంతరమని తెలిపినది, కల్పాంతమందు లయకార్యమును నిర్వహించునట్లు నియమించినది. ఎవరూ కని, విని, ఎరుగని తన రూపాన్ని హిమాలయ పర్వత మహారాజుకి చూపినది. సత్యలోకాన్ని తన నుదుట, విశ్వాన్ని తన కురులలో, సూర్యచంద్రులను తన కళ్ళుగా, నాలుగు దిక్కులను తన కర్ణాలుగా, వేదాలనే తన పలుకులుగా, మృత్యువు, అనురాగం, భావోద్రేకాలను తన దంతాలుగా, మాయను తన చిరునవ్వుగా చూపినది. దేవి భాగవత పురాణములో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు, వినాశకారి ఆది పరాశక్తే అని సూచించబడింది. సృష్టి, స్థితి, లయ, తిరోధానానుగ్రహములు అను పంచకృత్యపరాయణ ఆ జగన్మాథ. తానొక నియంత. లోకములను సృష్టించి, లోకపాలురను నియమించినది. సకల దేవతలను, దిక్పాలకులను, గ్రహాలను, నక్షత్రాలను తానే నియమించినది. లోకపాలన సక్రమముగా జరుగునట్లు చూస్తున్నది. జీవుల కర్మఫలాలననుసరించి జన్మలు ఇస్తుంది. కష్టసుఖములు, సుఖదుఃఖముల వంటి ద్వంద్వములను వారి వారి కర్మలననుసరించి కలుగ జేస్తుంది. వాయువు కదలాలి; అగ్ని జ్వలించాలి; సూర్యుడు ప్రకాశించాలి, కాలగమనాన్ని తెలియజేయాలి; చంద్రకళలు నియమానుసారం ఉండాలి; నీరు ప్రవహించాలి; సముద్రములు చెలియలికట్ట దాటరాదు - ఈ కార్యక్రమములన్నియును తన నియంత్రణలోనే ఉంటాయి. గనుకనే ఆ పరమేశ్వరి నియంత్రీ యని అనబడినది.

పిండాండమునుండి బ్రహ్మాండమువరకును, అణువు నుండి ఆకాశము వరకును అన్నియు తన నియంత్రణలోనే ప్రవర్తిల్లుతున్నాయి గనుక, అమ్మవారు నియంత్రీ యని అనబడినది.
 
నియంత్రీ అనగా శ్రీమాత తన భక్తులను వారి అనుష్ఠానక్రమములో నియంత్రించుచూ, నియమము తప్పక వర్తింపజేయుచు, అజ్ఞాన తిమిరమునుండి వెలికివచ్చునట్లు శాసించును.

లోకములను నియంత్రించును, సమస్తజీవులయొక్క వృత్తులందు, ప్రవృత్తులందు నియమములేర్పరచును.

అమ్మవారు ఈ జగత్తును గతి తప్పనీయక నియంత్రించును.

అట్టి పరాశక్తికి నమస్కరించునపుడు ఓం నియంత్ర్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

569వ నామ మంత్రము 25.1.2022

ఓం నిఖిలేశ్వర్యై నమః

నిఖిలములన్నిటికి ప్రభుశక్తిరూపిణి  అయిన జగజ్జననికి నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి నిఖిలేశ్వరీ అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం నిఖిలేశ్వర్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ జగజ్జననిని ఉపాసించు సాధకుడు సర్వము ఆ పరాశక్తి స్వరూపము అను భావనతో రాగద్వేష రహితుడై, బ్రహ్మజ్ఞాన సంపన్నుడై, అహంబ్రహ్మాస్మి యనుచూ తనశరీరమే పాంచభౌతికముగా, షట్చక్రస్వరూపముగా, తనలో తాను తెలుసుకున్న సహస్రారచక్రమే జ్ఞానపరాకాష్టగా గ్రహించి అన్నిటికీ అఖిలాండేశ్వరియే మూలమని గ్రహించి తరించును.

పరమేశ్వరి అంటే శ్రేష్ఠమైన ఈశ్వరి. ఆమెయే లోకేశ్వరి. అఖిలాండేశ్వరి, భువనేశ్వరి. ఈ నామ మంత్రంలో నిఖిలేశ్వరి. అనగా నిఖిలములకే ఈశ్వరి. శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ, రాజరాజేశ్వరి, రాజ్యదాయినీ, రాజ్యవల్లభా, రాజత్కృపా, రాజపీఠ నివేశిత నిజాశ్రితా, రాజ్యలక్ష్మీ, కోశనాథా, చతురంగబలేశ్వరి, సామ్రాజ్యదాయినీ ఇటువంటి అమ్మవారి నామములు అన్నియును నాయకత్వానికి, రాచరికమునకును, సార్వభౌమత్వమునకను సూచన. 

నాఽవిష్ణుః పృథివీ పతిః విష్ణు అంశ లేనివాడు, విష్ణువు కానివాడు రాజు కాలేడని భావం. విష్ణువు అంటే సర్వవ్యాపకుడని, రాజు విష్ణు స్వరూపుడని వేదాలు స్పష్టం చేశాయి. సింహాసనాన్నధిష్ఠించిన ప్రతివాడూ రాజు కాడు. ప్రతి రాజూ విష్ణువు కాడు.  ఆ పరమేశ్వరి సాక్షాత్తు విష్ణ్వంశ గలిగినది. అది ఎలాగంటే  ఆ పరమేశ్వరి ఆవిర్భావంగురుంచి  శ్రీమద్దేవీభాగవతం, పంచమస్కంధం, పదకొండవ అధ్యాయములో ఇలా చెప్పబడింది.

అష్టాదశభుజాకారా బాహవో విష్ణుతేజసా|

వసూనాం తేజసాఽంగుళ్యో  రక్తవర్ణా స్తథాఽభవన్‌॥70॥

పరమాత్ముడైన శ్రీమహావిష్ణువు యొక్క మహత్తరమైన తేజస్సుతో పదునెనిమిది భుజములు ఆవిర్భవించెను. 

అమ్మవారికి విష్ణ్వంశగలిగినది. నారాయణునికి, నారాయణికి అభేదమున్నందున పరమేశ్వరి విష్ణుస్వరూపిణియే. గనుక నిఖిలేశ్వరీ యని అనబడినది.

నిఖీలేశ్వరి అనగా సమస్తమునకూ అధికారిణి, ఇంతకు పూర్వనామ( 568వ)మంత్రము నియంత్రీ యగుటచే ఈ మంత్రముద్వారా నిఖిలేశ్వరి అని భావించవచ్చును. విష్ణు (నారాయణ) శక్తి అఖిలాండకోటి బ్రహ్మాండములను పరిపాలించితే శ్రీమాత (నారాయణి) శక్తి నిఖిలేశ్వరి అయినది.

అటువంటి నిఖిలేశ్వరికి నమస్కరించునపుడు ఓం నిఖిలేశ్వర్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

570వ నామ మంత్రము 26.1.2022

ఓం మైత్ర్యాది  వాసనాలభ్యాయై నమః

మైత్రి, కరుణ, ముదిత (సంతోషము) ఉపేక్ష అనే సంస్కార బీజ సమన్వితమైన  వాసనా చతుష్టయముచే పొందదగినది అయిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి మైత్ర్యాది వాసనాలభ్యా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మైత్ర్యాది వాసనాలభ్యాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు సమస్త బాధలు తొలగిపోవును మరియు ఆ తల్లి కరుణాంతరంగ దృష్టులు ప్రాప్తించి శాశ్వతమైన బ్రహ్మానందము లభించి తరించుదురు.

వారి పుర్వజన్మ పుణ్య కర్మఫలముచే 

1. సుఖసంతోషములతో ఉన్నవారి యెడల ఈర్ష్యలేని మైత్రి తో మెలగవలయును. 

2. ప్రారబ్ధవశమున దుఃఖితులైన వారిపట్ల వారి దుఃఖితులైయుండుట తమ సంతోషముగా భావింపక, పరమాత్మ వారియెడ దయజూపవలెనను భావముథో కరుణ  కలిగియుండవలయును.

3. సత్సాంగత్యముచే అనునిత్యము పరమాత్మస్మరణమే తమ జీవనపరమావధిగా భావించు పుణ్యాత్ములను వీక్షించవలెను. తమ ముదిత మును (సంతోషమును) ప్రకటించుచుండవలయును.

4.  సన్మతుల భగవద్ధ్యానమును, పుణ్యాత్ములొనరించు సత్కర్మలను, దీనులయెడ దయాగుణమును ప్రతిఘటించుచు, సత్శీలులను  హింసించు పాపాత్ములను దరిజేరనీయక వారియెడ ఉపేక్ష ను కలిగియుండవలయును. 

ఈ మైత్రి, కరుణ, మదితము (సంతోషము) ఉపేక్ష అను నాలుగు లక్షణములు మైత్ర్యాది వాసనలు అని చెప్పుదురు.   ఈ కర్మవాసనలు అనే సంస్కార బీజాలు నాలుగింటిని వాసనా చతుష్టయము అనికూడా అందురు.  ఇక్కడ వాసన అనగా జీవులయొక్క మనస్సును పూర్వకర్మలతో కలుపునది లేదా  పూర్వజన్మ సంస్కారము, అటువంటి పూర్వజన్మ సంస్కారము గలవారికే ఆ జగన్మాత అనుగ్రహం పొందతగినది అవుతుంది. గనుకనే ఆ పరమేశ్వరి 
మైత్ర్యాది వాసనాలభ్యా యని అనబడినది. 

ఇదే విషయాన్ని వేదవ్యాసులవారి శ్రీమద్భాగవతం, పూర్వార్ధం, దశమస్కంధం, పదకొండవ అధ్యాయంలో చెప్పబడినది.

సుదాముడు ప్రేమానురాగములతో సమర్పించబడిన పూలమాలలను బలరామకృష్ణులు తమ అనుచరులతో సహా ధరించిరి. అతని సేవలకు వారు మిగుల సంతృప్తులైరి. భక్తులకు కోరిన వరములను ప్రసాదించెడి ఆ మహాపురుషులు తమకు ప్రపత్తితో ప్రణమిల్లిన ఆ సుదామునకు పెక్కు వరములను అనుగ్రహించిరి. 

41.51 (ఏబది ఒకటవ శ్లోకము)

సోఽపి వవ్రేఽచలాం భక్తిం తస్మిన్నేవాఖిలాత్మని|

తద్భక్తేషు చ సౌహార్దం భూతేషు చ దయాం పరామ్॥9868॥

అప్పుడు ఆ మాలాకారుడు కృష్ణప్రభువును ఇట్లు అర్ధించెను- 'స్వామీ సకల చరాచరాత్మకమైన జగత్తునకు ఆత్మస్వరూపుడవైన నీయందు (నీ పాదారవిందముల యందు) అచంచలమైన భక్తిని నాకు ప్రసాదింపుము. నేను నీ భక్తులయందు ప్రగాఢమైన మైత్రియు సకల ప్రాణులయెడ అహేతుక దయను కలిగియుండునట్లు అనుగ్రహింపుము,

ఈ సందర్భమున పోతనమహాకవి దశమస్కంధం, పూర్వార్ధం, ఒకవేయి, రెండువందల డెబ్బది రెండవ పద్యము తెలుగువారి నాల్కలపై నాని నాని, వారి హృదయములలో అమృతపుసోనలను నింపిన విధంకూడా మన కోసం:-

కంద పద్యము

నీ పాద కమల సేవయు , 
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూత దయయను ,
తాపస మందార నాకు దయసేయగదే

"ప్రభూ! నీవు తాపసులకు కల్పవృక్షమువంటివాడవు. నీ పాదకమలములను సేవించుచుండెడి భాగ్యమును నాకు ప్రసాదింపుము. నిన్ను సేవించెడి భక్తులతో మైత్రిని అనుగ్రహింపుము (నన్ను నీ దాసానుదాసునిగా ఆదరింపుము). నాకు ప్రాణులయెడలను అపారమైన దయయుండునట్లుగా చూడుము".

శ్రీమద్భగవద్గీతలో, పండ్రెండవ అధ్యాయం, పదమూడు, పదునాలుగవ శ్లోకములలో భగవానుడు పలికిన పలుకులు:-

అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ|

నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ॥13॥

సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః|

మయ్యర్పితమనోబుద్ధిర్యో మధ్భక్తః స మే ప్రియాః॥14॥

ఏ భక్తులైతే, సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో లేదా స్నేహపూరితముగా, కారుణ్యముతో ఉంటారో, వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ఆస్తిపై గాని ధనము పై మమకార లేదా ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా, సుఖ-దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై, ఆత్మ-నిగ్రహంతో, ధృడ సంకల్పంతో మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు.

మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనేవి నాలుగు భావములు. సమానులయెడ మైత్రి, దీనులయెడ కరుణ, సుఖముగా, హాయిగా, యశస్సుతో జీవించువారియందు ముదిత అనగా ఆహ్లాదంగా (సంతోషంగా) ఉండవలెనని అర్థము.

ఇక  దుష్టులను, నీచులను, పాపులను చూచినప్పుడు ఉపేక్ష, ఉదాసీనం, నికృష్టభావన లేక తటస్థ భావన ఉండ వలయును.

 మైత్ర్యాది నాల్గు గుణములు వాసనలు అనబడును, అవి మనస్సులో వసించుటచే వాసనలు అనబడును.

శ్రీమాత అనుగ్రహము మైత్ర్యాది వాసనాచతుష్టయ సంపద ఉన్న వారికే లభించును. గనుక అటువంటి శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం మైత్ర్యాది వాసనాలభ్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

571వ నామ మంత్రము 27.1.2022

 ఓం మహా ప్రళయ సాక్షిణ్యై నమః

మహాప్రళయ సమయానికి అమ్మవారు సాక్షిగా నిలిచింది, అటువంటి తల్లికి నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి మహాప్రళయసాక్షిణీ అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మహాప్రళయ సాక్షిణ్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ పరాశక్తియే సృష్టిస్థితి లయకారిణిగా  తెలిసికొనును, ఆ తల్లి పాదసేవనమందే నిమగ్నతపొంది సర్వ సృష్టియును దేవీ స్వరూపంగా భావించి, రాగద్వేష రహితుడై ఐశ్వర్యాది సర్వ విభూతియుతుడై, బ్రహ్మజ్ఞాన సంపన్నుడై శాశ్వతానందమంది తరించును.

మహాప్రళయకాలమున పరమశివుడు తాండవము చేయును. అప్పుడు బ్రహ్మ, విష్ణువు కూడా ఉండరు. మహాప్రళయము అనునది ఏమిటో తెలుసు కుందాము.

బ్రహ్మలు తొమ్మిది మంది (నవబ్రహ్మలు) వారు:-

1. భృగువు, 2. పులస్త్యుడు, 3. పులహుడు, 4. క్రతువు, 5. అంగిరసుడు, 6. దక్షుడు, 7. అత్రి, 8. మరీచి, 9. వసిష్ఠుడు.

కల్పాంతమునందు అనగా మహాప్రళయ సమయమునందు పరమశివుడు కాలాగ్నిరుద్రుడై బ్రహ్మవిష్ణువులతో సహితము సర్వజగత్తును భస్మము చేసి ఆ భస్మమును పూసుకొని మహాతాండవ నృత్యము చేస్తుంటాడు. పరమశివుని మహాప్రళయ తాండము చూచుచున్న పరమాత్మ అయిన తాను సాక్షీభూతురాలుగా ఉంటుంది.  లయం అనగా లీనం కావడమని అర్థము, ఉప్పు నీళ్ళలో కరిగితే, అ ఉప్ఫు మనకు కనిపించదు, అదేమాదిరిగా లయం అంటే మరణించడం, వినాశము కాదనీ, లయకారుడంటే వినాశకరుడు కాదని అర్థం; నాశము కాకుండా ఉండును కావున ఈ స్థితిని ప్రళయం అని అంటారు. ఈ విధంగా లయం కంటే ప్రళయం, ప్రళయం కంటే మహా ప్రళయం ఎక్కువ అని అంటారు. 
కల్పములయొక్క సంహారము చివర పరభైరవుడైన శంకరుడు తాండవము చేయును. ఆ సమయంలో చతుర్బాహుసమన్వితయైన ఆ పరమేశ్వరి నాలుగు బావువులయందును పాశము, అంకుశము, ఇక్షుధనుస్సు, పంచతన్మాత్రలను పుష్పబాణములుగా ధరించి, శ్రీమత్సింహాసనేశ్వరియై, కేవలం దేవీస్వరూపమే సాక్షిగా నిలిచి ఉంటుంది. 

ఇంద్రుడు, రుద్రుడు, బ్రహ్మ, విష్ణువు - మొదలైన వీరెవ్వరూ ఉండరు. మరణమును పొందినవారై పోవుదురు. గనుక వారి భార్యలుకూడా సుమంగళులై ఉంటారని అనకూడదు. అందుచే సుమంగళి అను పదము కేవలము పరమశివుని మహాప్రళయతాండవ సాక్షిణియైన పరమేశ్వరికి మాత్రమే చెందుతుంది.  అందుకే పరమేశ్వరి నిత్యసుమంగళి యని కూడా చెప్పబడియుంటుంది. గనుకనే పరమేశ్వరి మహాప్రళయసాక్షిణీ యని అనబడుటయేగాక, పార్వతీపరమేశ్వరులే నిత్యులు అని యనబడినారు.

ప్రళయములు

పరమాణువు మొదలుకొని, ద్విపరార్ధము వరకుగల కాలస్వరూపమును, అందు ఒక్కొక్క యుగము ఎన్ని సంవత్సరముల పర్యంతము జరుగును మొదలగు విషయములు   ఈ విధముగా నున్నవి:

కృత యుగము - 4,800 దివ్య సంవత్సరములు అనగా 17,28,000 మానవ సంవత్సరములు, 
త్రేతా యుగము - 3,600 దివ్య సంవత్సరములు అనగా 12,96,000 మానవ సంవత్సరములు, ద్వాపర యుగము - 2,400 దివ్య సంవత్సరములు అనగా 8,64,000 మానవ సంవత్సరములు, 
కలియుగము - 1,200 దివ్య సంవత్సరములు అనగా 4,32,000 మానవ సంవత్సరములు, 
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు,అంటే 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము దీనినే నాలుగు యుగములు లేదా మహాయుగము అంటారు. ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము. దీనినే మహాప్రళయము అంటారు.
  నీకు తెలిపితిని (మూడవ స్కంధము).  కల్పముయొక్క స్థితిని గూర్చియు, ప్రళయమును గురుంచియు వివరణ:

ఒకవేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు. బ్రహ్మయొక్క దినప్రమాణ కాలమునే కల్పము అని యందురు. ఒక కల్పమునందు పదునాలుగుమంది మనువులు ఉందురు. కల్పాంతమునందు అంతే సమయమునకు (వేయి చతుర్యుగములకు) ప్రళయము సంభవించును. ఈ ప్రళయకాలము బ్రహ్మకు ఒక రాత్రియగును. ఆ సమయమున ముల్లోకములును లయమగును.

ఆ సమయమున పరమాత్మ విశ్వమును తనలో లీనమొనర్చుకొని, శయనించును. బ్రహ్మగూడ ఆయనలో ప్రవేశించి నిద్రించును. దీనిని నైమిత్తిక ప్రళయము అని యందురు.
 
ఈ విధముగా బ్రహ్మయొక్క నూరువర్షముల కాలము అనగా రెండు పరార్ధముల కాలము ముగియగనే మహత్తత్త్వము, అహంకారము, పంచతన్మాత్రలు అను ఏడు ప్రకృతులును మూలప్రకృతి యందు లీనమగును. రాజా! దీనినే ప్రాకృతిక ప్రళయమందురు. ఈ ప్రళయమునందు పంచమహా భూతముల కలయికచే ఏర్పడిన బ్రహ్మాండము తన స్థూలరూపమును వీడి, కారణరూపములో స్థిరపడును. ఈ ప్రళయకాలము ఆసన్నమైనంతనే వందసంవత్సరములవరకు మేఘములు వర్షింపవు. జనులకు ఆహారము దొరకదు. వారు ఆకలిబాధకు తట్టుకొనలేక ఒకరినొకరు భక్షింతురు. ఈ విధముగా ప్రళయకాల - ఉపద్రవముచే పీడితులైన ప్రజలు క్రమక్రమముగా నశింతురు. ప్రళయకాలమునందలి సాంవర్తిక సూర్యుడు తన ప్రచండ కిరణములద్వారా సముద్రములను, ప్రాణుల శరీరములను, భూసారమును పీల్చివేయును. మరల ఆ జలములను వదలిపెట్టడు (వర్షింపడు). భూమిపై శాశ్వతముగా వర్షములే పడవు. అప్పుడు సంకర్షణ భగవంతుని ముఖమునుండి ప్రళయకాలీన సంవర్తకాగ్ని బహిర్గతమగును.

ప్రచండ వాయువేగముచే ఈ సంవర్తకాగ్ని విజృంభించి, అతలవితలాది ఏడు అధోలోకములను భస్మమొనర్చును. పైన సూర్యకిరణములతాపము, అగ్నిజ్వాలలకు తోడై సమస్త బ్రహ్మాండమును మలమల మాడ్చివేయగా, అది మండుచున్న ఆవు పిడకవలె భాసిల్లును. పిమ్మట వంద సంవత్సరములకు పైగా ప్రచండములైన సంవర్తక వాయువులచే ఆకాశమంతయును పొగలతోను, దుమ్ములతోను నిండిపోవును. అనంతరము ఆకాశమున మేఘ సముదాయములు చిత్ర విచిత్రములైన రంగులతో విలసిల్లును. తదనంతరము నూరు సంవత్సరములపాటు మేఘములు భయంకర గర్జనలతో వర్షించును. ఆ   సమయమున బ్రహ్మాండాంతర్గతమైన విశ్వము అంతయును జలములతో నిండిపోవును (సర్వం జలమయం జగత్ ).

ఇట్లు జలప్రళయము ఏర్పడినప్పుడు ఆ జలము ఫృథ్వీలక్షణమైన గంధమును తనలో లీనమొనర్చుకొనును. గంధగుణము జలములలో లీనమైపోగా పృథ్వీప్రళయము సంభవించును. అంతట పృథ్వి జలములలో కలిసిపోయి అంతయు జలరూపమగును. అనంతరము జలగుణమైన రసమును తేజస్తత్త్వము కబళించును. అంతట జలము రసహీనమై తేజస్సులో కలిసిపోవును. పిమ్మట తేజస్సుయొక్క గుణమైన రూపమును వాయువు కబళించును. అప్ఫుడు తేజస్సు రూపరహితమై వాయువులో కలిసిపోవును. అంతట ఆకాశము, వాయుగుణమైన స్పర్శను తనలో లీనమొనర్చుకొనును. అప్పుడు వాయువు, స్పర్శహీనమై ఆకాశమున అంతర్భూతమగును. అనంతరము ఆకాశ గుణమైన శబ్దమును తామసాహంకారము గ్రసించును. అప్పుడు ఆకాశము శబ్దహీనమై తామసాహంకారములో కలిసిపోవును. అదేవిధముగా తైజస (రాజస) అహంకారము ఇంద్రియములను, వైకారిక (సాత్త్విక) అహంకారము ఇంద్రియాధిష్ఠాన దేవతలను, మరియు ఇంద్రియ వృత్తులను తమలో లీనమొనర్చుకొనును. అనంతరము మహత్తత్త్వము, అహంకారమును, సత్త్వాది గుణముల మహత్తత్త్వమును గ్రసించును. ఇది అంతయును కాలప్రభావము. కాలప్రేరణచేతనే అవ్యక్త ప్రకృతి గుణములను తనలో లీనమొనర్చుకొనును. అప్పుడు కేవలము ప్రకృతియే మిగిలియుండును. ఆ ప్రకృతియే చరాచరజగత్తునకు మూలకారణము. అది అవ్యక్తము, అనాది, అనంతము, నిత్యము, శాశ్వతము. అది తన కార్యములను   లీనమొనర్చుకొని, ప్రళయకాలమున సామ్యావస్థను పొందినప్పుడు కాలము యొక్క అవయవములైన సంవత్సరము, మాసము, రాత్రింబవళ్ళు, క్షణము మున్నగు వాటియొక్క కారణముగా పరిణామము, క్షయము, వృద్ధి మొదలైన వికారములు ఏవియును దానియందు కలుగవు. ఆ సమయమున ప్రకృతియందు స్థూలరూపమున గాని, సూక్ష్మరూపమున గాని వాక్కు, మనస్సు, సత్త్వ, రజస్తమోగుణములు, మహత్తత్త్వాది వికారములు, ప్రాణము, బుద్ధి, ఇంద్రియములు, వాటియొక్క అధిష్ఠాన దేవతలు మొదలగునవి ఏవియును ఉండవు. సృష్టి సమయమున ఏర్పడు లోకముల కల్పన, వాటి స్థితియును ఉండవు. ఆ సమయమున జాగ్రత్, స్వప్న, సుషుప్త్యవస్థలు ఉండవు. ఆకాశము, జలము, పృథ్వి, వాయువు, అగ్ని, సూర్యుడుగూడ ఉండరు. అంతయు నిద్రాణమైయున్నట్లు శూన్యముగానుండును. ఆ స్థితిని తర్కముద్వారా ఊహించుటయు అశక్యము. ఆ అవ్యక్తమునే జగత్తుయొక్క మూలతత్త్వము అందురు. ఈ అవస్థనే ప్రాకృత ప్రళయమందురు. ఆ సమయమున పురుషుడు, ప్రకృతి అను రెండు శక్తులును కాలప్రభావమున క్షీణించి, వివశమై, తమ మూలస్వరూపమునందు లీనమగును.

సమస్త విశ్వమూ లయించిపోవడమే మహాప్రళయము. తాను సృజించిన సమస్తమూ తనలోనే లయించిపోవడంతో, జగన్మాత మాత్రం తానుగా మిగిలి ఉండడాన్ని ఈ నామం సూచిస్తోంది.

అన్నీ లయం పొందిన తర్వాత శ్రీమాత మాత్రం సాక్షీభూతురాలుగా ఉంటుంది అందుకనే ఆ తల్లి మహాప్రళయసాక్షిణీ అని నామప్రసిద్ధమయినది.

సృష్టి, స్థితి, లయ కారిణిగా జగన్మాతను కీర్తించిన లలితా సహస్రనామావళిలోని ఇంకా కొన్ని నామ నామ మంత్రములు

264వ నామ మంత్రము ఓం సృష్టికర్త్రై నమః - సృష్టి చేయు తల్లికి నమస్కారము

268వ నామ మంత్రము  ఓం సంహారిణ్యై నమః విశ్వసంహారం కావించు తల్లికి నమస్కారము

270వ నామమంత్రము ఓం తిరోధానకర్యై నమః సంపూర్ణ నాశనం చేయు తల్లికి నమస్కారము - ప్రతి వస్తువును ప్రకృతిలోనికి సంపూర్ణంగా లయింప చేయుట తిరోధానం

273వ నామమంత్రము ఓం అను గ్రహప్రదాయై నమః ప్రళయానంతరం బీజావస్థలో లయించి ఉన్న విశ్వమును తిరిగి సృష్టి చేయుటకు తన అనుమతిని (అనుగ్రహాన్ని) ప్రసాదించు తల్లికి నమస్కారము.

274వ నామమంత్రము ఓం పంచకృత్య పరాయణాయై నమః సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ కృత్యాలకు ఆశ్రయంగా ఉండు తల్లికి నమస్కారము (జగజ్జననితో కూడి బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు ఆయా కార్యాలు నిర్వర్తిస్తున్నారు.

281వ నామమంత్రము ఓం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళ్యై నమః కన్నులు తెరచినంతనే బ్రహ్మాండాలను సృష్టిస్తూ, కన్నులు మూసినంతనే బ్రహ్మాండాలను నశింపజేస్తున్న తల్లికి నమస్కారము.

340వ నామమంత్రము ఓం విలాసిన్యై నమః సృష్టి, స్థితి, లయములే తన క్రీడగా గల తల్లికి నమస్కారములు.

384వ నామమంత్రము ఓం విశ్వసాక్షిణ్యై నమః సమస్తానికి సాక్షీభూతురాలు అయిన తల్లికి నమస్కారము

620వ నామమంత్రము ఓం అనేక కోటి బ్రహ్మాండ జనన్యై నమః లెక్కింప నలవి కాని  బ్రహ్మాండాలను ఉద్భవింపజేయు తల్లికి నమస్కారము - ప్రళయమున అనంతకోటి బ్రహ్మాండములకు కారణమైన బీజములను తన గర్భమందు ధరించును కావున జగన్మాత అనేక-కోటి-బ్రహ్మాండ-జనని అయినది.

648వ నామమంత్రము ఓం  లీలాక్లప్త బ్రహ్మాండ మండలాయై నమః ఎట్టి శ్రమ లేకుండా క్రీడా మాత్రముగా బ్రహ్మాండాలను సృజించు తల్లికి నమస్కారము.

664వ నామమంత్రము ఓం లోకయాత్రా విధాయిన్యై నమః లోకయాత్రకు  (చతుర్దశ భువనాల సృష్టి-స్థితి-లయలను) విధించు తల్లికి నమస్కారము.

667వ నామమంత్రము ఓం నిర్ద్వైతాయై నమః ద్వైతము లేనిదైన తల్లికి నమస్కారము - సమస్త బ్రహ్మాండాలు, అందుగల అనేక జీవులు - అన్నీ జగన్మాత నుండే ఉద్భవించాయి కనుక, అవి అమ్మ స్వరూపాలే. అంటే అంతా పరబ్రహ్మమైన తల్లి స్వరూపమే తప్ప అన్యమైనది లేదు. .కాబట్టి  ద్వైతము (రెండవది) అనేది లేదు.

672వ నామమంత్రము ఓం బ్రహ్మాత్మైక్య స్వరూపిణ్యై నమః శివ జీవుల లక్ష్యమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము. సకల జగత్తు బ్రహ్మము నందే ఉద్భవించి, వృద్ధి చెంది, లయిస్తోంది. కాబట్టి జీవాత్మ, పరమాత్మల అభేదము తెలియుచున్నది. సాధన ద్వారా జీవుడు, తాను బ్రహ్మమే అనే ఏకత్వ భావనను పొందుతున్నాడు. ఇట్టి ఏకత్వ భావనే లలితాంబక స్వరూపము అని అర్థము.

865వ నామమంత్రము ఓం లీలా విగ్రహ ధారిణ్యై నమః సృష్టి, స్థితి, లయలనే క్రీడను కొనసాగించడానికి పెక్కు అవతారాలను ధరించు తల్లికి నమస్కారము.

934వ నామమంత్రము ఓం విశ్వమాత్రే నమః విశ్వమునకు మాత అయిన తల్లికి నమస్కారము.

934వ నామమంత్రము ఓం జగద్ధాత్రే నమః జగత్తును ధరించు తల్లికి నమస్కారము.

అటువంటి మహాప్రళయసాక్షిణికి నమస్కరించునపుడు ఓం మహాప్రళయసాక్షిణ్యై నమః అని అనవలెను
 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

572వ నామ మంత్రము 28.1.2022

 ఓం పరాశక్త్యై నమః

అన్ని శక్తులకూ మూలకారణమైన మహోత్కృష్ట శక్తి (పరాశక్తి) అయిన పరమేశ్వరికి  నమస్కారము.

శరీరమునందుండు పదియవధాతు స్వరూపిణియౌ భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి పరాశక్తి అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం పరాశక్త్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు   ఆ తల్లి కరుణచే తన శరీరము నందలి సప్తధాతువులు, షట్చక్రములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు మొదలగునవి అన్నియును తన వశములో నుండి, జితేంద్రియుడై, బ్రహ్మజ్ఞాన సముపార్జనలో పరాశక్తి అనుగ్రహమును బడయుటకై  దీక్షాబద్ధుడై కఠోరసాధనతో ఆ తల్లి కరుణచే ఇహపర సుఖములను సాధించి తరించును.

ధాతువు అనగా మూలకము. అనగా మూలద్రవ్యము. శరీరనిర్మాణము ఈ మూలకములచే ఏర్పడినది. శరీరనిర్మాణమేర్పడిన తొమ్మిది మూలకములనే తొమ్మిది ధాతువులు లేదా నవధాతువులు అని యందురు. ఈ నవధాతువులు రెండుగా విభజింపబడియున్నవి. అవి ఐదు శక్తిమూలకధాతువులు, నాలుగు శివమూలక ధాతువులు. శక్తి మూలకధాతువులు : 1. చర్మము, 2. రక్తము, 3. మాంసము, 4. మేదస్సు, 5. ఎముకలు, శివమూలకము ధాతువులు: 1. మజ్జ, 2. శుక్లము, 3. ప్రాణము, 4. జీవుడు. వీటితో శరీర నిర్మాణము జరిగినది. శరీరమనకు చలనము కలిగించేది, ఇప్పుడు చెప్పబడిన తొమ్మిది ధాతువుల యునికిని కాపాడేది, తొమ్మిది ధాతువులతో ఏర్పడిన శరీరమునందు మార్పులనుకలిగించేది, జీవము ఉన్నదనిపించేది అయిన పదియవ ధాతువు, పరమోత్కృష్ట  మైనదియగు పదియవధాతువునే పరాశక్తి యని అంటారు. ఈ పరాశక్తియే పరమేశ్వరి. ప్రాణరూపమున శరీరంలో విలసిల్లేదే పరాశక్తియను పదియవధాతువు. ఈ పదియవ ధాతువు లేకుంటే ఆ తొమ్మిది ధాతువులకు మనుగడ లేదు. అందుచేతనే పదియవ ధాతువు పరాశక్తి. 

శ్రీచక్రమునందు తొమ్మిది ఆవరణలు గలవు. తొమ్మిది ఆవరణలు తొమ్మిది సమద్విబాహు త్రిభుజములుగా చెప్పుదురు. అందులో నాలగు ఊర్ధ్వముఖంగా ఉండి శివాత్మకమైన సమద్విబాహు త్రిబుజములనియు, ఐదు సమద్విబాహు త్రిభుజములు పైనుండి క్రిందికి శక్త్యాత్మకమైనవిగా చెప్పుదురు. ఈ తొమ్మిదింటిని తొమ్మిది ఆవరణలుగా కూడా చెప్పుదురు. అదేవిధంగా నవధాతువులతో ఏర్పడిన శరీరముకూడా ఒక శ్రీచక్రమని చెప్పవచ్చును.

నడుమనున్న పరాబిందువే పరాశక్తి. అలా ఒకటిగానున్న పరాబిందువు నుండి మూడు బిందువులేర్పడినవి.

పని చేయాలన్నా ఆ పని చేయాలనే ఇచ్ఛ  (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎలా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి ఇచ్ఛ, ఆలోచన జ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపటమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయికే. ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే. ఈ మూడు బిందువులలో ఒకటి శివశక్తులొకటిగా నున్న బిందువు, రెండవది అచేతనంగా ఉన్న శివుడు, మూడవది చేతనా స్వరూపమైన శక్తి,

ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము. త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము. ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వర తత్వాన్ని సూచిస్తుంది. 

విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే ప్రకృతి అని, పరాశక్తి అని, అవ్యక్తం, శుద్ధమాయ అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత (తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత లేదా పరాశక్తి, వారికి అందించుతున్నది.

శ్రీచక్రం - మానవ శరీరం

శక్త్యాత్మకమై ఐదుధాతువులతోను శివాత్మకమైన నాలుగు ధాతువులతోను నిర్మింపబడిన ఈ శరీరమే ఒక శ్రీచక్రము. శరీరమనందుండు జీవాత్మ, పరమాత్మలు శ్రీచక్రమునందలి కామేశ్వరీ, కామేశ్వరులు.

గమనించవలసిన విషయమేమంటే ఈ జగత్తులోని సకల తత్వాలు, సకల భువనాలు, పరమశివుడు, పరాశక్తి మానవుని యందు కూడా కలవు. మానవ శరీరమును రెండు భాగములుగా చూస్తే - నాభి నుండి పైభాగము ఊర్థ్వలోకమని, క్రింది భాగం అధోలోకమని, ఈ రెండింటిని కలిపే వెన్నెముకను మేరు దండమని అంటారు. శ్రీ చక్రమును కూడా మేరువు అంటాము. మేరుపర్వతము కూడా భూమికి ఇరుసు వంటిది. ఏ రకంగా పరాశక్తి దివ్యస్వరూప కాంతులచేత జగత్తంతా ప్రకాశవంత మవుతుందో మన మేరు దండములోని కుండలినీ శక్తిచేత శరీరమంత చైతన్య మవుతుంది.

మనలో ఆత్మ ఉన్నదని అంగీకరించినట్లే మన శరీర నిర్మాణ ప్రాధాన్యం కూడా గుర్తించాలి. నవావరణాత్మకమైన శ్రీచక్రానికి, మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రం చెబుతోంది. శ్రీచక్రాన్ని ఆరాధిస్తే అన్ని దేవతామూర్తులను ఆరాధించినట్లేనని తంత్రశాస్త్రం తెలుపుతోంది.

శ్రీ అంటే శుభకరమైనది. దీనిని నవచక్రమని, వియత్‌ చక్రమని, నవయోని చక్రమని అంటారు. చక్రము ఎప్పుడూ పరిభ్రమిస్తుంది. దీనికి ఆద్యంతము లుండవు.

కేంద్ర బిందువు నుండి పరిధి వరకు ఎక్కడ కొలిచిననూ సమానంగా ఉంటుంది. చక్రారాధనము ప్రతిమారాధన కన్న శక్తివంతం. మంత్రం వలె యంత్రం కూడా మహిమ గలదే. శరీరమే దేవాలయము. జీవుడే అక్కడి దేవుడు అజ్ఞానమనే మాలిన్యాన్ని త్యజించాలి. ఆ దేవుడే నేననే భావమే పూజ. ఆ భావనతోనే అర్పించాలి.

కాబట్టి సాధకుని ధ్యానము, పూజ, భావన బాహ్యము నుండి లోనికి చొచ్చుకొనిపోయి ఆత్మను చేరుకోవాలి.

విశ్వంలోని శక్తులన్ని తొమ్మిది ఆవరణముల ద్వారా ఉత్పతై మానవుని పంచకోశములందు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు ఇమిడి ఉన్నవి.

నిరంతర సాధన మార్గం

శ్రీచక్రాన్ని మన శరీరంతో పోల్చి పరిశీలిస్తే ఆ జగన్మాత శ్రీ లలితాదేవి దర్శనం ఎంత అదృష్టంగా అనిపిస్తుంది. మనలోని కర్మ, జ్ఞానేంద్రియాల వెంటపడి పరిగెత్తే మనస్సు, బుద్ధి, అహంకార, మమకారాలు, కామోద్రేకాలు, శృంగారాది నవరసాలు, జాగ్రద, స్వప్న, సుషుప్తాది అవస్థలు వీటిని నడిపే సత్వరజస్తమోగుణాలు - వీటిన్నిటిని ఆ శ్రీదేవి విభూతులుగా గ్రహించి వీటన్నింటినీ దాటి బిందుస్థానమునకు చేరుకోగానే అచట అద్వితీయమైన, సచ్చిదానంద రూపమైన, సస్వరూపానుభవము కలుగుతుంది. అదే పరమేశ్వరి దర్శనం. పరాశక్తి అంటేనే సర్వశక్తులకు అతీతమైన ఆదివ్యశక్తి స్వరూపిణి,  శివశక్త్యైక్యరూపిణి అయిన జగజ్జనని.

పరాశక్తినే ఆదిపరాశక్తి అంటాము. హైందవ పురాణాల ప్రకారం సర్వశక్తిమంతురాలైన దేవత. పరబ్రహ్మ స్వరూపం. శాక్తేయంలో ఆది పరాశక్తే పరమసత్య స్వరూపంగా గుర్తింపబడింది. దేవి భాగవత పురాణములో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు, వినాశకారి ఆది పరాశక్తే అని సూచించబడింది. శాక్తేయంప్రకారం ఆది పరాశక్తి శూన్యబిందు, అనగా దివ్యమైన శూన్య స్త్రీ శక్తి, ఈ శక్తి యొక్క సార్వత్రిక ఆత్మ (పురుషుడు), ప్రకృతి శక్తికి జన్మించిన అంశములు జగన్మాత,    ఆ శ్రీమాత సౌందర్యానికి దేవత,  సాత్విక, రాజసిక, తామసిక గుణాలు మూడూ కలసిన ఆది పరాశక్తి. అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆది పరాశక్తి రూపం లేనిది, నిర్గుణ బ్రహ్మ అనే వాదన కూడా ఉంది. ఈ వాదన ప్రకారం ఆది పరాశక్తి ఒక దివ్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన చైతన్యము అయిన ఆదిపరాశక్తి, శ్రీమాతయే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాశక్తుల తనే మూలము. కావున ఆది పరాశక్తే అఖండ సత్యం. ఈ శక్తి దానికై అదే సంపూర్ణం. ఆది పరాశక్తి భర్త లేనిది. కానీ ఈ జగత్తుకి శివుడిని ఆహ్వానించటానికి తాను స్త్రీ రూపంలో జన్మనెత్తినది, 

అటువంటి పరాశక్తికి నమస్కరించునపుడు ఓం పరాశక్త్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

573వ నామ మంత్రము  29.1.2021

ఓం పరానిష్ఠాయై నమః

సకలకర్మలు, సకల జగత్తులు పరమేశ్వరియందు లయమగుటయే ఉత్కృష్టమగు సమాప్తి యనబడుతుంది. అట్టి ఉత్కృష్టమగు సమాప్తి లేదా జ్ఞానస్వరూపురాలు అయిన జగన్మాతకు నమస్కారము.

శ్రీ లలితా సహస్రనామావళి యందలి పరానిష్ఠా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం పరానిష్ఠాయై  నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు ఆ పరాశక్తి కరుణచే ఆత్మానుభూతియు, ఐహిక, ఆముష్మిక శుభాలును ప్రాప్తిస్తాయి.

శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప|

సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే॥33॥(భగవద్గీత, నాలుగవ అధ్యాయం)

 ఓ శత్రుసూదనా! పార్థా! యాంత్రికముగా ద్రవ్యముతో చేసే యజ్ఞము కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞము ఏంతో శ్రేష్ఠమైనది. ఏదేమైనా, ఓ పార్థా! అన్ని యజ్ఞ కర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమగును.

శారీరకమైన భక్తియుతకర్మలు చేయుట మంచిదే అయినా అవి సరిపోవు అని అర్జునుడుకి చెప్తున్నాడు. పూజాది క్రియలు, ఉపవాసాలు, మంత్ర జపాలు, తీర్థ యాత్రలు, ఇవన్నీమంచివే, కానీ వాటిని జ్ఞాన యుక్తంగా చేయకపోతే, అవి కేవలం భౌతికమైన క్రియలుగా మిగిలిపోతాయి. ఏమీ చేయకపోవటం కన్నా ఇటువంటి యాంత్రికమైన పనులు మంచివే కానీ మనస్సుని పరిశుద్ధమొనర్చుకోవడానికి అవి సరిపోవు.

చాల మంది జనులు భగవన్నామాన్ని పూసలమీద జపిస్తుంటారు, శాస్త్రాలు వల్లెవేస్తుంటారు, పవిత్ర ధామాలని సందర్శిస్తుంటారు మరియు పూజాది కార్యక్రమాలు చేస్తుంటారు. ఇటువంటి భౌతిక మరియు శారీరక క్రియల తోనే భౌతిక బంధాలనుండి విముక్తి లభిస్తుందనే విశ్వాసం తో ఇవన్నీ చేస్తుంటారు.  

భగవంతునికి పూజచేయడానికి అనేక విధములైన పూజా సామాగ్రి సమకూర్చుతాము. పరిశుభ్రమైన వస్త్రములు అందరిని ఆకర్షించేలా ధరిస్తాము.  పూజాచేస్తూ వారు వింటున్నారా, వీరు చూస్తున్నారా అని నాలుగుప్రక్కలా దృష్టిసారిస్తామేగాని, ఒక్కక్షణంకూడా పరమాత్మునిపై దృష్టినిలపము. ఇటువంటి పూజ నిష్ఠతో చేయునది కాదు. మనదృష్టి, మనము చేయు కర్మ, అన్నీకూడా పరమాత్మపై లయంచేయడమే ఉత్కృష్టమైన కర్మ అనబడుతుంది. దానినే పరానిష్ఠా అని అంటాము.  ఇంద్రియములు మనసులోను, మనసు బుద్ధియందు, బుద్ధి ఆత్మయందు లయంకావడమే పరానిష్ఠ. 

అన్నికర్మలు జ్ఞానమునందు పరిసామాప్తమగుటయే పరానిష్ఠ యని అనబడినది.

సర్వం ఒక్కటే అను సత్యాన్ని తెలుసుకోవాడమే ఆత్మసాక్షాత్కారం అనబడుతుంది. జీవాత్మను పరమాత్మయందు లయం చేయుటయే ఆత్మసాక్షాత్కారం అనబడుతుంది. మూలాధారము నందున్న కుండలినీ శక్తిని మేల్కొలిపి, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథులను ఛేదిస్తూ, షట్చక్రములను దాటించి సహస్రారం  చేర్చడమే ఆత్మసాక్షాత్కార మనబడుతుంది. ఆత్మ సాక్షాత్కారం పొందినవాడికి సర్వము ఒక్కటే అంతా నిరాకార నిర్గుణ నిర్వికల్ప నిర్లింగ సర్వాతీత పరబ్రహ్మ స్వరూపమే ఉన్నదని తెలుసుకోవడం జరుగుతుంది. ఆ పరబ్రహ్మ స్వరూపానికి ఎలాంటి పేరు లేదు ఏలాంటి గుణములు లేవు నిరాకారుడు సర్వానికి అతీతుడు లింగరహితుడు ఆ పరబ్రహ్మమునే ఆదినారాయణుడు అని పరమశివుడని ఆదిపరాశక్తి అని ఎవరికి వారు వారికి నచ్చినట్లు పూజిస్తారు. ఎవరిని పూజించినా చేరేది ఒక్కరికే. ఎవరిని స్మరించినా అది ఒక్కరినే. ఈ స్థితినే పరానిష్ఠ అంటారు. ఈ స్థితిలో నిరాకారము పరమాత్మ, సాకారము ఆత్మ. ఆత్మపరమాత్మలు ఒకచోటికి చేరుటయే ఆత్మసాక్షాత్కారము. పరమాత్మ యోగమాయచే శూన్యస్థితి నుండి జీవాత్మగా మారుతున్నాడు. జీవాత్మ యోగసాధనతో పరమాత్మలో లయమైన ఆ శూన్య స్థితిని చేరి పరమాత్మగా మారుతున్నాడు.

సృష్టి స్థితి లయలలో స్థితి శాశ్వతమైనది అదే పరబ్రహ్మ స్వరూపమైన శూన్యస్థితి. అంటే నిరాకార పరబ్రహ్మమే శాశ్వతమైన స్థితిని పొందుతున్నాడు మిగిలినది అది ఏదైనా సరే అశాశ్వతమే అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే నిజమైన ఆత్మసాక్షాత్కారము. ప్రతీ జీవి పరమాత్మ (నీ యొక్క) స్వరూపమే అనే సత్యాన్ని తెలుసుకోవడమే ఆత్మసాక్షాత్కారము. ఈ ఆత్మసాక్షాత్కారమే పరానిష్ఠ యని అనబడుతుంది. పరబ్రహ్మ స్వరూపిణియైన పరమేశ్వరి ఈ స్థితియందుండే జ్ఞానస్వరూపురాలు. అందుకే ఆ పరమేశ్వరి పరానిష్ఠా యని అనబడినది.

జగదీశ్వరికి నమస్కరించు నపుడు ఓం పరానిష్ఠాయై నమః అని  అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

574వ నామ మంత్రము 30.1.2022

 ఓం ప్రజ్ఞానఘన రూపిణ్యై నమః

లేశమైనను అజ్ఞానసంబంధము లేని మహోన్నత జ్ఞానస్వరూపిణి అయిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి ప్రజ్ఞానఘనరూపిణీ అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం  ప్రజ్ఞానఘన రూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు సర్వవిద్యలు, కళలు అనాయాసంగా లభించుటయే గాక భోగభాగ్యాది శుభములు సమగ్రంగా లభించును. 

శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్జ్వల ఆ పరమేశ్వరి. అనగా ఆ పరమేశ్వరి దంతపంక్తులు శ్రీవిద్యాంకురాకారములు. శుద్ధవిద్య అంటే జ్ఞానసంబంధమైనది. పరమేశ్వరి బ్రహ్మజ్ఞానస్వరూపిణి. గొప్పదైన నిర్వృత్తికమైన జ్ఞానముతో ఘనీభవించిన రూపముగలది ఆ పరమేశ్వరి. ఈ జ్ఞానమతో ఘనీభవించిన రూపము యనుటయే ప్రజ్ఞానఘన రూపము. 

సుఖదుఃఖాలకు ప్రత్యేక మనుగడ లేదు. ఒకవేళ ఉన్నట్లు తెలిస్తే, అవి మనిషి మనస్సులోనే ఉంటాయి. వేరుగా ఉండవు కనుక, ఆ రెండింటిలో ఏది కావాలో, ఏది వద్దో మనిషే నిర్ణయించుకోవాలి. సుఖము మన స్వరూపము. దుఃఖము ఆగంతుకము. కల్పితము, ఆరోపితము. విచారము ద్వారా నిషేధించదగినది. సుఖానికి మార్గాన్ని శాస్త్రం సుస్పష్టం చేసే ఉంది. జీవ జగత్పరాత్మల సంబంధాన్ని, అఖండత్వాన్ని సంశయరహితంగా సంప్రదాయమునకు దూరం కాకుండా అర్థం చేసుకుంటే దృష్టే మారిపోతుంది. వ్యవహారికంగా గోచరించే మిథ్య కూడా సత్యంగానే తెలుస్తుంది. అయినా మిథ్యను ప్రకాశింపచేసే చైతన్యం మిథ్యతో సంబంధము లేనిదై స్వరూప వైభవంతో సదా శోభిస్తూ ఉంటుంది. ఒక ప్రశాంతవనంలోకి మనం ప్రవేశించాము. ఒక చెట్టుక్రింద కూర్చున్నాము. ప్రశాంతంగా ఉన్నాము. ఈలోగా గుడిగంట వినిపించించి. ఆ శబ్దం వైపు దృష్టిని సారించాము. ఒక ఆలయం కనిపిస్తూ ఉంది. మన చెవి ఆలయంలో మ్రోగిన గంటను విన్నది. మన కళ్లు ఆలయాన్ని చూశాయి. ఆలయ రూపం. గంట శబ్దము. ఈ రెండు మనకు దృశ్యాలే. శబ్దం వినిపించక ముందు ఆలయానికి సంబంధించిన ఆలోచ  మనలో లేనే లేదు. శబ్దం వినిపించింది. ఆ వైపు దృష్టి సారిస్తే ఆలయం గోచరించింది. ఈ దృశ్యాలన్నీ వాస్తవానికి వృత్తులే. మన ఆలోచనల కన్నా వేరుగా మనకు ఏదీ తెలియదు. దృశ్యము తెలిసింది. అంటే, దృశ్యానికి సంబంధించిన వృత్తి మనలో ఉంది. వృత్తులు మారుతూ ఉంటే, దృశ్యాలు కూడా మారుతూ ఉంటాయి. గుడి వృత్తి ఐనప్పుడు గుడి దృశ్యము ఉంది. బడి అనే వృత్తి గుడి వృత్తి స్థానంలో నిలిస్తే, ఆ క్షణాన ఒడిలో బడి ఉంటుందే గాని గుడి ఉండదు. ఇలా జ్ఞానము మారుతూ ఉంటుంది. ఇది వృత్తి జ్ఞానము. వృత్తులు లేనపుడు దృశ్యాలు లేవు. కాని, మనము ఉన్నాము. వృత్తి జ్ఞానంగా కాదు. ప్రజ్ఞానంగా. ఇంతవరకు వృత్తి జ్ఞానాన్ని ప్రకాశింపచేస్తూ, వృత్తి రాహిత్యంలో స్వరూపంగా భాసించే ప్రజ్ఞానంగా, శబ్దం వినిపించినపుడు శబ్ద చైతన్యం. శబ్దం ఆగగానే శబ్దం లేదు కనుక అది శుద్ధ చైతన్యం. శబ్దం చైతన్యంలోనే తెలిసింది. శబ్దానికి ఆద్యంతాలు ఉన్నాయి. శబ్దానికి ముందే చైతన్యం ఉంది. శబ్దం ఆగినా చైతన్యం శుద్ధమై సాగుతుంది. శబ్దం చైతన్యానికి దూరంగా లేదు. శబ్దం లేని స్థితి నిశ్శబ్దం. శబ్దాన్ని, నిశ్శబ్దాన్ని, రెండింటిని చైతన్యమే ప్రకాశింపచేస్తూ ఉంది. ఈ రెండూ లేకపోయినా తాను తానుగా ప్రజ్ఞానం ఉంటుంది. శబ్దం ఉన్నప్పుడు నిశ్శబ్దం లేదు. నిశ్శబ్దం లేకపోవచ్చు గాని చైతన్యం లేకపోలేదు. నిశ్శబ్దం రాజ్యమేలే సమయాన శబ్దం విదేశాలకు తరలిపోయి ఉండొచ్చు. కానీ చైతన్యం సిద్ధంగానే ఉంది. కనుక ప్రజ్ఞాన స్వరూపమైన చైతన్యం శబ్దాశబ్దాలను, దృశ్యాదృశ్యాలను, జ్ఞానాజ్ఞానాలను ప్రకాశింపచేస్తూ వాటికి అతీతంగా స్వరూప వైభవముతో శోభిస్తుంది. వృత్తి జ్ఞానంతో ముడిపడియున్న ద్వైత ప్రపంచం మిథ్య. ప్రజ్ఞాన స్వరూపమైన సత్యంపై అది ఆధారపడి యుంది. మిథ్యా ప్రపంచాన్ని ప్రకాశింపచేసే చైతన్యం మిథ్య లేకపోయినా ఉంటున్నది కనుక అది మిథ్య కాదు. మిథ్య సత్యం కన్నా వేరు కానందున మిథ్య కూడా సత్యమే (అల కూడా సముద్రమే అయినట్లు). మిథ్య లేకపోయినా సత్యం సిద్ధమై తెలుస్తూ ఉన్నందున సత్యం మిథ్య కాదు (అల లేకపోయినా సముద్రమున్నట్లు). లేచిపడే అలలో అలజడి ఉండొచ్చు. సముద్రాన్ని దర్శించటానికి అల మనకు అవరోధమా? అలను తొలగిస్తే గాని సముద్రం అర్థం కాదా? ఆలోచించండి. అవగాహన ఉంటే దృక్పథం మారిపోతుంది. అఖండత్వం అనుభూతిగా వెలిగిపోతుంది. మిథ్యా ప్రపంచం కూడా అలల రూపంలో లేచిపడుతూ ఉండొచ్చు. వికారములను పొందుతూ ఉండొచ్చు. కాని, అలలో కూడా సముద్రమే ఉన్నట్లు, ఈ ప్రపంచంలో ఉన్నది కూడా పరమాత్మే. జగద్వికారాలు జగన్నాథుని పూర్ణత్వాన్ని భంగపరచలేవు. అలలను ప్రకాశింపచేసే సముద్రము వాటికి అతీతంగా అఖండత్వంతో శోభించునట్లు, దృశ్య ప్రపంచాన్ని ప్రకాశింపచేసే సత్తా స్ఫురణలు అనంతంగా భాసిస్తూనే ఉన్నాయి. 
దేనిచేత ఈ ప్రపంచం చూడబడుతుందో, వినబడుతుందో, వాసన చూడబడుతుందో, పిలువబడుతుందో, రుచిని, అరుచిని గ్రహిస్తూ ఉందో, అదే ప్రజ్ఞానము అని చెప్పబడింది. అటువంటి ఘనీభవించిన ప్రజ్ఞానంతో పరమేశ్వరి ఉన్నది గనుక, ఆ తల్లి ప్రజ్ఞానఘనరూపిణీ యని అనబడినది. లేశమైనను అజ్ఞానసంపర్కములేనట్టిది పరమేశ్వరి. పరమేశ్వరి కేవలం జ్ఞానస్వరూపిణి. అంతకన్నా వేరేస్దితిలేనిది. ఉప్పురాయి ఎట్లు లోపలబైటను ఇతర రసములులేక లవణరసముతోనే ఘనీభవించియుండునో, అట్లే పరమాత్మ కూడ లోపలబైట ఇతరము లేవియు లేక కేవలము ప్రజ్ఞానముతో ఘనీభవించి ఉన్నది గనుకనే ఆ పరమేశ్వరి ప్రజ్ఞానఘనరూపిణీ యని అనబడినది. 

అమ్మవారికి నమస్కరించునపుడు  ఓం ప్రజ్ఞానఘన రూపిణ్యై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీలలితా సహస్రనామ భాష్యము

575వ నామ మంత్రము 31.1.2022

ఓం మాధ్వీపానాలసాయై నమః

మదిరాపానముచే మత్తెక్కిన  వాని వలె స్వాత్మానందానుభవంలో అంతర్ముఖమై ఉన్న జగన్మాతకు నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి మాధ్వీపానాలసా అను ఆరక్షరముల (షడాక్షరీ) నామ మంత్రమును ఓం మాధ్వీపానాలసాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు వెనుకటి మహాపాతకాలు నశించును, ఇకపైనఏవిధమైన పాతకాలు చేయక జ్ఞానసంపదతో ఆ శ్రీమాత సేవలో జన్మతరించి విలసిల్లుదురు.

ధ్యానశ్లోకంలో పాణిభ్యా మలిపూర్ణరత్స చషకం అని ఉన్నది. అమ్మవారి చేతిలో మద్యంతో నిండిన రత్నభాండము ఉన్నదని చెప్పబడినది. అమ్మవారికి మద్యంకూడా ఇష్టమని చెప్పబడినది. పిల్లలకు అమ్మవారు  (ఆటలమ్మ, మశూచి వంటి వ్యాధులు) సోకినప్పుడు, నేటికీ కల్లును త్రాగించడం ఒక సాంప్రదాయము. అందుకే ఈ నామ మంత్రంలో అమ్మవారిని మాధ్వీపానాలసా యని అనడము జరిగినది. మాధ్వీ (మధువు - ద్రాక్షరసము) కన్నా వేరైన మధుపానము చేసినను ఆ పరమేశ్వరి నిశ్చలమైన మనసు గలిగినది అనిభావము. మధుపానము చేసినవారు చంచలమనస్కులై వేరేగా తమ స్వభావముకన్నా అన్యముగా ఉంటారు. కాని అమ్మవారు ఇందుకు భిన్నము. ఆ పరమేశ్వరి మధువును పానముచేసినను ప్రజ్ఞానఘన రూపిణి గానే యున్నది. పరానిష్ఠా యను నామ ప్రసిద్ధముగానే యున్నది. ఆ పరమేశ్వరి భక్తిప్రియా యని అనబడినది.  భక్తిప్రియత్వము కూడా ఆ పరమేశ్వరికి మాధ్వీపానము లాంటిదే. శ్రీలలితా సహస్ర నామ స్తోత్రపారాయణము జరిగే ప్రదేశములో ఆ పరమేశ్వరికూడా తన భక్తులతో కూర్చునే ఉంటుంది. సహస్రనామ స్తోత్రపారాయణము వింటూ అత్యంత పారవశ్యతకులోనయి ఉంటుంది. భక్తపరాధీనగా మారిపోతుంది. బ్రహ్మానందభరితురాలై నిర్వికారస్థితిలో ఉండిపోతుంది. ఇదే ప్రజ్ఞానఘనరూపమునకు ఉదాహరణ. సర్వం బ్రహ్మమయిపోతుంది.

నాడు గజరాజు మొసలిబారినుండి తనను రక్షించమని వేడుకొంటూ

నీవే తప్ప ఇతఃపరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్

రావే యీశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా! యని యనుటతోడనే 

ఆ లక్ష్మీపతి గజరాజును రక్షించుటకు ఎలా బయల్వెడలి నాడు అంటే:
 
మత్తేభ విక్రీడితము

సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ" డభ్రగపతిం బన్నింపఁ" డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరిని పిలవలేదు. వాహనం ఐన గరుత్మంతుని పిలవలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టుముడి కూడ చక్కదిద్దుకోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన లక్ష్మీదేవి పైటకొంగు కూడ వదలి పెట్టలేదు.

ఇదే భక్తపరాధీనత అంటే. ఆ సమయంలో భగవంతుడు తనను తాను మరచిపోవును.  భగవంతునికి భక్తపరాధీనతకూడా మాధ్వీపానము వంటిదే.

సాధకుడు తన యోగస్థితిలో మూలాధారమందున్న కుండలినీ శక్తిని జాగృతముచేసి, గ్రంథిత్రయమును ఛేదింపజేసి, షట్చక్రములకావలనున్న సహస్రారం చేర్చగా, అచ్చట వర్షింపబడిన సుధాధారలలో ఆ యోగి తన డెబ్బదిరెండువేల నాడీ మండలము తడిసి, తన్మయుడైన ఆ యోగి అవ్యాజమైన మరియు అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతాడు. ఆ ఆనందము బ్రహ్మానందము తక్క మరొక ఆనందముకాదు. ఆ అనందంలో అతని శరీరం గాలిలో తేలిపోగా నృత్యముచేస్తాడు. బాహ్యేంద్రియ స్పృహ ఉండదు. ద్వైత భావన ఉండదు. బ్రహ్మానందమే ఉంటుంది. ఇదే మాధ్వీపానాలసత్వము అంటే. అమ్మవారు కూడా అంతే. వామాచారతత్పరులు అమ్మవారికి మద్యము నివేదనగా సమర్ఫిస్తారు. వామాచారులు సమర్పించిన మద్యపానముతో అమ్మవారు తన్మయమైపోతుంది. తనను తాను మరచిపోతుంది. దీనినే మాధ్వీపానాలసత్వము అంటారు. గనుకనే పరమేశ్వరి మాధ్వీపానాలసా యని అనబడినది. 

ఆ తల్లికి  నమస్కరించునపుడు ఓం మద్వీపానాలసాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము

576వ నామ మంత్రము 1.2.2022

ఓం మత్తాయై నమః

బ్రహ్మానందముచే పరవశించి ఉన్న జగన్మాతకు నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి మత్తా అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం మత్తాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించే వారిని తన బిడ్డలవలె అనంత కరుణతో రక్షిస్తుంది పరాశక్తి.

మత్తా అనగా పరవశమై ఉండునది, బ్రహ్మానందముతో పరవశమైనది శ్రీమాత. మాద్వీపానాలసా (575వ నామ మంత్రము) మత్తా (576వ నామ మంత్రము) - ఈ రెండు నామ మంత్రములు సంపుటీకరించితే తల్లి తన బిడ్డను ఒడిలో నిడుకొని వాత్సల్యముతో, అత్యంత ప్రేమతో మమేకమై అర్ధనిమీలిత నేత్రాలతో ఆబిడ్డను తదేకంగా చూచినట్లు జగన్మాత  మనందరినీ (తన బిడ్డలను) ఎనలేని మాతృ ప్రేమలో ( మాధ్వీపాన యై) అలసత్వమంది (లాలసా) అర్ధనిమీలితనేత్రయై పరవశయై (మత్తా) వీక్షిస్తూ సంరక్షించుకుంటూ ఉన్నది.

మత్తా అనగా పరవశత్వముతో నుండునది. ఇంతకు ముందు నామములో మాధ్వీపానాలసా యని అనబడినది. పరమేశ్వరి మాధ్వీపానముచే మత్తెక్కియున్నది అని యనబడినది. శ్రీలలితా పరమేశ్వరి వశిన్యాది వాగ్దేవతలచే తన సహస్రనామాలు విరచింపజేసుకున్నది. దేవతా సమూహములు, విశ్వామిత్రుడు మున్నగు పుణ్యాత్ములు, సనకాది సిద్ధుల సమూహములు (దివ్యౌఘ గురువులు, సిద్ధౌఘ గురువులు, మానవౌఘ గురువులు) కూడా వచ్చియున్నారు. ఇంకను శ్రీలలితాంబ కొలువు దీరిన ఆ సభకు అత్యంత ముఖ్యులైన మంత్రిణి శ్యామలాంబ,  దండిని వారాహీదేవి మాత్రమేగాక, లెక్కకు మిక్కిలి శక్తిస్వరూపిణిలు కూడా వచ్చియున్నారు. అంతమాత్రమే గాక రుద్రయామలాది గ్రంథములందు ప్రసిద్ధిగా చెప్పబడినటువంటి శక్తి సమూహములైన 1) పరాశక్తి, 2) ఆదిశక్తి, 3) ఇచ్ఛాశక్తి, 4) జ్ఞానశక్తి, 5) క్రియాశక్తి, 6) బలా, 7) బాల, 8) అన్నపూర్ణ, 9) బగళ, 10) తార, 11) వాగ్వాదిని, 12) పర, 13) గాయత్రి, 14) సావిత్రి, 15) సిద్ధలక్ష్మి, 16) స్వయంవర, 17) నకులి, 18) తురగారూఢ, 19) కురుకుళ్ళ, 20) రేణుక, 21) సంపత్కరి, 22) సామ్రాజ్యలక్ష్మి, 23) పద్మావతి, 24) శివ, 25) దుర్గ, 26) భద్రాకృతి, 27) కాళి, 28) కాళరాత్రి, 29) సుభద్రిక, 30) ఛిన్నమస్తక, 31) భద్రకాళి, 33) కాలకంఠి, 33) సరస్వతి మొదలైనవారు అమ్మవారిని సేవించుటకు వచ్చి ఉన్నారు. ఇంకనూ అనేక కోటి దిక్పాలకులతో కోట్లాది సంఖ్యలుగల సూర్యచంద్రులు, వసువులు, సనకాదులు, యోగీంద్రులు, సప్తమహర్షులు మొదలైనవారు పరివేష్టించి ఉన్నారు. ఆ పరమేశ్వరి మహాచతుష్షష్టికోటి యోగినీ గణములతోనూ కొలువుదీరి యున్నది.  ఇంకనూ, ఆ తల్లికి ఇరువైపుల   లక్ష్మీ, సరస్వతులు వింజామరలు వీచుచున్నారు. అట్టి మహాసభలో వశిన్యాది వాగ్దేవతలు వారికి నిర్దేశితమైన ఆసనములందు కూర్చుని యున్నారు. లలితాంబిక వారందరివైపు వాత్సల్యపూరిత దృక్కులతో వీక్షించుచున్నది. వెంటనే ఆ అమ్మవారి ప్రేమగల క్రీగంట చూపులకు ప్రేరణనందిన వశిన్యాదులు తమ స్థానములలోనే లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించుచూ తాము విరచించిన సహస్రనామములతో అమ్మవారిని స్తుతించారు. అమ్మవారు పరబ్రహ్మస్వరూపిణి. వశిన్యాదులు విరచించిన ఆ సహస్రనామములు ఏ  ఇతర సహస్ర నామములకు లేని విశిష్టత సంతరించుకునేలా వారు విరచించారని గ్రహించిన అమ్మవారు ఎంతోసంతోషించినది. ఒక్కొక్క నామము అనేకానేకమైన భావములతో, అర్థములతో నిగూఢగుప్తమై యుండుటచే అవి రహస్యాతిరహస్యమైన శ్రీలలితా సహస్ర నామములుగా ఆవిర్భవించినవని ఆ పరమేశ్వరి గ్రహించి అత్యంత పారవశ్యమైనది. ఆ పరమేశ్వరి ఎంతటి పరవశమైనదంటే మాధ్వీపానము వలన కలిగిన పరవశతకన్నను అనేక కోట్లరెట్లు పారవశ్యతను చెందినది. నాటి నుండి నేటివరకును ఎచ్చట శ్రీలలితా సహస్ర నామ స్తోత్రపారాయణ జరుగుచున్ననూ, ఆ పరమేశ్వరి మహదానంద పరవశత నందుచున్నది. వశిన్యాదులు అమ్మవారిని మాధ్వీపానాలసా యని ఎందుకు అన్నారంటే తన సహస్రనామ పారాయణమే అమ్మవారికి అసలైన మాధ్వీపానము వంటిది అన్నది  నిజమనిపించుచున్నది. భక్తపరాధీనతయే పరమాత్మకు మాధ్వీపానము. పరమాత్మను మత్తులో ముంచాలంటే భక్తుడు పరమాత్మను కీర్తించుటయే పరమాత్మకు సమర్పించిన మాధ్వీపానము వంటిది. ఈ విషయంలో ప్రహ్లాదుడు నవవిధభక్తిమార్గములు తెలియజేశాడు.

ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది. ఆ శ్లోకం:

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనమ్|

అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనమ్|

ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవలక్షణా

క్రియతే భగవత్యద్ధా తన్మన్యేధీతముత్తమమ్

పై శ్లోకాలను పోతనగారి భాగవతంలో:

తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా

ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం

బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి స

జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!

అనగా భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.

శ్రవణం: భగవంతుని గూర్చిన గాథలు, భజనలు, కీర్తనలు వినుట - (హరికథ శ్రోతలు, ధర్మరాజు, జనమేజయుడు, శౌనకాది మునులు.

కీర్తనం: భగవంతుని గుణగణములను కీర్తించుట: రామదాసు, దాసగణు, అన్నమయ్య, త్యాగరాజు, తులసీదాసు, మీరాబాయి - మరెందరో భక్త గాయకులు.

స్మరణం: భగవంతుని స్మరించుట - నిత్యం ధ్యానం చేసే కోట్లాది భక్తులు.

పాదసేవ: దేవుని పాదముల పూజ సేయుట

అర్చనం గుడిలోగాని, ఇంటిలోగాని, హృదయములో గాని విధివిధానములతో అర్చించుట.

వందనం ప్రణామం చేయుట

దాస్యం భగవంతునకు దాసుడగుట - హనుమంతుడు, రామదాసు

సఖ్యం అర్జునుడు

ఆత్మనివేదనం తనను పూర్తిగా దేవునకు సమర్పించుకొనుట - గోదాదేవి, మీరాబాయి.

పరవశత్వమునందినప్పుడు బహిరింద్రియ జ్ఞానశూన్యమై నిర్గుణ, నిర్వికారమగు తురీయస్దితికి పరమేశ్వరి చేరుటచే,   మత్తా యని అనబడుతుంది. 

మాధ్వీపానాలసా మత్తా అయిన అయిన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మత్తాయై నమః అనుట మాత్రమేగాక, ఇంతకు పూర్వపు నామ మంత్రమును కూడా చేర్చి ఓం  మాధ్వీపానాలసా మత్తాయై నమః అని కూడా అనవచ్చును.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

577వ నామ మంత్రము 2.2.2022

 ఓం మాతృకా వర్ణ రూపిణ్యై నమః

మాతృకలే ( అ నుండి క్ష వరకు గల అక్షరములలో ముప్పదిరెండు మాతృకాక్షరములను మాతృకా వర్ణములందురు) తన స్వరూపంగా గల పరమేశ్వరికా నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి మాతృకావర్ణరూపిణీ అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మాతృకా వర్ణ రూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులు సర్వమంత్ర శక్తి స్వభావమూ, సమస్త వేదశాస్త్రసారయుతమైన తేజస్సు, శుద్ధవిద్యాసమన్వితమైన దివ్యత్వముతో విరాజిల్లుతూ ఆ తల్లి పాదపద్మమలనారాధించి తరించుదురు.

క్షరము కానిది అక్షరము. భారతదేశపు సకలభాషలకు సంస్కృతము మూల భాష. సంస్కృత భాషను దేవనాగరి భాష అనికూడ అంటారు. సంస్కృత భాషకు అక్షరములు ఏబది ఒకటి. అవి:

అచ్చులు - 16

అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ౡ, ఏ, ఐ, ఓ, ఔ, అం, అః

హల్లులు - 35

క, ఖ, గ, ఘ, ఙ

చ, ఛ, జ, ఝ, ఞ

ట, ఠ, డ, ఢ, ణ

త, థ, ద, ధ, న

ప, ఫ, బ, భ, మ

య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష

మొత్తం అచ్చులు, హల్లులు లెక్కపెడితే - ఏబది ఒక అక్షరములు.

ఏబది ఒక అక్షరములలో ముప్పది రెండు అక్షరములు (32) మాత్రమే ప్రారంభాక్షరములై అమ్మవారి సహస్ర నామములు గలవు.

ఈ ఏబది ఒక అక్షరములలో ఎనిమిది హల్లుల (ఐ, ఔ, అః, ఊ, ఋ, ౠ, ఌ, ౡ) మరియు పదకొండు హల్లుల ప్రారంభములతో అమ్మవారి సహస్ర నామములలో నామములు లేవు.

గనుక ఏబది ఒక (51) అక్షరముల నుండి, పందొమ్మిది అక్షరములను  (ప్రారంభాక్షరములుగా నామములు లేని) మినహాయిస్తే ముప్పది రెండు అక్షరముల (32) మాత్రమే ప్రారంభాక్షరములై అమ్మవారి సహస్ర నామములు గలవు. ఈ ముప్పది రెండు అక్షరములనే మాతృకా వర్ణములు అందురు. ఈ ముప్పది  రెండు అక్షరముల (మాతృకా వర్ణముల) ప్రారంభములతోనే అమ్మవారికి గల నామములన్నియు గలవు గనుక అమ్మవారు మాతృకావర్ణరూపిణీ యని అనబడినది.

సంస్కృత భాషకు ఏబది ఒక అక్షరములు గలవు. అందు ముప్పది రెండు అక్షరములకు మాత్రమే (ప్రారంభాక్షరములుగా) సహస్రనామములు గలవు. ఈ ముప్పది రెండు అక్షరములనే మాతృకా వర్ణములు అని యందురు. గనక పరమేశ్వరి మాతృకావర్ణరూపిణీ యని అనబడినది.

వర్ణమాలలోని అక్షరములన్నియు వీటినుండే ఏర్పడినవి, సమస్త మంత్రములు, వేదశాస్త్రములు, సకల భాషలు ఉద్భవిస్తాయి, ఇటువంటి మాతృకా వర్ణస్వరూపమే జగజ్జనని అని ఈ నామ మంత్రమునకు అర్థము.

గమనించ వలసిన విషయము:-

 మాతృకా వర్ణములు ముప్పది రెండు

అమ్మవారి సహస్ర నామములు ప్రారంభాక్షరములుగా తీసికొనిన అ అక్షరముల సంఖ్య ముప్పదిరెండు.  

శ్రీలలితా సహస్ర నామస్తోత్ర శ్లోకములు విరచింపబడిన అనుష్టప్ ఛందస్సుకము అక్షరములు ముప్పదిరెండు

శుద్ధవిద్యాంకురములై భాసిల్లు అమ్మవారి రెండు దంతపంక్తుల సంఖ్య ముప్పది రెండు

ఇంకొక విషయము ఏమిటి అంటే, (సనత్కుమార సంహిత ప్రకారము) ఈ ఏబది ఒక అక్షరములకు వర్ణములు (రంగులు గలవు).  

అచ్చులు పదహారు - ధూమ్ర వర్ణము

క నుండి ఠ  వరకు - సిందూర వర్ణము.

డ నుండి ఫ వరకు తెల్లని (గౌర) వర్ణము.

బ నుండి ర వరకు అరుణ (లేత ఎఱుపు) వర్ణము.

ల నుండి స వరకు కాంచన (బంగారు) వర్ణము.

హ, క్ష అను ఈ రెండు అక్షరములు మెఱుపు వర్ణము.

ఈ ఏబది ఒక అక్షరములలో అచ్చులు శక్తిస్వరూపములు అనగా అమ్మవారి స్వరూపము. హల్లులు అన్నియును శివస్వరూపములు. హల్లలు అచ్చుల చేరిక లేనిదే అక్షరము సంపూర్ణ స్వరూపము గాదు. గనుక అక్షరము అనునది శివశక్త్యైక్యరూపము.

అక్షరము శబ్దస్వరూపమై నోటి నుండి వెలువడుతున్నది. అటువంటి ఈ అక్షరములకు వర్గములు, ఆ వర్గములకు అధిదేవతలు గలరు. వారిని వాగ్దేవతలు అందురు. వారే వశిన్యాది వాగ్దేవతలు. వశిన్యాదులు వాగ్దేవతలు ఎలాగ అయారు అనగా - వాక్కు అంటే మాట. మాట అంటే పదము. కొన్ని అక్షరముల సముదాయమే మాట. వశిన్యాదులు ఎనిమిదిమంది. ఏబది అక్షరములు 

అ వర్గము (అ నుండి ఆః వరకు గల అక్షరములు) - వశిని

క వర్గము (క,ఖ,గ,ఘ,ఙ) - కామేశ్వరి.

చ వర్గము (చ,ఛ,జ,ఝ,ఞ) - మోదిని

 ట వర్గము (ట,ఠ,డ,ఢ,ణ) - విమల.

త వర్గము (త,థ,ద,ధ,న) - అరుణ.

ప వర్గము (ప,ఫ,బ,భ,మ) - జయిని

య వర్గము (య,ర,ల,వ) - సర్వేశ్వరి

శ వర్గము (శ,ష,స,హ,క్ష) - కౌళిని అని ఎనిమిది వర్గములు ఆ వర్గములకు వశిన్యాదులు అధిష్ఠాన దేవతలు.

వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అను  వీరు వైఖరీరూపంలో వెలువడు వాక్కునందున్న అక్షరములతో, జ్ఞానమును జోడించి వాక్కుగా వెలువడజేతురు.  గనుకనే అమ్మవారు వీరిని వాగ్దేవతలు అని యన్నది. 

ఇది మాత్రమే కాకుండా వైఖరీ రూపమైన   వాక్కు వెలువడడానికి కంఠం నుండి శిరస్సు వరకు ఎనిమిది ప్రదేశములు గలవు. ఈ ఎనిమిదింటిని 1) ఐదు స్థానములు (కంఠము, తాలువులు అనగా దౌడలు, ఓష్ఠములు అనగా పెదవులు, దంతములు, అంగుడు)  2) రెండు ప్రయత్నములు (అభ్యంతరప్రయత్నము, బాహ్యప్రయత్నము - అనగా మాటలాడుటకు లోపలినుండి మాట వెలుపలకు వచ్చుటకు అభ్యంతర ప్రయత్నమనియు, లోపలి నుండి వచ్చిన మాట బయటకు వెలువడజేయుట బాహ్యప్రయత్నము అనియు అందురు), 3) ఒక కరణము (నాలుక). ఈ ఎనిమిదింటికి అధిదేవతలు పైన చెప్పబడిన వశిన్యాది వాగ్దేవతలు.

అలాగే ఈ ఏబది ఒక్క (51) అక్షరములకు (ల, ళ అను అక్షరములు ఒకటిగానే పరిగణింపబడుటచే  (ఏబది మంది దేవతలు గలరు). శరీరంలోని షట్చక్రములందుండు వివిధ సంఖ్యలుగల పద్మములందు ఆ దేవతలు ఉన్నారు ఆ వివరములు:-

విశుద్ధిచక్రము అ నుండి అః వరకు పదహారు దళముల  ఈ పద్మమునందు డాకిని అధిష్ఠానదేవతగా  ఉండు దేవతలు పదహారు (16) మంది. వారు:-

1. అమృతా, 2. ఆకర్షిణి, 3. ఇంద్రాణి, 4. ఈశాని, 5. ఉషఃకేసి, 6.  ఊర్ధ్వ, 7. ఋద్ధిత, 8. ౠకార, 9. కార, 10. షా, 11. ఏకపదా, 12. ఐశ్వర్యా, 13. ఓంకారి, 14. ఔషధి, 15. అంబికా, 16. అఃక్షరా.

అనాహతచక్రము క నుండి ఠ వరకు పండ్రెండు దళముల  ఈ పద్మమునందు రాకిని అధిష్ఠానదేవతగా  ఉండు దేవతలు పండ్రెండు (12) మంది. వారు:-

17. కాళరాత్రి 18. ఖాతీత, 19. గాయత్రి, 20. ఘంటాధారిణి, 21. ఙామిని, 22. చంద్రా 23. ఛాయా, 24. జయా, 25. ఝుంకారి, 26. జ్ఞానరూప, 27. టంకహస్తా, 28. ఠంకారిణి.

మణిపూరచక్రము డ నుండి ఫ వరకు పది దళముల  ఈ పద్మమునందు లాకిని అధిష్ఠానదేవతగా  ఉండు దేవతలు పది (10) మంది. వారు:-

29. డామరి, 30. ఢంకారిణి, 31. ణామిరి, 32. తామసి, 33. స్థాణ్వి, 34. దాక్షాయణి, 35. ధాత్రి, 36. నందా, 37. పార్వతి, 38. ఫట్కారిణి.  

స్వాధిష్ఠానచక్రము బ నుండి ల వరకు ఆరు దళముల  ఈ పద్మమునందు కాకిని అధిష్ఠానదేవతగా  ఉండు దేవతలు ఆరు (6) మంది. వారు:-

39. బందిని, 40. భద్ర, 41. మహామాయ, 42. యశస్వినీ, 43. రమా, 44. లంబోష్ఠిత.

మూలాధారచక్రము వ నుండి స వరకు నాలుగు దళముల  ఈ పద్మమునందు సాకిని అధిష్ఠానదేవతగా  ఉండు దేవతలు నలుగురు (4) మంది. వారు:-

45 వరద, 46.  శ్రియ, 47.షండా, 48. సరస్వతి.

 ఆజ్ఞాచక్రము హ మరియు క్ష అను రెండు దళముల  ఈ పద్మమునందు హాకిని అధిష్ఠానదేవతగా  ఉండు దేవతలు ఇరువురు (2). వారు:-

49. హంసవతీ, 50. క్షమావతీ 

ఆ, ఈ, ఊ, మొదలగు ప్రత్యేక వర్ణములు కలయికచేత మూడేసి వర్ణముల కలియికచేత మూడేసి వర్ణములు చేర్చుటతో క కారాది క్ష కారాంతము వరకు మార్చుచు, చేర్చుచూ, నేర్చుచూ పలుకులన్నీ పరమేశ్వరి నామములే కావున జగన్మాత మాతృకావర్ణరూపిణి అనబడును.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మాతృకావర్ణరూపిణ్యై నమః అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

578వ నామ మంత్రము 3.2.2022

ఓం మహాకైలాస నిలయాయై నమః

 పరమశివుడే ఉండు మహాకైలాసమే నివాసమై, అదే తన స్థానమై విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీచక్రం మధ్యలో నుండు బిందువే అమ్మ తన నివాసంగా  ఉండు జగన్మాతకు నమస్కారము.

'షట్చక్రములను దాటిన తరువాత, సుషుమ్న నాడికి పైభాగాన సహస్రదళ పద్మముగలదు'  అని స్వచ్ఛంద సంగ్రహమునందు వివరించబడిన దీనినే అకులము అందురు. సుషుమ్నానాడి ప్రారంభమునందు ఆధార చక్రమునకు దిగువన ఒక సహస్రారకమలము ఉన్నది.  సుషుమ్నకు పైన అనగా షట్చక్రములు దాటిన తరువాత ఇంకొక సహస్రార కమలము గలదు.  సహస్రదళ పద్మంలో ఎనిమిది పెద్దదళములు గలవు. ఈ అష్టదళములు అష్టదిక్కులకు ఉండగా, ప్రతీ దళమునకు 125 చిన్నచిన్న దళములు ఉండును. ఆ విధంగా సహస్రార పద్మములో మొత్తము వేయిదళములు ఉండును. మానవ శరీరంలో రెండు సహస్రదళ పద్మములు ఉండగా, ఒకటి ఆధారచక్రమునకు క్రిందను, ఇంకొకటి ఆజ్ఞాచక్రానికి పైన ఉండును. దిగువన ఉన్న సహస్రదళ  పద్మమును కులమనియు, ఆజ్ఞాచక్రమునకు పైన ఉన్న సహస్రదళ పద్మమును అకులమని అందురు. కుండలినీ శక్తి సహస్రారమునకు (సుషుమ్మానాడి ఎగువ కొసవద్ద) క్రింద భాగంలోను, లలాటమునకు పైన షట్చక్రములను దాటి, వాటితో సంబంధంలేకుండా అక్కడ ఉన్న సుధాసాగరంలో కుండలినీ శక్తి రూపంలో ఉన్న శ్రీమాత ప్రవేశించి విహరిస్తూ ఉంటుంది. అక్కడ ప్రవేశించి, బిందువునందున్న పరమేశ్వరునితో అంతర్లీనమై శివశక్త్యైక్య స్వరూపిణి అగుట చేత పరమేశ్వరిని అకులా, అని కూడా అంటారు. ఈ అకులస్థానమునే (బిందుస్థానమునే) కైలాసమని అంటారు.

ఏతత్ కైలాస సంజ్ఞం పదం అకులపదమ్|

బిందురూపీ స్వరూపీ యత్రా స్తే దేవదేవః (సౌభాగ్యభాస్కరం, 705వ పుట)

బిందురూపమైన అకులస్థానమే కైలాసము అని అంటారు. పరమశివుడు ఇక్కడ ఉంటాడు. ఇంకోమాటలో చెప్పాలంటే సహస్రారమే కైలాసము. అక్కడ పార్వతీ, పరమేశ్వరులు ఉందురు. 

మహాకైలాసము అనేది వేరేగా ఒకటి ఉన్నది. మహాకైలాసము కైలాసముకంటె మిక్కిలి పరము. మహాకైలాసము కూడా అది ఒక లోకము. మహాకైలాసము పరమశివుని నివాసము అని శివపురాణములో చెప్పబడినది.

శ్రీచక్రం మొత్తం కైలాసము అన్నాము. శ్రీ చక్రము, సహస్రారకమలము ఒకటే. బహిఃపూజలకు శ్రీయంత్రమును ఉంచి పూజిస్తారు.అంతః పూజలకు సహస్త్రారపద్మాన్ని ఆరాధిస్తారు.

శ్రీ చక్రం లోని ఒక్కొక్క భాగం త్రిపుర సుందరి యొక్క సూచికగా భావిస్తారు. బయటి నుండి లోపలికి వెళ్ళే దిశలో శ్రీ చక్ర భాగాలు-

మూడు సమాంతర రేఖలతో కూడుకుని ఉన్న చతురస్రాకారము - త్రైలోక్య్య మోహనము.

పదహారు రేకులు గల వృత్తము - సర్వాశాపరిపూరకము.

ఎనిమిది రేకులు గల వృత్తము - సర్వసంక్షోభణము.

పధ్నాలుగు చిన్న త్రిభుజాలు - సర్వ సౌభాగ్యదాయకము.

పది చిన్న త్రిభుజాలు - సర్వార్థసాధకము.

పది చిన్న త్రిభుజాలు - సర్వ రక్షాకరము.

ఎనిమిది చిన్న త్రిభుజాలు - సర్వ రోగహరణము.

మధ్యనున్న ఒక త్రిభుజం - సర్వ సిద్ధిప్రదము.

బిందువు - సర్వ ఆనందమయము -  దీనినే మహాకైలాసము అందురు. ఆ బిందువులో జగన్మాత ఉంటుంది గనుక అమ్మవారు మహాకైలాసనిలయా యని అనబడినది.


శ్రీచక్రంలోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. ఆ స్త్రీపురుషులు ఇరువురు పార్వతీపరమేశ్వరులు. గనుక పార్వతీపరమేశ్వరుల స్థానమైన శ్రీచక్రము కైలాసము అయితే, అందులో బిందువు మహాకైలానము. అచ్చటనే శివశక్త్యైక్యము ప్రస్ఫుటమగును. 

అమ్మ వారికి నమస్కరించునపుడు ఓం మహాకైలాస నిలయాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

579వ నామ మంత్రము 4.2.2022

ఓం మృణాల మృదు దోర్లతాయై నమః

తామర తూడులోని సన్నని దారములవలె అతి సుకుమారమైన భుజములను గలిగిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి మృణాళ మృదు దోర్లతా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మృణాళ మృదు దోర్లతాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు సమస్త బాధలు తొలగిపోవును, ఇహమందు సుఖ సంతోషములుతోను మరియు ఆ తల్లి కరుణాంతరంగ దృష్టుల వలన ఆధ్యాత్మిక సంతోష కారకమైన బ్రహ్మానందము లభించి తరించుదురు.

మృణాళ ము అనగా తామరతూడు, తామరతూడు చాలా మృదు అతి సున్నితమైన దోర్లతా అనగా బాహువులు కలిగియున్నది అమ్మవారు - ఇది యథాతథంగా నామ మంత్రమునకు అర్థము.

ఇందులో అంతర్లీనమై ఉన్న భావం ఏమంటే మూలాధారంనుండి వెన్నెముక వెంబడి ఉన్న కుండలినీ మార్గంలో గల సుషుమ్నానాడి జగన్మాతగా భావిస్తే,  ఆ సుషుమ్మానాడికి ఇరువైపులా అతిసూక్ష్మంగా ఉండే ఇడా, పింగళ నాడులు ఆ తల్లి బాహువులుగా భావించవచ్చును, యోగపరంగా  ఈ నామమంత్రమందు సూక్ష్మార్థము. ఇదే విషయాన్ని శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు డెబ్బదియవ (70వ) శ్లోకంలో అమ్మవారి బాహువులను వర్ణస్తూ ఇలా చెప్పారు:

మృణాళీమృద్వీనాం - తవ భుజలతానాం చతసృణాం

చతుర్భి స్సౌందర్యం - సరసిజభవ స్స్తౌతి వదనైః|

నఖేభ్య స్సంత్రస్యన్‌ - ప్రథమ మథనాదంధకరిపో

శ్చతుర్ణాం శీర్షాణాం - సమ మభయహస్తార్పణధియా ||70||

శ్లోకమునకు భావము

బ్రహ్మ దేవి నాలుగు చేతుల స్తుతి - పూర్వము బ్రహ్మకు ఐదు తలలుండెడివని, అందొక తలను రుద్రుడు తన గోటితో చిదిమివేసెనని ఒక పురాణగాథ. శివుని గోళ్ళకు భయపడిన బ్రహ్మ తన నాలుగు తలలను రక్షించుకొనుటకై నాలుగు ముఖాలతోను ఒకేమారు పరమేశ్వరి యొక్క సుకుమారమైన, తామరతూండ్లవంటి బాహువులను బ్రహ్మ స్తుతించెను

అలాగే లలితా సహస్రనామ స్తోత్రంలోని నలుబదియవ శ్లోకంలో:-

తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థితా|

మహాసక్తిః కుండలినీ బిసతంతు తనీయసీ॥

బిసతంతతు తనీయసీ అంటే తామరతూడులోని దారం మాదిరిగా సున్నితమైన శరీరం గలిగినది అని చెప్పడం జరిగినది.

ఈ నామ మంత్రమునకు  తామరతూడు వంటి బాహువులు గలిగినది శ్రీమాత అని అర్థం చెప్పుకుంటే అంతర్లీనంగా సుషమ్నా నాడికి ఇరువైపులా గల ఇడా, పింగుళ నాడులవలె తనకిరువైపులా బాహువులు కలిగినది జగన్మాత  భావించవలయును.

ఆ పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం మృణాల మృద దోర్లతాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

580వ నామ మంత్రము 5.2.2022

ఓం మహనీయాయై నమః

అందరి చేతా పూజింపబడు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి మహనీయా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహనీయాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాదకులకు సమస్త బాధలు తొలగిపోవును మరియు తమ అభీష్టములు సిద్ధించుటయే కాక పలువురిలో తమ పేరు ప్రతిష్టలు ఇనుమడించి గౌరవింపబడుదురు, బ్రహ్మానందభరితులై తరించుదురు.

అమ్మ అత్యంత పూజనీయురాలు, హరిబ్రహ్మాదులచే కూడా పూజింపబడినది. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు జగన్మాతను పూజించి, జగన్మోహినీ అవతారమును సాధించుకొని దేవ దానవులకు అమృతం పంచడంలో దేవతలకే అమృతమును లభించునట్లు చేయగలిగెను.

ఈ విషయం ఆది శంకరులే సౌందర్యలహరిలో ఇరువది రెండవ శ్లోకంలో వివరించారు.

భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాఞ్ఛన్ కథయతి భవాని త్వమితి యః|

తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్య-పదవీం ముకుంద-బ్రమ్హేంద్ర స్ఫుట మకుట నీరాజితపదామ్ ||

తనను భక్తితో కోర్కెలు కోరెడి దాసుల వాక్యము పూర్తి కాకుండానే దేవి వారికి దుర్లభ సాయుజ్యమును ప్రసాదించును

జగన్నాతకు నమస్కరించునపుడు ఓం మహనీయాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీలలితా సహస్రనామ భాష్యము

581వ నామ మంత్రము 6.2.2022

ఓం దయామూర్త్యై నమః

దయాలక్షణముతో మూర్తీభవించిన జగన్మాతకు నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి దయామూర్తిః అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం దయామూర్త్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు ఆ కరుణామూర్తి తన భక్తులను అపార కరుణా హృదయంతో ఆయురారోగ్యములు, సిరిసంపదలు, వంశాభివృద్ధి, బ్రహ్మజ్ఞాన సంపదలు కలుగజేసి తరింపజేయును.

జగన్మాత కరుణా సముద్రురాలు, కరుణాంతరంగిణి, దయారూపంతో మూర్తీభవించిన పరమాత్మ. ఆ పరమేశ్వరి ప్రతి అణువు, పరమాణువు కరుణా పూరితమైనదే. విశ్వమంతా జగన్మాత కరుణపై ఆధారపడినది. జగన్మాత అంత దయాస్వరూపిణి గనుకనే బ్రహ్మోపేంద్ర మహేంద్రాదులు అమ్మవారిని ఆరాధిస్తారు.

తపోదీక్షలోనున్న పరమేశ్వరునికి పార్వతిపై మరులు కలుగజేయవలెనని మన్మథుడు పరమేశ్వరునిపై పూలబాణములు వేశాడు. తన తపస్సు భగ్నమయినందుకు పరమేశ్వరుడు మన్మథుని భస్మంచేస్తాడు. సర్వమంగళయైన పార్వతి, రతీదేవికి కలిగిన పతీవియోగానికి జాలిపడి, ఆమెను కరుణించి మన్మథుని తిరిగి సజీవుని చేస్తుంది. 

బ్రహ్మచేసిన సృష్టికి, విష్ణువు స్థితిని కలుగజేస్తాడు. పరమేశ్వరుడు లయంచేసి వదలి వేస్తాడు. త్రిమూర్తులు అమ్మవారు నియోగించిన సృష్టిస్థితిలయకార్యములను మాత్రమే నిర్వహిస్తారు. పరమేశ్వరి విలయంలో చిక్కుకున్న అందరినీ తన కుక్షిలో నిక్షిప్తం జేసుకుని తిరిగి అనంతకోటి జీవరాశులను కర్మఫలానుసారము తిరిగి జన్మింపజేస్తుంది. సృష్టిస్థితిలయలకు తను కారణము మాత్రమే గాక తిరోధాననుగ్రహములను కూడా నిర్వహిస్తూ అనుగ్రహమూర్తిగా, పంచకృత్యపారాయణగా జీవరాశుల సంరక్షణమును కూడా చేపడుతుంది. అందుకే అంటారు నారుపోసిన పరమాత్మ నీరు పోయడా అని. ఆ నీరు పోసే పరమాత్మ పరమేశ్వరియే.

పరమేశ్వరి శ్రీచక్రంలోని పరమానందమయ చక్రంలో ఉంటుంది గనుకనే ఆమె స్వతహాగానే దయామూర్తి.

సర్వరోగహరచక్రస్వామినిగా కులయోగిని, వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అను శక్తిదేవతల ద్వారా జీవులకు కలుగు సర్వరోగములను ఉపశమింపజేస్తూ  సర్వరోగప్రశమనీ యని అనబడుటకు ఆ పరమేశ్వరి దయామూర్తి యగుటయే కారణము.

సర్వసంక్షోభణచక్రస్వామినియై, గుప్తతరయోగిని, అనంగకుసుమ, అనంగమేఖల, అనంగమదన, అనంగమదనాతుర, అనంగరేఖ, అనంగవేగిని, అనంగాంకుశ, అనంగమాలిని యను యోగినీ శక్తులద్వారా లోకాలను సర్వసంక్షోభములనుండి కాపాడుటకు పరమేశ్వరి దయామూర్తియగుటయే కారణము.

ఆ పరమేశ్వరి దయామూర్తి యగుటచే తనను సేవించు భక్తులకు అకాలమృత్యువులను నివారిస్తూ, సర్వమృత్యునివారిణీ యని అనబడుచున్నది.

అమ్మ కరుణారస పూరిత హృదయాన్ని స్తుతించిన శ్లోకము మరియు కొన్ని నామమంత్రములు

అరుణాం కరుణా తరఙ్గితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం|

అణిమాదిభి రావృతాం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్॥

అపాదమస్తకము ఎఱుపురంగులో  ప్రకాశిస్తూ, సదా కనుల నుండి ప్రవహిస్తున్న కరుణ తో, పాశ-అంకుశ-పుష్పబాణ-చాపాలను  ధరించి, అణిమాది అష్టసిద్ధులూ పరివేష్టించి ఉన్న భవానీ దేవిని నేనే అని భావిస్తున్నాను.  

1)  197వ నామ మంత్రము ఓం సాంద్రకరుణాయై నమః గొప్పదయాస్వరూపిణి  (ఘనీభవించిన కరుణారస పూరిత హృదయ) అయిన తల్లికి నమస్కారము.

2) 326వ నామ మంత్రము ఓం కరుణా రస సాగరాయై నమః దయారసమునకు సముద్రమువంటి దైన శ్రీమాతకు నమస్కారము

3) 992వ నామ మంత్రము ఓం అవ్యాజ కరుణా మూర్త్యై నమః నిర్హేతుకమైన అనగా కారణం లేదా ప్రతిఫలాపేక్షలేని మాతృప్రేమా స్వరూపు రాలైన జగన్మాతకు నమస్కారము

అటువంటి దయాస్వరూపిణికి నమస్కరించునపుడు ఓం దయామూర్త్యై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

582వ నామ మంత్రము 7.2.2022

ఓం మహాసామ్రాజ్య శాలిన్యై నమః

సమస్త భువన మండలములను పరిపాలించు శ్రీమాత మహాసామ్రాజ్ఞి. అటువంటి తల్లికి నమస్కారము

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి మహాసామ్రాజ్య శాలినీ అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మహాసామ్రాజ్య శాలిన్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులను ఆ శ్రీమాత కరుణించి భక్తిసామ్రాజ్యాధినేతలను జేయును బ్రహ్మజ్ఞాన సంపదలనిచ్చి ఆధ్యాత్మిక సౌఖ్యములనుభవింపజేయును మరియు ఐహికముగా సఖసంతోషములతో వర్తింపజేసి అంత్యమున మోక్షమును ప్రాప్తింపజేయును.

శ్రీమహారాజ్ఞి, అఖిలాండేశ్వరి, జగదీశ్వరి అని శ్రీమాతను కీర్తిస్తున్నాము. సృష్టి, స్థితి, లయకారిణి అయిన శ్రీమత్సింహాసనేశ్వరి మహాసామ్రాజ్యశాలినియై ఋతుధర్మములకు అష్టదిక్పాలకులను కాలానికి సూర్యచంద్రులను, గ్రహగోళములకు నవగ్రహములను, సృష్టి, స్థిత, లయ కార్యములకు త్రిమూర్తులను, అష్టైశ్వర్యములకు, చతుష్షష్ఠి కళలకు, జగన్మంగళకారణములకు మువురమ్మల(లక్ష్మి, సరస్వతి, పార్వతుల) ను అధిపతులను జేసి సర్వము తన కనుసన్నలలో, తనచేతి రాజముద్రికతో ఏదియు అదుపు తప్పక, ధర్మమునధిగమించక పరిపాలించుచున్న మహాసామ్రాజ్య శాలిని శ్రీమాత.

అమ్మవారికంటే ఏదీ గొప్పదికాదు. అమ్మవారి గొప్పదనమే పరాకాష్ఠ అయినది. అమ్మవారి వైభవంకన్నా గొప్పదైన వైభవం లేదు. ఇక మంచిదనం చెప్ప వలసి వస్తే, ఆ తల్లి అమ్మ. జగాలకే అమ్మ. జగన్మాత. అమ్మకన్నా మంచి వాళ్ళు ఎవరూ ఉండరు. గనుక వైభవమైనా, మంచిదనం అయినా, గొప్పతనమైనా పరమేశ్వరికన్నా మిన్న ఏదియును లేదు. ఆ తల్లి పంచకృత్యపరాయణ. అనగా సృష్టిస్థితిలయతిరోధానానుగ్రహములను పంచకృత్యములయందు నిమగ్నురాలు. జగములన్నియును ఆ తల్లి సృజించినవే. ఒక్కొక్క జగమూ ఒక సామ్రాజ్యము అని చెపితే, ఆ సామ్రాజ్యములన్నింటినీ కలిపి ఒక మహాసామ్రాజ్యముగా చేసి అంతయు తన అధీనమునందు పెట్టుకొనిన ఆ పరమేశ్వరి మహాసామ్రాజ్యశాలినీ యని అనిపించుకొన్నది. ఆ మహాసామ్రాజ్యానికి తను పరిపాలకురాలు. పరమేశ్వరియంటే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకురాలు. శ్రీమన్నగరనాయిక. ఆత్మసామ్రాజ్యాధినేత్రి. అనంతజీవరాశులలో ఉన్న ఆత్మలకు ఆ తల్లి పరమాత్మ. ప్రజ్ఞానమే ఒక ఘనముగా రూపొందిన ప్రజ్ఞానఘనరూపిణి.  

పార్వతీపరమేశ్వరుల స్థానమైన శ్రీచక్రము కైలాసము అయితే, అందులో బిందువు మహాకైలానము. ఆ మహాకైలాసమే ఒక మహాసామ్రాజ్యము. ఆ మహాసామ్రాజ్యాధినేత్రియైన పరమేశ్వరి మహాసామ్రాజ్యశాలిని

జగజ్జననిని అధినాయకురాలిగా  కీర్తించిన ఇంకా కొన్ని నామమంత్రములు

1) 2వ నామ మంత్రము ఓం శ్రీమహారాజ్ఞ్యై నమః సమస్త లోకాలను పాలించు తల్లికి నమస్కారము.

2) 3వ నామ మంత్రము ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః సింహాసనముపై ఆసీనురాలైన తల్లికి నమస్కారము.

3) 56వ నామ మంత్రము ఓం శ్రీమన్నగర నాయికాయై నమః శ్రీవిద్యానగరానికి (శ్రీచక్రానికి) నాయిక అయిన తల్లికి నమస్కారము.

4) 463వ నామ మంత్రము ఓం సురనాయికాయై నమః దేవతలకందరికీ నాయకురాలైన మహాశక్తి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము.

5) 569వ నామ మంత్రము ఓం   నిఖిలేశ్వర్యై నమః సమస్త ప్రపంచములకు ఈశ్వరి అయిన తల్లికి నమస్కారము.
 
శ్రీమహారాజ్ఞికి నమస్కరించునపుడు ఓం మహాసామ్రాజ్య శాలిన్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

583వ నామ మంత్రము 8.2.2022

ఓం ఆత్మవిద్యాయై నమః

జగన్మాత ఆత్మవిద్యా స్వరూపిణి. అటువంటి పరమేశ్వరికి నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి ఆత్మవిద్యా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం ఆత్మవిద్యాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులను బ్రహ్మజ్ఞాన సంపదలిచ్చి కరుణించును మరియు ఆతల్లి తన భక్తులను ఐహిక సుఖసంతోషములకు, కీర్తి ప్రతిష్టలకు లోటురానీయదు.

ఈ (583వ) నామ మంత్రం నుండి  దివ్య విగ్రహా అను (621వ) నామ మంత్రం వరకూ బ్రహ్మవిద్యకు సంబంధించిన ఉపదేశములు తెలుపబడినవి. ఇవి అన్నియ అపరావిద్యలు అనగా పదార్థవిజ్ఞాన శాస్త్రము.  

ఆత్మ అనేది హిందూమతములోను, సంబంధిత సంప్రదాయాలలోను తరచు వాడబడే ఒక తాత్విక భావము. దీని గురించి వివిధ గ్రంథాలలో వివిధములైన వివరణలున్నాయి. స్థూలంగా చెప్పాలంటే సమస్త జీవులు కేవలం మనకు కనిపించే శరీరాలు కావని, ఆ శరీరాలు నశించినా నశించని జీవుడు ఒకడున్నాడని, ఆ నాశనరహితమైన జీవుడే ఆత్మ అని చెప్పవచ్చును.

ఆత్మ అనగా ప్రతీ మనిషి లోనూ ఉండే భగవంతుని అంశ. కనుక దానికి కుల, మత, వర్గ, రూప భేదాలు ఉండవు. దీనినే అంతరాత్మ అని అనవచ్చును. అంతర్లీనంగా ఉండి, మానవునికి సరి అయిన మార్గమును, న్యాయ-అన్యాయాలు, తప్పు-ఒప్పులను నిస్పక్షపాతంగా చెపుతూ,  సన్మార్గాన్ని చూపుతూ ఉంటుంది. ఇది ఎప్పుడూ, మంచిని చెప్పే ఒక ఆత్మీయునిలాగ, ధర్మాన్ని తెలియజెప్పే ఒక గొప్ప యోగిలాగ, మంచి చెడులను సరిగ్గా నిర్ణయించి తెలియజెప్పే ఒక న్యాయమూర్తిలాగ ప్రవర్తిస్తుంది. అందుకే అంటాము ఆత్మను మించిన సాక్షి లేదని మానవులందరిలోనూ ఈ అంతరాత్మ ఒకే విధంగా ఆలోచిస్తుంది. ఒక విషయాన్ని ఒకే విధంగా వివరిస్తుంది. అంతరాత్మ విషయంలో మానవులలో ఏవిధమైన తేడాలూ లేవు. ఎందుకంటే ఇది ఆ పరమాత్ముని అంశ అయినది కనుక. ఆయన ఒక్కడే కనుక. ఆయన నుండి వేరుపడి, వివిధ రూపాలు కలిగిన శరీరాలలో ప్రవేశించి జీవనం సాగిస్తుంది కనుకనే ఎంత వీలయితే అంత తొందరగా ఆ భగవంతునిలో లీనం కావాలని తాపత్రయ పడుతూ ఉంటుంది. ఆత్మకు రూపం లేదు. అది ఒక దివ్య శక్తి . ఈ శక్తిని తెలుసుకోమనే గొప్ప గొప్ప మహాత్ములందరూ తమ బోధలలో చెప్పేది. మరి మానవుల ఆలోచనావిధానం లోనూ, ఆచరణావిధానం లోనూ ఇన్ని తేడాలు ఎలా వచ్చాయి? సాధారణంగా మానవులు రూపంలో కానీ, చేష్టలలో కానీ, ఆలోచనా విధానంలోకానీ ఒకరితో ఒకరికి పోలికలు ఉండవు. ఏదో ఒక చిన్న తేడా అయినా ఉంటుంది. కానీ విచిత్రంగా, అంతరాత్మ విషయంలో అందరూ ఒకేలాగ, ఒకే పోలికతో ఉంటారు. తేడా ఏదైనా ఉంటే, ఎవరు ఎంత శాతం అంతరాత్మకు విలువ ఇస్తున్నారు అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే మనుషులు ఒకరితో ఒకరికి పోలిక లేకుండా పోతుంది. ఈ పరిస్థితికి కారణం మనస్సు ఇది కూడా మనలో ఆత్మచేసే బోధకు సమాంతరంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మనస్సు పరిస్థితులకు, కారణాలకు, ఇంద్రియాలకు, పురుషార్థాలకు, గుణాలకు లోబడి మనకు మార్గము చూపుతూ ఉంటుంది. ఈ మార్గం సమయాను సారంగా మారుతూ ఉంటుంది. ఈ మార్గమును ఎవరు, ఎంత శాతం వరకూ అనుసరిస్తారు? అన్న దానిమీద ఆధారపడి ఉంది. మరి, ఆత్మ, దేనికి లోబడక, ఏ పరిస్థితులకూ, సమయానికీ కూడా లోబడకుండా ఎప్పుడూ న్యాయమార్గాన్నే చూపుతూ ఉంటుంది. మనుషులలో తేడాలు, ఈ రెండు మార్గాలలో దేనికి ఎంత విలువనిస్తారు? అన్న దానిమీద ఆధారపడి ఉంటుంది.

మహావాక్యాలు

హిందూమతం లోని ఆధ్యాత్మిక, ఉపనిషత్తుల సారమే ఈ మహా వాక్యాలు. ఒక్కొక్క వేదంలోని సారమే ఒక మహావాక్యంగా ఈ మహావాక్యాలు చెబుతాయి. ఆ మహావాక్యాలు:-

ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరీయోపనిషత్తు - ఋగ్వేదము.

అతి ప్రాచీనమైన ఋగ్వేదములో సృష్టిమూలమును తెలియజేస్తూ ఈ బ్రహ్మాండము పరబ్రహ్మము నుండి జనించినదని, ఈ చరాచర సృష్టికి శుద్ధ చైతన్యము బ్రహ్మమేనని తీర్మానించినది. బ్రహ్మమే సర్వజ్ఞతను కలిగియున్నది. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులను నడిపించే చైతన్యము బ్రహ్మము.

ఆహం బ్రహ్మాస్మి బృహదారణ్యకోపనిషత్తు - యజుర్వేదము అహం బ్రహ్మ అస్మి అంటే నేను బ్రహ్మ అగుగాక అని, బ్రహ్మ జ్ఞానం సంపాదించాలని అంతరార్థం. నేనే బ్రహ్మను అంటే నాలోనే బ్రహ్మ ఉన్నాడనే భావన రావాలి. అంటే ఈ ఆత్మే బ్రహ్మ అని అర్థం. .

తత్ త్వమసి- ఛాందోగ్యోపనిషత్తు - సామవేదము. చరాచరమంతా వ్యాపించియున్న శుద్ధచైతన్యము ఎక్కడో లేదు, నీలోనే వుండి, నీవైయున్నదని నిర్వచించడం చాలా ఆశ్చార్యాన్ని, తృప్తిని కలిగిస్తుంది. శంకర భగవత్పాదులు చాటి చెప్పిన అద్వైతము ఈ మహావాక్యమునుండే ఆవిర్భవించినది అని భావించడం మనం వినియున్నాము. ఏక మేవ అద్వితీయం, ఉన్నది ఒక్కటే! అదే పరబ్రహ్మము. అది నీలోన, అంతటా వ్యాపించి ఉన్నదనే ఒక గొప్ప సత్యాన్ని అద్వైతము ఆవిష్కరించినది. ఆత్మ పరమాణు ప్రమాణమైనది. అటువంటి పరమాణువునుండే ఈ బ్రహ్మాండము ఆవిర్భవించినది. కావున ఈ బ్రహ్మాండములో భాగమైన నీవే ఆత్మవు అని వర్ణించినది.

అయమాత్మా బ్రహ్మ - ముండకోపనిషత్తు - అధర్వణవేదము. ఈ వాక్యము కూడా ఆత్మయే బ్రహ్మమని తెలియజేస్తోంది. జీవాత్మ పరమాత్మలు ఒక్కటేనని విచారించింది. ఈ వేదములోనే ప్రణవ సంకేతమైన ఓంకార శబ్దమును మానవాళికి అందించినది. లౌకిక వస్తు సమదాయములన్నీ వివిధ నామములతో సూచించబడినట్లే అనంత విశ్వమును ఓంకారమనే శబ్ద సంకేతముతో సూచించినది. గ్రహముల భ్రమణ శబ్దము ఓంకారమేనని ఇటీవల విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు భావిస్తున్నాయి.

ఈ మహావాక్యాలు ఆత్మ తత్వాన్ని సూచిస్తున్నాయి.

అయమాత్మా బ్రహ్మ(ఈ ఆత్మయే బ్రహ్మము)
ఇక్కడ ఆత్మ, బ్రహ్మము అనేవి ఒకటే అని చెప్పబడింది. ఇందుకు సముద్రము, అందులోని కెరటము దృష్టాంతముగా తీసికొన్నారు. ఒకో కెరటము ప్రత్యేకమైన ఉనికి ఉన్న వస్తువుగా అనిపిస్తుంది. కాని ఆకెరటం ఒడ్డును తాకి పడిన తరువాత కెరటానికి, సముద్రానికి తేడా లేదని తెలుస్తుంది.

శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీతలో, ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు. ఆత్మ రెండు విధాలు. 1. జీవాత్మ 2. పరమాత్మ. విశ్వవ్యాప్తంగా ఉండే శక్తి పరమాత్మ అని, జీవులలో ఉండే తన అంశను జీవాత్మ అని వివరించాడు. ఈ జీవాత్మే ఆత్మ యని అనబడుచున్నది. ఆత్మ నాశనం కానిది, శస్త్రం ఏదీ ఛేదించలేనిది, అగ్ని దహించలేనిది, నీరు తడపలేనిది, వాయువు ఆర్పలేనిది అని వివరించాడు ఆ శ్రీకృష్ణభగవానుడు. ఇంతేకాక అహం బ్రహ్మస్మి, అయమాత్మ బహ్మ అనే ఉపనిషద్ వాక్యాలు కూడా నీలో ఉన్న ఆత్మ భగవంతుని అంశే కనుక ఆవిషయాన్ని తెలుసుకోమని చెబుతున్నాయి అని  ఆ  శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు.

వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు. ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి

సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు.

బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.

అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.

ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి ఒకవేయి నూట ఎనబై (1180) ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి. వాటిలో నూటఎనిమిది (108) ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిలో పది (10) ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదహరించారు.

అటువంటి ఉపనిషత్సారమే ఆత్మ విద్య.  ఉపనిషత్తులన్నియు వేదముల నుండి వెలువడినవే గనుక వేదమాత అయిన పరమేశ్వరి ఆత్మవిద్యా యని అనబడినది.

అటువంటి ఆత్మవిద్యా స్వరూపిణి యని నామ ప్రసిద్ధమైన శ్రీమాతకు, ఆ శ్రీమహారాజ్ఞికి నమస్కరించునపుడు   ఓం  ఆత్మవిద్యాయై నమః అని దీక్షతో అంటూ ఆ ధ్యానంలో లీనమైతే ఆతల్లి కరుణ లభించి, సాధకులు ఈ ఆత్మవిద్యా సాధనయందు నిమగ్నులై తరించగలరు, ఆ తల్లి అనుగ్రహం సంపాదించగలరు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

584వ నామ మంత్రము 9.2.2022

ఓం మహావిద్యాయై నమః

 నవదుర్గా మంత్రస్వరూపురాలును, అనర్థములను తొలగించెడి గొప్ప జ్ఞాన స్వరూపురాలైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి మహావిద్యా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహావిద్యాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ జగజ్జననిని ఉపాసించు భక్తులు బ్రహ్మవిద్యాసంపన్నులై ఐహికమగు సుఖసంతోషములతో బాటు ఆధ్యాత్మికసామ్రాజ్యాధినేతలై జగజ్జననినీ పాదసేవాతత్పరులై తరింతురు.

సకల జ్ఞానములలోను, లేదా అన్ని విద్యలలోను ఆత్మవిద్య అనగా ఆత్మజ్ఞానమే గొప్పది. అట్టి ఆత్మవిద్యయే మహావిద్య యని అనబడును. అందుచేత పరమేశ్వరి మహాజ్ఞాన స్వరూపురాలు. ఈ మహావిద్ అనబడే ఆత్మజ్ఞానము సాధకునికి కలుగగానే సకల అనర్థములు తొలగిపోవును.  అజ్ఞానకారకములైన అరిషడ్వర్గములు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు), ద్వైతభావన (జీవుడిని, దేవుడిని వేరుచేసి చెప్పు తత్వము) వంటి లక్షణములన్నియు   అనర్థములు అనబడును. 

మహావిద్యలు అనగా దశమహావిద్యలు. 

దశమహావిద్యలు అనగా పది మహావిద్యలు. 1. కాళికా దేవి, 2. తారా దేవి, 3. షోడశి (మహాత్రిపుర సుందరి), 4. భువనేశ్వరి, 5. త్రిపురభైరవీ దేవి, 6. ఛిన్నమస్తాదేవి, 7. ధూమావతీ దేవి, 8. బగళాముఖీ దేవి, 9. మాతంగీ దేవి, 10. కమలాత్మికా దేవి.

కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ|

భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా|

బగళా సిద్ధ విద్యా చ మాతంగీ కమలాత్మికా|

ఏతా దశ మహావిద్యా సిద్ధ విద్యాః ప్రకీర్తితా॥

1. శ్రీకాళీదేవి - (మంత్రం: ఓం క్రీం మహాకాళికాయై స్వాహా)

కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్తేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

2. శ్రీతారాదేవి - (మంత్రం: ఓం హ్రీం త్రీం హుంఫట్)

దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.

3. శ్రీషోడశీదేవి - (మంత్రం: ఐం హ్రీం శ్రీం)

అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో మూడవ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆ సాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

4. శ్రీ భువనేశ్వరీదేవి - (మంత్రం: హ్రీం)

దశ మహావిద్యలలో నాలుగవ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

5. శ్రీ త్రిపుర భైరవీ దేవి - (మంత్రం: హసైఁ హసరీం హసైఁ)

దశమహావిద్యలలో ఐదవ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమ తిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.

6. శ్రీ ఛిన్నమస్తాదేవి - (మంత్రం: శ్రీం హ్రీం క్లీం హుంఫట్ స్వాహా)

దశ మహావిద్యలలో ఆరవ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.

7. శ్రీ ధూమవతీ దేవి - (మంత్రం: ధూం ధూం ధూమావతి ఠః ఠః)

దశ మహావిద్యలలో ఏడవ మహావిద్య. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతి దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

8. శ్రీ బగళాముఖీ దేవి - (మంత్రం: హ్ల్రీం బగళాముఖీ హుంఫట్ స్వాహా)

దశమహావిద్యలలో ఎనిమిదవ మహావిద్య. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ బగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యాన్ని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

9. శ్రీ మాతంగీదేవి - (మంత్రం: ఓం శ్రీం హ్రీం క్లీం మాతంగ్యై హుంఫట్ స్వాహా)

దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య. మరకతపు వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవి కి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

10. శ్రీ కమలాత్మికాదేవి - (మంత్రం: శ్రీం జగత్ప్రసూత్యై స్వాహా)

పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో పదియవ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.

ఇక్కడ చెప్పిన దశమహావిద్యలు అమ్మవారి స్వరూపములే అయి యున్నవి. గనుకనే పరమేశ్వరి మహావిద్యా యని అనబడినది.

 సూచన: ఇక్కడ ఉదహరించిన మంత్రములు అనుష్ఠానపూర్వకంగా  గురువు సమక్షంలో మాత్రమే ఉపదేశంపొంది సాధనచేయవలెను. అట్లు కానిచో సాధన చేయరాదు)

ఇంతకుముందు ఆ పరమేశ్వరిని మహాసామ్రాజ్యశాలినీ అని స్తుతిస్తూ మహా అను రెండక్షరములకు గల ప్రభావమును ప్రస్తుతించుకున్నామ. మహా అనగా పరాకాష్ఠకు చెందిన గొప్పదనం, వైభవం, మంచిదనం, పరిపాలనా దక్షతాలక్షణాలను ఒకే ఒక పదం ఈరెండక్షరాలతో ఏర్పడింది. ఈ మహా అనే విశేషణానికి  ఆ జగజ్జనని అధిష్ఠాత్రి. 

అంతేనా?ఆ లక్షణం ఆ దశమహావిద్యల రూపంలో ప్రకటితమయినది. ఆ పదం ఉన్నతత్వాన్ని సంతరించుకుంది...అంతటి మహాపదం ఆ జగదీశ్వరికి గల విద్యకు అలంకరిస్తే ఆ విద్య మహావిద్య అయితే ఆ పరమేశ్వరియే ఆ మహావిద్యా స్వరూపిణి యై విరాజిల్లుతున్నది. అటువంటి మహావిద్యా స్వరూపురాలైన పరమేశ్వరికి పాదాభివందనం.

యోగ విద్యలో ఆత్మశక్తికి సంబంధించిన జ్ఞానంతోబాటు విశ్వవిజ్ఞానాన్ని గూడా జోడిస్తే ఆ విద్య మహావిద్య అయితే, అట్టి మహావిద్యా స్వరూపిణిగా మనలను అనుగ్రహించే పరమేశ్వరికి నమస్కారము.

అందుకని మహావిద్యా అని అమ్మను కీర్తించితే ఆ నామ మంత్రానికి అర్థం వ్యక్తిగత విశ్వగత జ్ఞానస్వరూపిణి అవుతుంది.

ఇంతకు ముందు అమ్మను ఆత్మవిద్యా అని స్తుతించాము. ఇప్పుడు ఈ నామ మంత్రంతో మహావిద్యా అని కీర్తించుతున్నాము. ఇకపైన శ్రీవిద్యా, కామసేవితా, శ్రీషోడశాక్షరీవిద్యా ఇలా దివ్య విగ్రహా అను నామం వరకూగల నామ మంత్రములలో బ్రహ్మవిద్యాదుల ఉపదేశ విశేషములు చెప్పబడతాయి.

మహావిద్యా స్వరూపిణి అయిన జగజ్జననికి నమస్కరించునపుడు ఓం మహావిద్యాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

585వ నామ మంత్రము 10.2.2022

ఓం శ్రీవిద్యాయై నమః

శ్రీవిద్యా (పదిహేను అక్షరములతో కూడిన శ్రీవిద్యా మంత్ర) స్వరూపిణి అయిన జగదీశ్వరికి  నమస్కారము. 

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి శ్రీవిద్యా అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం శ్రీవిద్యాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు ఆ తల్లి కరుణతో బ్రహ్మవిద్యా సంపన్నులగుదురు. ఇహమందు సుఖసంతోషములతో జీవించి, శ్రీవిద్యా మంత్రములోని పదిహేను అక్షరములు పరమపదమునకు పదిహేను ముక్తిసోపానములై సహస్రారమును దాటి బ్రహ్మపదమును పొందుదురు. 

ఇంతకు ముందు ఆత్మవిద్యా అను (583వ)  నామ మంత్రమునుండి, ఈ నామ మంత్రము మరియు దివ్యవిగ్రహా అను  (621వ) నామ మంత్రము వరకు ఆత్మవిద్య, మహావిద్య,బ్రహ్మ విద్యాదుల ఉపదేశ విశేషములు తెలియజేయ బడతాయి. 

విష్ణుపురాణంలో  యజ్ఞవిద్య, మహావిద్య, గుహ్యవిద్య, ఆత్మవిద్య యని నాలుగు చెప్పబడినవి. పరమేశ్వరియే నాలుగు విద్యలు. యజ్ఞవిద్య అనునది కర్మకాండలకు సంబంధించినది. మహావిద్య యనునది ఉపాసనకు సంబంధించినది. గుహ్యవిద్య అనగా మంత్రవిద్య. మంత్రములు రహస్యములు. గోప్యముగా నుంచవలసినవి. గనుక మంత్రవిద్యను గుహ్యవిద్య అని అంటారు. పరమేశ్వరి సర్వమంత్ర స్వరూపిణి. గుహ్యమగు పంచదశీవిద్య శ్రీవిద్యా యని అనబడుతుంది. ఈ చతుర్విద్యా (యజ్ఞవిద్య, మహావిద్య, గుహ్యవిద్య, ఆత్మవిద్యల) స్వరూపురాలు ఆ పరమేశ్వరి. ఇది మాత్రమేగాక తర్కశాస్త్రము, వేదత్రయము (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము), రాజనీతి, శిల్పశాస్త్రము, ఆయుర్వేదము మొదలగు విద్యలన్నియు ఆ పరమేశ్వరి యనియే విష్ణుపురాణమునందు చెప్పబడినది.

విద్య అనగా జ్ఞానము. ప్రత్యేకించి తంత్రము లో స్త్రీ దేవతలు (శక్తి దేవతల) కుసంబంధించిన మంత్ర, తంత్ర, యంత్ర సంబంధమైన
జ్ఞానము.  శ్రీ అనగా లలితా పరమేశ్వరి. శ్రీ అనగా త్రిపురసుందరి. శ్రీ విద్య అను    పరాశక్తి మూలమంత్రమే ఆత్మగా, మూలమంత్రమే తన శరీరంగా (88,89వ నామమంత్రములలో) వర్ణించ బడినది. అలాగే మూలమంత్రము (పదిహేనక్షరములలో) మొదటి క ఏ ఈ ల హ్రీం అను ఐదక్షరములు (వాగ్భవకూటము) అమ్మవారి వదనముగాను,  మధ్యనున్న  హ స క హ ల హ్రీం అను ఆరక్షరములు (కామరాజకూటము) అమ్మవారి కంఠము నుండి  కటి పర్యంతము గాను, చివరి స క ల హ్రీం నాలుగక్షరములు (శక్తికూటము) అమ్మవారి కటినుండి పాదముల పర్యంతముగాను వశిన్యాదివాగ్దేవతలు వర్ణించారు.

వర్ణమాల లోని అక్షరములు అన్నీ మంత్రములే. అన్నీ బీజాక్షరములే. ఒక్కో అక్షరానికి ఒక్కో శబ్దము. ఒక్కో శబ్దానికి ఒక్కో శక్తి. కాబట్టి శబ్దానికి, ధ్వనికి దివ్యమైన శక్తి వున్నది. ఆ శబ్దాన్ని పదే పదే మననం చేయడం మంత్రం. ఆ మంత్రాన్ని పదే పదే స్మరించడమే ఉపాసన.  భగవంతుడికి దగ్గరగా వుండటమే ఉపాసన. అంటే ప్రతి క్షణము గాలి పీల్చినప్పుడు, వదలి నప్పుడు కూడా పలుకడం. ధారగా పలుకడం. కన్ను మూసినా రామ, కన్ను తెరచినా రామ అని అనడం ఉపాసన. నోట్లో మంత్రము తిరుగుతూ వుండాలి.

అరణిని మథింప అగ్ని ఎట్లు జనించునో, అట్లు బీజాక్షరములతో గూడిన మంత్రమును పలుమార్లు జపించుట చేత శక్తి ఉద్బవిస్తుంది,
ఆ మంత్ర దేవత సాక్షాత్కారము కలుగుతుంది. అది ఉపాసన.

పంచ దశీ మహా మంత్రము

శ్రీవిద్యలో మంత్ర రాజము అని చెప్పబడేది పంచదశీ మహా మంత్రము. దీనిలో ఏ దేవత పేరు వుండదు.
కేవలం బీజాక్షరములే వుంటాయి. అలాగే శ్రీచక్రము లో ఏ దేవత పేరు గాని, మంత్రము గాని వుండదు.
కేవలము రేఖా నిర్మితమైనది. పరాశక్తికి మంత్ర రూపము పంచదశి అయితే యంత్ర రూపము శ్రీచక్రము.
పంచదశీ మహా మంత్రము మాయను పోగొట్టి పర బ్రహ్మమును ప్రకాశింప జేయును.
పూర్వ కాలములో ఈ పంచదశి మహా మంత్రమును విష్ణువు, శివుడు, బ్రహ్మ, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, కుమార స్వామి,
మన్మథుడు, ఇంద్రుడు, బల రాముడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు
మొదలగు వారు ఉపాసించి,  దేవీ ఉపాసకులు అయినారు. ఈ మంత్రమును దర్శించి ఈ లోకమునకు తెచ్చినవాడు మన్మథుడు.
ఈ మంత్రమునకు మూల పురుషుడు ఋషి - దక్షిణామూర్తి.
పంచదశి మహా మంత్రము మూడు భాగములుగా వుంటుంది.
మొదటది ప్రధమ ఖండము. దీనిని వాగ్భవ కూటము అని అందురు. రెండవది కామరాజ ఖండము,
మూడవది శక్తి ఖండము, ప్రతి ఖండము తరువాత ప్రాణ శక్తి అయిన హ్రీం కార బీజము వుంటుంది.
మూడు హ్రీం కారములను  వరుసగా బ్రహ్మ గ్రంధి, విష్ణు గ్రంధి, రుద్ర గ్రంధి అని అందురు.
మొదటి ఖండము ఋగ్వేదాత్మకము అని, రెండవ ఖండము యజుర్వేదాత్మకము అని, మూడవ దాన్ని సామ వేదాత్మకము అని అందురు.
అజ్ఞానము పోగొట్టి, బుద్ధిని వికసింప జేసి, బ్రహ్మ జ్ఞానమును కలుగ జేసే మహా మంత్రము ఇది.
దూర్వాస మహా ముని ఉపాసన చేసిన మహా మంత్ర మిది.

శ్రీవిద్యకు అనుబంధముగా మరికొన్ని నామ మంత్రములు ఇంతకు ముందే పరిశీలించినవి మరియొకసారి

1. 85వ నామ మంత్రము ఓం శ్రీమద్వాగ్భకూటై. స్వరూప ముఖపంజాయై నమః వాగ్భవకూట రూపమైన ముఖపద్మముతో తేజరిల్లు తల్లికి నమస్కారము.

పంచదశీవిద్యలో మొదటి ఐదు అక్షరములను వాగ్భవకూటం అంటారు. ఈ ఐదు అక్షరములు అమ్మ సూక్ష్మరూపంలోని ముఖపంకజమును సూచిస్తుంది.

2. 86వ నామ మంత్రము ఓం కంఠాదఃకటి పర్యంత మధ్యకూట స్వరూపిణ్యై నమః

కంఠం క్రిందినుండి నడుమువరకూ ఉన్న కామరాజ కూటము ను తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము. పంచదశీ విద్యలో మధ్యనున్న ఆరు అక్షరములను కామరాజ కూటం అంటారు. ఈ కూటమును అమ్మ సూక్ష్మతర రూపాన్ని సూచిస్తుంది.

3. 87వ నామ మంత్రము ఓం శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణ్యై నమః

 నడుము నుండి పాదముల వరకుగల శక్తి కూటమును ధరించి ఉన్న తల్లికి నమస్కారము.

పంచదశీవిద్యలో చివరి నాలుగక్షరములును శక్తికూటం అంటారు. ఈ కూటము శ్రీమాతయొక్క సూక్ష్మతర రూపాన్ని సూచిస్తుంది.

4. 88వ నామ మంత్రము ఓం మూలమంత్రాత్మికాయై నమః. సర్వానికి మూలమైన పంచదశాక్షరీ మంత్రమే (కూటములన్నీ - వాగ్భవకూటము, మధ్యకూటము, శక్తి కూటము) ఆత్మస్వరూపంగా గల తల్లికి నమస్కారము.

5. 89వ నామ మంత్రము ఓం మూలకూటత్రయ కళేబరాయై నమః మూలమంత్రమైన పంచదశాక్షరీలో కూటములన్నీ (వాగ్భవకూటము, మధ్యకూటము, శక్తి కూటము) తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము.

శ్రీవిద్యా స్వరూపిణి అయిన తల్లికి నమస్కరించునపుడు ఓం శ్రీవిద్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

586వ నామ మంత్రము 11.2.2022

ఓం కామసేవితాయై నమః

మహా కామేశునిచే సేవింపబడిన పరమేశ్వరికి నమస్కారము.

మన్మథునిచే పూజింపబడిన జగన్మాతకు నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి కామసేవితా అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం కామసేవితాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు ఉపాసకులకు అభీష్టములను సిద్ధింపజేయును,  శ్రీవిద్యోపాసనయందు మనసు నిర్మలముజేసి పరమపదమునకు శ్రీవిద్యోపాసనా సోపానములపై నడిపించి తరింపజేయును.

కామేశ్వరుడు (శివుడు), కామేశ్వరి (పరాశక్తి) ఒకరికోసం ఒకరు తపస్సునాచరించి, ఆ తపస్సువలన చిక్కిశల్యమై, వారి రెండు శరీరములు ఒక్కటై అర్థనారీశ్వరులయ్యారని శివానందలహరిలో ప్రథమశ్లోకంలో ఆదిశంకరులు ఇలా చెప్పారు

కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః|

ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే|

శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున|

ర్భవాభ్యామానన్ద స్ఫురదనుభవాభ్యాం నతిరియమ్॥1॥

పార్వతీ పరమేశ్వరులు సకల కళలస్వరూపులు. ఇరువురికి శిరసున శశాంకములు (చంద్రరేఖలు) ఉన్నవి. పరస్పరము ఒకరి తపస్సునకు మరియొకరు ఫలముగా లభించినవారు. భక్తులకు విశేషముగా వరములను ప్రసాదించువారు, పరమ మంగళ స్వరూపులు, త్రిభువనములకును విశేషముగా శుభములను కలుగజేయువారు, నా హృదయమునందు మరలా మరలా దర్శనమిచ్చువారు, నిరంతరమూ ఉప్పొంగుతున్న ఆనంద స్థితిని అనుభవించువారు. 

పై శ్లోకంలో శివుడు తనకోరికమేరకు శ్రీమాతను సేవించాడు అని చెప్పబడుటచే. కామునిచే  (శివునిచే) సేవింపబడిన ఆ తల్లి  కామసేవితా అని నామమును పొందినది.

పరాశక్తిపై శివునికి ప్రేమను ప్రేరేపించుటకు మన్మథుడు సుమబాణమువేయగా, తపస్సు భంగమయిన శివుని కోపాగ్నికి తన మూడవ కంటిమంటలో మన్మథుని భస్మము చేయగా రతీ దేవి వైధవ్యాన్ని తొలగింపజేసి మన్మథుని సజీవుని జేసిన పరాశక్తిని రతీమన్మథులు ఇద్దరూ పూజించారు కనుక అమ్మవారు కామపూజితా (అనగా మన్మథునిచే సేవింప బడినదని) అను నామముతో ప్రసిద్ధమైనది.

శ్రీవిద్యోపాసకులు పదునాలుగుమందిలో మన్మథుడు ఒకడు. మన్మథుడు ఉపాసించిన మంత్రాలను మన్మథుద్ధార విద్య అని అంటారు. ఈ విద్య మంచి ప్రచారమునందినది. అమ్మవారిని ఎన్నో కోరికలతో ఆరాధిస్తారు. వారినే కామకులు అనగా కోరికలు గలవారు అంటాము - వారు వరదా, కామదాయినీ, కల్పవల్లీ, వాంఛితార్థప్రదాయినీ అను పలునామాలతో స్తుతిస్తారు. . కావున ఈవినంగా కుడా శ్రీమాత కామసేవితా అను నామమునకు సార్థకత చెందియున్నది.

శ్రీవిద్యోపాసకులు

శ్రీవిద్యోపాసకులు మొత్తం పద్నాలుగు మంది ప్రధానంగా ఉన్నారు. కొందరు పన్నెండు అంటారు కానీ మరొక ఇద్దరిని కూడా ప్రముఖంగా తీసుకొచ్చి పధ్నాలుగురు గురించి మానసోల్లాస గ్రంథం చెప్పింది. శ్రీవిద్యను మనదాకా తీసుకువచ్చిన మహానుభావులు వీరు. వీళ్ళందరూ కూడా దేవతా స్థాయి వాళ్ళు. మానవ స్థాయిలో ఉన్న ఋషులు చాలామంది ఉన్నారు. ఆది శంకరులు మొదలైన వారెందరో గలరు. కానీ దేవతలకు సంబంధించిన మనం వారిని సిద్ధ్యౌఘ, దివ్యౌఘ, పాదౌఘ అని కూడా అంటూంటాం. ఇలా అనేకమంది ఉన్నారు. కానీ ప్రధానంగా పద్నాలుగు మంది. వీరిని ఎప్పుడూ తలంచుకోవాలి. వీళ్ళు శ్రీవిద్య ఉపాసన వల్ల శక్తి పొంది జగద్రచన చేస్తారు. వాళ్ళు ముందుగా శివుడు - ఆయనొక పెద్ద భక్తుడు. అందుకే శివారాధ్యా అని అమ్మవారిని అంటున్నాం. ఇంకను విష్ణువు, బ్రహ్మ, మనువులు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, మన్మథుడు - మన్మథుడు ఉపాసించిన శ్రీవిద్యే మనకు ప్రసిద్ధి. ఇప్పుడు మనం చేస్తున్న పంచదశీ విద్య అంతా మన్మథుడు చేసినదే. వీళ్ళు ఎలా ఉపాసించారు అన్నది మనకు తెలియదు. వాళ్ళయొక్క మంత్రవిద్యలు వేరు. వాళ్ళందరూ అమ్మను ఉపాసించారు అని తెలుసు కానీ వాళ్ళ పద్ధతులు ఏవో మనకు తెలియవు. మనం ఉపాసిస్తున్నది మన్మథ విద్య - కామరాజ విద్య. అదే  ఆత్మ విద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా. అమ్మ ఇచ్చాశక్తి స్వరూపిణి కదా! ఆవిడ అనుగ్రహం లేకపోతే మన్మథుడు ఈ ప్రపంచాన్ని   నడుపలేడు. 

ఇదే విషయాన్ని శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు ఆరవ శ్లోకంలో ఇలా అన్నారు:

ధనుః పౌష్పం మౌర్వీ - మధుకరమయీ పంచ విశిఖాః

వసంతః సామంతో - మలయమరు-దాయోధన-రథః |

తథాప్యేకః సర్వం -  హిమగిరిసుతే కామపి కృపాం

అపాంగాత్తే లబ్ధ్వా - జగదిద-మనంగో విజయతే॥6॥

ఓ జగదీశ్వరీ! ఆ మన్మధుడు ఈ జగత్తుని జయిస్తున్న తీరు చూస్తే చాలా ఆశ్చర్యము కలుగుతుంది. ఎందుచేతననగా అతడు ఏమాత్రం పెద్ద బలము, బలగముగాని లేనివాడు. అతని ధనుస్సు పూలదండే కర్రగా కలిగినది. దాని నారిచూస్తే తుమ్మెదలన్నీ వరుసగా నిలబడితే ఏర్పడిన తాడు అది. ఇక బాణములా ఎక్కువ లేవు అయిదే అయిదు అవికూడా మృదువైన పుష్పబాణములు (పంచతన్మాత్రలు మాత్రమే). అతని సామంతుడు, చెలికాడు అయినవాడు ఏడాదికి రెండునెలలు మాత్రమే ఉండు జడమైన వసంతుడు. అతని రథము - కొండలమీదనుండి వచ్చు సుగంధములే అతని రథము. అంతటి బలహీనుడు లోకాలను ఎలా జయించగలడు?
పైగా ధారుఢ్యమైన అంగములు లేనివాడు.  బలవంతుడా అంటే అసలు దేహమేలేనివాడు (అనంగుడు) ఆ మన్మథుడు. అట్టి బలహీనుడు ఈ లోకమును ఎట్లు జయిస్తున్నాడంటే! ఇదంతా ఆ మన్మథుడు నీ పాదపద్మములను కొలుచుటవలన మాత్రమే గదా!
నీవు నీ చల్లని దయాదృష్టిని అతనిపై ప్రసరింపచేయుటవలన తప్ప వేరు కారణము కానేకాదు. నీ దయాదృష్టి పొందినవాడు అల్పుడైననూ మహాబలుడు కాగలడు గదమ్మా!

మన్మథుడు అంగములు లేనివాడు (అనంగుడు) ఎలా అయాడు?

ఇంద్రుడు మరియు ఇతర దేవతలను తారకాసురుడు బాధించసాగెను. బ్రహ్మ ఇచ్చిన వరముల మూలంగా శివుని కుమారుడు తప్ప వేరొకరు మరెవ్వరూ వధించలేరు. కాని అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు. పార్వతి శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని (శివునికి పార్వతిపై మరులు గొలుపుట యను బృహత్కార్యము) మన్మథుడు చేయగలడని పంపిస్తాడు. మన్మథుడు వసంతుని సహాయంతో శివునిపై పూల బాణంతో మేల్కొలుపుతాడు. కోపించిన శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు.

వసంతుని ప్రభావం మీద పార్వతిని చేరిన శివుడితో, మన్మథుని బ్రతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు. అనంగుడైన మన్మథునికి చిత్తము, వ్రేళ్ళు, మెడ, జిహ్వ లేని వాడాయెను. చిత్తము లేదు గాని మన్మథునికి చైతన్యము గలదు. పరమేశ్వరి అనంగుడు, అంధుడైన మన్మథునికి శ్రీవిద్యను ప్రసాదించెను. మన్మథుడు జిహ్వలేనివాడైనను శ్రీవిద్యను ఆస్వాదించెను. లోకానికి తెలియజేసెను. మన్మథుడే శ్రీవిద్యకు మంత్రద్రష్ట (మొదట తెలిసికొనినవాడు) అగుటచే, శ్రీవిద్యా మంత్రమునకు మన్మథుడే ఋషి అయ్యెను. శ్రీచక్రార్చన చేయునపుడు ఋషిని తెలియకుంటే శ్రీచక్రార్చనయందు ప్రవేశించకూడదు. మంత్రద్రష్ట ఎవరో తెలయకుండా శ్రీచక్రార్చనయందు ప్రవేశించాలి అంటే శివశక్తి సామరస్యము (శివశక్తుల ఏకత్వము) తెలిసికొని శ్రీచక్రార్చనయందు ప్రవేశించవలెను. ఇది మన్మథుని వ్రతము అని అరుణోపనిషత్తులో చెప్పబడినది. నిరృతి అనగా లక్ష్మీదేవి. లక్ష్మీదేవి పుత్రుడు వైదేహః అనగా దేహము లేని అనంగుడు. మన్మథుడే మంత్రద్రష్ట ఋషియని తెలిసిన తరువాత బాహ్యపూజయగు శ్రీచక్రార్చనమందు ప్రవర్తించవలెను. పూజ చేయువారు ఆడంబరములు చేయరాదు.  మన్మథుడు రూపహీనునిగా (అనంగునిగా) పునర్జీవితుడయినవాడైనను. అతని భార్య రతీదేవికి మాత్రం రూపము గలవానిగా కనిపిస్తాడు.

మహాకామేశ్వరుడు (శివుడు) అందరికన్నా ప్రథమ శ్రీవిద్యోపాసకుడు (పరమేశ్వరిని ఆరాధించినవాడు). గనుక పరమేశ్వరి కామసేవితా యని అనబడినది.

జగన్మాత దేవతలచే సేవింపబడిన వైనమును వశిన్యాది వాగ్దేవతలు   సహస్రనామములలో ఉదహరిస్తూ కీర్తించారు. అట్టి నామ మంత్రములలో కొన్ని :-
 
1. 84వ నామ మంత్రము ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధ్యై నమః

శివుని నేత్రాగ్నిచే బూడిదైన మన్మథుణ్ణి మరల బ్రతికించి అతని పాలిట సంజీవనైషధియై ఒప్పారిన పరమేశ్వరికి నమస్కారము.

ఇక్కడ మన్మథు (కాము) నిచే సేవింపబడినది గనుక కామ సొవితా అని శ్రీమాత సార్థకనామధేయురాలైనది.

2.231వ నామ మంత్రము ఓం మహాభైరవపూజితాయై నమః

మహాభైరవుని చేత అనగా శివునిచే పూజింపబడు పరమేశ్వరికి నమస్కారము.

3. 375వ నామ మంత్రము ఓం కామపూజితాయై నమః

మన్మథునిచే పూజింపబడు జగన్మాతకు నమస్కారము.

4. 406వ నామ మంత్రము ఓం శివారాధ్యాయై నమః

 శివునిచే ఆరాధింపబడు పరమేశ్వరికి నమస్కారము.

5. 989వ నామ మంత్రము ఓం వాంఛితార్థ ప్రదాయిన్యై నమః

భక్తులు కోరిన కోర్కెలనన్నిటినీ తీర్చుతల్లికి నమస్కారము.
 
అటు వంటి శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం కామసేవితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

587వ నామ మంత్రము 12.2.2022

ఓం  షోడశాక్షరీవిద్యాయై నమః

సకల మంగళప్రదమైన పదహారు అక్షరముల మంత్ర (షోడశాక్షరీ) విద్యా స్వరూపిణి అయిన పరాశక్తికి నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి శ్రీషోడశాక్షరీవిద్యా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం శ్రీషోడశాక్షరీవిద్యాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులు ఆ పరమేశ్వరి కరుణతో శ్రీవిద్యా తత్త్వాన్ని గ్రహించి, బ్రహ్మజ్ఞానసంపన్నులై ఆ పరమేశ్వరి భక్తస్వరూపులు జీవించి తరిస్తారు.

పంచదశి మంత్రమునకు పదునైదు బీజాక్షరములు ఉండును. షోడశాక్షరి అనగా పదహారు బీక్షరములు. శ్రీ షోడశాక్షరీ యనగా శ్రీం యను బీజాక్షరమును చేర్చిన పంచదశీ మంత్రము షోడశాక్షరీ మంత్రము అని యనబడుతుంది. షోడశాక్షరీ మంత్రము శ్రీవిద్యలో చాలా ప్రధానమైనది. దీనిని శుద్ధవిద్య అనికూడా అంటారు. 

అమ్మవారు శ్రీవిద్యా స్వరూపిణి. శ్రీవిద్యకు ప్రధానమైన మంత్రము షోడశాక్షరి. శ్రీ యనగా సర్వమంగళకరము. అమ్మవారు సర్వమంగళ స్వరూపిణి. గనుక శ్రీవిద్యాస్వరూపిణియైన అమ్మవారు  శ్రీషోడశాక్షరీవిద్యా యని అనబడినది.

మన్మథుడు ఉపాసించిన పంచదశీ మంత్రమునకు చివర శ్రీం చేర్చిన అది షోడశి అవుతుంది.

పంచదశి 

క ఏ ఈ ల హ్రీం| హ స క హ ల హ్రీం| స క ల హ్రీం 

షోడశి

షోడశి రెండ విధాలు. ఒకటి పంచదశికి చివరలో శ్రీం చేరిస్తే షోడశి అవుతుంది. 

క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం శ్రీం (పదహారు బీజాక్షరములు.)

రెండోరకం ఉంది అందులో ఇరువది ఎనిమిది బీజాక్షరాలుంటాయి. అందులోనూ పంచదశి ఒక భాగమే కాని మొత్తం పంచదశిని మూడు కూటాలుగా చేసి ఒక్కొక్క కూటమిని ఒక్కొక్క బీజాక్షర సమానంగా పరిగణిస్తారు.  ఇంకా పదిహేను బీజాక్షరాలు వెనుక ముందు ఉంటాయి. 

అది ఎలాగ అంటే: శ్రీం హ్రీం క్లీం ఐం సౌః అనునవి శక్తి ప్రణవాలు. వీటినే పంచప్రణవములు అంటారు.

1. శ్రీం హ్రీం క్లీం ఐం సౌః అను ఈ పంచప్రణవములకు ఓం హ్రీం శ్రీం  అను మూడు బీజాక్షరములను చేర్చగా ఎనిమిది బీజాక్షరములు ఔతాయి.

2. పిదప పంచదశిలోని మొదటి కూటమి ఐన క ఏ ఈ ల హ్రీం చేర్చవలెను. (ఈ ఐధు బీజాక్షరములను ఒక బీజాక్షరముగా భావించవలెను)

3. తదుపరి పంచదశిలోని రెండవ కూటమి అయిన హ స క హ ల హ్రీం చేర్చవలెను (ఈ ఆరు బీజాక్షరములను ఒక బీజాక్షరముగా భావించవలెను).

4. తరువాత పంచదశిలోని మూడవ కూటమి అయిన స క ల హ్రీం చేర్చవలెను (ఈ నాలుగ బీజాక్షరములను ఒక బీజాక్షరముగా భావించవలెను).

5. పంచప్రణవములను (శ్రీం హ్రీం క్లీం ఐం సౌః) విలోమముగా అనగా (చివరినుండి మొదటికి) సౌః ఐం క్లీం హ్రీం శ్రీం చేర్చవలెను.

అలా చేర్చితే షోడశి ఈ విధంగా ఏర్పడుతుంది.

శ్రీం హ్రీం క్లీం ఐం సౌః  ఓం హ్రీం శ్రీం (ఇవి ఎనిమిది బీజాక్షరములు)

క ఏ ఈ ల హ్రీం| హ స క హ ల హ్రీం| స క ల హ్రీం| (ఈ మూడు కూటములను మూడు బీజాక్షరములు గా భావించవలెను)

సౌః ఐం క్లీం హ్రీం శ్రీం॥ (ఇవి ఐదు బీజాక్షరములు)

అలా అయితే ప్రారంభంలో ఎనిమిది (8), మధ్యలో పంచదశి మూడుకూటములు మూడు బీజాక్షరములు (3), చివరలో విలోమముగా చెప్పిన పంచ ప్రణవములు ఐదు (5)

అంటే షోడశీ మంత్రానికి రెండు విధములు ఒకే విధముగా   8 + 3 + 5 = 16 బీజాక్షరములు ఉండును. అలాకాకుండా విడిగా తిలకిస్తే ఇరువది ఎనిమిది (28) అక్షరములు  ఉండును.

శ్రీం హ్రీం క్లీం ఐం సౌః  ఓం హ్రీం శ్రీం|
క ఏ ఈ ల హ్రీం| హ స క హ ల హ్రీం| స క ల హ్రీం| సౌః ఐం క్లీం హ్రీం శ్రీం॥ 

మహాషోడశి

రెండవ పద్ధతిలో చెప్పిన ఇరువది ఎనిమిది (28) బీజాక్షరముల షోడశికి ముందు ఓం చివర నమః చేరిస్తే అది 30 బీజాల మహా షొడశి ఔతుంది.

ఓం
శ్రీం హ్రీం క్లీం ఐం సౌః  ఓం హ్రీం శ్రీం|
క ఏ ఈ ల హ్రీం| హ స క హ ల హ్రీం| స క ల హ్రీం| సౌః ఐం క్లీం హ్రీం శ్రీం
నమః (ఇది మహా షోడశి)

ఈ ప్రక్రియను మొత్తం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ పరమేశ్వరి కరుణ నిశ్చయంగా సంప్రాప్తమౌతుంది అనడానికి సందేహంలేదు.

షోడశి మంత్రంలోని పదహారు బీజాక్షరములకు, ప్రతి బీజాక్షరములోను శివశక్తులు ఇమిడి  ఉంటాయి. అనగా పదహారు బీజాక్షరములు పదహారు జతలు చూడగా ముప్పది రెండు ఔతుంది. ఈ ముప్పది రెండు అమ్మవారి నోటిదంతములు. శుద్ధవిద్యాంకురములు. షోడశీమంత్రస్వరూపిణి అయిన అమ్మవారు మనకు గోచరిస్తుంది. 

శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా అను ఇరువది ఐదవ (25వ) నామ మంత్రము జ్ఞప్తికి వస్తుంది.

 ఆ షోడశాక్షరీ విద్యా రూపిణి ని  ఇలా ప్రార్థిస్తాము  - పరాశక్తీ! శ్రీరాజరాజేశ్వరీ! మాయాశక్తివి;  ఆత్మశక్తివి; నీవే అవ్యక్త; మహత్తత్త్వ అహంకారములు నీవే! శ్రీమాతా! అర్ధనారీశ్వరాత్మకవు; పార్వతీ పరమేశ్వరాత్మకవు; వాణీ హిరణ్యగర్భాత్మకవు; లక్ష్మీనారాయణాత్మకవు; అగ్నీషోమాత్మకవు; పృథివ్యాది పంచభూతాత్మకవు; ప్రతిబింబరూపమున బ్రహ్మగ్రాహక పదార్థమ వైతివి; నాయందలి అవిద్యను పోగొట్టుము. అజ్ఞానమును నివర్తింపజేయుము. నా నిజస్వరూపమును మఱుగుపడిన యథార్థతత్త్వమును ప్రకాశింపచేయుము. నాకు బ్రహ్మాపరోక్ష వృత్తిని కలుగజేసి నీ సాయుజ్యమునిచ్చి కాపాడుము.

ఆ తల్లికి నమస్కరించు నపుడు ఓం శ్రీషోడశాక్షరీవిద్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

588వ నామ మంత్రము 13.2.2022

ఓం  త్రికూటాయై నమః

 మూడు కూటములుగా ఉన్న పంచదశీ మంత్ర స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి త్రికూటా అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం త్రికూటాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు ఉపాసకులు ఆ శ్రీమాత కరుణచే సర్వశ్రేష్ఠమైన పంచదశీమంత్ర ప్రభావసంపన్నులై, బ్రహ్మతేజస్సుతో వెలుగొందుచు, పలువురికి బ్రహ్మతత్ప్వమును బోధజేస్తూ గురుస్వరూపులై విలసిల్లుతారు.

పరమేశ్వరి మూలమంత్రాత్మికా అనగా మూలమంత్రమే తనస్వరూపంగా, ఆమె ఆత్మగా విరాజిల్లుచున్నదని అర్థము. మూలము అనగా ఆధారము, ముఖ్యము, సరళము ఇత్యాది భావాలను గ్రహింఛి శ్రీమాత  సంబంధమైన శ్రీవిద్య, అనగా కుండలినీ శక్తి విద్యయే అన్ని మంత్రములకంటె సులభము, సరళము అగుటచే శ్రీవిద్యయే మూలమంత్రము అవుతుంది. ఈ మూలమంత్రము పదిహేను బీజాక్షరసంయుతము. ఏ మంత్రమైనా మూడుగా విభజించగలిగితే ఆ మూడు భాగాలను మూడుకూటములుగా  గ్రహించదగును. అలాగే ప్రస్తుతం అమ్మవారికి సంబంధించిన పంచదశాక్షరీ మంత్ర బీజాక్షరములను కూడా మూడు భాగాలు కలిగిన శరీరంగా ఊహిస్తే - ఆ శరీరానికి, అమ్మవారి స్థూలశరీరానికి భేదం లేదని గుర్తించదగును.  మూలమంత్రము యొక్క కూటత్రయమే శ్రీమాత యొక్క సూక్ష్మశరీరము. వాగ్భవకూటము బీజము; కామరాజ కూటము కీలకము; శక్తి కూటము శక్తి అని తెలియదగును. కామకళ యందలి ఊర్ధ్వ బిందువు - మధ్య బిందువు -  నాద బిందువులను కూటత్రయము అందురు. వేదమాతయగు శ్రీగాయత్రియు - త్రిపదా గాయత్రి యనియు - తురీయ పాదమనియు అధికారి భేదాన్ని బట్టి ఉపాసనలో గలుదు. సమిష్టి గాయత్రీ మంత్రము శ్రీపరమేశ్వరికి స్థూలశరీరము, శ్రీవిద్య సూక్ష్మశరీరము. పంచదశ బీజములలో శ్రీ బీజము ప్రధానమైనది గనుక పరమేశ్వరి శ్రీవిద్యా అనబడుచున్నది. పంచదశీ మంత్రములో గల మూడు కూటములు వాగ్భవకూటము, కామరాజకూటము, శక్తికూటము అన్నాము. పరమేశ్వరి స్థూలశరీరమందు శిరస్సునుండి కంఠము వరకు పంచదశీ మంత్రమందు - క, ఏ, ఈ, ల, హ్రీం - ఈ ఐదక్షరములు వాగ్భవకూటము  (క అను అక్షరముతో ప్రారంభమయినది గనుక కాది కూటము అని కూడా ) అందురు, హ, స, క, హ, ల, హ్రీం  ఈ ఆరు అక్షరములు కామరాజకూటము  (హ అను అక్షరముతో ప్రారంభమయినది గనుక హాది కూటము అని కూడా)  అందురు ,  స, క, ల, హ్రీం ఈ నాలుగక్షరములు శక్తికూటము   (స అను అక్షరముతో ప్రారంభమయినది గనుక సాది కూటము అని కూడా ) అందురు. మరియు బ్రహ్మ, విష్ణు, రుద్రులు సత్వరజతమస్సుయను గుణములు. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అని అవస్థలు. మంత్రశాస్త్రము ననుసరించియున్న బీజము, శక్తి, కీలకములలో కూటములుండునని చెబుతారు. పంచదశీ మంత్రములో గల వాగ్భవ, కామరాజ, శక్తి మూడు కూటములు పరమేశ్వరి స్వరూపమగుటచే అమ్మవారిని త్రికూటా అన్నాము.

జగన్మాతను శ్రీవిద్యా స్వరూపిణిగా స్తుతిస్తూ లలితా సహస్రనామావళిలోని ఇంకా కొన్ని నామ మంత్రములు

1. 85వ నామ మంత్రము ఓం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజాయై నమః

వాగ్భవకూట రూపమైన ముఖ పద్మముతో తేజరిల్లు తల్లికి నమస్కారము. పంచదశీ విద్యలో మొదటీ ఐదక్షరములను వాగ్భవకూటం అంటారు. ఈ కూటము శ్రీమాత యొక్క సూక్ష్మ రూపాన్ని సూచిస్తుంది

2. 86వ నామ మంత్రము ఓం కంఠాదః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణ్యై నమః

కంంఠం క్రింది నుండి నడుము వఱకూ ఉన్న కామరాజకూటమును తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము. పంచదశీ విద్యలో మధ్యలోని ఆరు అక్షరములను కామరాజకూటము అంటారు. ఈ కూటము శ్రీమాత యొక్క సూక్ష్మతర రూపాన్ని సూచిస్తుంది.

3. 87వ నామ మంత్రము ఓం    శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణ్యై నమః

పంచదశీ విద్యలో చివరి నాలుగక్షరములను శక్తి కూటము అంటారు. ఈ కూటము శ్రీమాతయొక్క సూక్ష్మతర రూపాన్ని సూచిస్తుంది.

4. 88వ నామ మంత్రము ఓం  మూలమంత్రాత్మికాయై నమః 
మంత్రములన్నిటికీ సర్వోత్తమమైన పంచదశాక్షరీ మంత్రమే (మూఢు కూటములు కలిపి) ఆత్మ స్వరూపంగా గల తల్లికి నమస్కారము.

5. 89వ నామ మంత్రము ఓం మూలకూటత్రయ కళేబరాయై నమః

మూల మంత్రమైన పంచదశాక్షరిలో కూటములన్నీ తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము.

6. 585వ నామ మంత్రము ఓం శ్రీవిద్యాయై నమః

శ్రీవిద్యా(పదిహేను అక్షరములతో కూడిన అయిన శ్రీవిద్యా మంత్ర) స్వరూపిణి అయిన జగదీశ్వరికి  నమస్కారము.

అమ్మవారికి నమస్కరించునపుడు ఓం త్రికూటాయై నమః అనిఙ అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

589వ నామ మంత్రము 14.2.2022

 ఓం ఐం హ్రీం శ్రీం కామకాటికాయై నమః

 శివశక్తులిద్దరి సామరస్యమును పొందిన పరబ్రహ్మరూపిణియైన జగన్మాతకు నమస్కారము

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి కామకోటికా అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం కామకోటికాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు సమస్త బాధలు తొలగిపోవును మరియు ఆ తల్లి దృష్టులు ప్రాప్తించి శాశ్వతమైన బ్రహ్మానందమును, మోక్షపదము ప్రాప్తమగును.

చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షములలో కామమునకు అగ్రము లేదా అంచున ఉన్నది మోక్షము. కాబట్టి  కామకోటికా అంటే మోక్షము అని అర్థముగా భావించదగును. పరాశక్తి మోక్షస్వరూపిణి అని కూడా భావించదగును. కాముడు అంటే శివుడు కాబట్టి కామకోటికా అంటే శివుణ్ణి అవధిగా గలిగినది అని కూడా భావించదగును

పురుషార్థములు

చతుర్విధ పురుషార్థాలు: ధర్మార్థకామమోక్షాలు (ధర్మం, అర్థం, కామం, మోక్షం).

పురుషార్ధాలు అంటే వ్యక్తికి కావలసినవి. హిందూమతం సంప్రదాయంలో అందరికీ అవసరమైన నాలుగు విషయాలు తరచు ప్రస్తావింప బడుతాయి. అవి

ధర్మము : మత లేక సామాజిక నియమాలకు కట్టుబడి జీవించడము. నీతి, విద్య అనికూడా అన్వయించవచ్చును.
అర్థము: ధన సంపాదన, కీర్తి.

కామము : శారీరక లేక ఇంద్రియ లేక లౌకిక సుఖాలు.
మోక్షము : పునర్జన్మ రాహిత్యము లేక సంసారచక్రము నుండి విడుదల.
ఆశ్రమ ధర్మాలు అనికూడా వీటిని చెబుతుంటారు. మొదటి మూడూ గృహస్తాశ్రమ ధర్మాలు అనగా గృహస్తులు పాటించవలసిన ధర్మాలు. వ్యక్తి ధర్మానికి బద్ధుడై ధనాన్ని సంపాదించాలనీ, తద్వారా సుఖాలు అనుభవించాలనీ అంటారు. కనుకనే ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి అని పెళ్ళిలో ప్రమాణం చేయంచబడుతుంది.

తరువాత వానప్రస్థాశ్రమం లో భార్యా భర్తలు కలసి వుంటూనే లౌకిక భోగాలకు దూరంగా ఉండి మోక్షార్ధులై జప తపాదులు నిర్వహించవచ్చును. అయితే సన్యాసం తీసుకొన్నవారు సంసారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. మోక్షమును పొందాలంటే కామము అనగా కోరిక, ధనసంపాదన ధర్మయుక్తముగా ఉండాలి. సన్యాస ధర్మము అనగా మోక్షమును మాత్రము కోరుతూ మిగిలిన మూడు పురుషార్థాలను త్యాగము చెయ్యడము. గృహస్థుడు కూడా కాలాంతరములో దీనిని పొందుతాడు. అంతేకాక కొందరు మనుషులు పూర్వజన్మల సంస్కారాల వలన ప్రస్తుతము ఏ దశలో ఉన్నప్పటికీ వెంటనే సన్యాసస్థితిని పొందుతారు.


మోక్షము

ప్రతి మనిషి పునురపి జననం పునరపి మరణం లేనటువంటి మోక్షమును కోరుకుంటాడు. దానికై అనేక మార్గములు అనే్వషిస్తాడు. నిష్మర్మ, నిష్కామములు కలిగి వుండుటకు ప్రయత్నిస్తాడు. మానవుడు ఆశించే ముక్తి మూడు విధాలంటారు.సద్యోముక్తి, క్రమముక్తి , శుద్ధముక్తి.
సద్యోముక్తి అనగా కొంత అభ్యాసముతో ఎక్కువ కాలయాపన లేకుండా బ్రహ్మమునందు లీనమగుట. పరమ శాంతిని పొందుటకు కర్మను పరిత్యజించి యోగులు శరీరమును విడచే క్రమమును సద్యోముక్తి అంటారు. సద్యోముక్తి అంటే తక్షణమే తడవు లేకుండా ముక్తి పొందుట. మడమతో మూలాధార చక్రమును నొక్కియుంచి ప్రాణవాయువను బిగపట్టవలెను. ఆ ప్రాణవాయువును నాభికి దగ్గరగా వుండే మణిపూరక చక్రమునకు తీసుకుని పోవాలి. అక్కడనుంచి ప్రాణవాయువును హృదయమునకు దగ్గరగా వుండే అనాహత చక్రమునకు తరలిస్తాడు. అనాహత చక్రమునుండి కొద్దిగా పైభాగంలో వుండే విశుద్ధ చక్రమునకు అచటనుండి నుదుటికి సమీపంలో వుండే అజ్ఞాచక్రమునకు తరలిస్తాడు. ఇదంతా అభ్యాసం ద్వారా సమకూరుతుంది. ఇటువంటి స్థితిలో ఎన్నో అద్భుత శక్తులు సంప్రాప్తించవచ్చు. కాని వాటిపై ధ్యాస నిలపక నాసిక, నోరు వంటి ద్వారములను బంధించి ఇంద్రియాలతో తనకు యున్న బంధాలను తొలగించుకుంటూ బ్రహ్మద్వారమును ఛేదించుకుని పరబ్రహ్మతో లీనమవుతాడు. బుద్ధిని జీవాత్మలోను, జీవాత్మను శుద్ధాత్మలోను శుద్ధాత్మను పరమాత్మలోను లీనం చేయడం ద్వారా ఈ సద్యోముక్తి సాధ్యపడుతుంది. యోగపురుషులు మాత్రమే పొందగలిగే ముక్తి తపము జపము ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది.
ఇంద్రియములతో అనుబంధం విడిచిన వాడు పరబ్రహ్మలో లీనమైతే సద్యోముక్తి అలా ఇంద్రియములపై వ్యామోహం విడువలేనివాడు బ్రహ్మలోకం మాత్రమే చేరుతాడు. ఆ బ్రహ్మలోకమునందు శోకము దుఃఖము వంటివి యుండను గాక యుండవు. సిద్ధ యోగులయొక్క అమృతవాక్కులు సదా వినబడుతు వుంటాయి. ఈ బ్రహ్మలోకమును చేరిన వాడికి పునర్జన్మ మాత్రం లేదు. బ్రహ్మ ఎంతకాలం జీవించి వుంటాడో అంతకాలము జీవించి పుణ్యఫలమును అనుసరించి ముక్తులగుదురు. నారాయణ చరణ కమలములు ఆశించినవారు కల్పాంతమున బ్రహ్మాండమును ఛేదించి నారాయణుడువుండే గోకులము చేరి విష్ణుపదము పొందుతారు. ఇక మహాదేవుని అర్చించి కైలాస సదనం వాంఛించు వాడు లింగ శరీరంతో భూమితత్వం పొంది ఘ్రాణేంద్రియాలద్వారా విభూతి గంధము గ్రహించి లయ స్థానము అయిన అహంకార ఆవరణము చేరి మహతత్వంలోకి ప్రవేశించి శివునిలో లీనమై ఆనందమయుడు అవుతాడు. సూక్ష్మంగా క్రమముక్తి అంటే అది.
శుద్ధముక్తి. పై చెప్పబడిన సద్యోన్ముక్తి, క్రమముక్తి కేవలం సర్వసంగ పరిత్యాగులను అయిన లౌకిక వాసనలు వదిలినటువారికే సాధ్యం. మరి సామాన్యుల ముక్తికి అర్హులు కారా అంటే అర్హులే. శుద్ధముక్తి ద్వారా శుద్ధముక్తికి సాధనలు ఎలా వుంటాయి అంటే చాలా సులభంగానే వుంటాయి. కానీ క్లిష్టము, నియమ నిబద్ధమైనటువంటి జీవితం గడుపుతు మనసా వాచా కర్మణా ఏ పని అయినా త్రికరణ శుద్ధిగా చేస్తూ వుండాలి. కంటికి కనపడే దైవాలైన మాతాపితరులను జీవిత కాలం బాధ కలిగించకుండా వారికి సేవ చేయాలి. ఇక సాటి మనిషిపై ద్వేషం, అసూయ వంటి తమోరజ భావము తొలగించుకుని తనకు కేటాయించబడిన వృత్తిని ఇష్టంగా చేస్తూ యుండాలి. ఎంతటి పని అప్పగించినా భీరువు వలె వెనకకు మరలరాదు. ఏ పని చేసినా నాచే భగవంతుడు ఈ పని చేయించుచున్నాడు. నేను నిమిత్తమాత్రుడను అని భావించాలి. జనక మహారాజువలె సాంసారిక విషయములపై తామరాకుపై నీటి బిందువువలె వుంటు ధర్మమార్గము వీడగూడదు. చైతన్యునివలె, తుకారం వలె ఏకనాధుని వలె జ్ఞానదేవుని వలె సంసారంలోనే వుంటూ మోక్ష మార్గమును అనే్వషించువాడు శుద్ధముక్తికి పాత్రుడగును. ఆధునిక కాలమునకు శుద్ధముక్తికై ఆచరణ యోగ్యమైంది.


మోక్షస్వరూపిణి అయిన అమ్మ వారికి నమస్కరించు నపుడు ఓం కామకోటికాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

590వ నామ మంత్రము 15.2.2022

ఓం  కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవితాయై నమః

అనుగ్రహ వీక్షణ మాత్రముచేతనే కోటిమంది లక్ష్ముల సమూహముచే సేవింపబడు జగన్మాతకు నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి కటాక్షకింకరీభూత కమలాకోటి సేవితా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం కటాక్షకింకరీభూత కమలాకోటి సేవితాయై నమః అని ఉచ్చరించుచూ విశేష భక్తి శ్రద్ధలతో ఆ జగన్మాతను ఉపాసించు  సాధకులకు అనంతకోటి గుణితమైన లక్ష్మీకటాక్షము కలుగును మరియు జన్మరహితులై శాశ్వత బ్రహ్మలోకవాసమునకు మార్గమేర్పడి తరింతురు

 ఆ పరమేశ్వరి కరుణా తరంగములనెడి వీక్షణ మాత్రముచేతనే కోట్లాది లక్ష్మీదేవీలచే సేవింపబడుచున్నది. అందుచేతనే ఆ పరమేశ్వరి మణిద్వీపమందు అత్యంతవభవోపేతముగా విలసిల్లుచున్నది. ఆ వైభవం ఎలాంటిదో ఒక్కసారి మన మనోనేత్రములతో తిలకించుదాము:-

బ్రహ్మలోకానికి పైన ఉన్న సర్వలోకము అనెడి  మణిద్వీపానికి నాలుగు వైపులా అనేక యోజనముల పొడవు, విస్తీర్ణముగల రత్నపురవ్వల ఇసుక, బంగారు చేపలుగల అమృతమయమైన సముద్రము (సుధాసాగరము) గలదు.   ఈ సుధా సాగరమునకు అన్ని దిశలయందును రత్నాల వృక్షములు గలవు. సుధాసాగరమునకు ఆవల ఇరువది ఐదు ప్రాకారములు గలవు.  ఆ ప్రాకారములలో అత్యంత అద్భుతమైన వెండిప్రాకారము, కాంచనప్రాకారము, పుష్పరాగమణి ప్రాకారము, పద్మరాగమణి ప్రాకారము, గోమేధికమణి ప్రాకారము, వజ్రాల ప్రాకారము, వైడూర్య ప్రాకారము,  ఇంద్రనీల మణి ప్రాకారము, ముత్యాల ప్రాకారము, మరకతమణి ప్రాకారము, పగడాల ప్రాకారము, మాణిక్యరత్న ప్రాకారము - ఇటువంటి ప్రాకారముల మధ్య చింతామణి గృహము తనకు ప్రధానస్థానముకాగా, మూలప్రకృతియైన ఆ భువనేశ్వరియొక్క పది శక్తితత్త్వములు సోపానరూపములో  ఉపస్థితములై యుండగా, పంచబ్రహ్మాసనమనెడి వేదిక మహనీయ శోభలొలుకుచుండగా, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, సదాశివుడు - ఈ నలుగురు దేవతలు ఆ వేదికకు (మంచమునకు) నాలుగు పాదములై ఒప్పగా, సదాశివుడు ఆ మంచమునకు ఫలకముకాగా, దానిమీద మహామహిమాన్వితుడగు పరమేశ్వరుడు విరాజిల్లుచుండగా పరమేశ్వరి నడుము భాగమున నవరత్నములు పొదిగిన ఒడ్డాణముతో ఇనుమడించిన సౌందర్యముతో ఒప్పుచుండెను. తప్తకాంచనము, వైడూర్యములతో సిద్ధము చేసిన భుజకీర్తులు ఆ పరమేశ్వరికి శోభనుకలుగ జేయుచున్నవి. ఆ భుజకీర్తులు శ్రీచక్రములవలె ఉన్నవి. గొడుగులవంటి తాటంకములు భగవతి ముఖమండలమును మనోహరముగ తీర్చిదిద్దుచున్నవి. పరమేశ్వరి లలాటకాంతి అష్టమిచంద్రుని శోభలనుకూడ తుచ్ఛముచేయుచున్నవి. ఆ తల్లి పైపెదవి పగడపుకాంతులను, క్రింది పెదవి దొండపండ్లను తిరస్కరించుచున్నవి. మనోహరమైన దంతపంక్తులు శుద్ధవిద్యాంకురములవలె ప్రకాశిస్తున్నవి. కుంకుమ, కస్తూరి కలిపిన తిలకము ముఖమండలమునకు అపారసౌందర్యమును కలుగజేయుచున్నది. ఆ పరమేశ్వరి సూర్యచంద్రులవంటి ఆకారములతో రత్ననిర్మితమైన దివ్యమగు చూడామణిని మస్తకమున ధరించియున్నది. శుక్రనక్షత్ర కాంతులను తిరస్కరించు నాసికాభరణము ఆ తల్లి ప్రకాశమును ఇనుమడింపజేయు పరమసాధనముగ రూపొందినది. ఆ పరమేశ్వరి కంఠాభరణమునందు  గల ముత్యముల గుత్తితో అతిశయ శోభాన్వితయై ఒప్పుచున్నది. చందనపంకము, కర్పూరము, కుంకుమలతో ఆ పరమేశ్వరి స్తనములు అలంకృతములై యున్నవి. విచిత్రములు, అద్భుతములైన ఆమె భుజస్కందములు శంఖములవలె సౌందర్యముతో అలరారుచున్నవి. అమూల్యరత్నములతో పొదిగబడిన మకుటమును తలపైధరించి రాజసముతో ఒప్పుచున్నది. పరమేశ్వరి ముఖకమలమందు ముంగురులు తుమ్మెదలవలె కదలుచున్నవి. మణులతో పొదిగిన ఉంగరము పరమేశ్వరి వ్రేలుకు క్రొత్త శోభలను అమర్చుచున్నది. కమలదళాకృతిని ధరించిన మూడునేత్రములతో ఆ శ్రీమాత అతిశయమనోహరముగ దర్శనమిచ్చుచున్నది. మెరుగుపెట్టి స్వచ్ఛమొనరించిన మహారాగములు, పద్మరాగములతో సమానమైన ఆ పరమేశ్వరి శరీరకాంతులు మహోజ్జ్వలమై తనరారుచున్నవి. రత్ననిర్మిత కింకిణులతో, కంకణములతో ఆ పరమేశ్వరి అపురూప సౌందర్యవతివలె తేజరిల్లుచున్నది. మణుల, ముత్యాలసరుల యందున్న సహజలావణ్య శోభ ఆ పరమేశ్వరి చరణములనుండి ఉత్పన్నమైనది. ఆ పరమేశ్వరి నాలుగు భుజములు పాశ, అంకుశ, వర, అభయ ముద్రలతో సుశోతములై యున్నవి. ఆ పరమేశ్వరి తన పలుకుల మధురిమలతో సరస్వతీ దేవి కచ్ఛపీ వీణాస్వరమును తుచ్ఛమొనరించుచున్నది. సఖియలు, దాసీజనములు, దేవతాస్త్రీలు, సమస్త దేవసమూహములు పరమేశ్వరిని నాలుగు వైపుల పరివేష్టించి ఆసీనులై యున్నారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులతో ఆ పరమేశ్వరి కూడియున్నది. లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ - ఇవి మూర్థిమంతములై భగవతిచెంత విరాజిల్లుచుండెను. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, దోగ్ధ్రీ, అఘోర, అమంగళ -  ఈ తొమ్మిదిమంది పీఠశక్తులు పరమేశ్వరి సేవయందు సదా నిమగ్నులై యుందురు. శంఖనిధి, పద్మనిధి, అను ఈ నిధులు పరమేశ్వరికి పార్శ్వభాగములందు గలవు.  నవరత్నవహ, కాంచనశ్రవ, సప్తధాతువహ అను పేర్లుగల నదులు శంఖ, పద్మ నిధులనుండి వెలువడినవి. ఈ నదులు సుధాసింధువునందు కలియుచున్నవి ఈ విధముగ విశేషశక్తిశాలినియైన ఆ పరమేశ్వరి మహానుభావుడైన పరమేశ్వరుని వామాంకమున విరాజిల్లుచుండెను. ఇదంతయును ఆ పరమేశ్వరి కృపాకటాక్షవీక్షణముల వైభవమే. కోట్లాది లక్ష్మీదేవి సమూహములు ఆ పరమేశ్వరిని సేవించుటచేతనే అంతటి మహత్తరమైన వైభవము నెలకొనియున్నది. క్షీరసాగరమున నారాయణుని వైభవము, సుధాసాగరమున నారాయణీ వైభవము - మహోన్నతములే. 

అంతటి మహోన్నత వైభవము అమ్మవారి కృపాకటాక్ష వీక్షణములు ఏ భక్తులపైయుండునో, ఆ భక్తులు కోట్లాది లక్ష్మీకటాక్ష వీక్షణముల తుల్యమైన వైభవముతో (అష్టైశ్వర్యములతో) జీవింతురు. జీవితాంతమున మోక్షలక్ష్మీ సామ్రాజ్యాధినేతలై తరింతురు.

అమ్మ వారి కరుణ ఏ భక్తులకు అనుగ్రహింపబడుతుందో వారికి సిరిసంపదలు, పాడిపంటలు, సుఖశాంతులు సంప్రాప్తమగును అని ఈ నామమంత్రములోని అంతర్భావము. గనుక భక్తులయినవారు శ్రీలలితా సహస్రనామ స్తోత్ర పారాయణము నియమనిష్టలతో నెఱపువారుగా మెలగవలయును.

శ్రీమాత ఎంతబాగా వ్యక్తీకరించుతుందో ఆదిశంకరులు సౌందర్యలహరి (51వ)   శ్లోకంలో ఎలా వివరించారో తెలుసుకుందాము.
 
శివే శృంగారార్ద్రా తదితరజనే కృత్స్నపరా|

సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ

హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య జననీ

సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిః సకరుణా

దేవి నేత్రద్వయము ఆకర్ణాంతము విస్తరించి నల్లని తుమ్మెదలవలె నున్నవి. కావ్యరస మాధుర్యభరితమైన చెవులనెడు పుష్పములనుండి మకరందమునాస్వాదించుచున్నవి. వాటిని చూచి అసూయచే మూడవ కన్ను కొంచెము ఎరుపెక్కినది
 
అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణములు తమపై ప్రసరించినంతనే ఆ అవకాశం కోసం ఎదురు చూచిన అష్టలక్ష్ములందరూ సకల సంపదలను ప్రసాదిస్తూ, తమ కృతజ్ఞతా భావాన్ని ఎలా తెలుపుకుంటారో ఆది శంకరులు సౌందర్యలహరి స్తోత్ర పఠనానికి ఫలశ్రుతిగా ఆదిశంకరులు తొంబది తొమ్మిదవ శ్లోకంలో ఇలా చెబుతారు.
 
సరస్వత్యా లక్ష్యా విధి హరి సవత్నో విహరతే|

రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేతి వపుషా|

చిరం జీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికరః|

పరానందాభిఖ్యం రనయతి రనం త్వద్‌భజనవాన్‌॥

భక్తవత్సలవు నీవు. నీ భక్తులు నిన్ను ఏం కోరినా యిస్తావు. నీవు లక్ష్మి ఒక చేత్తోనూ, వాణి ఒక చేత్తోనూ వింజామరలు వీస్తుండగా కొలువుతీరియుందువు. లక్ష్మీసరస్వతులు నీకు దాసులై  వింజామరలతో సేవ చేస్తుండగా నీకు అతివత్సలుడైన నీ భక్తునికి వారు మాత్రం వారు సేవ చేయక యుందురా?  పరిపూర్ణతకు లక్ష్మీకటాక్షం తప్పనిసరి. ఆ లక్ష్మీ పురుషోత్తమునిధామం వైకుంఠం వదలి నీపాదాలముందే పడిగాపులు కాస్తూ ఉన్నది. అంతటితో ఆగక నీభక్తునికి సైతం పరిచర్యచేయడానికి సమకట్టుతూ ఉన్నది. అపుడు నీభక్తుణ్ణి చూస్తే పురుషోత్తమునికి సైతం అసూయ కలుగును.

అమ్మవారు మహాచతుష్షష్టికోటియోగినీగణ సేవితా యని అనబడినది. అనగా శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు ఉండగా, ఒక్కొక్క ఆవరణకు అరువదినాలుగు కోట్ల యోగినీ గణములు చొప్పున తొమ్మిది ఆవరణలకు ఐదువందల డెబ్బదియారు (64 x 9) కోట్ల యోగినీ గణములు ఉందురు. అమ్మవారు ఈ యోగినీగణములచే సేవింపబడుచున్నది. ఈ యోగినీ గణములే కోట్లాది లక్ష్మీదేవిలుగా  (కమలాకోటిగా) సమన్వియించు కొనవచ్చును. భక్తులచే ప్రార్థింపబడిన ఈ లక్ష్మీసమానులైన యోగినీ గణములు, భక్తులకు సకలసంపదలను సంప్రాప్తింపజేయుదురు, సకలార్థసిద్ధిని అనుగ్రహించుదురు. గనుకనే ఆ పరమేశ్వరి కటాక్షకింకరీభుతకమలాకోటిసేవితా యని అనబడినది.

అట్టి తల్లికి నమస్కరించునపుడు ఓం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

591వ నామ మంత్రము 16.2.2022

ఓం శిరఃస్థితాయై నమః

శిరస్సున బ్రహ్మరంధ్రములో అనగా సహస్రారమునందు తేజరిల్లు తల్లికి నమస్కారము. 

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి శిరఃస్థితా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం శిరఃస్థితాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు సమస్త అనారోగ్య బాధలు తొలగిపోవును మరియు ఆ తల్లి కరుణాంతరంగ దృష్టులు ప్రాప్తించి శాశ్వతమైన బ్రహ్మానందము లభించి తరించుదురు. 

శిరస్సును ఉత్తమాంగము అన్నారు.   సామాన్యంగా ఆలోచిస్తే, ఇంద్రియజ్ఞానమునకు కేంద్రమైన మస్తిష్కము (మెదడు) శిరస్సులోనే ఉన్నది. శరీరంలోని సర్వావయవములకు సంబంధించిన సమాచారవ్యవస్థ శిరస్సులోనే గలదు. వినుట, చూచుట, చెప్పుట, రుచిని కనుగొనుట, ప్రాణవాయువును స్వీకరించుట వంటివి వ్యవస్థలన్నియును ఆ పరమాత్మ శిరస్సులోనే ఏర్పరిచాడు. గనుకనే శిరస్సు ఉత్తమాంగము అయినది. 

శిరసి బ్రహ్మరంధ్రే గురురూపతయా స్థితా॥ అమ్మవారు గురురూపంలో బ్రహ్మరంధ్రమునందు ఉన్నది. 

 గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః|

గురుః సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః॥

గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, అలాగే గురువే పరంబ్రహ్మ. అలాంటి గురువుకు నమస్కరిస్తున్నాను.

గురువు అంటే త్రిమూర్తిస్వరూపము. పరమేశ్వరి సర్వదేవతా స్వరూపిణి. అలాగే త్రిమూర్తి స్వరూపిణి. అందుకే ఉపాసకులు బ్రహ్మరంధ్రం వద్ద గురువును భావిస్తూ పరమేశ్వరికిల నమస్కరిస్తారు. గనుకనే అమ్మవారు శిరఃస్థితా యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం శిరఃస్థితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

592వ నామ మంత్రము 17.2.2022

ఓం చంద్రనిభాయై నమః

చంద్రునివంటి చల్లని కాంతులతో ప్రకాశించు పరమేశ్వరికి నమస్కారము.

 శ్రీ లలితా సహహ్రనామావళి యందలి చంద్రనిభా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం చంద్రనిభాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు సమస్త బాధలు తొలగిపోవును మరియు ఆ తల్లి కరుణాంతరంగ దృష్టులు ప్రాప్తించి బ్రహ్మానందము ప్రాప్తించి, ఆనందోత్పాదన శక్తి లభించును. 

చల్లని వెన్నెల శరదృతువునందు మంచి ఆహ్లాదంగా ఉంటుంది. ఆ చంద్రకాంతి చల్లదనానికి మేను పులకరిస్తుంది. భగవంతుని సన్నిధిలో ఆ చల్లని వెన్నెల దివ్యమైన భావాలకు నెలవుగా ఉంటుంది. 

చంద్రుడు షోడశకళాప్రపూర్ణుడు. నిత్యాదేవతల మైత్రితో తన వెన్నెల సొబగులను ప్రకృతికి అప్పగిస్తే, ఆ ప్రకృతి ఒడిలో కవులు పరవశులై తమ కలం నుండి జాలువారిని కమనీయమైన కవితలను రసహృదయులకు సమర్పిస్తారు. 

పరమేశ్వరి నిత్యాషోడశికారూపా యని అనబడినది. అనగా నిత్యాదేవతలు పదహారు మంది. అమ్మవారు ఈ పదహారు నిత్యల స్వరూపిణి.  నిత్యా దేవతల వలనే చంద్రకళలు ఏర్పడుచున్నవి. ఆ వివరణ ఇచ్చట ఈయబడినది.

చంద్రకళలు పదహారు. పాడ్యమి నుండి పౌర్ణమి లేదా అమావాస్య వరకూ పదిహేను కళలు. పదహారవ కళ సచ్చిదానందస్వరూపిణియైన ఆ పరమేశ్వరి. అలాగే పదిహేను తిథులకు పదిహేను మంది దేవతలు గలరు. వారినే నిత్యాదేవతలు, లేదా తిథినిత్యలు అందురు. చంద్రునికి కళలు నిత్యాదేవతల వలన వచ్చుచున్నవి. పరమేశ్వరి నిత్యాషోడశికారూపా యని అనబడినది అంటే అమ్మవారు పదహారు నిత్యాదేవతల స్వరూపిణి. దీనిని బట్టి చంద్రునికి కళలు పరమేశ్వరి వలననే కలుగుచున్నవి. 

పదహారు మంది నిత్యలు

కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండా, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతీ, త్వరితా, కులసుందరీ, నిత్యా, నీలపతాకా, విజయ, సర్వమంగళ, జ్వాలామాలినీ, విచిత్ర, మహానిత్య వీరందరూ మహానిత్య అయిన లలితాంగికి అంగములుగా భాసిల్లుదురు. గనుక ఇక్కడ అమ్మవారు చంద్రనిభా యని అనబడినది.

నిత్యలు - చంద్రకళలు

పదిహేను తిథులకు పదిహేను నిత్యలు కాగా చంద్రుని పదహారవ కళయే మహానిత్య. ఆ మహానిత్యయే సచ్చిదానంద స్వరూపిణియైన పరమేశ్వరి. శుక్లపక్ష పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ రోజుకొక నిత్య చొప్పున పదిహేను తిథులకు పదిహేను నిత్యలు ఉందురు.  

 శుక్ల పక్షము

  1. పాడ్యమి - కామేశ్వరి
  2. విదియ    - భగమాలిని
  3. తదియ    - నిత్యక్లిన్నా
  4. చవితి      - భేరుండా
  5. పంచమి  - వహ్నివాసినీ
  6. షష్టి        - మహావజ్రేశ్వరీ
  7. సప్తమి   -  శివదూతీ
  8. అష్టమి  -   త్వరతా
  9. నవమి  -   కులసుందరీ
10. దశమి   -   నిత్యా
11. ఏకాదశి -   నీలపతాకా
12. ద్వాదశి -   విజయ
13. త్రయోదశి-సర్వమంగళా
14. చతుర్దశి  - జ్వాలామాలిని
15. పూర్ణిమ  -  చిత్రా

శుక్ల పక్షము నందు పాడ్యమి నాటి చంద్రుని కళ కామేశ్వరి ప్రసాదించు కళ. శుక్ల పక్షము పాడ్యమి నాడు  చంద్రుని కళకు కాంతి ఉండదు.  శుక్ల పక్ష పౌర్ణమి నాటి చంద్రుని కళ చిత్రా అనే నిత్యాదేవత కళ. సంపూర్ణముగా చంద్రబింబము కనిపిస్తుంది. ఆ కళ చంద్రునిది కాదు. ఆనాటి నిత్యాదేవతదే అని గమనించవలెను. అమ్మవారు నిత్యాదేవతా స్వరూపిణి. మరల
కృష్ణ పక్షములోని పాడ్యమి నాటి చంద్రుని కళ పౌర్ణమి నాటి చిత్రా యను నిత్యాదేవత కళయే అవుతుంది (ఎందుకంటే పౌర్ణమినాటి చంద్రుడు, కృష్ణపక్షము లోని పాడ్యమి నాటి చంద్రుడు ఒకే విధంగా ఉంటారు) క్రమంగా కృష్ణ పక్షము నాటి అమావాస్యకు శుక్ల పక్షము లోని పాడ్యమి నాటి నిత్య అయిన కామేశ్వరి ప్రసాదిస్తుంది (శుక్ల పక్ష పాడ్యమి నాడు చంద్రుడు కనబడడు అనగా నెలపొడుపు ఉండదు. అలాగే అమావాస్యనాడు కూడా చంద్రుడు కనబడడు). ఇప్పుడు శుక్లపక్షము లో ఆయాతిథులలో నిత్యాదేవతలు, కృష్ణ పక్షములోని నిత్యాదేవతలు పరిశీలిస్తే ఆ తిథులలోని చంద్రకళలు ఎలా ఏర్పడ్డాయో తెలుస్తుంది. అనగా చంద్రునికి కళ ఆనాటి నిత్యాదేవతకళయే యని గ్రహించగలము.

కృష్ణ పక్షము

  1. పాడ్యమి - చిత్రా
  2. విదియ    - జ్వాలామాలిని
  3. తదియ    - సర్వమంగళా
  4. చవితి      - విజయా 
  5. పంచమి  - నీలపతాకా
  6. షష్టి        - నిత్యా
  7. సప్తమి   -  కులసుందరీ
  8. అష్టమి  -   త్వరితా
  9. నవమి  -   శివదూతీ
10. దశమి   -   మహావజ్రేశ్వరి
11. ఏకాదశి -   వహ్నివాసిని
12. ద్వాదశి -   భేరుండా
13. త్రయోదశి-నిత్యక్లిన్నా
14. చతుర్దశి  - భగమాలిని
15. అమావాస్య  -  కామేశ్వరీ

మూలాధారంలో జాగృతమైన కుండలినీ శక్తి ఆజ్ఞాచక్రమునకు చేరి, అచటినుండి సహస్రారమునకు చేరగా, సహస్రారంలోని సహస్రదళ పద్మాన్ని తన నోటితో కరచి పట్టుకుంటుంది. అంతవరకు ఘనీభవనస్థితిలోనున్న అమృతము, కుండలీనీ శక్తిప్రజ్వలనం వలన స్వాధిష్ఠాన ఉష్ణతత్త్వముచే కరిగి ధారలై సాధకుని శరీరంలోని డెబ్బదిరెండువేల నాడీమండలాన్ని తడుపుతుంది. సాధకుడు అనిర్వచనీయమైన బ్రహ్మానందంతో పులకించిపోతాడు. సహస్రారంలోని చంద్రమండలం అనేకకోట్ల చంద్రకాంతులతో ప్రకాశమానమై యుంటుంది గనుక, కుండలినీ శక్తి రూపంలో ఉన్న పరమేశ్వరికూడా అంతే విరాజమానయై యుంటుంది.  అందుచే అమ్మవారు చంద్రనిభా యని అనబడినది.

బ్రహ్మరంధ్రమునకు క్రింది భాగమున ఆజ్ఞాచక్రమునకు, సహస్రారమునకు మధ్యన బిందుస్థానమున ఉన్న ఒక పవిత్ర ప్రదేశమున ఆనందకందముండును. చంద్రకాంతికి మించిన ప్రకాశముతో తేజరిల్లుచుండును. దానినే చంద్రకళా, చంద్రనిభా అని అందురు. సహస్రారాన్ని సాక్షాత్తు సుధాసింధు వని అంటారు.అందుచేతనే ఈ స్థానమంతా చంద్రమండలము క్రిందనే వస్తుంది. ఇంద్రుడును, సూర్యుడును, చంద్రునిపై కిరణాలు పంపుతారు.  ఆ దివ్య కిరణముల ద్వారా చంద్రుడు ప్రకాశిస్తాడు. అందుచేత దేవీ ఉపాసకులు ప్రదోషకాలమగు సాయం సమయమున పరమేశ్వరిని చంద్రకాంతి రూపమున భావించి ధ్యానిస్తారు. కావున చంద్రనిభా  అను నామంతో స్తుతించుచున్నాము. అమ్మవారు  బైందవాసనా అంటే  అమ్మవారు శ్రీచక్రంలో ఉండే బిందుస్థానంలో ఉన్నది. ఈ బిందుస్థానమే సహస్రారచక్రం ఉండే - ఉపాసకుల శిరఃస్థానముగా సూచింపబడుతుంది కనుక అమ్మవారు శిరఃస్థితా అయినది. అలాగే  సహస్రారమునకు, ఆజ్ఙాచక్రమునకు గల మధ్యప్రదేశాన్ని ఆనందకందము అంటారు. దీనినే చంద్రనిభా, చంద్రకళా అని అన్నాము. సహస్రారాన్ని సాక్షాత్తు సుధాసింధు అని కూడా అంటాము. ఇక్కడ సహస్రారము సుధాసింధు అన్నాము. ఇంతకు ముందు 591వ నామంలో సహస్రారమును శిరఃస్థితా - ఉపాసకుల శిరఃస్దానమని అనుటచే   ఈ రెండు నామములు 591 మరియు 592 నామ మంత్రములను ఒకనామంగా సంపుటీకరించి శిరఃస్థితా చంద్రనిభా (ఓం శిరఃస్థితా చంద్రనిభాయై నమః) అని అమ్మవారిని స్తుతించవచ్చును.
 
జీవునికి అనందోత్సాహములను కలుగజేయును, కావున శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం చంద్రనిభాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

593వ నామ మంత్రము 18.2.2022

ఓం ఫాలస్థాయై నమః

 ఫాలభాగమందు హ్రీంకారరూపంలో ఉండు తల్లికి నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి ఫాలస్థా అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం ఫాలస్థాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు పరమేశ్వరి కరుణతో ఐహిక, ఆముష్మిక సుఖసంపదలు కలుగాటయే గాక ఆత్మానందభూతి, బ్రహ్మజ్ఞానతత్త్వము సంప్రాప్తమై తరించుదురు.

ఆజ్ఞాచక్రం కనుబొమల మధ్యఉంటుంది. కొంచం పైభాగాన ఉండే ప్రదేశాన్ని ఫాలభాగం అంటారు. అదే లలాటం అనికూడా  అంటారు. ఈ లలాటస్థానంలో అమ్మవారు బీజరూపంలో ఉంటుంది. ఉదయకాల ధ్యానంలో అమ్మవారిని ఫాలస్థానం (లలాటభాగం) లో ఉందని భావించి  అమ్మవారిని ధ్యానంచేయాలి అని తెలియనగును. ఎందుకనగా ఈ లలాటస్థానం భ్రూమధ్యమునకు తూర్పుదిశయగును. ఆ దిశనుండే సూర్యభగవానుడు ప్రకాశము వెదజల్లును గాన శ్రీమాత పాలస్థా యని కీర్తించుచున్నాము. ఆజ్ఞా చక్రం రెండు దళాలు కలిగిన పద్మం.ఇది నీలి బూడిద రంగులో ఉంటుంది. దీని యొక్క రెండు దళాలలో ఒక దళం పైన హం అని రెండవ దళం పైన క్షం అనే అక్షరాలు ఉంటాయి. ఇవి శివ , శక్తులకు సంబంధించిన దళ బీజమంత్రాలు. ఈ చక్ర బీజ మంత్రం ఓం కుండలినీ ఆజ్ఞ చక్రంలో పనిచేయటం ప్రారంభించగానే, అంత వరకు ఇంద్రియాల ద్వారా పని చేస్తున్న మనసు క్రమంగా కుండలినీ వైపుకు మరలుతుంది. ఆజ్ఞా చక్రంలో తల క్రిందులుగా ఒక త్రికోణం ఉంటుంది. ఈ త్రికోణం శక్తి కి ప్రతీక. ఈ త్రికోణం లో ఒక నల్లటి శివలింగం ఉంటుంది. ఈ శివలింగం పైన ఓం బీజాక్షరం ఉంటుంది. దాని పైన అర్ధ చంద్రాకారం ఉంటుంది. తరువాత ఒక బిందువు ఉంటుంది. ఈ శివలింగం లింగశరీరమనకు  సూచిక గా చూపిస్తారు. ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవత పరమ శివుడు. ప్రతి రోజు ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేసిన వారికి ఈ క్రింది ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ఆజ్ఞాచక్రస్థానము, ఫాలభాగము ఒకేచోట ఉండుటచే, దేవీ ధ్యాన ఫలితములు. వస్తు వ్యామోహం తగ్గును. తనను తాను తెలుసుకోవడం సాధ్యమవుతుంది. సన్మార్గంలో నడిచే సామర్ద్యం కలుగుతుంది. దురాశను నియంత్రించును, కోర్కెలను అదుపులోనుంచును. మనసులో జ్ఞానాభివృద్ధి కలుగును.  ఆకామ్య కర్మలనుండి విముక్తుడిని చేయును. ఏకాగ్రత, శ్రద్ద,  నేర్పరితనం, ఔన్నత్యము పెంపొందించును. మన:శాంతి కలుగును. ఆరోగ్యము పెంపొందించును, ముఖము తేజోవంతమగును.

శ్రీమాతకు నమస్కరించు నపుడు ఓం ఫాలస్థాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

594వ నామ మంత్రము 19.2.2022

ఓం ఇంద్ర ధనుః ప్రభాయై నమః

ఇంద్ర ధనుస్సును బోలిన కాంతితో ప్రకాశించు జగన్మాతకు నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి ఇంద్ర ధనుః ప్రభాయై అను ఆరక్షరముల (షడాక్షరీ) నామ మంత్రమును ఓం ఇంద్ర ధనుః ప్రభాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులు పరాశక్తి కరుణచే తాపస నియమము, సంపదను పొందగలరు.

ఇంతకు ముందు నామ మంత్రంలో ఫాలస్థా యని అన్నాము. ఇప్పుడు ఇంద్ర ధనుః ప్రభా యని అంటున్నాము.  ఫాలము అనగా లలాటము. 

దీపాకారోఽర్ధమాత్రశ్చ లలాటే వృత్త ఇష్యతే|

అర్ధచంద్ర స్తదాకారః పాదమాత్ర స్తదూర్ధ్వకే॥(సౌభాగ్యభాస్కరం, 713వ పుట)

ఆజ్ఞాచక్రం నుంచి గల ఉన్మని వరకూ తొమ్మిది చక్రములున్నవి.  అందు మొదటిది బిందువు. ఇది లలాటంలో ఉన్నది. దీనికి పైన అర్ధమాత్ర ఉన్నది. ఈ అర్ధమాత్రమే అర్ధచంద్రము అని అందురు. ఇది దీపము వలె అర్ధచంద్రాకారంలో ఉంటుంది. 

నుదురునందు దీపమువలె ప్రకాశించు ఓం లేక హ్రీం  అర్థమాత్రాకాలముగల పూర్ణబిందువు ఉన్నది. అర్ధచంద్రాకారముగా ఉన్నదని తెలుపుటకే ధనుస్సు అని చెప్పబడగా, ఆ ధనుస్సు ఇంద్రధనుస్సువలె వర్ణరంజితమై, ప్రకాశించుచుండుటచే అమ్మవారిని ఇంద్రధనుఃప్రభా యని వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కీర్తించారు.
లలాటంలో ఇంద్రగ్రంథి గలదు. ఇది సూర్యుని సూచించే స్థానము మరియు ఆజ్ఞాచక్రస్థానము. గనుక ఉదయకాలంలో ఉపాసకులు భృకుటి స్థానమునందు పరమేశ్వరిని దృష్టిలో నిల్పి వివిధ వర్ణములు గలిగిన దేవిగా భావించి ఉపాసిస్తారు. అందుచే అమ్మవారు ఇంద్ర ధనుః ప్రభా యని అనబడినది.

ఆ పరాశక్తికి నమస్కరించునపుడు ఓం ఇంద్రధనుఃప్రభాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

595వ నామ మంత్రము 20.2.2022

ఓం హృదయస్థాయై నమః

భక్తులు తమ హృదయ మధ్యంలో ధ్యానించుటకు వీలుగా కొలువై ఉండు పరమేశ్వరికి నమస్కారము.
 
శ్రీ లలితా సహహ్రనామావళి యందలి హృదయస్థా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం హృదయస్థాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరాశక్తిని ఉపాసించు ఉపాసకులకు ఆతల్లి వారి హృదయములయందే నివసించి ధర్మ, అర్థ, కామ, మోక్షములనెడి పురుషార్ధములను  తెలియజేసి, అత్యంత ఉత్తమమైన మోక్షపదమునకు మార్గమును చూపి, సుఖభోగములు, ఇహమందు కీర్తిప్రతిష్టలు, అంత్యమునందు బహ్మలోకనివాసము ప్రాప్తింపజేయును.

 ఈ దేహము షట్చక్రములు, ఇడ, పింగళ నాడులు,సుషుమ్న నాడులు, గ్రంథిత్రయము, కుండలినీగమనము, సహస్రారము ఇత్యాదులు మాత్రమే కాక, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనసు మొదలైనవన్నియు ఇవన్నీ దేహమునకు చెందినవి. ఇందులోనే ఆత్మకూడా ఉన్నది. ఆత్మకు మరో అర్థము బ్రహ్మము. అంటె శరీరమే ఒక శ్రీచక్రముగా భావించి, అందులోని బిందువు హృదయమైతే, ఆహృదయంలో శ్రీమాత వసిస్తోంది అనిభావించుదుము గాన శ్రీమాతను హృదయస్థా అని స్తుతిస్తున్నాము.

ఇక శ్రీమాత పంచదశాక్షరీలోగల వాగ్భవ, కామరాజ, శక్తికూటముల స్వరూపమయితే, కామరాజకూటము (కంఠము దిగువ భాగమునుండి కటి ప్రదేశము వరకు) నందు హృదయం ఉంటుంది గనుక, దేహానికి హృదయమే ముఖ్యము గనుక  ఆ హృదయంలో గల ప్రాణమే పరమాత్మయనియు భావిస్తున్నాము గనుక శ్రీమాత హృదయస్థా హృదయములో నుండునది అనదగును. జగన్మాతను వశిన్యాదులు దహరాకాశ రూపిణీ అన్నారు. అనగా హృదయకుహరంలో ఆకాశమే తన స్వరూపంగా భావించుదుము గనుక శ్రీమాత హృదయస్థా అని నామసిద్ధమైనది.

 ఆ పరమేశ్వరి హృదయము నందు కామరాజ బీజ రూపముగా ఉండును  కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అనగా ఈ మధ్యకూటమే కామరాజ కూటమందురు.

హృదయము ఒక పవిత్ర స్థానం.  పాపము అంటని ప్రదేశము. జీవన ప్రసరణకు, అనురాగ ప్రసరణకు కేంద్ర స్థానము. దయాదాక్షిణ్యములకు మూలమైనది. హృదయమను పద్మమునందు హృ మరియు ము తొలగించిన మధ్య దయ ఉండును. దయ, ధర్మములకు నిలయము. ధర్మమున్నచోట శ్రీమాత యుండును. హృదయం వద్దనే అనాహత చక్రము ఉన్నది. హృదయమును హృత్పుండరీకం అని కూడా అందురు. పుండరీకము అనగా పద్మము అని అర్థము. ఈ హృదయస్థానముననే పరమేశ్వరి ఉంటుంది కనుక హృదయస్థా అన్నాము. అందుచేత ఉపాసకులు శ్రీమాతను ధ్యానించునపుడు హృదయములో ఉందన్న భావించి ధ్యానము చేయుదురు.


నారాయణుడే  శివాయ విష్ణు రూపాయ శివరుపాయ విష్ణవే అన్నట్లుగా శివుడని, బ్రహ్మయని, ఇంద్రుడని, అక్షరుడని (నాశము లేనివాడు), విరాట్ స్వరూపుడని మనం ప్రతి రోజు మంత్ర పుష్పం అను పేరు గల నారాయణ సూక్తమున భక్తి ప్రపత్తులతో చదువుతున్నాము.  అట్టి విరాట్ స్వరూపుడే పరమాత్మ. ఆ పరమాత్మయే పరమేశ్వరి యని ఉపాసకులు మధ్యాహ్నకాలంలో అమ్మవారిని హృదయమందు ఉండే  పరమేశ్వరిని హృదయస్దా యని ఆరాధన చేయాలి
 
శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం హృదయస్థాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

596వ నామ మంత్రము 21.2.2022

ఓం రవిప్రఖ్యాయై నమః

సూర్యుని కాంతితో  సమానమైన కాంతితో ప్రకాశించు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి రవిప్రఖ్యా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం  రవిప్రఖ్యాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు సమస్త బాధలు తొలగిపోవును మరియు బుద్ధి ప్రకాశించి దివ్యశక్తి, చైతన్యశక్తి ప్రాప్తించి శాశ్వతమైన బ్రహ్మానందము లభించి తరించుదురు.

హృదయస్థా అన్నాము శ్రీమాతను ఇంతకు ముందు నామ మంత్రములో.  హృదయములో సూర్యమండలము ఉండును గనుక జగన్మాత సూర్యమండల సంస్థితా యని కూడా యనబడినది. సూర్యమండల సంస్థితా అంటే సూర్యమండల స్థానమైన మణిపూరచక్రంలో గలదని భావము. సూర్యమండల సంస్థిత యగుటచే సూర్యునితో (రవితో) సమానమైన ప్రకాశవంతమైనది యని అర్థము. మణిపూరచక్రస్థానమైన హృదయమునందు పరమేశ్వరి సాధకులచే ఉపాసింపబడును. అందుచే ఆ తల్లి రవిప్రఖ్యా అని (సూర్యునితో సమానమైన కాంతితో ప్రకాశిస్తోందని వశిన్యాది వాగ్దేవతలు (వశినీ, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని) చెప్పారు. వారికి శతకోటి గురువందనములు! ఆరవ నామ మంత్రములో ఉద్యద్భాను సహస్రాభా అన్నాము. అంటే ఉదయించు సూర్యులు వేయిమంది కాంతిని బోలు కాంతిని కలిగియున్నదని అన్నాము. అక్కడ ఉద్యద్భానుడు అయితే ఇక్కడ మధ్యాహ్న భాస్కరుడు. హృదయంలో సూర్యమండలం  ఉంటుంది గనుక శ్రీలలితా పరమేశ్వరి హృదయస్థా  అయినది. అందుకని ఆ తల్లిని హృదయస్దా రవిప్రఖ్యా అని రెండు నామాలు కలిపి (ఓం హృదయస్థా రవిప్రఖ్యాయై నమః) అని స్తుతించవచ్చును. అనగా హృదయస్థినమునందున్న పరమేశ్వరి సూర్యమండల కాంతులతో సమానంగా ప్రకాశిస్తున్నదని భావము. ఆ పరమేశ్వరిని ఉదయకాలమందు ధ్యానించినట్లయితే   "ఉద్యద్భాను సహస్రాభా యని అనదగినంతటి (ఉదయకాలమునందలి వేయి సూర్యులకాంతి ప్రభావముగలిగినంతటి) భక్తవాత్సల్యముతోను,  మధ్యాహ్మము హృదయమునందు భావించి ధ్యానిస్తే రవిప్రఖ్యా యని అనదగినంతటి ప్రకాశమానమైన (మధ్యాహ్నకాల రవితేజ మంతటి) భక్తవాత్సల్యముతోను విరాజిల్లుతుందని భావించదగును. బహిర్ముఖమైన వెలుతురుకు అంతర్ముఖమైన వెలుతురుకు తారతమ్యముంది. బహిర్ముఖమైన వెలుతురులో ఐహిక సంబంధితమైనవి  చూస్తూవుంటాము. ఇవి అందరికీ కనిపిస్తాయి. అంతర్ముఖమైన ప్రకాశము బుద్ధిలో కలిగి అందువల్ల ఆధ్యాత్మిక చింతనతో శ్రీమాత అనుగ్రహంకోసం పరితపించడం జరుగుతుంది. ఆ పరమేశ్వరి అనుగ్రహం ప్రాప్తిస్తే బుద్ధిని ప్రకాశింపజేసే దివ్యశక్తికి చైతన్యం కలుగుతుంది. సాధకుడు ఆ స్థితికి చేరితే ఆత్మానుభూతి, బ్రహ్నానందం కలుగుతాయి.

 అమ్మకు నమస్కరించి ఓం రవిప్రఖ్యాయై నమః  అని ఉచ్చరించుచూ ధ్యాననిమగ్నత కలుగజేసుకోవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

597వ నామ మంత్రము 22.2.2022

ఓం త్రికోణాంతర దీపికాయై నమః

మూలాధార పద్మ కర్ణికలోని త్రికోణంలో అగ్నిమండల స్వరూపిణి అయి తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.

సోమ (చంద్ర), సూర్య, అగ్నులచే మూడు తేజస్స్వరూపాలకూ తేజమును చేకూర్చు పరమేశ్వరికి నమస్కారము. 

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి త్రికోణాంతర దీపికా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం త్రికోణాంతర దీపికాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు భక్తులకు ఆ తల్లి జన్మజన్మల ప్రారబ్ధకర్మల దుష్ప్రభావము నశింపజేసి బ్రహ్మానందమును కలుగజేయును.

షట్చక్రములు : మూలాధారము, స్వాధిస్ఠానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆఙ్ఞాచక్రము, సహస్రారము.

7. సహస్రారము -- సత్యలోకము -- పరమాత్మస్థానము.

6. ఆఙ్ఞాచక్రము -- తపోలోకము -- జీవాత్మస్థానము.

5. విశుద్ధము-- జనలోకము -- ఆకాశభూతస్థానము.

4. అనాహతము-- మహ్ర్లోకము - వాయుభూతస్థానము.

3. మణిపూరము -- సువర్లోకము - అగ్నిభూతస్థానము.

2. స్వాదిస్ఠానము -- భువర్లోకము -- జలభూతస్థానము.

1. మూలాధారము -- భూలోకము -- పృథ్వీభూతస్థానము.

మూలాధారము: మలరంధ్రానికి రెండు అంగుళాల పై భాగంలో ఉంటుంది. దీనిరంగు ఎర్రగా రక్తవర్ణంలో ఉంటుంది. నాలుగు రేకులుగల తామరపువ్వు ఆకారంలో ఉంటుంది. ఈ చక్రానికి అధిపతి గణపతి, వాహనం ఏనుగు.

స్వాధిష్టానము : ఇది జననేద్రియం వెనుక భాగాన, వెన్నుముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మ, తత్వం జలం. సింధూరవర్ణంలో ఉంటుంది, ఆరు రేకుల పద్మాకారంలో ఉంటుంది. వాహనం మకరం.

మణిపూరము : బొడ్డునకు మూలంలో వెన్నుముకయందు ఉంటుంది. అధిపతి విష్ణువు, పది రేకుల పద్మాకారంలో, బంగారు వర్ణంలో ఉంటుంది, వాహనం కప్ప.

అనాహత చక్రము : హృదయం వెనుక వెన్నుముకలో ఉంటుంది. అధిదేవత రుద్రుడు, పండ్రెండు రేకుల తామరపువ్వు వలె నీలం రంగులో ఉంటుంది. తత్వం వాయువు, వాహనం లేడి.

విశుద్ధచక్రము : కంఠం యొక్క ముడియందు ఉంటుంది. అదిపతి జీవుడు, నలుపురంగులో ఉంటుంది. తత్వం ఆకాశం, వాహనం ఏనుగు.

ఆఙ్ఞాచక్రము : రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. అధిపతి ఈశ్వరుడు, రెండుదళాలు గల పద్మాకారంలో, తెలుపు వర్ణంలో ఉంటుంది.

సహస్రారము : కపాలం పై భాగంలో, మనం మాడు అని పిలిచేచోట ఉంటుంది. దీనినే బ్రహ్మరంధ్రం అంటారు. అధిపతి పరమేశ్వరుడు, వేయిరేకుల పద్మాకృతిలో ఉంటుంది. సుషుమ్నా నాడి పై కొన మీద ఈ చక్రం ఉంటుంది. దీనికి ఫలం ముక్తి.

పైన షట్చక్రములలో చెప్పిన మూలాధార చక్రము అనే మూలాధార పద్మములోని కర్ణికయందు త్రికోణమున్నది.   ఆ కోణముయొక్క మూడు బిందువులలో అగ్ని, చంద్రుడు, సూర్యుడు ఉందురు. అంటే ఒక కోణము అగ్ని మండలము. అనగా ములాధారపద్మములోని కర్ణికయందు త్రికోణమున్నది. ఆ త్రికోణము మధ్యలో అగ్నిమండలము ఉన్నది. అందు జగన్మాత కుండలినీ శక్తియై తేజరిల్లుచున్నది. అనగా దీపమువలె ప్రకాశించుచున్నది. ఈ విషయము తంత్రరాజమునందు చెప్పబడినది.

మూలాధారమునందు అగ్నిమండలము, హృదయకమలము (మణిపూరపద్మము) నందు సూర్యమండలము, శిరస్సునందు వికసించుచున్న బ్రహ్మరంధ్రమునకు క్రిందుగా చంద్రమండలము గలదు. ఈ మూడింటినే త్రిఖండమని యందురు. నిత్యాస్వరూపురాలైన పరమేశ్వరి ఈ త్రిఖండస్వరూపిణి. ఆయా ఖండములందున్నప్పుడు నిత్యాస్వరూపురాలు. గనుక మూలాధారమునందున్నప్పుడు అగ్నిస్వరూపిణియనియు, లేదా రవిప్రఖ్యా యను (596వ) నామమంత్రము ప్రకారము సూర్యునితో సమానమైన ప్రకాశము ఉన్నదిగాను, శిరస్సునందు బ్రహ్మరంధ్రము క్రిందనున్న చంద్రమండలమునందు ఉన్నప్పుడు చంద్రనిభా యను (592వ) నామ మంత్రము ప్రకారము చంద్రునితో సమానమైన ప్రకాశముగలదిగాను ఆ లలితా పరమేశ్వరిని భావించదగును. ఈ చెప్పబడిన సమానత్వమే త్రికోణాంతర దీపికాత్వము, త్రికోణాంతర దీపికా స్వరూప సమాన ధర్మముచే సూర్యునితో సమానమైనది యని భాస్కరరాయలు వారు చెప్పారు.

మేరు పర్వతమునకు అష్టదిక్కులందును అష్టకోణములు గలవు. సూర్యుడు మేరు పర్వతమునకు ప్రదక్షిణముగా సంచరించుచుండుటచేత , మూడుకోణములను మాత్రమే ప్రకాశింపజేయును. అది ఎలాగ అంటే మధ్యాహ్నకాలమున సూర్యుడు తూర్పు దిక్కునందున్నచో దక్షిణమునందు ఉదయించుట, సౌమ్య (ఉత్తర) దిక్కునందు అస్తమించుట జరుగును. అందుచే కోణత్రయముగా ఉన్నతూర్పు, దక్షిణము, ఉత్తరములు అను మూడు పురము (దిక్కు) లను ప్రకాశింపజేయుచున్నాడు. ఈ మూడు ప్రధాన దిక్కులకు (తూర్పు, దక్షిణము, ఉత్తరములకు) మధ్యనుండుటచే ఆగ్నేయము, ఈశాన్యమూలలను  (విదిక్కులను) ప్రకాశింపజేయుచున్నాడు అని చెప్పకనే చెప్పుచున్నట్లున్నది యగుటచే ఆగ్నేయ ఈశాన్యములు ప్రధాన త్రికోణరేఖలో మధ్యనున్నవి.   అట్టి సమయములో దక్షిణదిక్కునందు ఉదయము ఆగ్నేయకోణమునందు ప్రధమయామము (ప్రధమ యామము/మొదటి మూడుగంటలు), తూర్పున మధ్యాహ్నము (ద్వితీయ యామము/రెండవ మూడుగంటలు), ఈశాన్యకోణమున తృతీయయామము (మూడవఝాము/మూడవ మూడుగంటలు), ఉత్తర దిక్కున అస్తమయము (చతుర్థయామము/నాలుగవ మూడుగంటలు) జరుగుచుండును. సూర్య సంచారము ఈ విధముగా నుండుటచే త్రికోణ అనగా మూడుదిక్కులను, రెండు విదిక్కులను (మూలలను) దీపికా యనగా ప్రకాశింపజేయుచున్నాడు అని భావించదగును. అలాగే ఆగ్నేయదిక్కునందు మధ్యాహ్నము వచ్చినపుడు, ఈశాన్యమున అస్తమయము, నైరృతి దిక్కునందు ఉదయము, దక్షిణమున ప్రథమయామము (మొదటి మూడుగంటలు), ఇంద్రదిక్కు (తూర్ఫుదిక్కు) నందు తృతీయయామము జరుగును. ఈ విధముగా సూర్యసంచారము జరిగినప్పుడు మూడు విదిక్కులయొక్క రేఖలో మధ్య ఉండుటచే  రెండు ప్రధానదిక్కులను ప్రకాశింపజేయుచున్నాడు. అలాగే దక్షిణము మొదలగు దిక్కులందు మధ్యాహ్నకాలము అయినపుడు ఉదయాస్తమయములను తీసుకోవలయును.  ఈ విషయము విష్ణుపురాణమునందు చెప్పబడినది. సూర్యుడు  తూర్పుదిక్కు మొదలగు ప్రధాన దిక్కులందు ఉన్నప్పుడు మూడు ప్రధానదిక్కులు, రెండు విదిక్కులు ప్రకాశింపజేయును. విదిక్కులలో మధ్యాహ్నాదులు అయినప్పుడు మూడు విదిక్కులు (మూలలు), రెండు ప్రధాన దిక్కులను ప్రకాశింపజేయును. అది ఎట్లనగా తానున్న కోణము ఒకటి, తనకు కుడియందున్న రెండుకోణములు, ఎడమనందున్న రెండుకోణములు అనగా దిక్పంచకము ప్రకాశింపజేయుచున్నాడు. కోణములందున్నప్పుడు రేఖలు ప్రధానదిక్కులు అగును. ఈ విధముగా సూర్యుడు త్రికోణాంతరదీపకుడైనట్లే, రవిప్రఖ్యా యని  (596వ నామ మంత్రమునందు) అనబడిన పరమేశ్వరికూడా త్రికోణాంతరదీపికా యని అనబడినది.

అంతకన్నా ముఖ్యమైన విషయము  ఏమిటంటే
సూర్యుడు, చంద్రుడు, అగ్ని - ఈ మూడు తేజోమూర్తులకు తేజస్సునిచ్చుటచే త్రికోణాంతర దీపిక అని నామప్రసిద్ధమైనది.

అమ్మవారికి నమస్కరించు నపుడు ఓం త్రికోణాంతర దీపికాయై నమః యని అనవలెను.

అమ్మవారిని ఓం చంద్రనిభా త్రికోణాంతరదీపికా నమః యనియు, ఓంరవిప్రఖ్యా త్రికోణాంతరదీపికాయై నమః యనియు, ఓం హృదయస్థా త్రికోణాంతర దీపికాయై నమః యనికూడా అనవచ్చును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

598వ నామ మంత్రము 23.2.2022

ఓం దాక్షాయణ్యై నమః

దక్షుని పుత్రికగా జన్మించినందున దాక్షాయణీ అని పిలువబడే పరమేశ్వరికి నమస్కారము.

 శ్రీలలితా సహస్రనామావళిలోని దాక్షాయణీ అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం దాక్షాయణ్యై నమః అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని ఆరాధించు భక్తులకు దాక్షాయణీ స్వరూపిణి అయిన శ్రీమాత అభీష్టములను సిద్ధింపజేయును, నామజపంతో ఆత్మానందము కలుగజేసి తరింపజేయును. 

విద్యార్థి కల్పతరువులో ప్రజాపతులు ఇరువది ఒక్క మంది అని చెప్పబడినది. వారిలో దక్షుడు ఒకడు.

1.  బ్రహ్మ, 2. స్థాణువు, 3. మనువు, 4. దక్షుడు, 5. భృగువు, 6. ధర్ముడు, 7. యముడు, 8. మరీచి, 9. అంగిరసుడు, 10. అత్రి, 11. పులస్త్యుడు, 12. పులహుడు, 13. క్రతువు, 14. వసిష్ఠుడు, 15. పరమేష్ఠి, 16. సూర్యుడు, 17. సోముడు, 18. కర్దముడు, 19. క్రోధుడు, 20. అర్వాకుడు, 21. ప్రీతుడు.
 
దాక్షాయణి అంటే దక్ష ప్రజాపతి కూతురు అని అర్ధం. ఈమెకే సతీదేవి అని కూడా అంటారు. దక్షుడు స్వాయంభువ మన్వంతరంలో బ్రహ్మ కుడి బొటనవేలు నుంచి పుట్టాడు. ఇతని భార్య స్వాయంభువ మనువు కూతురైన ప్రసూతి. ఈమె కూతురే సతీదేవి. శివపురాణంలో సతీదేవి గురించి చక్కగా వర్ణించబడింది.

బ్రహ్మ తన కూతురైన సంధ్యాదేవిపైన మరులు గొనడాన్ని శివుడు అసహ్యించుకున్నాడు. బ్రహ్మ ఎలాగైనా పరమేశ్వరుడు కూడా ప్రేమ సముద్రంలో మునిగేట్లు చేయాలని పట్టుదల పూనాడు. విష్ణువు ఉపదేశించినట్లుగా బ్రహ్మ శక్తిని ప్రసన్నం చేసుకున్నాడు. శక్తి ప్రత్యక్షమై తాను దక్షపుత్రికగా జన్మించి శివుణ్ణి పరిణయమాడుతానని పలికింది.

దక్షయజ్ఞం

అహంకారంతో విర్రవీగిన దక్షుడు తను జరుపుతున్న యాగానికి అల్లుడైన ఈశ్వరుడిని ఆహ్వానించలేదు. అయినా ఈశ్వరుడి సతీమణి, దక్షుడి కుమార్తె దాక్షాయణి తండ్రి చేసిన తప్పును తెలిపి ఆయన మనసు మార్చడానికి ప్రయత్నించింది. శక్తి స్వరూపిణి దాక్షాయణి చేసిన నీతిబోధలు దక్షుడికి రుచించలేదు. దాంతో దక్షాయణి విరక్తి చెందింది. దక్షుడి అహంకారాన్ని అణచడానికి యాగం జరగకూడదని హోమాగ్నిలో దూకింది. దాక్షాయణి అగ్నికి ఆహుతి అయిపోయింది. ఈ విషయం తెలిసిన ఈశ్వరుడు క్రోధంతో రగిలిపోయాడు. దక్షుడు చేయబూనిన యాగాన్ని నాశనం చేశాడు. దాక్షాయణి కళేబరాన్ని భుజంపై వేసుకుని రుద్రతాండవం చేశాడు. అఖిలాండములు దద్దరిల్లాయి. భీతి చెందిన దేవతలు పరంధాముడైన శ్రీమహావిష్ణువును సహాయం కొరకు ఆశ్రయించారు. ఈశ్వరుని క్రోధాన్ని తగ్గించి మామూలు స్ధితికి తీసుకురమ్మని వేడుకొన్నారు. పరంధాముడు తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. చక్రాయుధం ఈశ్వరుని భుజంపై నిర్జీవంగా వున్న దాక్షాయణి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. దాంతో ఈశ్వరుడు తిరిగి మామూలు స్ధితికి చేరుకుని తప్పిదాన్ని తెలుసుకున్నాడు. ఉమామహేశ్వరి శరీరంలోని అవయవాలు పడిన ప్రదేశములు శక్తిపీఠాలుగా విలసిల్లినవి. అందులో ముఖ్యమైనవి పదునెనిమిది శక్తి పీఠములని తెలియజేయబడినది. 

శక్తిపీఠాలు

హిందువులు పార్వ‌తీ దేవిని ఆరాధించే దేవాల‌యాల‌లో పురాణ గాథ‌ల‌, ఆచారాల ప‌రంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కొన్ని స్థలాల‌ను శ‌క్తిపీఠాలు అంటారు. ఈ శ‌క్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విష‌యంలో విభేదాలున్నాయి. పదునెనిమిది (18) అనియు, ఏబది ఒకటి అనియు, ఏబది రెండు (52) అనియు,  నూట ఎనిమిది (108) అనియు, వేర్వేరు లెక్క‌లున్నాయి. అయితే పదునెనిమిది (18) ప్ర‌ధాన‌మైన శ‌క్తి పీఠాల‌ను అష్టాద‌శ శ‌క్తి పీఠాలు అంటారు.  

1. శాంకరీదేవి :

ట్రింకోమలి( శ్రీలంక) లోని ఒక కొండపై శిథిలాలయాన్నే శాంకరీ దేవి కొలువైన ప్రదేశంగా భావిస్తున్నారు. (ఈ ఆలయ ఆనవాళ్ళు పోర్చుగీసుల దాడి కారణంగా కనిపించుట లేదు.)

2. కామాక్షీదేవి :

కామాక్షీ దేవి ఆలయం కాంచీపురం, తమిళనాడు ఉంది. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడినట్టు చెప్పే ప్రదేశం. ఇక్కడ అమ్మవారు కామాక్షి రూపంలో కొలువై ఉంది.

3. శృంఖలాదేవి :

అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ శృంఖలాదేవిని అక్కడి వారు చోటిల్లామాత గా పూజిస్తారు. పాండువానే అసలైన శివక్షత్రమని, ఇది పశ్చిమబెంగాల్లో వెలసి ఉంది.

4. చాముండేశ్వరీదేవి:

ఈ ఆలయం మైసూరు, చాముండి పర్వతాలపై, కర్ణాటకలో ఉన్నది. ఈ ప్రదేశంలో ఆ పరమేశ్వరుడి రుద్రతాండవంలో అమ్మవారి శిరోజములు ఊడి ఈపర్వతాలపై పడ్డాయని స్థల పురాణం చెబుతుంది.

5. జోగులాంబాదేవి:

ఇది ఆలంపూర్, తెలంగాణ రాష్టంలో ఉంది. సతీదేవి ఖండితాంగాలలో  పైవరుస దంతాలు, దవడ భాగం పడినట్లు చెప్పే చోటు.

6.భ్రమరాంబికాదేవి :

శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు చక్రంతో ఖండింప బడిన సతి మెడ భాగం పడిన ప్రదేశమే శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అయితే ఇక్కడే పరమేశ్వరుని యొక్క ద్వాదశ జోతిర్లింగము ఉండుట చేత శ్రీశైలము ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగాకూడా ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి.

7. మహాలక్ష్మీదేవి:

ఆది పరాశక్తి అంబాబాయి గా కొల్హాపూర్, మహారాష్ట్రలో వెలసింది. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు.

8. రేణుకాదేవి:

మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలో, మాహుర్ క్షేత్రంలో వెలిసిన తల్లి రేణుకాదేవి. ఇక్కడి వారు ఈ తల్లిని ఏకవీరికాదేవి గా కొలుస్తారు. సతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల నుండి పూజలందుకుంటున్నది.

9. మహాకాళీదేవి:

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ప్రదేశంలో సతీదేవి పై పెదవి పడినదని దేవీ భాగవతం తెలుపుతోంది. ఇక్కడ ఈ తల్లి మహంకాళీ రూపంలో ఆ నగరాన్ని రక్షిస్తోందని చెబుతారు.

10. పురుహూతికాదేవి:

పురాణ ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక్కడ సతీదేవి పీఠబాగం పడిన చోటు కాబట్టి, ఈ ప్రదేశానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణలు తెలుపుతున్నాయి.

11.గిరిజాదేవి :

ఒడిశా, జాజ్‌పూర్ లో వెలసిన తల్లి గిరిజాదేవి. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని అక్కడి స్థానికులు బిరిజాదేవిగా , విరిజాదేవిగా కొలుస్తారు.

12. మాణిక్యాంబాదేవి:

ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్ లో సతీ దేవి ఎడమ చెంప భాగం పడినట్లు, ఈ ప్రదేశాన్ని ద్రాక్షారామంగా, దక్షవాటికగా పిలిచే ఈ గ్రామం పంచారామక్షేత్రంగా కూడా వెలసినది.

13. కామరూపాదేవి:

అసోం రాజధానికి గువాహటి (గౌహతి) లోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవి గా కొలుస్తారని స్థలపురాణం.

14. మాధవేశ్వరీదేవి :

అమ్మవారి కుడిచేతి వేళ్ళు ప్రయాగ, ఉత్తరప్రదేశ్ లో పడినట్లు చెబుతారు. ఇక్కడ సతీదేవిని అలోపీదేవి గా కొలుస్తారు. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగు దిక్కులా సమానంగా కట్టిన పీఠం మాత్రం ఉంటుంది.

15. వైష్ణవీదేవి :

కాంగ్రా, జ్వాలాముఖి, హిమాచల్‌ప్రదేశ్ వెలసిన దేవీ వైష్ణోదేవి. ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలముఖి గా భక్తులకు దర్శనమిస్తారు.

16. సర్వమంగళాదేవి :

సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు బీహార్ లోని గయా ప్రాంతంలో పడినట్లుగా చెబుతారు. ఈ అమ్మవారే మంగళగౌరీదేవి. ఈ స్థలపురాణానికి తగినట్లుగానే వక్షోజాలను పోలినట్లుగా రెండు ఆలయములు, ఆ రెండు ఆలయములపై ఆచ్ఛాదనగా వస్త్రమును కప్పుట వంటి ఏర్పాటు చేశారు. ఇక్కడ అమ్మవారిని మంగళగౌరిగా పూజిస్తారు భక్తులు.

17. విశాలాక్షీదేవి :

సతీదేవి మణికర్ణిక(చెవి భాగం) వారణాసి, ఉత్తరప్రదేశ్ పడిందని, ఈ ప్రదేశం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయసమీపంలో ఉన్నట్లు స్థలపురాణం తెలుపుతోంది.

18. సరస్వతీదేవి :

పాక్ అక్రమిత ప్రదేశమైన కాశ్మీర్ లోని ముజఫరాబాద్ కు దాదాపు నూట ఏబది కిమీ దూరంలో ఈ శక్తిపీఠం ఉండేదని చెబుతారు.

మరో విశేషము ఏమిటి అంటే శక్తీపీఠముల ఆలయములన్నియు చిన్నవిగా ఉంటాయి.

దక్షుడు పరమ భక్తుడు. నిరంతరము పరమేశ్వరిని ఆరాధించేవాడు. అతని భక్తికి ప్రతిఫలంగా దక్షుని కూతురుగా శ్రీమాత అవతరించినది. ఈ విధంగా శ్రీమాత అవతార విశేషాలు తర్వాత నామాలలో తెలియగలము. 

దాక్షాయణి అనగా వింశ్వంభరా దేవి స్వరూపురాలని భావిస్తూ ఆ దయామయికి నమస్కరించునపుడు ఓం దాక్షాయణ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

599వ నామ మంత్రము 24.2.2022

ఓం దైత్యహంత్ర్యై నమః

భండాసుర మహిషాసురాది రాక్షసులను సంహరించి మంచి వారిని కాపాడిన జగన్మాతకు నమస్కారము

శ్రీలలితా సహస్ర నామా వళియందలి దైత్యహంత్రీ అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం దైత్యహంత్ర్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఉపాసించు భక్తులకు శత్రునాశనమొనర్చి, అజ్ఞాన, అసురీ ప్రవృత్తులను తొలగించి జ్ఞానవికాశమును ప్రసాదించి తరింపజేయును మరియు అభీష్ట సిద్ధిని కలుగజేయును.

కశ్యప ప్రజాపతికి అదితి, దితి అని ఇద్దరు భార్యలు. అదితికి పుట్టినవారు దేవతలు, దితికి పుట్టినవారు దైత్యులు. దైత్యులది రాక్షస ప్రవృత్తి. బ్రాహ్మణులను, మునులను, ఋషులను, స్త్రీలను, ఇంద్రాది దేవతలను మరియు యజ్ఞములు, హోమములు మొదలైన పుణ్యకార్యములను చేయువారిని హింసించడమే వారి పని.  అలాంటి వారిలో భండాసురుడు, మహిషాసురుడు మొదలైనవారు. వారు లోక కంటకులై ఉండేవారు. అమ్మవారు నవదుర్గలుగా అవతారములెత్తి వారిని సంహరించి లోకమునకు మేలు చేసినది. ఇంకను తన చేతి పదివ్రేళ్ళ గోళ్ళసందుల నుండి శ్రీమన్నారాయణుని పది అవతారములు సృష్టించి (కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః) రాక్షస సంహారము చేయించి దేవతలకు సహాయపడినది (దేవకార్య సముద్యతా). ఆ విధంగా దైత్యులను (దుష్టులను) శిక్షించి, శిష్టులను ప్రహ్లాదాది భక్తజనులను రక్షించుటచే ఆ జగన్మాత దైత్యహంత్రీ అనగా దైత్యులను సంహరించినదిగా నామ ప్రసిద్ధమైనది. 

తన భక్తులలో క్రూర (ప్రవృత్తిని (ఉంటే) నాశనమొనర్చి సన్మార్గులను జేసిన దైత్యహంత్రికి నమస్కరించునపుడు ఓం దైత్యహంత్ర్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

600వ నామ మంత్రము 25.2.2022

ఓం దక్షయజ్ఞ వినాశిన్యై నమః 

దక్షయజ్ఞవినాశనానికి కారణమైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి దక్షయజ్ఞ వినాశనీ అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం దక్షయజ్ఞ వినాశిన్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాత్పరిని ఉపాసిస్తే అమ్మ కరుణచే జ్ఞానమయులై విరాజిల్ల గలరు.

బ్రహ్మ తలపెట్టిన యాగానికి దేవతలందరూ ఆహ్వానింపబడ్డారు. దేవతలందరూ ఆ యాగమునకు విచ్చేశారు. దక్షుడు రావడం కొంచం ఆలస్యమయినది. దక్షప్రజాపతి సాక్షాత్తు బ్రహ్మ తనయుడు గనుక వచ్చిన దక్షప్రజాపతిని చూడగానే దేవతలంతా లేచి నిలబడ్డారు. పరమేశ్వరుడు మాత్రం నిలబడలేదు. దక్షునిలో అహంకారం విజృంభించింది. అహంకారంతో విర్రవీగిన దక్షుడు తను జరుపుతున్న యాగానికి కూతుళ్ళనందరినీ ఆహ్వానించాడు. సతీదేవిని ఆహ్వానించలేదు. అల్లుడైన ఈశ్వరుడిని కూడా ఆహ్వానించలేదు. అయినా ఈశ్వరుని సతీమణి, దక్షుడి కుమార్తె దాక్షాయణి (సతీదేవి) తండ్రి చేసిన తప్పును తెలిపి ఆయన మనసు మార్చడానికి ప్రయత్నించింది. శక్తి స్వరూపిణి దాక్షాయణి చేసిన నీతిబోధలు దక్షుడికి రుచించలేదు. దాంతో దక్షాయణి విరక్తి చెందింది. దక్షుడి అహంకారాన్ని అణచడానికి యాగం జరగకూడదని హోమాగ్నిలో దూకింది దాక్షాయణి అగ్నికి ఆహుతి అయిపోయింది. ఈ విషయం తెలిసిన ఈశ్వరుడు క్రోధంతో రగిలిపోయాడు. దక్షుడు చేయబూనిన యాగాన్ని నాశనం చేశాడు. దాక్షాయణి కళేబరాన్ని భుజంపై వేసుకుని రుద్రతాండవం ఆడాడు. అఖిలాండం దద్దరిల్లింది. భీతి చెందిన దేవతలు శ్రీమహావిష్ణువును సహాయం కొరకు ఆశ్రయించారు. ఈశ్వరుని క్రోధాన్ని తగ్గించి మామూలు స్ధితికి తీసుకురమ్మని వేడుకొన్నారు. పరంధాముడు తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. చక్రాయుధం ఈశ్వరుని భుజంపై నిర్జీవంగా వున్న దాక్షాయణి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. దాంతో ఈశ్వరుడు తిరిగి మామూలు స్ధితికి చేరుకుని తప్పిదాన్ని తెలుసుకున్నాడు. "ఉమామహేశ్వరి శరీరంలోని అవయవాలు ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలలో శక్తిపీఠాలుగా విలసిల్లుచున్నవి. సతీదేవికి జరిగిన అవమానానికి శివుడు కూడా మిగుల కోపోద్రిక్తుడై తన జటాఝూటం నుండి వీరభద్రుని సృష్టించి వదిలాడు, ఆ వీరభద్రుడు దక్షుని యాగాన్ని నాశనం చేయడంలో ముఖ్యపాత్ర వహించాడు, ఆవిధంగా జగన్మాత దక్షయజ్ఞ వినాశనానికి కారణ మవడంచేత శ్రీమాత దక్షయజ్ఞవినాశనీ యని అనబడినది. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం దక్షయజ్ఞ వినాశిన్యై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి