25, నవంబర్ 2019, సోమవారం

కిష్కింధా కాండము

 యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-కిష్కింధా కాండము.1
హనుమ సమాగము
అరణ్య కాండలో మారీచుడు బంగారు లేడీగా మారి సీతమ్మను ఆకర్షించింది. ఇది మొదట జీవులు సంసారమున ఎట్లు ప్రవేశింతురో వెల్లడించెను. ప్రియురాలు దూరము అయినప్పుడు ప్రియుడు సుందరమగు దృశ్యములను చూడగానే ఆమెను స్మరించి శోకించు చుండును. జీవాత్మల ఎడబాటు  పరమాత్మ కూడా  అనుభవించును. శ్రీరాముడి పరిస్థితి అలాగునే యున్నది.
 
రామాయణ కావ్యము శ్రీరాముడు నరుడిగా ప్రేయసి వియోగములో అనుభవించెడి వేదనను అనుభవించుచున్నట్లు కనబడును. ప్రకృతి యొక్క సౌందర్యమును అనుభవించుట తప్పు గాదు. కానీ దానిచే రజోగుణ వికారమగు కామమునకు లోనుకాకుండా ఉండవలెను. కానీ ఉండజాలడు. ఈ క్లిష్టమైన దశను రాముడు అనుభవించుతూ మనకు దర్శింప చేయుచున్నాడు.
 
ఋష్యమూకమునుండి రామలక్ష్మణులను సుగ్రీవుడు చూచి తనను సంహరించుటకు వాలి పంపేనేమో అని సందేహ పడెను. అప్పుడు మాటలాడుటలో నేర్పరి అయిన సుగ్రీవునితో ఈ ఋశ్యమూకమునకు వాలి రాలేడు కావున భయము నొందవలదు అని చెప్పెను. శుభకరమగు మాటలు విన్న సుగ్రీవుడు హనుమతో  వాలి చాలా బుద్ధిమంతుడు, కార్యదక్షుడు, అనేక ఉపాయములు తెలిసిన వాడు కావున నీవు స్వస్వరూపమును వ్యక్త పరచకుండా వారి స్వభావమును గమనించుమని చెప్పెను. అంత హనుమ భిక్షు రూపమున రామలక్ష్మణులను చేరి వీరు తప్పక సుగ్రీవుని విరోధి అయిన వాలి ని అంతమొందించ గలరని నిశ్చయించుకొని వారిని ప్రశంసించి మీరు మనుష్యరూపములో యున్న దేవతల వలె యున్నారు. రాజ్యమునకు తగిన వారై యుండియు ఏల జటామండలము దాల్చి ఇచటకు వచ్చియున్నారు. సమస్త ఆభరణములు దాల్చుటకు తగిన బాహువులు కలిగి యుండియు ఎందుకు ఆభరణములు ధరింపరైతిరి అని అడిగెను. వారి మీద నమ్మకము కలిగి తన యొక్క భిక్షుక రూపమును వీడి తాను వచ్చిన ప్రయోజనము, వానర రాజైన సుగ్రీవుడు పంపగా వచ్చినానని, నా పేరు హనుమ, సుగ్రీవుడు మీతో మిత్రత్వము కోరుకొంటున్నాడు  అని  నుడివి ఊరకుండెను. అప్పుడు రాముడు లక్ష్మణునితో మనము వెతుకుతున్న సుగ్రీవుడు, తన మంత్రిని పంపినాడు.
 
న అన్ఋగ్వేద వినీతస్య న యజుర్వేద ధారిణ:
న సామవేద విదుష: శక్యం ఏవం ప్రభాషితుం  4 3 29
 
న్యూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శ్రుతం
బహు వ్యాహరతా అనేన న కించిత్ అపశబ్దితం         4 3 30
 
న ముఖే నేత్రయోర్వా౭పి లలాటే చ భ్రువో: తథా
అన్యేషు అపి చ గాత్రేషు దోష: సంవిదిత: క్వచిత్  4 3 31
 
అవిస్తరం అసందిగ్ధం అవిళంబితమ్ అద్రుతం
ఉర: స్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమే స్వరే  4 3 32
 
సంస్కార క్రమ సంపన్నాం అద్భుతం అవిళంబితాం
ఉచ్చారయతి కల్యాణీం వాచం హృదయ హారిణీం  4 3 33
 
అనయా చిత్రయా వాచా త్రి స్థాన వ్యంజనస్థ యా:
కస్య న ఆరాధ్యతే చిత్తం ఉద్యత అసే అరే: అపి       4 3 34

ఈతఁడు మూడు వేదములను అధ్యయనము చేసినట్లు ఇతని మాటల వలన తెలియు చున్నది. అంతియే గాక ఇతడు మనతో పెక్కు విషయములను వివరించెను. ఎక్కడను అపశబ్దము లేదు. కనుక ఇతడు సమస్త వ్యాకరణము కూలంకషముగా నేర్చినవాడు అని తెలియును. మాట్లాడు నప్పుడు ముఖము నందు, ఫాలభాగము నందు, కనుబొమల యందు, తదితర శరీర భాగముల యందు ఎట్టి వికారము లేదు. ఇతడు సంక్షిప్తముగా తన అభిప్రాయములు తెలియ చేసినాడు. ఇతను పలికిన మాటలు వ్యాకరణ శాస్త్ర సమ్మతములు. ఇతని వచనములు భావములను ప్రకటించుటకు అనుగుణమగు స్వరస్థానములో (స్వరములు ఉన్నతములగు స్థానములు మూడు అవి వక్షస్థలం, కంఠము, శిరస్సు) పలుక బడుటచే ఆశ్చర్యము కలిగించు చున్నది. అప్పుడు రామలక్ష్మణులు సమయోచిత వచనములతో హనుమతో మాట్లాడి సుగ్రీవుని వద్దకు వెళ్లిరి.
శ్రీరామ జయరామ జయజయ రామ


--((***))--

[5:32 AM, 11/27/2019] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-కిష్కింధా కాండము.2
రామ సుగ్రీవుల మైత్రి


రామలక్ష్మణులను సుగ్రీవుని వద్దకు చేర్చి హనుమ సుగ్రీవునితో .. మహావీరుడైన రాముడు దశరథ మహారాజు పుత్రుడు, మహాపరాక్రమశాలి, వాలిని సంహరించ సమర్థుడు కావున అతనితో మిత్రత్వము సేయుము. వారు కూడా సీతాన్వేషణకై  నీ మిత్రత్వమును అభిలషించు చున్నారు అనెను. అప్పుడు సుగ్రీవుడు మిగుల సంతోషించి, రామలక్ష్మణులకు అతిథి మర్యాదలు చేసి మిత్ర హస్తమును అందించెను.
 

తతో౭గ్నిం దీప్యమానం తౌ చక్రతు శ్చ ప్రదక్షిణమ్
సుగ్రీవో రాఘవ శ్చైవ వయస్యత్వమ్ ఉపాగతౌ  4 5 16
 

అప్పుడు రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైరి. సుగ్రీవుడు రామునితో రామా! మా అన్న వాలి అకారణముగా నాతో వైరము నొంది నన్ను రాజ్యము నుండి వెడలగొట్టి, నా భార్యను అపహరించెను. అతడు మహా బలవంతుడు కాన నాకు వాలిని సంహరించి రక్షణ ఈయవలసినదిగా ప్రార్థన. అందుకు రాముడు సుగ్రీవునకు అభయమును ఒసగెను.  సుగ్రీవుడు రామునితో రామా! మేము ఇచ్చట నుండగా ఒకనాడు ఒక క్రూరాత్ముడైన రాక్షసుడు బలవంతముగా ఒక స్త్రీని తీసుకొని పోవుట చూచితిమి. అతను దక్షిణ దిశగా పయనం అయ్యాడు. ఆ రాక్షసుని నివాస స్థానము, అతని వంశము, వాని శక్తిసామర్థ్యములు నాకు తెలియవు. ఆ స్త్రీ ఆర్తనాదముతో మిమ్ములను గూర్చి బిగ్గరగా ఏడ్చుతూ శోకించుట గమనించితిని. ఆమె నీ భార్య అయిన సీత అయి ఉండవచ్చు. ఆమెను తీసుకొచ్చి మీకు అప్పగించగలను అని నమ్మకముగా పలికెను. మమ్ములను చూచి  చీరకొంగులో ఒక నగల మూటను జారవిడిచింది కావున వాటిని గమనించ వలసినది. రాముడు ఆ నగల మూటను చూచి ఆశ్రునయనముల  వలన, లక్ష్మణునితో వాటిని పరికించమనెను. అప్పుడు లక్ష్మణుడు …
 

నా౭హం జానామి కేయూరే నా౭హం జానామి కుండలే
నూపురే త్వ౭భి జానామి నిత్యం పాదా౭భి వందనాత్   4.6.23
 

అన్నా! ఈ కేయూరములను, కుండలములు నేను ఎరుగను.  నిత్యము ఆమెకు పాదాభివందనం చేయువాడను కావున ఈ కాలి అందెలు ఆమెవే అని నుడివెను. (ఈ శ్లోకము భారతీయ సంస్కృతికి మచ్చుతునక)  సుగ్రీవుడు శ్రీరామునితో వాలి మహాబలవంతుడు. అతను దుందుభి అను ఒక ఘోరమైన రాక్షసుని సంహరించి ఆ దుందుభి యొక్క మహాకళేబరమును ఒకే ఒక్క ఊపుతో యోజనము దూరము విసిరి వైచెను. అట్లు విసిరివేయబడిన దుందుభి రక్తబిందువులు ఇక్కడ ఆశ్రమమునందున్న మతంగ మునిపై పడగా అతను క్రుద్ధుడై పవిత్రమైన ఈ ఋష్యమూక పర్వతమును రాక్షస రక్తబిందువులతో అపవిత్రము చేసినాడు గావున, ఆ వాలి ఈ పర్వతము నకు యోజన దూరము వరకు ప్రవేశించినచో అతనికి మరణము తథ్యము అని శాపము ఇచ్చెను. అప్పటి నుండి వాలి ఇచ్చటకు రాకుండెను. నేను నా మంత్రులతో ఇచ్చట దుఃఖరహితుడనై ఉంటిని. శ్రీరాముడు, సుగ్రీవునకు విస్వాసము కలిగించుట కొరకై ఆ దుందుభి కళేబరమును కాలిబొటన వ్రేలితో పది యోజనములు విసిరి వేసెను. రాముడు ప్రయోగించిన బాణము ప్రచండ వేగముతో అక్కడి ఏడు మద్దిచెట్లను చీల్చుకొని పాతాళమునకు ఏగి అంతే వేగముతో మరల శ్రీరాముని వద్దకు చేరెను. సుగ్రీవునకు ఆ విధముగా నమ్మకము కలిగిన తర్వాత వాలి సుగ్రీవుల ద్వంద యుద్ధములో శ్రీరాముడు వాలిని సంహరించెను.
 

శ్రీరామ జయరామ జయజయ రామ
--((***))--

[6:06 AM, 11/28/2019] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-కిష్కింధా కాండము.3
వాలి శ్రీరాముని అధిక్షేపించుట


తతః శరేణ అభిహతో రామేణ రణ కర్కశః
పపాత సహసా వాలీ నికృత్త ఇవ పాదపః   4.17.1


స దృష్ట్వా రాఘవం వాలీ లక్ష్మణం చ మహా బలమ్
అబ్రవీత్ ప్రశ్రితం వాక్యం పరుషం ధర్మ సంహితమ్ 4.17.13
 

త్వం నరా౭ధిపతేః పుత్ర ప్రథితః ప్రియ దర్శనః
కులీనః సత్త్వ సంపన్నః తేజస్వీ చరిత వ్రతః            4.17.14
 

పరాఙ్ముఖ వధం కృత్వా కో ను ప్రాప్త స్త్వయా గుణః
యత్ అహం యుద్ధ సంరబ్ధః శరేణ ఉరసి తాడితః 4.17.15
 

దమః శమః క్షమా ధర్మో ధృతిః సత్యం పరాక్రమః
పార్థివానాం గుణా రాజన్ దండః చ అపి అపరాధిషు 4.17.17
 

న త్వాం వినిహత ఆత్మానం ధర్మ ధ్వజమ్ అధార్మికమ్
జానే పాప సమాచారం తృణైః కూపమ్ ఇవ ఆవృతమ్           4.17.20
 

సతాం వేష ధరం పాపం ప్రచ్ఛన్నమ్ ఇవ పావకమ్
న అహం త్వామ్ అభిజానామి ధర్మ చ్ఛద్మా౭భిసంవృతమ్ 4.17.21
 

విషయే వా పురే వా తే యదా న అపకరోమి అహమ్
న చ త్వాం అవజానే౭హం కస్మాత్ త్వం హంసి అకిల్బిషమ్ 4.17.22
 

వయం వన చరా రామ మృగా మూల ఫలా౭శనాః
ఏషా ప్రకృతిః అస్మాకం పురుషః త్వం నరేశ్వరః        4.17.27
 

శ్రీరాముడు తన తీవ్రమైన బాణముతో కొట్టగా వాలి మొదలు నరికిన మహావృక్షం వలె నేలకొరగెను. రామలక్ష్మణులను చూచిన తర్వాత వాలి శ్రీరాముడిని ధర్మబద్ధముగా ఇట్లు  పరుష వచనములు పలికెను. స్వామీ! మహారాజు కొడుకువు, ధర్మ శాస్త్రములను అభ్యసించిన వాడివి, ఉత్తమ వంశములో పుట్టిన వాడివి, సత్వగుణము కలవాడవు, పరాక్రవంతుడవు, ధర్మ నియమములు పాటించువాడవు, వేరొకనితో యుద్ధము చేయుచున్నప్పుడు నన్నేల సంహరించితివి? ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, సహనము, ధర్మాచరణము, ధైర్యము, సత్య వ్రతము, పరాక్రమము, అపరాధులను దండించుట మొదలగు రాజులకు ఉండవలసిన గుణములన్నియు నీకు ఉన్నవి. తార ఎంత చెప్పియున్నను వినకుండా ధర్మాత్ముడైన రాముడు ఇతరులతో యుద్ధము చేయునప్పుడు దెబ్బతీయడని విశ్వసించితిని.     కాని ముసుగు కప్పుకున్న అధర్మపరుడవని, గడ్డితో కప్పియున్న భావి వంటి వాడివని ఎరుగనైతిని. నేను ఎప్పుడు నిన్ను అవమాన పరచుట గాని, అపకారము తలపెట్టుట గాని చేయలేదు. అట్టి నన్ను ఏల సంహరింప బూనితివి? మేము వనమూలములు తిను వనచారులము. నీవేమో మహారాజువు. నా చర్మము గాని, రోమములు గాని, దంతములు గాని నీకు ఏవిధముగాను ఉపయోగ పడవు. నా మాంసఖండములు తినుటకు అయోగ్యము. సీతాదేవిని తీసుకొని వచ్చుటకు నీవు సుగ్రీవునితో మైత్రి చేసితివి. అలా కాకుండా నన్ను కోరినచో ఒక్క రోజులో సీతా దేవిని నీకు అప్పగించెడివాడను. అంతియే గాక రావణుని బంధించి నీ ఎదుట నిలబెట్టేవాడిని. లోకములో ప్రాణులందరు ఎదోఒకరోజు మరణించ వలసినదియే. కానీ నన్ను చంపిన తీరు మాత్రము అనుచితము. నన్ను చంపుట ఉచితమే యని భావించినచో నాకు ప్రత్యుత్తరమిమ్ము.
 

వాలి: సాధనా క్షేత్రములో రాముని అవస్థ కన్నా, వాలి అవస్థ ఎంతయో మిన్న. ఆ సమయమునకు రాముని అవస్థ వాలిని జయించుటకై సమతూకములో లేదు. కనుకనే వాలిని చాటు నుండి వధించవలసి వచ్చినది. అందువలననే వాలి రామునికి ఆ విధమైన అధర్మ యుద్ధము నందు గాక ఎదురుగా పోరాడవలసి యుండవలెనని చెప్పినాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ
 

[6:00 AM, 11/29/2019] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-కిష్కింధా కాండము.4
శ్రీరాముడు ధర్మసమ్మతముగా సమాధానము ఇచ్చుట
నేలకూలిన వాలి వివేకము లేనివాడై పరుషముగా అధిక్షేపించుతూ మాటలాడిన మాటలకు, శ్రీరాముడు ధర్మబద్ధంగా ఇట్లు సమాధానం చెప్పెను.


ధర్మమ్ అర్థం చ కామం చ సమయం చా౭పి లౌకికమ్
అవిజ్ఞాయ కథం బాల్యాత్ మామ్ ఇహ అద్య విగర్హసే    4.18.4
 

అపృష్ట్వా బుద్ధి సంపన్నాన్ వృద్ధాన్ ఆచార్య సమ్మతాన్
సౌమ్య వానర చాపల్యాత్ త్వం మాం వక్తుమ్ ఇహ ఇచ్ఛసి      4.18.5
 

ఇక్ష్వాకూణామ్ ఇయం భూమిః స శైల వన కాననా  4.18.6
తాం పాలయతి ధర్మాత్మా భరతః సత్యవాక్ ఋజుః   4.18.7
 

తస్య ధర్మ కృత ఆదేశా వయమ్ అన్యే చ పార్థివః
చరామో వసుధాం కృత్స్నాం ధర్మ సంతానమ్ ఇచ్ఛవః           4.18.9
 

జ్యేష్ఠో భ్రాతా పితా చైవ య శ్చ విద్యాం ప్రయచ్ఛతి
త్రయ: తే పితరో జ్ఞేయా ధర్మే చ పథి వర్తినః                  4.18.13
 

యవీయాన్ ఆత్మనః పుత్రః శిష్య శ్చా౭పి గుణోదితః
పుత్రవత్ తే త్రయ శ్చిన్త్యా ధర్మ: చ ఏవ అత్ర కారణమ్           4.18.14
 

సూక్ష్మః పరమ దుర్జ్ఞేయః సతాం ధర్మః ప్లవంగమ
హృది స్థః సర్వ భూతానామ్ ఆత్మా వేద శుభా౭శుభమ్  4.18.15
 

తత్ ఏతత్ కారణం పశ్య యద౭ర్థం త్వం మయా హతః
భ్రాతుర్ వర్తసి భార్యాయాం త్యక్త్వా ధర్మం సనాతనమ్ 4.18.18
 

అస్య త్వం ధరమాణ స్య సుగ్రీవ స్య మహాత్మనః
రుమాయాం వర్తసే కామాత్ స్నుషాయాం పాప కర్మ కృత్          4.18.19
 

త ద్వ్యతీతస్య తే ధర్మాత్ కామ వృత్త స్య వానర
భ్రాతృ భార్యా అభిమర్శే అస్మిన్ దణ్డో అయం ప్రతిపాదితః       4.18.20
 

రాజభి: ధృత దణ్డా స్తు కృత్వా పాపాని మానవాః
నిర్మలాః స్వర్గమ్ ఆయాన్తి సన్తః సుకృతినో యథా             4.18.32
 

శాసనాత్ వా విమోక్షాత్ వా స్తే న: పాపాత్ విముచ్యతే
రాజా తు అశాసన్ పాపస్య తత్ అవాప్నోతి కిల్బిషం    4.18.33
 

యాన్తి రాజర్షయ శ్చ అత్ర మృగయాం ధర్మ కోవిదాః
తస్మాత్ త్వం నిహతో యుద్ధే మయా బాణేన వానర
అయుధ్య న్ప్రతియుధ్య న్వా యస్మాత్ శాఖా మృగో హి అసి   4.18.41
 

త్వం తు ధర్మమ్ అవిజ్ఞాయ కేవలం రోషమ్ ఆస్థితః
ప్రదూషయసి మాం ధర్మే పితృ పైతామహే స్థితమ్                   4.18.44

ధర్మార్థకామములను లౌకిక విషయములు తెలుసుకొనకుండా అజ్ఞానముచే నన్ను తూలనాడుతున్నావు.  ఈ భూమియు అంతయు ఇక్ష్వాకుల ప్రభువుల అధీనం లోనిది. అట్టి ఈ భూమిని ధర్మాత్ముడైన భరతుడు పరిపాలించు చున్నాడు. అతని ధర్మబద్ధమైన ఆదేశాలు పాటించుతూ మేము భూమి అంతయు తిరుగు తున్నాము. (రాజ శాసన విషయమై చిన్న పెద్ద లకు తారతమ్యము లేదని రాముడు స్పష్టము చేయుచున్నాడు. "కనిస్టేన జ్యేష్ఠ నియోగ: కథం? ఇత్యపేక్షాయాం రాజధర్మోయం ఇత్యాశయేన ఉక్తం ధర్మపథం").  అగ్రజుడైన సోదరుడు, జన్మనిచ్చిన తండ్రి, విద్యనొసగిన గురువు ఈ ముగ్గురు తండ్రులే. ఇది ధర్మ మార్గము. చిన్నవాడైన సోదరుడు, తనకు జన్మించిన పుత్రుడు, సద్గుణములు గల్గిన శిష్యుడు ఈ ముగ్గురు పుత్రులుగా భావించాలి. ధర్మము అతి సూక్ష్మమైనది. సమస్త ప్రాణులలో యున్న పరమాత్మయే శుభాశుభములను, ధర్మాధర్మములను ఎరుగును. నీవు చేసిన పాపకర్మకు శిక్షగా నిన్ను చంపితిని. నీ సోదరుడు బ్రతికి ఉండగా నీ కోడలి తో సమానమైన అతని భార్యను స్వీకరించితివి గాన నీకు మరణ దండనమే యుక్తము. పాపము చేసిన వారు రాజుచేత దండింప బడినచో వారి పాపములు నశించును. అట్లు దోషరహితులై పుణ్యము చేసిన వాని వలే స్వర్గమునకు పోవుదురు. అనగా రాజుచేత దండింపబడిన పాపాత్ములు గూడ పుణ్యాత్ములు అగుదురు.  (ఇక్కడి ధర్మ సూక్ష్మమును గమనించితే ప్రస్తుతము శిక్ష పడిన దోషులు తప్పించుకొన చూడకుండా శిక్ష అనుభవించుటయే శ్రేయస్కరము).  కానీ రాజు పాపాత్మునికి శిక్ష విధింపకున్నచో ఆ పాపము రాజునకు చుట్టుకొనును. (రాజా రాష్ట్రకృతం పాపం). నీవు శాఖామృగానివి కావున నిన్ను పొంచి యుండి చంపుటలో తప్పు లేదు. ఓ వానరా! నేను మా పూర్వజులు అనుసరించిన ధర్మ మార్గము నందే నడచు కొనుచున్నాను. నీవు ధర్మ రహస్యములు తెలియక నన్ను నిందించు చున్నావు.
శ్రీరామ జయరామ జయజయ రామ


--(())--

[5:50 AM, 11/30/2019] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-కిష్కింధా కాండము.5
తార
 

వాలి శ్రీరాముని నిందించినందుకు మిక్కిలి పరితపించి తన భార్య అయిన తారను, కుమారుడైన అంగదుని శ్రీరాముని రక్షణకై ఒసగెను.
 

పంచ కన్యలలో వాలి పత్ని తార కూడా యున్నది. కిష్కిందకు రాజైన వారందరికి తార భార్యగా యుండును. మరి ఆమె పతివ్రతయా? ఆదర్శ స్త్రీ ఎట్లయినది?
 

అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరీ, తథా
పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్
 

'తార' అనగా తమ యందే స్థిరమైన శక్తిని ప్రక్షేపణ చేయు మరింత శక్తివంతమైన ఆత్మ రూప అవస్థ. ఆ ఆత్మ రూప అవస్థ యందు వ్యాపకమైన శక్తిని వికిరణము చేయు ప్రక్రియయే తార.  'వాలి' అనేది పరమోచ్చ ఆత్మ రూప అవస్థకు చేరువారికి పత్నిగా తార అనెడి ప్రక్షేపణ ప్రక్రియ  దానంతట అదియే సన్నద్ధమగును.
 

తార గురించి స్కంద పురాణములోని విషయము గమనించితే ... పాల సముద్రమును మధించునప్పుడు "తార" అందుండి జన్మించెను. అప్పుడు ఆమె యొక్క దక్షిణ (కుడి) హస్తమును వాలియు, వామ (ఎడమ) హస్తమును సుషేణుడు పట్టుకొనిరి. అంతట ఆమె కొరకు వారిరువురికి నడుమ వివాదము జరిగినది. దేవతల తీర్పులో తార సుషేణునికి కూతురుగాను, వాలికి భార్య గాను అయ్యెను.
 

శ్లో|| దేవైః సుషేణ కలహే పుత్రీతి    ప్రతిపాదితా|
సుషేణో  దుహితుః తస్యాః స్వయంవరమ్ అకల్పయత్|
ఇత్తమ్ ఊడా కపీంద్రేణ తారా సర్వాంగ సుందరీ||
 

శ్రీరాముడు సుగ్రీవాంగదాదులను ఓదార్చుట
శోకించుచున్న సుగ్రీవునితో, అంగదునితో, తారతో ఓదార్చుతూ శ్రీరాముడిట్లు పలికెను. "చనిపోయిన వారిని గూర్చి శోకముతో పరితపించుటచే, చనిపోయిన వారికి శ్రేయస్సు కలుగదు.

నియతిః సర్వ భూతానాం నియోగేషు ఇహ కారణమ్  4.25.4
 

న కర్తా కస్యచిత్ కశ్చిన్ నియోగే చా౭పి న ఈశ్వరః
స్వభావే వర్తతే లోక: తస్య కాలః పరాయణమ్ 4.25.5
 

న కాలః కాలమ్ అత్యేతి న కాలః పరిహీయతే
స్వభావం వా సమా౭౭సాద్య న కశ్చిత్ అతివర్తతే 4.25.6
 

న కాలస్యా౭స్తి బన్ధుత్వం న హేతుర్ న పరాక్రమః
న మిత్ర జ్ఞాతి సంబన్ధః కారణం న ఆత్మనో వశః 4.25.7
 

కిం తు కాల పరీణామో ద్రష్టవ్యః సాధు పశ్యతా
ధర్మ శ్చ అర్థ శ్చ కామ శ్చ కాల క్రమ సమాహితాః  4.25.8
 

లోకములన్ని ఆ సర్వేశ్వరుని నియతి ప్రకారమే జరుగును. ఎవరు కూడా స్వతంత్రముగా నియతికి విరుద్ధముగా చేయలేడు. కాలమును ఎవ్వరు ఉల్లంఘించలేరు. తరువాత సుగ్రీవుడు, వాలికి దహన సంస్కారములు చేసెను. శ్రీరాముని ఆదేశముతో ఆ రాజ్యమునకు లక్ష్మణుడు సుగ్రీవుని వానర రాజుగా పట్టాభిషేకము చేసెను. అప్పుడు వర్షాకాలం ఆరంభము కావడంతో సీతాన్వేషణకు విరామము ఇచ్చినారు. అచటనే రామలక్ష్మణులు ప్రస్రవణ పర్వతము వద్ద ఆ కాలములో ఉన్నారు.
 

యోగావాసిష్ఠములో వసిష్ఠ మహర్షి నియతిని గురురించి వివరించుతూ ... రామా! చిత్ శక్తి, స్పందరూపిణి అయిన మహానియతి ఒకటి ఉన్నది. ఆ నియతి (పద్ధతి ప్రకారం నడిపించే శక్తి) బలంచేతనే తత్వజ్ఞుల శరీరం నిలబడి లౌకిక వ్యవహార యోగ్యం అవుతుంది. అట్టి మహా నియతియే "మహాసత్త- మహాచిత్- మహాశక్తి- మహాదృష్టి- మహాక్రియ- మహాద్భావము- మహాస్పందము- మహాత్మరూపము --- ఇత్యాదినామరూపములతో వ్యవహరించబడుతుంది. "ఇది అగ్ని, ఇది ఊర్ధ్వముఖముగా వెలుగుతుంది; ఇది ఈ సమయములో పుడుతుంది;  ఇది ఈ  విధముగా చలిస్తుంది" మొదలైన నియమాలన్ని సృష్టి మొదటే పుడుతున్నాయి. ఈ ప్రపంచము అంతా ఒక నియతి చేత పరిపాలింప బడుతుంది. ఈ నియతి యొక్క బలము చేతనే రాక్షసులు, దేవతలు, నాగులు మొదలైన వారంతా కల్పాంతము వరకు స్థాపింపబడుతూ ఉన్నారు. బ్రహ్మము, నియతి, సృష్టి - ఈ మూడు ఒకటేగాని వేరువేరు కాదు. ఈ మహానియతినే "దైవము" ఈశ్వరసంకల్పము"  అనికూడా అంటున్నాము.   ఇది సర్వకాల సర్వావస్థలలోను ఉంటుంది. ఓ రామా! నీవు దైవాన్ని గురించి అడగటం, నేనుచెప్పటం, ఎవరైనా  ఏదైనా ప్రయత్నము చేసినా అది అంతా నియతి లోని భాగమే. అవశ్యం జరగవలసియున్న దాన్ని రుద్రుడుకూడా ఆపలేరు. ఒకవేళ నిర్వికల్ప సమాధిలో వాయువును కూడా నిరోధించి తత్వజ్ఞు డెవడైనా ముక్తిని పొందితే అది పురుషాకారం అవుతుంది. కానీ, ఆ పురుషాకారం కూడా ఈశ్వరనియతి లోనిభాగమే.
శివ గీతలో కూడా పరమ శివుడు శ్రీరామునికి ఇట్టి విషయమై స్పష్టము చేసెను
శ్రీరామ జయరామ జయజయ రామ
 


[6:04 AM, 12/1/2019] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-కిష్కింధా కాండము.6
శ్రీరాముని విషాదము-లక్ష్మణుని హితబోధ
 

వర్ష ఋతువు నందు శ్రీరాముడు విరహ వేదనకు గురి అయ్యెను. శ్రీరాముడు లక్ష్మణునితో, లక్ష్మణా! సుగ్రీవుడు శరత్కాలం మొదలు కాగానే గుర్తించి మనకు ఉపకారము చేయుటకు స్వయముగా పూనుకొనగలడు.
 

ఉపకారేన వీరోహి ప్రతీకారేణ యుజ్యతే
అకృతజ్ఞో ప్రతికృతో హంతి సత్యవతామ్ మనః 4.28.64
 

సుగ్రీవుడు మహావీరుడు. రాముని సహాయము పొందినవాడు. ఈ రెండు కారణములుగా రామునికి ప్రత్యుపకారము చేయవలసిన స్థితి యందు యున్నాడు. ప్రపంచమున తమకు చేసిన సహాయమును మరచి ప్రత్యుపకారము చేయని వారు సత్పురుషుల మనస్సుకు బాధను కలుగ చేయుదురు. శరత్కాలం మొదలు కాగానే మిత్ర కార్యము (సీతాన్వేషణ) నకు పూనుకొనవలసినదిగా హనుమానుడు సుగ్రీవునకు సూచించును.
 

యో హి మిత్రేషు కాలజ్ఞః సతతం సాధు వర్తతే
తస్య రాజ్యం చ కీర్తి శ్చ ప్రతాప శ్చ అభివర్ధతే                  4.29.11
 

యస్య కోశ శ్చ దణ్డ శ్చ మిత్రాణి ఆత్మా చ భూమిప
సమవేతాని సర్వాణి స రాజ్యం మహత్ అశ్నుతే                 4.29.12
 

ఏ రాజైతే సమయము నెరిగి మిత్రులతో మంచి మార్గమున వ్యవహరించునో అతడి రాజ్యము, కీర్తియు, ప్రతాపము వర్ధిల్లును. ఏ రాజునకు కోశము, దండము, మిత్రులు సమముగా ఉండునో అతడి రాజ్యము అత్యున్నత స్థితి యందుండును. కావున రాజా! మిత్రకార్యమునకై వానర శ్రేష్ఠులను అందరిని రప్పించవలసినదిగా ప్రార్థన. హనుమ అవ్విధముగా ప్రశస్తమైన మాటలు మాట్లాడగా సంతృప్తి చెందిన సుగ్రీవుడు, నీలుని పిలిచి అన్ని దిక్కులలో ఉన్నటువంటి తమ సేనాధిపతులు అందరూ ససైన్యముగా పదిహేను దినములలో రావలసినదిగా శాసించెను.
 

గుహాం ప్రవిష్టే సుగ్రీవే విముక్తే గగనే ఘనైః
వర్ష  రాత్ర ఉషితో రామః కామ శోకా౭భిపీడితః              4.30.1
 

ఈ లోగా శ్రీరాముడు శరత్కాలం యొక్క నిర్మలమైన మేఘములను చూచి సీత ఎడబాటు కొరకై మిగుల వ్యాకుల పడెను. కామవాసనల వలన రామసాధకుడు కూడా పీడితుడగును. అయితే ఎటువంటి కామవాసనలు? సీతారూప సాత్విక అనుభూతులు. సాధనా సమయము నందు పొందిన అనుభూతులు తిరిగి తిరిగి ప్రాప్తించాలని సాధకుడు కోరుకొనును. దీనివలన సాధకుడు ప్రగతి నొందడు. పూర్వ అనుభూతులను త్యజించి మరింత ఉన్నతమైన  అనుభూతులను పొందుచు చివరగా, అనుభూతి రహిత శ్రేష్ఠ సమాధి అవస్థను చేర వలెను. కాని రాముడింకను సీతా రూప సాత్విక రూప అనుభూతుల కొరకై పరితపించును. లక్ష్మణుడు మాత్రము రాముడా స్థితి నుండి ముక్తము కావాలని చెప్పు చున్నాడు.
 

కిమ్ ఆర్య కామ స్య వశంగతేన
కిమ్ ఆత్మ పౌరుష్య పరాభవేన
అయం సదా సంహ్రియతే సమాధిః

కిమ్ అత్ర యోగేన నివర్తితేన         4.30.16
 

క్రియాభియోగం మనసః ప్రసాదం
సమాధి యోగ అనుగతం చ కాలమ్
సహాయ సామర్థ్యమ్ అదీన సత్త్వః
స్వ కర్మ హేతుం చ కురుష్వ హేతుమ్ 4.30.17
 

అన్నా! పరాక్రమమును (పురుష ప్రయత్నము) విస్మరించి ఈ విధముగా కామ ప్రతంత్రుడగుట వలన ఏమి ప్రయోజనము? దీనివలన చిత్త స్థైర్యము దెబ్బతినును. అందువలన లాభమేమి? ఇట్టి స్థితిలో మనస్సును చిక్కబట్టుకొన్నచో ఈ చింత దూరమగును. దైన్యమును వీడుము. కార్య సాధనకు పూనుకొనుము. మనస్సును ప్రసన్నము గావింపుము. ఇప్పుడు చిత్త స్థైర్యమును (ధైర్యమును) వహింపుము. సుగ్రీవుడు మొదలగు వారి యొక్క సామర్థ్యమును ఉపయోగించుకొనుము. కార్య సిద్ధికి తోడ్పాటు విధానము అవలంభించుము.
 

ఇచ్చట లక్ష్మణుడు రాముని వంటి ఆదర్శ పురుషుడు సీత కొరకై అంతగా శోకించుట తగదని చెప్పు చున్నాడు. లక్ష్మణుడు సాధకుని యందలి వివేక వృత్తి కనుక ఒంటరిగా యున్నను రాముని కంటే సంతులనంలో ధీరోదాత్తుడుగాను చూప బడినాడు. వాల్మీకి పై శ్లోకములలో క్రియా యోగముతో సీతను త్యజించమని రామునికి చెప్పుచున్నాడు. అనగా అంతకన్నను ఉచ్చ అనుభూతుల ద్వారా సీతా రూప అనుభూతులను త్యజించడమన్న భావన. అదే లక్ష్మణుని ద్వారా రామునికి ఇచ్చిన సలహా. ఓ! రాముడా! పత్ని యందలి కోరికను వదలి పౌరుష ధారణ చేయవలెను. యోగము ద్వారా మనస్సును సమాధి అవస్థకు తీసుకొని వచ్చి నివృత్తము కావలెను. నీవు క్రియా యోగమును ధారణ చేసి మనస్సును శాంత పరచుము. సమాధి యోగము ద్వారా కాలమునకు అతీతుడవై నీ యందున్న మహాశక్తి సామర్థ్యమును జాగృత పరచి దీన భావమును త్యజించుము. కర్తవ్యమును నిష్కామ భావముతో నెరవేర్చుము. దీని ద్వారా వాల్మీకి ఎటువంటి కోరికలు లేకుండా మానవుడు తనను భగవంతునికి అర్పణం చేసుకోవాలని సూచించారు. భగవద్గీత లో కూడా శ్రీక్రష్ణుడు అర్జునుడు కి ఇటువంటి సూచనయే చేస్తాడు
 

ప్రియా విహీనే దుఃఖా౭౭ర్తే హృత రాజ్యే వివాసితే
కృపాం న కురుతే రాజా సుగ్రీవో మయి లక్ష్మణ             4.30.67
 

అనాథో హృత రాజ్యో అయం రావణేన చ ధర్షితః
దీనో దూర గృహః కామీ మాం చైవ శరణం గతః             4.30.68
 

ఇతి ఏతైః కారణైః సౌమ్య సుగ్రీవ స్య దురాత్మనః
అహం వానర రాజస్య పరిభూతః పరంతప                  4.30.69
 

లక్ష్మణా! రాజ్యాధికారంమునకు దూరమై, సీతను ఎడబాసి, దుఃఖార్తితుడై యున్న నాపై సుగ్రీవుడు దయ చూపుట లేదు. భార్య ఎడబాటుచే శ్రీరాముడు దైన్యముచే సుగ్రీవుని శరణు జొచ్చి నాడు. కాని దురాత్ముడైన వానర రాజు నన్ను చులకన చేయుచున్నాడు.
అర్థినామ్ ఉపపన్నానాం పూర్వం చ అపి ఉపకారిణామ్
 

ఆశాం సంశ్రుత్య యో హన్తి స లోకే పురుషా౭ధమః                    4.30.72
శుభం వా యది వా పాపం యో హి వాక్యమ్ ఉదీరితమ్
 

సత్యేన పరిగృహ్ణాతి స వీరః పురుషోత్తమః                                 4.30.73
 

కృతా౭ర్థా హి అకృతా౭ర్థానాం మిత్రాణాం న భవన్తి యే
తాన్ మృతాన్ అపి క్రవ్యాదః కృతఘ్నాన్ న ఉపభు౦జతే        4.30.74
 

పూర్వము తమకు సహాయము చేసి ఇపుడు సహాయము పొందవలసిన కష్టస్థితి యందున్న, సహాయార్థము చేరవచ్చినట్టి వారికి సహాయము చేయునట్లు నమ్మించి సహాయము చేయనివారు ఈ లోకములో అధమ మానవులు. తాము చెప్పిన వాక్యము మంచిదైనను చెడుదైనను దానికి కట్టుబడి యుండి సత్యమును తప్పనివాడు ఉత్తమ మానవుడు. తమ కార్య సాఫల్యమును స్నేహితుని సహాయముతో పొంది, కార్యార్థియై యున్న ఆ స్నేహితునికి ప్రత్యుపకార మాచరింపని కృతఘ్నుడు మరణము నొందినప్పుడు అతడి శరీరమును మాంస భక్షణము చేయు జంతువులు కూడా స్పృశింపవు.  మాట తప్పినచో వాలికి పట్టిన దుర్గతి తనకు కూడా పట్టునేమో అని సుగ్రీవుడు భయము లేకుండుట మిగుల ఆశ్చర్యకరం. కావున లక్ష్మణా! వెంటనే నీవు వెళ్లి క్రుద్ధుడనైన నా మాటలు సుగ్రీవునికి వివరించుము.
 

గురువు అయిన వసిష్ఠ మహర్షి దగ్గర ఆత్మ జ్ఞానము పొంది, విశ్వామిత్రుని వద్ద అభ్యాసము చేసినా,  మానవునునికి కలిగే మాయా ప్రభావము వలన శ్రీరాముడు సీతా వియోగము వలన  అమితమైన దుఃఖాన్ని పొందుతాడు. సర్వ శక్తి సంవితుడైన చక్రవర్తి అయి ఉండి కూడా వసిష్ఠ మహర్షి కృపచే సంపూర్ణ  ఆత్మ జ్ఞానము పొందినా మాయ ప్రభావము వలన ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళతాడు. అందుకనే ఆది శంకరాచార్య తన భజ గోవిందం శ్లోకం 11 లో "మాయామయమిదమ్-అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా | సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింకరణే||" అని చెప్తారు. ఈ జగత్తు సృష్టి అంతా మాయామిదం అని, మానవుడు ఆ మాయ నుంచి ఎల్లప్పుడూ జాగరూకతో ఉండాలి అని ఉద్భోదిస్తారు.ఇట్టి మాయ నుంచి బయిట పడమని అగస్త్యుడు రామునికి అరణ్యవాసంలో విరజా దీక్ష ఇస్తాడు.  అప్పుడు పరమ శివుడు ప్రత్యక్షమై గీతను ఉద్బోధించారు. అదియే శివగీత. శివ గీతలో పరమేశ్వరుడు ఇట్టి మాయాస్వరూపాన్ని వివరించుతారు. అప్పుడు స్వస్తుడై రాముడు కార్యోన్ముఖుడు అవుతాడు. అయినా మానవుడు కావున మరల మరల చింతాక్రాంతుడు అవుతాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ
 

Durga Prasad Chintalapati
[5:56 AM, 12/2/2019] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-కిష్కింధా కాండము.7
లక్ష్మణుడు సుగ్రీవుని వద్దకు ఏతెంచుట
 

తారయా సహితః కామీ సక్తః కపి వృషో రహః
న తేషాం కపి వీరాణాం శుశ్రావ వచనం తదా   4.31.22
 

సంగృహ్య పాదౌ పితుః ఉగ్ర తేజా
జగ్రాహ మాతుః పున రేవ పాదౌ
పాదౌ రుమాయా శ్చ నిపీడయిత్వా
నివేదయా మాస తతః తమ్ అర్థం     4.31.37
 

స నిద్రా మద సంవీతో వానరో న విబుద్ధవాన్
బభూవ మద మత్త శ్చ మదనేన చ మోహితః   4.31.38
 

లక్ష్మణుడు కిష్కింద నగరము చేరు సమయమునకు సుగ్రీవుడు తారతో కామవశుడై యున్నాడు. అప్పుడు మహాబలశాలియైన అంగదుడు సుగ్రీవుని మధు సేవనం వలన మత్తులో ఉండగా, తల్లియైన రుమ పాదములపై మోకరిల్లి లక్ష్మణుని ఆగమనమును వివరించెను. అంత సుగ్రీవుడు తన ఆసనము పైనుంచి దిగ్గున లేచి మంత్రులతో లక్ష్మణుని కోపము ఉపశమించే మార్గము ఆలోచించెను. బుద్ధిశాలి అయిన హనుమానుడు సీతాన్వేషణ ప్రయత్నమునకు సమయము ఆసన్నమైనదని వివరించెను.
లక్ష్మణుని శాంతపరచుటకు సుగ్రీవుడు తారను పంపుట
క్రుద్ధుడైన లక్ష్మణుడు ధనుష్టంకారము చేసి ఆ రాజ భవనంలోని ఏకాంత (స్త్రీలసవ్వడి లేని) స్థలమున నిలబడెను. అప్పుడు సుగ్రీవుడు తారను పిలిచి, లక్ష్మణుడు సౌమ్యుడు, స్త్రీల యందు గౌరవభావం కలవాడు కావున వెళ్లి అతనిని ప్రసన్నము చేసుకొని వలసినదిగా కోరతాడు. అప్పుడు తార బయిలుదేరుతున్నది. ఆమె పరిస్థితి ఎలా ఉన్నదంటే...
 

సా ప్రస్ఖలంతీ మద విహ్వలా౭క్షీ
ప్రలంబ కాంచీ గుణ హేమ సూత్రా
స లక్షణా లక్ష్మణ సన్నిధానం
జగామ తారా నమిత అంగ యష్టిః         4.33.38
 

స తాం సమీక్ష్య ఏవ హరీశ పత్నీం
తస్థౌ ఉదాసీనతయా మహాత్మా
అవాఙ్ముఖో అభూత్ మనుజేంద్ర పుత్రః
స్త్రీ సన్నికర్షాత్ వినివృత్త కోపః              4.33.39
 

మధువు గ్రోలుటచే తార యొక్క కనులు మూతబడు చుండెను. తొట్రుబాటుతో అడుగులు తడబడు చుండెను. నడుముకు చుట్టుకొన్న వడ్డాణము యొక్క బంగారు సూత్రములు వ్రేలాడు చుండెను. స్త్రీల ఎదుట తన కోపమును ప్రకటించుట ఉచితము కాదని లక్ష్మణుడు శాంతము వహించెను. లక్ష్మణుడు శాంతముతో సుగ్రీవుడు శ్రీరాముని వద్ద సహాయము తీసుకొని సీతాన్వేషణను మరచినాడని చెప్పెను. అప్పుడు తార, లక్ష్మణునితో .. సుగ్రీవుడు వానరుడు, మధువును గ్రోలి యున్నాడు, కామావశుడై యున్నాడు. కానీ సీతాన్వేషణ విషయమై మరువలేదు. తగిన ఆజ్ఞలు ఇచ్చియే యున్నాడు. సత్పురుషులు గౌరవభావముతో (మాతృభావముతో/సోదరి భావముతో) పర స్త్రీలను చూచుట దోషము కాదు అని చెప్పి లక్ష్మణుని అంతఃపురమునకు తీసుకొని వెళ్లెను. అప్పుడు సుగ్రీవుడు ఎలా ఉన్నాడంటే... 

రుమాం తు వీరః పరిరభ్య గాఢం 
వర ఆసనస్థో వర హేమ వర్ణః
 

దదర్శ సౌమిత్రిమ్ అదీన సత్త్వం
విశాల నేత్రః సువిశాల నేత్రమ్ 4.33.66
 

సుగ్రీవుడు రుమను కౌగిలించుకొని యున్నాడు. అప్పడు సుగ్రీవుడు దిగ్గున తన సింహాసమున నుండి దిగెను.

[5:48 AM, 12/3/2019] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-కిష్కింధా కాండము.8
సుగ్రీవుడు శ్రీరాముని దర్శించుట
లక్ష్మణుడు తార మొదలుగాగల వీరుల ద్వారా సుగ్రీవుడు సీతాన్వేషణకై తగు ఏర్పాట్లు చేసినాడని తెలుసుకొని సంతోషముతో సుగ్రీవుడు అశేష వానర సేనానితో  శ్రీరాముని దర్శనార్ధమై వెళతారు. అందుకు శ్రీరాముడు మిగుల సంతసించెను.
 

ధర్మమ్ అర్థం చ కామం చ కాలే యః తు నిషేవతే
విభజ్య సతతం వీర స రాజా హరి సత్తమ                                 4.38.21
 

హిత్వా ధర్మం తథా అర్థం చ కామం యస్తు నిషేవతే
స వృక్షా౭గ్రే యథా సుప్తః పతితః ప్రతిబుధ్యతే             4.38.22
 

అమిత్రాణాం వధే యుక్తో మిత్రాణాం సంగ్రహే రతః
త్రివర్గ ఫల భోక్తా తు రాజా ధర్మేణ యుజ్యతే                4.38.23
 

ఎల్లప్పుడూ ఎవరైతే ధర్మార్థకామములను విభజించి ఆయా కాలములందు సేవించునో అతడే సరియైన రాజు. ధర్మార్థములను విడిచి కామమును మాత్రమే ఎల్లప్పుడూ సేవించువాడు వృక్షాగ్రామున నిదురించువాడు నేలపై బడి మేల్కొనునట్లుగా, అధఃపతనము పొందిన తర్వాతనే తన నడత యందలి దోషము తెలుసుకొనును. శత్రువులను హతమార్చుతూ, మిత్రులను కూడగట్టుచు కాలమును గడుపు రాజు సరియగు రాజ ధర్మమును ఆచరించినవాడు. కాన ధర్మార్థకామములను సరిగా నిర్వర్తించిన సత్ఫలితములను పొందును.
ఇంకను శ్రీరాముడు సుగ్రీవునితో .. సుగ్రీవా! శత్రువులను నశింపజేయ సామర్థ్యము కలవాడవు. శత్రువు పై దండెత్తుటకు సమయము ఆసన్నమైనది కాన మంత్రులతో ఆలోచించమని చెప్పగానే, సుగ్రీవుడు రామా! ఉత్సాహవంతులు, మహాపరాక్రమ శాలురు, కామరూపులు, అనేకమైన ఉచ్ఛజాతికి చెందినవారు, అనేకమైన మహాపర్వతములలో నివసించు వానరులు, భల్లూకములు కోట్లకొలదిగా సీతాన్వేషణకై మరియు రావణ సంహారమునకై నీతో కలసి నడుచుటకు వచ్చి యున్నారు అని చెప్పెను. వారి సంఖ్యను వివరించుతూ ...
 

శతైః శత సహస్రై శ్చ కోటిభి శ్చ ప్లవంగమాః
అయుతై శ్చ వృతా వీరా శ౦కుభి శ్చ పరంతప              4.38.31
 

అర్బుదైః అర్బుద శతైః మధ్యై శ్చ అన్తై శ్చ వానరాః
సముద్రై శ్చ పరార్ధై శ్చ హరయో హరి యూథపాః                       4.38.32
 

ఆ వానరులు వందలు, లక్ష, కోటి, శంకువు, అర్భుధము, మద్యము, అంతము, సముద్రము, పరార్థము అను సంఖ్యలో ఉన్నారు. (ఈ సంఖ్యావిషయములు జ్యోతిషశాస్త్రము నందు ఈ విధముగా చెప్పబడినది
 

ఏకం దశశతంత్వస్మాత్ సహస్రం అయితం తతః, పరం, లక్ష్యం, ప్రయుతం, కోటిం, ఆధార్బుధం,  బృందం, ఖర్వం, నిఖర్వంచ, తస్మాన్మహా సరోజం, శంకుం, సరితాంపతిమ్, త్వంతం మద్యం, పరార్థమాహు:,  యధోత్తరం, దశగుణం తథాజ్ఞేయం  .. ఒకటి, పది, వంద, వేయి, ఆయుధము, లక్ష, ప్రయుతము, కోటి, అర్బుదము, బృందము, ఖర్వము, నిఖర్వము, పద్మము, శంకువు, సముద్రము, అంతము, మద్యము, పరార్థము - అనునవి సంఖ్యలు. వీటిలో వరుసగా ఒక సంఖ్య కంటే తరువాతి సంఖ్య పదిరెట్లు అని ఎరుగవలెను)
 

అందుకు రాముడు సంతోషముతో ముందుగా ఆయా వానరులను సీతాన్వేషణ కార్యమునకు వినియోగించమని చెప్పెను. అప్పుడు సుగ్రీవుడు ఆ వానరులను నాలుగు దిక్కులు పంపుతూ ఆయా దిక్కులలోని విశేషాలు మొదలగునవి అన్నియు చెప్పుచున్నాడు. (ఇక్కడ భూగోళ వర్ణన చాలా విశేషమైనది. సుగ్రీవుడు వానర సమూహములను సీతాన్వేషణకై పంపునపుడు వింధ్య పర్వతమును కేంద్రముగా చేసికొనెను.). రాముడు ఆశ్చర్యముతో భూమండలమున ఉన్న అన్ని దేశములు స్పష్టముగా నీకు ఎటుల తెలియును అని సుగ్రీవుని అడుగగా .. సుగ్రీవుడు వినమ్రతతో .. రామా! నా అన్న వాలి నన్ను చంపుటకు వెంటాడుచుండగా నేను భూమండలం అంతయు తిరిగితిని. నేను పారిపోసాగితిని. నేను నా మిత్రులతో గూడి పలు నదీతీరములను, వనములను, నగరములను, పర్వతములను గాంచుతూ పిక్కబలము చూపసాగితిని. ఆ సమయమున నాకు భూమి అద్దములో నున్న దానివలెను, అలాత చక్రము రీతిగాను, ఆవు గిత్త ప్రమాణము మాదిరిగా కన్పట్టెను. (భూమండలం ఎంత విశాలమైనది అయినను అద్దములో చిన్నధిగానే కనపడును.  "కొండ అద్దము నందు కొంచెమునై యుండదా" . అలాతము అనగా కొరివి. కొరివిని తీసుకొని తిప్పినప్పుడు అది ఒక చక్రము వలె కనబడును. ఆవు పాదము చిన్నది గదా! మిక్కిలి వేగముగా పరిగెత్తుచున్న సుగ్రీవునకు ఈ భూమండలం అంతయు అద్దములో నున్న దానివలె, అలాతచక్రము వలె, గోష్పాదము వలె  చిన్నదానిగా కనబడెను). అప్పుడు బుద్ధిమంతుడైన హనుమ మతంగి మహర్షి శాపము వలన ఋష్యమూక పర్వతమునకు వాలి రాడు అని చెప్పగా అప్పటి నుంచి నేను నా మంత్రులతో ఈ పర్వతముపై ఉండ యుంటిని అని చెప్పెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

--(())--

[6:06 AM, 12/4/2019]

 యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-కిష్కింధా కాండము.9
భూగోళ వర్ణనము - తూర్పు దిక్కు
సుగ్రీవుడు "వినత" అనే సేనానాయకుడిని పిలిచి, వినతా! చంద్రుని అంశచే, సూర్యుని అంశచే జన్మించిన లక్షమంది వానరులను తీసుకొని తూర్పు దిక్కునకు ఏగుము. అచట సీతమ్మ ఉన్నదేమో చూడుము.
తూర్పు దిక్కును గురించి చెపుతూ ...
తూర్పు దిక్కున రమ్యమగు భాగీరథి, సరయు, కౌశికి, కాళింది, యమున, సరస్వతి, సింధువు, శోణము, మహి, కాలమహి మొదలగు నదులు గలవు. అచ్చట బ్రహ్మమాల, విదేహ, మాళవ, కాశి, కోశల, మహాగ్రామము, పుండ్రము, వంగము మొదలగు దేశములు గలవు. అవి అన్నియు వింధ్య పర్వతములకు మధ్య వలయాకారంగా ప్రవహించుతున్న నదికి తూర్పు దిక్కున ఉన్నవి. అక్కడ నుండి సముద్రమున మునిగి ఉన్న పర్వతములు, సముద్ర అంతర్భాగమున కొన్ని పట్టణములు ఉన్నవి. అక్కడ నుండి మంథర పర్వత అగ్రభాగమునకు పోవలెను. అక్కడి వనచరుల రూపములను వాల్మీకి సుగ్రీవుని ద్వారా తెలియ చేస్తున్నారు.  అక్కడ చెవులు లేనివారు, పెదవులపై చెవులు గలవారు, ఇనుప ముఖము గలవారు, ఒక పాదము గలవారు, నరమాంస భక్షకులు, కిరాతులు, బంగారు వర్ణము గలవారు, పచ్చి చేపలు తినువారు ఉందురు. అక్కడ నుండి కొండలతో నిండి ఉన్న వేరొక ద్వీపము గలదు. ఆ ద్వీపము దాటిన తర్వాత ఆకాశము అంటుచున్నటువంటి "శిఖరము" అనేసి పర్వతము గలదు. అవి అన్నియు సముద్ర మధ్యమమున గలవు.  అక్కడ ఎర్రటి నీరు గల "శోణము" అను నది గలదు. (The Yangtze River in Chongqing, China, is called as red river also known as the Hồng Hà and Sông Cái in Vietnamese and the Yuan River in Chinese, is a river that flows from Yunnan in Southwest China through northern Vietnam to the Gulf of Tonkin)   తరువాత ఉవ్వెత్తు కెరటముల ఎగిసిపడుచు ఉన్న ఇక్షు సముద్రము, ద్వీపములు గలవు. తరువాత ముందుకు సాగినచో శాల్మిలి (బూరుగు) వృక్షములతో విశాలమైన శాల్మిలి అను మహా ద్వీపము కనపడును. అక్కడ మందేహాది రాక్షసులు ఉందురు. (మందేహాది రాక్షసుల వివరణ ఇంతకు ముందు ఈయడము అయినది) వీటి తర్వాత కుశ, క్రౌంచ  ద్వీపములు ఉండును. (సప్తద్వీపములు. 1.జంబూ ద్వీపము; 2.ప్లక్ష ద్వీపము; 3.శాల్మలీ ద్వీపము; 4.కుశ ద్వీపము; 5.క్రౌంచ ద్వీపము; 6.శాక ద్వీపము; 7.పుష్కర ద్వీపము, "సప్త ద్వీపావసుమతీ' - అని మార్కండేయ పురాణంలోనూ, 'సప్త ద్వీపవతీ మహీ' అని బ్రహ్మాండ పురాణంలోనూ కలదు. పురాణాలలో వర్ణింపబడిన ప్రకారం జంబూ ద్వీపమే ఈ ఏడు ద్వీపాలకు మధ్యలో ఉన్నది. ఈ జంబూ ద్వీపమే ఇప్పటి ఆసియా ఖండానికి, దానికి తూర్పు దక్షిణంలో ఉన్న ద్వీపాలకు సరి పోతున్నది.). అక్కడ నుంచి ఉత్తర దిక్కున పదమూడు యోజనముల విస్తీర్ణములో "జాతరూప శైలము" అనెడి బంగారు కొండా గలదు. అక్కడే మహాపురుషుడగు అనంతుడు గలడు. అక్కడ నుంచి వంద యోజనముల బంగారు విస్తీర్ణము గల బంగారు ఉదయ పర్వతము ఉండును. ఇది సూర్యుడు ఉదయించు ద్వారము. (బంగారు పర్వతమనగా సూర్యుని ఉదయ కిరణములు కొండ పై బడి బంగారు వర్ణముతో శోభిల్లును. ప్రస్తుతము ఇది జపాన్ దేశము కావచ్చు). ఇది తూర్పు దిక్కు యొక్క విశేషము. ఆయా ప్రదేశములలో సీతమ్మకి వెదికి మాసములోపు రావలెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

--(())--

[6:33 AM, 12/5/2019] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-కిష్కింధా కాండము.10
భూగోళ వర్ణనము - దక్షిణ దిక్కు
అంగదుడు నాయకుడుగా, హనుమదాదులను దక్షిణ దిక్కుకు సుగ్రీవుడు పంపుచున్నాడు. దక్షిణ దిక్కు గురించి వివరించుతూ ...
వేయి శిఖరములతో వింధ్య పర్వతము దక్షిణ దిక్కున గలదు. దక్షిణమున నర్మద, గోదావరి, కృష్ణ, మేఖల, ఉత్కళ అను నదులు, విదర్భ, ఋషికము, మహిషము, వంగము, కళింగము, కౌశికము అను దేశములు దండకారణ్యమున ఉండును. అటులనే ఆంధ్ర, పుండ్ర,  చోళ, పాండ్య, కేరళ దేశములు గలవు. అక్కడ నుండి కావేరి బయల్వెడలిన "సహ్యాద్రి" పర్వతము గలదు. తరువాత అంతులేని మహా సముద్రము. ఒడ్డు
 నుంచి నూరు యోజనముల దూరములో లంక ద్వీపము గలదు. అదియే రావణుని దేశము. ఆ తరువాత సముద్రాన్ని దాటితే పుష్పితము అనే పర్వతము కనపడుతుంది. అది దాటితే సూర్యవత్, వైద్యుతం అనే పర్వతాలు కనపడతాయి. ఆ తరువాత కుంజరం అనే పర్వతం కనపడుతుంది, దాని మీద విశ్వకర్మ అగస్త్యుడికి బ్రహ్మాండమైన భవనం నిర్మించాడు. అలా ముందుకి వెళితే భోగవతి అనే నగరం వస్తుంది, అందులో విషంతో కూడుకున్న పాములు ఉంటాయి. అక్కడే సర్పాలకి రాజైన వాసుకి ఉంటాడు. ఆ తరువాత ఎద్దు ఆకారంలో ఉన్న వృషభ పర్వతం కనబడుతుంది. దానిమీద గోశీర్షకము, పద్మకము, హరిశ్యామము అనే మూడు రకాల చందనం కనపడుతుంది. ఇవి కాకుండా అగ్నితుల్యము అనే చందనం కూడా ఉంటుంది, కాని మీరు పొరపాటున కూడా ఆ చందనాన్ని ముట్టుకోకండి. అక్కడ శైలూషుడు, గ్రామణి, శిక్షుడు, శకుడు, బభ్రువు అనే 5 గంధర్వ రాజులు పరిపాలన చేస్తుంటారు. మీరు వారికి నమస్కారం చేసి ముందుకి వెళితే, పృద్వికి చివరన పుణ్యం చేసుకున్నవారు స్వర్గానికి వెళ్ళేవారు కనపడతారు. అదికూడా దాటిపోతే పితృలోకం వస్తుంది. ఇక అది దాటితే యమధర్మరాజు యొక్క సామ్రాజ్యం ఉంటుంది, అక్కడ పాపులు ఉంటారు. మీరు అది దాటి వెళ్ళలేరు. దక్షిణ దిక్కున అక్కడిదాకా వెళ్ళి వెతికిరండి " అన్నాడు.
సుగ్రీవుడు ప్రత్యేకంగా హనుమను పిలిచి నీకు ఈ భూమిపై గాని, అంతరిక్షంలో గాని తెలియని ప్రదేశము లేదు. భూమిపై, నీటిపై, ఆకాశము నందు పోగలవాడవు. అసుర, నర, నాగ, దేవ, గాంధర్వ లోకములు, సాగరములు, పర్వతములు అన్నియు తెలియును. వాయువుతో సమానమైన వేగము కలవాడవు. బలము, బుద్ధి, పరాక్రమము, దేశకాలములు ఎరిగి ప్రవర్తించు నేర్పు, నీతి శాస్త్రము నీకు బాగుగా తెలియును. కావున నీవు కార్యసిద్ధిని గురించి బాగుగా ఆలోచించుము అని చెప్పెను. అప్పుడు శ్రీరాముడు హనుమ శక్తి సామర్థ్యముల పైన నమ్మికతో అతనికి సీతకు గుర్తుగా తన అంగుళీయకమును ఇచ్చెను.
Hanuman crossed ocean of hundred yojanas. At the ఆఋpresent time the shore to shore distance between southern tip of India and Northern tip of Sri Lanka is around sixty miles. Even with a measure of 2.5 miles per yojana, hundred yojanas translate to 250 miles. To explain this anomaly, we need to consider that around the time of Ramayana, the distance was lot more than the current sixty miles. The current theories by geologists that the ocean between India and the current Sri Lanka had been replaced by land mass over a period of time. As per Dr. E. Vedavyas, IAS considering if there is no change of land mass over a period of time the place where Lanka situated is near to the equator.
శ్రీరామ జయరామ జయజయ రామ


--(())--
[6:50 AM, 12/6/2019] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-కిష్కింధా కాండము.11
భూగోళ వర్ణనము - పశ్చిమ దిక్కు
తరువాత సుగ్రీవుడు సుషేణుడిని పిలిచి, "మీతో పాటు మరీచి మహర్షి యొక్క కుమారుడైన అర్చిష్మంతుడు, అర్చిర్మాల్యుడు మొదలైన వానరాలని తీసుకొని పడమర దిక్కుకి వెళ్ళండి. అప్పుడు మీరు సౌరాష్ట్ర, బాహ్లిక, చంద్ర, చిత్ర, కురు, పాంచాల, కోసల, అంగ, మగధ, అవంతి, గాంధార, కాంభోజ మొదలైన రాజ్యాలు, పట్టణాలు, గ్రామాలు వెతకండి. అలాగే మురచిపురం, జటాపురం కనపడతాయి, వాటిని కూడా వెతకండి. సిందు-సాగర సంగమ స్థానంలో, 100 శిఖరాలతో, పెద్ద చెట్లతో సోమగిరి అనే పర్వతం కనపడుతుంది. మీకు ఆ పర్వతం మీద రెక్కలున్న సింహాలు కనపడతాయి, అవి ఏనుగుల్ని ఎత్తుకుపోతుంటాయి, సముద్రంలోని తిమింగలాలని ఎత్తుకుపోతుంటాయి. అక్కడ సముద్రంలో పారియాత్రం అనే పర్వతం ఉంది, అది 100 యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. దానిమీద 24 కోట్ల గంధర్వులు ఉంటారు, వాళ్ళకి నమస్కారం చేసి ముందుకి వెళ్ళండి. అప్పుడు మీకు 100 యోజనాల ఎత్తయిన వజ్ర పర్వతం కనపడుతుంది. సముద్రంలో నాలుగోవంతు భాగంలో చక్రవంతం అనే పర్వతం ఉంటుంది, దానిమీద విశ్వకర్మ వెయ్యి అంచుల చక్రాన్ని నిర్మించాడు. ఆ చక్రాన్ని ఎవరూ తీసుకోకుండా చూస్తున్న హయగ్రీవుడు అనే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు చంపి ఆ చక్రాన్ని తీసుకున్నారు, అలాగే పంచజనుడు అనే మరొక రాక్షసుడిని చంపి శంఖాన్ని తీసుకున్నారు.
 

అక్కడినుంచి ముందుకి వెళితే మీకు ప్రాక్ జ్యోతిషపురం అనే ప్రాంత కనపడుతుంది, దానిని నరకాసురుడు పరిపాలిస్తున్నాడు. దాని తరువాత సర్వ సౌవర్ణ అనే పర్వతం కనపడుతుంది. ఆ పర్వతాల మీద ఏనుగులు, పందులు, పులులు, సింహాలు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి. అదికూడా దాటిపోతే మేఘనం అనే పర్వతం కనపడుతుంది, ఈ పర్వతం మీదనే ఇంద్రుడు పాకశాసనుడు అనే రాక్షసుడిని సంహరించి దేవతల చేత అభిషిక్తుడయ్యాడు. ఆ తరువాత 60,000 బంగారు పర్వతాలు కనపడతాయి, వాటి మధ్యలో మేరు పర్వతం ఉంటుంది. ఆ పర్వత శిఖరం మీద ఉన్న ఏ వస్తువైనా బంగారంలా మెరిసిపోతుంది. ఈ మేరు పర్వతం నుండి అస్తమయ పర్వతం 10,000 యోజనాల దూరంలో ఉంది, ఇంత దూరాన్ని సూర్య భగవానుడు అర ముహూర్తంలో దాటి వెళ్ళిపోతాడు. అక్కడే విశ్వకర్మ చేత నిర్మింపబడ్డ భవనంలో పాశము పట్టుకొని ఉన్న వరుణుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడినుంచి ముందుకి వెళ్ళాక బ్రహ్మగారితో సమానమైన మేరు సావర్ణి అనే మహర్షి కనపడతారు, ఆయనకి నమస్కారం చేసి సీతమ్మ ఎక్కడుంది అని అడగండి. ఇక అక్కడినుండి ముందుకి వెళ్ళడం కష్టం. కావున మీరందరూ అక్కడిదాకా వెతికి రండి " అన్నాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ


--(())--


 యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-కిష్కింధా కాండము.12
భూగోళ వర్ణనము - ఉత్తర దిక్కు
తరువాత ఆయన శతబలి అనే వానరుడిని పిలిచి " శతబలి! నువ్వు లక్ష వానరములతో కలిసి ఉత్తర దిక్కుకి వెళ్ళు. నువ్వు మ్లేచ్ఛ, పులింద, శూరసేన, ప్రస్థల, భరత, కురు, మద్రక, కాంభోజ, యవన, శక, కౌరవ మొదలైన ప్రాంతములలో వెతకండి. ఆ తరువాత సుదర్శన పర్వతాన్ని, దేవసఖ పర్వతాన్ని వెతకండి. ఆ తరువాత 100 యోజనాల  నిర్జనమైన ప్రదేశం ఉంటుంది. ఆ తరువాత విశ్వకర్మ నిర్మితమైన తెల్లటి భవనంలో యక్షులకు రాజైన కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడున్న క్రౌంచ పర్వతానికి ఒక కన్నం ఉంటుంది, అందులోనుండి దూరి అవతలివైపుకి వెళ్ళండి. అప్పుడు మీకు మైనాక పర్వతం కనపడుతుంది, అక్కడ కింపురుష స్త్రీలు నివాసం చేస్తుంటారు, మయుడు అక్కడే నివాసం ఉంటాడు. అక్కడే మీకు సిద్ధుల, వైఖానసుల, వాలఖిల్యుల ఆశ్రమాలు కనపడతాయి. (వీరి గురించి ఇంతకు ముందు వివరణ ఈయడం అయినది) అది కూడా దాటితే వైఖానస సరస్సు కనపడుతుంది, అందులో కుబేరుడి వాహనమైన సార్వభౌమము అనే ఏనుగు ఆడ ఏనుగులతో కలిసి స్నానం చేస్తుంది. ఆ తరువాత ఆకాశం ఒక్కటే ఉంటుంది. భయపడకుండా అది కూడా దాటితే శైలోదం అనే నది వస్తుంది. ఆ నదికి అటూ ఇటూ కీచకములు అనే వెదుళ్ళు ఉంటాయి, ఆ వెదుళ్ళ మీద ఋషులు అటూ ఇటూ దాటుతుంటారు. అక్కడినుండి ముందుకి వెళితే సిధ్దపురుషుడు కనపడతాడు. అది కూడా దాటితే పుణ్యాత్ములకు నివాసమైన ఉత్తరకురు దేశం కనపడుతుంది. అక్కడ ఎన్నో వేల నదులు ప్రవహిస్తుంటాయి, అన్ని నదులలోను వెండి పద్మాలు ఉంటాయి. వాటినుండి రజస్సు నీళ్ళల్లో పడుతూ ఉంటుంది, అందువలన ఆ నీరు సువాసనలు వెదజల్లుతుంటుంది. అక్కడ చిత్రవిచిత్రమైన చెట్లుంటాయి, ఆ చెట్ల కింద నిలుచుని ఒక కోరిక కోరితే, ఆ కోరికలకి సంబంధించినది ఆ చెట్టుకి వస్తుంది. అక్కడినుంచి ముందుకి వెళితే మీకు సంగీత ధ్వనులు వినపడతాయి, అక్కడ ఎందరో సంతోషంగా తపస్సు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళాక మీకు దుఃఖం అన్నది ఉండదు. అది దాటిపోతే ఉత్తర సముద్రం కనపడుతుంది, ఆ సముద్రం మధ్యలో సోమగిరి అనే పర్వతం ఉంటుంది. సూర్యుడు లేకపోయినా ఆ పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. అదికూడా దాటి వెళ్ళిపోతే ఒక పర్వతం మీద బ్రహ్మాండమైన, రమ్యమైన మందిరం కనపడుతుంది.
 

భగవాన్ తత్ర విశ్వాత్మా శంభుః ఏకాదశ ఆత్మకః |
బ్రహ్మా వసతి దేవేశో బ్రహ్మ ఋషి పరివారితః||
 

అక్కడ శంకరుడు11 రుద్రులుగా వచ్చి కూర్చుంటాడు. ఆ పక్కనే బ్రహ్మగారు వేదాన్ని బ్రహ్మర్షులకి చెప్తుంటాడు. ఇక అది దాటి ఏ ప్రాణి వెళ్ళలేదు. మీరు అక్కడిదాకా వెళ్ళి సీతమ్మని వెతకండి. ఒక నెల సమయంలో సీతమ్మ జాడ కనిపెట్టండి " అని చెప్పాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ
 

--((***))--

[7:10 AM, 12/8/2019] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-కిష్కింధా కాండము.13
సంపాతి సీత జాడ చెప్పుట
 

సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం 4 దిక్కులకి వెళ్ళిన వానరములలో 3 దిక్కులకి వెళ్ళిన వానరములు నెల రోజుల తరువాత వెనక్కి తిరిగి వచ్చేశాయి. వాళ్ళు అన్ని ప్రాంతాలని వెతికినా సీతమ్మ జాడ ఎక్కడా కనపడలేదు. దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరములు వింధ్య పర్వతం దెగ్గరికి వెళ్ళి, ఆ పర్వతంలో ఉన్న చెట్లని, గుహలని, సరస్సులని, మార్గమధ్యంలో ఉన్న నదులని, పట్టణాలని, గ్రామాలని అన్వేషిస్తూ వెళుతున్నారు. అలా వెతుకుతూ వెతుకుతూ సుగ్రీవుడు విధించిన నెల రోజుల గడువు దాటినది. సుగ్రీవుడు చండ శాసనుడు. గడువు తీరిన తర్వాత సీత జాడ లేకుండ వెళితే ఎలాగూ మరణ దండన విధిస్తాడు కావున యువరాజైన అంగదుడునితో సహా వానరులు ప్రాయోపవేశము చేయడానికి సిద్ధపడి రామకథ చెప్పుకుంటూ ఉండగా.. అది జటాయు సోదరుడైన సంపాతి చెవిన పడింది. అప్పుడా పక్షి చెపుతూ.. సంపాతి అనబడే నేను, జటాయువు సోదరులము. సూర్యుడు ఉదయించినప్పటినుంచి అస్తమించేలోపు ఆయనతో సమానంగా ప్రయాణం చెయ్యాలని మేము ఒకనాడు పందెం కాసుకున్నాము. అనుకున్న ప్రకారం నేను, జటాయువు సూర్యుడి వెనకాల వెళ్ళిపోతున్నాము. అలా వెళుతుండగా మిట్ట మధ్యాహ్నం వేళ మేము సూర్యుడికి దెగ్గరగా వచ్చాము. అప్పుడా సూర్యుడి వేడిని భరించలేక జటాయువు స్పృహతప్పి కిందపడిపోతున్నాడు. పెద్దవాడిని కనుక తమ్ముడిని రక్షించాలని నేను నా రెక్కలని జటాయువుకి అడ్డంగా పెట్టాను. అప్పుడా సూర్యుడి వేడికి నా రెక్కలు కాలిపోయి వింధ్య పర్వతం మీద పడిపోయాను. కాని నా తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలీలేదు. మళ్ళి ఇంతకాలానికి మీవల్ల నా తమ్ముడి గురించి విన్నాను. రెక్కలు కాలిపోయాయి ఇలా పడి ఉన్నాను, కాని రామకార్యానికి నేను మాటమాత్రం సహాయం చేస్తాను. సీతమ్మని రావణుడు ఆకాశ మార్గంలో తీసుకెళుతున్నప్పుడు ఆమె ఆభారణాలని కొంగుకి చుట్టి విడిచిపెట్టడం నా కొడుకు అయిన సుపార్షుడు వలన తెలిసింది. ఈ సముద్రానికి దక్షిణ దిక్కున 100 యోజనముల అవతల లంక ఉంటుంది. అట్టి లంకా నగరంలో దీనురాలై,  రాక్షస స్త్రీల మధ్యలో సీతమ్మ ఉంది. నేను ఇక్కడే కూర్చుని సీతమ్మని చూడగలను. మాకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే, భూమి నుండి ఆకాశానికి కొన్ని అంతరములు ఉన్నాయి. మొదటి అంతరములో తమ కాళ్ళ దెగ్గర ఉన్న ధాన్యాన్ని ఏరుకొని తినే కుక్కుటములు అనే పక్షులు ఎగురుతాయి. రెండవ అంతరంలో చెట్ల మీద ఉండే ఫలాలని తినే పక్షులు ఎగురుతాయి. మూడవ అంతరంలో భాసములు, క్రౌంచములు ఎగురుతాయి. నాలుగవ అంతరంలో డేగలు ఎగురుతాయి. అయిదవ అంతరంలో గ్రద్దలు ఎగురుతాయి. ఆరవ అంతరంలో హంసలు ఎగురుతాయి. ఏడవ అంతరంలో వినతా పుత్రులమైన వైనతేయులము (గరుడుడు, అరుణుడు/అనూరుడు, సంపాతి, జటాయు - అనూరుడు పుత్రులు) కాబట్టి  మేము ఎగురుతాము. అందుకని మేము తినే తిండి చేత, సహజంగా మేము జన్మించిన జాతి చేత 100 యోజనముల అవతల ఉన్న విషయాన్ని కూడా ఇక్కడే ఉండి చూడగల దృష్టి శక్తి మా కంటికి ఉంటుంది. అదుగో దూరంగా లంకా పట్టణంలో, అశోక వనంలో సీతమ్మ కూర్చుని ఉండడం నాకు కనిపిస్తుంది. మీలో ఎవరైనా సాహసం చేసి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలిగిన వాడు ఉంటె, సీతమ్మ యొక్క దర్శనం చెయ్యవచ్చు.
 

ఇంక అక్కడున్న వానరాలకి ఇది చూడగానే చాలా సంతోషం వేసింది. సముద్రాన్ని దాటుదామని వాళ్ళందరూ కలిసి సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు " ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళగలిగినవాడు ఎవడు. మిగిలిన వానర జాతికి ఎవడు ప్రాణప్రదానం చెయ్యగలిగినవాడు. ఈ సముద్రం దెగ్గర నిలబడిపోయిన వానరాలు సంతోషంగా తిరిగి వెళ్ళి తమ భార్యాపిల్లలని చూసేటట్టు చెయ్యగలిగినవాడు ఎవడు. ఎవరివల్ల ఈ కార్యం జెరుగుతుంది, ఎవరు అంతటి సమర్ధుడు " అని అడిగారు.
 

అప్పుడు జాంబవంతుడు ఒక్కడిగా కూర్చున్న హనుమంతుడి దెగ్గరికి వెళ్ళి ... నువ్వు పుట్టగానే ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి తినే ఫలం అనుకొని ఆయనని పట్టుకోబోయావు, నిన్ను పడగొట్టగలిగే వాడు ఈ బ్రహ్మాండంలో ఎవ్వరు లేరు. ఇవ్వాళ కొన్ని కోట్ల వానరముల భవిత, సౌభాగ్యము, ప్రాణములు నీ చేతులలో ఉన్నాయి. నీ వీర్యమును, తేజస్సును, పరాక్రమమును ఒక్కసారి పుంజుకో. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటి సీతమ్మ జాడ కనిపెట్టి ఇక్కడికి రా. హనుమా! నీ శక్తిని చూపించు " అని జాంబవంతుడు అన్నాడు.
 

జాంబవంతుడి మాటలు విన్న హనుమంతుడు మేరు పర్వతం పెరిగినట్టు తన శరీరాన్ని పెంచేశాడు. గుహలో నుండి బయిటకు వచ్చిన సింహంలా, తన స్వస్వరూపాన్ని పొంది,  అక్కడ ఉన్న వృద్ధులైన వానరాలకి నమస్కరించి  ఇక్కడ నుండి లేచి దక్షిణ దిక్కున ఉన్న సముద్రాన్ని ముట్టుకుంటాను. రావణాసురుడిని కొట్టి చంపేస్తాను, లేదా లంకని పెల్లగించి చేతితో పట్టి సముద్రానికి ఈవలి ఒడ్డుకి తీసుకువచ్చి రాముడి పాదాల దెగ్గర పడేస్తాను. అని చెప్పి ఈ భూమి నన్ను తట్టుకోలేకపోతుంది, అందుకని మహేంద్రగిరి పర్వతం మీద నుంచి బయలుదేరతాను " అన్నాడు. ఇందలి యోగ రహస్యమును రేపటి కథాంశములో తెలుసుకొందాము.
శ్రీరామ జయరామ జయజయ రామ



--(())--

శ్రీరామ జయరామ జయజయ రామ


శ్రీరాముడు-యోగరహస్యము-కిష్కింధా కాండము.14

సంపాతి కథ యందలి యోగ రహస్యము
వాల్మీకి మహర్షి యోగ సాధనకు సంబంధించిన ప్రకరణము లన్నియు సుగమముగా ఆవిష్కరించెను. సాధన ప్రగతి నొందుచున్న కొలది, తత్పలితముగా సాధకుని శక్తి వృద్ధి యగును. శక్తితో పాటుగా గర్వము, అహంకారము అధికమై సాధకుడు అనవసరమైన భ్రమలలో తేలియాడును. లేదా తొందరపాటుతో అనావశ్యక కార్యము లందు తనకు ప్రాప్తించిన అవస్థను ఉపయోగించును. సంపాతి అవస్థ ఇటువంటిదే అయిన ఉచ్చ అవస్థ నుండి క్రిందికి పడిపోతూ సాధన యొక్క దక్షిణ (పూర్వపు) అవస్థకు చేరుట.

సంప్రాప్య సాగరస్యా౭న్తం సంపూర్ణం శత యోజనమ్
ఆసాద్య దక్షిణం కూలం తతో ద్రక్ష్యథ రావణమ్           4.58.24

త త్రైవ త్వరితాః క్షిప్రం విక్రమధ్వం ప్లవంగమాః
జ్ఞానేన ఖలు పశ్యామి దృష్ట్వా ప్రత్యా౭౭గమిష్యథ       4.58.25

లంక సముద్రము మధ్యన యున్నది. అనగా మాయ చుట్టూ సంసార సాగరము వ్యాపించి యున్నది. దానిని ప్రాప్తించుకొనుటకై ఈ సంసార సాగరమును దాటవలసి యున్నది. శత యోజనముల దూరమనగా అనేకమైన ఉపాయములు. దక్షిణ తీరమనగా రావణుని కాంచన వృత్తి రూప జ్ఞానమనెడి అహంకారము యొక్క స్థానము.

ఈ దక్షిణ తీరమును మార్గదర్శనం చేసిన సంపాతి గురించి తెలుసుకొనవలసి యున్నది. సంపాతి, జటాయు నిశాకరముని (రాత్రి యందు సాధన చేయువారు) శిష్యులు. వృత్రాసురుని జయించిన ఇంద్రుని జయించుటకు వీరిరువురు ఆకాశ మార్గములో (ధ్యాన మార్గము ద్వారా) స్వర్గలోకమునకు ఏగిరి. స్వర్గము అనగా సమాధి. లోకము అనగా అవస్థ. స్వర్గలోకమనగా సమాధి అవస్థను ప్రాప్తించుకొని ఇంద్రియములను జయించుట. స్వర్గలోకమును గురించి
శ్రీమద్భావతమున ఇట్లు చెప్పినారు.

అత్రైవ నరకః స్వర్గ ఇతి మాతః ప్రచక్షతే
యయాత నావై నారక్యాస్తా ఇహాప్యుపలక్షితా

స్వర్గ నరకములు మనస్సు యొక్క అవస్థలు. శరీరభావము అధిగమించిన (సమాధి) ప్రగతిశీల అవస్థయే స్వర్గలోకము. ఆ అవస్థ యందు ఒక కల్ప కాలము యున్నను శరీరము నందు మార్పు రాదు.  అక్కడ మృత్యు భయము, ఆకలిదప్పులు, వృద్ధాప్యము, శోకము ఉండదు అంతయు ఆనందమే ఆనందము. ఈ అవస్థయే వృత్తాసురుని సంహరించిన తర్వాత ప్రాప్తించేది శూన్య అవస్థ.

పురా వృత్ర వధే వృత్తే పరస్పర జయైషిణౌ
ఆదిత్యమ్ ఉపయాతౌ స్వో జ్వలన్తం రశ్మి మాలినమ్   4.58.4

ఆవృత్యా౭౭కాశ మార్గేణ జవేన స్మ గతౌ భృశమ్
మధ్యం ప్రాప్తే చ సూర్యే చ జటాయుః అవసీదతి                     4.58.5

తమ్ అహం భ్రాతరం దృష్ట్వా సూర్య రశ్మిభిః అర్దితమ్
పక్షాభ్యాం ఛాదయా మాస స్నేహాత్ పరమ విహ్వలః                  4.58.6

నిర్దగ్ధ పక్షః పతితో విన్ధ్యే౭హం వానరోత్తమాః
అహమ్ అస్మిన్ వసన్ భ్రాతుః ప్రవృత్తిం నోపలక్షయే    4.58.7
 

ప్రగతి నిరోధకమైన వృత్తాసురుని రాక్షస ప్రవృత్తి ఇంద్రునిచే సంహరింపబడినప్పుడు సంపాతి, జటాయు లిద్దరు ఆకాశమార్గములో స్వర్గమునకు (ఇంద్రుని జయించుటకు) పోయెదరు. అనగా ధ్యానము ద్వారా సమాధి అవస్థకు చేరెదరు. అప్పుడు సూర్య తేజస్సు వలన జటాయు వ్యాకుల పడినప్పుడు సంపాతి తన రెక్కలతో రక్షించి క్రింద పడిపోయెను. ధ్యాన మార్గము నుండి విచలితుడై క్రిందకు పడిపోయెను.
 

అహమ్ అస్మిన్ గిరౌ దుర్గే బహు యోజనమ్ ఆయతే
చిరాన్ నిపతితో వృద్ధః క్షీణ ప్రాణ పరాక్రమః     4.59.77
 

ఇక్కడ పర్వతముపై దీర్ఘకాలం ఉండుట వలన ప్రాణశక్తి క్షీణించి సంపాతి వృద్ధుడాయెను.
 

తత స్తు సాగరాన్ శైలాన్ నదీః సర్వాః సరాంసి చ
వనాన్ ఉదధి వేలాం చ సమీక్ష్య మతి: ఆగమత్            4.60.6
 

హృష్ట పక్షి గణా కీర్ణః కన్దరా౭న్తర కూటవాన్
దక్షిణ స్యోదధే స్తీరే విన్ధ్యో౭యమ్ ఇతి నిశ్చితః 4.60.7
 

తెలివి వచ్చుసరికి సంసార సాగరము యొక్క దక్షిణ తీరము అనగా సాధన యొక్క దక్షిణ అవస్థ యందు క్రిందకు దిగిపోతిని.
 

ఇంద్రియ శక్తుల ద్వారా ప్రగతి నిరోధక వృత్తిని సంహరించుట, అచ్చట నుండి ఇంద్రావస్థను జయించి ఆకాశ మార్గమున (ధ్యాన మార్గమున) సమాధి అవస్థకు చేరుట, అచట నుండి సూర్య ప్రకాశము లేదా జ్ఞానము/బ్రహ్మ జ్ఞానము ప్రాప్తించుకోవాలి అనే కోరికతో తీవ్ర సాధనలో భరించలేని తాపము పొంది, మిగిలియున్న అహంకారము కారణంగా క్రింది అవస్థకు పడిపోవుట జరుగును. అదియే సాధన యొక్క దక్షిణ అవస్థ లేక దక్షిణాయనము.
 

శ్లో|| అగ్నిర్జ్యోతి రహః శుక్ల: షన్మాసా ఉత్తరాయణం  భ|గీ| 24 /1
      ధూమో రాత్రి స్తథా కృష్ణ: షన్మాసా దక్షిణాయనం భ|గీ| 25 /1
భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము - లో శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు. అగ్ని, తేజము, పగలు, శుక్ల పక్షము, ఉత్తరాయణము ఆరు మాసములు ... వీటి యందు గతించిన బ్రహ్మవేత్తలు పరబ్రహ్మ స్థితిని పొందుదురు. వారికి పునర్జన్మ లేదు. ఈ మార్గమును అర్చిరాది మార్గమనియు, దేవయాన మార్గమనియు అందురు. ఈ మార్గము నందు పోవు యోగులు, సూర్య మండలము ద్వారా స్వర్గమును ప్రవేశించి బ్రహ్మలోకమునకు ఏగి అచ్చట ఆత్మానుభూతి నొంది బ్రహ్మ కల్పాంతమున విదేహముక్తులు అగుదురు.  పొగ, రాత్రి, కృష్ణ పక్షము, దక్షిణాయన ఆరుమాసములు ... వీటి యందు మరణించిన యోగులు చంద్రమండలమును చేరి, తిరిగి భూమియందు జన్మింతురు. ఈ మార్గమును ధూమాది మార్గమనియు, పితృయానం మార్గమనియు అందురు. ఈ మార్గమున పోవు యోగులు, చంద్రమండలం ద్వారా స్వర్గమునకు ఏగి దివ్యభోగానుభవము ముగిసిన పిమ్మట చంద్ర కిరణముల ద్వారానో, వర్షధారల ద్వారానో భూమి యందు సస్యాదులలో ప్రవేశించి అన్నరూపమున ప్రాణుల జఠరమందు జొచ్చి శుక్రముగా మారి, శుక్రశోణిత సంయోగము వలన స్త్రీ గర్భము నందు స్థూల శరీరమును ధరించి జన్మింతురు.)
సుగ్రీవ-రాముల కలయిక మరియు హనుమ-సంపాతి సంవాద సమయము నందు రాముని సాదావస్థను ఉత్తరాయణ అవస్థగా గ్రహించ వలెను. ఈ అవస్థ దక్షిణాయన అవస్థ కన్నా శ్రేష్టమైనది. ఉచ్చ అవస్థలకు పోగోరు సాధకుడు క్రింది అవస్థల యందలి అనుభూతులను త్యజించవలసి యున్నది. అదేవిధంగా పూర్వ అనుభూతులను పొందగోరు సాధకుడు మరల ఆయా దక్షిణ అవస్థలకు పోవలెను. అందుచే రామాయణకారుడు సీత మరియు లంక దక్షిణ దిశలో ఉన్నవని క్రింది అవస్థలను చెప్పకనే చెప్పుచున్నాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ
--(())--
శ్రీరాముడు-యోగరహస్యము-కిష్కిందా కాండము-15
సింహావలోకనం

కిష్కింద నామమును పెట్టుటలో వాల్మీకి తన చర యోగావస్థను, అత్యంత బుద్ధిమతను పరిచయము చేసినాడు. నిర్వికల్ప సమాధి యందు నిరాలంబ, నిర్గుణ, శూన్య అవస్థ తారసబడును. ఆ అవస్థ ఎవరికీ చెందినది కాదు. ఒకరు మరొకరిని ధారణ చేసినది కాదు. అంతయు శూన్యము. నిరాలంబము, అవస్థ కాని అవస్థ. అటువంటి అవస్థయే కిష్కింధ. రాజైన వాలి అట్టి శూన్య అవస్థకు చేరినవాడు.

 కుండలిని యందు చెప్పిన ఋగ్వేద [1]నాసదీయ సూక్తమును చూద్దాము.

శ్లో|| నాస దాసీన్నో సదాసీత్త దానీం| నాసీద్రజో నోవ్యామాపరాయత్|
      కిమావరీవ కుహ కస్య  శర్మ న్నంభ:| కిమాసీదగహనం గభీరం|
      నమృత్యు రసీదా మృతం, నతర్హి  నారాత్రయా అహనాసీద ప్రాకేతః|
      అనీద వాతం స్వధయా తదేకం| తస్మాదాన్యన్న పరః కించనాస||
                             ...... ఋ|| మం|| 10 వ సూక్తి 129

అటువంటి అవస్థలో సత్తుగాని అసత్తుగాని లేదు. అస్థిత్వము, అనస్థిత్వము లేదు.  ఆ సమయములో ధారణ చేసే జలము లేదు. అసలు పరాక్కువస్థా యొక్క గహన గంభీరమైన    వ్యోమము లేదు. మూల శక్తి ఏది? మూల పదార్థము ఏది? ఏది దేన్ని ఆవహిస్తుంది? ఆ శూన్య స్థితి యొక్క  గహణత్వాన్ని తెలుసుకొన గలది ఎముంది? ఆ సమయములో గంభీర గహణత్వము ఏది? అచ్చట నాశము లేదు, ఉత్పత్తి లేదు. ప్రకాశము లేదు. అంధకారము లేదు. ఒకే ఒక చైతన్యము. తనలో తానే స్పందిస్తున్నది. ఆ చైతన్యాన్ని తెలుసు కొనగల వస్తువు ఏది? ఎక్కడ నుండి స్పందిస్తుంది? ఆ చైతన్యాన్ని తెలిసికొన గల నిగూఢమైన సత్యాన్ని వెలుగులోకి తెచ్చుటకు ఒక సాటిలేని ప్రయత్నము. ప్రతి అస్థిత్వము తనకు తాను గానే అసంఖ్యాకమైన అనుభవాలతోను, బాహ్య రూపం వెనుక నున్న నిజ తత్వము తోను కూడి యుంటుంది. ఇటువంటి అస్థిత్వము యందు నిగూఢమైన జ్ఞానం దాగి యున్నది. ఈ జ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చే సముదాయము వేదాలు. జగదారంభము యొక్క మూల అవస్థ యందలి నిర్వికల్ప సమాధి అనుభవమును పొందినవారు నాసదీయ సూక్తమును సంపూర్ణముగా అవగాహన చేసుకొన గలరు. తర్క వితర్కముల వలన ఉపయోగము లేదు. ప్రకృతి యొక్క మూల అవస్థ యందలి విజ్ఞానమును మహాపురుషులు గ్రహించగలరు. ఈ కిష్కింధ శూన్య అవస్థ కు ప్రతీక. 

దుందుభి: దుందుభి అనగా డోలు లేదా నగారా. శూన్య (సమాధి) అవస్థకు పోవునప్పుడు సాధకుడు అనాహత నాదములు వినును. అవి... మృదంగనాదము, భాసురీనాదము, సముద్ర కెరటముల నాదము, ఘంటానాదము, శంఖనాదము, మేఘనాదము, సూర్యచంద్ర కిరణముల నాదము ఇత్యాది. మనము ముందుగా చూసిన పరమోచ్చ శూన్య అవస్థ ఈ అనాహత నాదముల కన్నా ఉత్కృష్టమైనది. (పరమోత్కృష్టమైన పరనాదము గురించి ఉపోద్ఘాతము లో చర్చించుకొన్నాము) ఎల్లప్పుడూ అనాహత నాదములనే విను సాధకుడు శూన్య అవస్థకు పోయినట్లు కాదు. అంచేత కిష్కింధ రూప సమాధి అవస్థ యందు ఉండగోరు వాలి సాధకుడు దుందుభిని నిర్మూలన (సంహరించుట) చేయవలసి యున్నది. ఆ దుందుభి సంహారమునకై బిలమునందు ప్రవేశించి ఒక సంవత్సర కాలము ఉండెను. కాని వారికి సమయము ఒక క్షణములా గడచెను. బిలమనగా సూక్ష్మ రంధ్రము. అటువంటి చిన్న రంధ్రము నందు దుందుభి, వాలి వంటి విశాల కాయులు ప్రవేశించుట సాధ్యమా? అచ్చట  అన్నపానీయాలు, గాలి, ప్రకాశము లేకుండా సంవత్సర కాలము ఎలా గడిపిరి? (లేఖకుడు ఋశ్యమూకం మరియు హంపి లోని వాలి గుహ, సుగ్రీవ గుహ మరియు హనుమ జన్మ స్థానమైన గుహలను దర్శించి యున్నాడు. అంతటి విశాల దేహులు అంత చిన్న గుహలలో ఎలా ఉండారో అని ఆశ్చర్యము కలుగును) గహన యోగ సాధన యందు ఉచ్చ సాధకునకు ఈ బిలము యొక్క అనుభవము కల్గును. ఈ బిలమే ఇడ, పింగళ మధ్య ఉన్న సుషుమ్నానాడి. సాధకుడు తన చిత్తము ద్వారా  సుషుమ్నానాడిలో చరించు చున్నప్పుడు బాహ్యమునందున్న సమయము స్ఫురించదు. సమాధి అవస్థ యందున్న అట్టి సాధకుడు కాలాతీతుడు. దేహ భావముకు కొద్ది క్షణములే గడచినట్లుండును. మేరుదండమునందున్న అతి సూక్ష్మమైన సుషుమ్ననాడియే వాలి జొరబడిన బిలం. ఈ బిలం నందు ప్రవేశించినప్పుడు దుందుభి నాదము శాంత మగును. శాంతబడిన సుషుమ్న రూప బిలమున వాలి ఒక సంవత్సర కాలము దేహ భావమునకు అతీతుడగును. కాని సమాధి అవస్థకు బయిట నున్న సుగ్రీవునకు సాధారణ భావమున ఒక సంవత్సరమయ్యెను. యోగి గంటల తరబడి యున్న సమాధి అవస్థను అవగాహన చేసుకొనలేక, ఓర్మి కోల్పోయి సామాన్యులు తమ తమ వ్యవహారములలో నిమగ్నమయ్యెదరు. సుగ్రీవుడు ఈ విధముగానే బిలం  వదలి కిష్కింధకు వెళ్లెను.     శక్తి ప్రక్షేపణ చేయు తారను, ఆందరూపమైన రుమను (సుగ్రీవుని భార్య) వాలి స్వీకరించి సుగ్రీవుని బయిటకు పంపెను. తద్వారా తాపసి జీవనమునకు సుగ్రీవుడు అలవాటుపడునట్లు చేసెను. రాముడనగా ఆనందము. వాలి అవస్థ బ్రహ్మమయి సంపూర్ణ శూన్యావస్థకు చేరెను. "ప్రణవోదను: శరోహ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్య ముచ్యతే" ఆత్మా రాముడు ఈ విధంగా సాధనారూప ధనస్సును ఆత్మ రూప బాణముతో సంధించి వాలి రూప బ్రహ్మపై గురి పెట్టెను. ఆత్మా రాముడు వాలి రూప బ్రహ్మగా మారెను. వాలి సంహరింపబడిన తర్వాత సుగ్రీవుడు కిస్కిందకు రాజయ్యెను. తార రూప శక్తి ప్రక్షేపణ అవస్థ సుగ్రీవునికి పత్ని అయినది. వీర పురుషుడైన రాముడు కూడా కామవాసనల (సీతా రూప సాత్విక అనుభూతులు) వలన దుఃఖితుడు అవుతాడు. అయితే లక్ష్మణుడు మాత్రము ఉచ్చ అనుభూతుల ద్వారా సీతా అనుభూతులను త్యజించమను చున్నాడు. వానరులందరూ ఏకత్రితమై సీతా శోధనము హనుమానుని ద్వారానే జరుగ వలెనని నిశ్చయించిరి. హనుమానుడు మనస్సులో లంకను స్మరించుకొనెను. లంక అనగా మాయ. కామిని, కాంచనము మరియు కీర్తి - ఈ మూడింటి ప్రదేశము లంక. లంక చుట్టును సముద్రము యున్నది. సముద్రము అనగా సంసారము. లంక సంసారము మధ్యలో చిక్కు కొని యున్నది. అట్టి లంకను శ్రేష్ఠ సాధకుడైన రాముడు ఉద్ధరించవలెను. 
కిష్కిందా కాండము సమాప్తము
శ్రీరామ జయరామ జయజయ రామ

99(())--



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి