27, జనవరి 2022, గురువారం

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

33వ నామ మంత్రము  27.1.2022

ఓం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తన్యై నమః

కామేశ్వరుని భౌతాకాతీతమైన ప్రేమరత్నమును పొందుటకు కామేశ్వరి (శ్రీమాత) తన భౌతికమైన స్తనరత్నములను పణముగా సమర్పించుకున్న జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తనీ అను పదహారు అక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తన్యై నమః అని ఉచ్చరించుచూ భక్తితత్పరతతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునకు భౌతికపరమైన వాంఛలు పోయి ఆధ్యాత్మికతా తత్త్వ మానసుడై ఆ పరమేశ్వరీ పాదసేవాపరాయణుడై శాశ్వత బ్రహ్మత్వసాధనలో తరించును.

ఈ నామ మంత్రమందు విశేషమైన ఆధ్యాత్మికతత్త్వము ఇమిడి ఉంది. అదేమిటంటే పార్వతీ పరమేశ్వరులవలె అన్యోన్యంగా జీవించండి అని నూతన దంపతులను ఆశీర్వదించడం జరుగుతూ ఉంటుంది.

ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోళాశంకరుడిగా, పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే పరమేశ్వరుడు. లింగ స్వరూపంలో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను నిర్వహిస్తూఉంటాడు. పరమేశ్వరుడిని నిరంతరారాధన చేసేవారి హృదయమే కైలాసమై, వారి మనసులోని కామక్రోధాదులు శమించి నిరంతరానందాన్ని పొందుతారన్నది సత్యము. నిర్గుణ పరబ్రహ్మ యొక్క కర్మ స్వరూపం శ్రీమహావిష్ణువు అయితే, జ్ఞాన స్వరూపం పరమేశ్వరుడు. అందుకే లౌకిక పురోగతికి విష్ణు రూపాన్ని, ఆధ్యాత్మిక పురోగతికి శివ స్వరూపాన్ని ఆరాధన చేయాలి. ఇంతటి భౌతికాతీతమైన పరమేశ్వరుని ప్రేమ అనే ఒక రత్నాన్ని పొందడానికి జగన్మాత తన స్తన రత్నములను రెండిటిని పణముగా పరమేశ్వరునికి ఇచ్చినది. ఇలా ఆ ఆది దంపతులు  వారి ప్రేమ అనే వస్తువులను ఇచ్చి పుచ్చుకున్నారు అంటే పరమేశ్వరుని ప్రేమరత్నంపై శ్రీమాతకు, శ్రీమాత స్తన రత్నములపై పరమేశ్వరునకు హక్కులు ఇచ్చి పుచ్చుకున్నారు అంటే అయ్యవారి ప్రేమ ఇంక అమ్మవారిదే...అమ్మవారికొక్కదానికే...ఆ ప్రేమలో ఇంకొకరికి భాగంలేనట్లే అంటే అయ్యవారు ఏక పత్నీవ్రతుడే గదా. అలాగే అమ్మవారి స్తనరత్నాలు అయ్యవారికి మాత్రమే అంటే అమ్మవారి పాతివ్రత్యానికి నిదర్శనమేగదా. అయ్యవారి, అమ్మవారి దివ్యమైన మరియు పవిత్రమైన దాంపత్య ఫలితమే ఈ విశ్వం గనుక దంపతులైనవారు అందరూ ఇదే పాతివ్రత్యాన్ని, ఏక పత్నీవ్రతాన్ని కలిగి ఉండాలని సూచనయే కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తనీ అను నామ మంత్రములోని భావము.

వశిన్యాది వాగ్దేవతలు అమ్మ ఆదేశం మేరకు కోట్లాది సహస్ర నామాలలో శ్రీలలితా సహస్ర నామములను అత్యంత ప్రాధాన్యమైనదిగా రచించారు. శ్రీలలితా సహస్ర నామాలు ఇతర సహస్ర నామాలవలె ఋషులుగాని, తాపసులుగాని ఇంకెవరో మానవమాత్రులు రచించినవి కావు. సాక్షాత్తు ఆదిపరాశక్తి నుండి వెడలివచ్చిన ఎనిమిది అద్భుతమైన కిరణములే ఆ వశిన్యాదులు (వశినీ, కామేశ్వరి, మోదిని, విమల, జయిని, అరుణ,  సర్వేశ్వరి, కౌళిని). వారు పరబ్రహ్మస్వరూపిణియైన పరమేశ్వరి అంశ నుండి వ్యక్తమైన బ్రహ్మజ్ఞానస్వరూపులు. అమ్మవారిని కీర్తించడానికి, ఆ తల్లికి ప్రియాతి ప్రియమైన సహస్రనామములు మాత్రమేగాక, బ్రహ్మజ్ఞాన తత్త్వము, పిండాండము నుండి బ్రహ్మాండము వరకు  ఇమిడియున్న అనంతమైన పంచకృత్యపరాయత్వము, ఆ పరమేశ్వరియొక్క స్థూల, సూక్ష్మ, కారణ రూపముల తత్త్వము, శ్రీయంత్రము, బ్రహ్మాండము, పిండాండము - ఈ మూడింటియొక్క సమన్వయమును తెలిపే షట్చక్రాది విశేషములు, చతుష్షష్టికోటి యోగినీ గణదేవతలు, తిథిమండలములు... ఇంకను ఎన్నో పరబ్రహ్మ తత్త్వమునకు సంబంధించిన విషయములను రహస్యాతి రహస్యమైన శ్రీలలితా సహస్ర నామములలో నిక్షిప్తముజేసి అనంతమైన బ్రహ్మజ్ఞాననిధిని మనకు సమర్పించారు. అమ్మవారి నామములు కేవలము సహస్రము మాత్రమేకాదు. పంచదశీమంత్ర స్వరూపమైన త్రిశతి మాత్రమేకాదు. సకలదేవతా స్వరూపిణియైన ఆ పరమేశ్వరికి అనంతకోటి నామములు గలవు. అనంతకోటి స్వరూపములుగలవు. అంతటి అమ్మవారు పరమేశ్వరుని ప్రేమ యనే రత్నమును పొందుటకు తన స్తనద్వయం పణంగా (మూల్యముగా) సమర్పించినది అంటే పరమేశ్వరుడు ఎవరు? ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోళాశంకరుడిగా, పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే పరమేశ్వరుడు.

పరమేశ్వరుడిని నిరంతరారాధన చేసేవారి హృదయమే ఒక వెండికొండ. నిరంతరానందాన్ని పొందుతుంది.  జ్ఞాన స్వరూపం ఆ పరమేశ్వరుడు. ఆధ్యాత్మిక పురోగతికి శివ స్వరూపాన్ని ఆరాధన చేయాలని వేదాలు చెబుతున్నాయి.

వేదం శివుడిని సకల దుఃఖ హరుడైన రుద్రుడిగా చెబుతోంది. శత్రుబాధ, పిశాచపీడ, దుఃఖము పోవడానికి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని,

విషపూరిత జీవుల నుండి రక్షణకై ఓం నమో భగవతే నీలకంఠాయ అనే మంత్రాన్ని పఠించాలన్నది వేదవచనం. అంతటి వాడైన పరమేశ్వరునికి ఆ పరమేశ్వరి ఆ విధంగా తనను తాను సమర్పించుకున్నది. ఆయనలో సగం తానై అర్ధనారీశ్వర తత్త్వాన్ని లోకానికి తెలియజేసింది ఆ పరమేశ్వరి. 

అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు  ఓం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తన్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

34వ నామ మంత్రము 28.1.2022

ఓం నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయ్యై నమః

 నాభి (అను పాదు) నుండి వక్షస్థలం వరకూ ఉన్న నూగారు (సన్నని నూగువలె ఉన్న రోమాళి) అను తీగ (లత) కు ఫలముల వలె ఉన్న స్తనములతో తేజరిల్లు జగన్మాతకు నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయీ అను పదహారక్షరముల (షోడశాక్షరీ)  నామ మంత్రమును ఓం నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయ్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఉపాసించు సాధకుడు రాగద్వేషరహితుడై, ఆత్మానందానుభూతిని పొందును.

పొట్ల, చిక్కుడు వంటి తీగ మొక్కలను పెంచుటకు ముందు ఒక చిన్న గుంటచేసి, గింజను వేసి కొంచం మట్టితో కప్పి చిన్న పళ్ళెంవలె మట్టిని ఆ గుంటకు చుట్టూ ఏర్పాటు చేస్తారు. దానిని పాదు అంటారు. అందులో నీరు పోస్తూండగా గింజ మొలకెత్తి తీగవస్తే దానిని పందిరిపైకి వచ్చేలా ఏదైనా ఆధారం ఏర్పాటు చేస్తారు. తీగ పందిరిపైకి వచ్చిన తరువాత ద్రాక్షతీగ వంటిదైతే ఆ తీగకు పందిరిపై ద్రాక్షపళ్ళు ఏర్పడతాయి. అలాగ శ్రీమాత అమ్మవారి బొడ్డు అనే పాదునుండి సన్నని రోమాళి నాభి నుండి వక్షస్థలం క్రింది వరకూ ఊర్థ్వముఖంగా ఉంటుంది,  దీనినే నూగారు అంటారు, అటువంటి నూగారు అనే తీగకు  అమ్మవారి స్తనయుగము తీగకు రెండు ప్రక్కల ఫలముల వలె ఉండి జగన్మాత విరాజిల్లుచున్నదని వశిన్యాదులు ఈ నామ మంత్రములో వర్ణించారు.

ఇచ్చట నాభి అనునది మణిపూర చక్రస్థానము అయితే,  స్తన మధ్యభాగం - అనాహత చక్రస్థానము అవుతుంది.  ఇడా, పింగళా నాడుల ఆ పరమేశ్వరి స్తనములుగా భావించితే, బొడ్డు నుండి వక్షస్థలంవరకూ ఉర్ధ్వముఖంలో ఉన్న సన్నని రోమాళిని సుషమ్నా నాడిగా భావించవచ్చును.

నాభియందు ఆలవాలత్వము  (పాదు అనే భావము), రోమాళియందు లతాత్వము సమన్వయించబడినవి. కుచముల యందు ఫలత్వము సమన్వియింపబడినది. మొదటి సమన్వయము రెండవ సమన్వయత్వమునకు కారణములుగా భావింపదగును. తల్లీ బిడ్డల మధ్యగల   పుట్టిన వెంటనే బొడ్డును కోయడంతో భౌతిక బంధం తెగుతుంది. అందుకే బొడ్డును కోస్తారు. అయితే ప్రేమబంధంతో సంబంధం ఉండదు అని తెలియదగును.  శివుని కోపాగ్నికి మన్మథుడు కాలిపోతే, ఆ తాపం తగ్గడం కోసం అమ్మవారి నాభి అనే సరసులో దూకితే - అప్ఫుడు ఆ బొడ్డు అనే సరస్సునుండి సన్నని తీగలాగా పైకిలేచిన పొగతీగవలె అమ్మవారి నూగారు (సన్నని) రోమాళి ఉంటుందని శంకరాచార్యులవారు సౌందర్యలహరియందు  డెబ్బది ఎనిమిదవ శ్లోకంలో ఇలా వర్ణించారు.

స్థిరో గంగావర్త - స్తనముకుళ రోమావళిలతా

కలావాలం కుండం - కుసుమశరతేజో హుతభుజః ||

రతేర్లీలాగారం - కిమపి తవ నాభి ర్గిరిసుతే

బిలద్వారం సిద్ధే - ర్గిరిశ నయనానాం విజయతే॥78॥

ఓ పరమేశ్వరీ!  నీ నాభి నిశ్చలమైన గంగ ప్రవాహం. స్తనములు అను పూలమొగ్గలకు ఆధారమైన రోమరాజి యనెడు తీగకు పాదు. మన్మథుని పరాక్రమాగ్నికి హోమగుండము. రతీ దేవికి విహార గృహము. ఈశ్వరుని కనుల సిద్ధికి గుహాముఖము. అయి విరాజిల్లుచున్నది.

జననీ!  ఓ జగన్మాతా! నీ నాభిని, వక్షస్థలం పైకి ఊర్ధ్వమఖంగా ఉన్న సన్నని రోమాళి -  నూగారును ఎంత వర్ణించినా తక్కువే తల్లీ. అవి అంత సౌందర్యవంతమైనవి. నీ నాభి గంగానదియందు పుట్టిన స్థిరమైన సుడిగుండమయితే,  పయోధరములు అను రెండు పుష్పములు పూచిన రోమావళి (నూగారు) అను లతకు ఆధారమైన పాదులా ఉంటుంది. (అమ్మ నాభి పాదు ఐతే నూగారు దానినుండి వచ్చిన తీగగా, ఆపైన పాలిండ్లు ఆ తీగకు పూచిన రెండు పుష్పములు గా ఉన్నవి అని) మన్మథుని తేజస్సు అను కాంతితో ప్రకాశించుచున్న అగ్నిహోత్రంతో కూడిన హోమగుండలా ఉంటుంది, రతీదేవి విహరించే గృహంలా ఉంటుంది, ఇక పరమేశ్వరుని కంటికేమో తనకు తపస్సిద్ది నొసంగు గుహద్వారంలా ఉంటుంది ఇలా ఎంతని చెప్పను జగన్మాతా! ఎంత వర్ణించినా తనివి తీరనంతటి అందంతో నీ నాభి విరాజిల్లుతున్నది -  ఇక్కడ  వర్ణింపబడిన అమ్మ నాభి పాదువలె, రోమావళి లతవలె చెప్పబడినది.

శంకరాచార్యులవారు పై శ్లోకములో  పూలమొగ్గలని చెప్పినవి ఈ నామ మంత్రంలో వశిన్యాదులు ఫలములుగా వర్ణించారు.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయ్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

35వ నామ మంత్రము 29.1.2022

ఓం  లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమాయై నమః.

కనబడుచున్న నూగారు (రోమలత) అను తీగకు ఆధారంగా విరాజిల్లు సన్నని నడుము గలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమా అను పదహారు అక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రముసు ఓం లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమాయై నమః అని ఉచ్చరించుచూ పరమేశ్వరీ పాదసేవాపరాయణులైన భక్తులకు పరమేశ్వరి అనుగ్రహంలభించి శ్రీవిద్యా తత్త్వము పూర్తిగా అవగాహన చేసుకొని ఆత్మానందానుభూతిని పొంది తరించుదురు.

పందిరి మీదకు తీగ పాకాలంటే ఆలంబన అవసరము. పాదులో మొక్క తీగ వేయుట ప్రారంభించిందంటే ఏదో ఒక సన్నని కర్రవంటిది లేదా పాదుకు చూట్టూ కంపకట్టి ప్రారంభమైన తీగ పందిరి మీదకు వెళ్ళడానికి ఆధారం ఇస్తారు. ఆ తీగ చాలా సున్నితంగా ఉంటుంది. ఇచ్చిన ఆలంబనను తీసుకొని పందిరి మీదకు తీగ ప్రాకడం ప్రారంభిస్తుంది. అమ్మ వారి నాభి అనే పాదులో ప్రారంభమైన నూగారు (నూగువంటి రోమాళి) అను తీగ వక్షస్థలము పైకి ప్రాకుతుంది. ఆ నూగారు తీగకు అమ్మవారి స్తనములు ఫలములైనవని  ఇంతకు ముందు నామములో చెప్పబడినది. ఆ నూగారు అను తీగ పైకి పాకడానికి ఆలంబన (ఆధారం) అవసరము.  అమ్మవారి సన్నని అందమైన నడుమే ఆ నూగారు అను తీగకు ఆధారము.

సన్నని నడుము గల స్త్రీని సింహమధ్య అంటారు. స్త్రీలకు నడుము అందంగా సన్నగా ఉండడం శుభప్రదమైన సాముద్రిక లక్షణము. 

అమ్మవారి నడుమును శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరి, ఏడవ శ్లోకంలో ఇలా వర్ణించారు:-

క్వణత్కాంచీ-దామా కరి కలభ కుంభస్తనభరా

పరిక్షీణా మధ్యే - పరిణత శరచ్చంద్రవదనా |

ధనుర్బాణాన్ పాశం -  సృణిమపి దధానా కరతలైః

పురస్తా దాస్తాం నః -  పురమథితు రాహోపురుషికా॥7॥
 
మంగళప్రదమైన సవ్వడులు చేయుచున్న మెరయుచున్న మణులతో కూడిన బంగారు మొలనూలు ధరించినదియు, మదపుటేనుగుల కుంభస్థలముల వంటి స్తనముల భారముచే కొంచము ముందుకు వంగినదియు, (సాధారణ తల్లులే తమ బిడ్డలకై క్షీరసమృద్ధితో భారమైన స్తనద్వయం కలిగియుండగా  సకల జగత్తుకూ తల్లియైన జగన్మాత, జగత్తులోని అందరి బిడ్డల ఆకలినీ పోగొట్టుటకు భారమైన స్తనములతో ఒప్పారుచున్నది)
కృశించిన సన్నని నడుము కలదియు, శరత్కాల పూర్ణిమనాటి చంద్రబింబమువంటి ముఖారవిందము కలిగినదియు, చతుర్భుజముల కరములయందు చెరకువిల్లు, పుష్పబాణములు, పాశ, అంకుశములు ధరించునదియు, త్రిపురాసురులను సంహరించిన పరమేశ్వరుని యొక్క అహంకారమే స్వరూపముగా కలిగినదియు అయిన అటువంటి జగన్మాతయైన ఆదేవి ఎల్లవేళలా నా మనోనేత్రములయందు గోచరమవుతూ నా మనో ఫలకముపై సుఖాసీనయై ఉండుగాక!

అందమైన సన్నని నడుము గల స్త్రీలను అసలు నడుము ఉందా లేదా అని సందేహించేంత సన్నని నడుము కలది అని అంటూంటారు.. స్త్రీలకి నడుము బాగము ఎంత సన్నగా ఉంటే అంత తేలికగా పిల్లలను ప్రసవించ గలుగుతారు అని అంటారు. ఇది కూడా ఉత్తమ సాముద్రిక లక్షణము. జగదేక సుందరి, సకలజగములకు తల్లి అయిన పరమేశ్వరికి నడుము ఈ కారణం చేతనే సన్నగా ఉన్నది అని భావము.

శంకరభగవత్పాదులవారు ఇంకను తమ సౌందర్యలహరియందు డెబ్బది తొమ్మిదవ (79వ) శ్లోకంలో ఇలా వర్ణించారు.

నిసర్గక్షీణస్య - స్తనతటభరేణక్లమజుషో

నమన్మూర్తే ర్నారీతిలక శనకైస్త్రుట్యత ఇవ|

చిరం తే మధ్యస్య - త్రుటితతటినీతీర తరుణా

సమావస్థాస్థేమ్నో - భవతు కుశలం శైలతనయే||79||

సహజముగానే కృశించింది. స్తన భారముచే వంగినది. నాభియు, వళులు (మడతలు) ను ఉన్న చోట విఱిగిపోవునో యన్నట్లున్నది. ఒడ్డు విఱిగిన నదీ తీరమున ఉన్న చెట్టువలె ఊగుచున్నది.
 
ఓ జగన్మాతా!  నారీ శిరోమణీ!  అతి సన్నగా ఉన్న నీ నడుమును చూస్తుంటే అది ఎక్కడ తునిగిపోవునో (విరిగిపోవునో) అని నాకు కంగారు కలుగుచున్నది. సహజంగానే మిగుల కృశించి సన్నంగా ఉండేది, స్తన భారంచేత బడలిపోయి కొంచెం వంగిన ఆకారము కలిగినది, ఒడ్డు (గట్టు) మీద ఉండి వాగువైపునకు వంగిన చెట్టులా వంపుతిరిగి ఉండేది అయిన నీ నడుము చిరకాలమూ కుశలంగా ఉండి మాకు క్షేమం కలిగించుగాక.

సన్నగా కృశించి ఉన్న నడుము స్త్రీ అందంలో ప్రధాన. భూమిక పోషించును. అమ్మవారి నడుము అత్యంత సుకుమారంగా సుందరంగా ఉన్నది అని కవి భావన.  అమ్మ నడుముకు పై భాగము, క్రింద భాగము విశాలముగా ఉండి మధ్యలో ఈ నడుము ఉన్నదా లేదా అని అనిపించేంత అతి సన్నదిగా ఉన్నది అని భావము.

దేవియొక్క ఆవిర్భావ కాలమున ఇంద్రుని తేజముచే నడుము ఏర్పడెను అని దేవీభాగవతంలో పంచమస్కంధంలో, పదకొండవ అధ్యాయంలో డెబ్బది ఒకటవ శ్లోకంలో చెప్పబడినది.

సౌమ్యేన తేజసా జాతం స్తనయో ర్ముగ్మముత్తమమ్‌|

ఇంద్రేణా స్యా స్తథా మధ్యం జాతం త్రివళిసంయుతమ్‌॥71॥

చంద్రుని తేజస్సుతో రెండు వక్షోజములు, ఇంద్రుని తేజస్సుతో మధ్యభాగమగు కటిప్రదేశము మరియు త్రివళులు (పొట్టపై ఉండు మూడు మడతలు),

సమున్నేయ మధ్యమా అనగా చక్కగా  ఉద్ధరింపబడిన నడుముకలిగినది అని అర్థము. అమ్మవారి విరాట్స్వరూపంలో నాభికి పైన ఊర్ధ్వలోకములు,  నాభికి దిగువన అధోలోకములు ఉన్నవి. ఊర్ధ్వలోకములను, అధోలోకములను ఉద్ధరించేందుకే అంతసన్నని నడుము ఉన్న పరమేశ్వరిని సమున్నేయ మధ్యమా  యని విశేషించి చెప్పడం జరిగినది.

శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమాయై నమ  అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

36వ నామ మంత్రము 30.1.2022

ఓం స్తనభారదళన్మధ్యపట్టబన్ధ వళిత్రయాయై నమః

దృఢమైన స్తనముల భారముచే నడుము విరుగునేమోయని నడుము చుట్టూ పట్టీలువలెనున్న వళిత్రయము (పొట్టపై మూడు మడతలు) గలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళియందలి స్తనభారదళన్మధ్యపట్టబన్ధ వళిత్రయా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం స్తనభారదళన్మధ్యపట్టబన్ధ వళిత్రయాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఉపాసించు సాధకులకు కాలస్వరూపిణియైన శ్రీమాత కరుణచే సర్వసౌభాగ్యములు, సుఖసంతోషములు, ఎనలేని ఆత్మానందము కలుగును మరియు పరాశక్తి ఆరాధనలో మరింత ఏకాగ్రత ఏర్పడి పరమపదమునకు సోపానములు ప్రాప్తించి తరించుదురు.

అమ్మవారి స్తనద్వయం రవిసోమాత్మకమైన కాలాన్ని తెలియజేస్తుంది. అట్టి కాలమును భరించునది కావున ఆ పరమేశ్వరి కాలస్వరూపిణి యను భావము గ్రహించునది. స్తనముల బరువుచే నడుము విరుగునేమో యని కట్టిన పట్టీలవలె ఆ అమ్మవారి పొట్టమీద మూడు ముడుతలు గలవట.  చాలా సహజంగా యుక్తవయసు రాగానే పొట్టమీద మడతలు ప్రతివారికిని ఏర్పడుతాయి. జగన్మాత విషయంలో కొంచం ఉత్ప్రేక్షించడం జరిగింది. స్తనభారముచే సన్నని నడుము వంగిపోవునేమోనని భయంతో బంగారు పట్టీని నడుముచుట్టూ కట్టినట్లుగా శ్రీమాత వళిత్రయము (పొట్టపైగల మూడు మడతలు) ఒప్పుచున్నదట..ఆ వళిత్రయముతో అమ్మవారి సౌందర్యము మరింత ఇనుమడిస్తోందట. ఇది అంతయు వశిన్యాదులు జగన్మాత సౌందర్య వర్ణనలో ఉపయోగించిన ఉత్ప్రేక్షాలంకారమే అవుతుంది. అలా ఈ నామ మంత్రమును వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి ఎదుట పఠించారట. ఆ తల్లి కన్నులు అరమోడ్పులయాయట. ఆ పెదవులపై మందస్మితము తళుక్కున మెరసిందట. 

అమ్మవారి నడుముచుట్టూగల ఆ మూడు ముడుతలు గుణత్రయముగా (సత్త్వరజస్తమో గుణములు), స్దూల, సూక్ష్మ కారణదేహములుగా,. అలాగే మువురమ్మలుగా(మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి), త్రిమూర్తులుగా (బ్రహ్మవిష్ణుమహేశ్వరులు), ముల్లోకములుగా (భూ, భువ, సువర్లోకములు) సమన్వయించు కోవచ్చును. 

శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు ఎనుబదియవ శ్లోకంలో అమ్మవారి వళిత్రయాన్ని ఇలా వర్ణించారు.

కుచౌ సద్య స్స్విద్య - త్తటఘటితకూర్పాసభిదురౌ

కషంతౌ దోర్మూలే - కనకకలశాభౌ కలయతా|

తవ త్రాతుం భంగా - దలమితి వలగ్నం తనుభవా‌

త్రిధా నద్ధం దేవి - త్రివళిలవలీవల్లిభి రివ॥80॥

మన్మథ నిర్మితములై కాంచన కలశములవంటి ఆ శ్రీమాత స్తనములు ఈశ్వర స్మరణచేత సారెకు ప్రక్కలయందు చెమర్చుచు రవికను పిగుల్చుచున్నవి. చంకలను ఒరయుచున్నవి. ఆ కుచ భారమునకు నడుము విరిగిపోకుండా కాపాడుటకై దేవి వళులు (నడుముపైని మూడు ముడుతలు) లవలీలతచే కట్టబడిన మూడు కట్లవలెనున్నవి.

ఓ తల్లీ! పరమేశ్వరీ! నిరంతరం స్వేదంతో తడచి ఇరు పార్శ్వములయందు అంటుకుని ఉన్న రవికను ఛిద్రం  చేయుచున్న, బాహుమూల సమీప ప్రదేశముల ఒరిపిడికి గురయగుచున్న, బంగారు కలశముల కాంతితో, అత్యంత సౌందర్య సౌభాగ్యాలతో ఒప్పు నీ స్తనముల బరువు వలన అతి సున్నితము, సుకుమారము సూక్ష్మము ఐన నీ నడుమునకు భంగపాటు కలుగకుండా ఉండడానికా అన్నట్లు, ఆ మన్మథుడు ఏలకి లత (ఏలక్కాయ లత) తీగలచేత మూడు చుట్లుతో మూడు కట్లు కట్టినట్లుగా నీ ఉదరం(పొట్ట) మీద ఉన్న ఆ మూడు మడతలు మూడు రేఖలుగా తోచుచున్నవి.

ఇచ్చట గమనించవలసిన విషయం ఒకటున్నది. అమ్మ సౌందర్యం కన్యా సౌందర్యంగా వర్ణించుటలేదు. కన్యగా అయితే ఆ ముడుతలు అందం కాకపోవచ్చు,కాని ఇక్కడ అమ్మను మన అందరి కన్నతల్లిలా, ప్రౌడ సౌందర్యంగా శ్రీ శంకరులు వర్ణించారు. బిడ్డల తల్లి అయిన ప్రౌఢ స్త్రీకి ఉదరంపై ముడుతలు అందమేకాక స్త్రీత్వానికి పరిపూర్ణతనిచ్చు మాతృమూర్తిగా, సంతానవతి ఈమె అను గొప్పను తెలుపునది కూడా. అందువల్ల అమ్మ ముడుతలతో అందంగా శోభిల్లుతున్నది. స్తనభారము మోయు నడుమును కాపాడుటకు మధ్యన పట్టబంధముతో కట్టబడినట్లు మూడు ముడుతలతో అమ్మ ఒప్పారుచున్నది అని భావము.

శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం స్తనభారదళన్మధ్యపట్టబన్ధ వళిత్రయాయై నమః  అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

37వ నామ మంత్రము 31.1.2022

ఓం అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతట్యై నమః

బాలభానుని (ఉదయించు సూర్యుని) ఎఱుపు రంగువలెను, కుంకుమపువ్వు ఎఱుపు రంగువలెను కనిపించు వస్త్రముతో ప్రకాశించు కటి ప్రదేశం కలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ అను పదహారు అక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును  ఓం అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతట్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు జీవనమే శుభప్రదమై, భోగభాగ్యములతోను, సుఖసంతోషములతోను విలసిల్లుచూ, పరమేశ్వరీ పాదసేవలో పరమపద సోపానములు కూడా అనాయాసముగా లభించును.

అరుణవర్ణము అంటే ఎఱుపు వర్ణము. అరుణారుణము అనగా  అరుణవర్ణాన్ని మరింత ఎక్కువజేసే మిక్కిలి అరుణవర్ణము. ఆ అరుణవర్ణము ఎలాంటిదంటే కౌసుంభ (కుంకుమ వర్ణము).  అనూరునివలె (అనూరుడు అరుణవర్ణంలో ఉంటాడు. అందుచే అరుణుడు అని కూడా అన్నారు. సూర్యుని రథచోదకుడు అనూరుడు. ఇతనికి ఊరువులు లేవు. ఊరువులు లేకుండా పుట్టాడు. మిక్కిలి అరుణవర్ణంలో ఉన్న అనూరునివలె) ఎర్రని రంగువస్త్రములతో ప్రకాశించే కటిప్రదేశముగలిగినది ఆ పరమేశ్వరి. గనుకనే అమ్మవారు అరుణారుణకౌసుంభవస్త్ర భాస్వత్కటీతటీ యని అనబడినది.

అమ్మవారికి అరుణవర్ణం అంటే చాలా ఇష్టము. ధ్యాన శ్లోకములో

సిందూరారుణ విగ్రహాం సిందూరం మాదిరిగా ఎర్రనైన శరీరము గలిగినది అమ్మవారు. రక్తోత్పలం బీభ్రతీమ్ ఎర్రని కలువను ధరించియున్నది. రత్నఘటస్థరక్తచరణాం రత్న ఘటమునందు రక్తమువలె ఎర్రని పాదములు గలిగినది అరుణాం కరుణా తరఙ్గితాక్షీం ఆపాద మస్తకమూ ఎర్రని రంగులో ప్రకాశించునదియు, సదా కనులనుండి కరుణా తరంగములు ప్రసరించునది ఆ పరమేశ్వరి. అమ్మవారు ఇష్టపడే మందారములు, కదంబములు, దాడిమీ కుసుమములు, అమ్మవారి పెదవులు అన్నియునూ అరుణవర్ణమే. అందుకే అమ్మవారు సర్వారుణా యని కూడా అనబడినది.

సాయ సంధ్యవేళలో కుంకుమపరచినట్లు ఉండే పడమటిదిశ  చూడముచ్చటగాను, వర్ణనాతీతముగాను ఉంటుంది. సకలవేదవేదాంగములను పుక్కిటబట్టిన వేదబ్రాహ్మణుని ముఖకమలం అరుణవర్ణ రంజితమై  ఉంటుంది. అంటే అతనిలో వేదరూపములో బ్రహ్మజ్ఞానము ప్రస్ఫుటమౌతున్నది గదా! ప్రేమకు, అనురాగమునకు ఎర్రని గులాబీ సంకేతము. సృష్టి అనేది ఉదయసంధ్యవంటిది. ఉదయసంధ్య ఎర్రని బాలభానుని వంటిది. జాగ్రదావస్థ అంటే అరుణవర్ణరంజితమైన ఉదయసంధ్యవంటిది. అరుణవర్ణము చైతన్యమునకు సంకేతము. పరమేశ్వరి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి, అనంతకోటి జీవరాశికి అనురాగభరితమైన మాతృశ్రీ. గనుకనే అమ్మవారు అన్నివిధముల అరుణారుణ వర్ణరంజితమూర్తి. 

అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు  ఓం అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతట్యై నమః  అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

38వ నామ మంత్రము 1.2.2022

ఓం రత్నకింకిణికా రమ్య రశనా దామ భూషితాయై నమః

రత్నములతోను, చిఱుగజ్జెలతోను మిక్కిలి రమణీయమై అలరారే ఒడ్డాణపు త్రాడును ధరించియున్న శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళియందలి రత్నకింకిణికా రమ్య రశనా దామ భూషితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం రత్నకింకిణికా రమ్య రశనా దామ భూషితాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ జగన్మాత కరుణించి సకలాభీష్టములను నెరవేర్చును.

అమ్మవారు ఆపాద మస్తకమూ సకలాభరణభూషిత. ఆ ఆభరణములు నవరత్నఖచితములు.  అమ్మవారి ఒడ్డాణము సువర్ణముతో చేయబడినది. ఆ ఒడ్డాణమునకు అంచులందు రత్నములు పొదిగిన చిఱుగంటలు ఉన్నవి. అటువంటి రత్నఖచితమైన చిఱుగంటల అంచులుగలిగిన అందమైన బంగారపు ఒడ్డాణముతో   అలంకృత అయిన పరమేశ్వరి రత్నకింకిణికారమ్య రశనాదామ భూషితా యని అనబడినది.

మగవాళ్ళకు మొలత్రాడు, ఆడవాళ్ళు బంగారు మొలనూలు లెేదా ఒడ్డాణము ధరించుట సాంప్రదాయము. మొలనూలు లేదా  ఒడ్డాణము శరీరమునందు మధ్యభాగమున ఉంటుంది. అమ్మవారు ధరించిన ఒడ్డాణము నాభిమీదుగా ఉండును. అమ్మవారి విరాట్స్వరూపమును ఆలోచిస్తే ఆ తల్లి నాభికి పైనగల ఊర్ధ్వలోకములు, నాభికి క్రిందగల అధోలోకములను అనుసంధానము చేయుచున్నట్లుగా ఉండును.

సౌమ్యేన తేజసా జాతం స్తనయో ర్ముగ్మముత్తమమ్‌|

ఇంద్రేణా స్యా స్తథా మధ్యం జాతం త్రివళిసంయుతమ్‌॥71॥

జంఘోరూ వరుణస్యాఽథ తేజసా సంబభూవతుః| 

నితంబః స తు సంజాతో విపుల స్తేజసా భువః॥72॥॥

(దేవీభాగవతము, పంచమస్కంధము, పదకొండవ అధ్యాయము)

చంద్రుని తేజస్సుతో రెండు వక్షోజములు, ఇంద్రుని తేజస్సుతో మధ్యభాగమగు కటిప్రదేశము మరియు త్రివళులు (పొట్టపై ఉండు మూడు మడతలు), వరుణుని తేజస్సుతో తొడలు ప్రకటితమయ్యెను

శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం రత్నకింకిణికా రమ్య రశనా దామ భూషితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

39వ నామ మంత్రము 2.2.2022
 
ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః

పరమేశ్వరునికి (శ్రీమాత భర్తకు) మాత్రమే తెలిసిన సౌభాగ్యశ్రీలతోను మృదుత్వంతోను కూడిన ఊరువులు కలిగిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి  కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః అని ఉచ్చరించుచూ శ్రీమాతను పూజించు భక్తులకు ఆ తల్లి ఆత్మానందమును, బ్రహ్మానందమును ప్రసాదించి కరుణించును.

భార్యయొక్క అంగాంగములు భర్తకు మాత్రమే తెలియును. ఇందుకు పార్వతీ పరమేశ్వరులు ఏమాత్రమూ మినహాయింపుకారు.  ఆదర్శదాంపత్యానికి పార్వతీపరమేశ్వరులే ప్రతీకలు. అమ్మవారి సర్వాంగములు వివిధ దేవతలయొక్క అంశలనుండి ప్రకటితమయినవి. 

జంఘోరూ వరుణస్యాఽథ తేజసా సంబభూవతుః| 

నితంబః స తు సంజాతో విపుల స్తేజసా భువః॥72॥॥ (దేవీభాగవతం, పంచమస్కంధం, పదకొండవ అధ్యాయము)

వరుణుని తేజస్సుతో తొడలు, పిక్కలు, భూదేవి తేజముతో విశాలమైన నితంబభాగము (పిరుదులు)  ప్రకటితమయ్యెను.

పరమేశ్వరుడు ఈ జగత్తుకే సాక్షీభూతుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఆయన కామేశ్వరుడు. ఆ పరమేశ్వరి కామేశ్వరి. కామేశునికి మాత్రమే తెలియదగిన ఊరుద్వయము కామేశ్వరి కలిగియున్నది. ఈ విషయాన్నే శ్రీలలితా సహస్ర నామావళిలో వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా యని అన్నారు. కామేశజ్ఞాత అనగా కామేశ్వరునికి మాత్రమే తెలిసిన, సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా సౌభాగ్యము, మార్దవముగలిగిన ఊరుద్వయముతో కూడినది ఆ పరమేశ్వరి. అమ్మవారి ఊరువుల జంటలో ఎడమ తొడ సౌభాగ్య సంకేతము, కుడి తొడ మార్దవ సంకేతము గలిగి యున్నది. ఊరు అనగా ఊ అను అక్షరము, రు లో ఉ కారము గలవు.  ఇందులో ఉ కారము దక్షిణోరువు, ఊ కారము వామోరువు. వామోరువు పరాసూచితము. దక్షిణోరువు అపరాసూచితము. వామోరువు జగత్తులోని బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రులు అను నాలుగువర్ణములకు సూచన అయితే, దక్షిణోరువు భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము అను పంచభూతములను మరియు మనోబుద్ధ్యహంకారములను సూచిస్తాయి.

అమ్మవారి కపోలము అష్టమీచంద్రుడనియు, కనుబొమలు మన్మథగృహ తోరణమునియు, రెండు కన్నులు ఆ తల్లి ముఖప్రవాహమున చలించెడి మీనముల జంట అనియు, నాసాదండము నవ సంపెంగవంటి దనియు, చెక్కిళ్ళు పద్మరాగ శిలలను, అద్దమును తిరస్కరించుచుండెననియు, ఆ తల్లి పెదవులలో ఒక పెదవి క్రొత్తపగడమును, క్రింది పెదవి దొండపండును వెక్కిరించు చున్నవనియు, ఆ తల్లి దంతపంక్తులజంట శుద్ధవిద్యాంకురములైన ద్విజులనియు, ఆ తల్లి పలుకులు కచ్ఛపి వీణానాదముకన్నా మధురమనియు... ఇలా అన్నిటికీ ఉపమానములు చెప్పగా, అమ్మవారి ఊరుద్వయము కామేశ్వరునికి మాత్రమే తెలియడం చేత వశిన్యాది వాగ్దేవతలు ఉపమానమును చెప్పలేదు.

శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరిలో ఎనుబది రెండవశ్లోకంలో వర్ణించినవిధం ఇలా ఉన్నది:

కరీన్ర్దాణాం శుండాన్‌ - కనక కదళీకాండపటిలీం

ముభాభ్యా మూరుభ్యా - ముభయమపి నిర్జిత్య భవతి|

సువృత్తాభ్యాం పత్యుః - ప్రణతికఠినాభ్యాం గిరిసుతే

విధిజ్ఞే జానుభ్యాం - విబుధకరికుంభద్వయమసి॥82॥

అమ్మా! ఓ పరమేశ్వరీ! వేదవిహితమైన ధర్మానుష్టానము కలిగినదానా.. నీ ఊరువులు ( తొడలు) రెండూ, దిగ్గజముల యొక్క తొండాల శోభనూ, బంగారు అరటిబోదెల అందాన్ని కూడా ధిక్కరిస్తూ అత్యంత శోభాయమానంగా వెలుగొందుచున్నవి. అలాగే నీ జానువులు (మోకాళ్ళు) రెండూ చక్కనైన వట్రువులు (గోళాకారం) కలిగి ఉండి, నీవు నిరంతరం పతివ్రతా ధర్మంతో అనునిత్యం నీ భర్తకు సేవలు చేస్తూ ఆయనకు నీవు మోకాళ్ళపై పాదాభివందనములు చేయుటచేత, ఆ మోకాళ్ళు నేలకు తగిలి అవి కఠినములై ఐరావత దిగ్గజముయొక్క కుంభస్థలాలను సైతం త్రోసి రాజిల్లుతూ అవి జయకరంగా ప్రకాశించుచున్నవి.

 శ్రీమాతకు నమస్కరించునపుడు  ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః అని అనవలెను.

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

40వ నామ మంత్రము 3.2.2022

ఓం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః

మాణిక్య కిరీటము వంటి మోకాలు చిప్పల జంటతో విరాజిల్లు లలితాంబకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం  మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు బ్రహ్మజ్ఞాన సంపదలతో ఆత్మానందమునంది తరించును.


మహిషాసురాది రాక్షస సంహారమునకు దేవతలవలన పరమేశ్వరి శరీరము మొత్తము వివిధ వారివారి అంశలతో ప్రకటితమయ్యెను. ఆ తల్లి ధరించిన ఆయుధములుకూడ దేవతలనుండి లభించినవే. అందుచే అమ్మవారి శరీర నిర్మాణములో వివిధ అంగములు ప్రత్యేకతను సంతరించుకొని యున్నవి. 

అమ్మవారి మోకాలి చిప్పలు మాణిక్య ఖచితమైన మకుటములవలెనున్నవి. వేరే మాటలో చెప్పాలంటే పెద్దమాణిక్యము ఒకటి తీసుకొని, ఆ మాణిక్యముతో చేసిన టోపీలవలవంటి మోకాలి చిప్పలతో అమ్మవారు ప్రకాశించుచున్నది.

శంకర భగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు ఎనుబది రెండవ శ్లోకంలో అమ్మవారి ఊరువులను, జానువులను ఇలా వర్ణించారు.

కరీన్ర్దాణాం శుండాన్‌ - కనక కదళీకాండపటిలీం

ముభాభ్యా మూరుభ్యా - ముభయమపి నిర్జిత్య భవతి|

సువృత్తాభ్యాం పత్యుః - ప్రణతికఠినాభ్యాం గిరిసుతే

విధిజ్ఞే జానుభ్యాం - విబుధకరికుంభద్వయమసి‌||82||

అమ్మా! పార్వతీ!  వేదవిహితమైన ధర్మానుష్టానము కలిగిన ఓ జగన్మాతా! నీ ఊరువులు ( తొడలు) రెండూ, దిగ్గజముల యొక్క తొండాల శోభనూ, బంగారు అరటిబోదెల అందాన్ని కూడా ధిక్కరిస్తూ అత్యంత శోభాయమానంగా వెలుగొందుచున్నవి. అలాగే నీ జానువులు (మోకాళ్ళు) రెండూ చక్కనైన వట్రువులు (గోళాకారం) కలిగి ఉండి, నీవు నిరంతరం పతివ్రతా ధర్మంతో అనునిత్యం నీ భర్తకు సేవలు చేస్తూ ఆయనకు నీవు మోకాళ్ళపై పాదాభివందనములు చేయుటచేత, ఆ మోకాళ్ళు నేలకు తగిలి అవి కఠినములై ఐరావత దిగ్గజముయొక్క కుంభస్థలాలను సైతం త్రోసి రాజిల్లుతూ అవి జయకరంగా ప్రకాశించుచున్నవి.

 ఆ జగన్మాత మోకాళ్ళు కఠినములై ఉన్నవి అని ఇచట అమ్మను విధిజ్ఞే అని కీర్తించారు అనగా వేదవిహిత కర్మానుష్టానము కలిగినదానా అని. అందువల్ల అమ్మ పతివ్రతా ధర్మాన్ని తను పాటించి లోకానికి తెలిపినది. అందువలనే తను సర్వం సహా మహారాజ్ఞి అయినప్పటికిని తన భర్త అయిన పరమేశ్వరుని సన్నిధిలో మాత్రం మామూలు స్త్రీ వలె తన ధర్మాన్ని పాటించి, మోకాళ్ళపై సాష్టాంగపడి భర్తను పూజించడం వలన అమ్మ జానువులు (మోకాళ్ళు) కఠినములై మాణిక్యములతో చేయబడిన మకుటములుగా విరాజిల్లు చున్నవి.. ఈ శ్లోకంలో శ్రీ శంకరులు అమ్మ తొడలను మోకాళ్ళను వర్ణించారు. ఈ రెండిటినీ వర్ణిస్తూ లలితా సహస్రం నామావళి యందు కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా అని ఊరువులను మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా అని జానువులను వర్ణించిరి. అనగా కామేశ్వరునికి మాత్రమే తెలిసిన మెత్తనైన ఊరువులు కలిగినదానా అని ఓ నామం అర్ధం. అంటే స్త్రీ గోప్య సౌందర్యం రతీ విలాసవేళ భర్తకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి అలా వర్ణించారని భావించవచ్చు. కాని అదికాక వేరే నిగూఢ రహస్యం ఉన్నది. పార్వతి పరమేశ్వరులు అర్ధనారీశ్వరులు. శంకరుడు పద్మాసనంలో కూర్చుని ఉండువాడు (శాంత పద్మాసనస్తం) అలా పద్మాసనం లో కూర్చుని ఉన్నప్పుడు ఎడమ తొడమీదకు కుడి అరికాలు వచ్చి చేరును .ఆ ఎడమ తొడ అమ్మవారిది దాని మీదకు చేరిన అరికాలు శివునిది.  ఆ అరికాలి స్పర్శతో పరమేశ్వరి తొడ మార్ధవం అర్ధనారీశ్వర తత్వంలో శంకరునికి గోచరమైనది. అంతే కాని రతికేళీ విలాసంలో కాదు. ఇక అమ్మ మోకాళ్ళు మాణిక్యాలు పొదిగిన కిరీటాల్లా విరాజిల్లుతున్నాయని మరొక నామం అర్ధం. మాణిక్యం ఎర్రగా ఉండును. అమ్మ ఎర్రచీరతో కూర్చుని ఉంటే మోకాళ్ళు ముందుకి పొడుచుకుని వచ్చి ఆ ఎర్రచీర కప్పబడి ఉన్న ఆ మోకాళ్ళు మాణిక్య మకుటాల్లా ఉన్నాయని దాని భావము.

ఆ పరమేశ్వరి బ్రహ్మానందస్వరూపిణి, పరబ్రహ్మస్వరూపిణి, సచ్చిదానందస్వరూపిణి, శివశక్త్యైక్యరూపము, సర్వవేదవేదాంగవేద్య. బ్రహ్మానందపు అంశయైన ఆనందకలిక  కలిక అనగా మొగ్గ. ప్రతీ జీవిలోను మొగ్గస్థితిలో అవ్యక్తంగా ఉన్న బ్రహ్మానందాన్ని జగన్మాత యొక్క కృపతో సాధన ద్వారా వికసింపజేసుకోవచ్చని అనగా అనుభవంలోకి తెచ్చుకోవచ్చని ఈ కలిక అను శబ్దములో గుప్తముగానున్న భావము.

శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

41వ నామ మంత్రము  4.2.2022
 
ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః.

ఎర్రని రంగులో ఉన్న ఆరుద్ర పురుగులచే చుట్టూ చెక్కబడిన మన్మథుని అమ్ములపొదుల బోలిన జంఘికలు (పిక్కలు) గలిగిన జగదాంబకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి ఇంద్రగోప స్మరతూణాభి జంఘికా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరుని పూజించు భక్తులకు అనంతమైన సుఖసంతోషములు, భౌతికానందముతో బాటు బ్రహ్మానందమును ప్రాప్తించును.

మోక్షమునిచ్చి రక్షించేది మరియు స్మరణ మాత్రముచే కోరికలను పూరించు ప్రకాశావిర్భావము గలిగినది శ్రీమాత.

అమ్మవారి జంఘికలు మన్మథుని యొక్క సుమబాణ తూణీరము వంటిది. మన్మథుని బాణతూణీరము ఇంద్రగోపములు పొదగబడి ఉంటాయి. ఆరుద్ర పురుగులు ఎర్రని గురువింద గింజల రంగులో ఉంటాయి. ఆరుద్ర పురుగులు వ్యవసాయము మొదలు పెట్టుటకు,ఆరుద్ర కార్తె అనుకూలమైనది. ఈ కార్తెలో మాత్రమే కనబడేది ఆరుద్ర పురుగు. ఇది మొఖమల్లు వస్త్రమును (అందమైన, సున్నితమైన, ఎర్రని పట్టువస్త్రమును) చుట్టుకున్నట్లుగా ఉండి, ఎర్రగా బుర్రగా, బొద్దుగా ఉంటుంది.  అమ్మవారి జంఘములు ఇంద్రగోపములు అతుకబడిన మన్మథుని బాణతూణీరములను బోలి ఉన్నవి. ఆ బాణ తూణీరముల యందు మల్లెలు, చంపకములు (సంపంగిలు), పున్నాగములు మొదలైన సుగంధభరిత పుష్పములతో చేయబడిన బాణములు ఉంటాయి. మన్మథుని విల్లు ఇక్షుకముతోను (చెఱకు గడతోను), ఆ వింటినారి బిసతంతువులతోను తామరతూడులోని సన్నని దారముతో) చేయబడి, ఆ విల్లుపై సమ్మోహనమంత్ర మరియు వశీకరణమంత్ర బీజాక్షరములు లిఖింపబడి ఉంటాయి.

శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో ఎనుబది మూడవ శ్లోకంలో అమ్మ జంఘికలను ఇలా చెప్పారు.

పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే

నిషజ్గౌ జజ్ఘే తే విషమవిశిఖో బాఢమకృత||

యదగ్రే దృశ్యంతే దశ శరఫలాః పాదయుగళీ

నఖాగ్ర చ్ఛద్మాన స్సురమకుటశాణైకనిశితా ||83||

గిరిసుతా! ఈశ్వరుని గెలుచుట కొఱకు మన్మధుడు నీ పిక్కలను పదేసి బాణములున్న అమ్ముల పొదులుగా చేసికొనెను. (ఎందుకంటే మన్మధుని దగ్గర ఉన్న ఐదే బాణాలు చాలవని). వాని చివరల నీ గోటికొనలనెడు బాణాగ్రములు (ములుకులు) కనుపించుచున్నవి. ఆ బాణాగ్రములు (అమ్మవారి పాదములకు మ్రొక్కుచున్న) దేవతల కిరీటములచే పదునుపెట్టబడియున్నవి.

ఇంద్రగోప (ఆరుద్ర పురుగులచే), పరిక్షిప్త (చుట్టును అమర్చబడిన) స్మర - తూణ (మన్మథుని అమ్ములుపొదుల వంటి), జంఘిగా (పిక్కలు గలిగిన తల్లీ).

వర్షాకాలములో ఆరుద్ర కార్తెయందు వ్యవసాయ భూములలో ఆరుద్ర పురుగులు పుట్టుకొస్తుంటాయి. అవి ఎర్రగా ముక్కమల్లు గుడ్డవలె చిన్నవిగా ఉంటాయి. వర్షంలో ఆవి చావకుండా వర్షాధిపతి ఇంద్రుడు కాపాడుతాడనియు, అందుకనే వీటికి ఇంద్రగోపములనియు పిలుస్తారు. 

ఇంద్రగోపములు అనగా మంత్రములోని బీజాక్షరములు అని రహస్యార్థము. తూణము (తూణీరము) అనగా మంత్ర సముదాయము. తూణమునందు ఉండే బాణములచే మంత్రములు సూచితమైనవి. దేవి జంఘికలు మహావర్ణ సంపుటికలు అని తెలియదగును. స్మర శబ్దము సగుణ బ్రహ్మయు, ప్రపంచ సృష్టికర్తయు అయిన పరమేశ్వరునకును - తూణా శబ్దము మాయా శక్తికిని బోధకములు అగును.

శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

42వ నామ మంత్రము 5.2.2022

ఓం గూడగుల్ఫాయై నమః

నిండైన, సుందరమైన, నిగూఢంగా ఉండే చీలమండలు గలిగిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి  గూఢగుల్ఫా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం గూడగుల్ఫాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు ఉపాసకుడు ఆ తల్లి కరుణతో నిగూఢతత్త్వమైన పరాశక్తి తత్త్వమును పరిపూర్ణముగా గ్రహించి, బ్రహ్మత్వమును ప్రాప్తింపజేసుకొని ఆత్మానందమునందును

ధ్యానించు వారిని రక్షించు స్వభావం గలిగినదని ఈ నామ మంత్రములోని అంతరార్థము. గూఢ (లావైన, ఇంపైన) గుల్ఫా (చీలమండలు గలిగినది). లావైన లేదా అందమైన లేదా ఇంపైన చీలమండలు గలిగినది.

గూఢ అనగా రహస్యమైన, గాన అమ్మవారి చీలమండలు రహస్యంగా కనబడకుండా ఉంటాయి; స్త్రీలు సాధారణంగా పాదములు కనబడనట్లు చీర కుచ్చెళ్ళను పాదములవరకూ జారవిడుస్తారు, అనగా కాలిమట్టెలు కూడా కనబడనంతగా చీర కప్పబడి ఉంటుంది; శ్రీమాత కూడా ఆ సాంప్రదాయం పాటించునది ఎందుకంటే  కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా  అనగా వివాహితయొక్క సౌందర్యము భర్తకు మాత్రమే అంకితము, ఆ అవయవ సొంపులు భర్తకు మాత్రమే తెలియనగును.

అయితే అమ్మవారి చీలమండలు కనబడకుండా ఎలా ఉంటాయి? అమ్మవారు పద్మాసన స్థితిలో కుర్చుని ఉంటుంది గదా అప్పుడు చీలమండలు కనబడవు అలాగే ఒక కాలు పీఠం మీద, రెండవ కాలు పద్మాసనస్థితిలో ఉన్నప్పుడు? అప్పుడు కూడా అమ్మవారి చీర అంచు పూర్తిగా చీలమండలను కప్పి ఉంటుంది కాని చీలమండల పైకి ఉండదు గాన ఈ రహస్య (గూఢ) అర్థాన్ని బట్టి ఈ నామమంత్రాన్ని అర్థం చేసుకోవాలి.

గుహ్యస్థానము రత్నమణి సూచికము. చీలమండలము సంధిస్థానము - ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అను ఈ నవార్ణవ మంత్రమునందలి

మధ్య వర్ణము చింతామణి గుర్తుగలది; మిగిలిన ఎనిమిది వర్ణములు అష్టప్రకృతులు అనబడును.

నవార్ణవ మంత్రము అనగానేమి?

నవార్ణవ మంత్రము అంటే చండీ నవార్ణవ మంత్రము. అత్యంత ప్రభావవంతమైన విద్యలలో చండీ, దుర్గా విద్యలు చాలా ప్రభావవంతమైనవి. ఎటువంటి కోరికలనైనా సిద్ధింపజేస్తుంది. ఆ చండీ దేవి తన భక్తులకు ఏమికావాలో తెలిసుకొని ఆ కోరికలను సిద్ధింపజేస్తుంది. దీనికి సంబంధించిన కథ ఒకటి కలదు.

వారు ఇద్దరు చండీ ఉపాసకులు. చాలా నిరాశతో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకడు మహారాజు. కాని రాజ్యాన్ని కోల్పోయాడు. రెండవవాడు సాధారణ ఉపాసకుడు. అతడు కడు పెదవాడు. బలహీనుడు కూడా. వారిద్దరూ చాలానిరాశతో జీవితం విరక్తి కలిగి ఉంటారు. వారు ఇద్దరూ అడవిలో కలిసినప్పుడు ఒకరి వృత్తాంతమును మరియొకరు చెప్పుకుంటారు. వారు ఇద్దరూ స్నేహితులయారు. వారికి అడవిలో ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఆ ఆశ్రమంలోని మునీశ్వరులను సేవించుతారు. వారిద్దరూ ఆ ఆశ్రమానికి కేవలం ప్రశాంతతకోసమే  వెళ్ళారు. నిరాశానిస్పృహలచేత ఏ కోరికలు లేనివారుగా మారుతారు. అయినప్పటికినీ ఆ మునీశ్వరునికి తమ బాధలను విన్నవించు కుంటారు.  ఆ మునీశ్వరుడు వారిపై జాలిపడి మహత్తరమైన చండీమంత్రాన్ని ఉపదేశించుతాడు. వారు ఆ చండీమంత్రాన్ని చాలాతీవ్రతరముగా సాధనచేస్తారు. వారి సాధనలో ఆ చండీమంత్ర జపంచేయునప్పుడు ఆ చండీమాతకు తమ వ్రేలిని కోసి, స్రవించిన రక్తముతో ఆ చండీమాత పాదములకు ఆభిషేకము చేస్తూ ఉంటారు.  వారి మంత్రసాధనకు ఆ చండీమాత వారియందు కరుణించి వారికి కనిపిస్తుంది. వారికి ఏమికోరిక ఉన్నదో తెలియజేయమని ఆ చండీమాత వాళ్ళను అడుగుతుండి. అందులో సాధారణ వ్యక్తి సంపదలు, గృహము వంటివి కోరుతాడు. మహారాజు మాత్రం పోయిన తన రాజ్యాన్ని తిరిగి వచ్చేలా కరుణించమని కోరుతాడు. కాని చండీ మంత్ర సాధనా ప్రభావానికి, వారు కోరిన కోరికలకు ఎక్కడా పొంతనలేదు. వారి కఠోరసాధనకు వారు కోరికలు చాలా చిన్నవి అని చండీమాత అంటుంది. అప్పుడు ఆ చండీమాత ఆ వారిరువురికి వారి కోరికలు సిద్ధించుననియు,  మరియు బ్రతికినంత కాలము సకలభోగాలు, అష్టైశ్వర్యాలు అనుభవించి అంత్యమున మనువుగా మారతారు అని చెప్పింది. మనువు అంటే ప్రజాపతులలో ఒకడు. ఆ స్థాయికి చండీమాత అతనికి వరమిస్తుంది. అంటే చండీమాత నవార్ణవ మంత్రప్రభావము అంతటిది. 

చండీ నవార్ణవ మంత్రము అంటే తొమ్మిది అక్షరములు గల చండీ మంత్రము. 

గూఢగుల్ఫా యని నామప్రసద్ధమైన తల్లికి నమస్కరించునపుడు ఓం గూఢగుల్పాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

43వ నామ మంత్రము 6.2.2022

ఓం కూర్మపృష్ఠ జయిష్ణు  ప్రపదాన్వితాయై  నమః

తాబేలు పృష్ఠ (వీపు) భాగము కంటెను సుందరమైన మీగాళ్ళు (పాదాగ్రములు)  కలిగి యలరారు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి  కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా  యను పండ్రెండక్షరముల (ద్వాదశాక్షరీ) నామ మంత్రమును  ఓం ఐం హ్రీం శ్రీం కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై  నమః అని ఉచ్చరించుచూ ఆ  అఖిలాండేశ్వరిని అత్యంత భక్తి ప్రపత్తులతో ఆరాధించు సాధకులను ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా ఉద్దరించి సమస్త భౌతిక సుఖసంతోషములను లభింపజేసి, జీవితమంతా ఆధ్యాత్మికచింతనతో ప్రవర్తింపజేసి తరింజేయును.

కూర్మపృష్ఠ (తాబేటి వీపును) జయిష్ణు (జయించు స్వభావముగల) ప్రపద (ముంగాలు అనగా పాదాగ్రము) కూడినది - కలిగియున్నది. ఈ పండ్రెండక్షరముల నామ మంత్రమును  ఓం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై  నమః అని ఆపకుండా ఉచ్చరించ వలెను. ఏ పరిస్థితిలోనూ కూర్మపృష్ఠా అని ఆపి   చదవకూడదు...ఇంతకన్నా వివరించి చెప్పకూడదు..

తాబేటి వీపున కంటె ప్రశస్తముగా, సుందరమై ఒప్పారే పాదోపరిభాగములతో శ్రీమాత అలరారుచున్నది. అమ్మవారి పాదములు మోక్షప్రదములు. నాలుగు వేదాలకు సంబంధమైన నాలుగు వాక్యాలైన అహం బ్రహ్మాస్మి, తత్త్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, ఈ నాలుగు మహావాక్యాలు అమ్మవారి పాదాలను ప్రస్తుతించే వేదాలకు చెందినవి. అమృత మథనసమయంలో శ్రీమహావిష్ణువు ఆదికూర్మమై తన పృష్ఠభాగముతో మందరగిరిని క్షీరసాగరములోనికి క్రుంగకుండా ఉద్ధరించెను. అటువంటి బహు సుందరమైన ఆ ఆది కూర్మము యొక్క పృష్ఠభాగముకంటెను శ్రీమాత పాదాగ్రములు సుందరమై, అత్యంత మృదుత్వంతో అలరారు చున్నవని  ఈ నామ మంత్రములోని భావము.
అంత శ్రేష్ఠమైన జగన్మాత పాదములు ఆశ్రితులకు అమృతపదముసు కలిగిస్తాయి, మోక్షదాయకములై పాపకూపములో పడకుండా ఉద్ధరిస్తాయి.

శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు ఎనుబది ఎనిమిదవ శ్లోకంలో అమ్మవారి ముంగాళ్ళను ఇలా వర్ణించారు:

పదం తే కీర్తీనాం - ప్రపద మపదం దేవి విపదాం

కథం నీతం సద్భిః - కఠినకమఠీకర్పరతులామ్|

కథం వా పాణిభ్యా ముపయమనకాలే పురభిదా

యదాదాయ న్యస్తం - దృషది దయమానేన మనసా॥88॥

ఓ అఖిలాండేశ్వరీ! నీ పాదములు యశస్సును కలిగించునవి, విపత్తులను హరించునవి. పురారియైన శివుడు దయామయుడై వివాహ సమయమున నీ సుకుమార పాదములను తన చేతబట్టి మృదువుగా సన్నెకల్లును త్రొక్కించెను. అట్టి పాదాగ్రములను పూజ్యులైన పూర్వకవులు కఠినమైన తాబేటి పెంకుతో ఎట్లు పోల్చిరో తెలియరాదు.

ఓ లలితాపరమేశ్వరీ! నిన్ను ఆశ్రయించిన వారికి సత్కీర్తులను కలిగించుచు, సకల ఆపదలను తొలగించుచు, మంచికి పుట్టిల్లుగా, చెడు అనేది దరిచేరలేని శుభవాకిళ్లుగా వెలుగొందుచుండేవి, నీ పాదముల పైభాగాన ఉండు నీ మీగాళ్ళు, అటువంటి నీ పాదమును నీ వివాహ వేళ, రాతియందు వధువు పాదము పెట్టించుట అను ఒక తంతుయందు దయాపూర్ణమైన మనసు కల నీ భర్తయైన శివుడు తన చేతితో నీ పాదములు పట్టుకుని రాతియందు ఉంచుటకు ( వధువుచే సన్నికల్లు తొక్కించుట) చాల సందేహించి నాడు. ఎందుకనగా అతి మృదువులైన నీ పాదములు ఆ కఠిన రాతి స్పర్శ తో ఎక్కడ కందిపోవునో అని. మరి అంత సున్నితమైన ఆ సుకుమార పాదాన్ని, ఆ పాదంపై నున్న మీగాలుని ( అరికాలు పై భాగం) కొందరు సత్కవులు ( లలితా సహస్ర నామావళియందు వశిన్యాది వాగ్దేవతలు) కఠినంగా ఉండే ఆడ తాబేలు వీపు చిప్పతో ఉపమానం చెబుతూ ఎలా వర్ణించగలిగారమ్మా!

ఆ లలితా పరమేశ్వరి పాదపద్మములపై దృష్టి నిలిపి నమస్కరించునపుడు ఓం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై  నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

44వ నామ మంత్రము 7.2.2022

ఓం నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై నమః

నమస్కరించు భక్తజనుల అజ్ఞానాంధకారాన్ని పోగొట్టగలిగిన కాలిగోళ్ళ కాంతులు గలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని ఉపాసించు భక్తులకు ఆ పరమేశ్వరి కాలిగోళ్ళ కాంతికిరణముల వలన తమ అజ్ఞానమును నశింపజేసికొని బ్రహ్మజ్ఞానప్రకాశముతో తేజరిల్లుచూ జగన్మాత పాదసేవాపరాయణులై జన్మతరింపజేసికొందురు.

దేవతలందరూ జగన్మాత పాదములకు శిరస్సులుతాకుచూ నమస్కరించునపుడు వారి కీరీములందున్న వివిధ రత్నములు జగన్మాత కాలిగోళ్ళకు సానబెట్టినట్లుతాకగా సహజంగానే ప్రకాశవంతముగా ఉండే ఆ తల్లి కాలిగోళ్ళు మరింత ప్రకాశవంతంగా కాంతులు విరజిమ్ముచూ, నమస్కరించు భక్తజనుల అజ్ఞానతిమిరములను పారద్రోలుచు ప్రజ్ఞానకాంతులను ప్రసాదించుచున్నవని ఈ నామమంత్రమందలి భావము.. అమ్మవారి పాదాలు షట్చాక్రాలకు పైన ఉండి, చక్రాలపై అనంతమైన కిరణాలను వర్షింపజేస్తాయి. అలా వర్షించు కిరణాల్లో అగ్నికి సంబంధించినవి 108, సూర్యసంబంధమైనవి 116, చంద్రసంబంధమైనవి 136 వెరసి 360 కిరణాలు మాత్రమే ఆ షట్చక్రాలు గ్రహిస్తాయి. వీటినే సౌర సంవత్సరమందున్న రోజులు.

శంకరాచార్యులవారు క్రింది శ్లోకాలలో వర్ణించిన విధాన్ని పరిశీలించుదాము.

సుధాధారాసారై-శ్చరణయుగలాంతర్విగలితైః

ప్రపంచం సించన్తీ - పునరపి రసామ్నాయమహసః|

అవాప్య స్వాం భూమిం -  భుజగనిభ మధ్యుష్ట వలయం

స్వమాత్మానం కృత్వా - స్వపిషి కులకుండే కుహరిణి || 10 ||
 
అమ్మా! పరమేశ్వరీ! బ్రహ్మరంధ్ర స్థానములో ఉన్న సహస్రార చక్రమందు అయ్యవారితో విహరించు ఓ జగన్మాతా!  నీ పాదద్వయం మధ్యబాగము నుండి స్రవించిన అమృతధారా వర్షములచేత (మనలోని అంతః ప్రపంచమైన) వేల నాడుల ప్రపంచమును తడుపుతున్నదానివై,అమృతాతిశయ కాంతిగల చంద్రుని స్థానమును (బ్రహ్మరంధ్రమును) వీడి, మరలా స్వస్థానమైన మూలాధారమును చేరి, నీ రూపాన్ని నీవే చుట్టుకుని, పామువలె చుట్టలు చుట్టుకుని, పృధివీతత్వమగు మూలాధారమందు, తామరదుద్దు మధ్యలోని సన్నని రంధ్రములో సూక్ష్మముగా నున్న దానియందు కుండలినీశక్తిగా నిద్రిస్తూ ఉంటావు.

క్షితౌ షట్పంచాశ -   ద్ద్విసమధిక పంచాశ దుదకే

హుతాశే ద్వాషష్టి - శ్చతురధిక పంచాశ దనిలే |

దివి ద్విఃషట్త్రింశ - న్మనసి చ చతుఃషష్టిరితి యే

మయూఖాస్తేషామప్యుపరి తవ -  పాదాంబుజయుగమ్ || 14 ||

షట్చక్రాలలోని సహస్రారములో ఉండు దేవి పాదప్రకాశ వైభవం.

అమ్మా! శ్రీమాతా! యోగసాధనలో సాధకుడు షట్చక్రాలనూ అధిగమించి,సహస్రారములో ఉన్న నీపాదపద్మాలు చేరాలంటే తన దేహంలో ఉన్న పృధివీతత్వంతో కూడిన మూలాధార చక్రంలో ఏబదియారు (56) కిరణములను దాటి, జలతత్వాత్మికమైన మణిపూరక చక్రంలో ఏబది రెండు మయూఖములను దాటి, అగ్నితత్వాత్మికమైన అనాహత చక్రంలో ఏబది నాలుగు కాంతిరేఖలు దాటి, ఆకాశతత్వాత్మికమైన విశుద్దచక్రమునందు డెబ్బదిరెండు కాంతికిరణాలు దాటి, మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రము నందు అరువది నాలుగు కిరణపుంజాలు దాటి, ఈ ప్రకారముగా ప్రసిద్ధములైన ఈ మయూఖములు దాటి పైకి చేరుకోగా అచట సహస్ర దళ మధ్యగత చంద్రబింబాత్మకమైన   బైందవ స్థానమున, సుధాసింధువునందు నీయొక్క పాదపద్మముల జంట గోచరమగుచున్నది.

 శంకర భగవత్పాదులవారు, సౌందర్యలహరియందు, ఎనుబది తొమ్మిదవ శ్లోకంలో అమ్మవారి నఖములను ఇలా వర్ణించారు.

నఖై ర్నా కస్త్రీణాం - కరకమలసంకోచశశిభి

స్తరూణాం దివ్యానాం - హసత ఇవ తే చండి చరణౌ|

ఫలాని స్వస్థ్సేభ్యః - కిసలయకరాగ్రేణ దదతామ్

దరిద్రేభ్యో భద్రాం - శ్రియమనిశ మహ్నాయ దదతౌ॥89॥

చండీమాత పాదములు బీదలకు భద్రమైన సకలైశ్వర్యములను ప్రసాదించును. చండీమాత పాదములకు దేవతలు చేతులు జోడించి అంజలి ఘటించుచున్నారు. మాత కాలిగోళ్ళనెడు చంద్రుల కాంతికి ఆదేవతాస్త్రీల కర పద్మముల ముకుళించుచున్నట్లుగా అనిపించుచున్నది. ఆ చంద్రులు స్వర్గములో (దేవతలకు సంపదలనిచ్చెడు) కల్పవృక్షములను పరిహసించుచున్నట్లున్నది.

అమ్మా!  పరమేశ్వరీ! .దేవలోకంలో ఇంద్రుని నందనవనంలో కోరికలు తీర్చే నంద‌నవనం ఉన్నది. అది తన చిగురుటాకుల చేత కోరిన కోరికలు తీర్చును.కాని ఆ కల్పవృక్షం దేవలోక వాసులైన దేవతల కోరికలు మాత్రమే తీర్చును.మరి నీ దివ్య చరణములు -  ఆలోకం ఈ లోకం అను భేదము లేక నిన్ను నమ్మిన సర్వలోకములలో ఉండు దరిద్రులైన వారందరికీ ఎల్లవేళలా తరుగు లేనన్ని సంపదలను శీఘ్రముగా అనుగ్రహిస్తూ ఉంటాయి. ఏదో ఒక్క స్వర్గలోక వాసులకు మాత్రమే సంపదలిచ్చి మిడిసిపడు ఆ కల్పవృక్షమును చూసి, సమస్త లోకవాసులనూ అనుగ్రహించు నీ పాదములు చాల్లే నీ బడాయి అన్నట్లు ఆ కల్పవృక్షాన్ని చూసి పరిహసిస్తూ ఉంటాయి. అంతే కాదు ఇంద్రుని భార్య అయిన శచీదేవి మొదలుగా గల స్త్రీలు నిన్ను సేవించుటకు అర్చించుటకు నీ పాదముల వద్దకు రాగానే పద్మములవంటి వారి చేతులు, చంద్రోదయం వంటి నీ నఖ( గోటి) కాంతులవలన అవి ముకుళింపబడి ( రెండుచేతులు దగ్గరకు ముడవబడి) నీకు నమస్కరించుచున్నవి. అటువంటి శోభతో నీ పాదాలు నీ నఖములు అలరారుచున్నవి.

పద్మములు చంద్రోదయం కాగానే ముడుచుకుపోతాయి. అమ్మ దగ్గరకు రాగానే ముడుచుకుపోయే ఆ దేవతా స్త్రీల చేతులను కరపద్మాలుగా పోల్చి, అమ్మ కాలిగోళ్లను చంద్రునితో పోల్చి శ్రీ శంకర భగవత్పాదులవారు చక్కగా వర్ణించారు. అనగా అమ్మ పాదాలు దేవతల చేత, దేవతా స్త్రీలచేత కూడా నమస్కరింపబడునని చెప్పబడినది. అందుకే కదా! పోతనగారు అమ్మలగన్నయమ్మ అను పద్యం లో వేల్పుటమ్మల మనమ్ములనుండేడియమ్మ అని వర్ణించారు. మనమందరమూ ఇష్టదైవాలుగా కొలచే ఈ దేవతలంతా, వారు తమ ఆరాధ్య దేవతగా అమ్మనే పూజించుచున్నారని పోతనగారి పద్య భావము.

మత్స్య మరియు పద్మపురాణములందు నారదుడు హిమవంతునికి ఇలా చెప్పెనని గలదు:

నారదుడు పార్వతీదేవి యొక్క సాముద్రిక లక్షణములను చూచి ఇలా వివరించాడు:-

ఈమెకు (పార్వతికి) భర్త పుట్టలేదు. ఈమె లక్షణములు లేనిది, చేతులు ఎల్లప్పుడును పైకి ఎత్తబడి మాత్రమే ఉంటాయి. ఈ పార్వతి యొక్క పాదములు వ్యభచరించునవి లేదా కాంతులు లేకయుండును అని చెప్పెను. అంతట నారదుడు పార్వతి నుదహరించి చెప్పిన ఆ విషయములు చెడ్డవి అని హిమవంతుడు కంగారు పడెను. అంతట నారదుడు ఇట్లు చెప్పదొడగెను. "ఓ పర్వతరాజా! నేను చెప్పిన ఈ  లక్షణములు సంతోషింపదగినవే. ఎందుచేతనంటే 'ఈమె భర్త జన్మించలేదని యనగా లోకములోనున్న అందరివలె తల్లిదండ్రులకు జన్మించలేదు. అలా జన్మించితే మరణించుట తథ్యము. కాని ఈ పార్వతిభర్త పుట్టుక, నాశనములేని అయోనిజా సంభూతుడైన పరమశివుడు. ఈ పార్వతి చేతులు ఎల్లప్పుడూ పైకే ఉంటాయి అనగా దానము ఇచ్చువారి చేయివలె ఈ పార్వతీదేవి చేయి పైచేయిగా ఉంటుందని భావము. పరమేశ్వరి పాదములు కాంతులచే వ్యభిచరిస్తాయి అనగా, ఆ పరమేశ్వరి పాదాల గోళ్ళతో ప్రకాశించే  ఆ తల్లి పాదాలు పద్మములవలె ఉంటాయి. అనగా దేవదానవులు నమస్కరించు నపుడు వారి కిరీటములలోని మణుల కాంతులు పరమేశ్వరి కాలి గోళ్ళ కాంతులముందు వెలవెలబోతున్నాయి. మరియు ఆ తల్లి పాదాల గోళ్ళ కాంతులు, తనను నమస్కరించువారి హృదయములలో ప్రవేశించి వారి అజ్ఞానమును తొలగించుచున్నవి' అని భావము అని నారదుడు చెప్పెను. ఆ జగన్మాత పాదనఖకాంతులు ఈ విధమగా చెప్పబడినవి.

పృథ్వీ తత్త్వాత్మిక మూలాధార చక్రమున (పృథ్వీ అగ్ని జ్వాలలు 56), మణిపూర చక్రమున (ఉదక తత్త్వాత్మిక జ్వాలలు 52) కలిపి 108 అగ్ని జ్వాలలు.
అట్లే స్వాధిష్టాన (అగ్ని తత్త్వాత్మిక కిరణములు 62), అనాహత చక్రమున (వాయు తత్త్వాత్మిక కిరణములు 54) కలిపి 116 సూర్య కిరణములు. 
ఆకాశ తత్త్వాత్మకమగు (విశుద్ధ చక్రమున 72), మనస్తత్త్వాత్మకమగు (ఆజ్ఞా చక్రమున 64) కలిసి 136 చంద్రుని కళలు అగుచున్నవి. ఇవి 108+116+136 మొత్తం 360 కిరణములు అగును. ఈ కిరణాలన్నియు అమ్మవారి పాదములనుండి వెడలినవే.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి