[08/01, 07:01] Mallapragada Ramakrishna: *ఆనందమఠ్ -1*
*వందేమాతరం*
ఇప్పటికి 130 సంవత్సరాల క్రితం 1875 లో “వందేమాతరం" గేయం బెంగాలీ భాషలో రచింపబడింది. వందేమాతరం పద నముదాయానికి "భూమాత" కు అభివాదం చేయడం లేక స్తుతించడం అని అర్థం.
వందేమాతరం - అమ్మా ! నీకు వందనం అనే ఈ రెండు పదాల కలయిక యాధృచ్ఛికం కాదు. రాజకీయపు ఎత్తుగడ కూడా కాదు. శ్రావ్యతకై కూర్చిన పద్యపాదం అంతకంటే కాదు. అది మాతృభూమితో అవిభాజ్య బంధాన్ని సుస్థిరం చేస్తున్న గౌరవాస్పదమైన సమాసం. దేశభక్తికి నమ్మకమైన ప్రతిజ్ఞ.
*సుషుప్తావస్థనుండి చేతనావస్థకు:*
ఐదు సంవత్సరాల పాటు సుషుప్తావస్థలో వున్న వందేమాతరం గేయం 1880-82 సంవత్సరాల మధ్య కాలంలో వంగదర్శన్ అనే మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడిన "ఆనందమఠం" నవలతో చేతనావస్థకు చేరి అక్కడ ఆనందమఠంలో దీపశిఖగా నిలిచి భారతదేశ దాస్యశృంఖ లాలను బ్రద్దలు కొట్టే బలాన్ని భారతీయులకి ఇచ్చిన మహా మంత్రంగా రూపొందింది.
📖
అది 1770 వ సంవత్సరం. అప్పటికి రెండేళ్ళుగా వంగదేశాన్ని (బెంగాల్) కరువు కాటకాలు పట్టి పీడిస్తున్నవి. 1768 వ సంవత్సరంలో పంటలు బాగా పండక పోవటంతో ధాన్యం ధర విపరీతంగా పెరిగిపోయింది. సామాన్య ప్రజలు నానా యిక్కట్లకూ గురికాసాగారు. కాని, నవాబు మాత్రం గోళ్ళూడకొట్టి పన్నులు వసూలు చేశాడు.
1769 వ సంవత్సరంలో తొలకరిన మంచి వర్షాలు పడినై. ప్రజల ఆనందాని కంతు లేదు. హఠాత్తుగా ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వర్షాభావం కలిగింది. ఎదిగివచ్చిన పైర్లు భూమి బెట్టతీయటంతో నిలువునా ఎండిపోయినై ఎక్కడైనా కొంచెం చెదురు మదురుగా దాన్యం పండితే దాన్ని సైనికుల కోసం నవాబు ఉద్యోగులు కొనివేశారు.
ఆ తరువాత భయంకరమైన కాటకం ప్రారంభమైంది. 1770 వ సంవత్సరంలో అసలు వర్షాలే పడలేదు. కాయకష్టం చేసి బతికే బీదాబిక్కీ బిచ్చమెత్తసాగారు కాని, వారికి బిచ్చం పెట్టే నాధుడు లేడు. అంతో యింతో భూవసతి వున్న రైతులే, తమ పశుగణాన్నీ, వ్యవసాయ పరికరాలనూ అమ్మి కొన్నాళ్ళపాటు అర్ధాకలితో బతికి, యిక చేసేదిలేక అడవిలో దొరికే దుంపలూ ఆకలములూ తినసాగారు. అవీ దొరకనిదశ రాగానే, చావసిద్ధంగా వున్న కుక్కల్నీ, పిల్లుల్ని పట్టుకుని తినసాగారు. కొందరు ఒక సోలెడుగింజలకు తమ పిల్లల్ని బానిసలుగా అమ్మేశారు.
ఈ భయంకర వాతావరణంలో అంటు రోగాలు చెలరేగినై. విషజ్వరం, కలరా, క్షయ, మసూచికలతో జనులు దిక్కులేని చావుల కు గురికాసాగారు. ఏ కొంపలోనైనా ఒకరికి కలరాగాని, మసూచిగాని సోకిందో ఆ వెంటనే రోగిని అక్కడే వదిలి బంధుగణం దూరంగా ఏ అడవికో పారిపోసాగారు. వంగదేశంలోని ప్రతి గ్రామం, పల్లెకూడా యిలాంటి దుర్భర దారుణ పరిస్థితుల్లో చిక్కి ప్రజలు నరకయాతనలు అనుభవిస్తున్నారు.
📖
అది నడివేసవి. మిట్టమధ్యాహ్నంవేళ సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. పద చిహ్న మనే గ్రామంలోని వీధులూ, ఇళ్ళూ ఆ వేడికి పొగలూ, సెగలూ వెలార్చుతున్నవి. గ్రామం మధ్య ఒకే ఒక రెండంతస్తుల మేడ వున్నది. తక్కిన వన్నీ పూరి ఇళ్ళు. ఆ మేడకూ, ఆ గ్రామం చుట్టూ వున్న ఎక్కువ భాగం భూములకూ యజమాని మహేంద్ర సింహుడు. మహేంద్రసింహుడంతటి ధనికుడు ఆ చుట్టుపక్కల గ్రామాలలోకూడా మరెవ్వరూ లేరు.
కరువుధాటికి తట్టుకోలేక పదచిహ్న గ్రామస్తు లందరూ ఏనాడో గ్రామం విడిచి తలా ఒక దిక్కుకూ పారిపోయారు. పోగా, గ్రామంలో వున్న ఆ మేడలో మిగిలినది మహేంద్ర సింహుడూ, ఆయన భార్య కళ్యాణీ, వారి సంతానం రెండేళ్ళ శిశువు సుకుమారీ మాత్రమే.
మహేంద్రుడూ, అతడి భార్యా ఉపవాసాల తో సగం అయారు. సుకుమారికి పాలిచ్చే ఆవు మేత లేక చావ సిద్ధంగా వున్నది. ఈ దుర్భర పరిస్టితుల్లో తామిక ఆ గ్రామంలో వుండటం క్షేమం కాదని ఆ భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు.
కళ్యాణి దుఃఖాన్ని దిగమ్రింగి గోశాల వెళ్లి ఆవుపాలు తెచ్చి వాటిని వేడిచేసి బిడ్డకు పట్టింది. ఆవుకు మేతవేసి వచ్చింది. ఇంట్లోకి వచ్చిన భార్యను చూచి "ఇలా ఎంతకాలం సాగుతుంది"? అని ప్రశ్నించాడు.
"ఇక ఎక్కువకాలం సాగదు, సాగినంత కాలం సాగించాను. ఇక బిడ్డను తీసుకొని మీరు పట్టణం వెళ్లిపోండి" అని అన్నది కళ్యాణి.
“నేను పట్టణం వెళ్లాలనుకుంటే యీ శ్రమంతా దేనికి ? పద ! ముగ్గురం వెళ్లిపోదాం, వెంటనే బయలుదేరు.” అన్నాడు మహేంద్ర.
ఇరువురి మధ్య కొద్దిసేపు చర్చ, తర్కం జరిగింది.
కళ్యాణి “పట్టణం వెళితే లాభం ఏమైనా వుంటుందా?” అంది.
మహేంద్ర “ఏమో ! అక్కడ ఎలా వుందో తెలియదు. ప్రాణరక్షణ ఉందో లేదో చెప్పలేను”.అన్నాడు.
కళ్యాణి “ముర్షిదాబాదు, కాసింబజార్, లేక కలకత్తా వెళితే మన ప్రాణాలకు రక్షణ లభిస్తుందేమో ! యీ ప్రదేశం వదిలి వెళ్లడం మంచిదేమోనని అనిపిస్తున్నది.” అంది.
మహేంద్ర “దొంగలు పడి యీ ఇంట్లో మన ధనమంతా ఎత్తుకుపోతారేమో !” అన్నాడు.
కళ్యాణి “ఎత్తుకుపోతే పోనీయండి. దొంగతనం చేయడానికి వచ్చే దొంగల్ని మనిద్దరం అపగలమా ! ప్రాణాలు వుంటే గదా డబ్బూ దస్కం ? ప్రాణాలేపోతే డబ్బు వల్ల ఏం ప్రయోజనం ? పదండి మూటముల్లె కట్టుకొని బయలుదేరుదాం. బ్రతికివుంటే తిరిగివద్దాం. అప్పుడు డబ్బును, ఆస్తిని అనుభవిద్దాం.”
మర్నాడు ఉదయం మహేంద్రుడు కొంతధనం మూటగట్టుకుని, ఇంటికి తాళాలు వేసి భార్యా బిడ్డతో రాజధాని నగరానికి ప్రయాణ మయ్యాడు. అతడు ఇంటి ప్రాంగణం దాటి వీధిలోకి వస్తూనే ఆగి వెన్నంటివస్తున్న భార్యతో “మనం రాజధాని పట్టణం చేరే లోపల కొండలూ, అడవులూ కూడా దాటవలసి వుంటుంది. రోజులు బాగాలేవు. ఎక్కడ చూసినా దారిదోపిడిగాళ్లు విచ్చల విడిగా తిరుగుతున్నట్టు రోజూ వార్తలు వింటున్నాం. ఎందుకైనా మంచిది, తుపాకీ తెస్తాను." అంటూ తిరిగి ఇంటిలోకి వెళ్లి, తుపాకీ, కొన్ని తూటాలూ తీసుకుని బయటికి వచ్చాడు.
కళ్యాణి కూడా భర్తను అనుసరించి ఇంటి ముఖద్వారం దగ్గిరకు వెళ్లి, అతడు బైటికి వచ్చి, తలుపులకు తాళం వేయబోయేంత లో, "ఆగండి, ఆత్మరక్షణకు ఉపయోగించే అస్త్రం నేను తెచ్చుకుంటాను," అంటూ లోపలికి వెళ్లి, ఒక చిన్న విషపు భరిణను భద్రంగా పమిట చెంగుకు కట్టుకుని బయటికి వచ్చింది.
జ్యేష్ఠమాసపు మండు టెండలో పడి మహేంద్రసింహుడు రాజధాని పట్టణం కేసి ప్రయాణమయ్యాడు. దారిలో వారికి తగిలిన చెరువులూ, గుంటలూ అన్నీ ఎండిపోయి వున్నవి. దాహబాధకు ఓర్చలేనప్పుడు ఎక్కడైనా చెరువులో కొద్దిగా మిగిలి వున్న మురికినీటినే తాగి దాహశాంతి చేసుకుంటూ చీకటి పడేవేళకు వారొక మజిలీ చేరారు. అది ఒక చిన్న సత్రము ఆ సత్రంలో మనుషు లెవరూ లేరు.
చుట్టుప్రక్కల వున్న ఇళ్ళల్లో గృహస్థులున్న సూచన లేమీ కనిపించలేదు. మహేంద్రుడు తన భార్యనూ, బిడ్డనూ సత్రం లోపల ఒక గదిలో కూర్చోపెట్టి, అక్కడ గోడకు ఆనించి వున్న, కుండపిడతల్లోనుంచి ఒక పిడత తీసుకుని, "సుకుమారికి ఎక్కడైనా పాలు దొరికే అవకాశం వున్నదేమో చూస్తాను. నువ్వు ఒంటరితనాని కేమీ భయపడకు.
నేనిప్పుడే తిరిగివస్తాను. ఆ శ్రీకృష్ణుని దయ వల్ల ఈ ఇళ్ళల్లో పాడిఆవు వున్నవాళ్ళెవ రైనా వుండవచ్చు." అంటూ సత్రంలోనుంచి వీధిలోకి వెళ్లాడు.
క్రమంగా చీకటి కమ్ముకుంటున్న సత్రం లోపలి మూలగదిలో కళ్యాణి, తన బిడ్డను ఒడిలో పరుండబెట్టుకుని బిక్కుబిక్కు మంటూ కూచున్నది. పావుగంట గడిచింది. మహేంద్రుడు తిరిగివస్తున్న జాడలేదు. దూరంగా వున్న శ్మశానంలో నుంచి కుక్కలూ నక్కలూ వికృతంగా అరిచే అరుపులు గట్టిగా వినవస్తున్నవి.
💪
*సశేషం*
ప్రాంజలి ప్రభ
. సేకరణ
[10/01 *ఆనందమఠ్ - 2*
🛕
రచన : బంకిం చంద్ర చటోపాధ్యాయ
క్రమంగా చీకటి కమ్ముకుంటున్న సత్రం లోపలి మూలగదిలో కళ్యాణి, తన బిడ్డను ఒడిలో పరుండ బెట్టుకుని బిక్కుబిక్కు మంటూ కూచున్నది. పావుగంట గడిచింది. మహేంద్రుడు తిరిగివస్తున్న జాడలేదు. దూరంగా వున్న శ్మశానంలో నుంచి కుక్కలూ నక్కలూ వికృతంగా అరిచే అరుపులు వినవస్తున్నవి.
ఉన్నట్టుండి కల్యాణి కూచున్న చోటుకు కొంచెం పక్కగా వున్న ఒక తలుపు కిర్రు మన్నది. ఉలిక్కిపడి కల్యాణి అటుకేసి చూసింది. నల్లని నీడలా, ఎండి వడిలి పోయిన ప్రేతంలా ఒక ఆకారం, కొంచెంగా తెరుచుకున్న తలుపును ఆసరాగా పట్టుకుని ఆమెకేసే చూస్తున్నది.
కల్యాణి బిడ్డను భుజంమీదికి ఎత్తుకుని గదిలోనుంచి బయటికి పారిపోయేందుకు
లేవబోయింది. కాని భయంవల్ల ఆమె కాళ్ళు గజగజలాడిపోతున్నవి. లేచేందుకు ఆమె వృధాప్రయత్నం చేసి నిస్పృహగా కూలబడిపోయింది.
తలుపు నానుకుని నిలబడిన నల్లని ఆకారం వెనుదిరిగి చేయి పూపింది. ఆ వెంటనే ఒకటి... రెండు అంతులేనన్ని వికృత మానవాకారాలు నిశ్శబ్దంగా గదిలోకి ప్రవేశించి, కళ్యాణిని చుట్టుముట్టినై. కళ్యాణి కుమార్తెను గట్టిగా హృదయానికి హత్తుకుని పెద్దగా అరవబోయింది. కాని ఆమె గొంతు పెగలలేదు. ఇంతలో ఒక ప్రేతమూర్తి ఆమె కేసి చేయి వూపుతూ, తన వెంట వున్న జీర్ణ రూపాల కేదో సంజ్ఞ చేసింది. ఆపై కళ్యాణికి స్పృహ తప్పింది.
మరుక్షణం ఆ వికృతాకారాలు కళ్యాణినీ, సుకుమారినీ చేతుల్లోకి ఎత్తుకుని, పొలాలూ గుట్టలూ దాటి, ఒకానొక భయంకర అరణ్యం లోకి ప్రవేశించాయి.
కొద్దిసేపటికి మట్టి పాత్రలో పాలునింపుకొని మహేంద్ర అక్కడికి వచ్చాడు, కంగారుపడి అంతటా కలియ జూచాడు. అక్కడ ఎవ్వరూలేరు. బిడ్డను, భార్యను పేరుబెట్టి పిలిచాడు. అరిచాడు. కేకలు పెట్టాడు, కాని సమాధానం దొరకలేదు. భార్యాబిడ్డలు కనబడలేదు. ఏమైపోయారో తెలియదు.
📖
అరణ్యమంతా అంధకారమయంగా వున్నది. కళ్యాణినీ, ఆమె కుమార్తె సుకుమారినీ ఎత్తుకునిపోయిన ముఠా ఆ చీకట్లో నిశ్శబ్దం గా వారిద్దరినీ కొంతదూరం మోసుకుపోయి, సమతలంగా వున్న ఒక ప్రాంతాన కిందికి దించింది. ఆ వెంటనే చెట్లచాటు నుంచీ, పొదలమాటు నుంచీ బిలబిలమంటూ మరికొన్ని కంకాళమూర్తులు బయటికి వచ్చి, వారిని చుట్టుముట్టినై. అలా కళ్యాణిని అపహరించి తీసుకుపోయినవాళ్ళు, ఆ
కొత్తవాళ్ళను అటకాయిస్తూ, "గుప్పెడు బియ్యంగాని, జొన్నలుగాని యివ్వండి. ఈ ఇద్దరి వంటిమీద వున్న నగలన్నీ మీ కిచ్చేస్తాం." అన్నారు.
ఆ మాటలకు కొత్తగా వచ్చిన జీర్ణ దేహులు వికటంగా నవ్వుతూ, "బంగారం, వెండీ ఎవడిక్కావాలి మీరేమైనా గ్రామాన్నుంచి ధాన్యం తెచ్నారేమో అని వచ్చాం. ఎక్కడ దాచారు ?" అంటూ వాళ్ళమీద కలియబడ్డారు.
ఆ గుద్దులాటలో ఒకడు కీచుమంటూ అరిచి కిందపడి ప్రాణాలు వదిలాడు. తమలో ఒకడు ఆవిధంగా చావటం చూస్తూనే ఆ వికృతరూపులు పోట్లాట మాని, చచ్చిన వాడికేసి ఆశ్చర్యంగా చూడసాగారు. అప్పుడు వాళల్లో ఒకడు, "అలా చూస్తూ వూరుకుంటారేం ? మనం యింతకాలంగా నక్కల్నీ, కుక్కల్ని తిని ప్రాణాలు నిలబెట్టు కున్నాం. ఇప్పుడు అవి దొరకటంలేదు. ఎలానూ చచ్చాడు గనక, వీణ్ణి కాల్చుకు తిందాం." అన్నాడు.
ఆ వెంటనే చకుముకిరాయి కొట్టి నిప్పు చేసి, దానిమీద ఎండుటాకులూ, పుల్లలూ వేసి కొందురు మంట చేయసాగారు. కొందరు తినటాని కేదో దొరికిందన్ని సంతోషంలో కీచుమంటూ గంతులు వేయసాగారు.
నిప్పు బాగా రాజి మంట లేవగానే ఇద్దరు ముగ్గురు శవాన్ని సమీపించి కాళ్ళూ, భుజాలూ పట్టుకుని దాన్ని మంటకేసి లాగసాగారు. అంతలో ఒకడు పెద్దగా అరుస్తూ ముందుకు వచ్చి, "మనం మనిషి మాంసమే తినదలిస్తే, ఈ ఎండి వడిలిన శవాన్నెందుకు తినాలి ? మనం పట్టుకొచ్చిన ఆడమనిషీ, ఆ చిన్నపిల్లా సంగతే మరిచి పోయారా ? వాళ్ళను గొంతు పిసికి, యీ మంటల్లో పేల్చండి. అందరం తృప్తిగా తినవచ్చు," అన్నాడు.
అప్పటివరకూ కళ్యాణినీ, ఆమె శిశువునూ మరిచిపోయి, తగువులూ, తైతక్కల్లో కాలం గడిపిన నికృష్ణపుమూక అంతా ఒక్కసారిగా, కళ్యాణినీ ఆమె బిడ్డనూ పడవేసిన చెట్టుకేసి తిరిగి, "ఎత్తుకురండి, మంటల్లో పడవేసి కాల్చండి. అంటూ బయలుదేరారు, కాని కళ్యాణి అప్పటికే సుకుమారితో అడవి లోపలికి పారిపోయింది.
"ఆ ఆడదీ, పిల్లా తప్పించుకుపోయారు. అడవిలో ఎంతో దూరం పోయివుండరు. నలుగురూ నాలుగు వైపులకూ పరిగెత్తి, వెతకండి" అంటూ ఇద్దరుముగ్గురు పెద్దగా అరిచారు. ఆ వెంటనే మూక మూకంతా అన్నిదిక్కులకూ పరిగెత్తింది.
📖
కళ్యాణి తన బిడ్డను గుండెలకు గట్టిగా హత్తుకుని, చీకటిలో దారీతెన్నూ కనిపించని అరణ్యంలో పరిగెత్తసాగింది. ఆమె వుద్దేశం తనను పట్టితెచ్చిన దుష్టులనుంచి సాధ్య మైనంత దూరం పారిపోవటం. వాళ్లు తన కోసం అడవి గాలిస్తున్నారన్న సూచనగా వాళ్ళ కేకలు ఆమెకు వినిపిస్తున్నవి.
కళ్యాణి లేని ఓపిక తెచ్చుకుని మరింత వడిగా అరణ్యంలోకి పరిగెత్తసాగింది. ఆమె పాదాలకు చెట్ల మోడులూ, ముళ్ళూ గుచ్చుకుని గాయాలయినై. శరీరాన్ని అడవి లతలూ, కొమ్మలూ తాకి బాధపెట్టసాగినై. అయినా ఆమె మొండిగా పరిగెత్తుతూనే వున్నది. క్రమంగా ఆమెకు తనను వెతికి పట్టుకోచూస్తున్న ఆ దుష్టుల కేకలూ, అరుపు లు దూరం కాసాగినై. ఆసరికి ఆమె బాగా అలిసిపోయింది. ఇక పరిగెత్తే శక్తిగాని, ఆఖరుకు నడిచే ఓపికగాని లేక ఆమె ఒక చెట్టుకింద సొమ్మసిల్లి పడిపోయింది.
ఒక అరగంట కాలం గడిచింది. చంద్రుడు అడవిచెట్లశిఖరాలని తెల్లగా మెరిపిస్తున్నా డు. చెట్లు అంత దట్టంగా లేని ప్రాంతాల చంద్రకిరణాలు నేలను తాకి గడ్డీ గాద రను ప్రకాశవంతం చేస్తున్నది. కళ్యాణి తన కుమార్తెతో పాటు చెట్టుకింద నిశ్చేతనంగా
పడి వున్నది. ఆమెపై చల్లని చంద్రకిరణాలు ప్రసరిస్తున్నవి.
ఉన్నట్టుండి కళ్యాణి కొద్దిగా కదిలింది. అర్ధచైతన్యావస్థలో వున్న ఆమెకు మృదు మధుర స్వరంలో ఒక పాట వినిపించసాగింది.
📖
హరే మురారే మధుకైటభారే గోపాల గోవింద ముకుంద శౌరే హరే మురారే మధుకైటభారే
కళ్యాణి కళ్ళు తెరిచింది. దగ్గిరలో ఎక్కడా మనిషి వున్న జాడలేదు. కాని తనకు పాట అంతకంతకూ బిగ్గరగా, స్పష్టంగా వినబడు తున్నది. కళ్యాణి ఆశ్చర్య సంభ్రమాలతో లేచి కూర్చోబోయింది. కాని ఆకలిదప్పుల వలనా, నరమాంసభక్షకులనుంచి తప్పించు కు పారిపోయే ప్రయత్నంలో పడ్డ ప్రయస వల్లా, ఆమె లేచేందుకు శక్తిహీనురాలు అయింది.
కల్యాణి ఆ పాట వస్తున్నవైపుకు తలతిప్పి చూస్తూ, నిశ్చేతనంగా వుండిపోయింది. హఠాత్తుగా గుబురుచెట్ల చాటునుంచి, చంద్రకాంతిలో తెల్లగా మెరిసిపోతూ, కాషాయాంబరాలు ధరించిన ఋషిలాంటి ఆజానుబాహు డొకడు ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. కళ్యాణి లేచి అతడికి ప్రణామం చేయబోయి, నీరసంగా ప్రక్కకు ఒరిగిపోయింది.
కళ్యాణికి తిరిగి స్పృహ కలిగి కళ్ళు తెరిచి చూసేసరికి, అరణ్యంలోనే ఒక విశాలమైన ప్రదేశంలో చలువ రాళ్లతో నిర్మించబడిన ఒక పెద్ద మఠంలో వుంది. పురాతత్వవేత్తలు దాన్ని చూచి పూర్వకాలంలో అది బౌద్దుల విహారంగా వుండేదని, ఆ తరువాత అదే హిందువుల మఠం అయిందని చెబుతారు. అందు విశాలమైన ప్రదేశంలో గల రెండతస్థు ల పెద్దభవనం వుంది. దానిలో అనేక దేవ మందిరాలు, ఎదురుగా నాట్యమందిరం వున్నాయి. చుట్టూ శిలాకుడ్యాలున్నాయి.
ఆ ప్రదేశాన్ని దట్టమైన అరణ్యం, పెద్ద పెద్ద చెట్లు ఆవరించియుండటం వల్ల అంత పెద్ద భవనం, అంత పెద్దమఠం పూర్తిగా ఎవ్వరికీ కనపడటంలేదు. అతి ప్రాచీనమైన కట్టడం కావడంవల్ల అక్కడక్కడా గోడలు బీటలు వారి వున్నాయి. పగలు పరిశీలించి చూస్తే ఆ భవనానికి ఈమధ్యనే మరమ్మత్తు చేసినట్లు అనిపిస్తుంది. దుర్భేద్యమైన ఆ అడవిలో మనుష్యులెవ్వరూ వుండేవారు కాదేమో అనిపిస్తుంది. ఆమె ఆ భవనమందలి ఒకానొక దేవీ మందిరంలో ఒక పెద్ద గదిలో ఉన్నది. ఆ గది లాంటి మందిరం లో పెద్ద కొయ్య, అఖండ జ్యోతిగా కాలుతూ వుంది.
బౌద్ధం క్రమంగా క్షీణించిన తరవాత, ఆ విహారం అడవి చెట్లచేత ఆక్రమించబడి, జనబాహుళ్యానికి, ఆ కీకారణ్యం మధ్య అలాంటి కట్టడం వున్నదన్న సంగతే తెలియకుండాపోయింది.
కళ్యాణి ఆశ్చర్యంగా తన పరిసరాలను పరికిస్తున్నంతలో, అడవిలో దొంగల బారి నుండి, ఆమెను కాపాడిన తాపసి ఆమె దగ్గరకు వచ్చి, "అమ్మా, నీ కొచ్చివ భయం ఏమీలేదు. ఇది దేవతామందిరం. ఆకలి దప్పులతో శోషిల్లి వున్నావు. అవిగో, అక్కడ ఒక పాత్రలో పాలున్నవి. అవి నీకూ, నీ బిడ్డకు ఆకలి తీర్చగలవు. సంకోచించక తాగండి." అన్నాడు.
కళ్యాణికి యీ మాటలతో ప్రాణం లేచివచ్చి నట్టయింది. ఆమె లేని వోపిక తెచ్చుకుని లేచి నిలబడి, చీరచెంగును కంఠానికి చుట్టుకుని, ఆ తాపసికి నమస్కరించింది. ఆయన ఆమెను 'దీర్ఘ సుమంగళీభవ' అని దీవించి, అక్కడే పాలతో వున్న ఒక మట్టి పాత్రను తెచ్చి ఆమె ముందుపెట్టాడు.
కళ్యాణి ఆ పాత్రలోవున్న పాలను తన బిడ్డ సుకుమారికి కొంచెం తాగించి, మిగిలిన వాటిని దూరంగా పెట్టింది. తాపసి ఆమెకేసి ప్రశ్నార్ధకంగా చూస్తూ. ''అమ్మా ఆ మిగిలిన పాలు తాగకుండా దూరంగా పెట్టావేం?" అని అడిగాడు.
కళ్యాణి ఆ తాపసికి మరొకసారి తలవంచి నమస్కరిస్తూ, "స్వామీ, నన్ను క్షమించి ఆ పాలు తాగమని ఆజ్ఞాపించకండి. నేను మానసికంగా చాలా వ్యధపడుతున్నాను," అన్నది.
"అలా అయితే, ఆ సంగతేదో చెప్పు. నా చేతనైన సహాయం చెయ్యగలను. నేను అరణ్యవాసంలో కాలంగడిపే బ్రహ్మచారిని, సన్యాసిని. నువ్వు నా కుమార్తె లాంటి దానివి." అన్నాడు తాపసి.
కళ్యాణి కన్నులలో ఆశ్రువులు కదులుతుండ గా, గద్గదస్వరంతో, "స్వామీ, మీరు దైవ సమానులు, నేను నా భర్త నుండి కొందరు దుష్టుల కారణంగా యీ అరణ్యం లోకి చేరటం జరిగింది. నా భర్త జాడలు తెలియ కుండా, ఆయన భుజించారో లేదో కూడా తెలుసుకోకుండా, నేనెలా ఈ పాలు తాగగలను?" అన్నది.
తాపసి కళ్యాణిని ప్రశ్నించి ఆమె సత్రంలో నుంచి, ఎలా అపహరించబడిందో మొత్తం తెలుసుకున్నాడు. ఆమె తన భర్త పేరు చెప్పగూడదు గనక ఆమె నివసించే గ్రామం, అక్కడ భర్త అంతస్థూ విచారించి, ఆఖరుకు "నువ్వు మహేంద్ర సింహుని పత్నివా?" అనడిగాడు.
కళ్యాణి అవునన్నట్టు తల వూపింది. ఆ వెంటనే తాపసి, దేవీమందిరం నుంచి బయటికి పోతూ. "అమ్మా, నువ్విక్కడ నిర్భయంగా వుండవచ్చు. నేను నీ భర్తను వెతికేందుకు వెళుతున్నాను." అని చెప్పాడు.
ఆ వెంటనే తాపసి మఠం వదిలి అరణ్యం
లోకి ప్రవేశించాడు.
🪔
*సశేషం*
*ఆనందమఠ్ - 3*
🛕
రచన : బంకిం చంద్ర చటోపాధ్యాయ
తాపసి మఠం వదిలి అరణ్యంలోకి ప్రవేశించాడు. ఆప్పటికి రాత్రి రెండవ జాము జరుగుతున్నది. చంద్రుడు ఆకాశంమధ్య దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. ఆకాశా న్నంటే మహావృక్షాలతో, వాటి నల్లుకుని వున్న అడవితీగలతో చుట్టబడి వున్నందు వల్ల మఠం వున్న ప్రదేశం మాత్రం నల్లని కారుచీకటిముసుగుతో కప్పబడివున్నది.
తాపసి అరణ్యంలో కొంతదూరం నడిచి ఒక చిన్న పర్వతప్రాంతాన్ని చేరాడు. ఆ పర్వతాన్ని ఆనుకునే, ముర్షీదాబాదు నుంచి కలకత్తాకు పోయే రాజమార్గం వున్నది. తాపసి కొండమీదికి ఎక్కి చుట్టూ ఓమారు కలయచూచి, తృప్తిగా తలాడించి, కిందికి దిగివచ్చాడు. రాజమార్గానికి ఆనుకుని ఒక చోట మరింతదట్టమైన చెట్లగుంపు వున్నది. తాపసి సూటిగా అక్కడి కెళ్లాడు.
ఆయుధాలు ధరించివున్న దాదాపు రెండు వందలమంది యోధులు చెట్లకింద కూచుని వున్నారు. అంతా నిశ్శబ్దం. అక్కడ ఎవరూ మాటాడటంలేదు. తాపసి, ఆ యోధుల్లో ప్రతిఒక్కరినీ పరిశీలనగా చూస్తూ ముందుకు సాగి, ఒకచోట ఆగి ఒక యోధుణ్ణి పరీక్షగా చూసి, సంజ్ఞచేశాడు. వెంటనే నవయవ్వను డైన ఒక యువకుడు లేచినిలబడి తాపసి వెనుకగా బయలుదేరాడు. ఇద్దరూ చెట్ల గుంపులోనుంచి బయటికి వచ్చి రాజ మార్గం పక్కగా నిలబడ్డారు.
తాపసి రాజమార్గంకేసి ఓ క్షణకాలం చూసి, తరవాత తన వెంటవచ్చిన యువకుడితో..
"భవానంద్! మహేద్రసింహుడేమైందీ నీ కేమన్నా తెలుసా?" అని అడిగాడు.
"మహేంద్రసింహుడు నేటి ఉదయం, భార్యనూ, బిడ్డనూ వెంటబెట్టుకుని, పద చిహ్న గ్రామం వదిలి, రాజధానికేసి బయలు దేరాడు. కాని, సంధ్యాసమయంలో అతడు బసచేసిన సత్రంలో.........."
భవానందుడీలా చెపుతూండగానే, తాపసి అతడి మాటలకు అడ్డుతగిలి. "సత్రంలో ఆ దుండగం చేసినవాళ్ళెవరో కనుక్కున్నావా?" అని ప్రశ్నించాడు.
"ఆ దుండగానికి కారకులు ఆ గ్రామం రైతులే. వాళ్ళు ఆకలితో నకనకలాడుతూ దాపులనే వున్న అరణ్యంలో కాలం వెళ్ళ బుచ్చుతున్నారు. వాళ్ళు దొంగలుగా మారి పోయారు. అయినా, యీ కాటకపు రోజుల్లో దొంగ కానివాడెవడు. మేమూ యీ రోజు కొత్వాలుతాలూకు రెండు బస్తాల బియ్యం దారి అటకాయించి పట్టుకుని వైష్ణవుల తృప్తి కి కైంకర్యం చేశాం." అన్నాడు భవానందుడు.
ఆ మాటలకు తావసి చిరునవ్వు నవ్వి. "మహేంద్రుడి భార్యనూ, బిడ్డ, దొంగల బారి నుంచి నేనే రక్షించాను. వాళ్ళిప్పుడు మఠం లో వున్నారు. నీవు వెంటనే బయలుదేరి వెళ్ళి, ఆ మహేంద్రసింహుణ్ణి వెతికి తేవాలి. ఇక్కడి నాయకత్వ బాధ్యత జీవానందుడు నిర్వహిస్తాడు." అన్నాడు.
📖
సత్రంలో భార్యనూ, బిడ్డనూ వదిలి పాలకోసం గ్రామంలోకి వెళ్ళిన మహేంద్రుడు ఒక గంట కాలం తరవాత- పిడతతో పాలు తీసుకుని అక్కడికి తిరిగివచ్చాడు. కాని అతడికి భార్యా బిడ్డా కనిపించలేదు. అతడు వారికోసం సత్రం గదులన్నీ వెతికాడు. గొంతెత్తి బిగ్గరగా పిలిచాదు. అంతా వ్యర్థం.
మహేంద్రుడు ఇక ఆ ప్రాంతాల కాలయాపన చేయటం వ్యర్ధమని గ్రహించాడు. పట్టణానికి పోయి, అక్కడి ప్రభుత్యోద్యోగుల సాయంతో తన భార్యా బిడ్డలను వెతకటం ఒక్కటే మార్గమని నిశ్చయించుకున్నాడు. అతడు తుపాకిని భుజాన పెట్టుకుని రాజమార్గం మీద కొంతదూరం ప్రయాణించేసరికి అతడికి ఎదురుగా కొన్ని ఎడ్లబళ్ళూ, వాటిని కాసలా కాస్తూ, కొందరు ఇంగ్లీషు కంపెనీవాళ్ళ సిపాయిలూ ఎదురైయ్యారు.
1770 నాటికి వంగదేశంమీద ఆంగ్లేయులకు పూర్తి శాసనాధికారంలేదు. వాళ్ళకు అప్పట్లో పన్నులు వసూలు చేసే దివానీగిరిమాత్రమే ఉండేది. శాసనాధికారం, పరిపాలనా బాధ్యత అంతా నవాబు మీర్జాఫర్ చేతిలో వుండేది. అతను తాగుబోతు, విషయ లోలుడు మీదుమిక్కిలి విశ్వాసఘాతకుడు.
నవాబు మీర్జాఫర్ అసమర్థుడవటం ఆంగ్లేయులకు బాగా ఉపకరించింది. వాళ్ళు యిష్టమొచ్చినచోటు యిష్టమొచ్చినంత పన్నువసూలు చేసేవాళ్ళు. మీర్జాఫర్ వాళ్ళు పెట్టమన్నచోట రసీదుపైన సంతకాలు పెట్టేవాడు. బెంగాలీలు పన్నుల భారంతో కృంగిపోతుండేవాళ్ళు. కాని వాళ్ళ మొర వినే నాథుడే లేడు.
వంగదేశం యావత్తూ కరువుకాటకాలతో సర్వనాశనం అయిపోతున్న దశలో కూడా, ఇంగ్లీషువాళ్లు నియమించిన కలెక్టర్లు ప్రజల గూబలు పిండి పన్నులు వసూలు చేస్తూనే వున్నారు. తిండిలేక మరణించే వేలాది జనుల దురవస్థను వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. తాము పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బంతా పెట్టెల్లో పెట్టి, ఎడ్లబళ్ళమీద ఎక్కించి, సిపాయిల కాపలాతో కలకత్తాకు పంపేవాళ్ళు.
📖
ఇలాంటి సిపాయిల దండొకటి రాజమార్గం మీద మహేంద్రుడి కెదురైంది. చంద్రకాంతిలో బళ్ళకు వెనకా ముందూ తుపాకులు ధరించి నడుస్తున్న సిపాయిలను చూస్తూనే,
మహేంద్రుడు మార్గం దిగి, పక్కనే వున్న చెట్ల లోకి పోయేందుకు ప్రయత్నించాడు. ఎందుకంటే, ఆ రోజుల్లో దారిదోపుడులు తరచుగా జరుగుతూండేవి. సిపాయిలు తనను దోపిడిగాడుగా భావించి పట్టుకోవచ్చు.
మహేంద్రుడు రాజమార్గం నుంచి పక్కకు దిగి చెట్లకేసి కొంచెం దూరం నడిచేంతలో, దండు లో నుంచి యిద్దరు సిపాయిలు విడివడి, "దొంగ! దొంగ!" అంటూ పరిగెత్తుకుంటూవచ్చి అతణ్ణి పట్టుకున్నారు. ఈ సమయంలో తుపాకీని వుపయోగించటమా మానటమా? అని మహేంద్రుడు తటపటాయించేంతలో, సిపాయిలు అతడి చేతినుంచి తుపాకీ ఊడ బెరుక్కుని, "నడూ, దొంగ వెధవా!" అంటూ మహేంద్రుణ్ణి రాజమార్గం మీదికి లాక్కు పోయారు.
దండుముందు ఏదో గలాటా జరుగుతున్న ట్టు విన్న హవల్దారు, దండుమధ్య నుంచి ముందుకు వచ్చి, "ఏమిటది? ఎందుకా గోల?" అంటూ సిపాయి లిద్దర్నీ కోపంగా ప్రశ్నించాడు.
"హవల్దార్ సాబ్!మేమీ దొంగను పట్టుకున్నాం చేతిలో తుపాకీ కూడా వున్నది. వీడు దొంగల నాయకుడై వుంటాడు. దొరగారి దగ్గిరకు తీసుకుపొమ్మన్నారా ?'' అని అడిగాడొక సిపాయి.
హవల్దారు, మహేంద్రుణ్ణి గుచ్చిగుచ్చి ఓమారు పరీక్షగా చూసి, తలాడిస్తూ "దొరగారు కాస్త జల్సాలో వున్నారు. ఇప్పు డాయన్ని పలకరించి లాభంలేదు. వీణ్ణి కాళ్ళూ చేతులూ కట్టి బండిమీద పడవెయ్యండి. తరువాత చూద్దాం." అన్నాడు.
సిపాయిలు మహేంద్రుణ్ణి కాళ్ళూచేతులూ కట్టి ఒక బండిమీద పడవేశారు. దండు ముందుకుసాగింది.
తాపసిచేత, ఆదేశం పొంది భవానందుడు హరికీర్తన గానం చేస్తూ మహేంద్ర, అతడి భార్యబిడ్డలు విడిపోయిన బస్తీకి వెళ్లాడు. అక్కడ మహేంద్రుని సమాచారం తెలుసు కోవచ్చునని భావించాడు.
ఆంగ్లేయులు యిప్పుడు నిర్మించినట్లు ఆ రోజుల్లో రోడ్లు లేవు. మరో నగరాన్నుండి కలకత్తా వెళ్లాలంటే ముగల్ పాదుషాలు నిర్మాణం చేయించిన మార్గాలనుండే వెళ్ల వలసివచ్చేది. మహేంద్ర కూడా పదచిహ్న గ్రామాన్నుండి నగరం వెళ్లడానికి దక్షిణదిశ నుండి ఉత్తరదిశకు పయనం చేశాడు.
భవానందుడు తాళ పర్వతాన్నుండి బయలుదేరి బస్తీకి దక్షిణదిశనుండి ఉత్తర దిశ వైపే వెళ్లాలి.
అలా రాజమార్గం వద్దకు చేరుకున్న భవానందుడు మార్గానికి ఎగువ నున్న ఒక గుట్ట పక్కన వుండి జరిగిన యీ గందరగోళ మంతా విన్నాడు. అతడికి ఎవరో ఒక వ్యక్తి తుపాకీతో కూడా సిపాయీలకి దొరికిపోయా డని తప్ప, ఆ వ్యక్తి తను వెతుకుతున్న మహేంద్రసింహు డని తెలియలేదు.
ఇప్పుడేమి చేయటమా అని భవానందుడు ఆలోచిస్తున్నంతలో దండు అతణ్ణి సమీపించింది. మహేంద్రుణ్ణి పట్టుకున్న సిపాయీలలో ఒకడు భవానందుణ్ణి అంత దూరాన చూస్తూనే, "అడుగో. ఇంకొక దొంగ పట్టుకోండి!" అంటూ ముందుకు పరిగెత్తాడు.
భవానందుణ్ణి నలుగురైదుగురు సిపాయిలు చుట్టుముట్టారు. భవానందుడు ఏమీ తొణగకుండా, "మీ కేంకావాలి ? నన్నెందుకు చుట్టుముట్టారు ?" అని అడిగాడు.
"మా క్కావలసిందేమిటో చెపుతాం. ముందు హవల్దారువద్దకు పద దొంగవెధవా." అంటూ ఒక సిపాయి భవానందుడి చేయి పట్టుకుని ముందుకు లాగాడు.
"నేను దొంగలా వున్నానా? నా కాషాయ వస్త్రాలు చూశారా ? నేను ఈ ఆడవిలో తపస్సు చేసుకునే బ్రహ్మచారిని," అన్నాడు భవానందుడు.
భవానందుడిలా అనగానే సిపాయిలు బిగ్గరగా నవ్వుతూ, "దొంగతనాలు చేసేందు కు యిదొక దొంగవేషం, బ్రహ్మచారులూ, సన్యాసులే యీ రోజుల్లో మరింత పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తున్నారు." అన్నాడు.
ఆ తరవాత వాళ్ళు భవానందుణ్ణి యీడ్చు కుంటూ హవల్దారు దగ్గరకి తీసుకువెళ్ళారు. ఇది ఒకందుకు మేలే కావచ్చనుకున్నాడు భవానందుడు. సిసాయలచేరలో యింతకు ముందు పట్టుకోబడ్డ వ్యక్తి ఎవరైనదీ తెలుసు కోవచ్చు, ఒకవేళ అతడు మహేంద్ర సింహు డైతే మరీమంచిది.
అలా కాకపోతే ఏక్షణానయినా తను, యీ పనికిమాలిన సిపాయిల గుంపునుంచి తప్పించికుని పారిపోగలడు అని అనుకున్నాడు.
🔥
*సశేషం*
*ఆనందమఠ్ - 4*
🛕
రచన : బంకిం చంద్ర చటోపాధ్యాయ
హవాల్దారు భవానందుణ్ణి చూసి కళ్ళెర్ర జేశాడు. "వీడు గజదొంగలా వున్నాడు. ఆ కాషాయగుడ్డలూ, కండలు దిరిగిన శరీరం చూస్తే. యీ కరువు రోజుల్లో దార్లు కొట్టుకు తినే ముఠాలకు వీడే నాయకుడులా కనిపిస్తున్నాడు. తెల్లవారి చూద్దాం. వీణ్ణి కూడా ఆ మొదటిదొంగ వున్న బండిమీదే, కాళ్ళూచేతులూ కట్టి పడవెయ్యండి." అన్నాడు.
భవానందుడి కాళ్ళూ చేతులూ తాళ్ళతో బాగా బిగకట్టబడి, మహేంద్రుడున్న బండి మీదికి చాపచుట్టలా విసిరివేయబడ్డాడు. మహేంద్రుడు బ్రహ్మచారివేషంలో వున్న యీ కొత్తదొంగను చూసి ఆశ్చర్యపడేంతలో, భవానందుడు చిన్నగొంతుతో, “మెల్లిగా మాట్లాడు. నువ్వు మహేంద్రసింహుడి వవునా ?" అని అడిగాడు.
మహేంద్రసింహుడు కొంచెం ఆశ్చర్యపడి, "అవును, నేను మహేంద్రసింహుణ్ణి. మీ రెలా గుర్తించారు ?'' అని ప్రశ్నించాడు.
"నేను నిన్ను గుర్తించలేదు. ఇంతకుముందు జరిగిన సంగతి సందర్భాలను బట్టి వూహించాను. సరే మంచిది. మన యిద్దరం కలిసి ఒక ముఖ్యప్రదేశానికి వెళ్ళవలసి వున్నది. ముందు నీ చేతి కట్లనూ, కాలి కట్లనూ తెంచుకో. ఆ బండిచక్రానికి ఆ కట్లున్న చోటు తాకించావంటే, రాపిడికి అవే తెగిపోతాయి.” అన్నాడు భవానందుడు.
భవానందుడు చెప్పినట్లే చేసి, మహేంద్రుడు తనను బంధించి వున్న తాళ్ళనుంచి ముక్తు డయాడు. ఈలోపల భవానందుడు కూడా తన కట్లను తెంచుకున్నాడు.
ఒకటిరెండు నిముషాల నిశ్శబ్దం తరవాత భవానందుడు తల ఎత్తి, సిపాయిలు సమీపిస్తున్న ఒక చిన్న కొండకేసి చూస్తూ. "మహేంద్రా! ఇక కొద్దిక్షణాల్లో నువ్వూ నేనూ స్వేచ్ఛ పొందబోతున్నాం. అంతేకాక, ఈ సిపాయిలు కరువు కాటకాలతో కృశించి పోతున్న బెంగాలీ రైతులనుంచి వసూలు చేసిన డబ్బూ దస్కమూ కూడా మనది కాబోతున్నది. కొంచెం హెచ్చరికగా వుండు.” అన్నాడు.
సిపాయిలదండు కొండను సమీపించేంతలో, ముందున్నవాళ్ళకు ఎదురుగా వున్న కొండ పాదంలోని ఒక పెద్ద రాతిమీద ఒకవ్యక్తి నింబడివుండటం కనిపించింది. ఆ వెంటనే ముందు నడుస్తున్న సిపాయిల్లో కొందరు, "అడుగో, మరొకదొంగ!'' అంటూ దండు విడిచి ఆ వ్యక్తి కేసి పరిగెత్తారు.
భవానందుడు బండిమీద నుంచి మోచేతుల మీద కొద్దిగా లేచి అటుకేసి చూడసాగాడు. సిపాయిలు ఒక దృఢకాయుడైన పొడవుగా కాషాయాంబరాలు ధరించివున్న యువకుణ్ణి హవల్దారు దగ్గిరకు లాక్కొచ్చారు. హవల్దారు కోపంగా చేయెత్తి, "దొంగ వెధవా ! అంటూ ఆ కాషాయవస్త్రధారిని ముఖంమీద గట్టిగా కొట్టబోయేంతలో, ఢాం అంటూ పిస్టర్ మోగింది. హవల్దారు ఒక చావుకేక పెట్టి వెనక్కు పడిపోయాడు. అదే అదనుగా భవానందుడు బండిమీది నుంచి దూకి, ఒక సిపాయి చేతినుంచి కత్తి లాక్కున్నాడు. మరుక్షణంలో రాజమార్గం పక్కనవున్న చెట్లగుంపులో కాషాయవస్త్రధారులై వున్న రెండువందలమంది ఆయుధధారులు 'హరే మురారే! హరే మురారే!" అంటూ వచ్చి సిపాయిలదండుమీద పడ్డారు.
హవల్దారు మరణించటం, ఖడ్గపాణులైన యోధులు హఠాత్తుగా వచ్చి మీదపడటం తో, ధనాన్ని కావలి కాస్తూ బండ్లవెంట నడిచే సిపాయిల్లో భీతీ, కలవరం ఏర్పడింది. ఇదంతా చూసిన సిపాయిల కమాండరు తెల్లదొర, గుర్రాన్ని వేగంగా పరిగెత్తిస్తూ, బళ్ళముందుకు వచ్చి "సిపాయిలంతా భయపడకుండా, యీ దొంగ వెధవల్ని ఎదిరించండి. మన తుపాకుల ముందు, వీళ్ళ కత్తు లేపాటి." అంటూ కేకలు పెట్టసాగాడు.
హవల్దారు పోయినా, ముఖ్య సేనాని ఇంగ్లీషుదొర బతికివుండటం, అతడన్నట్టు దొంగలచేతుల్లో కత్తులు తప్ప మరే ఆయుధం కనబడకపోవటంతో, సిపాయిలు కొంత ధైర్యం తెచ్చుకుని చతురస్రంగా నిలబడి, తమమీది కురికివస్తున్న ఆ కాషాయాంబరధారులపైకి తుపాకు లెత్తారు. కాని, అదే సమయంలో దాడి చేస్తున్న యోధుల్లో ఒకవ్యక్తి 'హరే మురారే!' అంటూ పెద్దగా నినాదం చేసి, గుర్రంమీద వున్న దొరను కత్తితో ఒక్కపోటు పొడిచాడు. దొర ఒక్క అరుపు అరిచి గుర్రం మీది నుండి తలకిందులుగా కింద పడిపోయాడు.
ఈ విధంగా తమ నాయకుడు దుర్మరణం పాలవగానే, సిపాయిలు లౌక్యం కోల్పోయి, ఎత్తిన తుపాకీలు దించి, వెనుదిరిగి రాజ మార్గం వెంట పారిపోసాగారు. కాషాయాంబ రధారులు, అలా పారిపోయేవారిలో దొరికినవారిని చంపి ఇంగ్లీషు వాళ్ళ ఖజానా అంతా వశపరుచుకున్నారు.
మొదటిసారి తుపాకీ పేల్చి హపల్దారును చంపిన యోధుడు తన అనుచరులకు బండ్లమీద వున్న ధనపు పెట్టెలను దించవల సిందిగా ఆజ్ఞ యిచ్చాడు. ఆ వెంటనే యోధులు పెట్టెలను దించి వాటిని మోసుకుంటూ అడవికేసి వెళ్ళిపోయారు. ఆ సమయంలో రక్తశిక్తమైన కత్తిని చేతబూని భవానందుడు ఆజ్ఙనిస్తున్న యోధుని ముందుకు వచ్చాడు. భవానందుడ్ని చూస్తూనే ఆ యోధుడు ఆతడి భుజం పట్టుకుని ఉత్సాహంగా వూపుతూ, "భవానంద్ సోదరా! మనం అనుకున్న దాని కంటె తేలిగ్గానే మ్లేచ్చుల మదం అణచాం, ఈ దోపిడీ ధనాన్ని మన రహస్య ప్రదేశానికి చేరుస్తాను. నీ ప్రయాణం ఎటు?" అని ప్రశ్నించాడు.
భవానందుడు ఆ ప్రశ్నకు వెంటనే జవాబివ్వ కుండా చుట్టూ కలయచూశాడు. అతడికి ఆ రాజమార్గం దిగువన ఒక చెట్టునీడలో ఒక ఆకారం కనిపించింది. భవానందుడు అతడె వరైనదీ గ్రహించినవాడిలా తల పంకించి, "జీవానంద్ సోదరా! నువ్వు, ముందు బయలుదేరు. నేను ఒకటి రెండు నిమిషాల్లో నిన్ను అనుసరిస్తాను." అంటూ ఆ ఆకారం నిలబడి వున్న చెట్టుకేసి బయలుదేరాడు.
వెన్నెలకాంతిలో గుబురుచెట్టు ఛాయలో కత్తి చేబూని నిలబడివున్న ఆ వ్యక్తి మహేంద్ర సింహుడు. అతడు కాషాయవస్త్రధారులైన యోధులు సిపాయీల మీద చేసిన పోరులో తటస్థంగా వుండిపోయాడు. ఇంగ్లీషువాళ్ళు బళ్ళమీద ఎక్కించుకుపోతున్న ధనం బెంగాలీ రైతుల్ని పీడంచి బలవంతంగా వసూలు చేసినదే కావచ్చు కాని, దానిని దోచుకునేందుకు వచ్చిన దొంగలకు తోడ్పడి తన హృదయా న్నెందుకు మలినం చేసుకోవాలి ? దొంగలకు సహాయపడేవాడు కూడా దొంగే అవుతాడు. ఇలా ఆలోచించి మహేంద్రుడు, ఒక సిపాయినుంచి కత్తి లాక్కుని కూడా, దూరంగా చూస్తూ నిలబడిపోయాడు.
భవానందుడు చకచక నడుస్తూ, మహేంద్రుణ్ణి సమీపించేంతలో అతడు కటు వుగా "మీ రేవరు ?" అని ప్రశ్నించాడు.
భవానందుడుకూడా అంత కంఠస్వరంతోనే, "నే నెవరో తెలుకోవలసిన అవసరం నీకేం
కలిగింది ?" అని మారు ప్రశ్న వేశాడు.
భవానందుడి కంఠస్వరంలోని కాఠిన్యత గమనిస్తూనే మహేంద్రుడు కొంచెంగా ఆశ్చర్యపడి, "మీ రెపరో తెలుసుకోవలసిన అవసరం నాకున్నది. ఇంతకుముందు మీరు నా కెంతో గొప్ప సహాయం చేశారు. నన్ను బంధవిముక్తుణ్ణి చేసిన మీకు కృతజ్ఞుణ్ణి." అన్నాడు.
ఆ మాటలకు భవానందుడు అవహేళనగా నవ్వుతూ. "అలాంటి కృతజ్ఞత మీకున్నట్లు రుజువేం కాలేదు. మీ జమీందార్లు ఎంత పిరికిపందలో యింతకుముందే గ్రహించాను. కత్తి చేతబట్టికూడా అలా స్థాణువులా నిలబడిపోవటం, నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది." అన్నాడు.
"నేను దొంగతనం చేసేవారికి సాయపడి పాపం ఎందుకుకట్టుకోవాలి ?" అన్నాడు మహేంద్రుడు.
భవానందుడు ఆ మాటలకు నవ్వి, "సరే, అలాంటి దొంగ నుంచే, నీవు కావాలను కుంటే మరింత సహాయం పొందగలవు. నా వెంట రాగలవా? నీ భార్యా, కుమార్తే వున్న చోటు చూపుతాను." అన్నాడు.
మహేంద్రు డీ మాటలకు ఎక్కడలేని ఆశ్చర్యం కనబరుస్తూ, "మీరు నా భార్యా, కుమార్తే వున్న చోటు చూపెడతారా.. ఆశ్చర్యంగా వుందే. వాళ్ళెక్కడున్నారో మీ కెలా తెలుసు ?" అన్నాడు.
"సరే, ఆశ్చర్యపడుతూ చెట్టుకిందే వుండదలిస్తే నా అభ్యంతరంలేదు. కాని, ఒకవేళ నీ భార్యనూ, బిడ్డనూ చూడదలిస్తే మాత్రం, నావెంట రా." అంటూ భవానందు డు అడవికేసి బయలుదేరాడు. మహేంద్ర సింహుడు మారుమాటాడకుండా అతణ్ణి అనుసరించాడు.
🔥
*సశేషం*
*ఆనందమఠ్ - 5*
🛕
రచన : బంకిం చంద్ర చటోపాధ్యాయ
భవానందుడు ఆడవిలో ప్రవేశించి ఒక
కాలిబాట వెంట నడవసాగాడు. మహేంద్రుడి కతణ్ణి, తన భార్యాబిడ్డలను గురించి ఏవేవో ప్రశ్నలు చేయాలని కోర్కెగలిగింది కాని నిశ్శబ్దంగా తలవంచుకు నడుస్తున్న ఆ బ్రహ్మచారిని ప్రశ్నించే ధైర్యం అతడికి లేకపోయింది. ఉన్నట్టుండి భవానందుడు తలెత్తి చంద్రకాంతిలో మిలమిల మెరుస్తున్న వృక్ష శిఖరాగ్రాలకేసి ఓమారు చూసి గొంతెత్తి
పాడసాగాడు:
వందే మాతరమ్ సుజలాం సుఫలాం మలయజశీతలాం సస్య శ్యామలాం మాతరమ్.
మహేంద్రుడి కా పాట ఆశ్చర్యం కలిగింది. పేరూ వూరూ లేని యీ మాత ఎవరు ?
అనుకున్నాడతను. వెంటనే ఆతడు భవానందుణ్ణి, "బ్రహ్మచారీ! ఎవరీ మాత ?" అని ప్రశ్నించాడు. కాని, భవానందుడు ఏమీ జవాబివ్వక పాడుకుపోతున్నాడు.
శుభ్రజోత్స్నా పులకిత యామినీమ్ పుల్లకుసుమిత దృమదళ శోభినీమ్ సుహాసినీమ్ సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరమ్.
భవానందుడు అంతవరకు పాడగానే
మహేంద్రుడు చిరునవ్వు నవ్వుతూ, ''మీరు పాడే పాటలో కనిపించేది దేశం; తల్లి కాదు," అన్నాడు.
"అవును, దేశమే! మే మీ దేశమాతను తప్ప మరొకరిని ప్రేమించం. 'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ' మేము జన్మభూమినే తల్లిగా భావిస్తాం. అది తప్ప మాకు యింకో తల్లి లేదు. తండ్రిలేడు, భార్య బిడ్డలు, ఇల్లు వాకిలి ఏమీలేదు." అన్నడు భవానందుడు గంభీరంగా..
"అయితే ఏదీ, ఆ పాట మరోసారి పాడండి!" అన్నాడు మహేంద్రుడు.
వందేమాతరమ్
సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరమ్
సుభ్రజ్యోత్స్నా పులకిత యామినీమ్
పుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్ సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరమ్
సప్తకోటి కంఠ కలకల నినాదకరాళే ద్విసప్తకోటి భుజై ధృత ఖరఖరవాలే అబలాకే నమాఎతవాలే
బహుబుధారిణీ సమామి తారిణీమ్
రిపు దళవారిణీమ్ మాతరమ్
తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణాః శరీరే
బాహుతేతు మిమాశక్తి
హృది తుమి మాభక్తి
తోమరాయి ప్రతిమాగాడి మందిరే మందిరే
త్వంహి దుర్గాదశ ప్రహరణ ధారిణీ
కమలా కమల దళవిహారిణీ
వాణీ విద్యాదాయినీ నమామిత్వాం నమామి కమలా మమలా మతులాం సుజలాం సుఫలాం మాతరమ్
వందే మాతరమ్
శ్యామలాం సరళాం సుస్మితాం భూషితామ్
ధరణీం ధరణీం మాతరమ్.
📖
భావానందుడు యిలా పాడుతూ పాడుతూ దుఃఖంతో వివశుడైపోయాడు, మహేంద్రు డా పాటకు తన్మయుడై "మీరు అడవిలో తపస్సు చేసుకునే బ్రహ్మచారుల్లా నాకు కనిపించటం లేదు. నిజం చెప్పండి.
మీరెవరు?" అని అడిగాడు.
"మేము సంతానులం!" అన్నాడు భవానందుడు.
"సంతానులు! అంటే ఎవరి సంతానం?" అన్నాడు మహేంద్రుడు.
"దేశమాత సంతానం."
“మీరు దేశమాత సంతానమా!" అంటూ మహేంద్రుడు కొంచెం యీసడింపుగా అని, "అయితే దేశమాత మిమ్మల్ని దొంగతనాలు చేసి బ్రతకమన్న దన్నమాట. మీరేదో ఒక రోజున సిపాయీల ఫిరంగి మూతులకు కట్టబడి తునాతునియలు చేయబడతారు. రాజుగారి ధనం దోపిడీ చేసినవారెవరూ బతికి బయటపడలేదు." అన్నాడు.
"మేము దోచింది రాజధనం కాదు. పాలన చేయనివాడు రాజు కాదు. దేశంలో ప్రజలు తిన తిండిలేక, ఆకలములు తిని ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూంటే, మనకు పాలకుణ్ణని చెప్పుకునే నవాబు మీర్జాఫర్ ఏంచేస్తున్నాడు? అతడి నౌకరీలో ఉన్న ముస్లిం సైనికులు గ్రామాలమీద పడి, దోపిడులు, మానభంగాలు చేస్తూంటే అతడు తెలిసే, ఆ కిరాతకృత్యాలను ఆపేందుకు ప్రయత్నం చేయడేం?" అని భవానందుడు క్రోధంవుట్టిపడే గొంతుతో ప్రశ్నించాడు.
మహేంద్రుడీ ప్రశ్నకు కలవరపడుతూ,
"నిజమే, ఈ ముస్లిం పరిపాలనలో ఇలాంటి రాక్షసకృత్యాలన్నీ జరుగుతున్నవి. కాని వాళ్ళను గద్దె దించటం ఎలా సాధ్యం? మీ కొద్దిమంది సంతానులచేత అదెలా సాధ్య మవుతుంది?" అన్నాడు.
"ప్లాసీయుద్ధంలో ఆంగ్లేయ సేన ఎంత ? నవాబు సేన ఎంత ?" అని ప్రశ్నించాడు భవానందుడు.
"ఆంగ్లేయులూ, మన బెంగాలీలం సమానమా?" అన్నాడు మహేంద్రుడు.
"సమాన మయేందుకే ప్రయత్నిస్తాం. ప్లాసీలో అంత చిన్న సేనతో ఆంగ్లేయులు ముస్లిం సేనావాహినిని ఎందువల్ల ఓడించగలిగారు? వాళ్ళకున్న ధైర్యసాహసాలే అందుక్కారణం. మహమ్మదీయుల్లో ఆవిలేవు. కాస్త శరీరం చెమట పట్టగానే యుద్ధ రంగం విడిచి పారిపోతారు. షర్బత్ ఎక్కడ దొరుకుతుందా అని తిరుగుతారు. వాళ్ళల్లో ధైర్యం లేదు, పట్టుదలా లేదు. ఒక ఫిరంగిగుండు ఒక స్థానంలోనే గాని పది స్థలాల్లో పడదు. అందువల్ల ఒక్క ఫిరింగిగుండు చూసి పదిమంది పారిపోనవసరం లేదు. మహమ్మదీయ సైనికుడు ఒక గుండు చూస్తే చాలు గుండెపగిలినంత పనై పారిపోతారు, ఆంగ్లేయ సైనికుడెన్ని గుండ్లను చూసినా యుద్ధరంగం వదిలి పారిపోడు," అన్నాడు భవానందుడు.
"మీ సంతానులకు, ఆంగ్ల సైనికుల కున్నంత గుండెధైర్యం వున్నదని నన్ను నమ్మమంటా రా?" అని ప్రశ్నించాడు మహేంద్రుడు.
"ప్రస్తుతం లేకపోవచ్చు. అలాంటి ధైర్య సాహసాలు చెట్టునుంచి రాలేవి కావు. అభ్యసించి అలవరచుకోవలసిన గుణం అది. మేం సన్యాసులం మా కార్యం పూర్తయే వరకూ, మేం మా భార్యా పిల్లల ముఖం చూడం. కావాలనుకుంటే నువ్వూ సంతానుడవు కావచ్చు" అన్నాడు భవానందుడు.
"భార్యా బిడ్డలను పరిత్యజించ నవసరం లేకపోతే, నేనూ ఓ సంతానుల వ్రతం స్వీకరిస్తాను." అన్నాడు మహేంద్రుడు.
"వారిని వదలనిదే నువ్వీ సంతానవ్రత గ్రహణం చేయలేవు." అంటూ వేగంగా నడవసాగాడు భవానందుడు.
🔥
*సశేషం*
*ఆనందమఠ్ - 6*
🛕
రచన : బంకిం చంద్ర చటోపాధ్యాయ
భవానందుడు మహేంద్రుణ్ణి వెంటపెట్టుకుని ఆనందమఠం చేరేసరికి సూర్యోదయమైంది. వారిద్దరూ మఠంలోని పూజామందిరద్వారం సమీపించేంతలో తాపసి - సత్యానంద స్వామి, అప్పుడే ప్రాతఃకాల పూజ ముగించి, జీవానందుడితో ఏదో మాట్లాడుతున్నాడు.
మహేంద్రుణ్ణి చూస్తూనే, సత్యానందస్వామి ముందుకు వచ్చి, భవానందుణ్ణి భుజం పట్టుకుని, పూజామందిరానికి పక్కనే ఉన్న మరొకగదిలోకి తీసుకుపోయి, కొద్దినిమిషాల తర్వాత తిరిగి పూజామందిరంలోకి వచ్చాడు. ఈసారి మహేంద్రుడు ముందుకు రెండడుగులు వేసి సత్యానందస్వామికి నమస్కరించాడు. సత్యానంద అతణ్ణి దీవించి “మహేంద్రసింహా ! నీ క్కలిగిన ఆపద మమ్మల్నందర్నీ కలత పరిచింది. నేనే నీ భార్యనూ, బిడ్డనూ అడవిలో దొంగలనుంచి కాపాడి, ఇక్కడికి తెచ్చాను. రా, వారున్న చోటుకు తీసుకుపోతాను," అంటూ బయలుదేరాడు.
సత్యానందస్వామి, మహేంద్రుణ్ణి వెంట పెట్టుకుని, చీకటిమయంగా వున్న నాలుగైదు గదుల్లోనుంచి నడిచి, కొంచెం వెలుగు వున్న ఒక పెద్ద గదిలో ప్రవేశించాడు. అక్కడ ఒక చతుర్భజమూర్తి విగ్రహం మహేంద్రుడికి కనిపించింది. శంఖచక్రగదాపద్మధారియై వక్షస్థలంమీద కౌస్తుభమణి ప్రకాశిస్తున్న ఆ విగ్రహాన్ని చూచి మహేంద్రుడు దిగ్భ్రామ చెందాడు. ఆ మూర్తి పాదపద్మాల ముందు మధుకైటభరక్కసుల శిరస్సులు మొండెం నుండి వేరై పడి వున్నవి.
"ఈ మూర్తిని చూశావా, మహేంద్రసింహా ?" అని అడిగాడు సత్యానందస్వామి. మహేంద్ర సింహుడు తల ఊపాడు.
"ఆ విష్ణుమూర్తి అంకమున వున్న దేవిని గుర్తించావా?" అన్నాడు సత్యానంద స్వామి.
"లేదు స్వామీ, ఎవరామె?" అని అడిగాడు మహేంద్రుడు.
"మాత! మన మందరమూ ఆమె సంతానమే. చెప్పు, వందేమాతరమ్" అని హెచ్చరించాడు సత్యానందుడు. మహేంద్రుడు తలవంచి వందేమాతరమ్ అన్నాడు.
సత్యానందుడు, మహేంద్రుణ్ణి మరొక గదిలోకి తీసుకుపోయాడు. అక్కడ అష్ట భుజాలో సమస్తాలంకారాలతో శోభిల్లుతున్న జగద్ధాత్రీమూర్తి మహేంద్రుడికి కనిపించింది.
"ఈమాత పేరేమిటి ?" అని అడిగాడు మహేంద్రుడు.
"సింహ, వ్యాఘ్ర, గజ, భల్లూకాది వన్య మృగాలను తన పాదాలతో నేలమట్టగించి, అక్కడ పద్మాసనం ప్రతిష్టించి కూర్చున్న సమస్థ ఐశ్వర్యస్వరూపిణి. ఈమెకు నమస్కరించు,” అని ఆజ్ఞాపించాడు సత్యానందుడు. మహేంద్రుడు నమస్కరించాడు.
సత్యానందస్వామి, మహేంద్రుణ్ణి మరొక గదిలోకి నడిపాడు. ఆ గది చీకటి వెలుగుల మయంగా వుంది. అక్కడ ప్రతిష్ఠితమైన భీకరకాళీమూర్తిని చూసి మహేంద్రుడు కొంచెం భయపడ్డాడు. సత్యానందుడు, మహేంద్రుని ముఖకవళికల్లో భయచిహ్నాల ను గ్రహించినవాడిలా ముఖం పెట్టి, "ఈమె కాళీమాత! నేడు దేశం సర్వనాశనమై వున్నది. అందువల్లనే కాళీమాత కంకాళ మాలలు ధరించివున్నది. ఆమె తన శివుణ్ణి పాదాలతో మర్దించుతున్నది. హా, మాతా !" అంటూ సత్యానందుడు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. అతడిగొంతు రుద్దమైపోయింది.
"స్వామీ, ఆమె చేతుల్లో కత్తి, కపాలమూ ఏమిటి?" అని అడిగాడు మహేంద్రుడు భక్తి భయాలతో వణికిపోతూ.
“మేమంతా ఆమె సంతానమే. ఆమె తన చేతగల కత్తినే మాకు అనుగ్రహించింది. చెప్పు, వందేమాతరమ్ అన్నాడు సత్యానందస్వామి. 'వందేమాతరమ్' అంటూ మహేంద్రుడు కాశీమూర్తికి సాష్టాంగ నమస్కారం చేశాడు.
సత్యానందస్వామి ఆ గదిలోనుంచి బయటికి పోబోయేంతలో, మహేంద్రుడాయ నతో, "స్వామీ! ఒక్కమనవి. నన్ను నా భార్య నూ, పుత్రికనూ ఒక్కసారి చూడనివ్వండి. తరవాత వారిని పంపివేసి, నేనూ మీ సంతానుల వ్రతగ్రహణం చేసాను." అన్నాడు.
"నీ భార్యా పుత్రికలను ఎక్కడకు పంపుతావు?' అని సత్యానందు డడిగాడు.
ఆ పశ్న తలెత్తిన తరవాత గాని మహేంద్రుడికి, తన భార్యా పుత్రికలను పంపేందుకు ఎక్కడా చోటు లేదనే సంగతి స్ఫురణకు రాలేదు.
"పదచిహ్న గ్రామంలోని నా ఇంటిలో ఎవరూ లేరు. మహమ్మారి లాంటి యీ కరువు కాటకాల మధ్య ఆమె నెక్కడికి పంపినా, ఎవరాదరిస్తారు?" అన్నాడు మహేంద్రుడు దీనంగా.
సత్యానందస్వామి ఆ ప్రశ్నకు జవా బేమీ చెప్పకుండా తల వూపి వూరుకుని, "సరే, ఈ ద్వారం వెంట బయిటికి వెళ్ళు. అక్కడ ఆవరణలో నీ భార్యా, పుత్రికా వున్నారు." అంటూ మహేంద్రుడికి చెప్పి, మహేంద్రుడు బయటికి పోగానే, ఆ గదిలో వున్న ఒక రహస్య సొరంగం తెరచి, దాని మెట్లమీదుగా భూగృహంలోకి దిగిపోయాడు.
ఆ భూగృహంలో, జీవానందుడూ, భవానందుడూ రాత్రి దోచుకువచ్చిన ఆంగ్లేయుల ఖజానా పెట్టెలు బద్దలుకొట్టి, అందులో వున్న రూపాయలు రాసులుగా పోసి లెక్క పెడుతున్నారు. సత్యానందుడు వారితో మహేంద్రుడు తిరిగి మన దగ్గిరకు వస్తాడు. అతడివల్ల మన సంతానులకు గొప్ప మేలు జరుగుతుంది. ఇక్కడ మీ పని పూర్తికాగానే, అడవిలో భార్యా బిడ్డలతో పోయే మహేంద్రుడి వెంటనంటి వుండండి. ఆ సమయం రాగానే అతణ్ణి మన మఠం లోని విష్ణు మంటపానికి తీసుకురండి" అని చెప్పి, భగృహం నుంచి మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు.
🔥
*సశేషం*
*ఆనందమఠ్ - 7*
మహేంద్రుడు గదిలోనుంచి బయిటికి వస్తూనే, ఒక విశాలమైన మంటపంలో
సుకుమారిని ఒడిలో పెట్టుకుని తలవంచుకు కూర్చున్న భార్యను చూశాడు. ఆమెను చూస్తూనే అతడికి దుఃఖం ఆగిందికాదు. కళ్యాణి అడుగుల చప్పుడు విని తల ఎత్తి భర్తకేసి చూస్తూనే, ఆనందం దుఃఖం ఒకేసారి హృదయాన్ని పెనగొనగా లేచి నిలబడి జలజల కన్నీళ్లు కార్చింది. భార్యాభర్త లిద్దరూ కొంతసేపు మాట్లాడలేక ఒకరి నొకరు చూసుకుంటూ మూగ బాధననుభవించారు. తరువాత కళ్యాణి సత్రంలో తన ఆపహరణ సంగతి చెప్పింది. మహేంద్రుడు తన అనుభవాలు చెప్పాడు.
ఈవిధంగా ఒక అరగంటకాలం గడిచింది. మహేంద్రుడు తన భార్యతో.
"ఇక మనం ప్రయాణమై పోవటమే మంచిది. ఈ పవిత్రస్థలం సంసార లంపటాలలో చిక్కుకుని అలమటించే మనలాంటి పామరులకు వాసస్థానంకాదు," అన్నాడు.
మహేంద్రుడు కూతురును చంక నెత్తుకుని ఆవరణలో నుంచి కదలబోయేంతలో అతడికి ఎదురుగా ఒక తిన్నెమీద రెండు టేకుఆకులలో భోజనపదార్థాలు కనిపించినై. అవి ఎప్పుడెవరక్కడ పెట్టారో తెలియదు. మహేద్రుడు వాటిని భార్యకు చూపించాడు.
“ఇవి మనకోసమే. ముందు మీరు తినండి." అన్నది కళ్యాణి, మహేంద్రుడు మారు మాటాడకుండా తిన్నెమీద కూర్చుని ఆకలి తీరేవరకు భుజించాడు. ఆ మిగిలిన పదార్ధాలని కళ్యాణి భుజించింది. అక్కడే పెట్టివున్న ఒక ముంతలోని పాలను ఆమె
సుకుమారికి తాగించింది. తరవాత వారు మఠం ఆవరణ దాటి అరణ్యంలోకి ప్రవేశించారు.
📖
పదచిహ్న గ్రామం ఎటువున్నదో మహేంద్రుడు తనకు తెలుసుననుకున్నాడు. ఒకసారి అర్యణంనుంచి బయటపడి, రాజమార్గం చేరితే ప్రయాణం సుఖంగా సాగుతుందని అతడు ఆశించాడు. అతడి ప్రయత్నం చీకటిపడేలోగా తన స్వగ్రామం చేరాలని.
కాని, మహేంద్రుడు ఆరణ్యంలో గంటకు పైగా ప్రయాణించినా, అతడికి దానిలోని ఆది అంతాలు తెలియరాలేదు. ఎంత దూరోం పోయినా మహారణ్యమే. దానిలో నుంచి బయటపడటం ఎలాగో అతడికి అర్ధంకాలేదు. పైగా అతడికి తన స్వగ్రామం వున్న దిక్కు కూడా తెలియకుండా పోయినట్టయింది.
అలాటి సంకట సమయంలో ఒక వైష్ణవ బ్రహ్మచారి అతడికి ఎదురయ్యాడు. అతడి పెదాలమీద చిరునవ్వు తాండవిస్తోంది. అతణ్ణి చూస్తూనే మహేంద్రుడికి ప్రాణం లేచివచ్చినట్టయింది.
"గోసాయీజీ- మీరీ ప్రాంతాలు బాగా తెలిసిన వారులా వున్నారు. మమ్మల్ని ఈ ఆరణ్యం దాటించి, రాజమార్గం చేర్చగలరా?” అన్నాడు మహేంద్రుడు.
గోసాయి మారు మాటాడకుండా వెనుదిరిగి బయలుదేరాడు. మహేంద్రుడు అతణ్ణి అనుసరించి నడిచాడు. ఓ పావుగంట తరవాత వాళ్ళు అరణ్యం దాటి ఒక కాలవ ఒడ్డుకు వచ్చారు. వారికి అల్లంతదూరంలో రాజమార్గం కనిపిస్తున్నది.
"అవసరం అనుకుంటే యిక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని, ఆ కనిపించే మార్గంవెంట తూర్పుగా వెళితే, నువ్వు పదచిహ్న గ్రామం చేరగలవు." అని చెప్పి గోసాయి తిరిగి అరణ్యంలోకి ప్రవేశించాడు.
మహేంద్రుడు భార్యతో, కుమార్తెతో కలిసి కాలవ ఒడ్డునే వున్న ఒక చెట్టుకింద కూచున్నాడు. ఒకటి రెండు నిమిషాలవరకూ ఎవరూ మాటాడలేదు. కళ్యాణి భర్త ముఖం కేసి చూసింది. అతడేదో దీర్ఘాలోచనలో వున్నట్టు కనిపించాడు.
మఠంలో కలుసుకున్నప్పటి నుండి నేను చూస్తూన్నాను, మీరేదో మనసులో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారు. ఆ సంగ తేమిటో నాకు చెప్పగూడదా?" అన్నది కళ్యాణి.
మహేంద్రుడా ప్రశ్నకు ఒక నిట్టూర్పు విడిచి, "నా మనసులో అంత పెద్ద బాధేమీ లేదు. సత్యానందస్వామి నన్ను సంతానధర్మం స్వీకరించమన్నారు. నేను నిరాకరించాను. ఆ విషయమే మనసులో మెదులుతున్నది. అంతకన్న మరేంలేదు.” అన్నాడు.
"అవును, మీరెందుకు సంతానధర్మం స్వీకరించగూడదు? రాత్రి నేనొక కల గన్నాను. ఆ కలలో మీరు కాషాయ వస్త్రాలు ధరించి, వందేమాతరమ్ అని నినాదాలు చేస్తూ, ఇతర సంతానులతో కలిసి మ్లేచ్ఛుల తో యుద్ధం చేయటం చూశాను,” అన్నది కళ్యాణి.
"అది కలే. వాస్తవం కాదు. సంతానధర్మం స్వీకరించివాడు భార్యా బిడ్డల ముఖం చూడగూడదు. ఆ సంగతి నీకు తెలియదా" అన్నాడు మహేంద్రుడు.
"ఆ నియమానికి అంగీకరించి, ఆ వ్రతం పూనండి. దేశమాత సేవకు నేనెందుకు అడ్డు వస్తాను, ఇదిగో, మీకు నా ఆటంకం తొలిగే మార్గం., ఇద్దరం ఏదో ఒకనాడు ఆ స్వర్గంలో కలుసుకుందాం." అంటూ కళ్యాణి తన చీర చెంగుకు కట్టుకున్న విషపుడబ్బాను ఊడదీసింది.
ఆ విషభరిణను చూస్తూనే మహేంద్రుడు నిలువెల్లా కంపించిపోయి, దానిని ఆమె చేతిలో నుంచి తీసుకోబోయాడు. అది జారి కిందబడింది.
"కళ్యాణీ, నువ్వంత సాహసాని కొడగట్టకు. కావాలంటే నిన్నూ, సుకుమారినీ ఎవరి యింటనైనా దిగవిడిచి, నేను ఈ సంతాను ల్లో కలవగలను. మాతకార్యం పూర్తవగానే తిరిగి నిన్ను కలుసుకోగలను." అన్నాడు మహేంద్రుడు.
కళ్యాణి ఏదో జవాబు చెప్పబోయేంతలో సుకుమారి కీచుమని అరిచింది. ఆ భార్యా భర్తలిద్దరూ ఒకేసారి కుమార్తెకేసి చూశారు. విషపుడబ్బా మూత వూడదీసి ఉన్నది. అందులో విషగుళిక లేదు. సుకుమారి బాధతో తన్నుకుంటున్నది.
కళ్యాణి పిచ్చిదానిలా ఒక్క కేక వేసి, సుకుమారి నోట్లో వేళ్ళుపెట్టి సగం కరిగి పోయిన విషగుళికను బయటికి తీసింది. ఆఖరికి సుకుమారి తన్నుకోవటం మాని, కళ్ళు తేలవేసి సొమ్మసిల్లి పడిపోయింది. కళ్యాణి కూతురును పైకెత్తి హృదయానికి హత్తుకుంటూ, “చూశారా, ఆ శ్రీకృష్ణుడే మీకు ధర్మమార్గం చూపించాడు. ఇక మా బంధం మిమ్మల్ని బాధించదు. స్వేచ్ఛగా దేశమాతను సేవించండి." అంటూ మిగిలి వున్న విషగుళికను చప్పున నోట్లో వేసుకుని మింగింది.
ఈ దృశ్యం చూసి మహేంద్రుడు నిశ్చేష్టుడై పోయాడు. అతడికి కాళ్ళూ చేతులూ ఆడలేదు. అంతలో ఎక్కడినుంచో ఒక పాట వినబడసాగింది.
హరే మురారే మధుకైటభారే...
గోపాల గోవింద ముకుంద శౌరే...
పాట వస్తున్న దిక్కుకేసి మహేంద్రుడు తల తిప్పాడు. కాని అక్కడ ఎవరూ లేరు. అతడు భార్యా పుత్రికలకేసి చూశాడు. ఇద్దరూ నేలమీద నిశ్చలంగా పడివున్నారు. మహేంద్రుడు పెద్దగా ఒక్క శోకం పెట్టి వారిమీద వాలిపోయాడు. అంతలో అతడి భుజాన్ని ఎవరో తాకినట్టయింది. వెంటనే మహేంద్రుడు తలఎత్తి చూశాడు. ఎదురుగా సత్యానందస్వామి.
సత్యానందస్వామిని చూస్తూనే మహేంద్రుడు లేచి కూచున్నాడు. అతడి కళ్ళ నుంచి అశ్రువులు ధారగా ప్రవహిస్తున్నవి. సత్యానందుడు అతడి భుజంమీద చేయి వేసి అనునయించాడు. మహేంద్రుడు కొంచెం ఉపశమనం పొంది లేచి నిలబడ బోయేంతలో ఇద్దరు సిపాయిలు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిలో ఒకడు జమేదారు. అతడు మహేంద్రుడి మెడ పట్టుకుని గుంజుతూ, "రాత్రి బళ్ళను అటకాయించి ధనాన్ని దోచుకున్న ఆ కాషాయ సన్యాసుల్లో వీడూ తప్పక ఉండి వుంటాడు. మన కనుగప్పేందుకు ఆ దుస్తులు తీసివేసి, సామాన్యపౌరుడిలా వేషం ధరించాడు." అన్నాడు.
జమేదారు మెడ పట్టుకోగానే, మహేంద్రుడు కాలసర్పంలా బుసలుకొట్టుతూ అతడి కేసి చూశాడు. జమేదారు వెంటవున్న సిపాయి మహేంద్రుడి చేతులకు బేడీలు తీసి బిగించ బోయాడు. అది చూస్తూనే మహేంద్రుడు సిపాయిని లాగి ఒక తన్ను తన్నాడు. వాడు అరుస్తూ కిందపడిపోయాడు. జమేదారు ఉగ్రుడై మీదికి రాబోయేసరికి, మహేంద్రు డతన్ని నడుం పట్టుకుని దూరంగా విసిరివేశాడు.
జమేదారు కత్తి దూస్తూ పడ్డచోటునుంచి లేచి నిలబడబోయేంతలో అరణ్యంలో నుంచి అయిదుగురు సిపాయిలు పరిగెత్తుకుంటూ వచ్చి మహేంద్రుణ్ణి, సత్యానందుణ్ణి చుట్టు ముట్టారు. మహేంద్రుడు వాళ్ళమీద కలియబడబోయేంతలో సత్యానందస్వామి అతడి భుజం పట్టుకుని వారిస్తూ,
"ఇది సమయం కాదు ఆగు" అన్నాడు ఆజ్ఞాపిస్తున్న కంఠంతో.
మహేంద్రుడి చేతులకు సంకెళ్లు తగిలించ బడినై. సత్యానందస్వామి క్కూడా ఒక సిపాయి, సంకెలలు వేయబోయేంతలో, వెంటనే జమేదారు అతణ్ణి వారిస్తూ,
“ఆ వృద్ధుడి కెందుకు సంకెళ్లు? ఆయన చాలా సాత్వికుడిలా వున్నాడు. మనవెంట
నగరానికి తీసుకుపోదాం." అంటూ మహేంద్రుడి కేసి కళ్ళెర్రచేసి చూస్తూ "ఈ బద్మాష్ మాత్రం పారిపోకుండా చూడండి. వీడికి ఉరి తప్పదు. బహూశా, ఈ వృద్ధ సన్యాసి క్షేమంగా విడుదల కావచ్చు.'” అన్నాడు.
సత్యానందుడూ, మహేంద్రుడూ సెలయేటి ఒడ్డున పడివున్న కళ్యాణీ, ఆమె పుత్రికల నిశ్చల శరీరాలకేసి ఓమారు చూసి, తల వంచుకుని సిపాయిల వెంట బైలుదేరారు.
"నా భార్యా బిడ్డల శవాల క్కూడా దహన క్రియలు జరిపే శక్తి నాకు లేదు. ఆ శవాలను ఏ అడవిమృగాలో పీక్కుతింటాయేమో" అని అనుకున్నాడు మహేంద్రుడు.
📖
రాజమార్గం వెంట పట్టణంకేసి సిపాయిల వెంట కొంతదూరం నడిచిన తరవాత సత్యానందస్వామి జమేదారుతో, ''అయ్యా, నేను హరినామస్మరణ చేసుకోవచ్చునా ?'' అని అడిగాడు.
"నిరభ్యంతరంగా చేసుకోండి. నగరంలో కొత్వాలు తమను తప్పక విడుదల చేస్తాడు. ఈ బద్మాష్ కి మాత్రం తప్పక ఉరిశిక్ష పడి తీరుతుంది." అన్నాడు జమేదారు.
సత్యానందస్వామి గొంతెత్తి పాడసాగాడు.
ధీరసమీరే తటి నీతీరే వసతివనే వరనారీ నకురో దనుధర గమనవిలంబన మతివిధురా సుకుమారీ.
🔥
*సశేషం*