9, డిసెంబర్ 2019, సోమవారం

 నమామి నారాయణ పాద పంకజం
కరోమి నారాయణ పూజనం సదా
వదామి నారాయణ నామ నిర్మలం
స్మరామి నారాయణ త్తత్వ మవ్యయం

భావము :-- నారాయణుని పద్మములవంటి పాదములకు నమస్కరింతును. ఎల్లప్పుడూ నారాయణుని పూజ యొనరింతును.నిర్మలమగు నారాయణ నామ ముచ్చరింతును.
నాశరహితమగు నారాయణ స్వరూపమును ధ్యానింతును.
--(())--

అవాహూతః ప్రవిశ్యతి అపృష్టో బహుభాషతే,
అవిస్యస్తే విశ్వసితి మూఢ చేతా నరాధమః

భావము:-- మూఢ మతియగు నరాధముడు పిలువబడకయే పరులకడకేగును, ఎవ్వరెమియు అడగకకున్నను అధికముగా మాటలాడును, నమ్మగూడని వారిపై విశ్వాసముంచును. (విదురనీతి)
--(())--

చిక్కియున్నవేళ సింహంబు నైనను
బక్క కుక్క గఱచి బాధచేయు
బలిమిలేనివేళ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినుర వేమ

అలసస్య కుతో విద్యా
అవిద్యస్య కుతో ధనం
అధనస్య కుతో మిత్రం
అమిత్రస్య కుతో సుఖం

తా:--సోమరికి విద్య పట్టుబడదు, విద్యలేనివానికి ధనమురాదు, ధనము లేనిచో మిత్రులు దొరకరు, మిత్రులు లేనివారికి సుఖమెక్కడిది? అనగా జీవితములో సర్వసుఖములూ
విద్యవల్ల కలుగుతాయని, అట్టి విద్య నిరంతర పరిశ్రమ వల్లనే సాధ్యమని భావము.
'రమాకుమార' అంటే మన్మథుడు. అందులో 'ర' తీసేస్తే 'మా'కుమార. మా అంటే లక్ష్మి. లక్ష్మీ కుమార అంటే మన్మథు డే కదా!ఇప్పుడు మా తీసేస్తే 'మార'అంటే మన్మథుడు. ఇప్పుడు 'మా'తీసేస్తే మిగిలేది 'ర' ఏకాక్షర నిఘంటువు ప్రకారం 'ర' అంటే కూడా మన్మథుడే.'రమాకుమార' ఎటునుంచి చదివినా అలాగే ఉంటుంది. 'తమాషాగా లేదూ!
--(())--

పరోపకరణం యేషాం జాగర్తి హృదయే సతామ్
నశ్యంతి విపదేస్తేషాం సంపదః స్యుః పదే పదే
తీర్థస్నానైర్న సా శుద్ధిర్బహుదానైర్న తత్ఫలమ్
తపోభిరుగ్రైస్తన్నాప్య ముపకృత్యా యదాప్యతే...

భావము:--ఏ సుజనుల హృదయంలో పరోపకార భావన జాగరూకమై వుంటుందో వారి ఆపదలన్నీ తొలగిపోతాయి. సంపదలెన్నో వారికి ప్రాప్తిస్తాయి. పరోపకారం వల్ల ప్రాప్తించే పవిత్రత అనేక పుణ్య తీర్థాలలో స్నానం ఆచరించినా ప్రాప్తించదు. అందువల్ల కలిగే పుణ్యఫలితం అధిక దానాలు చేసినా, తీవ్ర తపస్సు చేసినా కలుగదు. నిష్కామ భావనతో పరోపకారం చేయడం కోసం పాటుపడేవారికి భగవత్ప్రాప్తి కూడా కలుగుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
==))((==

యోవనం ధనసంపత్తి: పభుత్వమవివేకితా !
ఏకై కమప్యనర్ధాయ, కిముయత్ర చతుష్టయం!!

భావం: మానవుడు కన్నుమిన్ను గానని నడియవ్వనములో నుండుట, అప్పుడు ధనసంపదకల్గుట, అట్టి సంపద సమయంలో ఉన్నతో ద్యోగం లబించుట, ఈ మూడింటికి తోడుగా అట్టివానికి అవివేకం అ బ్బును అనే ఈ నాలుగు సన్నివేశాలలో మానవునకు ఏ ఒక్కటి ఉన్ననూ అది అతనిని అనర్ధములలో  పడవేయును, పైని చెప్పిన నాల్గును కలసి ఉన్నవాడు మూర్ఖాటి మూర్ఖుడై పతితుడై పోవును.
--(())--
 


ఈ శ్లోకం కూడా మద్దులపల్లి వారి కవితా సంకలనం లోనిదే.

పానీయం పాతుమిచ్చామి త్వత్తః కమలలోచనే
యది దాస్యసి నేచ్చామి నో దాస్యసి పిబామ్యహం


అర్థము:-- ఇందులో ఒక చమత్కార మున్నది.ఒక ఒక వనిత బావిలో నీళ్ళు తోడుకొని కుండలో పోసుకొని వెళుతున్నది. ఆ దారిలో వెళుతున్న ఒక బ్రాహ్మణుడు.ఆమెను నీరడుగు చున్నాడు.
ఓ! కమల లోచనా !త్వత్తః =నీదగ్గర నుండి పానీయం=మంచినీళ్ళను, పాతుమిచ్ఛామి =త్రాగదలచి నాను.
కానీ, యది దాస్యసి=నీవి చ్చినట్లయితే, నేచ్చామి=నాక్కరలేదు, నో దాస్యసి=యివ్వక పోయినట్టయితే
పిబామ్యహమ్= త్రాగుతాను.ఇది చిత్రముగా నున్నది కదా!యిక్కడ యది దాస్యసి నేచ్చామి=నీవు దాస్యసి
దాసీ+అసి అంటే దాసీదానవు అయితే నాకక్కర లేదు.నో దాసీ+అసి=దాసీ దానవు కాకపొతే త్రాగుతాను.
(పూర్వం బ్రాహ్మణులు వేరే జాతి వాళ్ళ చేతి నీళ్ళు త్రాగే వాళ్ళు కారు కదా!) .

చిత్ర కవిత కర్ణపేయంగా ఉన్నప్పటికీ, వ్యర్థ పదాడంబరము తో నిండి సులభంగా అర్థం కాదు. రసపుష్టి కూడా లోపిస్తుంది. చిత్రకవితా పంచాననులైన కాశీపతిగారు చిత్రకవిత్వము లో వ్రాసిన పద్యాలలో పేర్కొనదగినవి రెండు. అందులో మొదటిది
'పాద భ్రమకం' రెండవది 'పద్యభ్రమకం' ప్రతి పాదము ఎటునుంచి చూసినా
'వికటకవి' లాగా ఒకటిగానే వుంటాయి. 'పద్యభ్రమకం' లో పద్యమంతా క్రిందినుంచి చదివినా ఒకటిగానే వుంటుంది. కాశీపతిగారు వ్రాసిన 'పాదభ్రమకం' పద్యము చిత్తగించండి.
సార సుర ధీర సురసా
తారసగా తత సభా సతత గాన రతా
వీర సభా భాస రవీ
మార పరా యమర వార మయ రా పరమా

టీక:-- సార=చేవగల, సుర= దేవతలయందున, ధీర=విద్వా౦సుడైన వాడా,లేక ధైర్యము
గలవాడా, సురసా=మంచియనురాగము గలవాడా, తారనగ =వెండికొండయే, ఆ

తత=విశాలమైన. సభా =కొలువుకూటముగ గలవాడా, సతత=నిరంతరము,
గాన= సంగీతము నందు, రత= ఆసక్తి గలవాడా, వీర= శూరుడా, సభా=ప్రభావయుక్త మైన
వాడా, భాస=కాంతియందున, రవీ=సూర్యుడైనవాడా, మార= మన్మథునకు, పరా=శత్రువైనవాడా, అమర=దేవతలయొక్క, వార =సముదాయముతో,
మయ=నిండినవాడా, పరమా =ఉత్కృష్టమైన వాడా, రా =రమ్ము
ఈ పద్యములో ఏపాదానికా పాదం ఎటునుంచి చదివినా ఒకటిగానే వుంటుంది.
--------------------------శుభసాయంత్రం------------------------

పురుషుడు ఎలా ఉండాలో ధర్మ శాస్త్రం చెప్పింది..కానీ ఎందుచేతో ఈ శ్లోకం జనబాహుళ్యం లోకి రాలేదు.

కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)
--> కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
--> కరణేషు దక్షః
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
--> రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే (ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు) ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.
--> క్షమయా తు రామః
ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
--> భోజ్యేషు

తృప్తః
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
--> సుఖదుఃఖ మిత్రం
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.
 కోకిలానాం స్వరో రూపం
పాతివ్రత్యంతు యోషితాం
విద్యారూపం విరూపాణాం
క్షమా రూపం తపస్వినాం
అర్థము: కోకిలకు స్వరమే అందము.మహిళలకు పా తివ్రత్యమే అందము.
కురూపులకు విద్యయే అందము.యతులకు(మునులకు) క్షమ,శాంతి యే అందము.
------------------------------------
ఉత్సవే వ్యసనే చైవ
దుర్భిక్షే రాష్ట్ర విప్లవే
రాజద్వారే స్మశా నేచ
యాస్తి ష్టతి స బాంధవః
అర్థము: శుభ కార్యములలో అవసరము వచ్చినప్పుడు,కష్టములు చుట్టుముట్టినప్పుడు ,
దేశమున తిరుగుబాట్లు జరిగినప్పుడు ,అధికారుల సమక్షమునందు, మరణాది దుఃఖము
తట స్థించి నప్పుడు,మొగము తప్పించక వెంటనుండి సహాయము చేయువాడే నిజమైన బంధువుడు.
-------------------------
నాస్తి విద్యాసమం చక్షు:
నాస్తి సత్యసమం తప:
నాస్తి రాగసమం దు:ఖం
నాస్తి త్యాగసమం సుఖం.
అర్థం:విద్యనూ పోలిన కళ్ళు, సత్యమును పోలిన తపము,
మాత్సర్యము వంటి దు:ఖ కరము ,త్యాగమును పోలిన సుఖమును లేవు.
--------------------------------------
అన్నింటిని సఫలం చేసేది నమ్మకం
అన్నింటి లోనూ జీవం నింపేది ఆశ
అన్నింటికీ అందం అద్దేది ప్రేమ

ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మ దలంచి యుగ్ర వా
క్పరుషత జూపినన్ ఫలము గల్గుట తథ్యము గాదె యంబుదం
బురిమిన యంతనే కురియకుండునె వర్షము లోక రక్షణ
స్థిరతర పౌరుషంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా!
తా:--మేఘు౦డు ప్రాణంబునకు భయము కలుగునట్లురిమిననూ వెంటనే జనులను రక్షించు పట్టుదలతో నానందము కలుగునట్లు వర్షించును. ఆ విధముగా మిక్కిలి
దయగలవాడు సమయానుకూలంగా కఠినముగా మాటలాడిననూ తదుపరి తప్పక మేలుచేయును గానీ కీడు చేయడు

మచ్చిక లేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా
కుచ్చితులున్న చోట గుణ కోవిదులుండని చోట విద్యకున్
మెచ్చని చోట రాజు కరుణింపని చోట వివేకు లుండి రేని
అచ్చట మోస ముండు సుగుణాకర పెమ్మయ సింగధీ మణీ
గుణ కోవిదులు=మంచి పండితులు.

కారము లేని కూర యుపకారము లేని మనుష్యు డాది నోం
కారము లేని మంత్ర మధికారము లేని ప్రతిజ్ఞ వాక్చమ
త్కారము లేని మాట గుణకారము లేని లెక్క సా
కారము లేని పాట కొరగావు సదాశివ సద్గురు ప్రభూ!

పుణ్యస్య ఫల మిచ్చంతి ' పుణ్యం నేచ్చంతి మానవా: :
న పాపఫల మిచ్చంతి ; పాపం కుర్వంతి యత్నతః .
అర్థము:--: మానవులు పుణ్యమును చేయుటకు నుత్సహించరు గాని పుణ్యము
చేయుట వల్ల గలుగు ఫలము కావాలని మాత్రం కోరుకుంటారు .
పాపం చేయటానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు గానీ పాప ఫలం తమకు
కలగ కూడదని కోరుకుంటారు.ఎంత విపరీతము .

అక్షరాలలో స్త్రీ కి నిర్వచనమిది
అ - అపురూపమైనది
ఆ - ఆప్యాయత పంచేది
ఇ - ఇంటికి దీపం వంటిది
ఈ - ఈశ్వరుడి మూడోకన్నులాంటిది
ఉ - ఉన్నంతలో సర్దుకుపోయేది
ఊ - ఊరటనిచ్చేది
ఋ - ఋణం తీర్చుకోలేని సేవచేసేది
ఎ - ఎన్ని ఇబ్బందులు ఎదురైనా
ఏ - ఏకాగ్రత కోల్పోకుండా
ఐ - ఐనవారికోసం
ఒ - ఒంట్లో శక్తినంతా ధారపోస్తూ
ఓ - ఓరిమితో నేరిమితో
ఔ - ఔదార్యం చూపేది
అం - అందరి అవసరాలూ తీర్చేది
అః - అః అనిపించేది

పుణ్యస్య ఫల మిచ్చంతి ' పుణ్యం నేచ్చంతి మానవా: :
న పాపఫల మిచ్చంతి ; పాపం కుర్వంతి యత్నతః .
అర్తఃము: మానవులు పుణ్యమును చేయ నుత్సహించరు గాని పుణ్యము
చేయుట వల్ల గలుగు ఫలము కావాలని మాత్రం కోరుకుంటారు .
పాపం చేయటానికి నిరంతరం యత్నిస్తున్తారే గని పాప ఫలం తమకు
కలగా కూడదని కోరుకుంటారు.ఎంత విపరీతము .

---------పద్యభ్రమకం-----------
సారసజ నుత జయ తరళ
శూరహరా సాదరి వరసు సురా పరమా
సూర పరా సుసుర వరద
సారా హర శూలతర యజతనుజ సరసా
టీకా:- సారసజ =పద్మసంభవుడైన బ్రహ్మదేవుని చేత, నుత =కొనియాడబడు
జయ=జయముగలవాడా, తరళ =చరించునట్టి, శూరహర =రణసాహసులను హరించినవాడా, సాదరి =ఆదరముతో గూడిన, వర=ప్రభువా, సు= శ్రేష్ఠుడవైన
సుర= వేలుపా, పరా=పరమాత్ముడా, మర= మన్మథునకు, పరా =శత్రువైనవాడా,
సుసుర=మంచి వేల్పుల యొక్క, వర= కోరికలను, ద=ఇచ్చువాడా, స+హరా=వేగయుక్త
హర=హరనామము గలవాడా, శూలరత =త్రిశూలాయుధము నాదాసక్తి కలవాడా,
సరసా= రసికుడవైన వాడా.

ఈ పద్యము చివరినుండి మొదటికి చదివినా,మొదటినుండి చివరకు చదివినా ఒకేవిధంగా వుంటుంది. (కాశీపత్యావధానులు గారి రచన)

డా.మాడుగుల నాగఫణిశర్మ గారు చేసిన ద్విశతావధానంలో ఒకావిడ అడిగారు.సురలోకం లో సురాపానాన్ని నిషేధిస్తే ఎలా వుంటుందో ఒక శ్లోకం లో చెప్పమని . సంచాలకులైన రామబ్రహ్మం గారు, వారికి సుర లేక పిచ్చెక్కి పోతూవుంది.ఏమి చెయ్యాలో తోచడం లేదు. అవధానిగారు దీనికొక ఉపాయం చెబుతున్నారు.దేవలోకానికి దగ్గరలో 'యానాం' లేదు కదా! అని తమాషా గా చెప్పారు. మధ్యలో అప్రస్తుత ప్రసంగి శంకరనారాయణ గారు అయితే "కల్లుతెచ్చు కోమని చెప్తారా? అంటే అవధాని గారు 'కల్లు'కాదు 'కళ్ళుతెరుచుకోమని' అని చెప్తూ ఈ క్రింది శ్లోకం చెప్పారు.

శ్లోకం:- సురలోకోయమితి ప్రభాతి నితరా తత్రాపి నోచేత్సురా
కరణీయం కిమధ ప్రయోగ కుశలై: ర్దేవైస్య నిత్యమ్ము దా
సతతం మాద్యమహోకధతం ఘటతే చేతం తదా చేత్తదా
ద్వి శతం దివ్యవధానకం భవతు తత్ త్పద్య మాద్యంకరం.
అర్థము:-- అసలే సురలోకం మరి అక్కడ సుర లేకపోతె దేవతలు పిచ్చి వాళ్లై పోయారు.. ఏమిచేద్దామని వాళ్ళు ఆలోచిస్తూంటే, ఇంద్రసభలో ఇంద్రుడు దేవ భాషలో ద్వి శతావధానం ఏర్పాటు చెయ్యాలి అని అవధానిగారు సలహా యిస్తున్నారు. .దానితో ఒక్కో శ్లోకం వింటూ వుంటే మద్యం తాగినట్టు తన్మయత్వంతో వాళ్ళు తూలి పోతారట.అంత రసవత్తరంగా సాగుతుందట ఆ అవధానం. అవధాని గారి ఊహకు నమోవాకాలు

---------------------శుభసాయంత్రం-------------------------------


---------------శుభోదయం ------సుభాషితాలు----------------------
గుణవ దగుణవ ద్వా కుర్వతా కార్యమాదౌ
పరిణతి రావధార్యా యత్నతః పండితేన
అతి రభస కృతానాం కర్మణా మా విపత్తే:
భవతి హృదయదాహీ శల్యతుల్యో విపాకః
బుద్ధిమంతుడగు వాడు ఏపని నైనా చేయబూని నప్పుడు, దానివల్ల ఎట్టి ఫలితాలు కలుగుతవో బాగుగా విచారించి మరీ చెయ్యాలి.అలా కాకుండా అనాలోచితంగా తొందరపడి ఏ పనైనా చేస్తే అది మరణ పర్యంతము బాధించే మనశ్శల్యముగా పరిణమిస్తుంది.

పెట్టక కీర్తిరాదు వలపింపక యింతికి యింపు లేదు తా
దిట్టక వాదులేదు కడు ధీరత వైరుల సంగరంబులో
కొట్టక వాడ లేదు కొడుకొక్కడు బుట్టక ముక్తి రాదయా
పట్టపురాజుకైన నిది పద్ధతి పెమ్మయ సింగధీమణీ !

నిముసమైనను మది నిల్పి నిర్మలముగ
లింగ జీవా వేశు లను గాంచి భంగ పడక
పూజ మదియందు జేయుట పూర్ణపదవి
పరము గోరిన నిది చేయ బాగు వేమా
అర్థము:-- పనులెన్ని యున్నా వేరు విషయముల గురించి ఆలోచింపక క్షణ కాలమైనను తీరిక చేసుకొని నిర్మల మైన మనస్సుతో,నిశ్చల మైన బుద్ధితో పరమాత్మను పూజిస్తే ముక్తి కలుగుతుందని వేమన చెప్తున్నాడు.

తనుజులనుం గురు వృద్దు ల
జననీజనకులను సాధుజనుల నెవ్వడు దా
ఘనుడయ్యు బ్రోవడో యా
జనుడే జీవన్ మృతుడు జగతి కుమారా
అర్థము:-- ఓ! కుమారా తన కుమారులను,గురువులను,పెద్దవారిని,తల్లిదండ్రులను,సజ్జనులైన వారిని తగిన సమయమున రక్షింపడో
అతడు బతికి యున్నను చచ్చిన వానితో సమానము.
(కుమార శతకం)

మమ్మీ డాడీలు వద్దు అమ్మ,నాన్నలే ముద్దు
అచ్చమైన తెలుగు వీడి ఆంగ్ల బాట నడవద్దు
అవసరమున్నంత వరకే ఆంగ్లాన్ని నేర్వండి
అనవసరపు ఆర్భాటం ఆత్మ వంచనే నండి

నియత తపమును నింద్రియ నిగ్రహంబు
భూరివిద్యయు శాంతికి కారణములు
వాని యన్నిటికంటె మేలైన శాంతి
కారణము లోభముడుగుట కౌరవేంద్ర !
ఇంద్రియాలు చంచలమైనవి వాటివల్ల ఒక్కోసాగారి బుద్ధి క్షీణిస్తుంది. వాటిని అదుపులో పెట్టడానికి నియమనిష్టలతో చేసే తపస్సు, ఇంద్రియ నిగ్రహం, విద్య శాంతికి సాధనాలు. వీటన్నిటికీ మించి లోభగుణాన్ని వదిలేస్తేచాలు. పరమ ప్రశాంతత లభిస్తుందని ధృతరాష్ట్రుడితో చెప్పాడు విదురుడు. లోభి తాను తినడు,యితరులకు పెట్టడు. ఎప్పుడూ సంపదగురించే ఆలోచిస్తూ ఆ క్రమంలో జీవితంలోని ఆనందాలన్నిటికీ దూరమవుతాడు. ప్రతిక్షణం ఏదో తెలియని అశాంతికితొ

బతుకుతాడు పిసినారితనాన్ని పక్కనబెట్టి పరులకింత మేలు చేస్తే ఆ సంతృప్తి కలిగించే శాంతి బ్రహ్మానంద భరితమన్నది విదురుడి మాట. “లోభికి నాలుగందాల నష్టం” అన్న సామెత ఉందనే ఉంది కదా!

దగ్గర కొండెము చెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మరి తా
నెగ్గు ప్రజకాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ!
తా:--చెప్పుడు మాటలు,పొగడ్త లకు లొంగిపోయి ప్రజలకు కీడు తలపెట్టు రాజు
బొగ్గులకోసం కల్పతరువును కాల్చేసే మూర్ఖుడితో సమానమని చెప్పాడు బద్దెన
---------------శుభోదయం-------సుభాషితాలు-----------------
విద్యయే మనుజుల వికసింప జేసెడు
మహిత సాధనంబు మనుజులందు
విశ్వ హితము లేని విద్వేష పూర్ణమౌ
విద్య వున్నవాడు వింత పశువు (డా. మూలే రామముని రెడ్డి,ప్రొద్దుటూరు)

పరోక్షే కార్య హంతారం
ప్రత్యక్షే ప్రియవాదినం
వర్జయే తాదృ శ మ్ మిత్రం
విషకుమ్భం పయోముఖం
అర్థము: ఎదుట ఎప్పుడూ ఇచ్చకము లాడుతూ,చాటున అపకారములు చేయునట్టి మిత్రుడు పయోముఖ విష కుంభము వంటి వాడు.(పాల లాగా కనిపించే విషముతో నిండిన కుండ)
వాడికి దూరముగా యుండవలయును.

ముఖం పద్మదళా కారం వచశ్చందన శీతలం
హృత్కర్తరి సమం చాతివినయం ధూర్త లక్షణం


అర్థము:-ముఖము తామరరేకుల్లాగా అందముగా వుంటుంది,మాటలు మంచిగంధము వలె చల్లగా
వుంటాయి,కానీ మనస్సు కత్తెరలాగా పదునుగా వుండి మనకు హాని కలిగిస్తుంది.అతివినయం దుర్మార్గుల లక్షణము.కనుక వారితో జాగ్రత్తగా మెలగవలయును.
------------------------------------
మిత్ర ద్రుహః క్రుతఘ్నస్య స్త్రీ ఘ్నస్య పిశునస్యచ
చతుర్ణా మాపి చైతెషాం ని ష్కృతి ర్నైవ విశ్రుతా
అర్థము:-- మిత్ర ద్రోహి, కృతఘ్నుడు, స్త్రీని బాధించు వాడు ,చాడీలు చెప్పువాడు ఈ నలుగురూ మహా పాపులు. వీరి పాపములకు నిష్కృతి లేనే లేదు.
----------------------------------
"నీతో యుధ్ధముసేయనోపఁగవితా నిర్మాణశక్తిన్ నినున్/
బ్రీతుంసేయగలేను,నీకొఱకు తండ్రింజంపఁగాఁజాల,నా/
చేతన్ రోకటనిన్నుమొత్తవెఱతున్, జీకాకు నాభక్తి,యే/
రీతిన్ నాకిక నిన్నుజూడఁగలుగున్ ,శ్రీ కాళహస్తీశ్వరా!

కాళహస్తీశ్వర శతకము. ధూర్జటి మహాకవి.

భావము:స్వామీ! కాళహస్తీశ్వరా! నీభక్తులందరూ అసాధ్యమైన కార్యములొనరించి నీమెప్పువడసినారు.తెలిసీతెలియనివాడనునాభక్తియెట్టిదో నాకేతెలియనిపామరుడనునీతో యుధ్ధమొనర్చుటనాతరమా?కవిత్వమును జెప్పినిన్నుమెప్పించు శక్తియు లేనివాడనే, నీకొరకు కన్నతండ్రినైనను జంపుసాహసములేదే,నాచేతిరోకటితో నిన్నుదంచలేనే?మరియెట్లుస్వామీ నీసన్నిధినిచేరుట.నాకాఉపాయమేదో ఉపదేశింపుమని కవియభవుని అడుగుచున్నాడు.

విశేషములు:
ఇందు నిందాస్తుతి యలంకారమున్నది.నిందించుచున్నట్లు పైకిగానవచ్చినను వ్యంగ్యముగా శివుని ,యతనిభక్తులను ప్రశంసించుటయే కవియొనరించినకార్యము.
1అర్జునుడు పాశుపతాస్త్రముకొరకై తపమొనర్చునపుడు మాయాకిరాతవేషధారియగుశివునితో యుధ్ధమొనరించును.ఆరీతిగా నీతో యుధ్ధము నేనుచేయలేనుస్వామీ!అనుచున్నాడు.(సమరమున అర్జునుడు శివునిపలురీతులనొప్పించెను)
2నత్కీరుడనే శివభక్తుడు శివునికవిత్వమునతప్పులుబట్టి తనకవితాశక్తితో శివుని మెప్పించినాడు.నాకు అటువలె కవితచెప్పుశక్తిలేదనుచున్నాడు.
3విచార,శర్మయనునాయనారు పశువులను మేపుటకుగొనిపోయి,భక్తిపారవశ్యమున మునుగ,పశులు పంటపొలమునబడినవి.ఇదేమిరాయని అడుగ వచ్చిన తండ్రిని తనఏకాగ్రతకుభంగముకల్గించెనని, కోపావేశమున గొడ్డలితోనరకును.అదిగో ఆనాయనారువలె తండ్రిని చంపలేననుచున్నాడు.
4చిరుతొండనంబియను శివభక్తుడు కపటజంగముకోర్కెదీర్చుటకై కొమరుని జంపి యతనిశిరోమాంసమునురోకటదంచి కూరవండి పెట్టినాడు.
ఈరీతిగా శివభక్తులు చేసినత్యాగములను నేనుచేయలేని యశక్తుడననుచు,"చీకాకునాభక్తి"-యనుచున్నాడు(.అనగా తనభక్తిస్వరూప స్వభావ ులేవో చెప్పుటకు వీలులేనిది)
అట్టిశక్తిహీనుడను నన్ను నీవే నీదరికి చేర్చుకొనవలె ననుచున్నాడు.
స్వస్తి!(శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి సౌజన్యముతో)

ఉపకారేణ నీచానా మపకారోహి జాయతే
పయః పానం భుజంగానాం కేవలం విష వర్ధనం
తా:-నీచులకు ఉపకారము చేసినా వాళ్ళు మనకు అపకారమే చేస్తారు.ఎలాగయితే పాముకు పాలు పోయడం వలన దానికి విషము వృద్ధి యై మనల్ని కాటువేస్తుందో అలాగ.

ఆయుర్వేదేన నిర్ణీత మౌషధం రోగిణాం
జ్ఞానం తదైవ నిర్ణీతం సర్వేషాం భవ రోగిణాం
అర్థము: ఆయుర్వేదము రోగముగల సర్వ మానవులకొఱకు ఎట్లు యేర్పడినదో అలాగున అజ్ఞాన రోగముగల సర్వ మానవులకు
బ్రహ్మ జ్ఞానమను ఔషధము భవరోగము లను తగ్గించుట కొఱకు వేదము చే నిర్ణయింప బడి నది.

యాంతి ధర్మ ప్రవృత్తస్య తిర్యం చోపి సహాయతాం
అపంథానంతు గచ్చానం సోదరోపి విముంచతి.

అర్థము:-ధర్మ మార్గమున నడచు వానికి పశు పక్ష్యాదులు కూడా సహాయ పడతాయి.అధర్మ నార్గం లో నడిచే వానిని సోదరుడు కూడా విడిచి పెడతాడు.(సోదరుడు విడిచి పెట్టినా వానికి పాపము అంటదు)(రామునికి కోతులు సహాయము చేశాయి కదా!)

కట్టడ దప్పి తాము చెడు కార్యము చేయుచు నుండి రేని దో
బుట్టినవారినైన విడిపోవుట ధర్మము దౌర్మదాంధ్యముం
దొట్టిన రావణాసురునీతో నెడబాసి విభీషణాఖ్యు డా
పట్టున రాము జేరి చిర పట్టము గట్టుకొనండె భాస్కరా!

గుడ్ మార్నింగ్ వచ్చేను నేరువక
శుభోదయం చచ్చేను తలువక
ఎన్నడూ తెలుగేను మరువక
ఓ కూనలమ్మ!
--(())--


తెట్టు గ్రామవాసి వెంకన్నకు ప్రభువు యాచమానాయుడు యిచ్చిన సమస్య
సమస్య:-"వక్త్రంబుల్పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వేయగున్"
(నోర్లు పది,కన్నులు ఐదు, చేతులు వర్ణింపగా వేయి అవుతాయి.)
క్రమాలంకారములో పూర్తి చేశారు, తెట్టు గ్రామ వాసి వెంకన్న కవి.


ఈ 'క్త్రా'ప్రాసము కష్టమౌననుచు మీరింతేసివారాడగా
వాక్త్రాసంబది సత్కవీశ్వరుల త్రోవ ల్గామి నే జెప్పెదన్
దిక్త్రారాతికి బార్వతీశ్వరులకున్ దిగ్మప్రభారాశికిన్

వక్త్రంబుల్పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వేయగున్


ఈ 'క్త్రా' ప్రాస కష్టము లే పూరింప లేడని మీరు యింతగా అనుకుంటున్నారేమో,
సత్కవీశ్వరులకు వాక్కు యెలాగైనా త్రిప్పుటకు దారులు వుంటాయి.నే చెప్పెదను వినుడు. దిక్కులకు శత్రువైన రావణునికి నోర్లు పది, పార్వతికి, ఈశ్వరునకు గలిసి
కన్నులు ఐదు (అర్ధనారీశ్వరుడు కదా)ఇక ఆకాశములో వెలుగు సూర్యునకు కిరణములు
వేయి వుంటాయి.(కరములు =కిరణములు)ఆయన సహస్ర కిరణుడు కదా!

ఒకసారి అవధానం లో ఈ దత్తపది యిచ్చారు. సోనియా,తెరిసా,మండేలా,గాంధీజీ నాగఫణి శర్మ గారి


పూరణ.
వాల్లభ్యంబును వీడి వచ్చితి మహో వా సోనియామ్యస్థితిన్
చల్లంగా గడతేరిసాగి గహనీ సంచార ధారా గతిన్
జిల్ల్లన్ గుండియ మండే లాలిత జనశ్రీ జూపు నా ప్రేమతో
నల్లాడెన్ పితృవాక్య నిర్వహణ రాగాంధీ జిత క్రోధమై
అర్థము:-ఈ మాటలు లక్ష్మణుడు అంటున్నాడు రాముడితో వదిన కష్టపడుతూందనే బాధతో అన్నగారి
మీద మిక్కుటమైన ప్రేమతో అంటున్నాడు. వాసోనియమము అనగా(వల్కలములు నారచీరలు) )ధరించవలెనను నియమముతో అంతఃపుర


సౌఖ్యాలన్నిటినీ విడిచి పట్టి పితృ వాక్య పరిపాలన కోసం ఈ అడవుల్లో సంచరిస్తున్నాము.అయోధ్య ప్రజలు చూపిన ప్రేమతో నా గుండె మండిపోతూ వుంది.అని అన్నగారి మీద ప్రేమతో అంధుడై పోయినలక్ష్మణుడు క్రోధమును జయించిన అన్నగారితో అన్నాడు..
------------------------------
ఇరుక రాదు, కొరుకరాదు,నరుకరాదు,పెరుకరాదు అని నాలుగు పదాలు యిచ్చి పూరించమన్నాడట. యాచామనాయుడను రాజు తెట్టు గ్రామ వాసి యైన వెంకన్నకు.
పూరణ:-


ఇరుక రాదు చేత నిసుమంత నిప్పైన
గొరుకరాదు ఇనుము కొంచెమైన
నరుకరాదు నీరు నడిమికి రెండుగా
బెరుకరాదు బావి పెల్లగిలగ

------------------------శుభరాత్రి------------------------



    --------------శుభోదయం----సుభాషితాలు------------------------
    ఐశ్వర్యస్య విభూషణం సుజనతా శౌర్యస్య వాక్సంయమః
    జ్ఞానస్యో పశమః శ్రుతస్య వినయో విత్తస్య పాత్రే వ్యయః
    అక్రోధ స్తపసః క్షమా ప్రభావితు ర్ధర్మస్య నిర్వ్యాజతా
    సర్వస్యాపి హి సర్వకారణ మిదం శీలం పరం భూషణం (భర్తృహరి సుభాషితం)
    అర్థము:--ఐశ్వర్యమునకు అలంకారము మంచితనము, పరాక్రమమునకు మంచి మాట

    శోభ నిచ్చును. జ్ఞానమునకు శాంతము,పాండిత్యమునకు వినయము, శోభించును. ధన
    మున్నందుకు సత్పాత్ర దానము, తపస్సునకు కోపము లేకుండుట,సమర్థునికి క్షమా
    గుణము అలంకారము లగును. ధర్మ మునకు
    నిర్వ్యాజత, సమత తేజస్సు నొసగును. మిగిలిన ఏ గుణములుండనీ లేకపోనీ మంచి
    నడవడి సర్వ జనులకూ శోభ నిచ్చును.

    పద్దెము లోభికేల? మఱి పందికి జాఫరు గంధ మేల? దు
    క్కెద్దుకు పంచదారటుకులేల?నపుంసకుడైనవానికిన్
    ముద్దులగుమ్మయేల? నెఱ ముక్కఱ యేల వితంతురాలికిన్
    గద్దకు స్నానమేటికి? గావలె? బెమ్మయసింగధీమణీ!

    అడిగిన జీతంబియ్యని
    మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
    వడిగల ఎద్దుల గట్టుక
    మడి దున్నుకు బతుకవచ్చు మహిలో సుమతీ!

    సుఖార్థీ త్యజతే విద్యాం
    విద్యార్థీ త్యజతే సుఖం
    సుఖార్తినః కుతో విద్యా


    కుతో విద్యార్తినః సుఖం.
    అర్థము:సుఖము ను కోరువాడు విద్యను వదులుకోవల్సిందే.
    విద్య కావలిసిన వాడు సుఖాన్ని వదులు కోవలిసిందే. సుఖార్థు లకు .విద్య ఎందుకు?విద్యార్థులకు సుఖము ఎక్కడ?
    -------------------------------
    ఉత్సవే వ్యసనే చైవ
    దుర్భిక్షే రాష్ట్ర విప్లవే
    రాజద్వారే స్మశా నేచ
    యాస్తి ష్టతి స బాంధవః
    అర్థము: శుభ కార్యములలో అవసరము వచ్చినప్పుడు,కష్టములు చుట్టుముట్టినప్పుడు
    దేశమున తిరుగుబాట్లు జరిగినప్పుడు ,అధికారుల సమక్షమునందు, మరణాది
    దుఃఖము తట స్థించి నప్పుడు,మొగము తప్పించక వెంటనుండి సహాయము చేయువాడే
    నిజమైన బంధువుడు.

    అనభిద్యా పరస్వేషు ; సర్వ సత్వేషు సౌహృదం
    కర్మణాం ఫల మస్తీతి ; మనసా త్రితయం చరేత్
    అర్థము:-- పరుల సొమ్ము పై ఆశ లేకుండుట, సర్వ జీవుల యందు కరుణ కలిగి వుండుట, చేసిన కర్మకు ఫలముండి తీరునన్న నమ్మకము; ఈ మూడింటిని మనసునందు వుంచుకొని ప్రవర్తించ వలయును.

    ==((***))--


    యజమాని క్షేమాన్ని కోరుకునే బ్రాహ్మణుడు వెంటనే దక్షిణ తీసుకోవాలి.

    శ్లో౹౹దక్షిణా విప్రముద్దిష్య తత్కాలంచే న్నదీయతే౹
    ఏక రాత్రే వ్యతీతేతు తద్దానం ద్విగుణం భవేత్౹౹
    మాసే శత గుణం ప్రోక్తం ద్విమాసేతు సహస్రకం౹
    సంవత్సరే వ్యతీతేతు స దాతా నరకం వ్రజిత్౹౹
    దాత్రా న దీయతే మూర్ఖో గ్రహీతాచ న యాచతే౹
    ఉభౌ తౌ నరకం యాతౌ దాతా వ్యాధియుతో భవేత్౹౹
    విప్రాణాం హింసనం కృత్వా వంశహానిం లభేద్ధ్రువం౹
    ధనం లక్ష్మిం పరిత్యజ్య భిక్షకశ్చభవేద్ర్వజన్౹౹

    - బ్రహ్మవైవర్త పురాణం

    తాత్పర్యం:-

    బ్రహ్మణుని ఉద్దేశించి ఇవ్వవలసిన దక్షిణ వెంటనే ఇవ్వాలి.ఒకవేళ అలా ఇవ్వకపోతే..
    ఒకరాత్రి గడిస్తే ఆ ఇవ్వవలసిన దానం రెట్టింపు అవుతుంది.
    నెలకు నూరు రెట్లు అవుతుంది.
    రెండునెలలకు వేయి రెట్లు అవుతుంది.
    సంవత్సరం గడిస్తే ఆ దాత నరకాన్ని పొందుతాడు.ఇది నిశ్చయం.
    ధనం,లక్ష్మీ వీటిని పోగొట్టుకుని వెళుతూ భిక్షకుడౌతాడు.
    మూర్ఖుడైన దాత ఇవ్వకపోయినా..తీసుకునే బ్రాహ్మణుడు అడగకపోయినా ఇద్దరూ నరకానికి వెళతారు.
    చివరకు దాత రోగగ్రస్తుడౌతాడు.విప్రులను హింసిస్తే వంశహాని జరుగుతుంది.


    వేదాంతంలో కస్తూరీమృగం కధ చెబుతారు. కస్తూరీమృగం అంటే ఒక రకమైన జింక. సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది. అది మంచి మదపువాసనగా ఉంటుంది.అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది.ఆ వాసన తనవద్ద నుంచే వస్తున్నదని అది గ్రహించలేదు.ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది. ప్రాణాలు కోల్పోతుంది. వేదాంత గ్రంధాలలో ఉన్న ఈ కధ అందరికీ తెలిసినదే.

    మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్ధంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలనీ తీర్ధయాత్రలనీ అనవసరంగా తిరిగి డబ్బునీ కాలాన్నీ వృధా చేసుకుంటూ ఉంటాడు. నిజానికి వీటివల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు.
    పాండవులు తీర్ధయాత్రలకు వెళుతూ కృష్ణుణ్ణి కూడా తోడు రమ్మని పిలుస్తారు. సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్ధయాత్రల అవసరం ఏముంది? ఆ సంగతి మాయామోహితులైన పాండవులకు తెలియదు. కనుక కృష్ణుని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్ధయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు. ఆయన చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయ నిచ్చి 'నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి.'అని చెబుతాడు. వారు అలాగే చేసి తీర్ధయాత్రలు ముగించి తిరిగి వస్తారు.

    అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింపచేస్తాడు కృష్ణుడు. ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది.

    'అదేంటి బావా? ఇది చేదు దోసకాయ.కటికవిషంలాగా ఉంది.ఇలాంటి వంటకం చేయించావేమిటి?' అని వారు అడుగుతారు.

    దానికి కృష్ణుడు నవ్వి.' బావా. ఎన్ని గంగలలో మునిగినా ఈ దోసకాయ చేదు పోలేదు చూచావా?' అంటాడు.

    ఎన్ని తీర్ధయాత్రలు చేసినా, మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పూ రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం.

    మనిషి ప్రయాణం బయటకు కాదు. లోపలకు జరగాలి. యాత్ర అనేది బయట కాదు.అంతరిక యాత్రను మనిషి చెయ్యాలి.ప్రపంచమంతా మనిషి తిరిగినా చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు. అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలోనుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు. పాతకాలపు మహర్షులు

    దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు. ఒకచోట స్థిరంగా కూచుని తపస్సు చేశారు. జ్ఞానసిద్ధిని పొందారు.

    సర్వేజనా సుఖినోభవంతు
    ==))((==

        ---------------శుభోదయం ------సుభాషితాలు----------------------
        మాడలమీద నాసఁగలమానిసి కెక్కడి కీర్తి?కీర్తి పై
        వేడుకగల్గు నాతనికి విత్తము మీద మరెక్కడాస? యీ
        రేడు జగంబులందు వెలహెచ్చిన కీర్తి ధనంబు గాంచి స
        స్ప్రౌఢ యశంబు జేకొనియె బమ్మయసింగడు దానకర్ణుడై

        అక్కరకు రాని చుట్టము
        మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా
        నెక్కిన బారని గుఱ్ఱము
        గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!

        అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
        తినగ తినగ వేము తియ్యనుండు
        సాధనమున పనులు సమకూరు ధరలోన
        విశ్వదాభిరామ వినుర వేమ

        అతనికి వార్ధి కుల్యయగు నగ్ని జలంబగు మేరుశైల మ౦
        చిత శిలలీలనుండు మదసింహము జింక దెరంగుదాల్చు గో
        పిత ఫణి పూలదండ యగు భీష్మ విషంబు సుధారసంబగున్
        క్షితిజన సమ్మతంబగు సుశీల మదెవ్వని యందు శోభిలున్
        తా:--దేశము లోని జనులు మెచ్చుకొనే సౌశీల్యము యెవనియందుండునో, అతనికి సముద్రము పిల్లకాలువ వలెను,అగ్ని నీరైపోవును,మీరు పర్వతము ఒకచిన్నరాయిగానూ,
        మదించిన సింహము జింక మాదిరిగానగును, కోపించిఉన్న సర్పము పూలదండలాగున
        ను, విషము అమృతములాగునను మారిపోవును.

        ప్రేమను గూర్చి యల్పునకు బెద్దతనంబును దొడ్డ వానికిం
        దామతి తుచ్ఛపు౦బని నెదం బరికింపఁగ యీయరాదుగా
        వామకరంబు తోడ గుడువం గుడిచేత నపామార్గము౦
        దోమగవచ్చునే మిగుల దోచని చేతలు గాక భాస్కరా!
        తా:--లోకంలో నీచునకు గొప్ప పదవిని, గొప్పవానికి చిన్న పదవిని నిచ్చి పనులు చేయించుచో ఆ పాలనమంతయు ఆలోచన లేనిదిగా క్రమబద్ధరహితముగా యుండును.
        ఎట్లనగా ఆలోచనలేక ఎడమచేత భుజించుటయును, కుడిచేతితో మలమూత్రములు శుభ్ర పరచుటయును నగును.

        సమస్య:"విద్య వున్నవాడు వింత పశువు"
        పూరణ:--తెలుగు పుడమిన తెలుగు వారికి బుట్టి
        తెలుగు గడ్డ మీద కొలువు దీరి
        తెలుగు వారితోడ తెలుగు మాట్లాడని
        విద్య వున్నవాడు వింత పశువు (భక్తకవి. వేంకటగిరి )

        వినయ మిచ్చు విద్య వెలిగించు నెడదను
        వినయ శోభ లేని విద్య యేల?
        వినయమును హరించు విత్తదాయకమగు
        విద్య వున్నవాడు వింత పశువు (కొర్రపాటి. చంద్రశేఖరరావు,గుంటూరు)

        విద్యనెరిగి విజ్ఞాన మెరుగక
        ధరణి ప్రగతి సుంత దలపక
        తానె జ్ఞాని ననెడి తలబిరుసున్నట్టి
        విద్య వున్నవాడు వింత పశువు (భళ్ళమూడి. శ్రీనివాసరావు,హైదరాబాదు)

        వివిధ విద్యలెల్ల విరివిగా నేర్చినా
        వినయ హీనుడగుట వింత గాదె?
        సంఘ హితము గోరు సౌశీల్యము లేని
        విద్య వున్నవాడు వింత పశువు (Jaada.Rajeswara Rao Jaggampeta)

        దుర్జనో నార్జవం యాతి


        సేవ్యమానో ఫై నిత్య శ:
        స్వేద నాభ్యన్జనో పాయై:
        శ్వపుచ్చ మివ నాపితం.

        అర్థము:ఎంత మంచి చేసి ప్రయత్నిచినను దుర్జనులు మంచి మార్గమునకు రారు ఎలాగంటే ఎన్ని విధము ల సాగ దీసి,చమురు రాసి,కట్టిపెట్టి ఉంచినా కుక్క తోక చక్కగా అ వదు కదా!
        __(())--


        6:31 pm, 04/12/2019] Hari: విత్త మార్జనంబె
        విద్య లక్ష్యంబాయె
        విలువ లెండమావి
        విధములాయె
        విజ్ఞులు కరువాయె
        విజ్ఞాన మెడమాయె
        విబుధ సేవనంబు
        వికృతాయె
        [6:31 pm, 04/12/2019] Hari: వినయ మిడని విద్య
        విఖ్యాతి నొందదు
        విలువ లేని విద్య
        వెలుగు నిడదు
        విశ్వ శాంతి నిడని
        విద్య పూర్ణమవదు
        విబుధులవక విద్య
        విభవ మిడదు
        [6:34 pm, 04/12/2019] Hari: తలపు మంచి దైన
        తప్పు దారిని పోరు
        తలపు చెడ్డ దైన
        తప్పు దారి
        తలపులె మన పాలి
        తలరాతలుగ మారు
        తలపులు సరిదిద్దు
        తప్పు ముప్పు
        [6:34 pm, 04/12/2019] Hari: ఏల జనులు వెంట
        యేమియు తేకుండ
        యేమగు తన దనుట
        యెంత వింత
        యేది మనది కాదు
        యేది మనతొ రాదు
        యెచటి దచటె యుండ
        యేల చింత
        [6:35 pm, 04/12/2019] Hari: ఘంటసాల
        సీ।శ్లోకమ్ము చదివెనా లోకాల నన్నిటిన్
        మంత్ర ముగ్ధము చేయు మధుర మూర్తి
        పద్యమెత్తుకొనిన భావాను గుణముగా
        నవ రసాలొలికించు నటన మూర్తి
        పాటలు పాడెనా ప్రాణి లోకమునెల్ల
        పరవశింపగ జేయు ప్రణయ మూర్తి
        స్వరములు కూర్చెనా సరస మాధుర్యాలు
        సరసాన్న ములు పెట్టు సరస మూర్తి
        గీ। వినయ సంపన్న శోభిత విదిత మూర్తి
        లలిత సంగీత సామ్రాజ్య రమ్య మూర్తి
        సరస సంగీత సాహిత్య చక్రవర్తి
        చలనచిత్ర రంగాన సంచలన మూర్తి
        గాన మాధుర్యముల సీమ ఘంటసాల
        అతని గొప్పను పొగడ నా కలవి యౌన?
        డా మీగడ

        గోత్రము - సూత్రము

        తిరుచ్చి రైల్వేస్టేషన్ లో పనిచేసే ఆ వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె. అతను పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తుడు. మహాస్వామి వారు ఎక్కడ మకాం చేసినా, సంవత్సరానికి కనీసం నాలుగైదు సార్లు కుటుంబంతో సహా దర్శించుకునేవాడు. కేవలం దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళిపోకుండా కనీసం రెండు రోజులు స్వామివారితో ఉండి వారి కరుణా సముద్రంలో మునుగిపోయేవాడు.

        ఒకసారి స్వామివారితో, “ఈ అబ్బాయికి తొమ్మిది సంవత్సరములు. ఉపనయనం చెయ్యాలి” అన్నాడు.

        “తప్పకుండా చెయ్యి” అన్నారు స్వామివారు.

        “ఇతని గోత్రము సూత్రము నాకు తెలియవు” అని బదులిచ్చాడు అబ్బాయి తండ్రి.

        “అతను మీ అబ్బాయే కదా?”

        ”కాదు. ఇతను తన తల్లి కడుపులో ఉండగా తండ్రి మరణించాడు. పుట్టిన రెండు నెలల తరువాత తల్లి కూడా కాలం చేసింది. ఈ పసివాని బాగోగులు చూడడానికి ఆ పల్లెటూరిలో ఎవరూ లేకపోవడంతో, మేము తీసుకుని వచ్చాము. యాతని గురించి కాని, యాతని బంధువుల గురించి గాని ఎటువంటి సమాచారము లేదు. తిరునల్వేలిలో ఒక ఆగ్రహారానికి సంబంధించిన వాడుగా తప్ప ఇతర వివరాలు ఏవి తెలియవు పెరియవ” అని మొత్తం చెప్పాడు.

        మహాస్వామివారి మోహంలో అసాధారణమైన చిరునవ్వు కనిపించింది. అక్కడే ఉన్న కణ్ణన్ మామతో, “చూడు, ఇతను ఒక అనాథను పెంచుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా పెంచడమే కాకుండా ఇప్పుడు ఉపనయనం చేయాలని కూడా యోచిస్తున్నాడు. ఎంతటి ఉన్నతుడు ఇతను” అన్నారు స్వామివారు.

        “ఇప్పటి దాకా ఆ పిల్లవాడు అతని కుమారుడే అనుకున్నాము” అన్నాడు కణ్ణన్ మామ.

        మహాస్వామివారు ఎంతో సంతోషంతో, “నేను విన్నట్టుగా గోత్రము తెలియని వారికి కాశ్యప గోత్రమని, సూత్రము తెలియక పొతే భోదాయన సూత్రమని ప్రమాణం. అలాగే సంకల్పించి ఈ బాలునికి ఉపనయన సంస్కారం జరిపించు. అతను అనాథ అని, పరాయివాడని ఎన్నటికి ఆలోచించకు. అతను నీవాడు; నీ కుమారుడు” అని ఆదేశించారు. ఆ వ్యక్తీ స్వామికి నమస్కరించి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయాడు.

        --- vandeguruparamparaam.blogspot.in నుండి

        అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
        శ్రీ

        చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

        #
        --(())--

        ఇది ఒక చమత్కార శ్లోకం. సమస్య:-"మృగాత్ సింహః పలాయతే " జింకను చూసి సింహము పరిగెత్తి పోయింది .ఇది అసంబద్ధం కదా! దీన్ని క్రమాలంకారం లో పూర్తి చేశారు.('చమత్కారశతం' పుస్తకము నుండి)

        శోకం:-- కస్తూరీ జాయతే కస్మాత్?
        కోహంతి కరిణాం కులం?
        కిం కుర్యాత్ కాతారో యుద్ధే?
        మృగాత్ సింహ పలాయతే
        కస్తూరి దీనినుంచి పుడుతుంది?సమాధానం మృగాత్ =మృగమునుండి (కస్తూరి అనే మృగమునుండి కారే మదమే కస్తూరి )
        ఏనుగుల గుంపును చంపేది ఎవరు? సింహం సమాధానం
        యుద్ధములో భయపడినవాడు ఏమి చేస్తాడు?పలాయతే =పరిగెత్తి పోతాడు.సమాధానం

        పన్నేండ్లక్రిందటి మాట.మదనపల్లి రచయితల సంఘం ఏర్పాటు చేసిన అష్టావధానం జోరుగా సాగుతోంది. ఓ పృచ్ఛకుడు లేచి అవధాని గండేపల్లి శివరామయ్యగారికి ఒక సమస్యను సంధించాడు. "తద్దినంబేను సుదినమ్ము తరచి చూడ"

        దీన్ని అవధానిగారు ఎలా పూరిస్తారోనని సభాసదులందరూ ఎదురు చూస్తూవున్నారు.
        అవధానాలంటే సాధారణంగా పృచ్ఛకులు కవులూ,రచయితలూ వుంటారు. వాళ్ళను దృష్టిలో పెట్టుకొని కాబోలు అవధానిగారు యిలా పూర్తి చేశారు

        పత్రికలలోన మనపేరు పడిన దినము
        రేడియోలన్నిమనపాట పాడు దినము,
        టెలివిజను నందు మన బొమ్మ వెలుగు దినము
        తద్దినంబేను సుదినమ్ము తరచిచూడ

        'తద్దినం'అంటే తత్ =ఆ, దినం =రోజు -ఆరోజు
        (సేకరణ: చీనేపల్లి రాజ్యలక్ష్మి తెలుగువెలుగు మాసపత్రిక సౌజన్యముతో )

        ఒకసారి అవధానం లో ఈ సమస్య యిచ్చారు.
        "కపిన్ పూజలు జేసే రాముడు కపుల్ గనగా కపిలేని వేళలోన్"డా. నాగఫణి శర్మ గారి పూరణ
        ఈ జననంబు ధన్యమై హేమ వితీర్ణ సువర్ణ పాత్రమై
        భ్రాజ దనన్య గుణ రాజ శిఖామణి దేవ దేవతా
        రాజిత నిరంతర వరప్రదాత నా వృషా
        కపిన్ పూజలు జేసే రాముడు కపుల్ గనగా కపిలేని వేళ లోన్
        తా:-రావణుడు బ్రాహ్మణుడు. ఆయనను చంపినందు వలన రామునికి బ్రహ్మ హత్యా పాతకం అంటుకుంటుంది. దాన్ని పోగొట్టుకోవడానికి అక్కడ సముద్రపు ఒడ్డు దగ్గరనే శివలింగ ప్రతిష్ఠ చేయమని సలహా యిస్తారు.అక్కడి ఋషులు. ప్రతిష్ఠ
        చేయడానికి ఆత్మ.లింగము తేవడం కోసం హనుమంతుడు కైలాసానికి పోతాడు.హనుమ .ఎంతసేపటికీ రాకపోయే సరికి ముహూర్తము దాటి పోతుందని సైకత (యిసుక)లింగము చేసి దానికి పూజలు చేయమని మునులు సలహా యిస్తారు. రాముడు ఆ సైకత లింగానికే ముందు పూజ చేస్తాడు.అదీ కథ.అక్కడ హనుమ లేకుండానే కపిలేని వేళలో వృషాకపి((శివుడు)ని రాముడు పూజించి ప్రతిష్ట చేస్తాడు.
        తనుతెచ్చిన లింగానికి కాక సైకత లింగానికి ముందు పూజ చేసినందుకు హనుమకు కోపం వస్తుంది సముద్రము లో పడి ప్రాణత్యాగము చేసుకుంటాను అంటాడు.అప్పుడు రాముడు అతనిని వారించి గర్భగుడిలో నీవు తెచ్చిన లింగానికే పూజలు జరుగుతాయని వరమిస్తాడు.యిప్పటికీ రామేశ్వరము లో రెండు లింగాలు వుంటాయి.

        ద్విశతావధానం లో యిచ్చిన సమస్య:--"శేషనుభూతమయ్యెమనచేతలరాతలు మార్చినాడహో"డా.నాగఫణి శర్మ గారి పూరణ:-

        సోషను గల్గ జేసెనిక శూరత జూపెడు నాయకాళికిన్
        సోషలిజమ్ములోన గల సూక్ష్మ మహస్థితి సంఘటించె యా
        శ్లేషిత వర్తమానుడయి చిత్రిత భవ్య భవిష్యుడింక యా
        శేషను భూతమయ్యె మనచేతల రాతలు మార్చినాడహో.
        మన నాయకులకు శోషవచ్చేటట్లుగా ఎన్నికల సంస్కరణచేసిన శేషన్ గారు
        మానతలరాతలు మార్చి భూతకాలం లోకి వెళ్లిపోయారు.మనం ఆయనను
        మర్చిపోయాము.మళ్ళీ ఎన్నికలు షరా మామూలైపోయాయి.
        ------------------శుభసాయంత్రం ----------------
        
        ==(())--
        

            -------శుభోదయం-----సుభాషితాలు--------------------
            కోమటివేముని దానము
            భూమి ప్రసిద్ధంబు ..కల్ప భూజముచెంతన్
            పామున్నపగిది తురగా
            రాముండున్నాడు ..చేరరాదెవ్వరికిన్'

            మనవికి నొక్కయేడు; ననుమానపు మాటకు నాఱునెల్లు; నే
            డనిపెదనన్న మాసమవు; నన్పెదపొమ్మన్న బక్షమౌను; తత్
            క్షణ మిదె యంపితన్న మఱి సంతయువచ్చును; మోక్షమింక నా
            మనవికి నెన్నడో? సుజనమాన్యుడ! పెమ్మయసింగధీమణీ!

            న భోగ హార్యా నచ బంధు హార్యా
            న భాతృహార్యా నచ రాజహార్యా
            స్వదేశ మిత్రం పరదేశ బంధు:
            విద్యా సుధా౦ ఏ పురుషా: పిబంతి.
            అనుభంచినా తరగనిది, బంధువులు, సోదరులు, రాజులు అపహరించలేనిదీ, స్వదేశమున మిత్రుని వంటిది, పరదేశమున బంధువు వంటిది యగు విద్యామృతమును పానము జేయువారు ధన్యులు గదా!

            "నీపంచంబడియుండగాఁగలిగినన్ భిక్షాన్నమేచాలు, ని/క్షేపంబబ్బిన రాజకీటముల నే సేవింపఁగా నోప,నా/
            శాపాశంబులఁ జుట్టిత్రిప్పకుము సంసారార్ధమై, బంటుగా/
            జేపట్టందగుఁబట్టి మానదగదో శ్రీకాళహస్తీశ్వరా!

            కాళహస్తీశ్వర శతకం. ధూర్జటి మహాకవి.

            భావము:స్వామీ! నన్ను నీపంచన పడియుండనిమ్ము,భిక్షాన్నమబ్బినను అగియేనాకు చాలును.
            నిధి నిక్షేపములొసంగినను రాచపురుగులను సేవింపను.ఆశాపాశముతో నన్నుబంధించి నన్ీసంసారముకొఱకై త్రిప్పవలదు.నీసేవకునిగా గైకొనుము నన్నెచ్టిపరిస్థితులలోను దూరముగావింపకు.
            విశేషములు:
            పంచ అనునది పల్లెలలో వసారాగా చెప్పబడు చిన్నఅరుగు.
            శినసన్నిలోనున్నపంచయైనచాలునట.భిక్షాన్నమైనను అభ్యంతరములేదట.(శివుడునిత్యభైక్షికుడు అతనికడదొరుకునది భిక్షాన్నమేకదా! "లోకంలోవాడుక మీయిట్లో పచ్చడి మెతుకులైనా నాకుపరమాన్నమే"-ననివాడుక,అట్లే యిదియు.
            నిధినిక్షేపములనిచ్చిననురాజకీటములసేవింపనొల్లడట! ఇటప్రభువులు కవికి కీటక సమానులుగా దోచుచున్నారు.బహుశఃఇది రాయలయనంతరపు మాటయైయుండవచ్చును

            సంసారభారమునుజూపి ఆశాపాశములతో ననుబంధించి పరిభ్రమింపజేయకుము.నీబంటుగా సేకొన్నచాలును చేపట్టి యెన్నటికి విడువబోకుము.నాకంతకుమించి వలదనుచున్నాడు.
            లోకమున నాశనుజయించినవాడు.లేడు.నిజముగా నదిపాశమువంటిదే"ఆశాపాశముదాగడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర!" యన్నవామనోక్తులు సర్వధాస్మరణీయములు.ఆశను జయించినవాడే ఆధ్యాత్మిక సింహాసనమున నధివశిచుటకు యోగ్యుడు.ఆయోగ్యనుప్రసాదింప గోరుట ధూర్జటి యాధ్యాత్మిక జ్ఙానపరిపక్వతకు నిదర్శనము.
            (శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి సౌజన్యముతో)

            పరహితము సేయు నెవ్వడు
            పరహితుండగును భూత పంచక మునకున్
            పరహితమే పరమ ధర్మము


            పరహితునకు నెదురు లేదు సర్వేందుముఖీ!

            మ్రింగెడి వాడు విభుండు
            మ్రింగెడిది గరళమని మేలని ప్రజకున్
            మ్రింగుమనె సర్వమంగళ
            మంగళసూత్రము నెంత మదినమ్మినదో (భాగవతము)

            పాల సముద్రము ను మధించే సమయములో భయంకరమైన విషము పుట్టింది.అది కాసేపట్లో లోకాలన్నిటినీ కబళించివేస్తుంది అని .అందరూ భయపడిపోయి కాపాడమని
            శంకరుడిని వేడుకున్నారు. ఆయన పార్వతి వైపు చూశాడట మ్రింగ మంటావా?అని అప్పుడు పోతనగారు చెప్పిన పద్య మిది.పరోపకారము చేయడానికి అమ్మవారే నాంది పలికింది.


            --((***))--
            

            --------ఇది గూఢచిత్రం.-----
            లచ్చి శంకరుండు లలిమీర గలిసిన
            ఇదేమిటి లచ్చి శంకరుండు లలిమీర గలిసిన -
            ఇదేట్లా సాధ్యం.
            ముందు ఈ పద్యం చూడండి.

            లక్ష్మి శివుని తోడ లలిమీరగూడిన
            భువనకారకుండు పుట్టవలయు
            లచ్చి శంకరుండు లలిమీర గలసిన
            విష్ణుదేవుడుద్భవింప వలయు
            ఇది పైకి అశ్లీలగా, భ్రాంతి కలిగించి, మెదడుకు పదును పెడుతున్నది. నిదానంగా
            ఆలోచిస్తే విషయం అర్థమౌతుంది. లక్ష్మి కి పర్యాయపదాలు చూస్తే - కమల, లచ్చి,
            రమా, ఇందిర .... ఉన్నాయి. .అలాగే శంకరునికి పర్యాయపదాలు - భవుడు,

            ఈశ్వర,ఈశ,....

            పై పద్యంలో మొదటి రెండు పాదాలు తీసుకుంటే

            లక్ష్మి శివుని తోడ లలిమీరగూడిన
            భువనకారకుండు పుట్టవలయు
            లక్ష్మి పర్యాయపదం కమల,
            శంకర పర్యాయపదం భవుడు,
            లక్ష్మి కి శంకరుడు కలిసిన భువనకారకుడు పుట్టాలికదా
            పర్యాయపదాలను తీసుకుంటే
            కమల(లక్ష్మి) - భవుడు(శంకరుడు) ఈ రెండిటిని కలిపిన కమలభవుడు
            అంటే భువనకారకుడు(బ్రహ్మ)కదా!
            అలాదే చివరి రెండు పాదములు తీసుకొన్న
            లచ్చి శంకరుండు లలిమీర గలసిన
            విష్ణుదేవుడుద్భవింప వలయు
            లక్ష్మి ని శంకరుడు కలిసిన విష్ణువు పుట్టాలి
            పర్యాయపదాలను తీసుకుంటే
            రమా(లక్ష్మి) - ఈశ(శంకరుడు) - రమేశ అంటే విష్ణువేకదా!
            మరి ఇందులో అశ్లీలము లేదుకదా!
            (శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి వివరణ)
            -----------------------------------
            ------------ఇది మరొక గూఢచిత్రము------------------
            ఈ పద్యం చూడండి.

            ఆననాధరగళ మూర్తు లతివ కజుఁడు
            చంద్రకురువిందశంఖ చంచలలఁజేసి,
            చెలఁగి, తచ్చిహ్న కాఠిన్య సితచలతలు
            సొరిదిఁ కచకుచహాసదృష్టులుగఁ జేసె
            (చాటుపద్యమణిమంజరి-1భా. పుట.108)
            ఈ పద్యం తెనాలి రామకృష్ణునిదిగా ప్రసిద్ధమయినది.

            పద్యంలోని క్రిందిపదాల వరుస చూడండి.
            ఆనన-చంద్ర-చిహ్న - కచ
            అధర- కురువింద- కాఠన్య- కుచ
            గళ- శంఖ- సిత- హాస
            మూర్తి-చంచల- చలత-దృష్టులు
            ఈ వరుసక్రమంలో పదాలను గుర్తుంచుకొని వివరణలో గమనించండి.

            బ్రహ్మదేవుడు వనితయొక్క
            ముఖాన్ని(ఆననమును) చంద్రునితోను,
            పెదవిని(అధరమును) పద్మరాగ(కురువింద)మణులతోను,
            కంఠము(గళము)ను శంఖముతోను,
            ఆకారమును(మూర్తిని) మెరుపు(చంచల)తోను,
            క్రమంగా ఉంపమింప సృష్టించినాడు.
            కానీ,
            క్రమంగా వాటిలోని దోషాలను తర్వాత గమనించి, మరల విజృంభించి(చెలగి)
            ముఖము చంద్రునితో చేశాడుకదా చంద్రునిలోని మచ్చ(నలుపు)ను
            తొలగించటానికి ఆమె వెంట్రుకల(కచ)తోను,
            పద్మరాగంలోని కఠినత్వాన్ని స్తనాలలోను,
            శంఖంలోని తెల్లదనాన్ని(సిత) ఆమె నవ్వు(హాసం)లోను,
            మెరుపులోని చంచలత్వాన్ని ఆమె చూపులలోను,
            క్రమంగా రూపొందిచి తప్పు చేసినాడనే
            అపవాదు నుండి తప్పించుకున్నాడు బ్రహ్మ.
            (శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి వివరణ)
            -----------------శుభసాయంత్రం ----------------------------
            
            --(())--
            

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి